శశికళ/మన చెలిమి
మన చెలిమి
నా సఖీ మన చెలిమి
వేసటేనట భువికి
కాసంత ఉపకారి కాదంట మనుజునకు
నా సఖీ ! నా సఖీ !
జీవిత విధానాలు
భావి కర్తవ్యాలు
ఎరుగ లేనే లేని
ఎదురుకోనే లేని
పాట లెందుకటంచు పదములేలా అంచు
పలుకుదురు భాషణలు చిలుకుదురు దూషణలు
నా సఖీ మన చెలిమి
వేసటేనట భువికి !
జుమ్ముమను మధుర శ్రుతి
తుమ్మెదలు ఆడవా ?
కొమ్మ కొమ్మకు తేలి
కోకిలలు పాడవా ?
అవి వట్టివమ్మంట అర్ధరహితమ్మంట.
నా సఖీ మన చెలిమి
వేసటేనట భువికి !
కాసంత ఉపకారి
కాదంట మనుజునకు !
పుష్పగంధ వ్యాప్తి
పూర్ణ చంద్రుని దీప్తి
భుక్తి నీయగలేని శక్తి హీనములంట
ఓ సఖీ మనప్రేమ
వేసటేనట భువికి !
కలలు హుళక్కియట
కళలు వ్యర్థములంట
కళలైన సాంఘిక రాజకీయార్ధికా
చలిత భావోద్రిక్త సంకలితమ్మై యుండ
వలెనంట, మనుజప్రగతికి దారంట అవి !
ఓ సఖీ మన ప్రేమ
వేసటేనట భువికి !
భౌతికోన్నతి జేర్చు భౌతికోద్యములుండె
భౌతికోద్యమ మహాప్రజ్ఞార్ధి సమదర్శ
నస్తితికి మానసానంద బుద్ధ్యానంద
స్వస్థతయె మూలమ్ము భావోజ్వలము లవియె
ఓ సఖీ మన ప్రేమ
వేసటేనట భువికి !
ప్రకృతిలో సౌందర్య ప్రత్యక్షదృశ్యాలు
వికసితోత్త మకృషులు సకలకావ్యములు కళలు
పరమసృష్ట్యా విర్భవ రసస్వరూపములు
నరజాతి ప్రగతికవి ఆలంబనోద్దీప
నాధారములు విమల హృదయస్తితికి కార
ణాత్మికము లాప్త శక్తీ ప్రపుల్లములు
ఓ సఖీ మన ప్రేమ
అసాధ్య మీ భువికి !
అమలమౌ ఏదృశ్య
మమృతమౌ ఏఘటన
కాల్పనిక చిత్రమై శిల్ప విషయముకాదొ !
అల్పభావము లెట్లు శిల్ప విషయములౌను
పొడితనము ఉన్నతటె
జడత సంపన్నతటె
ఓ సఖీ మన ప్రేమ
ఉత్త మోత్తమ చరిత్రకదవే !
భౌతికాకర్షణాతీత సంకలనమే
భౌమ్యమౌ తుచ్ఛేంద్రి యాకర్షణాతీత
రీతియే, ఘటనయే
ప్రీతియే, ప్రేమయే
సౌందర్య రూపమ్ము సౌందర్య భావమ్ము !
సౌందర్య సంధాన సందర్శనోద్భవము
ఆనందమో దేవి ! ఆనందమే శక్తి
ఆనందమే ప్రగతికై నరులకిడు రక్తి
ఓ సఖీ మన ప్రేమ
ఆసాధ్య మీ భువికి
ఆనంద సౌందర్య
ప్రాణమే మనుజునకు !