ప్రత్యక్షము

 
ఒక రాగాలాపనలో
ఒక గీతా విష్కరణలొ

          ఎవరో ఒక దివ్యరూప
          ఎవరో ఒక తళుకుచాన
          కిరణం లా కరణం లా
          సురచాపం వర్ణం లా

                  మెరసిందహొ మిరిమిట్లై
                  దరిసిందహొ దరిసెనమై !

ఒక రేఖా విన్యాసము
ఒక వర్ణం ప్రసరింపులొ

          ఎవరో ఒక దివ్య భావ
          ఎవరో లావణ్య మూర్తి
          అమ్నాయ సునాదంలా
          అతివేల రసాపగలా
          అసేచన కాలేఖ్యము
          అతి రేఖావతరణమ్ము

 
             నిరతిశ యానందమ్మై
             పరిమళాంగి ప్రవిమలాంగి
             పారిభద్ర ప్రసూనాంగి
                    విరసిం దహొ విదురేఖై
                    కురిసిం దహొ సురమధువై !

దివి తరించి భువి తరించి
అవతరించె నా ప్రణయిని
దిశామూర్తి శశి కళాఖ్య
నిశామూర్తి శశి కళాఖ్య
గోదావరి పాడిందీ
గోవత్సం ఆడిందీ
సాయంతన కల్య బాల
చల్లెను పన్నీటి జాలు,
చల్లెను స్వర్ణాక్షతలను
చదల దేవి ఆశీస్సుల !