ప్రణయకోపన

ఏల కోపంవచ్చినదొ నీ
మ్రోల నిలిచిన నన్ను చూడవు
బాలికా నావైపు తిరగవు
                 పంతగించితివో ?

వీణె మీటిన తీపి పాటలు
వేణు వూదిన గాన మంత్రము
జాణ! నీవై పలుకు లాడవు
                 ముగ్ధనాయికవా ?

పూల తావుల అలలు చూపులు
మాలతీ వల్లరుల నవ్వులు
నీల గగన విలాస లీలలు
                 దాచుకొన్నావా ?

కాళిదాస మనోజ్ఞ కవితా
కలశవార్నిధి వీచికలు నీ
కౌగిలింతలలోని వింతలు
                నేడు చూపవుటే !

పచ్చ కర్పూరాన వెన్నెల
పసిడి సంజల సంపగులలో

పాటలీ కుసుమాన ఉషనులు
               చుంబనము లేవీ !

మేల మాడవు గంధ మలదవు
పూల జడతో నన్ను కట్టవు
వాలు చూపుల నివాళించవు
               ప్రణయ కోపనవా !

నేను చేసిన తప్పు లేవో
                    నేనె ఎరుగను
గాన పూజలొ అపశ్రుతిలా
                    కలత బెడితినొ
ఆన తప్పితినేమొ మోహో
                    ద్రిక్త విరసముననన్
ప్రాణకాంతా ! పాద పద్మము
                    మ్రోల వాలుదు

       ప్రణయ లీలల
       ప్రధమ తప్పిద

                    మెట్టిదై నను
                    ఏరికైన క్ష
                    మార్హమేకాదా ?