శశికళ/పూజ
< శశికళ
పూజ
అందుకోవేమే శశికళా !
నా పూజ
సుందరివి నీవె కాదంటవే !
ప్రణయ పళ్లెరమందు
పండ్లు కాంక్షల గములు
చూవు పూవుల సరులు
ఊపిరే ధూపాలు
అందుకోవేమి ఓ శశికళా
నా పూజ
సుందరివి నీవు కాదంటవే !
తనువె నీ ఆలయము
మనసె ఆసనమయ్యె
నామ మంత్రము జపము
నా గీతములె వినతి
అందుకోవేమి ఓ శశికళా
నా పూజ
సుందరివి నీవు కాదంటవే !
కలల నారతి నిచ్చి
కళ నివేదనమిస్తి
అందుకోవేమి ఓ శశికళా !
నా పూజ
సుందరివి నా దేవి వే నీవు !