శశికళ/చరిత్ర
< శశికళ
చరిత్ర
మర్త్యుడను నే నటే
ప్రియ బాల
అమర సఖి వీవటే !
ఒక తారకా కాంతి
ఒక దివ్య లిప్తలో
చీకట్ల వెలిగిస్తు
చేరినది ఈ భువిని
తార కిరణము నేను
తారకవు నీ వటే !
శిల్ప నిష్ణాత గా
చిత్రకారుణ్ణిగా
జన్మ జన్మా లెన్నొ
తన్మయ కళా పూజ
శిల్పి నేనే నటే !
శిల్పమవు నీ వటే !
ఆనాట జంతాన
ఆంధ్రపురి కటకాన
ఆంధ్ర కవి స్వప్నాన
ఆంధ్ర నట కరణాన
ఆంధ్ర సంస్కృతి నేనె
ఆంధ్రత్వ మీ వటే !