శశికళ/ఇష్టదేవత

(శశికళ/ఇష్ట దేవత నుండి మళ్ళించబడింది)

ఇష్ట దేవత

హితులందరికి వారి ఇష్ట దేవులు కలరు - నాబ్రతుకు
శ్రుతికలిపి వలపించు సతి చతురవుదేవీ !

యెంకొక్క దేవతై యెలిసెనట ఒక్కరికి
యెనక జల్మమునుండి యెన్నేని జన్మాల
                   హితులందరికి వారి ఇష్ట దేవులు కలరు !

హృయేశ్వరీ దివ్య పదపుష్ప పూజార్ధి
వకుళ మాలికవైచి వరియించె సుఖుడొకడు
                   హితులందరికి వారి ఇష్ట దేవులు కలరు !

కిన్నెరీబాలా ప్రసన్నాఽవిలాసితుడు
రసవాహినీ స్నాత రమ్యవాఙ్మి యొకండు
                   హితులందరికి వారి ఇష్ట దేవులు కలరు !

మఘవమస్తక మకుట మాణిక్యమై వెలయు
ఊర్వశీదేవి ప్రేమోల్లాసి చెలియొకడు
                   హితులందరికి వారి ఇష్ట దేవులు కలరు !

మందార పుష్పార్ద్ర సుందరీ మృదుహాస
చెంద్రికా శోభితులు జంటకవి హితులొకరు
                   హితులందరికి వారి ఇష్ట దేవులు కలరు
                                             నా బ్రతుకు
                   శ్రుతికలిపి వలపించు సతివి చతురవుదేవీ !