శశికళ/ధ్యేయము
< శశికళ
ధ్యేయము
నా బ్రతుకొక పరిమళార్ద్ర
నందనోద్యాన వనము
నందనాన విహరించే సుందరివే ప్రేమరాణి !
నాప్రజ్ఞే నీ లోకము
నవ నవోన్మేషణమ్ము
నవ్యతలో నిత్యోదయ కల్యబాలవే నీవూ !
నీ ఒదిగిన నా స్వప్నము
నింగివరకు స్పందించును
నిద్రాస్వాప్నిక పులకిత నిరుపమరూపవె సఖియా !
నా ప్రణయమె నీ రూపము
నా ఆత్మే నీ ప్రాణము
నీకునాకు విడుటేది విరహమేది !
మన ప్రణయమె మన ధ్యానము
మన యోగమె మన ధ్యేయము
మనమే మన థ్యాతలమై
మనుదుమే అనంతమందు.