శశాంకవిజయము/ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు

శశాంకవిజయము

ద్వితీయాశ్వాసము

శ్రీవిజయరంగచొక్క
క్ష్మావిజయగురుప్రసాదసంపన్నిత్యా
శ్రీవరదాచార్యమణి
శ్రీవరదాస్యైకకృత్య సీనామాత్యా!

1


వ.

అవధరింపుము సూతుండు శౌనకాదిమహామునీంద్రుల కిట్లనియె.

2


శా.

ఆలీలన్ గమలాసనుండు చన నయ్యాజ్ఞాపనం బౌదలన్
బాళిం గైకొని విశ్వకర్మ యుచితాభ్యాసైకశిల్పక్రియా
శాలిత్వంబు ప్రతిష్ఠ గాంచఁగఁ బ్రతిష్టానాఖ్యచే నెంతయున్
మేలౌపట్టణమున్ బ్రయాగమును నిర్మించెన్ జను ల్మెచ్చఁగన్.

3


క.

ఆపురివిభవము శివునకు
నూపుర మగుచిలువఱేఁడు నుతి సేయంగా
నోపు రహి గాంచనేరఁడు
కాపురమై లచ్చి యచట కదలక యుంటన్.

4


మ.

నగరీసౌధములన్ గుమారికలు వీణ ల్మీటుచో నీలపుం
జగతు ల్వజ్రపుగోడలుం జలముగా సప్తర్షిసంఘంబు మం
త్రగణోచ్చారణతో సితాసితసరిద్భ్రాంతి న్జలం బాడి యా
మగువ ల్నవ్విన భ్రాంతికిం బురుషధర్మత్వంబు సిద్ధింపఁగన్.

5


మ.

అఱజాబిల్లిమెఱుంగు బాసికముచాయం బూనఁగా తారక
ర్నెగయన్ జల్లినసేసఁబ్రాలకరణి న్నిండార సౌనర్గని
ర్ఝరిణీకంకణయుక్తకేతుకరకంజం బొప్పఁ దద్రత్నగో
పుర మాగోపురలక్ష్మి పెండి లయి యొప్పెన్ బ్రాప్తకల్యాణమై.

6

చ.

విలసితపద్మరాగమణివేల్లితమై తగుమేటికోటకొ
మ్మలు దళపఙ్క్తులై మెఱయ మంజుహిరణ్మయసౌధయూథము
ల్దల మగుకేసరంబులుగఁ దత్ప్రభుగేహము మిద్దె గాఁగ ను
జ్జ్వల మగుతత్పురాబ్జమున సారసవాసన నించు నిచ్చలున్.

7


ఉ.

పా టొకయింత లేనిఘనపత్త్రసహస్రము రాజమాన్య మౌ
పాటవము న్జడోపచితభంగి యెఱుంగనివృద్ధియోగమున్
బాటిలఁ జారుచిత్రనవపద్మగతి న్విలసిల్లి కంటకో
ద్ఘాటన లేక యుండు రమకాపుర మాపురమందు నిచ్చలున్.

8


సీ.

వసుమతీవలయాధిపత్యరాజద్రాజ
        పరితోవిజృంభితపరిధి యనఁగ
విక్రమత్రయభృశోపక్రమాధోక్షజ
        చరణవిస్రస్తహంసక మనంగ
భువనత్రయాద్భుతపురరమాకటిలగ్న
        ధగధగన్మణికాంచిదామ మనఁగ
నఖిలభూభరణసామ్రాజ్యయాచ్నాయాత
        మండలీకృతమహాకుండలి యన


గీ.

నెసఁగు బహుజీవనప్రదాతృత్వవిష్ణు
పదసమాశ్రయతాభోగభాసురత్వ
పురుషరత్నాభిరామత్వపూర్ణమహిమ
విమలహేమకవాట మవ్వీటికోట.

9


గీ.

జాళువాకోటకొమ్మలు చాలుదీప
ములుగఁ బైమొగు ల్ధూమవిస్ఫూర్తి గాఁగ
నవ్యనీరాజనంబు తన్నగరలక్ష్మి
విష్ణుపదమున కర్పించు వేడ్క మీఱ.

10


చ.

కళుకుకడానిచాయ మెయిఁ గన్పడఁగా మెఱుఁగుందురాయితో
విలసిత మైననీలఘనవేణికచేఁ జెలువొందుకోటకొ
మ్మలఁ గని చంద్రుఁడు రవియు మాపును రేవును రక్తి మీఱఁగా
మెలఁగుచుఁ జుట్లఁ బెట్టుదురు మే నొకయించుక సోఁక నప్పురిన్.

11


చ.

అలపురికోటకొమ్మగమి నానను దద్గరుడోపలద్యుతిన్
జిలువలపగ్గము ల్చెదరఁ జిక్కుపడున్ రథ మొంటిబండి నే

నలసెద నొంటిగా ననుచు నర్కుఁ డన న్నెల కొక్కరుండు గా
నిలువుఁ డటంచుఁ బంచె విధి నీరజమిత్రులవంతు దీరఁగన్.

12


ఉ.

పంత మెసంగఁ దన్నగరభామిను లబ్జము లంఘ్రిఁ దోయు చ
త్యంతవిలాసరేఖఁ బరిఖాంబువుల న్విహరింపఁ గౌతుక
భ్రాంతమనస్కులై చిలువరాకొమరు ల్దల లెత్తి చూచి ద
ర్శింతురు గూఢపాద్వనిత లెంతయు వ్రీడ శిరంబు వంపఁగన్.

13


శా.

వాటంబై తగుఁ గోటక్రింద వసధివ్యాఖ్యేయ మాఖేయమున్
ఘాటం బైనకుళీరమీనమకరోగ్రంబౌ మరుద్గంగపై
సాటోపస్థితి మీరుమర్త్యులు నమర్త్యానీకము న్వీఁక నె
చ్చోటం దాఁకక యుండ రెండుపరిఖల్ జోడించెనో బ్రహ్మ నాన్.

14


ఉ.

పెక్కుముఖంబులం జదివె వేదము లంతట నిద్ర సోమరై
క్రక్కున నీటిలోఁ గలిపెఁ గ్రమ్మర నేర్చుట సా మెఱుంగు నీ
యెక్కువ యేమి బ్రహ్మ కని యేకముఖంబున సాంగవేదముల్
దక్కక నేర్చి బుద్ధి నచలస్థితిఁ దాలుతు రప్పురిన్ ద్విజుల్.

15


సీ.

ఒమ్మైనబళువుగోతమ్ములు ద్రొబ్బిన
        ఱొమ్ములగాయమ్ము లెమ్మె మీఱ
దండెము ల్దోసినకండెము లలభుజా
        కాండమ్ము లనుసానకత్తు లమర
గాటంపువీఁకన దా టైనమేనుల
        యఱమట్టినిగనిగల్ హరువు మీఱ
వికటారివీరుల ప్రకటాహమిక మాన్పు
        చికటారిసొదలిక ల్చెన్ను మిగుల


గీ.

హల్లకద్యుతిచెంగావిచల్లడాలు
డాలు మీఱిన వెలిపచ్చడాలు నమర
నమరనాయకవిభవనిరాకులంబు
రాకులంబు చరించు నారాజధాని.

16


శా.

బాణావంకిని పెద్దకత్తిగుమితిన్ బాణాసనప్రౌఢిమన్
ద్రోణాచార్యుల కైనఁ బల్కుదురు నేర్పు ల్సూడు మై డాసినన్
స్థాణుం డైనపటంబుగా నిలువకుండన్ ద్రోతు రాపన్నసం
త్రాణోద్యద్బిరుదాంకు లప్పురమునన్ రాజన్యచూడామణుల్.

17

ఉ.

నిచ్చల మైన కెంపులును నీలమణు ల్వరమౌక్తికంబులున్
బచ్చలు పుష్యరాగములు వజ్రములుం బగడాలు తూములన్
హెచ్చుగఁ గొల్తు రెప్పుడు ధనేశునిధు ల్దమయప్పువడ్డికి
న్వచ్చిననొచ్చె మెం తనుచు నవ్వుదు రప్పురిలోనికోమటుల్.

18


ఉ.

చారుచిరత్నరత్నమయసౌధముల న్బురివైశ్యకన్యక
ల్గీరనగింజ లాడుతఱిఁ గ్రిందను జిందినదివ్యరత్నముల్
పౌరులు ద్రొక్కుచు న్జనఁగఁ బాదుకొన న్ధరణీపురంధ్రికిన్
వారక రత్నగర్భ యను నామముఁ బెట్టిరి సత్కవీశ్వరుల్.

19


ఉ.

ఏ రొక టబ్బె రామునకు నెడు పొసంగవు చంద్రమఃకళా
ధారికి నొక్కయె ద్దిది వితావిత సీరము లేమిఁ గావునన్
సీరికి నొంటిపోగుకు విశేషము లే శివుఁ డాదిభిక్షువం
చేరులు నెడ్లు గల్గి సుసమృద్ధిగఁ బాదజు లుందు రప్పురిన్.

20


చ.

భుజములు తమ్మితూండ్లు కనుబొమ్మలు సింగిణివిండ్లు చన్ను ల
క్కజపుఁబసిండిగిండ్లు తెలిగన్నులు శ్రీసతియిండ్లు వాతెర
ల్నిజముగ దొండపండ్లు రమణీయకటిద్వయి పైడిబండ్లు కా
యజువిరికల్వచెండ్లు పురమందలి కొవ్విరిబోండ్లు చూడఁగన్.

21


సీ.

చంచలత్వము తళ్కు మించుకన్నుల నుంచి
        మించుబోం డ్లైనక్రొమ్మించు లనఁగ
నిమ్ముగాఁ గాఠిన్య మెమ్మెచన్నులఁ దాల్చి
        కొమ్మ లైనకడానిబొమ్మ లనఁగఁ
గుటిలత్వ మలకల ఘటియించి వనితలై
        నటియించుశశికళాపటల మనఁగ
ధవళత నవ్వులం దవతరింపఁగఁ జేసి
        యువతు లౌతారకానివహ మనఁగ


గీ.

నలరుదురు లోకసంహననాభిలాషి
మత్స్యలాంఛనకృతజపమంత్రసిద్ధు
లఖిలయువనేత్రభాగధేయంబు లచటి
చక్కనిమిటార్లు మరుచేతిచిక్కటార్లు.

22


సీ.

కే లెత్తి సురదంతి నాలంబునకు నిల్చు
        పగిదిఁ దుండంబులు పైకి జాఁచుఁ

గలశభవాచాంతజలధి నింపఁగఁ జాలు
        నివె యన్నగతి వమధువులఁ జల్లు
నొంటి నెత్తఁగ రాదె యుర్వి నాగాధిప
        త్రయధృతి ననుమాడ్కిఁ దాల్చు మట్టిఁ
బుడమి యెల్లను నాలుగడుగుల నడుగు నం
        చనుగతి ముందఱి కడుగు లిడును


గీ.

కీలు మేలును మదభరోద్వేలధార
లోలిఁ గురియంగ సెలయేళ్లఁ జాల మెఱయు
శైలములలీల నాలానజాలబద్ధ
లైనమత్తేభఘట లొప్పు నప్పురమున.

23


శా.

బ్రద్దల్వాఱి ధరిత్రి లీలఁ దెలిబాబాఁ జూచి వేఁటాడుచున్
రుద్దున్ ఘల్లున కొమ్ముక ట్లెగయఁగా నూరారు సన్న ల్వడున్
సద్దెచ్చోటను విన్న డీకొను నిజచ్ఛాయ న్మహావృక్షముల్
ప్రోద్దామస్థితిఁ బెల్లగించు నచటన్ బొల్పొందుమత్తేభముల్.

24


సీ.

కసవుమోపరిగాలి గణుతియే మా కంచు
        నగినట్ల వదనఫేనముల రాల్చు
ధర సరి లేదు పాతాళమం దేనియుఁ
        గంద మన్గతి ఖురాగ్రమునఁ ద్రవ్వు
నినరథాశ్వములట్ల మునుఁగుదుమే పూడ్తు
        మబ్ధు లన్గతి రేఁచు నంఘ్రిరజము
తముఁ గూడి వచ్చుచిత్తముల నల్క చే
        నదలించుకరణి నల్లార్చు శిరము


గీ.

లురము నందంబుఁ బలుకంద ముదుటుఁగన్ను
లరిది వెన్నులు తగ నంద మై యెసంగ
సింధుకాంభోజశకపారసీకధట్ట
బాహ్లికారట్టఘోటకపంక్తు లచట.

25


మత్తకోకిల.

చక్రము ల్జత గూడ బంగరుచాయ నింగి చెలంగఁగాఁ
బ్రక్రమాదృతపద్మతన్ శరవర్షణాస్పదవృత్తు లై
వక్రగామిత లేమిఁ జైత్రనవప్రతాపవిజృంభణో
పక్రమస్థితి మీఁఱు దేరులు భానుమండలవైఖరిన్.

26

క.

తురగము రౌతును బల్లము
గరకరి నేఁపడఁగ రథము గావించి యశం
బరుదుగ నెదు రంపుదు ర
ప్పురభటులు సురాళి గురియు బువ్వులజడికిన్.

27


సీ.

కర్ణాటకామినీకర్ణావతంసిత
        కర్ణికారపరాగగణముఁ దాల్చి
మధురాధరాచరన్మధురాధరాపున
        ర్నిధువనోత్సాహము ల్నిగుడఁ జేసి
కుంతలాంచదరాళకుంతలాగరుగంధి
        కుంతలామోదము ల్కొల్ల లాడి
లాటశుద్ధాంతలలాటమర్మాంబులీ
        లాటనక్రియలఁ బాయంగఁ ద్రోసి


గీ.

నలినకువలయనవలయనటనపటిమ
చలితలలితవదళికులకలకలకల
వితతగతికృతిచతురత వెలసి పొలసి
విసరు మరుదంకురంబు లవ్వీట నెపుడు.

28


చ.

కలువల కేమి నీ విపుడు కన్గొనినంతనె తెప్పతెప్పలౌ
నలినము లెన్ని రావు లలనామణి నీవిటు మోము ద్రిప్పినన్
వలసినసంపెగ ల్గలుగవా మఱి నీమెయిచాయ డాయ నం
చెలమి విటాళి పల్క విరు లిత్తురు నప్పురిఁ బుష్పలావికల్.

29


మ.

కులుకుంజందురుకావిపావడపయిన్ గ్రొందళ్కురాయంచ యం
చులజిల్గుం దెలిదుప్పటంబు రహి మించం గుచ్చెల ల్జాజునన్
దొలుక న్మెట్టెలసద్దుల న్మునులపద్దు ల్వీడఁగా వారకాం
తలు తద్వీథుల వత్తు రచ్చిగురుఖాణారౌతుతేజీ లనన్.

30


శా.

బాగై మించినయప్పురోత్తమముక్రేవన్ జూడ నయ్యెన్ రకం
బై గంగాయమునాసరస్వతులు చంద్రాపేక్ష యాత్మన్ గొన
ల్సాగ న్జంద్రికయున్ గళంకరమయున్ సౌగంధికస్త్రీయు ను
ద్యోగం బొప్పఁగ వచ్చె నందు మదిలో నుర్వీజనం బెన్నఁగన్.

31


క.

ఆనగరంబునఁ జంద్రుఁడు
భూనుతవైభవ మెసంగఁ బొలుచు నిజకథా

గానసుధాపానబుధా
సూనవిథామోదమోదయుక్తుం డగుచున్.

32


ఉ.

పిన్నటినాఁటనే తనవివేకము లోకమువారు మెచ్చఁగా
వన్నెకు వాసి కెక్క గురుభక్తియు యుక్తియు బంధురక్తియున్
సన్నుతసూనృతోక్తి భుజశక్తియుఁ జక్కదనం బెలర్పఁగాఁ
గన్నులు చల్లసేయు నలకైరవమిత్రుఁడు లోకమిత్రుఁడై.

33


క.

అత్త్రి నయ మలర ని ట్లను
నత్త్రిసయనునట్టిపట్టి కతిహర్షముతో
బుత్త్రా! నీదగుబుద్ధికి
పాత్రం బగుగురునికరుణఁ బడయఁగ వలదే.

34


చ.

చదువునఁ బ్రజ్జ దాన సరసజ్ఞత యందునఁ గార్యఖడ్గకో
విదతయు దానఁ జేసి ప్రతివీరనృపాలజయంబు దానిచే
నదనుగ మీఱుసంపదలు నందునఁ ద్యాగము భోగ మందుచేఁ
బదపడి కీర్తి దాన ననపాయపదంబును గల్గు నెంచఁగన్.

35


ఉ.

ఆఱనిదీవె యక్షయమహానిధి జూపునవాంజనంబు నూ
రూరికి వచ్చి తోడుపడ నోపినబంధుఁడు జ్ఞాతివర్గము
ల్గోరనిసొమ్ము దేవనరలోకవశీకరణౌషధం బసా
ధారణ మైనవిద్య వసుధ న్నుతియింప వశంబె యేరికిన్.

36


క.

చెఱకునకుఁ బండు పసిఁడికిఁ
బరిమళమును చిత్రమునకుఁ బ్రాణంబును దా
నరుదుగఁ గల్గినరీతిని
నరపతులకు విద్య గలిగిన న్నలు వొసఁగున్.

37


క.

దురమున కలుకనితురగము
వరగుణ యౌయువిద వినయవంతుఁడు సుతుఁడు
స్వరతుఁడు బుధుఁడు వివేక
స్ఫురితుం డగుమంత్రి రత్నములు నీయైదున్.

38


ఉ.

కావున నీవు ప్రాభవము గల్గుటకు న్ఫల మొందువైఖరి
న్దేవగురున్ బృహస్పతి నతిప్రతిభాస్థితి భారతీపతి
న్సేవ యొనర్చి నీదగుసుశీలతచే ముద మందఁ జేసి మే
ధావిభవంబున న్దనరి తత్కృప విద్యల నెల్లఁ గాంచుమీ.

39

క.

అన విని చంద్రుఁడు జనకుని
పనుపున సంతస మెసంగ భాసురవిద్యా
ఖని యగుగీష్పతిపాలికిఁ
జని ప్రణమిల్లుటయు నతఁడు సమ్మద మలరన్.

40


ఉ.

మైత్రి యెలర్ప నీ ట్లను కుమారక! సారెకు సచ్చరిత్రుఁ డౌ
యత్రికి సేమమా కుశలమా యనసూయకు నీకు మేలె లో
కత్రయపందనీయులు సుఖస్థితులే భవదగ్రసోదరు
ల్చిత్రము నీదురాక సవిశేషముగా నెఱిఁగింపు నావుడున్.

41


ఉ.

మాతలిదండ్రు లన్నలును మాతలిసారథికార్చనీయ! సం
ప్రీతిగ నున్నవా రచట మీచరణాంబుజ సేవఁ జేయ న
న్నీతఱిఁ బంపఁగా నెలమి నే నిట వచ్చితి నన్ను శిష్యుని
న్నీతనుజాతురీతిని వినీతుని గా నొనరించి ప్రోవవే.

42


ఉ.

ఒజ్జలు నిర్జరావళికి నుజ్జ్వలబుద్ధి సమృద్దు లెంతయున్
సజ్జను లిజ్జగంబునను సన్నుతి గాంతురు మీర లట్టిమీ
పజ్జను జేరి యొజ్జ గని భక్తి యొనర్చుచు విద్య నేర్చిన
న్మజ్జననంబు సార్థము నమజ్జనతావన! లోకపావనా!

43


శా.

మీచెంత న్బహువేదశాస్త్రపఠన న్బెక్కండ్రు విద్వాంసు లై
వాచోయుక్తిపటుత్వ మొందిరి గదా వారంద ఱౌ నౌ ననన్
ధీచాతుర్యము మించ శాస్త్రముల నర్థి న్నేర్చి యుష్మద్దయా
సాచివ్యంబునఁ బేరుఁ బ్రౌఢియుఁ బ్రతిష్టారూఢియు న్గాంచెదన్.

44


క.

సదమలగురువిశ్వాసము
త్రిదశులు మనుజులును మెచ్చ ధృతి మీయొద్దన్
జదివెద మీపరిచర్యను
నొదవెద తుదఁ గీర్తిఁ దెత్తు నురుతరలీలన్.

45


మ.

అనిన న్సంతస మంది గీష్పతి కుమారా! యత్రిగర్భంబున
న్జననం బొందిననీకు నీవినయము న్సౌజన్యమర్యాదవ
ర్తన మంచన్మధురోక్తులుం దలఁప వింత ల్గావు రాజత్కళా
ఖని వై యొప్పెడినీవు శిష్యుం డగు భాగ్యం బెన్న సామాన్యమే.

46


క.

పదునెనిమిదివిద్యలు నినుఁ
జదివించెద వేయు నేల జగముల నెందున్

బదు లితనికి లేదనిపిం
చెద నిను నాయంతవానిఁ జేసెదఁ జంద్రా!

47


చ.

అని మది మోద మందుచు బృహస్పతి యాహరిణాంకు నింటికి
న్గొని చని యాదరించి తనకు న్సహధర్మిణి యైనతారఁ గ
న్గొనె యితఁ డత్రిపుత్రకుఁ డనూనగుణాఢ్యుఁడు తల్లిదండ్రిపం
పున మనవద్దకుం జదువుపూనిక వచ్చినవాఁడు తొయ్యలీ!

48


ఉ.

నీరజగంధి! వీఁడు జననీజనకు ల్గడుగారవంబున
న్వారకఁ బెంపఁగాఁ బెరిఁగినాఁ డతికోమలదేహుఁ డీతని
న్మేర యెఱింగి యాదరము మీఱఁగ వేళకు వేళకు న్మనం
బారసి యన్నపానముల కాఁకొననీయక ప్రోవఁగాఁ దగున్.

49


మ.

అనినన్ దారయు నట్ల కాక యని విద్యాసక్తుఁ డౌచంద్రునిన్
దినము న్మజ్జనభోజనాదివిధి నర్థిం బూని పోషింప న
వ్వనజారాతియు భక్తిగౌరవము విశ్వాసంబు సంధిల్లఁగా
ననిశంబు న్దలిదండ్రుల న్మఱచె నయ్యాచార్యసేవారతిన్.

50


మ.

పరమప్రీతి నహర్నిశంబు త్రిదశోపాథ్యాయవర్యుండు సు
స్థిరతం బాఠము సెప్పి చింతనలు ప్రీతిం దానె చేయించి ప
ల్మరు నయ్యర్థ ముపన్యసింపు మని లీలం దానె శంకించి యు
త్తరము ల్దెల్పఁగ నేర్పె సభ్యనుతవాదప్రౌఢిమం దిద్దుచున్.

51


క.

ప్రఖ్యాతిఁ గాంచఁగలఁ డని
ముఖ్యుం డగుశిష్యుఁ డనియు ముద మలరంగా
నాఖ్యానాఖ్యాయికలన్
వ్యాఖ్యానముఁ జేయ నేర్పె నాతని ప్రేమన్.

52


సీ.

చదివెను ఋగ్యజుస్సామాదివేదంబు
        లధికరించెను దద్రహస్యజాత
మభ్యసించెను లక్షణానీకముల నెల్ల
        నధిగమించెను షడంగాంగములను
బఠియించెఁ గాణాదభాష్యమీమాంసలు
        తెలిసె వ్యాసమతంబు తేటపడఁగ
గ్రహియించె సాంఖ్యయోగములమర్మము లెల్ల
        నాకళించెను బురాణాదికముల

గీ.

నేర్చెఁ దెల్లముగా దండనీతిశాస్త్ర
మరసె నాద్యంతముగను వైద్యాగమంబు
నెఱిఁగె సాంగధనుర్వేద మెల్ల నపుడు
సోముఁ డుద్యత్కళాస్తోమధాముఁ డగుచు.

53


చ.

అరసి విశుద్ధశబ్దములు నర్థములు న్ధ్వనివైభవం బలం
కరణము రీతి వృత్తులును గల్పన పాకము శయ్యయు న్రస
స్ఫురణము దోషదూరత యచుంబితభావము లొప్పఁ జిత్రవి
స్తరమధురాశులీలఁ గవిత ల్రచియింపఁగ నేర్చె నంతటన్.

54


క.

అంగనలసొక్కుమందుగ
సంగీతము భరతశాస్త్రసరణియు విద్యా
సంగతులగు గంధర్వుల
సంగతి నమ్మేటి నయ మెసంగఁగ నేర్చెన్.

55


క.

అఱువదినాలుగువిద్యలు
నఱువదినాలుగువితంబు లయ్యె నుతింప
న్సురగురునికరుణఁ జిరభా
సురగురునియతి న్సుబుద్ధి సోముఁడు నేర్చెన్.

56


క.

నానావిధవిద్యలకు
న్దా నాస్పద మగుచు నమృతధాముఁడు బొలిచె
న్బూనుతబహువిధరత్నని
ధానం బగుజలధివిధము దైవాఱంగన్.

57


ఉ.

అంత ననంతవిభ్రమనిరంతర మై జిగికుందనానకున్
వింతగ సౌరభంబు ప్రభవించినవైఖరి జుంటితేనె క
త్యంతము తేట పుట్టినటు లాతనిమేనికి వన్నె దెచ్చుచు
న్గాంతి నెసంగె జవ్వనము కాంతలకు న్నయనోత్సవంబుగన్.

58


క.

పరువంపుఁబ్రాయమున నా
సరసునినెన్నడుము మిగుల సన్నం బయ్యెన్
మరునిమరు లెసఁగ నిచ్చలు
తరుణులు చూడంగ దృష్టి తాఁకినరీతిన్.

59


చ.

అలనలినారి పొల్చె నిజయౌవనవేళ స్వకీయబింబలీ
లలు దన నెమ్మొగంబునఁ గళంకరుచుల్ నునుమీసకట్టునన్

వలుదద యారుణద్యుతులు వాతెఱ వెన్నెలడాలు లేఁతన
వ్వుల నమృతంబుఁ బల్కులను బూనెనొనాఁగ మనోహరాంగుఁడై.

60


సీ.

తను జూచుజవరాండ్ర కెనయుకోర్కులభంగి
        నిడుదలై బాహువు ల్నీటు మెఱయ
గని సొక్కుకొంతలయనునయోక్తులరీతి
        యెగుబుజంబులు కర్ణయుగళి సోఁకఁ
దిలకించుభామలబలుచింతయును బోలె
        విస్తీర్ణ మై ఱొమ్ము వీఁకఁ దనర
వీక్షించుకన్నెలవిరహాబ్ధికైవడి
        లలితవాక్కులు గభీరత వహింప


గీ.

మిసమిసలు దేరునునుపైనమేనిసొబగు
కన్నులను గాంచి మది మెచ్చుకమలముఖుల
మనసువలె బాల్యము గరంగ మరునిమామ
సొంపు గనెఁ జాల యెలజవ్వనంపువేళ.

61


ఉ.

చక్కనిపోఁకబోదె నగఁ జాలుగళంబును గేల నొక్కినం
జిక్కనిపాలుగాఱునునుఁజెక్కులు సంపెఁగమొగ్గయందమున్
ద్రొక్కెడుచారునాసికయుఁ దోరపుడా ల్వెలిదమ్మిరేకులన్
మిక్కిలి గెల్చుకన్నులును మించునొయారము నింపు నింపఁగన్.

62


క.

చక్కెరవిల్తునొయారపుఁ
జక్కెర పం చని వలంచుచక్కదనాన
న్మిక్కుటముగ విలసిల్లెను
చుక్కలగమికాఁడు మిగులఁ జూపఱు లెంచన్.

63


చ.

మునుమును వింతగాఁ జిలుకముక్కుజిగి న్దగునుక్కుగోటిచే
ననువుగ గీరునామము నొయారముగా నిడ నేర్చెఁ బెన్నెఱు
ల్వెనుకకు నొత్తి జాఱుసిగ వేయఁగ నేర్చెఁ గడానితమ్మిపూ
పనినునుఁబచ్చడంబ వలెవాటు వహింపఁగ నేర్చె నీటునన్.

64


సీ.

పలుమాఱు ముగ్ధభాషలు పల్కుటలు మాని
        యమరి జాణతనంబు లాడఁ దొడఁగె
సతతంబు వేదశాస్త్రప్రసంగము మాని
        శయ్య లొక్కొకసారి చదువ సాగె

సహజంబుగా వధూజనులఁ జూచుట మాని
        సొలపున నోరగాఁ జూడఁ గలిగె
వేడ్క బాలురతోడ విహరించుటలు మాని
        సరసులతోఁ జెల్మి సలుపఁ బూనె


గీ.

వటువు జిగిమోవి మెఱయ నవ్వుట లెఱింగె
వింతవింతగఁ గైసేయువితముఁ దెలిసె
మొలకమీసలు వడి గొల్పు మురువు నేర్చె
రసికతానందశృంగారరసము నేర్చె.

65


ఉ.

వాని యొయారవున్నడలు వానిచకచ్చక లీనుపొన్నొడ
ల్వానిరుటంపుఁబెందొడలు వానిరువారపుసిబ్బెపుంబొడ
ల్మానవతు ల్గనుంగొనిరి మానసవీథి మనోరథానుసం
ధానము పూని సూనశరదారితభూరితరాభిమానలై.

66


సీ.

కులుకుఁ జూపులను గల్గొననియేణాక్షియు
        ననురక్తిఁ గననిబింబాధరయును
బలుక నుంకింపనిచిలుకకొలికియుఁ
        దమి జెంది కుందనికమలముఖియుఁ
బెనఁకువ కాసఁ జేయనిలతాతన్వియుఁ
        బారవశ్యంబుఁ దాల్పనిప్రమదయు
ఘన మైనమరుకాఁక గొనని హేమాంగియు
        సరసతఁ జెందనిజలదకచయు


గీ.

డాసి దయ నేలు మనుచు వేఁడనియబలయుఁ
గదిసి కేలెత్తి మ్రొక్కనిగజగమనయు
లేదు ధారుణిలోఁ గల్గు లేమలందు
జవ్వనంబున రేరాజు నివ్వటిల్ల.

67


ఉ.

హాటకగర్భునంశ నమృతాంశుఁడు నుజ్జ్వలమూర్తి యౌజగ
న్నాటకసూత్రధారకుమనం బలరంగ మెలంగినట్టియ
మ్మేటి కళానిధిత్వమున మించినవాఁ డెలజవ్వనంబు స
య్యాటలు మీఱుచోఁ గువలయాక్షుల కిం పొనరించు టబ్రమే.

68


ఉ.

ఆలలితంబు లాసొగసు లానెఱజాణతనంబు లాకళా
శాలిత యాసురూపరుచిసంపద లాహవణింపుసొంపులున్

హాళి మెయిం గనుంగొనినయంతన వేలుపుటొజ్జలయ్యయి
ల్లాలు విరాళి నొందె మది నంగజుమాయ తరింప శక్యమే.

69


ఉ.

రాకకుఁ బోకకుం గలువరాయనిచక్కదనంబు కంటి కిం
పై కనుపట్టి యచ్చెలువ యప్పటికప్పటికిన్ మనంబునన్
వ్యాకులతన్ వహింప మరుఁ డంతట నంతట తమ్మిగుమ్మితిం
జేకొని వీఁక మై మొనలఁ జిమ్మఁ దొణంగెను గొమ్మఱొమ్మునన్.

70


మ.

ప్రమదారత్నము తార చంద్రు నెనయన్ భావించుఁ దోడ్తోన న్యా
యము గా దంచుఁ దలంచుఁ దాళఁగలనా యంచున్ వితర్కించు వం
శము శీలంబు మదిం గణించును బ్రతిష్ఠ ల్సూచినం దీరునా
తమి యంచుం గమకించు భీతి మదిలోఁ దర్కించుఁ గాంచు న్వెతన్.

71


ఉ.

ఒప్పుగ నొజ్జయొద్ద శశి యున్నతఱిం దలు పోరఁ జేసి యా
యొప్పులకుప్ప వానిమెయియొప్పిదముం గనుఱెప్పవెట్టకే
తప్పక చూచి కన్మొగిచి తళ్కు తళుక్కనఁ గమ్మ లూఁగఁగాఁ
గొప్పసియాడఁ జెక్కులు గగుర్పొడువం దలయూఁచు మెచ్చుచున్.

72


ఉ.

కమ్మజవాదివాసనలు గ్రమ్మఁగ నోరపయంట జాఱఁగా
నెమ్మెలు మీఱ నగ్గురునియింతి తొలంగఁగ నిమ్ము లేనిమా
ర్గమునఁ జంద్రునిం గదియఁగాఁ జని వానిభుజమ్ము సోఁకఁగా
జిమ్మును జన్మొనన్ గళలు చెమ్మగిలన్ దనువెల్ల జల్లనన్.

73


ఉ.

పాయనిప్రేమ బాల్యమునఁ బాపఁడ! చిన్న కుమార! రార! బా
బా! యనుపల్కులం దొఱఁగి యాగజగామిని సామి! యేమిరా
కాయజమోహనాంగ! వగకాఁడవురా నెఱహొంతకారివౌ
నోయి! పరాకు జాణ! యనుసూక్తులు పల్కఁగ సాగె వింతగన్.

74


మ.

జనము ల్లేనియెడన్ శశాంకుసరసన్ సాంబ్రాణిధూపంబు వా
సన గుప్పక్ నెఱిగొప్పు విప్పి పయఁటన్ జందోయి నిక్కంగ వే
డ్కను గీల్గంటు ఘటించి చెంగలువమొగ్గ ల్చెక్కి రేరాజ! యీ
నన నీ వంటిన విచ్చునం చతని మేనన్ మోపుఁ దా నవ్వుచున్.

75


క.

పరిపరివిధముల ని ట్లా
సరసునిఁ జెనఁకుచును నిలుపఁ జాలని ప్రేమన్
మరునురవడివిరికిరుసున
మెరమెరభావంబు లోన మెఱవఁగ మఱియున్.

76

సీ.

కనుఱెప్ప వెట్ట కాతని నెగాదిగఁ జూచుఁ,
        జూచి యల్లన తల యూఁచి మెచ్చు
మెచ్చి మోహము బయల్మెఱయఁ బక్కున నవ్వు,
        నవ్వి తోన గిరుక్కునను దొలంగుఁ
దొలఁగి వెంటనె యోరఁ దళుకొత్తఁ గన్గొను,
        గన్గొని వానిఁ జెంగటికిఁ బిలుచుఁ
బిలిచి యూరక సీమఁ గలముచ్చటల నాడు,
        నాడి యేకాంత మటంచుఁ జేరుఁ


గీ.

జేరి చెవిలోన గుసగుస ల్చెప్పినట్ల
మోహమున వానిచెక్కిట మోముఁ జేర్చుఁ
జేర్చి చెక్కులఁ బులకలు చెంగలింప
నవశ యై చొక్కుఁ దమి మీఱి యామిటారి.

77


చ.

గడెతడ వాతఁ డొక్కపనిగాఁ జని యింటికి రాకయుండినన్
దడఁబడు మీఁ దెఱుంగదు వితాకున నుండును జిన్నవోవుఁ దా
బుడుతలచేతఁ బిల్వఁబనుపున్ మఱి వచ్చిన నింతసేపు నె
క్కడ నని మోడిగాఁ బలుకుఁ గ్రక్కున నవ్వును నాతఁ డల్గినన్.

78


ఉ.

అందపుజాఱుఁగొప్పు నసియాడెడుకౌనును లేఁతవెన్నెలల్
సిందెడునవ్వు నబ్బురపుసిబ్బెపుగుబ్బ సగంబు గానరాఁ
గ్రిందును జీరుపయ్యెదయు గిల్కు గిలుక్కని మ్రోయుమట్టియల్
చం దమరంగ నిందుముఖి చందురుముందఱ నిల్చుఁ గుల్కుచున్.

79


ఉ.

మట్టుకు మీఱుమోహమున మానిని వానికి మేలిదుప్పటు
ల్గట్టఁగ నిచ్చుఁ గుంకుమముఁ గస్తురిఁ దానె యలందుఁ గ్రొవ్విరు
ల్చుట్టు ననర్హ్యరత్నములసొమ్ములు వెట్టును భోజనం బిడున్
గట్టెఁడుతెల్లనాకులును గప్పురబాగలు నిచ్చు నిచ్చలున్.

80


సీ.

జిలుఁగువల్వ వదల్చి చెంగావి ధరియించి,
        యది బాగొ యిది బాగొ యనుచు నడుగు
ఱైక సడల్చి యారజపుఁబైఁట ఘటించి,
        యది మేలొ యిది మేలొ యనుచు నడుగు
జడ విచ్చి వింతగా జాఱుకొ ప్పమఱించి,
        యది నీటొ యిది నీటొ యనుచు నడుగు

హెచ్చుముక్కర దీసి పచ్చతళ్కు ధరించి,
        యది లెస్సొ యిది లెస్సొ యనుచు నడుగు


గీ.

గమ్మకస్తురితిలకమ్ముఁ జిమ్మి సమ్మ
దము గ్రమ్మగ జగికుందనమ్ముఁదళుకు
తిలక మలికమ్మునను జిగి దొలఁకఁ బూని
యందొ యిందునొ యంద మం చడుగు వాని.

81


గీ.

ఇంట మెలఁగెడివారిలో నెవ్వ రైన
నతనిఁ దారామనోహరా! యనుచుఁ బిల్వ
డెంద మానంద మొంద నాయందకాని
మొగముఁ గనుఁగొని ముసిముసి నగవు నగును.

82


క.

అద్దము గానము తిలకము
దిద్దర నుదుట నన నతఁడు దిద్దుచు నుండన్
ముద్ధిడ వాతెఱ యొగ్గును
ముద్దియ యతఁ డూరకున్న మోడిగఁ జూచున్.

83


ఉ.

చేరఁగ రార నీకురులు చి క్కెడలించెద నంచు నేర్పుతో
సారసగంధి పిల్చి బిగిచన్నులు వెన్నున నాన నిల్పి శృం
గారపువింతమాటల వికావిక వాని నగించి నవ్వుచుం
గూరిమి మీఱ గీఱి కొనగోటఁ జిటుక్కున నొక్కుఁ జొక్కఁగన్.

84


ఉ.

ఒక్కొకవేళ నాసరసుఁ డొంటిగ నింటను నిద్ర పోవఁగా
నక్కలకంఠి తమ్మరస మంటఁగ గెంటనిప్రేమ వాని ను
న్జెక్కులు ముద్దు వెట్టుకొని నిద్దుర లేచినయంత నింతనే
పెక్కడఁ బోయి తీగుఱుతు లేడవి యద్దముఁ జూచికొ మ్మనున్.

86


సీ.

గుబగుబ మని పల్కుకోకిల పల్కులు,
        విని యవి నేర్తువా యనుచు నవ్వు
గవ గూడి పొదలుజక్కవల మక్కువటెక్కుఁ,
        గాంచి వానిగుఱించి కన్ను గీటు
నీవు పెక్కువొ లేక నేను బెక్కువొ యంచు,
        సరి నిల్చు వానిభుజంబు సోఁక
మడుపులు చుట్టి యేర్పడఁగ గోరులు వెట్టి,
        లలి మీటు మరునికిల్లాకు లనుచు

గీ.

మురిపెమున మేను విఱుచుఁ గెమ్మోవిఁ దెఱచుఁ
గుచ్చెల విదుర్చుఁ బయ్యెదకొంగు జార్చుఁ
గొసరు వగ నవ్వుఁ గొనగోటఁ గొప్పు దువ్వు
నొంటి నరికట్టు నిలు మంచు నొట్టుఁ బెట్టు.

86


క.

ఈరీతిన్ వానియెడన్
నారీతిలకంబు మేలునన్ వర్తిలఁ గా
నారసి యారసికునిపైఁ
దారసిలెన్ గిన్క మీఱ దర్పకుఁ డంతన్.

87


క.

ఆపొలఁతి తలఁపు వలపున
దాపక తోఁదోపులాడు నయు తరితీపుం
జూపుల కోపుల నేపుల
వైపుల మైపులక లెసఁగ భావము గరఁగన్.

88


సీ.

కులుకులాడిని ప్రేమ దొలుకుఁజూపులఁ జూచి,
        యలుకు మీఱఁగ దోస మనుచుఁ దొలఁగు
కనకాంగి తనుఁ జేరఁ జెనకంగ నుంకించి,
        వెనుకటి కిది మాట యనుచు వెఱచు
సరసిజాననతోడ సరస మాడఁ దలంచి,
        వరుస కా దంచు భావమున నెంచు
నెలఁతఁ గన్గొని సొక్కి నిచ్చలు తన కిదే,
        మరు లాయె నని హరిస్మరణ సేయు


గీ.

నొంటిపాటున నవ్వాలుగంటి నంటి
యొంటుకొనఁ జూచి యోహో యయుక్త మనుచుఁ
దలఁచు దలఁచియు మరునికిఁ దల్లడిల్లు
నుల్లమున నుండు యామినీవల్లభుండు.

89


ఉ.

చెంతఁ దనంత నింతి కడుఁ జేరిక సేయఁగ సంతసంబున్
గంతుఁడు రం తొనర్పఁ బరకాంత యటంచు నధర్మ మంచు లో
నెంతయుఁ జింత నొందు మన సిట్టటు కొట్టుక నాడ సాహసం
బింత భయం బొకింత రుచి యింత యసమ్మతి యింత గన్పడన్.

90


క.

వెండియు దినదినమును దన
దండను వేదండయాన తరితీపువగల్

మెండుకొన నుండఁ గన్నుల
పండువుగాఁ జూచి కామపరవశుఁ డగుచున్.

91


ఉ.

ఈయబలాలలామ కెన యేయుగమందును గాన నీబెడం
గీయెలప్రాయముం జెలువ మీకొమరున్ మఱి దీనికే తగున్
వే యన నేల ధాత్రిఁ బ్రభవించినవారికి నీమిటారిమై
చాయ యొకింత సోఁకినను జాలు నదే కనకాభిషేకమౌన్.

92


క.

చన్నులు కౌఁగిటి కణుగవు
కన్నులు చేరలును గొల్వఁగా సరిమించున్
వన్నెలు పలుకులు వేలుపు
టన్నులయందైన దీనియందము గలదే.

93


సీ.

నిద్దంపుటద్దంపునిగనిగల్ గలదీని,
        ముద్దు చెక్కిట నుంచుమోము మోము
జగజంపుజిగికెంపువగ నింపునీయింతి,
        మోవిపై నానించుమోవి మోవి
బలుకోకముల వీఁక నలవోక గెల్చునీ,
        కలికిచన్గవఁ బట్టుకరము కరము
క్రొమ్మించునమ్మించునెమ్మేన మెఱయునీ,
        సుదతియందము చూచుచూపు చూపు


గీ.

మదనదవదహదోదూయమానమాన
సాబ్జసంజీవినీవిద్య యైనదీని
రవకొసరుఁబల్కు వినువానిచెవులు సెవులు
తనియ నీయింతిఁ గూడినతనువు తనువు.

94


ఉ.

ఎందఱిఁ జూడ మిద్ధరణి నిందునిభాస్యల వారి కెల్ల నీ
యందము చందముం గలదె యక్కట! మిక్కుట మైనకోర్కి చే
నందఁగరానిమ్రానిఫల మాస యొనర్చినచంద మాయె నే
మందు మనోజుఁ డేగతిని నారడిఁ బెట్టఁదలంచినాఁడొకో!

95


సీ.

కలకంఠితళ్కుగాజులు గల్లు మనినంత,
        మనసు ఝుల్లని చాల మమత నొందఁ
జిగురాకుఁబోఁడి మై జిగి దళు క్కనినంత,
        తాల్మి చెళు క్కని తత్తరిల్లఁ

గులుకుగుబ్బెతజాఱుకొప్పు ఘమ్మనినంత,
        సొక్కి జుమ్మని మేను సొమ్మసిల్లఁ
జేరి మాటాడక చెలి గిరుక్కున నేఁగ,
        మతి చురుక్కని చాల వెతలఁ జెంద


గీ.

బాళిఁ గడు దూలి జవరాలిపై విరాళి
బయలు మతిమాలి తమి సోలి బయిసిమాలి
వనరువత మాయె నౌర భావజునిమాయ
నేకరణి నిల్వఁగా నేర్లు నెట్టు లోర్తు.

96


ఉ.

ము న్నొకనాఁడు నంగనల ముద్దులసుద్దు లెఱుంగనట్టిచో
వన్నెలు మీఱ నందమున వావిరి వింతకు వింత యైనయీ
క్రొన్ననబోణి తానె ననుఁ గోరికఁ జేరిక సేయ నూరకే
యున్న యెడ న్మనోజుఁ డిది యోర్చునె దైవము మే లొనర్చు నే.

97


ఆ.

అలక లురులు గాఁగ యలనాభి చెలమగా
మెఱుఁగుఁదియ్యమోవి మేఁత గాఁగ
చెలియదీమమునను వలరాజు వేఁటాడఁ
జిక్కె నామనంబు జీనువాయి.

98


ఉ.

ప్రేంఖదధర్మవర్తనకు భీతిలి గోలతనాన నిప్పు డీ
శంఖసమానకంఠిని వశంపదఁ జేసుక పొందనైతి నా
పుంఖితబాహుఁడై మరుఁడు పొంచినవాఁ డెటులో “శరీగమా
ద్యం ఖలు ధర్మసాధన” మటంచు వచింపఁగ నాలకింపమే.

99


క.

ఈవనిత బెళుకుఁజూపులు
భావజుతూపులవితానఁ బైఁ బర్వినచో
నేవేదము లేశాస్త్రము
లేవాదము లేవివేక మేలా నిల్చున్.

100


సీ.

పొలయల్కలోన నీపొలఁతుకతోఁ గూడఁ
        దర్కించువేడుక తర్కశాస్త్ర,
మంగజుకేళి నీయంగనతోఁ గళా
        స్వరములు పల్కుటే శబ్దశాస్త్ర,
మదనమౌతమి దీనియాస్యంబున నిజాస్య
        యోగ మొనర్చుటే యోగశాస్త్ర,

మిమ్ముగా నిమ్ముద్దుగుమ్మగుణములు,
        సంఖ్య యొనర్చుటే సాంఖ్యశాస్త్ర


గీ.

మలఁతికొనగోట నొక్కి నీయతివనీవి
మోక్ష మొనరించుటే యెల్ల మోక్షశాస్త్ర
మేను నీవని పైకొనుటేను ద్వైత
మిరువు రొక టైన నద్వైత మిద్ధరిత్రి.

101


క.

మెఱుఁ గెక్కినయద్ధముగతిఁ
బరఁగినయాచెలికపోలఫలకముమీఁదన్
చిరుతనెలవంక లుంచుట
సరసముగ గురుప్రతిష్ఠ సలుపుట గాదే.

102


చ.

మెలకువ సెజ్జఁ గాంచి తమి మించి నయంబున బుజ్జగించి వై
పుల నెలయించి వింతసొలపుం దెలుపుంబలుపున్ వగల్ దగన్
గళల గఱంచి భావములు గాంచి రతిం దనియించి వేడ్క నీ
యలికులవేణిఁ గూడవలదా యిలఁ దాఁ దను వెత్తినందుకున్.

103


క.

ఉన్నవి నామది కోరిక
లెన్నెన్నో యింతిహృదయ మేమో నన్నున్
మన్నన దయఁజేయునొకో
క్రొన్నవిలుకానివెతలకుం ద్రోయునొకో.

104


మ.

అని యంతంత నిరంతరాంతరదురంతానంతచింతామహాం
బునిధిస్ఫీతతరంగభంగురహృదంభోజాతుఁడై సంతతం
బును గుప్యద్ఘనమీనకేతనధనుఃపుంఖానుపుంఖోత్పత
ద్వనజానర్గళమార్గణప్రకరనిషత్రాకృతస్వాత్మతన్.

105


క.

పువ్విలుతుఁ డొకఁడు ద్రిప్పఁగ
నెవ్వరు నెఱుఁగనివిరాళి హృదయంబు గడు
న్నొవ్వఁగ నెవ్వగఁ బొగలుచు
నవ్వనజారాతి మగుడ నాత్మగతమునన్.

106


చ.

పలుకులనేర్పులున్ జిలుగుఁబయ్యెదజార్పులు వింతమోడిన
వ్వులు నలయింపులున్ బెళుకు టోరయొయారపుఁజూపుసొంపులుం
గులుకులుఁ బ్రౌఢకామినులకున్ సహజంబులు వీనిఁ జూచి య
య్యలికచఁ జేరఁ గోరఁ దగవా నగ వారడి గాదె మీఁదటన్.

107

చ.

తలఁపఁగ సాహసంబు తలిదండ్రులు విన్నను తాళ రీగురుం
డలిగిన మోస మింద్రుహృదయంబునకు న్వెలి యాదు నందుపైఁ
బొలఁతుల నమ్మఁ గూడ దెటు బో నెటు లౌనొ యిదేల తానె యీ
చిలుకలకొల్కి బల్మి దయచేసిన చూత మటంచు ధీరతన్.

108


క.

అగ్గలిక మీఱఁ దాలిమి
తగ్గక మానసముఁ బట్టి తను వలచినయా
దిగ్గజకుంభస్తనిపై
నొగ్గినభావంబు నూఁది యుడుపతి యుండెన్.

109


ఉ.

అంత లతాంతకుంజసదనాంతవిహారవిలాసవత్యుప
క్రాంతవసంతరాగవిసరద్విగుణీకృతపల్లవోల్లస
త్కాంతిసదారుణోదయతతప్రమదాకులకోకకామినీ
సంతతరుచ్యుదంతము వసంతము దోఁచె వనాంతరంబులన్.

110


క.

ఆకులపాటు వియోగుల
కే కాదు ప్రపంచధర్మ మెఱుఁగనివృక్షా
నీకంబునకుం గలిగెన్
ఢాక వసంతునిదె మిక్కుటంబుగ ధాత్రిన్.

111


ఉ.

వాలుగడాలువానిదళవాయి వసంతుఁడు జైత్రయాత్రకై
సాలములందు జీర్ణదళసంఘము చీళిత బెట్టి క్రొత్తఁగా
మేలిదళంబుల న్నిలిపి మీఱి యయుక్తజనామితక్షమా
పాళి గ్రహించి నూత్నమగుపైకములన్ సవరించె నెల్లెడన్.

112


క.

ఎలమావిని నునుఁబల్కులు
గలకోయిలఁ జేరనీక కాకము తఱిమెన్
లలితుఁ డగునృపునిచెంగట
ఖలుఁ డొక్కరుఁ డుండి కవులఁ గదిమెడిమాడ్కిన్.

113


మ.

తెలిమొగ్గల్ బలుసిబ్బెపుంబొడలుగాఁ దేనె ల్మదోద్వేలధా
రలుగాఁ దేఁటులబారు బారిగొలుసై రాణింప లేగుజ్జుపొ
న్నలు పున్నాగము లై వనిన్ జిగురుఖాణామేటికి న్మెచ్చుగా
దళశృంగారము లై చెలంగె నిరుచెంతన్ మావు లొప్పారఁగన్.

114


గీ.

సరజసారుణమకరందసారధార
గురిసె నప్పుడు కుసుమమంజరిని జాలఁ

కమ్మవిలుకాఁడు విరహులఁ గ్రమ్మి దివియఁ
గిఱుసుకత్తిని దొరఁగునెత్తురు లనంగ.

115


ఉ.

కోయిలపేరిగారడపుగొంటరి తా ఋతురాజుముందటన్
మాయ వహించి లేఁజిగురుమారునికత్తులు మ్రింగ వాఁడు ము
క్తాయతహారపఙ్క్తులు ప్రియమ్ముగ నీయఁగ దెచ్చి నించె నా
నేయెడ మొగ్గచాలు జనియించెను భృంగకులంబు మెచ్చఁగన్.

116


మ.

అమరం గ్రొవ్విరితేనెచాలుకొణతా లందంద లాగించి పొం
కముగం బుప్పొడిమట్టిలోఁ బొరలి వీఁకన్ బోక పూమొగ్గగో
తములం ద్రొబ్బి సమీరమల్లుఁ డనువొందన్ మావిపూలోడిఁ ద్రి
ప్పుమెయిన్ గోకిలబాలుఁ డెంచికొను సొంపుల్ గుల్కునాదంబులన్.

117


రగడ.

వెలసె వనాంతరవీథి వసంతము
గలిగె జగంబులఁ గనకవసంతము
జిలిబిలియలరులఁ జిమ్మె లతాంతము
సొలపున మీఱె నశోకలతాంతము
మురువుగఁ బొన్నల మొగ్గలు వుట్టెను
సరసిజముల మధుసారము వుట్టెను
కరకరిఁ గంతుఁడు కైదువఁ బట్టెను
విరహిణులకు మది వెత చూపట్టెను
భుగభుగ మని సురపొన్నలు విచ్చెను
మగనికిఁ జెలి కమ్మనిమో విచ్చెను
పొగడమొగడలకుఁ బుట్టెను దావులు
తగె విటసంకేతమ్ముల తావులు
భసలవిసరములు బారులు తీరెను
మసలక పికములమౌనము దీరెను
కనుఁగొనవే శృంగారపువనములు
మన మలరించునె మఱి జవ్వనములు
పొలిచె మహీజంబులు సదళంబులు
తులకించెను గంతునిషుదళంబులు
కననీయ నిదే కైకొను మరువము
వనితా! యిచ్చితివా నిను మరువము

మెలఁతరొ! నావి సుమీ విరవాదులు
వలదే నాతో వలవనివాదులు
కలికీ! యిచ్చట కంతునికైదువ
నలికీ నరుగఁగ నచ్చటికైదువ
తగఁ బూచెఁ గదే స్థలనీరజములు
దిగు లొందించెఁ బథిని నీరజములు
పువ్వులు గలవఁట పోదమె దవులకు
నవ్వుచు జవ్వని! నను వెను దవులకు
ఇంతి! యెక్కడివె యీకోరకములు
చెంత నుండె నిచ్చెద కోరకములు
చెలి! మును నేఁ జూచితినే కొమ్మలు
బళి న్యాయముఁ జెప్పరె యాకొమ్మలు
నాతి! ప్రేంకణము నగె నీపాటల
చేతి కబ్బె నిదె చేకొను పాటల
తోయజలోచన! దొరకెను దవనము
వే యీడకు రావే మీఁద వనము
మోవి గంటివా ముద్దుల గులుకదె
మోవిగంటి నా ముద్దుల గులుకదె
విటపాళుల నీ వేనలిఁ బెట్టుదు
విటపాళుల నీవే నలిఁ బెట్టుదు
ననిచిన గోరంటను జెలి! మెచ్చవు
ననిచినగో రంటను చెలి మెచ్చవు
అని వనితామణు లాడఁగఁ బాడఁగ
ఘన మగుతమి మొగ్గలు గిలు పాడఁగ
నలు వగునబలల నారామంబుల
నళికులయుతముల నారామంబుల
పాటీరనగోపరిహరిచందన
వాటీవేల్లితవల్లీస్పందన
పటిమ చెలంగుచుఁ బాండ్యవధూటీ
చటులోపరిరతిసంభ్రమధాటీ

విలులితసురభిళవేణీచాలన
లలితసుపరిమళలహరీఖేలన
సరణికఁ బోదలుచుఁ జల్లగఁ గదలుచు
విరులను గురియుచు విరహుల నొరయుచుఁ
గమలము లంటుచుఁ గలువల నొంటుచు
స్తిమితతఁ గులుకుచుఁ దేనెలుఁ జిలుకుచు
నలసతఁ దూలుచు నళితతిఁ దోలుచు
మలసెను దారము మలయసమీరము.

118


సీ.

ఏలాలతాజాలడోలాసమాలోల
        బాలామణీగానభాసురములు
ధీరానిలవ్రాతధారాచలచ్చూత
        దూరాపతద్రజోధూసరములు
మోదావహాంగనవేదాభరవభృంగ
        ఖేదావహజ్జాతికేసరములు
నాళీకదృక్కాంతపాళీనవైక్రాంత
        కేళీపరిన్యూతకేసరములు


గీ.

కనఁ దగె నకుంఠకలకంఠకంఠనాద
పటుభటాహ్వానకుపితబిభ్యత్ప్రపంచ
పంచసాయకమదహస్తిపైసరములు
మీసరములు మధుమాసవాసరములు.

119


క.

ఆమని యేమని చెప్పెద
నామనికిన్ వికచకుసుమితారామతరుల్
కామనిరంతరకీర్తి
స్తోమముగా నిఖిలదిశల సొబ గొందునెడన్.

120


చ.

ప్రతతభుజానిరర్గళపరాక్రమపాలితలోకుఁడౌ శత
క్రతుఁ డపు డత్యుదారత నొకానొకయాగము సేయఁ బూని దై
వతగురుఁ డైనయాంగిరసుపాలికిఁ జారునిఁ బంప వాఁడు శీ
ఘ్రతఁ జనుదెంచి గీష్పతినిఁ గాంచి జొహారొనరించి యిట్లనున్.

121


క.

తిన్నగ జన్నము సేయుమ
తి న్నగవైరి నను బంచె దేవరకడకుం

బన్నుగ నాతని ఫలసం
పన్నుఁగఁ జేయఁ దగు శిష్యవత్సల! యనినన్.

122


క.

హృదయమున సమ్మోదము
గదుర సురాచార్యుఁ డట్ల కాని మ్మనుచున్
మది రాగము కుదు రారఁగ
మదిరాయతనేత్రఁ జూచి మధుమధురోక్తిన్.

123


పంచచామరము.

పయోజపత్రనేత్ర! గోత్రపత్త్రభంజనుండు స
త్ప్రయోగ మైనయాగ మర్థి తా నొనర్చుపూనికిన్
బ్రియంబునన్ రయంబు మీఱఁ బిల్వఁ బంచె నన్నయో!
వియోగవేగ మెట్టు లోర్తువే గజేంద్రగామినీ!

124


శా.

ముల్లోకంబుల నేలురాజు సవనంబున్ దీర్ప రమ్మన్నచో
నుల్లంఘింపఁగ రాదు గావునఁ దదుద్యోగంబు గాఁ జేసి సం
పల్లాభంబున వేగ వత్తు నిపు డాత్మన్ ఖేదముం జెందకే
యిల్లున్ వాకిలిఁ జూచికొమ్ము మదమత్తేభేంద్రకుంభస్తనీ!

125


చ.

అలకలు దువ్వరాదు సరసాన్నములన్ భుజియింపరాదు మై
కలప మలందరాదు తిలకంబు రకంబుగ దిద్దరాదు సొ
మ్ములు గయిసేయరాదు సుమముల్ ధరియింపఁగరాదు సాధ్వియౌ
నలినదళాయతాక్షికిని నాథుఁడు చెంగట లేక యుండినన్.

126


గీ.

కాన నీవును మారాక మానసమునఁ
గోరి యీరీతి సత్పథాగారగరిమ
మీఱ నుండుము చారుచకోరనేత్ర!
నీవెఱుంగనినీతి నిర్నీతి గలదె.

127


చ.

మఱియొకమాట బోటి వినుమా మనమారసి యీడ కేము క్ర
మ్మఱఁ జనుదెంచునంతకును మాప్రియశిష్యుఁడు చంద్రుఁ డన్నిఁటన్
వెఱవరి నీమనం బరసి వేడ్క మెలంగుచు నింట నుండు నీ
వఱమఱ లేక కావలయునట్టిపను ల్గొను మంబుజాననా!

128


చ.

వయసున బాలుఁ డయ్యుఁ బరువంబగుతెల్విని జాలపెద్ద యెం
తయు గృహకృత్యవర్తనల నన్ మఱపించును నిచ్చలున్ సుఖో

దయమున నెండ కన్నెఱుఁగఁ డారయఁ జూచినఁ గందు మేను స
త్ప్రియహితవర్తనుం డితని వేఱుగ నెంచకుమా తలోదరీ!

129


క.

ఇంటికి బ్రాపై యెప్పుడు
కంటికి ఱెప్పవలెఁ గదిసి కాచు నితని కాఁ
కంటికి నన్నం బిడి వా
ల్గంటీ! కడు ప్రేమఁ బ్రోవఁ గాఁదగుఁ జుమ్మీ.

130


చ.

అనినఁ దదీయదార సముదారముదారమదాత్మభావగో
పనమున నోరచూపులను బ్రాణవిభుం దిలకించి యుస్సురం
చని వెస నూర్చి చెక్కిటఁ గరాబ్జముఁ జేర్చి ధరిత్రి వ్రాయుచున్
గనుగవ నశ్రువుల్ దొలుక గద్గదికన్ దల వాంచి యిట్లనున్.

131


శా.

ఔ! లెం డేమిటిమాట! హా పయనమా హాస్యానకుం బల్కుటో!
బాళి న్నాహృదయంబుఁ జూచుటకొ! నాపైఁ గోపమో! కాక నన్
జాలిం బెట్టెడిలాగొ! నైజమొ కటా! న న్నొంటిగా నుంచి పో
నేలీలన్ మన సొగ్గె మీకు నహహా! యేనా మిముం బాయుటల్?

132


ఉ.

ఏ మనుదాన నేకరణి నే మనుదాన వియోగసాగరం
బేమని యీఁదుదాన గతి యేమని పల్కెడువారిఁ గాన హా!
గామిడి దైవ మీవితము గామిడిమేలపుసేఁత నిర్దయన్
సీమలు గానిసీమలకుఁ జెల్వుఁడ! యేఁగఁగ దెచ్చె నక్కటా!

133


ఉ.

పైన మిదేల యన్న గ్రతుభంగము చేసినదోస మశ్రువుల్
పూన నమంగళం బగును బొమ్మని పల్కను నో రెటాడు మీ
తో నయినట్టిపాటు ననుఁ దోడ్కొనిపొమ్మన నెంతభారమో
యౌ నది మీకు నెట్టు లహహా యెడఁబాయుదె నేమి సేయుదున్.

134


గీ.

తలఁపు లొక్కటి గాఁగ నగ్గలపువలపు
చెలిమికలిమిని దొలఁకక కలసి మెలసి
భువిని క్షీరోదకన్యాయమునను వెలయు
దంపతులు చేసినట్టిదేతపము తపము.

135


సీ.

తీర్థాలవెంబడిఁ దిరుగుట కొన్నాళ్ళు
        జన్నంపుదీక్షలఁ గొన్నినాళ్ళు
తుద లేనియొక్కప్రొద్దులచేతఁ గొన్నాళ్ళు
        ఘోరతపంబులఁ గొన్నినాళ్ళు

గురుకులవాసపుగోష్ఠిచేఁ గొన్నాళ్లు,
        పున్నమమా సంచుఁ గొన్నినాళ్లు
ఋతుదినంబు లటంచు మది నెంచి కొన్నాళ్లు,
        పన్నినవేసటఁ గొన్నినాళ్లు


గీ.

గాఁగ యెలప్రాయ మెల్ల నీకరణి నేఁగె
యెన్నఁడును నీదుకౌఁగిలి యెఱుఁగ నైతి
యిపుడు నీవద్దనుండుట కేని యోర్వ
దాయెఁ బగదాయదైవ మీదారి నకట.

136


చ.

గళరవమంత్రము ల్చెలఁగఁగా జిగిసిబ్బెపుగుబ్బచన్ను ల
న్కలశము లంది యంది జఘనం బనువేదికయందు నుండి యు
జ్జ్వలరశనన్ గ్రహించి జిగివాతెరసోమరసంబు గ్రోలవే
డ్కలు గలమన్మథక్రతువు కన్నను వేఱొకజన్న మున్నదే.

137


గీ.

తఱుచుమాటలు నేర నిర్దయత మీఱ
నింట నన్నొంటి నుంచిన నేవితానఁ
దాళఁగలదాన నెన్నిచందాల నైనఁ
బైనమైరాక మాన మీపాద మాన.

138


చ.

అని కపటాంతరంగ మెనయంగఁ బొసంగఁగఁ బల్కు నంగనన్
గని దయ రాఁగ రాగరసకందళికం దలిరాకుబాకునన్
ఘనముగఁ దుంటవింటిదొరకాయము గాయము సేయ జాయతో
ననిమిషదేశికుం డనియె సాదరమోదరసాదరాత్ముఁడై.

139


చ.

వగవకు మింతకంటె బలవంతపువంత పురంధ్రి! మా కిదే
నెగు లెగయించెఁ బువ్విలుగ నీమది నీ మది దోఁచకున్నె నె
మ్మి గదుర వచ్చి పొం డిటకు మీ రన మీఱ నయుక్త మిందుపై
నిగఁ బసిగోల గోలతన మేలను మే లనుకూలమయ్యెడిన్.

140


ఉ.

ఇచ్చటియగ్నిహోత్రతతు లెవ్వరిపా లతిథివ్రజంబులన్
వచ్చినయాప్తబంధుల ఘనంబుగ నెవ్వరు పూజసేయువా
రిచ్చట నున్నశిష్యులకు నేగతి నన్నెడఁబాయ లేనిబ
ల్మచ్చిక నీవు వచ్చిన బలా! యబలా! ప్రబలాఘ మంటదే.

141


క.

నటవిటవారవధూటీ
పటలీసంవృతము స్వర్గపట్టణ మటకున్

ఘటకుచయుగ! సతులకు నేఁ
గుట యుచిత మె వలదు మదిని గోపము నాపైన్.

142


వ.

నావచనంబులకుఁ బ్రతివచనంబులు వచియింపకు నాయాన యానంబు విడువుము శుభోదయంబుగా మమ్ముఁ బైనంబు పంపుము పోయివచ్చెద మనిన నక్కల్కి కల్పితవిషాదంబును కపటలజ్జాభరంబును గైతవాశ్రుపాతంబునుం గనుపట్ట మీ రిట్లు పల్కిన నేమి సేయఁగలదాన విరహసాగరం బేరీతిఁ గడవఁ గలదాన నైనను మీయానతికి సమ్మతింపడితి నన్నగారాతిజన్నంబు సేయించి పిమ్మట నిమిషమాత్రం బైన నచ్చట నిలువవలదు మీమాట జవదాఁట నే నంతబేలనే యాత్మకుమారునింబలె యీయత్రికుమారునిం బోషించెద విశేషించి నేఁటనుండియుఁ బ్రాణపదంబుగా గారవించెద మీకుం బ్రియుం డఁట యితని యేనుం బ్రియునిఁ గాఁ దలంపవలవదె యిచ్చటివిచారంబులు మాని నెమ్మదిగాఁ బయనమ్ముఁ బోయిరమ్మని యనుపుటయు నయ్యనిమిషగురుండు శతమఖమఖనిర్వర్తనకౌతుకాయత్తచిత్తంబున నమరావతీపురంబునకుం జనియె ననుటయు.

143


ఆశ్వాసాంతము

శా.

అర్ణో రాశిగభీర! భీరహితచిత్తభోగ! భోగావళీ
వర్ణోదీర్ణవిభా! విభావశమితవ్యాపాద! పాదాంబుజా
భ్యర్ణప్రాహృదమిత్ర! మిత్రహితసంపద్వాస! వాసచ్చటా
స్వర్ణాంచత్కవిరాజ! రాజకసదస్సమ్మాన్య! మాన్యగ్రణీ.

144


క.

కల్పక సమదానకళా
కల్పక నిజపాణిపద్మ! కాంచనపద్మా!
కల్పక సత్కవివినుతా
కల్పక! సత్కీర్తినూత్న! గాయకరత్నా!

145

పృధ్వి.

మంతుకృద్వైరిసామంతమంత్రిస్మయ
ధ్వాంతవిధ్యంసనోదగ్రజాగ్రద్రవీ!
సంతతౌదార్యసౌజన్యగంభీరతా
శాంతిసంపన్నరాజద్గవీ భారవీ!

146


గద్య.

ఇది శ్రీజానకీరామచంద్రచరణారవిందవందనకందళితానందకందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్యతనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయప్రణీతంబైన శశాంకవిజయం బనుమహాప్రబంధమునందు ద్వితీయాశ్వాసము.


--- ---