శశాంకవిజయము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

శశాంకవిజయము

తృతీయాశ్వాసము

శ్రీరంగపతిపదాంబుజ
సారంగచ్చిత్త! చిత్తజాతజయంతా
కారా! కవిమందారా!
శ్రీరాంభోనిధిగభీర! సీనయధీరా!

1


వ.

అవధరింపుము సూతుండు శౌనకాదిమునీంద్రుల కిట్లనియె నవ్విధంబున బృహస్పతి దివస్పతిసదనంబునకుంజనిన యనంతరంబ యిక్కడ.

2


ఉ.

ఒంటిగ నబ్బెఁ జంద్రుఁ డిపు డొంటిగ వాతెరజుంటితేనియల్
గెంటనిప్రేమఁ గ్రోలి రని కేళిని దేలక యున్నముత్యపుం
బంటవలంతివింటిదొరబారికి నోరువలే నటంచు నా
తుంటరిగుబ్బలాఁడి వగతో విగతోరువివేకపాకయై.

3


గీ.

గురునివెంబడిఁ దా నొకకొంతదూర
మరిగి యాతనియనుమతి నంబుజారి
క్రమఱఁగ వచ్చునాలోనఁ గంబుకంఠి
పట్టఁగూడనితమకంబు నెట్టుకొనఁగ.

4


సీ.

సరసాన్నపానము ల్శాకపాకంబులు
        వింతవింతగఁ జేసి దొంతి నునిచి,
యొప్పైననలుగులు నుష్ణోదకంబులు
        నొనర మజ్జనగేహమున నొనర్చి,
చెలువొందువలువలు వెలహెచ్చుసొమ్ములు
        పొందళ్కుతట్టలఁ బొందుపఱిచి,
కుంకుమంబు రసంబు గోరజవ్వాజియు
        రతనాలగిన్నెల జతనపఱిచి,

గీ.

పువ్వుటెత్తులపొట్లము ల్నివ్వటించి
పొంకముగఁ గేళిగృహము నలంకరించి
యింతి యాతనిరాకకు నెదురుచూచు
చుండఁ దారామనోవల్లభుండు వచ్చె.

5


క.

వచ్చినయాతని వేగమె
పచ్చలగద్దియను నునిచి ప్రమదామణి తొ
నొచ్చంబు లేనికూరిమి
ముచ్చట లాడుచును బ్రేమ ముప్పిరిగొనఁగన్.

6


ఉ.

ఊరికిఁ బంపి వచ్చితివె యొజ్జల నీగురుఁ డమ్మ చెల్ల! సం
సారముమీఁదిభ్రాంతిఁ జనఁజాలఁడు దవ్వుగ సాఁగిపోయె నే
దారున రాఁడుగా మరలి దైవకృతంబున నొంటిపాటు చే
కూరిన దింక నీమనసుకూరిమి నేగతి నాదరించెదో.

7


గీ.

ప్రొద్దు వోయెను లెమ్మిఁక సుద్దు లేల?
శిరము మజ్జన మొనరింప వరుస నేఁటి
కనుచు నమ్ముద్దుచాన యత్యాదరమున
నలపు సొలపును వలపు సయ్యాట మెసఁగ.

8


సీ.

ఫాలభాగమున వజ్రాలపాపటబొట్టు
        తళుకుతళుక్కని తాండవింపఁ,
గరసరోజముల బంగారుగాజులు రత్న
        కంకణమ్ములు గల్లు గల్లు మనఁగఁ,
జెమటచేఁ జాఱిన చికిలికస్తురిబొట్టు
        ఘుమఘుమతావులఁ గుమ్మరింప,
మెఱుఁగారుకమ్మలు మృదుకపోలములపై
        ధళధళత్కాంతులు దళుకు లొత్త,


గీ.

గొప్పుముడి వీడ నుదుట ముంగురులు గూడ
గుబ్బచనుదోయి హారముల్ గునిసియాడ
నీటువగ మీఱ వన్నెకానికి మిటారి
దమక మెద నంట సంపెఁగతైల మంటె.

9


గీ.

చెండ్ల గెలిచినమెఱుఁగుపాలిండ్లతోడ
బీరములు చూపవచ్చు జంబీరములను

జించి సారస్య మంతయు వంచినట్లు
నిమ్మపండ్లరసంబున నెలఁత యంటె.

10


మ.

తరుణీరత్నము బాలకైతకదళోదంచన్నఖాగ్రంబులన్
గురులన్ మెల్లనఁ జీరిపాయ లిడి చిక్కుల్ పాయఁగాఁ బ్రాముచున్
గరపంకేరుహరత్నకంకణఝణత్కారంబు తోరంబుగా
వరగంధామలకంబుఁ బెట్టెను సుధావారాశితొల్పట్టికిన్.

11


ఉ.

జాఱుపయంటఁ జెక్కి బిగి చన్గవ నిక్కఁగ బాహుమూలశృం
గారరుచు ల్వెలిం బొలయఁగా నగుమోము చెమర్ప రత్నకాం
చీరవము ల్సెలంగ నభిషేక మొనర్చె లతాంగి వానికిన్
మారునిమాఱు సాగరకుమారునిఁ బట్టము గట్టెనో యనన్.

12


సీ.

పసమించుమాదరపాకపోరువలచేఁ
        దడియార నొత్తి కుంతలము లార్చి,
సాంబ్రాణిధూపవాసన నించి జవ్వాది
        చేనంటుచును కురు ల్చిక్కు దీర్చి,
అఱవిరివిరిజాజివిరులు చుట్టినజాఱు
        సిగను జంటరుమాల సొగసుపఱిచి,
తళుకునిచ్చలపునెత్తమిపూవులబంతి
        పుట్టంబు హొయలు గాఁ గట్టనిచ్చి,


గీ.

కమ్మకస్తురిచేఁ దిలకమ్ము దీర్చి
యొంటివజ్రంపుబావిలీ లుంగరాలు
చేసరాలును సరిపెణ ల్చిలుకతాళి
పంకజేక్షణ వాని కలంకరించె.

13


చ.

బలురతనంపుఁజక్కడపుఁబళ్లెర ముంచి పసిండిగిండిలో
సలిలము నుంచి ముత్యసరిసన్నపుబియ్యపుటన్న మొల్పుఁబ
ప్పులుఁ బొడికూరగుంపు కలుపు ల్వడియంబులు చారు లూరగా
యలు కలవంటకాలు పరమాన్న మిడెన్ లలితాంగి వానికిన్.

14


సీ.

విరహాగ్ని నీరీతి గరఁగె నామానసం
        బనినట్ల వెన్న గాచినఘృతంబు,
పాలఁబోల్వయసు నీపాలుసేయుట కిదె
        యానవా లన్నట్టు లానవాలు,

నెమ్మి నీరీతి నాకెమ్మోవి గ్రోలుమీ
        పూని నీ వన్నట్టు పానకంబు,
తనవచోమాధుర్య మెనయునా యివి చూడు
        మన్నట్టు మేలిరసాయనములు,


గీ.

నొప్పుగా గిన్నియల నుంచి యుపచరించి
పాణిపంకజకంకణక్వాణ మెసఁగఁ
బువ్వుసురటిని విసరుచు భోజనంబు
కాంత సేయించెఁ దనమనఃకాంతునకును.

15


క.

బంగారుబొమ్మ రంగగు
భృంగారుజలంబు వంపఁ బ్రియ మిం పెసలా
రంగా మోదంబున సా
రంగాంకుఁడు ధౌతపాణిరాజీవుండై.

16


ఉ.

కాంత యొసంగువీడియముఁ గైకొని యింతి యొనర్చునవ్విధం
బంతయుఁ జూడ వింతవగయై కనుపట్టె నటంచు నెంచుచున్
గంతునిరంతు లోర్చుక చొకాటపుగాటపుఁ బువ్వుదోఁట నే
కాంతముగా వసించె హృదయంబునఁ బెక్కుదలంపు లూరఁగన్.

17


క.

అలపొలఁతుక దా నంతట
వలపులు వడ్డికిని బాఱ వాంఛలు మీఱన్
దలపోయుచుఁ బనిదోఁపక
నిలుపం జాలనివిరాళి నెమ్మదిఁ బొదలన్.

18


సీ.

తేటయౌ గొజ్జఁగినీట మజ్జన మాడి,
        వలిపచెంగావిపావడ ధరించి,
పసిడిరాయంచుబవంతిచీర ధరించి,
        రాణించు పైఠాణిఱైక దొడిగి,
వదనాంబుజమున జవ్వాదిచారికఁ దీర్చి,
        గొప్పఁగా నెఱజాఱుకొప్పుఁ బెట్టి,
గమగమ వలఁచుకుంకుమము మేన నలంది,
        మృగనాభిపంకంబు మెడను బూసి,


గీ.

 మినుకకాటుకరేఖ కన్గొనలఁ దీర్చి,
చరణయుగమున లత్తుకఁ జాదుకొలిపి,

తనయొయారంబు నిలువుటద్దమునఁ జూచి
యపుడు గైసేసి గడిదేరి యామిటారి.

19


సీ.

చిగురాకువిలుకానిచేతిచక్రమురీతి,
        కమ్మలు ధగధగత్కాంతి గులుక
కుసుమసాయకధనుర్గుణనినాదములీలఁ,
        గలమేఖలాఘలంఘలలు వెలయ
చెఱకువిల్మాష్టీనిబిరుదుడిండిమలీలఁ,
        జరణనూపురఝళంఝళ లెసంగఁ
బంచసాయకసార్వభౌమసత్కీర్తి నాఁ,
        దారహారము తళతళ యనంగ


గీ.

సారె రతిరాజుమ్రోల హెచ్చరిక దెలుపు
చక్కి మెట్టెలు గిలుకుగిలుక్కు మనఁగ
లలితకందర్పసామ్రాజ్యలక్ష్మి నాఁగ
గంధగజయాన వచ్చె శృంగారవనికి.

20


వ.

ఇవ్విధంబున నచ్చకోరలోచన యచ్చటికి వచ్చి నిచ్ఛనిచ్చలు న్బొరవిచ్చి విచ్చలవిడి రాలిన నిచ్చలంపుఁబచ్చకపురంపుఁబరాగంబునం బ్రోదులుగాఁ బాదులు గట్టి సజ్జకం బైనగుజ్జుగొజ్జంగినీరు నించి పెంచినపొన్నలు పొగడగున్నలు గన్నేరులు కన్నెగోరంటలు చిన్నిసురపొన్నలు నిమ్మలు కమ్మసంపెఁగలు నింపుమీఱునునుపోకమాఁకులు డంబుమీఱునారికేళంబులు తావులకుం దావు లయినమోవుల నెలమావులప్రోవులు వాసనాసారదంబు లగుశారదంబులు నారదంబులు నీరదంబులడంబు విడంబించుఁ చీఁకటిమాఁకులును లికుచకుచాకుచసాదృశ్యఫలంబులపోడిమి మీఱుదాడిమీనికుంజంబులు జంబూవృక్షంబులు జంబీరంబులు ఫలరసజంబాలంబు లైనపనసతరుజాలంబులు సాలహింతాలతాలతక్కోలసాలంబులుం గలిగి యెల్లెడల నల్లిబిల్లిగా మొల్లమిగ నల్లికొనినమల్లియల నుల్లాసంబునం దిరుగుతేఁటిపిల్లలగరులగములఁ గని నిగనిగనిజిగి మిగులు మొగులతెగ లని మచ్చికలం బురివిచ్చి యాడుమవ్వంపుఁజిలువజవ్వనుల ఱెక్కమొక్కతెరల మరువున మలయపవననటనర్తితలలితలతికాలతాంగులనటనంబులకు న్ఘటనంబులుగా జోకమీఱుతదీయకేకారవంబులు షడ్జంబులుగా

సమదకోకిలకాకలీరవంబులు పంచమశ్రుతులుగా గానంబుఁ జేయు తేఁటిబోటిపాటల కనుగుణంబుగా నుగ్గడించు భరతపిట్టల దిట్టంపుసొల్లుకట్టులం గమ్మి యఖండనాదమేదురంబై యయత్నకల్పితసంగీతమాధుర్యంబునం బొలుపొందు నందనోద్యానంబు చందంబున హృదయానందం బగునమ్మందిరోద్యానంబునఁ జెంగల్వకొలనిచెంగట రంగారుబంగారుకలశంబులం బొలుపొందుజీవదంతపుఁజవిక వసియించునమ్మనోహరాకారునిం దూరంబునం గాంచి కాంచీకలకలంబులు నిగుడ గబ్బిమబ్బులోపల నొరపు నెరపు మెఱుపుఁదీఁగెలాగునం బొదరిండ్ల డాఁగుచు మనోన్మాదంబునన్ దూఁగుచు నిద్దంవుటద్దంబులగతి ముద్దుగులుకు బాహుమూలంబులరుచులు చెమచెమక్కని వెలిం బర్వఁ దళుక్కునఁ జనుగుబ్బలు నిక్క నిక్కి విరులు గోసి కప్పుగొప్పునం జెక్కుచుఁ బుప్పొడితిన్నియల నెక్కుచుఁ జిఱుచెమటజాఱినతిలకంబు తేటనీటిబావులనీడం జూచి నీటుగాఁ గొనగోట దిద్దుచుఁ జేనున్నపూబంతి కాలువ నద్దుచు మొయిళ్లనుండి ముత్తియంబులు రాలువిధంబున గొప్పుననుండి తెలిమల్లెమొగ్గలు రాలఁ దేనెవాఁకలు దాఁటుచుఁ జిగురుటాకుల నెలవంకగోళ్లు నాటుచుఁ జెదరినముంగురులు చక్కందువ్వుచు నల్లనల్లనం గులుకుచుఁ బల్లటీలం గని నవ్వుచు మలయానిలంబున నరజాఱుపయంట మాటిమాటికిం జేర్చుచు రాయంచలకుఁ దనగమనవిలాసంబు నేర్చుచు వెడవెడసడలినపోకముడి బిగియించునెపంబునఁ దనపొక్కిలిచక్కదనంబుఁ గన్పడం జేయుచుఁ గర్ణావతంసంబునకై చివురులు గోయుచు మరువంపుఁబాదులజాడ ద్రాక్షపందిళులనీడఁ గప్పురపుటనంటులమాటునఁ బోకమాఁకులచాటునఁ బటికంపు మెట్టికల కేళాకూళులఠేవఁ గుసుమకేసరపరాగధూసరం బైనత్రోవం జేరవచ్చు నవసరంబున.

21


చ.

కనియె మృగాంకుఁ డాచెలిని గన్గొనినంతనె తళ్కుబెళ్కుగా
ననిచి కటారి నూరి యెద నమ్మదనుం డెద నాట మీటఁగా
మనసు ఝళుక్కన న్మెయిఁ జెమర్పఁగ నోర్వఁగ రానితత్తరం
బునఁ బులక ల్దనర్ప ధృతి మొగ్గగ దిగ్గున లేచి యాత్మలోన్.

22


శా.

ఔరా చక్కదనంబు హౌసు! మురిపెం బయ్యారె! యొయ్యార మౌ
రౌరా! మైసిరి హైసరే! సొగసు మే! లాహా విలాసంబు! ల

జ్ఝారే జవ్వన! మద్దిరా వగలు! మజ్ఝారే తనూవిభ్రమం!
బీకామామణితోడ నీడు గలరా యీరేడులోకంబులన్?

23


గీ.

కొమ్మ గా దిది బంగారుబొమ్మ గాని
యింతి గా దిది జాజిపూబంతి గాని
కలికి గా దిది మరునిపూములికి గాని
భామ గా దిది లావణ్యసీమ గాని.

24


చ.

నవతనుకాంతియుక్తిని ఘనప్రతిభం బని తాను తారకా
నివహ మెదిర్చి యింతి తపనీయరుచి న్నిజసత్త మాయఁగా
బవలు దొఱంగి చేరి పదపద్మముల న్నఖరత్నవైఖరిన్
దివిరి భజించెఁ గా దనఁ దదీయసమాఖ్యను దన్వి పూనునే?

25


క.

పాటలగంధిమొగంబుం
దేటకు నే నోడి బంటుతెఱఁగైతి నిదే
సాటిగ ననుఁ గొల్చినయుడు
గోటియు నీచెలువనఖరకోటికి నోడెన్.

26


ఉ.

పల్లవజాతిబింకములఁ బాపుట కే నిటు సాక్షి కాంతిసం
పల్లవనిర్జితంబులు ప్రవాళము లవ్వివరంబు గన్నదే
పల్లవపాణిపాదములఁ బర్వుజపాధికలీల వాటిసొం
పల్లవసిష్ఠుతండ్రి గనినట్టివలంతియు నెన్ననేర్చునే?

27


ఉ.

కామతరుప్రవాళనవకందళరేఖలొ లేక మన్మనః
ప్రేమ నవానురాగఝరి పేరినఠావులొ కాక యుల్లస
త్కోమలకాంతిపూరనదకోకనదంబులొ లేక మోహరా
త్రీముఖసాంధ్యరాగపరదేవతలో కనకాంగిపాదముల్!

28


గీ.

కమలగర్భాదుల జయించుకలికిజంఘ
లాత్మరాశిగ మకరంబు నరసి ప్రోచె
స్వజనసంరక్షణైకతత్పరుల కెందు
నెదుటిమందాధికారత నెంచ నేల?

29


చ.

కరభము లన్నపేరు విసఁగానె వికారము డొంకు దెల్పెడిన్
కరివరతుండము ల్సమతఁ గైకొని వచ్చి ధరిత్రి వ్రాలె నీ
హరివరమధ్యపెందోడలు హైసరె జానులపేరియందపుం
గరుడులపైడికంబములె కాయజమల్లుని బంధనౌచితిన్.

30

చ.

గొనబురువారపుంజలువకోకకు బంగరునీటిచిన్కుడా
ల్గొనకొనఁ జేసి మాటికి దళుక్కనుచు న్వెలిఁ బర్వుకాంతి నిం
పెనసినయీయొయారితొడ లించుక సోఁకినయంత నబ్బు గొ
బ్బునఁ బదివేలరంభలఁ గవుంగిటఁ జేర్చినసౌఖ్య మొక్కటన్.

31


క.

ఈనారీమణినునుతొడ
లేనుఁగుతుండములె కాని యెద సుడిఁ బెట్టన్
బూనినకదళీతరులున్
దా నేలా పిల్లపిల్ల తరమున్ దరమున్?

32


చ.

కటి యొకటే ధరిత్రి నవఖండము లేలఁగఁ జాలు నందుపైఁ
బటుజఘనంబె చక్రములఁ బంపు లిడున్ గుచము ల్మహోన్నతం
బిటు సృజియించి దీని కొకయించుక కౌను సృజింపఁ డాయె నే
మిటికొ విరించి యింతి మెయి మించు కనుంగొని మోహ మందెనో?

33


సీ.

ఈలేమ చక్కదనాలవెల్లియొ కాక,
        తళుకుకన్బేడిస బెళుక నేల!
యీరామ రతిదేవియారామమో కాక,
        పొక్కిలిపొన్నపూ పుట్ట నేల?
యీకల్కి మదనునిచేకటారియొ కాక,
        కౌనుపేరిటిపిడి గాంచ నేల?
యీరాజముఖి పంచదారరాసియొ కాక,
        యారుచీమలబారు చేర నేల?


గీ.

మేటియీబోఁటి తేటపన్నీటిచెర్వు
కానిచో వళివీచిక ల్కలుగ నేల?
యీవనిత నాదుపుణ్యంపుఁదీవె యరయఁ
గానిచో చన్నుగుత్తులు పూన నేల?

34


గీ.

అంఘ్రులకుఁ బద్మసారూప్య మక్షులకును
గమలవరగర్వసంపద కర్ణములకు
శ్రీవిలాసంబు గలిగియుఁ జెలియకౌను
కేలనో లేమి దాని యదృష్టరేఖ!

35


ఉ.

బంగరుకుండ లంచు విరి బంతు లటంచును జెం డ్లటంచు రా
థాంగయుగం బటంచు సమదద్విపకుంభము లంచు నెంచి ప

ల్కంగ నయుక్త మిక్కలికిగబ్బిచనుంగవ కంతురాజరా
జ్యాంగములందు నెక్కు డగునంగము యౌవనరేఖఁ బొల్చుటన్.

36


సీ.

వీణెకాయలు గుణశ్రేణిపై నిడుకొన,
        [1]యెఱుఁగవు యొరుక్రింద నీఁగియుంట
తమ్మిమొగ్గలు తమముద్దు చూపెడి,
        నలజన్మపంకంబు [2]దలఁప నెఱుఁగ
వరయక నెరపుబంగరుకుండ [3]లరయంగఁ,
        జేరి వేఁడిమి చూప నీరు గావె?
[4]బట్టగూర్చుతనానఁ బుట్ట చెండ్లెగరీని,
        మఱచెనో తలకొట్లమారితనము


గీ.

నొమ్ము గాన్పించె బలుగజనిమ్మపండ్లు
గలుగు సారస్యమును దాము కాసుఁ జేయఁ
గలవె యీయింతిబిగిచన్నుఁగవకు సాటి
యొకటొకటితోడ జోడుగా నొనరుఁ గాని.

37


చ.

కమలదళాక్షి హస్తములు గల్గొనఁ బద్మిని కౌనుదీవెపో
ణిమఁ బరికింప శంఖినియె నెన్నడ హస్తిని యౌఁ బరేంగిత
క్రమ మరయంగఁ జిత్తినియె గా కటు పల్కులు వేయునేటికిం
బ్రమద మెసంగ నిక్కలికి పక్కున నవ్విన జాతు లేర్పడున్.

38


చ.

మృగమదసారసౌరభము మీఱినయాసతికంఠలక్ష్మి న
చ్చుగ నెదిరిందు కౌనుపొలుసుంగనుశంఖ మదెంత చుట్టియుం
దెగువ మొగాన నిల్వవలదే యపు డేర్పడకున్న దానియా
సొగసులుగుల్కు పల్కుబడి సోయగమున్ దనరిత్తకూఁతలున్.

89


క.

పగడంబుల తెగడంబుల
జగడంబుల గెలువఁ జాలుసఖిమోవి జగా
నిగరాల న్మగరాలన్
నగరాల న్వెలకు నము నాతిరదమ్ముల్.

40


క.

అంబుజముఖినెమ్మొగ మన
యంబును నిద్ద మగు నద్ద మగుఁ గాని యెడన్

బింబమునకుఁ బ్రతిబింబము
డం బౌకెమ్మోవిపేరిటం దాలుచునే!

41


ఉ.

చక్కదనంబు పాల్కడలిచాయఁ దగెం గుచమందరాద్రి యా
చక్కినె రోమరేఖను భుజంగము గన్పడె నందుచేఁ గదా
యిక్కడితియ్యమోవిసుధ లింపులు గుల్కెడు దీని గ్రోలకే
యెక్కడి సౌమనస్యము? హరీ! యిది నీకృప లేక కల్గునే!

42


సీ.

ఇది మనోహరకాంతి కింపైనబింబంబు,
        బింబంబు గా దిది బెడగుకెంపు
కెంపు గా దిది తేఁటియొంపనిమంకెన,
        మంకెన గా దిది మంచిచిగురు
చిగురు గా దిది వింతజిగిహెచ్చుపగడంబు,
        పగడంబు గా దిది పానకంబు
పానకం బిది గాదు పలుచని చెఱకుపా,
        ల్పెఱకుపా లిది గాదు కురుజుతేనె


గీ.

కురుజుతేనెయుఁ గా దిది కుసుమరసము
కుసుమరసమును గా దిది గొనబుజున్ను
జున్ను గా దిది చవిగుల్కు సుధలదీవి
సుధలదీవియుఁ గా దిది సుదతిమోవి.

43


ఉ.

నీరజగంధిమోవిజిగి నెక్కొనుముక్కరముత్తియంబు దా
మారుఁడు ధాతువాదపటిమన్ ఘటికాకృతి గట్టినట్టిసిం
దూరితపారదం బనఁగ నూత్నరుచిం దనుపట్టెఁ గానిచోఁ
గారణ మేమి నాసకును గాంచనకోశసమృద్ధి గల్గఁగన్.

44


మ.

తళుకుందేటయు విప్పు సోఁగతన మందం బొప్పఁగాఁ దారకా
కలితచ్ఛాయల నింపు సొం పెసఁగునీకంజాక్షి కన్దోయితోఁ
జెలువారన్ సరసంపునవ్వులకు వచ్చెన్ జూడు రేఁజీఁకటిం
దలవంపు ల్గనునట్టితమ్మియు దివాంధం బైనలేఁగల్వయున్.

45


క.

కులుకునెఱవంకకన్బొమ
సొలపుల నీయింతివాలుచూపులఁ జూడ
వలరాజువంటివాఁడును
విలునమ్ములు వైచి దాసవృత్తికిఁ జొరఁడే.

46

సీ.

పదపల్లవంబులఁ బద్మసంపదయును,
        ప్రపదంబులను గచ్ఛపప్రభూతి
రక మైనజంఘల మకరలీలాయోగ,
        మూరుల వరమనోహారితయును
గొనబుటారున నాముకుందనందకలక్ష్మి,
        చారుగళంబున శంఖగరిమ
యందంపురదములఁ గుందంపువిభవంబు,
        పరఁగుమోమున మహాపద్మసుషమ


గీ.

యలకముల నీలకాంతియు నెలవుకొలిపి
నలువ నవనిధులను గూర్చి చెలువఁ జేసి
వరుస నాలెక్క లిరువంక వ్రాసె ననఁగ
నీనలినపత్త్రనేత్రకు వీను లమరె.

47


క.

నుదురా జిగి కొన్నెలచె
న్ను దురాగతమునను దేంట్లనుదురావెట్టు
న్నదురా యని ముంగురు లె
న్నదురా నెఱివేణి జీవనదులాజసమున్.

48


సీ.

సవరంబు తనకుఁ దా సవరంబుగా నెంచు,
        మలయు మజ్జను మజ్జ మానుమనును
బర్హంబు కనికరం బర్హంబు గా దను,
        నళిఱెక్కకప్పులకప్పు లొసఁగు
నీలంబు జిగి గాంచి నీలంబు వల దను,
        నలరారు నాచు మున్నాచుదరమి
చీఁకటిమా నోర్సు చీఁకటి మ్రాన్పడ,
        తమము గైకొన దనుత్తమము గాఁగ


గీ.

మంపు సాంబ్రాణిధూపంబుపెంపు పెంపు
వంవు మరువంపుటిందీవరంపు రంపు
గుంపు మృగమద వాసన ల్గుప్పు రనఁగ
సాటిలే కొప్పు నీయింతిజాఱుకొప్పు.

49


గీ.

ఆకృతిని హేమరూపి యౌనైనముక్కు
ఛాయఁ జూడఁ దిలోత్తమసరణి దోఁచె

మోముఁ జూచిన శశిరేఖమోడి యమరె
మాటపోడిమిఁ జూచిన మంజుఘోష.

50


ఉ.

పన్నగకన్యల న్మనుజభామల యక్షసరోరుహాక్షులన్
గిన్నరసన్నుతాంగులను ఖేచరభామల సిద్ధకాంతలన్
జన్నపువిందుసుందరులఁ జారణవారణరాజయానలన్
గన్నది కాదె దీనిమెయి కైపులు వైపులు చూడ మెచ్చటన్.

51


గీ.

చూడకుండంగఁ గూడ దీసుదతిసొబగు
చూచినంతనె మదిలోనఁ జొచ్చెఁ బాళి
యేమిటికి వచ్చె నిచటికి నిందువదన
యెట్టులున్నదొ యింక రతీశ్వరాజ్ఞ!

52


క.

అని చింతించుచు నుండఁగ
వనజాయతనేత్ర వచ్చి వానిసమీపం
బునఁ గూర్చుండెను మేనం
గొన బగుజవ్వాదితావి గుబులుకొనంగన్.

53


గీ.

వచ్చి కూర్చున్న వాఁడు నవ్వన్నెలాడిఁ
జూచి ధృతి గుంది యందంద చోద్య మంది
తనువు పులకింపఁ జిత్తము తత్తరింప
వివశతను జెంది మగుడ వివేక మొంది.

54


క.

ఏటికి వచ్చితి నే నీ
తోఁటకు నిం దేల వచ్చెఁ దోడ్తోడనె యీ
బోటి మరుండు మనోధన
పాటచ్చరుఁ డేమిపాటుఁబడ నున్నాఁడో!

55


క.

నిలువర మయ్యెను మును నా
తలఁచినయది మది విరాళి తహతహపడి తా
నెలమిన్ బైకొనవచ్చెను
గలకంఠుల నమ్మరాదుగా కల నైనన్!

56


క.

ఐనను గానీ నాచే
నైనగతి న్నిలిపి చూతు ననుచిత మగుచో
నౌనా మోహం బనుచున్
మానవతం జూచి న్యాయమార్గము దోఁపన్.

57

మ.

ఇది యే మిచ్చటి కేల వచ్చితివి నీ కింటం బను ల్లేవె యొ
ప్పదు పోపో పతి యూరలేనియెడ నీపల్పోకశృంగారముల్
సుదతు ల్సేయుదురే రహస్యమున నిచ్ఛోఁ జేరి నా చెంత నుం
డెద విట్లుండిన లోకు లూరకయ సందేహింపరే చూచినన్.

58


క.

అనఁ జిఱునవ్వు మొగంబున
దనరఁ జకచ్చకితకర్ణతాటంకరుచుల్
దనుకన్ మకమక చినుకన్
కనకాంగి హొయ ల్చెలంగఁగా నిట్లనియెన్.

59


ఉ.

వచ్చిన నేమి రావలసివచ్చితి నేపని యున్న దింట నీ
విచ్చట నుండఁగా మనసు కింపగుసొములుఁ బెట్టినంత నే
యొచ్చెము లేనినీసరసనుండుట కేమియు నోచనైతినా
యొచ్చట నున్న నేమి మన కేమిటి కెవ్వరు సంశయింపఁగన్.

60


ఉ.

కాకయె సంశయించినను కాదన నేటికిఁ గంతు బారికిన్
లోకువ గానివారు ధరలోఁ గలరే యిపు డిన్నినాళ్ళకై
చేకుఱె నొంటిపా టిచటఁ జేసినపుణ్యముచేత నింక నన్
గాఁకలఁ బెట్టకే విను ముఖాముఖిఁ బల్కెద దాఁచనేటికిన్.

61


ఉ.

నీనెఱనీటు నీసొగసు నీరసికత్వము నీవిలాసము
న్నీనవమోహనాకృతియు నీయెలప్రాయముఁ జూచి చూచియున్
మాననిప్రేమ నేచి యభిమానముచేఁ దమి దాచి యిన్నినా
ళ్ళేను మనోజుబారికి సహించితిఁ బొంచితి మోహ ముంచితిన్.

62


సీ.

కమ్మనినీముద్దుకెమ్మోవి గని యాస,
        మీఱంగ గ్రుక్కిళ్ళు మ్రింగి మ్రింగి
యొఱపైన నీదుపేరురముచందముఁ జూచి,
        గుబ్బచన్నుల బయల్ గ్రుమ్మి గ్రుమ్మి
యింపైన నీచెక్కు లీక్షించి ముద్దిడ,
        నూరకే వాతెర యొగ్గి యొగ్గి
చూడఁజూడఁగ వింతసొబ గైననినుఁ గాంచి,
        తహతహ పైబడఁ దలఁచి తలఁచి


గీ.

యెపుడు పైకొందు ముచ్చట లెపుడు గందు
నెపు డొదవుఁ బొందు విరహాగ్ని యెపుడు డిందు

ననుచు నే నుందు నేటికి నబ్బె సందు
లీలఁ బెంపొందురతులఁ దేలింపు మిందు.

63


చ.

అన విని గుండె జల్లనఁగ నచ్చెరుపాటును రిచ్చపాటు నె
క్కొన గరుపాటునుం గదురఁ గొండొకసే పటు లూరకుండి నె
మ్మనమునఁ దెల్విఁ బెట్టి మటుమాయలమారుని దిట్టి యక్కటా
వనితలభావము ల్తెలియవచ్చునె యంచుఁ దలంచి యిట్లనున్.

64


క.

తగునే నీ కిది యెంతటి
తెగువే యీసు ద్దొకింత తెలిసిన జగతి
న్నగ వారడి యపయశమున్
మగువా! చేపట్టినట్టిమగవాని కగున్.

65


ఉ.

ఇంతిరొ పాలవంటికుల మీవు జనించిన దౌట నెన్నఁగా
నెంతయు వన్నె వాసిగను నింటను జొచ్చిన దేమి చెప్పు కం
చంతటికాపురంబు సతు లౌననఁ జేసెదు జాతి నీతి యొ
క్కింత దలంప కిప్పనికి నేటికి నేఁటికిఁ గ్రొత్తఁగాఁ జొరన్.

66


ఉ.

ఓర్వదు బంధుజాల మడకొత్తున నొత్తును మామగా రిదే
పర్వినమాత్ర పంట పగఁ బట్టును బావ మగం డటంటిమా
దుర్వహరోషభీషణతఁ దోడనె చంపఁగఁ జూచుఁ గావునన్
సర్వవిధంబుల న్సతికి జారసమాగమకాంక్ష చెల్లునే?

67


చ.

రమణిరొ! యేటి కి ట్లిహపరంబులకు న్వెలి యైనయట్టియీ
క్రమమున విన్నపాటు తమకంబును దిట్టతనం బొయారమున్
బొమముడిపాటు జంకెనయుఁ బూనికయు మురిపెంబు మోడిపం
తము చిఱునవ్వు దోఁప వనితామణి కని వాని కి ట్లనున్.

68


శా.

కానీరా యిటువంటినీతము లనేకంబు ల్నినుం బోలివి
న్నా నేను న్నినువంటినీతిపరులు న్నారీకుచాభోగభో
గానందైకరసంబె బ్రహ్మ మని మోహాయత్తతన్ మౌనమున్
ధ్యానంబు న్జపముం దపం బుడిగి యుండం జూడమే యిద్ధరన్.

69


ఉ.

గోలతనానఁ బల్కెదవు కుంభ కుచాపరిరంభగుంభనో
ద్వేలసుఖోదయం బనుభవింపనివాఁడవు గానఁ గూరిమిన్
దాళఁగ లేనిదాన దయదాఁచకు నీకిటు తప్పునేమము
ల్చాలుర చాలు నీగొనబుచక్కెరమోవి యొసంగి యేలరా.

70

ఉ.

సూనశరార్తికి న్మిగులఁ జొక్కుచు దీనతఁ జేరి మ్రొక్కుచున్
దా నయి కోరి పైఁబడినదాని నుపేక్ష యొనర్పఁ బాతకం
బౌ నిఁక నోర్వ నే నిమిషమైనను నాగొన బైనమే నిదే
కానుక నీకు రూపజితకైరవసాయక! ప్రాణనాయకా!

71


క.

గణ్యత నేమైనసరే
ప్రాణ్యవనముఁ జేయవలయు రసికసుతప్రా
వీణ్యా! “పరోపకారః
పుణ్యాయ” యటన్న వచనము న్విన లేదా.

72


క.

అతివలహృదయము లారసి
రతికలన న్దేల్పలేనిరట్టడిరూపున్
జతురతయు జవ్వనంబును
వితయ చుమీ యడవిఁ గాయువెన్నెలరీతిన్.

73


ఉ.

ఎంచఁగ రానిమోహమున నే నిటు పిన్నటనాఁటనుండియు
న్బెంచితిఁ బెద్దఁ జేసితిని బేర్మిగఁ బ్రాయము వచ్చినంత నే
యెంచక మాటలాడె దిపు డిన్నిప్రియోక్తుల కిమ్ము వుట్టెఁగా
మంచిది నిన్ను గూడుటకె మాకు స్వతంత్రము లేకపోయెనే.

74


ఉ.

నావుడు నాతఁ డేమియు నన న్మన సొగ్గక మోహ మెట్టిదో
యేవగఁ ద్రోసినన్ విడువ దీవగలాడి బలారె యుక్తమా
యీవిత మంచు నిట్లనె సురేంద్రునకుం గురుపత్నివై జగ
త్పావనకీర్తి గాంచితివి పాడియె నీకిటువంటిపోడుముల్.

75


చ.

వికలచరిత్రుఁ డైన ముదివెంగలి యైనఁ గురూపి యైననున్
త్రికరణశుద్ధిగా మగఁడె దేవుఁ డటం చని నిశ్చయించి యొం
డొకఁ డెటువంటివాఁ డయిన నొప్పదు కోరఁగ సాధ్వి యి ట్లెఱుం
గళ మది దప్పెనేని కలన న్నిరయంబు రయంబున న్గనున్.

76


క.

కోపము వల దిది నీ వీ
పాపమునకుఁ జొచ్చినం బ్రపంచంబున నిం
కేపొలఁతి మగనియొద్దన్
గాపుర మొనరించు వలదు కాపథ మనినన్.

77


క.

కటకట! గురువులతోనే
గుటగుటలా నేను గోరుకోరిక వితగా

నటు నిటు ప్రొద్దులు పుచ్చుచు
నటమటఁ బెఱగాయసుద్దు లాడెద వౌరా!

78


చ.

మగని నతిక్రమించుటలు మానినికిం దగ దంటి వొప్పితిన్
మగఁడు మగం డనంగ మది మక్కువ యెవ్వనియందొ కంటి కిం
పగునతఁ డెవ్వఁడో యతఁడె యాతనిఁ గా దని యన్యుఁ గూడినన్
దగ దిది కాముకీజనులధర్మము మర్మము నే నెఱుంగుదున్.

79


ఉ.

బాళి మనంబునం దణఁచి ప్రాయము వ్యర్థము చేసి యూరకే
దూలిన నేమి పుణ్య మని తోఁచెను ము న్నలదారుకావన
స్త్రీలు గిరీశునికి గలయరే వ్రజభామలు శౌరిఁ గూడరే
యాలలనాశిరోమణుల కందున నిండున నేమి చెప్పుమా.

80


సీ.

కన్నకూఁతు రటంచు నెన్నక భారతీ
        తరుణిఁ గూడఁడె నీపితామహుండు
మేనత్త యనుమేర మీఱి రాధికతోడ
        నెనయఁడే నిన్న నీయనుఁగుబావ
వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
        నెలఁతతోఁ బొందఁడె నీగురుండు
మునిపత్ని యన కహల్యను బట్టఁడే నీదు
        సహపాఠి యగు పాకశాసనుండు


గీ.

ఇట్టి మీవారినడతలు గట్టిపెట్టి
యమ్మ నే చెల్ల! న్యాయంబు లాడె దౌర!
కడకు నీరంకు నీవెఱుంగనివితాన
దూరెదవు నన్ను జలపోరి దోసకారి!

81


ఉ.

లోకములోనఁ గొంద ఱబలు ల్సతులం దనియింపలేక య
స్తోకమనీష నన్యపురుషు ల్దమకాంతల నంటకుండఁ దా
టాకులలోన వ్రాసిరి పరాంగనఁ గూడినఁ బాప మంచు న
య్యాకులపాటుఁ జూచి యిపు డాకులపా టెనయంగ నేటికిన్?

82


ఉ.

పాప మటంచు నీపనికిఁ బైకొనకుండితి వేని కంతుసం
తాపముచేత నాతనువు దాళఁగలే దిసుమంత నీకు ని
ప్పాపము పోవు టెట్లు నను పాలన సేయుము నీవు దీన నౌ
పాపము నాది ప్రాణపరిపాలన పుణ్యము నీది వల్లభా!

83

ఉ.

ఎక్కువ మాట లేల విను మే బహుభాషలదానఁ గాను నా
యక్కఱ చిన్నవుచ్ఛక ప్రియంబున నేలిన మేలు గానిచో
మక్కున లేనివారిఁ బతిమాలిన నేమిఫలంబు చూడరా
గ్రక్కున నింద నీకు నయి ప్రాణము లర్పణఁ జేతు గట్టిగన్.

84


ఉ.

ఒల్లను శీల మామగని నొల్ల ను కాపుర మొల్ల మాన మే
నొల్లను చుట్టపక్కముల నొల్లఁ గులంబును నొల్ల నామనో
వల్లభ! నీదు కెంజిగురువాతెరఁ గ్రోలక మాన నేల నీ
యెల్ల సుద్దు లింపెనసి యున్నదినం బొకటైనఁ జాలదే.

85


ఉ.

ఏలర జాలిఁ బెట్టె దిపు డేలర వేగమె యెన్ని పువ్వులన్
వ్రాలదు తేఁటి యట్ల మగవాఁ డనువానికి దోస మున్నదే
బాళిని దానె పైఁబడినభామను బిగ్గ కవుంగిలించినం
జాలదె యింద్రభోగపదసౌఖ్య మన న్మఱి వేఱె యున్నదే.

86


సీ.

చిత్తజాకార! నీ చెలువుఁ జూడఁగ లేని,
        కమలాక్షినిలువాలుఁగన్ను లేల?
కాంతుఁడ! నినుఁ జేరి కౌఁగిలింపఁగ లేని,
        జక్కవగుబ్బెతచన్ను లేల?
ప్రాణేశ! నీప్రక్కఁ బవ్వళింపఁగ లేని,
        తరలాక్షిచక్కనితను వ దేల?
రమణ! నీతోఁ గూడి రతికేళి నెనయని,
        బాలికామణియెలప్రాయ మేల?


గీ.

చిన్ని వయసున నుండియు నిన్నే కోరి
యున్న నను బోయమరునికి నొప్పగించి
తేలచూచిన నిన్ను నే నేల విడుతు
గోర్కి దీరంగ వీఁకఁ బైకొందుఁగాక.

87


చ.

సరసుఁడ! నీ మనంబునకె సమ్మతి గావలె నంచు నింతసే
పరసితి యాఁచి యాఁచి యిఁక నంగజసాయకకీలికీలచే
నరనిమిషంబు నోర్వ నధరామృత మానఁగ నిమ్ము కానిచోఁ
దెఱవను జంపినట్టికొల దీరక తాఁకుసుమీ మనోహరా!

88


చ.

అని యిఁక మాఱు పల్క వల దంచును దీనత దోఁప నాడుచున్
జనుఁగవ యుబ్బఁగాఁ బయఁట జారఁగఁ గ్రొమ్ముడి వీడ దేహ మె

ల్లను బులకింప నీవి వదలం గరకంకణకింకిణీకన
ద్ఘనమణిమేఖలాధ్వనులు గ్రమ్మఁగఁ బైఁ బడి కౌఁగిలించినన్.

89


చ.

పరవశుఁ డయ్యె వాఁడు నలపంకజగంధియుఁ జొక్కి వ్రాలె న
య్యిరువురు నట్ల మోహముల నేమియుఁ దోఁపక యుండి రంత నా
గురుకుచ వానిఱొమ్ముఁ జనుగుబ్బమొన న్నెరుమంగ వాఁడు న
య్యరవిరిబోఁడిమోవిచిగు రానఁగ నెం చిసుమంత కొంకినన్.

90


ఉ.

భావము గాంచి యావికచపంకజలోచన మంచ మెక్కియు
న్వావులు చాలురా హృదయవల్లభ! యం చని వానియందపు
న్మోవి బిఱాన పంటిమొన నొక్కుచు నానుచుఁ జొక్కుచుండఁగా
నావగఁ గాంచి యారసికుఁ డట్లనె దా నొనరింప నెంచినన్.

91


మ.

తరితీపు న్వగలెత్తి మోవి మెలుపుందప్పింపులం జాల య
క్కఱఁ బుట్టింప నతండు తత్తర మొసంగ న్గొమ్మ ధమ్మిల్లమున్
జెరపిన్ గైకొని బాహుమూలయుగళి న్గిల్గింతఁ గావింప న
య్యరవిందానన నవ్వ నాతఁ డధరం బాసక్తిమై నొక్కినన్.

92


చ.

కమలదళాక్షి సంకలితకంకణఝంకృతి సీత్కృతు ల్సవి
భ్రమగతి మీఱ మేను గరుపార మనోజవికారపారవ
శ్యము దయివాఱ నీవి దిగ జాఱ నొకంగము జాళువారఁగా
రమణునిపేరురంబుపయి వ్రాలెను జంత్రపుబొమ్మకైవడిన్.

93


ఉ.

మోమును మో మురంబు నురము న్బుజము ల్భుజము ల్దొడ లొడ
ల్ప్రేమఁ గదించి పాదములు పిక్కలు నొక్కటిగా మలించి పో
రాములనిండుకౌఁగిటఁ దిరంబుగ సౌఖ్యపయోధి నేలి రా
లేమయుఁ బ్రాణనాథుఁడును లీల భుజంగయుగంబుపోలికన్.

94


సీ.

కన్నాత లాఁగించి కాంతుమోము గదించి,
        సారెసారెకు మోవిఁ జప్పరించి
రతిచాతురికి మెచ్చి రమణుఁ గౌఁగిటఁ గ్రుచ్చి,
        మోహాన నూఱాఱుముద్దు లిచ్చి
తనియక యెదురెక్కి దయసేయు మని మ్రొక్కి,
        గుదికాళ్లు వెల్పునఁ గూర్చి నొక్కి
మదనశాస్త్ర మెఱింగి మనసుకొంకుఁ దొఱంగి,
        కాయంబు లొక్కటి గాఁగ మెలఁగి

గీ.

యరిది సూదంటుశిలవలె హత్తి హత్తి
గొనబుతీవియచందాసఁ బెనఁగి పెనఁగి
కౌముదిని జంద్రశిలవలెఁ గరఁగి కరఁగి
సమరతుల నేలె నా బాల సరసలీల.

95


చ.

ఎఱుఁగదు చన్నుదోయి బిగియించి కరంబులఁ బట్టు టెంతయున్
ఎఱుఁగదు వాఁడిగోళ్లతుదనిక్కువ లెల్లను గ్రుచ్చుటేమియున్
ఎఱుఁగదు లేఁతమోవిచిగు రెంతయుఁ గుమ్మెలువోవ నొక్కుట
ల్తరుణి యఖండసౌఖ్యరసతన్మయత న్మరుసంగరంబునన్.

96


ఉ.

మక్కువఁ దిట్లుకొట్లు బతిమాలుట లూఱట లెచ్చిపోరుట
ల్పక్క మరల్పు నేర్పులును బద్దులు నబ్బినచోట ముద్దులున్
మ్రొక్కులు పల్కు మోడి విసరు ల్కసరు ల్కొసరు ల్చెలంగ నా
చక్కెరబొమ్మ నెమ్మి మరుసామున సోమునిఁ గూడె వేడుకన్.

97


మ.

కనుదము ల్ముకుళింపఁగాఁ బులక లంగశ్రోణి నిండారఁ గాఁ
దనువు ల్సొక్కివిచేష్టితం బొరయఁగాఁ దత్తద్గతు ల్మాని నె
మ్మనము ల్నిర్వృతిఁ జెందఁగా నలరుచున్ బ్రహ్మైక్యలీలాసుఖం
బన నింపొందుసుఖోన్నతిం గనిరి రత్యంతంబునం దిర్వురున్.

98


సీ.

చిలుక వ్రాలినమేలిచిఱుదొండపం డన,
        మొనపంటినొక్కులమోవితోడఁ
గవురంపువీడెంపుఁ గఱ చుట్టుఁ గనుపట్టు,
        గబ్బిసిబ్బెపుఁజనుకట్టుతోడఁ
గమనీయమణిమాలికాశశపదచంద్ర,
        రేఖాంక మౌతనురేఖతోడ
నలరువిల్తునిసాము జిలిబిలిచెమటచే,
        సొగసు మీఱిననవ్వుమొగముతోడఁ


గీ.

గొం గొకటి కట్టి మిగిలినకోకఁ జుట్టి
కరమునను బట్టి వీడినకచభరంబుఁ
దగ నమర్చుచు విభునికైదండఁ బూని
తార శృంగారలీలావతార వెడలె.

99


గీ.

ఇవ్విధంబునఁ జనుదెంచి యిగురుఁబోఁడి
విభుని తనవెన్కనుంచుక వింతవారు

లేరుగా యంచు సదనంబుఁ బారఁజూచి
యల బలము లేనినిజమందిరాంగణమున.

100


శా.

పన్నీటం జలకంబు లాడి నునుజాళ్వాయంగదట్టంబుతో
బన్నీటందపుజల్వఁ గట్టి హరు వొప్పన్ దావిగంధంబు మే
న న్నిండార నలంది జాజివిరిదండ ల్జుట్టి జవ్వాజిరే
ఖ న్నెమ్మోమునఁ దీర్చి నూత్న మగుశృంగారంబు రంగారఁగన్.

101


గీ.

కాంతునట్లనె కైచేసి కళ్కుపసిఁడి
తమ్మి మొగ్గల వ్రాఁతయందంపుజిగులు
దుప్పటిని కట్టఁగా నిచ్చి తోడుకొనుచు
వచ్చి వాఁకిటితలుపు తీవ్రముగ వైచి.

102


సీ.

కసటు వోఁ బన్నీటఁ గడిగి పువ్వులతావి,
        వల నైనకమ్మజవ్వాజివలపు
నెఱపెడిసుగటీలగరులగాడ్పులు సోఁకి
        పలుకుకిన్నెరతంతి యళుకు కులుక,
కెరలి యల్గించుకోకిలపల్కుతమి కింపు,
        నింపుకెంపులగుంపు నిగ్గుజగ్గు
చప్పరకోళ్లమంచము సఖి నెలపాన్పు,
        తలగడ బటువుబిల్లులును జిల్గు


గీ.

తెరయు చౌశీతిబంధంబుటరిదిపటము
లగరుసాంబ్రాణిధూపంబుపొగలు నూడి
గమ్ము లొనరించుకీల్బొమ్మ గమియుఁ గల్గి
వెలయుపడకింట నాదంట విభునిజంట.

103


చ.

జిలిబిలితేనియ ల్చిలుకుచెందొవచందువక్రింద నంద మై
చలువలఁజిల్లుసన్నవిరజాజులపాన్పునఁ గమ్మతెమ్మెర
ల్పొలయఁగ నుండి ప్రాణవిభుమోముఁ గనుంగొని లేఁతవెన్నెల
ల్దలకొన నవ్వుచున్ దమిఁ జెలంగి పునారతికౌతుకంబునన్.

104


చ.

గమగమవాసన ల్దెసలఁ గప్పఁగ నొప్పగుకప్పురంపుబా
గము లపు డిచ్చి లేఁతవిడిగాఁ దగుగేదఁగిఱేకుటందపుం
దములపుటాకుమడ్పులును దా నొసఁగం గొఱి కిమ్మటంచు నా
రమణుఁడు మోము ద్రిప్పుటయు రాజముఖీమణి యట్ల చేయుడున్.

105

మ.

మొనపంట న్మడు పందుకొంచుఁ జెలి కెమ్మో వింత యానంగ నం
గస సీత్కారకపోతకూజితచమత్కారంబు సంధిల్ల నా
తనిబింబాధర మాని నొక్కెఁ దమిచేత న్వార లీరీతి నిం
పొనరం జుబ్బనచూఱగాఁగఁ గొని రన్యోన్యాధరంబు ల్దమిన్.

106


క.

అద నైనపికిలిగువ్వలు
గదుముచు నొండొంటిమీఁదఁ గవియువితానన్
మదవతియుఁ బ్రాణనాథుఁడు
మదనాహవకేళివేళ మార్కొని రంతన్.

107


క.

గుత్తంపుగుబ్బ లురమున
హత్తుగసరి యాని యాని యారసికుండున్
బిత్తరియును బెనఁగిరి సరి
బిత్తరులుం బిరుదుజెట్లు బెనఁగినమాడ్కిన్.

108


చ.

పెనఁకువతత్తరంబునను బిత్తరి కత్తఱి నీవి జాఱిన
న్ననవిలుకానిసాదనకు నాథునిఁ బైకొన లాఁగి కేల్మయిన్
ఘనమణిఘంటికాకటకకంకణకింకిణికాంచికాంచికా
స్వనములు నివ్వటిల్లఁ బురుషాయితకేళి కుపక్రమించుచున్.

109


చ.

అమరిక మీఱఁగా నిలిచి యందపు మై సిరి నుల్లసిల్లఁగాఁ
గొమరుమిటారిగబ్బిచనుగుబ్బలవ్రేగునఁ గౌను నాడఁగా
రమణి క్రమక్రమంబున దురంపువగ న్నటియించె వింతగా
సుమశరసూత్రధారకుఁడు సొంపున దిద్దినపాత్రకైవడిన్.

110


సీ.

కట్టుగంబంబునఁ గట్టినగంధేభ
        మనఁగ నల్లన నసియాడి యాడి
బిరుదుజెట్టియు నాఁగఁ బెనఁగి యారాటాన
        నందంపుఁదొడలచే నదిమి యదిమి
చికటారిమాష్టీనిచెలువునఁ గూర్చుండి,
        పూనిక మీఱంగఁ బొదలి పొదలి
చెండు గోరించినచెలువున లివ మీఱ
        నొయ్యారమునఁ గొంత యుబికి యుబికి


గీ.

కలయ మెలఁకువ బెలుకుచుఁ గులికి కులికి
వలపుఁ దెలుపుచు నరయరఁ బలికి పలికి

యలపుసొలఫున నిలువక నిలిచి నిలిచి
మొనసి ప్రియుఁ గూడె మగపాడి ముద్దులాఁడి.

111


సీ.

అరవిందమకరందమళి యానినటు లాని,
        వరునివాతెఱ చిఱుపాలు గ్రోలు
గిరి హత్తుమదమత్తకరి వ్రాలునటు వ్రాలి,
        చనుగుబ్బ లతనివక్షమునఁ గ్రుమ్ము
నెరసానిదొరసాని హరి నెక్కి దుర మెక్కి,
        వగ వింతజోదైనవగపుఁ జూపు
బవమానలవమాననవమాలికన సోలి,
        యదరునిట్టూర్పుల నలవుఁ దెలుపు


గీ.

అమరికకు మెచ్చి కెమ్మోవి యాన నిచ్చు
నానికల నిచ్చు నరిపల్కు మని యదల్చుఁ
గేళిఁ బడలితి వని నవ్వుఁ గేల దువ్వు
బాల గిఱికొన్నబాళి పుంభావకేళి.

112


సీ.

సొంపారఁ గుల్కెడుకెంపుబావిలితోడ,
        నలరువజ్రపుఁగమ్మ లల్లలాడ
నుదుటిపైఁ జెమటబిందువులు గుంపులు గూడ,
        ఘుమఘుమతావిని గొప్పు వీడ
రమణీయతారహారములముత్యము లూడ,
        నిగ్గుపాపటబొట్టు నృత్యమాడ
నాయాసభరమున నాననాబ్దము వాడ,
        విభుఁడు ప్రేమను దను వేడ్కఁ జూడ


గీ.

మించుతీవియ మెఱసి నటించుజాడ
నరిదిచూపులు ప్రియుహృదయంబు గాఁడ
నంగజావేశమున సన్న మైనవ్రీడ
రమణునెద క్రీడ సలిపె నారతులప్రోడ.

113


ఉ.

[5]సెయ్యక సెయ్యుచిక్కులును జిన్నిమిటారపుగోటినొక్కులున్
నెయ్యముఁ దొల్కుచూపులును నిచ్చలు మెచ్చుల గిచ్చువైపులున్

దొయ్యనికూర్ములుం దనరఁ దొయ్యలియున్ శశియున్ దివానిశం
బయ్యెడ నుండి రిట్లు మదనాహవమోహవశానురక్తులై.

114


వ.

అనుటయు.

115


శా.

ఆచంద్రాచలచందనాచలధరణ్యాకల్పకీర్తిప్రభా
శోచిష్కేశపటుప్రతాపశలభస్తోమికృతారివ్రజా
ధీచాతుర్యలసద్వచోవిజితమాధ్వీగోస్తనీపాణితా
క్వాచిత్కాంచితసత్కవిప్రవర వాగ్జాలప్రియంభావుకా.

116


క.

స్వామిద్రోహరగండా!
సామాదికచతురుపాయసాధనశౌండా!
శ్రీమద్గుణప్రకాండా!
హైమగృహాళిందపూర్ణహయవేదండా!

117


స్రగ్విణీవృత్తము.

దానధారాసుతా! ధర్మసత్యవ్రతా!
దీనరక్షాప్రియా! ధీరభావ్యోదయా!
భానుభాస్వద్ఘృణీ! బ్రహ్మవంశాగ్రణీ!
మీనలక్ష్మీకృతీ! మేరుభూభృద్ధృతీ!

118


గద్య.

ఇది శ్రీజానకీరామచంద్రచరణారవిందవందనకందళితానంద కందాళరామానుజగురుచరణసేవాసమాసాదితసాహితీవైభవ శేషము కృష్ణయార్య తనూభవ సుకవిజనవిధేయ వేంకటపతినామధేయప్రణీతంబైన శశాంకవిజయం బనుమహాప్రబంధమునందు దృతీయాశ్వాసము.

  1. ఎఱుఁగరు తమయొళవెల్లవారు
  2. దలఁపవేమొ
  3. లవియంత
  4. పూనిగుర్తుతనానఁ బూలచెండ్లరిదిని
  5. అర్థము చింత్యము.