నవీన విశ్వవిద్యాలయాల్లో

పురాణ కవిత్వంలాగా

శ్రవణ యంత్రశాలల్లో

శాస్త్రీయ సంగీతం లాగా

ఇలా వచ్చేవేం వెన్నెలా!

ఎలా వర్ణించను నిన్ను ?

మహా కవులు లోగడ చెప్పిందే

మళ్ళీ మళ్ళీ చెప్పాలా ?


ఏదో కాస్త భాషా జ్ఞానం

ఇంతో అంతో చ్చందస్సంపదా

ఐదో పదో అలంకారాలు

ఆరో అందులో సగమో ఆవేశం


ఇలాంటివే ఏవో పోగుచేసి

ఇదివరకు నిన్నెప్పుడూ చూడనట్టు

ఇవ్వాళే కొత్తగా కనిపెట్టినట్టు

ఏమని వర్ణించను నిన్ను ?


ఏది రాసినా ఏం లాభం ?

ఇదివరకెవడో అనే వుంటాడు

బహుషా ఆ అన్నదేదో నాకన్నా

బాగానే అని వుండొచ్చు.


అలాంటప్పుడు మళ్ళీ

కలం కాగితం మీద పెట్టి

కళంకంలేని తెల్లదనాన్ని

ఖరాబు చెయ్యడ మెందుకు ?


అనాది నుంచీ నువ్వు

అంత మంది కవులకి

ఉపాదేయ వస్తువుగా నిలిచి

ఉపకారం చేశావు


అలాగే నేనూ ఒకప్పుడు

రొమాంటిక్ ప్రమాదంలో పడి

అమాయకంగా నీ బ్యూటీ

అభివర్ణించాను వృత్తాలలో


ఇవాళ మళ్ళీ అలాగ

ఎలాగ రాయగలను నేస్తం ?

ఇరవయ్యో ఏడు నాకు మళ్ళీ

ఎలా వస్తుంది చెప్పూ ?


అంచేత నీ గురించి

అన్వసరావేశాలు పెంచి

అన్యాపదేసంగానో లేదా

అర్ధాంతరన్యాసంగానో


సొంత కోపాలేవో పెట్టుకొని

పంతాలు పట్టింపులూ పట్టుకొని

ఎవరినీ ఈ వ్యవహారంలో

ఇరికించదలచుకోను నేను !


ఎంతకీ ఆవేశాక కేముంది ?

ఎవడి బతుకు వాడు బతుకుతున్నాడు

ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా

ఎంతగా పై పై భేదాలున్నా

ఎంతగా స్వాతిశయం పెరిగినా

ఎంత బలం ధనం జవం పెరిగినా

అంతరంగం అట్టడుగున మాత్రం

అంతమందిమీ మానవులమే !


అందుచేత ఓ చందమామా

అందమైన ఓ పూర్ణసోమా

సముద్రం మీదా అరణ్యం మీదా

సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా