వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/25-ప్రకరణము

25-ప్రకరణము

కళాప్రపూర్ణుని కడపటిదినములు. ఆముక్తప్రకాశనము

1925 సం. మున, నాలుగేండ్లక్రింద తాతగారికి సన్మానముచేసిన స్వాములవారు, భారతీకృష్ణతీర్థులు శారదాపీఠమున తమశిష్యులనుంచి తాము పురీజగన్నాధముననుండు శంకరపీఠమునకు జగద్గురువులై వచ్చిరి. వచ్చినవెంటనే తాతగారిని పురీజగన్నాధమునకు రప్పించిరి. తాతగారు, తమఋణము స్వాములవారి సాయముచే తీరుననియు, కుటుంబస్థితి బాగుపడుననియుందలంచి 1925 సం, అక్టోబరులో బయలుదేరిపోయి కొంతకాలము స్వాములవారితో నుండిరి. ఆసమయమున స్వాములవారి మఠము కొన్ని వ్యాజ్యపు చిక్కులలో నుండినందున వెంటనే మాకు వారు తలంచిన సాయము చేయలేక పోయిరి. తాతగారికి అనారోగ్యము హెచ్చయినందునను, ఆముక్తమాల్యదను ముద్రింపవలసి యుండినందునను 1926 సంవత్సరారంభమున బయలుదేరి మదరాసుకే వచ్చిచేరిరి. నెల్లూరి కాపురమును చాలించుకొనిరి. పురి-జగన్నాధముననుండిన కాలముననే తాతగారు ఆంధ్ర భారతము నంతయు పఠించి సవరించి ముద్రణోచితముంజేసినారు.

ఆముక్తమాల్యద 1927 సం జూలైనెలలో ప్రకటింపబడినది. ఈవ్యాఖ్యనువ్రాయుటకు తొలుత తాతగారిని ప్రేరేపించినవారు శ్రీ పీఠికాపురమండలేశ్వరులు శ్రీ రావు వేంకటకుమారమహీపతి సూర్యరావు బహద్దరువారు. తాతగారు ఆముక్తమాల్యద ఉపోద్ఘాతమున వ్రాసియున్నారు. శ్రీ మహారాజావారు తాతగారికి పారితోషికముగా రు. 1200 పూర్వ యుద్ధమునకు ముందొసంగిరి. తర్వాతవెలలు యుద్ధముచే హెచ్చినందున 'మహారాజావారొసంగినధనము ఆముక్తపు వ్రాతప్రతులను విలుచుటకును, ఓరియంటల్ లైబ్రరీలో గ్రంథశోధనలు సేయించుటకును వ్యయమైనది.'...శ్రీయుత కట్టమంచి రామలింగారెడ్డిగారి ప్రేరణచే శ్రీయుత అల్లాడి కృష్ణస్వామయ్యగారు వేయిరూప్యముల నొసంగిరి. తాతగారు 'జీవికయు ఆ యతియులేక ఏతద్గ్రంథముద్రణ భారము క్రింద క్రుంగిపోవుచున్న' దినములవి. ఈకాలమున ననేకులు వారికి "శతాధిక రూప్యములనిచ్చి కష్టములను తొలగించుచుండిరి.' తాతగారిట్లు వ్రాసియున్నారు. 'ఇట్లు కొందఱు వదాన్యులు ధనమిచ్చినను, ఒకప్పటికి కూడిన ధనము ముద్రణాదికృత్యములకు పర్యాప్తముగాక యుండినది. ఆంధ్రగైర్వాణగ్రంథములనే రమారమి రు 900 లకు కొనవలసివచ్చినది. దుర్దైవవశమున మందదృష్టినైతిని. దానంజేసి కార్యసహాయులకై రు 1500 ఎక్కుడుగానే వ్యయమయినది. ఆసమయమున, నేను రిక్తుడను రుగ్ణుడను, నిరాయతిని బహుకుటుంబిని, ఉక్తకారణములచేత బహువ్యయుండనుంగాన, ముద్రణమునకు తక్కువపడిన ధనమును వ్యయించుటకు స్వశక్తి లేకయు నుంటిని. దానినెఱింగి యీ గ్రంథము తప్పకముద్రితమగుగాకయని నెల్లూరుజిల్లా కావలి తాలుకా ఇందువూరుగ్రామ్యవాస్తవ్యులు, భూస్వాములు శ్రీయుతులు ఎఱబ్రోలు రామచంద్రారెడ్డిగారు ....... నాకు ఏతద్గ్రంథ ముద్రణపూర్తికై అప్పుడప్పుడు రు. 2500 ల పరిమితిం జెందువఱకు విరాళమొసంగిరి.' ఈవిధముగా నీగ్రంథము 1927 సం జులయినెలలో వెలువడినది. 'చేసెదనింకదత్పరత సేవలు చూడికుడుత్త దేవికిన్‌' అని 1913 సం కావించిన ప్రతిజ్ఞను ఇన్నాళ్ళకు చెల్లించుకొని 'చేసితినిప్డు తత్పరత సేవలు చూడికుడుత్తదేవికిన్‌' అని ముద్రించినారు. ఆముక్తమాల్యద ముద్రితమై వెలువడినప్పుడు వారిహర్షమునకు మేరలేదు.

'ఇన్ని కడగండ్లపాలయి యిపుడుదీని నచ్చుబొత్తంబుకా గంటిహర్ష మెసగ' అని వ్రాసినారు.

1926 సం మున కంటి ఆపరేషను జరిగినదికాని దృష్టి చక్కగా కుదురలేదు. అట్లే ఆముక్తమాల్యదకు ప్రూపులు దిద్దిరి. లెక్క లేని అచ్చు దప్పులుపడినవి. వానిని చాలవరకు సవరించిరి. మిగిలినవి చదువరులకే వదలిరి.

ఆముక్తమాల్యద ప్రకటితమైన సంవత్సరాంతమున ఆంధ్రవిశ్వవిద్యాలయమువారు తాతగారికి కళాప్రపూర్ణ బిరుదము నొసంగి సత్కరించిరి. ఆనాడే బెజవాడ పురపాలక సంఘమువారు వీరికి తమపురమున సర్వస్వాతంత్ర్యములను ఇచ్చి (Freedom of the city of Bezwada) గౌరవించిరి. ఇట్టి గౌరవములనందిన ప్రథమాంధ్రకవిపండితులు వీరే. ఆముక్తమాల్యదా ముద్రణానంతరము తాతగారు గ్రంథములు వ్రాయలేదు; ఎప్పుడును మంచముననేపరుండి ఏదోచదువుచును వ్రాయుచు థ్యానించుచుండువారు. ఋణమొకటి యున్నది. అది తీరుట ఎట్లని నిరంతరము చింతించుచుండువారు. రాను రాను వారికి దిగులు వృద్ధి కాజొచ్చినది. శ్రీగునుపాటి ఏనాదిరెడ్డి గారికి జాబులు వ్రాయుచుండువారు. *"నాపేర వారమునకు రెండుజాబులు వ్రాయుటయేగాక అపుడపుడు ఋణదాతలు వ్రాయు జాబులను సైతము పంపుచుండిరి. నేనును ఇట్టి చందాలకుదిరుగు వాడుక లేనివాడ నగుటను తొల్లింటిపెద్దలు కలిసి రానందునను శ్రీవారి ఋణశల్యము నాహృదయశల్యమాయెను. 'మీరు ప్రయత్నించిన సర్వము జక్కవడును' అని శాస్త్రులవారాశీర్వదించుచుండిరి. 'ఇంత పెద్దమొత్త మెట్లు సమకూర్చ గలనాయని భయపడుచు, నావలన నేమికాగలదు శ్రీవారిప్రతిభయె సమకూర్చు' ననుధైర్యము వహించి, నామిత్రులును శాస్త్రులవారియం దభిమానాదర ప్రపత్తులుగల వారును ప్రస్తుతము (ఇదివ్రాసినదినములలో) శాసనసభాధ్యక్షులుగనుండు శ్రీయుతులు బెజవాడ రామచంద్రారెడ్డిగారితో నీవిషయము విన్నవించితిని. వారు విని 'ఈయప్పు శాస్త్రులవారు తీర్చవలసినది కాదు. మనముచేసిన యప్పుగాభావించి తీర్చవలసినబాధ్యత మనయందును ముఖ్యముగ మనరెడ్డి సంఘమునందేయున్న' దని


  • శ్రీ ఏనాదిరెడ్డిగారు ప్రకటించిన నివేదికనుండి. పలికి 'మీరు మనయూరికిరండు. మన శ్రీయుతులు బెజవాడ చంద్రశేఖరరెడ్డిగారితో గలిసి మాటలాడి ప్రయత్నింత' మనిరి. అంతకుబూర్వమే యీవిషయము చంద్రశేఖరరెడ్డిగారితో నించుక సూచించియుంటిని గాన ఒకతేది నిర్ణయించుకొని బుచ్చిరెడ్డి పాళెమునకుపోయి నేనును రామచంద్రారెడ్డిగారును చంద్రశేఖరరెడ్డి గారివద్దకుంజని ఈవిషయము వారికి విశదపరచి ఒక సుముహూర్తము నిశ్చయించుకొని ఆతేది మువ్వురము బుచ్చిరెడ్డిపాళియమున గలిసి రామచంద్రరెడ్డి గారిచేత రు 500 లును చంద్రశేఖరరెడ్డిగారిచేత రు 500 లును చందాపట్టికయందు వ్రాయించి మామువ్వురము నెల్లూరికివచ్చి వయస్సున పిన్నలయ్యును వదాన్యతయందు పెద్దలగు శ్రీయుతులు రేబాల పట్టాభిరామరెడ్డిగారిచేత రు 1000 లను చందావేయించి ఈ ప్రయత్నమంతయు వారికి విశదపరిచి వారిని ఒడంబరుచుకొని మానలువుర మొకసంఘముగజేరి ముఖ్యులగు రెడ్డిసోదరులచే కొన్నివేలు చందాలువేయించితిమి. పిమ్మట పట్టాభిరామరెడ్డిగారును నేనును కొంతధనమును, రామచంద్రరెడ్డిగారును నేనును మదరాసులో కొంతధనమును చందాలు వేయించితిమి. ప్రత్యేకముగా రామచంద్రారెడ్డి గారు శ్రీ వేంకటగిరికుమార రాజాసాహేబుగారివద్ద (ప్రస్తుతము రాజాసాహేబుగారు) వేయిరూప్యములందెచ్చియిచ్చిరి. రావుసాహేబు పొణకా వీరారెడ్డి గారును నేనును కొందఱిని దర్శించి కొంతధనము చందాలు వేయించితిమి. నేను స్వయముగానే కొంతమంది ప్రముఖులను సందర్శించి కొన్ని చందాలువేయించితిని. మిగత చందాలు వేయించుటకును చందాధనము వసూలుంజేసి మానలువురము నిర్ణయంచుకొనిన కోశాధ్యక్షునివద్దనుంచి శాస్త్రువారి ఋణముందీర్చి మిగతధనమును శాస్త్రులవారి కుటుంబమునకు వినియోగించవలసినబాధ్యత నాయందేయుంచిరి. ఈరామచంద్రారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, పట్టాభిరామరెడ్డి, వీరారెడ్డిగార్లు ఆజన్మము ఇచ్చుట యెఱిగినవారేగాని అడుగుట లెఱుగని వారలయ్యును శాస్త్రులవారి యందలి ఆదర ప్రపత్తులచే గొప్ప మొత్తములను విరాళముల నిచ్చియు నన్ను వెంటనిడికొని అనేకస్థలములకు తిరిగి గొప్పసాహాయ్యమొనర్చిరి. ఈసత్పురుషులకు నలువురకు నేనాజన్మము కృతజ్ఞుడను. మేము వసూలుచేసిన మొత్తమును తనవద్ద భద్రపఱచి శాస్త్రులవారి ఖర్చులకు నేను తెలియజేసిన అనుక్షణముననే వారికింబంపుచు నాకుందోడ్పడుటయే గాక అపుడపుడు తనవద్ద నిలువయున్న మొత్తములకు వడ్డి సయితమొసంగిన కోశాధ్యక్షులును శాస్త్రులవారియందలి మిక్కిలిభక్తి ప్రపత్తులుకలవారునగు శ్రీయుతులు దొడ్ల రామారెడ్డి గారికెంతయు కృతజ్ఞుడను. అంతట దాదాపు పదునొకండు వేల పరిమితము చందాలు వేయించి వసూలుప్రారంభించి చెన్నపురికిబోయి ఆడుమానదస్తవైజు లెక్కచూడగా అసలుఫాయిదాలు రు 7500 అయినందుకు శ్రీమాన్ శఠగోపరామానుజాచార్యులవారు (మొదట అప్పిచ్చినవారు) ఏడువేలు మాత్రము పుచ్చుకొని మిగత సంతోషముగ త్రోచివైచిరి." ఇదంతయు తాతగారు చనిపోవుటకు కొన్నినెలలు ముందు జరిగినది. అప్పటికి వారితల్లిగారు ఇంకను జీవించియుండిరి. లక్ష్మమ్మగారు ఉడాలి యశ్వత్థసూర్యనారాయణ సోమయాజులవారి ప్రథమపుత్రిక నూటరెండేండ్లు జీవించియుండిరి. కడపటివరకు దంతపటుత్వ లోపముగాని దృష్టిలోపముగాని లేదు. తుదిదినములలో కొంత అస్తవ్యస్తముగా నుండిరి. తాతగారికి తల్లిగారియందు చాలభక్త్యనురాగము లుండెడివి. నెల్లూరిలో ఏసన్మానము జరిగినను, సన్మానము జరిగినవెంటనేవచ్చి తల్లిగారిని దర్శించి పూలమాలలతో తల్లిగారిపాదములలోవ్రాలి ఆవెనుక అలంకరణములను తీయువారు. తాతగారు చనిపోవుటకు దాదాపు ఆఱునెలలు ముందు వీరుగతించిరి. వార్ధక్యమున, లేవలేనిస్థితిలో తల్లిగారికి క్రతువులు చేయవలసివచ్చినది. సోదరులు చేయుచుండగా తాతగారు చెంతకూర్చుండియుండు వారేగాని అంతకన్న నేమియు చేయలేక యుండిరి. డెబ్బదియైదవయేట తాతగారు తల్లినికోల్పోయిరి.

1928 సంవత్సరము డిసెంబరునెల ఆఖరులో గావలయు శ్రీ ఏనాదిరెడ్డి గారు తాతగారిని దర్శించి 'తమఋణమును తీర్చి వేసితిమి' అని చెప్పినప్పుడు ఆయిరువుర సంతోషమునకు మేరలేదు. నెల్లూరిశిష్యులచే తమకేర్పడిన ఋణము తమ చిరకాలమిత్రుల సాయముచే తీరెనుగదాయని తాతగారు పరమానందముంజెందిరి. సంతోషముచే కొన్ని నిమిషములు ఏడ్చుచుండిరి. ఋణముతీరినది. ఆతర్వాత ఆఱునెలలు మాత్రమే జీవించియుండిరి. ఆదినములలో వారిహృదయము నీటికన్నను పలుచగా కరగిపోవు చుండెను. దేనిని చూచినను జాలికలుగు చుండెను. శిశువువలె నైపోయిరి. ఒక్కొకయప్పుడు ఒడలుతెలియని సంతోషము, ఒక్కొకప్పుడు చాలదు:ఖమును వారికి కలుగుచుండినవి. ఆ యాఱుమాసములు వా రుండిన విధము వర్ణింపతరముగాదు. ఎవ రేదియడిగినను 'ఇచ్చివేయి' అనువారు, 'మనకు దేవుడిస్తాడురా' అనువారు. ఏమియుందోచక పోయిన ఏనాదిరెడ్డిగారికి జాబువ్రాసి జవాబున కెదురుచూచువారు. లేక కాగితము కలముంగొని తోచినదివ్రాసి చింపివేయుచుండువారు. మరల ఏగ్రంథవ్రాయవచ్చును, దేనికివ్యాఖ్య, ఏకథను నాటకము చేయవచ్చును, రెడ్డి మహనీయులు చేసిన ఈ యుపకారమునకు తగిన ప్రత్యుపకార మేమి చేయవచ్చును, అని ఆలోచించుచు నిరంతరము మంచము మీదపరుండి చుట్టును పుస్తకములనుంచుకొని కాలము గడుపుచుండిరి. వయసు డెబ్బదియైదు.

శ్రీ ఏనాదిరెడ్డిగారు తాము వసూలుచేసిన ద్రవ్యమునుండి ఋణమునకు పోను మిగిలినదానితో మఱికొంత వసూలు చేసి, మహాకవిపూజగా కనకాభిషేకము సేయించి, నిండుసభలో నెల్లూరి పౌరసౌధమున తాతగారిని సత్కరింపదలంచి ప్రయత్నించుచుండిరి. తాతగారు పూర్వము ఋణమును గూర్చి ప్రస్తావము వచ్చినప్పుడంతయు 'నేను ప్రాణంతో ఉండగా కావలెనుగదా' అనియు 'అంతకాలం నాకు భగవంతుడు ఆయుస్సీవలెను గదా' అనియు చెప్పుచుండెడివారు. ఎట్లో శ్రీ రెడ్డిగారిప్రయత్నము వలన తాతగా రుండగనే ఋణనివర్తియైనది. కనకాభిషేకముంగూర్చి శ్రీ రెడ్డిగారి సంకల్పము నెఱవెరకమునుపే చనిపోవుదు మేమోయనియు తలంచుచుండిరి. వేసవి దినములు మేనెలలో 'నేను భగవద్గీతకు ఆంథ్రానువాదమును రచించి మా ఏనాదిరెడ్డిగారికి అంకితమిచ్చెదను' అని పలికిరి. పదిపదునైదు దినములు అదిపనిగా భగవద్గీతపై తమ భాండాగారమునందలి గ్రంథముల నన్నిటిని ఒకమాఱు చదివి 'ఇక నారంభించెదను' అనిరి. ఆదినము సాయంకాలమే జ్వరము తగిలెను కాలిమీద గోకినందున పుండేర్పడినది. జ్వరము వృద్ధియైనది అంతకు నెలదినముల నుండియు నాపెదతమ్మునికి ఉపనయనమునకు ఏర్పాటు చేసియుంటిమి. మధ్యలో తాతగారికి జ్వరమువచ్చినను దానిని నిలుపలేదు. ఉపనయనము నాడు వారికి జ్వరమువచ్చి పదునొకండు దినములు. తాతగారికి కష్టముగానుండునని మేళములు మొదలైనవాద్యములను పూర్తిగా నిలిపివేయించితిమి. ఉపనయనము కేవలము మంత్రములతోనే జరిగెను. తాతగారు నాటి ఉదయము 'ఏమిరా, చప్పుడులేదు, వాద్యములు లేవు. ఉపనయనము నిలిపివేసినారా యేమి?' అని అడిగిరి. 'లేదండి. తమకు శబ్దము కష్టముగా ఉంటుందని వాద్యాలు నిలిపినాము. మంత్రాలతోనే జరుపుతాము' అని నేను చెప్పితిని. 'ఆ. ఆ. మంచిపని' అని సంతోషించినారు. ప్రతిదినమును ప్రొద్దున నొకటి రెండుగంటలు శరీరముపై స్పృహయుండెడిది. తర్వాత జ్వరము వచ్చెడిది. ఒడలు తెలియనిస్థితి. గంజి ఆహారము. ఉపనయనానంతరము నేను చెంతకుపోయితిని. 'మీకు, ఒంట్లో ఎట్లున్నదండీ?' అని యడిగితిని 'పరమ పదం, పరమపదం' అనిమాత్రము చాలకష్టముతో చెప్పగల్గిరి. ఆవెనుక వారికి చైతన్యము లేదు. మరల తెల్లవారులోపల 1929 సం. (1929) జూనునెల 18 తేది మంగళవారము వేకువను 5-45 గంటలకు పరమపదించిరి.


__________