వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/24-ప్రకరణము

24-ప్రకరణము

ఆంధ్రభాషాభిమాని సమాజము

రంగనాయకులపేటలో నున్నంతకాలము తాతగారికి విద్యావినోదములచే కాలము జరుగుచుండెడిది. నిత్యము సాయంకాలములయందు శిష్యులువచ్చి వాకిట తిన్నెపై సమావేశమై సంస్కృతాంధ్ర కావ్యనాటకములను వారికడ చదువు చుండిరి. ఆంధ్రభాషాభిమాని సమాజము, నాడు, 1900 సంవత్సరప్రాంతమున, స్థాపితమైనట్టిది, నిరంతరాయముగా జరుగుచువచ్చినది.

కందాడై శ్రీనివాసన్‌గారు (దొరసామయ్యంగారు), నేలటూరు తిరువేంగడాచార్యులు (బంగారయ్య) గారు, కొండగుంట వేంకటరమణశాస్త్రి గారు, గుంటూరు శివకామయ్యగారు, నందగిరి హనుమంతరావు గారు, యరగుడిపాటి వేంకటాచలము పంతులవారు, వారి సోదరులు య. గోపాలకృష్ణరావుగారు, (నేటిప్రసిద్ధసినిమాదర్శక శిఖామణులలో నొకరగు వై.వి. రావుగారి తండ్రిగారు) ఇంకననేకులు మొదటమొదట తాతగారి శిష్యులై ప్రతాపరుద్రీయము, ఉష, శాకుంతలము, నాగానందము, లను నాటకములను నెల్లూరిలో ప్రదర్శించుచుండిరి. ఈ నటులందఱు బి.ఏ.లు. పైగా సంస్కృతాంధ్రములయందు మంచి ప్రవేశముగలవారు. కందాడై శ్రీనివాసన్‌గారు, క్రైస్తవ కళాశాలలో తాతగారి శిష్యులైయుండినవారు, సమాజమున మొదటినుండియు నాయకునివేషమును ధరించుచుండిరి. ప్రతాపలో ప్రతాపుడుగాను, శాకుంతలములో దుష్యంతుడుగాను కీర్తిగాంచినవారు వీరు. తాతగారు దొరస్వామియని పేర్కొనుటకుబదులు వీరిని 'మాదుష్యంతుడు' అని ప్రియముగా వచించువారు. వీరి మధురగానము, సుందరరూపము, ఆదర్శప్రాయమగు నభినయమును నెల్లూరివారికి నేటికిని కన్నులయెదుట నున్నట్లున్నవి. వీరి దుష్యంతపాత్రను చూచి జటప్రోలు ప్రభువులు 'రాజంటేవాడే రాజురా, మిగిలిన రాజులేమి రాజులు త రాజులు' అని వచించిరట నాటి శ్రీ వేంకటగిరి మహారాజావారు నూట పదార్లు సమాజము వారికి పారితోషిక మొసంగిరి. అట్లే వీరి ప్రతాపరుద్రుని పాత్రయు, అనిరుద్ధుని పాత్రయు చూచినవారిది భాగ్యము. బంగారయ్యగారి యుగంధరపాత్ర శాస్త్రులవారి మనసుకు నచ్చినది. కొండగుంట వేంకటరమణశాస్త్రిగారు (బి.ఏ.) పేరిగాడుగా నద్వితీయులై కీర్తివడసిరి. వీరికే ఏనాదిశాస్త్రియని నామాంతరము. వేషమును, ఉచ్చారణయు, అభినయమును వీరిది పరమావధింబొందియుండెడిది. హనుమంతరావు గారు ఉష మొదలైన నాయికాపాత్రలను చక్కగ నిర్వహించువారు. గుంటూరు శివకామయ్యగారి చిత్రరేఖాభినయము శాస్త్రులవారి మెప్పును వడసినది. తాతగారి పద్యములను వారి యభిప్రాయము శ్రోతలకు తెలియునట్లు మనోహరగానముతో చదివినవారిలో వీరగ్రగణ్యులు. యరగుడిపాటి సోదరులు బాణాసురాదిపాత్రలను ధరించుచుండెడివారు. వీనియందంతయు ప్రతిబింబించునది శాస్త్రులవారి మూర్తి. అక్షరమక్షరమును వారిశిక్షయే. నటునిచూడగానే ఫలానిపాత్ర కీతడుతగునని వారికి తోచును. వా రేపాత్రయొసంగిన ఆపాత్రనే నటులు ధరింపవలయునుగాని అన్యథా వర్తించుటకు అవకాశముండెడిది కాదు. పైగా వారిచ్చినపాత్రను ధరించిన వారికి ఆపాత్రయందు కీర్తివచ్చెడిది. మఱియొకపాత్రను ధరించిన చెడిపోవు చుండెడిది. ఇదియే డైరెక్టరుల కుండవలసిన లక్షణము. తాతగారిని ఒకరు ఈవిధముగా ప్రశ్నించిరట 'శాస్త్రులవారూ, తాము నటులనుచూచి వారికి తగిననాటకములను వ్రాసితిరా? లేక నాటకములకు తగిననటులు, అదృష్టవశమున, మంచివారు, దొరకినారా? లేకున్న అంతచక్కగా ఆపాత్రలకు ఈ నటులు కుదిరిపోయినారేమండీ!' అని, పాత్రకు సరియైన నటుని గ్రహించినవారు శాస్త్రులవారు. భారతాభారతారూపక మర్యాదలను వ్యాసములో నిట్లువ్రాసియున్నారు.-

"నటులంగూర్చియు ఒకమాట చెప్పవలయును. నటునికి వాగ్మిత, దిట్టతనము, అనుకరణనైపుణి, సమగ్రనిజపాఠ్యపరిజ్ఞానమే కాక సమగ్రనాటక పరిజ్ఞానమును, ప్రజ్ఞయు వలయును.

"నటులను అర్హతంబట్టి పాత్రములకు నియమించినచో ఒజ్జలకు ప్రయాసముండదు. ప్రయోగము శోభిల్లును.

"పాఠ్యములో నటునికి ఒజ్జ ప్రతిశబ్దమును (ప్రతియక్షరమనియుం జెప్పనొప్పును) నేర్పవలయును. ఒద్దికలో నటులు గడిదేరినపిమ్మటనే ప్రయోగము కావింపవలయును. ఒండుచో నటులు నానావిధముల కవికిని, ఒజ్జకును అవమానముందెత్తురు."

చెకుముకిపాత్రను ధరించుటకు ప్రయత్నించుచు శిక్షనందుచుండిన శ్రీ కాళహస్తి సుబ్బయ్యశాస్త్రిగారికి తాతగారొకమా రిట్లు వ్రాసియుండిరి. The play will not be staged unless the actors are made to be thorough with their parts in every way. You should keep sound health, If necesssary Cod-liver oil will strengthen the voice. అని నటుల యారోగ్యాదివిషయములలోగూడ తాతగారు శ్రద్ధవహించుచుండిరి.

ఒద్దికలుకుదిరినవని తలంచినవెనుక నాటకప్రదర్శనమునకు ముందు ఒకమారు వేషములువేసి ఒద్దికలుజరుపువారు. తమ డైరిలో నొకమారు డ్రెస్సురిహార్సలు లేనందున నాటకము చక్కగా శోభిల్లలేదని వ్రాసికొనిరి.

1916 సం మున బొబ్బిలి యుద్ధనాటకమును క్రొత్తగా శాస్త్రులవారు రచించిరి. శాస్త్రులవారి నాటకములనేగాని ఇతరుల నాటకములను ప్రదర్శింపని ఈనట సమాజమునకు శాస్త్రులవారి క్రొత్తరచన అభిలషణీయమైనది. ఈకాలమునకు సమాజములో కొంత మార్పుకలిగినది. దొరస్వామయ్యంగారు చీలిపోయి ప్రత్యేకముగా నొక సమాజమును నిర్మించుకొనిరి. ఏవేవోనాటకములను ప్రదర్శించు కొనసాగిరి. ఆంధ్రభాషాభిమాని సమాజమునకు ఈనూతన నాటకమునకు నాయకపాత్ర థారి లేకపోయెను. ఐననేమి, ఎవరినైనను తయారు చేయగలిగిన తాతగారు వెంటనే దొరసామయ్యంగారి మేనల్లుడు శ్రీ సుందరరాజయ్యంగారిని ఆపాత్రకు సిద్ధముచేసిరి. రంగారాయ పాత్రకు సుందర రాజయ్యంగారు కుదిరినట్లు ఎవరును తర్వాత కుదరలేదు. ఆవెలమబీరమును వీరియందే చూడవలయును వీరిని రంగమందు చూచువారికి ప్రాచీనరాజపుత్రవీరులు జ్ఞప్తికివత్తురు. తర్వాత నాయకపాత్రలను ధరించి ప్రసిద్ధికి వచ్చినవారు బెంగళూరు రంగస్వామయ్యంగారు. తొలుత నాయికాపాత్రములను ధరించుచుండిరి. ముమ్మడమ్మ వేషము మొదలు యుగంధరపాత్రము వరకును అన్ని పాత్రలను వీరుధరించిరి. వీరియుగంధరాభినయము చాలశ్లాఘనీయమైనది.

ఈవిధముగా నిరంతరము శిష్యులచే నాటకము లాడించుచు తాతగారు 1925 సం వరకు నెల్లూరిలో నుండిరి. సమాజమున తొలుత నుండిన శిష్యులు కొందఱు గతించిరి; కొందఱు రోగులైరి. శ్రీ దొరసామయ్యంగారు అసహాయోద్యమమున పాల్గొని జైలునుండి విడుదలయైవచ్చిన యనంతరము జబ్బులోపడిరి. శాస్త్రులవారి సమాజమునుండి వేఱుపోయినను గురువర్యులపై భక్తివీడలేదు. మరల తొలుతటి సమాజమునకు రావలయుననియే వారియాశయము. అసహాయోద్యమమున పాల్గొని జైలుకు పోయినవెంటనే తాతగారికి జాబువ్రాయుచు నాటకమున ఖైదుచేయబడినది అబద్ధమనియు, తాము ఖైదై వాస్తవముగానే ప్రతాపరుద్రు డనుభవించినదశ ననుభవించు చున్నామని వ్రాసిరి. జైలునుండి విడుదలయై వచ్చినదినము సమాజమువారుపోయి వారిని ఊరేగింపుగా ఊరిలోనికి కొనివచ్చిరి. మాయింటివాకిట నిలిచి దొరసామయ్యంగారు లోనికివచ్చి తాతగారికి సాష్టాంగముగా నమస్కరించి 'శ్రీదయితుండు దానవులజెండి' అనుపద్యము, ప్రతాపరుద్రుడు విడుదలయైన వెంటనే యుగంధరుని పాదములవ్రాలి చెప్పునట్లు చెప్పి కన్నీరు కడవలునేడ్చిరి. తాతగారును ఏడ్చిరి. అప్పటికే దుర్బలులుగా నుండిన వారగుట దొరసామయ్యంగారిని చెంతనున్నవారు పట్టుకొని లేపవలసి వచ్చినది. తాతగారు ఆశీర్వదించి వీడ్కొనిరి. ఆతర్వాత చాలకాలము తాము బ్రదుకజాలమని దొరసామయ్యంగారికి తోచినది. ఒకమారు మరల దుష్యంత ప్రతాపరుద్రపాత్రల నభినయించి ఆవెనుక చనిపోవలయునని తమ యాశయమని తాతగారికి తెలుపగా వేంటనే తాతగారు వారిని మరల సమాజములో చేర్చుకొనిరి. ఆవెనుక కొన్నినాటకములు నెల్లూరిలో ప్రదర్శింపబడినవి. 1925 సం వచ్చుసరికి దొరస్వామయ్యంగారు, బంగారయ్యగారు, యరగుడిపాటి సోదరులు ఇంకను పలువురు గతించిరి. సమాజమునుండి కొందఱు లేచిపోయి ఆంధ్రసభలో చేరిరి. అంతట ఎక్కువకాలము సమాజము జరుగదని తలంచి తాతగారు రత్నావళీ నాటికను ప్రదర్శింపించి, సమాజమునకు 25 సంవత్సరములు నిండుటచే రజత మహోత్సవమును జరిపిరి. ఆవెనుక సమాజము అంతరించినది.


__________