వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/విజ్ఞాపనము

విజ్ఞాపనము

ఈజీవితచరిత్రను రచియించునుద్దేశము నాకు చిరకాలమునుండియు కలదు. శ్రీ తాతగారు జీవించియుండినపుడు నేనొకపరి బాస్వెల్ మహాశయవిరచిత డాక్టర్ జాన్సన్‌పండిత జీవితచరితమును చదివితిని. నాటినుండియు శ్రీతాతగారి భాషాసేవపై నాదృష్టి మరలెను. తమ జీవితచరితమునందలి విషయలను వారు నాకును తమ శిష్యబృందమునకు చెప్పునప్పుడు గ్రహించి గ్రంథస్థములంజేయుచు వచ్చితిని. వారు చనిపోవుటకు కొన్ని నెలలుముందు, ఒకపరి, చిరకాలముగా తమకడ పడియుండినజాబుల నన్నిటిని, కొన్నిటిని చింపియు, కొన్నిటిని చింపకయు పాఱవేసిరి. వెంటనే వానివల్ల నేను సేకరించుకొంటిని. శ్రీవారు పరమపదించినవెనుక వారి గ్రంథములను పఠించియు, తమ్ముగూర్చి వారు ఎచ్చటెచ్చట నేమేమి చెప్పుకొనియుండిరో వానినెల్ల సేకరించియు, వారికి వచ్చినజాబులను ఆధారముగా నుంచుకొనియు కాలానుక్రమణిక నేర్పఱచుకొని జీవితచరిత్రను అప్పుడప్పుడు వ్రాయుచు థ్యానించుచు నుంటిని. నెల్లూరిలో నామిత్రులును, తాతగారిశిష్యులును కొందఱు, నిరంతరము తమ గురువర్యులనే థ్యానించుచుండువారు, ఈవిషయమై శ్రద్ధ వహింపసాగిరి. అప్పుడప్పుడు సంభాషణలనడును తాతగారిచరిత్రనే ఒకరికొకరము చెప్పుకొనుచు మా యభిప్రాయములను దృడీకరించుకొనుచు వచ్చితిమి. పత్రికలలో నెవరో యొకరు వారింగూర్చి వ్యాసములు వ్రాయుచునేయుండిరి. వీనిలో మామిత్రులు శ్రీ దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారి 'సుమనస్మృతి' ప్రశంసనీయకావ్యము. నేనును కోరినవారికెల్ల విషయసహాయము చేయుచునే యుంటిని. భారతిలో 1936 సం., శ్రీతాతగారిచరిత్రను తొలిమారు సమగ్ర వ్యాసముగారచించి ప్రకటించితిని. కొంచె మించు మించుగా నాకాలముననే శ్రీధరణికోట వేంకటసుబ్బయ్యగారు, మేము ప్రకటించిన సాహిత్యదర్పణమున కుపోద్ఘాతముగా, నొకటి రచించిరి. ఆవెనుక శ్రీగుఱ్ఱము సుబ్బరామయ్యగారు 'శాస్త్రి సంస్మృతి'ని ప్రకటించిరి. ఇటీవలనే శ్రీ వంగోలు వేంకట రంగయ్యపంతులుగారు త్రిలిఙ్గపత్రికలో కొన్ని వ్యాసములు వ్రాసి వానినెల్ల నొక్కటిగా సంపుటీకరించినారు. నేను, గురుపాదథ్యానముగాను, సామాన్యవిద్యార్థులకు పఠనపాఠన యోగ్యముగానుండునట్లును, సమకాలికాంధ్రభాషాస్థితిని వర్ణించుచు సంగ్రహముగా నొకచరిత్రను వ్రాయసంకల్పించి, అనవసరములని నామదికిం దోచినవానిని వదలి ఈచిన్నిగ్రంథమును వెలువరించు చున్నాడను. మేమెల్ల నొకవిషయమునుగుఱించియే ఇట్లు వ్రాయుట గురుభక్తి పారవశ్యముచేతను, ఈవిధముగానే పలువురు వ్రాయవలయు ననుతలంపుచేతను. యుద్ధమువలని బాధలెల్ల నీగి, మనకు జయకాలము వచ్చి, ముద్రణ పరికరములెల్ల వెలలు తగ్గి అనుకూలించి, సమగ్రమైనచరిత్రను ప్రకటించు నవకాశము త్వరలో కలుగునుగాక. నేనీచరిత్రను ముద్రించి, మావారైన శ్రీఅల్లాడి కృష్ణస్వామయ్యగారికి చూపి 'ఎవరైననుపెద్దలు నాయీప్రయత్నము నాంధ్రపండితావళికి ఎఱుకపఱుచుట మంచిది' అని విన్నవింపగా వారు వెంటనే 'శ్రీకట్టమంచి రామలింగారెడ్డిగారు శాస్త్రిగారి శిష్యులలో నగ్రగణ్యులు. పైగా నపారమైన గురుభక్తిగలవారును. వారే ఇందులకుతగినవారు.' అని సెలవిచ్చి, వారు వచ్చినంతనే నాకు వారిదర్శనము తామే చేయించి నాప్రయత్నముం గూర్చి వారికడ ప్రశంసించిరి. శ్రీ రెడ్డిగారు తమకు సహజాలంకారమైన ఆదరాభిమానములతో 'మాగురువుగారి గ్రంథమునకు కాదనగలనా' అని తక్షణమే నాపుస్తకమునకు ప్రశంసావాక్యముల వ్రాయుట కంగీకరించిరి.

శ్రీ రెడ్డిగారు తాతాగారి శిష్యులలో మొదటిశ్రేణిలోనివారు. తాము కళాశాలలో నాంధ్రవిద్యార్థులు; తాతగారు సంస్కృతోపాథ్యాయులు. ఐనను తాతగారిగుణములచే నాకృష్టులై అత్యంతమిత్రులును ప్రియశిష్యులును నైరి. విద్యార్థిదశయందే రెడ్డిగారియందు భావిప్రతిభాస్ఫోరకము లైన చిహ్నములు శ్రీతాతగారు కనిపట్టుచువచ్చిరి. వీరి 'ముసలమ్మ మరణము'నకు పరీక్షకులలో తాతగా రొకరు. వీరిరచనాపరిపాటి ఇతరరచనల నధ:కరించి మిన్నగానుండుటంగని వీరికే బహుమాన మిప్పించిరి. శ్రీ రెడ్డిగారు ఆధునికాంధ్రవచనరచనావిథాతలలో నొకరు. వీరి కీశక్తి నన్నయ చిన్నయల నారాధించుటచే వచ్చినది. ఆంధ్రభారతపఠనాసక్తి వీరికి హెచ్చు; అదియే వీరి కభిమానగ్రంథము. తెనుగువచనగ్రంథములలో చిన్నయ తర్వాత శ్రీతాతగారి కథాసరిత్సాగరము వీరికి కడుంబ్రియము. మైసూరులో నుండుకాలమున కథాసరిత్సాగరము, అన్ని భాగములను, రెండుప్రతులు, ఒకటి ఇంటను, రెండవది కళాశాలలోను ఉంచుకొనియుండువారు. విరామసమయములలో వీనిని చదువుచుండువారు.

ఇట్టి, మారెడ్డిగారు తమకు అనారోగ్యమైనను, కార్యాధిక్యముచే నవకాశము లేకున్నను, శ్రీ తాతగారియందలి భక్తి చేతను, నాయందలి వాత్సల్యముచేతను, 'గురుపూజ' యని పేరిడి, నాగ్రంథమును ప్రశంసించుటలో క్రొత్తయేమి! శ్రీ రెడ్డిగారికి నేను నిరంతరము కృతజ్ఞుడనే.

అల్పజ్ఞుడనైన నామాటలకు, బాలభాషితమునకుంబోలె, సంతసించుచు, నన్నీరచనకు పురికొల్పుచుండిన మా నెల్లూరి మిత్రులకెల్లరకును వందనములు.

వే.వేం.
25-12-43
మదరాసు.