వృక్షశాస్త్రము/ద్రాక్ష కుటుంబము

పారకి:- పెద్ద తీగె. ఆకులపై నెత్తుగ మెత్తని రోమములు గలవు. పువ్వులకు తొడిమలు లేవు. కాయ నల్లగ నుండును. దీనిని తినవచ్చును.

గోటి:- చిన్న చెట్టు. ఆకులు కొంచము గుండ్రముగ నుండును. అంచున సన్నవి రంపపు పండ్లు గలవు. వానిపై మెత్తని రోమములు గలవు. దీని కలప నారింజ రంగుగను గట్టిగా నుండును.


ద్రాక్ష కుటుంబము

ఇది యొక చిన్నకుటుంబము. ఇందులోని మొక్కలు చాల భాగము నులి తీగెలమూలమున బ్రాకునవియె. ఈ నులితీగె లాకుల కెదురుగనున్నవి. ఇవి ప్రకాండము యొక్క మారు రూపములు గాని యాకుల యొక్క మారు రూపములు గావు. ప్రకాండము పలకలుగా నుండును. ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు. వృంతము మీదను కొన్నిటిలో నులి తీగెలు గలవు. అది పూర్తిగ నట్లు మారుటయు గలదు. పుష్పములు మిధునములే కాని, కొన్నిటిలో మాత్ర మేక లింగ పుష్పములున్నవి. ఆకర్షణ పత్రములు నాలుగో, అయిదో యున్నవి. అవి మొగ్గలో నొక దాని నొకటి తాకు చుండును. కింజల్కములు ఆకర్షణ పత్రము లెన్ని గలవో, అన్నియే యున్న వి. ఇవి వాని కెదురుగా నుండును. వీని మధ్య నొక పళ్ళెరము కూడ గలదు. అండాశయము నందు గదులు ఆరు వరకు గలుగు చుండును. కొన్నిటిలో కీలము పొట్టిగా నున్నది. కొన్నిటిలో నది లేదు. ఫలము కండకాయ.

ద్రాక్ష.

ద్రాక్షతీగెలు:- విరివిగా శీతల దేశములలో బెరుగును. వానికి తేమగాలి కూడదు. చెన్న రాజ్యమునందు వాని పంట మిక్కిలి తక్కువ. మన దేశము యొక్క యితర భాగములలో నచ్చటచ్చట బెంచు చున్నారు. ద్రాక్షపండ్లలో చాల రకములు గలవు. తీగెలను విత్తుల మూలమున గాక, కొమ్మలను గోసి, వానిని పాతియే పైరు చేసెదరు. ఒక యడుగు పొడుగుగా నున కొమ్మ మీద సుమారు నాలుగైదు మొగ్గలుండ వచ్చును. కొమ్మలను అడ్డముగా బాతిన తరువాత అమొగ్గలే మొక్కలుగా వచ్చును. అవి సుమారు తొమ్మిది అంగుళములు ఎత్తుగా నున్నప్పుడు వానిని దీసి, జనుముతో దమ్ముచేసి, ఎరువు వేసిన తోటలలో బాతుదురు. వానికి నాలుగైదు దినముల కొక మారు నీళ్ళు పోయుదురు. ఎదిగెడుతీగెలు ప్రాకుటకు దగ్గరనేమైన పాతవలెను. తరుచుగా బాడిద కొ మ్మలను బాతుచున్నారు. 5 అడుగులెత్తు ఎదిగిన తరువాత తీసి గెల చివరను కత్తరింతురు. అందుచే ప్రక్కల నుండి కొమ్మలు బయలు దేరును. వీనిలో కొన్నింటిని మాత్రముంచి మిగిలిన వానిని కత్తరించి వైతురు. కత్తిరించిన నాలుగైదు వారములకు పువ్వులు పూసి కాయలు కాయ నారంభించును. పూసినప్పటినుండియు నీరు పోయ వలెను.

అంగళ్ళ యందు ఆమ్ము కిసిమిసిపండ్లు ద్రాక్ష పండు వేరు వేరు రకములు. ఈ పండ్లను ఔషదములలో వాడు చున్నారు. వీని నుండి సారాయి బ్రాందిని కూడ దీయుదురు.

నల్లేరు:- చెట్టు మీద బ్రాకు చుండును. దీనికిని నులి తీగలు గలవు. ప్రకాండము ఆకు పచ్చగ నున్నది. లేత కొమ్మలను ముక్కలు ముక్కలుగా గోసి, ఎండ బెట్టి నీళ్ళలో గాచి ఆ ముక్కలను రెండు మూడు మారులు సున్నపు నీటిలో కూడ కాచుదురు. అప్పటికి వాని దురద పోవును. ఆ మందును పంచదార నీళ్ళలో కలిపి, అజీర్ణమును బోగొట్టుటకు నిత్తురు. కొన్ని జబ్బులకు నల్లేరుతో పడియములు బెట్టి వానిని అన్నములో గలుపుకొని తిందురు.

బఱ్ఱిబచ్చల:- చాల చోట్లనే పెరుగు చున్నది. దీని ఆకులను గాచి కురుపులకు త్వరగా చితుటకు పట్టు వేయుదురు. మారాటతీగె:- అడవులలో జెట్ల మీద బ్రాకు చుండును. ఆకులకు కణుపు పుచ్ఛములు గలవు. ఎఱ్ఱని చిన్న చిన్న పువ్వులు పూయును.

కనపతీగె:- బల్ల పరుపుగా నుండును. వువ్వులు తెలుపు.


కుంకుడు కుటుంబము

కుంకుడుచెట్లు మనదేశములో జాలచోట్ల బెరుగుచున్నవి.

ఆకులు:- మిశ్రమ పత్రములు. ఒంటరి చేరిక. కణుపు పుచ్ఛములు లేవు. చిట్టి యాకులు మూడో, నాలుగో అయిదో యుండును. సమాంచలము. విషమ రేఖ పత్రము. దట్టముగాను బిరుసుగాను నుండును. కొన సన్నము. ఒక్కొక్కప్పుడు ఖనితము.

పుష్పమంజరి:- కొమ్మల చివరల నుండి రెమ్మ గెలలు. తెల్లని చిన్న పువ్వులు. చేటికలు గలలవు. పువ్వులకు వాసన లేదు.

పుష్పకోశము:- రక్షక పత్రములు 5 సమముగా నుండును, నీచము

దశవలయము:- 5 ఆకర్షణపత్రములు, సమముగానుండును. పైన రోమములు గలవు.

కింజల్కములు:- 8 పొట్టివి. కాడల యడుగున రోమములు గలవు. పుప్పొడి తిత్తులు 2 గదులు, కింజల్కముల చుట్టు పళ్ళెరము గలదు.