వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/నగజకు నెఱుకఁ దెలుపుట

నగజకు నెఱుకఁ దెలుపుట

190-క.
కడకంటఁ గరుణ వొడమఁగ
బడఁతుక సఖు లెందఱేనిఁ బరివేష్టింపన్
మృడుసతియును నెఱుకతతో
నడిగిన కృత్యంబు చెప్ప నగు గతిం గలదే.
191-వ.
అని పలికి హిరణ్య మణి మరకత వజ్ర వైడూర్య ఖచితంబు నగు విలసి తాసనంబునం గూర్చుండి “దేవేంద్ర కమలసంభవ నారాయణ ప్రముఖు లైన దేవతలు నెఱుంగరు భవదీయ చిత్తంబున నేది యేనియుం దలంపు చెప్పెద నదియునుం గాక విను” మని యి ట్లనియె.
192-సీ.
“చింతించి యా బ్రహ్మ సృష్టిఁ బుట్టించుచోనెలనాఁగ! ననుఁ గాంచి యెఱుక లడిగె
నగములు సాధింప నగభేది రావించియెలనాఁగ! ననుఁ గాంచి యెఱుక లడిగె
దనుజుల నిర్జింప దనుజారి పోవుచోనెలనాఁగ! ననుఁ గాంచి యెఱుక లడిగె
మఱి హలహవహ్ని దెరలి వేల్పుల మూకయెలనాఁగ! ననుఁ గూర్చి యెఱుక లడిగె
ఆ. పరమమునులు యతులు పరమయోగీంద్రులు
సభల మున్ను నన్ను సంతసమున
నెఱుక లడిగె కాదె యెల్ల శుభంబులు
గలిగి యుండు టెల్ల కమలనేత్ర!”
193-వ.
అని మఱియు సముచితాలాపంబులు పలుకఁ పరమయోగీంద్రు ప్రోడం గనుంగొని “యొక తలంపు దలంచెదఁ జెప్పు” మని కనకమయ పాత్రంబున ముక్తాఫలంబు లమరించి వానిం జూచి భావంబున ని ట్లని తలంచె.
194-సీ.
“నగరాజుపురమున నా కెన్ని దినములునిశ్చయంబుగ నేను నిలువవలయు
నటమీఁదఁ దడసిన నడవులలోపలశివునికై తప మెంత సేయవలయు
తపము గావించినఁ దాపసాధీశ్వరుండమరంగ నెంతకాలమున మెచ్చు
మెచ్చిన పిమ్మట మీనధ్వజారాతికేలిచ్చి నన్ను నే క్రియ వరించుఁ
ఆ. దప్పకుండఁ జెప్పు ధర్మదేవత! యని
యబల చెలులతోడ ననుమతించి
తలఁపు తథ్యమేని తలకొని చెప్పుమా”
యనుచు నిజము గోరి యద్రిపుత్రి.
195-వ.
ఇట్లు నియమింపఁ దలచిన.
196-ఆ.
“నాకు వాకు వచ్చె నలినాక్షి రమ్మిటఁ
గరము దెమ్ము నాదుకరము వట్టి”
యనుచుఁ బ్రేమతోడ నడల ప్రాణిగ్రహ
ణమ్ముఁ జేసెఁ గపటనాటకుండు.
197-క.
ఒకమాటు గరము లంటుచు
నొకమాటు లతాంగి చిత్త మూరించుచు వే
ఱొకమాటు కుచము లంటుచు
ప్రకటించుచు నెఱుక చెప్పెఁ బార్వతీసతికిన్.
198-సీ.
“హరుఁ గూర్చి తలఁచితి వంబుజలోచన!తలఁపు లన్యులమీఁది తలఁపుగాదు
శైలాధిపతి యింట సతి వసించెద నన్నఁ దలఁపు వేడ్కలమీఁది తలఁపుగాదు
ఘోరాటవులలోనఁ గ్రుమ్మరియెద నన్నతలపు వేఱొకచోటిఁ తలఁపుగాదు
పరమేశు నర్చించి భార్య నయ్యెద నన్నతలఁపు లెవ్వరిమీఁదు తలఁపుగాదు
ఆ. కాదు నిశ్చయంబు గంగాధరునిమీఁది
భక్తి గలదు నీకు భరిత మగుచు
నాతి! నీ తలంపు నా మాటయును నేక
మగుట యెల్లఁ దలఁపు మంబుజాక్షి!
199-వ.
అదియునం గాక.
200-క.
నా కేమి మెచ్చు వెట్టెదు
నీకున్ సిద్ధించు మేలు నిర్ణయమై నా
వాకునకఁ దోఁచుచున్నది
వీఁకను నెఱిఁగింతు నీకు విమలేందుముఖీ!”
201-వ.
అనిన విని పార్వతీదేవి యి ట్లనియె.
202-క.
“మణికేయూరము లిచ్చెద
మణితాటంకంబు లిత్తు మంజులవాణీ!
మణులుం గనకమము లిచ్చెద
మణికోటీరములు నీకు మఱియు న్నిత్తున్.”
203-వ.
అనవుడు న క్కపట వెలఁది యి ట్లనియె.
204-క.
“మణికేయూరము లొల్లను
మణితాటంకంబు లొల్ల మంజులవాణీ!
మణులుం గనకము లొల్లను
మణికోటీరంబు లొల్ల మన్నన లొల్లన్.
205-క.
ననుఁ గూడి తిరుగ నొసఁగుము
ధనములు నా కేమి సేయు ధనములు వేలున్
నినుఁ గూడి యుంటఁ బోలునె”
యనవుఁడు “నగుగాకఁ జెప్పు” మని సతి యనియెన్.
206-వ.
అనవుడు నా ప్రోడ యి ట్లనియె.
207-సీ.
“కువలయలోచన! కొన్నిదినంబులుకొండలరాజింట నుండఁ గలవు
ఉండి వనంబున నువిదతో నేఁగియుశివునికై తప మర్థిఁ జేయఁ గలవు
తప మర్థి జేసినఁ దరళాక్షి! నినుఁ గూర్చిమీనాంకవైరియు మెచ్చఁ గలఁడు
మెచ్చి సంభావించి మీ తండ్రి యింటనువేడుక నినుఁ బెండ్లియాడ గలఁడు
అ. అమరఁ బెండ్లియాడి యర్థాంగలక్ష్మి వై
సకల భువన రాజ్య సంపదలను
గలిగి మోము లాఱు గల సుతుఁ గాంచి మో
దమున నుండగలవు ధవళనేత్ర!”
208-వ.
అని మఱియును.
209-ఆ.
“నిన్నుఁ బొందఁ దలఁచి నెలఁత యువ్వీళ్ళూరు
చున్న వాఁడు శంభుఁ డుగ్రమూర్తి
శంకరుండు భవుఁడు శాశ్వతుం డఖిలాండ
చక్రవర్తి యైన చంద్రధరుఁడు.
210-వ.
ఇందేల యున్నదానవు వనవాస ప్రయాణంబు చేసి పరమేశ్వరు నేలుకొమ్ము నీకుం గానరాఁడు పరమేశ్వరుండు వీఁడే నినుఁ జూచి పోవుచున్నాఁడు నిశ్చయం” బని చెప్పి వీడ్కొని తన పూర్వ ప్రకారంబుఁ దాల్చి కైలాసంబునకుం జనియె నంత న చ్చెలియు నొక్కనాఁడు తన మనంబున ఖండేందుభూషణుం దలఁచి కామమోహావేశంబున ని ట్లని తలపోయం దొడంగె.
211-ఉ.
“లోలత నాకు వల్లభుఁడు లోఁబడి తప్పి సమాధినిష్ఠ మై
సోలెడి కాయముం గరఁగఁ జూచుచు నుండు సుఖంబు గాన శ్రీ
శైలనివాసు నొద్దఁ బరిచర్యలు సేయఁగ లేదు చెల్లరే
మేల్కొనఁ గూడి కూడి యిటు మిన్నక పోయె నిఁకేమి చేయుదున్.
212-సీ.
వినరమ్మ నా మాట విశ్వేశ్వరునిఁ బాసినిలువంగ నేరనో నెలఁతలార!
నాగేంద్రధరుమీఁద నా కోరికలు పర్వి పాయంగ నేరనో భామలార!
వలరాజు వెసఁ దోఁచి యలరుల బాణంబులేసి నొప్పించెనో యింతులార!
నగముల రాజుతో నా ప్రకారం బెల్లఁదెలియంగఁ జెప్పరే తెరవలార!
ఆ. రమణులార నిలువరా దింకఁ దాపంబు
సరసిజాక్షులార! సైఁపరాదు
ఒక్క దినము గడచు టొక్క వత్సరము దాఁ
గడచు టయ్యె నాకుఁ గాంతలార!
213-ఉ.
బాలశశాంకభూషణునిఁ బాసి చరించుట దుస్తరంబు నీ
లాలకలార! చంద్రముఖులార! తపోవనభూమిలోపలన్
జాల తపంబు చేసి హరు శంకరు సన్నిధిఁ గాంతు నింక మీ
కేల విచారముల్ హిమనగేంద్రునితో వినుపింతు నింతయున్.”
214-వ.
అని నిశ్చయంబు చేసి.
215-మ.
చెలులుం దానును గూడి వచ్చి కడఁకన్ శీతాచలాధీశ్వరున్
లలనారత్నము గాంచి మ్రొక్క విన యాలాంపబులన్ శీతలా
చలుఁడున్ మన్నన చేసెఁ జేసెడి తఱిన్ జంద్రాస్య హస్తంబుజం
బులు ఫాలంబునఁ జేర్చి పల్కె వినయంబున్ భక్తియిన్ రంజిలన్
216-క.
“ఘనసార పుష్ప చందన
కన కాంబర భూష ణాది ఘన వైభవముల్
మన యింట నేమి గొఱఁతయుఁ
గనుఁగొనఁగా రాదు మిగులఁ గలవు గిరీంద్రా!
217-వ.
అట్లయినను.
218-మ.
శివదేవుం దలపోయఁ జొచ్చు నభవున్ జింతించు దేవేశ్వరున్
ధవళాంగుం ఫణిరాజకంకణధరున్ దర్కించుఁ గాంక్షించు వై
భవముం జేయదు నా మనంబు దప మొప్పం జేసి నీ పంపునన్
భువనాధీశ్వరు గాంచి వత్తు ననుచున్ భూమిధరేంద్రోత్తమా!
219-ఆ.
ఏమి చెప్ప నేర్తు నే నేమి సేయుదు
నా వశంబు గాక నా మనంబు
లోకనాథుఁ దవిలి లోఁబడి పాయదు
భ్రాంతిఁ దపము సేయఁ బనుపు మయ్య!
220-శా.
అయ్యా! సిద్ధము దాఁటరాదు మదిలో నాలింప మీ యానతిన్
నెయ్యం బొప్పఁగ మీరు నన్ బనుపఁగా నే నిష్ట మై యుంట యొ
ప్పయ్యెన్ వే ననుఁ బంపు” మన్న విని య త్యానంద చిత్తంబుతో
ధీయుక్తిం గిరిరాజు కూర్మి తనయన్ దీవించి కీర్తించుచున్.
221-మ.
“సతి! నీ వాక్యము వేదవాక్యము సుమీ చంద్రాస్య యాతండె పో
గతి యంచున్ దన నాథు నేడు గడయుంగాఁ జూచి సేవింపఁగా
ధృతి మై నుత్తమ కన్య యండ్రు మృగనేత్రిం గన్న యా తండ్రియున్
మతిలో సజ్జన మాన్యుఁ డంచు జగముల్ మన్నించుఁ గాంతామణీ!
222-మ.
త్రిదశారాధిత వై జగజ్జనని వై దేవేంద్రసంపూజ్య వై
మదనారాతికిఁ బ్రాణవల్లభవు నై మాయా ప్రపంచాత్మ వై
మది మోదించిన నీవు కూఁతురవు నై మన్నించి తీ పెంపు చా
లదె పుణ్యాత్ముఁడ నైతి నీ కరుణఁ గళ్యాణీ! కృపాంభోనిధీ!
223-క.
వనితా! నా విన్నప మిది
వినుము మది న్నీకుఁ బోవ వేడుక పుట్టెన్
దనరఁగ నీ వేడుక మై
నయమున వర్తించు” మనుచు నగపతి పల్కెన్.
224-వ.
ఇట్లు పలుకు వల్లభుఁ జూచి య గ్గిరీంద్రవల్లభ యగు మేనకాదేవి గౌరీదేవి కి ట్లనియె.
225-క.
“ఏమియుఁ గొఱఁత దపోవన
భూములలోఁ దపము సేయఁ బోయెద ననుచు
న్వేమరు భాషించెద వో
భామా! నిన్నడవి కెట్లు పంపుదుఁ జెపుమా.
226-క.
వాలాయించి వనంబుల
నే లమ్మ! తపంబు సేయ నిభకుంభకుచా!
హాలాహలభక్షుఁడు మన
లీలావన భూము లందు లేఁడే చెపుమా.
227-క
లలనా! వనభూములలో
మలహరు వెదుకంగ నేల మంజులవాణీ!
వలచిన చోటనె శంభుఁడు
గలుగుట సందేఙ మమ్మ కంజాతమఖీ!
228-క.
నీ ముద్దులు నీ మాటలు
నీ మధు రాలాములును నీ మురిపంబుల్
రామా! చూచిన పిమ్మట
నా మది యెట్లుండ నేర్చు నలినదళాక్షీ!
229-సీ.
గంగావతంసునిఁ గరము మజ్జన మార్పగంగాజలంబులు గలవు మనకు
ఘననాగకంకణుఁ గరమ మలంకారింపఘన కంకణంబులు గలవు మనకు
గంధేభదనుజారిఁ గఱకంఠు నలఁదింపగంధంబు లెన్నియుఁ గలవు మనకు
అలరుసాయకవైరి నలరించి పూజింపనలరు లెన్నెన్నియొ కలవు మనకు
ఆ. మఱియు నేమి యైన మలహరుఁ బూజింపఁ
గమలనేత్ర! మనకు గలిగి యుండఁ
గాననముల కేఁగఁ గలకంఠి! యే లమ్మ!
వనము లేడ? ముగ్ధవనిత లేడ?”
230-వ.
అనవుఁడు కుమారీతిలకంబు తల్లి కి ట్లనియె.
231-శా.
“తల్లీ! శంభుఁడు లేని చోటు గలదే తర్కింప సందేహమే
ముల్లోకంబులు శంభుఁ డంచుఁ జదువుల్ మ్రోయంగ నెవ్వారికిన్
చెల్లింపం దగ దమ్మ యిండ్లఁ దపముల్ చిత్తంబు రెండై ఫలం
బెల్లం జేరకపోవుఁ గాక జననీ యెన్నెన్ని మార్గంబులన్.
232-క.
తా మరిగిన చిత్తములోఁ
దామరుగుఁ జుమీ లతాంగి తద్దయుఁ బ్రీతిన్
తా మరుగని చిత్తములో
తామరుగఁడు పాయుఁ గాని తామరసాక్షీ!
233-క.
తను వలచినఁ దను వలచును
దను వలువక పాసి యున్నఁ దను వలువఁ డిలన్
దనదు పటాటోపంబులు
తన మాయలు పనికి రావు తథ్యము తల్లీ!
234-క.
చని కందమూలఫలములు
తిని వనటలఁ జాల డస్సి ధీరాత్మకు లై
వనములఁ దపములు సలిపెడు
వనవాసులు వెఱ్ఱు లమ్మ వారిజనేత్రా!
235-క.
ఆరయ నీ లోకంబుల
మీ రెఱుఁగని పనులు గలవె మీకును దగవుల్
వారక చెప్పెడు దాననె
యేరూపం బైన నుద్ధరింపుఁడు నన్నున్.
236-వ.
అనుచున్న గౌరీదేవి పలుకులు విని గిరీంద్రశేఖరుండు మేనకా దేవియుం దానును సంతసిల్లి “ దేవి యింక మాఱుమాటలు పలుక వెఱతుము భవదీయ మనోరథంబు లెల్ల నమోఘంబు లై ఫలించుఁ గాక” యని కీర్తించి దీవించి వనవాస ప్రయాణంబునకుఁ దల్లిదండ్రు లనుమతించిన.