వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము/అమరావతీ వర్ణనము

అమరావతీ వర్ణనము

31-సీ.
కొమరొంది పొడవైన గోపురంబులచేతఁదనరారు దివ్యసౌధములచేత
బహు రత్న కాంచన ప్రాసాదములచేతఁగమనీయ విపణిమార్గములచేత
పుణ్యజనావళిచే బృందార కాప్సరోగంధర్వ కిన్నర గణముచేత
బహు విమానములచే బహు వాద్యములచేతబహువనాంతర సరః ప్రతతిచేత
ఆ. పసిఁడికొండమీఁద బహు వైభవమ్ముల
లలిత దేవరాజ్యలక్ష్మి మెఱసి
సకల భువనభవన చారుదీపం బైన
పట్టణంబు వజ్రి పట్టణంబు.
32-వ.
కనుంగొని యనంత వైభవంబున న న్నగరంబు ప్రవేశించి గోవింద నందనుం డసమాన సుందరుం డై చనుదెంచుచున్న సమయంబున.
33-ఉ.
ఓలి నలంకరించుకొని యొండొరు మెచ్చని వైభవంబునన్
గ్రాలుచు మేడ లెక్కి యమరావతిలోఁ గల కన్నె లందఱున్
సోలుచు జాలకావలులఁ జూచుచు “నో సతురార యీ రతీ
లోలునిఁ గంటిరే” యనుచు లోలత నప్పుడొకర్తొకర్తుతోన్.
34-సీ.
“కమనీయసంఫుల్లకమలాక్షి యీతఁడేకామినీమోహనాకారధరుఁడు
సలలితసంపూర్ణచంద్రాస్య యీతఁడేబిరుదుగ గండరగండ బిరుదువాఁడు
ఘనతరమదమత్తగజయాన యీతఁడేపంచబాణంబుల బహుళయశుఁడు
కొమరారునవపుష్పకోమలియీతఁడేమగువల మగవలను మలచు జెట్టి”
ఆ. యనుచుఁ జూచి చూచి యంగజు నాకార
సరసిలోన మునిఁగి జాలిఁగొనుచు
నొనర గోడవ్రాసినట్టి రూపంబుల
కరణి నుండ్రి దివిజకాంత లెల్ల.
35-వ.
అంత న ద్దేవేంద్రు మందిరంబు చేరం బోయి.
36-ఉ.
సంగడిఁ గోయిలల్ సందడి వాయుచుఁ జంచరీకముల్
మంగళగీతముల్ చదువ మానుగ రాజమరాళ సంఘముల్
చెంగట రాఁగ వాయవుని శ్రీమొగసాల రథంబు డిగ్గి యా
యంగసంభవుండు చొచ్చె నమరాధిపుకొల్వుఁ బ్రమోదమగ్నుఁ డై.
37-వ.
ఇట్లు దివ్యాస్ఠానమంటపంబు దరియం జొచ్చి.
38-సీ.
అతి మోహనాకారుఁ డై వెలింగెడువానినభినవశృంగారుఁ డైనవాని
కడిమిమై నాకలోకంబు నేలెడువానినొడలెల్లఁ గన్నులై వెలయువాని
పొలుపారఁ గేలఁ దంభోళి యొప్పెడువానినత్యంత వైభవుం డైనవాని
కేయూర కంక ణాంకిత బాహువులవానిని మ్మైన మణికిరీటమ్మువాని
ఆ. గరుడ సిద్ధ సాధ్య గంధర్వ కిన్నర
భుజగపతులు గొలువ పొలుపుమిగిలి
తేజరిల్లువాని దేవేంద్రుఁ బొడఁగాంచి
సమ్మదమున నంగసంభవుండు.
39-వ.
ఇట్లు పొడఁగాంచి నిరుపమ నయ వినయ భయజనిత మానసుండై నమస్కారంబు చేసిన కుసుమసాయకం గనుంగొని విపుల ప్రమోదంబున నెదురు వచ్చి వలదు తగ దని బాహు పల్లవంబుల నల్లన యెత్తి పలు మాఱు నందందఁ గౌఁగలించుకొని దేవేంద్రుఁడును నతులిత తేజో మహి మాభిరామ కనక మణి గణాలంకార సింహాస నాసీనుం జేసి మఱియు నొక్క దివ్య హారంబు సమర్పించి మహనీయ మధుర వచనముల ని ట్లనియె.
40-క.
“చనుదెంచితె కుసుమాయుధ!
చనుదెంచితె పంచబాణ శబరవైరి!
చనుదెంచితె కందర్పక!
చనుదెంచితె యెల్ల పనులు సన్మోదములే.”
41-వ.
అని మహేంద్రుం డడిగిన నంగసంభవుం డి ట్లనియె.
42-ఉ.
“ఓ మహిత ప్రతాప భువనోన్నత! మీరు గలంత కాలమున్
నేమి కొఱంత సమ్మదము నిప్పుడు నన్నుఁ దలంపఁ గారణం
బేమి సురేంద్ర నీ తలఁచునంతఁ గృతార్థుఁడ నైతిఁ జాలదే
నీ మదిలో ననుం దలఁప నేఁ డొక కార్యము నీకుఁ గల్గెనే.”
43-వ.
అనిన విని పురందరుం డిందిరానందనున కి ట్లనియె.
44-ఉ.
“నీ భుజదండ విక్రమము నీ మహిమాతిశయాభిమానమున్
శోభితకీర్తి మైఁ గలుగఁ జోకిన కార్యము మమ్ము జోకెఁబో
నాభరమైన కార్యముల నారయ నెవ్వరి భార మయ్య యో
శోభితమూర్తి యో భువనసుందర యో గురుధైర్యమంద!
45-క.
నీకును భారము గా దేఁ
జేకొని యొనరింతిఁ గాక చెప్పెద నొకటిన్
లోకంబుల వారలకును
నాకులకును నీవు మేలొనర్చుట సుమ్మీ.
46-క.
వారిజగర్భుని వరమున
దారకుఁ డను దానవుండు తద్దయుఁ గడిమిన్
గారించె నఖిల జగములు
పోరం గడతేరఁ డెట్టి పురుషులచేతన్.
47-క.
పురహరునకు నద్రిజకును
బరఁగం బ్రభవించునట్టి బలియుఁడు వానిం
బరిమార్చు నద్రి కన్యకఁ
బురహరునకుఁ గూర్చి కీర్తిఁ బొందుము మదనా.!
48-సీ.
ఇది యెంతపని నీకు నిందిరానందన!తలఁపులోపలఁ బేర్మిఁ దలఁతుగాక
తలఁచి నీ భుజదండ దర్పంబు శోభగొనకొని మము వీడుకందుగాక
కొనిన బలంబులు కొమరారఁగాఁ గొల్వభూతేశుపై దండు బోదుగాక
పోయి విజృంభించి పారి నారి సారించితీపుల విల్లెక్కు దీతు గాక
ఆ. తిగిచి పువ్వుటమ్ము తెఱఁగొప్ప సంధించి
విశ్వనాథుమీఁద విడుతుగాక
విడిటి కలఁచి నేర్చి విశ్వేశు మృడుకేళి
యేర్పడంగ గిరిజ కిత్తుఁ గాక.”
49-వ.
అని ప్రియంబులు పలుకుచున్న పురందరుం గనుంగొని కందర్పుం డి ట్లనియె.
50-శా.
“ఓహో! యీ పని నన్నుఁ బంపఁ దగవా యూహింప నాకున్ శివ
ద్రోహం బిమ్మెయిఁ జేయఁగాఁ దగునె యీ ద్రోహంబు గావింపఁగా
నాహా! వ ద్దని మాన్పఁబట్ట కిది చేయ న్మీరు పొమ్మందురే
మోహాతీతుఁడు శంభుఁ డాతనికి నే మోహంబు లే దెమ్మెయిన్.
51-క.
కొలఁది లేదు పేర్చి కోపించెనేని వి
రించినైన శిరము ద్రెంచి కాని
విడువకున్న బిరుదు విన్నాఁడ వెన్నాడ
నభవు జేర వెఱతు నమరనాథ!
52-క.
తలఁపులు మఱపులు దమలో
పల మఱచి విరాళవృత్తిఁ బరమేశుఁడు దా
గలఁ డని లేఁ డని యెఱుఁగరు
సురలఁ గడచినట్టివాఁడు సొరఁ జొరవేదీ.
53-క.
ఆరయ నేకాంతస్థలిఁ
జేరంగా రాదు నాకుఁ జేరఁగ దరమే
ఆరయ నేకావస్థలఁ
జేరి వెలుంగొందు నాకుఁ జేరం దరమే.
54-వ.
అదియునుం గాక.
55-సీ.
పుండరీకాక్షుని పుత్రుండ నై నేనునిభచర్మధరునిపై నెట్లు వోదు
పోయిన న ద్దేవు భూరి ప్రతాపాగ్నినెరయంగ నా తేజ మెందు మోచు
మోచిన పరమేశుమూర్తి యేఁ గనుఁగొనియెదిరి విజృంభించి యెట్లు వత్తు
వచ్చిన మా తండ్రి వావిరిఁ గోపించియే చూపు చూచునో యేను వెఱతు
ఆ. వెఱతు నయ్య యెన్ని విధములఁ జెప్పిన
కొలఁది గాదు నా కగోచరంబు
నిక్క మి వ్విధంబు నీ యాన దేవేంద్ర!
మృగకులేంద్రు నోర్వ మృగము వశమె.”
56-వ.
అనవుడు రతీమనోహరునకు శచీమనోహరుం డి ట్లనియె.
57-ఆ.
“పొందుగాని పనికి పొమ్మందునే నిన్ను
నింత చింత యేల యిట్టి పనికి
దర్పచిత్తుఁ డైన తారకాసురు చేతి
బాధ మాన్పి కీర్తిఁ బడయు మయ్య!”
58-సీ.
జగములోపలఁ గల జంతు రాసులఁ బట్టిమనసులఁ గలచు నీ మహిమ మహిమ
నాటుచో గంటు గానఁగరాక వాడి యైసరిలేక నాటు నీ శరము శరము
పరమేష్టి సృష్టి లోపలి పురుషుల కెల్లదీపమై వెలుఁగు నీ రూపు రూపు
అఖిలంబు నెందాఁక నందాఁక నందమైపృథుతరం బైన నీ బిరుదు బిరుదు
ఆ. శూలి నైనఁ దాపసుల నైన బాధింతు
గాలి నైన నెట్టి ఘనుల నైన
గలదె నీదు పేర్మి ఘనత తక్కొరులకు
నిన్నుఁ బోల వశమె నిరుపమాంగ!
59-క.
ఒప్పని పని కేఁ బంపను
ఒప్పుగఁ బుష్పాల పూజ లొనరించు గతిన్
గప్పుము దేవర శిరమును
నిప్పుడు నీ పుష్పశరము లింతే చాలున్.“
60-శా.
లోకాధీశుఁడు శూలి నిన్నుఁ గనినన్ లోకోపకారార్థి యై
యీ కాత్యాయనిఁ దన్నుఁ గూర్పఁ దనపై నేతెంచినాఁ డంచు దా
నే కీడుం దలపోయకుండు నలుగం డీ మాట సిద్ధంబు నీ
కీ కార్యం బవలీల గా నెఱుఁగుమీ యేపారఁ గందర్పకా.
61-క.
ఇట్టి విధంబులు చెప్పిన
నెట్టన నినుఁ బోఁటివాఁడు నెరబిరు దైనన్
ఘట్టనఁ గావించెద నని
బెట్టిదములు పలుకుఁ గాక పిఱికియు నగునే.
62-క.
ఎంత పని యైన మైకొని
పంతంబునఁ జేయు నీవు భయమున నకటా
చింతించెదు పలుమాఱును
చింతించుట నీకుఁ దగదు చిత్తజ! వినుమా.
63-సీ.
కలకంఠ గణముల కలనాదములతోడఁగలహంసనాదంబులు గడలుకొనఁగ
అరయ డాకాలి పెండెరము నాదమ్ముతోఝంకారనాదంబు జడికొనఁగ
భూరి సుందర రాజకీర నాదములతోవెడవింటి నాదంబు సుడిగొనంగ
నందంద చెలరేఁగి యార్చు నాదములతోశర వేద నాదంబు జడలుకొనఁగ
తే. కలిసి వెన్నెల గాయంగఁ గమ్మగాలి
యెలమి వీవంగఁ బూవింటి నెక్కి ద్రోచి
శరము సంధించి యేయుచో శంకరుండు
కలఁగు నంగజ మమ్మెల్ల గావు మయ్య.
64-వ.
అని మఱియును బ్రియంబును కఱకును దొరల నాడు దేవేంద్రు వచనంబు వచనంబులకు విహ్వలీకృత మానసుం డై కొంత ప్రొద్దు విచారించి యెట్టకేలకు నొడంబడి “సురేంద్రా! భవదీయ మనోరథంబు సఫలంబుఁ జేసెద” నని పల్కి మఱియు ని ట్లనియె.
65-ఉ.
“బంటుతనంబు పెంపెసఁగఁ బచ్చనికార్ముక మెక్కువెట్టి యా
యొంటరి యాన యట్టి శివ యోగసముద్రము నాదు కోలలన్
రెంటలు చేసి శీఘ్రమున నిక్కముగాఁ జలికొండకూతు పు
ట్టింటికి గౌరి వెటఁ జన నీశునితోఁ బఱతున్ సురాధిపా!”
66-వ.
అనిన విని పురంద రాది దేవ గణంబులు బహు ప్రకారంబుల నంగజాతుని వినుతించి వీడ్కొల్పిన నత్యంత కర్మపాశ బద్ద మానసుం డై నిజ మందిరంబునకుం జనియె.