వీరభద్ర విజయము/దక్షుఁడు దాక్షాయణిం దిరస్కరించుట

దక్షుఁడు దాక్షాయణిం దిరస్కరించుట మార్చు

131-ఆ.
అట్టివిధము చూచి యాత్మలోఁ గోపంబు
పుట్టుటయును ధీరబుద్ధి నద్రి
కన్యయైన మేటి గావున సైరించి
సామవృత్తి నాదిభామ పలికె.
132-శా.
"తండ్రీ! నీ దగు నోము చూడఁ దగమా? తర్కింప నా పిన్న చె
ల్లెండ్రం బిల్చియు నన్ను జీరవు; మదీయాధీశు నీ యున్న య
ల్లుండ్రం బిల్చియుఁ బిల్వరావు; యిలవేల్పుల్ గర్తలే? పూజనల్
వీండ్రం జేసిన నేమి గల్గు? చెపుమా విశ్వేశ్వరుం డుండఁగన్.
133-శా.
దేవేంద్రాది దిగీశ సంఘములకున్ దివ్యప్రభాలక్ష్ము లే
దేవుం డిచ్చె; ధరాధరుం డజరుఁ డే దేవుండు శేషాహి కే
దేవుం డిచ్చె; నగణ్యదక్షత జగద్దేవేశుఁ డెవ్వాఁడు; త
ద్దేవుం డిచ్చకు నేఁడు రావలవదే? ధీయుక్తిఁ జింతింపుమా.
134-క.
ఏ దేవు కతన విష్ణుం
డే దేవుని కతన బ్రహ్మ యీడేరిరి; తా
మే దేవుఁ గూర్చి బ్రతికిరి;
యా దేవుఁడు రాక వీరి కరుగం దగవే?”
135-క.
అనవుడు దక్షుం డదరుచుఁ
గనలుచుఁ గోపించి చూచి “కమలదళాక్షీ!
విను నీకంటెను నెక్కుడు
ననిశము నీ యున్న కూఁతు లందఱు గౌరీ!
136-త.
పరగ నీ తనయాధినాథులు భాగ్యవంతులు, శ్రీయుతుల్,
వరుసఁ దల్లియుఁ దండ్రియుం గలవారు, నిత్యమహావ్రతుల్;
ధరణిలోఁ గులగోత్రవంతులు తద్ఙ్ఞు లెందుఁ దలంపఁగన్;
తరుణి యిన్నియు నేల నీ పతి తల్లిదండ్రులఁ జెప్పుమా?
137-సీ.
కట్టంగ దిక్కులే కాని కోకలు లేవు;: పూయ గంధము లేదు భూతి గాని;
కాలకూటమె కాని కంఠమాలిక లేదు;: ఫణి గాని తొడుగంగ మణులు లేవు;
నలినాకసమె కాని తలవెండ్రుకలు లేవు;: తలకుఁ బువ్వులు లేవు నెలయ కాని;
కుడువ గంచము లేదు వెడద పున్కయ కాని;: యొక్క గుఱ్ఱము లేదు యెద్దు గాని;
ఆ. మూడుమూర్తు లందు మొగి నెవ్వడును గాఁడు;
జాతిలేదు పుట్టుజాడ లేదు;
పరముఁ డొంటిగాఁడు; బ్రహ్మాదు లెఱుఁగరు;
తిరుగు జోగిఁ దగునె దేవుఁ డనగ?
138-ఉ.
లోకములోన లేఁడు; నృపలోకములోనన లేఁడు; కుండలి
ళ్లోకములోన లేఁడు; మునిలోకములోనన లేఁడు; దేవతా
లోకములోన లేఁడు; సురలోకములోనన లేఁడు; వెఱ్ఱిము
ప్పోకలఁ బోవు టే నెఱిఁగి పూజలు సేయఁగ నెంతవాఁడొకో?
139-క.
తా నెక్కడ? నే నెక్కడ?
తా నాకుం దలప సరియె? తనుఁ గొలువంగా
నే నాఁడు వచ్చి నిలిచిన
తా నాకుఁ బ్రియంబు సేయఁ దలఁచెనె చెప్పుమా?
140-క.
నీ నాయకుం డల్లుం డగుఁ
గాని మమున్ ధిక్కరించెఁ గాక; భవానీ!
మానుగఁ గనియును నీవును
కాననిగతి నుండ లేల గర్వము లేలా?
141-క.
చెలువా పిలువక ముందట
వలనఱి మా యింటి కేల వచ్చితీ చెపుమా;
పిలువని పేరంటము పని
గలవారునుబోలె సిగ్గు గాదే రాఁగన్?”
142-వ.
అనవుఁడు న మ్మహాదేవి కోపవివశ యై య య్యాగమంటపంబున సుఖాసీనులై యున్న సభాపతుల నవలోకించి యి ట్లనియె.
143-చ.
“నిగమములార! ధర్మపదనిర్ణయులార! మునీంద్రులార! యో
నిగమమహాత్ములార! ఘననిర్ణయులార! దిగీంద్రులార! భూ
గగనచరాదులార! భవఖండనులార! యతీంద్రులార! యే
నిగమము లందుఁ జెప్పె శివనింద యెఱింగితి రేనిఁ జెప్పరే?
144-చ.
ఎఱుఁగరు బ్రహ్మ విష్ణువులు నిం తని కానఁగ లేరు దేవతల్
గురియిడ లేరు తాపసులు గోచరనీయులు గాని యోగు లా
పరముఁ దలంప లే రతని బాగు లగణ్యము లిట్టిచోట వీఁ
డొఱపున శంకరుం దెగడనోపె సభాసదులార! వింటిరే;
145-ఉ.
వేదము లం దెఱింగిన వివేకము లెక్కడఁ బోయె? నేఁడు పు
ణ్యోదయబుద్ధి యెం దణఁగి యున్నది నేఁడు? దపంబుఁ బొల్ల యే
నీ దగు దక్ష తాద్భుతము నీతియో నెక్కడ దాఁగె నేఁడు? బ్ర
హ్మాదులఁ బోలు ప్రఙ్ఞ యది యారడి వోయెనె నీకు? నక్కటా!
146-శా.
ఏరా దక్ష! యదక్షమానస! వృథా యీ దూషణం బేలరా?
యోరీ పాపము లెల్లఁ బో విడువరా; యుగ్రాక్షుఁ జేపట్టరా;
వైరం బొప్పదురా; శివుం వలఁపరా వర్ణింపరా; రాజితో
త్కారాతుం డగు నీలకంఠుఁ దెగడంగా రాదురా; దుర్మతీ!
147-క
చదువులు నాలుగు శివుఁ గని
యెదమంచును వెదకుఁ గాని యెబ్బంగులఁ ద
త్సమలరూపముఁ గానక
పదపడి తమలోనఁ జిక్కుపడ్డవి దక్షా!
148-సీ.
కలయ నీరేడులోకముల దొంతులతోడఁ; : బాగొప్ప మూఁడు రూపములతోడ;
మూఁడు మంత్రములతో మూఁడు కాలములతో;: భ్రమయించు పుణ్యపాపములతోడ;
సలలిత ఖేచరాచర జంతుకోటితో;: భూరితేజములతో భూతితోడఁ;
జంద్రానలావనీ జల వాయు గగనాత్మ: తరణులతోడఁ; జిత్రములతోడ;
ఆ. భర్గదివ్యమహిమ బ్రహ్మాండములు సేయుఁ
గాచు నడఁచుఁ గాని కానరాదు
నిఖిల మెల్లఁ దాన నీవును నేనును
దాన కాన నింద దగదు సేయ.
149-వ.
అదియునుం గాక.
150-క.
దేవతలు మునులు గృతమిడి
దేవుఁడు పరమేశుఁ డైన దేవుం డనుచున్
భావించినచోఁ జదువులు
దేవుఁడు శ్రీకంఠుఁ డనుచుఁ దెలిపెనొ లేదో?
151-క.
మఱి యాగంబులలోపల
బురదనుజారాతి ప్రథమ పూజ్యం డెలమిన్
సురలకు నందలిహవ్యము
లరయఁగ నతఁ డెలమి నిచ్చె నంతయు వినమే?
152-క.
విశ్వములోపలఁ దనరెడు
శాశ్వత మగు శివునిమహిమ చెప్పఁగ నీకున్
విశ్వాసంబును జెల్లదు
యీశ్వరుమహిమాబ్ది నీకు నెఱుఁగ న్వశమే?
153-మత్త.
సాహసంబున మందరంబును సారె కవ్వముఁ జేసి తా
రూహక్షీరపయోధిఁ ద్రచ్చుచు నున్న శ్రీరమణాదులన్
దాహదోహల నీలవర్ణులఁ దద్దయు న్వడిఁ జేయు హా
లాహల మఱచేతఁ బట్టి గళంబులోన ధరింపడే?
154-క.
బ్రహ్మశిరంబును ద్రుంచుట
బ్రహ్మాండము లతని యందుఁ బ్రభవించుటయున్
బ్రహ్మాదు లెఱుఁగకుండుట
బ్రహ్మాదులచేత వినవె భర్గునిమహిమల్?
155-క.
శివుఁ డెచ్చట వేంచేయును
శివతర మచ్చోటు వినుతిసేయఁగ వశమే
శివుఁ డెచ్చట వేంచేయఁడు
శివుఁ డెచ్చో నిండిలేఁడు సిద్ధము దక్షా!
156-క.
హరుఁ గూర్చి సేయు తప్పులు
హరమై యొప్పిద మొనర్చు న ప్పురుషులకున్
హరుని వెలిసేయు నొప్పులు
హరమై తప్పిదము లనెడు నది మఱచితివే.
157-క.
ఖండేందుబింబభూషణు
నొండొరులకు నెఱుఁగవశమె యోహో వినుమా;
మండిత మగు నీ యాగము
పండిన తుదిఁ బండు పండు భర్గుఁడు కాఁడె?
158-క.
అట్టి మహేశ్వరుఁ డిచ్చటికి
నెట్టన రాఁగలఁడు చెఱుప నీ యఙ్ఞము నీ
పుట్టిన దేహముతోఁడను
పట్టున శివుఁ జేరరాదు పరమార్థ మిలన్.
159-క.
ఈ యొడలు రోతఁ గాదె
పాయక పరమేశు నొందఁ బని సేయంగా
వేయును నేటికి మాటలు
పోయెదరా కీడు నొంది పొగిలి దురాత్మా?”
160-సీ.
అనుచు మహేశ్వరి యమరులు బెగడంగఁ: బూని భద్రాసనాసీన యగుచు
శంకర శ్రీపాదపంకజ యుగళంబుఁ: దన మనస్సరసిలోఁ దనర నిలిపి
వెలుఁగు మూలాధార వేదిపై శివయోగ: వహ్ని మేల్కొలిపి యవ్వలను మిగిలి
తనుఁ దాన చింతించి తరణి చంద్రుల వడి: నరుగంగనీక ఘోరాగ్నిఁ దెచ్చి
ఆ. యందు నిల్చి దివ్య మగు తన మైదీఁగె
రాజహంసగమన రాజవదన
పరమయోగశక్తి భస్మంబుగాఁ జేసి
పుణ్యతనువు తరుణి పొందె నపుడు.
161-చ.
తులు వగు దక్షు నింట మఱి తోఁచిన వేఁడిమి మంచుకొండలోఁ
దొలువకపోవ దన్న క్రియఁ దోయజలోచన గౌరి లోలయై
లలితలతావరాంగసవిలాసిని యై కొమరాలు నై విని
ర్మలగతి నేఁగెఁ గొండలకు రా జగు కొండకు మంచుకొండకున్.
162-వ.
అంతఁ దత్ప్రకారంబు వీక్షించి దక్ష మఖమంటపంబున సుఖాసీనులై యున్న బ్రహ్మ విష్ణు సూర్య చంద్ర దేవేంద్ర దండధర వరుణ కుబేరాది దేవజనంబులు మహాభీత చిత్తు లైరి; మూర్తిమంతంబు లైన మంత్రంబులు తంత్రంబులు చాలించె; పాప కర్ముం డగు దక్షుని నిందించి బ్రహ్మ తన లోకంబునకుఁ బోయె; మఱియుఁ దక్కిన వార లందఱు తమతమ నివాసంబులకుం జనిరి తత్సమయంబున.