వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/సూర్యోదయ వర్ణనము


సూర్యోదయ వర్ణనము

124-సీ.
నలినదళంబుల కిలకొని వెలయించి
కువలయదళముల క్రొవ్వణంచి
కుసుమబాణుని పెంపు కొంత నివారించి
విరహులఁ బట్టినవెఱ్ఱిఁ దెలిపి
యంధకారము నెల్ల హతమును గావించి
చుక్కలతేజంబు జక్కఁబెట్టి
మద చకోరంబుల మదములు విడిపించి
నిఖిలజగంబుల నిద్ర మాన్చి
ఆ.
వేఁడిదీప్తి దిశల వెదచల్లి మునులును
నమరసంఘములును నర్ఘ్యజలము
లొసఁగఁ బూర్వశైల దెస నభిరమ్యమై
తామ్రకిరణుఁ డైన తరణి వొడిచె.
125-వ.
ఇట్లు ప్రభాత సమయం బై యొప్పె నంతక మున్న తదీయ ప్రభాతకాల నిశ్చయాలోకన మనోరధుండై తుషారధరణీధరేంద్రుండు వంది మాగధ మంగళపాఠ కాది జనంబులు కళ్యాణ వాద్యంబులతో నత్యంత శోభన తూర్యంబు లవార్యంబు లై చెలంగ నాలించి ప్రాతస్స్నాన ప్రాణాయామ సంధ్యాది సముచిత కృత్యంబులు నిర్వర్తించి గృహదేవతా ప్రార్ధనంబు చేసి ధన కనక ధేను ధాన్యాది మహాదానంబుల ననేక భూసుర నికరంబులకు నుపచరించి తదీయ మంగళాశీర్వాద ప్రమోదమానమానసుం డై తదనంతరంబున.
126-మ.
తమ పెద్దింటి యరుంగుమీఁదఁ గడఁకన్ ధాన్యంబు పైఁ బెండ్లిల
గ్న ముపాధింపఁ బసిండి పేర్పున నభోగంగానదీ తోయముల్
రమణం బోసి యలంకరించి ఘడియారం బొప్పఁ గట్టించి య
య్యమరాచార్యునిచే మహామహిమతో నర్కప్రతాపంబునన్.
127-వ.
ఇట్లు ఘడియారంబు వెట్టించి పరమేశ్వరుండు వేంచేయుచున్నాఁడు; ఎదుర్కొన పోవలయుఁ దడవుసేయరాదని సంభ్రమానందంబున.
128-సీ.
గంధమాదన మేరు కైలాస శైలాది
కులశైలభర్తలు గొలిచి నడువ
పుణ్యకాహళులును బుణ్యదుందుభులును
బుణ్యశంఖంబులు పొలచి మ్రోయ
మంగళపాఠక మాగధ వందిజ
నంబులు శుభకీర్తనములు సేయ
కదిసి పేరంటాండ్రు కళ్యాణములఁ బాడ
పరిజనంబులు తన్నుఁ బలసి కొలువ
తే.
లలిత సామ్రాజ్యవైభవలక్ష్మి మెఱసి
పరఁగ నంతంత మ్రొక్కుచు భక్తితోడ
శైలముల కెల్ల రాజగు శైలవిభుఁడు
ఎలమి నేతెంచెఁ బరమేశు నెదురుకొనఁగ.
129-వ.
ఇవ్విధంబున నెదురకొనం జనుదెంచి పంచాననుం డాదిగా నెల్ల వారలమీఁద సేసలు చల్లుచుఁ గరపల్లవంబులు మొగిడ్చి వినయంబునఁ బ్రణామంబులు చేసి “భక్తవత్సల! పరమేశ్వర! సర్వదేవతామయ! శంకరస్వామీ! మహేశ్వర! మహదేవ! దేవతాసార్వభౌమ! శరణ్యం” బని పలికినం; గనుగొని యల్లల్ల నవ్వుచు శ్రీవల్లభుం జూచి “చూచితే” యని పలుకుచు నమ్మహేశ్వరుండు తన్ను డాయ రమ్మని చేసన్న చేసినం గదిసి తుహినాచలేంద్రుండు.
130-మ.
“ జగదీశాయ! నమో నమో నవసుధాసంకాశితాంగాయ! శ్రీ
నగనాథాయ! నమో నమో శుభకరానందాయ! వేదార్ధపా
రగవంద్యాయ! నమో నమో సురనదీరంగత్తరంగావళీ
మకుటాగ్రాయ! నమో నమో మునిమనోమందార! సర్వేశ్వరా!
131-ఉ.
విదితతంత్ర మంత్రవాద వేదధర్మ మర్మముల్
వెదకుఁ గాని నిన్నుఁ గాన లేవు యిట్టి నీకు స
మ్మదముతోడఁ గన్నె నిచ్చి మామ నైతిఁ బుణ్యసం
పదలు గంటిఁ గీర్తిఁ గంటిఁ బంచవదన! శంకరా!”
132-వ.
అని వినుతించుచున్నగిరీశ్వరుం జూచి విరించి మొదలగు దేవతాబృందంబు లి ట్లనిరి.
133-తే.
“పరఁగ విహిత మైన పనులను జేయంగఁ
బోవవలయునేని పోవు మిపుడు
దేవదేవుఁ డేగుదెంచుచు నున్నాఁడు
తడవు సేయఁ దగదు ధారుణీధ్ర!”
134-వ.
అనిన విని “విహితకృత్యంబులు సర్వాయత్తంబు లై యున్నవి మహాత్ములార! మీతోడ నే చంద్రశేఖరుఁ గొలిచి వచ్చెద” నని పలికిన నయ్యవసరంబున.
135-క.
గౌరినాధుని పెండ్లికి
నీరేడుజగంబు లెల్ల నేతెంచుటయున్
భారమునకు సైరింపక
తారాచలవల్లభుండు తద్దయుఁ గడఁకన్.
136-తే.
దేవదేవు పెండ్లి తెఱఁగొప్ప నంతయుఁ
జూడఁ దలఁచి నిక్కి చూచె ననఁగ
దక్షిణంబుదిక్కు ధారుణి యంతయుఁ
గడలనొడ్డగెడవు గాఁగ నెగసె.
137-వ.
అంత నంతయుం బరికీంచి సకలలోకరక్షకుఁ డగు నారాయణ దేవుం డమ్మహాదేవున కిట్లనియె.
138-శా.
“ స్వామీ! శంకర! కంకణోరగపతీ! సంవూజ్యబృందారకా!
కామధ్వఁసక! సర్వలోకములు మీ కళ్యాణముం జూడ స
త్ప్రేమన్ వచ్చుటఁ జేసి యుండఁగ మహావ్రేఁగై భరంబోర్వ కీ
భూమీచక్రము గ్రుంగె నీవు సమతం బొందించి రక్షింపవే.”