వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము/సప్తమహర్షులను శీతాచలంబునకుఁ బంపుట


సప్తమహర్షులను శీతాచలంబునకుఁ బంపుట

26-వ.
అని విన్నవించిన మునిజనంబులం గనుంగొని మహేశ్వరుం డతులిత కరుణాపూరిత మానసుం డై యిట్లనియె.
27-సీ.
శీతాచలేంద్రునికూఁతుఁ బార్వతికన్య
  నతిమోదమున మాకు నడిగి రండు
ఉడురాజవదనకు సుంకు వేమడిగిన
  నెంతైన మైకొని యిచ్చి రండు
మదిరాక్షి నాతండు మనకిచ్చునట్లుగాఁ
  బెంపార నుంగ్రముఁ బెట్టిరండు
పాలకూళ్లు గుడిచి బాలను మనసొమ్ము
  చేసిరం డనువొందఁ జేసి రండు
ఆ.
ఇదియె మాకు మెచ్చు నెల్ల భంగులనైన
దీనిఁ జేయవలయుఁ దెఱఁగు మెఱసి
కదలిపోవ నిదియె కడుమంచిలగ్నంబు
భూధరేంద్రపురికిఁ బోయి రండు.
28-వ.
అని పలికి యన్యపురుషావలోకనంబు సేయక వసిష్ఠపాదావలోకనంబు సేయుచున్న పతివ్రతాశిరోమణి యగు నరుంధతిం జూచి శివుం డిట్లనియె.
29-మ.
వనితా కూఁతులఁ బెండ్లి సేయు నెడలన్ వాచాలకుల్ తల్లులే
యని లోకంబులు పల్కుఁ గాన సతి నీ వద్రీశు నిల్లాలితో
నొనరం గన్నియకున్ వరుండు దగు మీరూహింపఁగా నేల యి
మ్మని కార్యంబు ఘటింపంగాఁ బలుకుమీఁ యంభోజపత్రేక్షణా!”
30-వ.
అని యానతిచ్చిన మహామునులు నరుంధతీ సమేతులై పరమేశ్వరునకు పాష్టాంగదండప్రణామంబు లాచరించి వీడ్కొని పరమానందంబున నత్యంత శుభసూచకంబులు పొడగాంచుచుం దుహినశిఖరంబునకుఁ బ్రయాణంబు చేసి పోవుచున్న నతిదూరంబున.