వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/వీరభద్రుఁడు విష్ణువుతో యుద్ధము చేయుట


వీరభద్రుఁడు విష్ణువుతో యుద్ధము చేయుట.

139-చ.
అరిమురి నన్నిదిక్కులకు నాలములోపలఁ జొచ్చి భీతు లై
పఱచుటఁ జూచి మాధవుఁడు “పాఱకుపాఱకుఁ డేను గల్గఁగా
వెఱవఁగ నేల రం” డనుచు వేల్పుల నందఱ నిల్పి మొత్తమై
వెఱవక నిల్చి బీరమున వీరునకున్ గిరివోలె నడ్డ మై.
140-వ.
ఇవ్విధంబున.
141-ఉ.
ఆలము సేయఁ బూని కడు నాయితమై హతశేషు లైన దే
వాళియు సేన యై నడువ నార్చుచు పన్నగవైరి వాహుఁడై
వ్రాలుచు భద్రుపైఁ గవిసే వారిజనాభుఁడు వాసుదేవుఁ డా
భీలవిహారి యై మృగము బెబ్బులి నుగ్రత చేరునాకృతిన్.
142-వ.
తత్సమయంబున.