వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము/దక్షుని యజ్ఞ వృత్తాంతము దధీచి శివునకుఁ దెల్పుట


దక్షుని యజ్ఞ వృత్తాంతము దధీచి శివునకుఁ దెల్పుట.

47-సీ.
నీలకంఠునకును నెచ్చెలిగాఁడొకో
యటమటీఁ డైన యీయంబుజాక్షుఁ
డహికంకణునకు మూఁడవకన్ను గాఁడొకో
పాటుమాలిన యట్టి పావకుండు
గంగాధరునకు సంగడికాఁడు గాఁడొకో
వెనుకూళ్ల మారైన యనిమిషపతి
పురవైరికిని తలపుష్పంబు గాఁడొకో
నిర్భాగ్యుఁ డైన యీనీరజారి
47-1-తే.
యేమి కుడువంగ వచ్చితి రిందు మీరు
తాము పాలించునట్టి లోకముల విడచి
పంచవదనుని కను జేఁగురించెనేని
తక్షణంబునఁ దమయాళ్లత్రాఁళ్లు దగవె.
48-ఉ.
ఆచరితంబు లెల్లఁ దనయాత్మ నెఱింగి కలంగి దిక్కులన్
జూచి కడిందికోపశిఖ చుట్టి మనంబున సందడింపఁ దా
రాచలనాధుసన్నిధికి నల్లన వచ్చి భవాని నీశునిం
జూచి నమస్కరించి తనచేతులు మోడ్చి మహేశుకిట్లనెన్.
49-చ.
“ మలహర! నేఁడు దక్షుఁడు రమావర దిగ్వర వాగ్వరాదులం
బిలిచి హిమాద్రిపై మనలఁ బిల్వక యాగముఁ జేయు చున్నవాఁ
డలవున మీరు వేగఁ జని యచ్చట శూరుల వానితోడుత
న్నలవడఁ జెండి పీచము లడంచి ననున్ బ్రమదాత్ముఁ జేయవే.
50-ఉ.
దారుణబాహుదండబలదండధరోన్మది కుంభికుంభకం
ఠీరవ వైరిదానవఫణి వ్రజశేఖర పన్నగాంతకా
కార భుజంగహార భుజగర్వమదోద్ధతపంచబాణసం
హార త్రిలోకవీర త్రిపురాసురదర్పవిరామ శంకరా!
51-వ.
అని విన్నవించిన నతని పలుకులు విని పరమేశ్వరుండు కోపీంచి