వీరభద్ర విజయము/కవివంశాభివర్ణన
కవివంశాభివర్ణన
మార్చు23-క.
వేమరు జగములు సేయఁగ
ధీమతిఁ బరమేశు నానతిని దక్షుం డై
శ్రీమాధవుపొక్కిటఁ గల
తామర నొక నలుమొగాల ధాత జనించెన్.
24-క.
విదితముగ నతని మొగములఁ
జదువులు నాల్గును జనించె సరసతగాన
చ్చదువులు నాతని సృష్టికి
సదమలుఁడు వసిష్ఠతపసి జననం బయ్యెన్.
25-వ.
అట్టి వసిష్ఠపుత్రుం డగు కౌండిన్యుండు.
26-మ.
ధనదుం డాయతపుణ్యమూర్తి మునిమందారుండు సన్యాన్యుఁడు
న్ముని నిర్నిద్రదయాత్ముఁడు న్మహితుఁడు న్మార్తాండ తేజుండు భూ
తనయాధీశ్వరవర్ణనీయుఁడు తపోగణ్యుండు నైనట్టి కౌం
డినకుం డ న్ముని సన్మునీంద్రపరుఁడై యి ధాత్రిఁ గీర్తింపఁగన్.
27-వ.
అట్టి కౌండిన్య గోత్రంబునం దాపస్తంబసూత్రంబున.
28-ఉ.
మల్లయభీమనాహ్వయకుమారకుఁ డన్నయమంత్రికిన్ దయా
వెల్లికి గౌరమాంబ కరవిందదళేక్షణుఁ డై జనించి వ
ర్థిల్ల వెలుంగు సజ్జనవిధేయుఁడు సోమననామధేయుఁ డా
మల్లమ యందుఁ గాంచె సుకుమారుల ధీరుల సత్కుమారులన్.
29-ఉ.
నీతి యుగంధరుం డనఁగ నిర్మలుఁడై ఘన నాగరీకుఁడై
యాతత కీర్తి రేచనయు నన్నయమంత్రియు సర్వశైవలో
కాతురహారుఁ డెల్లనయు నయ్యలు ప్రగ్గడయున్ దయాగుణ
వ్రాతవిభూషణుండు జనవంద్యుఁడు మాచయ నాఁగ నున్నతిన్.
30-క.
అందుల మధ్యముఁ డెల్లన
మందరధీరుండు నీతిమంతుఁడు వనితా
కందర్పుఁడు మాచాంబిక
నందంబుగఁ బెండ్లియాడె నభినవ కీర్తిన్.
31-ఉ.
మానిని మాచమాంబకుఁ గుమారుఁడు యెల్లనకుం బ్రసిద్ధిగా
మానుగ నుద్భవించిరి కుమారులు కేసనయుం గుణావళి
న్మానితుఁ డైన మాధవుఁడు మాన్యుఁడు నిమ్మడి నాఁగ మువ్వురున్
భూనుతు లైరి తేజమునఁ బోలిరి ధర్మజ భీమ పార్థులన్.
32-ఉ.
ఇమ్ముల నర్థి కోటి ధన మిమ్మని పల్కిన పల్కుకంటెఁ దా
నిమ్మడి నిచ్చు నిచ్చు మది నిమ్మడి పుణ్యముఁ బొందుభాతి లో
కమ్ములఁ గీర్తిఁ జెంద గణకవ్రజమాన్యుఁడు మానికంబు మా
యిమ్మడి సర్వమార్గమ్ముల నిమ్మడి గాక తలఁప నల్పమే.
33-క.
సాధుగుణాఢ్యుఁడు కేసన
మాధవనందనుఁడు రూపమహిత విభూతిన్
మాధవతల్పము దక్షత
మాధవుఁ డనుకంపవృత్తి మాధవుఁ డయ్యెన్.
34-ఉ.
భూసురవంద్యునిన్ సుగుణభూషణు నాశ్రితకల్పవృక్షమున్
దాసజన ప్రపన్ను శివతత్వమనోరథకౌతుకోన్నతున్
కేసనమంత్రి సత్యనిధిఁ గీర్తివిశాలుఁ జిరాయు రున్నతున్
జేసి యుమామహేశ్వరులు చెన్నుఁగఁ గాతురుగాక సత్కృపన్.
35-క.
మంచిగుణంబుల నీతఁడు
మంచిగదా మంచిపేరు మహిఁ దగు ననఁగా
నంచిత వితరణఖనియై
మించిన తేజమ్ముతోడ మెఱసె ధరిత్రిన్.
36-ఉ.
అట్టి ఘనుండు మంచికి దయాగుణధీమణి మాచమాంబకుం
బుట్టిన లక్ష్మికన్య యనఁ బొల్పగు గోపన కూర్మి చెల్లెలిన్
నెట్టనఁ బెండ్లియాడె మహనీయుఁడు కేసనమంత్రి శ్రీసతిన్
దట్టపు వేడ్కఁ గేశవుఁడు దాను వరించిన భంగిఁ బొంగుచున్.
37-ఉ.
పావనగంగ భోగశచి భాగ్యపుగౌరి గభీరభూమి సం
భావనకుంతి రూపగుణభారతి సంపదమహాలక్ష్మిదేవి సం
సేవితసంఙ్ఞ నిశ్చలవిశేష యరుంధతి యైన లక్ష్మి దాఁ
గేవలకన్యయే తలఁపఁ గీర్తనసేయఁదగున్ ధరాస్థలిన్.
38-క.
ఆ దంపతులకు సంతత
మోదిత చిత్తులకు మిథునముఖ్యులకు దయా
పాదితగుణులకు శంకర
పాదయుగాంభోజ పారీణులకున్.
39-శా.
సారాచారుఁడు కాంతివైభవగతిన్ సంపూర్ణచంద్రుండు భూ
దారాహీంద్రసమానదక్షుఁడు సదాధర్మాకరుం డర్థి మం
దారుం డంచితరూపరేఖలను గందర్పుండు భూయోయశ
శ్రీరమ్యుం డగు తిప్పనార్యుఁడు జనించెన్ వంశవర్ధిష్టుఁ డై.
40-వ.
త దనుజుండ నై యేను జన్మించి పోతయ నామధేయుండ నై పరఁగి జనకశిక్షిత విహితాక్షరాస్యుండ నై వీరభద్రప్రసాద లబ్ద కవితాతిశయం బున.
41-ఉ.
భాగవత ప్రబంధ మతిభాసురతన్ రచియించి దక్షదు
ర్యాగకథాప్రసంగమున నల్పవచస్కుఁడ నైతి త న్నిమి
త్తాగతవక్త్రదోష పరిహారముకై యజనైకశైవశా
స్త్రాగమ వీరభద్రవిజయంబు రచించెద వేడ్కనామదిన్.