విక్రమార్కచరిత్రము/ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

విక్రమార్క చరిత్రము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతా ప్రార్థనము


శ్రీ గౌరీకుచనీలమౌక్తికమణిశ్రేణివిభూషాఘృణి
ప్రాగల్భ్యంబులు గృష్ణపాండురతనుప్రౌఢిం బ్రతిష్ఠింపఁ దే
జోగణ్యుండయి యొప్పు శ్రీహరిహరేశుం డెప్డు రక్షించు వి
ద్యాగంభీరుని జన్నమంత్రిసుతు సిద్ధామాత్యచూడామణిన్.

1


చ.

కనకనగంబు బొమ్మరముగా, భుజగేంద్రుఁడు జాలెగా నమ
ర్చిన, గిరిపుత్రిగాంచి యివిరెండును దేవధనంబు లన్న; న
జ్జననిహితోపదేశమున సన్మతి వానిఁ బునఃప్రతిష్ఠ చే
సినగణనాయకుండు కృప సేయుత సిద్ధనమంత్రికోరికల్.

2


ఉ.

ఆనతులై నుతించు చతురాననముఖ్యులకోర్కిఁదీర్పఁ బం
చాననదివ్యమూర్తికి షడాననుఁడై జనియించి యాసహ
స్రాననుసంస్తవంబులకు నందని శక్తిధరుండు సానుకం
పాననుఁడై నృపేంద్రసచివాగ్రణిసిద్ధనఁ గాచుఁ గావుతన్.

3


చ.

హరిహరసంగమంబున మహాద్భుతభంగిఁ జరించి చేతులం
బరశుపినాకఖడ్గఫణిపాశ కపాల వరత్రిశూలముల్
కరమనురక్తిఁ బూని నుతిఁ గాంచిన బెల్లముకొండభైరవుం
డురుమహిమాఢ్యుఁ జేయు సుగుణోన్నతు జన్నయసిద్ధధీమణిన్.

4


ఉ.

రాజు సహోదరుండు, రతిరాజు తనూజుఁడు, తండ్రి వాహినీ
రాజు, వరుండు లోకములరాజుగ రాజితలీల నొప్పు నా

రాజమరాళయాన సిరి, రాజ్యరమారమణీయుఁ జేయుతన్
రాజనుతప్రతాపగుణరమ్యుని జన్నయసిద్ధధీమణిన్.

5


క.

క్షీరామృత శశి శారద
నీరద నీహారహార నిర్మలశోభా
గౌరవ కళావిశారద
శారద సతతంబుఁ బ్రోచు జన్నయసిద్ధున్.

6


చ.

హరిహరనీరజాసనసుఖావహమై నిమిషార్ధమాత్రలో
నిరువదిరెండునూఱులకు నెక్కుడు నిర్వదియోజనంబు లే
యరదము లీలవోలెఁ జను నంబరవీథి ననారతంబు నా
సురథము సన్మనోరథము చొప్పడ నీవుత సిద్ధమంత్రికిన్.

7


సీ.

మకరందనిష్యందమందారమాలిక
        కబరీభరంబున సొబగుమీఱ
రమణీయమౌక్తికరత్నహారంబులు
        కుచకుంభములమీఁదఁ గొమరుమిగులఁ
గాంచనాంచలదివ్యకౌశేయచేలంబు
        ఘనకటితటమునఁ గరము మెఱయ
ఘనసారకాశ్మీరగంధసారోదార
        మృగమదపంకంబు మెయిఁ దనర్ప


తే.

 మఱియు బహువిధశృంగారమహిమ మించి
హాటకోన్నతదివ్యసింహాసనమునఁ
దేజరిల్లెడు పార్వతీదేవి కరుణ
మంత్రిజన్నయసిద్ధుని మనుచుఁగాత.

8


సంస్కృత కవిస్తుతి

చ.

అచిరములైన యన్యరుచు లన్నియు నావలఁ బోవఁ ద్రోచి నా
ఙ్నిచయమనోహరం బయిననేర్పు త్రికాలముఁ బ్రస్తుతింపఁగా
సుచరిత రామసంస్తవనసూక్తిసుధారస మాను నెవ్వఁ డా
ప్రచురకవిత్వతత్త్వనిధి భక్తి భజించెదఁ బుట్టపుట్టువున్.

9

ఉ.

ఆది ననంతసంఖ్యఁ దనరారుచు నేరి కగమ్యమైన యా
వేదము నెల్ల విప్రులుఁ బ్రవీణతతోఁ బఠియించునట్లుగా
శ్రీ దనరార నాలువుగఁ జేసినపుణ్యుఁ బరాశరాత్మజున్
మోదముతో నుతింతు మునిముఖ్యుని నేకముఖాబ్జసంభవున్.

10


సీ.

శ్రీహర్షు శివభద్రుఁ జిత్తపు శివదాసు
        సౌమిల్లిని సుబంధు సార్వభౌము
కర్ణామృతకవీంద్రుఁ గామందకుఁ గళింగుఁ
        గవిరాక్షసుని భాసుఁ గాళిదాసు
మల్హణు బిల్హణు మాఘు మయూరుని
       వామను వరరుచి హేమచంద్రు
భవభూతి భారవి భట్టనారాయణు
       భట్టగోపాలకుఁ బ్రవరసేను


తే.

రాజశేఖరు హర్షు మురారిఁ జోరు
వరగుణునిదండి నాశాతవాహనుని వి
నాయకుని జయదేవు దిఙ్నౌగు భద్రు
హరిని భామహుఁ గవిరాజు నాత్మఁ దలఁచి.

11


కవిత్రయ ప్రశంస

ఉ.

వేయివిధంబులందుఁ బదివేవురు పెద్దలు సత్ప్రబంధముల్
పాయక చెప్పి రిట్లు రసబంధురవాగ్విభవాభిరామధౌ
రేయులు శబ్దశాసనవరేణ్యులునాఁగఁ బ్రశస్తికెక్కిరే
యేయెడ నన్నపార్యుగతి నిద్ధర? నట్టిమహాత్ముఁ గొల్చెదన్.

12


చ.

పరువడి భారతాఖ్యగల పంచమవేదము నాంధ్రభాష సు
స్థిరత రచించుచోఁ గృతిపతిత్వముఁ గోరి ప్రసన్నుఁ డైన యా
హరిహరనాథుచేఁ బడసె నవ్యయసౌఖ్యపదంబు నెవ్వఁ డా
పురుషవరేణ్యుఁ దిక్కకవిఁ బూని నుతింతుఁ గృతాధ్వరోత్సవున్.

13

ఉ.

ఈత్రయిఁ దాఁ బ్రబంధపరమేశ్వరుఁడై విరచించె శబ్దవై
చిత్రి నరణ్యపర్వమున శేషము, శ్రీనరసింహ రామచా
రిత్రములున్ బుధవ్రతగరిష్ఠత నెఱ్ఱయశంభుదాసుఁ డా
చిత్రకవిత్వవాగ్విభవజృంభితుఁ గొల్చెద భక్తియుక్తితోన్.

14


కుకవి నిరసనము

మ.

నవశబ్దార్థ రసానుబంధపదవిన్యాసక్రియాభావగౌ
రవ పాకధ్వనిరీతిశయ్యలఁ గవీంద్రశ్రేణి కావ్యాళిఁ జె
ప్ప వృథామత్సర మూని దుష్కవులుఁ జెప్పంజూతు రట్లేకదా!
శివుఁడుం దాండవమాడ నాడవె పిశాచీభూతభేతాళముల్.

15


మ.

నవనానారసభాస్వరార్థపదవిన్యాసక్రియాలంక్రియా
శ్రవణానందకథాసుధామయమహాసారస్వతాంభోధిలో
నవలీలన్ విహరించుతద్జ్ఞులు గతాహంకారులై యుండఁగాఁ
గవితాప్రౌఢిమలేని యజ్ఞులు వృథా గర్వాంధు లే లౌదురో!

16


క.

ప్రతిపద్యముఁ జోద్యముగాఁ
గృతిఁ జెప్పిన నొప్పుఁగాక కృతి నొకపద్యం
బతిమూఢుఁ డైనఁ జిత్రతఁ
బ్రతిపాదింపఁడె ఘుణాక్షరన్యాయమునన్?

17


వ.

అని యి ట్లిష్టదేవతాప్రార్థనంబును శిష్టకవిజనకీర్తనంబును దుష్టకవినిరసనంబునుం జేసి యపూర్వకథాబంధురప్రబంధరచనాకౌతుకుండనై యుండునంత.

18


కృతికర్త సభావర్ణనము

సీ.

నవరసోజ్జ్వలకావ్యనాటకాలంకార
        [1]నికషోపలవివేకసుకవివరులు

శ్రీమహాభారత రామాయణాదిపు
        రాణపారీణపౌరాణికులును
వేదాంతవైశేషికాదిషడ్దర్శన
        తర్కకర్కశులైన తార్కికులును
దత్తిలభరతమతంగకోహళమత
        ప్రముఖసంగీతపారంగతులును


తే.

మహిమఁ గొలువంగ నాస్థానమండపమున
జనితసాహిత్య[2]సౌహిత్యసరసగోష్ఠిఁ
జిత్త మిగురొత్త జన్నయసిద్దమంత్రి
కొలువుగూర్చుండి నను వేడ్కఁ బిలువఁబంచి.

19


కవి వంశప్రశంస

సీ.మా.

సంస్కృత ప్రాకృత శౌరసేన్యాదుల
        ఘటికలో నొకశతకంబుఁ జెప్పఁ
బ్రహసన ప్రకరణ బాణాది బహువిధ
        రూపకంబులయందు రూఢి మెఱయఁ
జక్ర చతుర్భద్ర చతురుత్త రాధిక
        క్షుద్రకావ్యములు పెక్కులు రచింప
నాంధ్రకవిత్వంబునందుఁ బ్రబంధంబు
        మేలుగాఁ దద్జ్ఞులు మెచ్చఁ జెప్ప
నిమ్ముల నేరీతి నేధాతువుల నేమి
        రసమున నైన వర్ణనము సేయ
సరి యేకసంధా ద్విసంధా త్రిసంధలఁ
        దొడరినఁ బొరిబొరి గడవఁ జదువ
నెవ్వఁ డేయవధాన మెఱుఁగు నయ్యవధాన
        మున వాని కించుక ముల్లుసూప
వృత్తకందముఁ గందవృత్తంబునుం జతు
        స్కందంబు మొదలుగాఁ గలుగుగర్భ

కావ్యవర్గముఁ జెప్పఁగాఁ బ్రబంధంబులుఁ
        గ్రొత్తలు పుట్టించుకొని లిఖంపఁ
గా; నక్షరచ్యుతకంబు మాత్రాచ్యుత
        కంబు బంధచ్యుతకంబు నామ
గోప్యంబులుం గ్రియాగోప్యంబులును భావ
        గోప్యంబులును జెప్ప, గోష్టియందుఁ
బద్యంబు గీతికార్భటి నొగిఁ జదువంగ,
        నెల్లవిద్యల సంచు లెఱుఁగనేర్తు


తే.

ననుచు నెల్లూరితిరుకాళమనుజవిభుని,
సమ్ముఖమ్మున సాహిత్యసరణి మెఱసి
మహిమ గాంచిన పెద్దయామాత్యసుకవి
మనుమఁడవు నీవు నీవంశమహిమయొప్పు.

20


క.

ఆఁడఁడు మమూరరేఖను
గాఁడం బాఱండు బాణగతి మన మెరియన్,
బ్రోడగు పెద్దయయన్నయ
మాడకు మాడెత్త యతనిమాటలు జగతిన్.

21


క.

అని మీతండ్రిమహత్త్వము
జనవినుతరసప్రసంగసంగతకవితా
ఘనతేజులు కవిరాజులు
గొనియాడుదు, రఖలరాజకుంజరసభలన్.

22


జక్కన కవితాప్రశస్తి

క.

చక్కన నీవైదుష్యము
చక్కన నీకావ్యరచనచాతుర్యంబుల్
చక్కన నీవాగ్వైఖరి
చక్కన నీవంశమహిమ జక్కనసుకవీ!

23


క.

స్వాభావికనవకవితా
ప్రాభవముల నుభయభాషఁ బ్రౌఢిమఁ జెప్పం
భూభువనంబున సరి లే
రాభారతి నీవుఁ దక్క నన్నయజక్కా!

24

వ.

అనిసంభావించి.

25


కావ్యకరణ హేతువు

తే.

వనము నిధియును నల్లిల్లు వరసుతులును,
జెఱువు గుడియును ధరఁ బ్రతిష్ఠితములయ్యె
గృతియుఁ గైకొన్న సప్తసంతతులవలనఁ,
గీర్తిసుకృతంబులకును నేఁ గర్త నగుదు.

26


సీ.

ప్రతిభాగుణధురీణ పౌరాణికత్రాణ
        సకలపురాణశాస్త్రములయందు
బరమార్థ చరితార్థ భారతరామాయ
        ణాదిప్రబంధకావ్యములయందుఁ
గల్పాంతరస్థాయి గద్యపద్యప్రాయ
        కమనీయచిత్రకావ్యములయందు
రసికజనానందరససుధానిష్యంద
        విలసితనాటకావలులయందు


తే.

సకలదేశభాషావిశేషములయందు
వరునఁ బ్రఖ్యాతమనఁగ నుత్పాద్యమనఁగ
మిశ్రమన నొప్పు సత్కథామేళనంబు
లెన్నియన్నియు విన్నాఁడఁ బిన్ననాఁడ.

27


చ.

[3]తలఁపఁ దదీయనాయకవితానముకంటెను, సాహసక్రియా
కలితవదాన్యతాది గుణగౌరవరేఖల విక్రమార్కభూ
తలపతి యెక్కుడై నెగడెఁ దచ్చరితంబుఁ బ్రబంధశయ్యగాఁ
దెలుఁగున చెప్పి, యాకృతిపతిత్వము మా కొడఁగూర్పు నేర్పునన్.

28


వ.

అని సవినయంబుగాఁ గనకమణిభూషణాంబరతాంబూలంబు లొసంగి గారవించినం బ్రమోదించి, తత్ప్రబంధమునకు ముఖాకల్పంబుగా, నాప్రధానోత్తము వంశంబుఁ బ్రశంసించెద.

29

కృతిపతి వంశప్రశంసనము

ఆ.

జలజనాభు నాభిజలజంబున జనించె
బ్రహ్మ, యతని వదనపంకజమున
జనిత మైన విప్రజాతికిఁ దొడవుగా
హరితమునివరేణ్యుం డవతరించె.

30


మ.

ఇనకోటి ప్రతిమానతేజుఁ డభవుం డీశానవక్త్రంబుచేఁ
దనకుం గీత యొనర్పఁగా, మెఱసె నుద్యద్ధర్మశాస్త్రక్రియన్
మను కాత్యాయన దక్ష గౌతముల సామర్థ్యంబునన్ మించె, స
న్మును లెవ్వారును నేర్తురే హరితునిన్ బోలం బ్రభావోన్నతిన్!

31


వ.

తదీయగోత్రంబున నూత్నరత్నంబై జనియించి.

32


సీ.

వేదశాస్త్రపురాణవిజ్ఞానసరణిమై
        నధిగతపరమార్థుఁడై తనర్చె
పెద్దనపూడి రాజేంద్రచోడక్షమా
        రమణుచే నగ్రహారములు వడసె
గనకదం డాందోళికాచ్ఛత్రచామర
        ప్రముఖసామ్రాజ్యచిహ్నముల నొప్పె
సర్వతోముఖముఖ్యసవనక్రియాప్రౌఢి
        నుభయవంశంబుల నుద్ధరించె


తే.

నన్నదానాది దానవిద్యావనుండు
పరమశైవసదాచారపావనుండు
హరితవంశాంబునిధినుతుఁ డార్యనుతుఁడు
సుగుణవిభ్రాజి సూరనసోమయాజి.

33


క.

[4]అమ్మహితాత్ముని మనుమఁడు
సమ్మానదయానిధానసౌజన్యరమా

సమ్మోదితబాంధవుఁడై
యిమ్మహిలో సిద్ధమంత్రి యెన్నిక కెక్కెన్.

34


మ.

శ్రుతులన్ వన్నియకెక్కె, శాస్త్రములచే సొం పగ్గలించెన్, మహో
న్నతిఁ బోషించెఁ బురాణకావ్యరసనానానాటకాలంకృతుల్,
క్రతువర్గంబుల సుప్రయోగమహిమన్ గాంచెన్, విరించాన్వయో
ర్జితపుణ్యుండగుసిద్ధమంత్రి సుగుణశ్రీ మించి సేవించినన్.

35


చ.

వనరుహనాభు కుద్దవుఁడు, వజ్రికి జీవుఁడు, వత్సధారణీ
శునకు యుగంధరుండు, దితిసూతికి దైత్యగురుండు, విక్రమా
ర్కునకును భట్టిరీతి; నధికుండగు నన్నయగంధవారణం
బునకుఁ బ్రధానుఁడై నుతులఁ బొందెను సిద్ధనమంత్రి యిద్ధరన్.

36


వ.

అమ్మహాప్రధానోత్తముండు.

37


చ.

పరిణతనవ్యకావ్యరసభావవిజృంభణభూరివిక్రియా
స్ఫురితచరిత్రతత్త్వసరసుం డగు పేరయనన్ననార్యసో
దరి యగు సూరమాంబిక ముదం బలరంగఁ బరిగ్రహించె, భా
స్వరకమలాజనార్ధనవివాహమహోత్సవలీల మీఱఁగన్.

38


క.

ఆదంపతులకు సుకృత
ప్రాదుర్భావమున మంత్రి భాస్కరుఁడు, దయా
పాదితబాంధవనికరమ
హోదయుఁడగు జన్నమంత్రియునుఁ గల్గిరొగిన్.

39


వ.

అందగ్రజుండు.

40


చ.

అమృతగిరీంద్రసంయమి పదాంబుజషట్పదనాయకుండు నా,
నమితరవిప్రణామనికరాంచితపుణ్యుఁడునాఁగ, నీశ్వరా
గమపరమార్థవేదియనఁ గంజభవాన్వయవర్థనుండునా
బ్రమహితకీర్తిఁ బెంపెసఁగె భాస్కరమంత్రి ప్రతాపధాముఁడై.

41

తే.

సుజనమిత్రుఁ డాదిత్యుండు సుతుఁడుగాఁగ
మనుమఁడై నారధీమణి మహిమమెఱయ
భాగ్యనిధియైన భాస్కరప్రభువరుండు
పుత్త్ర పౌత్త్రాభివృద్ధిచేఁ బొలుపుమిగిలె.

42


వ.

తదనుసంభవుండు.

43


సీ.

విమలవర్తనమున వేదశాస్త్రపురాణ
        వాక్యార్థసరణికి వన్నెవెట్టె
బరమహృద్యంబైన పద్యశతంబున
        దేవకీతనయు విధేయుఁ జేసె
రసికత్వమున దేవరాయమహారాయ
        కరుణాకటాక్షవీక్షణము గాంచెఁ
గర్ణాటకటకముల్ గలయంతయును మెచ్చ
        గణకవిద్యాప్రౌఢి ఘనతకెక్కె


తే.

గురులఁ బోషించె, సత్కవివరుల మనిచెఁ
బ్రజలఁ బాలించె, భాగ్యసంపద వహించె
హరితమునిముఖ్యవంశరత్నాకరేంద్ర
చంద్రుఁడై యొప్పు సిద్ధయజన్నమంత్రి.

44


మ.

అరసె బంధుల వైభవోన్నతులఁగా, నాదిప్రధానావళిన్
దొరసెన్ నీతివివేకవిస్ఫురణచేఁ దోరంపునత్కీర్తులన్
ఒరసెన్ బూర్వవదాన్యవర్గముల; నోహో! యెందు నేమంత్రులున్
సరియే సిద్దయజన్నమంత్రికి మనీషాదేవతామంత్రికిన్?

45


వ.

అమ్మహామంత్రీశ్వరుని కులపాలికారత్నంబు.

46


సీ.

పరమపతివ్రతాగరిమ నీసతి కెన్నఁ
        బ్రతి లేరు ధర నరుంధతియ దక్కఁ
బుత్త్రులఁ గాంచినపోల్కి నీకాంతకుఁ
        జింతింప సరి లేరు గొంతి దక్కఁ

దాలిమిపేర్మి నీతరుణిలలామకు
        నెన లేరు ధారుణీవనిత దక్క
సౌభాగ్యగరిమ నీసాధ్వికి నుపమింప
        లక్ష్యంబు లేరు శ్రీలక్ష్మి దక్క


తే.

రూపమున నీవధూమణిఁ జూపి చెప్ప
జోడు లేరు సురాధిపుసుదతి దక్క
ననఁగఁ బుణ్యపుముడి మోచి యక్కమాంబ
బంధువులపాలిసురభినాఁ బరఁగె ధరణి.

47


క.

ఆరమణీరమణులకును
శ్రీ రంజిల్లంగ నవతరించిరి విభవో
దారుఁడు సిద్ధనమంత్రియు
నారూఢయశుండు భైరవామాత్యుండున్.

48


సీ.

సొబగుమైఁ గనువిచ్చి చూడ నేర్చిననాఁడె
        సుజనులఁ గరుణతోఁ జూడ నేర్చె
మవ్వంబు దళుకొత్త నవ్వ నేర్చిననాఁడె
        నయమార్గహీనుల నవ్వ నేర్చె
నడుగెత్తి యల్లన నడవ నేర్చిననాఁడె
        ననిచి ధర్మముత్రోవ నడవ నేర్చె
లలిఁ దొక్కుఁబల్కులు పలుక నేర్చిననాఁడె
        పరికించి సత్యంబు పలుక నేర్చె


తే.

వ్రాయ నేర్చిననాఁడె సద్వర్ణసమితి
[5]నర్థి నర్థము ప్రబల వ్రాయంగ నేర్చె
బాల్యమునయంద బహుకళాప్రౌఢి మించెఁ
జిరయశోహారి జన్నయసిద్ధశౌరి.

49


సీ.

చిత్రగుప్తునకైనఁ జింతింప నరుదైన
        గణితవిద్యాప్రౌఢి ఘనత కెక్కె
నవరసంబులయందు నవ్యకావ్యంబులు
        కవిజనంబులు మెచ్చఁగా నొనర్చె

నాణిముతైములసోయగము మించినవ్రాలు
        వరుసతో నిరుగేల వ్రాయ నేర్చె
నాత్మీయ లిపియట్టు లన్యదేశంబుల
        లిపులను జదువంగ నిపుణుఁ డయ్యె


తే.

దేవరాయమహారాయధీవిధేయ
మంత్రివల్లభచామనామాత్యదత్త
చామరచ్ఛత్రశిబికాది సకలభాగ్య
చిహ్నముల నొప్పె జన్నయసిద్ధమంత్రి.

50


ఉ.

చంద్రుఁడు కాంతి, నర్జునుడు శౌర్యమునన్, హరి సంపదన్, హరి
శ్చంద్రుఁడు సత్యవాక్యమున, శంభుఁడు భూతి, గురుండు నీతి, దే
వేంద్రుఁడు వైభవంబున, ధనేంద్రుఁడు దానమునందు నీ డనన్
సాంద్రయశోవిశాలుఁ డగుజన్నయసిద్ధయ యొప్పు నెప్పుడున్.

51


ఉ.

వెన్నెలగంటిసూర్యుఁడు వివేకగుణాఢ్యుఁడు వేదశాస్త్రసం
పన్నుఁడు రెడ్డివేమనరపాలకుచేత మహాగ్రహారముల్
గొన్నకవీంద్రకుంజరుఁ డకుంఠితతేజుఁడు పెద్దతండ్రిగా
సన్నుతి గన్నసిద్ధునకు, సంతతదానకళావినోదికిన్.

52


ఉ.

నైజకళావివేకగుణనవ్యవిలాససమగ్రవిత్తవి
భ్రాజితవైభవంబుల తరంబుల జన్నయసిద్ధమంత్రికిన్
రాజును భోజరాజు రతిరాజును గిన్నరరాజు దేవతా
రాజును బోల రండ్రు కవిరాజులు రాజసభాంతరంబులన్.

53


క.

చందురుఁ గన్నపయోనిధి
చందంబున సిద్ధమంత్రి జనతానయనా
నందనుఁడు తిప్పధీమణి
నందనుఁడుగ నిత్య సేవనస్థితి మించెన్.

54


వ.

తదీయానుజుండు.

55

సీ.

చెలిమిచేఁ గలిమిచేఁ జెన్నొందఁగ నొనర్చి
        హితుల నిత్యానందయుతులఁ జేసె
శక్తిచే భక్తిచే సేవన మొనరించి
        గురుల సమ్మదరసాకరులఁ జేసె
సమతచే మమతచే సంతర్పణ మొనర్చి
        జనుల సంపూర్ణజీవనులఁ జేసె
నయముచేఁ బ్రియముచే నానాట నలరించి
        కవుల వైభవరమాధవులఁ జేసె


తే.

నీతిచేత వినీతిచే నేర్పు మెఱసి
గరిమఁ దనరాజు ధనరాజుగా నొనర్చె
సుగుణచంద్రికానందితసుజనహృదయ
కైరవుండగు జన్నయభైరవుండు.

56


వ.

ఈ దృగ్వంశవర్ణనాసముదీర్ణకీర్తినిధానంబైన యమ్మంత్రినిధానంబునకును.

57


షష్ఠ్యంతములు

క.

శ్రీమద్వల్లయవరసుత
చామనదండాధినాథసామ్రాజ్యరమా
సామగ్రీసంపాదక
సామాదికచతురుపాయసంవన్నునకున్.

58


క.

సముచితయజనాదివిధి
క్రమనిపుణున, కుభయవంశఘనకీర్తిసము
ద్యమనియమాచారునకును
విమలాపస్తంబసూత్రవిఖ్యాతునకున్.

59


క.

దినకరదండనమస్కృతి
దినదినసంవర్ధమానతేజోనిధికిన్

వినుతహరితాన్వయాంబుధి
జనితకళానిధికి, సుకవిజనవరనిధికిన్.

60


క.

జన్నామాత్యునిసుతునకు
సన్నిహితసరస్వతీప్రసాదోదయసం
పన్నచతుష్షష్టికళా
సన్నాహస్ఫురితకీర్తిసౌభాగ్యునకున్.

61


క.

అక్కాంతానందనునకు
ధిక్కృతసురరాజమంత్రిధీవిభవునకున్
దిక్కూలంకషకీర్తికి
జక్కనకవికావ్యకరణసత్ప్రియమతికిన్.

62


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నారచియింపం బూనిన, నవ్యకావ్యకథాలక్ష్మికి సుధాసాగరంబయిన మధురానగరం బెట్టి దనిన.

63

కథాప్రారంభము

మధురాపుర వర్ణనము

చ.

ధరణికి గోటచక్రగిరి, దాని కగడ్తలు వారిరాసు, లా
పరిఖలు కోటలోనునికి భావ్యము గాదని యజ్ఞసూతి భా
సురముగఁ జక్రభూధరముచుట్టును వార్ధులు నిల్పె నాఁగ; శ్రీ
కరమగుకోటచుట్టును నగడ్తలు చెల్వగు నప్పురంబునన్.

64


తే.

అడుగుఁ జెంది భోగావతి యతిశయిల్లఁ
బరిఖ లక్ష్మీశుకరణిఁ జూపట్టె ననియొ,
దాను బురికోట యాకాశతటిని మోచి
సమధికోన్నతి గౌరీశుచంద మొందె.

65


క.

పురినప్రఖచిత మణిగణ
సురుచిరదీధితులవలన, సొరిదిని దివియల్
సరకుగొన రెట్టిరాత్రులఁ
గరమరు; దప్పురముకోటకావలివారల్.

66

చ.

వరకనకప్రభాతివిభవంబున మేరుమహీధరంబు లై
నిరుపమవజ్రమౌక్తికవినిర్మలకాంతుల వెండికొండ లై
సురుచిరరత్నదీధితులంపున రోహణపర్వతంబు లై
పురమున దేవగేహములు పొల్పెసలారును వైభవోన్నతిన్.

67


క.

అప్పురిసౌధములం గల
యొప్పును, బొడవును, దనర్పు, నూహించుచు వా
తప్పఁడె కలరూ పెల్లను
జెప్పెడుచో రెండువేలజిహ్వలవాఁడున్.

68


తే.

భూమిఁ దనతోడియిరువురుఁ బూజగొనఁగ
ధాత యాచందమునఁ బొందఁ దానుగోరి
వివిధభూసురాకారత వెలసె ననఁగ
బ్రహ్మసంఘంబు వెలయు నప్పట్టణమున.

69


సీ.

వేదశాస్త్రపురాణవిద్యానవద్యులు
        మంత్రతంత్రాగమమర్మవిదులు
నానావిధాధ్వరనైపుణ్యగణ్యులు
        సాధుసంరక్షణాచరణపరులు
నిఖలధర్మాధర్మనిశ్చితహృదయులు
        పరమకారుణికత్వభవ్యమతులు
నిజకులాసారైకనిష్ఠాగరిష్ఠులు
        నిత్యసత్యవ్రతనిరతవచను


తే.

లర్కతేజులు, సువ్రతు, లకుటిలాత్ము
లమలచరితులు, దైవజ్ఞు, లలఘుయశులు
విప్రు లొప్పుదు, రెప్పు డవ్వీటిలోనఁ
జిత్సదానందసంపూర్ణచిత్తు లగుచు.

70


చ.

దొరఁకొని పూర్వజన్మమున దుర్జనశిక్ష యొనర్పఁ గామి, సు
స్థిరమతి రాజ్యభోగములు చేకొనఁగాఁ దఱిలేమి నాత్మలో

హరి తలపోసి, సౌఖ్యముల నందఁగఁ దత్పురిఁ బెక్కురూపులై
సొరిది నించెనా, నృపతినూనులు వొల్తురు శ్రీ సమేతులై.

71


ఉ.

ఇంకని వారిధుల్, ధరణి నెవ్వరి వేఁడనియింద్రు, లెన్నఁడున్
బొంకనిధర్మనందనులు, పొంకముగందనిచంద్రబింబముల్,
శంకరుకింకలోఁబడనిశంబరసూదను, లాహవంబునన్
గొంకనిపార్థులై నృపతికుంజరసూనులు పొల్తు రప్పురిన్.

72


చ.

కరమున నున్నపున్కయును, గామునిభూతియు, నుడ్కుఫాలమున్,
గరివరచర్మమున్ దొఱఁగి, గ్రక్కున లేమికి బొమ్మగట్టఁడే
హరుఁడు, కుబేరుచె ల్మెడలి యాదట మాసఖుఁ డైన నంచు న
ప్పురమున వైశ్యు లాడుదురు పుణ్యముపేర్మిఁ బ్రతాపధాములై.

73


చ.

పొడవుగ నెల్లయంగడులఁ బ్రోవులు వోసిననూత్నరత్నముల్
కడఁక ననేకవేషములు గైకొని వచ్చినయర్థికోటికిన్
బిడికిళులాదిగాఁగ బలిపెట్టుదు రెప్పుడు వైశ్యభామిను
ల్కడవక హస్తకంకణకలధ్వను లొప్పఁగ నప్పురంబునన్.

74


ఆ.

లెక్క కెక్కుడైన మిక్కిలిసిరి గల్గ
నెన్ని, కోట్లపడగ లెత్తరామి
నపరిమితధనంబులను వ్రాలి పడగలు
గట్టు వైశ్యజనము పట్టణమున.

75


చ.

చెఱకును రాజనంబుఁ గృషిచేయుచు నుండెడునేర్పుకల్మియున్
దఱుఁగని ధాన్యముల్ పసులదాఁటులు దోఁటలుఁ గట్టుబండులున్
గుఱు తిడరాక యుండెడునగోచరవస్తుచయంబుఁ దేజులన్
దఱచుగ నీనుగోడిగలుఁ దత్పురిశూద్రుల కొప్పు నెప్పుడున్.

76


సీ

క్రోల్పులి నైన నుక్కునఁబట్టి, మీసాల
        నుయ్యెల లూఁగెడునోపికలును

మదహస్తి నయినను నెదిరి, కొమ్ములువట్టి
        చదికిలఁబడఁ ద్రోచుసత్వములును
గంఠీరవము నైనఁ గడిమికిఁ బెడఁబాపి
        సటలు వెఱుక జాలుసాహసములు
శరభంబు నైనను సరభసంబునఁ గిట్టి
        మూటకట్టుగఁ గట్టు మొక్కలములు


తే.

గలిగి, శస్త్రాస్త్రనిపుణులై కరము మెఱసి
యతిభయంకరాకారత నతిశయిల్లి
ధీరతాసముద్భటులైన వీరభటులు
పరఁగుచుండుదు రప్పురవరమునందు.

77


సీ.

మృగరాజమధ్యలై మిక్కిలి మెఱసియు
        వక్షోజకరికుంభరక్ష సేసి
చంద్రబిందాస్యలై చాల రాగిల్లియు
        నలకాంధకారంబు వెలయఁజేసి
పికనాదకంఠలై పెంపువహించియు
        నధరపల్లవముల ననునయించి
కలహంసగమనలై కడు బెడఁగారియుఁ
        గరమృణాళంబులఁ గరము మనిచి


తే.

నవ్యకౌముదీస్మితలయ్యు నయనపాద
సారసంబుల నెంతయు గారవించి
చిత్రసౌందర్యధుర్యలై చిగురుఁబోఁడు
లప్పురిఁ దనర్తు రెక్కుడు నొప్పిదముల.

78


చ.

తెలికనుదోయి మించులును, దిన్నని నవ్వులు, ముద్దుమోములున్
బలుచని చెక్కులుం, జిలుకపల్కులు, మెత్తని మేనుఁదీఁగలున్,
గలుగుట సందియం బయినకౌనులు, వట్రువలైన చన్నులున్
గలిగి, పురం జెలంగుదురు కామునిదీమములట్ల కామినుల్.

79


ఉ.

భూమిఁ గవీంద్రవాక్యములఁ బొచ్చెము సేయఁగ జెల్లెఁగాక, యా
తామరసాక్షులైన పురితన్వులశాతకటాక్షముల్ విట

స్తోమము మర్మదేశములఁ దూటి కలంపఁగఁ జాలుపోలికన్
గాముని పుష్పబాణములు కాముకుల న్నెఱినాటఁ బోలునే?

80


క.

అసమశరుఁ డించువిల్లును
గుసుమశరంబులును విడిచి, కొమ్మల భ్రూనే
త్రసమృద్ధిచేతఁ దత్పురి
బసగలవిలుకాఁ డనంగఁ బరఁగుచు నుండున్.

81


క.

యోషిజ్జనసౌందర్యవి
శేష మశేషంబు, వాగ్విజృంభణమహిమన్
భాషాపతి నిర్ణరగురు
భాషాశేషులకు రాదు ప్రస్తుతి సేయన్.

82


ఉ.

ఎత్తులయొప్పుకంటె సరమెత్తుట యొప్పఁగఁ, జొక్కి నిల్వకా
ఱొత్తడిఁ బుష్పముల్ కొసర కూరక యున్కికి నల్ల నవ్వుచున్
విత్తముతోన చిత్తములు వేగ హరింతురు నేర్పుమీఱఁగాఁ
జిత్తజువేఁటదీమములచెల్వునఁ దత్పురిఁ బుష్పలావికల్.

83


చ.

చిలుకలతేరుఁ గోయిలలసేనలుఁ దుమ్మెదపిండునారియున్
గలువలయమ్ములుం బ్రసవకార్ముకమున్ మగమీనుటెక్కెమున్
మలయసమీరుప్రాపుఁగని మన్మథుఁ డప్పురిలోనఁ ద్రిమ్మరున్
లలనలఁబ్రాణనాథు లెడ లజ్జల నుజ్జగిలంగఁ జేయుచున్.

84


సీ.

నడయాడ వరములు వడసి మోదమ్మున
        గూడియాడెడు నడగొండ లనఁగ
వర్షధారలు దానవారియై తొరఁగంగ
        ధర వసించిన యంబుదంబు లనఁగ
నాశాగజాకృతు లలవడ జనులకు
        జూప వచ్చిన బహురూపు లనఁగఁ
దిమిరారి దోఁచిన దీనతపెంపునఁ
        దెమలిన చీఁకటిగము లనంగ

తే.

వాలి చరియించుఁ బురి మదవారణములు
దారుణాహవాంభోనిధితారణములు
కదనవిజయరమాధారకారణములు
పృథులరాజన్యశౌర్యసంప్రేరణములు.

85


చ.

సురపతిదాడి నంబునిధిఁ జొచ్చినయద్రులు, నిచ్చ లప్పురిన్
దిరుగఁగ నాత్మఁ గోరి, శరధిన్ బరిఖాకృతిఁ గావు పెట్టి, తా
రరుదుగ భద్రసామజములై, సెలయేఱులు దానధారలై
తొరఁగుచు నున్న మాడ్కి, నతిదుస్సహతం గరులొప్పు నప్పురిన్.

86


సీ.

పవమాను నైనను నవమానయుతుఁ జేయుఁ
        జటులజవోపేతసత్త్వగరిమ
సింహగర్జల నైన జీరికిఁ గొనకుండుఁ
        బృథులహేషాఘోషభీషణముల
నాంజనేయుని నైన నవహసింపఁగఁ జాలు
        నతిదూరలంఘనాహంకృతులను
విక్రమార్కుని నైన వెఱఁగొందఁగాఁ జేయుఁ
        జండతరాఖిలసాహసముల


తే.

భరతముని నైన నొచ్చెంబు పట్టుచుండు
వివిధనర్తనచాతుర్యవిక్రమముల
జిత్రరూపము మెచ్చవు చెలువులందు,
వలను మీఱిన యప్పురివారువములు.

87


సీ.

శుకమంజులాలాపశుభకరస్థితి మించి
        పల్లవసందోహభాతిఁ దనరి
కలకంఠకూజితవిలసనంబుల నొంది
        రంభానురేఖలరమణ మెఱసి
హరిచందనస్ఫూర్తి ననిశంబుఁ దనరారి
        పుష్పసౌరభములఁ బొలుపుమిగిలి
సరసాలిమాలికాసంసక్తి విలసిల్లి
        విషమబాణాసనవృత్తిఁ జెంది

తే.

లలితమాకందవైభవంబుల దనర్చి
యతిమనోహరాకారత నతిశయిల్లి
యుద్యదుద్యానవాటిక లుల్లసిల్లు
వారవనితలు నాఁ బురవరమునందు.

88


సీ.

సరసపుష్పపరాగపైకతంబులు దీర్చి
        తేనియకాలువల్ తెరలిపాఱ
రమ్యమయూరసంభ్రమలీలఁ గల్పించి
        ఘనతమాలాంబుదకాంతిఁ దనర
లతికావిలాసినీలాస్యంబు ఘటియించి
        చతురమారుతనటస్వామి వొలయఁ
జారుపల్లవరాగసంధ్యామహిమఁ జూపి
        విమలకోరకతారకములు మెఱయ


తే.

సతతవిహరణదంపతిచారుదేహ
రత్నభూషారుచిస్తోమరమ్య మగుచుఁ
బొలుచు నారామసమితి తత్పురమునందు
గల్పకావలి భువిమీఁదఁ గలిగె ననఁగ.

89


శా.

ఆరామంబులు పెక్కు గల్గును సునాయాసంబుగా నేచి ము
క్కారుం బండును రాజనంబుఁ జెఱకున్ గప్పారుపూదేఁనియన్
నీ రెల్లప్పుడు నిండియుండుఁ జెఱువుల్ నిర్మించు టెల్లన్ బురిం
బౌరశ్రేణికి గోకదంబమునకున్ బాథోవిహారార్థమై.

90


చ.

కరిమకరాలయాఢ్యత, బ్రకామగభీరత, నచ్యుతస్థితిన్,
వరకమలోదయస్ఫురణ పాలుటఁ బన్నగలోకసంగతిన్,
ధరఁ గలవారికెల్లఁ బ్రమదంబున నాశ్రయమై తనర్చుటన్,
బరఁగుఁ బురిం దటాకములు పాలసముద్రముతో సమంబులై.

91


చ.

సరసిజనాభుఁ డట్టె హరి, సారససంభవుఁ డట్టె బ్రహ్మ, యా
సిరియును వజ్రవాస యటె, చిత్తమునం దలపోసి చూడఁగా

దొరయునె యీప్రసూనములతో నితరప్రసవవ్రజంబు నాఁ,
బురమునఁ బద్మషండములు పొల్పెసలారు మనోహరంబులై.

92


సీ.

కామశాస్త్రంబులు వేమాఱు నియతిమైఁ
        జదువకుండినఁ బుష్పశరునియాన
మన్మథాగమములమర్మంబు లెల్లను
        జూడకుండిన రమాసుతునియాన
సూనాస్త్రతత్త్వవిజ్ఞానంబు గడముట్టఁ
        గనుఁగొనకున్న నంగజునియాన
మకరకేతనమంత్రసుకరాక్షరము లను
        ష్ఠింపకుండిన మనసిజునియాస


తే.

యనుచు, జనులెల్ల వినఁ జాటుననువు దోఁవ
మత్తకోకిలనిస్వన మధురకీర
భాషణంబులు వీనులపండు వగుచుఁ
దనరుఁ దత్పురి నుపవనాంతరములందు.

93


ఉ.

చిత్తజురాజ్యసంపద యశేషము గైకొని సౌఖ్య మందఁగా
[6]నుత్తులు దార నాఁ బురవరోపవనంబులు సొచ్చి యిచ్చఁ బూ
గుత్తుల వ్రాలి, తేనియలు కుత్తుగబంటిగఁ గ్రోలి, లీలమై
నొత్తిలి మ్రోయు చింపుదళుకొత్తుచు నుండు మదాలిదంపతుల్.

94


సీ.

విరజాజివిరులపై విహరించు విహరించి
        సొబగు నెత్తావులు చూఱలాడు
బొండుమల్లియలపైఁ బొరలాడుఁ బొరలాడి
        పుష్పంధయంబులఁ బోవఁజోపుఁ
గన్నె గేదఁగు లొయ్యఁ గదలించుఁ గదలించి
        చదలఁ బుప్పొడి వెదచల్లియాడు
జలజ వనంబులోఁ జరియించుఁ జరియించి
        దొరఁగు పూఁదేనెలఁ దొప్పఁదోఁగు


తే.

సతతబహువిధరతపరిశ్రాంతి నొంది
యున్నవనపాలదంపతు లొడల నున్న

చెమటలల్లనఁ బాయంగఁ జేయుచుండు
నప్పురంబునఁ బ్రమదవనానిలుండు.

95


శా.

వేమాఱు న్మలయానిలుం డడరి, యావీటం బ్రసూనాన్వితా
రామంబుల్ వెస ముట్టి, యందలి యలివ్రాతంబుఁ బోజోపి, తా
నామోదంబులు చూఱవట్టి బలియుండై యొప్పి, పౌరాంగనా
సీమంతంబులఁ బుష్పరేణు వునుచున్ సిందూరరేఖాకృతిన్.

96


సీ.

కమలాగృహకవాటకలితకుంచిక నాఁగ
        జలజకోరకరాజిఁ గలయఁదెఱచి
మధుకరాకర్షణమంత్రసిద్ధుఁడు నాఁగఁ
        గుసుమరజోభూతి దెసలఁ జల్లి
సుభగలతానటీసూత్రధారుఁడు నాఁగ
        నృత్యవిద్యాప్రౌఢి నెఱయనేర్పి
సకలజీవోన్మేషసంజీవని యనంగఁ
        బ్రకటనిద్రాముద్రఁ బాయఁజేసి


తే.

మందిరోద్యానవాటికలందుఁ బొలసి
వేగుబోకలఁ దత్పురి విభ్రమించు
శైత్యమాంద్యకసౌరభ్యసహితమైన
మలయపర్వతసంజాతమారుతంబు.

97


చ.

సిరి యుదయంబు నొందినవిశేషమున న్నవదుగ్ధవార్థియై
కర మరు దైనముత్యములు గల్గుట నూతనతామ్రపర్ణియై
వెరపున సత్ఫథస్థితి నవీనవియన్నది యై తనర్చి, యా
పురి బహుజీవనంబులఁ బ్రపూర్ణత నొందె జగన్నుతంబుగన్.

98


ఉ.

భామిను లెల్లఁ బద్మినులు, బాహ్మణు లెల్లఁ గృతాధ్వరోత్సవుల్,
భూమిససూను లెల్లఁ బటుభూరిభుజాబలవిక్రముల్, విట

గ్రామణు లెల్లఁ గామరసకావ్యకళాకలనావిశారదుల్,
కోమటు లెల్ల నర్థపులు, గుఱ్ఱము లెల్లను దేజు లప్పురిన్.

99


తే.

సకలకళలకు సుఖగోష్ఠి సలుపు నెలవు
మగతనంబుల కేకాంతమందిరంబు
పచ్చవిల్తుని కాయుధాభ్యాసశాల
యనఁగ, నొప్పారు నెప్పుడు నప్పురంబు.

100


వ.

మఱియు నప్పురవరంబు సరోవరంబునుం బోలె బహుజీవనపరిపూర్ణంబును గమలావాసవిలసితంబును గంకణగణకలితంబును రాజహంససేవ్యంబును గువలయానందభవ్యంబునునై, వసంతసమయంబునుంబోలెఁ బల్లవోల్లాసహృద్యంబును మదనవిహారానవద్యంబును సుమనోవికాసమహనీయంబును శుకశారికాలాపరమణీయంబును సకలజనమనఃప్రసాదంబును గలకంఠమృదులగానసంపాదంబునునై, రామాయణంబునుం బోలె రామాభిరామంబును భరతగొష్టీసీమంబును సుమిత్రాత్మజజనకతనయానందగమ్యంబును శత్రుఘ్నవ్యాపారరమ్యంబును నంగదకటకాలంకారకీర్తనంబును మహాబలకుమారోదారవర్తనంబునునై, మహాభారతంబునుం బోలె ధర్మనందనాచారప్రకారంబును శిఖండివిహారస్ఫారంబును భీమబలోద్దామంబును నర్జునుకీర్తిస్తోమంబును జాపాచార్యహస్తలాఘవప్రశస్తిభరితంబును గృపాచనచరితంబును నై, పయఃపారావారంబునుంబోలెఁ బురుషోత్తమవాసయోగ్యంబును లక్ష్మీజనిసౌభాగ్యంబును ననంతభోగిపరివృతకులగోత్రాలవాలంబును సకలరత్నోద్భవమూలంబునునై మెఱసి; మాతంగవారం బయ్యును మాతంగనివారంబై , పుండరీకమండనం బయ్యును బుండరీకఖండనంబై, పుణ్యజనభయంకరం బయ్యును బుణ్యజనశివశంకరంబై, మధుపకులనిరసనం బయ్యును మధువకులవిలసనంబై, యనంగవిహారసహితం బయ్యును ననంగవిహారరహితంబై తనరి; తనుకృశత్వంబు మానినీమధ్యంబులయంద, చంచలత్వంబు మృగేక్షణాకటాక్షంబులయంద, కుటిలస్వభావంబు కాంతాకుంతలంబులయంద, అన్యోన్యసంఘర్షణంబు ప్రమదాపయోధరంబులయంద, ఆలస్యంబు నితంబినీగమనంబులయంద, క్రూరత్వంబు సుముఖీనఖముఖంబులయంద, కలహంబు మానినీప్రణయప్రసంగంబులయంద, రాగాతిశయంబు బింబాధరామధురా

(గ్రంథపాతం)

ణప్రకీర్తితబుధజనానందుఁ డగుచుఁ
దనరె శృంగారశేఖరధరణివిభుఁడు.

102


క.

శోభాగణనీయయశో
లాభాగమనాఖిలాషలంపటుఁ డగుచున్
భూభాగ మేలె నాతఁడు
నాభాగ దిలీప రంతి నహుషులమాడ్కిన్.

103


క.

ఆరాజురాజ్యమున ధర
నారూఢివహించెఁ జిరతరాయు రనేక
శ్రీరుచిర పుత్త్రపౌత్త్ర స
దారోగ్యసుభాగ్యసంతతానందంబుల్.

104


వ.

అమ్మహీశ్వరుం డొక్కనాఁడు.

105


సీ.

సకలభాషాకావ్యసత్కవిరాజులు
        నుభయపార్శ్వంబుల నుల్లసిల్ల
సంగీతవిద్యాప్రసంగపారంగత
        గాయకేంద్రులు సమ్ముఖమున మెఱయఁ
జరమభాగమునందుఁ జామరగ్రాహిణీ
        కంకణఝణఝణత్కార మెసఁగఁ
బదపీఠిచెంగటఁ బ్రణతరాజకిరీట
        నవరత్ననీరాజనములు నిగుడ


తే.

సహజకరుణాకటాక్షవీక్షణవిశేష
దీపితాశేషధనకృతార్థీకృతార్థి
కలితచాటుసుధాపూర్ణకర్ణుఁ డగుచు
నిండువేడుకతోఁ గొలువుండునపుడు.

106


చంద్రగుప్తుఁడను విప్రకుమారుని రాక

ఉ.

క్రొన్ననవింటివాఁడొ నలకూబరుఁడో నలుఁడో జయంతుఁడో
యిన్నరమూర్తి, యంచుఁ గొలు వెల్లను నచ్చెరువొంది చూడఁగా,

విన్నను వొప్ప నొక్కరుఁడు విప్రకుమారకుఁ డేఁగుదేర, న
త్యున్నతరత్నపీఠమున నుంచి నృపాలకుఁ డిచ్చె నర్చనల్.

107


ఆ.

ఇచ్చి యాదరించి, యెయ్యది నీ నామ
మెచటనుండి యిచటి కేటి కిప్పు
డేఁగుదెంచినాఁడ? వెఱిగింపు మనుటయు
నిట్టులనియె భూసురేశ్వరుండు.

108


క.

నాపేరు చంద్రగుప్తుఁడు
భూపాలక! సకలకళలఁ బొగడొందినపృ
ద్ధోపాధ్యాయులశిష్యుఁడ
నాపుణ్యాత్ముల కృపాకటాక్షమువలనన్.

109


మ.

చతురామ్నాయములున్ దదంగములుఁ దూచాతప్పకుండ న్గ్రహిం
చితి, వేదార్థరహస్యముల్ దెలిసితిం, జేకొంటి న్యాయక్రమో
న్నతి, శీలించితి ధర్మశాస్త్రముఁ బురాణప్రౌఢిమన్ మించితిన్,
మతిలో నీపదునాల్గువిద్యలును సమ్మానంబునం బూనితిన్.

110


క.

గారవమున సకలకళా
పారీణుఁడ నైతిఁ, బసిఁడిపళ్లెరమైనన్
జేరుపగఁ జోటు వలె నని
చేరితి నిను, నాదుకోర్కిఁ జింతింపు మదిన్.

111


తే.

అనుచుఁ దళ్కాలయోగ్యంబు లైనయట్టి
భాషణంబుల బహుకళాప్రౌఢి దోఁపఁ
జంద్రగుప్తుండు గావించె సరసగోష్ఠి
వట్టిమ్రాఁకులఁ జిగుళులు పుట్టునట్టు.

112


ఉ.

ఆ లలితప్రసంగమున కాత్మదలిర్చిన, ఛత్రచామరాం
దోళిక లాదిగాఁ గలుగు తోరపుగింపద లిచ్చి, యమ్మహీ
పాలుఁడు సత్కరించె ద్విజబాలకముఖ్యు ననేకభంగి, ను
న్మీలితలంధుపంకజవనీకమలాప్తునిఁ జంద్రగుప్తునిన్.

113

మ.

చిరకీర్తిప్రథమానదానకలనా శృంగారశృంగారశే
ఖరధాత్రీరమణుండు నిత్యమును వేడ్కన్ దన్ను మన్నింప, సుం
దరలక్ష్మీరతి నుల్లసిల్లె ధరణీదేవోత్తముండుం బురిన్,
పరశిష్యప్రకరప్రబోధనకళావ్యాఖ్యానసౌఖ్యాత్ముఁడై.

114


మదనరేఖ వృత్తాంతము

క.

అంతట నొకనాఁడు జర
త్కాంతామణి యోర్తు గదిసి, ఘనతరవినయా
నంతభయభక్తి నతనికి
నెంతయుఁ బ్రియ మొదవ మ్రొక్కి, యిట్లనిపలికెన్.

115


సీ.

రమ్యగుణధామ శృంగారనిస్సీమ
        తోయజభవవంశతుహినధామ!
..మధురాపురాధీశుఁడై విలసిల్లు
        శృంగారశేఖరక్షితిపుపాల
..షలోత్తముండైన వీరవర్ముం డను
        దండనాయకుఁ డాత్మజుండు నాకు
..నిగాదిలిపట్టి యభినవతారుణ్య
        మహనీయతాస్పద మదనరేఖ,


తే.

రాగమంజరి యన నొప్పురాజసుతయుఁ
కొమ్మ నొకయీడుగాఁగ, నెంతయును వేడ్క
నమ్మహీపతి యక్కువఱొమ్మునందుఁ
..కొని యొక్కలాగునఁ బెనుపఁ బెరిఁగి.

116


క.

కామితఫలదము లనఁ దగు
నోములు సర్వమును నోఁచి, నుతదానకళా
శ్రీమించె బహుస్యందన
సామజహాయరోహణప్రశస్తి వహించెన్.

117


మదనరేఖ సౌందర్యము

క.

ఆ రమణి రూపరేఖా
చారువిలాసము లనన్యసాధారణముల్
శ్రీరమణీతనయరమా
ధారణములు ప్రథమరసకథాకారణముల్.

118

సీ.

అతివ తిన్ననిమాట లమృతంపుఁదేటలు
        హరినీలమణులమై నలరుకురులు
వనజాక్షిచూపులు వలరాజుతూపులు
        క్రొత్తవెన్నెలలోని క్రొవ్వు నవ్వు
మెలఁతమేనిమెఱుంగు మెఱయుకారుమెఱుంగు
        చిగురుకెంపులగ్రోవి చిన్నిమోవి
కోమలిచనుదోయి కొదమజక్కవదోయి
        శృంగారవీచులు చెలువవళులు


తే.

గంధసింధురశుండాప్రకాండకరభ
కదళికాకాండ కాంతవర్గములతోడి
పెందొడలు కాంతపెందొడ లెందు నరయ
మదనరేఖకు సరియైనమగువ గలదె?

119


మదనరేఖ చంద్రగుప్తునియం దనురక్త యగుట

క.

అన్నెలఁత నిన్న నున్నత
సన్నుతమణిచంద్రసౌధశాలలలోనన్
గ్రొన్ననవిలుతుని నోముచు
వెన్నెల నెచ్చెలులుఁ దాను విహరించుతఱిన్.

120


క.

చిలుకలతేరును, గోకిల
బలములు, లేఁజెఱకువిల్లుఁ బ్రసవాస్త్రములున్
దొలఁగించిన మరుఁడో! యన
విలసితగతి నీవు రాజవీథిఁ జరింపన్.

121


సీ.

ఎలమితోఁ గోరిక లీరిక లెత్తిన
        సరణి, మేఁ బులకలు జాదుకొనఁగ
నలువులువాఱెడు ననురాగరసలీల
        నానందబాష్పంబు లగ్గలింప
మఱుఁగువెట్టక డెంద మెఱఁగించుకైవడి
        గొబ్బునఁ బయ్యెదకొంగు సడలఁ
గనుఁగొన్నమాత్రానఁ గరఁగినగతి దోఁపఁ
        జెమటచిత్తడిసోన చిప్పతిలఁగఁ

తే.

దమకమును సిగ్గుఁ దమలోనఁ దడఁబడంగ
మఱపుఁజెయ్వుఱుఁ దమలోన మాఱుమలయ
సొలపుఁ జూపులుఁ దమలోన సూడుపట్ట
సహజశృంగార చేష్టలు సందడింప.

122


క.

లీలాతరంగితం బగు
లాలితభవదీయరూపలావణ్యరసం
బాలోలనయననలినీ
నాళంబులఁ గ్రోలుచుండె నలినాక్షి తగన్.

123


వ.

అంత.

124


క.

తరుణారుణారుణాంబుజ
శర మిక్షుశరాసనమున సంధించి మరుం
డరవిందనయన డెందము
కరమరుదుగ నుచ్చిపోవఁగా నేసె వెసన్.

125


క.

అగ్గజగామిని, కాముని
యగ్గలికకు బెగ్గడిల్లి, యాళిజనములన్
దిగ్గునఁ గనుమొఱఁగి, కడున్
సిగ్గున నేకాంతసదనసీమకుఁ జనియెన్.

126


వ.

అట్లు చనుటయు.

127


ఆ.

సకియ లత్తెఱంగు సకలంబు నూహించి
కార్యగతిఁ దలంచి కడుఁ జలించి
యిందువదన యున్నకందువ కేతెంచి
పొంచి నిలిచి, యాలకించునపుడు.

128


మదనరేఖ వలవంత

సీ.

తల్లిదండ్రులమాట చెల్లనిచ్చెద నన్నఁ
        దగు లుజ్జగింప నాతరముగాదు

మాటిమాటికిఁ గూర్మి మాటు సేసెద నన్న
        బైకొన్నవలవంత బయలువఱుచుఁ
జెలులతో నింతయుఁ జెప్పి చూచెద నన్న
        సిగ్గు నాచనవులు చెల్లనీదు
చక్కనిమానంబు చిక్కఁబట్టెద నన్న
        బంచబాణుఁడు గడుఁ బ్రల్లదీఁడు


తే.

కమలనయనాచకోరరాకాసుధాంశుఁ
డైన యతఁ డేడ, నేనేడ? ననితలంప
కకట! యందనిపంటికి నఱ్ఱుసాఁచెఁ
జిత్త; మిటమీఁద నే నేమి సేయుదాన.

129


క.

అని, చింతాసంతాపము
లనితరసాధారణంబులై, మదిలోనన్
బెనఁగొనఁగ నున్నకన్నియ
ననుగుణవతిఁ జేరి యిట్టు లనిరి వయస్యల్.

130


మ.

“తరుణీ! చిత్తము భూసురోత్తమునిమీఁదం జేర్చి, లజ్జాతిర
స్కరిణీగుప్తముగా నొనర్చి, యిటు లేకాంతంబు దుర్దాంతదు
ర్భరచింతం బడఁ బంతమమ్మ! మును వాక్ప్రౌఢిన్ విడంబింతుగా
విరహోత్కంఠితకామినీదళదశావిర్భావభావవ్యథల్”.

131


వ.

అంతఁ జతురికాజనంబులు తదీయదశాపనోదనం బొనరింపం దలంచి, యభిరామగృహారామంబున కెలయించిన.

132


సీ.

బాలరసాలంబుపైఁ గేలు సాఁపదు
        తిలకించి చూడదు తిలకతరువు
సంపంగె ముఖరాగసంపద నలరింప
        దడు గశోకమునకై యడరనీదు
పాట పెంపార్పఁ జూపదు ప్రియాళువుఁ జేరి
        కుచవీథిఁ గూర్పదు కురవకంబు

కర్ణి కారముఁ బొడగన్న మాటాడదు
        సిందువారముమీఁదఁ జేర్ప దూర్పు


తే.

ననుచు సురపొన్నఁ గనుఁగొన్న నవ్వ దెపుడు
పొగడఁ బుక్కిటిమథువునఁ బ్రోదిసేయ
దిందుముఖి దోహదక్రీడ లీడ విడిచె
నలరువిలుకానిములుకుల కాత్మ నులికి.

133


చెలులు శీతలోపచారము లొనరించుట

వ.

అప్పుడు.

134


క.

పొదలిన యారామములోఁ
గదలీతరుమధ్యదీర్ఘికాతటభూమిన్
బొదలిన గురువిందలలో
విదితంబగు చంద్రకాంతవేదికమీఁదన్.

135


చ.

దలమగు పచ్చకప్పురపుఁదాపులు పైపయి సోడుముట్టఁ జెం
గలువలపాన్పుపై నునిచి, కాంతకు గొజ్జఁగినీటితేటచే
జలకము లార్చి, మైఁ గలయఁ జందనపంక మలంది, యెంతయుం
బలుచనిసన్నగావివలిపంబులు గట్టఁగ నిచ్చి, నెచ్చెలుల్.

136


వ.

వెండియు.

137


క.

చల్లనిమం దని పైపైఁ
జల్లని మందొకటి లేదు, సతి డెందమునన్
జల్లఁదన మంద దయ్యెను
జల్లనిమందులను దాపసంపద మించెన్.

138


సీ.

అఱుతఁ దగిల్చిన యాణిముత్తెపుఁబేర్లు
        హరినీలహారంబులై తనర్చె
దనువల్లి నంటిన ధవళచందనచర్చ
        లీలఁ గాలాగరులేప మయ్యెఁ
గరముల మెత్తిన కర్పూరరేణువుల్
        కస్తూరికాగురుకణము లయ్యెఁ

సెజ్జపైఁ బఱచిన చేమంతిఱేకులు
        కలయ నిందీవరదళము లయ్యెఁ


తే.

జిత్తజాతుండు కనుమాయ చేసినాఁడొ
మన మనంబుల విభ్రాంతి మట్టుకొనెనొ
కమలలోచనపరితాపగౌరవంబొ
యనుచు వెఱఁగంది మదిఁ గుంది యజ్ఞముఖులు.

139


క.

ఇంతకు మిన్నకయుండుట
పంతముగా దనుచు వీరవర్మునితోడన్
గాంతామణిసంతాపముఁ
గంతుప్రతాపంబు లులియఁగాఁ జెప్పుటయున్.

140


మదనరేఖను బెండ్లాడుమని చంద్రగుప్తునిఁ గోరుట

క.

విని, భయము ప్రియము మనమున
నెనయఁగ, నవ్విభుఁడు వినయ మెసకమెసంగన్
నను నీపాలికిఁ జను మని
పనిచినఁ బనివింటిఁ గార్యభంగి ఘటింపన్.

141


క.

చాలింపు మితరముల మదిఁ
బాలింపుము వీరవర్మఁ బ్రమదాత్మునిఁగా
నాలింపుము నావిన్నప
మేలింపు మనోజరాజ్య మెంతయు నింతిన్.

142


వ.

అనిన నమ్మహీసురముఖ్యుం డమ్మగువ కిట్లనియె.

143


క.

అతివా! ముదియఁగ ముదియఁగ
మతిదప్పెనొ కాక నీకు, మనమున నియమ
వ్రతపరుల శూద్రరమణీ
రతికై బోధింపవత్తురా? యిది తగవా!

144


చ.

అనపుడు, నింతి యీయెడఁ బ్రయాసపడం బనియేమి యంచు, వే
గన ములు ముంటఁ బుచ్చుటయె కార్యముగాఁ దలపోసి, చంద్రగు

ప్తునిఁ దగురీతి వీడుకొని, భూపతిపాలికిఁ బోయి పూసగ్రు
చ్చినగతిఁ గార్యనిర్ణయ మశేషము తిన్నగ విన్నవించినన్.

145


మదనరేఖను బెండ్లాడుమని రాజు చంద్రగుప్తు నర్థించుట

చ.

విని కడుసంభ్రమించి యతి వేగమ కంచుకిఁ బంచి చంద్రగు
ప్తునిఁ బిలిపించి, యాదరముతోడ సమున్నతనూత్నరత్నకాం
చనమయరమ్యపీఠ మిడి, సారగభీరవచోనిరూఢి నొ
య్యన వినయంబు తేటవడ నమ్మనుజేంద్రకులేంద్రుఁ డిట్లనన్.

146


ఆ.

నిరుపమానమైన నీ మోహనాకార
రేఖ చూచె మదనరేఖ యనుచు
నదియ తప్పుచేసి, యలరంపగము లేసి
యలఁతఁబెట్టఁ దొణఁగె నంగభవుఁడు.

147


క.

మరుచే దొడిఁబడకుండఁగఁ
గరుణింపు, సరోజనేత్రఁ గావు, ‘మహింసా
పరమోధర్మ’ యనం గల
పరమార్థనిరూపణంబు భావించి మదిన్.

148


వ.

అనవుడు నబ్భూసురుండు.

149


మ.

సచ్చరితానువర్తనము సాధుజనంబులు సమ్మతింపగా,
నచ్చపుబ్రహ్మచర్యము ప్రయత్నమునం జరియించుచుండి, నేఁ
దొచ్చెల శూద్రఊామినికి నువ్విళులూరి పథంబు దప్పఁగా
వచ్చునె తెడ్డునాకి యుపవాసము మాన్పికొనంగ నేటికిన్?

150


క.

వర్ణాశ్రమధర్మంబుల
నిర్ణయములు దొఱుఁగకుండ నియమించు యశః
పూర్ణులు, మీరలె యీయది
నిర్ణయమని పలుకఁ దగునె నిండినసభలోన్?

151


వ.

అనిన నమ్మహీశ్వరుం డిట్లనియె.

152

క.

పారాశర్యప్రముఖు ల
పారకృపామహిమ తేటపడ నింతులదౌ
కోరిక దీర్చుట వినమే?
వారిసదాచారగౌరవం బెడలెనొకో!

153


చంద్రగుప్తుని ప్రత్యుత్తరము

క.

నావుడు భూసురుఁ డిట్లను
దేవరయానతియు నస్మదీయనియమమున్
భావించి యుభయసమ్మతి
గావించునుపాయ మొకటి గాంచితి, వినుఁడీ!

154


చ.

వరుసను బ్రాహ్మణోత్తముఁడు వర్ణచతుష్టయజాతకన్యలన్
బరిణయమౌట ధర్మ మని పల్కుదు రాదిమునీంద్రముఖ్యు, ల
వ్వెర వొడఁగూడునేనిఁ బృథివీవర! యీవరపర్ణినీమణిన్
గరమనురాగలీలఁ బ్రియకామిని గాఁగఁ బరిగ్రహించెదన్.

155


వ.

అనిన నమ్మహీపాలుండు తదనులాపానురూపప్రవర్తితకార్యుం డగుటయుఁ దద్వృత్తాంతం బంతయు మదనరేఖ కాంతాజనంబులవలన నెఱిఁగి.

156


క.

కాదంబినీసముద్గత
నాదంబున నీపలతిక ననిచినభంగిన్
జాదుకొని పులకకలికా
శ్రీదనువల్లికకుఁ జాలఁ జెన్నొదవింపన్.

157


సీ.

చెదరినయలకలచిక్కు సక్కఁగఁ దీర్చి
        జాఱినగనయంబు సవదరించి
తనువునఁ బైకొన్నతాప ముజ్జనచేసి
        తొరఁగెడికన్నీరు తొలఁగఁ ద్రోచి
చెక్కుటద్దములపైఁ జిఱునవ్వు చిలికించి
        చిన్నవోయిన మోము సేద దీర్చి
తలఁకుడెందముతోడఁ దాలిమి గీలించి
        పయ్యెదఁ జనుదోయిఁ బదిలవఱచి

తే.

పంచబాణుఁడు కరసానఁబట్టినట్టి
రత్నపుత్త్రికవోలె వినూత్నరత్న
కాంతి నెంతయు మోదించి, కమలవదన
సఖుల కెల్లను లోచనోత్సవము చేసె.

158


తే.

అంత నిజపురి శృంగార మాచరింప
బనిచె శృంగారశేఖరమనుజవిభుఁడు
హితపురోహితమంత్రినమ్మతముగాఁగఁ
దత్తదనుకూలశుభముహూర్తములయందు.

159


చంద్రగుప్తుఁడు మదనరేఖాదుల నలువురను వివాహమాడుట

సీ.

తనపురోహితుఁడు నాఁ దగువిష్ణుశర్ముని
        వరపుత్త్రియగు శీలవతిలతాంగిఁ
దనతనూజాతయై కారుణ్యమున నొప్పు
        రాగమంజరియను రాజవదనఁ
దనదుభాండాగారమున కధీశ్వరుఁ డైన
        ధనగుప్తుడను వైశ్యుతనయ సుమతి
దనదండనాయకోత్తమునిగాదిలికూతు
        మదవతీమణియైన మదనరేఖఁ


తే.

గ్రమము దప్పకయుండ నారాజవరుఁడు
సకలలౌకికవైదికాచారసరణిఁ
బ్రియముతో విప్రవరునకుఁ బెండ్లి సేసె
వేఱుసేయక వారికి వేఱువేఱ.

160


క.

నానామణిగణకాంచన
చీనాంబరబహుసుగంధశృంగారవతీ
దానానేకపరథతుర
గానేకగ్రామసమితి నరణం బిచ్చెన్.

161


క.

ఆ వివిధవినుతవిభవ
శ్రీవిలసనభాగ్యరసవిశేషస్ఫురణన్

దేవేంద్రునిగతి ధరణీ
దేవేంద్రుఁడు సకలభోగదీపితుఁ డగుచున్.

162


సీ.

శీలవతీనిత్యశృంగారరేఖావ
        నాంతరక్రీడావసంతుఁ డగుచు
మంజులతరరాగమంజరీవక్షోజ
        మంజరీమధుపకుమారుఁ డగుచు
సుమతిసీమంతినీకమనీయశశికాంత
        పాంచాలికాశీతభానుఁ డగుచు
మదనరేఖావధూమానసాంతరరాజ
        హంసావతంసవిహారుఁ డగుచు


తే.

వరుస దక్షిణనాయకత్వమున మించి
యొక్క తెఱఁగున ననురాగ మొదవఁ జేసి
యుచితరతిరాజలీలల నోలలార్చెఁ
జంద్రగుప్తమహీసురచక్రవర్తి.

163


క.

ఇత్తెఱఁగున నన్నలువురు
మత్తచకోరాక్షులకుఁ గ్రమక్రమము మెయిన్
జిత్తజకేళీనిపుణతఁ
జిత్తానందంబు లొదవఁజేయుచు నుండెన్.

164


వ.

అంతఁ గొంతకాలంబునకును.

165


మదనరేఖాదులు గర్భవతు లగుట

సీ.

చూపుల నిగురొత్తు సోలంబుతోడన
        సోలంబు తనువున మేళవింప
విలసిల్లుత్రివళులవిరివితోఁ గూడంగ
        విరివి నెమ్మనముల విస్తరిల్ల
జడిగొన్నచెయ్వులజడనుతోడను గూడ
        జడను నెన్నడలను జాదుకొనఁగ
బొలుపొరునారులనలుపుతోడనుగూడ
        నలుపు చన్మొనలందు నాటుకొనఁగ

తే.

గమనములఁ జాల నలసత గానఁబడఁగ
నెమ్మనంబులు మృత్సౌరభమ్ము గోర
మిగులవ్రేఁకని తొడవులమెచ్చు సడల
గర్భసంపద నొప్పి రక్కమలముఖులు.

166


సీ.

వేదవేదాంగాదివిద్యలు శీలింప
        శీలవతీకాంత చింతసేయు
ధరణి నేశాతపత్రముగ నేలుకొనంగ
        సతతంబు రాగమంజరి తలంచు
రాజరంజనరీతి రసికతామహిమల
        సుమతియై వెలుఁగంగ సుమతి గోరు
సగుణనిర్గుణములసంబోధనాపేక్ష
        మదిలోన భావించు మదనరేఖ


తే.

యాత్మగర్భాంతరాళంబులందు నున్న
యర్భకులయందు నందమై యతిశయిల్లు
గుణము లన్నియు నిచ్చానుగుణము లగుచు
నాఁటినాఁటికి దమయందు నాటుకొనఁగ.

167


చ.

లలితకపోలమండలములన్ మణికుండలముల్ నటింప, వి
చ్చలవిడిగా వినూత్నపురుషాయితకేలికి నగ్గలించు న
గ్గలికలు చెల్లకున్న, నధికవ్యథ నొయ్యన మాటిమాటి కూ
ర్పులు నిగిడింపఁ జొచ్చిరి సరోరుహనేత్రలు గర్భభిన్నతన్.

168


చ.

కనుఁగొని, నెమ్మనం బలరఁగాఁ బులిజున్నును నేదుకన్ను దె
మ్మనినను దెచ్చువాఁడఁ, బ్రియ మైనవి యెల్లను జెప్పుఁడంచు [7]గొ
బ్బన హృదయానువర్తి యయి, పల్కును బంతము నొక్కభంగి గాఁ
దనియఁగ నిచ్చు నవ్విభుఁడు తామరసాదులు గోరుకోరికల్.

169

వరరుచి విక్రమార్కాదుల జననము

క.

అంత నవమాసము లతి
క్రాంతము లగుటయును, విమలకైరవహితసి
ద్ధాంతమతి వెలుఁగు తేజో
వంతుడగు సుతుఁడు శీలవతి కుదయించెన్.

170


తే.

తత్సుతోదయవార్తామహోత్సవమునఁ
జంద్రగుప్తుండు పూర్ణిమాచంద్రుఁ గనిన
సంద్రమునుబోలె నానందసాంద్రుఁ డగుచు
మఱి యథావిధి జాతకర్మం బొనర్చె.

171


చ.

అరు దగుచున్న జన్మసమయగ్రహయోగబలంబు పెంపునన్
వరరుచియై దిగంతముల వాలుఁ జతుర్దశసంఖ్య విద్యలన్
వరరుచి యైనమూర్తి నవవారిజమిత్త్రునిఁ బోలునంచుఁ దా
వరరుచినామవిస్ఫురణవంతునిఁగా నొనరించెఁ బుత్త్రకున్.

172


వ.

ఒనరించి తోడ్తోన నిరతిశయలీలాలోకసరిరంసామాంగల్యమిళితమనోహరాంగుండై యుండె నంతఁ గొన్నిదినంబులకును.

173


మ.

దినకృద్వాసరచైత్రశుక్లనవమిం దిష్యం దృతీయాం సం
జననం బొందెను రాగమంజరికి రాజద్భాగ్యసౌభాగ్యసూ
చనలగ్నంబునఁ బుత్త్రరత్నము, నిజోచ్చక్షేత్రసందీప్తులై
యిన[8]మందారసురాసురేజ్యబుధు లా యిందు న్విలోకింపఁగన్.

174


వ.

అమ్ముహూర్తంబు మౌహూర్తికోత్తములు నిరూపించి.

175


శ్లో.

కుముదగహనబంధౌ వీక్ష్యమాణే సమస్తై
రగనగగృహవాసైర్దీర్ఘజీవీసతుస్యాత్
యదసదశుభజన్యం యచ్చకీదృద్విమోదం
నభవతి నరనాథస్సార్వభౌమో జితారిః.

176


వ.

అని హోరాస్కంధబంధురం బైన యీపద్యంబు నుపన్యసించి, యిక్కుమారుండు దీర్ఘాయురుపేతుండును, జితారిసంఘాతుండును జక్రవర్తిపదఖ్యాతుండును నగునని విన్నవించిన.

177

క.

ఆ వార్త లమృతహరీ
భావంబునఁ గర్ణవీథిఁ బ్రవహించి, తను
ప్లావనము చేసి, ధరణీ
దేవకులాగ్రణిమనంబుఁ దెప్పలఁదేల్చెన్.

178


వ.

అయ్యవసరంబున.

179


మ.

కురిసెం గల్పతరుప్రసూనములు దిక్కూలంకషప్రాయమై
మొఱసెం దివ్యమృదంగనిస్వనము సమ్మోదానుసంపాదియై
బెరసెన్ జందనశైలమారుతము గంభీరాప్సరోనృత్యముల్
దొరసెన్ గన్నులపండువై జనులు సంతోషించి ఘోషింపఁగన్.

180


క.

ఆ జగతీసురుఁ డప్పుడు
రాజోచితబహుతురంగరథధేనుమహీ
రాజముఖీధనధాన్యస
మాజమహాదానగుణసమగ్రత మెఱయన్.

181


వ.

జాతకర్మంబు యధోచితక్రమంబున నిర్వర్తించి, యనంతరంబ.

182


తే.

విక్రమంబున నాదిత్యువిధము దోఁప
సుప్రతాపానురూపతేజోవిశేష
కలితుఁ డగునని తజ్జన్మఫల మెఱంగి
తనయు విక్రమాదిత్యాభిధానుఁ జేసె.

183


తే.

అంత సుమతికి సంజాతుఁ డైనయట్టి
పట్టిని భట్టియని పేరువెట్టి పిదప
మదనరేఖావిలాసిని కుదయమైన
తనయులకు భర్తృహరినామ మొనరఁ జేసె.

184


వ.

ఇత్తెఱంగునఁ బుత్త్రోదయోత్సవానందబునం దృప్తుండై చంద్రగుప్తుండు.

185

క.

సముచితకర్మక్రియలను
సముచిత సంవర్ధనముల, సముచితవిద్యా
సముదయసంశిక్షణములఁ
గ్రమమున నందనుల ఘనులఁగాఁ జేయుటయున్.

186


క.

లోకహితకావ్యరచనా
సాకల్యప్రౌఢి వేదశాస్త్రపురాణ
వ్యాకరణసరణి, వరరుచి
యేకముఖబ్రహ్మ యనఁగ నెన్నిక కెక్కెన్.

187


సీ.

వచియించెఁ బ్రాకృతవ్యాకరణాగమం
        బభినవంబుగ భోజవిభుఁడు మెచ్చ
సకలవర్ణాశ్రమాచారనిర్ణయ మొప్ప
        ధర్మశాస్త్ర మొనర్చెఁ దద్జ్ఞు లలర
ధీయుక్తి మెఱయ జ్యోతిశ్శాస్త్ర మొనరించె
        సకలలోకోపకారకము గాఁగఁ
గాళిదాసునినవ్యకావ్యవిద్యాప్రౌఢి
        వరకవీశ్వరచక్రవర్తిఁ జేసె


తే.

భవ్యనారాయణీయ ప్రపంచసార
శారదాతిలకాదిప్రశస్తమంత్ర
శాస్త్రసర్వంకషజ్ఞానసరణి మించె
శీలవతివట్టి సర్వజ్ఞశేఖరుండు.

188


శా.

శ్రౌతస్మారరహస్యవేదులు గురుస్థానంబుగాఁ జూడ, వి
ఖ్యాతప్రౌఢి మహాకవీశ్వరులు సాక్షాద్భారతీమూర్తిగాఁ
జేతోవీథిఁ దలంపఁగా, నతఁడు మించెన్ ధర్మమర్మజ్ఞతా
చాతుర్యోన్నతు లైనరాజులకుఁ బూజాలింగమై పెంపునన్.

189


సీ.

వేదశాస్త్రపురాణవివిధాగమంబులు
        కరతలామలకంబుగా నెఱింగె

నవరసోజ్జ్వలకావ్యనాటకాలంకార
        సమితి నామూలచూడముగఁ జూచె
ధర్మార్థకామశాస్త్రప్రపంచంబులు
        [9]పల్లవిపాటగాఁ బరిచయించె
వారణస్యందనవాహనారోహణ
        క్రమమున మర్మగర్మములు దెలిసె


తే.

నృత్యగీతవిద్యాప్రౌఢి నిర్వహించె
సకలదివ్యాస్త్రశస్త్రప్రశస్తి మించెఁ
దేజమున నొప్పి భట్టిద్వితీయుఁ డగుచు
విక్రమాదిత్యుం డసమానవిక్రముండు.

190


క.

మరువము మొలవఁగఁ దోడనే
పరిమళ ముదయించినట్లు, పరమజ్ఞాన
స్ఫురణము బాల్యమునప్పుడె
పరిణతమై భర్తృహరికిఁ బ్రభవించుటయున్.

191


ఉ.

ఎంతయువేడ్కతోఁ బరిచయించినవిద్యలయట్ల, వేదవే
దాంతరహస్యమర్మములు నమ్మహితాత్ముని కాత్మఁ దోఁచె, న
త్యంతము చోద్యమై మెఱయు నంజనమబ్బినవానికిన్ ధరా
క్రాంతము లైనపెన్నిధులు కన్నులకుం బొడచూపుకైవడిన్.

192


ఉ.

అందఱు నన్నివిద్యల మహామహులై విలసిల్లుచుండగా,
నందనులం గనుంగొని మనంబునఁ బొంగుచుఁ జంద్రగుప్తుఁ డా
నందమహాంబుధిన్ దినదినంబును దెప్పలఁదేలుచుండె, సం
క్రందనుకంటె వైభవపరంపర మించి యనేకకాలమున్.

193


శా.

తారుణ్యంబున నమ్మహీసురుఁ డొగిన్ ధర్మార్థకామక్రియా
చారంబుల్ సరిగాఁ జరించి, తుద మోక్షశ్రీ నపేక్షించి, సం
సారాంభోనిధియానపాత్రమగు శ్రీశైలంబుమీఁదం దపం
బారంభింపఁ దలంచి, నందనుల డాయం బిల్చి తా నిట్లనున్.

194

శ్రీశైలమాహాత్మ్యము

తే.

గయ సహస్రయుగంబులు, కాశియందు
యుగసహస్రంబు, వింశతియుగము లధిక
నిష్ఠఁ గేదారమున నున్ననియతఫలము
నొక్కదినము శ్రీనగమున నున్నఁ గలుగు.

195


సీ.

శ్రీశైల మాత్మలోఁ జింతించినంతన
        జాతిస్మరత్వంబు సంభవించు
వేడ్కఁ దచ్చిఖరంబు వీక్షింపఁగోరిన
        సప్తజన్మాఘనాశంబు చేయు
నాత్రోవ రెండుమూఁడడుగు లేగినమాత్ర
        సకలజన్మములదోషములు పాయు
నత్యంతనియతిమై నగ్గిరి కేగినఁ
        బరమసాయుజ్యంబుఁ బడయవచ్చు


తే.

నెన్నిభంగుల శ్రీగిరి కేగువాఁడు
ధన్యుఁ డగు, నబ్బు నశ్వమేధంబుఫలము
నట్టిశ్రీగిరి కర్థిమై నరుగలేని
గుణవిహీనుండు పిచ్చుకకుంటుగాఁడె.

196


సీ.

ఏకొండశిఖరాగ్ర మీక్షించినంతన
        భవబంధములఁ బెడఁబావఁ గల్గు
నేకొండ యిల్లుగా నీశానుఁ డేప్రొద్దుఁ
        బార్వతీసహితుఁడై పాయకుండు
నేకొండపన్నిధి నెల్లతీర్థంబులు
        పాతాళగంగాఖ్యఁ బరఁగుచుండు
నేకొండమీఁద బ్రహ్మేంద్రాదిదివిజులు
        శబరవేషంబుల సంచరింతు


తే.

రట్టిశ్రీపర్వతము చూచినట్టివారు
గట్టిపుణ్యంబు చేసినయట్టివారు
ఘనతపఃఫలసిద్ధులు గన్నవారు
హరుని కత్యంతనిజభక్తు లైనవారు.

197

క.

ఏ పాపము లొనరించిన
నాపాపము లణఁచుచుండు నటమీఁద, నరుం.
డోపిక మీఱంగాఁ జని
శ్రీపర్వతదర్శనంబు చేసినయేనిన్.

198


చ.

శిల లఖలంబు లింగములు, చెట్లు సమస్తము గల్పభూజముల్,
జలములు దేవతానదిజలంబులు, మానవులెల్ల సంయముల్,
పలికినపల్కులెల్లను జపంబు, చరించుట సత్ప్రదక్షిణం
బులు, నిదురల్ సమాధి, తలపోయఁగ శ్రీగిరిమీఁదఁ జోద్యముల్!

199


ఉ.

వారణసీపురంబున నవారణ మేను దొఱంగనేల? కే
దారజలంబు లర్థి మెయిఁ ద్రావి శరీరము కోరవోవఁగా
నారడి నొంద నేల? యొకయప్పుడు జన్మము లేకయుంటకై
యారయ శ్రీనగంబుశిఖరాగ్రము చూచినఁ జాలు నెమ్మదిన్.

200


మ.

క్రతువిధ్వంసము, బ్రహ్మహత్యయును, ధర్మద్వేషమున్, సోదరీ
సుతసంహారము, నాదియైనదురితస్తోమంబులం బాసి, శా
శ్వతపుణ్యోదయుఁ డయ్యె నగ్గిరి నివాసంబౌట రుద్రుండు, దు
ష్కృతముల్ వాయుట లేమిచోద్యము జనుల్? శ్రీపర్వతం బెక్కినన్.

201


క.

కావున శ్రీనగమునకేఁ
బోవఁగ నూహించి, మిమ్ము బోధించుటకై
రావించితి, నావాక్యము
భావింపఁగ వలయు నిపుకు పరమార్థముగన్.

202


చ.

బ్రదుకుము విక్రమార్కనరపాలక! దిగ్విజయంబు చేసి, య
భ్యుదయముఁ బొందు భట్టి! నిజబుద్ధి నియోగితనంబునందు, స
మ్మదమున మించు భర్తృహరి! మా ధనమెల్లను నీకు నిచ్చితిన్,
హృదయ మెలర్పఁగా వరరుచీ! సుఖయింపుము వంశకర్తవై.

203


తే.

అనుచు నొడఁబడ వారికి నానతిచ్చి
యాత్మరమణీసమేతుఁడై యాక్షణంబ

శ్రీనగస్వామి పదపద్మసేవ సేయఁ
జంద్రగుప్తమహీసురచంద్రుఁ డరిగె.

204


వ.

ఇట్లు చతుర్థ పురుషార్థతత్త్వజ్ఞానగురుండైన నిజగురుం డరిగిన యనంతరంబ.

205


చ.

పరిచితనవ్యకావ్యరసభావవిచక్షణ, పుణ్యవీక్షణా!
పరమహితాశ్రితప్రకరబాంధవపోషణ, సత్యభాషణా!
తరళవిలోచనాజనవితానమనోభవ, నిత్యవైభవా!
నిరవధికప్రభావనృపనీతియుగంధర, కీర్తిబంధురా!

206


క.

చతురావధానభాషా
చతురజనస్తూయమాన సహజమనీషా!
యతులితగుణమణిభూషా
ప్రతివాసరవర్థమాన భవ్యవిశేషా!

207


మాలిని.

తరుణకమలనేత్రా, దర్పవజ్జైత్రయాత్రా!
పరహితసుచరిత్రా, భాగ్యలక్ష్మీకళత్రా!
సరససుకవిమిత్త్రా, సజ్జనారామచైత్రా
హరితకులపవిత్రా, యక్కమాంబాసుపుత్త్రా!

208


గద్య.

ఇది శ్రీమదఖిలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కననామధేయప్రణీతంబైన విక్రమార్కచరిత్రం బను కావ్యంబునందు బ్రథమాశ్వాసము.

  1. నికషోపలము=సాన
  2. సౌహిత్య=తృప్తి
  3. తలఁపఁ దదీయ యేకకవితానముకంటెను....అని వావిళ్ల. 1926.
  4. అమ్మహితాత్ముని తనయుఁడు
    సమ్మాన దయానిధాన........
    సిద్ధమంత్రి యెన్నిక కెక్కెన్. వావిళ్ల. 1926.
  5. నర్థి నర్థులు ప్రబల వ్రాయంగ నేర్చె, అని వావిళ్ల. 1926.
  6. అర్హులు
  7. గొ, బ్బున హృదయానువర్తి యయి పల్కును, వావిళ్ల. 1928. యతి(?)
  8. మంద+అర=శనికుజులు
  9. పల్లెపాఠంబుగాఁ బరిచయించె, అని పాఠాంతరము