విక్రమార్కచరిత్రము/ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు

విక్రమార్క చరిత్రము

ద్వితీయాశ్వాసము

శ్రీనాథచరణయుగళ
ధ్యానాధీనాంతరంగ, తరుణీజనచే
తోనందన, నిజమూర్తి
శ్రీనందన జన్ననార్యసిద్ధనమంత్రీ!

1


చ.

అరుదుగ విక్రమార్కవసుధాధిపచంద్రుఁడు, కీర్తిచంద్రికల్
ధరం బరఁగింప దిగ్విజయతత్పరుఁడై, యొకరుండు వింధ్యభూ
ధరమున కేఁగి, యందుఁ బ్రమదంబు మది న్విలసిల్లఁ గాంచె నీ
శ్వరవరవామభాగసహవాసవిలాసిని వింధ్యవాసినిన్.

2


వ.

కాంచి, లలాటాంబకకుటుంబినీపదాంభోరుహరోలంబకదంబాయితచికురనికురుంబలాంఛన లవనచంద్రమండలుండై, యమ్మండలాధీశ్వరుండు తదీయమందిరద్వారంబు నిర్గమించి, తత్ప్రదేశంబున.

3


కంథామణి పాత్రాదుల వృత్తాంతము

క.

ప్రబలాసురవరసూనులు
సుబలమహాబలులు వాలిసుగ్రీవులు నా
నిబిడాంగరక్తధారా
శబలితభూభాగమయిన సమర మొనర్పన్.

4


వ.

కాంచి తత్కలహంబు వారించి, తత్కారణం బడుగుటయు వార లిట్లనిరి.

5


చ.

హరునిగుఱించి వత్సరసహస్రము ఘోరతపంబు చేసి, త
త్కరుణ దుకూలకంథయును దండముఁ బావలు రత్నపాత్రమున్

వరమునఁ గాంచె మద్గురుఁ డవారణమైఁ బ్రబలాభిధానుఁ; డీ
[1]యురువిడిచేత నయ్యెడుప్రయోజన మెల్లను జిత్తగింపుమా.

6


శా.

ఈలాతంబున వ్రాయఁ బట్టణములౌ, నీపాదుకల్ మెట్టఁగా
నేలోకంబున కైన నేగ సులభం, బీపాత్ర దివ్యాన్నముల్
చాలంగా సమకూర్చుఁ, గోరినతఱిన్ సంధిల్లు నీకంథచే
వేలక్షల్ కనకంబు రాలు విద్రుపన్ విశ్వంభరాధీశ్వరా!

7


తే.

తండ్రి పిమ్మట నివి యేము తగినభంగిఁ
బంచుకొన నేర కిమ్మెయిఁ బ్రతిదినంబు
బోరుచున్నార మిట, నీవు పొందు వొసఁగఁ
బంచి పెట్టి రక్షింపుమీ పార్థివేంద్ర!

8


వ.

అనవుడు.

9


క.

జనపతులకుఁ బాపాత్ముల
ధన మెమ్మెయి నైనఁ గొనుట ధర్మం, బనఁగా
విని యున్నవాఁడు గావున
ధనసంగ్రహణంబునందుఁ దత్పరమతియై.

10


విక్రమార్కుఁడు కంథాదులు సంగ్రహించి యేగుట

చ.

అనఘుఁడు విక్రమార్కవసుధాధిపచంద్రుఁడు, మందహాస మా
ననము నలంకరింపఁ గుహనాచతురుండయి బుజ్జగించి, నా
పనుపున మీఱు చేసఱచి పాఱుఁడు, మీఱినయట్టివాఁడ యీ
ధనమున కెల్లఁ గర్త యగుఁ దప్పదు పొ, మ్మని యానతిచ్చినన్.

11


చ.

పనివడి యొండొరుం గడపఁ బాఱెడియాసను వారు దవ్వుగాఁ
జనుట యెఱింగి, కంథయును సన్మణిపాత్రయు యోగదండముం
గొని వెసఁ బాదుకల్ దొడిగికొంచు, వియచ్ఛరవాహినీకన
త్కనకసరోజగంధవహకౌతుకుఁడై వినువీథి కేగుచున్.

12

మేరుశైలవర్ణనము

చ.

కనియె నతండు, శంకరశిఖాశశిరంజితచంద్రకాంతసం
జనిత జలార్ద్రకల్పతరుజాలముఁ, గిన్నరకన్యకాప్రమో
దనమణిశృంగసంగతలతావనజాలము, దివ్యవాహినీ
వనజవనీతలద్రుహిణవాహమరాళము మేరుశైలమున్.

13


వ.

కనుంగొని ప్రమోదభరితమానసుండై.

14


సీ.

ఈకొండ మణికాంచనాకారరుచి గాంచెఁ
        గొండ లెల్లను దనుఁ గొండఁజేయ
నీకొండఁ గాఁపుండి యింద్రాదిసురముఖ్యు
        లెల్లభాగ్యములకు నెల్ల యైరి
యీకొండదండగా నీరేడుజగములు
        సుప్రతిష్ఠితములై సొంపుమిగిలె
నీకోండ కోదండమై కాలకంఠున
        కసమానజయలక్ష్మి నావహించె


తే.

నిర్జరాపగ యీకొండ నిర్ఝరంబు
పద్మబాంధవుఁ డీకొండపారికాఁపు
కొండయల్లునికొండ యీకొండశిఖర
మని సుమేరుప్రభావంబు లభినుతించి.

15


ఉ.

అందొక దివ్యరత్నశిఖరాగ్రతలంబున, రాగమంజరీ
నందనుఁ డబ్జినీతటమునన్ సురభూజమునీడ నిల్చి, లీ
లం దననెమ్మనంబునఁ దలంచినమాత్రనె పాత్రయందు నా
నందకరంబుగాఁ బొడమె నవ్యసుధామధురాన్నపానముల్.

16


విక్రమార్కుఁడు చంద్రపురంబును గావించి యేలుట

శా.

ఆయిష్టాన్నము లారగించి, యతఁ డాహ్లాదంబుతో మేరువున్
డాయం దక్షిణదిక్కునందు నొక చోటన్, యోగదండంబునన్
వ్రాయం గంధగజాశ్వసౌధసదనప్రాకారదేవాలయ
ప్రాయంబై యొకపట్టణం బరుదుగాఁ బ్రాదుర్భవించె న్వెసన్.

17


చ.

జనపతి యాపురంబునకుఁ జంద్రపురం బని పేరువెట్టి, యం
దనుపమరాజ్యవైభవమహామహిమన్ జెలువొంది, కంథ గ్ర

క్కున విదిలించి, యందుఁ బదికోటులు మాడలు రాలఁ బ్రోవుగా
ననయము నెల్లయర్థులకు నన్నరపాలకుఁ డిచ్చు నిచ్చలున్.

18


క.

కనుఁగొనిన వేయి, మాటా
డినఁ బదివే, ల్గుడువ లక్ష, డెందము ప్రమదం
బునఁ బొందినఁ గోటిధనం
బనయము నర్థులకు విక్రమార్కుం డొసఁగున్.

19


వ.

ఇవ్విధంబున ననన్యసామాన్యవదాన్యుండైన యారాజన్యుండు, పేరోలగంబున రత్నసింహాసనాసీనుండై యున్నయవసరంబున, వైహాయసమార్గంబున ననర్గళమణిమరీచిమాలికాదేదీప్యమానంబులైన దివ్యవిమానంబుల నవలోకించి, యాత్మీయమిత్త్రుండైనచిత్రరథుం డనుగంధర్వపతి, నివి యెందుఁ జనుచున్న వని యడుగుటయు, నతం డాతని కిట్లనియె.

20


ఆ.

సకలజీవలోకసజ్జనానందన
ప్రౌఢుఁ డైనపద్మభవునిఁ గొల్వ
ననుదినంబు నరుగునమరేంద్రముఖ్యుల
మణివిమానము లివి మనుజనాథ.

21


వ.

అనవుడు.

22


విక్రమార్కుఁడు బ్రహ్మసభ కేగుట

మ.

జగదుత్పత్తివిశారదుం డయిన భాషాజానియాస్థానిసో
యగ మీక్షించునపేక్ష, నాక్షణమ భృత్యామాత్యు లంగీకరిం
ప, గుణాలోలుఁడు సాహసాంకధరణీపాలుండు, లీలాగతిన్
గగనాభోగ మలంకరించె మణిరంగత్పాదుకాపాదుఁడై.

23


వ.

ఇవ్విధంబునం జని యమ్మహామహుండు, పితామహలోకాలోకనోత్సవం బంగీకరించి, తదాస్థానమండపంబు ప్రవేశించి.

24


సీ.

మౌద్గల్య మాతంగ మౌంజాయన మరీచి
        మైత్రేయ మాండవ్య మందపాల

కపిల కశ్యప కౌత్స కామంద కణ్వాత్రి
        కౌశిక కౌండిన్య కలహభోజ
వాత్స్యాయన వ్యాస వాల్మీకి వరతంతు
        వాలఖిల్య వసిష్ఠ వామదేవ
శరభంగ శుక శక్తి శార్ఙ్గ శారద్వత
        శౌనక శాండిల్య శాలిహోత్ర


తే.

జడభరత జహ్ను జాబాలి జామదగ్న్య
పులహ పిప్పల పర్వత పుండరీక
గార్గ్య గౌతమ గాలవ గణక మఖ్యు
లైనయాసంయమీశ్వరు లర్థిఁ గొలువ.

25


క.

యాగములు యాగకర్తలు
యోగములును యోగివరులు, నుచితాచార
ప్రాగుణ్యవిధులు నదులును
సాగరములు గిరులు దరులు సంసేవింపన్.

26


సీ.

తనతనుప్రభలతో నెనవచ్చుపటికంపు
        జపమాల యొకకేల నవదరించి
తనముద్దుమోముచందమున నందము నొందు
        నరవింద మొకకేల నలవరించి
తనమంజులాలాపతతిఁ గూడి భాషించు
        కీరంబు నొకకేల గారవించి
తనగాననినదంబు నెనయఁ జాలువివంచి -
        కేలిమై నొకకేలఁ గీలుకొల్పి


తే.

ప్రణతదిక్పాలబాలికాఫాలఫలక
తిలకమృగనాభిచిహ్నదేదీప్యమాన
చరణనఖచంద్రమై పూర్ణచంద్రవిమల
కమలకర్ణిక నుండి వాగ్రమణి కొలువ.

27


క.

కొలువున నెలవువహించిన
నలువకు సాష్టాంగ మెరఁగి, నరవరుఁడు రసా

కలితమృదుసార సౌరభ
సలలితవాక్పుష్పపూజ సమ్మతిఁ జేసెన్.

28


వ.

అప్పుడు ప్రసన్నతాచతురాననుం డైన చతురాననుం డిట్లనియె.

29


క.

ఎయ్యది కుల, మెయ్యది నెల
వెయ్యది నీనామ, మిప్పు డేచందమునన్
ఇయ్యెడకు వచ్చి? తనవుడు
నయ్యంబుజసూతితోడ నతఁ డిట్లనియెన్.

30


ఆ.

చంద్రగుప్తసుతుఁడ, చంద్రపురీశుండ
విక్రమార్కుఁ డనఁగ వెలయువాఁడ
దివ్యపాదుకాగతిప్రౌఢి వచ్చితి
నిచ్చ మిమ్ముఁ జూడ నిష్ట మగుట.

31


క.

నావుడు నతనిమహత్త్వము
భావించి విరించి చోద్యపడి సదయుండై
భూవర యేవర మడిగిన
నావర మే నిత్తు నీకు నని పల్కుటయున్.

32


ఉ.

ఫాలతలాగ్రచర్మము కృపాణమునం గొని చీరి యెత్తి. యీ
వ్రాలకు మీఁద నెక్కు డగువ్రా లొకకొన్ని లిఖంప నోపుదో?
యీలిపితోడఁ గొన్ని వెర వేర్పడ నిప్పుడు చక్కబెట్టఁగా
జాలుదొ? యానతిమ్మనిన సారసగర్భుఁడు విస్మితాత్ముఁడై.

33


ఉ.

ఆర్వురుచక్రవర్తులు సదార్వులు రాజులు విశ్వధారణీ
నిర్వహణప్రభావమున నేర్పరు లైనను, వీనిసాటియే
సర్వఫలప్రదానమున సాహసికత్వరమా సమగ్రతన్
గర్వితవీరవైరిచయఖండనమండనవిక్రమక్రియన్!

34


క.

ఇచ్చెద నొకవర మనినను
జెచ్చెర నామాట కుఱుచ సేసెను సభ, నీ

పొచ్చెము వాయుట కొఱకై
యిచ్చెద బ్రహ్మాస్త్రమైన నీతని కనుచున్.

35


బ్రహ్మ విక్రమార్కునకు బ్రహ్మాస్త్ర మొసంగుట

సీ.

సిద్ధాదు లగుకోష్ఠసీమలు పరికించి
        నామానుగుణము నిర్ణయము చేసి
యుచితదీక్షాకాల మూహించి యభిషిక్తుఁ
        జేసి జితస్థానసిద్ధి దెలిపి
కూర్మాసనాదులమర్మంబు లెఱిఁగించి
        యష్టాంగవివరణం బాచరించి
భూతశుద్ధితెఱంగు బోధించి మాతృకా
        విన్యాససరణి యుపన్యసించి


తే.

యావరణశక్తిబీజాధిదైవతములు
బలులు జపహోమతర్పణావళులు సెప్పి
సప్రయోగోపసంహరణప్రవీణుఁ
జేసి, బ్రహ్మాస్త్ర మిచ్చె నబ్జాననుండు.

36


వ.

ఇచ్చి మఱియు నిట్లనియె.

37


క.

మానుషశక్తి జయింపఁగ
రానిమహావీరు లైన రణశూరులపై
దీనిఁ బ్రయోగింపుము, బల
హీనులపై మఱచి యైన నేయకు మధిపా!

38


క.

అని బ్రహ్మ యానతిచ్చిన
జనపతి సాష్టాంగ మెరఁగి, సంభావితుఁడై
తనపురికి నరిగి జగతీ
జనరక్షణ చేయుచుండె సత్వరమతియై.

39


వ.

అంత, నాచంద్రపురంబునఁ జంద్రగుప్తాన్వయవార్థిచంద్రుం డైనరాజేంద్రుఁడు కీర్తిచంద్రికాసాంద్రుండై యుల్లసిల్లు టెఱింగి, త్రిజగదాశ్చర్య

చాతుర్యసకలకళాసంవిధానుండైన సుమతిసూనుండు చనుదెంచి, యుచితప్రకారంబునం బ్రవేశించి దండప్రణామంబు లాచరించిన, నుచితోపచారంబుల సంభావించి మథురానిర్గమనం బాదిగాఁగల యాత్మీయప్రయోజనంబు లఖిలంబులు నెఱింగించి, యిట్లనియె.

40


విక్రమార్కుఁడు భట్టికి నుజ్జయని విశేషము లెఱిఁగించుట

సీ.

చెలువొందు నేపురి శృంగారముగఁ గాల
        కంఠుఁ డెప్పుడు మహాకాలసంజ్ఞ
గోటిలింగంబులు కొమరారు నేవీట
        సంధ్యాత్రయమహోపచారగరిమ
విలయాంబునిధిపూరములయందు డిందక
        పెనుపొందు నేపుటభేదనంబు
యుగయుగంబునయందు నొక్కొక్కదివ్యాభి
        ధానంబు నేరాజధాని పూను


తే.

నంబికాదేవి యేపట్టణంబునందు
శ్రీమహాకాళినా నుతి శ్రీవహించు
నట్టియుజ్ఞని యోగపీఠాభిరామ
మైహికాముష్మికప్రదానాద్యసీమ.

41


ఆ.

ద్వారవతి యవంతి వారణాసి యయోధ్య
మథుర పుణ్యకోటి మాయ యనఁగ
నలఘుముక్తిదమ్ము లగుపట్టణములందు
నగ్రగణ్య యుజ్జయనిపురంబు.

42


వ.

అని పురాణప్రోక్తంబులగు సూక్తంబు లుపన్యసించి వెండియు.

43


సీ.

సర్వసర్వంసహాచక్రావతంసమై
        జయలక్ష్మి వెలయు నుజ్జయినియందు
శ్రీమన్మహాకాళికామందిరాంగణ
        స్థలి నగాధం బైనకొలనికెలన
నభ్రంకషాభోగమగు మఱ్ఱికొమ్మను
        గట్టినవ్రేలెడునుట్టి యెక్కి

చిత్రంబుగఁ దదీయసూత్రంబు లైదును
        ఘోరాసిచేఁ ద్రెవ్వం గోసి వైచి


తే.

యాజలాశయమధ్యంబునందు నున్న
యుగ్రశూలాగ్రమునఁ బడనోపువాఁడు
సకలసామ్రాజ్యవైభవోత్సవము నొంది
తత్పురం బేలు, నిది దేవతావరంబు.

44


క.

ఇది శిలవ్రాసినయది యని
[2]చదురున విప్రుం డొకఁడు ప్రసంగవశమునం
జదివెను నొగి నీపద్యము
నది యెఱుఁగఁగ వలయు, నచటి కరిగెద భట్టీ!

45


తే.

ఉట్టిచేరులు గోయంగ నుత్సహించి
యొకటి దెగఁగోసి వెండియు నొకటిఁ గోయ
మునుపుగోసినయది యంటుకొనుచునుండు
ననును విన్నార మిట్టిచోద్యములు గలవె!

46


క.

అన సుమతిసూనుఁ డిట్లను
జననాయక దీనికై విచారం బేలా?
విను ముట్టిచేరు లొక్కటఁ
బెనుపొతముగఁ గోయరాదె ప్రిదులక యుండన్.

47


ఉజ్జయిని కేగి కాళిని మెప్పించి విక్రమార్కుఁడు వరము పొందుట

మ.

అనినం దత్ప్రతిభావిశేషమున కత్యాశ్చర్యముం బొంది, య
మ్మనుజాధీశుఁడు భట్టిఁ జంద్రపురిసామ్రాజ్యంబున న్నిల్పి. భూ
జనసంరక్షణమార్గసమ్యగుపదేశం బిచ్చి, తా నేగె ను
జ్జనికిన్ సమ్మతిఁ బాదుకంబువలనన్ సంతోషితస్వాంతుఁడై.

48


వ.

అరిగి యనేక ప్రసూనసుగంధవహబంధురోపవనాపాదితసముత్కరంబయిన యన్నగరోపకంఠంబున.

49

ఉ.

మోహనమూర్తి యానృపతిముఖ్యుఁడు, గాంచె సువర్ణ కుంభస
న్నాహముఁ దుంగశృంగపరిణాహము, దర్పణరత్నతోరణో
త్సాహము, చంద్రికాధవళసౌధసమూహము, శ్రీమదంబికా
గేహము గోపురాగ్రతలఖేదవినోది దినేంద్రవాహమున్.

50


వ.

కని తదీయరామణీయకంబునకు నాశ్చర్యధుర్యుండై యక్కుమారవర్యుండు, వందారుబృందారకసుందరీసందోహసీమంతసింధూరపరాగపాటలితస్ఫటికమణికుట్టిమంబులవలనను, నటనఘటనారంభ రంభాపదాంభోజనిగళ దలక్తసంధ్యారాగరంజిత రంగస్థలీనభోంతరాళ తారకాయితముక్తాఫలోపహారంబులవలనను, సఖీజనసమాందోళిత డోలాసమారూఢ గంధర్వకామినీజేగీయమాన మధురగీతికాతిస్వనంబులవలనను, బ్రసిద్ధసిద్ధజనకథిత నవనాథచిత్రచరిత్ర వర్ణనప్రమోదహృదయ సామావిరాజమాన మణిమండపంబులవలనను, విటంకవిహరణపారావత కీరజిక శారికాపఠిత దేవస్తుతికథాగాథ శ్రవణప్రహృష్టహృదయ జనసముదయంబులవలనను, బ్రాకారసమీపసంజాత కరంజనికుంజ గంజామంజుమంజరీకుంభసంభృత మకరందమధురసాస్వాదమత్త మధుకరీగానతానానుకూల శాలిపాలికాబాలికానవరాగగీతప్రసంగంబులవలనను, నిరవలంబనాంబరచరద్రమణరమణీసురతశ్రమసంజాత ఘర్మాంబుబింద్వపనోదన చతురశీతలసమీరణసంజననకారణ పతాకానికాయంబులవలనను, జపలకపికంపితరసాలశాఖాపతిత పరిపక్వపలవాంఛాసంచరణ పౌరభామినీనివహంబులవలనను, నానాభివాంఛితశయితశాతోదరీసంపాద్యమాన జలధరోపమవిశాలనీలమణికుట్టిమప్రదేశంబులవలనను, నిరవధికభక్తిరసాతిశయ ప్రాణోపహారసమర్పణమహావీరవర శిలాప్రతిరూపంబులవలనను, గామితామితఫలోదయానందకందళితమనో మనోహర మానవానీతమహారంభగుంభితకుంభాంచిత కర్షణవ్యథానీయమాన స్వర్ణకోటివల్గనాఫల్గుశోభాకర పురోభాగంబులవలనను, నతిమనోహరంబై , సార్వకాలికసమర్పితానేక పుష్పగంధబంధురంబై, యగురుగుగ్గులుప్రముఖధూపవాసనావాసిత దశదిశాభాగంబై, శాతకుంభస్తంభసంభృతానేక నూతనరత్నప్రదీపికాదేదీప్యమానంబై, మహోపహారసమయసముచిత పంచమహాశుద్ధిసంభావ్యమానంబయిన యాదివ్యమందిరంబు ప్రవేశించి.

51

సీ.

నిర్జరవరవధూనేత్రకైరవములు
        చిఱునవ్వువెన్నెలచేత నలర
గోపతిసుతసతీకుంతలభ్రమరంబు
        లడుగుఁదమ్ములఁ జెంది యతిశయిల్ల
వరుణంగనామనోవల్లీవితానంబు
        పలుకుఁదెమ్మలచేతఁ బల్లవింప
ధనదకాంతాహర్షతటినీనికాయంబు
        విశదకృపారసవృష్టిఁ బెరుగ


తే.

హారికిన్నరకన్యకాహస్తజలజ
కలితచామరపవమానకంప్యమాన
చికురనికురుంబయై యొప్పుసకలజనని
కర్థి దండప్రణామంబు లాచరించి.

52


వ.

నిర్గమించి తదాలయపురోభాగంబున.

53


సీ.

సికతాతలంబున శివలింగపూజన
        పరులైన సన్మునివరులవలనఁ
బరిసరసహకారపాదపచ్ఛాయల
        గోష్ఠి సల్పెడి సిద్ధకోటివలన
నంతర్జలంబుల నఘమర్షణస్నాన
        మాచరించుచు నున్నయతులవలన
సిరులు నిండారంగ దరుల నోములు నోము
        మానవతీలలామమునవలన


తే.

సుకృతముల కెల్ల నెల్లయై సొంపు మీఱి
యపరమణికర్ణిక యనంగ నతిశయిల్లి
కమలకైరవమధురసకలితలలిత
వైభవాకరమగుసరోవరము గాంచి.

54


ఉ.

ఆసరసీతటాంతికశిలాక్షరపంక్తిఁ బఠించి చూచి, యీ
వ్రాసినవ్రాఁత యుజ్జయిని రాజ్యము చేరుటఁ జాటి చెప్ప సం

త్రాసముఁ బొందనేల? యని తత్క్షణమాత్రన యుట్టి యెక్కి, బా
హాసిఁ దదీయసూత్రముల నన్నిటి నొక్కటఁ గోసె వ్రేల్మిడిన్.

55


వ.

తదీయసాహసోత్కర్షంబునకు హర్షించి.

56


సీ.

వికచనీరజపత్త్రమకరందరసభాతిఁ
        బసనిచూపులఁ గృపారసము దొలఁకఁ
జంద్రమండలసాంద్రచంద్రికాద్యుతిభంగి
        నాననంబున మందహాస మొప్పఁ
గనకకుంభవినూత్నఘనరత్నరుచిలీలఁ
        బాలిండ్లఁ గుంకుమపంక మలరఁ
గాంచనపాంచాలికాకీర్ణహిమలీల
        లలితాంగవల్లి దువ్వలువ దనర


తే.

నొప్పులకు నెల్ల నెల్లయై యుల్లసిల్లు
నమ్మహాకాళి ప్రత్యక్షమై నరేంద్రు
శూలముఖమునఁ బడకుండఁ గేలఁ బట్టి
నిజచరణపీఠిచెంగట నిలుపుటయును.

57


వ.

రాగరంజితుఁడై యారాగమంజరీనందనుండు కృతాభివందనుండై, యంజలిపుటంబు నిటలతటంబున ఘటియించి, నిష్యందమానానందబాష్పకణికాప్రసారుండును, రోమాంచకంచుకితాకారుండును, సముద్గతగద్గదవ్యాహారుండును నై యిట్లని స్తుతియించె.

58


దండకము.

జయజయ జగదంతరానందమూర్తే, శతానందసంస్తుత్యకీర్తే, నమద్దివ్యసీమన్తినీకాంతసీమన్తసంక్రాంతసిందూరబాలాతపప్రస్ఫురత్పాదపంకేరుహే, హేమకుంభీలసత్కుంభవక్షోరుహే, నూత్నరత్నప్రభామండలీమండితానేకభూషావిశేషాప్రతీపప్రతీకే, కృపాజాగరూకే, రణారంభసంరంభశుంభన్నిశుంభాదితేయారిదుర్వారగర్వాంధకారచ్ఛిదాచండమార్తాండరూపే, సుధాసుప్రలాపే, కిరీటాగ్రజాగ్రత్సుధాభానుఖండద్వితీయార్ధశంకాసమాపాదిఫాలస్థలన్యస్తకస్తూరికాపట్టభాస్వల్లలామే, మ

హామంత్రయంత్రాభిరామే, సుధాసాగరాంతర్మణిద్వీపనీపాటవీపాటలీవాటికాకల్ప కల్పద్రుమప్రాంతచింతామణిశ్రేణికాగేహసీమా శివాకారమంచాగ్రభాస్వత్పరబ్రహ్మశయ్యారిరంసే ప్రభాసాంద్రచంద్రావతంసే, నవీనేక్షుకోదండనానాప్రసూనాస్త్రపాశాంకుశోల్లాసహస్తారవిందే, సదాసేవనాసన్నసన్మౌనిబృందే, నవాశోకబంధూకసౌగంధికాలక్తకస్యంద సిందూరరేణు ప్రవాళప్రతీకాశమూర్తిప్రకాశే, వినీలాలినీకేశపాశే, సముద్దామసౌదామనీధామ బాలారుణేందుప్రతీకాశ బీజత్రయీవిద్యమానాఖిలైశ్వర్యచింతామణే, లోకరక్షామణే, నిర్మలజ్ఞానవిద్యామహాయోగవిద్వన్మహాభాగ్యసౌభాగ్యవిద్యే, ప్రభావానవద్యే, నమస్తే, నమస్తే, నమస్తే నమః.

59


శా.

ఓసర్వేశ్వరి, యోమహేశ్వరసతీ, యోదివ్యమూర్తిత్రయీ
యోసిద్ధాంబిక, యోకదంబవనలీలోద్యానహృద్యా, శివా!
యోసంసారరుజాపహారనిపుణా, యోమంత్రతంత్రాత్మికా
నాసంసేవను జిత్తగించి, దయతో నన్నుం గటాక్షింపవే!

60


వ.

అనిస్తుతియింప నమ్మహీపతివై నపారకృపారసతరంగంబగు నపాంగంబు
నిగిడించి, యమ్మహాదేవి యిట్లని యానతిచ్చె.

61


ఉ.

తొల్లి, యనేకభూపతులు దుర్లభ మంచు నుపక్రమింప భీ
తిల్లినయట్టికార్య మిది, తెంపున నీవొనరింపఁ జూచి యే
నుల్లములోన మెచ్చి, యిపు డుజ్జయినీపురరాజ్యవైభవం
బెల్ల సహస్రవత్సరము లేలఁగ నిచ్చితి నీకుఁ బుత్త్రకా!

62


క.

అనితరసాధారణ మగు
ఘనతరసాహసము నీవు గావించుట, నో
మనుజేంద్ర! సాహసాంకుం
డనఁగాఁ జిరకీర్తిఁ బొందు మాకల్పముగాన్.

63


ఉ.

ఈయిల ధర్మరక్ష వెలయింప జనించినయట్టి యాదినా
రాయణమూర్తి వీవు, భవదంఘ్రిసరోరుహసేవ యర్థిమైఁ

జేయఁగ నాత్మఁ గోరి సరసీరుహగర్భుఁడు పుట్టె భట్టియై;
పాయక జోడుగూడి యిలఁ బాలన సేయుట మీకు నైజమౌ.

64


చ.

వదలక మీచరిత్రములు వర్ణనచేసిన, సంస్మరించినం,
జదివిన, వ్రాసినన్, విని ప్రసంగవశంబునఁ బేరుకొన్నఁ బె
ల్లొదవు మనుష్యకోటికి సముజ్జ్వలరాజ్యరమాసమృద్ధియున్,
సదమలధర్మబుద్ధియును సంవిదుదంచితమోక్షసిద్ధియున్.

65


మ.

అని, సర్వేశ్వరి యానతిచ్చినఁ బ్రియం బారంగ సాష్టాంగదం
డనమస్కారముఖోపచారములు నానాభంగులం జేసి, య
జ్జననాథాన్వయచక్రవర్తి తదనుజ్ఞాసిద్ధిపూర్వంబుగాఁ
దనయిచ్చం జరియించుచుండె నికటోద్యానాంతరాళంబునన్.

66


విక్రమార్కుఁ డుజ్జయినికి రాజగుట

ఉ.

అట్టి యెడన్, బ్రసేనుఁ డనునప్పుర మేలెడు రాజు చన్న, నా
పట్టపుదంతి మంత్రులయుపాయమునం జనుదెంచి, కీర్తికిం
గట్టనుఁగైన హారలతఁ గంఠమునం దిడ; రాజ్యలక్ష్మికిం
బట్టము గట్టి రాప్తులును బంధులు భృత్యులు నన్నరేంద్రునిన్.

67


వ.

ఇత్తెఱంగున నుజ్జయినీరాజ్యసింహాసనాసీనుండై.

68


సీ.

భరతునిలాగునఁ బరశురామునిభాతి
        రంతిదేవునిభంగి రాముగరిమ
[3]నంగునిరేఖ యయాతిభావంబునఁ
        బృథువిధంబున భగీరథునిమాడ్కి
గయులీల మాంధాతకైవడి నంబరీ
        షునిరీతి శశిబిందుసోయగమున
శిబిపోలిక మరుత్తుచెల్వునను దిలీపు
        కరణి సుహోత్రునిగారవమున

తే.

సగరువెరవునఁ బురుకుత్సుసరణి నలుని
రమణ నర్జునుక్రియఁ బురూరవునిచంద
మున హరిశ్చంద్రుతెఱఁగున వినుతి కెక్కి
సాహసాంకుండు వసుమతీచక్ర మేలె.

69


చ.

కుదురుకొనెన్ గిరీంద్రములు, కూర్మకులాగ్రణి జీవనస్థితిం
బొదలె, ఫణీశ్వరుండు బహుభోగసమున్నతి నుల్లసిల్లె, స
మ్మదము వహించె దిక్కరిసమాజము, క్రోడము చాలఁ గ్రొవ్వె, నొ
ప్పిదముగ నన్నరేంద్రుభుజపీఠిక యుర్వర నిర్వహించినన్.

70


చ.

అరిజనపాలకాననతృణాంకురవృద్ధి యొనర్చు, విద్విష
త్సరసిజలోచనాస్యజలధారలవర్ధన మొందు, నెప్పుడుం
జరణసమీపవర్తులకుఁ జల్లదనం బొదవించు, నమ్మహీ
వరునిప్రతాపవహ్ని జనవర్ణితచిత్రచరిత్రలీలలన్.

71


ఉ.

పాదుక లాదటం జరణపద్మములం దిడి, ముజ్జగంబులన్
మోదముతోడ నానృపతిముఖ్యుఁడు త్రిమ్మర, ముఖ్యకాంతయున్
సూదిపిఱిందిత్రాటిక్రియఁ జొచ్చినచోటులు సొచ్చు, నెన్నఁడే
బైదలి ప్రాణవల్లభునిపజ్జఁ జరింపక పాయనేర్చునే?

72


సీ.

ప్రకటప్రతాపాతపముచేత వైరుల
       కన్నులఁ జీఁకట్లు గ్రమ్మఁజేసి
ఖడ్గహాలాహలగరిమచే నహితుల
       నమృతాశనులుగాఁగ నలవరించి
సలలితసత్కీర్తిచంద్రికఁ బగతుర
       మనములతాపంబు మట్టుకొల్పి
సముదగ్రధారాళశరవృష్టి విమతుల
       తనువులఁ జెమటలు దలముకొలిపి


తే.

చిత్రచారిత్రవిక్రమశ్రీ వహించి
సాహసాంకమహీపాలచక్రవర్తి

జలధివలయితవసుమతీచక్రవహన
చండభుజదండకలితుఁడై యుండునంత.

73


వ.

పాకశాసనుశాసనంబునం దదీయసూతుండగు మాతలి దివ్యరథంబుతోడం జనుదెంచి కృతాంజలి యగుటయు.

74


చ.

అతనికి సాహసాంకవిభుఁ డాసనపాద్యము లాదియైన స
త్కృతు లొనరించి, నేఁ డిచటికిం దనదివ్యరథంబుతోడ సా
కతమునఁ బంపె నెంతపని గల్లెనొగాక! శచీవిభుండు ని
న్నితరములైనకార్యముల కిమ్మెయిఁ బంచుట మున్ను వింటిమే!

75


వ.

అనిన విని మాతలి సాహసాంకమహీపాలునితో నిట్లనియె.

76


క.

జంభాహితుఁ డూర్వశిపై
రంభపయిం గరుణకలిమి, రహిఁ దన్నటనా
జృంభణల తారతమ్యము
సంభావించుటయ కాని; చాలఁడు తెగడన్.

77


క.

కావున వారల నటనా
ప్రావీణ్యము హెచ్చుఁ గుందుఁ బ్రకటించుటకై
దేవరఁ దోడ్కొని రమ్మని
దేవేంద్రుఁడు పనిచె వసుమతీవర! నన్నున్.

78


క.

పాయక పెక్కుతపంబులు
సేయుతపోధనుల కైనఁ జేర నశక్యం
బీయరద మెక్కి విజయం
చేయుము జగతీశ! తడవు సేయక యనినన్.

79


ఇంద్రుని రథ మెక్కి విక్రమార్కుండు నాకమున కేగుట

సీ.

నిజతపోమహిమచే నిరుపమానంబుగా
        విరచించె నేతీరు విశ్వకర్మ
జంఖాదిదనుజేంద్రసంగరాంగణముల
        శక్రున కేతేరు జయ మొసంగె

గోరి ముప్పదిమూఁడుకోటులదివిజులు
        కొలువంగ నేతేరు కొమరు మిగిలెఁ
బటుజనస్ఫురణమై పదివేలహయములు
        పూనంగ నేతేరు పొలుపు మిగిలె


తే.

నట్టిదివ్యరథంబు నెయ్యమున నెక్కి
సాహసాంకమహీపాలచంద్రుఁ డరిగె
గరుడపవమానమానసాక్రమణనిపుణ
బహుగతిప్రౌఢి కుల్లంబు పల్లవింప.

80


వ.

ఇట్లు చనిచని.

81


ఉ.

నాకముఁ గాంచె నట్టియెడ, నందనమందచరన్నితంబినీ
లోకము, సంయమీంద్రధృతిలోపక లోలవిలాసమేనకా
లోకము, వాసవేభమదలోలుప చంచలచంచరీకమున్
స్వీకృతసత్తపఃఫలవిశేషవిపాకముఁ బుణ్యలోకమున్.

82


వ.

కని తదీయవిలాసోత్కర్షంబునకు హర్షించుచు, సకలజగన్నయనపర్వం బగు సుపర్వాధీశ్వరునగరంబు చొచ్చి రథావతరణంబు చేసి, దివ్యసభామండపంబు ప్రవేశించి.

83


చ.

కనియె నతండు, దివ్యగణికాజననేత్రచకోరికానురం
జన హసచంద్రికాలపనచంద్రునిఁ, జారుపులోమజాఘన
స్తన పరిరంభసంభ్రమవశస్ఫుటకుంకుమపంకసౌరభాం
జనతనుకాంతిరుంద్రుని, భుజాబలసాంద్రుని నిర్జరేంద్రునిన్.

84


క.

కని వందన మొనరించిన
జననాథున కెదురు వచ్చి, సరసాశ్లేషం
బొనరించి, యతని గద్దియ
నునిచికొనెన్ దివిజనాథుఁ డుచితప్రౌఢిన్.

85


వ.

ఇట్లయ్యిరువురు నేకాసనాసీనులై, సముచితసంభాషణంబు లొనరించు

సమయంబున, సమయజ్ఞతావిశారదుండగు నారదుం డన్నరేంద్రున కిట్లనియె.

86


క.

నటనాహంకృతిఁ దమలోఁ
జిటిపొటిజగడంబు లూర్వశీరంభలకుం
బొటమిన, మే లేర్పఱఱువఁగ
నిట నిను రప్పించె నిర్జరేశ్వరుఁ డధిపా!

87


వ.

అని యెఱింగించి, యమరపతి యనుమతి నమ్మదవతీమణుల రప్పించి, నర్తనవ్రవర్తనంబునకు నియోగించుటయు, నంక్యాలింగ్యోర్ధ్వకాద్యవయవంబులగు చతుర్విధవాద్యంబులకు ననువుగాను, గానంబునకు ననుతానంబుగాను నుపక్రమించి.

88


విక్రమార్కుఁ డూర్వశీరంభల నాట్యతారతమ్యమును నిరూపించి చెప్పుట

సీ.

కలికికన్నుల సోయగముమించుఁదళుకులు
        చెలఁగెడు మగమీలచెలువు నొంద
నభినవస్ఫురణమై నభినయించుకరంబు
        లలరుఁ గెందమ్ముల ననుకరింప
నిటలంబున నటించు కుటిలకుంతలకాంతి
        కొదమతుమ్మెదల యొప్పిదము చూప
వలివకంచెలలోని వలిచనుంగవ మించి
        జక్కవకవభంగి సంభ్రమింప


తే.

మంజుమంజీరకంకణశింజితములు
సమదకలహంసకలనినాదముల దొరయ
సరసిగతిఁ బూచి సరసులు సరి యనంగ
రంభ సురరాజుమ్రోల నర్తన మొనర్చె.

89


వ.

అంత.

90


సీ.

శృంగార మేపార రంగవల్లికయందు
        గీతసామగ్రి యంగీకరించి
కరతలామలకంబుగాఁ గరాంబుజముల
        నర్థమాద్యంతంబు నభినయించి

భావింవ నరుదైన భావమర్మంబులు
        మెఱుఁగుఁజూపులలోన మేళవించి
తానమానములతోఁ దాళనిర్ణయలీలఁ
        జరణపల్లవముల సంగ్రహించి


తే.

యఖలమును మెచ్చఁ బ్రత్యక్షమైనయట్టి
నాట్యవిద్యాధిదేవత నాఁ దనర్చి
భరతశాస్త్రమర్మజ్ఞతాప్రౌఢి మెఱసె
నూర్వశీకాంత వేల్పుఁబేరోలగమున.

91


వ.

ఇట్లిరువురుం బ్రవర్తించిన నర్తనంబులు గనుంగొని. విక్రమార్కుం డిట్లనియె.

92


ఉ.

సర్వజగంబుల న్నటనచాతురిఁ దాఁ గడుఁబ్రోడ నంచు, దు
ర్గర్వము పూని శాస్త్రగతిఁ గైకొననొల్లక రంభ యాడె, నీ
యూర్వశి శాస్త్రసమ్మతసముజ్జ్వలమార్గము దప్పకుండఁగాఁ
బర్వ మొనర్చె నిచ్చటి సుపర్వుల కెల్లఁ గళాప్రవీణతన్.

93


దేవేంద్రుఁడు విక్రమార్కునకు దివ్యసింహాసనంబు బహూకరించుట

వ.

అనిన, నమ్మహీనాథుని వివేకపరిపాకంబునకుఁ పాకశాసనుండు ప్రముదితాంతఃకరణుండై దివ్యమణిభూషణాంబరాదు లొసంగి, మఱియును నిజతపోవిశేషతోషితాంతరంగంబును, సర్వమంగళాస్పదంబును, నృపసింహాసనద్వాత్రింశత్సాలభంజికారంజితంబునునగు దివ్యసింహాసనంబు నొసంగి, తద్దివ్యపీఠంబుఁ బురంబునకు భరించికొనిపోవఁ ద్రిదశకింకరసహస్రంబు సమర్పించి, గారవించి వీడ్కొలిపిన, దివ్యమణిపాదుకాప్రభావసులభగమనుండై యజ్జనపాలుం డుజ్జయినీపురంబున కరుగుదెంచి.

94


సీ.

శ్రుతిమతంబునఁ బురోహితసమ్మతంబునఁ
        బుణ్యాహవాచనపూర్వకముగ
జలజబాంధవముఖ్యసకలగ్రహంబుల
        కభిమతంబగు హోమ మాచరించి
యన్నదానాది సమస్తదానంబుల
        బ్రాహ్మణప్రతతికిఁ బ్రమద మొసఁగి

యుచితంబులగు షోడశోపచారంబుల
        నాగద్దె కతిభక్తి నాచరించి


తే.

పౌరవృద్ధపుణ్యాంగనాపాణిపద్మ
ముక్తమౌక్తికశేషాసముజ్జ్వలావ
తంసుఁడై, యెక్కె శుభవేళ ధరణినాథుఁ
డమరపతిదత్తదివ్యసింహాసనంబు.

95


వ.

ఇట్లు తేజోవిరాజితుండై యఖిలప్రజాపాలనంబు సేయుచున్నంత, నొక్కనాఁడు.

96


సీ.

అచ్చవెన్నెలమించు నపహసించువిభూతి
        యంగరాగంబుగా నలవరించి
యాగమోచితముగా నవయవంబులయందు
        లలితరుద్రాక్షభూషలు వహించి
పొంబట్టుపుట్టంబు పొట్ట నందంబుగా
        ఘనజటాజూటంబు గలయఁ బొదివి
యడుగుఁగెందమ్ముల బెడఁగు రెట్టింపఁగాఁ
        గాంచనమణిపాదుకములు దొడిగి


తే.

జమిలిమొలత్రాట నినుపకచ్చడ మమర్చి
[4]కక్కపాలయుఁ గక్షభాగమునఁ బూని
తరుణగమౌలి యపరావతార మనఁగ
ధరణిపతిపాలి కేతెంచెఁ దపసి యొకఁడు.

97


క.

ఏతెంచి ‘శివునికృప’యని
ప్రీతి మెయిన్ భూతి యొసఁగఁ, బృథివీరమణుం
డాతతభక్తిని గైకొని
యాతాపసవరు భజించె నర్హార్చనలన్.

98


వ.

ఇత్తెఱంగున నత్తపోధనసత్తమునకు, సపర్యాపర్యాయంబునం బ్రమోదం బాపాదించి, యన్నరేంద్రుం డిట్లనియె.

99

క.

ఈచక్రవాళపరివృత
భూచక్రమునందు, నొకయపూర్వం బేదేఁ
జూచినయది గలిగిన, నది
యేచినకృప నాకు నానతిమ్ము మహాత్మా.

100


వ.

అనిన, యోగీశ్వరుం డిట్లనియె.

101


కనకస్తంభవృత్తాంతము

సీ.

సర్వపర్వతకులసార్వభౌముం డనఁ
        గొమరొందు పడమటికొండ దండఁ
గనకగోపురవప్రఘనసౌధసదనమై
        రాజిల్లు కనకపురంబు కెలన
రోహణకుధరప్రరోహణగతి నొప్పు
        మార్తాండదేవసద్మంబుచెంత
నఖలతీర్థస్వామియగు పాపనాశన
        నామతీర్థమునందు నట్టనడుమ


తే.

నగ్రకీలితమణిపీఠ మైనయట్టి
శాతకుంభమయోజ్జ్వలస్తంభ మొకటి
సంభవము నొందు వాసరారంభవేళ
కర్ణికోదీర్ణసౌవర్ణకమల మనఁగ.

102


తే.

అది దినేంద్రునికొలఁదినే యతిశయిల్లు
యామయుగళంబునకు నుష్ఠధాముఁ గదియు
నపరదిశఁ గూర్చి కమలాప్తుఁ డల్ల వ్రాలఁ
గ్రుంకు బంగారుకంబ మాకొలఁదిగాను.

103


క.

వారుణదిగ్వారాకర
వారి నరుణుఁ డస్తమింప, వర్ణితతీర్థో
దారమగు పాపనాశన
పూరములో మునుఁగుఁ గంబమును దినదినమున్.

104


చ.

అన విని, యత్తపోధనునియానతికిం దగ సంతసిల్లి, య
త్యనుపమశక్తియుక్తి మెయి నమ్మహితాత్ముని వీడుకొల్పి, గు

బ్బనఁ బతి దివ్యభవ్యమణిపాదుక లంఘ్రుల సంఘటించి, య
క్కనకపురంబు చొచ్చి తమకంబున నన్నిసి వుచ్చి, వేకువన్.

105


చ.

వెలవెలఁబాఱుదీవియలు, వింతరుచిం గలిగించుతమ్ముల
మ్ములు, నతిశీతలమ్ము లగుముత్తెపుఁబేరు, లఖర్వపద్మినీ
విలసితగంధవాతములు వేకువఁ దెల్ప, నరేంద్రముఖ్యుఁ డు
జ్జ్వలగతిఁ బాపనాశనముసన్నిధికిం జని, యుండునంతటన్.

106


సీ.

కైరవకాననోత్కరములు కడుఁ గుందఁ
        గంజపుంజంబులు కణఁక నొంద
లలిఁ జకోరంబులతలఁపులు గంపింపఁ
        జక్రవాకంబులు సంతసింప
సాంద్రచంద్రికల యుజ్జ్వలభావములు దిగ
        నరుణోదయప్రభాస్ఫురణ లెదుగ
జారచోరులమతిసంభ్రమంబులు చిక్క
        జనులకుఁ జిత్తప్రసాద మెక్క


తే.

దారకంబులకాంతి యంతయుఁ దొలంగ
ధరణిదివిజార్ఘ్యబిందుసంతతి సెలంగఁ
బూర్వపర్వత మెక్కె నపూర్వదీప్తి
మండలంబైన మార్తండమండలంబు.

107


కనకస్తంభము నెక్కి విక్రమార్కుఁడు సూర్యమండలమున కేఁగి వచ్చుట

శా.

క్షోణీనాథుఁడు తీర్థవారిపయి వక్షోజస్ఫురత్కాంచన
సూణాశృంగము గానవచ్చుటయు, మెచ్చుల్మీఱఁగాఁ జొచ్చి త
న్మాణిక్యోజ్వలపీఠ మెక్కె, మురజిన్నాభీసరోజస్ఫుర
ద్వాణీవల్లభుఁ గ్రేణి సేయుచుఁ బ్రభావస్ఫూర్తిమన్మూర్తియై.

108


వ.

తదనంతరంబ.

109


క.

అంబరమణి యల్లల్లన
నంబరమధ్యమున కరుగునంతటిలోనన్
జాంబూనదకలితం బగు
కంబము నరనాథుతోడ ఖరకరుఁ గవిసెన్.

110

వ.

కదిసిన, నత్యంతసంతాపకరంబైన నిజప్రతాపాటోపంబునకు మిసిమింతుండు గాని యమ్మహీకాంతునిం జూచి, విస్మితస్వాంతుండై భాస్వంతుం డిట్లనియె.

111


సీ.

కల్పాంతదుర్దాంతకలుషాంతకస్వాంత
        దుర్వారవహ్నికి నోర్వవచ్చు
నిష్ఠురనిర్దోషనిర్ఘాతసంఘాత
        జాతమహావహ్ని సైఁపవచ్చుఁ
బ్రళయకాలాభీల ఫాలలోచనఫాల
        భాగానలస్ఫూర్తి బ్రతుకవచ్చుఁ
గాకోదరేంద్రఫూత్కారసంభవతీవ్ర
        కాకోలదహనంబుఁ గదియవచ్చుఁ


తే.

గాక, సైరింపవచ్చునే లోకదహన
డర్పితంబైన యస్మత్ప్రతాపవహ్ని
దావకోత్సాహసాహసౌదార్యధైర్య
గతికి మెచ్చితి, విక్రమార్కక్షితీంద్ర!

112


విక్రమారుని సాహసమునకు మెచ్చి సూర్యుఁడు కుండలముల నొసఁగుట

క.

అనుదినము రెండుబారువు
లనుపమకాంచనము నొసఁగు నాశ్చర్యముగా
నని, పద్మరాగరంజిత
ఘనకుండలయుగము ధరణికాంతుని కొసఁగెన్.

113


వ.

ఇత్తెఱంగున నరుణమండలప్రభానిధానంబగు బహుమానంబుం గాంచి.

114


మ.

చరమాశాంతరవీథిఁ గైకొని సరోజాతప్రియుం డేగఁగా,
సరి నంతంతకుఁ గ్రుంగి క్రుంగి కనకస్తంభంబు చిత్రంబుగా
సరసీపూరసమస్థితం బగుటయున్, సర్వంసహాధీశుఁడున్
వెరవారం దిగివచ్చి, యప్పురిని దా విశ్రాంతచేతస్కుడై.

115


వ.

అమ్మఱునాఁ డుజ్జయనీపురంబున కరుగునప్పుడు, తత్పురోపకంఠంబున.

116

వృద్ధవిప్రుఁడు వచ్చి విక్రమార్కు నాశీర్వదించి కుండలములు పడయుట

సీ.

పటలికావృతనేత్రపర్యంత రేఖలు
        పొదివి కైవ్రాలిన బొమలతోడ
దంతపాతముల నెంతయు స్రుక్కినకపోల
        తలముల నెలకొన్నవలులతోడ
నపగతకేశోత్తమాంగంబు కెలఁకులం
        దూఁగాడు నరపవెండ్రుకలతోడఁ
గ్రౌంచకంఠోపమాకారతఁ గనుపట్టు
        నస్నిగ్ధమైన దేహంబుతోడ


తే.

శతశతచ్ఛిద్రజీర్ణవస్త్రములతోడ
నల్పతరపర్వయుతవంశయష్టితోడ
హరిసహస్రనామోచ్చారణరతితోడ
వచ్చి యొకవృద్ధభూసురవరుఁడు గదిసి.

117


సీ.

బ్రహ్మాయురస్తు, విప్రప్రసాదో౽స్తు. క
        ల్యాణపరంపరావాప్తిరస్తు
దేవేంద్రభోగో౽స్తు. దిగ్విజయో౽స్తు, సు
        స్థిరకీర్తిరస్తు, వాక్సిద్ధిరస్తు
సౌభాగ్యమస్తు, శాశ్వతసమున్నతిరస్తు,
        సంగరవిజయో౽స్తు, సౌఖ్యమస్తు
వస్తువాహనసంపదస్తు, చింతితమనో
        రథసిద్ధిరస్తు, సామ్రాజ్యమస్తు


తే.

సప్తసాగరపరివృతసకలభూమి
మండలైకాధివత్యసమాగమో౽స్తు
పుత్త్రపౌత్త్రాభివృద్ధివిస్ఫూర్తిరస్తు
మంగళాని భవంతు తే మనుజనాథ!

118


వ.

అని యాశీర్వాదంబు చేసి.

119


క.

అర్థించిన బ్రాహ్మణునకు
నర్థి నొసఁగెఁ గనకకుండలాభరణము న

త్యర్థమును రెండు బారువు
లర్థము ప్రతిదినము నొసఁగు, నని చెప్పి దయన్.

120


వ.

ఇవ్విధంబున.

121


మ.

అరిభూనాథవరూథినీమదభరాహంకారదుర్వారకో
వరసాటోపపటుప్రతాపపటలప్రధ్వంసకౌక్షేయభా
స్వరబాహాబలశాలి, సాహససముత్సాహైకసంసేవి యై,
ధరణీచక్రము విక్రమార్కవిభుఁ డుద్యల్లీలఁ బాలించుచోన్.

122


ఒక చెంచు విక్రమార్కుని వేఁటకుఁ బురికొల్పుట

సీ.

తలమీఁదఁ జెరివినఁ దనరారు నునుఁడెంక
        యమృతాంశురేఖ చందమున నమర
మేదినీరేణువు మెయినిండఁగాఁ బర్వి
        భసితాంగరాగసంపద వహింప
జుంజువెండ్రుక లెత్తి చుట్టినలేఁదీఁగ
        పన్నగాధీశ్వరు పగిది మెఱయఁ
గరమొప్పు నుదుటిపై గైరికతిలకంబు
        ఫాలలోచనభాతిఁ బరఁగుచుండ


తే.

శబరుఁ డొక్కరుఁ డేతెంచె సంభ్రమమున
శంకరుఁడు తొల్లి శబరవేషము వహించె
నంచు మదిలోన నీసుఁ ధరించి తాను
నీశునాకృతిఁ గైకొన్నయెఱు కనంగ.

123


ఉ.

వచ్చినచెంచుఱేనిఁ గని వాకిటివాఁడు నృపాలుపాలికిం
బొచ్చెములేక తోకొనుచుఁ బోవఁగ, వన్యము లైనకానుకల్
మెచ్చుగ నిచ్చి, యంగములు మేదిని సోఁకఁగ మ్రొక్కి లేచి, తా
వచ్చినకార్య మంతయును వావిరిఁ జెప్పఁ దొణంగి, యిట్లనున్.

124


సీ.

ప్రళయకాలాభీలభైరవోదగ్రత
        సూకరాకృతిఁ బొడసూపె నొక్కొ!
యత్యంతకుపితాంతకాంతకాకారంబు
        క్రోడరూపంబుఁ గైకొనియె నొక్కొ!

పటుభయంకర వీరభద్రాతిరేకంబు
        భూదారవేషంబు పూనె నొక్కొ!
చండభుజాదండ దండధరస్ఫూర్తి
        కిరి ఘోరమూర్తిని బరఁగె నొక్కొ!


తే.

యనఁగ, నతిభీకరాకార మైనయట్టి
యేకలం బెల్లయెడలను నెదురు లేక
ఘోరసత్త్వసమగ్రకాంతారజలధిఁ
దిరుగుచున్నది మందరగిరియుఁ బోలె.

125


క.

నరవర తాను భరించిన
ధర, నీవు భుజాగ్రపీఠిఁ దాల్పఁగ సుఖయై
తిరిగెడునాదివరాహము
గరిమం, దత్కిటి నటించుఁ గాననసీమన్.

126


క.

ధర నాదిశబరుఁ డొకకిటి
శరనిహతిం గూల్చె ననుచు, శబరుల నెల్లన్
బరిమార్పఁ బట్టెనో? యన
నురుకోలము చెంచుకొలము నొడుచు మహీశా!

127


వ.

ఇట్లు మహామహీధరపరిణాహంబైన యావరాహంబు.

128


చ.

మునిజనపర్ణశాలలు సముద్దతిమైఁ గలగుండు వెట్టుచున్
గునగున వచ్చి లావరులఁ గొమ్ముల వ్రక్కలు వాఱఁ జీఱుచున్
మునుకొని సస్యసంఘముల మోరను గుద్దలిగొంచు నెల్లెడం
దనరుపుమైఁ జరించు నతిదారుణలీల వనాంతరంబునన్.

129


చ.

జనవర! సాహసాంకుఁ డన సన్నుతి కెక్కిననీవు దక్క, నా
ఘనతరకోలముం గదిపి గర్వ మడంపఁగ నన్యభూపతుల్
గొనకొన లేమి, దేవరకుఁ గు య్యెఱిఁగింపఁగ వచ్చినాఁడ, వే
గన మృగయావినోదమును గౌతుక మార నొనర్పు నేర్పునన్.

130

విక్రమార్కుఁడు వేఁట కేఁగుట

తే.

అనిన నిష్టార్థముల వాని నాదరించి
వలయు సవరణతోడ భూవల్లభుండు
వెడలె వేఁటకు, మృగయాప్రవీణు లైన
శబరనాయకు లుభయపార్శ్వములఁ గొలువ.

131


వ.

ఇవ్విధంబున సర్వసన్నాహంబు మెఱయ, సాహసాంకుండు కృతపవనజవనవాహనుండై చని, శరభశార్దూలప్రముఖనిఖలమృగవరశరణ్యం బైన యరణ్యంబుఁ బ్రవేశించి, బహుప్రకారమృగయావినోదంబు లొనరించు సమయంబున.

132


వరాహము విక్రమార్కు నలయించి భూగర్భముఁ జొచ్చుట

ఉ.

కోలముఁ గాంచె నానృపతికుంజరుఁ, డంజనశైలవిగ్రహా
భీలముఁ, బోత్రసాధనవిభేదితభూవివరోరుజాలకో
త్తాలము, ఘుర్ఘురధ్వనివిదారితఖాద్రిగుహాంతరాళమున్,
లోలవిలోచనాంచలవిలోకితరోషమహాగ్నికీలమున్.

133


వ.

కని యతఁడు మున్ను శబరునిచేత విన్న తెఱంగునకు మెఱుం గిడినయట్లున్న, యున్నతోదారభూదారంబు నిటలవీథికిం గడియుటయును.

134


సీ.

అంతంత నగపడినట్ల చేరఁగ నిచ్చుఁ
        బైకొనఁజూచినఁ బరువువెట్టు
బటుపరిశ్రాంతి లోఁబడినలాగు నటించు
        కైదువునేయ డగ్గఱన సురుఁగుఁ
బొదలమాటున నుండి యదలించుచును ఱొప్పి
        కదియంగఁ జూచినఁ బెదరి తొలఁగు
నవనీతలము మోర నలవోకఁ గోరాడుఁ
        ద్రోవఁ గట్టినఁ దప్పుఁద్రోవ నుఱుకుఁ


తే.

జేరఁ దవ్వుగఁ బాఱును, జేరనీక
యల్లనల్లన నడపాడు, నాసగొలుపు;
మనుజపతి నిట్టు లెలయించుకొనుచు నరిగి
యమ్మహాకోల మవనిగహ్వరముఁ జొచ్చె.

135

వ.

చొచ్చిన, సూది పిఱింది త్రాటిక్రియ నచ్చోటం జొరం దలంచి, ఘోటకతిలకంబుఁ దిలకభూజంబున బంధించి.

136


విక్రమార్కుఁడు పాతాళమును జేరి బలినిఁ గాంచుట

క.

చెచ్చెరఁ బతియును దోడన
చొచ్చి, రసాతలముదాక సూకరమార్గం
బెచ్చో వదలక వెనుచన
నచ్చెరువుగ మాయమయ్యె నది యచ్చోటన్.

137


వ.

అతం డత్తెఱంగునకు విస్మయతరంగితాంతరంగుండై కొంతదవ్వు చని ముందట ననంతవిభవోదారం బగు నొక్కపురంబు గని. యాత్మగతంబున.

138


క.

ఈపురము నామ మెద్దియొ
యీ ట్టణ మేలునృపతి యెంతటివాఁడో,
యీపుటభేదనవిభవము
గోపురమున లేదు, వశమె కొనియాడంగన్.

139


చ.

అని, యటపోవఁ బోవఁ బణిహారియొకం డరు దెంచి, విక్రమా
ర్కునిఁ బొడగాంచి, మిమ్ముఁ దొడుకొంచు వేగం జనుదేర దైత్యు నొ
క్కనిఁ గిటిమూర్తి గైకొని తగం జనుమన్నను, వచ్చి తమ్ముఁ దె
చ్చినవిధ మంతయుం దెలియఁ జెప్పిన, ముప్పిరిగొన్న వేడుకన్.

140


క.

తలఁచిన తలఁపుకొలందిన
యలఘునుదారునిని విక్రమార్కవిభు రసా
తలమునకుఁ దెచ్చి, తనుచును
బలి మెచ్చెం దనదు భృత్యుఁ బరహితకృత్యున్.

141


క.

అని చెప్పి, మిమ్ముఁ దోడ్తేఁ
బనిచినఁ బని వింటి, ననినఁ బణిహారిబడిన్
దనుజేంద్రుని సన్నిధికిని
మనుజేంద్రుఁడు వచ్చి, వినయమహనీయుండై.

142

క.

కాంచిన, నతఁడును బెన్నిధిఁ
గాంచినగతి నలరి, యెదురుగా వచ్చి సమా
కుంచితశరీరవినయో
దంచితుఁ డై కౌఁగిలించి, తాత్పర్యమునన్.

143


క.

ఆసాహసాంకు మణిసిం
హాసనమున నిలిపి, సముచితార్ఘ్యప్రియపూ
జాసత్కారమున సుఖా
వాసునిఁగాఁ జేసి, దనుజవరుఁ డిట్లనియెన్.

144


శా.

భూలోకంబున సర్వసంపదలు సంపూర్ణంబులై యుండునా,
కాలాతిక్రమణం బొనర్ప కిల మేఘశ్రేణి వర్షించునా,
చాలంగాఁ బసిపాఁడిసొంపు గలదా సస్యంబు లేపారునా,
వాలాయించి యొనర్తురా జనులు దేవబ్రాహ్మణారాధనల్?

145


క.

ఏనును జనవత్సలతన్
మానవలోకప్రసంగమతిచేతను గా,
కేనివ్విచార మడుగం
గా నేటికి? నీవు గలుగఁ గారుణ్యనిధీ!

146


చ.

బలము ప్రతాప మీగి దయ భాతి విభూతి వినీతి ధర్మని
శ్చలత కళావిశేషము నిజం బవధానము మాన మాదరం
బెలమి యనం బొగడ్త గలయిన్నిగుణంబులఁ గీర్తి కెక్కి, నీ
విల భరియింపఁగా జనుల కేల విచారము? భూతలేశ్వరా.

147


వ.

అనిన సాహసాంకమనుజేంద్రుండు బలీంద్రున కిట్లనియె.

148


క.

సురపతి పిలువగఁ బంపిన
నరిగితి నమరావతికిఁ బ్రియంబున, నది నీ
పురికిని రమాసమగ్రత
సరిరాదన కానఁబడియె సౌజన్యనిధీ!

149

క.

పదునాలుగులోకంబులు
నుదరస్థములుగఁ జరించుచుండెడు లక్ష్మీ
హృదయేశుఁడు నిను వేఁడఁగ
బ్రదికితి, నీ బ్రదుకు బ్రదుకు బలిభూపాలా!

150


క.

‘దేహి’ యనువాఁడు, వగగొని
‘దేహి’ యనఁగ నుండువాఁడు తెల్లంబుగ లేఁ
డూహించిన నీరాజ్యము
లో, హరిహర చిత్రమహిమ లుంటాక బలీ!

151


క.

అని మధురవచనరచనల
దనుజేంద్రుని నలరఁ జేసి, తగ మజ్జనభో
జనవిధు లతండు వేడుక
లొనరింపఁగఁ దృప్తిఁ బొంది, యుండెడు వేళన్.

152


బలి విక్రమార్కునకు రసరత్నముల నొసఁగుట

ఆ.

రస రసాయనాఖ్యరత్నద్వయము రెచ్చి
యందు ముదిమి నొకటి యపనయించు,
నొకటి చాలసిరుల నొందించు, నని చెప్పి
యిచ్చి యనుప నిలకు వచ్చె నృపతి.

153


ఉ.

వచ్చి రయంబునం దనదువారువముం బ్రియమార నెక్కి, ము
న్నచ్చట నచ్చటం జెదరినట్టిబలంబును దన్నుఁ గూడి రాఁ
జొచ్చిన; వారితో బిలముఁ జొచ్చినలాగును, గన్నలాభమున్
జెచ్చెరఁ జెప్పుచున్ బురముఁ జేరఁగఁ బోయెడునంత, ముందటన్.

154


విప్రునకు విక్రమార్కుఁడు రసరత్నముల నిచ్చుట

చ.

[5]పలుకనిమోముఁ దొట్రుపడుపాదములున్ వగరంపుటూర్పులున్
వలవలనైనదంతములు వంగినమేను వణంకుమస్తమున్
నిలువఁగరానియుక్కిసయు నెమ్మెయి నెక్కొను దప్పిపెంపుఁ జే
వెలుఁగునఁ జూచుచూపుఁగల వృద్ధమహీసురుఁ డమ్మహీశ్వరున్.

155

వ.

కాంచి, బహువిధాశీర్వాదంబులఁ బ్రముదితహృదయునిం జేసిన, సాహసాంకనృపోత్తముండు కరుణాయత్తచిత్తుండై, యమ్మహీసురవరుని జరాభారదారిద్ర్యభారంబు లపనయించు తలంపునం, తత్ప్రయోజనంబు లెఱంగించి రసరసాయనాఖ్యరత్నద్వయంబు నొసంగుటయును.

156


క.

రససేవనంబునం దన
ముసలితనం బుడిగి, తరుణమూర్తియుతుండై
వసుధామరుఁ డింటికిఁ జని
రసాయనాన వరవిభవరమ్యుం డయ్యెన్.

157


క.

మనుజేంద్రుఁడు నిజపురమున
కనురాగముతోడ నరిగె, నఖిలజనములుం
దనదానధర్మపరహిత
ఘనసాహసనైపుణములు కణఁక నుతింపన్.

158


వ.

మఱియును.

159


పురందరుఁడను వణిక్కుమారుని వృత్తాంతము

తే.

భద్రనామాభిధానుఁ డక్షుద్రసంప
దాఢ్యుఁ, డుజ్జయనీపురి నధికలోభ
గర్హితుం డైన యొకవణిగ్వరుఁడు గలఁడు
అతనికి బురందరుండను సుతుఁడు గలడు.

160


తే.

ఆపురంధరుఁ డధికభోగానుభవమ
హావిభూతిఁ బురందరు నతిశయించి
భూరివితరణశ్రీఁ గల్పభూజ శిబి ద
ధీచి ఖచర కర్ణాదుల ధిక్కరించె.

161


వ.

ఇట్లు వణిక్కుమారుండు మహోదారుండై.

162


క.

కట్టక కుడువక యొరులకుఁ
బెట్టక తమతండ్రి గూడఁబెట్టినసిరిఁ దాఁ
గట్టియుఁ గుడిచియు నొరులకు
బెట్టియుఁ దనయిచ్చ వెచ్చపెట్టఁ దలంచెన్.

163

క.

ఆడెడువారల కిచ్చును
పాడెడువారలకు నిచ్చు, బట్లకు నిచ్చున్
బాడబవరులకు నిచ్చును
వేడుకకాండ్రురకు నిచ్చు వివిధార్థంబుల్.

164


సీ.

భూరిభూమ్యాదికభూరిదానంబులు
        సువిశేషతిథుల భూసురుల కిచ్చు
నుక్తదక్షిణలతో నుభయతోముఖసహ
        స్రములను బ్రాహ్మణోత్తముల కిచ్చుఁ
దిలధేనులాదిగాఁగల దానదశకంబు
        విధిపూర్వకముగ సద్ద్విజుల కిచ్చు
గడుఁబెద్దచెఱువులు గట్టించు నిఱుపేద
        విప్రుల రావించి వృత్తు లొసఁగు


తే.

విత్తనిర్వంచనక్రియావృత్తిఁ బెక్కు
దానములు చేయుఁ బుణ్యతీర్థములయందు
మఱియు నర్థమూలము లైన మహితపుణ్య
కర్మములు నెమ్మి నొనరించు ధర్మనిరతి.

165


పురందరునకు వైశ్యులు ధనప్రభావము నెఱిఁగించుట

ఉ.

ఇమ్మెయి నర్థ మెల్లను వ్యయింపఁ బురిం గలవైశ్యు లందఱున్
నెమ్మిఁ బురందరుం గదిసి, నీవు వణిక్కులవర్తనంబు స
ర్వమ్మును వమ్మునం గలిపి, వాలి విశృంఖలవృత్తి దానధ
ర్మమ్ములు త్యాగభోగములు మానక సేయుట నీతిమార్గమే?

166


క.

ఈమెయి వెచ్చము సేసిన
నామేరుమహాద్రియంత యర్థం బైనన్
వే మొదలికి మోసం బగు
మామాటలు విని తదుద్యమం బుడుగు మనా!

167


తే.

సరకుగొను మన్న మామాట సరకుగొనవు
జాతినీతివర్తనముల జాడఁ బోవు,

పాలసుం డగు నయ్యర్థపాలుఁ డైన
వలదు, మామాట వినవన్న చలము విడిచి.

168


తే.

అలహరిశ్చంద్రుఁ డనుచితవ్యయ మొనర్చి
యాలుబిడ్డల విడిచి యంత్యజునిఁ గొలిచె,
సంచితార్థంబు నిష్ప్రయోజనము గాఁగ
నల వెఱుంగక వెచ్చించునతఁడు చెడఁడె?

169


తే.

పుట్ట లిసుమంత లిడనిడఁ బొదలు టెఱఁగి
పుడుకఁ బుడుకంగం గాటుకపోకఁ జూచి
విత్తసముపార్జనవ్యయవృత్తులందుఁ
జిత్త మిడిన వర్తకునకుఁ జేటు గలదె?

170


ఆ.

పిల్లుగట్టు నలకుబేరుండు దానైన
నాయమునకు వెచ్చ మధిక మైనఁ
బేద యైన ధనదుపెన్నుద్దియై చను
నాయమునకు వెచ్చ మల్ప మైన.

171


క.

తనయొడలం గలనెత్తురు
ధనహీనుని విడిచిపోవు, దారాది సుహృ
జ్జనములు విడుచుట యరుదే?
మనుపీనుఁగు నిర్థనుండు మదిఁ బరికింపన్.

172


క.

పాసినయప్పుడు పాయుదు
రాసలఁ జేరుదురు చేరినప్పుడు చుట్టల్
డాసినచుట్టము సుమ్మీ
శ్రీసతి యెవ్వారి కైన సిద్ధము జగతిన్.

173


క.

ధనమూలము జగ మంతయు
ధనవంతుని కిష్ట మగుపదార్థము లెల్లం
దనచేతిలోని వగుటను
ధన మార్టింపంగ నెవ్విధంబున వలయున్.

174

క.

శ్రీమంతుఁడె కులవంతుఁడు
శ్రీమంతుఁడె సుభగరూపజితకంతుఁడు సూ !
శ్రీమంతుఁడె గుణవంతుఁడు
శ్రీమంతుఁడె సిద్ధశేముషీమంతుండున్.

175


క.

[6]ఒడమి గలవెడఁగు నైనను
బుడమిం గలవారలెల్ల భూషింతురు, శ్రీ
పెడఁబాసిన దూషింతురు
కడుఁ బేదఱికంబుకంటెఁ గష్టము కలదే?

176


వ.

కావున, నీవు మాబుద్ధులు విని, నీతివిరుద్ధవర్తనం బుడిగి కులం బుద్ధరింపు, మనిన సుజ్ఞానసుందరుండగు పురందరుండు పురాణసిద్ధంబులగు నీతివచనంబుల కార్యంబు లని నిర్దేశించి, వణిగ్వంశవర్యుల నుద్దేశించి ప్రియపూర్వకంబుగా నిట్లనియె.

177


ధనమునకు సద్వినియోగమే ఫలమని పురందరుఁడు తెలుపుట

క.

నేలం బాఁతిన, నన్యుల
పా లవు ధన, మొండె మ్రుచ్చుపా లవు, ధరణీ
పాలునిపా లవుఁ గావున
వాలాయముఁ గుడువ విడువ వలయున్ ధనమున్.

178


క.

నెఱ వగుసంపద గలిగిన
నెఱి దానం గుడువఁ గట్టనేరనిమనుజుం,
డఱిముఱిఁ జేనికిఁ గట్టిన
వెఱబొమ్మయె కాఁడె? యెన్నివిధములఁ జూడన్.

179


క.

కొలఁదికి మీఱినలక్ష్మికి
నలరెడుభోగంబె రక్ష, యారసిచూడన్
జలపూర్ణతటాకమునకు
నలవడఁగా వాట మైనయలుఁగుం బోలెన్.

180

క.

వరసతులఁ గవయుశక్తియు
సరసాహారములు గుడుచుశక్తియు, సిరికిం
దరమైన దానరక్తియు
నొరులకు లే వధికభాగ్యయుతులకుఁ దక్కన్.

181


క.

వే మింటిదాక బెరిఁగిన
దీమసమున నతలమునకు దిగఁబడి చనినన్
భూమి గలయంత దిరిగినఁ
దా మునుపెట్టనిది రిత్త దన కే లబ్బున్.

182


ఆ.

సంపదలు తరంగసంచలంబులు, రెండు
మూఁడునాల్గుదివసములది ప్రాయ,
మాయు వరయ శారదాభ్రపటల మని
యెఱిఁగి సేయుఁడు పరహితము హితము.

183


క.

ఏలా దాఁచెద రర్థము
లేలా యర్థులకుఁ బెట్ట రేలా కుడువం
జాలరు? నిలువదు సిరి పెను
గాలికిఁ గంపించు దీపకళికయుఁ బోలెన్.

184


క.

సిరియును నాయువుఁ గడు న
స్థిరములు, జముఁ డదయుఁ, డిది మదిం దెలిసియుఁ జే
యరు ధర్మము, 'ధర్మస్య
త్వరితా గతి' యను పురాణవచనము వినరే!

185


క.

తనచేసిన పురుషార్థము
తనసొమ్ముగ నెఱిఁగి నరుఁడు దానపరుండై
యనుభవియై మన వలదా?
దినములచే మోసపో కతిస్థిరబుద్ధిన్.

186


క.

ఇచ్చి చను నర్థ మెల్లను
విచ్చలవిడి నప్రదాత వితరణి గాఁడే

చచ్చియు విడువం డర్థము
నచ్చెరువుగ దాత లోభి యౌనో కాడో!

187


వ.

అని యనేకవిధంబుల దానధర్మపరోపకారంబులు సత్కర్మంబు లగుట దేటపడం బలికి, కులవృద్ధు లుపదేశించుబుద్ధులు వినక వీటింబుచ్చి, విచ్చలవిడి నిచ్చలు వెచ్చంబులు సేయం జేయ, నకించనత్వంబు ప్రాపించి, క్రమక్రమంబున నఖిలజననింద్యమానంబుగా నిత్యాశనశూన్యంబగు దైన్యంబు వచ్చిన, వచ్చినచుట్టంబులు నెవ్వగలనొవ్వ, నొవ్వనివార లవ్వల నివ్వల నవ్వం, దల యెత్తుకొని నడవ రామికిం, దొలంగఁ ద్రోవరాని లేమికి, నొండొకయుపాయంబు మదిం దోఁపమికిం గొండొకచింతించి, ధీరతావధీరతమందరుండగు పురందరుండు ధైర్యం బవలంబించి, సకలతీర్థదర్శనార్థం బుజ్జయినీపురంబు వెడలి, యనేక పురవరగ్రామంబులును గిరివనదుర్గంబులును నిర్గమించి, కతిపయదినంబులకుం బ్రతోళికాసముత్సేధసౌధచంద్రశాలావిలసితలీలావతీవిలసనవియచ్చరప్రమోదంబైన మథురాపుటభేదనంబు చేరి, తదీయవిభవవిశేషంబులకుం బరితోషంబు నొంది యనంతరంబ.

188


పురందరుని తీర్థయాత్రాగమనము

ఉ.

కాశికి నేగి, యందు మణికర్ణికలోపలఁ దీర్థమాడి, వి
శ్వేశుపదాంబుజంబులకు నెంతయు భక్తి నమస్కరించి, తాఁ
జేసినకర్మబంధముల చిక్కెడలించి, విముక్తికన్యకన్
డాసెద నంచు నెమ్మనమునం బ్రమదంబు వహించి వెండియున్.

189


క.

చిరనిద్ర యొండుచోటుల
నరయంగా దుఃఖహేతు వనఁగాఁ బరఁగుం,
బరమానందప్రద మా
చిరనిద్రయ కాశి, నిట్టిచిత్రముగలదే!

190


చ.

చెలు వగుకాశికామహిమ చిత్రము; బెబ్బులి లేడి మ్రింగి యా
కలిచెడ కెద్దుఁ బట్టఁ, బులికాటున నెద్దును నెద్దుపోటునన్
బులియు శరీరమున్ దొరఁగ బోరున లే డొకలేడిఁ బట్టుటల్
పులి పులితోలు గప్పుటయుఁ బొల్పగునె ద్దొకయెద్దు నెక్కుటల్.

191

సీ.

రూప మొక్కటి రెండురూపులై చెలువొందు
        మూఁడుమొనలపోటు ముట్టుఁ బట్టు
బాహుచతుష్కంబుఁ బంచాస్యములుఁ బూను
        షణ్ముఖుపైఁ బ్రేమ సలుపుచుండు
సప్తాశ్వచంద్రు లీక్షణములుగా నొప్పు
        నెనిమిదిమూర్తుల వినుతి కెక్కు
నవనిధీశసఖుం డనంగఁ గీర్తివహించుఁ
        బదికొంగులైన యంబరముగట్టుఁ


తే.

బదునొకండు విధంబులఁ బ్రణుతి కెక్కు
వెలయఁ బండ్రెండుగనుపులవిల్లుఁ బట్టు
గర్మపాశలవిత్రవిఖ్యాతి మెఱయుఁ
గాశిలో మేను దొఱఁగినఘనయశుండు.

192


వ.

అని యప్పురంబునకుం జని.

193


తే.

అర్థి భాగీరథీస్నాన మాచరించి
బహుళవిశ్వేశపదభక్తి భజన చేసి
శ్రీవిశాలాక్షి దర్శించి చిత్త మలర
వప్రగోపురభైరవస్వామిఁ గొలిచి.

194


వ.

మఱియుఁ దత్తదుచితకరణీయంబు లనుసంధించి యప్పురంబు వెడలి గయాప్రయాగప్రభృతిపుణ్యభూములం దిరిగి, దక్షిణదిశాభాగభాగధేయంబులగు పుణ్యతీర్థంబులు నిరీక్షించునపేక్షం దిరిగి, శ్రీపర్వతదర్శనంబు సేయం బూని, మహాయుగసహస్రానశ్వరంబగు నేలేశ్వరంబను తదీయపశ్చిమద్వారంబుచెంగటి యోగిపుంగవహృదయంగమంబగు నివృతిసంగమంబునకుం జని.

195


చ.

దురితనివృత్తికై వినయదోహలవృత్తి, నివృత్తిసంగమే
శ్వరు నిఖలేశ్వరుం ద్రిపురసంహరు హైమవతీమనోహరున్
హరికమలాసనాదివరదాభయపాణిఁ ద్రిశూలపాణి శం
కరు నసుహృద్భయంకరుఁ ద్రికాలముఁ బూజయొనర్చి, పిమ్మటన్.

196

వ.

అట జని చని.

197


శ్రీశైల మల్లికార్జున క్షేత్రప్రశంస

ఉ.

శ్రీలలితుండు దానగుణశీలి పురందరుఁ, డంతఁ గాంచె శ్రీ
శైలము, రుగ్జరామరణసంక్షయకారిఫలౌషధీలతా
జాలము, సార్వకాలికవసంతనితాంతలతాంతవిస్ఫుర
త్సాలము, సానుసంగతలసన్మణిదీప్తదిగంతరాళమున్.

198


వ.

కని, మహోత్కర్షహర్షభరవిగళదశ్రుపూరపరిపూరితలోచనయుగళుండును, సముదీర్ఘసంకీర్ణసమత్పులకాంకురప్రపంచకంచుకితశరీరుండును, నిరంతరానందరసభరితాంతరంగుండునునై, సర్వాంగసంగతమహీతలంబులగు సాష్టాంగదండప్రణామంబు లాచరించి లేచి, యంజలిపుటంబు నిటలతటంబున ఘటియించి, బహువిధంబులఁ బ్రస్తుతించుచు నమ్మహామహీధరంబు నారోహణంబుచేసి, శశిశేఖరదర్శనపూర్వకంబుగా నపూర్వలక్ష్మీసుందరమణికందరమధ్యభాగస్థితమహాదేవమందిరముఖమండపంబుం బ్రవేశించి.

199


ఉ.

ముందటఁ గాంచె నాశుభసముజ్జ్వలమూర్తి పురందరుండు, ని
ష్యందకృపాతరంగముఁ, బిశంగకపర్దసురంగము, న్విని
ప్యందితభక్తలోకహృదపాంగము, సుందరరత్నకందరా
మందిర మల్లికార్జునసమాహ్వయజృంభితసిద్ధలింగమున్.

200


క.

కని, వినయంబున సాష్టాం
గనమస్కృతు లాచరించి, కరపుట మలికం
బునఁ జేరిచి, యిట్లని వా
రనివేడ్క నుతించె భక్తిరసతన్మయుఁడై.

201


తే.

దేవ, శ్రీమన్మహాదేవ, దేవదేవ
నాగమణిహార, కృష్ణవేణావిహార
సత్కృపాపాంగ, శాంభవీసంగతాంగ
పాలితాఖిలజగదీశ, పార్వతీశ!

202

క.

ఆశాలతాలవిత్రక
యాశాధిపమకుటమణిసమభ్యర్చితశో
భాశోభితపదపంకజ
శ్రీశైలగుహావిహార, సింహకిశోరా!

203


క.

శరణాగతభయహరణా
పురదానవహరణ, భూరిభుజగస్ఫురణా,
గురుకరుణాంతఃకరణా
సరసిజభవవినతచరణ, చంద్రాభరణా!

204


క.

కైలాససానుసంగత
కేళీవనకేళిలోల, కిన్నరనారీ
లీలాగీతరసప్రియ
శైలసుతానందజలధిసంపూర్ణశశీ!

205


వ.

అని స్తుతించుచు, సవ్యాపసవ్యాంగప్రదక్షిణంబులును, సాష్టాంగదండప్రణామంబులు ననేకంబు లాచరించి, మహోపచారంబులు సమర్పించి, యనంతరంబ తోఁటవీరేశ్వరదేవాయతనంబునకుం జని.

206


క.

సాష్టాంగనమస్కారము
లష్టోత్తరశత మొనర్చి, యాదేవునిపై
దృష్టియుఁ జిత్తము నిడి, వి
స్పష్టముగా భక్తితోఁ బ్రశంస యొనర్చెన్.

207


శ్రీమదహోబల పుణ్యతీర్థప్రశంస

చ.

ఒనరిచి, యావణిగ్జనకులోత్తముఁ డాగిరిమీఁద డిగ్గి, తాఁ
జని చని ముందటం గనియె సాలరసాలతమాలకుందచం
దనహరిచందనక్రముకదాడిమనింబకదంబపాటలీ
పనసవనీకృతార్థమును భాస్వదహోబలపుణ్యతీర్థమున్.

209


క.

కని, దానిమహత్త్వమునకు
మనమున నాశ్చర్యరససమన్వితుఁడై పే

పేర్కొనుచుం జని భవనాశనిఁ
గని తజ్జలమజ్జనాపకల్మషుఁ డగుచున్.

209


ఉ.

కాంచెఁ బురందరుం డెదురఁ గన్నులపండువుగా, సమాధిని
శ్చంచలసత్స్వభావదివిషన్మునిరాజమనస్సరోజలీ
లాంచితరాజహంసు, సుజనావనదేవశిఖావతంసునిం,
బ్రాంచితఘోరవీరరసభావుని, శ్రీ నరసింహదేవునిన్.

210


క.

కని, దండనమస్కారము
లొనరించుచు, భక్తిరససముత్సాహమునం
గొనియాడుచుఁ దళుకొత్తెడు
ననురాగముతోడ జయజయధ్వను లెసఁగన్.

211


ఉ.

శ్రీమదహోబలేశ్వరుఁ డశేషజగన్నిధి, భక్తలోకచిం
తామణి, వైరిదానవవిదారణదారుణనారసింహలీ
లామహనీయమూర్తి, కమలారమణీరమణీయుఁ డబ్జజేం
ద్రామరబృందవంద్యుఁడు, నిజాశ్రితలోకముఁ గాచుఁ గావుతన్.

212


వ.

అని కీర్తించి, పురందరుండు పురాణసిద్ధంబగు సిద్ధపట్టణస్థానంబునకుం జని.

213


సిద్ధపట్టణ సిద్ధేశ్వరప్రశంస

క.

మున్నొనరించినపాపము
లన్నియుఁ బెనువఱుతఁగలయు నవగాహన సం
పన్నుల కని సద్భక్తిని
బెన్ననదిం దీర్థమాడి ప్రీతి దలిర్పన్.

214


వ.

సిద్ధేశ్వరునగరు సొచ్చి.

215


క.

కని, సాష్టాంగనమస్కృతు
లనేక మొనరించి, ముకుళితాంజలియై భ
క్తి నుతించెఁ దనమనమ్మున
ననురాగరసంబు నిండి, యలుపులువాఱన్.

216

వ.

ఇవ్విధంబున నప్పరమేశ్వరుం బరితుష్టహృదయునిం గావించి, తదీయాయతనశిఖరమహోక్షధ్వజప్రదక్షిణపరిణద్దమహోత్సవసమయసమాగతభ్రమరరూపదివ్యసంయమిసముదయంబును నక్షీణపరమతపోధనప్రత్యక్షపరంజ్యోతిస్స్వరూపంబును నద్భుతాయత్తచిత్తుం డయి యవలోకించి, దక్షిణకైలాసం బనం బ్రశస్తి వహించిన కాళహస్తి మహాస్థానంబును, ననంతభోగికటకోత్కటకంబగు వేంకటాచలంబును, సర్వలోకలోచనసముక్సేధసౌధగోపురంబగు కాంచీపురంబును, ననవరతపరిస్ఫుటకావేరీసముత్సంగంబగు శ్రీరంగంబును, నక్షీణదురిశాక్షేపణప్రారంభధురీణంబగు కుంభఘోణంబును, శ్రీరామప్రతిష్టాభిరామంబగు రామేశ్వరంబును, జననిరీక్షణాపేతదుష్కర్మబంధంబగు సేతుబంధంబును, సందర్శనసంచలీకృతజగజ్జననయనంబగు ననంతశయనంబును జూచి, యక్షేశ్వరదిశాభిముఖుండై, మోక్షదానదీక్షాసమక్షంబగు విరూపాక్షంబునకుం జని.

217


శ్రీవిరూపాక్ష క్షేత్రప్రశంస

ఉ.

లోలతఁ గాంచె నాసుగుణలోలుఁడు, చారుశీలాగళజ్ఝరీ
జాలతటిప్రవాళఘనసత్తరువాటముఁ బార్శ్వతుంగభ
ద్రాలహరీవినోదవిహరజ్జలశీకరనిర్గతశ్రమో
ద్వేలహరప్రణామ మతిదీపితకూటము, హేమకూటమున్.

218


వ.

కని, యటఁ జని తదగ్రభాగంబున.

219


ఉ.

ఇక్షుధనుర్విపక్షుని, రవీందుకృతక్షుని, సర్వదేవతా
ధ్యక్షుని, నాదిభిక్షుని, హతప్రతిపక్షుఁ, గృతాంతదంతిహ
ర్యక్షు, మహాముముక్షుశరణాగతరక్షణదక్షు, [7]శ్రీవిరూ
పాక్షుని, నానతేంద్రకమలాక్షునిఁ గాంచెఁ గృపాకటాక్షునిన్.

220


చ.

కని, యతిభక్తిపూర్వకముగా ధరఁ జాఁగి నమస్కరించి, లే
చి నిలిచిఁ భాలభాగమునఁ జేతులు సరిచి, సమ్మదాశ్రువుల్

కనుఁగవఁ దొంగలింపఁ, బులకమ్ముల నంగము విస్తరింప, న
త్యనుపమలీలతోడఁ గొనియాడెను భక్తిరసార్ద్రచిత్తుఁడై.

221


శ్లో.

భజతభవభుజఙ్గం, పాణిహేలాకురఙ్గం
ప్రమదహృదయసఙ్గం, బాలచనద్రోత్తమాఙ్గమ్
పరమకుటపిశఙ్గం, వాసకైలాసశృఙ్గం
జితమదనదపాఙ్గం, శ్రీవిరుపాక్షలిఙ్గమ్.

222


శ్లో.

స్మరత సదమలాఙ్గం, మౌళిగఙ్గౌతరఙ్గం
సదయ లసదపాఙ్గం, శైలజాత్మాబ్జభృఙ్గమ్
నయనవిధుపతజ్ఞం, నాగభూషోజ్జ్వలాఙ్గం
త్రిపురదనుజభృఙ్గం, శ్రీవిరుపాక్షలిఙ్గమ్.

223


శ్లో.

నమత సుమతిసఙ్గం, నాట్యలీలాభ్రతుఙ్గం
కరధృతశయనాఙ్గం, కాలకూటాభిషఙ్గమ్
నిగమతరువిహఙ్గం, నిత్యయుక్తాన్తరఙ్గం
సితభసితసురఙ్గం, శ్రీవిరుపాక్షలిఙ్గమ్.

224


వ.

అని యిట్లు స్తుతిపూర్వకంబుగాఁ బరమేశ్వరుం బరమానందభరితాంతఃకరణుం గావించి, యనంతరంబ స్వదేశగమనచింత యంతరంగంబుపట్టు దవిలిన, నప్పట్టు గదలి పురందరుండు.

226


పురందరుఁడు తీర్థయాత్ర ముగించి నిజపట్టణముఁ జేరుట

క.

పుట్టిన పెరిగిన దేశం
బెట్టిజనులకైనఁ జూడ నిచ్చగుటను, నే
పట్టునఁ గాలూఁదక నిజ
వట్టణమున కరుగుదెంచి, పార్థివుఁ గాంచెన్.

226


చ.

కని, ప్రణమిల్లి, నేమ మడుగంబడి, వైశ్యుఁడు తాను బోయివ
చ్చినకథ యెల్లఁ దెల్లముగఁ జెప్పిన, రాజు రసైకలోలుఁడై
విని, యట నీవు గన్నవియు విన్నవిఁ జోద్యము లెవ్విఁ గల్గిన
న్మన మలరంగఁ జెప్పు, మనినన్ వినయం బెసఁగంగ నిట్లనున్.

227

క.

ధర యెల్లఁ దీర్థసేవా
పరతమెయిఁ బరిభ్రమించి, బహువిధవిభవ
స్ఫురణ విలసిల్లుమథురా
పురి కేఁ జని, యందు నొక్కభూసురునింటన్.

228


వ.

కృతశయనుండనై యున్న, నిశాసమయంబున నప్పురోపకంఠంబునందు, వితతనిర్ఘాతపాతంబులగు కళాఘాతంబులకుం గా కాతురయగు నొక్కకాంతయార్తనాదంబు కర్ణగోచరం బగుటయు; నత్తెఱం గందుల గృహమేధిం ప్రబోధించి యడుగుటయు, నతం డిట్లనియె.

229


ఉ.

ఏమి నిమిత్తమో యెఱుఁగ, మీపురిచేరున బిల్వవాటికా
సీమఁ బ్రతిక్షపంబు, సరసీరుహలోచన యోర్తు దానవ
స్తోమకశాభిఘాతములఁ దోరపువేదన సైఁపలేక యు
ద్దామత నార్తనాదపరతం బ్రలపింపఁగ విందు మెప్పుడున్.

230


క.

అనియె, నని విన్నవించిన
విని, యత్తెఱఁగెల్ల నెఱుఁగువేడుక మదిలో
జనియించి, వైశ్యయుతుఁడై
మనుజాధీశుండు చనియె మథురాపురికిన్.

231


విక్రమార్కుఁడు పురందరయుతుఁడయి మధురపురి కేఁగుట

క.

అందుఁ బురందరదర్శిత
మందిరమున విశ్రమింప, మధ్యమనిశయం
దిందుముఖియార్తనాదము
నందంద వినంగఁబడియె నధిపతి, కంతన్.

232


వ.

వినంబడినయాయెలుంగుచక్కటికిం జని.

233


ఆ.

కనియె నృపుఁ డఖర్వగర్వాంధదైతేయ
ఘనకశాభిఘాతకాతరాత్మఁ
దీప్రవేదనాప్రదీపితార్తస్వన
నిబిడితాస్య నొక్కనీరజాస్య.

234

క.

కనుఁగొని, వెఱవకు వెఱవకు
మని యూఱడఁ బలికి సతికి నభయప్రదుఁడై,
మనుజేంద్రుఁడు గర్వితుఁడై
దనుజేంద్రుల కనియె నత్యుదగ్రస్ఫురణన్.

235


రాక్షసులను సంహరించి విక్రమార్కుఁడు కమలావతిని రక్షించుట

ఉ.

ఓరి దురాత్ములార! దళితోత్పలలోచన నేల యీక్రియన్
ఘోరకశాభిఘాతములఁ గుందఁగఁ జేసెద, రింత కోర్తురే
యారయఁ బుష్పకోమల? లహంకృతు లిం కిట మాన కున్న, మ
ద్ఘోరకరాసిపత్త్రమునకున్ బలిసేయుదు నీక్షణంబునన్.

236


వ.

అనిన నన్నిశాచరులు సాహసాంకునకు నిట్లనిరి.

237


సీ.

కైకొందు మమరేంద్రుఘనరాజ్యపదరమా
        ధీనత నేకధాటీనిరూఢి,
దండింతు మతిదుర్మదస్ఫూర్తి నంతకు
        నిజభుజాగర్వంబు నిమిషమాత్ర,
భంజింతు మపరదిక్పాలకుచతురంగ
        బలగర్వములు తృణప్రాయములుగ,
హరియింతు మే ముత్తరాధీశపాలిత
        నవనిధానములు ప్రాభవ మెలర్ప,


తే.

నంతలేసి మహాత్ముల నింత సేయు
మాకు, నిను సంహరించుటమాత్ర మెంత?
‘యెందు గుడిమ్రింగువారికి నంది పిండి
పడియ’ మనుప ల్కెఱుంగవే పుడమిలోన!

238


చ.

అనవుడు, మందహాసరుచి యాననపద్మమునం దలిర్పఁ జ
య్యన నిశితాసిపుత్త్రిక కరాంబురుహంబున సంతరించి, య
ద్దనుజబలంబుపై నడచె, దారుణవారణసైన్యయోధమ
ర్దనవిభవాభిరాముఁ డగు రామనృపాలునిఁ గ్రేణిసేయుచున్.

239

క.

సురరిపులుఁ బ్రాస పట్టిన
పరిఘ క్షుర చర్మ బాణ బాణాసన తో
మర ముఖ్యసాధనంబులు
కరముల విలసిల్లఁ గదనకాంక్షితమతులై.

240


వ.

మార్కొనుటయుఁ బ్రతాపార్కుండైన విక్రమార్కుండును.

241


ఉ.

కొందఱకంఠదేశము లకుంఠితశక్తిమెయిన్ హరించుచుం,
గొందఱ రక్తమాంసములు కుంభినికిన్ బలిగా నొనర్చుచుం,
గొందఱ గాత్రఖండములు కుప్పలు సేయుచు, దైత్యకోటిఁ దా
నందఱ సంహరించె విలయాంతకుభంగి నరేంద్రుఁ డుగ్రతన్.

242


వ.

ఇత్తెఱంగున లబ్ధవిజయుండై, యక్కామినీరత్నంబు నత్యాదరంబునం గనుఁగొని.

243


కమలావతియను నచ్చరలేమ వృత్తాంతము

క.

ఎయ్యది నీవుండెడు నెల
వెయ్యది నీ నామ, మిప్పు డీయసురులచే
నియ్యలజడిఁ బడఁ గారణ
మెయ్యది? యనవుడు లతాంగి యిట్లని పలికెన్.

244


క.

అమరావతిఁ గలవేలుపుఁ
గొమిరెలలో నెల్ల, రూపగుణశీలములం
గొమరారుదు, నానామము
కమలాపతి, మీఁదికార్యగతి విను మధిపా!

245


క.

అవిరళసమాధియుతుఁడై
భువనత్రయభయదభంగిఁ బూనినయుగ్ర
శ్రవసునితపంబు, వృద్ధ
శ్రవసుఁడు మాన్పంగ మది విచారించి వెసన్.

246


వ.

తదీయనియతిప్రతివిధానంబునకు నాజ్ఞాపించినం దదనుజ్ఞ గైకొని తపోవనంబునకుం జని.

247

సీ.

బద్ధసిద్ధాసనపరిణతిఁ గూర్చుండి
        హృదయసమాధాన మొదవఁజేసి
మూలాలవాలసమున్నతిఁ గైకొని
        యనిలు మధ్యమనాడియందు నిలిపి
యంతర్గతములైన యాఱుదామరలకు
        నభినవోల్లాసంబు ననునయించి
యాంతరజ్వలనసంక్రాంతిచేఁ దొరఁగెడు
        చంద్రకళాసుధాసారధారఁ


తే.

దడిసి, యాత్మానుసంధానతన్మయత్వ
నిశ్చలాంతరంగుం డయి, నిస్తరంగ
నీరనిధియును బోలె నొప్పారుచున్న
మునివరేణ్యునిఁ బొడగంటి, మనుజనాథ!

248


వ.

కని, సభక్తికంబుగా దండనమస్కారంబు లాచరించి, పుష్పాపచయవ్యాజంబున సఖీజనసమాజంబుతోఁ దత్ప్రదేశంబున.

249


సీ.

నవలతాడోలనోత్సవకేళి నెపమున
        సరససంగీతమాధురి నటించి
చతురచిత్రకళాప్రసంగంబునెపమునఁ
        బరిహాసభాషణప్రౌఢి సూపి
ప్రమదనర్తనకేళిబాహాసముల్లాస
        సరసతఁ జాతుర్యసరణిఁ దెల్పి
పలుమాఱు నేమేనిఁ బరికించువిధమునఁ
        గలికిచూపులమించు చిలికి చిలికి


తే.

చెరిఁగి యి ట్లేము చేసినసేత లెల్ల
మునితపోభంగ మొనరించుననువు దక్కి
యప్రయోజనచతురంబులై తనర్చె
వనమహీసాంద్రచంద్రికావలులకరణి.

250


వ.

అంత నంతరాత్మధ్యానావసానసమున్మీలితనేత్రుండై , యమ్మహాసంయమీంద్రుండు, తనవిజ్ఞానప్రభావంబున నన్నెఱంగి, యవలోకించి.

251

మ.

వినఁ జూడం గొఱగానిచేష్టలఁ దపోవిఘ్నంబు గావింపఁ బూ
నినదోషంబున, భీషణాసురకశానిర్ఘాతపాతవ్యథా
జనితాక్రోశరవంబుతోడ, మథురాసామీప్యబిల్వాటవీ
వనికాసీమఁ బ్రతిక్షపంబు తరుణీ! వర్తింపు దీనాస్యవై.

252


క.

అనుడును, శాపాలాపము
లనుతాపము సేయ, మునికి సాష్టాంగముగా,
వినతి యొనరించి, యెంతయు
వినయంబున శాపముక్తివిధ మడుగుటయున్.

253


మ.

క్షితిసంరక్షణ మాచరించుటకునై, శ్రీకామినీనాయకుం
డతులోదారుఁడు విక్రమార్కుఁ డన బ్రహ్మక్షత్త్రతేజోమయా
కృతి నావిష్కృతి నొందువాఁ, డతనియంగీకార మీశాపదు
ష్కృతికి న్నిష్కృతి సేయుఁ బొమ్మని కటాక్షించెం బ్రసన్నాత్ముఁడై.

254


క.

ఆమునిశాపానుగ్రహ
సామర్థ్యమువలన నసురజనితవ్యథయున్
భూమీశ! యిట్లు పొరలఁగ
నీమహిమ విముక్తి గలిగె నిది విదితముగన్.

255


వ.

అని వినిపించి కమలావతీవధూరత్నంబు.

256


క.

దానసమగ్రత వేలుపు
మానికముం బోలుననుచు, మహనీయమణిం
గానుక యిచ్చి, నరేంద్రుని
వేనోళ్లం బ్రస్తుతించి, వీడ్కొని చనియెన్.

257


మ.

ధరణీశుండును వీడుపట్టునకు నుద్యత్ప్రీతి నేతెంచి, య
త్తరుణీరత్నముశావముక్తికిని జిత్తంబందు హర్షించుచుం,
దరుణాదిత్యుప్రభన్ వెలుంగు సురకాంతాదత్తరత్నంబు స
త్కరుణన్ వైశ్యున కిచ్చెఁ దద్వితరణౌదార్యంబు నగ్గించుచున్.

258

వ.

ఇత్తెఱంగున లబ్ధవిజయుండై, యమూల్యవస్తు ప్రదానవర్ధితపురందరుండగు నన్నరేంద్రపురందరుండు పురందరసహితుండై యుజ్జయినీపురంబునకు వచ్చి, నిరంతరౌదార్యంబును, బరమసాహసకార్యంబును, దనకు నియతకార్యంబులుగా సప్తసాగరపరివృతవిశ్వవిశ్వంభరాభరణపరాయణుండై మఱియును.

259


శా.

శ్రీమద్బెల్లముకొండభైరవకృపాశ్రీనిత్యసామ్రాజ్యల
క్ష్మీమాదుర్యగృహాంతరాంతరసదాకేళీనటన్నందన
స్తోమాశేషవిశేషరత్నకలికాకుంభద్విభూషావలీ
సామగ్రీకృతలోచనోత్సవలసత్సౌభాగ్యభాగ్యోదయా!

260


క.

రామాకరచామీకర
చామరసంజాతవాతచంచలదలక
స్తోమాభిరామసుమహిత
రామాయణసుప్రలాప రసికకలాపా!

261


ధృతి యను వృత్తము

ప్రతాపగుణభూషణా, పరహితార్థసంభాషణా
వితీర్ణిరవినందనా, విభవనూత్నసంక్రందనా
శ్రుతిస్మృతివిచక్షణా, సుకృతకీర్తిసంరక్షణా
క్షితీంద్రసుతవర్తనా, శివపదద్వయీకీర్తనా.

262


గద్యము.

ఇది శ్రీమదఖలకవిమిత్త్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం బైన విక్రమార్కచరిత్రం బనుమహాకావ్యంబునందు ద్వితీయాశ్వాసము.

  1. వస్తుసమూహము
  2. చతురత. వా. 1926.
  3. ఒక రాజు, కాంచనాలంకారములతోఁ గూడిన గజాదులను దానము చేసి, యర్థులకు బంగార మొసఁగి యనేకయాగము లొనరించెను. దైవబ్రాహ్మణభక్తినిరతుఁడు.
  4. ఘనకపాలంబు కక్షభాగమునఁ బూని
  5. వివర్ణమయిన
  6. ధనము
  7. శ్రీ విరూపాక్షుని, నానరేంద్రకమలాక్షునిఁ గాంచెఁ-అని వావిళ్ల. 1926