వావిలాల సోమయాజులు సాహిత్యం-3
వావిలాల సోమయాజులు
సాహిత్యం-3
అనువాదాలు
బాలసాహిత్యం
ఎమెస్కో
ANUVAADAALU, BAALA SAAHITYAM
వావిలాల సోమయాజులు సాహిత్యం - 3
అనువాదాలు, బాలసాహిత్యం
సంపాదకులు: డా. డి. చంద్రశేఖర రెడ్డి
ముద్రణ: మార్చి, 2018
మూల్యం: రూ.500/-
ISBN: 978-93-86763-68-6
ముఖచిత్రం: స్టార్ మీడియా సర్వీసెస్, హైదరాబాద్
టైటిల్ డిజైన్: జి. పురుషోత్ కుమార్
ప్రింటర్స్ : రైతునేస్తం ప్రెస్, హైదరాబాదు.
ప్రచురణ
ఎమెస్కో బుక్స్ 1-2-7, బానూకాలనీ, గగనమహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్ - 500029, తెలంగాణ. e-mail : emescobooks@yahoo.com, www.emescobooks.com
బ్రాంచ్ ఆఫీసు
ఎమెస్కో బుక్స్ 33-22-2, చంద్రం బిల్డింగ్స్ సి.ఆర్. రోడ్, చుట్టుగుంట విజయవాడ-520004, ఆంధ్రప్రదేశ్. ఫోన్ : 0866-2436643
e-mail : emescovja@gmail.com ముందుమాట
శ్రీ వావిలాల సోమయాజులు (19.1.1918 - 9.1.1992) గుంటూరు జిల్లా విప్రులపల్లె అగ్రహారంలో జన్మించారు. తండ్రి సింగరావధానులుగారు, తల్లి మాణిక్యాంబ గారు. నరసరావుపేట, గుంటూరులో వారి విద్యాభ్యాసం జరిగింది. భార్య కైకమ్మగారు. సోమయాజులుగారు 1940-46 మధ్య గుంటూరులోని శ్రీ శారదానికేతన ప్రాచ్య కళాశాలలో ప్రధానాచార్యులుగా పనిచేశారు. ఆ తర్వాత 1976లో పదవీవిరమణ పొందేవరకు గుంటూరు హిందూ కళాశాలలో ఆంధ్రభాషోపన్యాసకులుగా పనిచేశారు.
సోమయాజులుగారి జీవితం పూర్తిగా సాహిత్య రచనకు, సాహిత్య ప్రచారానికే అంకితమై పోయింది. తనకు ఇరవయ్యేళ్లు నిండీ నిండకముందే సాహిత్య సంస్థలలో సభ్యుడిగా సాహిత్య సేవ ప్రారంభించారు. 1939 నుండి సాహితీ సమితి సభ్యులు. ఈ సమితికి సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా వ్యవహరించారు. నవ్యసాహిత్య పరిషత్తుకు సహాయ కార్యదర్శి. 'ప్రతిభ' పత్రికకు రచనలను ఎంపిక చేసే నిర్ణాయక సంఘంలో సభ్యుడు. 1963-73 మధ్య ఒక దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు.
సోమయాజులుగారు సంస్కృతాంధ్రాంగ్లాలలోను, హిందీలోను గొప్ప పండితులు. ఈ నాలుగు భాషల్లోనూ ఏ భాష నుండి మరే భాషలోనికయినా అనువాదం చేయగలిగిన సమర్థత కలిగినవారు. వచనాన్నే కాదు పద్యాన్ని పద్యరూపంలోనే అనువదించడంలో సిద్దహస్తులు. ఆయన సహజంగానే కవి కావడంవల్ల అనువాదంలోనూ మూలకావ్యం లోని కవిత్వాంశను సంపూర్ణంగా ప్రదర్శించగలిగిన కవితా హృదయాన్ని సొంతం చేసుకున్నారు.
సోమయాజులుగారి సాహిత్య సృజనా జీవితం బహువిపులమైంది. ఇరవై ఏళ్ల వయస్సులోనే ప్రారంభమైన వారి సాహిత్య సేవ జీవితాంతం కొనసాగింది. ఇంత బహుళంగా రచనలు చేసిన వారి సంఖ్య చాలా తక్కువ. అందులోనూ ఇన్ని ప్రక్రియలలో రచనలు చేసినవారు మరీ అరుదు. ఆయన కవిత్వం రాశారు. అందులో పద్యరచనలూ ఉన్నాయి, గేయ రచనలూ ఉన్నాయి. అతిసాధారణ వచనాన్ని కూడా అటు పద్యంలోనూ, ఇటు గేయంలోనూ ఇమిడ్చి మనోహరంగా రచింపగలిగిన శక్తి వారిది. నాటకాలు రాశారు, నాటికలు రాశారు. పద్య నాటికలు రాశారు, గేయనాటికలు రాశారు, సంగీత రూపకాలు రచించారు. శ్రవ్య నాటికలు రాశారు. నవలలు రాశారు. ఆంగ్లం నుండి నాటకాలూ, నవలలూ అనువదించారు. వీటిలో షేక్స్పియర్ నాటకానువాదాలు తెలుగులో వావిలాల వారివే బహుజనాదరణ పొందాయి. హిందీ నుండి మహాకవి జయశంకర ప్రసాద్ కావ్యాలు 'కామాయని', 'ఆంసూ' లను అతిమధురంగా పద్యకావ్య రూపంలో అనువదించారు.
ప్రౌఢ కవి అయిఉండీ పిల్లలకోసం సరళవచనంలో నవలలూ, దేశనాయకుల, దేశభక్తుల, చారిత్రక వ్యక్తుల, కవుల జీవిత గాథలూ రచించారు.
ఆయన పద్యరచన ఎంత విపులమో గద్యరచనకూడా అంతే విపులం. కథలు, జీవితగాథలు, నాటకాలు, నవలలను పక్కన బెడితే ఆయన సృష్టించిన వ్యాస సాహిత్యం అపారం. పరిశోధనాత్మక వ్యాసాలెన్నో రచించిన సోమయాజులుగారు సృజనాత్మక వ్యాసాలూ విస్తృతంగా రాశారు. ఆయన ఎంపిక చేసుకున్న విషయాలే మనల్ని విస్మయ పరుస్తాయి. డజనుకు పైగా వ్యాసాలు వివాహం పైనే అంటే ఆయనకు ప్రజల సాంఘిక జీవనం మీద, ఆచార వ్యవహారాల మీద ఉన్న పట్టును, అవగాహనను మనం అర్థం చేసుకోవచ్చు, మూడుపదుల వయస్సులో ఆయన వాత్స్యాయన కామసూత్రాలపై సాతవాహన సంచికలో రాసిన బృహద్వ్యాసం నేటికీ పరిశోధన వ్యాసానికి ఉదాహరణ ప్రాయంగా నిలుస్తుంది. ఆయన ఏమి రాసినా అది ప్రామాణికమే. తాను చెప్పే ప్రతి విషయానికీ ఆయన ఆధారం చూపుతారు.
సోమయాజులు గారి రచనలకు మరోపార్శ్వం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా భారతీయ దార్శనికతా ప్రియుడైన ఆయన బహాయీ సాహిత్యాన్ని అనువదించారు. క్రైస్తవ రచనలను అనువదించారు.
సోమయాజులుగారు ఇంగ్లీషులో కూడా కొన్ని వ్యాసాలు రచించారు.
సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్య బంధు, మధురకవి, కవి భూషణ, కుమార ధూర్జటి, పద్యవిద్యాధర వంటి అనేక బిరుదాలతో ఆంధ్ర సాహిత్యలోకం వావిలాల సోమయాజులు గారిని సమ్మానించింది. ఈ బిరుదులు ఆయన రచయితగా ఒకవైపు, సాహిత్య సేవకుడుగా మరోవైపు చేసిన కృషికి అద్దం పడతాయి. ఐదు దశాబ్దాలకు పైబడిన సాహిత్య జీవితంలో సోమయాజులుగారు చేసిన అసంఖ్యాక రచనల్లో ఎన్నో అలభ్యంగా ఉండిపోయాయి. కొన్ని అముద్రితాలుగా ఉండిపోయాయి. లభించిన రచనల్లో ముద్రితా ముద్రితాలన్నింటిని కలిపి ఇప్పుడు ఆయన లభ్యరచనల సమగ్ర సంపుటాలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ సంపుటులలో ఇది మూడవది.
19వ శతాబ్దం ద్వితీయార్ధంలోనే తెలుగులో నాటకరచన ప్రారంభమైనది. స్వతంత్ర నాటకాలు తక్కువగానూ, అనువాద నాటకాలు ఎక్కువగానూ మొదట్లో వచ్చేవి. అనువాదాల్లో ఎక్కువ భాగం సంస్కృత నాటకాలకు అనువాదాలు. తెలుగువారికి ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఏర్పడడంతో షేక్స్పియర్ వంటి నాటకకర్తల నాటకాలను తెలుగులోకి తేవాలన్న కాంక్ష ఏర్పడింది. ఆ రోజుల్లో ఆంగ్లాధికారులు, కళాశాలల ప్రధానాచార్యులుగా ఉన్న ఆంగ్లేయులు ఆంగ్ల నాటకాల ప్రదర్శనలు చేయించారు. వాటిలో ముఖ్యమైనవి షేక్స్పియర్ నాటకాలే. షేక్స్పియర్ నాటకానువాదకులలో మొదట చెప్పుకోదగినవాడు వావిలాల వాసుదేవ శాస్త్రి. మన వావిలాల వారితో ఇంటిపేరు కలిసింది. తరువాత గురజాడ శ్రీరామమూర్తి, కందుకూరి వీరేశలింగం పంతులు తదితరులు షేక్స్పియర్ నాటకాలను అనువదించారు. అనువాదంలోనూ భిన్న పద్ధతులు అనుసరించారు. కొందరు మొత్తం నాటకాన్ని ద్విపద తేటగీతి వంటి ఛందస్సులలో రాయగా, మరికొందరు గద్య పద్య మిశ్రంగా కేవలం గద్యరూపంలోనూ రచించారు. కొందరు స్థలాల పేర్లు, పాత్రల పేర్లు మార్చి నాటకాన్ని ప్రాంతీయం చేసారు. కొందరు యథాతథంగా అనువదించారు. కొందరు గ్రాంధిక భాష వాడితే, మరికొందరు వ్యావహారికం వాడారు.
వావిలాల సోమయాజులు గారు మూడు షేక్స్పియర్ నాటకాలను అనువదించారు. అవి జూలియస్ సీజర్, ఆంటోని - క్లియోపాత్రా, మేక్బెత్. ఈ మూడు నాటకాలకూ ఆయన విపులమైన పరిచయం రాసారు. అథోజ్ఞాపికలు ఇచ్చారు. నాటకాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన సామగ్రి అంతా ఇచ్చారు.
నాటకాన్ని బహుసరళంగా పాత్రోచితమైన వాడుకభాషలో దాదాపు మొత్తం గద్యరూపంలోనే రచించారు. ఎక్కడో అవసరమైన కొద్దిమాత్రపు గీతాలను వాడారు. బహుళ తెలుగులో ప్రదర్శన యోగ్యంగానూ, ఆధునిక భాషలోనూ, యథామాతృకం గానూ షేక్స్పియర్ నాటకాలను అనువదించడంలో మొదటివారు సోమయాజులుగారే. ఇంగ్లీషులో రాబర్ట్ లూయి స్టీవెన్సన్ రచించిన నవల 'డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్'. ఆ కాలంలో ఈ నవల పాఠకలోకాన్ని ఎంతగానో ఆకర్షించింది. వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వ్యక్తిలోని మంచి ఒక పాత్రగానూ, చెడు మరొక పాత్రగానూ ఉన్నట్లయితే ఎలా ఉంటుంది. ఒక వ్యక్తే భిన్న సమయాలలో మంచివాడుగానూ, చెడ్డవాడుగానూ ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది. మనిషిలోని చెడు స్వభావమే మంచి స్వభావాన్ని కూడా పూర్తిగా ఆక్రమించుకుంటే ఆ మనిషి జీవితం ఏమవుతుంది తెలియజెప్పేదే ఈ నవల.
ప్రౌఢ కవి విమర్శకులు పిల్లలకోసం సరళంగా సాహిత్య సృజన చేయడం చాలా కష్టం. వారికి అలవాటైన శైలి వారు పిల్లలకోసం రాసేదానిలోకి చొరబడుతుంది. అలా కాకుండా సోమయాజులుగారు పిల్లలకోసం సరళమైన భాషలో 'ఆండ్రూ కార్నెగీ’ జీవిత కథను రచించారు. ఒక ఉత్తమ విద్యార్థి కథను 'నాలంద' అన్న నవలికగా తీర్చిదిద్దారు. వీరు 'అగ్రగాములు' అన్న పుస్తకంలో ఝాన్సీ లక్ష్మీబాయి, లోకమాన్య తిలక్, గాంధీజీ, నేతాజీల జీవిత గాథలను పిల్లలకోసం రచించారు. ఈ నలుగురు స్వాతంత్ర్య సమర యోధుల కథలు పిల్లలలో దేశభక్తిని పెంపొందింపజేస్తాయి.
కదంబములో ఆరు కథలున్నాయి. వీటిలో త్యాగము, భ్రాతృప్రేమ, అహింస, ధర్మబుద్ధి, దేశాభిమానము ముఖ్య నీతులు. పిల్లలలో మంచి నీతిని పెంపొందించడానికి ఉద్దేశించిన కథలివి.
స్వాభావికంగా అధ్యాపకులైన వావిలాల సోమయాజులు గారు ఒకవైపు ప్రౌఢ సాహిత్యాన్ని సృష్టిస్తూనే మరోవైపు అంతర్జాతీయ ఖ్యాతిపొందిన షేక్స్పియర్ నాటకాలను అనువదించడం, అదే సమయంలో బాలబాలికల కోసం నీతికథలను రచించడం, వారికి భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దాలనే అభిలాషను తెలియజేస్తుంది.
డి. చంద్రశేఖర రెడ్డి
విషయసూచిక
9 |
135 |
323 |
459 |
555 |
557 |
705 |
791 |
871 |
This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.