వావిలాల సోమయాజులు సాహిత్యం-3/జూలియస్ సీజర్


భూమిక

కవి జీవితవిశేషాలు

'ప్రపంచాగ్రగణ్యుడైన నాటకకర్త' అని ఖ్యాతివహించిన విలియం షేక్స్పియర్ క్రీ.శ. 1564 ఏప్రిల్ మాసంలో ఆంగ్లదేశంలోని స్ట్రాఫర్డ్ - ఆన్ - ఆవన్ అనే నగరంలో జన్మించాడు. తన పదునాల్గో సంవత్సరం దాకా స్వల్పంగా విద్యాగ్రహణం చేసి, తండ్రి జాన్ షేక్స్పియర్కు వ్యాపారంలో తోడ్పడటానికని విద్యార్జనకు స్వస్తి చెప్పాడు. పదునెనిమిదవ ఏట తనకంటే ఏడు సంవత్సరాలు పెద్దదైన ఆనీహాథ్ వే అనే కన్యను వివాహమాడాడు.

యౌవనారంభదశలో సర్ జాన్ లూసీ అనే ధనికునితో పేచీ, వైవాహిక జీవిత వైఫల్యం షేక్స్పియర్ను జన్మసీమకు దూరం చేశాయి. క్రీ.శ. 1584లో అలా అతడు లండన్ మహానగరం చేరుకున్నాడు. 'గ్లోబ్' నాటకశాలలో మొదట 'అశ్వబాలుడు', 'ఆమంత్రణ - బాలుడు' ఉద్యోగాలు చేసి, క్రమంగా ఆ నాటకశాలలోనే నటకుడు, నాటకరచయితగా పదోన్నతి పొందాడు. ప్రారంభదశల్లో అతడు ఇతరుల నాటకాలను ప్రదర్శనీయంగా మలిచాడు. కాలక్రమాన అనుభవాన్ని స్వీయ నాటకరచన ద్వారా సమకాలీన నాటకకర్తల్లో అగ్రగణ్యుడనిపించుకున్నాడు. తన 24 సంవత్సరాల సాహితీ జీవితంలో 37 నాటకాలు రచించాడు. నటకుడుగా షేక్స్పియర్ ప్రజ్ఞావిశేషాలు ఏ స్థాయిని తాకినవో తెలియరాలేదు.

ఆత్మశక్తివల్ల నిత్యాభివృద్ధి పొందుతూ ప్రసిద్ధుడై ధనార్జనం చేసి, ప్రభువర్గంలో చేరి ఎసెక్సు, సౌతాంప్టన్ ఎరల్స్, పెంబ్రోక్ ప్రభువులతో మైత్రి సంపాదించి వారికి సరివాడనిపించాడు. ఎలిజిబెత్ రాణి, జాన్ రాజు ఆయన నాటకాలపై ఆసక్తులై బిరుదులతో గౌరవించారు. లౌకిక జీవితంలో కూడా విజయాలను సాధించి లోకజ్ఞుడనిపించుకొన్న షేక్స్పియర్, జీవిత చరమాంకంలో తన సంపదతో జన్మప్రాంతమైన స్ట్రాఫర్డ్ కు వచ్చి ప్రశాంత జీవితాన్ని గడిపి, 23 ఏప్రిల్ 1616 తేదీన తనువు చాలించాడు. నాటక రచన, వివిధ దశలు

1588 మొదలు 1612 వరకు సాగించిన 24 సంవత్సరాల సాహితీజీవితంలో షేక్స్పియర్ 37 నాటకాలు, రెండు మహాకావ్యాలు, కొన్ని ఖండకావ్యాలు రచించాడు. షేక్స్పియర్ నాటక రచనాకాలాన్ని విమర్శకులు నాలుగు దశలుగా విభజించారు.

ప్రథమదశ (1588-1595): ఈ దశ నాటకాల్లో చరిత్రాత్మకాలు, విషాదాంత, సుఖాంతాలు. వీటిలో ప్రసిద్ధమైనవి హెన్రీ VI మూడుభాగాలు, మూడవ రిచర్డ్, రెండవ రిచర్డ్, రోమియో జూలియట్, వేసవినాటి రాత్రికల మొదలైనవి. వీటిలో భాషాపటిమే గాని భావగాంభీర్యం తక్కువ.

ద్వితీయదశ (1595 - 1601): ఈ దశలో షేక్స్పియర్ కొన్ని సుప్రసిద్ధ సుఖాంతనాటకాలు, చరిత్రాత్మక నాటకాలు రచించాడు. వెనిస్ వర్తకుడు, జాన్ రాజు, నాల్గవ హెన్రీ రెండుభాగాలు, ఐదవ హెన్రీ ఈ కాలంనాటివి. ఈ దశలోని నాటక రచనాకాలం నాటికి షేక్స్పియర్ మహాకవి మనస్సు పరిపక్వం కావటం ప్రారంభించింది. వీటిలో ప్రపంచానుభవం, మనస్తత్త్వ పరిశీలనం, గత నాటకాలలో కన్నా ఎక్కువ.

తృతీయదశ (1601-1608): ఈ దశలో జన్మించినవే జూలియస్ సీజర్, ఆంటోనీ క్లియోపాత్రా, కోరియలాసస్ అనే మూడు రోమేశ చరిత్రాత్మక నాటకాలు. హామ్లెట్, ఒథెల్లో, లియర్, మాక్బెత్ - అనే విషాదాంత చతుష్టయం కూడా యీ దశలోనివే. ట్రాయిలస్ - క్రెసిడా వంటి సుఖాంత నాటకాలు కొన్ని ఉన్నప్పటికీ విమర్శకులు ఈ దశను 'విషాదాంత దశ' గానే పేర్కొన్నారు. ఈ దశలో మహాకవి షేక్స్పియర్ విలాసం, ప్రణయం, యుద్ధవైభవాదులమీదకు పోయే బుద్ధిని మానవ హృదయకుహరాంతరాలకు మళ్ళించి, అంధకారం ఆవరించిన అక్కడి మానవ దౌష్ట్య స్వరూప స్వభావాదులను దర్శించి అవకర్షణ చేసి ప్రదర్శించాడు.

చతుర్థదశ (1608 - 1611): తుది దశ. ఇది ఒక నవచైతన్య దశ. శీతకాల కథ, సింబలైన్, తుపాను, పెరికిల్స్ ఈ దశలో పుట్టిన రూపకాలు. ఈ నాటకాల్లో ప్రశాంతచిత్తం, సుఖదుఃఖాదుల యెడ సమబుద్ధి ప్రకటితాలౌతుంటవి. దీన్ని విమర్శకులు షేక్స్పియర్ పరిపక్వదశగా భావిస్తుంటారు. రోమను నాటకాలు

తన తృతీయదశలో షేక్స్పియర్ చెప్పిన జూలియస్ సీజర్, ఆంటోనీ - క్లియోపాత్రా, కొరియలాసస్ అన్న మూడు నాటకాలకూ ఆధారం రోమను చరిత్ర. ఈ మూడు నాటకాలూ విషాదాంతాలు. మూడింటికీ ప్లూటార్క్ "జీవితాలు” ఆధారం. షేక్స్పియర్ మహాకవి కొరియలాసస్ నాటకంలో వివిధవర్గాలవారు ఔన్నత్యానికోసం తమ అనంతశక్తిని ధారవోస్తూ కలహిస్తున్న రోమును, సీజర్లో సిద్ధాంతాల మధ్య కలిగిన సంఘర్షణవల్ల అనతికాలంలో ఛిద్రం కానున్న మహత్తర సంపత్సమృద్ధమైన రోమును, ఆంటోనీ - క్లియోపాత్రాలో వ్యక్తుల స్వార్థపరత్వం వల్ల కొల్లబోవటానికి సంసిద్ధమైన అధికార ప్రాభవాలు గల రోమును ప్రదర్శించాడు. రోమక నాటక త్రయంలోని నాయకులు ముగ్గురూ గొప్ప వ్యక్తులు. సీజర్ నాటకానికి నాయకుడైన బ్రూటస్ స్వార్ధరహితుడైన దేశభక్తుడు. ఆంటోనీ - క్లియోపాత్రాలో నాయకుడైన ఆంటోనీ విలాస ప్రియత్వంతో అధఃపతితుడైన మహాసేనాని. కొరియలాసస్ లోని నాయకుడు దేశభక్తి ద్వారా సద్గుణాలను అధిగమించిన స్వార్థపరత్వం వల్ల దెబ్బతిన్న మహాగర్వి, ఆత్మాభిమాని. ఈ నాటకత్రయం రోము దేశ చరిత్రకు ముకురాలు. ఈ మూటిలోను జూలియస్ సీజర్ ఉత్తమోత్తమం.

కథాకాలం నాటి రోము

కథాకాలం నాటి రోము మహత్తర విజయాలను సాధిస్తున్నా, వర్గకలహాలతోనూ, అంతర్యుద్ధాలతోనూ నిండి ఉండేది. రోమను సామ్రాజ్య పాలనను ప్రాచీన రోమను ప్రభు కుటుంబాలవారే సాగించాలని కొందరు, పౌరులకు, ఇతర ప్రజలకు సమానత్వాన్ని ప్రసాదించే పాలనను రూపొందించాలని కొందరు, ఈ ప్రజాస్వామిక విధానాలతో మీ కెటువంటి ప్రమేయం లేదు, శక్తిమంతుడైన ఒక పాలకుని క్రింద అభ్యుదయాన్ని పొందటమే మా ఆశయమని కొందరూ భిన్నాభిప్రాయాలు వహిస్తూ పరస్పరం వైమనస్యాలను వెళ్ళబోసుకుంటున్నారు. వీళ్ళకు నిత్య చాంచల్యం గల సామాన్య జనసముదాయం వివక్షారహితంగా తోడ్పడుతూ వస్తున్నది. సక్రమ ప్రజాస్వామికానికి ఆవశ్యకాలైన ముఖ్యసూత్రాలు చెదిరిపోయినవి. రోముకు కావలసింది శక్తిమంతమూ, జ్ఞానోపేతమూ అయిన సుస్థిర ప్రభుత్వం. ఇటువంటిదాన్ని ఆ నాటి ప్రజలు కల్పించుకోగలరా అన్నది ప్రశ్న.

రోమనులు ప్రధానంగా 'పెట్రీషియన్లు' (ప్రభువర్గం), 'ప్లెబియన్లు' (జన సామాన్యవర్గం) అని రెండు తెగలు. ఇంటి బానిసలు, యుద్ధ బానిసలు, అండదండలు లేని విదేశీయులు ఇతర బానిసలూ, దుష్టక్రియలు చేయటానికి స్వేచ్ఛ గల స్వతంత్రులూ ఈ జనసామాన్యవర్గంలో వారు. వీరు ధర్మాధికారులమీదా, సంరక్షకుల మీద తిరుగబడి హత్యలు చేస్తుంటారు. ధర్మానికి కట్టుబడేవారు కారు. పాంపే విజయంతో వచ్చినప్పుడు ఆయన్ను గౌరవించి ఆహ్వానించారు. అతణ్ణి చంపివచ్చిన సీజర్కు ఘనస్వాగతం చెప్పారు. సీజర్ కు హత్యచేసిన బ్రూటస్ ను 'సీజర్'ను చేద్దామనుకున్నారు. వారి నాయకులు చేకొన్న విజయం విదేశీయులమీద నైనా, స్వదేశీయులమీద నైనా వారికి ఒకటే. విషయగ్రహణశక్తి లేనివారిని, ప్రసంగ ప్రావీణ్యమున్న వక్తలు తమ వకృత్వశక్తితో కీలుబొమ్మలను చేసి ఆడిస్తుండేవాళ్ళు. వారు స్వేచ్ఛాస్వరూపాన్నే మరిచిపోయారు. జనసామాన్యవర్గస్థితి ఇలా ఉంటే ప్రభు వర్గస్థితిగతులు ఇంతకంటే అధ్వాన్నంగా ఉన్నవి. సభాభవనంలో వక్తలు ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరి ముఖాన ఒకరు ఉమ్మేసుకోవటం, ఎన్నికల సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ పెద్ద మనుష్యులు వీధుల్లోకి రావటానికి వీల్లేనంతగా అల్లరులు చేస్తూ, చేయిస్తూ ఉండటం వారికి నిత్యలక్షణాలైనవి. సభాభవనంలోనే తములయుద్ధాలూ, హత్యలూ జరిగించేవాళ్ళు. ఇటువంటి రోములో ప్రజాస్వామికానికి తావెక్కడుంది? సీజరిజం (నిరంకుశత్వం) తప్ప మార్గాంతరం లేదు. రోము అటువంటి నిరంకుశుని ఆగమనం కోసం ఎదురు చూస్తున్నది.

సీజర్ తగిన అర్హతలతో ఉద్భవించాడు. ఆహారవినోదాలను కల్పిస్తే తృప్తిపడి ఎటువంటి ప్రభుత్వ విధానమైనా పట్టించుకోకుండా తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోవటానికి సంసిద్ధులై ఉన్నారు రోము సామాన్య ప్రజలు. కానీ ప్రభు కుటుంబాలలోని కొందరు వ్యక్తుల హృదయాలలో కొంత వ్యక్తిగతేర్ష్యవల్ల నైతేనేం, కొంత జితించిన స్వాతంత్య్ర ప్రియత్వం వల్ల నైతేనేం సీజర్ యెడ వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతకు ఫలితమే సీజర్ వధ. సీజర్ వధాఫలితాలే ప్రజాక్రోధం, బ్రూటస్ - కాషియన్ల పలాయనం. ఫిలిప్పీ యుద్ధభూమిలో వారికి అకారణ నిరాశానిస్పృహలు, సంపూర్ణ పరాజయం, బ్రూటస్ ఆత్మహత్యతో 'సీజరిజం'కు పరిపూర్ణవిజయం, స్వాతంత్ర్యేచ్ఛకు స్వస్తి చేకూరాయి. ప్రజల రాచరిక ప్రియత్వం బయటపడ్డది. రోమక సామ్రాజ్యంలోని రాజకీయ, సాంఘికశక్తుల సంఘర్షణ అంతరించింది. ఆక్టేవియస్ సీజర్ సైనిక రాచరికాన్ని స్థాపించి రోమక మహాసామ్రాజ్యాధినేత యైనాడు.

కథాసంగ్రహం

లూపర్ కేలియో ఉత్సవదినంనాడు రోములో సామాన్యజనులైన ప్లీబన్లు, ముండా అనే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో అతని ప్రబలశత్రువులైన పాంపే కుమారులమీద విజయాన్ని చేకొని వస్తున్న సీజర్ను మహావైభవంతో ఆహ్వానించటానికి, ఆ నాటిని సెలవు దినంగా భావించి వీథుల్లో గుంపులుగా చేరుకుంటారు. ప్రజాధర్మాధికారులైన స్లేవియస్, మారులస్ పాంపేయెడ వారి కృతఘ్నతకు నిందిస్తూ చెదరగొడతారు (అం1-దృ1). లూపర్ కేలియో ఉత్సవాలకు వెడుతున్న జనసమూహానికి ముందు సీజర్ పరివారంతో నడుస్తుంటాడు. ఒక శకునజ్ఞుడు అతణ్ణి 'మార్చి పదిహేనో నాడు జాగ్రత్త!' అని హెచ్చరిస్తాడు. సీజర్ అతణ్ణి 'ఎవరో స్వాప్నికుడని త్రోసిపుచ్చి క్రీడలను చూడటానికి వెళ్ళిపొమ్మంటాడు. కాషియస్ బ్రూటస్ ను ప్రక్కకు తీసికోపోయి సీజర్ జీవితంమీద జరిగే కుట్రలో చేరవలసిందని ఉద్బోధిస్తాడు. క్రీడలైపోయి సీజర్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో కాస్కా చేరి, సీజర్ ఆంటోనీ అర్పించిన రాజకిరీటాన్ని ఎలా ముమ్మారు త్రోసి పుచ్చాడో వివరిస్తాడు. బ్రూటస్ మనస్సులో సీజర్ ఆశాపరత్వాన్ని గురించిన ఆలోచన ఆరంభమౌతుంది. (అం1-దృ2). కాస్కా సిసెరోను కలుసుకొని కనిపించిన దుశ్శకునాల నన్నింటినీ వివరిస్తాడు. సిసెరో వెళ్ళిపోయిన తరువాత కాషియస్ అతణ్ణి కలుసుకొని, అంతకు పూర్వమే దుశ్శకునాలకు కలవరపడుతున్న అతని మనస్సుకు నచ్చచెప్పి, హంతకవర్గంలో చేర్చుకుంటాడు. అక్కడికి వచ్చిన సిన్నా కూడా వారిలో చేరుతాడు. ముగ్గురూ బ్రూటస్ ను తమవాణ్ణి చేసుకోవటానికి పథకం వేస్తారు (అం 1 - దృ3)

సీజర్ ఆశాపరత్వం రోముకు ప్రమాదకారి అని భావిస్తూ మానసికాందోళనతో బ్రూటస్ తన ఫలోద్యానంలో రాత్రి నంతటినీ గడుపుతుంటాడు. హంతకులు వాతాయనంగుండా పడవేసిన ఉత్తరాలను చూచి రోము క్రూరపాలనకు పాల్పడకుండా చేయటంకోసం 'సీజర్ ను ఆరంభదశలోనే హతమార్చటానికి' నిర్ణయిస్తాడు. విద్రోహకవర్గం ఆయన్ను కలుసుకున్న తరువాత చర్చించి హత్యాపథక వివరాలను నిర్ణయిస్తారు. ప్రమాణాలు తీసుకోవాలెననీ, ఆంటోనీని కూడా తుదముట్టించాలెననీ, సిసెరోను కలుపుకోవాలెననీ కాషియస్ చేసిన సూచనలను బ్రూటస్ వ్యతిరేకిస్తాడు. కాషియస్ లొంగిపోతాడు. సభాభవనంలో సీజర్ ను మరునాడు చంపటానికి అంతా అంగీకరించి వెళ్ళిపోయిన తరువాత, బ్రూటస్ భార్య పోర్షియా వచ్చి ఆ రహస్య సమాలోచన లేమిటో, కళవళపెట్టే విశేషాలేమిటో తెలియజేయవలసిందని ప్రార్థిస్తుంది (అం.2-దృ1). మర్నాడు సీజర్ భార్య కల్పూర్నియా శకునజ్ఞుని సూచననూ, రాత్రి తనకు వచ్చిన కలనూ చెప్పి, సీజర్ ను సభాభవనానికి వెళ్ళకుండా నిర్బంధిస్తుంది. సభాసభ్యుల్లో ఒకడైన డెసియస్ వచ్చి కల్పూర్నియా కల సవ్యమైనదని చెప్పి మరొక వ్యాఖ్యానాన్ని చేసి సీజర్ సభకు వచ్చేటట్లు చేస్తాడు. సభాభవనానికి తీసుకుపొయ్యే ఉద్దేశంతో బ్రూటస్ ప్రభృతులు సీజర్ ప్రాసాదానికి వస్తారు (అం2 -దృ2). ఆర్టిమి డోరస్ సీజర్ ను జాగ్రత్తగా ప్రవర్తించవలసిందనే సూచికాపత్రాన్ని చదువుతాడు (అం2 -దృ3). భర్త రహస్యాలను తెలుసుకున్న పోర్షియా మానసిక వ్యధను భరించలేక సేవకుణ్ణి సభాభవనానికి వెళ్ళి బ్రూటస్ క్షేమ సమాచారాన్ని తెలుసుకోరావలసిందని పంపిస్తుంది (అం2-దృ4).

శకునజ్ఞులు ఇచ్చిన సూచనలను తిరస్కరించి ఆర్టిమిడోరస్, సీజర్ సభాభవనంలో ప్రవేశిస్తాడు. తాము పూర్వం ఏర్పాటు చేసుకొన్న క్రమాన్ని అనుసరించి, విద్రోహకవర్గంలో ఒకడైన మెటిల్లిస్ సింబర్, దేశబహిష్కృతుడైన తన అన్నను తిరిగి దేశానికి పిలిపించవలసిందని పెట్టుకొన్న వినతిపత్రాన్ని సీజర్ కు సమర్పిస్తాడు. సీజర్ అందుకు వ్యతిరేకాభిప్రాయాన్ని ప్రకటించగా బ్రూటస్ ప్రభృతులు జోక్యం కలిగించుకుంటారు. సీజర్ హత్య జరుగుతుంది. ఈ కల్లోలంలో ఇంటికి పారిపోయిన ఆంటోనీ తిరిగి వచ్చి, తన భావాలను గుప్తంగా ఉంచి సీజర్ అంత్యక్రియోపన్యాసాన్ని ఇచ్చేటందుకు బ్రూటస్ అనుజ్ఞను పొందుతాడు. ఆక్టేవియస్ సీజర్ రోము దగ్గిరవరకూ వచ్చినట్లు వార్తవస్తుంది (అం.3-దృ1). సీజర్ కు తాను ఎందుకు వ్యతిరేకంగా తిరిగి అతణ్ణి హత్య చేయవలసి వచ్చిందో ఆ కారణాలను తెలుపుతూ, బ్రూటస్ విపణి ప్రదేశంలో ఉపన్యసిస్తాడు. ప్రజలు సంతృప్తి వహించి బ్రూటస్ ను మహోదాత్తుడని శ్లాఘిస్తారు. తరువాత మార్క్ ఆంటోనీ సీజర్ మృతి కళేబరంతో ప్రవేశించి ప్రజలను ఉద్రేక పూరితులను గావించే ప్రసంగం చేసి విద్రోహులమీదికి వారు దండెత్తి గృహదహనం చేసేటట్లు చేస్తాడు. బ్రూటస్, కాషియస్ రోము నగరాన్ని వదిలి పెట్టి పారిపోతారు (అం. 3-దృతి). కోపోద్రిక్తమైన సామాన్య జనసముదాయం సిన్నాకవిని చూచి అతడు విద్రోహియైన సిన్నా అని భ్రాంతిపడి అతణ్ణి చీల్చివేస్తారు (అం.3-దృ3).

రోముపాలన వీరత్రయ కూటమి - ఆక్టేవియస్, ఆంటోనీ, లెపిడస్ల హస్తగతమౌతుంది. వారు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి హతమార్చవలసిన సభాసభ్యుల జాబితాను తయారుచేస్తారు. బ్రూటస్, కాషియస్ లను వెన్నాడి ఓడించటానికి పథకం వేస్తారు

(అం.4 - దృ1). సార్డిస్ రంగస్థలంలో బ్రూటస్, కాషియస్ ల మధ్య కలహం ఏర్పడుతుంది (అం. 4-దృ2). బ్రూటస్ తన శిబిరానికి వచ్చిన కాషియస్ ను లంచాలు తీసుకున్నావనీ, ప్రజలను హింసించి ధనం దోచుకున్నావనీ నిందిస్తాడు. అనతికాలంలోనే ఇరువురి మధ్యా సంధి కుదురుతుంది. వెంటనే బ్రూటస్ తన భార్య పోర్షియా మరణాన్ని గురించి కాషియస్ కు తెలియజేస్తాడు. తరువాత కాషియస్ సలహాను అతిక్రమించి బ్రూటస్ సైన్యాలతో ఫిలిప్పీవరకూ ఎదురువెళ్ళి శత్రువులను ఎదుర్కోవలెనని నిర్ణయిస్తాడు. ఏకాంతంగా ఉన్న బ్రూటను సీజర్ భూతరూపం కనిపించి అతడికి తిరిగి ఫిలిప్పీ యుద్ధభూమిలో దర్శనమిస్తానని చెప్పిపోతుంది (అం.4-దృ3).

ఉభయసైన్యాలు మాసిడోనియాలోని ఫిలిప్పీవద్ద కలుసుకుంటాయి. ఉభయపక్షాల నాయకులు మాట్లాడుకుంటారు. కాని నిష్ప్రయోజన మౌతుంది. తుదిసారిగా కాషియస్ బ్రూటస్ లిరువురూ కలుసుకొని పరస్పరం వీడ్కోలులు స్వీకరిస్తూ అవసరమైతే ఆత్మహత్యకు సంసిద్ధులైనట్టు వెల్లడించుకుంటారు (అం.5 దృ1). బ్రూటస్ తన సైన్యాలకు అనుజ్ఞ ఇచ్చి అవతల వైపున ఉన్న సైన్యాలను హఠాత్తుగా ఆక్టేవియస్ మీదికి పంపించేటట్లు చేయమని మోసెల్లాను పంపుతాడు (అం.5 దృ2). పొరబాటు వల్ల పిండారస్ లో ప్రథమయుద్ధంలో కాషియస్ సైన్యాలు ఓడిపోతవి. అతడు దూరం నుంచి వచ్చేవి మిత్రసైన్యాలో శత్రుసైన్యాలో చూచిరావలసిందని టిటినియన్లను పంపిస్తాడు. టిటినియస్ పట్టుపడ్డట్లు వార్త తెస్తాడు. కాషియస్ నిరాశ చెంది సేవకుడిచేత పొడిపించుకొని మరణిస్తాడు. టిటినియస్ తిరిగి వచ్చి జరిగినది చూచి తానూ ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రూటస్ జరిగిన ఈ ఉదంతాన్నంతటినీ మోసెల్లా వల్ల విని కాషియస్ టిటినియన్లను మహోదాత్తులైన తుది రోమనులని పొగిడి, వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయిస్తాడు (అం. 5-దృతి). యుద్ధభూమికి వెళ్ళి బ్రూటస్ తిరిగి ఒక యత్నం చేస్తాడు. ఆంటోనీ సైనికులు లూసిలియస్ ను పట్టుకొని అతడే బ్రూటస్ అనే భ్రాంతితో తమ నాయకుడిదగ్గరికి తీసుకోపోతారు. అంటోనీ సత్యాన్ని గ్రహిస్తాడు (అం.5-దృ4). తనకు విజయం అలభ్యమైపోయిందని నిర్ణయించుకున్న బ్రూటస్, తన్ను చంపవలసిందని మిత్రులను అర్థిస్తాడు. చివరకు 'స్ట్రాటో' అనే అతణ్ణి బలవంతపెట్టి అతడు కత్తిని పట్టుకోగా తాను దానిమీదపడి ప్రాణాలు తీసుకొంటాడు. ఆ స్థలానికి ఆంటోనీ, ఆక్టేవియస్ వచ్చి బ్రూట న న్ను స్తుతించి ఆయనకుచిత మర్యాదలతో అంత్యక్రియలు జరిపిస్తామని ప్రకటిస్తారు కీర్తిప్రతిష్ఠలను పంచుకోవటానికి నిష్క్రమిస్తారు. నాటక నామకరణం

సీజర్ ఈ నాటకంలో మూడు దృశ్యాలలో తప్ప కనిపించడనీ, అప్పుడైనా కొన్ని గర్వోర్ధత వాక్యాలు తప్ప ప్రసంగించడనీ, నాటకానికి నిజమైన నాయకుడు బ్రూటస్ కావటం వల్ల దీనికి 'మార్కస్ బ్రూటస్' అని నామకరణం చేయటం ఉచితమనీ విమర్శకులు కొందరు సూచిస్తున్నారు.

'జూలియస్ సీజర్' నాటకానికి నాయకుడు బ్రూటస్ ఐనప్పటికీ షేక్స్పియర్ ఈ నాటకానికి ఉచితంగానే నామకరణం చేసినట్లు కన్పిస్తున్నాడు. సీజర్ చరిత్రాత్మకంగా సుప్రసిద్దుడు బ్రూటస్ పేరు ప్రేక్షకలోకంలో ఎక్కువమందికి తెలియదు. ఇది చరిత్రాత్మక నాటకం. ఈ జాతి నాటకాలకు సర్వసామాన్యంగా మహారాజుల పేర్లు, చక్రవర్తుల నామాలు ఉంచటం పరిపాటి. సీజర్ ను సమ్రాట్టు గానే జనసామాన్యం భావిస్తుంటుంది. కనక సీజర్కు సంబంధించిన నాటకానికి "జూలియస్ సీజర్" అని నామకరణం చేయటమే సమంజసమని షేక్స్పియర్ భావించి ఉంటాడు. అంతే కాదు, నాటకంలో బ్రూటస్ నాయకుడుగా దృశ్యమానుడౌతున్నా, దీనికి సీజరే 'అశరీర నాయకుడు'. విద్రోహవర్గం సీజర్ వధకు పథకాలను వేసుకొంటున్నప్పుడు “మన మందరం సీజర్ తత్త్వాన్ని ఎదుర్కొందాం" అని అనటమూ, తృతీయాంక ప్రథమ దృశ్యంలోనే సీజర్ వధ జరిగిపోయినప్పటికీ, తదనంతరకథ నంతటినీ అతడి ప్రభావం నడిపించటమూ, నిరంకుశత్వంతో వ్యవహరించిన అతని భూతమూర్తి, 'మరణించినా సీజర్, నీవు బలవంతుడవే' అని ఆత్మహత్య చేసుకోబోతూ కాషియస్ చేసిన ప్రశంస మొదలైనవి 'జూలియస్ సీజర్' అని నాటకానికి నామకరణం చేయటంలో గల సామంజస్యాన్ని వెల్లడిస్తున్నవి. నిజానికి నాటక కథాచక్రపరివర్తనకు ఆధారం సీజర్ నిరంకుశత్వం. అతడు దేహంతో పాల్గొనటం అప్రధానం. నాటకాంతంలో విజయాన్ని పొందింది ఆక్టేవియస్ కాదు ఈ నిరంకుశత్వమే. అందువల్ల 'జూలియస్ సీజర్' అన్న నామం ఈ నాటకానికి తగి ఉందని చెప్పటంలో ఎట్టి విప్రతిపత్తి లేదు.

జూలియస్ సీజర్ - ఆధారాలు

జూలియస్ సీజర్ లోని కథావస్తువు సార్వజనీనమూ, సార్వకాలికమూను. సార్వదేశాలల్లో, సర్వకాలాలలో నివసించే ప్రజలకు ఇది ఒక పాఠాన్ని నేర్పుతున్నది. ఇట్టి కథావస్తువు మీదికి మహాకవి షేక్స్పియర్ దృష్టి ప్రసరించింది 'జూలియస్ సీజర్' నాటకం అవతరించింది. ఈ నాటక రచనకు షేక్స్పియర్ కొన్ని ఆధారాల సహాయాన్ని తీసుకున్నాడు.

షేక్స్పియర్కు జూలియస్ సీజర్ నాటక రచనలో తోడ్పడ్డ ఆధార గ్రంథాలలో ప్రధానమైనది ఫ్లూటార్క్ చరిత్రకారుడి 'జీవితాలు'. ఆయనకు గ్రీక్, లాటిన్ భాషలు బాగా రావు. అందువల్ల ప్లూటార్క్ జీవితాలన్న గ్రంథానికి నార్త్ అనువాదాన్ని ఆధారం చేసుకొని ఉంటాడు. ఆ అనువాదంలోని దోషాలు కొన్ని షేక్స్పియర్ నాటకాలలోనూ కూడా కనిపిస్తున్నవని, కొందరు విమర్శకులంటున్నారు. సీజర్ ఇచ్ఛాపత్రాన్ని వినిపించే సందర్భంలోను ఆంటోనీ, బ్రూటస్, లెపిడస్ చేసిన ప్రసంగాలకు కావలసిన అంశాలను షేక్స్పియర్ ఏప్పియన్ వ్రాసిన 'రోమను యుద్ధాలు' అన్న గ్రంథం నుంచి గ్రహించాడు. సీజర్ ను హత్య చేసినప్పుడు బ్రూటస్ ను చూసి 'నీవు కూడానా?' అని షేక్స్పియర్ చేత అనిపించాడు. ఇందుకు ప్లూటార్క్ ఎట్టి ఆధారం లేదు. అతణ్ణి కాస్కా హత్య చేయగానే లాటిన్ భాషలో సీజర్ “ఓరీ అధమ ద్రోహీ, కాస్కా! ఏం చేశావు?" అన్నట్లుంది. కానీ సీజర్ గ్రీక్ భాషలో బ్రూటస్ తో "నీవు కూడానా నా తండ్రీ!?" అన్నట్లు సుయటోనియస్ రచనవల్ల తెలుస్తున్నది. ఇతడి రచనను ఆధారంగా చేసుకొని ఒక లాటిన్ నాటకం జన్మించిందని, దానివల్ల షేక్స్పియర్ జూలియస్ సీజర్ కు ముందే పుట్టిన అనేక రచనల్లో 'నీవు కూడానా బ్రూటస్' అన్న లాటిన్ వాక్యం ప్రసిద్ధమైందనీ, దాన్నే ఆయన గ్రహించి ఉంటాడనీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. షేక్స్పియర్ సీజర్ హత్యను దేవమందిరంలో (కాపిటోల్) పెట్టాడు. అది సత్యానికి పాంపే నాటకశాలావలభీ ప్రదేశానికీ ప్రక్కనే ఉన్న 'క్యూరియా పాంపేనియా'లో జరిగింది. ఈ మార్పు ఛాసర్ మహాకవి 'మంక్స్ టేల్' లోనే ఉంది. ఆచారంగా వస్తూ ఉన్న ఇది దోషమైనా, సీజర్ వధను మహానగరోపకంఠసీమలో ఉన్న దేవమందిరంలోనే కల్పించటం వల్ల నాటకంలో ఆ సన్నివేశానికి ఉత్కర్ష చేకూరుతుందని భావించి షేక్స్పియర్ అనుసరించి ఉంటాడు. కొందరు షేక్స్పియర్ జూపిటర్ దేవమందిరాన్నే 'సభాభవన' మని భ్రమపడ్డాడంటారు.

షేక్స్పియర్ : ప్లూటార్క్

జూలియస్ సీజర్ నాటకంలో ప్రదర్శితమయ్యే నాటకకర్త ప్రతిభ తప్ప తక్కిన సమస్తం షేక్స్పియర్ కు ప్లూటార్కు చేకూర్చి ఇచ్చాడు. ప్లూటార్క్ రచనతో ఈ నాటకాన్ని పోల్చి చూస్తే సమస్తం అందులో గోచరిస్తుంది. షేక్స్పియర్ మహాకవి తాను వ్రాసిన ఆంగ్లదేశచరిత్రకు సంబంధించిన నాటకాలల్లో తీసుకున్న స్వేచ్ఛను ఈ


జూలియస్ సీజర్ 19 నాటకవిషయంలో గానీ, ఇతర రోమక నాటకాల విషయంలో గాని తీసుకోలేదు. షేక్స్పియర్ చెప్పిన ఆంగ్లదేశ చారిత్రక నాటకాలకు కావలసిన వస్తువులిచ్చిన హాలిన్షెడ్ కు, రోమక చారిత్రక నాటకాలకు కావలసిన వస్తువునిచ్చిన ప్లూటార్క్ కు ఎంతో విభేదం ఉంది. ఈ విషయాన్నే ఒక అనుభవజ్ఞుడు ఇలా చెప్పాడు: "షేక్స్పియరు హాలిన్షెడ్ తరువాత కాల్చి బాగు చేసుకోవలసిన అపరిష్కృతలోహాన్నిస్తే, కవి కళాదుడు తీర్చిదిద్దవలసిన నగిషీ మినహాగా సర్వం ప్లూటార్క్ తానే ఏరి కూర్చి ఇచ్చాడు. అందువల్ల షేక్స్ పియర్ కు స్వల్పమైన మార్పులు చేసి సీజర్, బ్రూటస్, ఆంటోనీల జీవితాలలోనుంచి పుట తరువాత పుట దించుకోవటం తప్ప వేరే పనిలేకపోయింది”

షేక్స్పియర్ ప్లూటార్క్ దగ్గరనుంచీ మొత్తం కథను గ్రహించాడు. లూషియస్ తప్ప మిగిలిన పాత్రల నందరినీ స్వీకరించాడు. నాటకంలో కనిపించే పాంపే పుత్రులపై సీజర్ విజయం, ఇరువురు ధర్మాధికారులు (మరులియస్, ప్లేవియస్) ప్రజలను నిందించి చెదరగొట్టటం, లూపర్ కేలియా ఉత్సవాలు, ఆంటోనీ సీజరుకు చేసిన కిరీట ప్రదానం, బ్రూటస్ పోర్షియాల సంభాషణ, సీజర్ పతనాన్ని సూచించే శకునాలు, కల్పూర్నియా పట్టుదల, డెసియస్ బ్రూటస్ సీజర్ను ఒప్పించటం, శకునజ్ఞుడు, ఆర్టిమిడోరస్ సీజర్ కు చేసిన సూచనలు, హత్య, ఆంటోనీ ప్రసంగం, ఇచ్ఛాపత్రపఠనం. సిన్నామరణం, సీజర్ భూతరూపదర్శనం, ఫిలిప్పీయుద్ధం, కాషియస్ బ్రూటస్ ల మరణం అన్నీ ప్లూటార్క్ లో ఉన్నవే. సీజర్ సుస్తి, మూఢనమ్మకాలమీద అభిమానం, ఆంటోనీ విలాసప్రియత్వం, సిసెరో గ్రీక్ భాషాభిమానం, కాసియస్ 'పలచని ఆకలి చూపు', అతని ఎపిక్యురస్ అనుయాయిత్యం, అతని కోపస్వభావం అన్నీ ప్లూటార్క్ నుంచి సంగ్రహించినవే.

షేక్స్పియర్ ప్లూటార్క్ కి భిన్నంగా కొన్ని కల్పనలు చేశాడు. ఆరు నెలలనాడే (సెప్టెంబర్ 45 క్రీ.పూ.) సీజర్ 'విజయయాత్ర'నుంచి తిరిగివస్తే ఈ అంశాన్ని షేక్స్పియర్ లూపర్ కల్ ఉత్సవం నాటికి 15 మార్చి 44 క్రీ.పూ. అని మార్చినాడు. సీజర్ హత్య క్యూరియాపాంపేలో జరిగితే దాన్ని దేవమందిరానికి మార్చాడు. హత్య మార్చి 15న, 'ఇచ్ఛాపత్ర ప్రచురణ' మార్చి 18న, అంత్యక్రియలు మార్చి 19న జరిగినవి. ఆక్టేవియస్ మే నెల దాకా రాలేదు. షేక్స్పియర్ అన్నీ ఒకనాడే జరిగినట్లు కల్పించాడు. 'వీరత్రయకూటమి' బోలోనియాలో కలుసుకుంటే షేక్స్పియర్ ఆ సంఘటన రోములోనే జరిగినట్లు చెప్పాడు. ఫిలిప్పీలో జరిగిన రెండు యుద్ధాలకూ మధ్య ఇరవై


20 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 రోజుల వ్యవధి ఉంది. షేక్స్పియర్ దాన్ని ఎత్తివేశాడు. కాలవ్యవధిని, సన్నివేశ బాహుళ్యాన్ని తగ్గించి విషాదాంతస్థాయిని పట్టటం కోసం నాటకతత్త్వాభిజ్ఞుఁడైన షేక్స్పియర్ ఈ మార్పులు చేసి ఉంటాడు. ప్లూటార్క్ లో కేవలం పట్టికగా ఇచ్చిన శకునాలను, హఠాత్సంభవాలనూ అతినైపుణ్యంతో షేక్స్పియర్ సమయోచితంగా ఉపయోగించుకొన్నాడు. ప్లూటార్క్ లోని బ్రూటస్ క్రూరశక్తినే షేక్స్పియర్ సీజర్ భూతాకృతితో సమన్వయించాడు. ప్లూటార్క్ ఇచ్చిన కొద్ది సూచనలో ఆంటోనీ మహాప్రసంగాన్ని కల్పించటం, పోర్షియావర్ణనలోనూ, పాత్ర పోషణలోనూ కన్పించే ప్రావీణ్యం, సిన్నా హత్యలో ద్యోతకమయ్యే పరిహాసరేఖలు, అక్కడ ప్రదర్శించిన జనసామాన్య స్వభావ చిత్రణమూ ఇత్యాదులన్నీ షేక్స్పియర్ ప్లూటార్క్ పై దిద్దిన వన్నెచిన్నెలు.

షేక్స్ పియర్ పాత్రోన్మీలనం - మార్పులు

మార్చు

షేక్స్పియర్ చిత్రించిన సీజర్ చరిత్రలో కన్పించే ప్రపంచాగ్రగామియైన మహావీరుడు, మహారాజనీతిజ్ఞుడు కాడు. అతడికి వైభవ ప్రియత్వం, గర్వోన్మత్తత, ఔద్ధత్యం, స్తోత్రప్రియత, కొన్ని శారీరక మానసిక దౌర్బల్యాలను షేక్స్పియర్ మహాకవి కల్పించాడు. నిజానికి చరిత్రలో తోచే సీజర్ నే చిత్రిస్తే ప్రేక్షకులకు విద్రోహవర్గంమీద అణుమాత్రమైనా అభిమానం ఉండటానికి తావుండదు. బ్రూటస్, కాషియస్ లకు ఆదర్శాన్నిచ్చి షేక్స్పియర్ వారి పాత్రలను పోషించాడు. సీజర్ సామ్రాజ్యతత్త్వ ప్రవక్త అతడికి ప్రతిగా ప్రజాస్వామికతత్త్వప్రవక్తనుగా బ్రూటస్ ను తీర్చిదిద్ది, షేక్స్పియర్ ప్లూటార్క్ లో కనిపించే అతడి లోపాలనన్నింటినీ వదిలివేశాడు. మహానగర రక్షణాధికారవిషయంలో బ్రూటస్, కాషియస్ ప్రత్యర్థులు. అందువల్ల వారిద్దరి మధ్యా సన్నిహితత్వం లేదు. ప్లూటార్క్ లో కన్పించే ఈ అంశాన్ని కొంతగా గ్రహించి వారిద్దరి మధ్య అసన్నిహితత్త్వాన్ని ప్రథమాంక ద్వితీయదృశ్యంలో ప్రదర్శించాడు గాని షేక్స్పియర్ అందుకు బ్రూటస్ మహాశయుని హృదయాంతర్యుద్ధాన్ని కారణంగా కల్పించాడు. అంతేకాక బ్రూటస్ ను సీజర్ కు సన్నిహిత మిత్రుణ్ణి చేశాడు. దీనివల్ల బ్రూటస్ ను ఒక ఆదర్శం కోసం నిలిచి మిత్రుణ్ణి కూడా హత్య చేయటానికి వెనుకాడని వీరపురుషుడుగా చిత్రించటం జరిగింది. పోర్షియా బ్రూటస్ ను వివాహమాడటానికి పూర్వం బిబులస్ అనే భర్తను చేపట్టి అతడివల్ల ఒక కుమారుణ్ణి పొందినట్లూ, అతడు కథాకాలంనాటికి యవ్వనదశ ననుభవిస్తున్నట్లూ ప్లూటార్క్ లో ఉంది. బ్రూటస్ వంటి అత్యుత్తమ వ్యక్తికిది కళంకాపాదకం కాబట్టి తొలగించి, బ్రూటస్ దంపతుల ప్రణయాన్ని ఆదర్శయుతంగా


జూలియస్ సీజర్ 21 చిత్రించాడు షేక్స్పియర్. చతుర్థాంకంలోని బ్రూటస్ కాషియస్ ల కలహం మానవత్వసముపేతమై మహోదాత్తంగా నడవటానికి కారణం షేక్స్పియర్ ప్రతిభే. సీజర్ కు ప్రథమానుచరుడుగా ఉన్న ఆంటోనీ పాత్రను ప్లూటార్కులో ఉన్న ఆంటోనీ పాత్రకంటే ఉదాత్తంగా సృష్టించి షేక్స్పియర్ వన్నె పెట్టాడు.

లూషియస్ పాత్ర సృష్టి, అతడికి యజమాని ఐన బ్రూటస్ కు మధ్య ఉన్న సంబంధం నాటకకర్త కల్పనే. షేక్స్పియర్ చిత్రించిన కాస్కా పాత్రకు ప్లూటార్క్ లొ ఆధారం లేదు. ద్వితీయాంక ప్రథమదృశ్యంలోని బ్రూటస్ స్వగతం నాటకకర్త ప్రతిభాజన్యం. ప్లేటో తత్త్వాన్ని అనుసరించే బ్రూటస్ సీజర్ ను హత్య చేయటానికి పూనుకొనేటందుకు ఇది ఎంతో తోడ్పడ్డది. ఆర్టిమిడోరస్ కు సీజర్ సమాధానాలు, కాషియస్ తప్ప మిగిలిన విద్రోహ వర్గంలో అందరూ కలిసి సీజర్ ను సభాభవనానికి తీసుకుపోవటానికి ఆయన ఇంటికి కలిసిరావటం, ఇతన్ని గురించిన కాషియస్ సంభాషణం, వధాదృశ్యంలో సీజర్ సంభాషణ, సీజర్ మానసిక శారీరక దౌర్బల్యం, నాలుగో అంకంలో సంగీతాన్ని ప్రవేశపెట్టి సేనాపతుల మధ్య కలిగిన కల్లోలాన్ని కప్పిపుచ్చటం, బ్రూటస్ కాషియస్ ల వీడ్కోలు సంభాషణలు, టిటినియిస్ కాషియస్ ను మాలాలంకృతుణ్ణి చేయటం ఇత్యాది కల్పనలన్నీ షేక్స్పియర్ వే. నాటకీయ ప్రదర్శనా పరిపుష్టికోసం, పాత్రపోషణకోసం షేక్స్పియర్ చేసిన మార్పులవల్లనే “జూలియస్ సీజర్” ఒక అద్భుత దృశ్యకావ్యంగా పరిణమించి, సార్వకాలీనమైన సాహిత్యసృష్టి అయిన దనటంలో ఎటువంటి సందేహం లేదు.

నాటక నిర్మాణం

నిర్మాణ విషయంలో ఎట్టి క్లిష్టతా లేకపోవటంలో జూలియస్ సీజర్ విశిష్టమైన నాటకం. ఇది ఏకవస్తుకము ప్రాసంగికాదులు లేవు. ఇందులో సన్నివేశాలు బహుస్వల్పాలు అలాగే పాత్రలూను. ఈ విషయాలల్లో ఇది మేక్బెత్ ను పోలి ఉంది. షేక్స్పియర్ మహాకవి కృతాలైన లియర్, ఆంటోనీ - క్లియోపాత్రాలవంటి విషాదాంత నాటకాలకు ఇది చాలా భిన్నమైంది. లియర్ రాజులో ప్రాసంగిక కథావస్తువు ఉంది ఆంటోనీ క్లియోపాత్రాలో క్లిష్టసన్నివేశ బాహుళ్యం కనిపిస్తున్నది.

నిరంకుశ ప్రభువైన సీజర్ వధవరకూ విద్రోహవర్గానికి తాత్కాలిక విజయమైనా, వారి పతనంతో, రోము పౌరుల స్వాతంత్య్ర వినాశనంతో, రాచరికం పునరుద్ధరింప బడటం చేత అంతంలో దానికి పరాజయం అన్నది జూలియస్ సీజర్ నాటకానికి వస్తువు. 'సీజర్ హత్య, బ్రూటస్ మరణం' లేదా 'సీజర్ హత్య, ప్రతీకారం' - అనే రెండు విభాగాలుగా నాటకం నడిచింది. కాబట్టి ఇది నిర్మాణాత్మకమైన దోషమని విమర్శకులు కొందరు పదే పదే సూచిస్తూ వచ్చారు. కానీ నిర్మాణంలో వారు భావించే టంతటి అనిబద్ధత గోచరించటం లేదు. కొందరు సూచించినట్లు 'బ్రూటస్' అని నాటకాన్ని వ్యవహరించినంత మాత్రం చేత గూడా, ఈ అనిబద్దత తొలగిపోయి వస్వైక్యం చేకూరదు. షేక్స్పియర్ ప్లూటార్క్ లభించిన వస్తువును యథాతథంగా గ్రహించి నాటకీకరణం చేశాడే గాని, నిర్మాణ విషయం మీద దృష్టి నిల్పినట్లు కన్పించదు. అయినా నాటకమంతటిలోనూ అనుస్యూతంగా ఒక సూత్రం గోచరిస్తున్నది. అదే నిత్యాభివృద్ధిని పొందుతున్న అనివార్యమైన రాచరికపుశక్తి. ఇది నాటకానికి నిర్మాణ సంబంధమైన ఐక్యతను ఇచ్చినదని చెప్పవచ్చు. 'ప్రాయశ్చిత్త' మనే భావం నాటకంలో సర్వేసర్వత్రా గోచరిస్తున్నది. 'చేసిన క్రియకు ఫలాన్ని అనుభవించి తీరాలి' -పాంపేపుత్రుల వధించి విజయం చేకొన్నానన్న గర్వాహంకారాలకు తగ్గ ప్రాయశ్చిత్తాన్ని సీజర్ అనుభవించాడు. విద్రోహవర్గం సీజర్ను వధించి తగ్గ ప్రాయశ్చిత్తాన్ని పొందారు. అందువల్ల ఈ ప్రాయశ్చిత్తభావం కూడా నిర్మాణైక్యాన్ని కొంతవరకు చేకూరుస్తున్నది.

రాజకీయభావం : గుణపాఠం

'జూలియస్ సీజర్' వల్ల అభివ్యక్తమయ్యే రాజకీయభావం ఏమిటి? ఈ ప్రశ్నకు విమర్శకులు ఇలా సమాధానం చెబుతున్నారు. “ప్రతిజాతికీ దాని యోగ్యతను బట్టి ఉత్తమ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒక క్రూరపాలకుణ్ణి హత్య చేసినందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అతడి స్థానే మరొకరు వస్తాడు. భ్రమ ప్రమాదరాహిత్యం వల్ల పాలకుల శీలంలో పరివర్తన కలగదు. జాతి నిర్మించిన రాజకీయ సంస్థలో మార్పు కలగాలెనంటే జాతిలోని జన సముదాయ మంతటిలోనూ శీలపరివర్తన జరిగి తీరవలసిందే.” 'జూలియస్ సీజర్' నాటకంలో ప్రజాస్వామికం పతనమై నిరంకుశత్వం తలయెత్తటం ప్రదర్శితమైంది. జనసామాన్య బుద్ధిహీనతను దీర్ఘదృష్టితో దర్శించిన మహామేధావి సీజర్, తాను నిరంకుశుడు కావటానికి ప్రయత్నాలారంభించాడు. ప్రజలు రాచరికం వంక మొగ్గు చూపటం వల్ల ప్రజాస్వామికానికి ప్రమాదం ఉందని భ్రాంతి వహించి, బ్రూటస్ సీజర్ను హతమార్చాడు. ప్రజాస్వామిక విధాన స్వరూపం జీర్ణం కాని ప్రజలు అతణ్ణి సీజర్ను చేయటానికి ఉద్దేశపడ్డారు. తుదకు ప్రజల చిత్త చాంచల్యం వల్ల ప్రజాస్వామికోద్ధరణ యత్నం వీగిపోయింది నిరంకుశత్వం విజయం పొందింది. హత్యవల్ల ఒక సీజర్ను తొలగిస్తే మరో సీజర్ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. రోమనులు మహత్తర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తరువాత, ఇంకా ప్రజాస్వామిక విధానాన్ని నిలుపుకోటానికి యత్నించటమే దోషం. హత్య మహాదోషం దానికి ఫలాన్ని అనుభవించవలసిందే. అందులో రాజకీయహత్య దేశసౌభాగ్యానికే దెబ్బ. జూలియస్ సీజర్ వధానంతరం ప్రమాదోపేతాలైన తత్ఫలితాలను రోము అనుభవించక తప్పింది కాదు.

'పాత్ర గత' గుణపాఠం

సీజర్ వధ, తత్ఫలితాలను కథావస్తువులుగా గల సీజర్ నాటకానికి విషాదాంత నాయకుడు బ్రూటస్. అతడు హృదయాశయ సౌందర్యాలు రెంటినీ కలిగిన అభ్యుదాత్తుడైన వ్యక్తి అని అందరూ అంగీకరించి తీరవలసిందే. ప్రబల శత్రువైన ఆంటోనీ కూడా అంగీకరించాడు. కానీ అతడు తాను చేసినది హత్య అనీ, తాను హంతకుడననీ ఊహించనైనా లేదు. కారణం రాజకీయ మైతేనేం, మరేదైతేనేం హత్య హత్యే. దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. భగవంతుని ఆజ్ఞ, మానవ ధర్మశాస్త్రం రెండూ దాన్ని నిషేధించాయి. మహోత్తముడైన బ్రూటస్ ఈ హత్య అనే ఏకైకదోషం వల్ల తన జీవితనౌకా భంగానికే గాకుండా జాతి జీవిత సాంయాత్రికతకు మహాభంగాన్ని కల్పించాడు. బ్రూటస్ చేసిన నేరానికి అనుభవించిన శిక్ష కేవలం కాలం, చరిత్ర కల్పించినవి కావు షేక్స్పియర్ సృష్టించింది అంతకంటే కాదు. భగవత్ప్రేరణవల్ల సంఘనైతిక శాసనం విధించింది. 'దౌష్ట్యంవల్ల సౌభాగ్యం ఏ నాడూ చేకూరదు చేకూరినా అది తాత్కాలికమే గాని సుస్థిరమైంది కాదు' అన్నది షేక్స్పియర్ మహాకవి, బ్రూటస్ పాత్రమూలంగా లోకానికి నేర్పిన నిత్యసత్యమైన గుణపాఠం.

'పాత్రలు '

సీజర్

రోమక చరిత్రలో కనిపించే సీజర్ ధీరోదాత్తుడు, మహాసేనాని, రాజకీయ ప్రజ్ఞాధురంధురుడు. జూలియస్ సీజర్ నాటకంలో మహాకవి షేక్స్పియర్ సీజర్ను కొంతగా లోపాలకు లోనైనవానినిగా చిత్రించాడు. ఇందులో సీజర్ వ్యాధిగ్రస్తుడు, దుర్బలుడు, కాషియస్తో ఈతలో ఓడిపోవటం, సుస్తీ చేసినపుడు ఆడపిల్లలా ఏడవటం, చెవుడు, కిరీట ప్రదానసమయంలో మూర్ఛపోవటం, బహుశః కాషియస్ ను చూచి భయపడటం అతని కంటే బలహీనుడు కావటం వల్లనేమో! ఇందుకు నిదర్శనాలు. భుజశక్తితో ప్రబలులైన శత్రువులను ఎందరినో జయించినా అతడికి అంధవిశ్వాసాలు తప్పలేదు. 'లూపర్ కేలియా' ఉత్సవాలలో అంటోనీని కల్పూర్నియాను స్పృశించమని కోరాడు. యాజ్జీకులు శకునాలు అనుకూలంగా లేవని చెప్పించినప్పుడు అంతకు పూర్వమే కల్పూర్నియా కలను గురించి భయపడుతున్న అతడు సభా భవన ప్రయాణాన్ని మానుకున్నాడు. సభా సభ్యులు కిరీట ప్రదానం చేద్దామని నిర్ణయించుకున్నట్లు డెసియస్ బ్రూటస్ తెలియజేసిన తరువాత, అతని రాజ్యాధికార లోభం, ఆశాపరత్వం అతణ్ణి సభకు రప్పించాయి. స్తోత్రపాఠమంటే తనకు గిట్టనట్లు ప్రసంగాలలో పదేపదే ప్రకటించుకున్నా, అతడికి స్తోత్ర పాఠమన్నా, స్తోత్ర పాఠకులన్నా మహాభిలాష. 'మీకు స్తోత్ర పాఠమంటే గిట్టదని నేనంటే స్తోత్ర ప్రియుడై అతడు ఔనంటాడు' (అం2 -దృ1) అన్న డెసియస్ బ్రూటస్ వాక్యం ఇందుకు నిదర్శనం. సభాభవనంలో అతడి ప్రవర్తన, సభా సభ్యులతో అతడు నడిపిన సంభాషణలు సీజర్ గర్వోన్మత్తతనూ, ఔద్ధత్యాన్ని, నిరంకుశత్వాన్ని, నిరసన భావాన్నీ నిరూపిస్తున్నవి.

ఇంతమాత్రం చేత షేక్స్పియర్ సీజర్ను సంపూర్ణంగా లోపభూయిష్ఠుడుగా చిత్రించ దలచాడని భ్రాంతి పడరాదు. ఆయన ఘనతను కూడా చిత్రించాడు. అయితే ఈ చిత్రణలో సీజర్ను 'ఆత్మనిష్ఠుణ్ణి' చేసి, తన అధిక్యాన్ని తానే విశేషంగా వ్యక్తీకరించుకొనే నిరంకుశుణ్ణి చేశాడు. కొన్ని లోపాలున్నప్పటికీ షేక్స్పియర్ చిత్రించిన సీజర్కు ఇతరులను ఆకర్షించే రూపంగానీ, వ్యక్తిత్వం గానీ లేకపోలేదు. వీటితో అతడు ఇతరులను భయభ్రాంతులను చేయగలడు. రోమక సామ్రాజ్యంలో అతడు ప్రథమవ్యక్తి. పూర్వం అతడు చేకొన్న విజయాలు అతడికి అట్టి అద్వితీయ స్థానాన్ని కల్పించాయి. ప్రభువర్గం, సామాన్యజనం ఇరువురూ అతడి ప్రభావానికి ప్రస్తుతం తల ఒగ్గుతున్నారు. అతడికోపం వారికి ప్రళయం, ఆంటోనీ "సీజర్ ఇది చేయమంటే అది జరిగిపోయినట్లే” అని అనటం, కాస్కా సీజర్ మాట్లాడబోయే ముందు ఏదో దేవవాణి వినిపించనున్నట్లు "శాంతించింది సీజర్ మాట్లాడుతున్నా" డనటం, మెటిల్లస్ సింబర్ అతణ్ణి దేవతామూర్తిగా భావించి వ్యవహరించటం, కాషియస్ చేసిన 'ఎందుకయ్యా! అతడు కోలోసస్ లాగా...' ఇత్యాది ప్రసంగం ద్వారా, సీజర్ ప్రభువర్గం మీద ఎట్టి ప్రభావాన్ని కలిగించాడో ఊహించటానికి కొన్ని నిదర్శనాలు. ఇక సామాన్యజనానికి అతడు లేని రోమక సామ్రాజ్యమే లేదు. వారికి సీజర్ ఉండి తీరవలసిందే. సీజర్ వ్యక్తిత్వానికి, ఘనతకూ 'సీజర్! నీవు మరణించినా కేవలం నిన్ను చంపిన కత్తితోనే ప్రతీకారాన్ని పొందావు నీవు మరణించినా బలవంతుడవే' అన్న మరణ సమయంలోని బ్రూటస్ కాషియస్ వాక్యాల కంటే ప్రబలనిదర్శనాలింకేమి కావాలి? అతడి శరీరాన్ని రూపుమాపినా అతడి శక్తి జీవించి విజయం చేకొన్నదని రోములోని యావన్మందీ అంగీకరించారు. షేక్స్పియర్ సీజర్ పాత్రకు శారీరక మానసిక, నైతిక దౌర్బల్యాలను కొన్నిటిని కల్పించటం విద్రోహక వర్గంమీద కొంతగా అభిమానాన్ని కల్పించటం కోసం కావచ్చు.

కొందరు విమర్శకులు సరియైన సీజర్కు 'జూలియస్ సీజర్' లో సీజర్ భీరుత్వం, అస్థిరత్వం, చిత్తచాంచల్యాలతో కూడిన పరిహాసరూపమని భావించారు. అది పొరబాటు. భార్య ప్రార్థన మీద సభాభవనానికి పోనని మాట ఇచ్చి, తరువాత డెసియస్ బ్రూటస్ ప్రసంగం వల్ల మారిపోవటం చేత ఇలా తోచినా, అందులో చిత్తచాపల్యంగాని, అస్థిరత్వం గాని, భీరుత్వం గాని లేవు. భార్యను సంతోషపెట్టటానికి మొదట మాటిచ్చాడు. తరువాత కిరీటం మీది ఆశాపరత్వంవల్ల నైతేనేం నిర్భీరుత్వ, వ్యక్తిత్వ ప్రకటనల కోసమైతేనేం సమస్తాన్నీ ధిక్కరించి సభాభవనానికి వచ్చాడు.

షేక్స్పియర్ సీజర్ ఘనతను ఎరగనివాడు కాడు. ఆయన అతణ్ణి వాతావరణం మీద ఆధారపడని స్వయంవ్యక్తినిగా సృజించాడు. అతడికి జన్మతః సంభవించిన అధికారాధిక్యాన్ని, నిర్భీరుత్వాన్ని, సర్వవ్యాపిత్వాన్ని, సార్వభౌమత్వాన్నీ ఆపాదించాడు. ఎప్పుడైనా ఇంచుక భీరుత్వం, చాంచల్యం గోచరిస్తే అది అతడిలోని మానవత్వావేశం వల్లనే. మానవుడై ఉండి తనకు దివ్యత్వాన్ని ఆపాదించుకొని దెబ్బ తిన్న వ్యక్తి సీజర్.

బ్రూటస్

విజ్ఞాని, దేశభక్తుడు, నీతిప్రవర్తకుడు, ప్రియహృదయుడు, ఉదాత్తమానవుడు. నీతి నియమాలతో శౌచగుణ భూయిష్ఠుడై ప్లేటో తత్వశాస్త్ర మార్గాన్ని గవేషిస్తూ తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న మహోదారమూర్తి బ్రూటస్. ఉత్తమాశయుడు. ఆశయ సాధనలో అచంచల దీక్షాన్వితుడు. వ్యక్తిగత రాగద్వేషాలకు లొంగి ఉదాత్తాశయానికి స్వస్తి చెప్పని మహనీయుడు. మానవ స్వభావ పరిగణనంలో ప్రజ్ఞాలోపం వల్ల దెబ్బతిన్న వ్యక్తి. మానవనీతికి వెరచి ఆంటోనీ ప్రాణహరణానికి ఒప్పుకోక పోవటం వల్ల, అతడికి ప్రమాదం చేకూరింది. ఆంటోనీ శక్తిని అపార్థం చేసుకొన్నాడు. ఇతరులను అతినిశితమైన నైతికనిబంధనలతో కొలిచి చూసే స్వభావం గల ఇతడు, సీజర్ హత్య తనకొక రాజకీయ కర్తవ్యమని భావించి నిర్వహించాడేగానీ, నైతిక శాస్త్ర దృష్ట్యా తానొక 'హంతకు'డన్న ఊహ ఆయనకు కలగలేదు. బ్రూటన్ కేవలం స్వాప్నికుడు, ఆదర్శారాధకుడు. కాషియస్ కున్న రాజనీతిజ్ఞతలో ఏ కొంత భాగమున్నా, ఆయనకు అపజయం చేకూరేది కాదు. అయితే ఇప్పటివలె ఉదాత్త మానవు డని అనిపించుకోగలిగి ఉండేవాడు కాడు. స్వభావతః తన ప్రవృత్తికి విరుద్ధమైన రాజకీయాదర్శ సంపాదనకు పూనుకొని, క్లేశాన్ని తెచ్చి పెట్టుకొన్నాడు. అపజయాన్ని పొందాడు. అయినా విజయాన్ని సాధించిన ఆక్టేవియన్ ఆంటోనీల కంటె అత్యధికంగా యుగయుగాల మానవహృదయాలను ఆకర్షించి అభిమానాన్ని చూరగొన్నాడు. బ్రూటస్ నామానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో దృఢానుబంధం ఏర్పడి అతడికి ప్రపంచ మానవస్వేచ్ఛా ప్రయత్న చరిత్రలో నిత్యత్వాన్ని కల్పించింది.

ఆత్మమిత్రుడైన సీజర్ను రోము స్వేచ్ఛకోసం బలి ఇవ్వటానికి ఎంతో ఆత్మబలం, దేశాభిమానం అవసరం. "సీజర్ను హత్య చేసింది నేను. అతణ్ణి తక్కువగా ప్రేమిస్తున్నానని కాదు రోమును అంతకంటే అధికంగా ప్రేమించటం వల్ల" అన్న ఆయన మాటల్లో అసత్యం అణుమాత్రమూ లేదు. ఇందుకు ఆయనకు శత్రువైన ఆంటోనీ బ్రూటస్ మృతకళేబరాన్ని చూచి చేసిన ప్రసంగంలోని "సంఘ సంక్షేమాన్ని భావించి వీరిలో (విద్రోహక వర్గంలో) చేరింది ఇతడొక్కడే” అన్న వాక్యాలు నిదర్శనం. ఆ ఆంటోనీయే బ్రూటస్ ను సద్గుణసంపన్నుడని శ్లాఘించాడు. బ్రూటస్ ఆదర్శజీవి. విద్రోహక వర్గంలోని ఇతర సభ్యులందరూ తనవలెనే మహోత్తమాశయసిద్ధికోసం తనవంటి పవిత్ర హృదయంతోనే సీజర్ హత్యకు పూనుకుంటున్నారని భ్రమపడ్డాడు. వారి వ్యక్తిగత విద్వేషాలను ఈర్ష్యాది దుర్గుణాలను గమనించలేకపొయ్యాడు. వారికి నిరంకుశత్వ నిర్మూలనం కంటే సీజర్ మృతి కావాలి. అతడికి అవకాశం ఉంటే సీజర్ను సజీవుణ్ణిగా నిల్పి అతడి నిరంకుశతత్త్వాన్ని వినాశనం చేస్తే చాలు. ఈ ఆదర్శ ప్రియత్వం వల్లనే ఆంటోనీని కూడా చంపాలన్న కాషియస్ భావంతో ఏకీభవించక త్రోసివేయటం. 'సీజర్ అంత్యక్రియల్లో ప్రసంగించటానికి ఆంటోనికి అనుజ్ఞ ఇవ్వటం, కాషియస్ సలహాను త్రోసిరాజని కేవలం ఫిలిప్పీ యుద్ధంలోనే తమ సర్వస్వాన్నీ ఒడ్డటం' మొదలైన కొన్ని దోషాలు చేశాడు.

బ్రూటస్ ప్రజాస్వామ్యపక్షపాతి. రోముకు రాజనే పేరునే అతడు సహించలేడు. అంతశ్శుద్ధితో తనపూర్వుడైన బ్రూటస్ చర్యను (టార్క్విన్సును పారద్రోలటం) ఆదర్శంగా పెట్టుకొని సీజర్ విషసర్పాన్ని 'అండంలోనే అవియించటానికి' పూనుకొన్నాడు. బ్రూటస్ ఉద్వేగాలకు లొంగని విజ్ఞాని. అందువల్లనే సీజర్ హత్యానిర్ణయానికి పూర్వం ఆయన మనస్సు డోలాందోళితమైంది. అందులో మహత్తరమైన అంతర్యుద్ధం చెలరేగింది. ఈ ఉద్వేగరాహిత్యం వల్లనే విపణిలో ఆయన చేసిన అనుద్వేగకర ప్రసంగం, ఆంటోనీ చేసిన ఉద్రేకపూరితమైన గంభీరోపన్యాసం ముందు పేలవమై పోయింది.

ఎటువంటి విషమ జీవిత సంఘటనలనైనా అతిప్రశాంతంగా, సహనంతో భరించి, సుఖదుఃఖాలకు అతీతంగా ప్రవర్తించటాన్ని నేర్పే స్టోయిక్ తత్త్వశాస్త్రాభిమాని బ్రూటస్. కానీ కథా సందర్భాలు అట్టి తత్త్వశాస్త్రంతో పరిచయం గల అతణ్ణి కూడా కళవళపెట్టాయి. మిత్రుడి హత్యను గురించి నిర్ణయించుకుండేటప్పుడు చిత్తం అంతర్యుద్దావిద్ధమైంది. రాజకీయ రహస్యాలను భార్యకు చెప్పకుండా దాచలేకపోయాడు. యుద్ధసమయంలో కోపాన్ని తెచ్చుకొన్నప్పుడు కాషియస్ “అనుభవంలో లేకపోతే మీరు చేసిన తత్వశాస్త్రజిజ్ఞాస వల్ల ప్రయోజనమేమిటి?" అని అడగటానికి అవకాశం కలిగింది.

కొన్ని విపరీత పరిస్థితుల్లో అతడిలో తత్త్వశాస్త్రదృష్టి తొలగటం వల్లనే మానవత్వం బహిర్గతమైనది. బ్రూటస్ కరుణా హృదయుడు. ప్రేమించగలడు. ఇతరుల ప్రేమను చూరగొనగలడు. భార్యయెడ, మిత్రులయెడ, స్నేహితుల యెడ అతడి ప్రవర్తన ఈ విషయాలను సుస్పష్టంగా సర్వేసర్వత్రా అభివ్యక్తం చేస్తున్నది.

పఠనాభిమానం, సంగీతరసికత బ్రూటస్ ను మహోత్తముడుగా తీర్చి దిద్దాయి. ఆశయపావిత్య్రం, నైతిక విజయం మరపురాని మహోదారునిగా భావియుగశుభ్ర చరిత్రల్లో అతడికి స్థానాన్ని కల్పించాయి. ఆంటోనీ అన్నట్లు భూతాలన్నీ ఏకమై “మానవుడంటే ఇతడు” అని చెప్పదగ్గ సద్గుణపుంజం బ్రూటస్.

కాషియస్

కాషియస్ స్వభావం చేత, శిక్షణవల్లా ఎపిక్యూరస్ తత్త్వం కలవాడు. పునర్జన్మ మీద నమ్మకం అతడికి లేదు. 'మానవ జీవితాలమీద దేవతల కెట్టి ప్రభావం లేదు' అని అతని విశ్వాసం. మరణానికి ఇంచుక పూర్వం తన అభిప్రాయాలను మార్చుకున్నా, అతడు శకునాలంటే నమ్మడు. బ్రూటస్ కష్టసుఖాలకు అతీతుడుగా ఉండలేనివాడు. అతికోపస్వభావం కలవాడు. ఈ గుణాన్ని తల్లివల్ల పొందానని తానే బ్రూటస్ తొ చెప్పుకున్నాడు.

ప్రజాస్వామికమంటే అతడికి ప్రియమైనదే. కానీ ఆ ప్రేమ ఒక విశాల సిద్ధాంతంమీద ఆధారపడి ఉండదు. తాత్కాలిక ప్రయోజనం చేకూరితే అది తృప్తి పడుతుంది. అరాజకానికి దారితీస్తున్నానేమో అన్న భయం దానికి లేదు. బ్రూటస్ సిద్ధాంతాన్ని అనుసరించి వ్యవహరిస్తే కాషియస్ కేవలం ఉద్రేకాన్ని బట్టి నడుచుకుంటాడు. అతడు ఉదాత్త సిద్ధాంత ప్రబోధకుడు ఇతడు రాజనీతి చతురుడు. కాషియస్లో ఉదాత్తదుష్ట ప్రకృతులు రెండూ సమ్మేళనాన్ని పొందాయి. సీజర్ ఘనతయెడ ఈర్ష్య వహించాడు. కానీ కేవలం ఈర్ష్య వల్లనే ఇతడు సీజర్ యెడ విద్రోహ వర్గాన్ని కల్పించటంలో సమాహర్త యైనాడనటానికి వీల్లేదు. ఇతడికి ప్రజాస్వామ్యాభిమానం లేకపోలేదు అయితే అది సంకుచితమైంది. అయినప్పటికీ ఇతడు దాని కోసం తన ప్రాణాలు అర్పించి, తన దోషాల నన్నింటినీ దగ్ధం చేసుకొన్నాడు.

తనకు అంతశ్శక్తి, క్రమశిక్షణ లేదని కాషియస్ ఆత్మపరీక్షల వల్ల తెలుసుకున్నవాడు కావటం వల్లనే నాయకత్వాన్ని బ్రూటస్ పరంచేసితాను అనుచరుడైనాడు. తన నిర్ణయాలు సక్రమమైనవనీ, కార్యసాధకాలైనవనీ అతడికి తెలిసినా, బ్రూటస్ కున్న నైతికబలం తనకు లేకపోవటం వల్ల ఎల్లవేళలా లొంగిపోతుండేవాడు. బ్రూటస్ కంటే కాషియస్ నైతికంగా తక్కువవాడైనా రాజకీయంగా ఎక్కువవాడు. రాజకీయాలలో అతడి బుద్ది అతినిశితంగా వ్యవహరిస్తుంది.

అతడు వ్యవహారదక్షుడైన రాజకీయవేత్త. వ్యక్తులను అతినిశితంగా పరిశీలిస్తాడు. మానవస్వభావ పరిశీలనలో అందెవేసిన చేయి. తన యుక్తితో, చాతుర్యంతో సీజర్ మీద విద్రోహాన్ని చేసి క్రమంగా ఒక్కొక్కరినీ ఆ వర్గంలోకి చేర్చగలిగాడు. బ్రూటస్ వంటి మహోత్తముణ్ణి తనపక్షానికి చేర్చుకోటానికి క్రమమైన విధానాన్ని అనుసరించి సాధించాడు. అతడు క్రమమైన రాజకీయవేత్త. లక్ష్యమే ముఖ్యం కాని అతడికి సాధన ఎటువంటిదైనా సరే. సీజర్ తోబాటు ఆంటోనీని కూడా చంపవలసిన అగత్యాన్ని దూరదృష్టితో గమనించి సూచించాడు. సీజర్ అంత్యక్రియల్లో ఆంటోనీ ప్రసంగానికి అవకాశం కల్పించటం ప్రమాదకారి అని పలకటం అతని బుద్ధి నైశిత్యానికి, విషయోన్నయనానికీ నిదర్శనం. సిసెరోను తమ పక్షంలో చేర్చుకోవలసిన అగత్యాన్ని దర్శించి సూచించాడు. అతడు ఉన్నట్లైతే బహుశః ఆంటోనీ వకృత్వ ప్రభావాన్ని తగ్గింపగలిగి ఉండేవాడు. బ్రూటస్ తో సంబంధం లేకుండా ఉంటే కాషియస్ విద్రోహవర్గానికి విజయాన్ని చేకూర్చగలిగి ఉండేవాడనిపిస్తుంది.

కాషియస్ లొ బ్రూటస్ చూపించిన లంచగొండితనం మొదలైన నైతికదోషాలు రాజకీయ ప్రయోజనదృష్టితో చూస్తే దోషాలే కావు. క్లిష్టపరిస్థితుల్లో ఎవరైనా చేయక తప్పనివి. ఇతడు ఎంతటి రాజకీయ ప్రవీణుడో అంతటి యుద్ధతంత్ర ప్రవీణుడు. ఎదురుపోయి శత్రువును ఎదుర్కోటం కంటే శత్రువునే రానివ్వటం మంచిది అన్న అతడు చేసిన సమంజసమైన సూచనను బ్రూటస్ త్రోసిపుచ్చాడు. అందువల్లనే కాషియస్ చెప్పినట్లు విద్రోహవర్గంవారు ఫిలిప్పీయుద్ధరంగంలో వారి సర్వ స్వాతంత్య్రాలూ కోల్పోవలసి వచ్చింది. తత్వవేత్త యైన బ్రూటస్ రాజకీయ చతురుడు, యుద్ధతంత్ర ప్రవీణుడైన కాషియస్ సలహాలను త్రోసి రాజనటంతో చేటుమూడింది.

బ్రూటస్ అనేకరీతుల తన్ను త్రోసిపుచ్చుతున్నా కాషియస్ అచంచలభక్తితో ఆయన్ను అనుసరించాడు. బ్రూటస్ ఉత్తమ వ్యక్తిత్వానికి తాను ముగ్ధుడు కావటమే ఇందుకు కారణం. వారిద్దరి మధ్య చెలరేగిన మనస్పర్ధలకు అతడు ఎంతో నొచ్చు కున్నాడు సంధి జరిగిన తరువాత మనసార కౌగిలించుకున్నాడు. పోర్షియా మరణానికి ఎంతో చింతించాడు. బ్రూటస్ పట్టుబడ్డాడన్న అబద్దవార్త విన్నప్పుడు 'నా కంటిముందు నా ప్రియమిత్రుడు పట్టుబడ్డ తరువాత నేనింకా బ్రతికి ఉన్నా' నని బాధపడ్డాడు.

ఇంతగా బ్రూటస్ యెడ అభిమానాన్ని వహంచి లొంగిపోయిన కాషియస్ నన్ను చూసి, సీజర్ "ఇట్టి ఆకలి కళ్ళతో చూచే బక్కపలచనివారు తమకంటె అధికులైనవారిని చూచి ఈర్ష్య వహిస్తుంటారు" అని ఆంటోనీతో అనటం సమంజసంగా లేదు. అతడి రాజకీయాలకు ఒక నైతికసిద్ధాంతం ఆధారంగా లేకపోవటం తప్ప కాషియస్ లొ వేరే దోషమేమీ లేదు. అతడే దోషభూయిష్ఠుడైతే బ్రూటస్ అతణ్ణి ప్రేమించేవాడే కాడు దుష్టత్వం, ఈర్ష్యపరత లక్షణాలైతే మరణపర్యంతం అనుసరించే అనుయాయులు కొందరు అతడికి ఏర్పడేవారు కారు. అతడిలో కొన్ని లోపాలున్నా ఉదాత్తగుణాలు లేనివాడు కాడు. బ్రూటస్ అతణ్ణి మరణానంతరం “రోమనులలో తుదివా”డనీ, నిన్ను బోలిన వ్యక్తులిక రోములో జన్మించరని ప్రశంసించేవాడు కాడు. 30వావిలాల సోమయాజులు సాహిత్యం-3

ఆంటోనీ

ఆంటోనీ మేధావి, భావోద్వేగి, ధైర్యసాహసాలు కలవాడు, ఎట్టి క్లిష్టపరిస్థితినైనా తన కనుకూలంగా త్రిప్పుకోగల ప్రవీణుఁడు. గౌరవాధికారాలపై ఆసక్తి కలవాఁడు. విలాసప్రియుడు. వినోదశీలి. సీజర్ ఎడ అతని భక్తిభావం అచంచలం, అమలినం, పరిపూర్ణం. ప్రభువర్గతత్త్వం అతడిలో జితించిన గుణం. అతడు పన్నుగడలు పన్నగల కుశాగ్రబుద్ధి. హృదయార్ద్రతకంటే విధానానుసరణం మీద అతడికి దృష్టి విశేషం. కానీ ఇతరుల ఉదాత్తతయెడ అంధుడు మాత్రం కాదు. బ్రూటస్ వలె ఇతడు నీతిసూత్రాలతో కొలిచి ఇతరులకు విలువ కట్టడు. ఆంటోనీ రాజకీయజ్ఞుడే కాని అతడి రాజకీయాలకు వ్యక్తిగతకారణాలు సుస్థిరసూత్రమేదీ ఆధారం కాదు. అందువల్లనే అతడు తదనంతర చరిత్రలో పరాజితుడైనాడు.

సీజరంటే అతనికి అపారభక్తి. 'సీజర్ ఏదైనా చెయ్యమంటే అది జరిగినట్లే' అన్న అతడి వాక్యంలో అణుమాత్రమైన స్తోత్రప్రియత్వం లేదు. సీజర్ మీద భక్తే అతణ్ణి వధానంతరం హంతకుల మధ్యకు నడిపించింది. సీజర్ కు జరిగిన మహాద్రోహం అతడిలో నిస్సీమమైన ఉద్రేకాన్ని కల్పించి దౌష్ట్యాచరణకు ప్రేరేపించింది. విజయాన్ని చేకొన్న విద్రోహులతో స్నేహం చేసుకొని అధికారాన్ని పంచుకోవటానికి పూనుకోకపోవటమే ఆంటోనీ స్వార్థరహితమైన స్వామిభక్తిని ప్రకటిస్తుంది.

అతడు రాజకీయాలలో నీతివిరహితుడు. ప్రజలను వక్తృత్వంతో ఉద్రేకపరచి "ఇది ఇక వ్యహరించుగాక! దౌష్ట్యమా! నీవు పయనమారంభించావు స్వేచ్ఛాను సారంగా విహరించు" అని అనటం వల్ల అతడి హృదయకౌటిల్యం వక్తమౌతున్నది. ప్రజలకు సీజర్ ఇచ్ఛాపత్రంలోని ప్రజాదానాల గురించి తెలియజేసి, తరువాత వాటిలోని ఆ భాగాలను తొలగించి ప్రజలను మోసగించటానికి లెపిడస్ చేత ఇచ్ఛాపత్రాన్ని తెప్పించటం, వీరత్రయకూటమిలో సభ్యుడైన లెపిడసన్ను గురించి అతడు ఆక్టేవియస్తో వెల్లడించిన భావాలు, మాటలకు మనస్సుకూ గల అసంబద్ధతను తెలియజేస్తున్నవి. తనతో సమానుడైన వీరుడు గదా లెపిడస్! అతడు భారవహనానికి పనికివచ్చే గార్దభమట! అతడిది ఎంతటి కుటిలహృదయం!

అతని క్రీడాభిరతి, విలాసప్రియత్వం, కొంతవరకు సహించ దగ్గవైనా అతని క్రూరత్వం, హృదయ రాహిత్యం క్షంతవ్యాలు కానివి. లెపిడస్ కోరితే తన మేనల్లుని “ఒక్క చుక్కతో తుడిచిపెడుతున్నా” నన్నాడు. షేక్స్ పియర్ చిత్రించిన సీజర్ నాటకంలోని ఆంటోనీని చూచినప్పుడు, కాలం ఒక దుష్టుణ్ణి దేవతను చేసి కూర్చో పెట్టిందనీ, అతడే చెప్పిన ఆంటోనీ క్లియోపాత్రాలోని ఆంటోనీని చూచినప్పుడు ఆ దేవతామూర్తి దుష్టుడుగా పరిణమించాడనీ అనిపిస్తుంది. సీజర్ నాటకంలోని ఆంటోనీ వకృత్వశక్తితో రోమను ప్రజను 'తాను పలికించినట్లు పలికే పిల్లన గ్రోవి’నిగా చేసుకుంటే, ఆంటోనీ - క్లియోపాత్రాలోని ఆంటోనీని 'ఆ ఈజిప్టు సమ్మోహిని, (క్లియోపాత్రా) తన ఇష్టానుసారంగా పలికించుకున్నది' అని ఒక విమర్శకుడు పలికిన వాక్యాలు ఎంతో సముచితాలైనవి.

ఇన్ని దోషాలున్నా ఆంటోనీ సమర్థుడు. ఆత్మసంయమనం కలవాడు. క్లిష్టస్థితిలో చిత్త స్థైర్యాన్ని అచంచలంగా నిలుపుకోగల గంభీరుడు. ఉపాయశాలి. శిలలకు ప్రాణంపోసి తన పనులు నెరవేర్చుకోగల ప్రజ్ఞాశాలి. కార్యనిర్వహణ దక్షుడు. కాషియస్ సీజర్ ఎడ విద్రోహవర్గాన్ని కూర్చి వధతో విజయాన్ని పొందితే విద్రోహవర్గానికి ప్రతివర్గాన్ని సృష్టించి విజయాన్ని సాధించిన మహామేధావి. యుద్ధతంత్రజ్ఞుడు. ఉదాత్తగుణాలు తనకు లేకపోయినా బ్రూటన్లోని నైతికాధిక్యాన్ని గమనించి "మానవుడంటే ఇతడే” అని శ్లాఘించటం, సీజర్ ఎడ అచంచల భక్తిప్రపత్తులు ప్రకటించటం ఈ కుటిలపాత్రకు గల రెండు మధురగుణాలు.

స్త్రీ పాత్రలు

సీజర్ నాటకంలో స్త్రీ పాత్రలు ఇరువురు. ఇందులో పోర్షియా స్త్రీ రూపంలో ఉన్న బ్రూటస్. అత్యుదాత్త అయిన రోమను నారీమణి. ఉత్తమ ధర్మపత్ని. భార్యకు గల హక్కులను కర్తవ్యాలను ఎరిగిన వ్యక్తి. తన చిత్తదారఢ్యా నిరూపణ కోసం ఊరువులో గాయాన్ని కల్పించుకొని భర్తకు తన పౌరుషశీలాన్ని ప్రకటించిన వీరనారి. అయితేనేం? ఆమె కేవలం స్త్రీమూర్తిగానే వ్యవహరించింది. భర్త యుద్ధభూమిలో ఉండటం వల్ల కలిగిన వియోగాన్ని భరించలేక మరణించిన ఆమె, స్త్రీ జనసహజమైన హృదయ దౌర్బల్యాన్ని జయించలేకపోయిందనే చెప్పవచ్చు. కాని వ్యక్తిత్వం గల స్త్రీ.

కల్పూర్నియా సీజర్ భార్య. వ్యక్తిత్వం లేని వ్యక్తి. అంతటి మహావీరునికి పత్ని అయి ఉన్నా, అంధవిశ్వాసాలమీద అపరిమితమైన నమ్మకం కలది. తన దుఃస్వప్నానికి వెరచి భర్తను సభాభవనానికి వెళ్ళవద్దని తొలుత ప్రార్థించినా, ఆయన వెళ్ళటానికి నిశ్చయించుకొన్నప్పుడు హృదయ దారణ్యంతో ఈమె ఎదురునిల్వలేదు. పోర్షియావలె తనకున్న వైవాహిక సత్యాలను గురించి పట్టుబట్టకపోయినా వాటి ప్రశంసైనా చేయలేదు. నిరంకుశునికి పత్ని అయిన ఆమె తనకున్న సత్యాలనే ఎరగదో, తెలిసి మరుపునకు అలవాటు పడిందో! లేక శకునాలకు ఒక వంక జంకుతున్నా భర్తకు లభించనున్న రాజకిరీటం మీద ఆమెకు కూడా అభిమాన ముందేమో! లేకపోతే తన ప్రార్థనలను సీజర్ తిరస్కరించి వెళ్ళుతుంటే నోరైనా ఎత్తకుండా ఉంటుందా? కల్పూర్నియా లోకసామాన్యురాలైన స్త్రీయే గాని పోర్షియా వలె విశిష్టమూర్తి కాదు.

పోర్షియా, కల్పూర్నియా ఇరువురూ ఉత్తమపత్నులే కాని, కల్పూర్నియా సీజర్ కోసమే జీవించింది. పోర్షియా బ్రూటస్ కోసం జీవిస్తూ కొంత తనకోసం కూడా జీవించింది. భర్తృహృదయసాన్నిహిత్య సంపాదనలో పోర్షియాకున్న ప్రజ్ఞ కల్పూర్నియాకు లేనట్లు కనిపిస్తుంది. ఇందుకు కారణాలైన గుణదోషాలు భర్తలతో, భార్యలవో?

రోమను ప్రజ

జ్ఞానహీనులు, చంచలస్వభావులు, ఉద్రేకపూరితులు అయిన రోమను ప్రజను మహాకవి షేక్స్ పియర్ తన అనంతప్రతిభతో ఈ సీజర్ నాటకంలో చిత్రించి చూపించాడు. నాటకాన్ని వారితో ఆరంభించాడు. ధర్మాధికారులు వారి మతిభ్రమణాన్ని, కృతఘ్నతను, చంచలశీలాన్ని నిందిస్తూ పారద్రోలితే దోషులైనట్లు కిక్కురుమనకుండా వారు వెళ్ళిపోయారు.

సీజర్ వథాసందర్భంలో వీరి చంచలత్వాన్ని షేక్స్ పియర్ ఇంకా స్పష్టంగా నిరూపించాడు. సీజర్ ను హత్య చేసినందుకు విద్రోహవర్గంమీద వెర్రికోపాన్ని పొంది మింగేసేటట్లు వచ్చారు. కానీ కారణాలను చెప్పి సంతృప్తి పరిస్తే చాలునని ఏకకంఠంగా పలికారు. బ్రూటస్ ఇచ్చిన సమాధానాన్ని విన్నారు. ఇంచుకైనా స్తిమితచిత్తాన్ని వహించి, ఆ సమాధానాన్ని పరిశీలించి అవగతం చేసుకోకుండానే సంతృప్తిని పొంది, బ్రూటస్ ను స్వాతంత్య్ర సముద్ధర్తనుగా నిర్ణయించి కీర్తించారు. సీజర్ ను వధించటానికి బ్రూటస్ ను ప్రేరేపించిన ప్రజాస్వామ్య సిద్ధాంతం, వారికి అణుమాత్రమైనా విజ్ఞానభూయిష్ఠమైన బ్రూటస్ ప్రసంగం వల్ల తెలిసిందని అనుకోటానికి అవకాశం లేదు. అయితేనేం? ఆయన ఎడ అపార ప్రేమానురాగాలను ప్రకటించి 'సీజర్ ను కూడా చేద్దామనుకొన్నారు. నిరంకుశత్వాన్ని రూపుమాపటానికి నాయకత్వాన్ని వహించిన వ్యక్తినే నిరంకుశ పదవికి ఎన్నుకోదలచటం కంటే ప్రజల మౌఢ్యానికి, అజ్ఞానానికి మరో నిదర్శనం ఏం కావాలి?

బ్రూటస్ ప్రసంగానికి పూర్వం ప్రజ సీజర్ యెడ అచంచల విశ్వాసాన్ని ప్రకటించింది. తరువాత బ్రూటస్ పక్షం వహించింది. ఆంటోనీ ప్రసంగించాడు. జూలియస్ సీజర్33 మళ్ళీ అందర్నీ సీజర్ వంకకు త్రిప్పాడు. జనచిత్తచాంచల్య పరిగణనలో నిధి అయిన ఆంటోనీ వారిని విద్రోహవర్గంమీదికి దండెత్తించి విజయం చేకొన్నాడు. బ్రూటస్ నిరూపించిన సమంజసమైన కారణాలతో వారి కేమి పని? ఆంటోనీ చేసిన భావోద్రేక సంఘర్షణ వారిమీద పనిచేసింది. ఇక వారు తలపెట్టి సాగించని దౌష్ట్యమంటూ లేదు. నేను సిన్నా కవిని, సిన్నాకవిని అని ఎంత మొరపెట్టు కుంటున్నా వినిపించుకోక, హంతకుల్లో ఒకడైన సిన్నాతో నామసామ్యం గల సిన్నా కవిని చీల్చివేయటంతో వారి క్రోధోన్మత్తత పరాకాష్ఠ నందుకున్నది. నిరంకుశత్వ ప్రజాస్వామ్యాలల్లో వారేవంకకు మ్రొగ్గుతారో! "ఇట్టి చిత్తప్రవృత్తిగల సామాన్యప్రజపై షేక్స్ పియర్ కు అభిమానం విశేషం. అందువల్లనే అతడు హృదయపూర్వకంగా వారితో క్రీడించాడు. దీర్ఘకాలంమీద వారినే ధర్మనిర్ణేతలనుగా తీర్చిదిద్ది రోమక ప్రభువర్గం కంటే ఉన్నతస్థానాన్ని వహించినవారినిగా వారిని నిరూపించాడు.”

ఇట్టి అపూర్వ పాత్ర సృష్టితోనే కాక, కాషియన్ బ్రూటస్ హృదయంలో విద్రోహబీజాలను నాటిన ప్రథమాంక ద్వితీయ దృశ్యం, విద్రోహవర్గజనదృశ్యం, పోర్షియా బ్రూటస్ల సమావేశంతో ఒప్పిన ద్వితీయాంక ప్రథమ దృశ్యం, ఆంటోనీ ప్రసంగ సన్నివేశం, బ్రూటస్, కాషియస్ల కలహ సన్నివేశం, బ్రూటస్ కాషియస్ ల సంభాషణం మొదలైన మహత్తర, మనోజ్ఞ సన్నివేశాలతో షేక్స్పియర్ మహాకవి తన పరిణిత కళావైదగ్ధ్యాన్ని ప్రకటించిన సీజర్ నాటకం సమకాలీనుల్లోనే విఖ్యాతి గడించి, నేడు ఆ నాటి రోమకచరిత్ర కొక చక్కని ప్రతిబింబంగా ప్రవర్తిస్తూ వస్తున్నది.

'ప్రతిజాతికీ దాని యోగ్యతను బట్టి ఉత్తమ ప్రభుత్వం ఏర్పడుతుంది. జాతి నిర్మించుకొన్న రాజకీయ సంస్థల్లో మార్పు కలగాలంటే, అందులోని జనసముదాయ మంతటిలోనూ శీలపరివర్తన కలగవలసిందే. అంతవరకూ ఒక క్రూరపాలకుణ్ణి తొలగిస్తే మరొకడు ఆ స్థానాన్ని ఆక్రమిస్తాడు. హత్య మహాదోషం. రాజకీయాశయం కోసమైనా హత్య చేసింది వ్యక్తి ఐతే వ్యక్తి, జాతి ఐతే జాతి తత్ఫలితాన్ని అనుభవించక తీరదు. ఉదాత్తలక్ష్యసిద్ధికి ఉదాత్త సాధనాన్నే ఉపయోగించాలి'

అన్నవి ఈ నాటకం నేర్పే గుణపాఠాలు. ఇవి సార్వజనీనాలు, సార్వకాలీనాలు. ఈ 'నిత్య సత్య ప్రవచనం' వల్ల సీజర్ నాటకం విశ్వసాహిత్యంలో సుస్థిరమైన విశిష్టస్థానాన్ని పొందినదనటంలో అతిశయోక్తి అణుమాత్రమైనా లేదు.

పాత్రలు

జూలియస్ సీజర్ : మహాసేనాని, రోమక సామ్రాజ్యాధి నేత

మార్కస్ బ్రూటస్ : విద్రోహ వర్గ సభ్యుడు

కాషియస్ : విద్రోహ వర్గ సభ్యుడు

కాస్కా : విద్రోహ వర్గ సభ్యుడు

ట్రెబోనియస్ : విద్రోహ వర్గ సభ్యుడు

ఆక్టేవియస్ సీజర్ : సీజర్ వధానంతరం ఏర్పడ్డ వీరత్రయ కూటమి సభ్యుడు

మార్క్ ఆంటోనీ : సీజర్ వధానంతరం ఏర్పడ్డ వీరత్రయ కూటమి సభ్యుడు

లెపిడస్ : సీజర్ వధానంతరం ఏర్పడ్డ వీరత్రయ కూటమి సభ్యుడు

సిసెరో : శాసనసభా సభ్యుడు

పబ్లియస్ : శాసనసభా సభ్యుడు

పొపిలియస్ లేనా : శాసనసభా సభ్యుడు

లిగారియస్ : విద్రోహ వర్గ సభ్యుడు

డెషియస్ బ్రూటస్ : విద్రోహ వర్గ సభ్యుడు

మెటిల్లస్ సింబర్ : విద్రోహ వర్గ సభ్యుడు

సిన్నా : విద్రోహ వర్గ సభ్యుడు

ప్లేవియస్, మరులియస్: ప్రజా ధర్మాధికారులు

ఆర్టిమిడోరస్ : ఛందశ్శాస్త్రోపాధ్యాయుఁడు

సిన్నా : కవి, మరొక కవి

లుసిల్లియస్, టిటినియస్, మెసెల్లా, యువకేటో వొలిమ్నియస్ బ్రూటస్ మిత్రులు క్లిటస్, వర్రో, క్లాడియస్, స్ట్రాటో, లూషియస్, డార్దానియస్ బ్రూటస్ సేవకులు. పిండారస్ కాషియస్ సేవకుడు శాసనసభా సభ్యులు, పౌరులు, రక్షకులు, పార్శ్వచరులు, తదితరులు.

స్త్రీలు

కల్పూర్నియా : జూలియస్ సీజర్ భార్య

పోర్షియా : బ్రూటస్ భార్య

'ప్రథమాంకము '

ఒకటో దృశ్యం

రోము మహానగరంలో ఒకవీధి.

ప్లేవియస్, మరులియస్, కొందరు పౌరులు ప్రవేశిస్తారు.

ప్లేవియస్  : వెళ్ళిపొండి! పనిపందల్లారా! మీ మీ ఇళ్ళకు వెళ్ళిపొండి. ఏమిటి? మీకేం తెలియదా? మీ మీ వృత్తిచిహ్నాలు లేకుండా ఈ శ్రమదినంనాడు ఇలా తిరగరాదని మీకు తెలియదా? ఏమోయ్, నీ వృత్తేమిటి?

ప్రథమ పౌరుడు  : ఎందుకు బాబూ? నేనో వడ్రంగిని.

మరులియస్  : అయితే నీ వక్షస్త్రాణమేది?' దారుదండమేది?

ఇంత మంచిదుస్తులు ధరించి తిరుగుతున్నావేం? నిన్నేనయ్యా! నీ వృత్తేమిటి?

ద్వితీయ పౌరుడు  : బాబూ,నిజం చెపితే నిపుణుడైన శ్రామికునితో పోల్చి నన్ను ప్రావీణ్యం లేనివాడని మీరంటారు.

మరులియస్ : కావచ్చు. నీ వృత్తేమిటో సూటిగా చెప్పు.

ద్వితీయ పౌరుడు  : నా వృత్తా బాబూ, భయరహితంగా చెప్పవచ్చునను కుంటాను, నిజం చెపితే, చెడ్డ చర్మాలను బాగు చేయటమే నా వృత్తి.

మరులియస్  : ఓరి తులువా! తల బిరుసెక్కిందా? నీదేం వృత్తి?

ద్వితీయ పౌరుడు  : వద్దు, కోపగించకండి బాబూ! నేను మీ చర్మాన్ని కూడా బాగుచేస్తాను.

మరులియస్ : అంటే నీ అభిప్రాయం? నా చర్మం కూడా బాగు చేస్తావా, ఓరి పెంకివెదవా?

ద్వితీయపౌరుడు  : ఎందుకు కోపగిస్తారు బాబూ, మీ అతకలను కూడా బాగుచేస్తాను.

మరులియస్ : అయితే నీవు చర్మకారుడి వన్నమాట! అంతేనా? ద్వితీయపౌరుడు  : నిజం చెపుతున్నాను బాబూ! నేను నా ఆరెతోనే జీవిస్తున్నాను. మరోవృత్తిగల వాళ్ళతో గాని, స్త్రీల విషయాల్లో గాని నేను ఎటువంటి జోక్యం కలిగించుకోవటం లేదు. అయితే, సత్యం చెపుతున్నాను, ఆపదలో ఉన్న పాత చర్మాలకు నేను ఘనవైద్యుణ్ణి. తగ్గ చికిత్స చేస్తాను. అందమైన చర్మాలు వేసుకొని నడుస్తున్నవాళ్ళు ఎవరు కన్పించినా వారు నా నైపుణ్యంవల్ల తయారైన చర్మాలను ఉపయోగిస్తున్నారన్న మాటే!

ఫ్లేవియస్  : అయితే, ఈ నాడు మీరంతా మీ మీ కర్మాగారాలలో పనిమానేశారా? ప్రజల నందరినీ గుంపులుగా నడిపించుకుంటూ వీథుల్లో ఇలా తిరుగుతున్నారేం?

ద్వితీయ పౌరుడు : వాళ్ళ చర్మాలు అరిగిపోవటానికి నాకు మరింతపని దొరకటానికి- కాదు బాబూ! సీజర్ను చూడటానికీ, అతడి విజయానికి ఆనందించటానికీ ఇవాళ మేము సెలవు తీసుకొన్నాం.

మరులియస్  : ఆనందించటానికా! ఏముంది కనక? అతడు ఏం విజయాలు నెత్తికెత్తుకో వచ్చాడని? కప్పాలు చెల్లించగల బందీలను రథానికి కట్టి వెంటబెట్టుకుని రోముకు నడిపించుకో వస్తున్నాడనా!

వీళ్ళు వట్టి మూర్ఖులు! రాతిగుండెలు!! భావహీనులు!!!... ఓ శిలాహృదయులారా! రోము నగర క్రూరపౌరులారా!! పాంపేను' అప్పుడే మరిచిపోయినారా? రోము నగర మహావీథుల్లో అతడు విజయపరంపరలతో వచ్చి యాత్ర చేస్తున్నప్పుడు అతని దర్శనంకోసం మీరు ఘనకుడ్యాలు, కోటకొత్తళాలు, హర్మ్యశిఖరాలు ఎగబ్రాకి ఎక్కి చేతుల్లోని పసిపాపల్తో, దీర్ఘమైన దినమంతా, ప్రశాంతంగా ఆశతో ఎన్నిమార్లు వేచి ఉన్నారో మరిచిపోయినారా? అతడి రథం కనబడీ కనబడక ముందే మీరంతా ఒక్కమారుగా చరిచిన కరతాళాల ప్రతిధ్వనులకు శూన్యతీర భూమితో టైబరునది వణికిపోవడం మరిచిపోయినారా?

ఆ! మీరు ఈ నాడు అత్యుత్తమమైన దుస్తులు ధరించారా? ఆ మీరు ఈనాటిని సెలవు దినంగా ఎన్నుకున్నారా? ఆ మీరు పంపే సంతానరక్తంతో చేకొన్న విజయాన్ని తెస్తున్నవాడి మార్గాలను పుష్పాలతో అలంకరిస్తున్నారా?

పొండి! వెళ్ళిపొండి!! మీ మీ ఇళ్ళకు పరుగెత్తి పొండి!! తాను చూపిన కృతఘ్నతను ఇలా బహిరంగంగా ప్రకటించుకొనే ఈ మహామారిని కొంతకాలం ఆపవలసిందని మీమీ దేవతలముందు మోకరిల్లి వేడుకోండి! పొండి!! 38 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ప్లేవియస్ : వెళ్ళిపొండి! ఉదాత్తులారా! దేశీయులారా! పొండి! దీన్ని ఆనందసమయంగా చేసుకొన్న మీ దోషానికి ప్రతిక్రియగా మీబోటి దీనులనందర్నీ గుంపు చేయండి. టైబరు నదీతీరానికి వెళ్ళండి! ఆ నదీవేణికలో మీ కన్నీటిని క్రుమ్మరించి ఆ తరంగిణి సర్వోన్నతతీర భూములనూ చుంబించేటట్లు చెయ్యండి!

(పౌరులు నిష్క్రమిస్తారు)

చూడు, వారి అల్పలక్షణం నా ప్రసంగం వల్ల మారిందో లేదో. చూడు దోషులు కావటం వల్ల కిక్కురుమనకుండా వెళ్ళిపోతున్నారు.

నీవు సభామందిరం వైపు వెళ్ళు, నేను ఇలా పోతాను. ప్రతిమలకు ఏమైనా ఉత్సవాలంకరణలు కనిపిస్తే ఒలిచివెయ్.

మరులియస్  : ఆ పని మనం చెయ్యవచ్చా? ఇప్పుడు లూపర్ ్కల్ ఉత్సవాలు జరుగుతున్నవని నీకు తెలుసు ననుకుంటాను?

ప్లేవియస్  : ఇందులో దోషమేమీ లేదు. సీజర్ విజయ గౌరవ చిహ్నాలతో ఏ ప్రతిమా అలంకరింపబడరాదు. నే వెళ్ళి వీథుల్లో గుంపులుచేరే జనాన్ని చెదరగొడతాను. దట్టంగా జనం మూగి ఉన్నట్లు కనిపిస్తే నీవూ చెదరగొడుతూ వెళ్ళు.

సీజర్ రెక్కలమీద మొలుచుకొస్తున్న ఈకలను ఇలా పెరికి వేస్తే అతడూ సామాన్యంగానే ఎగరగలుగుతాడు. లేకపోతే మన అందరి చూపులకూ అందకుండా అతడు విహాయస వీధుల్లో విహరిస్తూ మనలనందరినీ దాస్యభయంలో ముంచెత్తుతాడు.

(నిష్క్రమిస్తారు)

రెండోదృశ్యం

ఒక ప్రజాప్రదేశం. సంగీత విజయోత్సవాలతో సీజర్ ప్రవేశిస్తాడు. ఉత్సవాచారాలకూ ఆంటోనీ, కల్పూర్నియా,' పోర్షియా, డెసియస్, సిసెరో, బ్రూటస్, కాషియస్, కాస్కా ప్రవేశిస్తారు. వారివెంట ఒకమూక, అందులో ఒక శకునజ్ఞుడు ఉంటాడు.

సీజర్  : కల్పూర్నియా!

కాస్కా  : నిశ్శబ్దం! సీజర్ ప్రవేశిస్తున్నాడు.

(సంగీతం క్రమంగా అంతరిస్తుంది)

సీజర్  : కల్పూర్నియా!

కల్పూర్నియా  : ప్రభూ! ఇక్కడున్నాను.

సీజర్  : ఆంటోనియస్ పయనించే పవిత్ర మార్గంలో సూటిగా నిలు. ఆంటోనియస్!

ఆంటోనీ  : సీజర్ మహాప్రభూ!

సీజర్ : నీ ధావనవేగంలో కల్పూర్నియాను స్పృశించటం మరచిపోకు. అతిపవిత్రమైన ఈ వేటలో స్పృశింపబడ్డ స్త్రీకి వంధ్యత్వశాపం తొలగిపోతుందని పెద్దలు చెపుతుంటారు.

ఆంటోనీ  : తప్పక జ్ఞాపకం పెట్టుకుంటాను. సీజర్ 'ఈ పని చెయ్య' మని కోరితే ఆ పని జరిగిపోయినట్లే!

సీజర్  : ఇక బయలుదేరు. ఏ ఆచారభాగాన్నీ విడిచిపెట్టకు.

(సంగీతం వినిపిస్తుంది)

శకునజ్ఞుడు  : సీజర్!

సీజర్  : ఆఁ. ఎవరు, నన్ను పిలుస్తున్నారు?

కాస్కా : సర్వధ్వనులూ అంతరించాలి. వెనుకటిలా నిశ్శబ్దంగా ఉండాలి.

(సంగీతం ఆగిపోతుంది)

సీజర్  : ఆ గుంపులోనుంచి ఎవరు పిలిచింది? ఈ సంగీతం అంతకంటే అవ్యక్తమైన ఒక కలస్వనం ఈ గుంపులో నుంచి నన్ను పిలచినట్లు వినిపించింది. అదెవరు? మాట్లాడు. సీజరు ఈ వంకకు తిరిగి వినటానికి సిద్ధంగా ఉన్నాడు.

శకునజ్ఞుడు  : మార్చి పదిహేనో నాడు జాగ్రత్త!

సీజర్  : ఎవరది?

బ్రూటస్  : ఒక శకునజ్ఞుడు మిమ్మల్ని 'మార్చి పదిహేను నాడు జాగ్రత్త' అని సూచిస్తున్నాడు.

సీజర్  : అతడి ముఖాన్ని చూడాలి, నా ముందుకు తీసుకోరండి.

కాషియస్ : గుంపులోనుంచి ముందుకు రావయ్యా! సీజర్ ను దర్శించు.

సీజర్  : నీవు నాకు సూచించిందేమిటి? ఏదీ, మళ్ళీ ఒకమారు చెప్పు. శకునజ్ఞుడు  : మార్చి పదిహేనో నాడు జాగ్రత్త!

సీజర్  : ఇతడెవరో స్వాప్నికుడు. అతణ్ణి వదిలెయ్యండి. పోదాం కదలండి.

ఒక తుత్తారధ్వని వినిపిస్తుంది. బ్రూటస్, కాషియస్ తప్ప మిగిలిన వారందరూ నిష్క్రమిస్తారు.

కాషియస్  : మీరు వెళ్ళి 'ఆ పవిత్రధావనాన్ని' తిలకిస్తారా?

బ్రూటస్  : లేదు.

కాషియస్  : వెళ్ళి చూడవలసిందని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.

బ్రూటస్  : క్రీడలంటే నాకిష్టం లేదు. ఆంటోనీలో ఉన్న ఉద్వేగం నాలో లేదు. నీ కోరికలకు నేనేం ఆటంక పడనులే. నిన్ను వదలిపెట్టి వెళ్ళిపోతాను.

కాషియస్  : బ్రూటస్! కొంతకాలంనుంచీ మీ కళ్ళలో నాకు వెనకటి ఆప్యాయత ఎందుకోగాని కనిపించటం లేదు. మిమ్మల్ని మనసార ప్రేమించే మిత్రుడిమీద ఎందుకంత వినూత్నంగానూ, కఠినంగానూ ఉంటున్నారు?

బ్రూటస్  : కాషియస్, మోసపోకు. నీకు అపరిచితమైన భావంతో నా ముఖం కప్పుకోపోయి ఉంటే ఆ బాధంతా కేవలం నాకోసమే. ఇతరులకు ఎట్టి సంబంధమూ లేని విషయాల వల్ల నాలో పరస్పర విరుద్ధోద్వేగాలు కలిగి నన్ను అలయించాయి. ఇదే బహుశః నా విచిత్రప్రవర్తనకు మూలకారణమై ఉంటుంది. అందువల్ల నాలో ద్యోతకమయ్యే మార్పునకు నా ముఖ్యస్నేహితులు చింతపడరనుకుంటాను. వెర్రి బ్రూటస్, తన అంతరాత్మలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల, ఇతరుల ఎడ చూపవలసిన ప్రేమాభిమానాలను ప్రకటించటం కూడా మరిచిపోతున్నాడని అనుకుంటారు గాని, అంతకుమించి ఏమీ ఆలోచించరనుకుంటాను. నా ఆప్తమిత్రుల్లో నీవూ ఒకడివి.

కాషియస్  : బ్రూటస్! అయితే మీ మానసికోద్వేగాన్ని అపార్థం చేసుకున్నా నన్నమాట! తర్కించవలసిన అభిప్రాయాలను ఎన్నిటినో ఇన్నాళ్ళబట్టీ నా మనస్సులోనే దాచి ఉంచాను. మిమ్మల్ని గురించి మీకు బాగా తెలుసా బ్రూటస్?

బ్రూటస్ : లేదు, కాషియస్! అద్దంలో ప్రతిబింబాన్ని తిలకించటం వల్లనో లేదా మరోరీతిగానో తప్ప కన్ను తన్ను తాను చూచుకోగలుగుతుందా? కాషియస్  : సత్యం చెప్పారు. మీలో గుప్తంగా ఉన్న శక్తిని ప్రతిబింబించి మీ కంటిముందు నిలిపి నిజరూపాన్ని మీరు చూచుకొనే అవకాశాన్ని కల్పించగల అద్దాలు మీకు లేవని అంతా ఎంతగానో చింతిస్తున్నారు. దివ్యపురుషుడు సీజర్ తప్ప రోము మహానగరంలోని మహనీయులందరూ బ్రూటస్ మహాశయుడు తన్ను తాను దర్శించవలెనని వాంఛిస్తున్నారు. వారందరూ ఈ యుగంలోని క్రూరపాలన భారాన్ని మోయలేక మూల్గుతున్నారు.

బ్రూటస్  : నాలో గుప్తంగా ఏదో మహాయోగ్యత ఉన్నదని, దాన్ని వెదకమనీ ఉద్బోధించి నన్ను ఏ ప్రమాదాలలోకి నడిపిస్తున్నావో నీవు అర్థం చేసుకున్నావా? అట్టి శక్తి ఏదీ నాలో లేదని నాకు తెలుసు.

కాషియస్ : అయితే, బ్రూటస్, వినటానికి సిద్ధపడండి. ఎంత యత్నించినా మీ ప్రతిబింబంతో తుల్యంగా మిమ్మల్ని మీరు తిలకించలేరు. నేను మీకు ముకురా న్నౌతాను. అత్యుక్తి లేకుండా మిమ్మల్ని గురించి మీరెరుగని పర్వాన్ని ద్యోతకం చేస్తాను.

బ్రూటస్ మహాశయా! నన్ను అనుమానించకండి. నన్ను గురించి సామాన్య పరిహాసకుడని విన్నా, సాధారణ ప్రమాణ శుల్కానికి ప్రేమనటించే ప్రతినూతన వ్యక్తికీ మైత్రినిస్తానని తెలుసుకున్నా, స్తోత్రపాఠాలకు లొంగి తొలుతగా కౌగిలించి తరువాత తిడతానని, సామాన్య జనానురాగాన్ని చూరగొంటానికి ఆరాటపడతాననీ తెలుసుకొన్నా నన్ను ప్రమాదకారినిగా భావించండి.

(కోలాహలం, కరతాళధ్వనులు వినిపిస్తవి)

బ్రూటస్ : ఈ కోలాహలానికీ, కరతాళధ్వనులకూ అర్థమేమిటి? ప్రజలు సీజర్ ను రాజుగా ఎన్నుకుంటున్నారేమో. భయం వేస్తున్నది.

కాషియస్  : ఏమిటి? నిజంగా మీరు భయపడుతున్నారా? అలా జరగకూడదని మీరు వాంఛిస్తున్నట్లు నేను నమ్మవలసిందే.

బ్రూటస్  : ఔను కాషియస్, అలా జరగకూడదు. అయినా, అతడంటే నాకెంతో అనురాగం. అయితే నీవు ఎందుకు నన్నింతసేపు ఇక్కడ ఆపుతున్నావు? ఏమైనా చెప్పదలచుకున్నావా? అది సమష్టి స్వశ్రేయసానికి సంబంధించిందైతే మృత్యుగౌరవాలు రెండూ చెరొకవంక దర్శనమిచ్చినా, రెంటినీ సమదృష్టితో పరిశీలిస్తాను. మృత్యుభయాన్ని తొలగించి నాకు గౌరవం మీద అభిమానాన్ని ప్రసాదించి దేవతలు అభ్యుదయాన్ని చేకూర్చెదరు గాక! కాషియస్  : బ్రూటస్! అంతటి మహోదారగుణం మీలో ఉందని మీ బాహ్యరూపాన్నైన నాకు తెలుసు బాగుంది. వినండి. గౌరవమే నా కథనానికి వస్తువు. మీరూ, ఇతరులూ ఈ నాటి మన జీవితాన్ని గురించి ఏమనుకుంటున్నారో నేను చెప్పలేను. సర్వరీతులా నన్ను బోలిన ఒక వ్యక్తివల్ల కలుగుతున్న భయంతో బ్రతకటం కంటే మరణించటమే మంచిదని నాకు నేను భావిస్తున్నాను.

నేను సీజర్ లా స్వతంత్రుణ్ణిగా జన్మించాను. మీరూ అలాగే జన్మించారు. అతనితో తుల్యంగానే మన మిద్దరం పోషణను పొందాం. అతనిలాగానే శీతకాలపు చలిని మన మిర్వురం భరించగలం.

ఎందువల్లనంటారా, ఒకప్పుడు, ఒక శీతలమైన తుపాను నాటిరాత్రి, పొంగులువారే టైబరునది తన ఒడ్లమీద క్రోధాన్ని వెళ్ళగక్కుతున్నప్పుడు, సీజర్ నాతో "కాషియస్! ఈ క్రోధోన్మత్త తరంగిణిలో దూకి ఆ లక్ష్యం వరకూ నాతోబాటు ఈదటానికి నీకు ధైర్యముందా?" అని అడిగాడు. మరుక్షణంలోనే నేను ఉన్న దుస్తులతోటే నదిలోకి దుమికి అనుసరించమని అతణ్ణి ఆజ్ఞాపించాను. అతడు అనుసరించాడు. ప్రవాహం అతిభయంకరంగా గర్జిస్తున్నది. శక్తితో నీరాన్ని చిమ్మివేస్తూ, మనో ధైర్యంతో నదీవేగానికి అడ్డునిలుస్తూ ఇద్దరం ఈదుతున్నాం. ఇంకా మా లక్ష్యం దూరాన ఉంది. "కాషియస్! నాకు సాయపడు, లేదా నేను మునిగిపోతాను" అని సీజర్ దీనంగా కేకపెట్టాడు. ట్రాయ్ అగ్నిజ్వాలల్లో నుంచి మన పూర్వుడు ఏయే నియస్' తన భుజస్కంధాల మీద ఆన్ చెసిస్ ను మోసినట్లు టైబర్ అలలమీద అలిసిపోయిన సీజర్ ను నేను మోసి బయటపడేశాను.

అతడు ఈ నాడు మనకో దేవుడై కూర్చున్నాడు. కాషియస్ ఒక అల్పప్రాణి! అలక్ష్యంతో సీజర్ తల పంకిస్తుంటే నేను వినమ్రభావంతో శరీరాన్ని వంచవలసి వచ్చింది.

స్పెయిన్ లొ ఉండగా అతడికోమారు సుస్తీ చేసింది. దాని తీవ్రతలో అతడెలా వణికిపోయాడో నేను కళ్ళార చూచాను. ఈ నాటి దేవుడు ఆ నాడు గజగజలాడాడు. ఇది సత్యం. అతడి పెదవుల రంగు అదృశ్యమైపోయింది. సమస్తప్రపంచానికీ భయోత్పాతాన్ని కలిగిస్తున్న ఆ కన్నులు తమ కాంతిని కోల్పోయాయి. గాద్గద్యంతో కంపించిపోయిన ఆ నాటి అతని కంఠాన్ని నేను విన్నాను. తన ఆజ్ఞాపనలన్నింటినీ రోమకపౌరులు అధికాసక్తితో వినేటట్లు చేస్తూ, తానిచ్చే ఉపన్యాసాలను వారిచేత కంఠంస్థం చేయిస్తూ ఉన్న ఆ నాలుక, అప్పుడు, అయ్యో, జబ్బుపడ్డ ఒక ఆడపిల్లలా, 'టిటినియస్!' ఏదైనా పానీయాన్నివ్వు!' అని దీనంగా అర్థించింది. నాకెంతో ఆశ్చర్యం వేస్తున్నది. ఓ దేవతలారా! ఆ దుర్బలుడే ఈ నాడు ప్రపంచాగ్రగామియై ఎక్కటివీరుడైనాడు.

(కోలాహలమూ, కరతాళ ధ్వనులూ చెలరేగి వినిపిస్తవి)

బ్రూటస్  : మరో కోలాహలం! ఈ కరతాళధ్వనులుకు సీజర్ కు అబ్బిన నూతన గౌరవ చిహ్నాలని నానమ్మకం.

కాషియస్ : ఎందుకయ్యా! అతడీ క్షుద్రప్రపంచం మీద కోలోసస్"లాగా నిలుచుంటే అల్పప్రాణులమైన మనమంతా అతడి వరిష్ఠ పాదాల క్రిందుగా నడుస్తాం అంతే కాదు. గౌరవ రహితాలైన మన శ్మశానశిబిరా లెక్కడున్నవా అని వెదకటం కోసం వంగి వంగి ప్రాకిపోతాము.

కొన్ని సందర్భాలలో మానవులు తమ అదృష్టాలకు తామే అధికారులౌ తుంటారు. నెచ్చెలీ, బ్రూటస్ ! ఈ దోషం మన నక్షత్రాలది కాదు. మనదే. మనం అల్పులం.

బ్రూటస్! సీజర్!! ఆ 'సీజర్' అన్న నామంలో విశేషం ఏముంది కనక? అది మీ నామంకంటే ఎందుకు అధికంగా ఉచ్చరింపబడాలి? రెంటినీ జతచేసి వ్రాసిచూడండి. ఆ పేరెంత మధురమైందో మీదీ అంతే మధురమైంది. ఉచ్చారణ సౌలభ్యం దానికున్నట్లు దీనికీ ఉంది. తూచండి రెంటిభారం సమానమే. ఏదీ ఒకమారు రెంటినీ అభిమంత్రణం చేసి చూడండి. సీజర్ నామం ఎంత వేగంగా ఒక శక్తిని ఉద్భవింపజేయ గలుగుతుందో, బ్రూటస్ నామం కూడా అంత వేగంగానే ఒక శక్తిని ఉద్భవింపజేయగలుగుతుంది. సర్వదేవతల నామోచ్చారణం చేసి ఒకటి నేనడుగుతున్నాను : ఏం భుజించటం వల్ల సీజర్ ఇంత ఘనుడైనాడు?

కాలమా? నీవు అవమానిత వైనావు. రోము మహానగరమా! నీవు మహోదాత్తులకు జన్మభూమివి కావటం మానివేశావు. మహాప్రళయానంతరం" నుంచి ఏ యుగం అనేక ఘనులు జన్మించిన ఖ్యాతిని పొందకుండా గడచిపోయింది. రోము నగరం గర్వించదగ్గ పుత్రుడీతడొక్కడే అని ఒక వ్యక్తిని గురించి, ఎన్నడైనా దాని ఘనకీర్తిని శ్లాఘించేవారు చెప్పుకున్నారా? ఈ నాడు ఒకే ఒక వ్యక్తికి తప్ప తాను తావీయకుండా అతి విచిత్రమైనదైపోయింది రోము.

ఈ రోమును ఒకడు రాజై పాలించేదానికంటే ఒక పెనుభూతం ఇందులో విశృంఖలవిహారం చేసినా సహిస్తానని, పూర్వం ఒకానొకప్పుడు12 ఒక బ్రూటస్ పలికి తదనుగుణంగా ప్రవర్తించినట్లు పెద్దలు చెప్పుకుంటే మీరూ, నేనూ కథగా వినలేదూ? బ్రూటస్  : నీకు నా యెడ అనురాగం అపారం. ఇందులో అణుమాత్రమైనా నాకే అనుమానం లేదు. ఏమీ చేయవలసిందని నీవు నన్ను ప్రేరేపిస్తున్నావో, కాషియస్, అది నాకు కొంతకొంతగా బోధపడుతున్నది. ఈ విషయాన్ని గురించీ, ప్రస్తుత కాలగమనాన్ని గురించీ పూర్వం నేనేమేమి తలపోశానో నీకు తర్వాత తెలియజేస్తాను. నిన్ను ప్రేమ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. దాన్ని ఇప్పుడే వెల్లడించ వలసిందని కోరకు. నీవు సూచించటానికి యత్నించిన నా కర్తవ్యాన్ని గురించి నేను వివేచిస్తాను. ఇంకా నీవేమైనా వినిపించదలచుకుంటే ఓపికతో వింటాను. ఇటువంటి ప్రధానవిషయాలను వినటానికీ, సమాధానాలు చెప్పటానికీ తగ్గసమయాన్ని ఏర్పాటు చేస్తాను. అంతవరకూ ఓ నా పరమమిత్రుడా! ఈ విషయాన్ని గురించి యోచన చేస్తూ ఉండు. కాలం తెచ్చిపెట్టిన ఈ కఠినస్థితిని భరిస్తూ రోము నగరపుత్రుడనే ఖ్యాతిని వహించటం కంటే ఈ బ్రూటస్ పల్లీయుడని అనిపించుకోవటానికైనా ఇష్టపడతాడు.

కాషియస్  : సంతోషం! శక్తిహీనాలైన నా మాటలు బ్రూటస్ మహాశయుని ముఖంనుంచి ఇంతటి అగ్నిజ్వాలలను వెలికిచిమ్మించ గలిగినందుకు సంతోషం.

బ్రూటస్  : క్రీడలన్నీ ఐపోయినట్లున్నయ్. సీజర్ తిరిగి వచ్చేస్తున్నాడు.

కాషియస్  : వారీమార్గాన వెళ్ళేటప్పుడు కాస్కాను టోగా కొనపట్టి పిలవండి. మనం గమనించవలసిన విశేషాలు ఈ నాడు అక్కడ ఏమి జరిగాయో దాపరికం లేకుండా చెప్పేస్తాడు.

(సీజర్, అతని పరివారం తిరిగి ప్రవేశిస్తారు.)

బ్రూటస్ : అలాగే చేస్తాను. గమనించు, కాషియస్! సీజర్ ముఖం మీద ఏవో కోపరేఖలు కనిపిస్తున్నట్లున్నాయి? మిగిలిన పరివారమంతా గట్టిగా తిట్లు తిన్నట్లున్నారు? కల్పూర్నియా చుబుకం పాలిపోయినట్లు తోచటం లేదూ? సభాభవనంలో సభ్యులు తన్ను వ్యతిరేకించినప్పుడు కనిపించే ధోరణిలో సిసిరో రక్తారుణనేత్రాలతో ద్యోతకమౌతున్నాడు కదూ?

కాషియస్  : కాస్కా వచ్చి విశేషమేమి జరిగిందో వినిపిస్తాడుగా.

సీజర్  : ఆంటోనియస్!

ఆంటోని  : సీజర్! సీజర్  : నాకు అంగరక్షకులుగా బలిష్ఠులను, రాత్రులు గాఢనిద్రను పొందేవారిని కాపుంచు, అడుగో, దూరంగా బక్కపలచని ఆకలికళ్ళతో చూస్తున్నాడు కాషియస్. అతడెప్పుడూ అతిగా ఆలోచిస్తుంటాడు. అటువంటి వారివల్ల అధిక ప్రమాదం.

ఆంటోనీ  : అతడంటే భయపడకండి సీజర్! అతడివల్ల ప్రమాదమేమీ ఉండదు. అతడు మహోదారుడైన రోము పౌరుడు. అత్యుత్తముడు.

సీజర్  : ఇంతకంటే అతడు " బలిసి ఉంటే నేను భయపడేవాణ్ణి కాను. కానీ నేను అతడంటే జంకటం లేదు. అయితే భయం వల్ల సీజర్ ఎవరికైనా తొలగి ఉండటమంటూ సంభవిస్తే అతడు ఆ పలచని కాషియస్ మాత్రమే. అతడు అతితీక్షంగా గమనిస్తుంటాడు. వ్యక్తులు చేసే బాహ్యకృత్యాలను బట్టి అతడు వారి అంతస్సుల్లోని అభిప్రాయాలను దర్శిస్తుంటాడు. నీవలె అతడికి ఆటలంటే అభిలాష లేదు. సంగీతమంటే ఆసక్తి అంతకంటే లేదు. ఎప్పుడోగాని చిరు నవ్వెరగడు. అదైనా నవ్వటమనే తన బలహీనతను గురించి అసహ్యించుకున్నట్లుంది. తమకంటే అధికులైనవారిని చూస్తే అటువంటివారు హృదయశాంతి వహించలేరు. అందువల్ల వారు చాలా ప్రమాదకారులు. నేనెప్పుడూ భయరహితుడైన సీజర్. కానీ నేను భయపడే దానికంటే భయపడవలసిందేమిటో నీకు తెలియజేస్తున్నాను.

ఈ నా చెవికి చెవుడు కదూ, ఇలా కుడివైపుకు రా. అతణ్ణి గురించి నీ వేమనుకుంటున్నావో నాకు సత్యం చెప్పు.

తుత్తారధ్వని వినిపిస్తుంది. సీజర్, కాస్కా తప్ప మిగిలిన పరివారమంతటితో, నిష్క్రమిస్తాడు.

కాస్కా : నా టోగాను పట్టిలాగి నన్ను పిలిచారు. నాతో మాట్లాడదలిచారా?

బ్రూటస్  : కాస్కా! సీజర్ అంతగా చింతాక్రాంతుడై ఉన్నాడు. ఏం జరిగిందేమిటి?

కాస్కా : అదేమిటి? మీరూ ఆయన వెంటనే ఉన్నారుగా? లేరూ?

బ్రూటస్ : ఉంటే ఏం జరిగిందని నేను అడుగనే అడుగను.

కాస్కా: ఏముంది, అతడికి రాజకిరీటాన్ని సమర్పించారు. అతడు తన హస్తకరభంతో ఇలా వెనక్కు నెట్టాడు. అప్పుడు ప్రజలు కరతాళధ్వనులతో ముంచెత్తారు.

బ్రూటస్  : మరి రెండో కోలాహలం ఎందుకు జరిగింది? కాస్కా: ఎందుకా? అదీ అందుకే.

కాషియస్  : వాళ్ళు ముమ్మారు కరతాళధ్వని చేశారు. చివరిసారి ధ్వనులు ఎందుకో?

కాస్కా : అవీ అందుకే.

బ్రూటస్  : అయితే అతనికి కిరీటాన్ని ముమ్మారు సమర్పించారా?

కాస్కా : అవును, ముమ్మారు సమర్పించారు. ఒకమారుకంటే మరొకమారు మరింత నింపాదిగా దాన్ని అతడు అవతల పెట్టాడు. దాన్ని స్వీకరించటానికి అతడు తిరస్కరించినప్పుడల్లా ప్రజలు కరతాళధ్వనులు చేశారు.

కాషియస్ : అతడికి కిరీటాన్ని ఎవరు సమర్పించారు?

కాస్కా : అలా అడుగుతున్నావేమిటి? ఆంటోనీ!

బ్రూటస్ : సౌమ్యుడా, కాస్కా! అదంతా ఎలా జరిగిందో మాకు తెలియజేయ్.

కాస్కా : అది ఎలా జరిగిందో చెప్పటమంటే ఉరి వేయించుకోటమన్నమాట! అదంతా నేను బాగా గమనించలేదు. అది ఒక విచిత్ర నాటకం. అతడికి మార్కు ఆంటోనీ కిరీటాన్ని అర్పించటం మాత్రం చూచాను. అయినా అది రాజకిరీటం కూడా కాదు. కేవలం 'పత్రికిరీటం'. మీకు పూర్వం చెప్పినట్లుగా అర్పించిన కిరీటాన్ని ఆయన అవతల పెట్టాడు. కానీ అతడు చాలాసంతోషంతో దాన్ని స్వీకరించేవాడని నా అభిప్రాయం. ఆంటోనీ మళ్ళీ దాన్ని అర్పించాడు. అతడు మళ్లీ అవతల పెట్టాడు. మళ్లీ అవతల పెట్టేటప్పుడు అతడి వ్రేళ్ళలో లోభం కనిపించింది. అప్పుడు ఆంటోనీ మూడో మారు సమర్పించాడు. మూడోమారు కూడా అతడు అవతల పెట్టాడు. అప్పుడు ప్రజానీకం పొంగులువారి కరతాళ ధ్వనులు చేశారు. వారి చేతులు బీటలువారి పోయినాయి. వారు చెమటతో తడిసిన రేకుళాయిలు విసిరారు. సీజర్ కిరీటాన్ని తిరస్కరించాడని అతడు మూర్ఛలో మునిగిపోయేటంతగా గవులు నిట్టూర్పులు విడిచారు. అతడు అంతటితో మూర్ఛిల్లి క్రిందపడ్డాడు. పెదవులు తెరిస్తే దుర్గంధం ఎక్కడ ప్రవేశిస్తుందో అన్న భయంతో నేనుమాత్రం నవ్వటం కూడా మానేశాను.

కాషియస్ : నెమ్మదిగా మాట్లాడు. నిన్ను ప్రార్థిస్తున్నా! ఏమిటి, సీజర్ మూర్ఛపోయాడా?

కాస్కా : అవును. విపణి ప్రదేశంలో పడిపోయి నురగలు కక్కుకున్నాడు. నోట మాట రాలేదు. బ్రూటస్ : కావచ్చు. అతడికి మూర్ఛలవ్యాధి ఉంది.

కాషియస్: పొరబాటు. ఈ వ్యాధి అతనికి లేదు. మీకు, నాకు, సత్యప్రియుడైన కాస్కాకు ఈ మూర్ఛలవ్యాధి ఉంది.

కాస్కా : అంటే నీ అభిప్రాయమేమిటో నాకేమీ అర్థం కావటం లేదు. కానీ ఇదిమాత్రం సత్యం. సీజర్ పడిపోయినాడు. రంగస్థలంమీద నటకులు తమకు సంతృప్తినీ, అసంతృప్తినీ కలిగించినప్పుడు జనం కరతాళధ్వనులు చేయటం గేలిచేయటం చేసినట్లు సీజర్ ఎడ ప్రజానీకం ప్రవర్తించారని నేను చెప్పింది జరక్కపోయినట్లయితే, నేను సత్యసంధుణ్ణి కాదు.

బ్రూటస్ : స్మృతి వచ్చిన తరువాత అతడేమన్నాడు?

కాస్కా : మూర్ఛపోబొయ్యేముందు అతడు కిరీటాన్ని పలుమారు తిరస్కరిస్తున్నప్పుడు ప్రజానీకం తమ ఆనందాన్ని ప్రకటిస్తుంటే, ప్రచ్ఛదాన్ని విప్పమని నన్ను ఆజ్ఞాపించి, వారికి ఉత్తరించటం కోసం కుత్తికను అందించాడు సుమా! ఆ సామాన్య జనంలో నేనూ ఒక కర్మకారుడి నైనట్లయితే అతడి కోరిక సత్యమైందను కోని, అతడి కంఠాన్ని ఉత్తరించకపోతే తులువలతో పాటు నరకానికి వెళ్ళేవాణ్ణి.

అతడు మూర్ఛపోయినాడు. తిరిగి స్మృతి వచ్చిన తరువాత తానేమైనా పొరబాట్లు చేసినా, చేయరాని ప్రసంగాలు చేసినా అవి తన అస్వస్థతల వల్ల జరిగినట్లు భావించవలసిందని ప్రజను ప్రార్థించాడు. నేను నిలుచున్నచోట ముగ్గురు నలుగురు దాసీముండలు 'పాపం! ఉత్తమాత్మ' అని అతణ్ణి పొగిడి హృదయపూర్వకంగా క్షమించారు. కూడాను. కానీ వాళ్ళేమిటి? సీజర్ ఆ ప్రజానీకంలోని అందరి తల్లులనూ పొడిచి చంపినా అలాగే ప్రవర్తించేవాళ్లు వాళ్ళు.

బ్రూటస్ : అయితే అతడు తరువాత అలాగే చింతాక్రాంతుడై వచ్చేశాడా?

కాస్కా : అవును.

కాషియస్ : సిసెరో ఏమీ మాట్లాడలేదా?

కాస్కా : లేకేం, ఏదో మాట్లాడాడు, గ్రీకుభాష. అది నాకు15 గ్రీకుగానే ఉంది.

కాషియస్ : దానివల్ల ఏం ప్రయోజనం?

కాస్కా : అది నాకర్థమైందని అబద్ధమాడను ముందు నీ ముఖం చూడకుండా ఉండిపోలేను. అయితే అతడు మాట్లాడిందేమిటో అర్థం చేసుకున్న వాళ్ళు ఒకరిముఖం 48వావిలాల సోమయాజులు సాహిత్యం-3 ఒకరు చూసుకొని నవ్వుకున్నారు తలలు పంకించారు. అయితే అది నాకు మాత్రం గ్రీకుభాషగానే ఉండిపోయింది. ఇంతకంటే విశేషాలు మీకు నేనేం చెప్పగలను? సీజర్ విగ్రహాలమీద అలంకరణాలను ఒలిచి వేసినందుకు మరులియస్, ప్లేవియస్ లకు ఉద్యోగాల్లో నుంచి ఉద్వాసన చెప్పారు. వెధవ జ్ఞాపకశక్తి, నాకు లేదు! ఉంటేనా అక్కడ జరిగిన నాటకాన్ని గురించి మీకు ఇంకా ఎంతో చెప్పేవాణ్ణి.

'కాషియశ్ : కాస్కా! ఇవాళ రాత్రికి నీ భోజనం మా ఇంట్లో.

కాస్కా : వీల్లేదు. ఇదివరకే మరొకరికి మాటిచ్చాను.

'కాషియశ్ : అయితే, మరి, రేపు నీవు నాతో కలిసి భోంచేస్తావా?

కాస్కా : తప్పకుండా - నేను బ్రతికి ఉంటే, నీ మనస్సు మారకపోతే, పైపెచ్చు నీ విచ్చేవిందు పుచ్చుకోదగ్గదైతే.

'కాషియశ్ : మంచిది. నీ కోసం రేపు ఎదురు చూస్తుంటాను.

కాస్కా : సరే. మీ ఇద్దరికీ శుభం!

(నిష్క్రమిస్తాడు)

బ్రూటస్ : వీడెంత బండగా తయారైనాడు! పాఠశాలకు వెళ్ళే దినాల్లో చాలా చురుకైనవాడు.

కాషియస్ : రూపంలో ఇప్పుడు బండగా కనిపించినా, సాహసంలో గానీ లేదా ఉదాత్త కార్యకరణంలోగానీ వీడు ఈనాడూ అంతటి చురుకైనవాడే. ఈ బండతనం వీడి హాస్యాన్ని జీర్ణం చేసుకోను అవసరమైన వ్యంజనంగా పని చేస్తుంటుంది.

బ్రూటస్ : ఔను నిజమే. నీవు రేపు నాతో మాట్లాడదలచుకుంటే మీ ఇంటికి వస్తాను. లేదా నీకు ఇష్టమైతే మా ఇంటికి రా. నీకోసమే వేచి ఉంటాను.

కాషియస్ : తప్పక వస్తాను. అందాకా ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉండండి.

(బ్రూటస్ నిష్క్రమిస్తాడు)

బాగుంది. బ్రూటస్! నీవు అత్యున్నతుడవు. నీ ఉన్నతస్వభావ ధాతువును, అతిమెత్తని లోహంలా, ఇష్టం వచ్చినట్లు తీర్చిదిద్దుకోటానికి వీలున్నట్లు కనిపిస్తున్నది. ఎప్పుడూ ఉత్తములు ఉత్తములతో సాంగత్యం చేయటం మంచిది. ఎందువల్లనంటే : మలినం కానంతటి దారఢ్యాం ఎవరికుంది? సీజర్ కు నేనంటే అసహ్యం. కానీ బ్రూటస్ ను ప్రేమిస్తాడు. ఇటువంటి స్థితిలో నేనే బ్రూటస్ నై బ్రూటస్ కాషియస్ ఐతే అతడు నన్ను ప్రభావితం చేయటానికి యత్నించనే కూడదు.

నేను ఈ రాత్రే అనేక సహస్ర పౌరుల దగ్గరనుంచీ వచ్చినట్లుగా భిన్నహస్తాక్షరాలతో బ్రూటస్ వాతాయనం గుండా అతని ఇంట్లోకి లేఖలు పడవేయిస్తాను. వాటిలో లీలగా సీజర్ దురాశ ద్యోతక మయ్యేటట్లూ, రోము మహానగరమంతా, బ్రూటస్ మీదనే ఎంతటి గౌరవాన్ని నిలిపిందో తెలిపేటట్లు లిఖిస్తాను. ఆ తరువాత సీజర్ భద్రంగా కూర్చోగలుగుతాడో! లేక అతణ్ణి పెకలిస్తున్నాం గనక దుర్దినాలను అనుభవిస్తాడో!!

(నిష్క్రమిస్తాడు)

మూడో దృశ్యం

ఒకవీథి. ఉరుములు, మెరుపులు. ఒరనుండి దూసిన కత్తితో కాస్కా, సిసెరో ఎదురుమళ్ళగా ప్రవేశిస్తారు.

సిసెరో : సుసాయంతనం కాస్కా! సీజర్ను ఇంటికి తీసుకోవచ్చావా? అదేమిటి, అలా నిట్టూరుస్తున్నావు? ఎగాదిగా అలా చూస్తున్నావేమిటి?

కాస్కా : అస్థిరవస్తువులా భూమండలమంతా ఇలా కదలిపోతుంటే, నీవేం చలించటం లేదా? సిసెరో! తిట్టిపోస్తూ పెనుగాలులు మెలితిరిగిన ఓకు వృక్షాలను చీల్చే పెనుతుపానులను ఎన్నింటినో చూచాను. భయభ్రాంతిని కల్పించగల వారివాహాలతో తుల్యమైన ఔన్నత్యాన్ని పొందటం కోసం, సముద్రం ఉవ్వెత్తుగా ఉప్పొంగి క్రోధంతో నురగలు గ్రక్కుతూ ఉండడం చూచాను. అయితే, ఈ నాటి రాత్రి వరకూ, ఇంతవరకూ, అగ్నిపుంజాలను వర్షించే తుపానులను నే నెక్కడా చూడలేదు. స్వర్గంలో ఏదో అంతర్యుద్ధం వచ్చి ఉంటుంది. లేదా ప్రపంచం దేవతల యెడ అపచారం చేసి ప్రచండ ప్రళయాన్ని పంపించేటంతటి క్రోధాన్నైనా కల్పించి ఉంటుంది.

సిసెరో : ఎందువల్ల? ఆశ్చర్యకరాలైన విశేషాలేమైనా చూశావా?

కాస్కా : ఒక సామాన్యబానిస, చూస్తే నీవు అతణ్ణి వెంటనే గుర్తుపట్టగలవు కూడా. ఇరవై కాగడాలు జోడించినట్లు వెలుగుతున్న అతని వామహస్తాన్ని చూచాడు అతడికి అగ్నిభయం ఉన్నట్లు అణుమాత్రం కనుపించలేదు. అంతేకాదు. అప్పుడు దూసిన నా కత్తిని మళ్లీ ఒరలో నిలుపలేదు. సభాభవనానికి ఎదర నేనో సింహాన్ని కలుసుకున్నాను. అది నన్ను తేరిపారచూచి, కళవళ పెట్టకుండానే హఠాత్తుగా అదృశ్యమైంది. ఆ దృశ్యాన్ని చూచిన నూరుమంది స్త్రీలు కుప్పకూలారు. వారు వీథుల్లో కణకణలాడే నిప్పుల మీద అటూ ఇటూ ముందువెనకలకు బహుపర్యాయాలు పచార్లు చేసిన పురుషులను చూచారట! ప్రమాణం చేసి చెప్పారు. దివాంధ మొకటి నిన్నటి మధ్యందినాన్నే విపణిలో వింతగా అరుస్తూ కూతలు పెట్టింది. ఇన్ని అపశకునాలు ఒక్కమాటుగా సంభవించాయి. అయినా సామాన్యులు 'ఇవి వాటి లక్షణాలు, వాటి స్వభావం' అని అంటారేమో! అనకూడదు. ఇవన్నీ వాటి లక్ష్యమైన ఒక స్థితికి భవిష్యత్సూచ కాలని నా నమ్మకం.

సిసెరో : నిజంగా అంతే. ఇది చాలా విచిత్రమైన కాలంగా ఉంది. అయితే కలిగిన ఈ విషయాలన్నింటిని ఈ దృష్ట్యా కాకుండా, జనం వారి వారి బుద్ధిబలాన్ని అనుసరించి భావిస్తుంటారు. సీజర్ రేపు సభాభవనానికి వస్తున్నాడా?

కాస్కా : తప్పక వస్తాడు. ఈ విషయం నీకు తెలియజేయవలసిందిగా ఆంటోనియోను ఆజ్ఞాపించాడు కూడాను.

సిసెరో : అయితే కాస్కా! శుభం. శాంతిరహితమైన ఈ వాతావరణం ఎంతమాత్రం తిరగదగ్గదిగా కన్పించటం లేదు.

కాస్కా : సిసెరో! శుభమగుకాక!

(సిసెరో నిష్క్రమిస్తాడు కాషియస్ ప్రవేశిస్తాడు)

కాషియస్: ఎవరక్కడ?

కాస్కా : ఒక రోము నగర పౌరుడు.

కాషియస్ : గొంతుకనుబట్టి ఊహిస్తున్నా. అది కాస్కా ఏనా?

కాస్కా : నీవి మిక్కిలి చక్కని చెవులు. కాషియస్! ఇదేమి రాత్రోయ్.

కాషియస్ : సత్యప్రియులైనవారికి ఇది చాలా ఆనందదాయకమైన రాత్రి.

కాస్కా : స్వర్గం ఇంతగా కోపించగలదని పూర్వం ఎవరన్నా ఊహించారా?

కాషియస్ : ఈ భూమి దోషభూయిష్ఠమై పోయిందని గమనించినవాళ్ళు ఊహించారు. నా మటుకు నేను, ఇలాగే, ఇప్పుడు నీవు చూస్తున్నట్లు, మైమరువు లేకుండా రొమ్మును పడే పిడుగులకు ఒప్పజెప్పి, ఈ భయంకరకాళరాత్రిలో వీధుల వెంట విశృంఖలంగా విహరించాను. ఒకానొక శంప తన శాఖాధ్వయంతో నీలాతినీలమై అనుకంపారహితంగా ఆకాశగర్భాన్ని చీలుస్తున్నప్పుడు నేను దాని లక్ష్యసీమలో నిలిచాను. దాని కాంతిలో నిలిచాను.

కాస్కా: తమ బలాధిక్యాన్ని చూపి మానవులమైన మనను ఆశ్చర్యమగ్నులను చేయటానికి దేవతలు తమ భయంకర ప్రతినిధులను పంపిస్తున్నారు. జనానీకం భయోద్వేగంతో వణికిపోతున్నదే, నీవు ఇంతగా ఎందుకా దేవతలను తిరస్కరించి తిరిగావు కాషియస్!

కాషియస్ : కాస్కా! నీవు వట్టి మందబుద్ధివి. రోమునగర నివాసిలో ఉండవలసిన జీవితాగ్ని కణాలు నీలో లేవో, ఉన్నా అవి ప్రజ్వరిల్లటం లేదో. ఉంటే దేవతల కోపోద్రేకాన్ని చూచి ఇలా పాలిపోయి ఎగాదిగా చూస్తూ భయభ్రాంతుడివీ, ఆశ్చర్యమగ్నుడివీ కావు. ఈ మహాగ్ని పాతాలెందుకో, ఈ భూతాకృతుల విహారాలెందుకో, వృద్ధులు ఉన్మత్తులుగానూ, బాలురు విజ్ఞానులు గానూ ప్రవర్తించట మెందుకో ఇలా సర్వసత్వాలూ సహజగుణాలకు భిన్నంగా, ఉద్దిష్టాలకు విరుద్ధంగా రాక్షసప్రవృత్తిని ధరించట మెందుకో మూలకారణాన్ని అన్వేషించదలచకుంటే స్వర్గం భూలోకంలో ఒక తామసికసృష్టిని కల్పించదలచుకోని ఇట్టి శక్తులిచ్చి భయసూచనసాధనాలుగా ఉపయోగించటానికి ఉద్దేశించినట్లు అర్థమౌతుంది. అతడు కార్యాచరణదక్షతలో నీకంటే లేదా నాకంటే శక్తిమంతుడు కాకపోయినా, ఈ నాటి భయంకరకాళరాత్రిలా ఉరుముతూ, మెరుస్తూ, సమాధులు తెరుస్తూ, సభాభవనమందు గర్జిస్తూ కన్పించిన సింహం లాగానూ, ఈ మహోత్పాతాలలాగాను భయంకరుడై మహాభూతరూపంలో పెరిగిపోయి ఉన్న ఒక వ్యక్తి పేరు చెపుతాను.

కాస్కా : అది 'సీజర్' అనేనా నీ అభిప్రాయం? అంతేనా కాషియస్?

కాషియస్ : అది ఎవరైతేనేం! మన పూర్వులకున్నట్లే ఈ నాటి రోము వాసుల మైన మనకూ కండరాలు, అవయవాలున్నాయి. అయ్యో! ఎంత చెడుకాలం దాపురించింది. మనలో మన పితృపితామహుల" మనఃప్రవృత్తి మరణించింది. మాతృదేవతాశక్తులు మనలను పాలిస్తున్నవి. మనమెడమీది కాడి, బాధాసహనశీలం, మన స్త్రీత్వాన్నే వెల్లడిస్తున్నవి. కాస్కా : సభాసభ్యులు రేపు సీజర్ ను రాజును చేస్తారని వారంటున్నారు. ఇది నిజం. ఇటలీలో తప్ప అతడు సముద్రాలమీదా, భూమిమీదా కిరీటాన్ని ధరించి తిరుగుతాడట!

'కాషియశ్ : అయితే ఈ ఛురికను నిలపటానికి స్థానమేదో నాకు తెలుసు. కాషియస్ బానిసత్వంలోంచి కాషియస్ ను ఉద్ధరించుకోగలడు. ఓ దేవతల్లారా! ఈ యత్నంలో దుర్బలులను బలశాలులనుగా తీర్చిదిద్దండి. క్రూరపాలకులకు అపజయాన్ని కల్పించండి. రాతిబురుజులు, కంచుగోడలు, గాలిచొరని చీకటికొట్లు, ఇనుపసంకెళ్లు, ఉత్సాహబలాన్ని బంధించలేవు. అయినా, జీవితం ప్రాపంచిక బంధనాల వల్ల అలసిపోయినా, తన్ను తాను విడిపించుకోలేనంతటి అబల కాదు. ఈ అంశాన్ని తెలుసుకుంటున్నాను. అవగతమైన తత్క్షణమే నేడు నేను భరిస్తున్న క్రూరపాలనను స్వేచ్ఛానుసారంగా తొలగద్రోసుకోగలనని ప్రపంచానికి ప్రకటిస్తాను.

కాస్కా : నేనూ అంతే. ఇదే రీతిగా ప్రతి బానిసకూ తన బానిసత్వాన్ని రద్దు చేసుకొనే శక్తి హస్తగతమై ఉంది.

'కాషియశ్ : అయితే సీజర్ ఎందుకు క్రూరపాలకుడుగా ఉంటున్నాడు? వెర్రివాడు! అతడు తోడేలు కాదని నాకు తెలుసు కానీ రోము ప్రజలను అతడు గొర్రెలనుగా చూస్తున్నాడు. రోము ప్రజలు వేటకుక్కలు కాకపోతే అతడు సింహమెలా కాగలుగుతాడు? మహాగ్నిని జ్వలింపజేయ దలచుకున్నవారు ఎండుగడ్డి పోచలతో ఆ పనిని ఆరంభిస్తారు. సీజర్ వంటి క్రూరుడికి ఖ్యాతి కల్పించి ప్రకాశింప జేయదలచుకొని రోము ఎంత నికృష్టమైపోయింది! ఎంతటి నింద్యపదార్థ మైపోయింది!!

ఓ దుఃఖదేవతా! నీవు నన్నెక్కడికి నడిపిస్తున్నావో! నేను ఇదంతా ఇచ్ఛాపూర్వకంగా బానిసనైపోయినవాడి ముందు చెప్పాననుకుంటాను. అవసరమైతే తగ్గ సమాధానం చెప్పటానికి నేను సంసిద్ధుడనై ఉండాలి. అందుకే ఆయుధధారణం చేశాను. రాబొయ్యే ఆపదలతో నాకెట్టి ప్రమేయం లేదు.

కాస్కా : కాషియస్! మాటలు మోయటం అలవాటు కాని కాస్కాతోటే నీవు ప్రసంగించావు. మన దుఃఖాన్ని పటాపంచలు చేయటానికి ఒక పక్షాన్ని స్థాపించు. నేను సుదూరం నడిచే అగ్రగామిని, తుదిదాకా అనుసరిస్తాను. ఇదిగో ప్రతిజ్ఞ చేస్తున్నాను.

కాషియస్ : ఇందుకు నాకు అంగీకారమే. కాస్కా, ఒక రహస్యం చెపుతున్నాను. గమనించు. గౌరవప్రదమూ, భయోపేతమూ అయిన ఒకానొక సాహసకృత్యానికి నాకు తోడ్పాటు ఇవ్వవలసిందని ఇంతకు కొంతపూర్వమే కొందరు ఉదాత్తప్రకృతి గల రోము నివాసులను కదిలించాను. వారు నా కోసం పాంపే ద్వారతోరణం దగ్గర వేచి ఉంటారు. ఈ భయంకర రాత్రి వీథుల్లో సంచలనం గాని, సంచారముగాని లేదు. మేము తలపెట్టిన పనిలో రక్తోపేతమై భయానకంగా ఉంది భౌతికస్థితి.

కాస్కా : ఎవరో అతివేగంగా ఒక వ్యక్తి ఇటు వస్తున్నాడు. దగ్గిరగా నిలు.

కాషియస్  : నడకనుబట్టే తెలుస్తున్నది. అది సిన్నా, మన మిత్రుడు.

(సిన్నా ప్రవేశిస్తాడు)

సిన్నా! ఎక్కడికి అంత వేగంగా వెళ్ళుతున్నావు?

సిన్నా : మీరెక్కడ ఉన్నారో తెలుసుకుందామనే. ఎవరిది? మెటిల్లస్ సింబర్?

కాషియస్  : కాదు, కాస్కా, మన యత్నాలలో ఒక సహచరుడు. సిన్నా! వాళ్ళందరూ నాకోసం వేచి ఉంటారనుకుంటాను.

సిన్నా : ఈ నాడు నాకెంతో సంతోషంగా ఉంది. అబ్బా! ఎంత భయంకరమైన రాత్రి! మాలో ఇద్దరు ముగ్గురం అతివిచిత్రమైన దృశ్యాలు చూచాం.

కాషియస్  : చెప్పు. వాళ్ళు నా కోసం వేచి ఉండలేదూ?

సిన్నా : అవును. నీవు మహోదాత్తుడైన బ్రూటస్ ను మన పక్షానికి చేర్చటంలో విజయాన్ని పొందితే.

కాషియస్  : తృప్తివహించు. సిన్నా! ఇవిగో ఈ పత్రాలందుకో. చూడు. బ్రూటస్ కు తప్ప ఇతరులెవ్వరికీ కనిపించని రీతిగా దీన్ని ఆ న్యాయాధికారి ఆసనం మీద ఉంచు. దీన్ని అతని వాతాయనం ద్వారా లోపల పడవెయ్యి. దీన్ని వృద్ధ బ్రూటస్ ప్రతిమీద మైనంతో అంటించారా. ఈ పని ముగించుకొని పాంపే ద్వారతోరణం దగ్గరికి తిరిగిరా. అక్కడ మేమందరం ఉంటాము. డెసియస్ బ్రూటస్, ట్రెబోనియస్ అక్కడ ఉన్నారా?

సిన్నా : మెటిల్లస్ సింబర్ తప్ప అందరూ ఉన్నారు. అతడు నీ కోసం మీ ఇంటికి వెళ్ళాడు. సరే. నేను పరుగుల మీద ఈ పత్రాలను నీవు ఆజ్ఞాపించినట్లు చేస్తాను.

కాషియస్  : పాంపే నాట్యశాలకు రావటం మరిచిపొయ్యేవు.

(సిన్నా నిష్క్రమిస్తాడు)

కాస్కా! నాతో రా. నీవూ, నేనూ బ్రూటస్ ను అతడి ఇంటిదగ్గర కలుసుకుందాం. అతడు ఇప్పటికే మూడుపాళ్ళు మనవాడు. మళ్ళీ మనం కలుసుకుంటే పూర్తిగా మనవాడౌతాడు.

కాస్కా : అతడు సమస్త ప్రజాహృదయాలల్లో మహోన్నతపీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తి. అతడి తోడ్పాటు ఘనమైన రసాయనమై మన దోషాలుగా కనిపించేవాటిని అన్నింటినీ గుణాలుగా, సుగుణాలుగా పరివర్తన చేస్తుంది.

కాషియస్ : బలే. అతణీ, అతడి శక్తినీ, మనకు అతడి అవశ్యకతనూ చాలా జాగ్రత్తగా గమనించావు! అర్ధరాత్రి గడిచింది. ఇక మనం వెడదాం. తెల్లవారక ముందే అతణ్ణి మేల్కొల్పి గట్టి చేసుకుందాం.

(ఇరువురూ నిష్క్రమిస్తారు)

'ద్వితీయాంకం '

'ఒకటో దృశ్యం '

బ్రూటస్ ఫలోద్యానవనం, బ్రూటస్ ప్రవేశిస్తాడు.

బ్రూటస్  : ఏమిటి! లూషియస్! మేల్కో, నక్షత్ర గమనాన్ని బట్టి ఉదయానికి ఇంకా ఎంత ప్రొద్దు ఉందో లెక్కించలేకుండా ఉన్నాను. లూషియస్! నిజం చెప్పనా? ఇంత గాఢంగా నిద్రపోవటంతో నేనెంతో దోషం చేసినట్లు భావిస్తున్నాను. ఎప్పుడు లూషియస్, ఎప్పుడు? మేల్కో సంగతేమిటి లూషియస్!

లూషియస్  : పిలిచారా ప్రభూ!

బ్రూటస్  : నా విద్యాకక్ష్యలో దీపం వెలిగించు. తరువాత ఇక్కడికి వచ్చి నన్ను పిలుచుకో వెళ్ళు.

లూషియస్  : చిత్తం

(నిష్క్రమిస్తాడు)

బ్రూటస్  : అది అతని మృతివల్ల జరగవలసిందే. అందరి కోసం తప్ప అతనిమీద నాకు వ్యక్తిగతంగా అణు మాత్రమైనా క్రోధం లేదు. అతణ్ణి కిరీటాలంకృతుని చేస్తారు అని ఊహిద్దాం. అందువల్ల అతని స్వభావం ఎలా మారుతుంది అన్నది ప్రశ్న. మంచి ఎండ" కాసే రోజు సర్పం విషాన్ని వెలిజిమ్ముతుంది.

ఉచ్ఛదశ వ్యక్తి సత్యస్వరూపాన్ని వెల్లడిస్తుంది. అందువల్ల అతి జాగరూకతతో పయనించవలసిందే. కిరీటాలంకృతుని చేస్తారు చేస్తే? అతడికొక కొండి ఇచ్చినట్లుతుంది. దాంతో అతడు కోరుకున్నప్పుడు ప్రమాదాన్ని కల్పిస్తాడు. అధికారం నుంచి దయను విడదీసినప్పుడే అది దుష్ప్రయోగ మహత్త్వమౌతుంది.

సీజర్ ను గురించి సత్యం చెప్పాలంటే అతడి తార్కికప్రతిభ మీద అనురాగం, అధికారం నెరపినట్లు నేనెన్నడూ గమనించిన జ్ఞాపకం లేదు. అణకువ యౌవన ప్రాయంలో ఉన్న ఆశకు నిశ్రేణిక. దాన్ని ఎక్కేవాడు ఎప్పుడూ పైకే చూస్తుంటాడు. అతడు తుదిమెట్టు చేరుకున్న తరువాత నిచ్చెన వైపు వీపు నిలిపి, ఎక్కి వచ్చిన మెట్లన్నిటినీ చూచి అసహ్యించుకుంటూ మేఘాలలోకి తిలకిస్తుంటాడు. సీజర్ కూడా ఇలాగే ప్రవర్తించవచ్చు. అందువల్ల అతని పురోగమనాన్ని ఆపివేద్దాం. అయితే అతడి ప్రవర్తన నేడు మన శత్రుత్వానికి అనుగుణంగా ప్రదర్శితం కావటం లేదు. అందువల్ల అతణ్ణి స్వేచ్ఛగా వ్యవహరించనిస్తే పై ప్రమాదాలు తప్పవని నిరూపిద్దాం. అతడొక సర్పాండం. పొదగబడ్డ తరువాత అది తన స్వభావానికి తగ్గట్టే సహజ దుష్టత్వంతో పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని అండంలోనే అవియించటం క్షేమం.

(లూషియస్ తిరిగి ప్రవేశిస్తాడు)

లూషియస్  : ప్రభూ! మీ విద్యాకక్ష్యలో దీపాన్ని వెలిగించి వచ్చాను. శిలాశకలం కోసం మీ వాతాయనంలో వెతుకుతుండగా అంటించి ఉన్న ఈ పత్రం కనిపించింది. మొదట నేను నిద్రించటానికి శయ్యమీదికి వెళ్ళినప్పుడు అది అక్కడ లేదు గట్టిగా చెప్పగలను.

(లేఖను అందిస్తాడు)

బ్రూటస్  : ఇంకా తెల్లవారలేదు. నీవు వెళ్ళి నిద్రపో... లూషియస్! మార్చి పదిహేను రేపే కదూ?

లూషియస్ : అది నాకు తెలియదు ప్రభూ!

బ్రూటస్  : పట్టికలు చూచి వచ్చి నాకు ఏ సంగతి చెప్పు.

లూషియస్  : చిత్తం ప్రభూ!

(నిష్క్రమిస్తాడు)

బ్రూటస్ : ఈ తోకచుక్కలు లేఖను చదవటానికి తగ్గ వెలుగునిస్తున్నవి.

(లేఖను విప్పి చదువుతాడు)

"బ్రూటస్! మీరు నిద్రిస్తున్నారు. మేల్కొండి. స్వయంగా దర్శించండి. ప్రవచించండి. ఛేదించండి. ఉద్ధరించండి!”

"బ్రూటస్. మీరు నిద్రిస్తున్నారు. మేల్కొండి" ఇలా వ్రాసి పడవేసిన ఉద్బోధనలను ఎన్నింటినో ఎత్తుకొన్నాను. “రోము ఇత్యాది” బహుశః దీని అర్థాన్ని ఇలా వ్యాఖ్యానించుకోవాలనుకుంటాను. ఒక రోము వ్యక్తి భయంతో ఉండిపోవలసిందేనా? జూలియస్ సీజర్57 ఏమిటి? రోము! కేవలం రాజునని చెప్పుకున్నంత మాత్రానికి మా పితరులు టార్క్విన్సును ఈ రోము నగరవీధుల గుండా తరిమివేశారు. "ప్రవచించండి, ఛేదించండి, ఉద్ధరించండి" నన్ను ప్రవచించమనీ, ఛేదించమనీ, ఉద్దరించమని అర్థిస్తున్నారు. ఓ రోము! ఇదిగో ప్రతిజ్ఞ గైకొంటున్నాను. నిన్ను ఉద్దరించటానికోసం బ్రూటస్ తన సర్వస్వాన్నీ అర్పించటానికి సంసిద్ధుడైనాడు.

(లూషియస్ తిరిగి ప్రవేశిస్తాడు)

లూషియస్  : ప్రభూ! మార్చిలో పద్నాలుగు రోజులు గడిచిపోయాయి.

బ్రూటస్  : మంచిది. (లోపల చప్పుడు) ద్వారం దగ్గరికి వెళ్ళు. ఎవరో తలుపు తడుతున్నారు.

(లూషియస్ నిష్క్రమిస్తాడు)

కాషియస్! తొలుతగా నీవు నన్ను జాగృతం చేసింది మొదలు నిద్రన్నది ఎరగను. ఒక మహాభయంకర కార్యకరణానికి, ప్రథమారంభానికీ మధ్యకాలం ఒక పెనుభూతంగానో, ఒక భయానక స్వప్నం లాగానో ఉంటుంది. మేధ మానవసాధనాలతో సభ తీరుస్తుంది. మానవరాష్ట్రం, ఒక చిన్న రాజ్యంలా, విప్లవాల పాలౌతుంది.

(లూషియస్ తిరిగి ప్రవేశిస్తాడు)

లూషియస్  : ప్రభూ! ద్వారందగ్గిర ఉన్నది మీ బావమరది " కాషియస్. మిమ్మల్ని చూడగోరుతున్నాడు.

బ్రూటస్  : అతడు ఒంటరిగానే ఉన్నాడా?

లూషియస్  : లేదు ప్రభూ! వారివెంట ఇంకా కొందరున్నారు.

బ్రూటస్  : వారెవరో నీకు తెలుసునా?

లూషియస్  : లేదు ప్రభూ! టోపీలతో వారు చెవులదాకా కప్పేసుకున్నారు. వారి ముఖాలు సగంవరకూ దుస్తుల్లో మడిగి ఉన్నాయి. అందువల్ల వారిని గుర్తించడానికి నాకు ఏ చిహ్నం చిక్కలేదు.

బ్రూటస్ : వారిని ప్రవేశపెట్టు.

(లూషియన్ నిష్క్రమిస్తాడు)

వారే విద్రోహవర్గం. ఓ విద్రోహ దేవతా! దుష్టభూతాలు స్వైరవిహారం చేస్తున్న సమయంలో, ఈ రాత్రివేళ ఆపత్తుతో కూడిన నీ కనుబొమలను చూపించటానికి సిగ్గుపడుతున్నావా? అయ్యో! అయితే, నీ రాకాసిరూపాన్ని కప్పి పుచ్చుకోవటానికి పగటివేళ కారుచీకట్లు నిండిన గుహాగహ్వరం నీ కెక్కడ లభిస్తుంది?

విద్రోహమా! అన్యసహాయాన్ని అపేక్షించకు. నీ చిరునవ్వులో, నీ కృతజ్ఞతా ప్రకటనలో సర్వం కప్పిపుచ్చు. సహజరూపంతో నీవు పయనిస్తే ఎరుబస్ నరకంలోని అంధకారానికి కూడా నిన్ను కప్పిపుచ్చే శక్తి లేదు.

కాషియస్, కాస్కా, డెషియస్, సిన్నా, మెటిల్లస్ సింబర్, ట్రైబోనియస్ ప్రవేశిస్తారు.

కాషియస్  : సుప్రభాతం, బ్రూటస్! మీ ప్రశాంతికి భంగం కల్పించటానికి చాలా సాహసించామనుకుంటాను. ఏమైనా శ్రమ కలిగిస్తున్నామా?

బ్రూటస్  : నేను ఇంతవరకూ రాత్రంతా మేల్కొనే ఉన్నాను. నీ వెంటవచ్చిన వీరందరూ ఎవరో నేను తెలుసు కోవచ్చునా?

కాషియస్  : తప్పకుండా. ఇందులో ప్రతి ఒక్కరినీ మీరు తెలుసుకోవచ్చు. మీ మీద గౌరవం లేనివాడు వీళ్ళలో ఒక్కడూ లేడు. ఉదాత్తుడైన ప్రతి రోము పౌరుడూ మీ మీద ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో, మీరు కూడా మీ మీద అటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలెనని వీరిలో ప్రతిఒక్కరూ వాంఛిస్తున్నారు. -ఇతడు ట్రెబోనియస్.

బ్రూటస్  : ఇదే నా స్వాగతం.

కాషియస్ : ఇతడు డెషియస్ బ్రూటస్.

బ్రూటస్  : ఇతనికీ నా స్వాగతం.

కాషియస్  : ఇతడు కాస్కా, ఇతడు సిన్నా, ఇతడు మెటిల్లస్ సింబర్.

బ్రూటస్  : వీరందరికీ నా స్వాగతం. కళవళ పెట్టే ఏ భావాలు మీ నిద్రకు అంతరాయాన్ని కలిగిస్తున్నాయో అడగవచ్చునా?

కాషియస్  : నీతో ఒక్క మాట చెప్పాలి.

(బ్రూటస్, కాషియస్ గుసగుసలాడుతారు)

డెషియస్ : ఇదే తూర్పు. ఇక్కడే సూర్యోదయమౌతుంది.

కాస్కా: కాదు.

సిన్నా : క్షమించండి. ఇక్కడే ఉదయమౌతుంది. అవిగో, దూరంగా మేఘపుంజాల మీద కోపం కక్కుతూ, అవిగో అరుణరేఖలు దివాదేవి వార్తావహులు.

కాస్కా : మీరు ఇరువురూ మోసపోయారు ఈ విషయం అంగీకరిస్తారు కూడాను. నేను నా కత్తిని చూపించేవంక, వత్సరయౌవ్వన కాలాన్ని బట్టి పరిశీలించండి. ఇంకా సుదూరాన, దక్షిణాన సూర్యుడు ఉదయిస్తాడు. ఇంకా రెండు నెలలకు ఎంతో ఎత్తున ఉత్తరాన అతడు తన కాంతిపుంజాలతో ప్రకాశిస్తాడు. నిజమైన తూర్పుదిక్కు ఇక్కడికి సభాభవనంలా సూటిగా ఉంది.

బ్రూటస్  : ఒకరి తరువాత ఒకరు నాతో కరచాలనం చెయ్యండి.

కాషియస్  : మన నిర్ణయాన్ని గురించి శపథం చేద్దాం.

బ్రూటస్ : ఎందుకు. శపథంతో పని లేదు. మన ముఖాలల్లో వ్యథ వ్యక్తం కాకపోతే, ఆత్మల్లో అశాంతి ప్రబలకపోతే, కాలంలో దౌష్ట్యం కలతపెట్టకపోతే, - ఈ రీతి కారణాలన్నీ బలహీనాలైతే - ఇంకా మనం ముందుకు పయనించక ముందే మాంద్యం వహించి మన శయ్యాగారాలను చేరుకుందాం. ఒక్కొక్కరివంతు వచ్చి పూర్తిగా మనం రాలిపోయే దాకా దీర్ఘదృష్టి గల క్రూరపాలనను కొనసాగనిద్దాం. ఈ మూలకారణాలే శక్తిమంతాలైతే, కాకేం - శక్తిమంతాలే, పిరికిపందలను మహా వీరులనుగా రగులుస్తాయి. కరిగిపోయే స్త్రీల హృదయ భావాలకు పౌరుషకవచా లౌతాయి. దేశీయులారా! మనను మనం ఉద్దరించుకోటానికి ప్రేరేపించిన మన కారణాలు తప్ప వేరే శపథాలతో గాని, మరో వాటితో గాని మనకు పనేముంది? రహస్య గోపనంలో ఖ్యాతిగన్న రోము ప్రజల మాట, కల్లబొల్లి కానిమాట, చాలదూ? 'సత్యసంధులు సత్యసంధులతో ఇది చేసి తీరాలి చచ్చి తీరాలి' అని చెప్పిన మాట చాలదూ? మరో బంధమెందుకు? ఛాందసులు, పిరికిపందలు, మోసకారులు, నిరుపయోగులు, ఇలాగే ఇంకా చెడుగులను ఆహ్వానించే వ్యథితహృదయులూ శపథం చేస్తుంటారు. మానవులను అనుమానించే వ్యక్తులు దుష్ట చర్యలకు పూనుకున్నప్పుడు శపథం చేస్తుంటారు. మన కారణాలు గాని, ఆభరణ విధానాలు గాని శపథాన్ని ఆశిస్తవని భావించి మన సాహసకృత్య సద్గుణాన్ని గాని, అణచరాని మన అనంత ధైర్యాన్ని గాని కళంకితం చెయ్యవద్దు. రోము పౌరుని నోట వెలువడిన శపథంలో ఏ అణుమాత్రం తప్పినా అతడు మహోదాత్తంగా శరీరంలో వహించే రక్తంలోని ప్రతిబిందువు లోనూ ఏదో నైచ్యం ఉన్నదన్నమాట!

కాషియస్  : అయితే సిసెరో సంగతేమిటి? వాణ్ణి కూడా మనం కదిలించి చూద్దామా? అతడు మనతో అతిగాఢంగా తుదిదాకా నిలుస్తాడనే నా నమ్మకం.

కాస్కా  : వాణ్ణి మనం వదిలిపెట్టకూడదు.

సిన్నా  : నిజమే. తప్పక వదిలిపెట్టకూడదు!

మెటిల్లస్  : అతడు మనలో తప్పకుండా ఉండితీరాలి. వాడి నెరిసిన జుట్టువల్ల మనకు ప్రజాభిప్రాయం ఎంతో అనుకూలమౌతుంది. మనం చేసే కృత్యాలను కీర్తించే గొంతుకలు దొరుకుతాయి. బుద్ధిబలం వల్ల అతడు ఆలోచించి నిర్ణయించిన దాన్నే మనమంతా ఆచరిస్తున్నామని జనం అనుకుంటారు. మన యౌవనోద్రేకాలు అతని గాంభీర్యమనే కప్పుక్రింద ఒదిగి ఉంటాయి.

బ్రూటస్  : అతడి పేరు చెప్పకండి. మన మహాకార్యాన్ని అతనికి తెలియ జేయకూడదు. అతడు ఎన్నడూ ఇతరులు ఆరంభించినదాన్ని అంగీకరించి అనుసరించే స్వభావం కలవాడు కాడు.

కాషియస్  : అయితే మనం అతణ్ణి వదిలి వేయవలసిందే.

కాస్కా  : అవును. నిజం. వాడు ఇందుకు తగినవాడు కూడా కాడు.

డెషియస్  : సీజర్ ను తప్ప మనం మరి ఇతరులను ఎవరినీ ముట్టుకోకూడదు.

కాషియస్  : సందర్భోచితంగా జ్ఞప్తికి తెచ్చావు. సీజర్ మరణానంతరం అతడికి అతి ప్రియుడైన మార్క్ ఆంటోనీ సజీవుడై ఉండరాదు. ఉంటే అతడు మహామేధావి. మంచి అవకాశాలు కలవాడు. అతడు సమీకరిస్తే మన కెన్నైనా గట్టి చిక్కులు తెచ్చిపెట్టగలడు. అటువంటి పరిస్థితి రాకుండా చేసుకోవటానికి మనం సీజర్ ఆంటోనీలను ఇరువురినీ ఏకకాలంలో తొలగించాలి.

బ్రూటస్  : కైయస్ కాషియస్! ఇలా అయితే మన మార్గం మరింత రక్తోపేతంగా కనిపిస్తుంది. సీజర్కు ఆంటోనీ కేవలం ఒక అవయవం. చంపటంతో కోపం చల్లారుతుంటే ఇంకా ఈర్ష్యతో మోదటమెందుకు! శిరస్సును ఖండించిన తరువాత అవయవాలను చిత్రవధ చేయటమెందుకు? కైయస్! యజ్ఞకర్తల మౌదాముగాని మనం కసాయివాళ్ళం కావద్దు. మనమందరమూ సీజర్ తత్త్వానికి వ్యతిరేకులం కాని అతడికి వ్యతిరేకులం కాదు. మానవుల తత్త్వాలకు రక్తమంటూ లేదు. సీజర్ తత్త్వాన్ని తొలగించటానికి మరోమార్గమంటూ ఉంటే అతణ్ణి చంపవలసిన అగత్యమే మనకుండేది కాదు. కానీ, అందువల్ల, అయ్యో! సీజర్ రక్తాన్ని ఒలికించవలసి వస్తున్నది.

ప్రియమిత్రులారా! మనం సీజర్ను ధైర్యంతో అంతమొందించాలి. అంతేగాని కోపోద్రేకంతో చంపరాదు. అతణ్ణి దేవతలు స్వీకరించటానికి యోగ్యమైన హవిస్సుగా తుదముట్టిద్దాం. వేటకుక్కలకు ఆహారంగా పరిణమించే కబంధాన్ని చేయకూడదు. మన హృదయాలు జిత్తులమారి యజమాని సేవకులచేత కోపోద్రిక్తకృత్యాలను చేయించి తరువాత శిక్షించేటట్లుగా ప్రవర్తించాలి. ఇలా వర్తిస్తే మనం అవసరం వల్ల ఇట్టి చర్య తీసుకున్నామే గాని ఈర్ష్యవల్ల కాదని వెల్లడౌతుంది. జన సామాన్య నేత్రాల కిలా కన్పించడం వల్ల మనం పవిత్రకార్యకర్తల మౌతామే కాని హంతకులం కాము. మార్క్ ఆంటోనీని గురించి మనం ఆలోచించవలసిన పనిలేదు. సీజర్ శిరస్సును ఛేదించినపుడు అతని హస్తం ఏమీ చేయలేక ఎలా పడిపోతుందో అతడూ అలాగే అయిపోతాడు.

కాషియస్  : అయినా, నాకు అతడంటే భయం. అతడు తన హృదయాంతరాన్ని తొలిచి అందులో సీజర్ మీది ప్రేమను నిబద్ధం చేశాడు.

బ్రూటస్  : ప్రియమైన కాషియస్! అతణ్ణి గురించి ఇక ఆలోచించకు. సీజర్ మీద అతడికి అంత గాఢానురాగం ఉన్నా అతడు చేయగలిగిందేమిటి? పదే పదే సీజర్ ను గురించి ఆలోచించుకొని అతడికోసం మరణించటమే. క్రీడలన్నా, తిరుగుబోతుతనమన్నా, గోష్ఠులన్నా ఎప్పుడూ అతడికి ఆసక్తి అధికం. అంత పని చేయనే చేయడు.

ట్రెబోనియస్  : అతడివల్ల ఏ ప్రమాదమూ ఉండదు. అతడి మృతి మనకనవసరం. బ్రతికి అతడు తరువాత దీనికి పరిహాసమాడుతాడు.

(ఘంటిక మ్రోగుతుంది)

బ్రూటస్  : నిశ్శబ్దం! ఎన్ని కొట్టిందో లెక్కించండి.

కాషియస్ : మూడు కొట్టింది.

ట్రెబోనియస్  : ఇక మనం విడివడిపోవటానికి సమయమైంది. కాషియస్  : కానీ సీజర్ ఇవాళ వస్తాడా అన్నదే ఇంకా అనుమానంగా ఉంది. ఒకప్పుడు అతడికున్న భావాలకు భిన్నంగా ఇప్పుడతనికి భూతాలన్నా, కలలన్నా, శకునాలన్నా చాదస్తం పట్టుకొని బలిసిపోయింది. ఇంత స్పష్టంగా గోచరించే ఈ శకునాలు, అసాధారణమైన ఈ నిశీథిని కల్పించిన భయం, శకునజ్ఞుల నిర్బంధం - ఇవన్నీ ఏకమై అతణ్ణి సభాభవనానికి రానీయకుండా నిలిపివేయవచ్చు.

డెషియస్ : అందుకు మీరేం భయపడవద్దు. ఒకవేళ అతడు రానని తీర్మానించుకున్నా నేను అతణ్ణి త్రిప్పేయ గలను. శృంగాశ్వాలను " చెట్లతో, భల్లూకాలను అద్దాలతో, ఏనుగులను గర్తాలతో, సింహాలను వాగురులతో, మానవులను స్తుతి పాఠకులతో మోసగించవచ్చునని చెపితే అతడు ఎంతో సంతోషంగా వింటుంటాడు. అతణ్ణి మిక్కిలిగా స్తుతించి మీకు స్తుతి పాఠకులంటే చాలా అసహ్యం అన్నప్పుడు అతడు అవునని అంగీకరిస్తాడు. అతణ్ణి సభాభవనానికి రప్పించే పని నాకు ఒప్పచెప్పండి. చిత్త ప్రవృత్తికి తగ్గ దోహదం చేసి అతణ్ణి నేను సభాభవనానికి తీసుకోవస్తాను.

కాస్కా : అంతెందుకు? అతణ్ణి తీసుకురావటానికి మనమందరం వెడదాం.

బ్రూటస్ : ఎనిమిది గంటలకు. అంతకు మించకూడదు కదూ?

సిన్నా: మించకూడదు తప్పకూడదు కూడాను.

మెటిల్లస్  : పాంపేను గురించి మంచిగా మాట్లాడాడని సీజర్ అతణ్ణి కోపించాడట! కెయస్ లిగారియస్ కు20 అతడి మీద గుర్రుగా ఉంది. మీలో ఎవరూ అతణ్ణి గురించి ఆలోచించకపోవటం నాకు వింతగా ఉంది.

బ్రూటస్  : ప్రియమిత్రుడా, మెటిల్లస్ ! నీవు అతడి ఇంటి మీదుగా వెళ్ళు. అతడికి నేనంటే ఎంతో అనురాగం. ఇందుకు ఎన్నో కారణాలున్నాయి. అతణ్ణి నా దగ్గరకే పంపించు. నేను తగ్గట్టుగా అతణ్ణి తీర్చి దిద్దుతా.

కాషియస్  : ఇక మనకు తెల్లవారింది. బ్రూటస్! మేము సెలవు తీసుకుంటాము. ప్రియమిత్రులారా! మీరు వెళ్ళండి. నిజమైన రోమను పౌరుల్లాగా వ్యవహరించండి.

బ్రూటస్  : మిత్రులారా! మీరందరూ ఉత్సాహంతో, మహానందానుభూతిని పొందుతున్నట్లుగా కన్పించాలి. మీ చూపులవల్ల మన ఉద్యమం ఎక్కడా బయట పడిపోరాదు సుమా! మీరు అలసటలేని ఉత్సాహంతో, నిత్యాభ్యస్తమైన నైపుణ్యంతో రోమునటకుల్లా ప్రవర్తించాలి. మీలో ప్రతి ఒక్కరికీ రేపు సుప్రభాతం.

(బ్రూటస్ తప్ప మిగిలినవారందరూ నిష్క్రమిస్తారు)

ఒరేయ్, లూషియన్! మంచినిద్రలో ఉన్నావా? పోనీలే. నిద్రాదేవి నీకిచ్చే మరందమాధుర్యాన్ని అనుభవించు. నిరంతరం ఆందోళన పెట్టే జాగరూకతలు మానవుల బుద్ధికుడ్యాలమీద గీసే చిత్రాలవంటి భూతాకృతులు నీకు లేవు. అందుకనే నీవు గాఢనిద్రలో ఉన్నావు.

పోర్షియా ప్రవేశిస్తుంది.

పోర్షియా  : ప్రభూ! బ్రూటస్!!

బ్రూటస్  : పోర్షియా! ఎందుకింత పెందలకడ మేల్కొన్నావు? బలహీనంగా ఉన్న నీవు ఇటువంటి ఉదయకాల శీతలపవనాలలో తిరగటం ఆరోగ్యానికి ఎంతమాత్రం తగదు.

పోర్షియా  : ఇది మీకు తగిందేనా మరి? ఔదార్యరహితంగా నాశయ్యనుంచి జారుకొచ్చేశారు. రాత్రి, భోజన సమయంలో హఠాత్తుగా లేచి, చేతులు కట్టుకొని, ఏమేమో ఆలోచిస్తూ, నిట్టూరుస్తూ, పచార్లు చేశారు. విషయమేమిటని అడిగితే నా వంక అనుదాత్తనేత్రాలతో తిలకించారు. నేను పట్టుపట్టి అడిగాను. మీరు శిరఃకంపం చేశారు ఎంతో అశాంతితో అరికాలు నేలకు తాటించారు. ఇంకా నేను పట్టి పట్టి అడిగాను. అయినా మీరు నాకేమీ సమాధానం చెప్పలేదు. అతి కోపంతో మిమ్మల్ని వదలిపెట్టి వెళ్ళవలసిందని సంజ్ఞగా హస్తచాలనం చేశారు. సుస్పష్టంగా అభివ్యక్తమయ్యే మీ అశాంతి ఇంకా పుష్టిని చేకూర్చుకుంటున్నదన్న భయంతోనూ, ప్రతివ్యక్తికీ ఎప్పుడో ఒకప్పుడు ధాతుసంచలన విపర్యాసం వల్ల కలిగే స్థితిగతి తప్ప మరేమీ కాదని ఊహించుకోవటం వల్లనూ, మీరు కోరినట్లు మిమ్మల్ని ఏకాంతంగా వదలిపెట్టి వెళ్ళాను. కానీ ఆ స్థితి మిమ్మల్ని భోజనం చెయ్యనివ్వటం లేదు, మాట్లాడనివ్వటం లేదు. అది మీ మనస్సుమీద ఎంతగా పనిచేస్తున్నదో అంతగా బాహ్యరూపంమీద కూడా పనిచేస్తే, నేను మిమ్మల్ని గుర్తుపట్టగలిగేదాన్నే కాదు. ప్రియప్రభూ! మీ దుఃఖకారణ మేమిటో నాకు తెలియజేయండి.

బ్రూటస్  : నా ఆరోగ్యమంత బాగాలేదు అంతే.

పోర్షియా : బ్రూటస్ బుద్ధికుశలుడు ఆరోగ్యం బాగుండకపోతే తగ్గ చర్యలు చేసి దాన్ని జయిస్తాడు. బ్రూటస్  : జయించటం లేదని నీకు అనుమాన మెందుకు కలిగింది? అలాగే చేస్తున్నాను.- ప్రియా, పోర్షియా! నీవు వెళ్ళి శయనించు.

పోర్షియా : సుస్తీగా ఉన్నదంటున్నారు. నిజమైతే గుండీలు లేకుండా ?' ఇలా ఉదయకాలపు చలిగాలిని పీలుస్తారా మరి? మీకే సుస్తీగా ఉంటే సౌఖ్యదాయకమైన శయ్యనుంచి జారుకొని రాత్రివేళ సాహసించి, ఎదుర్కోటానికి తడిగా ఉన్న విషవాయువులను ఆహ్వానించి జాడ్యాన్ని వృద్ధి చేసుకుంటారా?

లేదు. ప్రియా! బ్రూటస్! మిమ్మల్నేదో మానసిక వ్యథ వేధిస్తున్నది. నాకున్న సత్త్వాన్ని బట్టీ, నా స్థానాన్ని బట్టీ అదేమిటో నేను తెలిసికోక తప్పదు. ఇదిగో, మీ ముందు మోకరిల్లుతున్నాను. ఒకనాడు మీరు స్తుతించిన నా సౌందర్యం మీద, సమస్త ప్రణయ ప్రతిజ్ఞల మీద, మన ఇరువురినీ ఏకం చేసిన ఆ మహాప్రతిజ్ఞ మీద ఒట్టుపెట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీ హృదయభారమేమిటో, ఎవరో ఆరేడుగురు చీకటికి కూడా ఎరుకపడకుండా ముఖాలు కప్పుకొని వచ్చారు, ఈ రాత్రి మీతో గోష్ఠి చేసిన ఆ నారెవరో, మీ అర్ధాంగినైన, నాకు తెలియజెప్పండి.

బ్రూటస్  : ప్రియా, పోర్షియా! మోకరిల్లకు.

పోర్షియా  : మీరు ఉదాత్తులైన బ్రూటస్ అయినంతవరకూ నాకు మోకరిల్లవలసిన పని లేదు. మీకు సంబంధించిన రహస్యాలేమో నేను వినకూడదని మన వివాహబంధంలో ఎక్కడైనా ఉందా? మీతో భుజించటానికి, శయనించటానికి, లేదా కొన్ని సందర్భాలలో ప్రసంగించటానికి మాత్రమేనా నేను మీ అర్ధాంగిని? మీ హృదయ బాహ్యభూమిలో మాత్రమే నేను వర్తిస్తున్నాన్నమాట! నేను ఇంతకంటే అధికస్థితి వహించకపోతే పోర్షియా బ్రూటస్ కు ఉంపుడు కత్తె కానీ ధర్మపత్ని కాదు.

బ్రూటస్  : పోర్షియా! నా హృదయంలో ఉన్న వేడినెత్తురు బొట్లల్లా నీవు నాకు ప్రియమైనదానివి. సత్యం వచిస్తున్నాను, నీవు నా గౌరవనీయమైన ధర్మపత్నివి.

పోర్షియా  : మీరు పలికేది సత్యమైతే మీ ఈ రహస్యం నాకు తెలిసి ఉండవలసింది కదూ? నేను ఒక స్త్రీనని అంగీకరిస్తాను. కానీ, ప్రభువు బ్రూటస్ కు పత్నినైన స్త్రీని. నేను ఒక స్త్రీనని అంగీకరిస్తాను కానీ ప్రశస్తి కెక్కినదాన్ని, కేటో పుత్రికను. అటువంటి తండ్రికి కుమార్తెనూ, ఇటువంటి భర్తకు భార్యనూ అయిన నన్నే నా జాతి సామాన్యలకంటే ప్రబలను కానని భావిస్తున్నారా? ప్రభూ! మీ రహస్యాలేమో నాకు చెప్పండి. వాటిని నేను బయటపెట్టను. ఇందుకు ఆవశ్యకమైన నిశ్చలత నాకున్నదని నిరూపించటం కోసం ఇదుగో, ఈ ఊరువులో గాయాన్ని కల్పించుకుంటున్నాను. దీన్ని ఓర్పుతో భరించగలదాన్ని మీ రహస్యాలను భరించలేనేమో పరికించండి.

బ్రూటస్  : ఓ దేవతల్లారా! ఇంతటి ఉదాత్తప్రకృతి గల పత్నికి తగ్గ భర్తనుగా నన్ను తీర్చి దిద్దండి.

(లోపల తలుపుచప్పుడు)

వింటున్నావా, పోర్షియా, ఎవరో తలుపు తడుతున్నారు. నీవు కొంచెంసేపు లోపలికి వెళ్లు. నా రహస్యాలేమో నీకు కొద్ది కాలంలో తెలియజేస్తాను. నా ప్రవర్తన సర్వస్వాన్ని నీకు వెల్లడిస్తాను. దీనమై తోచే నా ముఖలక్షణానికి కారణం వినిపిస్తాను. - త్వరగా లోపలికి వెళ్ళు. (పోర్షియా నిష్క్రమిస్తుంది) లూషియస్, ఆ తలుపు తట్టేది ఎవరు?

(లిగారియస్ తొ తిరిగి లూషియస్ ప్రవేశిస్తాడు)

లూషియస్  : ఎవరో జబ్బుమనిషి మీతో మాట్లాడాలట!

బ్రూటస్ : మెటిల్లస్ చెప్పిన కేయస్ లిగేరియస్ ఇతడే అయి ఉంటాడు. లూషియస్, నీవు పక్కగా తొలుగు. కేయస్ లిగేరియస్! ఏమిటిది?

లిగేరియస్  : బలహీనమైన నా కంఠం పలికే ప్రణామ వాక్యాలను స్వీకరించండి.

బ్రూటస్  : కేయస్, సాహసికుడవైన నీవు జబ్బు పడటానికి బలే మంచి సమయాన్ని చూచుకున్నావే!

లిగేరియస్  : గౌరవప్రదమైన ఒక సాహసకృత్యానికి బ్రూటస్ పూనుకుంటే నేను జబ్బుపడ్డట్లే కాదు. నాకు జబ్బే ఉండదు.

బ్రూటస్  : నేను అట్టి చర్యకు పూనుకున్నాను. నీకు ఆరోగ్యం బాగా ఉండి ఉన్నట్లయితే అంతా విశదంగా చెప్పేవాణ్ణి.

లిగేరియన్  : నిత్యం రోము నివాసులు ప్రణమిల్లే దేవతల సాక్షిగా నేను నా రుగ్మతను పరిత్యజిస్తున్నాను. మీరు రోముకు అంతరాత్మలు. గౌరవనీయులైన మాతాపితరులకు జన్మించిన వీరపుత్రులు. ఒక ఐంద్రజాలికుడిలాగా వ్యథిత హృదయుడనైన నాకు ఉత్తేజాన్ని ప్రసాదిస్తున్నారు. మీరు నన్ను పరుగెత్తమని ఆజ్ఞాపించండి. దేనినైనా వెనకపడేసేటట్లు పరుగెత్తుతాను. ఏమి చెయ్యమంటారో సెలవీయండి.

బ్రూటస్  : ఏదైనా సరే, అనారోగ్యవంతులకు ఆరోగ్యమిచ్చేది, నిర్జీవులకు జీవం పోసేదీ అయిన ఒక చర్య చెయ్యి.

లిగేరియస్  : అయితే జీవించి ఉన్న కొందరిని నిర్జీవులను చెయ్యటం మన కేమన్నా అవసరమా?

బ్రూటస్ : అవును. అది కూడా నిర్వర్తించవలసి ఉంది. కేయస్ ! మనం ఎవరికి ప్రమాదాన్ని కల్పించదలచు కున్నామో, అతడి ఇంటికి వెళ్ళేటప్పుడు దాన్ని గురించి సవిస్తరంగా తెలియజేస్తాను.

లిగేరియస్  : అయితే నడిపించండి. నవ్యోత్తేజాన్ని పొందిన హృదయంతో నేను అనుసరిస్తాను. నేనేం చెయ్యటానికి వెళ్లుతున్నానో నాకే తెలియదు అవసరం లేదు కూడాను. కానీ, బ్రూటస్ మహాశయుడు నన్ను నడిపిస్తున్నాడని మాత్రం నాకు తెలిస్తే చాలు.

బ్రూటస్  : అయితే, అనుసరించు.

(నిష్క్రమిస్తారు)

'రెండో దృశ్యం '

సీజర్ ప్రాసాదంలో ఒక ఘనకక్ష్య, ఉరుములు, మెరుపులు, సీజర్ రాత్రి దుస్తులతో ప్రవేశిస్తాడు.

సీజర్  : ఈ రాత్రి భూమ్యాకాశాల రెంటిమీదా ఎక్కడా శాంతి ఉన్నట్లు గోచరించటం లేదు. "అయ్యో! సాయపడండి!! వారు సీజర్ను హత్య చేస్తున్నారు” అని కల్పూర్నియా ముమ్మారు నిద్రలో కేకలు పెట్టింది. - ఎవరక్కడ?

(సేవకుడు ప్రవేశిస్తాడు.)

సేవకుడు : ప్రభూ!

సీజర్  : వెళ్ళు. 'వెంటనే దేవతలకు బలి ఇచ్చి నా విజయాన్ని గురించిన వార్తలను తెలుసుకో” మని చెప్పు. వారు వినిపించే వార్తలను తీసుకోరా. సేవకుడు  : చిత్తం, ప్రభూ!

(నిష్క్రమిస్తాడు)

కల్పూర్నియా ప్రవేశిస్తుంది.

కల్పూర్నియా  : ఏమిటి, ఎక్కడికైనా వెళ్ళటానికి నిశ్చయించారా? మీరు ప్రాసాదాన్ని వదలి ఈ నాడు ఎక్కడికీ వెళ్ళటానికి వీల్లేదు.

సీజర్  : సీజర్ తప్పక వెళ్ళి తీరాలి. నా ఎదుట నిల్చి ఇంత వరకూ ఎవరూ, ఏదీ, నన్నెదిరించలేదు. నీవు ఇంతగా భయపడుతూ ఉన్న భయంకర విషయాలన్నీ నా ముఖం చూచేటప్పటికి అదృశ్యమైపోతాయి.

కల్పూర్నియా : సీజర్! నేను ఎన్నడూ శకునాలను చూచి ఇంతవరకూ భయపడ్డదాన్ని కాను. కానీ, అవి ఈ నాడు నన్ను కళవళ పెడుతున్నవి. కొన్నింటిని గురించి మనం విన్నాం మరికొన్నింటిని కళ్ళారా కన్నాం. మన ప్రాసాదపాలకులు చూచినట్లు చెప్పేవి ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఒక సింహం ప్రజావీథుల్లో విచ్చలవిడిగా సంచరించి సంతానాన్ని ప్రసవించిందట! శ్మశానభూముల్లో సమాధులు ఆవులిస్తే అందులో నుంచి మృతిపొందినవారు లేచివచ్చారట! యుద్ధోచిత వేషాలతో సైనికులు భయంకరంగా బారులు తీర్చి మేఘమండలాల్లో పోరాటాలు సాగించారట!! అందువల్లనే సభాభవనం మీద రక్తవర్షం కురిసిందట!! యుద్ధధ్వనులు ఆకాశమంతా అలముకున్నాయి. అశ్వాలు భయంకరంగా హేషించాయి. మరణించేవారి ఆక్రోశ కంఠాలు వినిపించాయి. భూతాలు వికటాట్టహాసాలతో వీథుల్లో విచ్చలవిడిగా సంచరించాయట! సీజర్, ఇవన్నీ ఎంత అసహజమైన అంశాలు! నాకు భయం వేస్తున్నది.

సీజర్  : దేవతలు ప్రబలులు. వారి ఉద్దేశాలను ఎదుర్కొనే శక్తి ఎవరికుంది? అయినా, సీజర్ వెళ్ళితీరాలి. ఈ అపశకునాలన్నీ సీజర్ ఒక్కడికేనా? ఇవి ప్రపంచ మంతటికీ సమానమైనవి.

కల్పూర్నియా : భిక్షుకులు మరణించేటప్పుడు తోకచుక్కలు కన్పించవు రాజపుత్రుల మృతినే వినువీథి వెలిగి సూచిస్తుంది.

సీజర్ : భీరువులు మృతికి పూర్వం ఎన్నోమార్లు మరణిస్తుంటారు. వీరులు ఒక్కమారుతప్ప మరణపు రుచిని చూడరు. నా జీవితంలో ఎన్నో వింతలు విన్నాను. మృత్యువు రావలసినప్పుడు వస్తుందనీ, అది తమకు అత్యావశ్యకమైన అంతమనీ గమనించకుండా, మానవులు దానికోసం భీతి వహించటమే నాకు అతివిచిత్ర విషయంగా గోచరిస్తున్నది.

(సేవకుడు తిరిగి ప్రవేశిస్తాడు.)

కాలజ్ఞులు ఏమన్నారు?

సేవకుడు  : మీరీనాడు ప్రాసాదాన్ని వదలి ఎక్కడికి వెళ్ళటానికి వారు ఇష్టపడటం లేదు. బలిపశువును విశసనం చేసి చూచినప్పుడు దాని గుండె వారికి కనిపించలేదట!

సీజర్  : తమ భీరుత్వాన్ని చూచుకొని మానవులు సిగ్గు పడటం కోసం దేవతలు ఇలాగే చేస్తుంటారు. భయంవల్ల సీజర్ ఈ నాడు తన ప్రాసాదంలోనే ఉండిపోతే, అతడు గుండె లేని పశువౌతాడు! వీల్లేదు. సీజర్ పశువు కావటానికి వీల్లేదు. అపాయానికి సీజర్ తనకంటే అపాయకరమైనవాడని తెలుసు. నేనూ, ఆ అపాయం ఒకనాడే జన్మించాం. ఇరువురం సింహాలం. మా ఇరువురిలో నేనే పెద్దను. నేనే భయంకరుణ్ణి. సీజర్ వెళ్ళి తీరవలసిందే!

కల్పూర్నియా : ప్రభూ! మీ విశ్వాసం జ్ఞానశక్తిని వినాశం చేస్తున్నది. ఈ నాడు మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు. మిమ్మల్ని మీ భయం కాదు, నా భయం ఆపివేసిందని ప్రకటించండి. మనం మార్క్ ఆంటోనీని సభాభవనానికి పంపుదాం. అతడు మీకు ఈ నాడు శరీరస్వస్థత లేదని నివేదిస్తాడు. ఇదిగో, మీ ముందు మోకరిల్లి వేడుకొంటున్నాను, ఈ విషయంలో నాకు లొంగిపోండి.

సీజర్ : కల్పూర్నియా! నీ ఇష్టాన్ని తీర్చటానికి నేను నా ఇంటివద్దనే ఉండిపోతాను. మార్క్ ఆంటోనీ వెళ్ళి నాకు స్వస్థత లేదని వారికి చెపుతాడు.

(డెషియస్ ప్రవేశిస్తాడు)

అడుగో డెషియస్. అతడు వారికీ విషయం చెపుతాడు.

డెషియస్  : మహోదారపురుషా, సీజర్! శుభం. సుప్రభాతం. నేను మిమ్మల్ని సభాభవనానికి తీసుకోవెళ్ళటానికి వచ్చాను.

సీజర్  : సభాసభ్యులకు నా ఆకాంక్షను తెలియజేయటానికి నీవు సరిగా సమయానికి వచ్చావు. నేను ఈ నాడు సభకు రానని వారితో చెప్పు. రాజాల ననకు అది అబద్ధం. రావటానికి ధైర్యం లేదనకు. అది అంతకంటే అబద్దం. డెషియస్! ఈ నాడు రానని చెప్పు. కల్పూర్నియా : వారికి సుస్తీగా ఉందని చెప్పు.

సీజర్  : సీజర్ కు అసత్యాన్ని చెప్పిపంపవలసిన పనేముంది? ఈ గడ్డాలు నెరసిన వృద్ధులందరికీ అసత్యాలు చెప్పి పంపటానికీ, భయపడటానికేనా జైత్రయాత్రల్లో విశ్రాంతిని ఎరుగకుండా నా బాహుదండాలను అలయించింది? డెషియస్, వెళ్ళు. వారికి సీజర్ రాడని చెప్పు.

డెషియస్  : మహాబలశాలి, సీజర్! నాకేదైనా ఒక కారణం చెప్పండి. లేకుంటే మీరు చెప్పమన్నట్లు చెబితే వారందరూ నన్ను పరిహాసం చేస్తారు.

సీజర్  : కారణమా? నా ఇచ్చే ఇందుకు కారణం. నేను రాను. సభను తృప్తి పరచటానికి ఇది చాలు. కానీ, నీవు నాకు ప్రేమపాత్రుడివి కనుక నిజమైన కారణాన్ని నీకోసం చెపుతున్నాను. కల్పూర్నియా నన్ను ఇంటివద్ద ఆపివేస్తున్నది. గడచిన రాత్రి నా ప్రతిమ ఒక జలధారలా నూరునాళికలతో స్వచ్ఛమైన రక్తాన్ని చిమ్మినట్లు ఆమె కలగన్నది. అనేక లోభులైన రోమన్లు ఆ రక్తంలో తమ తమ చేతులు ముంచెత్తారట! ఈ శకునాలు రాబొయ్యే అశుభానికి సూచకాలని ఆమె వ్యాఖ్యానించింది. ప్రణమిల్లి ఈ నాడు ఇంటివద్దనే ఉండి పొమ్మని ప్రార్థించింది.

డెసియస్  : కల అపమార్గంలో వ్యాఖ్యానితమైంది. ఈ దృశ్యం ఎంతో రమణీయమైంది అంతే కాదు శుభప్రదమైంది. అనేకులైన రోమన్లు తమ చేతులు ముంచేటట్లు మీ ప్రతిమ ఒక జలధార వలె రక్తమెగజిమ్మిందంటే మీనుంచి రోము పునరుజ్జీవాన్ని పొందే రక్తాన్ని పావనం చేస్తున్నదన్న మాట! పెద్దవాళ్ళందరూ మీ జ్ఞాపకార్థాలైన పట్టికలు, చిహ్నాలు ఇతర స్మృతి చిహ్నాలైన వస్తువులకోసం మీ చుట్టూ మూగుతారన్నమాట! ఇదీ కల్పూర్నియా దేవి స్వప్నానికి క్రమమైన అర్థం.

సీజర్  : ఆ స్వప్నానికి ఇది నిజంగా రమణీయమైన వ్యాఖ్యానం.

డెషియస్  : నేను చెప్పినదాన్ని మీరు విన్నారంటేనే చాలు, నేను సవ్యంగా వ్యాఖ్యానించానన్నమాట! ఇంకా నేను చెప్పవలసింది కొంత ఉంది. వినమని ప్రార్థిస్తున్నాను. మహాబలశాలి అయిన సీజర్ మహాశయులకు కిరీటప్రదానం చెయ్యాలని సభ నిర్ణయించింది. 'నేను రాను' అని మీరు వార్త పంపిస్తే వారి మనస్సు మారిపోవచ్చు. అంతే కాదు. 'సీజర్ భార్యామణికి ఇంకా మంచి కల వచ్చేదాకా సభను వాయిదా వెయ్యండి' అని ఎవరైనా పరిహాసమాడటానికి కూడా అవకాశముంది. ఇలా దాక్కుంటే 'అయ్యో! సీజర్ పిరికిపడ్డాడని గుసగుసలాడరూ? క్షమించండి! ప్రస్తుతం నా బుద్ధిబలాన్ని త్రోసిరాజని నాకు మీ మీద, మీ కార్యనిర్వహణ మీద ఉన్న ప్రేమ మీతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడటానికి ప్రేరేపించి ఆజ్ఞాపిస్తున్నది.

సీజర్  : కల్పూర్నియా! నీ భయం ఎంతటి అర్థరహితమైందో ఇప్పుడు అవగతం చేసుకున్నావా? దానికి నేను లొంగిపోయినందుకు నాకెంతో సిగ్గు వేస్తున్నది., నేను వెళ్ళి తీరుతాను. ఏవీ నా దుస్తులు?

పబ్లియస్, బ్రూటస్, లిగారియస్, మెటిల్లస్, కాస్కా, ట్రెబోనియస్, సిన్నా ప్రవేశిస్తారు.

అడుగో, చూడు పబ్లియస్ నన్ను తీసుకోవెళ్ళటానికని వచ్చాడు.

పబ్లియస్  : సుప్రభాతం, సీజర్!

సీజర్  : స్వాగతం, పబ్లియస్!... ఏమిటి? బ్రూటస్, మీరు కూడా ఇంత పెందలకడ బయలుదేరారు. సుప్రభాతం, కాస్కా, కేయస్ లిగారియస్! ఇంతగా సన్నబడే జబ్బు నీకెంత శత్రువైంది. సీజర్ నీకెప్పుడూ ఇంతటి శత్రువు కాలేదు. కాలమెంతైంది?

బ్రూటస్  : ఎనిమిది కొట్టారు.

సీజర్  : మీరు తీసుకున్న శ్రమకూ, కృతజ్ఞతకూ నా అభివాదనాలు.

ఆంటోని ప్రవేశిస్తాడు.

అటు చూడండి. ఆంటోనీ, రాత్రి ఎంతో ప్రొద్దుపోయేదాకా విలాసాలతో గడిపేవాడు కూడా అప్పుడే మేల్కొని వచ్చేశాడు. ఆంటోనీ, సుప్రభాతం!

ఆంటోనీ  : సీజర్ మహోదారా! సుప్రభాతం.

సీజర్  : వారిని అందరినీ సిద్ధపడమని అజ్ఞాపించు. మీ అందరికీ ఆలస్యాన్ని కలిగిస్తున్నందకు నిందాపాత్రుణ్ణి నేనే. సిన్నా! మెటిల్లస్!! ట్రెబోనియస్ నేను మీతో ఒక అరగంట సేపు మాట్లాడాలి. మరిచిపోకు. ఈ నాడే నన్ను పిలిచి మళ్ళీ జ్ఞప్తి చెయ్. కాదు, నీవు నా ప్రక్కనే ఉండు. ఈ విషయం నాకే జ్ఞప్తికి వస్తుంది.

ట్రెబోనియస్  : అలాగే సీజర్! (స్వగతం) నీ ఆప్తస్నేహితులు కొంతైనా దూరంగా ఉంటే బాగుంటుందనుకొనేటంత సన్నిహితంగా ఉంటాను. సీజర్  : ప్రియమిత్రులారా! లోపలికి రండి. నాతో కలిసి కొంత ద్రాక్షాసవాన్ని సేవిద్దురుగాని. తరువాత మనం ఉత్తమమిత్రుల్లాగా సభాభవనానికి కలిసి వెడదాం.

బ్రూటస్  : (స్వగతం) సీజర్! ఒకలా నటించి మరొకలా ఉండటం బ్రూటస్ ను ఎప్పుడూ బాధపెడుతుంది.

(నిష్క్రమిస్తాడు)

మూడో దృశ్యం

సభాభవనం దగ్గిర ఒక వీథి. ఒక పత్రాన్ని చదువుతూ ఆర్టిమిడోరస్ ప్రవేశిస్తాడు.

ఆర్టిమిడోరస్  : "సీజర్! బ్రూటస్ ను గురించి జాగరూకత వహించు. కాషియస్ ను గమనించు. కాస్కాను దగ్గరకు రానీకు. నిన్నామీద ఒక కన్ను వేసి ఉండు. ట్రెబోనియస్ ను నమ్మకు. మెటిల్లస్ సింబర్ ను బాగా గుర్తుపెట్టుకో. డెషియస్ బ్రూటస్ కు నీ మీద అనురాగం లేదు. కెయస్ లిగారియస్ కు నీవు అపరాధం చేశావు. ఈ వ్యక్తులందరిదీ ఒకటే మనస్సు. అది సీజర్ కు వ్యతిరేకంగా ఉంది. 'నేను దివ్యుడను' అని అనుకోకపోతే నిన్ను గురించి ఆలోచించుకో. భద్రభావం ద్రోహానికి దారితీస్తుంది. బలవంతులైన దేవతలు నిన్ను రక్షింతురుగాక! - భవదీయానురాగి, ఆర్టిమిడోరస్”

సీజర్ ఇటు వెళ్ళేదాకా ఇక్కడే నే నిలిచి ఉంటాను. ఈ పత్రాన్ని ఒక నివేదనగా అతని చేతికి అందజేస్తాను. ఈర్ష్యాళువైన శత్రుత్వపుకోరలనుంచి తప్పించుకొని ఉదాత్తగుణం బ్రతకలేకపోతున్నదని నా హృదయం ఎంతో దుఃఖపడుతున్నది. సీజర్! దీన్ని నీవు చదివితే, విధి ద్రోహులతో సహకరించకుండా ఉంటే నీవు బ్రతకవచ్చు.

(నిష్క్రమిస్తాడు)

నాలుగో దృశ్యం

బ్రూటస్ ఇంటిముందు వీధిలో మరో భాగం.

పోర్షియా, లూషియస్ ప్రవేశిస్తారు.

పోర్షియా : లూషియస్, కాలహరణం చెయ్యకు! సభాభవనానికి పరుగెత్తుకో వెళ్ళు. నాకే సమాధానాలూ చెప్పనవసరం లేదు వెళ్ళు. ఇంక నిలుచున్నావేం? వెళ్లు. లూషియస్  : అమ్మా, వెళ్ళి నే నేం చెయ్యాలో తెలుసుకుందామని నిలుచున్నా.

పోర్షియా : నీవు ఏమి చెయ్యాలో చెప్పేలోగానే నీవు అక్కడికి వెళ్ళి రావాలని నా ఉద్దేశం. (స్వగతం) స్థైర్యమా! నాకు బలాన్ని చేకూర్చు. నా హృదయానికీ, మనస్సుకూ మధ్య మహా పర్వతాలను నిలుపు. నాకు పురుషులకు ఉండవలసిన మనస్సుంది. అయితే నా శక్తి స్త్రీ సహజమైంది. రహస్యాన్ని దాచటం స్త్రీల కెంత కష్టం? - ఇంకా నీవు ఇక్కడనే ఉన్నావా?

లూషియస్  : అమ్మా! నేనేం చెయ్యను? సభాభవనానికి పరుగెత్తటమేనా? ఇంకేం చెయ్యనవసరం లేదా? మళ్ళీ తిరిగిరావటమేనా? ఇంకేం లేదా?

పోర్షియా  : ఇంట్లోనుంచి ఏదో వ్యథతో వెళ్ళారు! మీ ప్రభువు కుశలంగా కనిపిస్తున్నారో లేదో వార్త తీసుకుని రా. సీజర్ ఏం చేస్తున్నాడో, అతడి ఆప్తులు అతణ్ణి ఏమి చెయ్యమని ప్రబోధిస్తున్నారో బాగా గమనించిరా... ఆ కోలాహల మేమిటి?

లూషియస్  : కోలాహలమా? నాకేమీ వినిపించటం లేదు.

పోర్షియా : ఒక జగడం జరుగుతున్నట్లు నాకేదో రొద వినిపిస్తున్నది. సభాభవనం వైపు నుంచి వచ్చే గాలి దాన్ని తీసుకో వస్తున్నది. లూషియస్, అదిగో జాగ్రత్తగా విను.

లూషియస్ : సత్యం తల్లీ! నాకేమీ వినిపించటం లేదు.

శకునజ్ఞుడు ప్రవేశిస్తాడు.

పోర్షియా  : రావయ్యా! ఎక్కడనుంచి వస్తున్నావు?

శకునజ్ఞుడు  : మా ఇంటినుంచేనమ్మా!

పోర్షియా  : ఇప్పుడు కాలమెంతైంది?

శకునజ్ఞుడు  : తొమ్మిదిగంటలు కావస్తున్నది.

పోర్షియా : ఈ సమయానికి సీజర్ సభాభవనానికి వెళ్ళి ఉంటాడా?

శకునజ్ఞుడు  : అమ్మా! ఇంకా వెళ్ళలేదు అతడు సభాభవనానికి వెళ్ళే సమయంలో అతణ్ణి చూడటం కోసం నేను నిలువబడటానికి వీథిలోకి వెళ్ళుతాను.

పోర్షియా  : ఆయనకు నివేదించుకోవలసిందేదో నీకుంది గదూ? శకునజ్ఞుడు  : అవును తల్లీ! తన విషయం జాగ్రత్తపడవలసిందని నివేదించ దలచుకున్నాను. నా ప్రార్థన వింటే ఆయనకు ఎంతో మేలు జరుగుతుంది.

పోర్షియా  : ఏం, అతడిమీద ఉద్దేశింపబడ్డ ఉపద్రవాన్ని గురించి నీకేమైనా తెలుసునా?

శకునజ్ఞుడు  : స్పష్టంగా నాకు తెలియదు. ఏదైనా జరగవచ్చునని నా భయం. సుప్రభాతం, తల్లీ! ఇక్కడ వీథి చాలా ఇరుగ్గా ఉంది. సీజర్ వెంట పాదచారులై వచ్చే గుంపు, సభాసభ్యులు, చోపుదార్లు, సామాన్యజనం, బలహీనుణ్ణి నన్ను మరణపర్యంతం నొక్కివేస్తారు. నేను విశాలంగా ఉన్న ఒక ప్రదేశానికి చేరి ఘనుడైన సీజర్ వస్తున్నప్పుడు అతనితో మాట్లాడుతాను.

(నిష్క్రమిస్తాడు)

పోర్షియా  : నేనూ వెళ్ళిపోవాలి. (స్వగతం) అయ్యో! స్త్రీ హృదయం ఎంత బలహీనమైంది? బ్రూటస్! సాహస కృత్యంలో నీకు దేవతలు తోడ్పడెదరు కాక! నిజం, నేను చెప్పింది లూషియస్ వినిపించుకున్నాడు.

బ్రూటస్ చేసే ఒక నివేదిక ఉంది దానికి సీజర్ ఇష్టపడడు. అయ్యో! నా శరీరం తిరిగిపోతున్నది. లూషియస్! పరుగెత్తుకో వెళ్ళి బ్రూటస్ తొ నన్ను గురించి చెప్పు. ఆనందంతో ఉన్నానని చెప్పు. నీతో ఆయన ఏమన్నారో తిరిగి వచ్చి నాతో చెప్పు.

(ఒంటరిగా నిష్క్రమిస్తుంది.)

తృతీయాంకం'

'ఒకటో దృశ్యం'

సభాభవనం ముందు సభ్యులు పైన సభ జరుపుతుంటారు సభాభవనానికి వెళ్ళే జనసమూహం వారిలో ఆర్టిమిడోరస్, శకునజ్ఞుడు ఉంటారు తుత్తరస్వరం వినిపిస్తుంటుంది. సీజర్ బ్రూటస్, కాషియస్, కాస్కా, డెనిషియస్, మెటిల్లస్, ట్రెబోనియస్, సిన్నా, ఆంటోనీ, లెపిడస్, పొపిలియస్, పబ్లియస్ తదితరులూ ఉంటారు.

సీజర్  : మార్చి పదిహేను వచ్చింది.

శకునజ్ఞుడు  : ఔను! ఇంకా గడవలేదు.

ఆర్టిమిడోరస్  : సీజర్! ఈ వినతిపత్రాన్ని చదువు.

డెషియస్  : ట్రెబోనియస్ తన వినతిపత్రాన్ని అమూల్యమైన మీ విశ్రాంతి కాలంలో వినిపించమని అర్థిస్తున్నాడు.

ఆర్టిమిడోరస్ : సీజర్! నా పత్రాన్ని ముందు తిలకించండి. దీనితో సీజర్ కు మిక్కిలి సన్నిహిత సంబంధం ఉంది. తప్పక చదవండి సీజర్!

సీజర్  : నాకు సంబంధం ఉన్నదాన్ని అన్నిటికంటే చివరకు చూడాలి.

ఆర్టిమిడోరస్  : సీజర్! ఆలస్యం చెయ్యకండి. వెంటనే చదవండి.

సీజర్  : ఏమిటి? ఇతడికేమైనా వెర్రి ఎక్కిందా?

పబ్లియస్  : ఏయ్! ప్రక్కకు తొలుగు.

కాషియస్ : ఈ పత్రాలను సమర్పించటానికి మీకు వీథి దొరికిందా? ఏమా తొందర? సభాభవనానికి రండి.

సీజర్ సభాభవనానికి వెళ్ళుతుంటాడు; అందరూ అనుసరిస్తారు.

పొపిలియస్  : ఇవాళ మీ సమస్తోద్యోగాలకూ విజయం చేకూరుగాక!

కాషియస్  : ఏమి ఉద్యోగమోయ్, పొపిలియస్! పొపిలియస్ : విజయం చేకూరుగాక!

బ్రూటస్  : అది పొపిలియసేనా? ఏమిటి అంటున్నాడు?

కాషియస్  : ఈ నాటి మీ ఉద్యోగాలన్నిటికీ విజయం చేకూరుగాక అని అంటున్నాడు. మన ఉద్దేశం బయటపడి పోయిందేమో అని నాకు అనుమానంగా ఉంది.

(సీజర్ ను అనుసరిస్తాడు)

బ్రూటస్  : గమనించు. అతడు సీజర్ దగ్గిరికి ఎలా వెడుతున్నాడో గమనించు.

కాషియస్  : కాస్కా, హఠాత్తుగా ప్రవర్తించాలి మనను కనిపెట్టారేమోనని అనుమానంగా ఉంది. బ్రూటస్ మహాశయా! మనకు కర్తవ్య మేమిటి? ఇది తెలిసిపోయిందా, కాషియస్ మళ్ళీ తిరిగి వెళ్ళడు. నన్ను నేనే చంపుకుంటాను.

బ్రూటస్  : కాషియస్! స్థైర్యం వహించు. పొపిలియస్ లేదా సీజర్ తొ మన ఉద్దేశాన్ని గురించి మాట్లాడినట్లు కనిపించటం లేదు.

కాషియస్  : ట్రెబోనియస్ కు నిర్ణీతకాలం తెలుసు. చూడు, అతడు సమయానికి మార్క్ ఆంటోనీని అవతలికి తీసుకోపోతున్నాడు.

(ఆంటోనీ, ట్రెబోనియస్ నిష్క్రమిస్తారు)

డెషియస్  : మెటిల్లస్ సింబర్ ఏడి? అతణ్ణి వెళ్ళమనండి. సీజర్ కు వెంటనే అతడి వినతిని సమర్పించమనండి.

బ్రూటస్  : అతడు సిద్ధంగానే ఉన్నాడు. దగ్గరకురా. అతడికి సాయం వెళ్ళు.

సిన్నా : కాస్కా, నీవు మొదటిపోటు పొడవాలి.

సీజర్ : మనమందరం సిద్దమేనా? సీజర్, అతడి సభాజనం సరిదిద్దవలసిన లోపాలేమిటి?

మెటిల్లస్  : ఘనకీర్తీ, బలశాలీ, సాహసీ, సీజర్! మెటిల్లస్ సింబర్ సవినయంగా మీ మహాసనానికి తన హృదయాన్ని నివేదనగా ఇచ్చి... (వంగుతాడు)

సీజర్  : సింబర్, ఈ రీతిగా నీవు ప్రణమిల్లటాన్ని22 నేను అంగీకరించరాదు. ఇలా వినమ్రం కావటం వల్లా, ప్రణామాలర్పించటం వల్లా ఎవరైనా జన సామాన్యులు, పసిబిడ్డల్లా, తొలిగా తాము చేసుకొన్న నిర్ణయాలను మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ సీజర్ యెడ ఇటువంటివి నిష్ప్రయోజనాలు. తీయని ఉపోద్ఘాతాలు, వినమ్రప్రణామాలు, గోమాయువినయాలు మొదలైన ఆచారాలు అల్పబుద్ధులను కరిగించి నిర్ణయాలను మార్చుకొనేటట్లు చేయగలుగుతున్నవి గదా అనే ఉద్దేశంతో ప్రయోగిస్తు న్నట్లున్నావు! వాటికి లొంగే రక్తం సీజర్ శరీరంలో ఉందని భావించి భ్రమపడకు. దీర్ఘంగా ఆలోచించి నిర్ణయించే మీ అన్నను దేశభ్రష్టుణ్ణి చేశాం. అతడికోసం నీవు ఇలా వంగి ప్రణమిల్లుతుంటే నిన్ను నేనడిచే మార్గంలో ఉన్న ఒక గజ్జికుక్కగా అసహ్యించుకుంటాను. అంటే సీజర్ తప్పిదం చెయ్యడనీ, తగిన కారణంలేకుండా అతడు సంతృప్తిని పొందడనీ తెలుసుకో.

మెటిల్లస్  : దేశబహిష్కృతుడైన మా అన్నమీద అభిశంసనాన్ని రద్దు చేయవలసిందని అర్థించటానికి, సీజర్ చెవులకు నా కంఠంకంటే మధురంగా వినిపించే మరో కంఠం ఈ సభలో ఏదీ లేదా?

బ్రూటస్ : సీజర్, నీ హస్తాన్ని చుంబిస్తున్నాను. ఇది నిన్ను స్తోత్రం చేయటానికి కాదు. పబ్లియస్ సింబర్ మీది అభిశంసనాన్ని తక్షణం రద్దుచేసి, అతడికి స్వాతంత్య్ర ప్రదానం చెయ్యటానికి.

సీజర్  : ఏమంటావు బ్రూటస్?

కాషియస్  : సీజర్! క్షమించు. పబ్లియస్ సింబర్ స్వేచ్ఛ కోసం కాషియస్ మీ పాదపర్యంతం వినమ్రుడౌతున్నాడు.

సీజర్  : నేను మీరే అయి ఉంటే కరిగిపోయి చలించేవాణ్ణి. ఇతరుల మనస్సులు కరగటానికి నేను ప్రార్థించేవాణ్ణి అయి ఉన్నట్లయితే ఇతరుల ప్రార్థనలకు నేను కరిగేవాణ్ణి. కానీ నేను ధ్రువతారలా నిశ్చలుణ్ణి. అన్నీ అగ్నిగోళాలే. ప్రకాశవంతాలే. ఆకాశమంతా ఈ అగ్నిగోళాలతోనే అలంకృతమై ఉంటుంది. అయితే, ధ్రువతార సుస్థిరస్థానాన్ని ఆక్రమించగల సామర్థ్యం వీటిలో దేనికీ లేదు. ఇదేరీతిగా ప్రపంచమంతా మానవులతో నిండి ఉంది. వీరు చర్మరక్తోపేతులు, విజ్ఞానవంతులు. అయితేనేం? వీరందరిలో ఎట్టి భయం లేకుండా నిశ్చలంగా తన స్థానాన్ని నిలుపుకుంటున్న ఒక్క వ్యక్తిని నే నెరుగుదును. ఆ వ్యక్తిని నేనే. ఈ విషయంలో, సింబర్ను బహిష్కృతుని చేయటంలో కూడా, నేను అచంచలుడనని నన్ను నిరూపించనివ్వండి.

సిన్నా : సీజర్, ప్రభూ...!

సీజర్  : మీరు ఇక్కడినుంచి వెళ్ళిపొండి, ఒలింపస్" పర్వతాన్ని ఎత్తటానికి యత్నిస్తారు! డెషియన్ : బ్రూటస్ మహాశయుని ప్రణామం కూడా ప్రయోజన రహితమైపోతుందని మీరు గమనిస్తున్నారా?

కాస్కా : ఇక నా నోరు మాటాడదు చేతులే పూనుకుంటాయి.

సీజర్ ను మొదట కాస్కా, తరువాత ఇతర విద్రోహ వర్గసభ్యులు మార్కస్ బ్రూటస్ పొడుస్తారు :

సీజర్  : నీవు కూడానా బ్రూటస్? సీజర్, ఇక ఒరిగిపో.

సిన్నా : స్వేచ్ఛ! స్వాతంత్య్రం!! నిరంకుశత్వం వినాశమైపోయింది. ప్రజలారా! ఇక్కడినుంచి వేగంగా వెళ్ళిపొండి. ఈ వార్తను వీధివీథులా ప్రకటించండి.

కాస్కా : కొందరు ప్రజావేదికల దగ్గిరకు వెళ్ళండి. 'స్వేచ్ఛ లభించింది, స్వాతంత్య్రం చేకూరింది. సత్వం లభ్యమైంది' అని కేక పెట్టండి.

బ్రూటస్ : ప్రజలారా! సభాసభ్యులారా!! భయపడకండి. పరిగెత్తిపోకండి. మా ఆశ, మా ఆశయం, లభించింది.

కాస్కా : బ్రూటస్, మీరు వేదికమీదికి వెళ్ళండి.

డెషియస్ : కాషియస్, నీవు కూడా.

బ్రూటస్ : పబ్లియస్! ఏడీ?

సిన్నా  : ఇడుగో, ఇక్కడ ఈ విప్లవానికి విస్తుపోయి నిలుచున్నాడు.

మెటిల్లస్ : ఇక్కడ మనమందరం గుమిగూడి నిలుచుందాం. లేకపోతే సీజర్ మిత్రులెవరైనా...

బ్రూటస్  : గుమిగూడి నిలుచోటాన్ని గురించి చెప్పకు. పబ్లియస్, సంతోషంతో ఉండు. నీ శరీరానికి ఏ ప్రమాదం లేదు. నీకే కాదు మరే రోమను పౌరుడికీ ఎట్టి ప్రమాదం లేదు. ప్రజలకలా ప్రకటించు.

కాస్కా : మా దగ్గరనుంచీ వెళ్ళిపో పబ్లియస్! లేకపోతే మీ మీదికి వచ్చే ప్రజావృద్ధుడవైన నీకు కూడా ప్రమాదాన్ని కల్గించవచ్చు.

బ్రూటస్  : నిజం. అలా చెయ్యి. మేము చేసిన ఈ కృత్యానికి మేము తప్ప ఇతరులెవ్వరూ బాధను పొందవద్దు.

ట్రెబోనియస్ తిరిగి ప్రవేశిస్తాడు.

కాస్కా : ఆంటోనీ ఎక్కడ?

ట్రెబోనియస్  : ఆశ్చర్యపడి ఇంటికి పారిపోయినాడు. పురుషులు, స్త్రీలు, బాలురు అందరూ దీన్ని ఒక మహాప్రళయ సమయంగా భావించి భయంతో పారిపోతున్నారు.

బ్రూటస్ : విధికన్యల్లారా! మీరు మమ్మల్ని ఏం చేయదలిచారో మేము ఎరుగుదుము. మేమూ మరణించవలసి ఉందని మాకు తెలుసు. ఇంకా ఈ భూమిమీద ఎన్నాళ్ళు మృత్యువుకోసం వేచి ఉండాలె నన్నదే మానవుల బాధ.

కాషియస్ : బ్రూటస్! మానవులు ఇంకా జీవించవలసిన కాలాన్ని గురించి ఎందుకు బాధపడాలి. ఒకరి ఇరవై సంవత్సరాల జీవితాన్ని త్రుంచిన వ్యక్తి తన మరణభయానికి గల కారణాన్ని కూడా త్రుంచివేయగలడు.

బ్రూటస్  : అయితే మరణమే మానవులకు క్షేమకరమని అంగీకరిస్తున్నా మన్నమాట! అతని మరణభయకాలాన్ని తగ్గించి అతడికి మనం మిత్రులుగా ప్రవర్తించామన్నమాట! నమ్రులు కండి. ఓ రోమను పౌరులారా! నమ్రులు కండి. మన మందరం మోచేతులదాకా హస్తాలను సీజర్ రక్తంలో ముంచెత్తుదాం. అతని రక్తంతో మనకత్తులకు మలామాచేద్దాం. తరువాత 'శాంతి, స్వేచ్ఛ, స్వాతంత్య్రం' అని కేకలు పెడుతూ, మన రక్తారుణకౌశేయాలను శిరస్సులపై కెత్తి జళిపిస్తూ విపణివరకూ పురోగమిద్దాం.

కాస్కా : అయితే, నమ్రులు కండి. హస్తాలను క్షాళనం చెయ్యండి. భవిష్యద్యుగాలలో, ఇంకా పుట్టని రాజ్యాలలో, పుట్టనిభాషలు గల ప్రజలో, ఈ నాటి దృశ్యాలను మరింకెన్నాళ్ళకు అభినయిస్తారో!

బ్రూటస్  : ధూళిలో, ప్రణామం చేస్తూ, పాంపే ప్రతిమపాదదేశంలో ఈ నాడు చచ్చిపడి ఉన్న సీజర్ రక్తం రంగస్థలాల మీద ఇకముందు రూపకాలలో ఎన్నిమార్లు స్రవిస్తుందో!

కాస్కా : అవును. ఎన్నిమార్లు ఈ దృశ్యం అభినయింపబడుతుందో అన్నిమారు మన బృందాన్ని దేశ స్వాతంత్య్ర ప్రదాతలుగా, స్వేచ్ఛాసముద్ధర్తలుగా కీర్తిస్తారు.

డెషియస్  : ముందు మన కర్తవ్యమేమిటి?

కాస్కా: మనం అందరం వెళ్ళిపోవాలి. బ్రూటస్ మనకు నాయకుడై మనలను నడిపిస్తాడు. అత్యుత్తమ సాహసోపేతాలైన రోమను పౌరజనహృదయాలతో, అతని అడుగుజాడలను మనం అనుసరించి గౌరవిద్దాం.

(ఒక సేవకుని ప్రవేశం)

బ్రూటస్  : నిశ్శబ్దం. ఎవరో వస్తున్నారు. ఆంటోనీకి మిత్రుడిలా ఉన్నాడు.

సేవకుడు  : బ్రూటస్ మహాశయా! ఈ రీతిగా మా యజమాని మీ యెడ వినమ్రభావాన్ని ప్రకటించమని ఆదేశించాడు. ఇలా భూస్పర్శగా మీకు ప్రణమిల్లమన్నాడు. ఇలా నివేదించ మన్నాడు.

"బ్రూటస్ ఉదాత్తుడు. విజ్ఞాని. వీరుడు, సత్యసంధుడు. సీజర్ మహాబలశాలి. సాహసోపేతుడు. రాచఠీవిగలవాడు, ప్రియమైనవాడు. అందువల్ల నేను బ్రూటస్ ను గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. సీజరంటే నాకు భయముండేదనీ, అందువల్ల అతణ్ణి ప్రేమించాననీ, గౌరవించాననీ చెప్పు. భద్రంగా అంటోనీ తనవద్దకు రావటానికీ, సీజర్ మృత్యు శయ్యను చేరటానికీ యోగ్యుడని భావించి అనుజ్ఞనిస్తే, మార్క్ ఆంటోనీ సజీవుడైన బ్రూటస్ కంటే మృతుడైన సీజర్ ను అధికంగా ప్రేమించడని చెప్పమనీ నన్ను కోరాడు. ఉదాత్తుడైన బ్రూటస్ ను అతడికి సర్వవ్యవహారాలలో, మంచిచెడ్డల్లో, సత్ప్రవర్తనతో ఒక్కటై అనుసరిస్తానని చెప్పు” మని మా యజమాని మార్క్ ఆంటోనీ చెప్పి పంపాడు.

బ్రూటస్ : మీ యజమాని తెలివిగలవాడు రోమన్ వీరుడు. అతణ్ని గురించి నాకెపుడూ ఎటువంటి దురభిప్రాయం లేదు. ఇక్కడికి రావటం అతడికి అభీష్టమైతే సీజర్ ను తుదముట్టించినందుకు తగ్గ కారణాలను వినగలడనీ, క్షేమంగా తిరిగి వెళ్ళగలడనీ నా గౌరవం మీద ప్రమాణం చేసి చెప్పానని చెప్పు.

సేవకుడు  : వెళ్ళి వారిని వెంటనే ఇక్కడికి తీసుకోవస్తాను.

(నిష్క్రమిస్తాడు)

బ్రూటస్ : అతణ్ణి మిత్రుణ్ణి చేసుకోవటం మనకు అవసరమనీ, క్షేమమనీ నాకు తెలుసు.

కాషియస్  : అదే నా అభీష్టం కూడాను. కానీ అతడు మనకు మిత్రుడుగా ఉంటాడా అని అనుమానంగా ఉంది. అదీగాక నా అనుమానాలు సర్వవేళలా సత్యాలౌతున్నవి.

(ఆంటోనీ పునఃప్రవేశిస్తాడు)

బ్రూటస్  : అడుగో ఆంటోనీ ఇక్కడికి వస్తున్నాడు... మార్క్ అంటోనీ, నీకిదే స్వాగతం!

ఆంటోనీ : మహాబలశాలీ, సీజర్! నీకింతటి పతనం సంభవించిందా? నీ జైత్రయాత్రలు, కీర్తిప్రతిష్ఠలు, విజయాలూ సర్వం నిన్ను ఈ దుఃస్థితికి తీసికోవచ్చాయా? నీకు వీడ్కోలు! ఓ మహోదారులారా! మీ మహాశయాలేమిటో, ఇంకా ఎవరెవరి రక్తం స్రవించాలో నాకు తెలియదు. మీరు అందులో నన్ను ఒకణ్ణిగా భావిస్తే సీజర్ మరణించిన ఈ సమయంకంటే మంచిది నాకెక్కడ లభిస్తుంది? ప్రపంచంలో కెల్లా మహోదారమైన రక్తాన్ని మైపూత గావించుకొన్న మీ శస్త్రాలకంటే నా మృతికి మంచి సాధనా లెక్కడ దొరుకుతాయి? నా మీద మీకేమైనా ఉంటే రక్తారుణమైన మీ హస్తాలతడి ఆరకముందే మీ ఆనందాన్ని తీర్చుకోండి. నేను ఇంకా వేయి సంవత్సరాలు జీవించినా మరణించటానికి ఇంతకంటే సుసమయం నాకు కలగదు. సీజర్ తో పాటు మరణించే అవకాశాన్ని ప్రసాదించగల ఈ ప్రదేశం కంటే మరో తావు నాకు తృప్తిని కలిగించలేదు. ఈ యుగం ఎన్నుకున్న ఉత్తములూ, మహోదారాశయులూ అయిన మీ సాధనాల కంటే, సీజర్ మృతికి సాధనాలైన సాధనాలకంటే, మంచివి నా కెప్పుడూ లభించవు.

బ్రూటస్  : ఆంటోనీ! మరణదానం చెయ్యండని మమ్మల్ని అర్థించవద్దు. ప్రస్తుతం మేము నిర్వర్తించిన ఈ కృత్యం వల్ల మమ్మల్ని రక్తపిపాసువులుగా, క్రూరులుగా ప్రదర్శించే మా హస్తాలు మాత్రమే నీకు కనిపిస్తాయి కానీ మా హృదయాలు గోచరించవు. అవి కరుణారసపూరితాలు. రోముకు జరుగుతూ వచ్చిన అపచార విషయంలో అవి కరుణారసపూరితాలు. ఒక అగ్ని మరో అగ్నిని తరిమివేసినట్లు ఒక కరుణ మరో కరుణను తరిమివేసింది. రోము ప్రజలమీది మా కరుణ సీజర్ మీది కరుణను పారద్రోలింది సీజర్ యెడ ఈ కృత్యాన్ని చేయించింది. నీ యెడ మా ఖడ్గాలు బండవారినవి. వాటికి అంచులు తప్పినవి. మా శస్త్రాలు నిరంకుశత్వం విషయంలో ఈర్ష్యాయుతాలు. మా హృదయాలు నీ యెడ భ్రాతృప్రేమ వహిస్తున్నవి. నిన్ను ప్రేమతో, గౌరవంతో, సదుద్దేశంతో ఆహ్వానిస్తున్నవి.

కాస్కా : ఉద్యోగ ప్రదానాలలోనూ, పోషణత్వ పాలనలోనూ మా అందరితో తుల్యంగా నీ మాట చెల్లుబడి ఔతుంది.

బ్రూటస్ : ఇక్కడ గుమిగూడిన జనానికి భయాన్ని పోగొట్టి ప్రశాంతిని కల్పించేటంతవరకూ కొంచెం ఓపిక పట్టు. నీకు కారణాలను వినిపిస్తాము. సీజర్ యెడ అంతటి ప్రేమగల నేను గూడా ఎందుకతడి యెడ ఇలా ప్రవర్తించానో తెలియ జెపుతాను.

ఆంటోని  : మీ విజ్ఞానాతిశయంమీద నా కెన్నడూ సంశయం లేదు. మీలో ప్రతి ఒక్కరూ రక్తప్లావితమైన హస్తాలను నాకందివ్వండి. కరచాలనం చేస్తాను. మొదట మార్కస్ బ్రూటస్, తరువాత కేయస్ కాషియస్, పిమ్మట డెషియస్ బ్రూటస్, మెటిల్లస్, సిన్నా, వీరాధివీరుడవైన నా కాస్కా! ఇప్పుడు నీ హస్తాన్ని అందించు. తుదిదైనా అనురాగంలో ప్రథమమైన నీ హస్తమేది ట్రెబోనియస్? - మీరందరూ ఉదాత్తవ్యక్తులు.

అయ్యో! మీతో నేనేమి సంభాషించాలో నాకు తెలియటం లేదు. నా కీర్తికి నిలువ నీడ తప్పింది. సీజర్ ను పరిత్యజిస్తున్నందుకు మీరు నన్ను భీరువుననైనా భావిస్తారు, లేదా స్తోత్ర పాఠకుడినని అయినా అనుకుంటారు. రెండు రీతులా చెడుగానే తలపోస్తారు.

సీజర్! నిన్ను నేను సత్యంగా ప్రేమించాను. ఇప్పుడు మమ్మల్ని చూస్తే, నీ కళేబరం ముందే, నీ ఆంటోనీ, నీ శత్రువులు రక్తహస్తాలతో కరచాలనం చెయ్యటం చూస్తే, నీ అంతరాత్మ మరణ సమయంలో పొందిన వేదనకంటే, ఓ మహోదారా! అధికవ్యథ పొందకుండా ఉండగలుగుతుందా? నీ శరీరం మీద పడ్డ పోట్లన్ని కన్నులు నాకుంటే, నీ గాయాలు రక్తాన్ని చిమ్మినట్లు అవి కన్నీరు కారుస్తుంటే, నీ శత్రువులతో మైత్రికంటే నా కటువంటి స్థితే ఎంతో ఆనందదాయకమైంది కదా!

జూలియస్! నన్ను క్షమించు. ఓ వీరమృగమా! నిన్ను ఇక్కడివారందరూ చుట్టుముట్టారు ఇక్కడ నీవు భూమిమీది కొరిగావు. నిన్ను వేటాడినవారు ఇక్కడే నీ మీద పొందిన విజయ చిహ్నమైన నీ అరుణారుణరక్తకాంతితో నిలిచి ఉన్నారు. ఓ ప్రపంచమా! నీవనే అరణ్యంలో సీజర్ మహామృగం అతిస్వేచ్ఛగా సంచరించింది. ఈ మృగమే సర్వ ప్రపంచానికీ హృదయమై వర్తించింది. ఓ సీజర్, ఒక హరిణంలా, అనేక రాజకుమారులు ఏకకాలంలో వేటాడి దెబ్బలు కొట్టిన హరిణంలా, ఇక్కడ పడి ఉన్నావా?

కాషియస్  : మార్క్ ఆంటోనీ!

ఆంటోనీ  : కేయస్ కాషియస్ నన్ను క్షమించు. ఈ స్థితిలో సీజర్ పరమశత్రువులు కూడా ఈ మాత్రం పలకకుండా ఊరుకోలేరు ఇక మిత్రుడనైన నా విషయంలో ఇది ఎంత?

కాషియస్  : నీవు సీజర్ ను స్తుతిస్తున్నందుకు నిన్ను నేనేమీ అనటం లేదు. అయితే నీవు మాతో ఎట్టి సంబంధాన్ని పెట్టుకుందామని అనుకుంటున్నావో తెలుసుకుందామని. నిన్ను మా మిత్రుల్లో ఒకణ్ణిగా లెక్కించుకోమన్నావా? లేక నీ జోక్యం పెట్టుకోక మా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించమన్నావా? ఆంటోనీ  : ఆ జోక్యం కోసమేగదా మీతో మైత్రినాశించి కరచాలనం చేసింది! కానీ దృష్టి సీజర్ మీద నిలిచినప్పుడు నేను విషయం సర్వం మరిచిపోయినాను. నేను మీ అందరితో మైత్రినే అర్థిస్తున్నాను అంతే కాదు, మీ యెడ అనురాగం వహిస్తున్నాను ఏ రీతిగా, ఏ కారణంగా సీజర్ అపాయకారి అని మీరు భావించారో నాకు నిరూపిస్తారని ఆశిస్తున్నాను.

బ్రూటస్  : కారణాలు చెప్పి మేము నిన్ను తృప్తిపరచలేకపోతే చేసిందొక పాశవిక కృత్య మౌతుంది. మా కారణాలు ఎంతో బలవత్తరమైనవి. నీవే సీజర్ కు పుత్రుడవై ఉన్నా వాటిని విన్నప్పుడు అవి నిన్ను తృప్తి పరచగలవనే మా నమ్మకం.

ఆంటోనీ  : నాకు కావలసింది కూడా అదే మరేమీ మిమ్మల్ని కోరబోను. అంతే కాదు, సీజర్ కళేబరాన్ని విపణి ప్రదేశానికి తీసుకోవెళ్ళి సభావేదికమీద నిల్చి, మిత్రుడికి యోగ్యమైన రీతిగా ఉపన్యసించేటందుకు నా కనుజ్ఞ ఇవ్వవలసిందని మిమ్మల్ని అర్థిస్తున్నాను.

బ్రూటస్  : ఆంటోనీ! అందుకు మేము అంగీకరిస్తున్నాం.

కాషియస్  : బ్రూటస్! ఒక్కమాట! (అపవారితం) ఏం చేస్తున్నారో మీకు అర్థం కావటంలేదు. సీజర్ అంత్యక్రియల సందర్భంలో అంటోనీ ఉపన్యసించ టానికి అంగీకరించకండి. అతడి ప్రసంగం వింటే జనం ఎంతగా చలించిపోతారో మీకు తెలుసునా?

బ్రూటస్  : క్షమించు. ముందుగా నేను వేదికెక్కి సీజర్ ను మన మెందుకు తుదముట్టించామో తెలియజేస్తాను. మా అంగీకారంతోటే ఆంటోనీ ప్రసంగిస్తున్నాడనీ, మా అందరికీ సీజర్ అంత్యక్రియోత్సవాలు సక్రమంగా సాగిపోవటం సంతోషకరమైన విషయమనీ ప్రజలకు ప్రకటిస్తాను. ఇందువల్ల మన సదుద్దేశాలు వారికి అర్థమైపోతాయి. మనకెంతో ప్రయోజనం చేకూరుతుంది.

కాషియస్  : ఈ పనివల్ల ఏం జరగనున్నదో నాకేమీ బోధ పడటం లేదు కానీ ఇది నాకు అణుమాత్రం మనస్కరించటం లేదు.

బ్రూటస్  : మార్క్ ఆంటోనీ! ఇదిగో, సీజర్ మృతకళేబరం. విపణి ప్రదేశానికి తీసుకోపో. నీ ఉపన్యాసంలో మామీద దోషారోపణలు చేయరాదు సుమా! సీజర్ ను గురించి ఎంతైనా మంచి చెప్పు. - అంతేకాదు, మా అనుజ్ఞతో మాట్లాడుతున్నా నని ప్రజలకు ప్రకటించు. లేకపోతే అతడి అంత్యక్రియోత్సవాలలో నీకు ఎట్టి స్థానముండదు. నేను మాట్లాడిన వేదికమీదనే, నా ప్రసంగం ముగిసిన తరువాతనే నీవు మాట్లాడవలసి ఉంటుంది.

ఆంటోనీ  : అలాగే కానివ్వండి. అంతకంటే నాకేమీ అవసరం లేదు కూడాను.

బ్రూటస్  : అయితే సీజర్ శరీరాన్ని అంత్యక్రియోత్సవాలకు అనుగుణంగా అలంకరించు. మమ్మల్ని అనుసరించు.

(ఆంటోనీ తప్ప తదితరులంతా నిష్క్రమిస్తారు)

ఆంటోనీ  : క్షమించు. రక్తస్రవంతివైన ఓ సీజర్ మృతశరీరమా! నన్ను క్షమించు. ఈ కరకు కసాయివారియెడ పిరికినై మెత్తబడ్డాను క్షమించు. కాలపు ఆటుపోటుల్లో జీవించిన సమస్త మానవకోటిలో ప్రథమోదాత్తుని శిథిలరూపానివి నీవు. నీ అమూల్యరక్తాన్ని ఇలా చిందించిన ఆ హస్తాలకు వినాశం కలుగుగాక! నీ గాయాలు మూగనోళ్ళతో నా కంఠాన్ని విప్పి మాట్లాడమని నన్ను ప్రార్థిస్తున్నవి. ఈ క్షతసంచయం సాక్షిగా మానవజాతి జీవితాల కొక మహాశాపం సంభవింపబోతున్నదని నేను జోస్యం చెపుతున్నాను. ఇటలీ దేశసర్వసీమలనూ అంతర్యుద్ధచ్ఛాయ లాచ్ఛాదితం చేస్తాయి. రక్తపాతం, వినాశం కలుగుతాయి. మహాదారుణ కృత్యాలు సర్వసామాన్యాలై పోతాయి. యుద్ధహస్తాలలో బిడ్డలు చిక్కుబడి, మరణించటం మొదలైన క్రూరచేష్టలు నిత్యోత్పన్నాలు కావటం వల్ల, తల్లులకు వికటాట్టహాసం తప్పనిదౌతుంది. ప్రతీకారవాంఛతో సీజర్ అంతరాత్మ నరకం నుంచీ విచ్చేసే ఏతీ" అనే ప్రతీకారదేవత తోడురాగా సర్వసీమల్లో స్వేచ్ఛాసంచారం చేస్తుంది. 'సర్వనాశన' మని క్షాత్రోన్మత్తకంఠంతో వికృతనినాదాలు వెళ్ళబోస్తుంది. అంత్యక్రియలకోసం ఆక్రోశించే మృతకళేబరాల ఆర్తనాదాలతో సమస్త ధరిత్రీమండలం మీద సీజర్ హత్య' అనే ఈ నీచకృత్యం వాసిస్తుంది.

(సేవకుడు ప్రవేశిస్తాడు.)

నీవు ఆక్టేవిస్ సీజర్ సేవకుడివి కదూ?

సేవకుడు  : అవును. మార్క్ అంటోనీ!

అంటోనీ  : అతణ్ణి రోముకు రావలసిందని సీజర్ ఉత్తరం వ్రాశాడు కదూ?

సేవకుడు  : అవును. అది చేరింది. ఆయన వస్తున్నాడు. ఆయన నోటి మాటగా మీతో చెప్పమన్నాడు. (సీజర్ కళేబరాన్ని చూస్తూ) అయ్యో! సీజర్ మహాశయా! ఆంటోనీ  : నీ హృదయం అతివిశాలమైందిగా కనిపిస్తున్నది. అవతలికివెళ్ళి సీజర్ కొసం దుఃఖించు. దుఃఖం అంటువ్యాధి వంటిది. నీ కన్నులను చూచి నా కన్నులు కూడా నీరు కారుస్తున్నవి. మీ ప్రభువు రోముకు వస్తున్నాడా?

సేవకుడు  : వారు ఈ రాత్రి రోము నగరానికి ఏడు లీగుల దూరంలో ఉంటారు.

ఆంటోని  : అతివేగంగా వెళ్ళిపో! ఇక్కడ ఏం జరిగిందో చెప్పు. రోము దుఃఖసముద్రంలో మునిగి ఉంది. మహా ప్రమాదకారిగా ఉంది. ఆక్టేవియస్ ప్రవేశించటానికి ఇంకా రోము ప్రమాదరహితం కాదని అతడికి నివేదించు. వెళ్ళు. కానీ, కొంచెమాగు నేను ఈ మృతశరీరాన్ని విపణి ప్రదేశానికి తీసికోవెళ్ళేదాకా నీవు వెళ్ళవద్దు. అక్కడ నేను నా గంభీరోపన్యాసం మూలంగా రక్తపిపాసువులైన వీరు చేసిన చేష్టను ప్రజలేరీతిగా స్వీకరిస్తారో ప్రయత్నించి చూస్తాను. అది చూచి అనుగుణంగా నీవు యువకుడైన ఆక్టేవియస్ తొ మాట్లాడవచ్చు. ఈ కళేబరాన్ని అక్కడికి చేర్చటానికి నాకు తోడ్పడు.

(సీజర్ శవంతో నిష్క్రమిస్తాడు)

'రెండో దృశ్యం '

విపణి ప్రదేశం. బ్రూటస్, కాషియస్ జనసమూహం ప్రవేశిస్తారు.

నగరనివాసులు  : మమ్మల్ని తృప్తి పరచాలి తృప్తి పరచండి.

బ్రూటస్  : మిత్రులారా! నన్ను అనుసరించండి. నా ప్రసంగం వినండి. కాషియస్, నీవు మరోవీథికి వెళ్ళు. జనాన్ని గుంపులుగా చేరకుండా పంపివెయ్యి. నన్ను వినదలచినవారు ఇక్కడ ఉండండి. కాషియస్ వెంట వెళ్ళదలచని వారు వెళ్ళిపొండి. సీజర్ వధకు కారణాలను బహిరంగం చేస్తాము.

ప్రథమ పౌరుడు  : నేను బ్రూటస్ ప్రసంగాన్ని వింటాను.

ద్వితీయ పౌరుడు  : నేను కాషియస్ ప్రసంగాన్ని వింటాను.

(కాషియస్ కొందరు పౌరులతో నిష్క్రమిస్తాడు. బ్రూటస్ వేదికమీదకు వెళ్ళుతాడు.)

తృతీయపౌరుడు  : మహోదారుడు బ్రూటస్ వేదికమీదికి వచ్చాడు. నిశ్శబ్దం.

బ్రూటస్ : తుదివరకూ ప్రశాంతంగా ఉండండి. రోము నగర నివాసులారా! దేశీయులారా!! ప్రియులారా!!! నేను వినిపించవలసిన కారణాలకోసం నా ప్రసంగాన్ని నిశ్శబ్దంగా వినండి. నామీద మీకున్న గౌరవాన్ని నిల్పి వినండి. మీరు విశ్వసించటంకోసం నా గౌరవాన్ని గౌరవించండి. విజ్ఞానంతో నా ప్రసంగాన్ని పరిశీలించండి. ఉత్తమరీతిని అవగతం చేసుకోవటానికి మీ జ్ఞాపకశక్తిని మేల్కొల్పండి. ఈ సభాసదుల్లో సీజర్ కు మిత్రుడెవరైనా ఉంటే అతడికి నే చెప్పేమాటలివి: “సీజర్ మీద నీకున్న ప్రేమకంటే అతడిమీద నాకున్న ప్రేమ అణుమాత్రం తీసిపోదు." అయితే ఆ మిత్రుడు నీవు సీజర్ కు ఎందుకు వ్యతిరేకంగా తిరిగావని ప్రశ్నిస్తే అతనికి నా సమాధానమిది. 'నేను వ్యతిరేకంగా తిరిగింది అతడిమీద తక్కువ ప్రేమ ఉండటంవల్ల కాదు రోముమీద అంతకంటే అధికమైన ప్రేమ ఉండటం వల్ల.' సీజర్ సజీవుడై ఉండి మీరంతా బానిసలుగా మరణించాలని కోరుకుంటున్నారా? సీజర్ ఒకడే మరణించి మీరంతా స్వతంత్రులై జీవించాలె నని కోరుకుంటున్నారా? సీజర్ నన్ను ప్రేమించాడు కనుక అతడి కోసం నేను దుఃఖిస్తాను. అతడు అదృష్టవంతుడైనాడు నేను ఆనందిస్తాను. అతడు వీరగుణోపేతుడు కనుక గౌరవిస్తాను. అతడు ఆశాపరుడైనాడు కనుక అంతమొందించాను. అతడి ప్రేమకు కన్నీరు, అదృష్టానికి ఆనందం, వీరగుణానికి గౌరవం, ఆశాపరతకు మృత్యువు - అన్నీ నాలో ఉన్నాయి. బానిసగా జీవించదలచిన నీచుడిక్కడ ఎవడైనా ఉన్నాడా? ఉంటే రావచ్చు. మాటాడవచ్చు. అతణ్ణి నేను అవమానించి ఆహ్వానిస్తున్నాను. స్వతంత్ర రోమునివాసిగా ఉండదలచుకోని మందబుద్ధి మీలో ఎవరైనా ఉన్నాడా? ఉంటే, రావచ్చు. మాటాడవచ్చు. అతణ్ణి నేను అవమానించి ఆహ్వానిస్తున్నాను. మాతృదేశాన్ని మన్నించి ప్రేమించని ఆటవికుడెవడైనా మీలో ఉన్నాడా? ఉంటే అతడు రావచ్చు. మాటాడవచ్చు. అతణ్ణి పరాభవించి నేనాహ్వానిస్తున్నాను - సమాధానం కోసం క్షణకాలం వేచి ఉంటాను.

అందరు  : ఎవరూ లేరు, బ్రూటస్, ఎవరూ లేరు!

బ్రూటస్  : అయితే నేను ఎవర్నీ, అవమానించలేదన్నమాట! అత్యాశాపరుడ నైనప్పుడు నన్ను మీరందరూ ఏం చేస్తారో అంతకుమించి సీజర్ ను నేనేం చెయ్యలేదన్నమాట! ఎట్టి పరిస్థితుల్లో అతడికి మరణాన్ని కల్పించామో ఆ విషయమంతా సభాభవనంలో గ్రంథస్థం చేసే ఉంచాం. సీజర్ కీర్తిప్రతిష్ఠలను అణుమాత్రమైనా తగ్గించలేదు. మరణాన్ని తెచ్చిపెట్టిన అతడి దోషాలను విశేషంగా ఉటంకించనూ లేదు.

(సీజర్ మృతకళేబరంతో ఆంటోనీ, ఇతరులూ ప్రవేశిస్తారు.)

అదిగో, సీజర్ మృతకళేబరం వస్తున్నది. వెంట ఆంటోనీ దుఃఖిస్తూ వస్తున్నాడు. అతడికి సీజర్ వధతో ఎట్టి సంబంధం లేకపోయినా, అతడు మన గణతంత్ర రాజ్యంలో ఉచితపాత్ర వహిస్తాడు. ఆ రాజ్యంలో మీలో ఉచితపాత్ర వహించనివారెవరు గనక? రోము సంక్షేమంకోసం నన్ను అత్యధికంగా ప్రేమించే వ్యక్తిని వధించాను. దేశం కోరుకుంటే నా మరణం కోసం కూడా ఉపయోగించటానికి అదే ఆయుధాన్ని దాచి ఉంచుతాను.

పౌరులు  : బహుకాలం జీవించు బ్రూటస్, బహుకాలం జీవించు.

ప్రథమ పౌరుడు : విజయోత్సవాలతో బ్రూటస్ ను అతడి ఇంటివరకూ అనుసరిద్దాం.

ద్వితీయ పౌరుడు : అతడి వంశీయుల వరుసలో బ్రూటస్కు ఒక ప్రతిమను నిలుపుదాం.

తృతీయ పౌరుడు  : అతణ్ణి సీజర్ ను చేద్దాం.

చతుర్థ పౌరుడు  : సీజర్ కుండవలసిన గుణాలన్నీ బ్రూటస్ ను వరించాయి.

ప్రథమ పౌరుడు  : కరతాళధ్వనులతో, హర్షనాదాలతో, అతడి ఇంటిదాకా మనం బ్రూటస్ ను అనుసరిద్దాం.

బ్రూటస్  : స్వదేశీయులారా!...

ద్వితీయపౌరుడు  : ప్రశాంతి. నిశ్శబ్దం. బ్రూటస్ ప్రసంగిస్తున్నాడు.

ప్రథమ పౌరుడు  : నిశ్శబ్దం! నిశ్శబ్దం!!

బ్రూటస్  : గుణవంతులైన దేశీయులారా! నన్ను ఒంటరిగా ఇంటికి వెళ్ళనివ్వండి.మీరు నన్ను అనుసరించ నవసరం లేదు. మా అనుజ్ఞ పొంది ఆంటోనీ ప్రసంగిస్తున్నాడు. నాకోసం మీరు అందరూ అతడి ప్రసంగాన్ని వినండి. సీజర్ మృతకళేబరాన్ని గౌరవించండి. నేనొకణ్ణి తప్ప ఆంటోనీ తన ఉపన్యాసాన్ని ముగించేటంతవరకూ ఎవరూ వెళ్ళిపోకండి. మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. ప్రథమ పౌరుడు : సోదరులారా! ఆగండి, మార్క్ ఆంటోనీ ప్రసంగాన్ని విందాం.

తృతీయ పౌరుడు  : అతడు వేదికను అలంకరించుగాక! మహాశయా, ఆంటోనీ! ప్రజాసనాన్ని స్వీకరించు.

ఆంటోనీ : బ్రూటస్ మహాశయునికోసం నేను ప్రసంగించవలసి వచ్చింది.

(వేదిక మీదికి వెళ్ళుతాడు)

చతుర్థ పౌరుడు : బ్రూటస్ ను గురించి ఏమిటో అంటున్నాడు.

తృతీయపౌరుడు : బ్రూటస్ కోసం తాను ప్రసంగం చేయవలసి వచ్చిందంటున్నాడు.

చతుర్ధ పౌరుడు : అతడు బ్రూటస్ కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా ఉంటే ఎంతో మంచిది.

ప్రథమ పౌరుడు  : ఈ సీజర్ నిరంకుశుడు.

తృతీయ పౌరుడు : రోముకు ఇతనిపీడ వదలిపోవటం మన అదృష్టం.

'ద్వితీయ పౌరుడూ : నిశ్శబ్దం. ఆంటోనీ ఏం చెపుతాడో విందాం.

ఆంటోనీ : మహాశయులారా! రోము పౌరులారా!!

పౌరులు  : నిశ్శబ్దం. మనం అతడు చెప్పింది విందాం.

ఆంటోనీ  : మిత్రులారా! రోము పౌరులారా!! దేశీయులారా!! ఇంచుక కర్ణదానం చెయ్యండి. మీ శ్రవస్సులకు శ్రమ కలిగిస్తున్నాను. నేను సీజర్ అంత్యక్రియలను జరపటానికి వచ్చాను. ఆయన్ను కీర్తించటానికి రాలేదు. మానవులు చేసే చెడుగులు వారితో అంతరించవు. అవి తదనంతరం కూడా జీవిస్తాయి. కానీ వారి మంచి మరణంతోనే గతిస్తుంది. సీజర్ విషయంలో కూడా ఇంతే ఔగాక! సీజర్ ఆశాపరుడని మహాశయుడు బ్రూటస్ మీకు వెల్లడించాడు. అది నిజమైతే నిజంగా బాధాకరమైన దోషమే! అంతే కాదు, సీజర్ అందుకు బాధాకరమైన ప్రతిఫలాన్ని అనుభవించాడు. బ్రూటస్, ఆయన అనుచరులైన ఇతరులు అనుజ్ఞతోటే నేను సీజర్ అంత్యక్రియల్లో ప్రసంగించటానికి వచ్చాను.

బ్రూటస్ గౌరవనీయుడు, ఆయన అనుచరులైన ఇతరులందరూ గౌరవనీయులు. సీజర్ నా నెచ్చెలి. విశ్వాస పాత్రుడు. అయినా బ్రూటస్ ఆయన్ను ఆశాపరుడంటున్నాడు. బ్రూటస్ గౌరవనీయుడు. సీజర్ ఎందరినో బందీలను గా రోము నగరానికి కొనివచ్చాడు. వారి ప్రాణపరిహార ద్రవ్యాన్నంతటినీ ప్రజాకోశానికి జమకట్టి దాన్ని నింపివేశాడు. ఇది సీజర్ ఆశాపరత్వమా? దరిద్రులు దుఃఖిస్తే సీజర్ దుఃఖించాడు. ఆశా పరత్వం ఇంతకంటే దారుణమైంది కదా? అయితేనేం బ్రూటస్ ఆయన్ను ఆశాపరుడంటున్నాడు. బ్రూటస్ గౌరవనీయుడు. లూపరకల్ ఉత్సవాలలో ముమ్మారు నేను ఆయనకు రాజకిరీటాన్ని అర్పిస్తే ఆయన ముమ్మారు తిరస్కరించటం మీరు కళ్ళారా చూచారు. ఇది ఆశాపరత్వానికి లక్షణమేనా? అయితేనేం? బ్రూటస్ ఆయన్ను ఆశాపరు డంటున్నాడు బ్రూటస్ గౌరవనీయుడు. బ్రూటస్ మాట్లాడింది కాదని నిరూపించటానికి నేను ఇక్కడికి రాలేదు నాకేం తెలుసునో చెప్పటానికి మాత్రమే వచ్చాను. మీరంతా ఒకప్పుడు సీజర్ను మనసిచ్చి ప్రేమించారు. కారణం లేకుండా ప్రేమించారా? నేడు మీరు ఆయన మరణానికి దుఃఖించటం లేదు. ఇలా మిమ్మల్ని అరికట్టిన ఆ ప్రబలమైన కారణమేమై ఉంటుంది. నిర్ణయమా! నీవీనాడు వన్యమృగాలను ఆశ్రయించావా? మానవులు తమ విచక్షణజ్ఞానాన్ని కోల్పోయారా? కాసేపు నా ప్రసంగాన్ని సహించండి. నా హృదయం అదిగో, అక్కడ, ఆ శవపేటికలో సీజర్ తొ బాటు నిలిచిపోయింది.

ప్రథమ పౌరుడు  : అతడు చెప్పేదాంట్లో ఏదో కొంత నిమిత్త మున్నట్లు నాకు గోచరిస్తున్నది.

'ద్వితీయ పౌరుడూ : విషయాన్ని, నీవు ఉచితరీతిని పరిశీలిస్తే సీజర్ లొ ఏదో దొడ్డదోషం ఉన్నట్లు అవగతమౌతుంది.

తృతీయ పౌరుడు  : అలాగా! అంతకంటే దుష్టుడైన నిరంకుశుడు అతడి స్థానాన్ని ఆక్రమిస్తాడేమోనని నాకు భయమేస్తున్నది.

చతుర్థ పౌరుడు  : "అతడు కిరీటాన్ని తిరస్కరించాడు" అన్న ఆంటోనీ మాటను గమనించావా? సీజర్ ఆశాపరుడు కాడనటానికి ఇది నిదర్శనం.

ప్రథమ పౌరుడు  : సీజర్ ఆశాపరుడు కాదన్న అంశం నిరూపితమైతే, హంతకులు తమ అకృత్యానికి తగ్గ అపరాధాన్ని చెల్లించి తీరవలసిందే.

ద్వితీయ పౌరుడు  : పాపం! ఏడ్చి ఏడ్చి ఆంటోనీ కన్నులు ఎంత ఎర్రబడి పోయాయి!

తృతీయపౌరుడు  : ఆంటోనిని మించిన మహోదాత్తుడు రోములేనే లేడు. చతుర్ధ పౌరుడు  : అడుగో! అతడు మళ్ళీ ప్రసంగాన్ని ప్రారంభించాడు.

ఆంటోనీ  : కానీ, నిన్నటివరకూ ప్రపంచమంతటా ఒకటైనా సీజర్ మాట నిల్వగలిగింది. ఈ నాడో అతిదీనంగా అతడు తన్ను గౌరవించేవారైనా లేకుండా ఇక్కడ పడి ఉన్నాడు. నేను మీ హృదయాలలో, మనస్సుల్లో విప్లవాన్ని, క్రోధాన్ని రెక్కెల్పే ఉద్దేశం కలవాణ్ణి కాదు. ఐతే బ్రూటస్ యెడ ద్రోహం చేసినవాణ్ణితాను కాషియస్ యెడ ద్రోహం చేసిన వాణ్ణితాను. వారు ఇరువురూ గౌరవనీయులు - మీరందరూ ఎరుగుదురు. నేను వారికి ద్రోహం చెయ్యను. అది నాకిష్టం లేదు. అంతకంటే నేను మరణించిన సీజర్ కు ద్రోహం చెయ్యటానికీ, నాకు ద్రోహం చేసుకోటానికీ, మీకు ద్రోహం చెయ్యటానికీ ఇష్టపడతాను. ఇదిగో! ఇది సీజర్ ముద్రాంకితమైన అజచర్మలేఖనం.30ఆయన అంతరృహంలో దొరికింది. ఇది ఆయన ఇచ్ఛాపత్రం! క్షమించండి. కానీ దీన్ని నేను చదవబోవటం లేదు. ఇందులోని విశేషాలు మీరంతా వింటే వెంటనే వెళ్ళి సీజర్ క్షతాలంకృతమైన మృతకళేబరాన్ని ముద్దెట్టుకుంటారు. ఆయన పవిత్రరక్తంలో మీ హస్త వసనాలను ముంచెత్తుకుంటారు. అంతే కాదు, అతని ఒక కేశఖండాన్ని జ్ఞాపకార్థ మర్థిస్తారు. మరణ సమయంలో వ్రాసి ఇచ్చే శాసనపత్రాలల్లో మీ మీ సంతానానికి ఇచ్చిపోతూ ఉన్న అమూల్య వారసత్వంగా దీన్ని తరువాత మీరు పేర్కొంటారు.

చతుర్ధ పౌరుడు  : మార్క్ ఆంటోనీ! మేమా పత్రాన్ని వినాలి. చదువు.

అందరూ  : ఇచ్ఛాపత్రం! మేము దాన్ని విని తీరాలి.

ఆంటోనీ  : ప్రియసోదరులారా! శాంతి వహించండి. దాన్ని నేను చదవకూడదు. సీజర్ మిమ్మల్ని ఎంత గాఢంగా ప్రేమించాడో తెలుసుకోవటం సమంజసం కాదు. మీరేమీ దారుమూర్తులుగానీ, శిలాఖండాలు కాని కాదు మానవులు! మానవులు కావటం వల్ల సీజర్ ఇచ్ఛాపత్రాన్ని వింటే ఉద్రేకపూరితు లౌతారు. అది మిమ్మల్ని ఉన్మత్తులను చేస్తుంది. మీరు ఆయనకు వారసులు కారని తెలుసుకోకుండా ఉండటమే మీకెంతో క్షేమాన్ని చేకూరుస్తుంది. ఎందువల్ల నంటారా? విన్నారనుకోండి. అయ్యో! దాని వల్ల ఫలితమేమిటి?

చతుర్థ పౌరుడు  : ఇచ్ఛాపత్రాన్ని చదువు అంటోనీ, అది మేము వినదలిచాం. సీజర్ ఇచ్ఛాపత్రాన్ని చదివి తీరాలి. ఆంటోనీ  : మీరు ప్రశాంత చిత్తంతో ప్రవర్తిస్తారా? మరికొంతసేపు శాంతి వహిస్తారా? మీతో ఈ పత్రప్రస్తావన తెచ్చి నేను చాలా హద్దు మీరాను. ఎవరి ఛురికలు సీజర్ ను పొడిచాయో, ఆ గౌరవనీయులయెడ అపచారం చేస్తున్నానని నాకెంతో భయం వేస్తున్నది.

చతుర్ధ పౌరుడు : వారు గౌరవనీయులా? ద్రోహులు!

అందరు  : సీజర్ ఇచ్ఛాపత్రం! ఆయన మరణశాసనం!

ద్వితీయ పౌరుడు  : వారు ద్రోహులు, హంతకులు. ఇచ్ఛాపత్రమేది? చదువు.

ఆంటోనీ  : మీరు నన్నీ ఇచ్ఛాపత్రాన్ని చదివి తీరాలని నిర్బంధిస్తున్నారా? అయితే మీరంతా చక్రాకృతిగా సీజర్ కళేబరం చుట్టూ చేరండి. ఈ ఇచ్ఛాపత్రాన్ని వ్రాసిన మహోదారుణ్ని మీకు చూపించటానికి నాకు అవకాశాన్ని కల్పించండి. నేను దిగి రానా? మీరు నాకు అనుజ్ఞ నిస్తున్నారా?

అందరూ: దిగిరా!

ద్వితీయ పౌరుడు  : దిగిరా!

తృతీయపౌరుడు  : మాకందరికీ ఇది అంగీకారమే.

చతుర్థ పౌరుడు  : మనమందరం చక్రాకృతిగా నిలుద్దాము.

ప్రథమ పౌరుడు  : శవపేటికకూ, కళేబరానికీ కొంతదూరంగా నిలవండి.

ద్వితీయ పౌరుడు  : మహాశయుడు ఆంటోనికి దారి ఇవ్వండి.

ఆంటోనీ  : మీరు నాకింత సన్నిహితంగా రావద్దు కొంతదూరంగా ఉండండి.

ద్వితీయ పౌరుడు  : కొంత వెనక్కు సర్దుకోండి. స్థలం చేయండి. వెనక్కు జరగాలి.

ఆంటోనీ  : మీకు కన్నీరుందా? ఉంటే కార్చటానికి సిద్దపడండి. ఈ మహోత్తరీయం మీకు చిరపరిచితమైందే. తొలుతగా సీజర్ దీన్ని ఎప్పుడు ధరించాడో నాకు బాగా జ్ఞాపకం." నెర్వైలమీద విజయాన్ని చేకొన్నరోజున, తన శిబిరంలో ఒకనాటి గ్రీష్మకాల సాయంసమయాన ఆయన దీన్ని ధరించాడు. చూడండి. కాషియస్ ఛురిక దూసుకోపోయింది ఇక్కడే. ఈర్యాపరుడైనా కాస్కా ఎంతటి ఘాతాన్ని కల్పించాడో చూడండి. దీని ద్వారానే అతిప్రియుడైన బ్రూటస్ పొడిచింది. బ్రూటస్ తన ఛురికను బయటికి లాగగానే ఇంత కరుణారహితంగా పొడిచింది బ్రూటస్ ఔనో కాదో తెలుసుకుందామని హఠాత్తుగా తలుపులు తెరుచుకుని వచ్చినట్లు చిమ్మింది. సీజర్ రక్తం. ఎందువల్లనంటే మీ అందరికీ తెలుసు సీజర్ కు బ్రూటస్ ద్వితీయ రూపమే గదా! ఓ దేవతలారా! నిర్ణయించండి. ఇదే అన్నింటిలోకి అతికరుణావిహీనమైన ఘాతుకమహోదాత్తుడు సీజర్ బ్రూటస్ తన్ను పొడవటం చూచాడు.

కృతఘ్నత ద్రోహుల బాహుదండాలకంటే బలవత్తరంగా కన్పించి తన్ను లోగొంటంవల్ల ఆయన హృదయం బద్దలైపోయింది. తన రక్తంతో ప్లావితమై తడిసి ఉన్న పాంపే ప్రతిమకు అది పాదదేశం అయినప్పటికీ మహత్తరుడు సీజర్ ఒరిగిపడిపోయాడు. ఈ పతనంతో నేనూ, మీరూ, ఇంకా ఇతరులు అందరూ పతనమైనారు. రక్తారుణమైన రాజద్రోహం మనమీద విజయం చేకొన్నది.

అయ్యో! మీరు ఇప్పుడు దుఃఖిస్తున్నారు. మీరందరూ కరుణారసప్రభావానికి లొంగిపోతున్నారా? మీ కన్నీరు ఎంత పవిత్రమైంది? ఓ కరుణారస పూరిత హృదయుల్లారా! ఏమిటి? సీజర్ ఉత్తరీయానికి తగిలిన గాయాలను చూచినంత మాత్రానికే ఇంతగా దుఃఖిస్తున్నారా? చూడండి. హంతకులు పిండలిచేసిన ఆయన్నే చూడండి.

(ఉత్తరీయాన్ని తొలగిస్తాడు)

ప్రథమ పౌరుడు  : ఎంత కరుణాన్విత దృశ్యమిది?

ద్వితీయపౌరుడు  : మహోదారా! సీజర్ మహాశయా!

తృతీయ పౌరుడు  : ఎంత దారుణమైన దినమిది?

చతుర్ధ పౌరుడు  : ఓ రాజద్రోహులారా! ఓ కుటిల హంతకులారా!!

ప్రథమ పౌరుడు  : అతిక్రూర దృశ్యం!

ద్వితీయ పౌరుడు  : ప్రతీకారం జరిగి తీరవలసిందే!

అందరు  : ప్రతీకారం! వెతకండి!! వెన్నాడండి!! చంపండి!! హతమార్చండి!! ఈ హంతకులను, ద్రోహులను బ్రతకనివ్వరాదు.

ప్రథమ పౌరుడు  : శాంతి వహించండి. మహోదాత్తుడు ఆంటోనీ ఏమో అంటున్నాడు వినండి.

ద్వితీయ పౌరుడు  : అతడు చెప్పేది విందాం అతణ్ణి అనుసరిద్దాం. అతడితో బాటు అవసరమైతే మరణిద్దాం. ఆంటోనీ  : ఉత్తమ మిత్రులారా! ప్రియ స్నేహితులారా!! నన్ను ఇంతటి విప్లవవాహినిని మేల్కొల్పినవాణ్ణిగా చేయవద్దు. ఉద్రేకపడవద్దు.

ఈ కృత్యాన్ని చేసినవారందరూ గౌరవనీయులు. ఈ పనిని చేయటానికి వ్యక్తిగతాలైన వ్యథలు వారి కేమున్నవో నాకు తెలియదు. వారు విజ్ఞానులు అంతేకాదు గౌరవనీయులు. వారు మనకు తగిన సమాధానాలు చెప్పగలరనే నా నమ్మకం.

మిత్రులారా! నేను మీ హృదయాలను దోచుకోపోవటానికి రాలేదు. బ్రూటస్ మహాశయునివలె నేనేమీ వక్తను కాదు. స్నేహితుణ్ణి గాఢంగా ప్రేమించిన కుటిలవర్తనలేని సూటైన మొరటువాణ్ణి. నాకు బుద్ధిబలం లేదు మాటలు రావు. విలువ లేనివాణ్ణి కార్యాచరణ శూన్యుణ్ణి. చెప్పలేను. ప్రజారక్తాన్ని ఉడుకెత్తించగల ప్రసంగ ప్రావీణ్యం నాకు లేదు. ఇదంతా వారికి తెలుసు. అందువల్లనే సీజర్ను గురించి ప్రసంగించటానికి వారు నాకనుజ్ఞ నిచ్చారు. నేను సూటిగా మాత్రమే మాట్లాడగలను. మీకు తెలిసిన విశేషమే, అయినా చెపుతున్నాను. మీతో నా బదులుగా మాట్లాడమని మధురహృదయుడూ, ప్రియుడూ అయిన సీజర్ మహాశయుని మూగనోళ్ళయిన గాయాలను చూపిస్తున్నాను. కానీ, నేనే బ్రూటస్ నై, బ్రూటసే ఆంటోనీ అయితే ఆ ఆంటోనీ సీజర్ ప్రతి గాయానికి ప్రాణం పోసి ఒక నాలుకిచ్చి పలికించి రోములోని శిలాఖండాల నన్నింటికీ చైతన్యాన్ని కల్పించి తిరుగుబాటు చేయింపగలిగి ఉండేవాడు.

అందరు  : ఇప్పుడు మేమూ విప్లవం చేస్తాం.

ప్రథమపౌరుడు  : బ్రూటస్ గృహాన్ని దగ్ధం చేస్తాం.

ద్వితీయపౌరుడు  : అయితే, పదండి! ద్రోహులను వెదకండి.

ఆంటోనీ  : అయినా, నా మాట వినండి, నన్ను మాట్లాడనివ్వండి.

అందరు  : శాంతించండి. ఆంటోనీ ప్రసంగం వినండి. అత్యుదాత్తుడు ఆంటోనీని వినండి.

ఆంటోనీ  : మిత్రులారా! మీరంతా విషయం ఏమిటో తెలుసుకోకుండా ఏమో చేయటానికి వెళ్లుతున్నారు. సీజర్ మీకు ప్రేమపాత్రుడు ఎందుకైనాడో తెలుసుకున్నారా? అయ్యో! మీకది తెలియదు. ఏమైతేనేం! మీకు నేను దాన్ని తెలియజేస్తాను. మీరు మీ ఉద్రేకంలో నేను చెప్పిన ఇచ్ఛాపత్రాన్ని గురించి మరచిపోయారు. అందరు  : సత్యం. ఏది ఆ ఇచ్ఛాపత్రం? మేమందరం అగి వింటాం.

ఆంటోనీ  : ఇదిగో, సీజర్ ముద్రాంకితమైన ఆయన ఇచ్ఛాపత్రం. ప్రతి ఒక్క రోము పౌరుడికీ ఆయన కొంత ఇచ్చి వెళ్ళాడు. వ్యక్తిగతంగా ప్రతి పౌరుడికీ ఆయన డెబ్బది ఐదు డ్రాక్మాల ధనమిచ్చాడు.

ద్వితీయ పౌరుడు  : అత్యుదాత్తా! సీజర్ మహాశయా!! మే మాయన ఘోర మరణానికి తగ్గ ప్రతీకారాన్ని పొంది తీరుతాం.

తృతీయపౌరుడు  : రాజఠీవిగల సీజర్ మహాశయా!

ఆంటోనీ  : ప్రశాంత చిత్తంతో వినండి.

అందరు  : నిశ్శబ్దం! నిశ్శబ్దం!!

ఆంటోనీ  : ఆయన తన స్థలాలనన్నిటినీ, తన ఏకాంత ప్రదేశాల నన్నిటినీ, టైబర్ నది ఆవలి ఒడ్డున క్రొత్తగా నాటించుకొన్న వనాల నన్నిటినీ మీ కోసం, మీ భవిష్యత్సంతతివారి కోసం సమష్టి విహారభూములుగా ఇచ్చిపోయాడు. ఆ మహాదానం చేసిన సీజర్ ఇడుగో! ఇటువంటి సీజర్ మళ్లీ ఎప్పుడు జన్మిస్తాడు ఎప్పుడు వస్తాడు?

ప్రథమ పౌరుడు  : ఎన్నడూ రాడు, రండి! పదండి ఆయన శరీరానికి ఒక పవిత్ర స్థలంలో దహన సంస్కారాన్ని కల్పించి, ఆ కొరువులతో ద్రోహుల గృహాలను దహించి వేద్దాం. పదండి. సీజర్ కళేబరాన్ని ఎత్తుకోండి.

ద్వితీయ పౌరుడు  : వెళ్ళి అగ్నిని తీసుకోరా!

తృతీయ పౌరుడు  : ఈ ఆసనాల నన్నింటినీ గుంజివెయ్యండి.

చతుర్థ పౌరుడు : ఆసనాలను, వాతాయనాలను, ఏది చిక్కితే దాన్ని గుంజివెయ్యండి.

(పౌరులు సీజర్ కళేబరంతో నిష్క్రమిస్తారు)

ఆంటోనీ  : ఈ ఉద్రేకం ఇక వ్యవహరించుగాక! ద్వేషమా! నీవు పయన మారంభించావు. స్వేచ్ఛానుసారంగా విహరించు.

(ఒక సేవకుడు ప్రవేశిస్తాడు.)

ఇదంతా చూస్తున్నావు గదా! ఎలా ఉంది? నీ అభిప్రాయమేమిటోయ్?

సేవకుడు  : బాబూ! ఆక్టేవియస్ ప్రభువు రోము నగరానికి వచ్చేశారు. ఆంటోనీ : అతడెక్కడున్నాడు?

సేవకుడు  : లెపిడస్ సీజర్ ఇంట్లో.

ఆంటోనీ : అయితే నేను వెంటనే అతణ్ణి కలుసుకోవాలి. సరిగా అతడు నేను కోరుకొంటున్న సమయానికే వచ్చాడు. అదృష్టదేవత మహానందంతో నర్తిస్తున్నది. ఇప్పుడు మనం ఏమి కోరుకుంటే దాన్ని ఇచ్చి తీరుతుంది.

సేవకుడు  : బాబూ! బ్రూటస్, కాషియస్ ఇరువురూ ఉన్మత్తవేగంతో రోము నగరం నుంచీ వెళ్ళిపోతున్నారని చెప్పుకుంటుంటే విన్నాను.

ఆంటోనీ  : బహుశః నేను ఏ విధంగా ప్రజలను ఉద్రేకపరిచానో వారు ముందుగా తెలుసుకొని ఉంటారు. నన్ను ఆక్టేవియస్ దగ్గరికి తీసుకోపో.

{

మూడో దృశ్యం

ఒక వీథి, సిన్నా కవి ప్రవేశిస్తాడు.

సిన్నా  : సీజర్ తోబాటు విందులో పాల్గొంటున్నట్లు రాత్రి నాకొక కల వచ్చింది. రాబొయ్యే ఆపదలను గురించి నా మనస్సు కళవళపడుతున్నది. వీధుల్లో తిరగాలెనని నాకు ఆసక్తి లేదు కాని ఏదో నన్ను ఇలా నడిపిస్తున్నది.

ప్రథమ పౌరుడు  : నీ పేరేమిటి?

ద్వితీయ పౌరుడు  : నీవు ఎక్కడికి వెళుతున్నావు?

తృతీయ పౌరుడు  : నీ నివాసం ఎక్కడ?

చతుర్ధ పౌరుడు  : నీవు వివాహితుడవౌనా? కాదా?

ద్వితీయ పౌరుడు  : అందరి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు.

ప్రథమ పౌరుడు  : ఔను. సంక్షిప్తంగా చెప్పు.

చతుర్ధ పౌరుడు  : యోచించి విజ్ఞానయుతంగా చెప్పు.

తృతీయ పౌరుడు  : సత్యం చెపుతున్నాం నిజం చెపితే నీకే క్షేమం.

సిన్నా : నా పేరేమిటా? నేను ఎక్కడికి వెళ్ళుతున్నానా? ఎక్కడ నివసిస్తున్నానా? వివాహితుడను ఔనా కదా? ప్రతి ఒక్కదానికీ సూటిగా, సంక్షిప్తంగా, జ్ఞానయుతంగా, సత్యంగా సమాధానాలు చెప్పాలా? - జ్ఞానినై చెపుతున్నాను నేను వివాహితుడును కాను.

'ద్వితీయ పౌరుడూ : అంటే వివాహం చేసుకున్నవాళ్ళు బుద్ధిహీనులని నీ భావమన్నమాట! ఇలా అయితే నీవు నా చేతిలో దెబ్బలు తింటావు. సూటిగా సమాధానం చెప్పు.

సిన్నా : సూటి సమాధానం కావాలా? నేను సీజర్ అంత్యక్రియల దగ్గరికి వెళ్ళుతున్నాను.

ప్రథమ పౌరుడు  : మిత్రుడివి గానా? శత్రుడిగానా?

సిన్నా  : మిత్రుడిగానే!

ద్వితీయ పౌరుడు  : ఈ విషయంలో సూటిగా సమాధానం చెప్పాడు.

చతుర్థ పౌరుడు  : మరి నీ నివాసం. సూటిగా చెప్పు.

సిన్నా : సూటిగానా - సభాభవనం ప్రక్కనే.

తృతీయ పౌరుడు  : సత్యం చెప్పు, నీ పేరు?

సిన్నా : సత్యంగా నా పేరు సిన్నా.

ప్రథమ పౌరుడు : ఇతణ్ణి ముక్కల క్రింద చీల్చివేయండి. ఇతడు ఒక హంతకుడు!

సిన్నా : నేను సిన్నా కవిని సిన్నా కవిని.

చతుర్థ పౌరుడు  : చెడ్డకవిత్వం చెప్పినందుకు అతణ్ణి చీల్చివేయండి. ముక్కల క్రింద చీల్చివేయండి.

సిన్నా : నేను ద్రోహినైన సిన్నాను కాను!

చతుర్థ పౌరుడు  : అయితేనేం? అతడి పేరు సిన్నా. అతడి గుండెలో నుంచి ఆ33 పేరును లాగివేయండి. ఆ తరువాత వెళ్ళిపోనివ్వండి.

తృతీయపౌరుడు  : చీల్చండి, చీల్చండి. తెండి, నిప్పుకాగడాలు. బ్రూటస్ ఇంటికి పొండి. కాషియస్ ఇంటికి పొండి. సర్వం దగ్ధం చేద్దాం. కొందరం డెషియస్ ఇంటికి వెడదాం. కొందరం కాస్కా ఇంటికీ, కొందరం లిగారియస్ ఇంటికీ పోదాం. పదండి! వెళ్ళండి!!

(అందరు నిష్క్రమిస్తారు)

'చతుర్థాంకం '

ఒకటో దృశ్యం

రోములో ఒక గృహం. ఆంటోనీ, ఆక్టేవియస్, లెపిడస్ ఒక బల్లముందు కూర్చొని ఉంటారు.

ఆంటోనీ : వీరందరూ మరణించి తీరాలి. మరణం కోసం వీరి పేర్లను గుర్తు పెట్టండి.

ఆక్టేవియస్  : మీ అన్న కూడా మరణించాలి. అంగీకరించావా లెపిడస్?

లెపిడస్  : ఆఁ అంగీకరిస్తున్నాను.

ఆక్టేవియస్  : ఆంటోనీ, అతణ్ణి కూడా గుర్తుపెట్టు.

లెపిడస్  : ఆంటోనీ మీ మేనల్లుడు పబ్లియస్ సజీవుడుగా ఉండరాదనే షరతు మీద నేను ఇందుకు అంగీకరిస్తున్నాను.

ఆంటోనీ  : అవును. అతడు సజీవుడై ఉండరాదు. ఇదిగో చూడు. ఒక్క చుక్కతో నేనే వాణ్ణి నాశనం చేస్తున్నాను. అయితే, లెపిడస్, నీవు సీజర్ ప్రాసాదానికి వెళ్ళు. ఆయన ఇచ్ఛాపత్రాన్ని ఇక్కడికి తీసుకోరా. మనం అందులోని వారసత్వాలలో ఒక భాగాన్ని ఎలా రద్దు చేయటమో ఆలోచిద్దాం.

లెపిడస్  : మీరు ఇక్కడనే ఉంటారా మరి?

ఆంటోనీ  : ఇక్కడగానీ, సభాభవనం ముందుగానీ ఉంటాం.

(లెపిడస్ నిష్క్రమిస్తాడు)

ఇతడు ఎంతో అయోగ్యుడు. ఇటువంటి పనులకు మాత్రమే పంపదగ్గవాడు. ప్రపంచాన్ని మూడు భాగాలుగా పంచుకొనే టప్పుడు ఇతడు అందులో ఒక భాగానికి అర్హుడౌతాడా?

ఆక్టేవియస్  : అలా భావించింది నీవే కదా! ద్రోహులను నిర్ణయించేటప్పుడు పట్టికలో అతడు కోరిన వ్యక్తులను కూడా చేర్చి ఆ యోగ్యతను కల్పించింది నీవే.

ఆంటోనీ  : ఆక్టేవియస్! లోకంలో నేను నీకంటే ఎక్కువ కాలం జీవించాను. ఎక్కువ అనుభవాన్ని సంపాదించాను. మన అపకీర్తి భారాన్ని తగ్గించుకోవటం కోసం ఇతడికీ గౌరవాన్ని కల్పించినా, గాడిద బంగారాన్ని మోసే సందర్భంలోలాగా ఇతడికి దాని భారం వల్ల గింజుకోవటం, చెమట పట్టటం తప్ప ఏమీ చెందకుండా ఉండాలి. ఆ భారవహనాన్నైనా మనం చెప్పినట్లు చెయ్యవలసిందే.

ఆక్టేవియస్  : నీ ఇష్టానుసారంగా జరిగించు కానీ అతడు కాకలు తేరినవాడు వీరయోధుడు.

ఆంటోనీ  : నా అశ్వం కూడా అటువంటిదే. అది నాకు చేసే సేవకు నేను దానికి తగినంతగా ఆహారమిస్తాను. పోరాడటం. గాలిలో విహరించటం, ఆగటం, సూటిగా పరిగెత్తటం అన్నీ నేను నేర్పుతాను. దాని సర్వావయవసంచలనాన్నీ నా ఇచ్ఛ పాలిస్తుంది. కొంతవరకు లెపిడస్ కూడా ఇంతే. అతడు ఇట్టి జంతువు మాత్రమే. నా అధికారంలోనే ఉంటున్నాడు. మందబుద్ధి! సర్వం బోధించి, శిక్షణ ఇచ్చి ఇలా నడుచుకోమని ఎవరో ఒకరు ఆజ్ఞాపించవలసిందే. అతడెప్పుడూ ఇతరులు త్రొక్కివిడిచిన పాతపుంతలు పట్టుకొని పయనిస్తుంటాడు ఇతరులను అనుకరించేవాడేగాని స్వతంత్రశక్తి కలవాడు కాడు. ఇతణ్ణి గురించి ఒక సాధనంగా మాత్రమే భావించి వ్యవహరించు.

ఆక్టేవియస్! కొన్ని మహత్తర విషయాలున్నవి. అవి విను. బ్రూటస్, కాషియస్ సైన్యాల మీద అధికారం వహిస్తున్నారు. మనం వెంటనే వారిని ఎదుర్కోను పోవాలి. ఇందుకోసం మనం ఒక బంధుబృందంగా ఏర్పడాలి. మన మిత్రులెవరో వారినందరినీ సమకట్టాలి. సాధన సామగ్రులను సంతన చెయ్యాలి. రహస్యతంత్రాలను తెలుసుకోటానికీ, బహిరంగంగా ఎదుర్కోనున్న అపాయాలకు ఎదురు నిల్చి సమాధానాలు చెప్పటానికీ మనం వెంటనే ఒక పరిషత్తును ఏర్పాటు చెయ్యాలి.

ఆక్టేవియస్  : తప్పకుండా వెంటనే ఏర్పాటు చేయిద్దాం. ఇప్పుడు మనం శత్రువులు మధ్య కట్టుకొయ్యలకు బంధింపబడి, వేటకుక్కలు చుట్టూ నిలువగా ఉన్న ఎలుగుబంట్లలా ఉన్నాం. మనముందు మందహాసం చేసే కొంతమంది హృదయాలలో కోటానకోటి కుతంత్రాలున్నవని నాకు అనుమానంగా కూడా ఉంది.

రెండో దృశ్యం

బ్రూటస్ శిబిరం ముందు, భేరీధ్వనులు వినిపిస్తుంటాయి. బ్రూటస్, లూసిలియస్, లుసిల్లస్ ఇతర సైనికులు ప్రవేశిస్తారు. టిటినియస్, పిండారస్ వారిని కలుసుకుంటారు.

బ్రూటస్  : ఆగండి! లూసిలియస్ : సైన్యాలకు ఆజ్ఞను అందజేయండి ఆగండి.

బ్రూటస్  : కాషియస్ వచ్చేశాడా ఏమిటి?

లూసిలియస్ : చాలా దగ్గరకు వచ్చేశాడు. తమ యజమానికి ప్రత్యా మ్నాయంగా మీకు ప్రణతులర్పించటానికి పిండారస్ వచ్చాడు.

బ్రూటస్  : అతడు వచ్చి క్రమరీతిని ప్రణతులర్పించవచ్చు. పిండారస్! తనలో కలిగిన మార్పువల్లనో, కొందరు దుష్టోద్యోగుల ప్రేరణవల్లనో, కొన్ని అకృత్యాలు చేసి బాధ కలిగించాడు. అయినా, అతడు దగ్గిర ఉంటే తగ్గ సంజాయిషీ తీసుకుండేవాణ్ణి.

పిండారస్  : ఉదాత్తుడైన మా యజమాని స్వతస్సిద్ధమైన ఆయన సుగుణానికి అనుగుణంగానే మహోద్దేశాలు పెట్టుకొని ప్రవర్తించినట్లే కనిపిస్తున్నారు.

బ్రూటస్  : ఆ విషయంలో అతని యెడ ఎవరికీ సంశయం లేదు. లూసిలియస్! అతడు నన్ను ఎలా ఆహ్వానించాడో నివేదించు.

లూసిలియస్  : తగిన కృతజ్ఞతాగౌరవాలతో ఆహ్వానించాడు గాని, పూర్వం ఆయన చూపించే అతి పరిచయాన్ని గానీ, మిత్రభావాన్ని గానీ ప్రదర్శించలేదు.

బ్రూటస్  : ఈ నీ వర్ణనను బట్టి అనురాగ పూర్వకమైన మైత్రి అతడిలో చల్లారిపోతున్నట్లు అర్థమౌతున్నది. లూసిలియస్! గమనించు. ఎప్పుడైతే ప్రేమ చల్లారిపోవటం ప్రారంభిస్తుందో అప్పుడు అది కృత్రిమరూపాన్ని ధరిస్తుంది. స్వచ్ఛమైన మైత్రికి అటువంటి కృత్రిమత్వం అనేది ఉండనే ఉండదు. చేయివేసి ఉంచినంతవరకూ తమ ప్రతిభా విశేషాలను ప్రకటించుకోటం కోసం అశ్వాల్లా అత్యుత్సాహాన్ని ప్రకటిస్తారు. పరీక్షకు నిలవవలసినప్పుడు బోర ముంగిల పారేసి మొండి తట్టులా క్రుంగిపోతారు. కాషియస్ సైన్యంతోటే వస్తున్నాడా?

లూసిలియస్  : ఈ రాత్రికి సార్డిన్35 లో బస చేద్దామన్నాడు. ఆశ్విక సైన్యంలో అధికారం ఆయన వెంటనే ఉన్నది.

(నేపథ్యంలో ఆశ్విక సైన్యం వస్తున్న ధ్వనులు)

బ్రూటస్  : ఇష్. అతడు వచ్చేశాడు. అతడికోసం ప్రశాంతంగా ఎదురు వెళదాం.

కాషియస్, అతని సైనికులూ ప్రవేశిస్తారు.

కాషియస్  : ఓహో సైనికులారా! నిలవండి, ఆగిపొండి. బ్రూటస్  : ఓహో సైనికులారా! నిలవండి, ఆగిపొండి. ఆగిపొమ్మనే ఆజ్ఞను సైన్యాల కందజేయండి!

ప్రథమ సైనికుడు  : ఆగిపొండి!

ద్వితీయ సైనికుడు  : ఆగిపొండి!

తృతీయ సైనికుడు  : ఆగిపొండి!

తృతీయ సైనికుడు  : ఆగిపొండి!

కాషియస్  : బావగారూ! మీరు నాకు అపచారం చేశారు.

బ్రూటస్ : దేవతలారా! ఈ అభియోగాన్ని మీరు విచారించండి. నా శత్రువులకైనా అపచారం చేయలేనే? అట్టి స్థితిలో నా బావమరదివైన నీకు నేనెలా అపచారం చేయగలుగుతాను?

కాషియస్  : మీరు చేసిన చెడ్డపనులకు మీ ప్రశాంత ప్రవర్తన మంచిముసుగులా ఉంది. వాటిని మీరు చేసేటప్పుడు...

బ్రూటస్  : కాషియస్! ఉద్రేకాన్ని పొందకు. నీకేవైనా బాధలుంటే ప్రశాంత చిత్తంతో తెలియజెయ్. నిన్ను నేను బాగా ఎరుగుదును. గాఢంగా మనలను ప్రేమించే మన ఉభయ సైన్యాలముందు మనం వివాదపడవద్దు. నీ సైన్యాలను పంపించివెయ్యి. తరువాత నీ బాధలేమిటో చెప్పు నేను వింటాను.

కాషియస్  : పిండారస్! మన సేనానాయకులను సైన్యాలను ఈ ప్రదేశానికి కొంతదూరంగా నిలుపమని ఆజ్ఞాపించు.

బ్రూటస్  : లూషియస్, మన సైన్యాలను గూడా అలాగే దూరంగా నిలుపు. మా ఇరువురి సంభాషణా పూర్తి అయ్యేదాకా నా శిబిరంలోకి ఎవరినీ ప్రవేశపెట్టవద్దు. ద్వారం వద్ద లుసిల్లియస్, టిటినియన్లను కాపలా ఉంచు.

మూడో దృశ్యం36

బ్రూటస్ గుడారంలో, బ్రూటస్, కాషియస్ ప్రవేశిస్తారు.

కాషియస్ : సార్డియన్ల వద్ద లంచాలు తీసుకొన్నాడని లూషియస్ పెల్లాను37 దోషిగా భావించి, విచారించి, శిక్ష చెప్పి మీరు నాయెడ ద్రోహం చేశారు. అతడు గౌరవనీయుడని నాకు తెలియటం వల్ల అతణ్ణి వదలిపెట్టవలసిందని ఎన్నోమార్లు మిమ్మల్ని లేఖల మూలంగా ప్రార్థించాను.

బ్రూటస్  : ఈ విషయంలో లేఖలు వ్రాసి నీకు నీవే ద్రోహం చేసుకున్నావు.

కాషియస్  : ప్రతి స్వల్ప విషయాన్నీ ఇలా దోషంగా నిరూపించటానికి ఇది తగ్గ సమయం కాదు.

బ్రూటస్  : ఈ లంచగొండితనం అనే దోషం నీలో కూడా ఉందని నేను విస్పష్టంగా చెప్పక తప్పదు. బంగారానికి ఆశ పడి నీవు మంచి ఉద్యోగాల నన్నిటినీ అయోగ్యులైన వారికి అమ్మావు.

కాషియస్  : ఏమిటీ? నాలో లంచగొండితనముందా? ఈ మాట్లాడేది బ్రూటస్ అని తెలుసుకుంటే మీరు ఇలా పలికేవారు కారు.

బ్రూటస్  : కాషియస్ పేరు లంచగొండితనంతో సంబంధం పెట్టుకొని, దానికి గౌరవాన్ని ఆపాదిస్తున్నది. అందువల్ల శిక్షాకాంక్ష సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చింది.

కాషియస్  : ఏమిటి? శిక్షించటాన్ని గురించి ఆలోచిస్తున్నారా?

బ్రూటస్  : ఔను. మార్చి నెల జ్ఞప్తికి తెచ్చుకో. మార్చి పదిహేనును జ్ఞప్తికి తెచ్చుకో. ఘనుడైన జూలియస్ ఆ నాడు న్యాయం కోసమేగదా తన రక్తాన్ని స్రవింపజేసుకొన్నది! న్యాయం కోసం కాక క్రౌర్యంతో అతణ్ణి పొడిచిన ద్రోహి ఆ నాడు ఒక్కడైనా ఉన్నాడా? ప్రపంచంలోకెల్లా ప్రథమ గణ్యుడైన ఆ వ్యక్తిని హతమార్చింది బందిపోటు దొంగలకు సాయపడటం కోసమేనా? మన అనంత గౌరవాన్ని పణం పెట్టి, మన హస్తాలను లంచగొండితనంతో మలినం చేసుకోవటానికేనా? ఆ పని చేసింది ఇందుకే ఐతే నేను అట్టి ఒక రోము పౌరునిమీద పడటం కంటే శ్వానాన్నై జన్మించి చంద్రుణ్ణి38 చూచి మొరుగుతూ ఉండేవాణ్ణి.

కాషియస్  : బ్రూటస్, నన్ను ఒత్తిడి చెయ్యవద్దు ఇది నేను సహించను. ఎలా నేను వ్యవహరించాలో ఆదేశిస్తూ నీవు నేనెవర్నో మరిచిపోతున్నావు. నేను బహుకాలానుభవం ఉన్న సైనికుణ్ణి. ఏర్పాట్లు చేయటంలో నీకంటే సమర్థుణ్ణి.

బ్రూటస్  : కాషియస్, ఇక చాలు. అంతటితో ఆపు. ఈ విషయంలో నీవు సమర్థుడివి కావు. కాషియస్  : నేను సమర్థుణ్ణి!

బ్రూటస్  : సమర్థుడివి కావని నా అభిప్రాయం.

కాషియస్ : ఇక ఉద్రేకపరచవద్దు. నన్ను నేను మరిచిపోవచ్చు. నీ శరీరవిషయం శ్రద్ధ తీసుకో. నన్ను ఇక విశేషంగా కదిలించకు.

బ్రూటస్  : అల్పుడా! ఇక వెళ్ళిపో.

కాషియస్  : అది ఎలా సాధ్యపడుతుంది?

బ్రూటస్ : అయితే విను. నీ ఉద్రేకాలకు నేను లొంగిపోవలసిందేనా? ఒక ఉన్మత్తుడు ఉరిమిచూస్తే బెదరిపోవలసిందేనా?

కాషియస్  : దేవతలారా! ఇదంతా నేను సహించి తీరవలసిందేనా? బ్రూటస్: ఇంతేనా? ఇంకా సహించవలసి ఉంటుంది. మహాగర్వంతో కన్నులుగానని నీ హృదయం బద్దలయ్యేటంతవరకూ కోపాన్ని వెలిగ్రక్కు నీకెంతటి కోపశక్తి తీవ్రత ఉందో నీ బానిసలకు చూపించు. వారిని గజగజలాడించు. నేను నీ కోపతాపాలను కనిపెట్టి నడుచుకోవాలా? నీ కోపేచ్ఛాను సారంగా నేను వంగి లేవాలా? దేవతలు సాక్షిగా చెప్పుతున్నాను. ఎంతటి కష్టమైనా సరే నీ ప్లీహం39 లోని విషాన్ని జీర్ణించుకో! ఈ నాటినుంచీ నీవు కోపం తెచ్చుకున్నప్పుడు నాకు ఉత్సాహాన్ని కల్పించటానికి అలా పరిహాసకుడిలా నటించి నవ్విస్తున్నావని భావిస్తాను.

కాషియస్  : అయితే వ్యవహారం ఇంతదాకా వచ్చిందన్నమాట!

బ్రూటస్  : నేను నీకంటే గొప్ప యోధుణ్ణన్నావు, నిరూపించు, నీ ప్రగల్భాలు సత్యాలని నిరూపించు. అప్పుడు నేను సంతోషిస్తాను. నా విషయం చెపుతున్నాను, విను నాకంటే ఉదాత్తుడైన వ్యక్తిదగ్గరనుంచీ నేర్చుకోవటానికి నేనెప్పుడూ సంసిద్ధమే.

కాషియన్  : నన్ను అవమానిస్తున్నావు బ్రూటన్! నీవు నన్ను సర్వరీతులా అవమానిస్తున్నావు. నేను నీకంటే వృద్ధ సైనికుడ నన్నాను గొప్ప సైనికుడనని అనలేదు. అన్నానా?

బ్రూటస్  : నీవు అన్నా నేనేమీ లక్ష్యం చెయ్యను!

కాషియస్ : సీజర్ సజీవుడై ఉన్ననాళ్ళల్లో ఆయనకూడా నాకెప్పుడూ ఇంతగా కోపాన్ని తెప్పించటానికి సాహసించలేదు. 102వావిలాల సోమయాజులు సాహిత్యం-3 బ్రూటస్  : ఆగు. నీవు ఆయనకు కోపం తెప్పించటానికి సాహసించి ఉండవు.

కాషియస్  : నేను సాహసించి ఉండేవాణ్ణి కానా?

బ్రూటస్  : కావు!

కాషియస్  : ఏమిటీ? నేను సాహసించి ఉండేవాణ్ణి కానా?

బ్రూటస్  : నీకు జీవితంమీద తీపి ఉండడం వల్ల, సాహసించి ఉండేవాడివి కావు.

కాషియస్  : బ్రూటస్! నీయెడ నాకున్న ప్రేమమీద ఎక్కువ ఆశపెట్టుకోకు. తరువాత చింతపడవలసి వచ్చే కృత్యాన్ని దేన్నైనా నేను చెయ్యవచ్చు.

బ్రూటస్  : చింతపడదగ్గపనిని పూర్వమే చేశావు. నేను అతిభద్రమైన సత్యకవచాన్ని ధరించాను. కాషియస్, నీ బెదిరింపులకు నేనేమీ బెదరను. అవి వాచాలాలైన వాయువుల్లా నా ముందుగా వెళ్ళిపోతాయి. చెడ్డమార్గాలలో చేకూర్చు కోలేనందువల్ల నేను కొంత ధనంకోసం నీ దగ్గరికి పంపించాను. ఇవ్వటానికి నీవు తిరస్కరించావు. కష్టజీవులైన కర్షకుల వద్దనుంచీ దుష్టమార్గాలలో ధనాన్ని సంపాదించేదాని కంటే, నా హృదయాన్ని, రక్తమాంసాలను నా ప్రాణాలక్రిందికి మారుస్తాను. నా సైన్యాలకు భత్యాలివ్వటానికి ధనంకోసం నీ దగ్గరికి పంపించాను నీవు నిరాకరించావు. ఈ పనిని కాషియస్ గానే చేశావా? కేయస్ కాషియస్ అడిగితే నేను అలాగే నిరాకరించేవాణ్ణా? మార్కస్ బ్రూటస్ లోభిగా పరిణమించి తుచ్ఛమైన ధనాన్ని గుప్తం చేసేటట్లయితే ఓ దేవతల్లారా! సమస్తమైన ఉల్కలనూ అతడిమీద విసరటానికి సంసిద్దులు కండి అతణ్ణి ఛిన్నాభిన్నం చెయ్యండి.

కాషియస్  : ధనమివ్వటానికి నేను నిరాకరించలేదు.

బ్రూటస్  : నిరాకరించావు.

కాషియస్  : నిరాకరించలేదు. నా సమాధానాన్ని మీ దగ్గరికి తీసుకోవచ్చినవాడు మందబుద్ధి. బ్రూటస్, మీరు నా హృదయాన్ని కలచివేశారు. మిత్రుడైనవాడు స్నేహితుని దోషాలను సహించాలి. కానీ బ్రూటస్ నా దోషాలను ఉన్నవాటికంటే ఎన్నోరెట్లు అధికం చేస్తున్నాడు.

బ్రూటస్  : లేదు, నీవు వాటిని నా మీద ప్రయోగించనంతవరకూ చేయలేదు.

కాషియస్  : మీరు నన్ను ప్రేమించటం మానివేశారా? బ్రూటస్  : నీ దోషాలంటే నాకిష్టం లేదు.

కాషియస్  : మిత్రుని కంటికి ఆ దోషాలు కనిపించనే కనుపించవు.

బ్రూటస్ : అవి ఒలింపస్ పర్వతాలవలె దొడ్డవై కనిపిస్తున్నా, స్తుతి పాఠకుడు గమనించడమే కాని, వాటిని సత్యసంధుడైన ఉత్తమమిత్రుడు గుర్తించకుండా ఉండలేడు.

కాషియస్  : ఆంటోనీ, రా! యువకుడా, ఆక్టేవియస్ రా! ప్రపంచమంటే కాషియస్ విసిగిపోయాడు. రండి, మీ ప్రతీకారాన్ని తీర్చుకోండి. తాను హృదయ పూర్వకంగా ప్రేమించిన వ్యక్తి, అతడి బావ, అతణ్ణి అసహ్యించుకుంటున్నాడు. అతడి సోదరుడు. అతణ్ణి సేవకుణ్ణి తిట్టినట్లు తిడుతున్నాడు. అతడు నా ముఖాన దులపటానికి నా దోషాల నన్నింటినీ గమనించాడు. గ్రంథస్థం చేశాడు. చదివి కంఠస్థం చేశాడు.

అబ్బా! నేను నా కన్నుల్లోనుంచి జీవనజ్యోతిని తొలగించుకోగలను. ఇదే నా వక్షఃస్థలం. ఇందులో ప్లూటస్ గని40 కంటే, కనకం కంటే, ప్రియమైన నా హృదయముంది. ఇదిగో నా ఛురిక! బ్రూటస్ మహాశయా! మీరు రోము పౌరులే అయితే అందుకోండి. దాన్ని అందుకోండి. ధనాన్ని నిరాకరించిన నేను మీకు హృదయాన్నిస్తున్నాను. పొడవండి. మీరు పూర్వం సీజర్ నెలా పొడిచారో అలాగే పొడవండి. నాకు తెలుసు - అతణ్ణి అత్యధికంగా అసహ్యించు కుంటున్నప్పుడే, మీరు కాషియస్ ను ఎన్నడూ ప్రేమించనంతటి అధికంగా ప్రేమించారు.

బ్రూటస్  : నీ ఛురికను ఒరలో నిల్పు. నీవు కోపగించదలచినపుడు కోపగించు. అది స్వేచ్ఛగా వ్యవహరించ దలచుకొన్నప్పుడు వ్యవహరించనీ. నీవు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు. నీవు చేసిన అప్రతిష్టాకరమైన ఏ కృత్యాన్నైనా నేనొక తాత్కాలిక చేష్టగా భావిస్తాను. కాషియస్, నీవు గొట్టెవంటి సౌమ్యునితో జోడుకోడె వైనావు. అతడి కోపం క్షణకాలం. అది చెకుముకి రాయి నిప్పు రవ్వలు ధరించినంత కాలం మాత్రమే ఉంటుంది. చాలా గట్టిగా కొట్టినప్పుడు ఒక రవ్వను పొందుతుంది. వెంటనే చల్లారిపోతుంది.

కాషియస్  : కాషియస్ తన దుఃఖంతో, కోపంతో మీకు విలాసాన్నీ, హాస్యాన్నీ కల్పించటానికి జీవించి ఉన్నాడన్న మాట!

బ్రూటస్  : ఆ మాట అన్నప్పుడు నా మానసికస్థితి ఏమీ బాగాలేదు.

కాషియస్  : ఇంతవరకైనా ఒప్పుకుంటున్నారు. ఏదీ మీ హస్తాన్ని ఇలా అందించండి. బ్రూటస్  : నా హస్తాన్నే కాదు హృదయాన్ని కూడా అందిస్తాను.

కాషియస్  : బ్రూటస్ మహాశయా!

బ్రూటస్  : విషయమేమిటి?

కాషియస్ : ఈ మీ మిత్రుడికి మాతృగర్భంలోనే అబ్బిన కోసం అతణ్ణి మరిపించిన వేళ కూడా సహించగలిగినంతటి గాఢానురాగం నా మీద మీకు లేదా?

బ్రూటస్ : లేకేం? కాషియస్ ఇకముందు నీకు కోపం వస్తే నీ స్నేహితుడు బ్రూటస్ దాన్ని మీ తల్లివల్ల సంక్రమించిన గుణంగా భావించి సహిస్తాడు.

కవి  : (లోపల) సేనాపతులను చూడటానికి వెళ్ళనివ్వండి. వారిమధ్య ఏదో కలహం వచ్చినట్లుంది. వారిని ఒంటరిగా ఉండనీయటం సమంజసం కాదు.

లూషియస్ : (లోపల) నీవు వెళ్ళటానికి అనుజ్ఞ లేదు.

కవి  : (లోపల) మృత్యువు తప్ప నన్నేమీ ఆపలేదు!

లూసిల్లియస్, టిటినియస్, లూషియన్లతో కవి ప్రవేశిస్తాడు.

కాషియస్  : విశేషాలేమిటి? ఎందుకొచ్చారు

కవి  : మీ ప్రవర్తనకు మీరు సిగ్గుపడండి. సేనాపతులారా! ఇలా కలహించుకోటంలో మీ అభిప్రాయమేమిటి? మీవంటి ఇరువురు వ్యక్తులు ఉండవలసిన రీతిగా ఉండి అన్యోన్యం అనురాగం వహించండి. 'ఎక్కువకాలం బ్రతికినవాణ్ణి విశేషాలు నే చూచినవాణ్ణి'.

కాషియస్  : హఁ, హఁ, హఁ. అంత్యప్రాసతో పాదాలను అతిక్షుద్రంగా పారేశాడు.

బ్రూటస్  : ఛీ! అవివేకీ! అవతలికి వెళ్ళిపో!

కాషియస్  : బ్రూటస్ మహాశయా! శాంతి వహించండి. సహించండి. ఇది అతడి శైలి.

బ్రూటస్ : సమయోచితజ్ఞానం వీడికున్నట్లయితే ఈ హాస్యాన్ని అవగతం చేసుకోగలిగేవాణ్ణి. యుద్ధసమయాలలో బుద్ధిహీనులైన ఇటువంటి హాస్యకవులకు తావులేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు!

కాషియస్  : వెళ్ళిపోవయ్యా! వెళ్ళు!! బ్రూటస్  : లూసిల్లియస్! టిటినియస్!! ఈ రాత్రి తమ సైన్యాలను నిలపటానికి డెరిజాలను వేయించవలసిందని సేనానాయకులను ఆజ్ఞాపించండి.

కాషియస్  : మీరు మీ సెల్లాను వెంటబెట్టుకొని తత్ క్షణమే మా దగ్గరకు రండి.

(లుసిల్లియస్, టిటినియస్ నిష్క్రమిస్తారు)

బ్రూటస్  : లూషియస్! ఒక చషకంనిండా ద్రాక్షాసవాన్ని తీసుకో రా.

కాషియస్  : మీకు ఇంత కోపం వస్తుందని నేను ఎన్నడూ భావించలేదు.

బ్రూటస్  : కాషియస్! అనేకబాధలవల్ల నేను మాములుగా లేను.

కాషియస్  : ఏవో తాత్కాలికాలైన బాధలకు నీవు లొంగిపోతే తత్త్వజిజ్ఞాసవల్ల మీరు పొందిన ప్రయోజనమేముంది?

బ్రూటస్  : కాషియస్! ప్రస్తుతం బ్రూటస్ కంటే అధికదుఃఖాన్ని ఎవరూ భరించటం లేదు. పోర్షియా మరణించింది

కాషియస్  : ఏమిటి! పోర్షియా మరణించిందా?

బ్రూటస్  : అవును. ఆమె మరణించింది.

కాషియస్  : ఇందాక మీకు అంతటి కోపాన్ని తెప్పించినప్పుడు నన్ను చంపలేదేమా అని నాకిప్పుడు ఆశ్చర్యం వేస్తున్నది. మీ చేతిలో చావును ఎంతగా తప్పించుకొన్నాను. అబ్బా! ఎంత భరించరాని బాధ! ఇది నా హృదయాన్ని గాయపరుస్తున్నది. జబ్బేమిటి?

బ్రూటస్  : నా వియోగాన్ని సహించలేకపోవటం. ఆమె మరణవార్తతోబాటు, యువకుడైన ఆక్టేవియస్, మార్క్ ఆంటోనీతో చేరి, నాకు వ్యతిరేకంగా బలవత్తరుడైనాడన్న వార్త కూడా వచ్చింది. ఆమె ఉన్మత్తురాలైందట. సేవకులు లేనప్పుడు నిప్పు మ్రింగిందట!

కాషియస్  : అందువల్ల మరణించిందా?

బ్రూటస్  : అవును.

కాషియస్  : అమరులారా! దేవతలారా!!

లూషియస్ ద్రాక్షాసవంతో బాటు కొన్ని లేఖాపత్రాలను కూడా తీసుకొని ప్రవేశిస్తాడు.

బ్రూటస్  : ఆవిడను గురించి ఇంక ప్రస్తావించకు. నాకో పాత్రనిండా ద్రాక్షాసవాన్ని పోసి ఇవ్వు. కాషియస్! దీంతో నీయెడ చూపిన నిర్దాక్షిణ్యతనంతటినీ నిర్మూలించి వేస్తాను.

(ఆసవాన్ని సేవిస్తాడు)

కాషియస్  : ఈ ఉదాత్త ప్రతిజ్ఞ కోసమే నీ హృదయం విదాహం వహిస్తున్నది. లూషియస్, పాత్రిక పొర్లిపోయే దాకా పానీయాన్ని నింపు. బ్రూటస్ ప్రేమను నేను విపరీతంగా క్రోలగలను.

(సేవిస్తాడు)

బ్రూటస్  : లోపలికిరా టిటినియస్!

(లూషియస్ నిష్క్రమిస్తాడు)

మెసెల్లాతో టిటినియస్ ప్రవేశిస్తాడు.

ఉదాత్తుడా, మెసెల్లా, నీకిదే స్వాగతం. ఈ కొవ్వొత్తి దగ్గిర కూర్చొని మనం కర్తవ్యాలను గురించి సమాలోచిద్దాం.

కాషియస్  : పోర్షియా! నీవు వెళ్ళిపోయావా?

బ్రూటస్  : ఆమెను గురించి ఇక చాలించు. నిన్ను ప్రార్థిస్తున్నాను. మెసెల్లా! యువకుడైన ఆక్టేవియస్ అంటోనీతో కూడా ఫిలిప్పీవైపు జైత్రయాత్రను సాగిస్తూ, మనమీదికి గొప్పసైన్యంతో వస్తున్నట్లు వార్త వచ్చింది.

మెసెల్లా  : ఇదే ధోరణిలో నాకూ లేఖలు వచ్చాయి.

బ్రూటస్ : ఇంకా విశేషాలేమైనా ఉన్నవా?

మెసెల్లా  : ఆక్టేవియస్, ఆంటోనీ, లెపిడస్ ముగ్గురూ సభాసభ్యులలో41 నూరుమందిని చట్ట విద్రోహులుగా ప్రకటించి శిక్షించారుట!

బ్రూటస్  : మన ఉభయుల లేఖలూ ఇక్కడ భేదిస్తున్నవి. నాకు నచ్చిన లేఖల్లో వారు ప్రాణాలు తీసిన సభాసభ్యులు డెబ్బయి మంది మాత్రమే. వారిలో సిసెరో ఒకడు.

కాషియస్  : సిసెరో వాళ్ళలో ఒకడా? మెసెల్లా  : సిసెరో అయిపోయినాడు - చట్టవిద్రోహులని వారు చేసిన ప్రకటనవల్లనే. ప్రభూ! మీకు వచ్చిన లేఖలు మీ భార్యగారు వ్రాసినవా?

బ్రూటస్  : లేదు మెసెల్లా!

మెసెల్లా : ఆమెగారిని గురించి మీకు వచ్చిన లేఖల్లో ఏమీలేదా?

బ్రూటస్  : ఏమీ లేదు మెసెల్లా!

మెసెల్లా : ఇది చాలా విచిత్రంగా ఉంది.

బ్రూటస్  : ఏమి ఇలా ఆమెను గురించి ప్రశ్నించావు. నీకు వచ్చిన లేఖలవల్ల ఆమెను గురించిన విశేషాలేమన్నా తెలుసుకున్నావా?

మెసెల్లా : ఏమీలేదు ప్రభూ.

బ్రూటస్  : మెసెల్లా! నీవు రోము పౌరుడవు. రోము పౌరుడిలా42 సత్యం చెప్పు.

మెసెల్లా : అయితే రోము పౌరుడిలా సత్యం చెపుతున్నాను. ఆమెగారు మరణించారు. ఇది నిజం. ఆ మరణం సామాన్యరీతిగా సంభవించలేదు.

బ్రూటస్  : ఎలాగైతేనేం43 పోర్షియా గతించింది. ఎప్పుడో ఒకప్పుడు మనకూ మృత్యువు తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు ఆమె మరణించి తీరవలసిందే గదా అన్న భావంతోనే శాంతి వహించి ఆమె మరణవార్తను భరిస్తున్నాను.

మెసెల్లా : మహనీయులు ఎల్లవేళలా ఇదేరీతిగా తమకు వచ్చిన అన్ని ఆపదలనూ భరిస్తుంటారు.

కాషియస్ : సిద్ధాంతదృష్ట్యా నాకూ ఇంతటి ప్రశాంతగుణమంటే ఇష్టమేగాని, కార్యాచరణలో మాత్రం ఇటువంటి కష్టాలను భరించలేను.

బ్రూటస్  : సరే! మనం ప్రస్తుతకార్యక్రమానికి వద్దాం. తత్ క్షణమే మనం ఫిలిప్పీమీదికి వెళ్ళటాన్ని గురించి నీ అభిప్రాయమేమిటి?

కాషియస్  : అది శ్రేయమని నేను భావించను.

బ్రూటస్ : ఎందువల్ల?

కాషియస్  : వెదుక్కుంటూ శత్రువును మనకోసం రానివ్వటమే మంచిది. అందువల్ల వారి సాధనసంభారాలు తరిగిపోతవి. సైన్యాలకు శ్రమ కలుగుతుంది. ఇక్కడ కదలకుండా ఉండటం వల్ల మనకు విశ్రాంతి చేకూరుతుంది. రక్షణకు మార్గాలను చేకూర్చుకోవచ్చు. సర్వవిధాలా మనం సిద్ధపడవచ్చు.

బ్రూటస్  : నీవు చెప్పిన కారణాలు చాలా మంచివే. కానీ నేను సూచించేవి అంతకంటే మంచివిగా ఉన్నప్పుడు అవి లొంగిపోవలసిందే. ఈ ప్రదేశానికీ, ఫిలిప్పీకీ మధ్యలో ఉన్న ప్రజలు మనను మనఃపూర్వకంగా అనుసరించేటట్లు కన్పించటం లేదు. వారు ఇష్టంతో మన సైన్యాలకేమీ విరాళాలిచ్చినట్లు లేదు. మన శత్రువులను ఈ ప్రదేశం గుండా రానిస్తే వారు వీరిని సైన్యంలో చేర్చుకొని, సంఖ్యను వృద్ధి చేసుకోటానికీ, నూతనోత్తేజాన్ని పొందటానికీ అవకాశం లభిస్తుంది. ఫిలిప్పీ వద్దనే మనం శత్రువులను ఎదుర్కొంటే వారికే అవకాశాలూ కలగకుండా చేయగలం. అంతేకాక ప్రజలు కూడా మనకు అండగా ఉంటారు.

కాషియస్  : బావగారూ! నా అభిప్రాయాన్ని మన్నించండి.

బ్రూటస్  : క్షమించు. అంతే కాదు. చక్కని మిత్రులను పొందాం సైన్యాలనూ, సాధన సంపత్తినీ చేకూర్చుకున్నాం. మన పథకాలు ఎంతో పరిపక్వమైనవి. శత్రువు ప్రతినిత్యం వృద్ధి పొందుతున్నాడు. ఇట్టి స్థితిగతులున్నా మనం పతనోన్ముఖం కాక తప్పదు. సకాలంలో వ్యవహరిస్తే మానవులను విజయం వరిస్తుంది. లేకపోతే వారి జీవితనౌక భగ్నమై దుర్భర దుఃస్థితిని కల్పిస్తుంది. ఇటువంటి మహాసముద్రంలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ప్రవాహం మనకు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రయోజనాన్ని పొందాలి లేకపోతే మన సాహసం సమస్తం వ్యర్థమౌతుంది.

కాషియస్: అయితే, మీ ఇచ్ఛానుసారంగా సైన్యాలను బయలుదేరదీయండి ఫిలిప్పీ వద్దనే శత్రువును ఎదుర్కొందాం.

బ్రూటస్  : మన సంభాషణలో రాత్రి ఎంతగా గడిచిపోయిందో గమనించలేదు. కొంత విశ్రాంతి తీసుకోవటం మన శరీరాలకు సహజధర్మం కదా! ఇంకా మాట్లాడు కోవలసిందేమైనా ఉందా?

కాషియస్  : ఏమీ లేదు. సునక్తం. రేపు ఉదయమే పెందలకడ సైన్యాలను బయలుదేరదీద్దాం.

బ్రూటస్  : లూషియస్! (లూషియస్ ప్రవేశిస్తాడు) నా నిచోళ44 మేది? శుభాకాంక్షలోయ్ మెసెల్లా మహాశయా! సునక్తం.

(లూషియస్ నిష్క్రమిస్తాడు)

ట్రిటినియస్! మహోదాత్తా, కాషియస్! సునక్తం. మంచి విశ్రాంతిని పొందుదువుగాక!

కాషియస్  : బ్రూటస్ మహాశయా! ఈ రాత్రి మన మధ్య కలహంతో ఆరంభమైంది మన అంతరాత్మల్లో అటువంటి విభేదాలుండకుండుగాక!

బ్రూటస్  : సర్వం శుభోదర్కంగానే ఉంటుంది.

కాషియస్ : మహాశయా, సునక్తం!

బ్రూటస్  : సునక్తం కాషియస్!

టిటినియస్: మెసెల్లా : సునక్తం బ్రూటస్ ప్రభూ!

బ్రూటస్  : అందరికీ నా శుభాకాంక్షలు.

(బ్రూటస్ తప్ప మిగిలినవారందరూ నిష్క్రమిస్తారు. లూషియస్ నిచోళంతో తిరిగి ప్రవేశిస్తాడు.)

నా నిచోళాన్ని ఇలా ఇవ్వు. నీ సంగీతసాధన మేది?

లూషియస్  : శిబిరంలో ఉంది.

బ్రూటస్  : అలా నిద్రమత్తుగా ఉన్నావేమిటి? పాపం వెర్రివాడివి నీ దోషం కాదు. నీవు చాలాసేపు మేల్కొన్నావు. నా మనుష్యులను, క్లాడియస్ ను, మరికొందర్నీ పిలు.

లూషియస్  : వర్రో! క్లాడియస్!!

(వర్రో, క్లాడియస్ ప్రవేశిస్తారు)

వర్రో  : పిలిపించారా ప్రభూ?

బ్రూటస్  : మీరు నా శిబిరంలో శయనించి నిద్రపొండి. కాషియస్ పని ఉంది. నేను మిమ్మల్ని అప్పుడప్పుడూ మేల్కొల్పవలసి వస్తుంది.

వర్రో  : మీకోరికైతే మేము రాత్రంతా మేల్కొనే ఉంటాము.

బ్రూటస్  : అవసరం లేదు మీరు నిద్రపోవచ్చు. మిమ్మల్ని లేపటానికి కూడా నాకు అసలు అవసరం కలగకపోవచ్చు. నేను వెతుక్కొంటున్న పుస్తకం, ఇదిగో, నా జేబులోనే పెట్టుకొన్నాను.

(వర్రో, క్లాడియస్ విశ్రమిస్తారు)

లూషియస్  : ప్రభూ! మీరు దాన్ని నాకు ఇవ్వనట్లు బాగా గుర్తు.

బ్రూటస్  : నేను నిన్నేమన్నదీ మరచిపో. నాకు మరుపు ఎక్కువైంది. కాసేపు మేల్కొని ఒకటి రెండు గీతాలు వినిపించగలవా?

లూషియస్ : మీ ఆనందం కోసం తప్పక వినిపిస్తాను.

బ్రూటస్ : పాపం! నిన్ను చాలా శ్రమ పెడుతున్నట్లున్నాను కానీ నీవు ఇష్టం చూపిస్తున్నావు.

లూషియస్  : అది నా కర్తవ్యం కదా ప్రభూ!

బ్రూటస్  : శక్తిమించిన కర్తవ్యాన్ని చెయ్యమని నేనెవరినీ బలవంతపెట్టను. యువకులు ఎప్పుడూ విశ్రాంతిని కోరుతుంటారని నాకు తెలుసు.

లూషియస్  : ప్రభూ! నేను కొంతగా నిద్రతీసి మేల్కొన్నాను.

బ్రూటస్  : మంచి పని చేశావు మళ్ళా నిద్రపోదువుగాని. నిన్ను ఎక్కువసేపు మేల్కొనపెట్టనులే. నేనే బ్రతికి ఉంటే నిన్ను ఎంతో ప్రేమతో చూస్తాను. (సంగీతం ఒక గీతం వినిపిస్తుంది) ఇది బాగా నిద్రవచ్చే ఫణితిలా ఉంది.

నిద్రా, ఓ హంతకీ! మహాభారోపేతమైన అధికారదండాన్ని గీతాలు వినిపించే నా బాలుడిమీద కూడా మోపుతున్నావా? ఒరేయ్, వెర్రివాడా! వెళ్ళు. విశ్రాంతి తీసుకో. నిన్ను మేల్కొని ఉండమనటం మహాపచారం. ఇలాగే తూగుతూ మేల్కొంటే నీవు వీణను కూడా బ్రద్దలు కొట్టుకుంటావు. దాన్ని ఇలాతే. వెళ్ళు. నిద్రపో, నేను చదువుతున్న పుట మారిపోయిందే! చాలా చిత్రంగా ఉంది బాగా మారింది.

(సీజర్ భూతాకృతి ప్రవేశిస్తుంది.)

ఈ దీపం ఇలా వణికిపోతూ ప్రకాశిస్తున్న దెందుకు? ఏయ్! ఎవరు? లోపల ప్రవేశించిదెవరు? లేదు. ఇది నా దృష్టిలోపం వల్లనే కలుగుతున్నదనుకుంటాను. భూతరూపం ఏదో గోచరిస్తున్నది. అయ్యో! ఇది నా మీదకే వచ్చేస్తున్నది. నీవు సత్యమైన మూర్తివేనా? లేక కృత్రిమరూపానివా? నా రక్తాన్ని చల్లబడజేస్తూ, నా కేశాలను నిక్కబొడుచుని నిలుచునేటట్లు చేస్తూ ఉన్న నీవు దేవతవా? గంధర్వుడవా? లేక భూతానివా? నీవెవరు? నాతో మాట్లాడు.

భూతం  : బ్రూటస్! నేను నీ దుష్టాత్మను.

బ్రూటస్  : నీవెందు కిక్కడికి వచ్చావు? భూతం : నేను నీకు మళ్ళీ ఫిలిప్పీలో దర్శనమిస్తానని చెప్పిపోవటానికి.

బ్రూటస్  : మంచిది. అయితే నిన్ను మళ్లీ అక్కడ చూస్తాను.

భూతం : అయితే ఫిలిప్పీ దగ్గర కలుసుకుందాం.

బ్రూటస్  : తప్పక. నిన్ను మళ్ళీ ఫిలిప్పీ దగ్గర46 కలుసుకుంటాను.

(భూతం నిష్క్రమిస్తుంది)

నీవు వెళ్ళిపోయావు. నాకు మళ్ళీ ధైర్యం వచ్చింది. ఓ దుష్టభూతమా! నీతో బహుకాలం సంభాషిస్తాను. ఒరేయ్ లూషియస్, వెర్రో, క్లాడియస్, మేల్కొండి, మేల్కొండి.

లూషియస్  : ప్రభూ! నా వీణతంత్రులు బాగాలేవు.

బ్రూటస్  : పాపం! వీడు ఇంకా తాను వీణ వాయిస్తున్నాననే అనుకుంటున్నాడు.

లూషియస్  : ప్రభూ!

బ్రూటస్ : ఇలా కేక పెడుతున్నావు? నీవేదైనా కల గంటున్నావా?

లూషియస్ : కలా, లేదు ప్రభూ!

బ్రూటస్ : మళ్ళీ నిద్ర పో! క్లాడియస్ (వర్రోతో) నిన్నే నోయ్ వర్రో, మేల్కోండి.

వర్రో : ప్రభూ!

క్లాడియస్  : ప్రభూ!

బ్రూటస్  : నిద్రలో మీరు ఎందుకలా కేక పెట్టారు?

వర్రో : క్లాడియస్  : నిజమా ప్రభూ?

బ్రూటస్  : ఔను. నిద్రలో మీకేమైనా కనిపించిందా?

వర్రో : నాకేమీ కనిపించలేదు ప్రభూ!

క్లాడియస్  : నాకూ ఏమీ కనిపించలేదు ప్రభూ!

బ్రూటస్  : నా అభినందనలు మీ బావమరది కాషియస్ కు అందజేయండి. అతణ్ణి మనకంటే బాగా ముందుగా సైన్యాలను బయలుదేరదీయమని చెప్పండి. మనం అతణ్ణి అనుసరిద్దాం.

వర్రో  : క్లాడియస్: చిత్తం. అలాగే ప్రభూ!

(నిష్క్రమిస్తారు)

'పంచమాంకం'

ఒకటో దృశ్యం

ఫిలిప్పీ మైదానాలు. ఆక్టేవియస్, ఆంటోనీ వారి సైన్యాలతో ప్రవేశిస్తారు.

ఆక్టేవియస్  : ఆంటోనీ! మన ఆశలన్నీ నెరవేరాయి. మన శత్రువులు కొండలను దిగిరారనీ, మైదానపు భూముల్లోనే, ఉపత్యకల్లోనే ఉంటారని నీవన్నావు. అలా జరగటం లేదు. వారి సైన్యాలు అతివేగంతో మనమీదికి వచ్చేస్తున్నాయి. ఈ ఫిలిప్పీ వద్దనే మనమీద పడటానికి వారు వస్తున్నట్లున్నారు. మనకు వారు సమాధానం చెప్పటానికి బదులుగా, మనమే వారికి సమాధానం చెప్పవలసి వచ్చేటట్లు కనిపిస్తున్నది.

ఆంటోనీ  : వారి మనోభావాలు నాకు బాగా అవగతమైనవే. వారు మనవంకకు రారు. ప్రక్కగా తప్పుకొనిపోవటంతో తృప్తి పడతారు. ఈ దృశ్యం ద్వారా మహావీరుల్లాగా మనమీదికి వచ్చిపడేటట్లు మనకో అభిప్రాయం కలిగించటానికి కనిపిస్తారేగాని, అటువంటి పరాక్రమం వారిదగ్గర లేదు.

ఒక వార్తావహుడు ప్రవేశిస్తాడు.

వార్తావహుడు  : సేనాపతులకు ఆజ్ఞలిచ్చి సిద్ధపడండి. శత్రువులు భయంకర పరాక్రమంతో వచ్చేస్తున్నారు. తమ యుద్ధచిహ్నమైన సిందూర వర్ణకంచుకాన్ని తగిలించుకొని వస్తున్నారు. మీరు వెంటనే ఏమైనా చెయ్యాలి.

ఆంటోనీ  : ఆక్టేవియస్ ! ప్రశాంతంగా ఉత్తరభాగపు యుద్ధభూమిని నీవు కాచుకో.

ఆక్టేవియస్  : నేను దక్షిణభాగాన ఉంటాను. ఉత్తరభాగాన్ని నీవు కాచుకో.

ఆంటోనీ  : ఈ క్లిష్టసమయంలో నీవు నాతో వ్యతిరేకిస్తున్నావెందుకు?

ఆక్టేవియస్  : నిన్ను వ్యతిరేకించటం కాదు. నేనీ పని చేస్తాను. అంతే!

(బయలుదేరుతారు)

(యుద్ధ దుందుభులధ్వనులు వినిపిస్తుంటవి. బ్రూటస్, కాషియస్,

వారి సైన్యాలు, లూసిలియస్, టిటిలియస్, మెసెల్లా, ఇతరులూ ప్రవేశిస్తారు.)

జూలియస్ సీజర్113 బ్రూటస్  : వారు నిలువబడ్డారు మనతో సంప్రదించదలచినట్లున్నారు.

కాషియస్  : టిటినియస్! ఆగిపో. ముందుకు వెళ్ళి మనం వారితో మాట్లాడాలి.

ఆక్టేవియస్  : మనం యుద్ధచిహ్నాన్ని వారికి అందిద్దామా?

ఆంటోనీ  : లేదు. సీజర్, వారి ఎత్తేమో చూచి సమాధానం చెబుదాం. ముందుకు పోదాం. బ్రూటస్, కాషియస్ సేనాపతులు మనతో మాట్లాడదలచి నట్లున్నారు.

ఆక్టేవియస్  : సంజ్ఞ చేసేటంతవరకూ కదలవద్దు.

బ్రూటస్  : దేశీయులారా! పోటీలకు ముందు మాటలా?

ఆక్టేవియస్  : మాటలంటే మాకు మీ కంటే ఇష్టమని కాదు.

బ్రూటస్  : మంచి మాటలు పోటులకంటే మంచివి.

ఆంటోనీ  : చెడ్డపోటులు పొడిచేటప్పుడు బ్రూటస్, నీవు మంచిమాటలే చెపుతావు. 'చిరంజీవ! జై సీజర్!' అన్న నినాదాలు చేస్తూనే సీజర్ ను పొడిచిన పోటు ఇందుకు సాక్ష్యం.

కాషియస్  : ఆంటోనీ! నీ పోటులు ఏ వంకకు పడతాయో ఇంకా తెలియదు. కానీ నీ మాటలు హైబ్లా" తేనెటీగలు దాచుకున్న తేనెనంతటినీ కాజేసి, వాటికి లేకుండా చేసినట్లు కన్పిస్తున్నవి.

ఆంటోనీ  : తేనె లేకుండా చేయటమే కాదు కుట్టటం కూడా లేకుండా చేసినట్లున్నవి నీవి.

బ్రూటస్  : అవును. వాటి ఝంకారాన్ని నీవు పుచ్చుకొన్నావు గనక నీవి రొదకూడా కాజేసినట్లున్నవి. కానీ కుట్టబొయ్యేముందు తెలివితేటలతో ప్రవర్తించు.

ఆంటోనీ  : ద్రోహులారా! నన్ను భయపెడుతున్నారా? మీ చురికలు ఒకదానితో ఒకటి సీజర్ శరీరంలో రాచుకొంటున్నప్పుడే మీరు అలా ప్రవర్తించ లేదు. అందుకు ప్రతిగా మీరు కాస్కా పిచ్చిగజ్జికుక్కలా సీజర్ మెడమీద దొంగపోటు వేసినప్పుడు స్తోత్రపాఠకుల్లాగా, మబ్బుల్లా పళ్ళికిలించి, కుక్కల్లా కాళ్ళమీద పడ్డారు.

కాషియస్  : బ్రూటస్, ఇందుకు నిన్ను నీవే అభినందించుకోవాలి. కాషియస్ మాట చలామణి ఔతుంటే ఈ నాలుక ఈ నాడిలా కారులు ప్రేలగలిగేదా? ఆక్టేవియస్  : ఈ వ్యర్థభాషణాన్ని చాలిద్దాం. ప్రస్తుతానికి వద్దాం. వాగ్వాదం వల్ల చెమట బిందువులు రాలితే, దాని ఫలితం వల్ల రక్తస్రావం జరుగుతుంది. ఈ హంతకులమీద నేను కత్తిని దూస్తున్నాను. ఇది తిరిగి ఒరలో ఎప్పుడు చేరుతుందో మీకు తెలుసునా? సీజర్కు తగిలిన ముప్పది మూడు గాయాలకూ తగిన ప్రతీకారం జరిగేటంతవరకూ పోదు లేదా మరొక సీజర్' హంతకద్రోహుల కత్తులకు బలి అయ్యేటంత వరకూ చేరదు.

బ్రూటస్  : సీజర్, నీవు అటువంటి వారిని వెంట తెచ్చుకుంటే తప్ప వారిహస్తాలలో మృతి నొందటానికి వీలుండదు.

ఆక్టేవియస్ : నేనూ అలాగే అనుకుంటున్నాను. నేను బ్రూటస్ కత్తితో చావటానికి పుట్టలేదు.

బ్రూటస్  : నీ వంశంలో నీవు మహోదాత్తుడవై జన్మించినప్పటికీ, నీకు అంతకంటే గౌరవనీయమైన చావు కలుగదు.

కాషియస్  : ఒక వేషధారి (మారుమొగం) తో తిని త్రాగి త్రుళ్ళేవాడితో చేరిన బడిపిల్లవాడికి అంతటి గౌరవార్హత కూడానా?

ఆంటోనీ  : సరిగా పరిహాసకుడవైన కాషియస్ లా మాట్లాడావు.

ఆక్టేవియస్  : వచ్చెయ్ ఆంటోనీ! ఇదిగో మా తిరస్కారం. అందుకోండి. ఎదుర్కోండి. మీకు ధైర్యముంటే ఈ నాడు యుద్ధభూమికి రండి. లేకపోతే మీకు ఇష్టం వచ్చిననాడు రండి.

(ఆక్టేవియస్, ఆంటోనీ వారి సైన్యాలతో నిష్క్రమిస్తారు)

కాషియస్  : పెనుగాలులు వీచాయి. కల్లోలితాలై అలలు చెలరేగాయి తుపాను వచ్చింది. మన సర్వస్వం ఉన్న నౌకను అలలమీద వదిలాం.

బ్రూటస్  : లూషియస్! నీతో కొంత మాట్లాడాలి.

లూషియస్ : (నిలువబడి) ప్రభూ!

(విడిగా బ్రూటస్, లూషియస్ మాట్లాడుతుంటారు)

కాషియస్  : మెసెల్లా!

మెసెల్లా : (నిలిచి) సేనాపతుల ఆజ్క్ష ఏమిటి? కాషియస్  : కాషియస్ జన్మించింది ఈ నాడే కనక ఈ నాడు నా జన్మదినం. ఏదీ నీ హస్తం? ఒకనాటి పాంపేలాగా49, నా ఇష్టానికి వ్యతిరేకంగా, మన సమస్తసాహసాన్నీ ఈ యుద్ధం కోసం పణం పెట్టవలసి వచ్చింది. ఎపిక్యూరస్కు నేను50 అనుయాయినని నీకు తెలుసు. కానీ నేనిప్పుడు నా అభిప్రాయాలను మార్చుకున్నాను. శకునాలు సత్యాలని నమ్ముతున్నాను. సార్డిస్ నుంచి మనం వస్తుండగా51 భరత పక్షులు రెండు మన ప్రధానధ్వజం మీద వ్రాలాయి. అవి అక్కడ మన సైనికుల హస్తాలను తింటూ కూర్చున్నవి. ఈ పక్షులు మనను పంపేవరకూ అనుసరించి ఈ ఉదయమే పారిపోయాయి. వాటిస్థానంలో కాకులు, గ్రద్దలు, కాకోలాలు మనను తమ అనిశ్చితాహారంగా భావించి తలలమీద తిరుగుతూ, మృత్యుసూచకాలై ఆచ్ఛాదిస్తున్నవి.

మెసెల్లా : మీరు వీటి నన్నింటినీ నమ్మకండి!

కాషియస్ : నేను వాటిని కొంతవరకు నమ్ముతాను. నన్నేదో నవచైతన్యం ఆవేశించింది. కానీ నేను నిశ్చలంగా సమస్తమైన ఆపదలనూ దృఢశక్తితో ఎదర్కొంటాను.

బ్రూటస్  : (దూరంగా లూసిలియస్ తొ) లూసిలియస్! సర్వదా అలాగే.

కాషియస్ : మహోదాత్తా బ్రూటస్! శాంతి సమయంలో స్నేహితులంగా ఉన్న మనం వృద్ధాప్యం వరకూ అలాగే ఉండటానికి ఉంటాం. నిశ్చయంగా దేవతలు మనయెడ మిత్రభావమే వహించారు. కానీ, మానవుల వ్యవహారాలన్నీ అనిశ్చితాలు కనక, ఎంతటి కీడు కలగటానికి వీలుందో అంతా ఊహిద్దాము. ఈ యుద్ధంలో మనకు అపజయమే ప్రాప్తిస్తే మనం ఇర్వురం కలిసి మాటాడుకోటానికి ఇదే తుదిసారి ఔతుంది. మీరేం చేయదలచుకున్నారు?

బ్రూటస్  : నేను నేర్చుకొన్న తత్త్వశాస్త్ర ధోరణి ఇది కాదు. భవిష్యత్తులో ఏమి కానున్నదో అన్న భయంతో జీవితకాలాన్ని తగ్గించుకోటం నా తత్త్వం కాదు. ఇందుకే నేను ఆత్మహత్య చేసుకొన్నాడని కేటోను52 నిందించాను. మనను పాలించే దేవతల నిర్ణయం కోసం నేను ప్రశాంత చిత్తంతో వేచి ఉంటాను.

కాషియస్  : ఈ యుద్ధంలో మనం ఓడిపోతే వారు తమ విజయోత్సవ సందర్భాలలో మిమ్మల్ని రోం ఘంటాపథాలలో ఈడ్చుకోపోవటానికి ఇష్టపడుతున్నారా?

బ్రూటస్  : లేదు. ఓ ఉదాత్త రోం పౌరుడా, కాషియస్! లేదు. బందీ అయి బ్రూటస్ రోంకు వెళతాడని భావించకు. అతడు మహామనస్వి. మార్చి పదిహేనున ఆరంభమైన పని ఈ నాటితో పరిపూర్ణమౌతుంది. ఈ నాడు గడచి మనం బ్రతుకుతామో లేదో. అందువల్ల మనం నిత్యమైన వీడ్కోలును పొందుదాం. కాషియస్! సర్వకాలాలకూ నీకు ఇదే నా వీడ్కోలు! మళ్ళీ కలుసుకుంటామనుకో, మందస్మితం చేద్దాం. లేదనుకో. ఈ విప్రయోగం అత్యుత్తమంగా జరిగిపోయిం దౌతుంది.

కాషియస్  : సర్వకాలాలకూ ఇదే నా వీడ్కోలు! మనం మళ్ళీ కలుసుకుంటే నిశ్చయంగా మందస్మితం చేద్దాం కదూ! నిజానికి మన వీడ్కోలు అత్యుత్తమంగా జరిగిపోతున్నది.

బ్రూటస్  : ఇక ఆలస్యమెందుకు? నడిపించు. ఈ నాటి ఫలితాన్ని గురించి ముందుగా తెలుసుకోటానికి నేనెంతో కుతూహల పడుతున్నాను. ఈ దినం ఏ రీతిగానైనా అంతమొందితే చాలు. ఫలితం తెలిసిపోతుంది. ఇక పద! నడవండి!!

రెండో దృశ్యం

(అదే ప్రదేశం యుద్ధభూమి. యుద్ధధ్వనులు వినిపిస్తుంటాయి. బ్రూటస్, మెసెల్లా ప్రవేశిస్తారు.)

బ్రూటస్  : వెళ్ళు మెసెల్లా, వేగంగా వెళ్లు. ఈ వార్తలు అవతలవైపు ఉన్న సైన్యానికి అందించు. (పెద్ద కోలాహలం వినిపిస్తుంది) ఆక్టేవియస్ పక్షంలో శక్తి క్షీణించినట్టు కనిపిస్తున్నది. వెంటనే కాషియస్ ను సైన్యంతో వారిమీద పడమను. హఠాత్తుగా పైబడితే వారు లొంగిపోతారు. వెళ్ళు. వేగంగా వెళ్ళు. వాళ్ళందరినీ క్రిందికి రమ్మను.

(నిష్క్రమిస్తాడు)

మూడో దృశ్యం

యుద్ధభూమిలో మరొకభాగం. యుద్ధకోలాహలం వినిపిస్తుంటుంది. కాషియస్, టిటినియస్ ప్రవేశిస్తారు.

కాషియస్  : చూడు టిటినియస్! ద్రోహులు పారిపోతున్నారు. నా మనుష్యులకు నేనే శత్రువుగా ప్రవర్తించాను. నా ధ్వజవాహకుడు పారిపోవటానికి యత్నిస్తుంటే వాణ్ణి చంపి, ఆ ధ్వజాన్ని అందుకున్నాను.

టిటినియస్  : కాషియస్! బ్రూటస్ చాలా ముందుగా పైబడమని ఆజ్ఞాపించారు. ఆక్టేవియస్ సన్నగిల్లటాన్ని చూచి వెంటనే విజయం చేకూరుతుందని భ్రాంతిపడి ఉంటాడాయన. మనను ఆంటోనీ చుట్టివేస్తుంటే, అతడి సైనికులందరూ దోపిడికోసం శత్రుశిబిరాలమీద పడ్డారు

పిండారస్ ప్రవేశిస్తాడు.

పిండారస్  : ప్రభూ! దూరంగా వెళ్ళిపొండి దూరంగా వెళ్ళిపొండి. మార్క్ ఆంటోనీ మీ శిబిరాలలో ప్రవేశించాడు. ఉదాత్తుడా, కాషియస్, దూరంగా వెళ్ళిపోండి.

కాషియస్  : ఈ కొండ చాలా దూరాన్నే ఉంది. టిటినియస్! చూడు, చూడు! ఆ అగ్ని దగ్ధమౌతున్న శిబిరాలు నావేనా?

టిటినియస్  : అవును ప్రభూ! మీవే.

కాషియస్  : టిటినియస్! నీకు నామీద ప్రేముంటే అశ్వాన్ని ఆరోహించి తరిమి పరుగెత్తించి పారిపో. ఆ దూరసైన్యాల దగ్గిరికి వెళ్ళి అవి మిత్రసైన్యాలో శత్రు సైన్యాలో తెలుసుకొని, రా.

టిటినియస్  : భావవేగంతో వెళ్ళి తిరిగివస్తాను.

(నిష్క్రమిస్తాడు)

కాషియస్  : పిండారస్! కొండపైకి వెళ్ళు - నాకు చూపు బాగా లేదు. టిటినియస్ నన్ను చూస్తుండు. యుద్ధభూమిలో జరిగే విశేషాలు నాకు అక్కడినుంచి నివేదిస్తుండు.

పిండారస్ కొండ ఎక్కుతాడు.

నేను ఈ నాడే జన్మించాను నేపుట్టిన ఈ నాడే మరణిస్తాను. నా జీవితం తన యాత్రను పూర్తి చేసుకొన్నది. ఒరేయ్! విశేషాలేమిటి?

పిండారస్  : (పైనుంచి) ప్రభూ!

కాషియస్  : విశేషాలేమిటి?

పిండారస్  : టిటినియస్ నన్ను ఆశ్వీకులు చుట్టుముట్టారు. అయినా అతడు ఇంకా అశ్వాన్ని తరుముతూ పరువులు పెట్టిస్తూనే ఉన్నాడు. వారు ఇప్పుడు అతడికి చాలా దగ్గరగా చేరారు. టిటినియస్! పరుగెత్తి పో!! శత్రువుల్లో కొందరు అశ్వికులు దిగుతున్నారు. టిటినియన్ కూడా దిగాడు. అయ్యో! వారు అతణ్ణి పట్టుకొన్నారు.

(దూరం నుంచి హర్షధ్వని వినిపిస్తుంది)

కాషియస్  : దిగి రా. ఇక చూడకు. అయ్యో! నా కళ్ళ ఎదటనే నా ప్రియమిత్రుడు బందీ అయిపోతే నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నేనెంత పిరికివాణ్ణి!

పిండారస్ దిగివస్తాడు.

ఒరేయ్, ఇక్కడికి రా! పార్థియాలో53 నిన్ను నేను బందీగా పట్టుకున్నాను. అప్పుడు నీకు ప్రాణదానం చేస్తూ 'మీ ఆజ్ఞలనన్నింటినీ పాలిస్తా'నని నీ చేత ప్రమాణం చేయించాను. రా. నీ ప్రమాణాన్ని నిలువబెట్టుకో. ఇప్పుడు నీవు స్వతంత్రుడివి. ఇదిగో, సీజర్ ఊపిరితిత్తుల్లో దూరిన ఈ కత్తితో నా కడుపును గాలించు. సమాధానం చెప్పటానికి ఆగకు. ఇదిగో! ఉఁ, అందుకో. నేను ఇలా చేతుల్తో మూసుకోగానే కత్తిని కడుపులోకి నడిపించు.

పిండారస్ అతణ్ణి పొడిచివేస్తాడు.

సీజర్, నీవు ప్రతీకారాన్ని పుచ్చుకొన్నావు. నిన్ను చంపిన కత్తితోనే ప్రతీకారాన్ని పుచ్చుకొన్నావు.

(పడిపోతాడు)

పిండారస్  : నేను ఇప్పుడు స్వతంత్రుణ్ణి. కానీ నేను ధైర్యం చేసి స్వతంత్రించి ఆయన్ను కాదని వ్యవహరించినట్లైతే స్వతంత్రుణ్ణయ్యేవాణ్ణి కాను. అయ్యో! కాషియస్ మహాశయా! ఎప్పుడూ ఏ రోము పౌరుడూ నన్ను గుర్తించని ఏ దూరదేశానికో నీ ఈ పిండారస్ పారిపోతున్నాడు.

మూస:చ్టి

మెసెల్లా  : టిటినియస్! ఇది కేవలం స్వల్పమైన మార్పేనా? బ్రూటస్ మహాశయుని సైన్యం ఆక్టేవియను జయించింది. కాషియస్ సైన్యాలు ఆంటోని చేజిక్కాయి.

టిటినియస్  : ఈ వార్త కాషియస్ కు సంతోషాన్ని చేకూరుస్తుంది.

మెసెల్లా  : నీవు అతణ్ణి ఎప్పుడు వదలి పెట్టి వచ్చావు?

టిటినియస్ : నేను వదలివచ్చినప్పుడు నిరాశ పూర్ణంగా ఆయన్ను ఆవరించి ఉంది. అప్పుడు ఆయన తన బానిస పిండారస్ ఈ కొండమీద ఉన్నాడు.

మెసెల్లా  : ఈ నేలమీద పడి ఉంది ఆయన కదూ?

టిటినియస్  : సజీవుడుగా ఉన్నట్లు లేదే. అయ్యో! హృదయమా! మెసెల్లా : ఇది ఆయన కాదేమో!

టిటినియస్  : పొరబడకు మెసెల్లా! ఇది ఆయనే. ఇక కాషియస్ మనకు లేడు.

ఓ అస్తమించే సూర్యుడా! ఈ రాత్రి అరుణకాంతులతో ఎలా నీవు అస్తమిస్తున్నావో, అలాగే తన అరుణారుణరక్త కాంతులతో కాషియస్ ఈ నాడు అస్తమించాడు. రోమక భానుడు " అస్తమించాడు.

మనరోజు గడిచింది. మేఘాలు, పొగమంచు, ఆపదలు ఆవరించాయి. మన పని పూర్తయింది. నే వెళ్ళిన పని విషయంలో ఉన్న అనుమానం ఇంత పని చేసింది.

మెసెల్లా  : విజయం చేకూరదన్న అనుమానమే ఈ పని చేసింది. ఓ చింతాదేవిదుహితా! నీచదోషమా!! అసత్య దృశ్యాలను అమాయకుల ఎదట ఎందుకు ప్రదర్శిస్తావు? ఓ దోషమా! నీవు చింతామూర్తి హృదయాన జన్మిస్తావు. నీ జన్మవల్ల అందుకు కారణభూతురాలైన నీ మాతృమూర్తి చింతాదేవి నశిస్తుంది.

టిటినియస్  : పిండారస్! ఎక్కడున్నావు?

మెసెల్లా : టిటినియస్! వీడెక్కడున్నాడో వెతుకు. నేనీవార్తను బ్రూటస్ చెవి కెక్కించి వస్తాను. ఎక్కించటం కాకేమిటి? దూసుకోపోయే కత్తికంటే, విషపుటికంటే ఈ దృశ్యానికి సంబంధించినవార్త ఆయన కెంతో దారుణంగా ఉంటుంది.

టిటినియస్ : మెసెల్లా! నేను పిండారస్ ను వెతుకుతాను. నీవు వెళ్ళు.

(మెసెల్లా నిష్క్రమిస్తాడు)

వీరుడా! కాషియన్, మీరు నన్నెందుకు పంపించారు? నేను నా మిత్రులను కలుసుకోలేకపోయినానా? వారు ఈ విజయపుష్పమాలను నాకిచ్చి నీ ఫాలదేశాన్ని అలంకరించమన్నారే! వారి ఆనందకోలాహలాన్ని వినలేదా? అయ్యో! మీరు సమస్తాన్నీ అపార్థం చేసుకొన్నారు. ఇదుగో చూడండి. ఈ పుష్పమాలతో మీ ఫాలాన్ని అలంకరించుకోండి. ఇది మీ కివ్వమని మీ బ్రూటస్ నన్ను ఆజ్ఞాపించాడు. నేను ఆయన ఆజ్ఞను పాలిస్తున్నాను. బ్రూటస్! మహాశయా! రండి! వేగంగా రండి!! చూడండి. నేను కేయస్ కాషియస్ ను ఎలా గౌరవిస్తున్నానో చూడండి. ఇది రోము పౌరులు ఆచారం. ఓ దేవతలారా! మీ అనుజ్ఞ నివ్వండి. రా, కాషియస్ మహాశయుని కరవాలమా! రా. టిటినియస్ హృదయాన్ని పరిశీలించు.

(ఆత్మహత్య చేసుకుంటాడు)

యుద్ధధ్వనులు వినిపిస్తుంటవి. బ్రూటస్, యువకుడైన కాటో, స్ట్రాటో

వొలుమ్నియస్, లూసిలియన్లతో మెసెల్లా ప్రవేశిస్తాడు.

బ్రూటస్ : ఎక్కడ? ఎక్కడ? ఏదీ అతని శరీరం?

మెసెల్లా  : అదిగో, దూరంగా. టిటినియస్ దానిమీద పడి దుఃఖిస్తున్నాడు.

బ్రూటస్  : టిటినియస్ ముఖం వెల్లకిలపడి ఉందే!

కాటో  : అతడు చంపబడ్డాడు!

బ్రూటస్  : సీజర్ నీవు మరణాంతరం కూడా బలవంతుడివే. నీ ఆత్మ స్వేచ్ఛగా విహరిస్తూ, మా కడుపుల్లోకి మా కత్తులనే నడిపిస్తున్నది.

మందంగా యుద్ధధ్వనులు వినిపిస్తుంటవి.

కాటో  : వీరుడా టిటినియస్!!... చూడండి. అతడు మరణించిన కాషియస్ ను కిరీటాలంకృతుణ్ణి చేశాడు.

బ్రూటస్  : సజీవులైన వ్యక్తుల్లో ఈ ఇద్దరివంటి రోమను పౌరులు మన కెవరైనా లభిస్తారా? రోము నివాసుల్లో తుది “మహోదాత్త వ్యక్తుల్లారా! మీకు వీడ్కోలు. రోములో మీకు సాటి అయినవారు జన్మించటం కల్ల!

మిత్రులారా! ఈ నాడు నే కార్చే కన్నీరు మరణించిన ఈ వ్యక్తి ఋణాన్ని తీర్చుకోలేవు. కాషియస్, సమయం చూచుకొని వచ్చి మరికొంత కన్నీరు కారుస్తాను. పదండి. అతడి శరీరాన్ని థసాస్ కు56 పంపించండి. అతని అంత్యక్రియలు మన శిబిరంలోనే జపితే మన పక్షానికి నిరాశ కలుగుతుంది. లూసిలియస్, పద. కేటో యువకా! పద. యుద్ధభూమికి పోదాం పదండి. లేబియో, ఫ్లేవియస్ మన యుద్ధాలను నడిపిస్తారు. ఇప్పుడు 57మూడైంది. రాత్రి వచ్చేలోగా రెండోమారు యుద్ధంలో మన అదృష్టాన్ని పరీక్షిద్దాం.

(నిష్క్రమిస్తారు)

నాలుగో దృశ్యం

యుద్ధభూమిలో మరోభాగం యుద్ధధ్వనులు వినిపిస్తుంటవి.

ఉభయ సైనికులూ సమరం సాగిస్తుంటారు.

తరువాత బ్రూటస్, కేటో, లూసిలియస్, ఇతరులూ ప్రవేశిస్తారు.

బ్రూటస్  : సోదరులారా! ధైర్యం వహించండి.

కేటో : ధైర్యాన్ని కోల్పోయేటంతటి నీచులమా మనం? నా వెంట ఎవరు వస్తారు? యుద్ధ భూమిలో నా పేరు నిలువబెట్టుకుంటాను. తెలుసునా? నేను మార్కస్ కేటో కుమారుణ్ణి నిరంకుశులకు శత్రువును. దేశమిత్రులకు మిత్రుణ్ణి.

బ్రూటస్  : నేను బ్రూటస్ ను. మార్కస్ బ్రూటస్ ను బ్రూటస్ దేశానికి మిత్రుడు. నన్ను బ్రూటస్ అని గ్రహించు.

మూస:C'''

లూసిలియస్  : యువ కేటో! పడిపోయినావా? టిటినియస్ వలె వీరుడిలా మరణించావా? నీవు కేటో పుత్రుడవన్న గౌరవాన్ని నిలబెట్టుకున్నావు.

ప్రథమ సైనికుడు : లొంగిపో! లేకపోతే మరణిస్తావు!

లూసిలియస్ : మరణించటానికి లొంగిపోతాను. ఇదిగో ఈ ధనాన్ని తీసుకో. నన్ను వెంటనే చంపు. (ధనమిస్తాడు). (బ్రూటస్ ను చంపు. ఆయన్ను చంపానన్న గౌరవాన్ని పొందు.

ప్రథమ సైనికుడు  : నిన్ను జీవగ్రాహంగా పట్టుకోరమ్మని మాకాజ్ఞాపించారు. నీవు ఉదాత్తుడవైన బందీవి.

ద్వితీయ సైనికుడు  : దారి ఇవ్వండి. ఆంటోనీకి బ్రూటస్ బందీ అయినాడని తెలియజేయండి.

ప్రథమ సైనికుడు  : నేనీవార్త చెపుతాను. అడుగో మా సేనాపతి వస్తున్నాడు. బ్రూటస్ ను బందీ చేశాం! బ్రూటస్ ను బందీ చేశాం!!

ఆంటోనీ  : అతడెక్కడున్నాడు?

లూసిలియస్  : ఆంటోనీ! ఆయన తగినంత భద్రంగా ఉన్నాడు. ఏ శత్రువైనా బ్రూటస్ మహాశయుణ్ణి జీవగ్రాహంగా పట్టుకోలేడు. నేనొక నిర్ణయంగా చెపుతున్నాను విను. దేవతలు ఆయన్ను అట్టి అవమానం నుంచి రక్షించెదరు గాక! ఎట్టి స్థితిగతుల్లోనైనా మీరు ఆయన్ను నిర్జీవుడుగాగాని, సజీవుడుగా గాని చూచినప్పుడు ఆయన ఆ మహోదాత్తుడైన బ్రూటస్ గానే కనిపిస్తాడు. ఆంటోనీ  : మిత్రులారా! ఇతడు బ్రూటస్ కాదు మీరు పొరబడ్డారు. కానీ ఇతణ్ణి జాగ్రత్తగా చూడండి ఇతడు బ్రూటస్ తొ తుల్యమైన విలువగలవాడు. ఇతణ్ణి మిక్కిలి కనికరంతో చూడండి. ఇటువంటివాళ్ళు నాకు శత్రువులుగా ఉండటం కంటే మిత్రులుగా ఉండవలెనని ఎంతగానో కోరుకుంటాను. పదండి. బ్రూటస్ సజీవుడో, నిర్జీవుడో వెదకండి. వ్యవహారం ఎలా పరిణమించిందో నాకు వార్తలందజేయండి. మేము ఆక్టేవియస్ గుడారంలో ఉంటాము.

ఐదో దృశ్యం

యుద్ధభూమిలో మరోభాగం. బ్రూటస్, డార్దానియస్,

క్లి

టస్, స్ట్రాటో, పొటాలినస్ ప్రవేశిస్తారు.

బ్రూటస్  : రండి. మిత్రుల్లో మిగిలిన అల్పసంఖ్యాకులారా! ఈ తిప్పమీద విశ్రాంతి తీసుకొండి.

క్లిటస్  : స్టాటిలియస్ కాగడాను చూపించాడే గాని తిరిగి రాలేదు బహుశః మరణించి ఉంటాడు. శత్రువులు అతణ్ణి బందీనైనా చేసి ఉంటారు, లేకపోతే -

బ్రూటస్ : క్లిటస్! కూర్చో. విశ్రాంతి తీసుకో. మరణించటమే ఈ నాటి వార్తయి పోయింది. అది ఆచారమైంది. మనం అనుసరిద్దాము. క్లిటస్!

(పిలిచి రహస్యంగా సంభాషిస్తాడు)

క్లిటస్  : ఏమన్నారు? మిమ్మల్ని చంపమన్నారా, ప్రభూ? సమస్తప్రపంచాన్ని నాకు కట్టబెట్టినా ఆ పని చేయలేను.

బ్రూటస్  : అయితే, గొడవ పెట్టకు.

క్లిటస్  : ఇంతకంటే నన్ను నేను చంపుకుంటాను గాని మిమ్మల్ని చంపటమా?

బ్రూటస్ : డార్డినస్, ఇలా రా.

క్లిటస్  : డార్డినస్!

డార్డినస్  : క్లిటస్!

క్లిటస్  : బ్రూటస్ నిన్ను ఎంత చెడ్డకోరిక కోరుతున్నారో గమనించావా? డార్డినస్ : ఆయన్ను చంపమంటున్నాడు క్లిటస్! ఆత్మభావచయంలో ఆయన ఎలా మగ్నుడైపోయినాడో చూడు.

క్లిటస్  : ఈ బ్రూటస్ హృదయపాత్ర దుఃఖంతో నిండి పొర్లిపోతున్నది. ఆ కన్నీటిని గమనించు.

బ్రూటస్  : ఇలారా, వొలుమ్నియస్! నేను చెప్పింది విను.

వొలుమ్నియస్  : ఏమంటున్నారు ప్రభూ?

బ్రూటస్  : సీజర్ భూతరూపం నాకు రెండుమార్లు దర్శనమిచ్చింది. ఒకమారు సార్డిస్ లో, మరోమారు రాత్రి ఫిలిప్పీ యుద్ధభూమిలో. నా అంత్యం దగ్గరకు వచ్చింది నాకు తెలుసు. వొలుమ్నియస్ : లేదు ప్రభూ! అలా అనకండి.

బ్రూటస్ : లేదు. నాకు నిశ్చయంగా తెలుసు. వ్యవహారాలెలా నడుస్తున్నవో నీకు తెలుసు. శత్రువులు మనలను గర్తందాకా తరుముకోవచ్చారు. వారు వచ్చి అందులోకి నెట్టేదాకా తారట్లాడటం కంటే ఈ ప్రపాతం నుంచి దుమకటం మనకు క్షేమం.

వొలుమ్నియస్! నీవూ, నేనూ బాల్యమిత్రులం కలిసి బడికివెళ్ళాం. ఆ అపూర్వమైత్రికి సాక్షిగా నీవు నా కత్తిని పట్టుకో. నేను దానిమీదికి పరుగెత్తి ప్రాణాలు కోల్పోతాను.

వొలుమ్నియస్  : ఇది మిత్రుడికి ఆదేశింపదగ్గ ఉద్యోగం కాదు ప్రభూ!

(ఇంకా యుద్ధకోలాహలం వినిపిస్తుంటుంది.)

క్లిటస్  : ఇక్కడ తారాడి ప్రయోజనం లేదు. ప్రభూ! పరుగెత్తిపొండి, పరుగెత్తిపొండి.

బ్రూటస్  : మీకు ఇదే నా వీడ్కోలు. నీకు క్లిటస్! నీకు వొలుమ్నియస్! స్ట్రాటో! ఇంతవరకూ నీవు నిద్రలో మునిగున్నావు. నీకూ నా వీడ్కోలు. జీవితంలో ఒకటే నాకు పరమానందం. నా తుదిదాకా నా మిత్రులందరూ నాయెడ సత్యసంధులై వర్తించారు. ప్రయోజనరహితమైన విజయం వల్ల ఆక్టేవియస్, ఆంటోనీ పొందేదానికంటే అపజయం వల్లనే నేను అధికంగా సాధింపగలిగాను. ఇక మీకు, మీ అందరికీ వీడ్కోలు. బ్రూటస్ జీవితచరిత్ర ఇంతటితో అంతమొందినట్లే. రాత్రి నా కనురెప్పలమీద కూర్చున్నది. అంతరాత్మ విశ్రాంతి కోసం ఆతురత వహిస్తున్నది. ఇంత కాలం నా శరీరం శ్రమించింది ఈ పుణ్య సమయం కోసమే. లోపల యుద్ధధ్వనులు, పరిగెత్తిపొండి, పరిగెత్తిపొండి అన్న కేకలు వినిపిస్తున్నవి.

క్లిటస్ : పరుగెత్తిపొండి! ప్రభూ, పరుగెత్తిపొండి!

బ్రూటస్  : పదండి, నేను అనుసరిస్తున్నాను.

(క్లిటస్, డార్జీనియస్, వొలుమ్నియస్ నిష్క్రమిస్తారు)

స్ట్రాటో! నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ ప్రభువుకు అండగా నిలు. మంచికీర్తిని సంపాదించుకున్నవాడివి. నీ జీవితం నిండా గౌరవామోదం నిబిడమై ఉంది. నా కత్తిని పట్టుకో. నీ ముఖాన్ని ప్రక్కకు త్రిప్పు నేను దానిమీద పడిపోతాను.

స్ట్రాటో : ప్రభూ! ముందు మీ హస్తచాలన సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించండి. ఇదే మీకు వీడ్కోలు.

బ్రూటస్  : ఉత్తముడా, స్ట్రాటో, ఇదే నీకు వీడ్కోలు!

(బ్రూటస్ కత్తిమీద పడిపోతాడు)

సీజర్, ఇక శాంతించు. నన్ను నేనే చంపుకుంటున్నప్పటి చిత్తస్ఫూర్తిలో అర్ధాంశంతోనైనా నిన్ను నేను చంపలేదు!

యుద్ధధ్వనులు వినిపిస్తుంటాయి. ఆక్టేవియస్, ఆంటోనీ ప్రవేశిస్తారు. మెసెల్లా,

లూసిలియస్, సైన్యాలు ప్రవేశిస్తారు.

ఆక్టేవియస్  : ఆ వ్యక్తి ఎవరు?

మెసెల్లా : మా యజమానికి సేవకుడు. స్ట్రాటో! ప్రభువువారెక్కడ?

స్ట్రాటో : మెసెల్లా! నీవు పడ్డ బానిసత్వాన్ని తప్పించుకొన్నారు. విజేతలు వారి చితాగ్నిని తప్ప చూడజాలరు. ఆయన తన్ను తానే చంపుకున్నాడు. ఆయనను చంపానని సగర్వంగా చెప్పుకొనే అవకాశం ఎవరికీ లేదు.

లూసిలియస్  : మహోదాత్తుడు బ్రూటస్ తన ఆధిక్యానికి అనుగుణంగా ప్రవర్తించాడు. బ్రూటస్ మహాశయా! నీవు లూసిలియస్ అంటున్నట్లే చేశావు.

ఆక్టేవియస్  : బ్రూటస్ ను సేవించేవారందరినీ నేను ఉద్యోగాలిచ్చి పోషిస్తాను. ఏమోయ్! నా సేవలో కుదరటం నీకిష్టమేనా?

స్ట్రాటో : మెసెల్లా ఇందుకు అంగీకరిస్తే అలాగే. ఆక్టేవియస్ : ఉత్తముడా మెసెల్లా! అతణ్ణి అలా ఆజ్ఞాపించు.

మెసెల్లా  : స్ట్రాటో! నా ప్రభువు బ్రూటస్ ఎలా మరణించారు?

స్ట్రాటో  : నేను కత్తిని నిల్పాను వారు దానిమీదపడి ప్రాణాలు తీసుకున్నారు.

మెసెల్లా : ఆక్టేవియస్ మా ప్రభువుకు తుదిసేవ చేసిన ఇతణ్ణి మీ కొల్వులోకి తీసుకోండి.

ఆంటోనీ  : వారందరిలో ఇతడే మహోదాత్తుడు. ఇతడు తప్ప మిగిలిన వారందరూ సీజర్ ను ఈర్ష్య వల్ల హత్య చేశారు. సత్యబుద్ధితో ప్రజాసామాన్య సంక్షేమాన్ని భావించి వారిలో చేరింది ఇతడొక్కడే. ఇతడి జీవితం అతికోమలమైంది. సమస్తభూతాలూ నిలిచి మానవుడంటే ఇతడు అని ప్రపంచానికి చాటిచెప్పదగ్గట్లుగా సర్వసద్గుణాలూ ఇతడిలో సంకలితాలయ్యాయి.

ఆక్టేవియస్  : ఇతడి మహోత్తమగుణాల కనుగుణంగానే మనం ఇతణ్ణి గౌరవిద్దాం. మహావీరుడికి యోగ్యమైన సమస్త ఆచారాలతో అంత్యక్రియలు జరుపుదాం. ఇక సైన్యాలను యుద్ధం మాని ప్రశాంతి వహించవలసిందని ఆజ్ఞాపించు. పద. మహానందకరమైన ఈ సుదినం నాటి కీర్తి ప్రతిష్ఠలను పంచుకోవటానికి ఇక మనం నిష్క్రమిద్దాం.

(నిష్క్రమిస్తారు)

'అనుబంధం'

1. వక్షస్త్రాణము  : చర్మపుడాలు వడ్రంగిపని చేసేటప్పుడు శరీరానికి దెబ్బ తగలకుండా కట్టుకుండేది.

2. చెడ్డ చర్మాలను  : ఇక్కడ షేక్స్ పియర్ 'బాడీ సోల్స్' అన్న పదాన్ని ఉపయోగించాడు. సోల్స్ శబ్దానికి చెప్పు అడుగు భాగమనీ, ఆత్మలనీ, ఆంగ్లభాషలో ఉన్న శ్లేషార్థాలు రెండూ ఈ సందర్భంలో వర్తిస్తాయి. ఈ సొగసు అనువాదంలో కనిపింప చేసే అవకాశం లేదు.

3. పాంపే - 'వీరత్రయకూటమి' (ట్రయంవిరేట్) క్రీ.పూ. 106-48 గొప్ప సేనాపతి. రోము కోసం అనేక విజయాలను చేకొన్నవాడు. సీజర్కు ప్రబలశత్రువు. ఇతణ్ణి ఈజిప్టులో హత్య చేశారు.

4. టైబర్ - రోము మహానగరం ఈ నదీతీరాన్నే నిర్మితమైంది. 5. సభా మందిరం - కాపిటోలైన్ కొండమీద కట్టిన జూపిటర్ దేవాలయం. జైత్రయాత్ర చేసి విజయాలతో రోము నగరంలో ప్రవేశించిన వీరులందరూ ఉత్సవంతో ఈ ఆలయానికి వచ్చి సర్వదేవతాపిత అయిన జూపిటర్కు వినతులు చెల్లిస్తారు. ఇది సభాభవనమని షేక్స్పియర్ పొరబడ్డాడు. 6. లూపర్కల్ ఉత్సవాలు - ఫానస్ అనే దేవతా గౌరవచిహ్నాలుగా ప్రాయశ్చిత్త, పవిత్రీకరణం కోసం రోము మహానగరంలో ఫిబ్రవరి పదిహేనున జరిగే ఉత్సవాలు. యువకులు నిరలంకృతులై నగ్నంగా నగరంలో పరుగెత్తుతూ, తమకు ఇష్టం వచ్చిన వాళ్ళను గట్టిగా చరుస్తూ పరుగెత్తి పోతుంటారు. వారు తట్టినవాళ్ళు గర్భవతులైతే సుఖంగా ప్రసవిస్తారనీ, వంధ్యలైతే గర్భవతులౌతారనీ రోము ప్రజల విశ్వాసం. 7. కల్పూర్నియా - సీజర్ను క్రీ.పూ. 44లో నాల్గవ భార్యగా వివాహ మాడిన వనిత. కల్పూర్నియాస్ పిసో కుమార్తె. జూలియస్ సీజర్ 127 - 8. ఏయనియస్ ఒక ట్రాయ్ వీరుడు. ఇడామౌంట్ మీది డార్దానసక్కు రాజైన ఆన్చెసిస్కు వీనస్ వల్ల జన్మించాడు. పది సంవత్సరాలు ముట్టడించి గ్రీకులు ట్రాయ్ని పట్టుకొని దగ్ధం చేసినప్పుడు, ఇతడు తన తండ్రిని తన భుజాలమీద ఎత్తుకొని, నగరంలోనుండి బయటపడవేసినట్లు వర్జిల్ కవి. 'ఈదడానికి ఏనిడ్ వల్ల తెలుస్తున్నది' సీజర్ గజ ఈతగాడని ఎన్నో కథలున్నాయి. కానీ షేక్స్పియర్ మానసిక శారీరక దౌర్బల్యం గల సీజర్ రోమక సామ్రాజ్యాన్ని ముందుగా కలగని అందుకు యత్నిస్తున్నట్లు చూపించటానికి, చరిత్రకు భిన్నంగా ఇలా కాషియస్చే పలికించాడు. 9. టిటినియస్ - సీజర్కు స్పెయిన్లో మిత్రుడు, పారిపార్శ్వకుడు. 10. కొలోసస్ - అప్పొలో దేవతకు రోహెడ్సు రేవులో నిల్పిన ఒక వరిష్ఠప్రతిమ. ఈ విగ్రహం పాదాల క్రిందుగా తెరచాపలు దించకుండానే నౌకలు ప్రయాణించ వచ్చునట! రోడ్స్ వద్ద కొలోసస్ అని ప్రఖ్యాతి వహించిన ఈ మూర్తి ప్రపంచ సప్త వైచిత్రాలలో ఒకటి. 11. మహాప్రళయానంతరం - క్రీ.పూ. 1403న ఈ ప్రళయం థెస్సలీలో జరిగినట్లు భావింపబడుతున్నది. ప్రొమిథియస్ పుత్రుడైన డ్యూకాలియన్ కాలంలో మానవులు చేసే అపచారాల మీద కలిగిన కోపం వల్ల ఈ ప్రళయాన్ని జూపిటర్ కల్పించాడట! ఈ ప్రళయం నుంచి డ్యూకాలియన్, అతడి భార్య పైఠాహా థెమిసిస్ దివ్యవాణి ఇచ్చిన సలహాను అనుసరించి, మౌంట్ పార్నాసస్ మీద నిలిచి బ్రతకగలిగినట్లూ, మానవజాతి నష్టాన్ని తీర్చటంకోసం వాళ్ళు వారి జేజెమ్మ ఎముకలను వెదజల్లారనీ, డ్యూకాలియన్ చల్లినవి పురుషులూ, అతని భార్య చల్లినవి స్త్రీలూ అయినట్లు గ్రీకు పురాణగాథల వల్ల తెలుస్తున్నది. 12. పూర్వం ఒకానొకప్పుడు ఒక బ్రూటస్ - ఇది టార్క్విన్సును పారద్రోలి రాచరికాన్ని రద్దు చేయటంలో ప్రముఖపాత్ర వహించిన లూషియస్ జూనియస్ బ్రూటస్. ఇతడు రోముకు మొదటి కాన్సల్ టార్క్విన్స్ రాజ్యపాలనను పునరుద్ధరించటానికి యత్నించిన తన కుమాళ్ళనిద్దరిని చంపుకొన్న దేశాభిమాని. ఇతని తృతీయపుత్రుని సంతతివాడు నాటకం నాటి బ్రూటస్. 128 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 13. టొగాకొన - రోమనులకు చొక్కా లేదు 'టోగా' అనే పేరు గల ఉత్తరీయాన్ని వారు ధరిస్తారు. 14. అతడు బలిసి ఉంటే - బలిసి చెయ్యబట్టినవాళ్లు సంతృప్తితో జీవిస్తుంటారనీ, అందువల్ల వాళ్ళు కుట్రలు పన్నరనీ సీజర్ భావం. 15. నాకు గ్రీక్ గానే ఉంది - అర్థం కాని అయోమయ సంభాషణ మన్నమాట! 16. మన పితృపితామహుల - మన తండ్రితాతల శరీరసౌష్ఠవం మనలను వదలక పోయినా మానసికంగా మనం మన తల్లుల లక్షణాలను పొంది స్త్రీత్వం వహించాము. ద్వితీయాంకం ప్రథమాంకంలో సీజర్ హత్యకు కుట్రలోని ప్రాథమికావస్థలు కనిపిస్తాయి. ద్వితీయాంకంలో కుట్ర పరిపూర్ణమౌతుంది. తృతీయాంకంలో హత్య జరుగుతుంది. 17. మంచి ఎండ కాసే రోజు - షేక్స్పియర్ మహాకవి ప్రకృతి పరిశీలనసామర్థ్యానికిది నిదర్శనం. 18. బావమరది - కాషియస్ జూనియా అనే బ్రూటస్ సోదరిని వివాహమాడటం వల్ల అతడికి బావమరది. 19. శృంగాశ్వం : 'యూనికారన్' అన్న పేరుగల గ్రీకు పురాణాలలోని కల్పిత జంతువు. దీనికి తలమీద కొమ్ముంటుందిట! 20. లిగారియస్ : బ్రూటన్కు ఆప్తమిత్రుడు. అతడియెడ గురుభావం కలవాడు. ఇతడు క్రీ.పూ. 43లో 'వీరత్రయకూటమి' నిర్ణయాల వల్ల, తన ఇరువురు సోదరులతో బాటు ప్రాణాలను కోల్పోయాడు. 21. గుండీలు లేకుండా - షేక్స్పియర్ రోమనులకు ఆంగ్లేయ వస్త్రాలిచ్చాడు. ఇది పొరబాటు. తృతీయాంకం సభాభవనం ముందు - నిజానికి సీజర్ హత్య "క్యూరియోపాం పైయానా'లో జరిగినట్లు ప్లూటార్కు చరిత్రకారుని రచనవల్ల తెలుస్తున్నది. ఇది పాంపే జూలియస్ సీజర్ 129 నాట్యశాలకు ఒక అనుబంధ మందిరం. షేక్స్పియర్ జూపిటర్ 'దేవమందిరాన్ని' సభాభవనంగా భావించి భ్రాంతి పడ్డాడు. కానీ సీజర్ హత్యను నగరకంఠమైన ఈ దేవమందిరం ముందు జరిపించటం సమంజసంగానే ఉంది. పాంపే నాట్యశాలలో ఉన్న పాంపే ప్రతిమను గూడా అతడు పొరబడిన సభాభవనానికి మార్చాడు. అయినా, సీజర్ తాను జయించిన తన ప్రబల శత్రువు పాంపే ప్రతిమముందు వధింపబడి ఒరిగిపోవటం, షేక్స్పియర్ చేసిన ఉచిత కల్పన అని అనిపించుకుంటున్నది. 22. ఈ రీతిగా ప్రణమిల్లావని - ఇక్కడ సీజర్ చేసిన ఆత్మ ప్రాతోన్మీలనం గమనింపదగ్గది. ఇందులో చక్రవర్తుల దృష్టి, వర్తనలు ఎలా ఉండాలో ఆయన నిరూపించాడు. ఆయన అభిప్రాయంలో చక్రవర్తి భయరహితుడు, అచంచలుడు, స్వతంత్రుడు - మానవ రూపాన్ని ధరించిన పరమేశ్వరుడు. 23. ఒలింపస్ పర్వతాన్ని - గ్రీసు దేశంలోని ఒక పర్వతం. ఇది సమస్త గ్రీకు దేవతలకూ నివాసభూమి అని గ్రీకు పురాణగాథలు. 24. మహాప్రళయసమయం - 'డూమ్స్'. 25. వీరాధి వీరుడ వైన నాకాస్కా - ఇందులోని వ్యంగ్యధ్వని గమనార్హం. 26. లేకపోతే - హంతకులను దూషించకపోవటం, సీజర్ను కీర్తించటం తప్ప ఇతరం చేయకపోవటం, బ్రూటస్ అనుజ్ఞతోనే మాట్లాడుతున్నానని సభలో ప్రకటించటం, బ్రూటస్ మాట్లాడిన వేదిక మీదనే ఆయన తరువాత మాట్లాడటం - అన్నవి అంగీకారం కాకపోతే, 27. ఏతీ - ప్రతీకారాది దోషాలకు మూర్తిత్వం వహించిన గ్రీకు దేవత. జూయస్ అనే పరమేశ్వరుడు ఆయన్ను త్వరపెట్టి ఒక దుష్టకృత్యాన్ని చేయించినందుకు, ఈ దేవతను దేవతానివాసభూమి అయిన ఒలింపస్ నుంచి నరకంలోకి విసరివేసినట్లు గ్రీకు పురాణగాథ. 28. రోము ప్రమాదరహితం కాదని - జూలియస్ సీజర్ను హత్య చేయటం వల్ల హంతకులు ఆక్టేవియస్ సీజర్ను కూడా హతమార్చే అవకాశం ఉండటం చేత. 29. మిత్రులారా! ఇది జూలియస్ సీజర్ నాటకంలో కెల్లా ప్రపంచ విఖ్యాతి 130 పొందిన ప్రసంగం. పైకి వినయాన్ని ప్రకటిస్తున్నా మార్క్ ఆంటోనీ ఒక జిత్తులమారి రాజకీయ వేత్త అనీ, చతురుడైన వక్త అనీ దీనివల్ల వెల్లడి ఔతున్నది. వావిలాల సోమయాజులు సాహిత్యం-3 30. అజచర్మలేఖనం - కాగితాలు లేని ఆ కాలంలో అజచర్మం (మేకచర్మం) మీద వ్రాసేవారు. 31. నెర్వైలు : బెల్లిక్ జాతుల్లో మహావీరులని పేరుపొందిన వర్గం. వీరిని సీజర్ క్రీ.పూ. 57లో 'సంత్రీ' యుద్ధంలో జయించాడు. ఈ యుద్ధం శీతకాలంలో జరిగింది. గ్రీష్మకాలంలో జరగలేదు. నాకు బాగా జ్ఞాపకం - కానీ ఆంటోనీ ఆ యుద్ధభూమిలో లేడు 32. ఒక పవిత్ర స్థలంలో - రోమను కాలంలో దహనానికి పవిత్ర స్థలాలంటూ లేవు. ఇది షేక్స్పియర్ ప్రవేశపెట్టిన క్రైస్తవ మత సంబంధమైన భావం. ఇది కాలీనవ్యత్యస్తకం (అనాక్రానిజం). 33. ఆ పేరును లాగివేయండి - సీజర్ ను, హత్యచేసిన వారిలో 'సిన్నా' నామం కలవాడు ఒకడు కావటం వల్ల. చతుర్థాంకం 34. ఇటువంటి పనులకు మాత్రమే పంపదగ్గవాడు: షేక్స్పియర్ లెపిడస్ ను ప్రజ్ఞాహీనుణ్ణిగానూ, క్షుద్ర కార్యకరణానికి పంపదగ్గవాణ్ణిగానూ చిత్రించాడే గాని, ఇతడు కాకలు దీరిన కదనవీరుడైనట్లు ప్లూటార్క్ రచనల వల్ల తెలుస్తున్నది. 'వీర త్రయ కూటమి' లో మిగిలిన ఇరువురూ ఇతణ్ణి తమకంటే తక్కువగా చూడటం చరిత్రాత్మకసత్యమే. అందువల్లనే ఇతడు క్రీ.పూ. 43లో తన స్థానాన్ని పొందటానికి తిరుగుబాటు చేసి ఓడిపోయినపుడు ఆక్టేవియస్ ప్రాణదానం చేస్తాడు. ద్రోహులను నిర్ణయించేటప్పుడు ఈ దృశ్యంలో వీరత్రయ కూటసభ్యులైన ఆక్టేవియస్, ఆంటోనీ, లెపిడస్ అధికారం కోసం ఆత్మబంధువుల సంహరణానికి కూడా ఎలా అంగీకరిస్తున్నారో గమనించదగింది. ఈ సందర్భంలో రోము మహానగరంలో జరిగిన హత్యాకాండ అతిదారుణమైంది. - 35. సార్డిస్ : ఆసియా మైనర్లో ప్రసిద్ధి పొందిన ఒక ప్రాచీన నగరం. రోములో తమమీద ఆంటోనీ వ్యతిరేకత ఫలితంగా తిరుగుబాటు వచ్చినప్పుడు బ్రూటస్, కాషియస్, తూర్పునకు పారిపోయారు. ఆక్టేవియస్, ఆంటోనీ ఇది గమనించి వారిని వెన్నాడుతూ వచ్చారు. జూలియస్ సీజర్ 131 36. ఇదే ప్రసిద్ధమైన కలహదృశ్యం. మహాకవి షేక్స్పియర్ మానవాతీతశక్తి కలవాడని నమ్మటానికి, మిగిలిన అన్ని రచనలకంటె కలహదృశ్యం ఎక్కువగా ఆకర్షించింది. అని సుప్రసిద్ధాంగ్ల విమర్శకుడు, కవి అయిన కోల్రిడ్జ్ అన్నాడు. 37. లూషియస్ పెల్లా : కాషియస్ క్రింది ఉన్నత సైనికోద్యోగి. - 38. చంద్రుణ్ణి చూచి మొరుగుతుండేవాణ్ణి ఈ పని చేయటం మూర్ఖత్వాన్ని వెల్లడిస్తుంది. చంద్రుణ్ణి చూచి భయపెట్టటానికి మొరిగే కుక్క పిచ్చిది కాకేమిటి? 39. నీ ప్లీహంలోని విషాన్ని జీర్ణించుకో - నీ కోపాన్ని రూపుమాపు అని అర్థం, ప్లీహం కోపం, ఈర్ష్య, చింతాది దోషాలకు జన్మస్థానమని పూర్వుల అభిప్రాయము. 40. ఫ్లూటస్ గని - గ్రీకుల ధనాధిపతి ప్లూటస్. విచక్షణ లేకుండా తన ధనాన్ని ఇస్తూ ఉండటం కోసం జూయస్ అతణ్ణి అంధుణ్ణి చేశాడని గ్రీకు పురాణగాథ. 41. 'వీరత్రయ కూటమి' హననం చేయటానికి గుర్తించిన సభాసభ్యుల సంఖ్య 200 అయినట్లు ప్లూటార్క్ 42. సత్యసంధుడైన - బ్రూటస్ మెసెల్లాతో తన భార్య పోర్షియాను గురించి ఎటువంటి వార్త రాలేదనటం, బహుశః అతడికి వచ్చిన లేఖల్లో ఆమెను గురించి వివరాలు ఏమై ఉంటాయో తెలుసుకోవటానికై ఉంటుంది. 43 ఎలాగైతేనేం : పోర్షియా గతించింది - ఇది బ్రూటస్ అనుద్వేగానికి ప్రబల నిదర్శనం. 44. రోమనులు ధరించే 'టోగా' ఉత్తరీయం వంటిది. దానికి జేబులుండవు. 45. నేను నీ దుష్టాత్మను - ప్లూటార్క్ కూడా భూతాన్ని గురించిన ప్రశంస చేశాడు. నీ కానీ అది సీజర్ భూతాకృతి అని వ్యవహరించలేదు. - 46. మళ్ళీ ఫిలిప్పీ దగ్గర కలుసుకుంటాను భూతాన్ని చూచి బ్రూటస్ మహాభయభ్రాంతుడై పోయినట్లు ప్లూటార్క్ షేక్స్పియర్ పాత్రపోషణ కోసం స్థైర్యమూర్తినిగా చిత్రించాడు. 132 వావిలాల సోమయాజులు సాహిత్యం-3 పంచమాంకం 47. హైబ్లా : సిసిలీలో తేనెకు ప్రసిద్ధి వహించిన ఒక ప్రాంతం. 48. మరొక సీజర్ : అతడి పేరు ఆక్టేవియస్ సీజర్ కావటంవల్ల అతడే. నేను జన్మించింది ఈ నాడే. రోమనులకు జన్మదినోత్సవాలు చేసుకొనే ఆచారం లేదు. 49. ఒకనాటి పాంపేలాగా - అనుభవరహితులైన అనుచరులతో థాస్సలీలోన ఫారస్సేలియావద్ద క్రీ.పూ. 48లో పాంపే సుశిక్షితాలై సీజర్ నాయకత్వాన నడిచివచ్చిన సైన్యాలను ఎదుర్కొని ఓడిపోయాడు. అంతటితో సీజర్కు రోమను సామ్రాజ్యం మీద ఆధిపత్యం లభించింది. 50. ఎపిక్యూరస్కు అనుయాయి - ఎపిక్యూరస్ క్రీ.పూ. 241-270లో జీవించి ప్రత్యేక తాత్త్వికశాఖకు మార్గదర్శియైన సుప్రసిద్ధ గ్రీకు తత్త్వవేత్త. దేవతలకు మానవుల జీవితాలమీద ఎట్టి ప్రభావం లేదని, వారికి సదాచార సంపత్తి గల జీవితాన్ని గడిపి ఆనందానుభవాన్ని పొందటమే చరమలక్ష్యమని అతడి తత్త్వసిద్ధాంతాలకు సారం. అతడి దృష్టిలో శకునాలు కేవలం ఇంద్రియవిభ్రాంతులు. 51 భరతపక్షులు : 'ఈగిల్స్'. శుభసూచకాలు. కాకులు, గ్రద్దలు, కాకోలాలు దుశ్శకున సూచకాలు. 52. కేటో : బ్రూటస్ భార్య పోర్షియాకు తండ్రి. ఫారసీలియా యుద్ధంలో పాంపేవైపు చేరి సీజర్కు వ్యతిరేకంగా పోరాడాడు. పాంపే ఓడిపోయిన తరువాత 'ఉటికా' వైపునకు పోయినాడు. అప్పుడు సీజర్ హస్తాలలో పడిపోకుండా ఉండటానికిగాను ఆత్మహత్య చేసుకున్నాడు. 53. పార్థియాలో నిన్ను నేను - నేటి ఖారోసాన్కు రోమక సామ్రాజ్యంనాటి నామం పార్థియా. కాషియస్, క్రాస్సస్ పార్థియన్లను ఛర్రె అనే యుద్ధంలో ఓడించారు. ఆ సందర్భంలో కాషియస్ పిండారస్ ను బానిసగా గైకొన్నాడు. 54. రోము భానుడు అస్తమించాడు - కాషియస్ మరణంతో రోములో ఆదర్శమైన ప్రజాస్వామిక భావం నశిస్తుంది. అందువల్లనే అతడు 'రోము భానుడు' అయినాడు. జూలియస్ సీజర్ 133 55. తుది మహోదాత్త రోమను వ్యక్తులారా! - బానిసత్వం కంటే ఆత్మహత్య ద్వారా గౌరవాన్ని పోషించుకోవటం వల్ల బ్రూటస్ ఇలా వీరిద్దరిని సంబోధించాడు. 56. థసాస్ - ఫిలిప్పీకి, థ్రెస్కు సన్నిహితంగా ఉన్న ఒక ద్వీపం. కేటో యువకుడు - పోర్షియా తమ్ముడు. బ్రూటస్ బావమరది. 57. ఇప్పుడు మూడైంది - పైన అస్తమయసమయమని చెప్పి మళ్ళీ మూడైంది అనటం స్వవచనవ్యాఘాతం. 134 వావిలాల సోమయాజులు సాహిత్యం-3