వావిలాల సోమయాజులు సాహిత్యం-2/గేయనాటికలు/వధూసర

వధూసర

1

(భృగ్యాశ్రమము - ప్రాతఃకాలము)

భృగుడు


అభిషేచనార్ధమ్ము అరుగుచున్నా నిదే
గర్భవతివౌ నీవు కదలరా దెచ్చటికి.


పులోమ


ఇది యేమి నానాథ! ఈవింత వచనమ్ము
చిన్న దానికివోలె చెప్పిపోతున్నారు!


భృగుడు


మనసులో నేదియో మధనగా నున్నయది
కారణము మాత్రంబు కనుపింప దిప్పటికి!!


పులోమ


పతి మీరు లేకున్న పడతినౌ నాకేల
ఇలు వీడి వెడలుటకు ఇచ్ఛ కలుగును నాథ!


భృగుడు


నా మనసులోనున్న నలత నంటినిగాని
నీమీద అనుమాన మేమి యుండియు కాదు.


పులోమ


ఎంత వింతగ తలచి ఎంత వింతగ నంటి
రెంతగా మీ మనము చింత పెడితిని నాథ!

భృగుడు


చింత పెట్టుట కీవు చేసినది యేమిటే?
పూజ్యవౌ నీ కేను బుద్ధి గరపుట లేల!


పులోమ


క్షణములో నిది యేమి క్షమియింప వేడెదను
వక్రవాక్కులటంచు భయము జనియించెడిని
జవ్వన మదంబులో జపతపంబుల కేను
తప్పు లేమైనాను తలపెట్టితినె నాథ!
సంవాహ వృత్తిలో సరసతను వీడి నే
నొప్పించితిన నాథ! నొసల ప్రాదంబులను.


భృగుడు


నీ మనసు నే విధిని నొప్పించితినే దేవి
కారణము లేనట్టి కలత కల్పించినపుడు
వక్రవాక్కుల నెపుడు వచియించితినె దేవి!
అప్రయత్నంబుగా నటుల పలికితినిగాని


పులోమ


స్వామి నాపై మీకు స్వాంతమునగల యూహ
తెలియజెప్పితిరేని తిరముగా చరియింతు

భృగుడు


దేవి! నీవలననే తేజరిల్లెడు నగ్ని
పరమ పూతుండయ్యె పతియైన భృగుమౌని


పులోమ


మీపాద దాసినన్ మీరింత పొగడుటల్
కనికరముచేగాని కలదె నాలో ప్రజ్ఞ

భృగుడు


అభిషేచనమ్మునకు నాలస్య మయ్యెడిని
పోయి వచ్చెద నిదే పొలతి! నిముషములోన


పులోమ


తడవు నిలిపిన నన్ను దయతోడ మీ రిపుడు
మన్నింపవేడెదను మహిత ప్రభావాఢ్య!


భృగుడు


(వేదిమీద ఉన్న తామ్రకమండలము చూపిస్తూ)


దయయుంచి నాకిమ్ము తామ్రపాత్రను చేతి
అరిగి వచ్చెదను నే నగ్నులను విహరింపు

(భాగీరథీనదికి స్నానానికిపోతాడు.)


2

పులోముడు


(జైత్రయాత్రామార్గమధ్యంలో ఉన్న భృగ్వాశ్రమానికి వచ్చి!


అతిథినై వచ్చితిని ఆశ్రమంబున కేను
కనుపించ రెవ్వరును కారణం బేమియో!


పులోమ


(లోపలినుంచి వచ్చి)


అతిథులై తామిపుడు అరుదెంచితిరయేని
వేవేగ లోపలకు విచ్చేయ రండయ్య.


పులోముడు


భృగ్వాశ్రమముగాదె వూతచరితా! ఇద్ది
ఆ మహాఋషికేమి అగుదువమ్మా నీవు?

పులోమ


ఆ మహామహుడు నా కౌనిటుల యం చేమి
అన్నియు న్నతడెగా అనుసరించెద నతని.

(వేదికను చూపించి)


విశ్రమింపుడు మీరు వేదిపై కాసేపు.

(లోపలికి పోతుంది. )


పులోముడు


ఎంత చక్కని నాతి! ఎంత చక్కని చుక్క!
ఈ సుందరాంగి నే నిదివరకె చూచితిన!
చూచినట్లే నాకు తోచుచున్నది యెడద
అట్టి సుఖసమయంబు అరిగినది యేనాడొ!
ఎప్పుడరిగినవేమి? ఇపుడు కాంచితి మరల
నీ సుందరీ రమణీ నీ యిందిరాదేవి
అతని కే మౌదువని అడిగినంతనె తన్వి
అన్ని అతడే యంచు నరిగె యర్థంబేమొ!
వింతగా నా మనసు వెలితి పాలైపోవు
ఈ భామ విడిచితిన ఇలలోన మృతి యేను.

(ఇంతలో చుళుకంలోని అగ్నిజ్వాల పైకెగసి మళ్ళీ క్రుంగి పోతుంది.
కలిగిన క్రీనీడ అంతరిస్తుంది. అది చూచి)


అక్క డెవరోయుండి నక్కినట్లున్నారు.
అరిగి యడిగెదగాక నాతన్వి చరింతబు.

(లేచి అగ్ని ఉన్న గదిలోపలికి పోబోతాడు)


అగ్ని


రాక్షసాధము డితడు రానె వచ్చెను విధీ!

పులోముడు

(మానవమూర్తి కనుపించదు... చుళుకంలోని అగ్నిని చూచి)


ఓ హవ్యహవానా! ఒడలు బలిసినదేమి?
పలుకకున్నా వేల పాపాత్మ నీవిపుడు?


అగ్ని

(రూపం ధరించి)


జయ జయ దితిసుతా! జయ సురపతినుతా!
ఎపుడు వేం చేశారు ఎటనుండి వచ్చారు?


పులోముడు


మా రాకతో నిపుడు మా పోకతో నిపుడు
కాలమ్ము వ్యర్ధముగ గడపజూడకు మోయి
ఈ యాశ్రమములోని ఇంతి ఎవ్వరొ నాకు
తెలియ జెప్పితివేని దిక్కు లేలెదవోయి.


అగ్ని

(నెమ్మదిగా)


భృగుపత్ని యంటినా భృగుడు శాపం చిచ్చు
కాదన్న పక్షాన కలుగు ననృతపు దోష
మెటులైన నామెడకె ఏ విధిని తప్పదిది
మునిశాప మంటేను మోదమే కాని
అనృత దోష ఫలంబు అనుభవింపగలేను.


పులోముడు


ఇంత తడవేలోయి?


అగ్ని


ఇంతి భృగుపత్నియే

(రూపం సంహరించుకొంటాడు)

పులోముడు


ఏను వలచిన కన్య నీముని ప్రవరుండు
పరిణయంబాడి తా పడయు సుఖముల నిపుడు
కాంత నెత్తుకొ పోయి కామించి పరిణయము
చేసుకొని సుఖముగా జీవింతు నిపుడైన.


(తిరిగి వచ్చి కొంతసేపు వేదిమీద కూర్చుంటాడు)

3

పులోముడు


(లోపలికి పోయి కుశాస్తరణం మీద గర్భభారంతో బాధ పడుతూ
ఉన్న పులోమను చూచి)



గర్భభారము దాల్చి కడు బాధ పడుచున్న
కరణి నున్నది కాంత కాన నేవిధిని నే
నీమె నిటనుం డిపుడు ఎత్తుకొనిపోగలను
భ్రూణహత్యాదోషమునకు పాలౌదునో!
తడవు చేసితినేని తపసి విచ్చేయునో!
విచ్చేసి శాపమే ఇచ్చునో క్రోధాన!


(పులోమను చేతులలోకి తీసుకుంటాడు.)

పులోమ

(బాధలో కళ్ళు మూసుకున్నామె కళ్ళు తెరచి)


అతిథివై విచ్చేసి అపమార్గమును త్రొక్కి
ఆచరింపగనౌనె అనుచితం బీసరణి.


పులోముడు

(మందస్మితము చేసి)


కాంత నీపై ప్రేమ నింతగా తలపెడితి
నన్ను చేపట్టితే నెన్నో సుఖాలబ్బు.

పులోమ


అతిథివని యంటేను అడుగుపెట్టగ నిస్తి
ఇటువంటి దుర్మార్గ మీవు తలపెట్టితివ
పతికంటె నాకెందు పరమాత్మ లేడు రా
పతిమ్రోలనే నేను బ్రతికియుంటానురా
అన్యపురుషుడ నీవు అడుగగా తగునయ్య
సౌఖ్యముల మునిసతులు సంతసించెడువారె?


పులోముడు


ఏమి కాంక్షించినను ఇత్తునే నీకిపుడు
సుందరీ నన్నింక సుఖములన్ తేల్చినన్
పతివి కమ్మందువా పరిణయం బయ్యెదను.


పులోమ


చాలు నాపుముర వాచాలతను నీవు నా
పతి వచ్చువేళయ్యె ప్రాణములు పోవురా.


పులోముడు


తపసి చేసెడిదేమి తల దీసివేయునా?
భయపెట్ట జూచెదవు భర్త గొప్పల జెప్పి.


పులోమ


దయగలాడవటందు తలపోసితిని ముందు.


పులోముడు


ఇప్పుడు కాకుంటినా?


పులోమ


ఐన పాతివ్రత్య
మపహరింపకుమయ్య అదయుండ వీవౌచు.

పులోముడు


పతిని నేనై నీకు సతివి నీవైనపుడు
రక్షింతు నేను నీ రమణి పాతివ్రత్య
మంత దాకను నీదు నాశయము నెరవేర్ప


(చేతులలో ఉన్న పులోమతో పర్వతోపల ప్రాంతానికి పరుగెత్తుతాడు)

4

(శిలాతలాల్లో పులోముడు పరుగెత్తుకుంటాడు. పులోమ గర్భంలో ఉన్న)

అజాత శిశువు


మహితాత్మయౌసాధ్వి మానంబు జెరుపగా
తలచి పారెదవేర దానవాధమ నీవు?


పులోముడు

(వెరగుపడి నాల్గు దిక్కులూ చూచి)


కనుచూపు మేరలో కానుపించ డెవండు
కర్ణగోచరమైన కంఠ మెవ్వానిదో!

(ఆలోచించి)


వెనుదిరుగ నను చూచి వెరగుపడి నక్కెనా
పాషాణమయమైన ప్రాంతమందెచటైన!


అజాత శిశువు


వెరగుపడి వెడలుటకు వెలితివాడను గాను
ఈ పాటి బలమునకె ఇంత గర్వంబేల?


పులోముడు


ఎందుండి నీవిట్లు ఎరుగకే నా బలిమి
పలుకుచున్నావురా పాపాత్మ చాటుగా.

అజాత శిశువు


కనుల ముందరయున్న గర్భగోళమునుండి.


పులోముడు


ఆకాశవాణియా!
అజాత శిశువు
ఆమె కాదుర నేను.


పులోముడు

(పులోమ గర్భంవైపు చూచి)


ఇందుండి ఎవడైన నిటు పలుకుచున్నాడ!


అజాత శిశువు


కొంచెమాగుర గర్భకుహరంబు వెలివడెద


పులోముడు


వింతగా నున్న దిది వేగిరమ ఇటనుండి
చేరుకొనియెదగాక జీవితేశ్వరితోడ
సర్వభద్రంబైన సదనమ్మునకు వేగ.


(త్వరగా భయంతో పరుగెత్తుతాడు. పులోమకు గర్భచ్యుతమై శిశోదయం అవుతుంది. పులోమ మైకంలో ఉంటుంది - శిశువు మృతి జెందాడని. క్రిందపడ్డ శిశువు లేచిపోతూ వున్న పులోముడితో)

జాత శిశువు


చాలురా నిలు రాక్షసాధమ సాధనము
నీ చేతకా దెటుల నిలిచి పోరాడేవు?


పులోముడు

(వెనుదిరిగి చూచి)


ఎవ్వడవురా నీవు ఎటనుండి ఒచ్చావు?

జాత శిశువు


ఇపుడె ఈ లోకమున నెత్తినాడను జన్మ
నిన్ను రణమున జంప నిలచియున్నా నిదే.


పులోముడు


తడవేల యట్లైన తాకి చంపెదగాక!


జాత శిశువు


తేలు నిపుడే నీదు తేజంబు శౌర్యంబు


పులోముడు


అడుగు ముందుకు రమ్ము అడుగు ముందుకు వత్తు
అపుడు పోరాడితే అంద మగుపించురా.


జాత శిశువు


ఇదుగొ వేసితి నడుగు ఏమి చేయుదువురా?


పులోముడు


అడుగు ముందుకు వేయ నాదిత్య తేజుడై
దహియించుచున్నాడు దానవునె నన్నిట్లు


జాత శిశువు


ఒక అడుగు నే వేయనొక యడుగు వెనుకకే
వేయుచున్నావేల వెలితిపడి దానవా!


పులోముడు

(మాటాడడు)


జాత శిశువు


విడువగా దగదు నిన్ విగతజీవుడవైన
ఇదుగొ వచ్చానురా ఇంక నడుగులు నాల్గు

పులోముడు


శిశువె యయ్యును వీడు శీర్ష మొగ్గించురా!
బ్రతుకుపై నాకిపుడు పాలుపోవుట లేదు.


(వెనక్కు నడుస్తుంటాడు)

జాత శిశువు


పర్వతాగ్రమ్మునకు పరిగిడెద వేలరా
ప్రస్థమ్ము పైనుండి ప్రత్యంతములమీద
పడిపోయి వడిలోన ప్రాణములు విడిచెదవు.


పులోముడు


దుర్బుద్ధి నౌనాకు దురితముల బాపుకొన
నింతకంటే వేరు నిరవు కనబడదురా
ఆ ఋషికి నే జేయు నపచారమున కిపుడె
తగిన శాస్తియె నాకు దయచేసె దైవంబు
అర్భకుని చేతిలో హతమౌటకంటేను
ఆత్మహత్యను నేను ఆచరించెద నిపుడు


(శైలాగ్రంనుంచీ క్రిందపడిపోతాడు. శిరస్సు భిన్నమౌతుంది. జాతశిశువు తల్లిదగ్గరకు పోయి)

జాత శిశువు


ఏను మృతి నొందుదని ఏడ్చినన్ కన్నీరు
కాల్వగా నిటుమారి కలసినది నదిలోన
భాగీరధీనది పాయగా ప్రవహించి

                                (తల్లి దగ్గరకు వచ్చి)

అంతకుని గృహమునకు అంపియున్నా నతని
అమ్మ లే లేవమ్మ ఆశ్రమంబున కేగ.

పులోమ


కుక్షిచ్యుతుండవై రాక్షసుని సమయించి
వరహాలనాబిడ్డ వచ్చితివ నా తండ్రి!

                       (అని ఎత్తుకొని ముద్దాడి)

అభిషేచనార్థమ్ము అరిగియుండిన నాన్న
ఆశ్రమ ప్రాంతమున కరుగొ వస్తున్నారు.


(బిడ్డ నెత్తుకొని ఆశ్రమానికి పోయింది.)

5

(ఆశ్రమోపాంతము - భృగుడు, పులోమ)

భృగుడు

(కంటి కన్నీటి కాల్వను చూచి)


ఈ ప్రవాహమ్మిచటి కెటనుండి వచ్చినది?
బాలార్కుబోలిన ఈ బాలు డెవడే తన్వి?


పులోమ


కాలకోవిదులు మీ కేల నే వచియింప?
దోషజ్ఞ! నన్నిపుడు త్రోసివేయకుడయ్య.


భృగుడు


(నిమీలిత లోచనుడై సర్వం గ్రహించి, చూళుక అగ్నిని చూచి)


సర్వభక్షకుడవై జగతి చరియింపు మిక


అగ్ని

(ప్రత్యక్షమై)


తా నెరింగినయర్థ మే నెరుగనని చెప్ప
పాపపంకమునందు పడుట నిక్కంబౌట
అపసత్య దోషంబు అనుభూత మౌనంచు


వెరచి నే చెప్పితిని వెలది నీ తన్వియని.
బ్రాహ్మణుడ నీవౌట ప్రతిశాప ముడిగితిని
అమరులకు నర్పించు హవ్యకవ్యంబులున్
నా ముఖంబునగదా నాకలోకము జేరు
న్యాయమా శపియింప నన్ను భట్టారకున్?


భృగుడు

(పశ్చాత్తప్తుడై)


అగ్ని భట్టారకా! ఆచరించిన కార్య
మపసవ్య మొనరింప తపము నోచగలేదు.
విధికృత మ్మిదిగాన వేడెదను నే నిదే
కనికరము నామీద కలిగియుండుము దేవ!


బ్రహ్మ

(సాక్షాత్కరించి)


విశ్వంబులో నెవరు వెనుద్రిప్పగా లేరు
ముని శాప మెంతయు నమోఘంబు గావునన్
ముల్లోకముల కిపుడు ముప్పు వాటిల్లినది.

                                       (అగ్నితో)

శుచులతో నత్యంత శుచివి నీవై అగ్ని
సర్వభక్షుండవై చరియింపు భువనముల.

                       (భృగునితో - పులోమను చూపిస్తూ)

ఈ మహాదేవితో నెనయైన పతివ్రతల్
దృష్టిగోచరమైరె సృష్టిలో నెపుడైన!
కంటి కన్నీరిట్లు కాల్వగా మారినది
నామకరణము జేతునా? వధూసరయంచు.

భృగుడు

(నమస్కరించి - జాత శిశువును చూపిస్తూ)


చిరుతవానికి కూడ చెప్పిపోవలె పేరు.


బ్రహ్మ


చ్యవనుండు. నీకులము పావనంబయ్యె ఋషి!


భృగుడు, పులోమ

(నమస్కరిస్తారు)

బ్రహ్మ

(అంతర్హితుడౌతాడు)

భృగుడు


అగ్ని కార్యమ్మునకు ఆలస్యమైనయది
అందుకై మన మిపుడు ఆయుత్తపడ వలయు.


పులోమ


సామి! మీ యాజ్ఞానుసారముగ వర్తింతు


(లోపలికి పోతారు).


-ఆంధ్రపత్రిక - ప్రమాది సంవత్సరాది సంచిక

This work is released under the Creative Commons Attribution-ShareAlike 2.0 license, which allows free use, distribution, and creation of derivatives, so long as the license is unchanged and clearly noted, and the original author is attributed.