వావిలాల సోమయాజులు సాహిత్యం-1/కలివిడంబన శతకము

'అంకితము '

స్వర్గీయులు, పరమప్రాచార్యులు

'శ్రీ మారేమండ రామారాయ మహాశయులకు '


ఉ. ఇచ్చితి దీనిఁగైకొనఁగదే మన సౌహృదభావ బంధన
    మ్మచ్చుపడన్ కవిత్వ సుమహారము - ఈ కలికాలరీతుల
    న్మెచ్చగ నెల్ల లోకము మనీషము వ్యంగ్యము నైక్యమంద నం
    దిచ్చెను నీలకంఠ కవిధీరుఁడు దీని జగద్ధితార్థియై

శా. విన్నాణంబుల నా బృహస్పతివలెన్ విఖ్యాతిఁ గన్నట్టి నీ
    వెన్నో రీతుల స్థైర్యమిచ్చితివి; నిన్నే నమ్మియున్నట్టి యీ
    నన్నున్ నీ ప్రియ సోదరుం బలెను గన్నా వెల్ల కాలమ్ము నో
    యన్నా! నీ ఋణ మీఁగఁగల్గుదునే ఈ యల్పప్రదానమ్ము తోన్.

శా. నీ కారుణ్య సుధీ సుశిక్షిత మహాంతేవాసినౌ నన్ను నీ
    వాకాంక్షన్ సభ వాగ్వివాదములు సేయన్ బంప, ద్విట్సేనలన్
    ధీకౌశల్యముతోఁ బ్రవీరగుణముల్ దీపింప భంజింపుచున్
    నీ కీర్తి ధ్వజమున్ వెలార్చనొకొ తండ్రీ! రామరాయాగ్రణీ!!

మ. రసికశ్రేష్ఠుల, సత్కళా విభవ సౌరభ్యార్ధ సద్బుద్ధులన్,
    అసమానోజ్వల భావనాచణులు, స్వేచ్ఛానంద సంసేవ్యులన్
    ప్రసరోదగ్ర సుశాస్త్రవేత్తలను నే రక్తిన్ బరీక్షించితిన్
    వసినా ళ్వాడని నీదు స్నేహసుమ మవ్వారిన్ గనన్ రాదుపో!

మ. పటు గంభీర పయోధిరాజ నటనా ప్రావీణ్య మెన్నాళ్ళొ - ఆ
    నటరాజేశ్వర పాదనూపుర రణన్యాసంబు లెన్నాళ్ల ప్రా
    కటమై యీ కృతి యన్ని నాళ్లు విలసత్కల్యాణ సౌరభ్యసం
    పుటముల్ వీచగ నీదు సంస్కృతికి విస్ఫూర్తిన్ ప్రసాదించుతన్.

'కృతి భర్త - నేను '

మిత్రులారా!

స్వర్గీయులు డాక్టరు మారేమండ రామారావు, ఎం.ఏ., పిహెచ్.డి, గారు క్రీ.శ 1934 మొదలు 1974 వరకు ఆంధ్ర, ఉస్మానియా, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలల్లో చరిత్రాధ్యాపకులుగాను, ఆచార్య, ప్రాచార్యులుగాను ఉద్యోగించిన మాననీయ మహావ్యక్తులు. వీరు ఆంధ్ర దేశచరిత్ర పరిశోధన విషయంలో ప్రముఖ పాత్ర వహించి మహోన్నత కృషి గావించి ఆంధ్ర పాఠకలోకానికి 'కాకతీయ సంచిక'ను (1934) 'సాతవాహన సంచిక'ను (1950) 'ఆంధ్ర శాసనసర్వస్వ సంగ్రహా'న్ని (1954) సంపాదకత్వం వహించి, సంపాదించి ప్రసాదించిన పూజనీయులు. వీరు నాకు కొంతకాలం దక్షిణ భారత, ఆంధ్ర చరిత్ర లకు గురువులుగా వ్యవహరించి, తరువాత పరిశోధనలో ప్రవేశపెట్టి, అనేక చారిత్రక ప్రదేశాలను దర్శింపజేసి చారిత్రక మూల విజ్ఞానాన్ని చేకూర్చారు. ఆప్త మిత్రులుగా, సోదరులుగా పరిణమించి వారి ఐతిహాసిక మండలికి సహకార్యదర్శిని గావించారు. నాచేత చరిత్రాత్మక నాటికలను రచింప జేశారు. తత్కాలీన నాటకీయాలల్లో (హిస్ట్రియానిక్స్ లొ) ప్రవీణుడిని గావించారు. వీరి ఆదేశం తోనే 1947 ఏప్రియల్ లొ వీరు కార్యదర్శి అయిన ఆంధ్రీతిహాస మండలి గుంటూరు వారు ఆంధ్రుల ప్రథమ ముఖ్యనగరమైన “ధనకటకం” (అమరావతి)లో జరుపనున్న “ఆంధ్ర సామ్రాజ్య మహోత్సవ సభలో ఉపన్యసించటానికి "వాత్స్యాయన కామసూత్రాల” మీద బృహద్వ్యాసాన్ని లిఖించి నేను ఆ కార్యాన్ని నిర్వహించాను. ఈ వ్యాసం శ్రీ “మారేమండ” వారి "సాతవాహన సంచిక" (1950)లో ముద్రితమై చారిత్రక సంచికకు ప్రతిగా వచ్చిన "కలింగ" హిస్టారికల్ రిసర్చి సొసైటీ వారి జర్నల్ లొ (మార్చి 1947 - సంపుటం 1 సంచిక 4) ప్రచురితమైన శ్రీ జయదేవ మహాకవి “పీయూష లహరి” నామ గోష్ఠిరూపకమైన అపురూప సంస్కృత కావ్యాన్ని వీరు నాకు చూపించి, ఆపేక్షించి నా చేత దానిని ఆంధ్ర గేయరూపకం జేయించి, "జయదేవుడు - పీయూషలహరి" అన్న వ్యాసం వ్రాయించారు. వ్యాసం భారతిలో (వికృతి మాఖం) 1951 మార్చిలో ప్రచురితమైంది. తెలుగు విశ్వవిద్యాలయం వారు నా 'పీయూష లహరి'ని 1990 మార్చిలో ముద్రించారు; జయదేవ కవీంద్రుని సంస్కృతమూలాన్ని నాగరీలిపిలో ఆంగ్ల పీఠికా వివరణలతో వేరే ముద్రింపనున్నారు.

పైన వెల్లడించిన కార్యాలన్నింటికీ కారణభూతులైన మహాపురుషులు, స్వర్గీయులు అయిన శ్రీ “మారేమండ” మహనీయులను శ్రద్ధతో సంస్మరిస్తూ, కలి విడంబన కావ్యాన్ని వారికి అంకిత మివ్వటాన్ని సాహిత్యలోకం అభిమానించి హర్షిస్తుందని విశ్వసిస్తూ ఇంతటితో నేను విరమిస్తున్నాను.

509 తిరుమల అపార్ట్మెంట్స్

భవదీయుడు

హిమాయత్ నగర్, హైదరాబాద్ 29

వావిలాల సోమయాజులు

'కావ్య ప్రశంస '

'డాక్టరు వి.వి.యల్. నరసింహారావు '

ఇది 'కలివిడంబన' కావ్యం. సంస్కృత మూలాని కనువాదం. మూలకర్త నీలకంఠ దీక్షితుడు. అనువక్త శ్రీ వావిలాల సోమయాజులుగారు. దీక్షితుల వారి మూలానికి సోమయాజుల వారి అనువాదం వ్యాఖ్యాప్రాయమైన స్వేచ్చానుసరణ కావటం దీనిలోని ప్రత్యేకత. వ్యాఖ్యానిరపేక్షంగా తెలుగువారు మూలాన్ని అవగతం చేసుకోవటానికి ఈ అనువాదం అత్యంతోప యుక్తంగా ఉంది.

కావ్యనామం 'కలివిడంబనం'. 'కలి' మనకు క్రొత్తగాదు. మన మున్నది కలియుగం. కలి కాలమహిమ మనకు తెలుసు; కలిపురుష లక్షణమూ కొంత తెలుసు. 'విడంబన' శబ్దం కొంచెం విలక్షణమైంది. దీనికి 'అనుకరణ', 'వంచన' అనే అర్థాలున్నాయి. కలి ననుకరిస్తూ కలికాలం చేసే మోసాలు గడుసుగా చెప్పటం కావ్య వస్తువు.

పరిమాణాన్ని బట్టి కావ్యం చిన్నది. మకుటం లేని శతకం లాంటిది. నిండా నూరు పద్యాలు - ఒకటి రెండు అటూ ఇటూగా. పరిమాణంలో చిన్నదైనా పరమార్థాన్ని బట్టి ఇది పరమప్రౌఢకృతి. ఈ కారణం వల్లనే సోమయాజుల వారు దీక్షితుల పట్ల ఆకర్షితులై యుంటారు.

దీక్షితులవారు మానవ ప్రకృతిని కాచి వడపోశారు. సన్నిహితమైన దోషాలను తూర్పారబట్టారు; అదీ గడుసుగా, సుకుమారంగా, వ్యంగ్యచమత్కార సుందరంగా.'కలి విడంబనాన్ని' ఆంగ్ల పరిభాషలో చెబితే Satirical Poems అనవచ్చు.

మూల కావ్యకర్త నీలకంఠ దీక్షితులు అప్పయదీక్షితుని సహోదర పౌత్రుడు. అప్పయ దీక్షితుని సహోదరుడు అక్కాదీక్షితుడు. అక్కాదీక్షితుని పుత్రుడు నారాయణుడు. నారాయణుని భార్య భూమిదేవి. ఈ దంపతుల పుత్రుడే నీలకంఠుడు. ఈయన మధుర తిరుమలనాయకుని ప్రధానమంత్రి. 17వ శతాబ్ది పూర్వార్ధంలో ఉన్నాడు. అంటే లోకజ్ఞుడైన మంత్రిసత్తముని సత్కవిత ఈ కావ్యం. 16వ శతాబ్దిలో మరొక నీలకంఠుడున్నాడు. మహాభారతానికి వ్యాఖ్యానం వ్రాసిన ఆ నీలకంఠుడు మహారాష్ట్ర దేశీయుడు.

'కలివిడంబన' కర్త అయిన నీలకంఠదీక్షితుడు శివలీలార్ణవం, సభారంజన శతకం, అన్యోపదేశ శతకం, వైరాగ్యశతకం, శాంతి విలాసం, ఆనందసాగరస్తవం మొదలైన అనేక రచనలు చేశాడు. ఇవే కాక గంగావతరణం, నలచరిత్రనాటకం, కైయట వ్యాఖ్యానం, శివతత్త్వ రహస్యం, నీలకంఠచంపువు మున్నగు రచనలు దీక్షితుల కీర్తికేతనాన్ని దివికెత్తి పట్టిన దివ్యరచనలు. తాతగారైన అప్పయ దీక్షితుల వృత్తివార్తికం, కువలయానందం, చిత్రమీమాంసాది రచనలను సంస్కృత రసజ్ఞ పండితులు మర్చిపోగలరా? ధ్వని - గుణీభూత వ్యంగ్యాదుల్ని తాతగారైన అప్పయ దీక్షితులవారు ఏ మార్గంలో వివరించారో ఆ మార్గంలోనే నీలకంఠు డవగతం చేసుకుని 'కలి విడంబన' కావ్యాన్ని ధ్వనిమయ కావ్యంగా, వ్యంగ్య వైభవోపేతంగా వెలయించా డనిపిస్తుంది.

డొక్కశుద్ధి లేని పండితులు, ఆత్మశుద్ధి లేని మాంత్రికులు, శాస్త్ర బుద్ధిలేని జ్యోతిషికులు, ఆయుర్విదులు గాని వైద్యులు, శబ్దార్థ శక్తి లేని కవులు - నీలకంఠదీక్షితుని కంటబడి, గంటాని కెక్కకుండా పోయింది లేదు. అల్లుని మంచితనం, ఋణదాతల సౌజన్యం, దరిద్రుల తాల్మి, లక్ష్మీపతుల లోభం, దాంభికుల దౌర్జన్యం - సున్నితంగా, సుతిమెత్తగా మెత్తని చెప్పుతో మొత్తినట్లు మందలించటం, మూదలించటం నీలకంఠునికి అలవోకగా అలవడిన కవితా విలాస మనిపిస్తుంది.

పండిత సభలలో జయం పొందాలంటే చిట్కాలైదున్నాయట; ఒకటి నిర్భయత్వం, రెండు సిగ్గు విడిచిపెట్టటం, మూడు ప్రతివాది ఎంత గొప్పవాడైనా వాణ్ణి అవమానించడం, నాలుగు పరిహాసవాక్యాలకు దిగటం, అయిదు సింహాసనస్థుడైన ప్రభువును ప్రస్తుతించడం - జయార్ధ హేతువు లివి యట!

'అసంభ్రమో, విలజ్ఞత్వ, మవజ్ఞా, ప్రతివాదిని
హాసో, రాజ్ఞః స్తవ శ్చేతి పంచైతే జయహేతవః (2)

దీనికి సోమయాజులవారి స్వేచ్ఛా సుందర భాష్య ప్రాయానుకృతి చిత్తగించండి.

చ. భయము మనమ్మునుండి యెడబాపుము; లజ్జను వీటిబుచ్చు; మ
    వ్యయగతి నెంతవాని - ప్రతివాది - నవజ్ఞ యొనర్పు; మంతటన్
    'పయర' గ హాస్యమాడుము; స్తవ మ్మొనరింపుము రాజమౌళి; నీ
     యయిదు జయార్థహేతువు లటంచు వచింపరె ప్రాజ్ఞులౌ బుధుల్?

మూలంలో 'హాస' అని రెండక్షరాల్లో చెప్పిన భావాన్ని "పయరగ హాస్య మాడుము” అని నవాక్షరగుంభితంగా, నవార్ధ బంధురంగా చెప్పుటం విశేషం. 'పయర' శబ్దానికి దక్షిణపు గాలి అనే అర్థం ఉంది. మలయమారుతం వీచినట్లు మంచి హాసోక్తులు పలికితే ప్రతివాదితో పాటు ప్రభువుకూడా ముగ్గుడు కాక తప్పదు. మూలానికి మెరుగులు దిద్దిన అనువాదం వావిలాల వారిది.

మూలం అనుష్టుప్పులో, ప్రతిపాదం అష్టాక్షరిగా నడుస్తుంది. అనువాదం చంపకోత్పల శార్దూల మత్తేభాలుగా ఏకోత్తర - ఏకోన వింశతి - అక్షర బద్ధ పాదాలుగా ప్రసరిస్తూ, పరిమళ లహరులు కుమ్మరిస్తూ, ఉదాత్తగమన సౌందర్యాన్ని ప్రత్యక్షం చేస్తాయి.

దాంభికులైన మాంత్రికులకు ప్రౌఢ గంభీర మౌనమే మహామంత్రమట! (13) జ్యౌతిషికుడు "పుట్టబోయే బిడ్డ - ఆడా? మగా?" అనే విషయంలో తండ్రికి కొడుకనీ, తల్లికి కూతురనీ చెపుతాడట! ఆడ పుట్టినా మగపుట్టినా పురస్కారం పుచ్చుకోవటానికి అప్పు డిబ్బంది ఉండదట. కలి కాలపు జ్యోతిషికుల కెంత తెలివి?

ఇంటి ప్రక్కన దుష్టుడు తారసిల్లితే ఆ యింట్లో కాపురం ఎంత కష్టమో నీలకంఠుడు పరిమిత పదాల్లో రూపక మర్యాదలో ప్రవచించాడు.

     "కాలాంతరే హ్యనర్థాయ గృధ్రో గేహోపరిస్థితః
      ఖలో గృహసమీపస్థః సద్యో నర్దాయ కేవలమ్ ”. (74)

సోమయాజులవారు ఆ చాలునకు రెక్కలు విప్పి - లీలగా ఆడించిన తీరు తిలకించండి.

ఉ. "రెక్కలు విప్పి యాగుచును, లీలగ నారుకు వ్రాలి కొప్పుపై
     కెక్కిన గృధ్రమౌ నెపుడో యేదో యనర్థ నిమిత్త ౽ మింటికిన్
     ప్రక్కగ నున్న దుష్టుఁడు కృపారహితాత్ముఁ డనర్ధ హేతువౌ
     ఇ క్కలికాల మందు కన నెప్పటి కప్పుడే క్రూరకృత్యుడై" ( 74)

శబ్దార్థ శక్తి గల సత్కవికి అసాధ్యమనేది లేదు. మంచి మాటతో జనవశీకరణం హాయిగా చెయ్యగలడు. 'ఏకాక్షి' ని శతపత్రేక్షణుని చెయ్యగలడు 'లోభిని కల్పవృక్షంగా’ మార్చగలడు. 'పిరికి వాణ్ణి వీరవరేణ్యుని'గా వర్ణించగలడు. సరస్వతీశ్వరు డైతేచాలు; వానికి చేతకాని దేముంటుంది? ధ్వనిచే వ్యంగ్య వైభవాదులు వాని కవితలో 296వావిలాల సోమయాజులు సాహిత్యం-1 చర్వణసహాలు. అటు నీలకంఠదీక్షితులు, ఇటు సోమయాజులవారూ సమస్కంధులు. ఆ మాటకు వస్తే సోమయాజులవారే ఓ ఆకు ఎక్కువ చదివారేమో ననిపిస్తుంది.

పద్యం, గద్యం, వ్యాసం, నాటకం, ప్రసంగం, ఉపన్యాసం, అనువాదం, పరిశోధన ఒకటేమిటి? తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషల్ని ఆత్మగతం చేసుకున్న సాహిత్యాచార్యులు వావిలాల సోమయాజులు గారు.

నిరంతర జప తపో నిష్టాగరిష్ఠులైన యజ్ఞకర్తలకు నెలవైన విప్రులపల్లె అగ్రహారం (గుంటూరు జిల్లా) లో మాణిక్యాంబా సింగరాయావధానులకు ది. 19-1-1918లో జన్మించిన సోమయాజులుగారు, భూమిదేవినారాయణుల గర్భవాసాన జన్మించిన నీలకంఠదీక్షితులను తలపింప జెయ్యటంలో ఆశ్చర్య మేమీ లేదు. దీక్షితులు తిరుమల నాయకుని ప్రధానియై భోగా లనుభవించినా, శీలసంపత్తిలో, కవితలో సోమయాజులవారికి పరమానుకార్యుడే.

కనుకనే “కలి విడంబన" కావ్యం సోమయాజులుగారి దృష్టి నాకర్షించింది.

కలికాలంలో కవులు డబ్బుకు అమ్ముడుపోయే దుస్థితిని దీక్షితులు గర్హించారు. శబ్ద బ్రహ్మం వ్యాపారదృష్టికి అతీతంగా ఉండాలని ఆయన ఆశయం. పోతన్న గారి లాగే దీక్షితులవారున్నూ.

     "శబ్దాఖ్యా మపరం బ్రహ్మ సందర్భేణ పరిష్కృతమ్
     క్రీయతే కతిపయైః వృధాన్యైః వినియుజ్యతే” {37}

ఉ. "పాయక శబ్ద రూప మగు బ్రహ్మమునున్ కయిసేసి కొంద రా
     ప్యాయత తోడ చేయుదురు వర్తకమున్, మరియున్ నిరర్థక
     ప్రాయము గాగ కొందరు ప్రవర్తిలుచుందు; రెరింగి బ్రహ్మమే
     ధ్యేయముగా చరించు గుణధీరులు లే రిల నెందు చూచినన్” (37)

సోమయాజులుగారు దీక్షితుల వారి త్రోవలో ప్రకృతం బ్రహ్మమే ధ్యేయముగా చరిస్తున్న గుణధీరులు, కలి విడంబనాను వాదానికి సర్వాధికారులు. వీరి ధీరగుణాన్ని బహుధా ప్రశంసిస్తూ, నా కీ ఉపక్రమ వాక్యాలు వ్రాసే అవకాశా న్నిచ్చిన సోమయాజులవారికీ, కవిముద్రాపకులు ఊట్ల కొండయార్య గుణ గ్రామణులకూ నమస్సు లర్పిస్తున్నాను.

హైదరాబాద్ - 35
ది. 14.7.1990

.వి.యల్ నరసింహారావు

'కలి విడంబన సవ్యాఖ్యానుసరణం '

సత్కవి శ్రీ ఊట్ల కొండయ్య

విద్వత్కవులైన శ్రీ వావిలాల సోమయాజులుగారు, 60 ఏండ్లుగా చేస్తున్న పని -అధ్యయనమూ, అధ్యాపనమూ, రచనమున్నూ. అధ్యాపన కార్యక్రమం మాత్రం రిటైర్మెంటుతో ఆగిపోయినా, మిగిలిన రెండు కార్యక్రమాలున్నూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే వున్నాయి నేటి వరకు. యాభై రెండేండ్లుగా నే నెరుగుదును వీరు నిరంతరాయంగా రచనలు చేస్తూవుండడం. కవిత్వమూ, చరిత్ర - సాహిత్య పరిశోధన వ్యాసాల రచనంతోపాటు విద్యార్థులను విద్యాధికుల్ని చేసే అనేక గ్రంథాలు నిర్మించడమే గాక, మరొక గొప్ప పని కూడా చేశారు సోమయాజులుగారు.

విద్యార్థుల కోసం అనేక విధాలుగా గ్రంథరచనం చేశారు చాలా మంది పండితులు అలాగే చరిత్ర - సాహిత్య పరిశోధన రచనలున్నూ అలాగే ఎవరికి వారు కవిత్వమూ వ్రాస్తున్నా రనేకులు. అయితే, ఈ అన్నిరకాల రచనలూ కలుపుకొని చేసినవారు తక్కువ. వీటితో పాటు అనువాదాల్ని కూడా తమ రచనా కార్యక్రమంలో ఇముడ్చుకొన్నవారు చాలా తక్కువ. అల్ప సంఖ్యాకులుగా వున్న వీళ్లల్లో అందరూ, అందరికీ తెలిసి బాగా ప్రచారంలో వున్న గ్రంథాలనే అనువదిస్తూవుండడం పరిపాటిగా వుంది. వీళ్లలాగే వావిలాలవారున్నూ అనువాదాలు చేశారు, విద్యార్థుల కోసమని, ఇంగ్లీషు నుండి షేక్స్పియరు నాటకాల్ని కొన్ని ఇంగ్లీషు - లెక్చెరర్లు కొందరు వీరి అనువాదాలు చదువుకొని, షేక్స్పియర్ ఆంగ్లనాటకాల పాఠాలు చెప్పేవారంటే, ఆ అనువాదాల ప్రాశస్త్య మెలాంటిదో మనం ఊహించుకోవచ్చు. విద్యార్థుల కోసం చేపట్టిన అనువాదాల సంగతి మాత్రమే ఇది. వావిలాల వారి అనువాద కార్యక్రమంలోని ప్రధాన సూత్రం మరొకటి.

సాహిత్యలోకంలో అట్టే ప్రచారంలోకి రాకుండా మరుగునపడి వున్న అన్యభాషా గ్రంథాలను - మహోన్నతమైన వాటిని -మన పాఠకులకు పరిచయంచేయడం, మన కవులకూ పండితులకూ రచయితలకూ, జ్ఞాపకం చేసి, చూపించడమూ శ్రీ వావిలాల వారి ప్రధానోద్దేశ్యమని, సంస్కృతం నుండి జయదేవుని 'పీయూషలహరి’ అనువాదమూ, దానిపై వారి పరిశోధన వ్యాసమూ ఆంగ్లం నుండి క్రైస్తవ, మొహ్మదీయ మతశాఖలవారి ప్రముఖ గ్రంథానువాదాలూ, జగద్విఖ్యాతమైన - జయశంకర ప్రసాద్ కృతహిందీ కావ్యం - 'కామాయని' అనువాదమూ ఇప్పుడీ 'కలి విడంబన' అనువాదమూ మనకు ప్రస్ఫుటం చేస్తున్నాయి. సాహిత్య పరిశోధకుడైన విద్వత్కవికి విద్యా వితరణ గుణం వున్నప్పుడు, ఇలాంటి ఔదార్యం సహజం. శ్రీ వావిలాల సోమయాజులుగారు, స్వీయరచనలతోపాటు, ప్రాచీనులైన మహాకవి పండితుల రచనలున్నూ మన కందించి, ఆంధ్ర సాహిత్య భాగ్యాన్ని పెంపొందించడానికి పూనుకున్నారు. ఈ వైపున వున్న వారి నిర్మాణ కుశలతలోని అంతర్భాగమే ఈ 'కలి విడంబన' అనువాదమున్నూ.

శ్రీ వావిలాల సోమయాజులు గారు పెద్దవారైన మాట నిజం. వృద్ధాప్యం ఆయన శరీరంలో ప్రవేశించిందే గాని మనస్సులో ప్రవేశించలేకపోయింది. ఇంకా ఆయన మనస్సు ఉత్సాహంతో ఉరకలు వేస్తూనే వుంది సాహిత్య సృష్టిలో. మనస్సు కనపడదు, శరీరం కనిపిస్తుంది. మనస్సును చూడగల చూపు అందరికీ వుండదు. కేవల బాహ్యస్వరూపాలనే చూడగలవారికి వావిలాల వారి వృద్ధాప్యమూ, అశక్తతా మాత్రం గోచరిస్తాయి. ఆయన మనస్సులో నిత్యనూతనంగా జరుగుతూ వున్న కవితా సృష్టి కనిపించదు వారికి. మహా వేగంతో తిరుగుతూవున్న బొంగరం అచంచలంగా స్థాణువువలె కన్పిస్తూ వుంటుందనీ, తక్కువ వేగంతో తిరుగుతున్నప్పుడు మాత్రమే దాని వేగం గమనింపగలుగుతామనీ, 'అచల రూపుడైన పరమేశ్వరుని చైతన్యస్థితికి ఉదాహరణగా మహాతత్త్వవేత్త ముట్నూరి కృష్ణరావు పంతులుగారు చెబుతూ వుండేవారు. ఆమాటే శ్రీ వావిలాల వారి 'అశక్తత' కున్నూ వర్తిస్తుందను కొంటాను వినయంతో.

ఇప్పుడీ "కలి విడంబనం" అనువాదాన్ని విడమర్చి చూస్తే సంగతి సమగ్ర స్వరూపంతో ప్రత్యక్ష మవుతుంది మన యెదుట :-

“కలి విడంబనం” అనుష్టుప్ శ్లోకాల్లో వుంది. మహా అయితే, ఒక శ్లోకం, మన ఆట వెలదిలోనో, తేటగీతిలోనో - తెలుగు మూసలో - కరిగిపోయవచ్చు, ఆ స్థలం చాలు దాని విస్తృతికీ, దాని యథాతథానువాదానికీ బాగా కాళ్లూ చేతులూ చాపుకొని పడుకొనేటంత వీలుంది ఆ శ్లోక భావస్వరూపానికి ఈ ఛందశ్శయ్యమీద అయితే, అలా వున్నది వున్నట్లు చెప్పడం, యథాతథంగా దించడం సోమయాజులుగారి అభిమతంకాదు. అలా చేస్తే సోమయాజులుగారి ప్రత్యేకత ఏముంటుంది? అనువాదంలో ఆయన వ్యక్తిత్వమే మున్నట్లు? కొన్ని మూలశ్లోకాలు చాలా క్లుప్తంగానూ మహా ఇరకాటంగానూ వున్న విషయం ఆయన గమనించారు. అనువాదం అంటే “చూస్కో నే నెంత గొప్ప గ్రంథం అనువాదం చేశానో!" అని చెప్పుకొని, ఆత్మానందం పొందుతూ, చదివేవాళ్లకు అర్థంకాకున్నా, వాళ్లు తన ఘనతను శ్లాఘిస్తే చాలు ననుకొనే తత్త్వం కాదు సోమయాజులు గారిది. బహుకాలం విద్యార్థులకు సాహిత్యాధ్యాపనం చేసిన వారు కనుక, వ్యాఖ్యానసమేతంగా విడమర్చి చెప్పడం, చెప్పింది అందరికీ అర్థమయ్యేట్లు స్పష్టంగా చెప్పడం, ఆయనకు బాగా అలవాటై సహజరీతిగా రూపొందింది. ఆ మార్గాన్ని ఆయన వదలలేదు. అన్ని శ్లోకాలూ ముందు కూలంకషంగా చదివి అవగాహన చేసికొన్న తరువాతనే అనువాద ప్రణాళిక నిర్ణయించుకొన్నట్లు తోస్తుంది.

ముందుగా, ఆయన ఎన్నుకొన్న ఛందస్సును చూస్తే రహస్యం బైటపడుతుంది. వృత్తాలెన్ను కొన్నారాయన, నిజానికి మూలశ్లోకం, మాటకు మాట అనువదిస్తే రెండు చరణాలచోటే సరిపోవాలి, కాని, సోమయాజులుగారు కాస్త పెద్ద ఛందస్సు - పాత్రను ఎందు కెన్నుకొన్నారంటే - ప్రతిశ్లోకాన్ని ముందు విరిచి, పొడిచేసి, అందులో తన వ్యాఖ్యానక్షీరం, భావనా మాధుర్యం కలిపి పాకంచేసి, వృత్తమూసల్లో పోయడానికే.

సోమయాజులుగారి అనువాదం చదువుతూ వుంటే కథని అనుసరిస్తూ మూలంలోని కవిత్వాన్నీ - భావ, శబ్ద సౌందర్యాన్ని ఏ మాత్రం జారవిడవకుండా, సాధ్యమైన చోట్ల నాటకీయతనూ, కావ్యవైభవాన్ని పెంపొందించడానికి ప్రయత్నించి సఫలీ కృతులైన ఆంధ్రభారత కవిత్రయం జ్ఞాపకం వస్తుంది. పలుతావులలో ఏనుగు లక్ష్మణకవి జ్ఞాపకం వస్తాడు కూడ. భర్తృహరికి ప్రాచీనానువాదాలు మూడున్నా లక్ష్మణకవినే సాహిత్యలోకం ఎందుకు అభిమానించిందో తెలిసికోవడం అంత కష్టమేమీ కాదు. అతని - అనువాదంలోని స్పష్టత ఒక గుణం రెండవది - మూలంలోని ఏ చిన్న భావాన్నీ పిసరంతైనా వదలివేయకపోవడం, మూలంలోని మధుర సుందర పదగుంఫనాన్ని వీలైనంతమట్టుకు తెలుగులోకి తీసుకురావడం, మూడవది అన్నిటికంటే మిన్నయైన ధారాశుద్ధి, శబ్దమాధుర్యం, మనల్ని ఆకట్టుకొన్నాయి. ఈ సల్లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొన్నారు తమ అనువాదంలో శ్రీ సోమయాజులుగారు. అనువాద విషయంలో నేటి ఏనుగు లక్ష్మణకవే ఈయన అంటే తప్పులేదు. నిజానికి సజావుగా అనువాద భారం లాగాలంటే ఏనుగువంటి కవిఐతే గాని పని నడవదు. అంత సాహిత్య, భావనా బలంతో పాటు, అంతటి ఛందోబలమూ కావాలి. మూలాన్ని చూడగానే, అనువాద రూపాన్ని అద్దంలో ప్రతిబింబాన్ని చూచినంత ఝటితిస్ఫూర్తితో, సందర్శించగలిగిన దక్షత వుండాలి.

ఇప్పుడు చూడండి ఈ 4వ శ్లోకం, - అనువాదానికి లొంగని దుష్కరకాఠిన్యాన్ని ఎలా రూపొందించుకొన్నదో అది!

      “లోభో హేతు ర్ధనం సాక్ష్యం దృష్టాన్తస్తు పురోహితః
       ఆత్మోత్కరో నిగమన మనుమానే ష్వయం విధిః”

ఈ శ్లోకం ఉక్కు పిండం ఏ వృత్తంలో కరిగి పోదామన్నా కరిగేట్లు లేదు. దొమ్మల గుండ అనే ఒక మృగం తిరుగుతూ వుంటుందట శ్రీ కాకుళం జిల్లా ప్రాంతాలలో అది ఎముకల్ని వాసన చూస్తే అవి మెత్తబడతాయంటారు నిజమో అబద్ధమో! అయితే, ఆ జంతువు తాలూకు ఎముక బిళ్లతో వుంగరం తొలిపించి, దాన్ని ఎడమచేతి మధ్య వ్రేలుకు పెట్టుకుంటారు, అరిసెమొలల వ్యాధి వున్నవారు చాలా మంది ఆ ప్రాంతాలలో మన సోమయాజులు గారి అనువాద శక్తిన్నీ అలాటిదే ఐవుండాలి లేకుంటే ఆయన ఒకసారి చూడగానే, ఈ శ్లోకాలు ఎందుకు అలా అమాంతం కరిగి, వృత్తాల మూసల్లో ఒదుగుతాయి!

ఈ శ్లోకానువాదం మత్తేభరూపం చేకొని ఏనుగ నడిచినట్లే నడిచింది. చూడండి:-

“అనుమానాఖ్యము నౌ ప్రమాణ మది నాల్గంగంబులై యుండు” నంటూ ఎత్తుకొన్నారు. అనుమానేషు అయం విధిః అన్నమాటను విప్పిచెప్పారు. అనుమానమనే ప్రమాణంవున్నది కదా? అది నాలుగు తీరులుగా వున్నదండీ! అని తేల్చి చెప్పారు. లోభ, హేతు, ధన, సాధ్యములకు క్రమాలంకారపరంగా దృష్టాంత, పురోహిత, ఆత్మోత్కర్ష, నిగమనాలు ఫలాలుగా చెప్పబడ్డాయి, మూలంలో వావిలాలవారు తెలుగులో దేనిఫలం దానికి జోడించేశారు - దృష్టాంతమగున్ పురోహితుడు, పొందున్ హేతు వాశన్, ధన మ్మది సాధ్యమ్మున సాధ్యమౌ నిగమనమ్మున్ స్వప్రశంస మ్మగున్. ఇక్కడికి ఐపోయింది మూల భావసర్వస్వం. సోమయాజులు గారు ఊరుకోలేదు. అసలు సంగతి బైట పెట్టారు, నీలకంఠ దీక్షితులవారు తన శ్లోకంలో చోటుచాలక, ధ్వనిపూర్వకంగా వదలివేసిన భావాన్ని - ముక్తాయింపుని అనుమానాస్పదులౌ జనావాళికి, సాధ్యంబేకదా సర్వమున్? అంటూ పద్యాన్ని నాటకీయంగా ముగిస్తూను.

పదహారో పద్యం చూడండి. కదను త్రొక్కుతూ ఎలా నడిచిందో, నీలకంఠ దీక్షితులవారి శ్లోకాన్ని అరటిపం డొలిచినట్లు ఒలిచి చేతికందిస్తున్నట్లుగా-

     "ఆయుః ప్రశ్నాదీర్ఘ మాయుర్వాచ్యం మౌమూర్తికై స్సదా
      జీవన్తో మహు మన్యస్తే మృతాః ప్రక్ష్యంతి కం పునః”

ఇది మూల శ్లోకం. దీనికి సోమయాజులుగారి అనువాదం ఇది :

మ. “ఇలపై నా బ్రతు కెంత కాల మని ప్రశ్నింపంగ, దైవజ్ఞుఁడు
     జ్వల వాక్యముల "దీర్ఘమాయు" వని తెల్పంజెల్లు - జీవించెనా
     కలుగున్ గౌరవ మద్భుతంబుగను, కాకన్ కాలగర్భమ్మునం
     గలియన్, రాడుగదా 'ఇదేమి' యని ధిక్కారించి ప్రశ్నింపగన్

ఎంత మనోహరంగా మన ఎదుట నిలిచి మనతో మాట్లాడుతున్న మనిషివలె కనిపిస్తున్నదో ఈ పద్యం చూడండి! నీలకంఠ దీక్షితులవా రన్న దేమంటే - ఆయువును గూర్చి ప్రశ్నిస్తే "దీర్ఘ మాయు" వని జ్యోతిష్కుడు చెప్పాలి. ఆ అడిగిన వాళ్లు బ్రతికి వుంటే, సన్మానం చేస్తారు పోయారే అనుకో మరి ఎవరి నడుగుతారు? అని మాత్రమే దీనికి 'ఉజ్వల వాక్యముల' అనే మాటనూ, 'కలుగున్ గౌరవం' అనేమాటతో 'అద్భుతంబుగను' అనేమాటనూ, మృతాః అన్న మాటకు 'కాల గర్భమ్మునం గలియన్ అనే మాటనూ, 'ధిక్కారించి' అనే మాటనూ చేర్చి, ఎలా ప్రాణం పోశారో చూడండి ఈ పద్యానికి !

ఇలా ప్రతి శ్లోకమూ దాని అనువాదమూ చెప్పుకొంటూ పోతే, మనం వేరొక గ్రంథమే వ్రాసుకోవలసి వుంటుంది. ఈమాట చెప్పినా, వదల బుద్ధి పుట్టడం లేదు 36వ పద్యం చూడండి. దీన్ని అనువాద మని ఎలా అంటాం? సోమయాజులుగారు స్వయంగా వ్రాసినంత బాగా వుంది ఎలా పరుగిడుతున్నదో 25వ పద్యం ఎలా సెలయేరులా గలగలలాడుతూ ఊరిస్తోందో చూడండి. అలాగే 37వ పద్యమూ, 66వ పద్యమూ, అనుబంధంలోని 3,5 పద్యాలూ, చూడండి, ఎక్కడా అనువాద వాసన కూడా లేదే! సోమయాజులు గారు పద్యనిర్మాణవేత్త కావడంచేతనే 'పద్య విద్యాధరుడు' అనే బిరుదంతో ఆయన్ని సాహిత్యలోకం గౌరవించింది. స్వీయరచనల్లో ఎలాటి గొప్పదనం వుందో అనువాదంలో అంతకంటే గొప్పదనం చూపగలగడం ఆశ్చర్యమనిపిస్తుంది. మూలకర్త శబ్దాల ద్వారా, భావాల ద్వారా అతని ఊహాలోకంలోకి ప్రవేశించగల, పరకాయ ప్రవేశ మహిమ యేదో సోమయాజులుగారికి లేకపోతే ఇంత గొప్పగా అనువాదాలు చెయ్యలే రనిపిస్తుంది. వారి మరి ఇతర అనువాద మహారచనలకోసం, ప్రత్యేకించి మహాకవి జయశంకర్ ప్రసాద్ హిందీ “కామాయని” అనువాదం కోసం ఆంధ్రలోకం ఎదురుచూస్తూ వుంటుంది.

శ్రీ సోమమయాజులుగారి ఈ సాహిత్య తపస్సు నిరంతరాయంగా, నిరంతరం కొనసాగడానికి, అన్ని విధాలా తోడ్పడుతూ వున్న వారి ధర్మపత్ని యైన మా చెల్లెలు 'చిట్టెమ్మా', ఆమె ముగ్గురు కొమారులూ, ముగ్గురు కుమార్తెలూ అభినందనీయు లని చెప్పక తప్పదు.

'పింగళి కాటూరి'
సాహిత్య పీఠం

ఊట్ల కొండయ్య

'విజ్ఞాపనం '

నేను మొదట, విద్యార్థులకు పాఠం చెప్పేటప్పుడు, మిత్రులతో సంభాషించే టప్పుడు, సభల్లో ఉపన్యసించేటప్పుడు శ్రోతలను ఉల్లాసపరచటం కోసం మధ్య మధ్య మహాకవి నీలకంఠ దీక్షితులవారి 'కలి విడంబన' శతకంలోని వ్యంగ్య గర్భితాలైన మనోహర శ్లోకాలను ఉపయోగించటానికి అలవాటుపడ్డాను.

'కలి', 'విడంబన' శబ్దార్థాలను పౌరాణిక విజ్ఞానం వల్ల అవగతాలైన చతుర్యుగాలలో తుదిదైన కలియుగ లక్షణాలను, కలిపురుషుని దౌష్ట్య ధిషణా నైశిత్య లక్షణాలను అనుసరించి ఈ శ్లోకాలను అన్వయించి వివరించటం నాకు గుణమై పోయింది.

ప్రజ్ఞాన్వితులైన నా శిష్యులు కొందరు, నా సాహిత్య సహవ్రతులు, సహోద్యోగులు, విద్వాంసులు కొందరు నా వివరణను అభిమానించి 'కలి విడంబనాన్ని' ఛందోబద్దంగా ఆంధ్రీకరించ మని కోరుతూ వచ్చారు. ఇలా 1939 మార్చి నుంచి, 1947 మార్చి చివర వరకు గడిచింది. ఈ కాలంలో ఒకసందర్భాన మహాత్మాగాంధీజీ "సత్యం స్వాతంత్య్ర యుద్ధానికి తొలిబలి" అన్నారు. ఈ ప్రవచనం నన్ను పలుమారు స్పందింపజేసి బుద్ధిని 'కలి విడంబనం' మీద లగ్నం చేయటం మొదలు పెట్టింది.

భారతదేశ స్వాతంత్య్రం రానున్న కొద్ది దినాలకు ముందు నేను ఒక సాయం సంభాషణలో ఈ విషయాన్ని ఆనుషంగికంగా నా పూజ్య మిత్రులు పుణ్య పురుషులు శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రి మహోదయులకు చెప్పుకున్నాను. వారు "ఉచిత సమయం. వెంటనే ఆంధ్రీకరించి ప్రచారంలోనికి తీసుకొనిరం" డని సమంత్రకంగా ఆశీర్వదించారు. ఆ, 1947 ఏప్రియల్ చివరలోని ఒక దినాననే. నేను కృషిచేసి 'మే' మాసాంతానికి అనువాదాన్ని ముగించి వినిపించి అనేకులను సంతోషపెట్టగలిగాను.

అయితే ఇంతకాలం వరకు బహు పర్యాయాలుగా శ్రోతల శ్రవణాలకు వినబడగలిగిన భాగ్యాన్ని పొందినప్పటికీ ఈ కృతి సాహిత్య లోక ముఖావలోకనం చేయగలిగే అదృష్టాన్ని పొందలేకపోయింది ఇందుకు హేతువు లనేకం. ప్రస్తుతం నా పురా మిత్రులు 'సత్కవులు' 'కవిధీరులు', బహుకావ్యకథా గ్రంథ కర్తలు పింగళి - కాటూరి సాహిత్యపీఠ ప్రచాలకులు శ్రీ ఊట్ల కొండయ్యగారు నా ఈ 'కలివిడంబన' ప్రచురణకు సంపాదకత్వం వహించి దానిని వారి పింగళి కాటూరి సాహిత్య పీఠం ద్వారా సాహిత్యలోకానికి సమర్పిస్తున్నారు. సంపాదకత్వం వహించినందుకూ, ప్రచురణ విషయాన్ని సమగ్రదృష్టితో పరిశీలించి ఆముఖభాగంలో ఉంచటానికి అత్యవసరమని భావించి "కలి విడంబన సవ్యాఖ్యానుసరణం” అన్న వ్యాసాన్ని లిఖించి ముద్రణకు ప్రసాదించి, గ్రంథానికి ప్రత్యేకతను ఆర్జించి ఇచ్చినందుకు శ్రీ కొండయ్య బావగారికి నా నమఃపూర్వ కాశీస్సులు.

నా “కలివిడంబన' స్వేచ్ఛానువాదానికి పీఠికారూపంగా ఉండదగ్గ రచన కావాలని మేము అపేక్షించినదే అని అనిపించుకో దగ్గ కావ్య ప్రశంస” అన్న రమణీయరచనను నా పూర్వ మిత్రులు, "ఉభయకవి మిత్ర" బిరుదాంకితులు ఆంధ్ర ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయ డైరెక్టరు గాను, తెలుగు విశ్వవిద్యాలయ గ్రంథప్రచురణ విభాగాధిపతులుగాను ఉద్యోగించి విరమించిన విద్వద్వరేణ్యులు, కవిశ్రేష్ఠులు డాక్టర్ వి.వి.యల్. నరసింహారావు గారు నా ఎడ గౌరవానురాగాలతో బహూకరించి నన్ను సంతోషపెట్టారు. ఇందుకు ఆ మాననీయ మిత్రులకు నా అభినందనలు.

ఈ కృతిని వెలువరించే కృషిలో మనఃపూర్వకంగా సహకరించిన నా పౌత్రతుల్యుడు సమీప బంధువు చిరంజీవి పైడిమర్రి శ్యాంప్రసాద్ కు కళ్యాణాకాంక్షలు, శుభాశీస్సులు.

ఈ కృతిని అనతికాలంలోనే ఆనందప్రదంగా ముద్రించి యిచ్చిన "లాసర్ గ్రాఫిక్స్" (జి. 15 అరుణ్ అపార్ట్మెంట్సు, రెడ్ హిల్స్, లక్టికాపూల్, హైదరాబాద్) ముద్రణాలయాధికారులకు మా శుభాకాంక్షలు.

వినమ్రులమై మేము సమర్పించే దశశతాధిక పాదాభివందనాలను వాత్సల్యంతో స్వీకరించి నా 'కలి విడంబన' శతక స్వేచ్ఛానువాదానికి సాహిత్య లోకంలో విపుల ప్రచారాన్ని ప్రసాదించమని మా కుటుంబ సభ్యుల మందరమూ బ్రాహ్మీ పరమేశ్వరులను అభ్యర్థిస్తున్నాము.

509, తిరుమల అపార్ట్మెంట్స్.
హిమాయత్ నగర్, హైదరాబాద్-29

భవదీయుడు

వావిలాల సోమయాజులు

'కలి విడంబనము '

{{{1}}}


చ. సభల జయమ్ము గోరునెడ జంకకు, నీ ప్రతివాది యెట్టి వా
    గ్విభవుఁడె యైన వాని యునికిన్ గురుతింపకు, వాని వాద మ
    భ్యభిహిత మైన దైన సభయందు చెవిం జొరనట్లు శీఘ్రమే
    రభసగ వాక్రవాహముల రమ్యముగాఁ బ్రవహింపఁ జేయుమీ. 1

చ. భయము మనమ్మునుండి యెడఁబాపుము, లజ్జను వీటి బుచ్చు, మ
    వ్యయగతి నెంతవానిఁ, బ్రతివాది, నవజ్ఞ యొనర్పు మంతటన్
    'పయర' గ హాస్యమాడుము, స్తవమ్మొనరింపుము రాజమౌళి నీ
    యయిదు జయార్థహేతువు లటంచు వచింపరె ప్రాజ్ఞులౌ బుధుల్.2

మ. తను వాదించు సభన్ గ్రహించునెడ మాధ్యస్థం బవిద్వాంసుఁ డు
    దనకంఠంబున బొబ్బవెట్టఁ దగు, నక్కార్యంబు పాండిత్యపుం
    గని గైకొన్నను పక్షపాతి యనుచున్ గావించి యారోపణం
    బును పొందన్వలయున్ జయంబు సభలన్ బొల్పార దృష్టాత్ముఁడై.3

మ. అనుమానాఖ్యము నౌ ప్రమాణ మంది నాల్గంగంబులై యుండు, నం
    దున దృష్టాంత మగున్ పురోహితుఁడు, పొందున్ హేతు వాశన్, ధన
    మ్మును సాధ్యమ్మున సాధ్యమౌ, నిగమనమ్మున్ స్వఃప్రశంస మ్మగున్
    అనుమానాస్పదు లౌ జనావళికి సాధ్యంబే కదా సర్వమున్.4

చ. పరుకడ విద్య నేర్చి ఘన పాండితిఁగైకొన బుద్ధి కల్గియున్
    బరగిన లజ్జచే విడిచి, పండితవర్యులఁ గెల్చు కొర్కె ము
    మ్మర మగు నేని సిగ్గువడ మాని సభన్ రగడన్ బొనర్చుటే
    యరయఁగ నున్న కార్యము గదా యిలలో నటువంటి వ్యక్తికిన్!5

చ. చదివిన దల్ప మైనను ప్రచారము గట్టిగఁ జేయు శిష్యులన్
    పదుగురఁ జేర్చి, యే కృతుల పాదములో తలక్రిందుచేసి, రూ


    పొదవగఁ జెప్పి యల్పగురుఁ డొందును బండితుఁడన్న ఖ్యాతి, క
    ల్గదుగద యట్టివానికిఁ బ్రగాఢ సుపాండితి జీవితంబునన్ 6

చ. జగతినిఁ దన్నుఁ దానె సుత్తి సల్పుకొన న్వలె, లేక మూర్ఖునిన్
    బొగడెడువార లుందురే? అపూర్వసుఖం బెటు లబ్బు - అందుచేఁ
    బొగడుకొనం దగున్ మధుర భూరి వచోవినిగుంఫన క్రియల్
    నెగడగ నెల్లవేళల వినిశ్చయుఁడై కన కెట్టి తృప్తియున్7

చ. “చదువుము ప్రశ్నవేళ కడు చన్నది యెన్నడొ ముందు ముందు నీ
     కిది విశదంబుగాఁ దెలియు" - ఈ గతి ఛాత్రుల దాటవేసి, నె
     మ్మది కొక ధైర్య మిచ్చి, అనుమానములన్ దిగఁబుచ్చి గ్రంథముల్
     జదువగఁ జేయు వాని కిల సాధ్యము గాని గురుత్వ మున్నదే!8

ఉ. చెప్పెడువాడు వేరొకఁడు చేకురకుండుట, మించు శ్రద్ధ, వా
    డెప్పుడుఁ జెప్పినట్టిదె పఠించుటలోఁ గల తృప్తి - యన్న పెం
    పొప్పెడు మూఁడు శిష్యగుణముల్ భువిలోనఁ దలంచి చూడఁగా
    జొప్పడుఁ గాదె మూర్ఖగురు శోభన మైన యదృష్టరేఖచేన్9

ఉ. ఎంతగ మేము విద్యల శ్రమించిన మా దగు బుద్ధి కొక్కర
    వ్వంతయు నబ్బదేని భయ, మందము, మాంత్రికవిద్య యందు ధీ
    మంతులమో, యతీశులమొ, మౌనము దాల్చెడి యోగిపుంగవా
    త్యంత మహత్వమూర్తులమొ యై గడు మాన్యత నొందకుందుమే!10

మాంత్రికులు



చ. కలిగినఁ గార్యసిద్ధి తరి కాలవిలంబన లేక మాంత్రికుం
    డిల మహిమాన్వితుం డని వహించు సుకీర్తిని - కార్యసిద్ధికిన్
    గలిగినచో విలంబనము “కావలె, తం తిది చాల, దెంతయో
    గల” దని చెప్పి పుచ్చు కొనఁగాఁ దగు ద్రవ్య మనూన వైఖరిన్.11

చ. జగతి సుఖించు వారు కడు సౌఖ్యము లొందుట, జీవితంబునం
    దగణిత దుఃఖయాతనల నందెడు వారు వివేకవంతులై
    వగలఁ దొరంగి జీవన మవారణ సల్పుట మా యనుగ్రహం
    బగు నని పల్కు మాంత్రికు లయారె! కనం గడు ధన్యు లిద్దరన్12


ఉ. ఆరయ జ్ఞాన మొక్క లవ మైన లభింపక యున్న ప్రౌఢగం
    భీరత మౌనమున్ గొనుట, విజ్ఞు లెఱుంగని యే విలక్షణా
    చారమునో వరించుట యజస్ర మహత్వము లై చెలంగు నీ
    ధారుణి మంత్రవేత్తల కుదాత్త యశః పరివాహకమ్ము లై. 13

జ్యోతిష్కులు



చ. ఫలములఁ జెప్పు వేళల నవశ్యముగా గ్రహచార వేత్తయై
    పలుకుట లెస్స యౌట జనపాలురకున్ ఫలముల్ వచించుచో
    ఛలము వహించి చారులతొ సల్పి విచారణ, చెప్పు నొప్పు ని
    య్యిల పయి జ్యోతిషుండు వినుతింపగ లోకము శాస్త్రపాండితిన్.14

మ. కలుగంబోయెడు బిడ్డ యెవ్వ రనుచున్ గావింపఁగాఁ బ్రశ్న "పో,
    కలుగున్ పుత్రుడు నీ” కటంచు పితకున్, "కల్గున్ బలే పుత్రి ఉ
    జ్వలనేత్రీ!" యని తల్లికిన్ దెలుపు దైవజ్ఞుండు ధీధుర్యతా
    కలితుండై విజయమ్ము సేకొను పురస్కారాళితో నిచ్చలున్15

మ. “ఇలపై నా బ్రతు కెంతకాల” మని ప్రశ్నింపంగ దైవజ్ఞుఁడు
     జ్వల వాక్యముల "దీర్ఘమాయు" వని తెల్పం జెల్లు - జీవించెనా
     కలుగున్ గౌరవ మద్భుతంబుగను కాకన్ కాలగర్భంబునం
     గలియన్ రాఁడుగదా, 'ఇదేమి' యని ధిక్కారించి ప్రశ్నింపగన్?16

మ. గురుఁ డేకాదశ మందు నుచ్ఛగతుఁడై కూర్చుంటఁ గార్యంబు సే
    కురు, కానీ - శని యష్టమం బగుటఁ గల్గున్ గొంత సందేహ - మీ
    మరు మాసంబునఁ గాక యున్న జరుగున్ మాసద్వయానంతరం
    బరలే దంచును జోస్యుఁడాడఁదగు మిశ్రార్ధంబులన్ మేటియై.17

మ. నిరుపేదల్ దమ భాగ్యముం గురిచి ప్రశ్నింపంగ నైశ్వర్య సు
    స్థిరులై మింతురటంచు, పృచ్ఛకయి లక్ష్మీపుత్రు లేతేర మీ
    కరు సంపద లబ్బ నున్నవని జోస్యంబాడు దైవజ్ఞుఁడు
    ర్వరపై నెల్లర యాదరంబును సమర్చల్ గొంట యాశ్చర్యమే.18

మ. పరగన్ నూర్ల కొలంది లాభములు దైవజ్ఞుండు తాఁ బొందు ను
    ర్వరఁ దాంబూల మొకండు, వేలుగను లాభంబుల్ లభింపంగ నా


    దర మేపారెడి భోజనమ్ము వడయున్ - తథ్యం బిదెట్లన్నఁ జే
    కురకన్ దప్పి జోస్య మాతనికిఁ గల్గున్ గాదె తిట్లెయ్యెడన్ 19

మ. స్థిర విశ్వాసము గల్గఁ బ్రాశ్నికుల నెంతే శ్రద్ద వీక్షించి యా
    దర మేపారగ జోస్యముల్ పలుకు నా దైవజ్ఞవిజ్ఞుల్ నిరం
    తరమున్ వర్థిల నట్టి తావు మదిలోఁ దర్కింపఁ బెత్తెండు సా
    గర పర్యంత మహా మహీతలము పైఁగన్నట్టెనే యెన్నఁడున్.20

ఉ. ఎన్నఁగ వారనామముల నేఁడును నేర్పిన వారు కొంద, రు
    త్పన్నమతిన్ గ్రహక్రమ విధమ్ము నెఱింగినవారు కొంద, ర
    భ్యున్నతిఁ దారకా నివహమున్ గణియింపఁ గలారు కొంద, రీ
    యన్నియు నేర్చువారు భువి నౌదురు దేవగురుల్ స్వయమ్ముగన్.21

మ. శకునఫలంబులో మహితశక్తి నెఱుంగఁగఁ జాలువారు, పొం
    దికమెయి స్వప్నదృశ్యములు తీరులు తెల్పఁగ నేర్చువారు, పా
    యక సురపూజనాపరత నర్థి నుపాసకులైనవారు, జా
    తకములు చెప్పువారి కిల దారుణశాత్రవులై మెలంగరే22

వైద్యులు



ఉ. రోగము లేనివానికడ రూకలు రాల, వసాధ్య రోగితో
    సాగదు వైద్య, మిద్దియును సంపద నీయదు, రోగభీతి పె
    ల్లూగెడివాఁడు, దీర్ఘరుజ నుత్తలమందెడి వాఁడు సర్వదా
    సాగి ధనమ్ములన్ గురువజాలు కుబేరుఁడు గాడె వెజ్జుకున్.23

మ. అతిధైర్యం బిడరాదు వెజ్జు, మదిలో నత్యంత నిశ్చింత నం
    చితరీతిన్ దగు "వైద్య కట్నమును” దాఁజెల్లింపఁ డేరోగి, ఆ
    యతభీతిన్ గలిగింప నొందు గద నైరాశ్యమ్ము - భైషజ్యు కి
    క్కతనన్ గల్గదు గా ధనమ్ము నిజకాంక్షాపూర్తి యేపారఁగన్.24

ఉ. ఈయఁగ వచ్చు మం దెదియొ యిష్టము వచ్చిన రీతి వెజ్జు, తాఁ
    బాయక చెప్పఁగా వలయు పథ్యము గట్టిది - వ్యాధి తగ్గెనా
    మా యభిజాత వైద్యమహిమం బని యాడగవచ్చు, లేనిచో
    నీ యఖిల మ్మపథ్యఫలమే యని పల్కఁదగున్ క్రుథోక్తులన్.25


ఉ. రోగ నిదానమున్ దెలిపి, రోగపుఁ బేరులఁ జెప్పి, యాపయిన్
    రోగిహితాహితమ్ముల ప్రరూఢగతి న్వివరించి వెజ్జుకున్
    రోగి గ్రహించినట్టి యపురూప చికిత్సల నెల్లఁజూపి తా
    మాగక బోధ సేసెదరు వ్యాధితు నింటఁ గలట్టి యంగనల్. 26

ఉ. పెంపు వహించి జాడ్యములు పెక్కు విజృంభణ సేయుచుండ ను
    త్కంపితదేహులై, మరణదారుణవర్తన జంతు సంతతుల్
    తంపరగా నశింప, వసుధన్ మెల మెల్లగ రోగతత్వస
    త్వంపు వివేకము స్వడసి వర్ధిలు వారు గదా చికిత్సకుల్.27

శా. రాకల్ పోకలు సేయఁగా ననుచు నారంభంబునన్ గొంత, "నే
    మీకై యౌషధ మొండు సేసితిని తెమ్మీ" యంచు నర్థంబులో
    నో కొంతన్, బహుమానమంచుఁదుదీయం చొప్పించుచుం గొంతగాఁ
    దాకాఁజేయుట యొప్పు వైద్యులు చికిత్సార్థుల్ శ్రమన్ వీడగన్.28

ఉ. ఈ తపనీయభూమిపయి నే చిరకాలమొ యాశ్రయించి వి
    ఖ్యాతము గాగ రోగుల ధనాళి గ్రహింప మదిన్ దలంపఁగా
    నా తరి పుట్టి వచ్చిరి మహాద్భుతరీతి చికిత్సకాళికిన్
    జ్ఞాతుల రీతి నిల్చి మనఁగా ఁదగ జ్యోతిష మాంత్రిక ప్రభుల్.29

ఉ. పొడమినవేళ జాడ్య మెద పొంగులతో బతిమాలు వెర్రియై
    నడుమ నొకింత యిచ్చును ధనమ్ము, భిషగ్వరు లక్ష్యపెట్టఁ డా
    పొడమిన వ్యాధి పెల్లడఁగి పోయిన, స్నానమొనర్చి నంతటన్
    కడ కొకమారు వానిఁ గనఁగా దలపోయఁడు పో నరుం డిలన్.30

శా. దైవజ్ఞత్వము, మాంత్రికత్వమును, వైద్యంబున్, జమత్కార వా
    క్రావీణ్యంబును, నొక్క టొక్కటగు ద్రవ్యం బీయ శక్తంబు - కా
    నీ విభ్రాజిత విద్యలై పరగ నిం దే రొండొ మూఁడో - తమిన్
    వ్యావర్తంబును జెంది యుండుటగు గాదా దుర్లభం బిద్దరన్.31

చ. కడఁగి యసత్యము నృలుకఁగల్గుట, చాతురి యేర్పడ ననదా
    యడలక ముచ్చటించుటయు నౌ నిలలో ధనయోగ మాత్మలో
    సడలక యెట్టి యాపదకు సత్యము పల్కుట నిండు పాండితిన్
    వడయుట యీ జగాన పరువంబగు నిర్ధనయోగ మెన్నగన్.32

కవులు


ఉ. పట్టెడు కూర కాశపడి ప్రౌఢతఁ గోల్పడి దాస్యవృత్తి చే
    పట్టిన యట్టి యీ కవులు బంధురభీరుత, దుర్వినీతి, నె
    ప్పట్టునఁదోచు లోభగుణవర్తన మ య్యవివేకశీలమున్
    బిట్టు చలింపకే తుడిచి పెట్టుచు నుందురు నిర్మలమ్ముగన్.33

చ. పొగడుట కుద్యమించిన కవుల్ కన ఁగోరెదరే ధరిత్రిలోఁ
    దగిన నిమిత్త మెద్దియు, సతంబును వారలు దేని నేనియున్
    పొగడకయున్నచోఁ దొలుచు బుద్ధి, చలించును జిహ్వ యెంతయో
    యగడువడున్ నిరంతర మహత్తర ఘర్ఘురతా విజృంభణన్.34

ఉ. ఇంకొక రెవ్వరో కడు నుతించి రటంచు స్తుతింత్రు గాని వ
    స్త్వంకిత మౌ గుణమ్ము గని సన్నుతిఁ జేసెడు వారలే కవుల్
    కొంకక పెద్దసేయుదు రొకో-యిది సత్యమె-కాకయున్నచో
    నంకిలిలేని యొక్క పురుగైన యళిన్ ఘనవర్ణనారతిన్.35

ఉ. ఒప్పిదమైన యా కవిత యొక్కటి యే యొక గ్రామ మిచ్చు, పెం
    పొప్పెడు నశ్వ మిచ్చు, నొక యున్నత మౌ గజ మిచ్చు, కానిచో
    తప్పక యన్న మిచ్చు, సుఖదంబగు వస్త్రము నిచ్చు, తమ్ములం
    బొప్పరికింప కిచ్చు సకలోచిత సాధకమై చెలంగుచున్.36

ఉ. పాయక శబ్దరూప మగు బ్రహ్మమునుం గయిసేసి కొంద రా
    ప్యాయతతోడఁ జేయుదురు వర్తకమున్, మరియున్ నిరర్థక
    ప్రాయము గాగఁగొందరు ప్రవర్తిలుచుందు, రెరింగి బ్రహ్మమే
    ధ్యేయముగాఁ జరించు గుణధీరులు లే రిల నెందుఁ జూచినన్37

మ. రసవంతం బగు కైత లబ్బు తరి శర్వాణీపతిం గొల్వ కు
    ల్లసిత ప్రక్రియ నే నరాధములనో లక్షించి వర్ణింపఁ బె
    ల్లొసగం జాలిన కామధేనువును మిథ్యోద్యోగులై నాగటన్
    పొసగన్ గట్టిన మందభాగ్యులఁతొఁ దామున్ సామ్యముం బొందరే !38

చ. అతిశయకౌశలమ్ము మెరయన్ మనుజాధములన్ నుతించుచున్
    రతిపతి రాజ్య వైభవ విలాసములే పరమంబు లంచు సం


     తత మదమత్తు లై ప్రలపనమ్ము లొనర్చు కవుల్ మహావ్యథా
     శ్రితతతి భీమ మైన భవసింధువు నెట్లు తరింప నేర్తురో ! 39

చ. ఒడుపుగ శబ్ద గుంఫనల నూహ యొనర్చుటలో, నలంకృతుల్
    చిడిముడి లేక కూర్చుటను, చెల్వగు వ్యంగ్యము సంతరించుటన్
    తడఁబడ నట్టి చిత్త నిభృతత్వమునన్ స్మరవైరివర్ణనల్
    కడిమి నొనర్చు కైత కనఁగా ఘనమౌను సమాధి నిష్ఠకున్40

 

గృహస్థులు



చ. అమిత మనోజ్ఞ శిల్పమున నాతని భార్యను, ఆమె చెల్లెలిన్
    ప్రముదిత భావనన్, శ్వశురులన్ మరి శ్యాలకు చిత్ర కల్పనో
    ద్యమమున సృష్టిచేసి కలి తానె గృహస్థున కిచ్చె నైదు ప్రా
    ణములుగ తత్శరీరభరణం బను కొండొక కర్మ దీర్పఁగన్.41

మ. అల యల్లుండ్రును, భాగినేయులును, భార్యాబంధువుల్, మేనమా
    మలు పెన్నుద్దులు వైచికొంచుఁ గడు నీమం బొప్పఁగా నింటిలో
    నెలుకల్ సేరిన యట్లు చేరి ఘనులై యేమేమి భక్షింతురో
    తెలియంగాఁ బనియేమి గేస్తునకు ధాత్రిం గాల మెంతైననున్.42

మ. బలమౌ తల్లియె మేనమామకు గృహప్రాథమ్యముం గూర్ప, నౌ
    బల మా యల్లునకున్ గుమార్తె సకల ప్రాముఖ్యముం గూర్ప, న
    వ్వల భార్యాపితకున్ సతీమణి బలం బౌ నగ్రిమం బీయఁ, దా
    బలమౌ గేస్తె స్వయమ్ముగా నతిథికిన్ ప్రాజ్యమ్ము చేకూర్చఁగన్.43

అల్లుడు



చ. పరఁగుచు నెంత కాల మిల బావమఱిందికి బాల్య ముండునొ
    యరయఁగ నంతకాలమును నల్లుని వక్రత సాగు-వానికిన్
    దొరకొనఁ గొంతగాఁ దెలివి తోఁచును సౌమ్యత జ్ఞానవంతుఁడౌ
    టరసిన యా క్షణంబె యత డర్థి పలాయనమున్ పఠించెడిన్.44

చ. తన సతి జ్యేష్ఠయై గృహవిధాన మటంచును బేరుగొంట, క్రొ
    న్నన యయి శ్యాలకుండు సదనమ్మున శైశవవృత్తి నుంట, పె


    త్తన మది యత్త దౌట కడు దవ్వున మామ ప్రవాసి యౌట -ఈ
    యనువులు గల్గినన్ జగతి నల్లుని భాగ్యము కోటి కెక్కదే ! 45

ఉ. పుట్టిన యింటి కొక్కపరి పుత్రిక చూడఁగ వచ్చి కొంతకున్
    మెట్టిన యింటి కేగు తరి మిన్నగ నూడ్చు గృహమ్ము - పెట్టుకో
    గట్టివి సొమ్ములన్, వలచి కట్టెడు పుట్టములన్, సుపాత్రలన్,
    పట్టికి నాడుకోఁ గనులపండువు లౌ నుపలాలనమ్ములన్46

ఉ. వచ్చిన నింటికిన్ స్వజనవర్గమునారు పదేపదిన్ మదిన్
    మెచ్చక “శుష్కభోజనులు, మించి మితాశను" లంచు, నెన్నడో
    వచ్చిన భర్త బంధువులు పాల్పరమాన్నము తెచ్చి పెట్టినన్
    మెచ్చక “దొంగ తిండి తెగ మెక్కెద" రంచును భార్య తెల్పెడిన్.47

చ. కొడుకులు గన్న యట్టి బహుకోపన లౌ సతు లిద్ద రుండి, తా
    చెడి తల చిన్ననాడె యిలు చేరిన చెల్లె లొకరు తల్లికిన్
    గడు ప్రియపుత్రియై సకల కైతవశాలినియై చెలంగెనేన్
    ఉడుగని యట్టి దౌ కలహయోగము పో గృహిజాతకమ్ముకున్.48

చ. ఇరువురు పత్నులుండుటయు నెందరొ పుత్రులు పుట్టియుంటయున్,
    తరుగని లేమియున్, గడు ఘనంబగు జాడ్యము చేరియుంట, దె
    ప్పర మగు వార్ధకంబు తమ పైఁబడి యా తలిదండ్రు లుంటయున్
    మరణము కంటె నత్యధికమై యొక టొక్కటే దారుణం బగున్.49

ఋణదాత



ఉ. అప్పిడినట్టివాని మన మందు దలంచిన సంగకమ్ములుం
    గుప్పగఁ గూలు, వాని గనుఁగొన్నయెడన్ స్పృహ దప్పు నెప్పుడున్
    తప్పక వాడు భూత మయి దర్శనమిచ్చును నెల్ల వేళలం
    దప్పునుఁ గొన్నవాని కిది యచ్చెరు వౌను దలంచిచూడఁగన్.50

మ. అసువుల్ గైకొన నంతకుం డయిన నత్యంత క్షమాదక్షుఁడై
    నొసటన్ వ్రాసిన వ్రాత చెల్లుటకుఁ దానున్ నిల్చి వీక్షించు పె
    మ్ముసురై క్రమ్ముటఁ దెల్పు కాలనియమంబున్ దా ఋణగ్రాహికిన్
    కొనకుం జెప్పఁడె యుత్తమర్జుఁ డిల నక్రూరత్వతా దీనతల్.51


చ. కనఁబడ వుత్తమర్జుని ముఖంబున దారుణ దంష్ట్ర లెవ్వి గై
    కొనఁడు కరమ్మునం దెదియు ఘోరతరం బగు నాగపాశ, మై
    నను, గనినంతనే మనమునన్ జనియించును భీతి జల్లియై
    తనువు చలించు, కంఠమును దాల్చును గద్గదికావిరావమున్. 52


దారిద్య్రము



ఉ. అంజిలి శాత్రవుండు బలుఁడైన, ప్రతిక్రియ సాంత్వనమ్ము - పె
    న్మంజుల మౌ ప్రతిక్రియ సమస్త రుజాతతి కౌషధమ్ము - మృ
    త్యుంజయ చింతనమ్ము మృతి కొప్పు ప్రతిక్రియ - ఎన్నడేన్ ప్రభా
    వ్యంజిత మౌ ప్రతిక్రియ యెదైన నభాగ్యత కున్నదే ధరన్.53

శా. సంచారం, బొనరింప సర్వ దిశలన్ సామర్థ్యముం గూర్చుచున్
    సంచారించి సహింప నేర్చుచును తీవ్రమ్మైన శీతోష్ణముల్
    అంచద్వైఖరి జాఠరాగ్ని కుదరంబం దుచ్చ్రితిం జెందుచున్
    మించున్ ధాత్రి దరిద్రతాగుణము సామీచీన్య భైషజ్య మై.54

చ. భయమున మాట తొట్రుపడువానిగ, మూసుకు పోవు కన్నులన్
    సయిరణ నిల్పువానిగను, చయ్యనఁ గాళ్లు వడంకు వానిఁగా
    నయమునఁ దీర్చి దిద్ది ప్రభునానతి వోలె దరిద్రతాగుణం
    బయమగు వేడికోలునకు నర్థి నొసంగరె యుత్సుకత్వమున్55

మ. తలపోయం గడు జీర్ణమై తగు దురంతంబుల్ ప్రభుద్రోహముల్
    లలి నెన్నో యవిధేయకృత్యములు సర్వం బిట్టె జీర్ణంబు లౌ
    అలుపాలై చను, జీర్ణమై యొలసి యత్యంతమ్ము గండాశ్మముల్
    ఇల దారిద్య్రబలాఢ్యతన్ వెలయువారే యైన లోకమ్మునన్56

శా. లోకంబందున నా దరిద్రులకు చోరుల్ లేరు, చూపోపమిన్
    ప్రాకాశ్యంబు వహించు వారలును కానన్ రారు, దాయాదులు
    న్వీకన్వైరముఁ దాల్పఁబోరు, కన పృథ్వీవల్లభుల్ లేరు, పె
    స్ట్రోకై రాజ్య మభాగ్యతాగుణముతో శోభిల్లగాఁ జాలునే !57

లక్ష్మి


మ. సిరి యొక్కించుక చేరెనేని బహుళోత్సేకమ్ముతో నింటిలో
    తిరమై నిల్వ సహంకృతిం బెనిచి యుద్దీపింపఁగాఁ జేయుఁ ద
    స్కరులన్ రండని పిల్చుఁ దా నిరతమున్, దాయాదులం జేరి దు
    స్తర కార్పణ్యము బుద్ధి కెక్కునటు ప్రోత్సహించుచున్ వర్తిలున్.58

మ. ధన సంపత్తిఁ గలట్టి వారిఁ గని నిత్యం బే విమూఢాత్మదు
    ర్జను లోజన్ హసియింత్రొ, వారలె కనన్ లక్ష్మీ కృపాపాంగ వీ
    క్షణ మొక్కించుక చేరినంతటనె లోకంబందు హాస్యాస్పదో
    ల్బణ కిమ్మీరిత కింవదంతులకుఁ బాలై పోవుటల్ గ్రొత్తలే.59

చ. ఇతరుల సేయు స్తోత్రము లహీన సుసత్యము లంచు నెంచుటల్
    మతి నిజ నిర్జరత్వ మనుమానము లేక గ్రహించి నిత్య మం
    చిత గతి మానవాళి యెడ నిందిత కీటక బుద్ధి పెంచి స
    మ్మతి గొనుటల్ కనంగ నడమంతరపున్ సిరికి న్నలంబు లౌ60

మ. ధనవంతుల్ మును విన్న దానినె సదా తా మిద్ది యే మంచు క్రొం
    దనముం జూపి వినంగఁ గోరెదరు, చిత్త ప్రీతిమై మెండుగాఁ
    గనియున్ సర్వము నిండు కన్నులను వీక్షంజేయఁగా జాల, రొ
    య్యన భావింతురు కీర్తనమ్ముగ మహాహాసాత్త భాషారతిన్.61

చ. ధనమద మావరించి కనుదమ్ములఁ గప్పినఁ జూడలేనివా
    రిని గని, పార్శ్వ మందునఁ జరించెడివారు పరస్పరమ్ముఁ దాఁ
    బనివడఁ గంటి సైగలతో, బాలుర, నున్మదులన్, పిశాచి పం
    పున మనువారిఁ జూచి నగు పోలిక నవ్వుచునుందు రియ్యిలన్.62

మ. తన స్తోత్రంబుల నందుకోఁదగిన పెద్దల్ సంస్తుతుల్ సేయ నె
    మ్మనమం దించుక యైన భీతిఁగొనఁ డే మాడ్కిన్, గురుత్వంబుచేఁ
    దన సేవల్ గొనఁ దగ్గ యోగ్యులటఁ బ్రత్యక్షంబుగా సేవ చే
    సిన లజ్జన్ వహియింపఁబోడు ఘనుఁ డాశ్రీమంతు డీయుర్విపై.63

మ. క్షణమాత్రమ్ముగ నిల్చి తాఁ దొలఁగు లోకానన్ గ్రహావేశ - ముం
    డును హాలా మద మొక్క యామముగ - మూఢుం జేరి సంపత్తి పెం


    పున నెక్కించిన యుజ్వలన్మదము పొల్పొందున్ ఘనోదర్చియై
    యనువర్తించును నిత్యదోహదముమై నా దేహ మవ్వానితోన్. 64

మ. ఇలలో నా సిరి యింట నొక్కనెలయో యం దర్దమో నిల్చి అ
    వ్వల మోమాటముమాని చెప్పకయె యావాసంబుఁ దా వీడు -ఆ
    కలిమిన్ గల్గిన పెన్వికార మది యాగారాంతరం బందు కొ
    దులమందన్ దిర మై రహిన్ లశునగంధం బట్లుగా నిల్చెడిన్.65

ఉ. ఆరికయన్న మిచ్చుమద మంతయు కంఠము నందే నిల్చు, నొ
    ప్పారెడి తమ్ములంపు మద మా హృదయమ్మున నిల్చు - కాని ల
    క్ష్మీరమణీలసన్మదము చేరును పో నిఖిలాంగకమ్ములన్
    చేరును వాని పత్నిని, వసించును జేరి సుతాదులందునన్.66

ఉ. ఏ కులమందుఁదా సిరి వసించుచు నున్నదో చిత్రవిభ్రమం
    బా కులమందు నర్తనల నత్తరి నిల్చిన నిల్చుగాక, ము
    న్నే కులమందు నామె చరియించి త్యజించునో యందుఁగుష్ఠయ
    ట్లాకులపెట్టు సొమ్మవలె నయ్యది వర్తిల నేమి హేతువో!67

మ. ఇలఁ దా మింపుగఁ జేరి హస్తమున నాడింపంగ నైదారు గ
    వ్యవలు శాస్త్రార్థము లొక్కమారె చదివింపంజేయు, విద్వాంసుల
    న్పలు మార్గాలఁ దృణీకరించుటకునై నైశ్చల్యముం గూర్పు, వ
    ర్తిలఁజేయున్ నిజ జాతివిస్కృతిని బ్రీతిం బెంచి చిత్తంబునన్.68

మ. ధనవంతుం డెపు డాత్మ సేవకుల వాత్సల్యాన పోషించుఁగా
    కనయంబున్ దనుఁజేరు యాచకుల కీయన్వచ్చుఁగా, కేమియై
    నను, సామర్థ్య మెఱింగి యర్థులకు నెన్నన్ దానముల్ సేయుచో
    గనఁ దా నోర్చునె వాని లోభగుణ మెక్కాలంబునన్ బెంపునన్.69

చ. ఇల పయి నోర్వలేని జనులే యతి కష్టము తోడ నెట్టులో
    కులధనభార మెల్ల తమ గొప్పగు మూపుల మోయు రీతి ను
    జ్వలగతిఁదోఁచు - అయ్యదియె సత్యము కాక మరెడ్డి యైన వా
    రలు లఘువు నొనర్పఁగ నిరంతర మేల శ్రమింతు రిద్ధరన్.70


ఉ. ఓపికతోఁ గనుంగొనఁగ నుర్విపతుల్ శ్రమ యెంతొ చూచి చూ
    పోపమిఁ గొండెముల్ వలుకు పుణ్యజనాళిని గౌరవింపఁగా
    నోపిరె? నేర్పుమై నెఱిఁగి యోగ్యత లెల్లఁ గృతాంతుఁ డొక్కఁడే
    యీ పనిఁ దీర్చు చుండు గద, నిబ్బడి ముబ్బడిగాఁ గృతజ్ఞుఁడై. 71

శా. గోకర్ణంబున భద్రకర్ణమున, సంకోచంబుల న్మాని పె
    స్వీకం జేయు జపంబు లెల్ల నెప్పుడో వీక్షించి దుష్కర్మలన్
    బోకార్చున్ ౽ మరి రాజకర్ణజప మున్మూలించుఁ బెంపొంది పె
    ల్లాకన్ సర్వము లైన కర్మముల సద్యఃకాలమం దొయ్యనన్.72

మ. ఇలపై దుష్టజనుల్ మహాపురుషు లెంతేఁ దుల్వులై స్వార్థముం
     గలలో నైనఁ దలంప కొక్కరునిచేఁ గార్యార్థ మెవ్వేళ నే
     పలు కొక్కించుక యైనఁ గోరకయె తా వర్తింతు రీ యుర్విని
     శ్చల చిత్తమ్మున నన్యకార్య రచనోత్సాహంబునన్ ధీరులై.73

ఉ. రెక్కలు విప్పి యాడుచును, లీలగ నార్చుచు నింటి కొప్పుపై
    కెక్కిన గృధ్ర మౌ నెపుడో యేదొ యనర్థ నిమిత్త ౽ మింటికిన్
    బ్రక్కగ నున్న దుష్టుఁడు కృపారహితాత్ముఁ డనర్థ హేతు వౌ
    నిక్కలికాలమందుఁ గన నెప్పటి కప్పుడె క్రూర కృత్యుఁడై.74

లోభి



మ. సొరిదిన్ ధాత్రి సమస్త ధర్మములలో శుష్కోపవాసంబు మే
    ల్తర మై, లంఖనమే చికిత్సలను సర్వశ్రేష్ఠమై దొడ్డగా
    వర యజ్ఞప్రజ మందు మేటి జపయజ్ఞం, బర్థి నా లోభికిన్
    బర మామోదములై రుచించుఁగద సంభావింపఁగా నిచ్చలున్.75

ఉ. ఏమని పల్కునో ధనము నిమ్మని తా నడుగన్ ధనాఢ్యు డం
    చీ మహి నిర్దనుం డెటు లహీనగతిన్ భయము స్వహించు - న
    ట్లేమి యతండు కోరి మది నిమ్మని నన్నడుగంగ వచ్చెనో
    ఏమి యొసంగఁగా వలెనొ యే నని లోభియు భీతి నొందెడున్.76

చ. అతిథికిఁ బెట్టి నట్టి కబళాన్న మొకొక్కటె మేరుతుల్య మం
    చతిశయ మిచ్చి శాస్త్రముల యందున పెద్దలు బోధచేయ సంత


     తమును మానవులు దాని మహార్థ మెఱింగి కంటి ముం
     దతులిత మేరురూపముల నా కబళాన్నము లీక్ష సేయరే. 77

మ. ఛల మొప్పన్ ధనరక్ష సేసెడి పిశాచం బా ధనస్వామి కా
     వలె నంచున్ దనుఁ గోరినంతటనె సర్వం బిచ్చు నాటంకముల్
     గలిగింప స్థలపెట్ట దెవ్వనికి నైనన్ దా ధనం బీయఁగా
     నిల నా లోభిపిశాచి యొప్పుకొనునే యెవ్వేళ నిచ్ఛాగతిన్!78

శా. యాచింపన్ జనుచుందు రర్ధు లిలలో నా దాతృగేహాళికిన్,
    యాచింపంగను దాతలున్ మరి విపర్యంబైన కాలాన సం
    కోచం బందక నర్థిఁ జేరెదరు - కల్గుంగాదె నిమ్నోన్నతుల్,
    ఆ చాంచల్యపు కర్తృకర్మ గత సంయాత వ్యతీహారతన్.79

చ. ధనమున కెన్నఁగా దగిన త్రాత మరొక్కడు లేఁడు నేఁడు నే
    తనువు ధరింపకున్న వసుధాతల మం దని లోభి యెంతయు
    న్మనమున నిశ్చయించి పెరమార్గ మగోచర మౌట నెట్టులో
    దినుఁగద యించు కించుకయె తిండి మనోవ్యథ దందడింపఁగన్.80

చ. ఒకరి గృహమ్మునం దతిథి యుండఁగఁ గోరినఁ దిష్ట వెట్టి పా
    యక దినమున్ బ్రయాణముల సర్ది నొనర్చుచుఁ జిత్ర చిత్రదు
    శ్శకునము లూహసేసి, మనసా చలియింపక వాని మెల్లఁగా
    నొక టొకటే వచించు టిల నొప్పగు మార్గముగాదె చూడఁగన్.81

అతిథి, దాంభికులు



మ. ధన మార్జింపఁ దలంచువారు ఘటకున్ దాత్పర్యమున్ జూపి, సే
    వనఁ గావించి, నిజేచ్చఁదెల్పి, తమ సద్వృత్తంబుఁ జెప్పించి యా
    ధనికుం డాత్మను నమ్మునట్లుగ నిజార్థంబుల్ ఫలాంతంబులై
    చనుదాకన్ దమ దుర్గుణంబులకు రక్షల్ సేయఁగాఁ జెల్లెడిన్.77

చ. “అవని సమస్త శాస్త్రనిచయం బొక యెత్తు, మరొక్క యెత్తగున్
     భువన మనోజ్ఞ మౌ తులసిపూస య దొక్కటి, ఇంచు కంత మే
     మవగతి సేసినాము, నిజ మా తులసీ గుళి కొక్కటే ఘనో
     దృవము మహత్వపూర్ణ" మని పల్కఁగఁ జెల్లును దాంభికాళికిన్.77


మ. అల యెన్నింటినో జెప్పి బాహటుఁడు దీవ్యద్వైద్య శాస్త్రంబులో
    దులసీకాష్ఠము కున్న యా గుణములందున్ విశ్వమం దర్థి ని
    స్తుల సమ్మోహిని, విత్తదాయిని యటంచున్ తద్గుణ ద్వంద్వమున్
    బలుకంగా మరచె న్గదా, ఇవియె సర్వశ్రేష్ఠముల్ గావొకో! 84

ఉ. ఈ యిలఁ బండితుం డయిన నిత్తురు రూప్య మొకండు, కావ్యసం
    ఛాయకు కిత్తు రొక్క పది, నర్తకు కిత్తురు నూరు, దాంభికుం
    డాయతవిప్రకారమున సర్థిగఁ దాఁ జనుదేర నిత్తురో
    వేయి, తలంచి యించుకయు వేదవిదుం గని యీయ నేర్తురే!85

ఉ. ఈ వసుధన్ గనుంగొనఁగ నిం తది గోచియు, భస్మధారణం
    బా వరదర్భ ఖండము, లయంబగు రుద్రజపాక్షమాల, తా
    రావళి నొప్పు ఖడ్గక, నిరంతర మౌనము - నవ్వి మూర్ఖసం
    జీవన షట్క సాధనలు, చెల్లును బూజన మబ్బఁజేయుచున్.86

శా. మా యావాసము పుణ్యతీర్ధములు, సన్మాన్యుండు, విఖ్యాతుఁ, డా
    మ్నాయార్థాంబుజ సంభవుండు, సమరానందుండె యాచార్యుఁ డ
    ధ్యాయాధ్యాపన గోష్ఠి శిష్యులకు విద్యల్ సెప్పుటే వృత్తి యం
    చా యా దాతల కెక్కఁ జెప్పు కొనఁగా నర్థార్థు లుంద్రీ ధరన్.87

మ. ధన మార్జించెడి యన్య దేశముల మంత్రభ్రంశముల్ గల్గుచోఁ
    గన మా కయ్యదె సంప్రదాయ మనుచున్, కల్గన్ కుసంస్కార మొ
    య్యన నేఁ గైకొనుచుంటి నూత్నమగు ప్రాయశ్చిత్త మంచున్ చెలం
    గ ననాచారము దేశధర్మ మనుచున్ దా పృచ్ఛకుం గెల్వ నౌ!88

చ. పలువు రెరుంగనట్లు తమపై నభిమానము గల్గి దాతకుం
    దెలిపెడియట్లు స్నాన జప నిర్మల యజ్ఞము లాదిగాగ పెం
    పొలసెడి సర్వ ధర్మముల యుక్తిమెయిన్ సలుషన్ ఫలించు - ని
    య్యిల వృథగా నొకించుకయు నేల యొనర్పఁగ దాంభికాళికిన్.89

మ. జపవస్త్రంబు నిరంతరంబు నిజవస్త్రం బందునం దాల్చుటల్
    యుపశోభింపఁగ మధ్యమధ్య నిజనేత్రోన్మీలనల్ సేయుటల్
    కృపతో సర్వము బ్రహ్మమం చనుట లెందేనిన్ మహాత్ముం డటం
    చపుడే నమ్మకమున్ కుదుర్చుటకుఁగా నౌఁబో నిమిత్తంబులున్.90


శా. ఆ మధ్యాహ్నము వాహినీతటిని సంధ్యాకృత్యముల్ దీర్చుటల్
    నీమం బొప్పఁగ దేవతార్చన జనానీకంబు దర్శింపఁగాఁ
    బ్రేమ న్డీర్చుటలున్ నిరంతర శుచిర్వేషంబుతో నుండుటల్
    ఏమీ యీ యిల దాంభికాగ్రణికిఁ గాదే జీవితం బెయ్యెడన్. 91

ఉ. చూచెడువార లెందనుక చొప్పడుచుందురొ యంతదాకయు
    న్వేచి సుదీర్ఘకాలము, సువిస్తర వృత్తిని, నిత్యకర్మలన్
    జూచి యొనర్చు టాపగిదిఁ జూచెడు వారలు గల్గకున్న సం
    కోచము మాని దాంభికులు క్లుప్తమొనర్చుట క్రొత్త వింతలే.92

చ. తలచిన యంతనే నయన తామరసమ్ముల హర్షబాష్పముల్
    కలుగుట, దేహమందు పులకల్ జనియించుట నేర్చెనేని యు
    జ్వలుఁడగు వాని కింకఁ బెరసాధనలన్ బనియేమి యున్న ది
    య్యిలఁగల రాజలోకముల నేలికొనన్ దన సేవకాళిగన్.93

దుర్జనులు



చ. కడఁగుచు శిక్షసెప్పక వికారము కల్గగఁ జేతు రర్ధిమై
    నెడదకు - లాలనల్ సలుప నేడ్తార మించు మనో వికారముల్
    వడయఁగఁ జేయఁజాలెదరు - ప్రౌఢత దుష్టుల దూరమందున
    న్విడచుట న్యాయమున్ గడు వివేకము గాదె తలంచి చూడఁగన్.94

ఉ. ఈయఁగ నున్నఁ గొంచెముగ నిచ్చిన వచ్చును సుంత కోప, మెం
    దీయిల వారు దృప్తిగను టెంతగ నిచ్చిన లేదు గాన పె
    ల్లీయుట సజ్జనావళి వహించెడి నైజగుణమ్ము, మధ్యలో
    నీయక మానినన్ కలహహేతువుగాఁ బరిణామ మొందెడిన్.95

చ. అరయఁగఁ గల్గ కుండుటయె యౌశుభ మీ భువి, దుర్జనాళితో
    బరిచయమున్నచో నది కృపారహితేర్ష్యకు హేతు వౌ - తగం
    దొరకాని తుచ్ఛమానవులతోఁ దగ వియ్యము నందుకొంట యెం
    దరిమురి సర్వనాశనము నబ్బగఁజేసిడి మూలకంద మౌ.96

శా. చేతః పద్మ మనోహరత్వమును విచ్ఛేదంబు గావించు వి
    ఖ్యాతమ్మైన దరిద్రతాగుణము, నా జ్ఞాతిత్వమున్, జ్ఞానశూ


    న్యోత ప్రోతము, పైశునంబు లను నా ల్గొప్పార నే దిక్కునం
    బ్రీతి నిల్చునొ దాని కీయఁదగు సంప్రీతి న్నమోవాకముల్. 97

మ. చెలఁగన్ దుష్టుల చిత్త మెన్నఁడు పరచ్ఛిద్రంబులన్, వారి శ్రు
    త్యల ఘూర్జద్ఘన రంధ్రముల్ పరుల వార్తా సంతతిన్, వాక్కు ని
    శ్చల వృత్తిన్ బరమర్మకర్మముల నిచ్చన్నిల్చి రాణింపఁగా
    నల పద్మోద్భవ శిల్పి నైపుణిని నత్యాసక్తి సృష్టించెఁబో !98

ఉ. ఏగతి జీవకోటులకు వృశ్చిక మిద్దర పుచ్ఛకోణది
    గ్భాగమునందు నుండు విషబంధురతన్ గడు భీతిఁ గూర్చునో
    యా గతి నిల్చి నంత దశమాంశము నందున సర్వ కాలమున్
    దాఁ గలి భీప్రదంబుగ నొనర్చి కలంచుట, సత్యమౌ గదా !99

శా. ఏ కాలమ్మున భార్యవాక్యములె తా మింపౌ శ్రుతుల్, సాధనం
    బే కాలంబున ధర్మనిర్వహణ మార్జింపంగ స్వః ప్రజ్ఞయౌ
    నే కాలంబున నౌఁ బ్రమాణ మిల నర్పింతున్ నతుల్ శ్రీ యుతుం
    డా కాలాత్మున కా కలిప్రభున కూహాతీత తేజస్వికిన్.100

శా. ఆయత్తస్థితిఁ గొన్న యి జ్జగము కాలాధీనమై యుండుఁగా
    నీ యీ కాలము కాలకాలుఁడగు సర్వేశుండు చిత్తంబునం
    దే యే రీతులఁ ద్రిప్పఁగా దలఁచు నట్లే సాగు - మ మ్మేమియున్
    జేయంజాలదు కాల మీశు పదరాజీవంబులం జేరుటన్.101

శా. భ్రాంతాత్ముల్ కలికాల లక్షణ విపర్యస్తంబులన్ నేర్వఁగా
    సంతోషింపఁగఁ బండిత ప్రజము, రాజాస్థాన సభ్యుల్ నిజ
    స్వాంతంబం దనుమోదనమ్ము వడయన్, సర్వజ్ఞుఁడై తొల్లి య
    త్యంత ప్రీతిని నీలకంఠ కవి సంధానించె నీ కావ్యమున్.102

మహాకవి నీలకంఠ దీక్షిత ప్రణీత

"కలివిడంబనము” లోని 'కవులు' కు చెందిన

అనుబంధ శ్లోకాలకు అనువాదాలు


మ. ఘనమై తోచెడు విశ్వ మియ్యది కనంగా నామరూపాత్మకం
    బని తా నొప్పును రెండు రీతులుగ ఇం దా నామ విశ్వమ్ము కెం
    దెన లేనట్టి కవీశ్వరుం డగును తానే స్రష్ట - రూపాత్మకం
    బను విశ్వమ్మున కా చతుర్ముఖుఁడు కర్తయొప్పెడున్ జూడగన్. 1

మ. అల సామాన్యపదంబె యయ్యు నది యా యా విద్యలం దెల్ప నీ
    యిల సారస్వత మన్న నామ మొగి తానెందున్ ధ్రువమ్మై మహో
    జ్వల లీలన్ బెలు పొందునో కవికి నా సారస్వతం బొప్పు ను
    జ్వల పాఠ్యంబయి మించు నన్య పఠనౌత్సుక్యం బనర్హం బగున్.2

ఉ. వేలకొలంది యశ్వములు వేలకొలంది మదద్విపంబులున్
    వేలకొలంది యోధులును వేయి విధంబుల నున్న నేమి? భూ
    పాలుని సత్సభన్ పరమభవ్య రసామృత కావ్య కల్పనా
    లీల నెఱుంగు నొక్క కవి లేకయె కల్గునె కీర్తిచంద్రికల్?3

మ. శతపత్రేక్షణుఁ డంచుఁ బొందును బ్రశస్తఖ్యాతి యేకాక్షి, ఆ
    య్యతిలోభుం డగు దేవతా భువన భాస్వత్కల్ప వృక్షంబు - వి
    శ్రుత సంగ్రామ పరంతపుం డగుచుఁ బొల్చు నీరు వీ భూమి -భా
    రతి కీశుండగు సత్కవీశుని కృపార్థంబైన చూ పబ్బినన్.4

మ. పరదేశంబుల వాసముల్, పరునికిం బాపిష్ఠి దాస్యంబు, లే
    వురునే కాక్షి నొకర్తు పత్నిగను దా భోగించుటల్ గల్గియుం
    దిరమౌ కీర్తిని బాండవుల్ వడసి రెంతే వ్యాసభట్టారక
    స్థిరవాణీ కరుణా కటాక్ష మనురక్తిం బ్రోచి వీక్షించుటన్.5


చ. ఎరుఁగరొ దేని నా శశిదినేశులు లోకపుఁ గన్నుదోయి యై
    యెరుఁగరొ దేని యోగివరు లిద్ధ సమాధి నివిష్ట చిత్తులై
    పరఁగియు, సర్వమున్ దెలియు భర్గుఁడు దేని నెఱుఁగ లేఁడొ ఆ
    పరమ రహస్య మెల్లఁ గవివర్యుఁ డెరుంగును ధీవిశేషతన్ 6

    "కలి విడంబనము” లోని మరొక అనుబంధమైన
    'జగద్వశీకరణ' ను గూర్చిన శ్లోకానికి అనువాదము

చ. అరయగ నిచ్చు టొక్కరికి నక్కర లేదు, గ్రహింపఁ గోరినన్
    బరుడిడు వస్తు వెద్దియును బట్టఁగ నక్కరలేదు, శక్తిమైఁ
    గరము శ్రమించి చేయఁదగు కార్యము నక్కరలేదు మంచి మా
    టరసి వచింప నెల్లరకు నౌను వశంబు జనమ్ము సర్వమున్.7

శ్రీ

శివాభ్యాం నమః

మహాకవి "నీలకంఠ దీక్షిత" ప్రణీత

కలి విడంబనము

పండితులు


మూ॥ నభేతవ్యం నబోద్ధవ్యం నశ్రావ్యం వాదినో వచః ।
      ఝుడితి ప్రతివక్తవ్యం సభాసు విజిగీషుభిః ॥1

మూ॥ అసంభ్రమో విలజ్ఞత్వ మవజ్ఞ ప్రతివాదిని |
     హాసో రాజస్త్సవశ్చేతి పంచైతే జయహేతవః2

మూ॥ ఉచ్చై రుద్రుష్యజేతవ్యం మధ్యస్థశ్చే దపండితః ।
      పండితో యది తత్రైవ పక్షపాతో ధిరోప్యతాం॥3

మూ॥ లోభోహేతు ర్ధనం సాధ్యం, దృష్టాంతస్తు పురోహితః
      ఆత్మోత్కర్ష నిగమన, మనుమానే స్వయం విధిః ॥4

మూ॥ అభ్యస్య లజ్జమానేన తత్త్వం జిజ్ఞాసునాచిరం।
     జిగీషుణా హ్రింయంత్యక్త్వా కార్యః కోలాహలోమహాన్ ॥5

మూ॥ పాఠనైర్గ్రంధనిర్మాణై ప్రతిష్ఠాతావ దాప్యతే |
      ఏవం సతస్తు వ్యుత్పత్తి రాయుషోంతే భవేన్నవా ||6

మూ॥ స్తోతారః కేభవిష్యంతి మూర్ఖస్యజగతీతలే |
      నస్తాతిచేత్ స్వయంచ స్వం కదా తస్యాస్తు నిర్వృతి ః ॥7

మూ॥ వాచ్యతాం సమయో తీతః స్పష్ట మగ్రే భవిష్యతి
      ఇతి పాఠయతాం పుంసాంకాఠిన్యం కుత్ర వర్తతే ॥8

మూ॥ అగతిత్వ మతిశ్రద్దా జ్ఞానాభ్యాసేన తృప్తతా।
     త్రయశ్శిష్యగుణాహ్యేతే మూర్ఖాచార్య కభాగ్యజాః ॥9


మూ॥ యదిన క్వాపి విద్యాయాం సర్వధాక్రమతే మతిః
మాన్రికాస్తు భవిష్యామోయతయో యోగినోపివా ౹ 10

మాన్రికులు



మూ॥ అవిళంబేన సంసిద్ధా మాన్రికై రాప్యతేయశః ।
విలంబే కర్మ బాహుళ్యం విఖ్యాప్యావాప్యతే ధనం ॥11

మూ॥ సుఖంసుఖషు దుఃఖీపి జీవనం బుద్ధిశాలిషు |
అనుగ్రహాయ తేయేషాం తేధన్యాః ఖలుమాన్రికా ః ॥12

మూ॥ యావ దజ్ఞానతోమౌన మాచారోవా విలక్షణః
తావ న్మాహాత్మ్యరూపేణ పర్యవస్యతి మాత్రికే13

జ్యోతిషికులు



మూ॥ చారాన్విచార్య దైవ జ్జెః వక్తం భూభృతాంఫలం |
గ్రహచారపరిజ్ఞానం తేషామావశ్యకం యతః ॥14

మూ॥ పుత్ర ఇత్వే పితరి కన్యకేత్యేవ మాతరి |
గర్భ ప్రశ్నేషు కఘయ దైవజ్ఞో విజయీభవేత్ ॥15

మూ॥ ఆయుఃప్రశ్నే దీర్ఘమాయుర్వాచ్యం మౌహోర్తికై స్సదా ।
జీవన్తో మహుమన్యస్తే మృతాః ప్రక్ష్యంతి కంపునః ॥16

మూ॥ సర్వం కోటిద్వ యోపేతం సర్వం కాలద్వయావధి |
సర్వంవ్యామిశ్రమివచ వక్తవ్యం దైవచింతకైః ॥17

మూ॥ నిర్ధనానాం ధనావాప్తిం ధనినా మధికం ధనం ।
బ్రువాణా స్సర్వదా గ్రాహ్యాలోకే జ్యోతిషికాజనాః ॥18

మూ॥ శతస్య లాభే తాంబూలం సహ్నస్యతుభోజనం ।
దైవజ్ఞానా ముపాలంభో నిత్యః కార్యవిపర్యయే ॥19

మూ॥ అపిసాగరపర్యన్తా విచేతవ్యా వసుంధరా ।
324
దేశోహ్యరత్ని మాత్రోపి నాస్తి దైవజ్ఞవర్జితః ॥20

మూ॥ వారాన్కేచి డ్రహాన్ కేచి తేచిదృక్షాణిజానతే |

త్రితయం యేనిజానంతితే వాచస్పతయస్వయం ॥ మూ॥ నైమిత్తికాః స్వప్నదృశో దేవతోపాసకా ఇతి | విసర్గశత్రవః సృష్టాః దైవజ్ఞానా మమీత్రయః ॥ వైద్యులు మూ॥ స్వస్థె రసాధ్యరోగైశ్చ జన్తుభిర్నాస్తి కించన । కాతరాదీర్ఘరోగాశ్చ భిషజాం భాగ్యహేతవః ॥ మూ॥ నా తిధైర్యం ప్రదాతవం నా 21 22 23 తిభీతిశ్చ రోగిణి । 24 నైశ్చింత్యా దాదిమేదానం నై రాశ్యాదేవ నానిమే మూ॥ భైష్యంతు యథాకామం పథ్యంతు కఠినం వదేత్ | ఆరోగ్యం వైద్యమాహాత్మ్యా దన్యథాత్వమపథ్యతః ॥ మూ॥ నిదానం రోగనామాని సాత్మ్యాసాత్మ్యచికిత్సతం । సర్వమప్యు పదేక్ష్యంతి రోగిణస్సదనే 2 G స్త్రియః I 25 || 26 మూ॥ జృంభమాణేషు రోగేషు మ్రియమాణేషు జన్తుషు | రోగతత్త్వేషు శనకైః వ్యుత్పాద్యంతే చికిత్సకాః ॥ మూ॥ ప్రవర్తనార్థ మారంభే మధ్యేత్వౌషధ హేతవే | బహుమానార్థమస్తేచ జిహీర్షంతే చికిత్సకాః ॥ మూ॥ లిస్సమానేషు వైద్యేషు చిరాదాసాద్యరోగిణః | దాయాదా స్సంప్రరోహన్తి దైవజ్ఞా మాన్రికా అపి | మూ॥ రోగస్యోపక్రమే సాంత్వం మధ్యేకించి ధనవ్యయః | శైనెరనాదర శ్శాన్తో స్నాతో వైద్యం నపశ్యతి ॥ మూ॥ దైవజ్ఞత్వం మాత్రికతా భైషజ్యం చాటుకౌశలం | ఏకైక మర్ధలాభాయ ద్వితియోగస్తు దుర్లభః ॥ మూ॥ అనృతం చాటువాదశ్చ ధనయోగో మహానయం | సత్యం వైదుష్య మిత్యేష యోగో దారిద్య్ర్య కారకః ॥ 27 28 29 30 31 32 కలివిడంబన 325 కవులు మూ॥ కాతర్యం దుర్వినీతత్వం కార్పణ్య మవివేకితాం | సర్వం మార్జంతి కనయ శ్శాకినీముష్టికింకరాః మూ॥ నకారణ మపేక్షంతే కవయః స్తోతు ముద్యతాః | కించి దస్తువతాం తేషాం జిహ్వా ఘరఘరాయతే ॥ మూ॥ స్తుతం స్తువంతి కవయో నస్వతో గుణదర్శినః | కీటః కశ్చిదళిర్నామ కియతీ తత్రవర్ణనా ॥ మూ॥ ఏకైక కవితా పుంసాం గ్రామా యా శ్వాయ హస్తినే । అస్తతో న్నాయ వస్త్రాయ తాంబూలాయచ కల్పతే ॥ మూ॥ శబ్దాఖ్య మరపరంబ్రహ్మ సన్దర్భేణ పరిష్కృతం । విక్రీయతే కతిపయై ర్వృథా 33 34 35 36 న్యైర్వినియుజ్యతే ॥ 37 మూ॥ వర్ణయన్తినరాభాసం వాణీంలబ్ధ్వాపి యేజనాః । ప్రాప్యాపీ కామధేనునే లాఙ్గలే వినియుజ్ఞతే మూ॥ ప్రశంసంతి నరాభాసాన్ ప్రలపంతో న్యథా తథా | కథంతరస్తు కవయః కామపారమ్యవాదినః ॥ మూ॥ యత్సన్దర్బే యదుల్లేఖే యద్యంగ్యే నిభృతంమనః । సమాధేరపి తజ్జ్యాయ శ్శంకరోయది వర్ణ్యతే ॥ గృహస్థులు మూ॥ గృహిణీ భగినీ తస్యాః శ్వశురౌ స్యాల ఇత్యపి। ప్రాణినాం కలినా సృష్టాః పఞ్చ ప్రాణా ఇమే పరే ॥ మూ॥ జామాతరో భాగినేయా మాతులాదారబంధవః | అజ్ఞాతాఏవ గృహిణాం భంక్షయాన్యాఖువద్గృహే ॥ మూ॥ మాతులస్య బలం మాతా జామాతు ర్దుహితా బలం శ్వశురస్యబలం భార్యా స్వయమేనా తిథే ర్బలం ॥ 326 38 39 40 41 42 43 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 అల్లుఁడు మూ॥జామాతు ర్వక్రతాతావ ద్యావ త్స్యాలస్య బాలతా | ప్రబుధ్యమానే సారళ్యం ప్రబుద్ధే స్మి పలాయనం ॥ మూ॥ భార్యాజ్యేష్ఠా శిశు స్స్యాలః శ్వ శ్రూస్వాతంత్ర్య శాలినీ । శ్వశురస్తు ప్రవాసీతి జామాత ర్భాగ్యధోరణీ మూ॥ భూషణై ర్వసనైక పాత్రై పుత్రాణా ముపలాలనైః | సకృదాగత్య గచ్చంతీ కన్యా నిర్మార్షి మందిరం ॥ మూ॥ గృహిణీ స్వజనంవక్తి శుష్కాహారం మితాశనం । పతిపక్షాంస్తు బహ్వాశాన్ క్షీరాపాన్ తస్కరానపి | మూ॥ భార్దేద్వే పుత్రశాలిన్యౌ భగిన్యః పతివర్జితాః | అశ్రాస్తకలహూనామ యోగో యం గృహమేధినాం మూ॥ ద్వేభార్యే బహవః పుత్రాః దారిద్య్రం రోగసంభవః | జీర్ణోచ మాతాపితరా నేకైకం మరణాధికం ॥ ఋణదాత మూ॥ స్మృతే సీదన్తి గాత్రాణి దృష్టే ప్రజ్ఞాపి నశ్యతి | అహో మహదిదం భూత ముత్తమర్ణాభి శబ్దితమ్ ॥ మూ॥ అస్తకో పిహి జస్తూనా మస్తకాల మపేక్షతే | నకాలనియమః కశ్చిదుత్తమర్థస్య విద్యతే ॥ మూ॥ నపశ్యామో ముఖే దంష్ట్రాం నపాశంవా కరాఞ్చలే | ఉత్తమర్ణ మనేక్ష్యేవా తథాప్యుద్విజతే మనః ॥ దారిద్య్రము మూ॥ శత్రాసాస్త్వం ప్రతీకారః సర్వరోగేషు భేషజం । మృత్యౌ మృత్యుంజయధ్యానం దారిద్యే నతుకించన ॥ మూ॥ శక్తిం కరోతి సంచారే శీతోష్ణ మర్షయత్యపి । దీపయాత్యుదరే వహ్నిం దారిద్ర్యం పరమౌషధం ॥ 44 45 46 47 48 49 50 51 52 53 54 కలివిడంబన 327 మూ॥ గిరం స్థలంతీం మీలన్యౌదృశౌ పాదౌ విసంస్థులౌ | ప్రోత్సాహయతి యాచ్నాయాం రాజాజ్ఞేవ దరిద్రతా | మూ॥ జీర్యన్తి రాజ విద్వేషాః జీర్య స్యవిహితాన్యపి । ఆకించన్యబలాఢ్యానా మనతో శ్మాం పి జీర్యతి ॥ మూ॥ నా స్య చోరా నపిశునా నదాయాదా నపార్థివాః దైన్యం రాజ్యాదపిజ్యాయోయదితత్త్వం విబుధ్యతే ॥ లక్ష్మీ మూ॥ ప్రకాశ యత్యహంకారం ప్రవర్తయతి తస్కరాన్ । ప్రోత్సాహయతి దాయాదాన్ లక్ష్మిః కించి దుపస్థితా ॥ మూ॥ విడంబయంతి యే నిత్యం విముగ్ధా ధనినోజనాన్ । తఏవతు విడంబ్యంతే శ్రియా కించి దుపేక్షితాః ॥ మూ॥ ప్రమాణ్యబుద్ధిః స్తోత్రేషు దేవతాబుద్ధిరాత్మని కీటబుద్ధిర్మనుష్యేషు నూతనాయాః శ్రియః ఫలం ॥ మూ॥ శృణ్వస్త్ర ఏవ పృచ్ఛంతి పశ్యన్తో పి నజానతే | విడంబనాని ధనికాః స్తోత్రాణీత్యేవ మన్వతే | మూ॥ ఆవృత్య శ్రీమదేనా న్దా నన్యోన్యకృత సంవిదః | స్వైరం హసంతి పార్శ్వ స్థా బాలోన్మత్త పిశాచవత్ ॥ మూ॥ స్తోతవ్యైః స్తూయతే నిత్యం సేవనీయైశ్చ సేవ్యతే | నబిభేతి నజితి తథాపి ధనికో జనః ॥ మూ॥ క్షణమాత్రం గ్రహావేశో యామమాత్రం సురామదః । లక్ష్మీమదస్తు మూర్ఖణా మాదేహ మనువర్తతే ॥ మూ॥ శ్రీర్మాస మర్ధమాసంవా చేష్టిత్వా వినివర్తతే | వికారస్తు తదారబ్ధా నిత్యో లశునగంధవత్ ॥ మూ॥ కంఠోమదః ద్రవజః హృదితామ్బూలఱో మదః । లక్ష్మీమదస్తు సర్వాంగే పుత్రదారముఖేష్వపి ॥ 55 56 57 58 59 60 61 62 63 64 65 66 328 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 మూ॥ యత్రాసీ దస్తివా లక్ష్మీ స్తోత్రోన్మాదః ప్రవర్తతాం | కులే త్వవతర త్యేషా కుష్ఠాపస్మారవత్కథమ్ ॥ మూ॥ అధ్యాపయన్తి శాస్త్రాణి తృణీకుర్వన్తి పండితాన్ | విస్మారయన్తి జాతి స్వాం వరాటాః పఞ్చషాః కరే ॥ మూ॥ భిభర్తు భృత్యం ధనికో దత్తాంవా దేయ మర్ధిషు । యావ ద్యాచకసామర్థ్యం తావ లోభో నమృష్యతి ॥ మూ॥ ధనభారోహి లోకస్య పిశునైరివ ధార్యతే | కథంతే తంలఘూకర్తుం యతస్తే పరథాస్వతః ॥ మూ॥ శ్రమానురూపం పిశునః కిము ప్రక్రియతే నృపైః | ద్విగుణం త్రిగుణంవాపి కృతాన్తో లాలయిష్యతి ॥ మూ॥ గోకర్జే భద్రకర్ణేచ జపో దుష్కర్మనాశనః । రాజకర్ణే జపస్సద్య సర్వకర్మవినాశనః ॥ మూ॥ నస్వార్థం కించి దిచ్ఛంతి నప్రేర్యనేచ కేనచిత్ | పరార్థేషు ప్రవర్తనే ఖలాస్సన్తశ్చ తుల్యవత్ ॥ మూ॥ కాలాన్తరే హ్యనర్థాయ గృద్రోగేహో పరిస్థితః । ఖలో గృహసమీపస్థ న్సద్యోనర్థాయ కేవలమ్ ॥ లోభి మూ॥ శుష్కోపవాసో ధర్మేషు భాషజ్యేషుచ లంఘనం | జపయజ్ఞశ్చ యజ్ఞేషు రోచతే లోభశాలినామ్ ॥ మూ॥ కిం వక్ష్యతీతి ధనికా ద్యావ దుద్విజతే ధనః । కిం ప్రక్ష్యతీతి లుబ్ధాపి తావదుద్విజతే తతః ॥ మూ॥ సర్వ మాతిథ్యశాస్త్రార్థం సాక్షాత్కుర్వంతి లోభినః । భిక్షాకబళ మేకైకం యేహి పశ్చన్తి మేరువత్ ॥ మూ॥ ధనపాలః పిశాచోహి దత్తేస్వామి న్యుపాగతే । ధరలుబ్దః పిశాచస్తు నకస్మైచన దిత్సతి ॥ 67 68 69 70 71 72 73 74 75 76 77 78 కలివిడంబన 329 మూ॥ దాతారో ర్థిభి రర్థ్యంతే దాతృభిః పునరర్థినః । కర్తృకర్మవ్యతీహారా దహోనిమ్నోన్నతం కియత్ ॥ మూ॥ స్వస్మిన్నసతి నార్థస్య రక్షక స్సంభవే దితి | నిశ్చిత్యైవం స్వయమపి భుక్త్వా లుబ్ధః కథంచన ॥ అతిథి మూ॥ ప్రస్థాప్యమానః ప్రవిశేత్ ప్రతిష్ఠిత దినే దినే । విచిత్రానుల్లిఖే ద్విఘ్నాన్తిష్ఠాను రతిథిశ్చిరం ॥ డాంభికులు మూ॥ ఘటకం సమ్యగారాధ్య వైరాగ్యం యావ దాహరేత్ | తావదరాః ప్రసిధ్వన్తి యావచ్చాపల మావృతం ॥ మూ॥ ఏకత స్సర్వశాస్త్రాణి తులసీకాష్ట మేకతః । వక్తవ్యం కించిదిత్యుక్తం వస్తు స్తులసీ వరా॥ మూ॥ విస్మృతం బాహటేనేదం తులస్యాః పఠతాగుణాన్ | విశ్వసమ్మోహినీ విత్తదాయి నీతి గుణద్వయమ్ ॥ మూ॥ ప్రదీయతే విద్యుప్యేకం కవౌ దశ నటే శతం । సహస్రం డాంభికే లోకే శ్రోత్రియే నతు కించన ॥ మూ॥ కౌపీనం భసితాలేపో దర్భా రుద్రాక్షమాలికా | మౌన మేకాసికా చేతి మూర్ఖసంజీవనాని షట్ ॥ మూ॥ వాసః పుణ్యేషు తీర్థేషు ప్రసిద్ధశ్చమృతోగురుః | అధ్యాపనా వృత్తయశ్చ కీర్తనీయా ధనార్థిభిః ॥ మూ॥ మస్త్రభ్రంశే సంప్రదాయః ప్రాయశ్చిత్త మసంస్కృ తౌ| దేశధర్మస్వనాచారే పృచ్చతాం సిద్ధ ముత్తరమ్ ॥ మూ॥ యథాజానన్తి బహవో యథావక్ష్యన్తి దాతరి | తథాధర్మంచరేత్సర్వం నవృథాకించి దాచరేత్ ॥ 79 80 81 82 83 84 85 86 87 88 89 330 వావిలాల సోమయాజులు సాహిత్యం-1 యూ॥ సదాజపపటోహస్తే మధ్యేమధ్యే క్ష్మిలనం | సర్వం బ్రహ్మేతివాదశ్చ సద్యః ప్రత్యయ హేతవః మూ॥ అమధ్యాహ్నం నదీవాసో సమాజే దేవతార్చనం | సతతం శుచివేషశ్చేత్యేత డ్డంభస్య జీవితమ్ ॥ మూ॥ తావదీర్ఘం నిత్యకర్మ యావత్స్యామేళనం I తావత్సంక్షిప్యతే సర్వం యావద్రష్టా నవిద్యతే | మూ॥ ఆనన్దబాష్ప రోమాన్చౌ యస్య స్వేచ్ఛావశంపదౌ | కింతస్య సాధనై రన్యైః కింకరాస్సర్వ పార్థివాః | దుర్జనులు మూ॥ వికుర్వన్తో దండ్యమానా లాల్యమానా స్తత స్తరామ్ | దుర్జనానామతో న్యాయం దూరాదేవ విసర్జనమ్ ॥ మూ॥ ఆదాన మీషద్ధానం కించిత్కోపాయ దుర్గియాం । సంపూర్ణదానం ప్రకృతి ర్విరామో వైరకారణమ్ ॥ మూ॥ జ్యాయా నసంస్తనో దుప్లై దీర్ఘ్యాయై సంప్తవః పునః | ఆపత్యసంబంధ విధః స్వానర్ధాయైవ కేవలమ్ ॥ మూ॥ జ్ఞాతేయం జ్ఞానహీనత్వం పిశునత్వం దరిద్రతా | మిళంతియది చత్వారి తద్ది శేపి నమోనమః ॥ మూ॥ పరచ్చి ద్రేషు హృదయం పరవార్తానుచ శ్రవః | పరమర్శనువాచంచ ఖలానా మసృజ ద్విధిః | మూ॥ విషేణ పుచ్ఛలగ్నేన వృశ్చికః ప్రాణినామిన । కలినాదశమాంశేన కాలస్సర్వోల పిదారుణః ॥ మూ॥ యత్రభార్యాగిరోవేదాః యత్రధర్మోల ర్ధసాధనం । యత్ర స్వప్రతిభా మానం తస్మై శ్రీకలయే నమః ॥ మూ॥ కామ మస్తు జగత్సర్వం కాలస్యాస్యవశం పదం | కాలకాలం ప్రపన్నానాం కాలః కింసు కరిష్యతి ॥ 90 91 92 93 94 95 96 97 98 99 100 101 కలివిడంబన 331 మూ॥ కవినా నీలకంఠేన కలేరేత ద్విడంబనం । రచితం విదుషాం ప్రీత్యై రాజాస్థానానుమోదనం కలి విడంబనము సంపూర్ణము 102 332 వావిలాల సోమయాజులు సాహిత్యం-1