ఆంగ్లసాహిత్యానికి

విశేష సేవలందించిన తెలుగుతేజం

డా. గూటాల కృష్ణమూర్తి


తెలుగు భాషోద్ధరణకు ఎనలేని సేవ లందించిన ఆంగ్లేయుడు సి.పి. బ్రౌన్ గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. ఆంగ్ల సాహిత్యానికి విశేష సేవలందించిన తెలుగు తేజం డా. గూటాల కృష్ణంమూర్తి. 1890 సంవత్సరం నుంచి 1900 - సంవత్సరం వరకు ఆంగ్ల సాహిత్యానికి స్వర్ణయుగమని నిరూపించిన మహోన్నత సాహిత్యమూర్తి డా॥ గూటాల కృష్ణమూర్తి, వారి ఆంగ్ల సాహిత్యసేవను చూస్తే, బ్రౌను తెలుగు సాహిత్యానికి చేసిన సేవతో సరితూచవచ్చు. బ్రౌనుకు తెలుగు జాతి పడిన రుణాన్ని కృష్ణమూర్తిగారు ఈ రీతిగ తీర్చాడనిపిస్తున్నది.

మా లండన్ పర్యటనలో డా. గూటాల కృష్ణమూర్తిని కలవడం ప్రధానమైన అంశం. 1975లో విదేశాంధ్ర ప్రచురణలు అనే సంస్థను లండన్లో ప్రారంబించి, పురిపండ అప్పలస్వామిగారి "పులిపంజా" కవితాసంపుటిని సర్వాంగసుందరంగా విదేశాల్లో ప్రచురించి, హైదరాబాదు 'కళాభవన్లో ఆనాటి విద్యాసాంస్కృతిక శాఖామాత్యులైన మా నాన్నగారు మండలి వెంకట కృష్ణారావుగారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం, ఆ సందర్భంగా గూటాలవారిని నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది.

పచ్చని మేని ఛాయతో సూటు, బూటులో తెల్లదొరలా కనిపించేవారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం 2006 అక్టోబరు 27–28 తేదీలలో విజయవాడలో జాతీయ తెలుగు రచయితల మహాసభలను డా. గూటాల కృష్ణమూర్తిగారితో ప్రారంభింపజేయడం జరిగింది. అలాగే 2007 సెప్టెంబరు 21, 22, 23 తేదీలలో అపూర్వమైన రీతిలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు వీరు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ రెండు కార్యక్రమాల్లో నా ఆహ్వానాన్ని మన్నించి వారు పాల్గొన్నారు.

విశ్వవిఖ్యాత గాయని, నటీమణి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారిపై అపురూప గ్రంథం 'సూర్యకుమారి ఇల్విన్ - ఎ మెమోరియల్ వాల్యూమ్' ను 2008 నవంబరు 13వ తేదీన సుప్రసిద్ధ సినీ నటుడు పద్మభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావుగారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆ సభకు అధ్యక్షత వహించే అవకాశం డా. గూటాల కృష్ణమూర్తిగారు నాకు కల్పించారు. తెలుగు ప్రచురణ రంగ చరిత్రలో అరుదైన, అపురూపమైన గ్రంథాన్ని వారు రూపొందించారు.

డా. కృష్ణమూర్తిగారితో చిరకాల పరిచయం ఉండటం వలన మా లండన్ పర్యటనలో వారి ఇంటికి వెళ్లాను. మొదటి అంతస్థులో వారి నివాసం. ఇల్లంతా పుస్తకాలమయంగా కనిపించింది. చివరికి బాత్రూముల్లో కూడా పుస్తకాల దొంతరలే. అవి మామూలు పుస్తకాలు కావు. ఎక్కడా దొరకని అపురూప గ్రంథాలు. ప్రత్యేకించి, 1890 దశకంలో వెలువడిన గ్రంథాలు వీరి వద్ద మాత్రమే ఆ దేశంలో లభ్యమవుతాయి. ఆంగ్ల సాహిత్య పరిశోధకులు వాటి కోసం వారింటికి వచ్చి వెళుతుంటారు. సుప్రసిద్దులకు సంబంధించిన లేఖలను, వస్తువులను భద్రపరచడం వారికి అలవాటు. సర్ ఆర్థర్ కాటన్ స్వదస్తూరితో వ్రాసిన లేఖలు వారివద్ద వున్నాయి. సరోజినీనాయుడు, తదితర ప్రముఖుల లేఖలు కూడా ఉన్నాయి. బ్రిటిష్ లైబ్రరీలో ఎప్పడో వందేళ్ళ క్రితం తయారు చేసిన తెలుగు-ఉర్దూ నిఘంటువుకు సంబంధించిన మైక్రో ఫిల్మ్ కృషమూర్తిగారు నాకిచ్చారు.

అలాగే కృష్ణా ఆనకట్ట నిర్మాణ సమయంలో (1948 సంll) చిత్రించిన
సర్ ఆర్థర్ కాటన్ స్వదస్తూరితో కూడిన లేఖ
సర్ ఆర్థర్ కాటన్ లేఖను చూపిస్తున్న డా॥ గూటాల


డా॥ గూటాల కృష్ణమూర్తితో శ్రీ మండలి బుద్ధప్రసాద్
రేఖా చిత్రాలు ఆనాటి నిర్మాణపు పనులకు దర్పణం 3 వారివద్ద ఉన్నాయి. ఇలాంటి అపురూపమైన సేకరణ ఎంతో వారివద్ద వుంది. 82 సంవత్సరాల వయసులో వంటరిగా వారక్కడ జీవిస్తున్నారు. వారి సతీమణి విశాఖపట్నంలో ఉంటారు. నేను వెళ్లే సమయానికి వారంత ఆరోగ్యకరంగా లేరు. వారిని చూసి నా మనసంతా వికలమైంది. ఒక ఆంగ్లేయమిత్రుడు అప్పడప్పుడు సహకారం అందిస్తూ ఆయన మంచి చెడ్డలు గమనిస్తూ వుంటాడని చెప్పారు. ఆయన శరీరం తగిన విధంగా సహకరించకపోయినా ఆయన మనస్సు మాత్రం శరవేగంగా పయనిస్తోంది.

"1890 – A Biographical Dictionary” రూపకల్పనలో ఆయన మునిగి తేలుతున్నారు. అయితే ఆయన ఎవరి సహాయం లేకుండా, అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగించకుండా తనకు తానే డిక్ష్నరీని రూపొందిస్తున్నారు. ఇది ఎంత శ్రమతో కూడిన విషయమో వేరుగా చెప్ప పనిలేదు. దాన్ని పూర్తి చేయాలన్న పట్టదలే ఆయనను ముందుకు నడిపిస్తున్నది.

విదేశాంధ్ర ప్రచురణల ద్వారా మహాకవి శ్రీశ్రీ చేతి వ్రాతతో ప్రచురించిన మహాప్రస్థానం గూటాలవారి తెలుగు సాహిత్యసేవకు మహోన్నత దర్పణంగా నిలుస్తుంది.

డా. గూటాల కృష్ణమూర్తి గాంధేయవాది. ఆయన మహాత్మాగాంధీ జన్మదినం అక్టోబరు 2వ తేదీన, నిర్యాణదినం జనవరి 30న ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటలవరకు, ఒక గంట విరామంతో, నిరంతరాయంగా రాట్నం వడుకుతారు. అదికాక ప్రతిరోజు రెండు గంటలు తప్పని సరిగా రాట్నం వడుకుతారు. ఈ అలవాటును ఆయన గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. స్వదేశంలో చరఖా సంగతి అంతా మరిచి పోయినా, విదేశంలో ఉంటున్న కృష్ణమూర్తిగారు మాత్రం దీన్ని ఒక 'యోగం' గా శ్రద్ధాసక్తులతో ఆచరిస్తున్నారు. అక్టోబర్ 2న, జనవరి 30న మాత్రం ఈ రాట్నం వడికే పనిని టాలిస్టాకీ స్క్వేర్‌లో గాంధీ విగ్రహం వద్ద రోజంతా కొనసాగిస్తారు. విదేశాల్లో గాంధీ తత్త్వాన్ని ప్రచారం చేస్తున్న నిస్వార్థ సేవాతత్పరుడు గూటాల కృష్ణమూర్తిగారు.

గూటాల గురునాథస్వామి, సుభద్రమ్మ దంపతులకు కృష్ణమూర్తిగారు 1928వ సంవత్సరంలో పర్లాకిమిడి గ్రామంలో జన్మించారు. ప్రస్తుతమిది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. తండ్రి మేజిస్ట్రేట్‌గా పనిచేశారు.

వీరి విద్యాభ్యాసం విజయనగరంలోను, విశాఖపట్నంలోను సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1955లో ఎం.ఏ. ఇంగ్లీషు ఆనర్స్ పట్టా పుచ్చుకున్నారు.

1955-1958 మధ్య అమలాపురంలోను, 1958-62 మధ్య బిలాస్‌పూర్ లోను ఆంగ్లోపన్యాసకులుగా పనిచేశారు. నిరంతర చైతన్యవాహిని అయిన కృష్ణమూర్తిగారికి ఈ ఉద్యోగాలు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. పరిధులులేని ఆయన ప్రజ్ఞకు ఆకాశమే హద్దయింది.

1962లో రీసెర్చ్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. 1966లో మధ్యప్రదేశ్‌లోని సాగర్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్.డి. పొందారు. 1968లో అమెరికా వెళ్లి 1972 వరకు బ్రిడ్జ్ వాటర్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొవిడెన్స్ కాలేజిలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇది బోస్టన్ సమీపంలో ఉంది. 1972లో ఇంగ్లాండ్ తిరిగి వచ్చి లండన్ గ్రామర్ స్కూలులో విదేశీ విద్యార్థులకు ఇంగ్లీషు బోధించారు.

విదేశాలలో నిరంతరం విద్యావ్యాసంగంలో తలమునకలవుతూ కూడా, తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి కృష్ణమూర్తిగారు అహరహం శ్రమించారు. పది సంవత్సరాల పాటు లండన్‌లోని ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా పనిచేశారు. మా నాన్నగారు విద్యాసాంస్కృతికశాఖామంత్రిగా ఉన్నప్పుడు విద్యాసాంస్కృతిక రంగాల్లో ప్రవాసాంధ్రులకు చేయూతనివ్వడానికి స్థాపించిన అంతర్జాతీయ తెలుగు సంస్థతో సన్నిహిత
విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో డా॥ గూటాలకు సత్కారం.

సంబంధాలు పెట్టుకొని ఇంగ్లాండ్‌లో నివశిస్తున్న తెలుగువారి సంతానానికి తెలుగుభాషా సంస్కృతులను పరిచయం చేసి, వారికి తమ సాంస్కృతిక వారసత్వం పట్ల అవగాహన, ఆసక్తి కలిగించడానికి విశేషంగా కృషి చేశారు. కృష్ణమూర్తిగారి అభిప్రాయం ప్రకారం 1890-1900 దశాబ్దం ఆంగ్ల సాహిత్యానికి స్వర్ణయుగం. ఆ దశాబ్దం ప్రాముఖ్యతను తెలియజెప్పడానికి "1890's Society" అనే సాహిత్య సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నారు. దాని పక్షాన పది జీవిత చరిత్రలు ప్రచురించారు.

"ఏ దేశమేగినా ఎందుకాలిడినా

పొగడరా నీ తల్లి భూమి భారతిని"

అన్న గురజాడ సందేశాన్ని ఆచరణాత్మకం చేసిన మహనీయ వ్యక్తి డా. గూటాల కృష్ణమూర్తి ఆంగ్ల సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరింపజేసుకున్న తెలుగుతల్లి ముద్దుబిడ్డడు డా॥ గూటాల కృష్ణమూర్తి.