లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు/తెలుగు భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్
తెలుగు భగీరథుడు
సర్ ఆర్థర్ కాటన్
"నిత్య గోదావరీ స్నానపుణ్యదోయోమహామతిః
స్మరామ్యాంగ్లేయదేశీయం, కాటనుం తం భగీరథం"॥
ఒక వేదపండితుడు గోదావరిలో స్నానమాచరిస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో పై శ్లోకం పఠించి, పూజలొనరుస్తుంటే, ఆ శ్లోకంలోని "కాటన్" అన్న పదం వినపడి, ఆ దారిన గుర్రం విూద వెళుతున్న తెల్లదొర ఒక్కసారిగా గుర్రాన్ని నిలిపి, ఆ పండితుణ్ణి పిలిచి, దాని అర్థమేమిటని ప్రశ్నిసాడు. "పవిత్ర గోదావరీ జలాలతో అనుదినం స్నానపానాదులాచరించగల పుణ్యఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు, భగీరథతుల్యుడు, ఆంగ్లదేశీయుడైన కాటన్ను స్మరిస్తున్నాను" అని దానర్ధాన్ని వేదపండితుడు చెబుతాడు. అంతట ఆ తెల్లదొర "కాటన్ జీతం తీసుకుని పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆనకట్టలుకట్టి, కాల్వలు త్రవ్వి పంటలకు నీరందించడం ఆయన ఉద్యోగ ధర్మం. ఆయన తన విద్యుక్త ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించాడు. అంతమాత్రానికే విూరాయనను దేవునిగా భావించి, ఆరాధించాలా" అని అంటాడు. అంతట ఆ పండితుడు "దొరగారూ! విద్యుక్త ధర్మనిర్వహణ దైవలక్షణం. అట్టి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే వారెవరైనా దైవ స్వరూపులే. ఈ గౌతమి మండలాన్ని గోదావరీ జలాలతో సస్యశ్యామలం చేసి, మా బ్రతుకుల్లో పాలు పోశారు కాటన్ దొరగారు. అందుకే ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాను" అని సమాధానం ఇస్తాడు. ప్రక్కనే ఉన్న దుబాసి మిూరు ఆరాధిస్తున్న కాటన్ దొరగారు వీరేనని పండితునికి చెబుతాడు. "దొరగారూ! మీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించిందని ఆ పండితుడు కాటన్ దొరకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు.
తాను పడిన శ్రమకు ప్రజల నుంచి అంత గుర్తింపు లభించినందుకు కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలాయి. 150 సంవత్సరాలుగా ఆ శ్లోకం గోదావరీ తీరాన ప్రతిధ్వనిస్తూనే ఉంది. కాటన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఈ నాటికీ నిలిచే ఉన్నాడు.
నీటిపారుదల పితామహుడు 'జలప్రదాత' సర్ ఆర్థర్ కాటన్
గోదావరి, కృష్ణా నదుల మీద ఆనకట్టలు కట్టడం ద్వారా అక్కడి బంజరు భూములన్నింటినీ సస్యశ్యామలంగా మార్చవచ్చని బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సఫలీకృతుడైన కాటన్ దొర గోదావరి నది మీద 1847-52 సంవత్సరాల మధ్య కృష్ణా నది మీద 1852-1855 సంవత్సరాల మధ్య ఆనకట్టలను నిర్మించాడు. ఈనాడు కృష్ణా, గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా, పాడిపంటలతో విలసిల్లుతున్నాయంటే దానికి కారణం ఆ మహనీయుడే.
11.4.1970న ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో శ్రీ నార్లవెంకటేశ్వరరావు ఈ విధంగా వ్రాశారు : "ప్రధాని నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు ఒక రైతు ఆయనతో "ఇది మీరు పెట్టిన దీపమే" అన్నాడు. నాగార్డున సాగర్ నెహ్రూ పెట్టిన దీపం కాగా, గోదావరి ఆనకట్ట, అంతకు నూరేళ్ళకు ముందు సర్ ఆర్థర్ కాటన్ పెట్టిన దీపం. దక్షిణ భారతంలో కాటన్ పెట్టిన పెక్కు దీపాల్లో అదొకటి. కాటన్ ఆనాడు పెట్టిన దీపం తెలుగు గడ్డకు వెలుగు నిచ్చింది. తెలుగు బిడ్డకు అన్నం పెట్టింది. గంగను స్వర్గం నుంచి భగీరథుడు భూతలానికి తెచ్చినాడన్న పురాణగాథ నిజమో కాదో కానీ, వృథాగా సముద్రం పాలైపోతున్న గోదావరీ జలాలను లక్షలాది ఎకరాల పంట పొలాలకు మళ్ళీంచిన అపర భగీరథుడు మాత్రం నిశ్చయంగా సర్ ఆర్థర్ కాటన్" అని శ్రీ నార్ల కొనియాడారు.
“సర్ ఆర్థర్ కాటన్ ఆనాడు అంత కొద్దిపాటి వ్యయంతో (రూ. 15,34,000/-) నిర్మించిన గోదావరి ఆనకట్ట బ్రిటిష్ ఇండియాలోని ఇంజనీరింగ్ నైపుణ్యానికి అత్యద్భుతమైన చిహ్నంగా విశేష ప్రశంసలు పొందింది. 1846లో రాజమండ్రి జిల్లా జన సంఖ్య 5,61.041గా ఉండేది. 1891 నాటికి అది 20,78,782కు పెరిగింది. 1844లో రాజమండ్రి జిల్లా నుంచి లభించే అన్ని రకాల రెవెన్యూ రూ. 17,25,841/-లు ఉండేది. 1898 నాటికి ఒక ల్యాండ్ రెవెన్యూ మాత్రమే రూ. 60,19,224/-లకు పెరగింది. ప్రభుత్వ దృష్టితో చూసినపుడు సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టకు ఇంతకు మించిన యోగ్యతా పత్రం ఏమికావాలి" అని శ్రీ నార్లవారు ప్రశ్నించారు.
సుప్రసిద్ధ ఇంజనీరు మాజీ కేంద్ర జల విద్యుత్ శాఖామంత్రి శ్రీ కె.యల్. రావు "ఇండియాలో దక్షిణ దేశమున సర్ ఆర్థర్ కాటన్ నిర్వహించిన సేద్యపు నీటి పారుదల పనులకు కరవు కాటకాల బారి నుండి లక్షలాది ప్రజలు శాశ్వతంగా రక్షింపబడుటయే కాక, కృష్ణాగోదావరి డెల్లా ప్రాంతాలు అభివృద్ధి మార్గాన పయనించాయి. అతని కృషి ఫలితాలు కొండపై కోటవలె అందరికీ అగుపడుచున్నవి" అన్నారు.
కాటన్ పుణ్యమా అని ఈ రెండు ఆనకట్టలప్రాంత రైతులు పేదరికం నుంచి స్వంత సాగుకు ఎదిగారు. ఒక పటిష్టమైన మధ్య తరగతి రైతాంగం ఆవిర్భవించింది. సంపన్న వర్గానికి, పేదవర్గానికి నడుమ ఈ మధ్య తరగతి రైతాంగవర్గం అవతరించింది. రైతాంగ వర్గాలకు సాంఘిక హోదా సంపాదించడానికి, వారి సంతానాన్ని విద్యావంతులను చేయడానికి
డార్కింగ్‌లో కాటన్ సమాధి
సర్ ఆర్థర్ కాటన్ డార్కింగ్ పట్టణంలో చనిపోయినట్లు తెలుసుకుని, డార్కింగ్ సెమెట్రీ ఫోన్ నంబర్లను నెట్ ద్వారా సేకరించి, వారికి ఫోన్ చేసి, కాటన్ సమాధి గురించి వాకబు చేశాము. ఆ సెమెట్రీలో ఆయన సమాధి వుందని సెమెట్రీవారు చెప్పిన మీదట ఆ మహనీయుడి యొక్క స్మృతి చిహ్నాల కోసం ఆ పట్టణానికి డా॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శ్రీ బోయపాటి ప్రమోద్‌లతో కలసి లండన్ నుంచి రైల్లో బయలుదేరి డార్కింగ్ చేరుకున్నాము. రైల్వే స్టేషన్‌కు ఒక కిలోమీటరు దూరంలోనే డార్కింగ్ సెమెట్రీ ఉంది. ఆ సెమెట్రీలో ప్రవేశించిన మేము ఆశ్చర్యపోయాము. అది స్మశానవాటికలా కాక, సుందర ఉద్యానవనంలా అందమైన కట్టడాలతో పచ్చిక బయళ్ళతో, రకరకాల పూల మొక్కలతో చూడచక్కగావుంది.
బ్రిటన్లోని డార్కింగ్ పట్టణంలో ఉన్న ఈ సెమెట్రీ 21 నవంబర్ 1855లో ప్రారంభమైంది. "బాక్స్ హిల్" కొండను ఆనుకుని ప్రశాంత వాతావరణంలో 14 ఎకరాలలో విస్తరించి ఉన్న చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఈ స్మశాన వాటిక ఇప్పటికీ వాడుకలో ఉంది.
సెమెట్రీ నిర్వాహకులు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, సర్ ఆర్థర్ కాటన్ సమాధి వద్దకు తీసుకువెళ్ళి చూపారు. కాటన్ సమాధి గురించి, అక్కడవున్న ఇతర పెద్దల సమాధుల గురించిన వివరాలతో కూడిన బుక్లెట్‌ను అందజేశారు. అందులో సర్ ఆర్థర్ కాటన్ గురించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
"జనరల్ సర్ ఆర్థర్ కాటన్ బర్మా యుద్ధంలో ప్రశంసనీయమైన సేవలందించిన పిమ్మట, తన శేష క్రియాశీల జీవితాన్నంతా భారీ నీటిపారుదల ప్రాజక్టులు, ఆనకట్టలు, వంతెనలు, చెరువులు, నీటిపారుదల కాలువలు నిర్మించడంలో భారతదేశంలోనే గడిపారు. “నీటిపారుదల కాటన్” గా ఈయన పేరు భారతదేశమంతటా ఈ రంగంలో సాధికారికతను సంతరించుకోవడమే కాక, ఈయన పథకాలన్నీ అత్యంత లాభదాయకమైనవిగా ప్రభుత్వంచే గుర్తింపు పొందాయి. నీటి పారుదల పథకాలపై ఆయనకు గల అత్యుత్సాహం మూలంగా రైల్వేల వంటి ఆధునిక వనరుల ప్రయోజనాన్ని గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. భవిష్యత్తులో సంపద అభివృద్ధి అంతా నీటి కాలువల పైనే ఆధారపడి ఉంటుందని ఆయన దృఢంగా విశ్వసించారు. "మస్తిష్కంలో జలంతో బాధపడుతున్న ఏకలక్ష్య వ్యక్తిగా" ఆయనను కొందరు విమర్శకులు అభివర్ణించేవారు.
సర్ ఆర్థర్ కాటన్ తన విశ్రాంత జీవితాన్ని గడపడానికి డార్కింగ్ పట్టణానికి చేరుకుని, 1870 సంవత్సరాంతం వరకు తూర్పు హ్యారో రోడ్‌లోను, ఆ తరువాత టవర్ హిల్ రోడ్‌లోని ఉడ్ కాట్ (ఇక్కడ ప్రస్తుతం గార్డ్ నర్సింగ్ హోం నడుస్తున్నది) లోను ప్రశాంతమైన జీవితం గడిపారు. ఇక్కడ కూడ ఆయన వ్యవసాయరంగంలో మెరుగైన పద్ధతులు ప్రవేశపెట్టడానికి, ముఖ్యంగా లోతుగా నేలను దున్ని చేసే సేద్యం గురించి ఎంతో కృషి చేశారు. అయితే, భూమిని దున్నడానికి ఆయన ప్రత్యేకంగా రూపొందించిన పొడవైన పళ్ళను పోలిన పరికరాల పట్ల స్థానిక కార్మికులలో ఏర్పడ్డ అపోహల మూలంగా ఈ ప్రయత్నం విజయవంతం కాలేక పోయింది. రిక్షా వంటి మూడు చక్రాల వాహనంలో తిరుగుతూ, ఆయన చేసిన ధార్మిక ప్రచారాల మూలంగాను, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల మూలంగాను పట్టణంలో అందరికీ ఆయన సుపరిచితుడైనారు. తన అవిశ్రాంత కృషే. తన ధీర్గాయువు యొక్క రహస్యమని ఆయన అనేవారు.
డార్కింగ్ పట్టణంలోని శ్రామికులను వారి పని వేళల్లో బీరు త్రాగే అలవాటు నుంచి మాన్పడానికి ఆర్థర్ కాటన్ వంటింట్లో తయారు చేసుకోవడానికి వీలైన ఒక రకం సూపును రూపొందించి ప్రచారం చేశారు. ఆయన అంత్యక్రియలు 30 జూలై 1899న డార్కింగ్ పట్టణం స్మశానవాటికలో పాక్షికమైన సైనిక లాంఛనాలతో జరిగాయి. "ది క్వీన్స్" అనబడే రెండవ వాలంటీర్ బ్రిగేడ్‌కు చెందిన సైనిక దళం ఒకటి శవయాత్రకు ముందు నడిచి, సమాధి మీదుగా తుపాకులు పేలుసూ, సైనిక వందనం చేసింది. రివరెండ్ జి.పి. క్విక్ ఆఫ్ డగ్లస్, కార్క్ రెవరెండ్ ఎఫ్.ఇ. ఆల్డ్ క్యూరేట్ ఆఫ్ సెయింట్ మేరీస్ డెవోన్స్ పోర్ట్ అంత్యక్రియలకు హాజరైనారు. ఆయన శవపేటికను ఆయన ఉపయోగించిన ఖడ్గంతోను, రాయల్ ఇంజనీర్స్ సమర్పించిన పుష్పగుచ్ఛంతోను అలంకరించడం జరిగింది.
కాటన్ నివసించిన ఇంటి గురించి సెమెట్రీ నిర్వాహకులనడుగగా, ఇప్పడు ఆ ఇంట్లో గార్థ్ నర్సింగ్ హోం ఉన్నట్లు చెప్పారు. ఒక టాక్సీని పిలిచి మమ్మల్ని అక్కడకు పంపారు. సర్ ఆర్థర్ కాటన్ నివసించిన ఆ ఇల్లు చాలా అందమైన భవనం. పూర్తిగా టేకు చెక్కతో నిర్మితమైంది. అందులో ఇప్పుడు "గార్థ్ హోం" పేరిట వృద్దుల శరణాలయం నడుస్తున్నది. 1949లో బ్రిటీష్ రాణి వ్యక్తిగత వైద్యుడు లార్డ్ హార్డెన్ దీనిని స్థాపించాడు. ఈ భవనం విశాలమైన పచ్చిక బయళ్ళతోను, ఎత్తైన రకరకాలు వృక్షజాతులతోను, పూల చెట్లతోను అలరారుతున్నది. డార్కింగ్ పట్టణంలో పోస్టాఫీసు, బ్యాంకులు, షాపింగ్ స్థలాలు వంటి అన్నీ ముఖ్యమైన ప్రదేశాలకు ఈ భవనం అతి చేరువలో వుంది. ఈ నర్సింగ్ హోం అక్కడి వృద్దులకు ప్రశంసనీయమైన సేవలందిస్తున్నది.
సర్ ఆర్థర్ కాటన్ సేవలన్నీ కూడా భారతదేశానికే పరిమితం కావడంతో, బ్రిటన్లో ఆయనకు ఒక సైనికాధికారిగానే తప్ప వేరే గుర్తింపులేదు. ఆయన స్మృతి చిహ్నాన్ని చూడటానికి సెమెట్రీకి వెళ్ళగా అక్కడివారు ఆశ్చర్యపోయారు. "మేము రెండు పూటలా భోజనం చేయడానికి ఆ మహానుభావుడే కారణమనీ, అందుకే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి ఇంత దూరం వచ్చామనీ వారికి తెలియజేశాను. కాటన్ సమాధిని సందర్శించడానికి ఇంతకు పూర్వం వెళ్ళినవారి గురించి తెలియదు కానీ, మేము మాత్రం ఆ మహానుభావుడికి తెలుగు జాతి పక్షాన, ప్రత్యేకించి కృష్ణా గోదావరి డెల్లా వాసుల పక్షాన శ్రద్ధాంజలి ఘటించినందుకు ఆనందించాము.
రాబర్ట్ చార్లెస్ కాటన్ రాష్ట్ర పర్యటన
మేము లండన్ పర్యటన ముగించుకుని తిరిగివచ్చిన తరువాత కాటన్ సమాధి సందర్శన గురించి పత్రికలలో వార్తలు చూసిన ముఖ్యమంత్రి డా॥ వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు మమ్మలను పిలిపించి కాటన్ వారసులెవరైనా ఉంటే వారిని మన రాష్ట్రానికి ఆహ్వానించి సత్కరిద్దామని చెప్పారు.
కాటన్ శత వర్ధంతి సందర్భంగా కాటన్ మునిమనుమడు ఛార్లెస్ రాబర్ట్ కాటన్ మన రాష్ట్రానికి వచ్చినట్లు గుర్తు. అయితే వారి చిరునామా మాకు లభ్యం కాలేదు. డా॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పట్టువదలని విక్రమార్ముడిలా ఇంగ్లాండులోని ఒక ప్రైవేటు ఏజన్సీ ద్వారా చార్లెస్ రాబర్ట్ కాటన్ చిరునామా సేకరించి మరలా ఇంగ్లాండు వెళ్లి హెన్లీ-ఆన్ -థీమ్స్‌లో వారి నివాసంలో కలసి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారి ఆహ్వానాన్ని అందజేశారు.
సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తిగ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పెండింగ్ ప్రాజక్టుల నిర్మాణానికి "జలయజ్ఞం" ప్రారంభించారు రాజశేఖరరెడ్డిగారు.
బృహత్తరమైన జలయజ్ఞాన్ని ప్రారంభించిన డా॥ రాజశేఖరరెడ్డిని కొనియాడుతూ భారత ప్రధాని డా॥ మన్మోహన్ సింగ్ 'అభినవ కాటన్"గా అభివర్ణించారు. రాబర్ట్ సి. కాటన్‌ని ఆహ్వానిస్తూ జులై 29, 2009న డా॥ రాజశేఖరరెడ్డిగారు వ్రాసిన లేఖ ఈవిధంగా ఉంది.
ప్రియమైన కాటన్ గారికి,
ప్రఖ్యాత ఇంజనీరు స్వర్టీయ సర్ ఆర్థర్ కాటన్‌గారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయదారులకు వరప్రసాదం లాంటి నీటి
వారిచ్చిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "జలయజ్ఞం" పేరుతో నీటి పారుదల అభివృద్ధికి ఒక ప్రతిష్టాత్మకమైన బృహత్ ప్రణాళికను చేపట్టింది. ప్రణాళిక మూలంగా కోటి పదిహేను లక్షల ఎకరాల భూమి అదనంగా సాగుకు వస్తుంది. ఇందులో భాగంగా భారీ, మధ్యతరహా నిర్మాణం క్రొత్తగా చేపట్టడమే కాక, ఇప్పటికే ఉన్న నీటి వనరులను ఆధునీకరించడం జరుగుతున్నది. దీని మూలంగా వ్యవసాయోత్పత్తులు అపారంగా పెరిగి, రైతుల పరిస్థితి మెరుగు పడటమే కాక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సర్వతోముఖంగా అభివృద్ది చెందగలదని ఆశిస్తున్నాము.
సర్ ఆర్థర్ కాటన్ నీటిపారుదల విషయంలో ఈ రాష్ట్రానికి చేసిన గణనీయమైన కృషికి గుర్తుగా వారి పేర 2009 నవంబర్ / డిసెంబర్ మాసంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. సర్ ఆర్థర్ కాటన్ వంశానికి చెందిన మిమ్మల్ని వారి వారసులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ఆహ్వానిస్తున్నాను.
దీనిని నా వ్యక్తిగత ఆహ్వానంగా కూడా భావించి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాదు నగరానికి విచ్చేసి, రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఈ చారిత్రాత్మక సన్నివేశంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తోడ్పడవలసిందిగా అభ్యరిస్తున్నాను.
గౌరవాభినందనలతో,
మీ
వై.యస్. రాజశేఖరరెడ్డి
డా॥ రాజశేఖరరెడ్డిగారి అభిలాష మేరకు సర్ ఆర్థర్ కాటన్ మునిమనుమడు శ్రీ చార్లెస్ రాబర్ట్ కాటన్‌ని ఆహ్వానించి అనుకున్న ప్రకారం కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య ఆదేశించారు. భారీనీటిపారుదల శాఖామంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మితమవుతున్న ప్రాజక్టులను చార్లెస్ రాబర్ట్ కాటన్‌కు చూపించి సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తీరుని వారికి తెలియజెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు.
2009 నవంబరు నెలలో 10 రోజుల పాటు చార్లెస్ రాబర్ట్ కాటన్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా రాష్ట్రమంతటా పర్యటించారు. గండికోట ప్రాజెక్టు నిర్మాణాన్ని చూసి, ఇడుపులపాయకు వెళ్లి, దివంగత రాజశేఖరరెడ్డిగారికి శ్రద్ధాంజలి ఘటించి,పులిచింతల ప్రాజెక్టును సందర్శించి, విజయవాడలో కృష్ణా డెల్లా రైతాంగ సన్మానాన్ని స్వీకరించారు. కాటన్ దంపతులు ఆ పిమ్మట గోదావరి బ్యారేజిని చూసి, రాజమండ్రిలో సన్మానం పొందారు. విశాఖపట్నంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన చర్చిని సందర్శించి, విశాఖవాసుల ఘన సన్మానాన్ని అందుకున్నారు. యల్లంపల్లి ప్రాజెక్టు సందర్శించి, హైదరాబాదు నగరంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వారి సత్కారం అందుకున్నారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ నారాయణ్ దత్ తివారిగారిని, ముఖ్యమంత్రి & శ్రీ కె. రోశయ్యగారిని కలిసి, వారిచే ఘన సత్కారాలను అందుకుని, రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి సర్ ఆర్థర్ కాటన్ పట్ల ఈనాటికీ గల చెక్కుచెదరని గౌరవాదరాలను ప్రత్యక్షంగా తిలకించి అబ్బురపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల శాఖ పక్షాన మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య ఘన సన్మానం చేసి, భారీ విందు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనంతటికీ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. సర్ ఆర్థర్ కాటన్ మునిమనుమడు చార్లెస్ రాబర్ట్ కాటన్ "ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్" సభ్యత్వ గౌరవాన్ని పొందారు. 1925 డిసెంబరు 31వ తేదీన ఇంగ్లండ లో లివర్‌పూల్‌లో ఆయన జన్మించారు. డెర్బీషైర్‌లోని రిప్టన్ స్కూలులోనూ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన మెక్‌డవిన్ కాలేజిలోను చదివి, మెకానికల్ సైన్సెస్ మరియు సివిల్ ఇంజనీరింగులో రోస్టర్ డిగ్రీ పొందారు. నేషనల్ కమిషన్డ్ రాయల్ ఇంజనీరింగు పక్షాన 1946-48 సంవత్సరాల మధ్య భారతదేశంలోను, పాలస్తీనాలోను పనిచేశారు. ఇంటర్నేషనల్ ప్యాకింగ్ కంపెనీ, మెటల్ బాక్స్‌లో వివిధ హోదాలలో పనిచేసి, 1933 సంవత్సరంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పదోన్నతి పొందారు. 1952-54 సంవత్సరం మధ్య మెటల్ బాక్స్ కంపెనీ కలకత్తా కార్యాలయంలో పనిచేశారు. వీరి భార్య శ్రీమతి నికోలెట్ ఆనీకన్లీవ్. వీరికి నలుగురు పిల్లలు, 13 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. ఉద్యోగ విరమణానంతరం సమాజ సేవలో తమ జీవితాన్ని గడుపుతున్నారు. చార్లెస్ రాబర్ట్ కాటన్ 84 సంవత్సరాల వయసులో రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా మన రాష్ట్రంలో పర్యటించడం హర్షదాయకం.
చార్లెస్ రాబర్ట్ కాటన్ దంపతుల పర్యటనలో సర్ ఆర్థర్ కాటన్ పట్ల తెలుగు ప్రజలకున్న ఆరాధనాభావం అడుగడుగునా వ్యక్తమయింది. మా లండన్ పర్యటన ఫలితంగా ఈ కార్యక్రమం ఈ విధంగా రూపుదిద్దుకోవడం మాకెంతో సంతృప్తి నిచ్చింది.
★★★