వరాహపురాణము/పంచమాశ్వాసము

పంచమాశ్వాసము

క.

శ్రీరమణప్రతిపాదక | వారాహపురాణతత్త్వవార్తాశ్రవణో
దారపరితోషచిత్తస! మారోపితపులక! యెఱ్ఱయప్రభుతిలకా!

1


వ.

ఆకర్ణింపుము. ఇట్లు రోమశుండు మార్కండేయునకుఁ బరమపవిత్రంబగు శ్రీకృష్ణ
చరిత్రంబు వినిపించి, పరమానంద[1]వికసితముఖారవిందుం డగుచు మఱియు నిట్లనియె.

2

కర్మయోగక్రమము

తే.

కారణంబగు పుష్పంబు, కార్యమైన | ఫలము పెనుపొందఁ, దాఁ జెడు పగిది [2]నొందుఁ;
గారణంబగు కర్మంబు, కార్యమైన | బోధ మొదవినఁ, దాఁ దెగిపోవు ననఘ!

3


సీ.

అనుపనీతునకుఁ జెప్పినయట్టి ధర్మంబు | బ్రహ్మచారికి నది పనికిరాదు,
బ్రహ్మచారికి నొనర్పఁగ నొప్పు ధర్మంబు | గృహమేధులకు నాచరింపరాదు,
గృహమేధియోగ్యమై [3]మహి మించు ధర్మంబు | వనవాసి చేయుట యనుచితంబు,
వనవాసివిహితమై తనరిన ధర్మంబు | సన్యాసులకుఁ బూని జరుపఁ[4]జనదు,


తే.

అట్టి [5]సన్యాసయోగంబు లాత్మలోనఁ | బాదుకొనుదాఁక, [6]నధికారి భేదమునను
వేదములు కర్మయోగంబు విస్తరించు, | [7]నమలసుజ్ఞానఫలసమవాప్తికొఱకు.

4


క.

వేదోక్తకర్మయోగస | మాదరణాభ్యాసజనితహరితత్త్వజ్ఞా
నోదధి యగు యోగీంద్రుఁడు, | మోదంబున నంతరంగముఖమగు నాత్మన్.

5

జ్ఞానయోగవిధానము

సీ.

చూచునట్లన చూచుసొరిది బాహ్యార్థముల్, | [8]దర్శనస్మృతి నాత్మఁ దగులనీఁడు;
వినినయటన విను వేదాదిరవముల, | నాకర్ణన[9]స్మృతి నాత్మ నిడఁడు;
పలికినట్లన పల్కుఁ బరులతో నేర్పున, | భాషణస్మృతి నాత్మఁ బఱపికొనఁడు;
అంటినట్లన యంటు [10]నఖిలవస్తువు, లెల్ల | స్పర్శనస్మృతి నాత్మఁ బట్టువఱుపఁ;


తే.

డీవిధంబునఁ గర్మంబులెల్ల వదలి | నిరుపమజ్ఞానభరితుఁడై పరమయోగి,
భక్తిఁ బరమాత్మఁ దనమదిఁ బాదుకొలిపి, | మఱచు బాహ్యప్రపంచంబు మౌనితిలక!

6

సీ.

చాంద్రమానమున మాసము నిండ, నది యొక్క | దివసమై చనుఁ బితృదేవతలకు,
దినములు పితృమాసమున నెన్న మున్నూట | యఱువది యొక యబ్ద మమర[11]తతికి,
దేవమానంబున దివ్యవర్షంబులు | పండ్రెండువేలైనఁ బరగ యుగము,
పరువడి [12]నేకసప్తతిమహాయుగములు | చింతింప నొక్కమన్వంతరంబు,


తే.

రమణఁ బదునాల్గుమన్వంతరములు చనిన | నబ్జభవునకు నొకదిన, మందులోన
నవతరించును భూభార మణఁప శౌరి | మీనకూర్మాదిరూపసమేతుఁ డగుచు.

7

హరినామమహత్త్వము

ఉ.

జిహ్మగసార్వభౌముఁడు, శచీరమణుండును, బంకజాసన
బ్రహ్మతనూజులుం, గమలబాంధవులున్, హరి నాద్యు నీశ్వరున్
బ్రహ్మకు జన్మహేతువుగఁ బ్రస్తుతి సేతురు గాని, కేవల
బ్రహ్మము విశ్వకర్త యని భావమునం దలపోయ రజ్ఞతన్.

8


క.

హరినామస్మరణంబునఁ | బరిహృతమౌ వానిదురితభారంబుఁ, బ్రభా
కరతేజస్స్ఫురణంబునఁ | గర మరుదుగఁ జెడని యంధకారముఁ గలదే?

9


క.

సురలోకసతతసన్నుత | [13]చరితుండును, దైత్యతిమిర[14]చండాంశుఁడు స
త్పురుషహృదయాలయుఁడు నగు | హరికన్నఁ దదీయనామ మధికం బనఘా!

10


మ.

ఉపవాసంబులఁ, దీర్ఘసేవనములన్, యోగావధానంబులన్,
జపహోమవ్రతచర్యలం, దపములన్, సన్యాసకృత్యంబులన్,
విపులక్లేశము నొందు సజ్జనులకున్, విష్ణుండు [15]నీలేని మో
క్షపదం బిచ్చుఁ దదీయనామము, సకృత్సంకీ ర్తిమాత్రంబునన్.

11


క.

శ్రీహరినామోచ్చారణ | మాహాత్మ్యముఁ గలుగఁబట్టి, మానవు లఘసం
దోహములఁ బాసి పొందుదు | రైహికసుఖపారలౌకికానందములన్.

12

చ.

విను, మునినాథ! పూర్వమున వీప్రుఁ డోకండు కృతాంతువీటికిం
జని, హరినామ మొక్కపరి సంస్తుతి చేసిన, నాలకించి, త
ద్ఘన[16]సుకృతంబుఁ జేసి, నరకస్థితు లాక్షణ[17]మందు ముక్తులై
రనుడు, మృకండునందన మహాముని రోమశుతోడ నిట్లనున్.

13


క.

ధరణీసురుఁ డెట్లరిగెను | నరకస్థలి? కతఁడు విష్ణునామము నుడువన్,
నరకస్థితు లది విని, హరి | పురమున కేరీతిఁ జనిరి? భూసురతిలకా!

14


వ.

అనిన మార్కండేయునకు రోమశుం డిట్లనియె.

15

శివశర్మోపాఖ్యానము

క.

మునివల్లభ! పుష్పావతి | యన నోక్కపురంబు ధాత్రి కవతంసంబై
తనరారుచుండుఁ, దత్పురి | యనుపమవిభవంబు పొగడ నజునకు వశమే?

16


సీ.

పార్వతీశ్వరుభాతి భాసిల్లు నప్పురి | హేమ[18]వప్రములు మిన్నేఱు మోచి,
హరిరీతిఁ బొల్చు నప్పురి[19]పరిఖాశ్రేణి | తనలోన భువనసంతతులఁ బూని,
యంబుజాసనుమాడ్కి నలరు నప్పురిగోపు | రములు హిరణ్యగర్భత వహించి,
యబ్ధి కైవడి నొప్పు నప్పురి రాజమా | ర్గము వాహినీ సహస్రముల [20]బెరసి,


తే.

సిరుల [21]పుట్నిల్లు, సౌభాగ్యగరిమ [22]వెంట, | మంగళంబుల టెంకి, ధర్మముల నెలవు ,
వినుత సర్వార్థనిలయంబు ననఁ, ద్రిలోక | భాసురంబగు నమ్మహాపట్టణమున.

17


మ.

చతురామ్నాయవిశారదుం, డఖిలశాస్త్రగ్రంథనిర్ణేత, [23]
త్క్రతునిర్దూతసమస్తకల్మషుఁడు, రాగద్వేషదూరుండు, సు
వ్రతుఁ డొప్పున్, శివశర్మనా, ధరణిదేవశ్రేష్ఠుఁ, డాసద్గుణా
న్నతచర్యుం డొకనాఁడు ప్రొద్దున నుషస్స్నా[24]నార్థియై యేటికిన్.

18


తే.

చని, కృతస్నానుఁడై కాల్యసమయకర్మ | పటల మొనరించి, భాస్కరోపాస్తి [25]చేసి,
కుశసమిత్ఫలమూలముల్ గొనుచు మగిడి | పురికిఁ జొత్తెంచునప్పు డాతిరువుపొంత.

19

చ.

ప్రియనవపత్రసాంద్రమగు పిప్పలభూజముక్రింద, వాలుకా
శయనమునందు, నప్పు డటు సంభవమొందిన పిన్నపాపనిన్
[26]బయలునఁ గాంచి, యాతఁ డనపత్యుఁడు గావున, భక్తితోఁ గర
ద్వయమున నెత్తి తెచ్చి, నిజధామముఁ జేర్చి, దయార్ద్రచిత్తుఁడై.

20


క.

శీలుండని పేరిడి, యా | బాలకునిం దాది పెట్టి పరిపోషింపం,
గాలక్రమమున నతనికి | నాలో యౌవనము వొడమ, నట విప్రుండున్.

21


వ.

అక్కుమారుని జాతి నిర్ణయింప లేమింజేసి, కృషి[27]పాశుపాల్యంబులయందు నియుక్తునిం
జేసిన, నతండును దత్కర్మంబుల నప్రమత్తుండై వర్తింపుచుఁ, దన్మందిరంబులు ధనధాన్య
[28]పూరితములుగా నొనరింపుచు, నా విప్రదంపతులయెడఁ బితృబుద్ధి గావింపుచు , జౌర్య
మాయాదిరహితుండై, నిర్మలభక్తియుతుండై, పనులయందు సావధానుండై, తద్గృహంబునఁ
బ్రవర్ధమానుండయ్యె. తద్భూసురాంగనయు నతనియందుఁ బుత్రస్నేహం బంగీకరించి,
మృష్టాన్నంబులం బరితృప్తి యొనర్చుచునుండె. ఇట్లు కొన్నిసంవత్సరంబు లరుగునంత.

22


చ.

సతతము నామహీవిబుధసాధ్వి, కుమారులు లేక , దారుణ
వ్రతములు, దేవపూజ లుపవాసములున్, బహుదానధర్మముల్
హితమతిఁ జేసి, ప్రాయ మొకయించుక జాఱఁగ, గొడ్డు [29]వీఁగి, య
ద్భుతముగఁ గాంచెఁ బూర్వకృతపుణ్యఫలంబున నొక్కకన్యకన్.

23


తే.

పద్మదళనేత్రి, సౌందర్యభరితగాత్రి, | బాల తనభార్య కిట్లు సంభవము నొందఁ
గాంచి, శివశర్మ దానికి గ్రహము లైదు | నిధనమున నున్న, నేష్యంబు నిర్ణయించి.

24


చ.

మనమున ఖేదమంది నిజమానిని కిట్లను, నో లతాంగి! యీ
తనయకు వల్లభుం డగునతండు మహామహుఁడయ్యు, నేడునా
ళ్ళన జమువీటికిం జనఁగలం డిది తప్పదు, పూర్వజన్మమం
దొనరిచినట్టి కర్మఫల మూరకపోవునె యెంతవారికిన్?

25

ఉ.

నావుడు, భూసురాంగన మనంబున శోకము నొంది 'యక్కటా!
దైవ మనేకకాలము వ్రతంబులు [30]బాసగ నీయఁబోయి, నా
కీ వర మెట్లొసంగెఁ? బతిహీనత నొందిన బిడ్డఁ జూచి, నా
జీవము నిల్చునే?' యనుచుఁ జింతిలి, పొక్కుచు నుండు నంతటన్.

26


క.

భూసురవరుఁ డాకన్యకు | వాసవి యని పేరు పెట్టి వావిరి పెనుపం
గా, సప్తవత్సరంబులు | భాసురగతి నరుగఁ, బెండ్లిప్రాయం బైనన్.

27


చ.

[31]వరుఁ గొనివచ్చి, పుత్రిని వివాహము చేసెద నంచు భూసురుం
డరయుచు . బ్రహ్మతీర్థతటమందు విహారపురంబు చేరి, కే
సరుఁ డను విప్రనందను, రసజ్ఞు, నధీతసమస్తవేదు, న
ప్పురమునఁ గాంచి, [32]పిల్చుకొని పోయి, నిజాత్మజఁ బెండ్లి చేసినన్.

28


తే.

కనినవా రెట్లు బ్రదికిరో మునివరేణ్య! | విన్నవింపంగ నోరాడకున్న దిపుడు;
వాసవీభర్త దారుణజ్వరము దాఁకి | తనువుతోఁ బా సె నేడవదినమునందు.

29


క.

అతఁ డిట్లు శమనమందిర | గతుఁడగుటయుఁ, బారలౌకికంబులు శాస్త్రో
[33]చితసరణిఁ దీర్చి, భూసుర | పతి సతియును [34]దాను వగల పాలై రనఘా!

30


ఉ.

భవ్య[35]నివాసహేతువగు ప్రాయ మొకించుక యంకురింప, భో
గవ్యవహారయోగ్యమగు [36]కాలమునంద యనుంగుబిడ్డ వై
ధవ్యము నొందెనేనిఁ దలిదండ్రులయేటికి, దానిఁ గన్నచో
నవ్యయదుఃఖసాగరమునందు మునుంగరె వీత[37]రాగులున్?

31


తే.

ఇట్లు పతిహీనయైన యాయిగురుఁ[38]బోణి | కబ్దములు కొన్ని చన్నఁ, బ్రాయంబు వొడమె;
రసము చవిగొను రాజకీరంబు లేని | చూతలతికకు సఫలతాఖ్యాతివోలె.

32

శీలుని యుత్తమశీలము

ఉ.

వాసవి యట్లు యౌవనభవంబగు దర్పముఁ జెంది యిక్షుబా
ణాసనబాణభిన్నహృదయాంబుజయై, ధృతి నిల్పలేక, కే
ళీసుఖకాంక్షఁ దన్నుఁ గదలింపఁగ, శీలునియింటికిం దమి
స్రాసమయంబునందు నభిసారికయై రయమార నేఁగినన్.

33

ఉ.

శీలుఁడు దానిరాకఁ గని, చిత్తమునం బరితాప మొంది, యా
బాలిక మన్మథార్త యగుభావముఁ గల్గొని, పల్కెఁ దల్లి! నీ
వేలరు దెంచితిట్లు? మన [39]యిద్దఱికిన్ శివశర్మ తండ్రి, దు
శ్శీలము మాను, నా యనుఁగుఁ[40]జెల్లెల, వీ విధి నీకు ధర్మమే?

34


చ.

ఉడుగుము పాపబుద్ధి, యిది యెప్పదు, మానఁగఁజాలవేని యి
ప్పుడె చని, యన్యపూరుషుని బొంది భయంకరరౌరవాగ్నిలోఁ
దొడిఁబడఁ గూలి, నీ దురిత[41]దుష్టఫలంబు [42]భుజింతు గాని, యిం
పెడలఁగ నన్నునుం జెఱుపనేటికిఁ జూచెదు విప్రకన్యకా!

35


చ.

నిమిషసుఖర్థమై కులము నీఱుగఁ [43]జేసి, దురాత్ము లబ్బినం
దమకముతో రమించి, నిజనాథుని రౌరవమందుఁ ద్రోచి, [44]యు
త్తములగు నత్త మామ [45]దలిదండ్రులకుం దలవంపు చేసి, మా
న మెడలి, మన్మథజ్వరమునం జెడిపోదురు దుష్ట కామినుల్.

36


చ.

సుజనునకైన, దుర్గృహము చూచిన దారుణలగ్నమందు, నా
త్మజు లుదయించిరేనిఁ బితృధర్మము వారికిఁ గల్గదన్న స
ద్విజవచనంబు తప్ప' దని వేమఱు కర్ణయుగంబు పాణి పం
కజముల మూసికొంచు, నెసకంబున వెండియు దాని కిట్లనున్.

37


తే.

'తల్లీ! నీ వింక నిచ్చటం దడవు నిల్వం | జనదు పోపొమ్ము' నావుడు, మనసులోన
నతివ లజ్జించి, [46]కోపాకులాత్మ యగుచు | మొక్కలంబునఁ బితృగేహమునకు నరిగి.

38


చ.

కనుగవ కింపొనర్చు నుపకాంతుని, దుష్కులజాతునైనఁ బై
కొని, రతిబంధభేదములఁ [47]గూడి రమింపుచునుండి, బంధకీ
జనమణి యొక్కనాఁడు విషసమ్మిళితాన్నము పెట్టి చంపి స
జ్జననుతశీలునిన్, గుణవిశాలుని, శీలుని, బుణ్యలోలునిన్.

39

మ.

అకలంకుం డతఁ డిట్లు చన్న, శివశర్మాఖ్యద్విజుం డౌర్ధ్వదై
హికముల్ వానికి, దీర్చి, యాత్మసతితో నింతింత[48]నారాని మ
చ్చిక దుఃఖింపుచునుండె, నంతటను నాశీలుండు భూదేవగే
హకృతాహారపవిత్రభోజనభవం బైనట్టి పుణ్యంబునన్.

40


చ.

అనుపమదివ్య దేహధరుఁడై వరపుష్పక మెక్కి, నిర్జరీ
జనములు గొల్వఁగా, నమరసద్మము చొచ్చిన, వాని భానుమ
త్తనయుఁడు గాంచి, తత్పతిహితత్వగుణంబున కుత్సహించి, యా
యనఘుని, నాత్మకింకరనియామకుఁగా నధికారిఁ జేసినన్.

41


క.

అతఁడును దాని కొడంబడి | ప్రతిదినమును శమనకింకరవ్రాతముతో
క్షితికిం జని భౌతికతను | గతులగు ప్రాణులను విలయకాలజ్ఞుండై.

42


చ.

కొని చనుచుండి యుండి, యొకకొన్ని[49]దినంబులు చన్నమీఁద, నా
జననుతుఁ డొక్కనాఁడు శివశర్మఁ గనుంగొని, [50]చేరఁబోయి వం
దన మొనరించి, శీలుఁడను నామము చెప్పిన, వానిఁ జూచి యా
ఘనుఁడు ప్రమోదమొంది, నునుఁగౌఁగిట జేర్చి, మృదూక్తి నిట్లనున్.

43


ఉ.

[51]‘ఎచ్చటనున్న వాఁడ విటు లిన్నిదినంబులు? నిన్నుఁగూడి యా
వచ్చినవార లెవ్వ? రనివారితదివ్యశరీర మేఘనుం
డిచ్చెను? నిన్ను భృత్యునిగ నేలిన దేవవరేణ్యుఁ డెవ్వఁ? డీ
యచ్చెరు వంతయుం దెలుపు మాత్మజ! నాయెడ భక్తి గల్గినన్'.

44


వ.

అని పలికిన శివశర్మకు శీలుం డిట్లనియె.

45


సీ.

భూసురోత్తమ! నీవు పుణ్యాధికుండవు | సత్యసంధుండవు సర్వసముఁడ
వగుట, నీగేహంబునందుఁ బతివ్రతా | రత్నంబు భవదీయరాజవదన,
ననుఁ బుక్రవాత్సల్యమున నియోగింపుచు | [52]ననువాసరంబు నిష్టాన్న మొసఁగ
భుజియించుకతన నేఁ బుణ్యుండనై యుండ, | నంత, నీపుత్రిక యధికరోష

తే.

కలితమానస యగుచు నకారణంబ | విషమువెట్టిన దేహంబు విడిచిపోవ,
శమనుఁ డాత్మీయకింకరస్వామిఁ జేసి | భక్తిఁ బనిగొంచు, నను నేఁడు పనిచె నిటకు.

46


క.

ఇచ్చటి ధరణీపాలుం | [53]డచ్చలమున వేఁటవెడలి [54]యధికపిపాసం
జచ్చు నిఁక, నతనిఁ గొనిపో | వచ్చి, నినుం జూడఁగంటి వర్ణితపుణ్యా!

47


వ.

అని చెప్పి, భూసురాన్నభోజనపుణ్యాతిరేకంబున దివ్యదేహంబు గలుగుటయుఁ ,
దనుఁ గూడవచ్చినవారలు యమకింకరు లనియు నెఱింగించిన, శివశర్మ ప్రముదితుం డగుచు,
శీలుని కర్ణంబు డాసి, మంతనంబున నిట్లనియె.

48


క.

ఈకాయముతోడనె సుర | లోకంబును, బ్రేతరాజులోకముఁ జూడన్
[55]నాకుం గాంక్ష యుఁ బొడమె, న | శోకగతి న్వాని రెంటిఁ జూపుము [56]పుత్రా!

49


చ.

అనవుడు, 'భూసురేంద్ర! నిను నంగముతోఁ గొనిపోవరాదు, నీ
తను వొకచోట దాఁప నుచితంబగు యత్నము సేయు, మంత నా
జనపతిఁ గాలకింకరవశంబున మీఁదికి నంపి వత్తు నే'
నని యెఱిఁగించి, శీలుఁడు రయంబునఁ బోయెఁ దిరోహి[57]తాత్ముడై.

50


శా.

ఆలోఁ దత్పురనాయకుండు మృగయావ్యాసక్తి నానాచమూ
జాలంబు ల్గొలువంగఁ గానలకు నిచ్ఛావృత్తిమై నేఁగి, శా
ర్దూలాదిమృగంబులన్ శితశరస్తోమంబునం దున్ని, యు
ద్వేలగ్రీష్మము దాఁకి నొచ్చి, మృతిఁ బొందెన్ దైవయోగంబునన్.

51


ఉ.

భూపతి యిట్ల కాలగతిఁ బొందిన, శీలుఁడు దివ్యయానసం
స్థాపితుఁ జేసి, కింకరవశంబున మీఁదికి నంపి, సత్యవా
చాపరతంత్రబుద్ధి శివశర్మగృహంబున కేఁగుదెంచి, త
ద్దీపితగాత్ర మొక్కబిలదేశమునందు సురక్షితంబుగన్.

52


క.

పదిలంబు చేసి, యాభూ | త్రిదశేంద్రుని నొక్కదివ్యదేహములోనన్
ముదమున నిడుకొని చని యం | బుదమార్గము గడచి, వినయమున నిట్లనియెన్.

53

శివశర్మ నరకలోకసందర్శనము

క.

[58]ఈతెరువు శమనపురికిని | నీతెరువు సురేంద్రపురికి నేఁగును భువన
ఖ్యాత గతి నిందులో నీ | కేతెరువు రుచించు నంద యేఁగుద మనఘా!

54


క.

అని శీలుఁ డిట్లు పల్కిన | విని విప్రుఁడు నరకలోకవీక్షా[59]పేక్షన్
మును శమనపురికి నరుగుద | మని, శీలుఁడుఁ దానుఁ జనుచు నటఁ గట్టెదురన్.

55


సీ.

దావాగ్ని బహుశిఖాతప్తులై వాతెరల్ | దడుపుచు నోళ్లెండి పడినవారు,
దారుణకింకరోత్కరతాడితాంగులై | మొఱలువెట్టుచు నేలఁ బొరలువారు,
నిటువంటి పాపంబు లేల చేసితి మని | కుందుచుఁ దముఁ దిట్టుకొనెడువారు,
మృదుపాదములు గాఁడి మీఁగాళ్ళు వెడలిన | వాఁడిముండ్లను [60]నొచ్చి వణఁకువారు


తే.

నగుచుఁ, దెరువున యాతనాప్రాప్తులైన | విప్రహంతల, దేవతావిత్తహరులఁ,
బరవధూసంగసహితులఁ, బాప[61]రతుల | నద్భుతంబునఁ గనుఁగొంచు నరిగి యరిగి.

56


వ.

అట ముందట, శస్త్రధారావిదారితంబులగు దుర్జనజిహ్వాఖండంబులవలనను,
నిస్త్రింశదళితంబులగు వేదబాహ్యజనగళంబులవలనను, శూలప్రోతంబు లగు గురునిందక
వక్షస్స్థలంబులవలనను, గదాఘాతశకలితంబులగు విప్రదూషకమస్తకంబులవలనను,
నిర్గళితంబులగు రక్తమాంసమేదోమజ్జాదులచేతం బంకిలంబై, తత్పూతిగంధంబునకు
ననుబంధంబులతో గములుగట్టి, [62]జుంజుమ్మన మూఁగి పరిభ్రమించు మక్షికాకులంబుచేత
సంకులంబై, తదుద్భూతంబులగు క్రిమిసంఘాతంబులు తొలఁగం జెదరిపడిన కండల నండ
గొనిన కాకంబులఁ దిననీక తఱుము లోహచంచుఖగంబులచేత భీకరంబై, సింహకిశోరంబుల
లీలం బొలుచు శునకసహస్రంబులు గఱచిన విడిపించుకొననేరక మొఱలుపెట్టువారును, శూల
నిక్షిప్తాఁగులై దురంతవేదనాభరంబున నొఱలువారును, దప్తతైలమధ్యంబునం దేలియాడుచుఁ
బొదపొదం బొక్కువారును, నసిపత్రవనంబులం గూలంద్రోచిన శకలితశరీరులై పరివేదనం

బొనర్చువారును, బ్రతప్తలోహస్తంభంబులం గట్టఁబడి కమలినదేహంబులం బొడమిన
దాహంబులం బరవశులై వగచువారును, మెడల నురులు దవిలించి వ్రేలం దివిచిన వాయు
నిరోధంబున నయనంబులు వెలికి నుఱికి తూఁగియాడెడువారును, గ్రాఁగిన లోహద్రవంబులు
వాతెఱలం బూరెంచిన నంతర్దాహంబున హాహాకారంబు లొనర్చువారును, గళలగ్నంబులైన
గాలంబులతోడం ద్రిప్పినఁ దద్భ్రమణవేగంబునం దెగి కూలువారును, లోహముఖంబులు
గల పులుఁగులు కన్ను లవియం బొడిచిన నంధులై కూపంబులం బడువారును, సంఘాతకాల
సూత్రాదినరకంబులందు బాధితు లగువారునునై యాతనాదేహం బవలంబించి, పాపఫలం
బనుభవించి, కుందు ప్రాణులచేత బీభత్సాకరంబైన యమమందిరంబుఁ గనుంగొని, శివశర్మ
పార్శ్వస్థితుండగు యమదూత కిట్లనియె.

57


క.

ఇది యేలోకం? బెవ్వని | సదనం? బీప్రాణు లిట్లు సంతతదుఃఖా
స్పదు లగుటకుఁ గత మెయ్యది? | సదయత నీమాయ దెలుపు సర్వము పుత్రా!

58


వ.

అనిన భూసురోత్తమునకు శీలుం డిట్లనియె.

59


సీ.

మున్నూఱుయోజనంబులు లోనివిస్తృతం | బార్నూఱుక్రోశంబు లాయతంబు
నై మించు నిచ్చోటు యమలోక, మిందును | జీవులు మును ధాత్రిఁ జేసినట్టి
పాతకరాసులఫలముల నీరీతి | యాతనాసహితులై యనుభవించి,
పాపానురూపరూపములతో మేదినీ | స్థలమున వెండియు సంభవించి,


తే.

పుత్రమిత్రకళత్రాదిభూరిమోహ | సహితు లగుచు ననేకదోషము లొనర్చి,
కాలవశమున గాత్ర[63]సంగములు విడిచి, | తిరుగ నీలోకమున కేఁగుదెంతు రనఘ!

60


తే.

పుణ్యపాపఫలంబు లీపురవరమున | ననుభవింపంగఁ గూడిన యపుడు, విప్ర!
ధారుణీనాయకుండు నంత్యజుఁడు నొక్క | సమమ, యధికాల్పభావలేశమును లేదు.

61


సీ.

కాఁగిన యినుము వక్త్రమునఁ బోసినఁ దిను | వారలు వాగ్వ్యభిచారపరులు,
మండెడు నుక్కుకంబములఁ బీడించిన ! వారు సంతతపరదారరతులు,
తప్తతైలద్రవాంతరముల వర్తించు | వా రన్యసంతాపవత్సలాత్ము,
లురులు పెట్టిన మెడ లూఁచిపోవఁగ వ్రేలు | వారు [64]జారాంగనావ్యసనమతులు


తే.

భీకరానలశిఖలలో వ్రేలువారు | శిష్టజనతాపకరులగు దుష్ట[65]జనులు,
తనువు లవియంగ నసిపత్రవనములందుఁ | బొక్కిపడువారు బొంకులపుట్ట లనఘ!

62

సీ.

బ్రహ్మకల్పముదాఁక బ్రహ్మఘ్ను లుందురు | తిరముగా సంఘాత[66]నిరయమందు,
మధుపానరతి[67]క్రియామత్తు లుందురు కాల | సూత్రనారకమందు శోకమునను,
స్పర్ణచోరకులగు సాహసు లుందురు | తప్తాఖ్యనరకమధ్యమమునందు,
గురువిప్రదూషణపరతంత్రు లుందురు | క్రిమిభోజనమునందు ఖేదమునను,


తే.

నిందకులు నాస్తికులు నతినీచమతులు | భ్రూణహంతలు కన్యలఁ బొందువారు
బలిమిఁ బరభామినులఁ [68]జెఱపట్టువారు | ఘోరగతిఁ బొందుదురు వజ్రనారకముల.

63


క.

ఋతుకాలంబున లజ్జా | వతియగు సతిఁ బాసి చనిన వల్లభుఁ డతిదుః
ఖితుఁడగుచును వర్తించును | సతతంబును గాలపాశసంఘాతములన్.

64


క.

నిరయమున నున్నవారును, | నిరయోన్ముఖులైనవారు, నిరయశ్రేణిం
దరియించినవారలునై | యురుతరదుఃఖముల నెరియుచుందురు ప్రాణుల్.

65


తే.

నరకదుఃఖానుభవము నెందఱు భజింతు | రందఱును గామమోహితులై జనింతు,
రుర్విసుర! ధాత్రిలో నెంద ఱుదితులైరి | యందఱును వచ్చుచుందు రీయమునిపురికి.

66


సీ.

చూడుము! మేదినీసురవర్య! రోషాగ్ని | సందీప్తలోచనోజ్జ్వలితుఁ డగుచు,
దక్షిణకరమున దండంబు చూపట్ట | నట్టహాసభయంకరాస్యుఁ డగుచు
యాతనాసంగతు లగుజీవులకు నెల్ల | నతిభీమదర్శనుం డగుచు మెఱసి,
చండశూలాయుధోద్దండబాహోగ్రుఁడై | వరుస నల్గడలఁ గింకరులు గొలువఁ,


తే.

జిత్రగుప్తుండుఁ జిత్రుండుఁ జిత్రముఖుఁడుఁ | జిత్రకేతుండు సమముగా జీవకోట్ల
కెల్లఁ బాపంబు పుణ్యంబు నేరుపఱుప, | నిండుకొలువున్నవాఁ డంతకుండు వాఁడె.

67


వ.

ఇట్టి యమలోకంబునకు నాగ్నేయభాగంబున నన్నపర్వతంబులును, నాజ్యప్రవా
హంబులును, బాయసకూపంబులును, శర్కరాసరోవరంబులును, మాక్షికతటాకంబులును
మొదలుగాఁ గలుగు పదార్థంబులకు నిలయంబై, చతుర్ద్వారసమేతంబై పితృలోకంబు వర్తించు.
అందుఁ బితృదేవతలు వివాహాదికర్మకాలంబుల సమాహూతులై, ప్రాగ్ద్వారస్థితసత్యవసు
సంజ్ఞికవిశ్వేదేవతాసమేతులును, దీర్థశ్రాద్ధాదులయందు సమాహూతులై యుదగ్ద్వారస్థిత
ధూర్లోచనసంజ్ఞికవిశ్వేదేవతాసమేతులును, మాససాంవత్సరికాదిపైతృకంబులం బశ్చిమ
ద్వారస్థితపురూరవాద్రవసంజ్ఞికవిశ్వేదేవతాసమేతులును, సపిండీకరణాదులయందు
దక్షిణద్వారస్థితకామలకామసంజ్ఞికవిశ్వేదేవతాసమేతులునై, తద్విశ్వేదేవపూర్వకంబుగ

హుతంబులును, దత్తంబులును నగు భోజ్యంబులును, గాలపక్వంబులు, నగ్నిపక్వంబులు,
రసపక్వంబులు నైన యన్నంబులం దృప్తిం బొందుదురు. ఇట్టి పితృలోకంబునకు నుదగ్భా
గంబున.

68


మ.

ప్రతతస్వర్ణమణిప్రభాధగధగత్ప్రాసాదవర్గంబు, నూ
ర్జిత[69]రంభాముఖనిర్జరీబహువిధక్రీడానిసర్గంబు, శో
ధితచింతామణికల్పకామరగవీబృందప్రసూతార్థమం
డితమార్గంబును నైన స్వర్గ మది కంటే? భూసురాగ్రేసరా!

69


చ.

అని వినిపింపఁగా, యమభటాగ్రణివాక్యము లాలకింపుచుం
జని, నికటంబున న్నరకసద్మమునం దనురూపయాతనా
తనువులు దాల్చి, శోకపరితాపమునం బలవించు జీవులం
గని, కరుణాతిరేకమునఁ గర్ణపుటంబులు కేల మూయుచున్.

70

నరకవాసులకుఁ బరమపదప్రాప్తి

క.

నారాయణ నారాయణ | నారాయణ యనుచుఁ బలుక నరకస్థితు లా
నారాయణ నామశ్రుతి | కారణమున విష్ణుపదము గనిరి మునీంద్రా!

71


చ.

హరిపురి కీప్రకారమున నందఱుఁ బోయినఁ, బ్రేతనాథుఁ డా
ర్తరవము లెప్పటట్లు వినరాక, నిజాలయమెల్ల శూన్యతా
గరిమ వహించియుండుటకుఁ గారణముం దెలియంగలేక, య
చ్చెరుపడి యాత్మకింకరులఁ జీరి భయంకరరీతి నిట్లనున్.

72


సీ.

భూరిలోహస్తంభములయందు నేలొకో | కలయంగ ననలంబు లలమికొనవు?
తప్యమానము లగు తైలంబు లేలొకో | భుగభుగధ్వనులతో నెగసిపడవు?
బంధురనరకకూపశతంబు లేలొకో | ప్రకటబీభత్సపూర్ణములు గావు?
[70]శ్వాపదాదిక్రూరజంతువు లేలొకో | పసిగొని నలువంకఁ బరువులిడవు?


తే.

వాఁడిదప్పిన వసిపత్రవనము లేల? | శూలములు మొక్కపోయిన వేల నేఁడు?
వివిధకుజనార్తరవ మేల చెవులఁ బడదు? | పాడువాఱె నిదేల మత్పట్టణంబు?

73

మ.

హరిదాసుల్ పనిపూని యిచ్చటికి దివ్యాకారులై వచ్చిరో?
వరయోగీంద్రులు దివ్యనామము లిట న్వర్ణించిరో? కాక, శ్రీ
వరుఁ డత్యంతదయాభిరాముఁ డగుచున్ వైకుంఠముం జేర్చెనో?
[71]తఱుచై ప్రాణులు లేరు చూడ నరకస్థానంబునం దెయ్యెడన్.

74


వ.

అని పలికిన పితృపతికిఁ గింకరులు కరంబులు మొగిచి యిట్లనిరి.

75


ఉ.

స్వామి! కృతాంత! దండధర! సజ్జనబంధు[72]శరణ్యుఁ, డిందుగా
భూమిసురాగ్రగణ్యుఁ డొకపుణ్యుఁడు వచ్చి, విపన్నమానవ
స్తోమము గాంచి, జాతకృపతో హరిఁ బేర్కొనఁ, దన్ముఖంబునం
దామరసాక్షునామము ముదంబున వీనుల నాలకించుటన్.

76


క.

[73]పాపములఁ బాసి, నరక | స్థాపితులగు జీవులెల్లఁ దత్క్షణమాత్రన్
శ్రీపతిభవనము చేరిన | నీపురి శూన్యత్వగతి వహించె మహాత్మా!

77


వ.

అనిన, కింకరులకు నంతకుం డిట్లనియె.

78


ఉ.

కింకరులార! మీరు పరికింపక శ్రీహరిభక్తుల న్నిరా
తంకత నిట్లుఁ దేఁదగునె? దానన మత్పుర మిట్టిదయ్యె, మీ
కింకొకబుద్ధి చెప్పెద. మహీస్థలి కెన్నఁడు చన్న, వైనతే
యాంకపదారవింద[74]యుగళాత్ముల, భాగవతాగ్రగణ్యులన్.

79


క.

హరిభక్తిపరుల, లక్ష్మీ | శ్వరుసేవాపరుల, విష్ణుచరణార్చనత
త్పరుల, ముకుందగుణస్తుతి | పరులం గని, తొలఁగిపొండు భయరయయుతులై.

80


వ.

అని, వైవస్వతుండు నిజకింకరుల నాజ్ఞాపించి, యంతఃపురంబునకుం జనియె.
శివశర్మయు విష్ణునామప్రభావం బెఱింగి, భూలోకంబునకు వచ్చి, యాత్మశరీరగతుండై,
చతుర్థాశ్రమంబు గైకొని, నారాయణ ధ్యానపరాయణుండై హరిపురప్రాప్తుం డయ్యె నని
చెప్పిన విని, మార్కండేయుండు రోమశున కిట్లనియె.

81

యాతనాశరీరధారణము

క.

నానావిధదేహంబులఁ | బూనిన యాజీవులెల్లఁ బుడమిని మృతులై
యానరకంబుల కేవిధ | మైన శరీరములు దాల్చి, యరుగుదు రనఘా?

82


క.

అనవుడు, విజ్ఞానకళా | వననిధి, రోమశుఁడు, వైష్ణవగ్రామణి, యా
మునిశేఖరునకు నిట్లను | ననుపమవాక్పాటవమున కార్యులు మెచ్చన్.

83


సీ.

జీవుఁ డవధ్యుఁ డ[75]చ్ఛేద్యుఁ డక్లేద్యుండు | జన్మజరామృత్యుజాతిరహితుఁ
డంగనాపురుషవేషాదిశూన్యుఁడు నిత్యుం | డచలుండు సర్వగుం డగుచు నుండు,
నతఁ డాత్మకర్మమూలాగతమృగపక్షి | మనుజకీటాదిజన్మములఁ బొంది,
తదనురూపములైన తనువులఫల మాయు | రవసానపర్యంత మనుభవించి,


తే.

పుత్ర[76]దారాదిమోహాంధబుద్ధి యగుచు, | భుక్తినిధువననిద్రాదిసక్తుఁ డగుచు
నల్పసుఖముల బద్ధుఁడై, యంతమీఁదఁ | గాలవశమున మృతిఁ బొంది గాత్ర మెడలి.

84


మ.

యమదూతల్ గొనిపోవఁ, గర్మలయపర్యంతంబు శస్త్రాగ్నిము
ఖ్యములన్ వ్రీలని యాతనాతనువునం దావిష్టుఁడై, భోగ[77]నా
శ్యములం గర్మఫలంబులం గుడిచి, తత్సందర్శితానేకగ
ర్భములం గ్రమ్మఱఁ బుట్టు జీవుఁ డుచితప్రజ్ఞావిహీనాత్ముఁడై.

85

చంద్రసూర్యవంశరాజన్యుల జననప్రకారము

చ.

అనిన, మృకండుసూనుఁడు ప్రియంబున రోమశుతోడ నిట్లనున్,
'మునివర! సూర్యసోమకులముఖ్యనరేంద్రుల జన్మకర్మవ
ర్తనములు సర్వముం దెలియఁ దత్త్వమతి న్వినిపంపు' మన్న, నా
యనఘవరేణ్యుఁ డిట్లనియె నమ్మహనీయున కాదరంబునన్.

86


మ.

హరిబాహాయుగళంబు[78]నం దుదితులై, యత్యంత[79]బాహాఢ్యులై,
ధరణీదుర్భరభారసంభరణవిద్యాదక్షులై సంతత
స్థిరధైర్యోన్నతులై, సమస్తవిభవశ్రీకామినీపూర్ణమం
దిరులై, రాజులు పుట్టి రంబుజసుహృత్తేజో౽భిరామాంగులై.

87

క.

నారాయణబాహుసుధా | పారావారమున నిట్లు ప్రభవించిన యా
ధీరాత్ములు నృపచంద్రులు | ధారుణి కేఁతెంచి నీతితత్పరమతులై,

88


ఉ.

కోపము చిన్నమంత, తలకొన్న ప్రసాదము మేరువంతగాఁ
జూపి, ప్రజానుపాలనము సూనృతవృత్తి నొనర్పుచున్, రిపు
క్ష్మాపతులన్ హరించి, గరిమంబున రాజ్యము చేసి చేసి, యు
ద్దీపితదర్పులై, తపనతేజముఁ జూచి సహింప కుద్ధతిన్,

89


మ.

ఘనబాహాబలదుర్మదాంధు లగుచున్, గంజాప్తుతో దివ్యసా
ధనముల్ పూని రణం బొనర్చినను, మార్తాండుండు కోపించి, యా
జననాథావళిఁ బట్టి మ్రింగుటయు, విశ్వక్షోణికిన్ రాజు లే
క, నరుల్ తస్కరబాధల న్నిబిడ దుఃఖవ్యాప్తులై యున్నెడన్.

90


ఆ.

కువలయప్రమోదకుండగు రాజు లే | కున్న [80]1సత్పథంబు వన్నె దిగదె?
కువలయప్రమోదకుండగు రాజు లే | కున్న సత్పథంబు వన్నె దిగదె?

91


చ.

అని తలపోసి, భూమివలయంబునకుం దగు రాజవర్యు నొ
క్కనిఁ గొనితేరఁగా నుచితకార్యవిశేషము నిర్ణయించి, స
న్మునులు ఆ[81]దివాకరుం గదిసి మూర్ధసమర్పిత[82]పాణిపద్ములై
వినుతి యొనర్పఁజొచ్చిరి, పవిత్రవచోగతి నమ్మహాత్మునిన్.

92


సీ.

సప్తాశ్వ! మార్తాండ! జలజవనీమిత్ర! | [83]సర్వలోచన! దేవ! సర్వవంద్య!
సర్వగ్రహాధిప! సర్వరోగాపహ! | సకలజగద్దీప! సామరూప!
భాస్కర! దినకర! బ్రహ్మాండభూషణ! | దశశతకిరణార్క! తపన! సూర్య!
ద్వాదశాత్మక ! వికర్తన! దివాకర! బోధ | మయ! జగన్మయ! సదాధ్యయననిరత!


తే.

యరుణ! కాశ్యప! తిమిరసంహరణచతుర! | యర్యమాదిత్య! దివిజేశ్వరాదిసేవ్య!
సత్యసంకల్ప! [84]మందేహదైత్యమథన! | స్వీకరింపుము మన్నమస్కృతిశతములు.

98


ఆ.

చండతిమిరపీతసకలచరాచరో | ద్ధరణకరణరూపధారి వగుచుఁ
బ్రతిదినంబు [85]నొందఁ బరమజగత్సాక్షి | వరయ నీవ కావె యజ్ఞమిత్ర!

94

తే.

మూఁడునాభుల నైదుకమ్ములఁ దనర్చు | చక్రమును, సప్తనామకాశ్వమును, గుంటి
సారథియుఁ గల్గు తే రెక్కి, సత్వరమున | నప్సరోనాగయక్షసమన్వితముగ,

95


ఆ.

వాలఖిల్యమునులు వర్ణింపఁగా, నిరా | లంబమైనయట్టి యంబరమున
ప్రతిదినంబుఁ దిరుగు భవదీయమహిమంబుఁ | దెలియ నరిది మాకు.ననఘచరిత!

96


క.

దినమును బక్షము మాసం | బును ఋతుపయనమును వర్షములునై కాలం
బనుమింపం బడుచుండుట | యనఘా! నీ యుదయమహిమ నౌనో కాదో?

97


క.

నరు లెవ్వరైనఁ దావక | చరణంబులు గొలిచిరేనిఁ జండాపత్సా
గరము గడచి, యారోగ్య | స్థిరు లగుదురు సకలదివిజసేవ్యచరిత్రా!

98


శా.

ఆకర్ణింపుము విన్నపంబు త్రిజగద్వ్యాపారపారీణ! భూ
లోకంబెల్ల నరాజకంబగుట యాలోకించి, చోరోద్ధతా
నీకంబుల్ గడుబాధ పెట్టఁగ, భయోన్నిద్రాత్ములై [86]భూప్రజల్
శోకంబందుచునున్నవారు దివిజస్తుత్యా! ప్రతాపోజ్జ్వలా!

99


క.

మఖములు సాగకయుండెను, | మఖభోజనవర్ధమానమహులగు బర్హి
ర్ముఖులు, మఖభాగచర్వణ | సుఖవాంఛారహితులైరి సురమునివినుతా!

100


చ.

అతులిత[87]వర్గధర్మనియమాబ్ధికిఁ జెల్లెలికట్ట, సజ్జనా
తతవిపదద్రికిం గులిశధార, చతుఃపురుషార్థశేముషీ
లతికకు నాలవాలము, కులద్విరదంబున కంకుశంబు భూ
పతి, యతఁ డబ్బకుండిన విపర్యయమందు సమస్తకార్యముల్.

101


ఉ.

కావున, రాజసత్తములు గల్గక యుండిన ధాత్రి సుస్థిరీ
భావము నొంద, దాత్మపతిఁ బాసిన భామినియట్లు, దేవతా
సేవితరూప! మామనవి చేకొని తావకగర్భవేశిత
క్ష్మావరకోటిఁ గ్రమ్మఱ నొసంగు మనన్, రవి వారి కిట్లనున్.

102


చ.

మునివరులార! యానృపతిముఖ్యులు మత్కిరణప్రసారసం
జనితమహోష్ణపీడితులు, సారవిహీనులు నౌటఁజేసి, దు
ర్జనరిపు[88]గర్వభంజనము, సర్వమహీపరిపాలనంబు స
జ్జనభజనంబుఁ జేయఁగ నశక్తులు, వీరల వేఁడ నేటికిన్?

103

సీ.

వినుఁడు, పూర్వమున నీమనుజాధిపతులు మ | త్కోపాగ్నిముఖమునఁ గూలునపుడు
హిమకరబింబమధ్యమమునఁ గొందఱు, | కొందఱు వరుణదిఙ్మందిరమున,
దారుణ[89]కాననాంతరమునఁ గొందఱు | కొందఱు [90]గిరిగుహాకుహరములను,
యోగీంద్[91]3వేషసంయుక్తులై కొందఱు | చని యణంగినవారు సాధ్వసమున,


తే.

నిట్టి రాజన్యవరులలో నెవ్వరేని | యఖిలభూపాలనమునకు నర్హు లగుదు
రట్టిరాజుల మీరు చేపట్టి మంత్ర | శక్తిఁ, బట్టంబు గట్టుఁ [92]డీస్థైర్యమునకు.

104


చ.

అన విని, యమ్మునిప్రవరు లర్కుని వీడ్కొని యింద్రయుక్తులై
చని, వనవాసదీనులగు క్షత్రియులం గొనివచ్చి, రాజ్యపా
లన మొనరింప నిల్పినఁ జలంబున వారలు ధర్మబాహ్యులై
మనుజుల [93]శౌర్యదండవిధి మాటికి [94]నొంపుచు గర్వితాత్ములై,

105


ఆ.

[95]తగఁ గిరాతవేషధారులై వనముల | కరిగి రంత, మునులు వరుణలోక
వాసులైన రాజవర్యులఁ దెచ్చి రా | జ్యమున నిలుప, వారు ననుదినంబు,

106


క.

మదిరాపానవిహారము | వదలక యన్యోన్యకలహవశమునఁ బ్రజలన్
విదళింపుచు వర్తింపఁగఁ | బదపడి భూతలము శూన్య[96]భావము నొందెన్.

107


సీ.

అది గాంచి, పద్మజుం డర్కశీతాంశుల | వలన రాజకులంబు గలుగఁజేసి,
తద్వంశజాతభూధవులకు నింద్రుని | వలన మనోహరైశ్వర్యమహిమ,
ధననాథువలన విత్తము, చండభానుని | వలనఁ బ్రతాపంబు, వనరుహారి
వలనఁ గాంతియు యశోవైభవంబును, సురా | చార్యునివలన రాజన్యనీతి


తే.

బలము, నంభోధివర్యునివలన [97]జయము | జేర్చి, రాజ్యాభిషిక్తులఁ జేసి నిలుప,
నన్నరేంద్రులు ధర్మసహాయు లగుచుఁ | బాడి తప్పక బుద్ధిసంపదలఁ బొదలి,

108


ఆ.

సుజనరక్షణంబు కుజనశిక్షణమును | సూనృతోక్తిరతియు సుభగమతియుఁ
గలిగి, ధాత్రి యేలి రలఘుతేజంబున | విప్రపూజనాభివృద్ధు లగుచు.

109

వ.

ఇట్లు సోమసూర్యవంశోత్పన్నులగు రాజన్యులు కుంచకులు, రాజకులు, గర్తకులు,
సమానకులు నన నాలుగుతెఱంగులవారు గలరు. అందు క్షత్రకన్యకలవలన విప్రుల
కుదయించినవారు కుంచకులును, క్షత్రియకాంతలయందు రాజన్యులకు సంభవించినవారు
రాజకులును, వైశ్యభామల యందు రాజుల కుద్భవించినవారు గర్తకులును, శూద్రాంగనల
యందు క్షత్రియులకుం బుట్టినవారు సమానకులు ననం బరగి, ప్రజాపాలనం బొనర్తురు.
అట్టి భూవరోత్తముల జన్మకర్మప్రకారంబులు గొన్ని చెప్పెద నాకర్ణింపుము.

110

ఇనకులేశుల దివ్యచరితము

సీ.

శ్రీభర్త యాత్మీయనాభిపద్మంబునఁ | [98]జతురాననుండు తా సంభవించె,
నా చతుర్ముఖుని చిత్తాంభోజమునఁ బుట్టె | నధికతేజోనిధి యగు మరీచి,
యా మహామహునకు నౌరసపుత్రుఁడై | జననంబునొందె కశ్యపవిరించి,
యతనికి దక్షకన్యక యైన యదితికిఁ | బ్రభవించెఁ దనయుఁడై భాస్కరుండు,


తే.

సకల సురసేవ్యుఁడై జగచ్చక్షు వగుచు | విమలమూర్తిత్రయాత్ముఁడై వెలయునట్టి
చండకరునకు వైవస్వతుం డనంగ | మనుకులాఢ్యుండు హరిభక్తిధనుఁడు వొడమె.

111


క.

వారిజహితసుతుఁడగు నా | ధీరుఁడు నిర్మించెఁ గర్మదృఢముగ సరయూ
తీరమున సుజనబోధ్యను, | సారసురాసుర[99]బలాద్యసాధ్య నయోధ్యన్.

112


క.

సిరుల, విశాలవధూటీ | స్ఫురణంబున, మధురసరసభోగ్యపదార్థా
కరమహిమ, భోగవతి యనఁ | బొరసెం దత్పురి యనేకపురనామములన్.

113


మ.

హరితేజోనవబీజకంబు, మనువర్యాంకూర, మిక్ష్వాకుబం
ధురకాండంబు, దిలీపముఖ్యనృపతిస్తోమోరుశాఖంబు, దా
శరథి స్వచ్ఛఫలంబు నైన రవివంశస్వర్గభూజంబు, త
త్పురరాజంబను నాలవాలమున నొప్పున్ సద్ద్విజావాసమై.

114


సీ.

తగ మేను దాల్చిన నిగమశాస్త్రంబులు, | మూర్తి పూనిన శౌర్యకీర్తివితతు,
లాకారవంతంబు లైన విత్తములు, రూ | పము వహించినయట్టి పతిహితంబు,
లంగంబు లందిన శృంగారభావంబు | లాకృతి [100]గలుగుకామాగమములు,
తనువు చేపట్టిన దానపాండిత్యంబు, | లసమగాత్రము గల యఖిలవిద్య,

తే.

లనఁగ, విఖ్యాతులై మింతు రధికమహిమ | వరమహీసురరాజన్యవైశ్యశూద్ర
కామినీజనకాముకగణవదాన్య | సరసపుంగవు లమ్మహాపురవరమున.

115


మ.

తరులెల్లన్ సురభూజముల్, శిలలమొత్తంబెల్లఁ జింతామణుల్,
వరగోబృందములెల్లఁ గామదుఘముల్, [101]భామాజనంబెల్ల [102]
చ్చరతండంబు, హయంబులెల్ల దివిజాశ్వంబుల్, మదానేకపో
త్కరమెల్లన్ దివిషద్గజంబు లనఁగాఁ గన్పట్టు నవ్వీటిలోన్.

116


వ.

ఇట్లు వైవస్వతమనువు సకలపదార్థపరిపూర్ణంబును, సకలవైభవాకీర్ణంబును, సకల
సౌభాగ్యసముదీర్ఘంబునుంగా, నయోధ్యానగరంబు నిర్మించి, యందుఁ గృతాభిషేకుండై,
న్యాయమార్గంబున రాజ్యంబు సేయుచుండె. అంతఁ, దద్వంశంబునకు నవతంసంబై
యిక్ష్వాకుం డుదయించె. తదన్వయంబున,

117


చ.

అగణితబాహు[103]శక్తిసముదంచితుఁడై , తన[104]పెంపు దేవతల్
పొగడఁగ, శత్రుభూపతులపొంక మణంచి, శతాశ్వమేధముల్
తగ నొనరించి, భూసురుల దన్పె ధనంబుల, నమ్మహాత్ముఁ డా
సగరుఁడు సంభవించె గుణసాగరుఁడై , మనువంశరత్నమై.

118


క.

ఘనపుణ్యుం డాసగరుఁడు | తనభామినులందు సత్త్వ[105]ధర్మాన్వితులన్
దనయుల నఱువదివేవురఁ | గనియె నఖండప్రతాపగర్వోన్నతులన్.

119


ఉ.

వారలు నూఁగుమీసములు వచ్చుతఱిన్, తమతండ్రి[106]పంపుగా
దారుణశక్తిజాలములు దాల్చి, మఖాశ్వముఁ గావఁబోవ, జం
భారి తదీయఘోటకము నర్థి హరించి, భుజంగలోకముం
జేరి, నిమీలితాక్షు, మునిశేఖరు, భాగవతాగ్రగణ్యునిన్,

120


చ.

కపిలుని గాంచి, యామునిశిఖామణిచెంగట నశ్వరత్నమున్
నిపుణతఁ గట్టిపోయె; నిట నిష్ఠురు లాసగరాధిపాత్మజుల్
కుపితమనస్కులై, సవనఘోటముఁ గానక కంపితాత్ములై
విపులధరిత్రియున్, గగనవీథియు నారసి చూచి వెండియున్,

121

తే.

ఉరగలోకంబు వెదకుట కుద్యమించి, | పటుఖనిత్రాగ్రముల ధాత్రిఁ బాయఁ ద్రవ్వి,
జలధిమార్గంబునను రసాతలము సొచ్చి, | కపిలమునిపొంత మఖఘోటకంబుఁ గాంచి,

122


చ.

వెనుక హయంబుఁ గట్టుకొని, [107]వీఁడె [108]యథార్థతపస్వికైవడిన్
గనుగవ మూసినాఁడు, పొడగంటిమి గుఱ్ఱపుదొంగ నంచు, నా
మునివరు ముష్టిఘాతముల మోదిన, నాఘను రోషవహ్ని లో
చనముల [109]వెళ్ళి, యాసగరజాతుల భస్మము చేసె నందఱన్.

123


ఉ.

అంత, భగీరథుండను మహాత్ముఁడు తత్కులమందుఁ బుట్టి, య
త్యంతతపోగతిన్, శివుఁ బురాంతకుఁ బ్రీతునిఁ జేసి, యాయుమా
కాంతు జటానుషంగ యగుగంగ, నభంగురభంగఁ, [110]బాపజా
లాంతకరప్రసంగఁ బ్రియ, మారఁగఁ దెచ్చిన, నాస్రవంతియున్,

124


తే.

తరుణ[111]శశిశేఖరుని జటాభరము [112]డిగ్గి, | యభ్రపథమున ధాత్రికి నవతరించి,
నాగలోకంబు దరిసి, పుణ్యతఁ దనర్చి | సగరతనయుల ముక్తిపారగులఁ జేసె.

125


క.

ఆరాజసుతుఁడు దెచ్చిన | కారణమున, సకలలోకకల్మషపటలీ
హారిణి యగు సురనది, భా | గీరథి యనుపేర విదితకీర్తి వహించెన్.

126


క.

[113]తదనంతరమున సుగుణా | స్పదుఁడగు యువనాశ్వనృపతి ప్రభవము నొందెన్
ముదమున నతనికిఁ ద్రిజగ | ద్విదితుఁడు, మాంధాతృ నామధేయుఁడు వొడమెన్.

127


క.

విశదయశః[114]పటగర్భిత | దశదిగ్వలయుం డతండు దారుణబాహా
నిశితాసిపాటవంబున | దశకంఠుని గెలిచె సమదదర్ప మెలర్పన్.

128


శా.

సాధుత్రాణకళావితంద్రుఁడు, హరిశ్చంద్రుండు జన్మించి, తే
జోధుర్యుండు వశిష్ఠు[115]పూన్కి నిలుపన్ శుద్ధాంతరంగంబునన్
గాధేయుం డొనరించు దుష్క్రియల, శోకంబందియున్, సత్యభా
షాధీరుం డగుచున్, ద్విసప్తయుగముల్ శాసించె భూచక్రమున్.

129

మ.

ప్రభవంబందె ననంతరంబున దిలీపక్ష్మాధవుం, డమ్మహీ
విభురత్నంబునకున్ సుదక్షిణకు నావిర్భూతుఁ డయ్యెన్ రఘు
ప్రభుఁ, డాతండు మఖాశ్వరక్షణ మొనర్పం బిత్రనుజ్ఞాతుఁడై
రభసం బొప్పఁగ సంచరించునెడ, సుత్రాముండు తద్వాహమున్,

130


ఆ.

అపహరించి చనిన నమరేంద్రు వెన్నంటి | యంపవెల్లి నతని యదటణంచి,
గెలిచినట్టి రఘువు గలుగుట, రఘువంశ | మనఁగఁ బరగెఁ దన్నృపాన్వయంబు.

181


ఉ.

అట్టి రఘుక్షమాపతికి నాత్మజుఁడై యజుఁ డుద్భవించి, యి
టట్టనరాని [116]విక్రమత నాధర యేలుచునుండె, నాజగ
త్పట్టణభర్తకున్, దశరథక్షితిపాలుఁడు పుత్రరత్నమై
పుట్టి తనర్పె, సర్వనృపపుంగవమౌళికిరీటసేవ్యతన్.

132


చ.

హరిమదహర్త కాదశరథావనిభర్తకుఁ బుత్రులై జనిం
చిరి మఖశక్తిఁ జేసి, హరిశేషసుదర్శనపాంచజన్యభా
సురతరతైజసాంశముల శూరులు రాముఁడు, లక్ష్మణాఖ్యుఁడున్,
భరతుఁడు, శత్రుహంతయు ననంగ మహాత్ములు నల్వు రెన్నఁగన్.

133


ఉ.

ఆమహనీయవిక్రములయందును, బూర్వజుఁడైన సద్గుణా
రాముఁడు, వైరివైభవవిరాముఁడు, రాముఁడు గాధినందనో
ద్దామమఖంబు గాచి, హిమధామకిరీటునివిల్లు ద్రుంచి, సీ
తామహిళావివాహసముదంచితుఁడై, తదనంతరంబునన్,

134


ఉ.

రావణముఖ్యరాక్షసపరంపరలం దునుమాడి, జానకీ
దేవియుఁ దా నయోధ్య కరుదెంచి, సుఖస్థితిఁ గ్రీడసల్పుచున్
భూవలయాధిపత్యమునఁ బొంగుచునుండి, [117]మహీజనాపవా
దా[118]విలవాక్యము ల్విని, ప్రియాంగన నంపె నరణ్యభూమికిన్.

135


మ.

లలనారత్నము సీత, దుష్టమృగజాలవ్యాప్తఘోరాటవిన్
బలవద్గర్భభరాలసాంగి యగుచుం బ్రాణేశ్వరుం [119]జీరుచుం
గలకంఠీకలకంఠపంచమకుహూకారానుకారధ్వనిం
బలవింప న్విని, చేరవచ్చెఁ గరుణం బ్రాచేతసుం డుల్కుచున్.

136

క.

చనుదెంచి, యాశ్రమాంతిక | మున వల్మీకజుఁడు గాంచె, మోహనకంఠ
స్వనజితపికసంఘాతను, | జనలోకఖ్యాత, నవనిజాతన్, సీతన్.

137


తే.

[120]ధరణిపతితను, ధూళిదూసరితగాత్రిఁ | బూర్ణగర్భసమన్వితఁబొలఁతి నిట్లు
గాంచి, కరుణారసం బాత్మఁ గడలుకొనఁగ, | మునిశిఖామణి యాయిందుముఖికి ననియె.

138


క.

వనితా! యెవ్వని భార్యవు? | వనమున నిను డించి చనినవాఁ డెవ్వఁడు? నీ
వొనరించిన తప్పెయ్యది? | వినిపింపుము వికసితారవిందనిభాస్యా!

139


వ.

అని పలికిన మునికులోత్తంసునకు నాహంసగమన యిట్లనియె.

140


ఉ.

భూజనయిత్రికన్, జనకపుత్రిక నే, నతిలోక[121]పుణ్యుఁ డా
రాజకులాగ్రగణ్యుఁ డగు రాముని భార్య, నతండు విశ్వధా
త్రీజనదుష్ప్రవాదము భరింపక, లక్ష్మణు నంప, నమ్మహా
తేజుఁడు నన్నుఁ దెచ్చి, వనదేశమునన్ దిగనాడిపోయినన్,

141


మ.

వగలం గుందుచునున్నదాన ననినన్ వాల్మీకి యుద్యత్కృపా
స్థగితుండై, తనయాశ్రమంబునకు నాసాధ్వీమణిం దెచ్చి, పొం
దుగఁ బోషింపఁగ, [122]నంతలో యమళపుత్రుల్ సన్ముహూర్తంబునం
దోగి జన్మించిరి సీతకుం గుశలవాఖ్యుల్ భూరితేజస్కులై.

142


చ.

సుతయుగళంబులోఁ బ్రథమజుండగునట్టి కుశుండు తాఁ గుశా
వతి యను వీడొనర్చి గరువంబున [123]రాజ్యము సేయుచుం, గుము
ద్వతి యను భామఁ బెండ్లియయి, తత్సతితోడ నయోధ్య కేఁగి, యం
దతిథిసమాహ్వయుం డగు వరాత్మజుఁ గాంచె గుణాభిరామునిన్.

143

వ.

అట్టి యతిథికి ఋషభాసతియందు [124]నిషధుండగు కుశేశయుం డుదయించె. అతనికి
[125]వాసవియతి యను భామయందు నలుండు సంభవించె అన్నరేంద్రునకు నభుండు,
నమ్మహీపతికిఁ బుండరీకుండు, నానృపాలునకు క్షేమధనుండు, నాభూభర్తకు వశంవదుండు,
నాధరణీధవునకు నహీనజుండు, నారాజచంద్రునకుఁ బారియాత్రుండు, నాజనపాలునకుఁ
బద్మకాంతయందు శీలుండు, నానృపోత్తమునకు సునాభుండు, నాక్షోణీవిభునకు వజ్రుండు,
నారాజన్యునకు శంఖుండు, నాపార్థివునకు హరిదశ్వుండును గ్రమంబున జనియించిరి,
ఆహరిదశ్వుండు భుజాబలంబున సమరతలంబుల ననేకరిపుకులంబులం బొలియించి,
హయమేధాది వివిధాధ్వరంబు లొనర్చి, దీప్త యను భార్యయందు విశ్వసహుండను
తనూభవుని గనియె. అతనికి హిరణ్యనాభుండు వొడమె. ఆమండలేశ్వరునకుఁ గౌసల్యుం
డవతరించె. ఆమహాత్మునకు సోమనృపాలుం డుద్భవించె. ఆక్షత్రియోత్తమునకు బ్రహ్మిష్ఠుం
డుత్పన్నంబయ్యె. ఇట్లు మహావీరులగు సూర్యవంశసంభవు లనేకులు గలరు. అట్టి సూర్య
వంశంబు చతుర్వింశతిభేదంబులం బ్రవర్తించె. ఇంక , సోమవంశప్రకారంబు వివరించెద
నాకర్ణింపు మని రోమశుం డిట్లనియె.

144

చంద్రవంశప్రశస్తి

సీ.

శిరసుపు వ్వంబికాజీవితేశ్వరునకు, | నిందిరాధవునకు నెడమకన్ను,
వాకట్టు [126]బదనికవనరుహశ్రేణికి, | [127]నమృతాశనులకు నాహారఘటము,
గారాపుఁగొమరుండు కలశవారాశికిఁ, | గలిమిచేడియకు డగ్గఱినతోడు,
మొగసిరిమందు చెందొగ [128]మొత్తమునకును, | జారచోరులకు నంగారవృష్టి,


తే.

విరహులకుఁ [129]బెట్టు, చలువకు [130]విడిదిమట్టు | తిమిరములనెవ్వ, [131]శిశుచకోరముల బువ్వ,
మన్మథుని మామ, కాంతిసంపదలసీమ, | చంద్రుఁ డొప్పారుఁ గౌముదీసాంద్రుఁ డగుచు.

145


ఆ.

అతనివలనఁ బుట్టి రనురూపతేజులు | పుష్యరథుఁడు దముఁడు పూరువుండు
దర్శనుండు వజ్రదంత సహాఖ్యులు | జిత్రుఁ డార్యకుండు జిత్రకుండు.

146


వ.

అందు,

147

క.

పుష్యద్గుణునకు, బుధసం | భాష్యునకు, నరేంద్రనీతిపారంగతవై
దుష్యమణిభూషణునకును, | బుష్యరథాఖ్యునకు విదుఁడు పుట్టె మునీంద్రా!

148


సీ.

విదమహీపతి కుద్భవించె సుద్యుమ్నుఁ డా | ధరణీశునకు క్షేమధన్వుఁ డొదవె,
శతబలి వానికి జన్మించె, నన్నరే | శ్వరునకు దమనుండు సంభవించెఁ,
బొడమె శంతనుఁడు తద్భూపాలకునకు, నా | మండలేశునకు భోజుండు పుట్టె
నవతరించెఁ గుశ ధ్వజాఖ్యుఁడా నృపతి, కా | స్వామికిఁ గలిగెఁ గ్రౌంచధ్వజుండు,


తే.

కనియె నాక్షోణిపతి వికర్తనుని, నతని | కాత్మజుండయ్యె సోమదత్తాహ్వయుండు,
తద్ధరావల్లభుఁడు యజ్ఞదత్తుఁ గాంచె, | నుదితుఁడయ్యె మహేంద్రుఁ డాయుత్తమునకు.

149


వ.

అమ్మహేంద్రునకు శరద్వతుండు పుట్టె. ఆరాజచూడామణికి మయూరధ్వజుండు జని
యించె. ఆమయూరధ్వజునకుఁ గుముద్వతియుఁ, బుంజిలయు, నిషధయుఁ, జంద్రరేఖయు
నన నలుగురుభార్యలు గలరు. అందుఁ గుముద్వతికి శృంగవీర్యుండును, బుంజిలకుఁ గృష్ణుం
డును, నిషధకు దాల్బ్యుండును, జంద్రరేఖకు రామసేనుండును నుదయించిరి. అందు,
శృంగవీర్యుండు బ్రహ్మచర్యంబున విప్రత్వం బంగీకరించి, బ్రహ్మలోకంబున కరిగె. తదను
మతంబునఁ గృష్ణుండు సహస్రకాంతాసమేతుఁడై చతురంగబలంబులు గొలువ, భూదేవేం
ద్రుండన రాజ్యంబు నిష్కంటకంబుగా నేలుచుఁ, గుమారసహస్రంబుఁ గాంచె. ఆందు,
వజ్రుండు కోసలాధిపతి యయ్యె; నూర్వురుకుమారులు [132]యోగాభ్యాసపరులై [133]యుత్తమమార్గం
బునకుం జనిరి; మఱియు, నార్నూట[134]పదునొకండుగురు కిరాతులై యరణ్యప్రదేశంబు
చేరిరి; వెండియు నిన్నూటయెనుబదియెనమండ్రుగురుకుమారులు సమబలులై యన్యోన్య
కలహంబునఁ బ్రజాపీడకు లైరి. అంతఁ గలియుగం బాసన్నంబైన,

150


మ.

 ధరణీనాథులు [135]సత్యహీను లగుచున్, దర్పించి దుర్మార్గులై
నిరతంబున్ ధనధాన్యమత్తులగుచు న్నిర్లజ్జులై, మేదినీ
సురవిత్తంబు లపహ్నవింపుచును దేజోహీనులై యున్నచో
హరి కల్క్యాకృతి దాల్చి, తున్ము [136]దురమం దశ్వోత్తమారూఢుఁడై.

151

శా.

ఆదిత్యామృతధామవంశభవులై యజ్ఞానులై, పుత్రకాం
తాదుర్మోహనిబద్ధబుద్ధు లగుచున్, దర్పాంధులై రాజ్యముల్
మోదంబొప్పఁగ నేలు దుష్టనృపు, లంభోజాక్షసద్భక్తిపూ
జాదూరస్థితులై నశించిరి, వృథా సంగ్రామరంగంబులన్.

152


తే.

ఉభయవంశంబులందు ని ట్లుద్భవించి, | చనిన మనుజేశ్వరుల వస్తుజాల మెల్ల
విలయమును బొందెఁ గాని, తద్విభులవెంట | నరుగ దొకటైన నందు సత్పురుషవర్య!

153

సంసారాసారపరిజ్ఞానము

సీ.

కావున, మనుజత్వకలితుఁడై యైశ్వర్య | దారాదిమోహబంధములఁ బడక,
పాంచభౌతికదేహభావసౌఖ్యంబులు | [137]క్షణభంగురము లను సరవిఁ దెలిసి,
సంగ్రహించిన వస్తుసమితిలో [138]నొకటైనఁ | దనవెంటఁ గూడి రాదనుచుఁ దలఁచి,
సద్గురుకరుణచే సర్వాంతరస్థాయి | హరి జగన్మయుఁడని యాత్మ నెఱిఁగి,


తే.

చక్రిరూపంబు నేత్రలక్ష్యంబు చేసి, | తత్కథా[139]కర్ణనమున శ్రోత్రములఁ దనిపి,
సతతసంకీర్తనక్రియాచతురుఁ డగుచు | నుండు నెవ్వఁడు, మోక్షంబు నొందు నతఁడు.

154


శా.

హింసా[140]దంభ[141]మదాభిమానరతులై యే కాలము న్మానవుల్
సంసా[142]రోదితపుత్రదారధనవాంఛాసక్తులై, యాత్మలోఁ
గంసారిం దలపోయఁ గాన, కతిదుఃఖప్రాప్తులై, కర్మవి
ధ్వంసోపాయము లేక, యోనిగతులై వర్తింపుచు న్వెళ్లుచున్,

155


క.

దురితానురూపదారుణ | నరకంబుల ననుభవించి, నలఁగి ధరిత్రిన్
దిరుగ జననముల నొందియు | నెఱుఁగరు [143]సదసద్వివేక మించుక యైనన్.

156


సీ.

జననస్థలంబులు చర్చింప దుర్గంధ | చటులమూత్రపురీషసంకులములు,
గాత్రముల్ పరికింప ఘనరక్తమాంసాస్థి | చర్మమేదోరోమనిర్మితములు,
సంచారములుచూడఁ జంచలాత్మకుటుంబ | రక్షణదైన్యదుర్లక్షణములు,
సంసారనిస్సారసౌఖ్యముల్ వివరింప | స్వప్నమిథ్యాభోగసన్నిభములు,


తే.

పట్టఁ బసచాల దిది మేడిపంటిచంద | మని యెఱింగియు, దేహి యత్యంతమోహ
సహితుఁడగుఁ గాని, వైకుంఠసదనమునకుఁ | దెరువు సుజ్ఞాన మనుబుద్ధిఁ దెలియఁ [144]డనఘ!

157

మ.

గురువే దైవముగాఁ దలంచి, మదిలోఁ గోర్కెల్ విసర్జించి, త
ద్గురువాక్యప్రతిభావిశేషమునఁ జేతోజాతసందేహదు
స్తరదుర్వారతమిస్రముం జెఱచి, నిస్తంద్రాత్ముఁడై, యిందిరా
వరునిం గొల్చినవానికిం గలుగు నిర్వాణంబు మౌనీశ్వరా!

158


వ.

వినుము. జీవుండు పాంచభౌతికదేహసహితుండై యనేకజన్మావసానంబున మను
ష్యత్వంబు నొంది, త్వక్చక్షుఃశ్రోత్రజిహ్వాఘ్రాణవాక్పాణిపాదపాపాయూపస్థాహ్వయదశేం
ద్రియసహితమనో[145]వ్యవహారవికారంబుల నణంచి, క్షణభంగురంబగు పుత్రదా ధనాది
సంగం బంగీకరించియుఁ, దజ్జనితసుఖదుఃఖంబులయెడ సమత్వం బవలంబించి, యాధ్యాత్మి
కాధిదైవికాధిభౌతికంబు లనం బరఁగు తాపత్రయంబువలనం బొడము వగలం దగులుపడక,
కులమద విత్తమద విద్యామద రూపమద భోగమద శౌర్యమద పుత్రమదంబులం బరగు సప్త
మదంబులం [146]బొదలక, పరవిత్తకాంతాదులయం దాసక్తి యొనర్పక, గురుముఖంబున లక్ష్మీ
వరునిఁ బరతత్త్వంబుగా నెఱింగి, తద్భక్తజనస్నేహంబును, దద్గుణాకర్ణనంబును, దత్ప్రతిమా
విలోకనంబును, దత్పాదతీర్థసేవనంబును, దత్పూజాపారతంత్ర్యంబును, దత్సమర్పితాన్న
భోజనంబును వదలక, భక్తియోగకర్మయోగంబులం బరమాత్మభావనాపరుండై, బాహ్య
జ్ఞానంబు మఱచి, సర్వసముండై, వర్తించునతండు విష్ణుసాయుజ్యంబు నొందు.

158

మయూరధ్వజోపాఖ్యానము

వ.

తొల్లి మయూరధ్వజుం డన నొక్కభూభుజుండు మునివచనప్రభావంబున నైదుదినం
బులన మోక్షంబు గాంచె. తత్కథావిశేషంబు చెప్పెద నాకర్ణింపుము.

159


చ.

కరిరథ[147]వాహవీరభటగర్భితసర్వపదంబు, రత్నగో
పురవరసౌధవప్రరుచిపుంజవిచిత్రిత సర్వదిక్కమున్,
సరసపదార్థ పూరితము, సంతతవైభవసంయుతంబునై
యిరవగుఁ బట్టణం బొకటి హేమపురం బన, దివ్యసేవ్యమై.

160


క.

భుజనిశితాసిభుజంగీ | [148]భుజకర్మీకృతవిరోధి భూభుజుఁడు, కుశ
ధ్వజతనుజుండు, మయూర | ధ్వజుఁ డనురా జేలుచుండు దత్పురవరమున్.

161

మ.

మదము న్మచ్చరముం బ్రమోదమును గామక్రోధలోభంబులున్
మది నుప్పొంగ నతండు దానమును ధర్మంబుల్ విసర్జించి, దు
ష్టదశా[149]సంయుతుఁడై, యనిత్యమగు సంసారంబు నిత్యంబుగా
హృదయంబందుఁ దలంచి, యర్థము లుపార్జించెన్ దయాశూన్యుఁడై.

162


ఉ.

పాడి దొఱంగి, యాధరణిపాలకుఁ డిట్లు ధరిత్రి యేలఁగా
[150]గోడని భూప్రజల్ వగలఁ గుందిరి, వానలు వోయె, సస్యముల్
వాడె, ఫలద్రుమంబులును వంధ్యము లయ్యెను, గోగణంబు పా
లీడినఁ దన్నుకోఁదొణఁగె, నే మని చెప్పుదు మౌనిశేఖరా!

163


తే.

రాజదోషాతిశయము కారణము గాఁగ ! సత్యధర్మదయాదులు సమసిపోవ,
ద్వాదశాబ్దంబు లుర్విపై వాన లేక | భూప్రజావళి దుర్భిక్షమున నశించె.

164


క.

యాగహవిర్భాగపరి | త్యాగం బొనరించి, రధికయత్నంబునఁ దే
జోగుణయుతులగు నింద్రపు | రోగము లిటు [151]కఱవు సంప్రరూఢం బైనన్.

165

వసిష్ఠాదిమునీంద్రుల యాగమనము

క.

ఆయెడఁ గౌశిక శాలం | కాయన జాబాలి హరిత కాత్యాయన వా
త్స్యాయన వల్మీక భవా | త్రేయ వశిష్ఠాది సకలదివ్యమునీంద్రుల్.

166


సీ.

రయమున బదరికాశ్రమభూమి కందఱుఁ | జేరి, యనావృష్టికారణంబు
నృపతిదోషంబుగా నిపుణత నూహించి, | తద్దోషశాంతి కుద్యమ మొనర్చి,
[152]హేమపురప్రాంతసీమకు నరిగి, బృం | దావనదీర్ఘికఁ దాన మాడి,
సంధ్యాదు లొనరించి, సపవిత్రపాణులై | పురి చొచ్చి, రాజమందిరము చేరి,


తే.

ద్వారమున నిల్చి, రప్పుడు వారిరాక | విభుఁడు దౌవారికుఁడు విన్నవింపఁ దెలిసి
నెదురు చని, యామహాత్ముల, నిద్ధయశుల, | మునుల నభ్యంతరాలయంబునకు దెచ్చి,

167


క.

పరమార్ఘ్యపాద్యముఖ్యా | చరణంబుల నతిథివిహితసత్కారములం
బరితృప్తులఁ జేసి, మనో | హరపీఠములందు [153]నునిచి యాదర మెసఁగన్.

168

తే.

వందనము చేసి కరపల్లవములు రెండు | ఫాలమునఁ గూర్చి వినయసంపన్నుఁ డగుచు
నామయూరధ్వజాహ్వయభూమిభర్త | మధురభాషల నిట్లను మౌనితతికి.

169


క.

అప్రాజ్ఞుల మాదృశులను | క్షిప్రంబునఁ గుశలమతులఁ జేయుటకై , తా
[154]రప్రార్థనీయు లయ్యును | విప్రులు చనుదెంతు రుదితవిహరణవాంఛన్.

170


క.

మీపాదరజము సోఁకినఁ | బాపంబు దొలంగుఁ, బుణ్యఫల మబ్బు, మన
స్తాపములు వాయు, శుభములు | చేపడు, నెటువంటి దుష్టచిత్తున కైనన్.

171


చ.

ధనమణిభూషణాంబరవితానము లొల్లక, నిస్పృహాత్ములై
వనముల నుండు మీ రిటకు వచ్చుటఁ జేసి, ఫలించె మత్పురా
తనసుకృతంబు, నాకు నుచితంబుగ నే నొనరించునట్టి యా
పని వినిపింపుఁ డెద్ది? దృఢభావమునన్ సమకూరు నిష్టమున్.

172


వ.

అనిన మయూరధ్వజునకు వశిష్ఠాదిమును లిట్లనిరి.

173


క.

విజయో౽స్తు తే, మయూర | ధ్వజ ధాత్రీనాథ! ఖండితద్వేషినృప
వ్రజ! రాజలక్షణోజ్జ్వల! | భుజవిక్రమశోభమాన1భోగసురేంద్రా!

174


ఉ.

అసలు గోసి, యింద్రియ[155]హయంబుల వాగెఁ గుదించి, కాననా
వాసులమైన మాకు నొకవస్తువుపై నభిలాష పుట్టినన్,
వాసవభోగ! చేతి కది వచ్చిన దాఁకఁ, దదీయవాంఛ దా
నోసరిలంగఁదేర, దను వొందునె వాంఛ జయింప నేరికిన్?

175


క.

ఆశావాంఛలు సరియగు | నాశతధృతికైన, నస్మదాదులకైనన్,
ధీశక్తిని నారెంటిని | నాశము నొందించు టరిది నరనాథమణీ!

176


క.

ఏయర్థము దన కీప్సిత | మాయర్థము హస్తగామి యగునట్లు బహూ
పాయముల మెలఁగఁ డెవ్వఁడు, | వాయుప్రేరితశవంబు వాఁడు నరేంద్రా!

177


క.

[156]విడిముడి గలిగియు నొరులకు | నిడనేరక, యనుభవింపనేరక మదిలో
నుడుగని లోభము దాల్చిన | గడుసరి, జీవన్మృతుండు గాఁడె తలంపన్?

178

తే.

అర్థి చే సాఁచి వేఁడిన యాక్షణంబ | వాంఛితార్థంబు లీనేర్చువాఁడె దాత,
పార్థివోత్తమ! యొకవిన్నపంబు గలిగి, | వచ్చినారము యాచకత్వము భజించి.

179


చ.

వినుము నరేంద్ర! లోకమున వృష్టి యొకింతయు లేమిఁ జేసి, భూ
జనులు నశింపఁ దత్కలుషశాంతికి నూహయొనర్చి, వర్షసా
ధనమగు యాగ మొక్కటి ముదంబున నింద్రునిగూర్చి చేయఁగాఁ
జనునని నిశ్చయించి, ధనసంచయనార్థము నిన్ను వేఁడఁగన్.

180


క.

హృదయమునఁ దలఁచి వచ్చితి | మిది మాయభిలషితకార్య, మిట నిష్కములం
బదివేలకో ట్లొసంగక | తుదిముట్టదు మఖము, విఘ్న[157]దూష్యం బగుచున్.

181


వ.

కావున, దత్పరిమితవిత్తం బొసంగిన సంప్రాప్తకాములమై నిజాశ్రమంబుల కరిగెద
మని పలికిన వశిష్ఠాదిమునీంద్రుల భాషణంబు లాకర్ణించిన యాక్షణంబ.

182


క.

ఆరాజవరుని ప్రాణస | మీరము వెడలంగ నుద్యమించెను, లోభా
ధారులకు నర్థివాక్యము | మారణమంత్రంబు గాదె మహి నూహింపన్?

183


చ.

ఘనతరకష్టలోభిఁ, దమకంబునఁ జంపెడునంత యల్క నె
మ్మనమునఁ బుట్టెనేని, విషమారణకర్మ కృపాణముఖ్యసా
ధనములు గూర్పనేల? ప్రమదంబున డగ్గఱి, కాసు వీస మి
మ్మనుటయె చాలు వాని నిమిషార్ధమునన్ మృతిఁబొందఁజేయఁగన్.

184


చ.

వినుము మునీంద్ర! యిట్లు పృథివీవరు ప్రాణము నిర్గమింపఁ జూ
చిన కథ లాత్మలం దెఱిఁగి, శీఘ్రమ మంత్రితవారిపూర మా
జనపతిమీఁద నమ్మునులు చల్లిన, నాతఁడు నిద్రితాత్ముఁడై,
కనుగవ మూసి, యొక్కకల గాంచె మహాద్భుతదర్శనంబునన్.

185


వ.

[158]తదీయస్వప్నకథాక్రమం బెఱింగించెద నాకర్ణింపుము.

186

విచిత్రస్వప్నకథ

చ.

అరిజయశాలి యానరవరాగ్రణి, కొల్వున నున్న యత్తఱిన్
గరువలిమేను దాల్చి, [159]తగ గర్వము చూపఁగ నేఁగుదెంచిన
ట్లరుదుగ నుత్తమాశ్వ మొక టాసభకుం జనుదేర, విక్రమా
భరణుఁడు గాంచెఁ [160]బో పసిఁడిపల్లముతోడి తురంగరత్నమున్.

187

తే.

కాంచి, సంతోషపులకితగాత్రుఁ డగుచు | ధరణినాయకుఁ డాహయోత్తమము నెక్క,
సరస నదియు మనోవేగభరిత మగుచుఁ | జాఁగి, యెనుబదివేలయోజనము లరిగె.

188


చ.

జలధులు దాఁటి యిట్లు రభసంబున నేఁగుచునుండ, భూవరుం
డలయిక దోఁచిన న్వికలుఁడై, మధుసాగరతీరమందు, నూ
డలు గనుపట్టు నున్నతవటద్రుమ మొక్కటి చేరువైనఁ, ద
ద్విలసితశాఖ పట్టుకొని వ్రేలుచు, వాగెలపట్టు వీడినన్,

189


క.

తురగోత్తమ మెందేనియు | నరిగె, మహీవిభుఁడు కంపితాత్ముండై త
త్తరువు దిగివచ్చి, మూల | స్థిరవేదిక విశ్రమించి, చింతాపరుఁడై,

190


వ.

తన మనంబున,

191


చ.

కదిసిన [161]లోభశక్తిఁ, జిరకాల ముపార్జితమైన రాజ్యమున్,
సుదతులఁ, బుత్రులన్, హితుల, శూరుల, దంతిరథాశ్వభృత్యసం
పదలను బాపి [162]తెచ్చె విధి బాపురె! కుమ్మరి కొక్కయేఁడునున్
[163]గుదియకు నొక్కపెట్టు, నని కూర్చిన యానుడి నిక్కువంబుగన్,

192


సీ.

అని తలపోయుచు, నన్నరేంద్రుఁడు ఘన | క్షుత్పిపాసాకృతక్షోభుఁ డగుచు,
నుదకంబు నచ్చోట వెదకుచు, మణిసౌధ | దీపితంబైన మాయాపురంబు
నుపకంఠమునఁ గాంచి, నృపతి యాపురి చొచ్చి | యే యే గృహంబున కేఁగి చూచే
నాయాయి గృహమున [164]నలఁగక గోహత్య | లొనరింపుచున్న దుర్జనుల కర్మ


తే.

[165]మక్షి గోచర మగుటయు నాత్మ రోసి, | తెలియఁ జండాలపుర మిది, దీన నున్న
వారు, సంభాషణీయులు గారు నాకు, | జలము గ్రోలక ప్రాణంబు నిలువ, దింక
నెట్టు భుజియింప మది కింపు పుట్టు నిచట?

193


క.

విధివశమున నా కిచ్చట | నధమగతిం జిందవలసె, నని శోకరసాం
బుధిఁ దేలి తేలి, క్రమ్మఱ | నధిపతి వటతరువుకడకు నరిగినయంతన్,

194

సాయంసమయవర్ణనము

చ.

కమలినిఁ, బుష్పిణి, న్మధువికారవతిన్, ద్విజరాజదూషితం
బ్రమదముతోడఁ గూడి, [166]యనురాగవశంబునఁ గ్రీడసల్పఁగా,
నమరఁగ రక్తమయ్యె నని, యంబరము న్విడనాడి, వార్ధిలో
దుమికే శరీరశుద్ధి కనఁ, దోయరుహాప్తుఁడు గ్రుంకె [167]నత్తఱిన్.

195


చ.

గిరిగుహలందుఁ, [168]గంజముఖికిన్ గచభారములందు, మత్తమ
ట్చరణములందు, నీలమణిజాలము నందుఁ, గురంగనాభియం
దిరువుగ దాఁగి, చండకరుఁ డేఁగిన, నొక్కటఁ గూడి, మొత్తమై
దిరదిర నేఁగుదెంచె నన, దిక్కులఁ బర్వె ఘనాంధకారముల్.

196


తే.

సరస రాత్రివధూమణి చంద్రగళిత | చంద్రికాసవగండూషసంగమమున
నిగిడి పూచిన మి న్ననుపొగడచెట్టు | పుష్పములభాతిఁ, దారలు పొడిచి యొప్పె.

197


చ.

సలలితతారకాకుసుమజాలము దట్టము గాఁగ, నంబర
స్థల మనుపాన్పుపై నెఱపి, [169]చల్లనివెన్నెలజాలుతుంపురు
ర్చిలికి, మనోభవుండు పవళించుటకై , యిడినట్టి శుభ్రపుం
దలగడబిళ్లవోలె, హిమధాముఁడు పొల్చె సురేంద్రదిక్తటిన్.

198


వ.

ఇట్లు ప్రభాసాంద్రుండగు చంద్రుం, డుదయాచలతుంగ[170]శృంగంబు నలంకరింపం
గనుంగొని, మయూరధ్వజుండు తృష్ణానలతప్తుం డగుచు, నిజరాజ్యధనవనితా[171]తనయాదులం
దలంచి, తన మనంబున,

199


సీ.

ఔషధం బెద్ది పద్మాననాలోకవి | యోగతాపజ్వరరోగమునకుఁ,
[172]దేప యెయ్యది పుత్రరూపనిరీక్షణా | హర్షరాహిత్యదుఃఖాంబునిధికిఁ,
బ్రబలవర్షం బెద్ది బంధుసంభాషణో | త్సాహ[173]దూరీభావదావశిఖికిఁ,
గుద్దాల మెయ్యది కోవిదహితమిత్ర | విరహసంభవఖేదవిషమలతకు,


తే.

నకట! దైవంబు ప్రతికూల మగుచు నిటకుఁ | దెచ్చె, నీశోక మెవ్వరు దీర్ప నేర్తు
రనుచుఁ, గనుమూయ మేల్కొన నలవి గాక | కళవళింపుచు నారాత్రి గడపె విభుఁడు.

200

చ.

జలజ[174]లతాంతము ల్విరిసెఁ, జల్లనివాయువు వీచెఁ, బుల్గుమూఁ
కల కలనాదముల్ చెలఁగెఁ, గైరవముల్ ముకుళించె, వెన్నెలల్
పలపలనయ్యెఁ, దారల నెపం బణఁగెన్, శశి గ్రుంకె నేర్పడం,
బలబల తెల్లవాఱె, రతిబంధమునం జెలరేఁగె [175]జక్కవల్.

201


ఉ.

దారుణసాంధ్యరాగశిఖిఁ దప్తము చేసి, ప్రభాతకారకుం
డారసి, పూర్వశైలశిఖరాగ్రపు[176]దాగటిమీఁదఁ దేజపుం
గాఱున నిడ్డ నొ ప్పెసఁగు క్రాఁగిన లోహపుముద్ద నాఁగ, జం
భారిదిగంతసీమ జలజాప్తుఁడు మించె ను[177]దీయమానుఁడై.

202


వ.

ఇట్లు సూర్యోదయం బగుటయుఁ దత్ప్రాంతంబున,203
క. మధుసమయకుసుమసముదయ | మధురసనిష్యందపానమదకలగుంజ
న్మధుకరమిథునమృదుస్వన | మధురిమ గల కొలను గనియె మహిపతి యెదురన్.

204


వ.

కాంచి, యాకాసారంబునం గాలోచితకృత్యంబులు దీర్చి, జలంబులు గ్రోలి,
వటమూలంబునకు వచ్చి, యెప్పటియట్ల యుండునంత,

205

సిద్ధపురుషుని తామసవిక్రియ

సీ.

భైరవార్పితదివ్యవారుణపూరంబు | నుత్సాహగరిమ [178]గ్రుడ్లుఱకఁ ద్రావి,
చాలమత్తత గొని నాలుక తిరుగక | తడఁబడ నేమేని నొడువుకొనుచు,
నడుగులు తొట్రిల్లఁ బడఁబారి గొబ్బున | బయలూరఁగొనఁ జూచి బార లిడుచు,
మద్యదుర్గంధసంపద చోడుముట్టంగ | హాస్యకారంబు పె క్కైన నగుచు,


తే.

నిక్కి వెస నావులింపుచు నీలుగిలుచు, | [179]బండులాడుచుఁ, [180]దారశబ్దములు బెళుక
నుగ్గళింపుచు, లజ్జావియోగియైన | సిద్ధవరుఁ డొక్కఁ డారాజుఁ జేరవచ్చె.

206


తే.

వచ్చి, యాసిద్ధవరుఁడు భూవరుని [181]గాంచి, | యతని కులగోత్రనామంబు లడిగి, ధాత్రి
జాఁగఁబడి మ్రొక్కి, పలుమఱు సన్నుతించి, | పలికె నొకమాట సంతోషభరితుఁ డగుచు.

207

తే.

వినుము భూపాల! మత్పుత్రి వనజగంధి | కమలహూతి [182]యనా నొక్కకన్య గలదు,
రూపలావణ్య మధురానులాపసుగుణ | రత్నమంజూష, దానికి రమణు లీడె?

208


సీ.

తలిరుజొంపముల మార్దవము, కాంచనకాహ | ళముల పొంకము, కరభముల తీరు,
ఘనసైకతము పెంపు గగనంబు సొబగును, | సుడిపొల్పు తరఁగల సోయగంబు,
కాలోరగము చాయ, కరికుంభముల మేలు, | లతల చెల్వము , శంఖ[183]లక్షణంబు,
పవడంపుఁగెంపు, చంపకము లావణ్యంబు, | తొలకరి మెఱుఁగుల వలనితళుకు,


తే.

[184]ముకురముల సొంపు, శ్రీకారముల తెఱంగు | విదియచందురు బాగు, తుమ్మెదల [185]కప్పు
గూర్చి, శృంగారరసముఁ బైఁ గ్రుమ్మరించి, | రమణిఁ గావించెఁ గాఁబోలుఁ గమలభవుఁడు.

209


క.

వేయును నేటికి? ధరణీ | నాయక! సౌందర్యముఖగుణంబుల నీ కా
తోయజవదనామణి తగు, | నా[186]యతివకు నీవ తగుదు వారసి చూడన్.

210


తే.

‘రత్నములలోనఁ గామినీరత్న మధిక’ | మనుచు వర్ణించు శాస్త్రంబు మనుజనాథ!
సౌఖ్యములలోన [187]నంగనాసౌఖ్యసుఖము | ధన్య, మిది సర్వజంతుసాధారణంబు.

211


ఉ.

హీనకులంబుమానవుని యింట మనోహారరత్న మున్న, నే
[188]పూనికనైనఁ గైకొనుట భూవరధర్మము, విన్ము, కాముకుం
డైనఁ గొఱంత యేమి? ‘కమలాసన శంకర మాధవుల్ సదా
మానవతీసమేతు’ లను మాట యెఱుంగవె రాజపుంగవా!

212


క.

వేదాధ్యయనపరుండగు | భూదేవున, కంత్యజునకుఁ బోలింపఁగ ను
త్పాదనగేహం బొకటియ | భేదము. లే, దిందుఁ బెద్దపిన్ననఁ గలదే?

213


వ.

అని పలికి, యాసిద్ధపురుషుండు తనతనూభవ రావించి, యమ్మహీపతి సమ్ముఖంబున
నిలిపిన, నామయూరధ్వజుండు నయనానందకందంబగు నాయిందుముఖి సౌందర్యం బవలో
కించి, యంతర్గతంబున,

214

చండాలప్రమదాసమాగమము

శా.

లావణ్యామృతవృష్టి, మోహనకళాలక్ష్యంబు, శృంగారపా
రావారంబు, మనోజరాజ్యఫలసర్వస్వంబు, సౌందర్యవ
ల్లీవిభ్రాజితమూలకంద, మిది పోలింపంగఁ జంద్రాస్యయే?
యీవామాక్షి [189]భజించువాఁడు [190]నృపదేవేంద్రుండు గాకుండునే?

215

సీ.

తలఁకక చేరలంతలు నేత్రములు దాల్చి | కొణిదెఁడుమొగ మెట్లు కుదురుపడియె?
నీ[191]యెత్తుఱోలు పాలిండ్లభారము పూని | చీమంతనడు మెట్లు [192]శేఖరించె?
గురుతరంబైన యీక్రొమ్ముడిపెనుమోపు ! నన్నువగళ మెట్టు లానుకొనియె?
[193]గుఱివెట్టరాని యీపిఱుఁదువ్రేఁగునఁ జిన్ని | పదము లెట్టులు తొట్రుపడక నిలిచెఁ?


తే.

బ్రకటలావణ్యరససముద్రంబు నెట్లు | రమణఁ దనువల్లి తనయందు నిముడ [194]నేర్చె?
భూరి శృంగారరసము నద్భుతరసంబుఁ | గలిపి, యీ తన్విఁ జేసెనో కమలభవుఁడు?

216


ఉ.

తీపులవింటివాఁడు భువిఁ ద్రిమ్మర నంపినయట్టి మాయ యీ
రూపము దాల్చెఁగాక, యిది రూపవతీమణి యయ్యెనేని, నా
చూపులవెంటనే మనసు చొచ్చుట యెట్లు? మనంబు సొచ్చెఁబో,
లోపల [195]నుండుఁగాక, వెలిలోచనమార్గముఁ [196]బాయ దెట్టొకో?

217


తే.

అకట! మాతంగకన్యక యగుట, దీని | నంటరాదని శంకించు టనుచితంబు,
బాహ్యమున నంటకయ మున్న భావవీథిఁ | గాంతతోఁ గూడి క్రీడింపఁ గనినపిదప.

218


చ.

అని తలపోసి పోసి మదనానలవేదనఁ గ్రాఁగుచున్న యా
జనపతిఁ జేరి, యాయధమజాతివధూమణి, తద్గళంబున
న్వినుతమధూకమాలికఁ దవిల్చె, నతండును బెండ్లియాడె, నే
మనఁగల దింకఁ, బాపభయ మాత్మఁ దలంతురె కాముకాధముల్?

219


శా.

చండాలప్రమదావివాహకలనాసంతుష్టుఁడై, యన్నరేం
ద్రుండశ్రాంతము మద్యపానరతుఁడై, దుర్బుద్ధి, గోమాంసస
త్ఖండంబుల్ భుజియింపుచు న్వరుస నాకంజాక్షితో నిక్షుకో
దండక్రీడలఁ దేలుచుండె మణిసౌధంబందుఁ [197]జేరిచ్చలన్.

220


ఉ.

ప్రేమ దలిర్ప నిట్లు విహరింపుచు, బుత్రశతంబుఁ గాంచి, యు
ద్దామవిభూతిఁ దత్తదుచితంబుగఁ బూని, వివాహకృత్యముల్
భూమివిభుం డొనర్చి, నిజపుత్రులుఁ బౌత్రులుఁ దాను భార్యయున్
దామరతంపరై కడుముదంబునఁ దేలుచునుండు నత్తఱిన్.

221

సీ.

పరిపాకగతి [198]మీఱఁ [199]జఱచెనో యన, దేహ | మెల్లను నరలచే దెల్లఁబాఱ,
[200]ద్విజములై, కానివి దినిన కీడును బోలె, | దంతంబు లిలఁ బతితములు గాఁగ,
ముదిమితొయ్యలి తన్నుఁ గదిసిన సాత్త్వికో | ద్గమ మయ్యెనో, యనఁ గంప మొదవఁ,
బ్రాయంబు గోల్పడఁ బటుశోకమునఁ బోలె | నేత్ర[201]గోళంబుల నీరు గ్రమ్మ,


తే.

వార్ధకం బను భూతంబు వచ్చి తన్ను | నలమినప్పుడు పుత్రకాంతాదిమోహ
పారవశ్యంబు వదలక పార్థివేంద్రుఁ | డుత్సుకత నుండె, నంతలో నొక్కనాఁడు.

222


చ.

కొడుకులు నాఁడుబిడ్డలును గోడలు కొమ్మలు పౌత్రవర్గమున్
దడయక చుట్టును న్మెలఁగఁ, దానును భార్యయు సమ్మదాశ్రులన్
జడిగొనఁ జూచుచున్నపుడు, సౌధతలంబునఁ గాలుజాఱి, యా
పడఁతుక గూలి యాక్షణమ ప్రాణవియోగము నందె, నందినన్,

223


తే.

భూవరేణ్యుండు సతిఁ జూచి, పొక్కిపడుచు | హా! పతివ్రత! హా! మనోహరశుభాంగి!
హా ! [202]ప్రియాంగన! ననుఁ బాయ [203]నగునె నీకు? | ననుచుఁ బలుమారు శోకించు నవసరమున.

224


క.

వెడ మాయఁ గనిన కలకై | యడలెడు భూపాలుచంద మారసి, నగుచుం
దొడ చఱచి, మేలుకొలిపిరి | తడయక యవ్విభుని మునులు దయ యిగురొత్తన్.

225


వ.

ఇట్లు మునివరప్రబోధితుండై, మయూరధ్వజుం డదరిపడి లేచి, ముహూర్తమాత్ర
స్వప్నంబునఁ జిరకాలానుభూతంబులగు సుఖదుఃఖంబుల కచ్చెరుపడి, యాస్థానంబుఁ గలయం
గనుంగొని, పశ్చాత్తాపంబున లజ్జా[204]నమితకంధరుండై , చిన్నవోయియుండె. ఆ సమయంబునఁ
గులగురుండగు వశిష్ఠమునీశ్వరుం డతని నాలోకించి, నగుమొగంబుతో నిట్లనియె.

226

జీవితములు స్వప్నానుభూతులు

తే.

తగునే నీ కిట్లు భూవరోత్తంస! మద్య | పానగోష్ఠియు, గోమాంసభక్షణంబు,
నధమమాతంగభామాసమాగమంబుఁ | బతితగృహభోజనముఁ జేయఁ బాప మనక?

227

క.

ఆసంపద, లామానిని, | యాసుతు, లాబంధువర్గ మావైభవమున్
గాసిం బొందక నిలిచెనె? | [205]యీసం దెఱుఁగంగవలదె యిలఁ బ్రాజ్ఞునకున్?

228


క.

క్షణికస్వప్నం బగు నిది, | గణుతింపఁగ దీర్ఘకాలికస్వప్నం బ
ప్రణుతంబగు సంసారము, | గుణ మందును నిందు లేదు [206]కువలయనాథా!

229


తే.

పూర్వనిమిషంబులోఁ గన్న భోగసుఖము | వర్తమానక్షణంబున వసుమతీశ!
స్వప్నమై తోఁచు, స్వప్నసంజాతసౌఖ్య | మస్థిరము గాక నిత్యమే యరసి చూడ?

230


ఆ.

ఇదియె కాదు, తరువులెల్లను వంధ్యంబు | లయ్యె, నధ్వరంబు లణఁగిపోయె,
శుభవిహీన మగుచు శూన్యభావంబునఁ | గానుపించె నీజగత్త్రయంబు.

231


ఉ.

కావునఁ, బుత్రమిత్రధనకంజముఖీముఖవస్తుజాలమున్
భావములోన స్వప్నసుఖ[207]భాతి ననిత్యముగాఁ దలంపుచున్,
భూవరచంద్ర! దానమున భూసురబంధుహితార్థకోటి ని
చ్ఛావిధిఁ దన్పి, గైకొనుము శత్రుజయంబును నీతిశాలివై.

232


ఉ.

భవ్యదయాసుధాజలధి, భక్తశరణ్యుఁడు, శ్రీవిభుండు, మం
తవ్యుఁడుగా నెఱంగి, ప్రమదంబున నాజగదీశు దేవతా
సేవ్యుఁ దలంచి, పేర్కొని భజించి, నుతించి, నమస్కరించి, నీ
వవ్యయసౌఖ్యసిద్ధి గను మస్మదుదీరితవాక్యపద్ధతిన్.

233


ఉ.

నావుడు, దద్వశిష్ఠవచనంబున నిర్గతసంశయాత్ముఁడై,
భావమునన్ సతీతనయబంధుజనాశ్రితవిత్తమోహముం
బోవఁగఁబెట్టి, యా పరమపుణ్యులకుం బ్రణమిల్లి, హస్తముల్
దా విలసిల్ల మోడ్చి, యనుతాపము దోఁపఁగ వారి కిట్లనున్.

234


మ.

అరిషడ్వర్గవశంవదుండనయి, రాజ్యశ్రీతనూజాంగనా
తురగానేకపముఖ్యవస్తుపటలీదుర్మోహబంధుండనై,
సిరి నిత్యంబని విశ్వసించి, మది లక్ష్మీనాథపూజానమ
స్కరణస్తోత్రము లాచరింపక వృథా సంసారసంగంబునన్,

235


క.

భోగములఁ దవిలి, పాత్ర | [208]త్యాగ మొనర్పంగలేక హతమతి నగు నా
కేగతి పొందఁగవలయుఁ? ద | మోగుణరహితాత్ములార! మునివరులారా!

236

ఉ.

ఏనదిఁ దీర్ధమాడి నరుఁ డేచినకర్మ[209]చయంబుఁ ద్రుంచు? నే
దానమున న్నశించు దురితంబులు? లెస్స యొనర్ప నేయను
ష్ఠానము ముక్తి నిచ్చుఁ? బ్రకటంబుగ నెవ్వనిసేవ స్వర్గసో
పానము? దేనఁ బొందుపడు భావము? పుణ్యము నెట్టిదింపగున్?

237


వ.

ఈసూక్ష్మార్థంబులు నిర్ణయించి, యిందఱు [210]నేకవాక్యంబుగా నానతిండనిన, నఖిల
ముని సమ్మతంబున వశిష్ఠుం డిట్లనియె.

238

పరమధర్మప్రబోధము

క.

అన్నోదకదానంబులు | సన్నుతములు సకలదానసారము, [211]లవి యా
పన్నులకు నిచ్చిరేని స | మున్నతగతి నిహపరంబు లొసఁగం జాలున్.

239


ఆ.

అగ్నిహెూత్రకాల మప్పుడు, భుజియింపఁ | బోవునపుడు, దేవపూజయపుడు,
నన్నకాంక్షి యగుచు నతిథి యేతెంచిన | నతని కిడనివాఁడె యంత్యజుండు.

240


తే.

అలసి,మధ్యాహ్నసమయంబునందు నింటి | కతిథి యేతెంచి, విఫలప్రయత్నుఁ డగుచు
[212]మరలిపోయినఁ, దద్గృహేశ్వరుఁడు మునుఁగు | నిరయదారుణదుఃఖసాగరమునందు.

241


క.

ఓదన మొసంగియైన, స | మాదరమున జలము వోసి యైనను హృదయా
హ్లాదముగ నతిథిఁ బ్రోచిన | యాదొరకున్ దొరకుఁ బుణ్య మతిసులభమునన్.

242


ఆ.

తెరువు [213]నడిచి యలసి ధృతిదప్పి మధ్యాహ్న | కాలమందు నన్నకాంక్షి యగుచు
నరుగు దెంచినట్టి యభ్యాగతుండె నా | రాయణుండు, శుభ పరాయణుండు.

243


ఆ.

పరమపుణ్యుఁడైనఁ, బాపాన్వితుండైనఁ, | గులజుఁడైన, నీచకులజుఁడైన,
బ్రహ్మవేదియైన, [214]పతితాత్ముఁడైన నాఁ | కొన్నవాఁడె పాత్రుఁ డన్నమునకు.

244


సీ.

ఏకపత్నీవ్రతవ్యాకోచచిత్తుండు, | [215]దాంతుండు, విమలసంతానయుతుఁడు,
[216]విశదకర్మాచార[217]విధిమూర్తి, శుద్ధాత్ముఁ, | డన్యకాంతాధనాద్యస్పృహుండు,
వైష్ణవమార్గవిశ్వాససంపన్నుండు, | హరిమంత్రభజనపరాయణుండు,
[218]నగ్నిహెూత్రాదిక్రియాసమర్థుఁడు, శాంతి | పూర్ణుఁ, డుత్తమవిప్రపుంగవుండు


తే.

నఖిలదానంబులకుఁ బాత్రు లనఘచరిత! | విష్ణుసంప్రీతిగాఁ బూని, వీరి కిచ్చు
దాన మత్యంతశుభఫలదాయకంబు | గానఁ, బ్రత్యహదానసంగతుఁడ వగుము.

245

క.

మానసవాక్కాయేంద్రియ | మానోత్పాదితములైన మహితాఘతతుల్
మానవులకుఁ బుణ్యనదీ | స్నానంబున నణఁగు నఖిలసన్నుతచరితా!

246


తే.

మాఘమాసమునందుఁ దామరసహితుఁడు | గొంతయుదయించునప్పుడు కువలయమునఁ
గల జలంబెల్లఁ బావనం బలఘుచరిత! | [219]స్నానమాడిన జనుల పాతకము లణఁచు.

247


ఆ.

మకరమాఘమందు సకలతీర్థంబులు | నమరనదికి సమము లండ్రు బుధులు,
గాన, సలిల మెచటఁ గలిగె నచ్చోఁ గృత | స్నానులగుట మేలు సజ్జనులకు.

248


క.

దీనులకు నన్న మిడుటయు, | దానము సత్పాత్రమందుఁ [220]దగఁ జేయుటయున్
మానవులకు నిత్యాను | జ్ఞానము, లివి రెండు సుగతిసాధక[221]తమముల్.

249

విష్ణుపూజావిశిష్టత

చ.

సకలమునందు నుండు హరి, సర్వమయుండు, సమస్తజీవులం
దొకరుఁడ సాక్షియై తిరుగుచుండుఁ బ్రబోధత నొంది, ముక్తిదా
యకుఁడగు నవ్విభుం గడవ నన్యుఁడు లేఁ, డది గావునన్, శిలా
దికముల [222]శ్రీపతిన్ బుధులు ధీరతఁ బూజ యొనర్పఁగాఁదగున్.

250


క.

సిరియును నాయువుఁ దేజముఁ | బరమనివాసంబు [223]నొసఁగఁ బాల్పడి, లక్ష్మీ
శ్వరుఁడు నిజదాసు లున్నెడ | [224]నిరవుగ వర్తించుఁ బాయఁ డెచ్చటనైనన్.

251


క.

అతులశిలాలోహాది | ప్రతిమల హరి నావహించి, భక్తి దలిర్పం
బ్రతిదినమును బూజించిన | యతఁ డేఁగు న్విష్ణుపురికి నధికవిభూతిన్.

252


క.

[225]ప్రణవాదినమోంతములగు | ఫణివల్లభతల్పశయను బహు[226]నామములన్
బ్రణుతించి, కృష్ణతులసీ | [227]మణిదళములఁ బూన్చునతఁడు మాధవుఁ జేరున్.

253


సీ.

శ్రీభర్త నొకతులసీదళంబునఁ బూజ | గావింప [228]నుపపాతకంబు లణఁగు,
వారిజాక్షుని దళద్వయమునఁ బూజింప | స్వర్ణచౌర్యాదిదోషములు దొలఁగు,
దనుజాంతకుని దళత్రయమునఁ బూజింప | బ్రహ్మహత్యాదిపాపంబు లడఁగు,
జలజనాభుని జతుర్దళములఁ బూజింప | నింద్రుఁడై సురలోక మేలుచుండుఁ,


తే.

బంచదళముల భక్తిసంపన్నుఁ డగుచుఁ | బంచసాయకగురుని బూజించునట్టి
పరమపుణ్యుఁడు వైకుంఠపురి వసించు, | నంతమీఁదటిఫలము శ్రీహరి యెఱుంగు.

254

క.

హరిచరణకమలసేవా | కరణదృఢోత్సాహుఁడైన ఘనునకు వర్యా
చరణీయము, తులసీతరు | పరిణతదళపూజనంబు పార్థివతిలకా!

255


ఉ.

భూరిగురు[229]ప్రసాదమున బోధవివేకముఁ గొంత గాంచి, త
త్కారణపుణ్యకర్మములఁ దా నొనరింపుచు, శాంతిరత్నభూ
షారమణీయగాత్రుఁడయి, [230]సత్యమునందు నిజాంతరంగముం
గూరిమిఁ బాయనీక పని గొంట యవశ్యము బుద్ధిశాలికిన్.

256


క.

దానంబును, బుణ్యనదీ | స్నానంబును, దేవపూజ, సత్యము, సదను
ష్ఠానము ననియెడునవి సు | జ్ఞానమునకు సాధనములు జగతీనాథా!

257


క.

భక్తిజ్ఞానగుణద్వయ | యుక్తుండై తనరు సజ్జనోత్తమునకు, నా
సక్తమతి నొసఁగు శ్రీహరి | [231]ముక్తివధూయోగసౌఖ్య మును జననాథా!

258


క.

హరి దైవము, హరి దైవము, | హరి దైవము సుమ్ము! నమ్ము, మవనీశ్వర! యా
హరిఁ గొలువు, మమ్మహాత్ముఁడు | కరుణానిధి [232]నీకు నొసఁగుఁ గైవల్యంబున్.

259


మ.

అని బోధింప, వశిష్ఠమౌనివచనవ్యాప్తిన్ మయూరధ్వజుం
డును చిత్తంబు కలంకదేరిన, గరిష్ఠుండై వశిష్ఠాదిస
న్మునుల న్వీడ్కొని, దుష్టమోహలత నున్మూలించి, లక్ష్మీశ్వరున్
వనజాక్షు న్మదిఁ బాదు కొల్పి, యితరవ్యాపారనిర్ముక్తుఁడై,

260


క.

పంచజనోద్భవధరు నా | పంచాస్త్రగురున్ భజించి, భావించి, తగన్
బంచమదినమున నాతఁడు | పంచత్వము నొంది పరమపదముం గనియెన్.

261


వ.

ఇవ్విధంబున మయూరధ్వజుండు హరిపురప్రాప్తుం డగుటయుఁ, దత్కుమారుం
డభిషిక్తుండై, రాజ్యంబు సేయుచుండె నని, కై వల్యఖండ[233]మాహాత్మ్యంబు వివరించిన,
మార్కండేయాదిమునీంద్రులు రోమశు నభినందించి, యనంతరంబ, విజ్ఞానఖండశ్రవణ
కుతూహలులై యుండి రవధరింపుము.

262

ఫలశ్రుతి

మ.

కపటస్వాంతులు గాక, యెవ్వ రిల నాకాంక్షించి, యేతద్వరా
హపురాణంబున నాదిఖండచరితం బాద్యంతము న్విందు, రా
నిపుణు ల్గాంతురు పుత్రపౌత్రధనవాణీసంపదాయుష్యము
ఖ్యపదార్థాదితసౌఖ్యతృప్తియుఁ, దుదిం గైవల్యసంప్రాప్తియున్.

263

ఆశ్వాసాంతపద్యగద్యములు

లయవిభాతి.

విమలగుణభూష! బుధకమలవనపూష! నిజ
[234]సుజనపరితోషజితహిమకరవిశేషా!
సమదరిపుజైత్ర! నవకుముదనిభనేత్ర! కుల
సముచితవిచిత్ర! పరిణమితనిజమిత్రా!
ప్రమదరసలోల! హతసమదహితజాల! ముర
విమతనతిశీల! మతిశమితమదలీలా!
యమరపతికల్ప! రతిసమరబహుశిల్ప! బలి
దమనపగితల్పఫణిరమణసమజల్పా!

264


క.

రూపాపహసితసుమన | శ్చాప! కలాలాప! దానసౌమనసమణీ |
దీపితహృత్పుటపేటీ | గోపితరుచిపూర్ణమదనగోపాలమణీ!

265


మాలిని.

శతమఖసమభోగా! సాధురక్షానురాగా!
సతతహరిసపర్యా! సప్తసంతానధుర్యా!
వితరణగుణధామా! విస్ఫురత్కీర్తిసీమా!
హితజనసురభూజా! యెజ్జయామాత్యరాజా!

266

గద్యము

ఇది శ్రీ హనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణితనూజాత, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదవిఖ్యాత, హరిభట్ట ప్రణీతం
బైన వరాహపురాణంబునఁ గైవల్యఖండంబను పూర్వభాగంబునందుఁ బంచమాశ్వాసము.


సంపూర్ణము

  1. కందళిత - క
  2. నొంద - మ, త, తా
  3. యొనరించు (యతి?) - మ,తి,క
  4. దగదు - త
  5. సన్యాసియోగ్యంబు - తి తీ
  6. నధికార - త,తా
  7. నసమ - క
  8. గలదర్శనంబులఁ గలసియుండు - తి, తీ; దర్శనత్వము నాత్మఁ దగులనీఁడు - మా; దర్శనం బందునఁ గలసియుండు (యతి?) - మ,తా,హ ,ర క
  9. స్తుతి-మా కంటె భిన్న ప్ర.
  10. నంటిన వరలెడు స్పర్శంబు మతి - తి తీ; నన్యవస్తువు లేమి ముట్టిన - త; నంటక వరలినను మతి - మ,తా,హ,ర,క
  11. పతికి - మ, తి, తీ,హ,ర,క
  12. నొక్క - తా
  13. చరణుండును - తి, తీ
  14. చండాంశుండున్ బురుష - తీ; చండాంశుఁడు తత్పురుష - మ,మా,త, తా, తి,హ,ర
  15. నున్లేని - అన్ని ప్ర.
  16. సుకృతంబుచేత - మా,త
  17. మాత్ర - త
  18. పత్రములు . మ,త, తా, తి, తీ, ర,క
  19. పరిఘ - తీ కంటె భిన్న ప్ర.
  20. మెఱసి - తి, తీ
  21. పుట్టిల్లు - మ, తి తీ
  22. పింట - ర; పెంపు - తి,తీ
  23. సంగత - త కంటే భిన్న ప్ర.
  24. నార్థమై - మ,మా, తి, తీ: నార్తుఁడై - హ
  25. తీర్చి - మ,మా,త, తా, హ,ర,క
  26. బ్రియతనమొప్ప - మా,త, తా
  27. పశుబంధనంబు - మ
  28. సమృద్ధ - తి, తీ
  29. వీడి - ర
  30. సేయఁగ - తి
  31. వరున కొసంగి - తి, తీ
  32. తోడుకొని - తి, తీ
  33. దిత - తా
  34. దారు - హ
  35. వివాద - తా
  36. నాలము (యతి?) - మ,త,ర
  37. రాగతన్ - హ
  38. బోఁడి - త,హ,ర; బోడి - తా
  39. యిర్వురకున్ - తి తీ
  40. జెల్లెల యీ - తి, తీ
  41. దుఃఖ - మా
  42. భజింతుగాక - మా, తా,హ
  43. నెట్టి - మా, ర; నిట్టు - త, క ; బెట్టె - తా; జేయు - తి, తీ
  44. సత్తము - తి తీ
  45. తలి - అన్ని ప్ర.
  46. రోషాకులాత్మ - తి, తీ, క
  47. గోరి - తా
  48. నాఁగాని - తా
  49. సమంబులు - త
  50. భక్తితోడ నా
    తనికి నమస్కరించి వసుధాదివిజోత్తమ యేను నీదునం
    దనుఁడను శీలనాముఁడ మనంబున నన్ను నెఱింగితే యనన్ - తా
  51. అచ్చెరువంది విప్రవరుఁ డాతనిఁ గన్గొని నిన్నుఁగూడి యా
    వచ్చిన - తా
  52. ననుఁదాసతంబు - మా,త
  53. డిచ్చకమున - తి,తీ
  54. ఎసఁగ - తి తీ
  55. నాకు న్నాకాంక్ష వొడమె శోక - మ,మా, త; నాకుంగాంక్ష జనించె నశోక - తి, తీ,క
  56. నీంద్రా - తా
  57. తాస్యుడై - క
  58. ఈతెరువు సురేంద్రపురి | ప్రీతి జను న్నది చూడఁగఁ బ్రేతవీటికిం - మ; ఈతెరువు శమనువీటికి | నీ తెరువు సురేంద్రపురికి నేఁగును భువన - మా; ఈతెరువు సురేంద్రపురికి | నీతెరువు కృతాంతనగరి కేఁగును భువన - త; ఈతెరువు ప్రేతపతిపురి | కీ తెరువు సురేంద్రపురికి నేఁగును భువన - తా; ఈతెరువు శమనపురమున |కీతెరువు త్రిలోకపాలుఁ డింద్రునిపురికౌ - తి, తీ; హ,ర ప్ర.లో ఈ భాగము లుప్తము.
  59. పరుడై - తా
  60. నెంచి - మ,క
  61. రతులునైనవారిని గను - తి, తీ
  62. జోమన - అన్ని ప్ర.
  63. సంఘములు - మ, తా,హ,ర,క
  64. రాజాంగనా - మా,త; పరాంగనా - తి, తీ
  65. మతులు - మ,హ,క
  66. నరక - త
  67. గల - తీ
  68. జేరఁబట్టు - తీ
  69. రంగన్ముఖ - తా
  70. జనపదాది - త; ద్వాపదాది (యతి?) - మ,మా,క; చౌపదాది - తి,తీ,హ,ర
  71. తఱచై - మా
  72. శరణ్య! ముందుగా - తి.తీ; శరణ్యుఁ డెత్తుగా - త; శరణ్యుం డింతలో - తా; శరణ్యుఁ డింపుగా - క
  73. ఈ పద్యమును, దరువాతి వచనమును ర. ప్ర.లో లుప్తము.
  74. నికరాత్ముల - త. కంటె భిన్న ప్ర.
  75. భేద్యు (యతి?) - అన్ని ప్ర.
  76. మోహాది - మ, తా, తి, తీ,హ, ర,క
  77. వాచ్యములం - తా
  78. నన్విదితులై - అన్ని ప్ర.
  79. దానాఢ్యులై - తీ కంటే భిన్న ప్ర.
  80. తత్పదంబు - తా
  81. దివౌకసుల్ - తీ
  82. పాద - తీ
  83. సర్వావలోకన - తీ
  84. మండిత - మ,మా, తా, తీ, హ, ర,క
  85. పొడమ - మా
  86. భూసురుల్ - తీ
  87. వర్ణ - మా, తా
  88. పర - తా,తి, తీ
  89. మౌ, రణాంతరమున - తి, తీ
  90. మహి - త, తా
  91. శేష - తా, తి, తీ,ర
  92. డైశ్వర్యమునకు - తా. కంటె భిన్న ప్ర.
  93. జౌర్య - మ,మా, క
  94. నొప్పుచు - అన్ని ప్ర.
  95. తగిలి గీతవేష - మా,త,కంటె భిన్న ప్ర.
  96. భాగము - మ,హ,ర,క
  97. గలుగఁజేసి - తా
  98. జతురాననుండన - తీ కంటే భిన్న.
  99. బలాఢ్యసాధ్య - అన్ని ప్ర.
  100. గలిగిన యాగమములు - త
  101. వామా - మా
  102. నప్సరతండంబు - తా
  103. సత్త్వ - మాత
  104. పంపు - త కంటే భిన్న ప్ర.
  105. ధామా - మా
  106. పంపఁగా - మ,మా,త, తీ
  107. వెండి - మ,తా,హ,ర
  108. హయార్థ - మా
  109. వెల్లి - మ, ర, క
  110. దాపబాలాంత - త
  111. శశిధరునిజజటా - త
  112. గాంచి - మ,తి, తీ,హ ,ర, క
  113. ఈ ప.ర ప.లో లుప్తము.
  114. పటు - మ, తా,హ,ర,క
  115. పూన్కె - మ, తా,హ
  116. విక్రమమునంధర (యతి?) - అన్ని ప్ర
  117. మహీ(ధవుండు మిథ్యావృతనింద)ల న్విని - తీ
  118. వళిగాంచి భూమిజను దప్పకనంపె - మ
  119. దూఱుచుం - మా, త, తా
  120. ధరణిపతి తన్ వృథా వనస్థలి వసింపఁ | బంప, శోకాకులత గళద్బాష్పయౌచు, డిల్లపడి రక్షణాశఁ దన్నల్లఁ జూడ - తీ; ధరణిపతియగు రాముని విరహతాప | మునను సోలుచు నెవ్వగ మునిఁగియున్న | ధరణిసంజాతఁ గనుఁగొని తలఁకు నొంది - హ; ధరణిసుతఁ దనుధూళి - క; ర. ప్ర. లో, దుది పా. మాత్రము కలదు.
  121. పుణ్యుఁడౌ - మా,త, తా,హ,ర
  122. నంతలోనఘన - మ; నంతలోనయమ - తా
  123. సద్వతిఁ బెండ్లియై మహా | రతిశతభోగము ల్దనిపి రమ్యపురాకృతపుణ్యరాశియం | దతిథి - మ; రాజ్యము దాలిచెం గుముద్వతి - తీ
  124. నిషండు - మా,తీ,ర
  125. వాసవ - తీ,హ
  126. నదెనిదె - మ,హ; వదినికె - మా,త; నదెవిదె - తా; వికసిత - తి, తీ; మరియును - క
  127. నమృతాంధసులకు - మా
  128. రత్నము - తి,తీ
  129. బెట్ట - తా
  130. విట్టిమట్టు - మ; వీటిమట్ట - తా: బిట్టుమట్టు - తి, తీ; విట్టిమట్టి - హ; వింటిమట్టు - క
  131. నాచకోర - తా
  132. యోగధ్యాన - మా, తి, తీ
  133. యుక్తధర్మమార్గ - తా
  134. పదునలుగురు - తా కంటె భిన్న ప్ర.
  135. సత్త్వ - తీ
  136. ధరయం - తా
  137. క్షర - మ,మా, తా,హ,క
  138. నొకటేని - తీ
  139. వర్ణన - తా
  140. రంభ - త
  141. మహా - తి, తీ,ర
  142. రోపిత - త
  143. సువివేకభావ - తీ
  144. డకట - తీ
  145. వ్యాపార - త
  146. బొరలక - తీ
  147. వాజి - తీ
  148. భుజవల్మీ - హ; భుజకర్మీకృత - ఇతర ప్ర.
  149. సంయుతమై యనీమమగు - మ, మా, తి, తీ,హ,ర,క
  150. గూడిన - తా
  151. కరము - తీ
  152. సోమపుర - అన్ని ప్ర.
  153. నిలిపి - తీ
  154. రప్రార్థితు లయ్యు మహా - త. కంటె భిన్న ప్ర.
  155. చయంబుల - మ, తి,తీ,హ,ర,క
  156. ఈ ప. తా ప్ర. లో లుప్తము
  157. దూరం - మా,త, తా
  158. తత్కలక్రమం - తా
  159. తన - మా
  160. బొంబసిఁడి పగ్గము - త; క్రొంబసిఁడి - మా, తా
  161. మోహ - తి తీ
  162. తెచ్చితివి - తి తీ
  163. గుదె కొకపెట్టు నాఁగ - తి తీ
  164. నలయిక . తీ
  165. ఇందలి యెత్తుగీతి పంచపాది
  166. యును రాగరసంబున - త
  167. నంతటన్ - తీ
  168. వారిజదళాక్షుల కేశములందు (యతి?) - తా
  169. చల్లన - తా,తి, తీ
  170. శిఖరంబు - తీ
  171. సుతాదులం - తీ
  172. దీప - తీ; దెప్ప (యతి?) - తీ. భిన్న ప్ర.
  173. భూరిదాహ మ ర క; భూరిధావ - మా; భూరిదాహ - త దూరదుర్గావ (హ?) - తి, తీ; దూరీదావ - హ
  174. నితాంతము - మా
  175. జక్కువల్ - మ,మా, తా,హ,ర,క
  176. ఁదా గడి - తీ
  177. దీప్యమానుఁడై - తా, తి, తీ
  178. గుండురుక - మ,త, తా, క; గుడ్డురక - మా,ర
  179. బంతు - మ,మా,హ,క; బూతు (యతి?) - తా; బాతు - త, తి , తీ,ర
  180. తాన - త; దాళ - త. కంటె భిన్న ప్ర.
  181. డాసి - మా
  182. యనఁగ - తీ
  183. తతిగరిమము - తీ
  184. ముకుళముల - తా భిన్న ప్ర,; కుముదముల (యతి?) - త
  185. పెంపు - మా. భిన్న ప్ర.
  186. యింతికి - తీ
  187. కామినీ - తా
  188. పూనికె - మ, త, తా
  189. భుజించు - తా
  190. మహి - తి,తీ
  191. యెత్తుకోలు - మా,త
  192. శేకరించె - మా; శీకరించె - త; స్వీకరించె - తా,క: సేకరించె - తి,తీ,హ
  193. గురువైనయట్టి యీ - తీ
  194. ఁజేసె - తీ; ఁగొనియె - త
  195. నుండెఁగాక - అన్ని తాళ. ప్ర: నుండు టెట్లు-తీ
  196. బాయుటెట్లోకో - తీ
  197. బేరిచ్చలన్ - మా; వర్తింపుచున్ - తీ
  198. జఱ - ర,క; జూడ - మా,త
  199. జెఱచెనో - త, తా, తీ
  200. ద్విజనులై - తీ
  201. గోళంబు కన్నీరు - తి,తీ,హ,ర,క
  202. ప్రియా ననుఁ బాయఁగ - తీ
  203. దగునె (యతి?) - తీ. భిన్న ప్ర.
  204. సహితమానసుండై - క
  205. యాసందెఱుగంగవలదె ప్రాజ్ఞున కెపుడున్ (యతి?) - మ, తి, తీ,హ,ర,క
  206. వసుధాధీశా (యతి?) - మా, తా: యవనీనాథా (యతి?) - త
  207. ఫక్కులు నిత్య - తీ; బారిన నిత్య - మ, తా,హ,ర,క
  208. త్యాగంబొనరింపలేక - తీ
  209. జయంబుదించు మ, మా, త, తి, తీ, హ, ర, క
  210. నైకకంఠ్యంబుగా - తీ
  211. లది - తా, భిన్న ప్ర.
  212. తరలి - తీ
  213. దప్పి - తి,తీ
  214. బ్రహ్మఘ్నుడైన - త
  215. దాత్తుండు - మ, మా, తి, తీ, హ, ర, క
  216. విశ్వ - త
  217. కృతమూర్తి - త. భిన్న ప్ర.
  218. నగ్నిసూత్రప్రక్రియా - తా
  219. తానమాడిన - మా, త, తా, తీ
  220. దగుఁ - మ, మా, హ, ర
  221. తరముల్ - మ, త
  222. శ్రీరమాపతిని ధీరత - త; శ్రీపతిందలఁచి - మా
  223. నొసఁగు - మ, తి, తీ, హ, ర, క
  224. నిరువు - తా
  225. ప్రణవాదిని మొత్తములగు - తీ
  226. మానములన్ - తీ
  227. మణులం బూజించునతఁడు - తా
  228. నృప - తీ, హ, ర
  229. ప్రదానమున - మ, తారా, తి, తీ,హ ,ర,క
  230. సత్త్వము - తా, తి, తీ
  231. ముక్తిదమాయోగ - త
  232. నీ కొసంగు - తీ
  233. మహత్త్వంబు - మ, మా,హ,ర
  234. సుజన (ప్రాస యతి?) - అన్ని ప్ర. (సుముఖ?)