వరవిక్రయము/రెండు మాటలు
రెండు మాటలు
తెలుగు సాహితీ వనంలో వెల్లివిరిసి, సంఘంలో నెలకొని వున్న చెడును, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి సాహిత్య సేవతో కలంపట్టి ఉద్యమించిన గుఱజాడ, కందుకూరిల కోవలో కాళ్ళకూరి నారాయణరావు ఒకరు;
సంఘంలో వేళ్ళూనుకుపోయిన వరకట్న పిశాచాన్ని పారద్రోలాలనే తపనతో- అవనిలో ఆడదానిగా పుట్టుటే తను చేసుకున్న పాపమా! అని ఏ స్త్రీ హృదయమూ ఆక్రోశించకూడదని ఆశించి; ఆడపిల్ల పెళ్ళి విషయంలో మొగ పెళ్ళివారి ఆశలు, ఆగడాలు-ఆడపెళ్ళివారి అవస్థలు కనులకు కట్టినట్టు సజీవపాత్రల జీవన చిత్రణము వరవిక్రయము.
సాహితీ సంద్రాన్ని మధించి పలుప్రక్రియలలో యాబది ఎనిమిది ఆణిముత్యాలతో తెలుగు తల్లికి నీరాజనాలర్పించిన శ్రీ కాళ్ళకూరి నారాయణరావుగారి రచనలలో స్వాతిముత్య మీ వరవిక్రయము.
రజస్వలానంతరం ఆడపిల్లలకు పెండ్లికావడం దుర్లభం. కారణము సంఘం ఆ కుటుంబాన్ని వెలివేస్తుంది. మరి యుక్త వయస్సు రాకుండానే పెండ్లి చేయాలి? 10 సంవత్సరాలు నిండగానే పెండ్లి, పెండ్లి అంటూ తల్లి తపన, తండ్రి ఆరాటం, కాళ్ళు అరిగేటట్లు తిరగటం, సంతలో సరుకులా పెండ్లి కొడుకుల తండ్రులు పెండ్లి కొడుకులను వేలం పెట్టగా, ఉన్న ఆస్తి సర్వస్వం తెగనమ్మి పెండ్లి కొడుకుల దండ్రుల యదాన కొట్టడం. ఆపైన అలో లక్ష్మణా అంటూ, ఎందుకు కన్నామురా ఆడపిల్లలననే ఆ తల్లిదండ్రుల ఆవేదన. యిదీ వరస-