వరవిక్రయము/జీవిత సంగ్రహము
జీవిత సంగ్రహము
శ్రీకాళ్ళకూరి నారాయణరావుగారు 28-4-1871న పశ్చిమగోదావరి జిల్లా మచ్ఛపురిలో పండిత కుటుంబంలో జన్మించారు. వీరు కవి, నాటకకర్త, కథ, నవల, చరిత్రలు, వ్యాసాలు మొదలగు సాహితీరంగములో అన్ని కోణాలను దర్శించి; 7 నాటకాలు, 13 ప్రహసనాలు, ఒక నవల, 3 కథలు, 3 విమర్శగ్రంథాలు, 3 చరిత్రకు సంబంధించిన రచనలు, 11 వ్యాసరచనలు, 5 గ్రంథ విమర్శలు, 10 కవితలు, 2 చిత్ర కావ్యములు మొదలగు 58 గ్రంథాలు రచించారు.
నారాయణరావుగారిపై వీరేశలింగంగారి ప్రభావం ఎక్కువగా వుంది. వీరు మహాకవులు, మహాపండితులు కొప్పరపు కవుల శిష్యులు, సంఘసంస్కర్త, బ్రహ్మసమాజికులు, నైతిక సంపత్తిగల శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడుగారికి సహచరులు కూడాను.
నారాయణరావుగారి సోదరి బాలవితంతువు. ఆమెకు పునర్వివాహం చేయాలనే పట్టుదలతో తండ్రితో ఘర్షణపడి ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆ రోజులలోనే కట్నకానుకలు లేకుండా వర్ణాంతర వివాహం చేసుకున్న గొప్ప సంఘసంస్కర్త.
వీరు నాటక రచయితే కాక మంచి నటుడు. టంగుటూరు ప్రకాశం పంతులుగారు దమయంతి పాత్ర వేస్తే, ఈయన నల, బాహుక వేషాలు వేసి ప్రజల మన్ననలు పొందారు. ఈయనకు ఫోటోగ్రఫీ, ఆయుర్వేదం, యోగాభ్యాసంలో మంచి ప్రవేశం వుంది. అంతేగాక మంచి గజ ఈతగాడు. గోదావరిని ఈవల నుంచి ఆవలకు ఈదిన ప్రముఖులు.
అధ్యాపకులుగా, వైద్యులుగా పత్రికా సంపాదకులుగా, పట్టాలేని ప్లీడరుగా, అన్నిటా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎన్నో అష్టావధానాలు, శతావధానాలు చేశారు.
సంఘంలో జరిగే దురాచారాల మీద వరవిక్రయము, చింతామణి, మధుసేవ వంటి నాటకాలు రచించారు. అవి ఎంతో ప్రజల మన్ననలు పొంది ప్రసిద్ధికెక్కాయి. వీరి ప్రథమ రచన "లుబ్దాగ్రేసర చక్రవర్తి" ప్రహసనము; చివరి రచన "సంసారనటన". వీరు 27-6-1927న నిర్యాణము చెందారు.