వదరుబోతు/సుఖస్వరూపము
సుఖ స్వరూపం
10
సుఖాపేక్ష మానవులకుఁ గడవరానిది. అనుదినమును విసుగు విరామములు లేక మన యాచరించు పనులును, ఏడు ప్రయాసములును, అనుభవించు కష్టములును, సుఖాపేక్షం బట్టియే!
ఆత్మరక్షణాసక్తియే జంతు జాలమునకుఁ బకృతి సిద్ధమైన ప్రథమోద్దేశమని కొందఱూహింతురు. కాని, యది యంతగా నన్ని వేళలయందును నిజముగా నేరదు. సౌఖ్యనాశము ప్రాణములపై కూడ నిరపేక్షక జనింపఁ జేయు చుండుట మనము గాంచుచున్నారము. దయితా వియోగమునఁ బ్రాణములకుఁ దెగించు పురుషులును, ప్రియవిరహమున నసువులువాయు రమణులును మనకుఁ గ్రొత్తలుకారు. సామాన్యదృష్టికి జీవి- తోద్దేశములుగఁ గానవచ్చు దేహబుద్ధి బలములును, జ్ఞాన వైరాగ్య సంపదలును, విద్యావివేకధనము లును, మున్నగువానిపై మానవులకుఁగల యాశను విమర్శించి చూచినచో నన్నింటికిని నిదానము సుఖాసక్తిగ స్పష్టముగ గోచరించును. అంగనా వ్యాసంగపరుఁడు మొదలుగ నంతరాత్మ వ్యాసంగ పరుని దాఁక సర్వులును సుఖము - సుఖ మనియే భ్రమించుచుండుట! కానీ సుఖమెందున్నది?
ప్రత్యుత్తరమునకుఁ దత్త్వజ్ఞులు ముందు వెనుకచూడరు. జీవితోద్దేశ మిట్టిదని మతాచార విధుల ననుసరించియో, ప్రకృతిశాస్త్ర రహస్యములు మూలమున నూహలనల్లి యోయుపన్యసింపవత్తురు. ఆకాశమున మేడల నిర్మించుకొని గాలి యుయ్యెల లలో నూగుచు మనసున మండిగలు చేసుకొని రచియనుభవింతురు.
అవాఙ్మానసగోచర మగు వస్తువు నెఱుఁ- గుటకై వినువానికన్న నుపదేశించువాని కెంత యర్హతయున్నదో నాకింకను బోధపడినదికాదు. పోనిండు. మన మిపుడు నేరువవలసిన విద్య బ్రతుకు, బ్రతుకున సుఖులమైతిమేని ధన్యులమే! కాని సుఖమెట్టిది? ఈప్రశ్న కుత్తరము సులభముగాదు. ప్ర- పంచమున సుఖమిట్టిదేయని కాని యది తనసొమ్మే యనికాని నోరువిడిచి చెప్పసాహసించు ధైర్యశాలి మన కంటఁబడఁడు. అయినను జన్మమెత్తిన మీఁద నొకప్పుడైన సుఖమును చవి చూచితినని యను కొనని యభాగ్యుఁడు లేఁడని మాత్రము చెప్ప వచ్చును. కాని యొక్కొకనికది యొకరూపమునఁ దోచుచుండును.
దధి మధురం మధు మధురం
ద్రాక్షా మధురా సుధాపి మధు కైవ!
తస్యత దేనహి మధురం
యస్య మనో యత్ర సంలగ్నం
అనురీతి నెవని మనను దేనిపైనుండునో, తత్రాప్తియే సుఖమూర్తియని వాఁడు తలపోయు ను. ఇంతియకాదు; నేఁటి సౌఖ్యము రేపటికట్లు తోపదు. కాక, కోటీశ్వరులును రాజాధిరాజులును గూడ ననేకసమయముల నిఱు పేదలకన్న నెక్కుడ సుఖదూరులుగ నుండుటకలదు. మఱి ప్రపంచమున వాస్తవముగ నట్టిపదార్థమే లేదా!
నిన్న సాయంతనమునఁ దటాకపు టొడ్డునఁ గూర్చుండి యీవిషయమై తలపోసి కొనుచుంటిని. ఒక యవ్వ నీళ్ళకై వచ్చియుండి నాశూన్య దృష్టు లను బరధ్యానమును గమనించి కారణమడిగెను. మునుపు హరికథకుఁ బోయిననాఁడు కూనలమ్మ కీర్తన పాడిన యవ్వగా గుర్తించి నాయాలోచనల నామె కెఱిఁగించితిని. ఆమెయు నవ్వి వినుమని నాకీకథఁ జెప్పెను.
పూర్వ మొకప్పుడు నలుగురు యువకులు చేరి ప్రపంచమున నత్యుత్కృష్టమగు సుఖమును బడయఁగోరి చాలకాలము పంచాగ్ని మధ్యమునఁ దపమాచరించి రఁట! దైవము వారికీఁ బ్రత్యక్షమై కోరికె యడుగఁగా నందఱు నేక వాక్యమున “మహా ప్రభూ! సర్వోత్త మమగు సుఖమును బ్రసాదిం- ఫుము.” అని ప్రార్థించిరి, “సరే! కాని చెఱి యొకవిధమగు సుఖ మివ్వవలనుపడదు. నేను మరల మూడుదినములకు వచ్చెదను. ఆలో మీరు నలుగురును మంతనముండి మీ యండఱకును రు- చించు సర్వోత్తమమగునట్టి సుఖమేదో నిర్దరించు కొని నాకుం జెప్పినచో నిచ్చెడ” నిని భగవంతుఁ జానకిచ్చి తిరోహితుఁడయ్యె.
నాఁడంతయు తనంతనాలోచించి విషయము నిర్ధారించుకొని మఱునాఁ డొక్కొ కఁడు తన సిద్దాం తమును వ్యక్తము సేయునట్లుగవారు తీర్మానించు కొనిరి. తోడనే చెఱియొక వివిక్త స్థలమునఁ గూ- ర్చండి నాఁడు రేయెల్ల కనుజేప్ప వేయక యనేక ప్రకారములఁ దమ మేధాశక్తిని తలక్రిందులు సాముచేయించుచు వాకండలు నాలోచించుకోను చుండిరి.
మఱునాఁ డుదయమున నొక చోట వారే- ల్లరు సమావేశమైనపుడు ప్రధముఁడైశ్వర్యము కోరుదమనియె. ద్వితీయుఁడు శాశ్వత దేహారోగ్య మునుగోరెను. "సంపదలు. క్షణ భంగురములు దేహము బుద్బుద ప్రాయము. సుఖమన్న నిరంత రమును గామినీజనపరివృతుఁడై దర్పకుని తక్కథై లాడించుటే సుఖ"మని తృతీయుఁడు వాదించె. నాలవయతఁడు "విద్యాధనమే సుఖ" మనియెను. నలుగురును వాదులాడఁజొచ్చిరి; తర్కింపసాగిరి. పూర్వపక్షములు లెక్కకు మీరి బయలు దేరెను. దానిలోఁ గొన్ని తునుక తునకలుగ ఖండింప బడియె. కాని సిద్ధాంతము స్థిరపడ లేదు. రెండు దినములు గడచె .
మూఁడవ నాఁడు కూడ సాయంకాలము దాక వాదముజరుగుచునే యుండెను. “ఆరోగ్యమే సుఖ; మెన్నియున్న నేమి?” యని యొకఁడు స్థాపిం- పఁగా నితరుఁడు, తినకూడును, కట్టుబట్టయు లేక గూబ బ్రతికినట్లు బతికిన నేమి సుఖమని యెత్తి పొడిచెను.
“విద్యానామ సరస్య రూప మధికం
ప్రచ్ఛన్న గుప్తం ధనం ”
అని యొకడు సాధింపఁగా, కాదని,
“అసారే ఖలు సంసారే
సార స్సారంగ లోచనా!”
యని యింకొకఁ డుదహరించెను. ఇట్టి మూర్ఖులం గూర్చియే.
శా|| "చన్నుల్ కాక పసిండి కుండ లఁట! వక్ష
శ్చర్మ దుర్మాంసముల్,
కన్నుల్ క్రొవ్విరి దమ్మి రేకులఁట! వే
ల్ల ద్దూషికా గోళముల్,
వెన్నుల్ సోగ యనంటి యాకులఁట! సం
వీతార్థి పుంజంబులీ,
యన్నుల్ సౌఖ్యముగాఁ దలంచు జను లా
హా యెంత మూఢత్ములో"
యని వ్రాసిరని ద్వితీయుఁడు నవ్వెను. వాని మిత్రున కిది యరకాలఁ బెట్టిన కొరవి నెత్తికెక్కి నట్లయ్యె. అతఁడు రోషావేశమునఁ దటాలున లేచి "ఛీ! అబలాజాతి నింత యగౌరవమాడిన చండాలుఁడు భూమిలోనుండ ననర్హు ”డని చేతి కబ్బని నూఁగు మీసములఁ దిప్పుచు యుద్ధసన్న ద్దుఁడు కాఁగా, నతని ప్రతిపక్షుఁడు “జాగ్రత!” యనుచు నశనింబోలు ముష్టింజూపెను. కొంత తడవు ప్రహారములతో సన్యోన్య దేహములపై వారు పూర్వపక్ష సిద్ధాంతములఁ జేసుకొను చుండిరి.
అంతలో సకాలమున నాకసమున మెఱుపు మెఱసినట్లయినది. ప్రథముఁడు పైకిఁజూచి “అదో భగవంతుఁడు?" అనియె. వాదములకింక నవకాశము లేదు. ఈశ్వరుని యెదుట నిపుడేమని విన్నవింప వలయునను విషయమై వారు చాలఁ జింతాక్రాంతు లైరి. అపుడించుక వివేకశాలియగు నాలవవాఁడు 'ఈవాదములతో మన కేమియు స్థిరపడినది కాదు. స్థిరపడినదికాదు. మసలో నొకఁడు కోరినది యితరులకు రుచింపదు, కాన నందఱకు రుచించునట్లుగ నే నొకటి చెప్పె దను " అని యొక మార్గము బోధించెను. అందఱును సమ్మతించిది.
ఆకసమునుండి విమానము క్రింది కవతరించెను. "ఏమి నిర్దరించితిరి? మీకేసుఖము కావలెను?” అను నక్షరములు భగవంతుని నోటి నుండి వెడ లియు వెడలక మున్న నలుగురు నేక వాక్యముగ “స్వామి! మా కేసుఖమునువలదు.మేము కోరు వరమింతే అనిరి. భగవంతుఁడును నవ్వి "మీ కిపుడు సుఖస్వరూపము బాగుగఁ దెలిసినది. ఇంక మీకు నేనియ్యఁ దగిన దేమియు నుండదు. పొండు!" అని యానతిచ్చి యంతర్థాన మందెనఁట
_____________