రాధికాసాంత్వనము (సముఖము)/రమ్యావలోకనము

రమ్యావలోకనము


సముఖము వేంకట కృష్ణప్ప నాయకుని
రాధికాసాంత్వన పీఠిక


రాయలనాఁటి రసికత నాయకరాజులనాఁటికిఁ బరకోటి ముట్టినది, పతనోన్ముఖము నైనది. అప్పటి యాంధ్రప్రబంధములు శృంగారరసపుఁ బసకును గసకును బరమావధు లని చెప్పవలె. అట్టివానిలో సముఖము వేంకట కృష్ణప్ప నాయకుని రాధికాసాంత్వనము నొకటి. పౌరాణికప్రతిష్ఠ గల ప్రబంధనాయికలలో రసప్రసిద్ధమైన వ్యక్తిత్వము గలవారిద్దఱే రాధిక, సత్యభామ. సముఖము కృతిలో నాయిరువురు నాయికలును గలరు. రాధికది ప్రధానభూమిక. సత్యభామ సవతి. రాయలనాఁటి ప్రబంధరాధిక స్వీయ. సత్యభామ సరేసరి; ఎప్పుడును ఖండితనాయికయే. అస లామె ఖండిత కాకున్నచో సొగసే లేదు. కాని దక్షిణాంధ్రకవుల చేతిలోఁ బడగానే వారి వాలకములు మారినవి. నాఁటి వీథినాటకములలో సత్యభామకును ప్రబంధములలో రాధకును బ్రాధాన్యము హెచ్చినది. రాధ పరకీయయు నైనది. పైఁగా సత్యభామ ఖండితనాయికాత్వము నామెకు సంక్రమించినది. సంప్రదాయసహజముగాఁ బ్రేమాభిరామములు గావలసిన యా నాయికల యాకృతు లప్పటికృతులలోఁ గామక్రీడాభిరామము లైపోయినవి. అయినను నభిరమ్యత యన్న దొకటి మిగిలియున్నది కనుకనే వాని కావ్యత్వమున కింత నిలుకడ గలిగినది.

మన కిప్పు డుపలభ్యము లగు రాధికాసాంత్వనములు రెండు. సముఖము కృతి యొకటి, ముద్దుపళని దొకటి. ఇరువురి కవితలకును బోలిక లిరుగుపొరుగుగా నున్నవి. పద్యము లఱువది పైచిలుకు రెండింట యథాతథముగా నున్నవి. సముఖము క్రీ.శ. 1704-1731 సం.ల మధ్య మథుర నేలిన విజయరంగ చొక్కనాథనాయకుని ముఖ్యసామాజికుఁడు. ముద్దుపళని క్రీ.శ. 1741-1764 సం.ల మధ్య తంజావూరు నేలిన మహారాష్ట్రప్రభువు ప్రతాపసింహుని నాస్థానిని. విజయరంగని రాజ్యకాలమునకే వేంకట కృష్ణప్ప వృద్ధుఁడై యుండె నను యూహకు నుపాధి గలదు. (చూ. ఆం.సా.ప. ప్రచురణ వచన జైమిని భారతమునకు జయంతి రామయ్యగారి భూమిక) ఎంత కాదన్నను నిరువురకును బది పదునైదేండ్లైన నంతర ముండి యుండును. అదియుఁ గాక యాంధ్ర సాహిత్య పరిషత్తునఁ గల సముఖము కృతి తాళపత్త్రప్రతిచివర, ‘కీలకనామ సంవత్సర మార్గశీర్ష బహుళషష్ఠి శుక్రవారమునాఁడు బాగూరు రంగశాయి కొమార్త అమ్మికి తంజావూరికవి వేంకటస్వామినాయఁడు రాధికాసాంత్వనము సర్వు స్వహస్తలిఖితముగా నిచ్చినది’, యని గలదు. ఆ కీలకనామ సంవత్సరము క్రీ.శ. 1728గా గుర్తింపబడినది. అది 1788 యైనను గావచ్చును. కాని యట్లయినచోఁ బ్రతాపసింహుని కాలమున ననఁగా నంతకు (1788 నాఁటికి) అథమపక్ష మిఱువదినాలుగేండ్లకు (1764 నకు) బూర్వమే రచింపబడియుండు ముద్దుపళని కృతిని గాదని, లేఖకుఁడు వేంకటస్వామి యా రంగశాయి కొమార్త యెవర్తకో సముఖముకృతికిఁ బ్రతి వ్రాసి యీయవలసిన యగత్య మేమి? మీఁదు మిక్కిలి నాయాసామియుఁ దంజావూరు కవియే యఁట. మఱి తల్లిపుట్టుక మేనమామ యెఱుఁగకుండునా? కాఁబట్టి యా కీలక 1728 యని నిశ్చయించుటయే సమంజసము. అది విజయరంగని రాజ్యపాలన కాలమునఁ బడినది. అప్పటికప్పుడై సముఖముకృతి ప్రతిష్ఠ తంజావూరునకును బ్రాకిన దన్నమాట. దానికి రంగశాయికొమార్త తంజావూరు కవిచేఁ బ్రతి వ్రాయించుకొనుటయే తార్కాణ. సముఖము రాధికాసాంత్వనము విజయరంగని పరిపాలన కాలముననే రచింపఁబడె ననుట కందలి ‘ఇది శ్రీపాండ్యమండలాధీశ్వర—శ్రీవిజయరంగ చొక్కనాథ మహీనాథ కరుణాకటాక్షసంపాదిత....’ అను నాశ్వాసాంతగద్యయే ప్రబలాధారము. అసలు సముఖము గ్రంథరచన మంతయు విజయరంగని రాజ్యకాలముననే సాగినది. అతని ప్రతి గ్రంథాంతగద్యలోను విజయరంగని పేరు కనిపించును. ఆ గద్యయు నన్నింట నొక్కతీరుగనే యున్నది.

ఇఁక నీ రాధికాసాంత్వనము సముఖము కృతమే యనుట కాధారములు: సమకాలికుఁడైన కవి యొకఁడు ప్రతి వ్రాయుట, గ్రంథావతారికలోని

‘వెలయ నభీష్ట మిమ్మనుచు వేంకటకృష్ణ నృపాలశేఖరుం
డిల రసికావతంసులకు హృద్యముగా మృదుమాధురీరసా
కలిత చమత్క్రియాకలన కల్పనగా రచియింపనొప్పు ని
శ్చలమగు రాధికారమణి సాంత్వనమున్ గృతి సల్పుమని చనెన్.’

అను పద్యమును, అహల్యాసంక్రందనము నందును నిందును నచ్చముగా నొక్కతీరుగ నున్న గ్రంథాంతమందలి కృతిపతి (శ్రీరంగపతి) ప్రశంసాపద్యములు మూఁడు, నాగ్రంథమధ్యముననే నాయికా నాయకుల సమాగమసందర్భమున నున్న పద్యములు మఱి మూఁడు నొకగద్యయును. (చూ, రా. సాం. సంఖ్య వరుసగా 114 నుండి 120వ పద్యము వఱకు)

ఏమైననేమి, ముద్దుపళని కృతి ముద్రితమై ప్రసిద్ధి కెక్కినది. సముఖము కృతి ముందు పుట్టినను మూలఁబడినది. కాని యతని కవితానవనీతాస్వాదనఫలము మనకు ముద్రితగ్రంథమునుండి ముట్టనే ముట్టినది. అయినను నీకృతిని బ్రచురించవలసిన యావశ్యకతయుఁ గలదు. నిలుకడమీఁదనైనను నిజము తేలవలెను గదా! సముఖమువాని కృతిలో సరసముగాఁ గనిపించిన ప్రతిపద్యమును సంగ్రహించినది ముద్దుపళని. అతని గ్రంథమున నున్నవే నూటయిఱువది గద్యపద్యములు. గద్యములు పోను నూటరెండు మాత్రమే పద్యములు. అందులో నఱువది మక్కికి మక్కిగా గ్రహించినది. (ఆపద్యములన్నియు గ్రంథమున కనుబంధమైన అకారాదిపద్యసూచికలోఁ జుక్కగుర్తులతోఁ జూపించి యుంటిని) ముఖ్యముగా ముద్దుపళని కృతి మూఁడవయాశ్వాసమున నీ యుద్యమ మెక్కువ. అదియే కథయొక్క కండపట్టు—చిలుక రాయబారము, నాయికా నాయకుల విరహము, తత్సమాగమము—అంతేకాక పద్యపాద, పదబంధముల తార్పుడు, భావముల మాఱుమనువులు నిట్టి యలఁతి యలఁతి మార్పులతో మఱి కొన్నింటికి ఛాయలు గల్పించినది.

ఉదా:

కొసరుపల్కులఁ బమ్మి గోటికత్తులఁ జిమ్మి
    కాసెలోఁ జెయివేసి కదియఁదీసి,
కర్ణాతు లాగించి కౌఁగిట బిగియించి
    సరిబిత్తరుల నొత్తి సాగ సిత్తి
కల్లంబునకు వచ్చి కలికి యౌ నని మెచ్చి
    మెఱుఁగుఁజెక్కిలి కొట్టి కురులు పట్టి,
తొడకంబముల నాని తోఁపునూకులఁ బూని
    సందు సేసుక నొక్కి చాలఁ దక్కి
యదలుపులుఁ బొగడికలు నెయ్యంపుఁ దిట్లు
గళరవంబులు దుడుకులుఁ జెలఁగ సత్య
మాధవుండును గడిదేరి మరునిసాము,
చేసి చెలరేఁగి నెఱహాయిఁ జెంది మఱియు-29. (సముఖముకృతి)
 
‘అలమి కౌఁగిటఁగ్రుచ్చి యల్లందులకుఁ జొచ్చి
    కాసెలోఁ జెయి వేయు కౌశలంబు,
నుబికి పెందొడ లెత్తి యొడలు ఝుమ్మన హత్తి
    హిత వొప్ప నెదురొత్తు లిచ్చువైపు
తళుకు లేఁ గనఁ దగ్గి తమి యుప్పతిల నొగ్గి
    ధేనుకబంధంబు నానుజాతి
చివచివఁ బైనెక్కి రవళి హెచ్చఁగ నిక్కి
    పుంభావ మొనరింపఁ బూను సొగసు,
తరువుఁ జుట్టిన లతకూన హరువు మీఱి,
తనువు తనువునఁ బెనఁగొన ననువు దేరి,
వలపుతో నాగబంధంబు సలుపుదారి

దానికేకాని మఱిదేనికైనఁ గలదె?—III 117 (ముద్దుపళనికృతి)

ఇట సందర్భము నాయికా నాయకుల సంభోగసంరంభము, రతిబంధముల వర్ణన కొంత శాస్త్రప్రకారముగా జేసినది పళని. సముఖము వృత్తిచే దండనాథుఁడగుటచే గాఁబోలు కర్ణాతు, కల్లము, సరిబిత్తరము లను మల్లబంధవిశేషములనే సందర్భసుందరముగా ననుసంధించినాఁడిచ్చట. పళని పద్యములో ‘నల్లందులకు జొచ్చి’ యనుప్రయోగము ససారస్యమే గాని యదియు నాయకు నుచ్ఛిష్టమే. (చూ.స.రా.పా.117).

‘కాంత లిట్టుల రా నీక ఱంతు సేయ
నీటిచిమ్ముల కళుకక నిలుచు గంధ
సింధురం బన నిలఁబడి శ్రీధరుండు
పలికె వారలఁగని నయభయము లమర’-(106 స-రా పా)

‘చెలిచెలు లిట్లుచేరి....రవ్వలిడఁగాఁగని శ్రీహరి యీటెపోటుల
గలఁగని గంధసింధరు మనంగఁ దొలంగక నిల్చి యి ట్లనున్.’-(ము ప-రా. సా IV 16)


ఇందు ఛందస్సు మాఱినది గాని గంధసింధుర మట్లనే యున్నది.

సుదతి యిసుమంత కడకంటఁ జూచినంత
నింత ఱంతులు సేతురా యింతులార
మీరు నా మాఱు పదముల మీఁద వ్రాలి
కలయఁ గలయించి సుకృతంబు గట్టుకొనరె. స-రా, సాం. 107

సుదతి యిసుమంత కడకంటఁ జూచినంత
నింత ఱంతులు చేతురా యింతులార
అలుక దీఱంగ దొరసాని కమరఁ బలికి
చెలిమి యొనరించి సుకృతంబుఁ జెందుఁ డనిన. (ము ప-రా. సా IV 17)

ఇందు పూర్వార్ధము లొకటే మోస్తరు. ఉత్తరార్ధమున నున్న సముఖము స్వారస్యము పళనిపద్యమునకు రాలేదు.

ఇందుబింబాస్య నవ్వుల కెంచి చూడఁ
జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె,
నింతినునుగప్పుకొప్పున కెంచి చూడఁ

జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె. (స.రా.సా. 97)

ఇందుబింబాస్య చిఱునవ్వు కెంచి చూడఁ
జంద్రకిరణవిలాసంబు సహజ మయ్యె
నింతినునుగొప్పుకప్పున కెంచి చూడఁ
గాలమేఘంబు సరిసాటి గాదనంగ. (మ.ప.రా.సా. 3 153)

ఇట పళని పద్యమున నాల్గవపాదము పూర్తిగా మాఱిపోయినది. ఆమెకు సముఖము పద్యములోని సభంగశ్లేష యర్థము కాలేదేమో! ముద్దుపళనిగ్రంథము ముద్రితప్రతులు మఱి రెండిటఁ బై పద్యపుటుత్తరార్ధమునకు మాత్రము ‘తీవబోడి కనుల తీ రెంచి చూచిన, జలజపత్రవితతి సమము గాదు’ అను పాఠాంతరము గన్పించుచున్నది. కాని యది యొక దోపుడుపుల్లు. పద్యపూర్వార్ధము తేటగీతిలో నున్నది. పాఠాంతర మాటవెలఁది. కావున నది యపరిగ్రాహ్యము.

అపుడు నచ్చట రాధ కంసారిరాక
చిలుకచే విని తన వద్ది చెలులఁ బిలిచి
వెన్నుఁ డిట కేఁగుదెంచిన విడువవలదు
వాకిటనె నిల్పుఁ డని చెప్పి పనిచె నంత. (స.రా.సా. 101)

ఇటులఁ జనుదెంచు హరిరాక యెఱిఁగి చిలుక
చెప్ప విని రాధ తన యొద్ది చెలులఁ బిలిచి
శౌరి యిట వచ్చె నని వింటి పరగ వాని (మీరలతని -పా)
విడక నిల్పుఁడు మోమోట మిడక యిందె. (ము.ప.రా.సా. 4-5)

ఇటుల నాడిన మాటల కిముడఁ బలికి
రాజసము మీఱఁగా యదురాజమౌళి
బలిమి జులుముల సందడుల్ దొలఁగఁ ద్రోచి
చొరవఁ జేసుక లోపలఁ జొచ్చువేళ. (స.రా.సా. 104)

అను సఖీమణి వాక్యము లాలకించి
బలిమి జులుములు విలసిల్ల బలసి చొరవఁ
జేసి చూచెద ననుచు నా శ్రీధరుండు
ఠీవి చెలగంగ లోఁ జొచ్చి పోవఁ గాంచి. (ము.ప.రా.సా. 4-13)

ఈ వైన మానాఁటి కెటు పోయెనో యని
        చెప్పి కరంబులు విప్పువారు (స.రా.సా. 109)

ఈ బుద్ధి యానాఁడె యెందుఁ బోయె నటంచు
        విడనాడి చేతులు విచ్చె నొకతె (ము.ప.రా.సా. 4-18)

పై యుదాహరణములలో నాడాడ మాటలే మాఱినవి కాని భావముల బండారము బయటపడుచునే యున్నది. ‘ఈవైన’మిత్యాది స్థలములలో మూలగ్రంథము సొగసులు కొన్ని ముద్దుపళని గ్రంథమునకు రాలేదు. ఇక్కడే మఱొక్కమాట; ఆమె వెలిదిండ్ల, శేషము వేంకటపతులను గూడ పలుకరింపక విడువలేదు. (చల్లకు వచ్చి ముంత దాఁచ నేల యని కాఁబోలు). ఇఁక సముఖములో రాయబార మెందులకు? వెంకటకృష్ణప్పయుఁ గవిత్వమున శేషముతో వియ్య మందినవాఁడే. అసలు వారిరువురు నాప్తసఖులు (చూ. అహల్యాసంక్రందనము-అవతారిక). ఆ వియ్య మహల్యాసంక్రందనమున నెక్కువ. రాధికాసాంత్వనమున నొక్కపోకడ.

తడవుఁ జూచిన దృష్టి తాఁకునోయని వాని
      నును మోముఁ గనులారఁ గనఁగ నైతి
గబ్బిగుబ్బలు సోఁకఁ గందునో యని వానిఁ
      గలసి నా మనసారఁ గలయనైతి (స.రా.సా. 12)

తడవుచూచిన దృష్టి తాఁకు నంచని వాని
      సొగ సెల్లఁ దప్పక చూడ వెఱతు
మొన గుబ్బ లదిమి గ్రమ్మినఁ గందు నని వాని
      లేఁత మేనును గౌఁగిలింప వెఱతు (తా.శ. 4-42)

(చూ.ము. ప. రా. సా. 2-116 కూడ-తిమ్మన కృత్యనుకృతులును గలవు. అవి స్థలాంతరమునఁ జూపఁబడినవి.)


అన్నట్లు తాళ్ళపాక తిమ్మక్క వొకమూఁడుముక్కలు వాఁడుకొన్నాఁడని యామధ్య నొక యమ్మక్కగారు చేమకూరనెత్తిపై నొకయభాండ మెత్తినారు; అది యొక మిషగాఁ బురుషకవులనెల్లఁ దూర్పారఁబట్టినారు. మఱి దీనికేమందురో? దానిమాట కేమి గాని, సముఖము వాని కృతి నెంత యనుకరించినను ముద్దుపళని కృతికి దానిప్రత్యేకత దానికున్నది. ఆమె తక్కువ తిన్నదా మఱి? ప్రతాపసింహున ప్రాపకమున శృంగారరసపు సరిహద్దులు చూచినది, కవితా భరత గంధర్వాది కళల కిటుకులు కనుఁగొన్నది. శతపద్యపరిమితమైన సముఖము కృతిని గ్రహించి, కించిదూనముగా నాఱువందల గ్రంథమును దయారుచేసినది. తప్పక తదుపజ్ఞమైన గ్రంథమును రసికప్రశంసనీయమే. సముఖము గ్రంథములో నప్పుడే ‘యిళ’ సుద్ది కొద్దిగాఁ బుట్టియున్నను నా ప్రతినాయిక పాత్రీకరణమునఁ జిత్రలేఖనపుఁ జమకుల నతిమాత్రమనోజ్ఞముగాఁ బ్రదర్శించినది పళని. సముఖముకంటె నెక్కువగా శృంగారరసరహస్యముల సూదంటుపనితనమునఁ దిమ్మనగారి యొరవడిని, పలుకుఁబళ్ళ మెఁలకువలలోఁ జేమకూరపాకమును సమర్థించినది. నాఁటికవుల కది యొక పరిపాటి.

సముఖము కృతి యేకాశ్వాసప్రబంధము. కవి దీనినిఁ జాటుప్రబంధమని పేర్కొనినాఁడు. గ్రంథాంతగద్యలో పూర్వలాక్షణికు లుదాహరణ ముక్తకాది కావ్యభేదములనే కాని యిట్టినిబద్ధకావ్యములను జాటుప్రబంధములుగాఁ బేర్కొన లేదు. కాని చాటుశబ్దమునకుఁ బ్రియోక్తియను నర్ధముండుట చేతనో, ప్రబంధప్రక్రియ కంగభూతములగు అష్టాదశవర్ణన లిందు పరిహరింపఁబడుటచేతనో, అపగతసర్గ ముపకావ్య మను నాలంకారిక వచనముండుటచేతనో రసికప్రియము, రసప్రధానము, నేకాశ్వాసము నగు నీప్రబంధము చాటుప్రబంధమైనది. కవి దృష్టిలో, అంతకుముందు నాఁటి విజయరాఘవ నాయకాదులును దమ యక్షగాన నాటకములను జాటుకావ్యము లని పేర్కొనుటయు నట్టి దృష్టితోనే యనుకొందును. వెనుకటికి శ్రీ వేటూరి ప్రభాకరులు దీని నేకాశ్వాస క్షుద్రప్రబంధ మనిరి. కాని యందు నిరసన లేదనుకొందును. కావ్యాలంకారసంగ్రహకర్త చాటుప్రబంధముల నుదాహరించినచోట క్షుద్రప్రబంధము లను బర్యాయముగా వాడెను. క్షుద్రశబ్ద మిట నల్పార్థ మునఁ బ్రయుక్తము. శృంగారము నరిగించుకోలేని వారి కెవరికో యన్యార్థమున నిది క్షుద్రప్రబంధ మనిపింపవచ్చును. కాని దీనిని జాటుప్రబంధమనుటయే సమంజసము.

ఇందు సుప్రసిద్ధము సువిశాలము నైన రాధాకృష్ణుల ప్రణయైతిహాసమున నేకదేశమగు ఘట్టమును గ్రహించినాఁడు కవి- రాధ పరకీయగాఁ జెప్పఁ బడక పోయినను అత్తవావి పేర్కొనఁబడినది. సత్యభామయే ప్రతినాయిక యైనను నామె పాత్ర రూపుకట్టలేదు. ఆమె ప్రత్యేకతయు రాధికనే యాశ్రయించినది. ఆ సందర్భమునఁ దిమ్మనగారి పోకడలు బోలె డనుకరింపబడినవి.




1. ‘అమ్మా యేమని చెప్పుదు’ - పారిజాత॥ 1-75
   ‘తెఱవా యేమని చెప్పుదు’ - రా॥ సా॥ 26
2. ‘ఏమేమి కలహాశనుం డచటికై యేతెంచి యిట్లాడెనా’ - పారి॥ 1-82
   ‘ఏమేమీ వెఱపింత లేకనె భళా హేమాంగి యిట్లాడెనా’ - రాధి॥ 33
3. 'మాసిన చీరఁ గట్టుకొని ....’ పారి॥ 1-99
   ‘జడ వేఁగ వదలించి...’ రాధి॥ 77
4. ‘వెడ వెడఁ గన్నుమూయుఁ గనువిచ్చు...’ పారి॥ 1-101
   ‘ఉలుకును వెచ్చనూర్చుఁ గడు నుస్సురనున్...’ రాధి॥ 78

ఇక ‘బికస్వరంబు’తో నేడ్చుట, “రాయను వింతపుట్టి నదిరాయను” నిట్టివి సర్వప్రబంధసామాన్యములైనవే యిందునుగలవు. రాధయుఁ “జిలువకోమలి" యైనది. సవతి “నరకాలఁ బెట్టి నేలరాయకున్నను నా పేరు రాధగాదు” అని ప్రతినఁ బట్టినది. అయినను ముక్కుతిమ్మన, ముద్దుపళనుల నాయికలవలె నాయకునిపై నెడమకాలి నెత్తలేదు. మఱియు గతానుగతిక మగు ప్రబంధధోరణికి నీకావ్యమునకు నొక యంతరము గలదు. ఆవర్లనల యూర్ణనాభస్వభావముగాని, యనుప్రాసల యట్టహాసములుగాని యిందు లేవు. పురవర్ణనాదులు లేవు సరి గదా విరహవర్ణనల సందర్భమునను జంద్రోపాలంభాదులు పరిహరింపఁబడినవి. కాని, చేసినతప్పు చెప్పకతప్పదు, చేయరాని వర్ణనయొకటి చేసినాఁడు కవి, అదియు సుదీర్ఘముగా— రెండుసీసములు (98 & 99). అందు “శృంగారయౌవనక్షీరాబ్ధినడుమను” అను పద్యము ముద్దుపళని గ్రంథముద్రితప్రతులలోఁ గొన్నిట నున్నది, కొన్నిట లేదు. రెండవపద్య మెందును లేదు. దీనినిఁ బట్టి చూడఁగా, పళని యాపద్యములఁ బరిహరించెననియే తోఁచుచున్నది. అది యథార్థమే యైనచో, గ్రుడ్డిలో మెల్ల, ఆమె యుచితజ్ఞత కది కొంత యూపిరి. అసలు విజయనగరప్రబంధములందు విప్రలంభశృంగారము, దక్షిణాంధ్రప్రబంధములందు సంభోగశృంగారమును బ్రాచుర్యము వహించినవి. అది యుగధర్మము.

సముఖముది జాతీయమై నుడిగారపు నునుపు దేఱిన రచన. అతని పలుకుఁబళ్లకుఁ గొన్ని మచ్చులు.

కనులఁ గప్పుక (23), దొంతర ముద్దులు (30), దురుసు పైసరములు (80), మానిసినిఁ జేసినందుకు (41), నంగనాచి (45), రుద్రాక్షపిల్లి (45), పొల మెఱుంగని నిన్నటివళికె పడుచు (49), తన్నుం దనమట్టు నెఱుఁగు (54), నమ్మి నానఁ బోసికొనియె (59), పదింబదియు గాను (60), తప్పుతంటలకు (68), వలపు వడ్డికిఁ బాఱన్ (114).

సామెతలు :- నిన్నఁ గుప్పయు నేఁ డాళ్లు (36), వ్రేలు వాచిన ఱోలంత పెరిఁగె ననిన, ఱోలు వాచిన నది యెంత పోలు (89), అల్పునకుఁ గల్మి వచ్చిన నర్ధరాత్రి, గొడుగు తెమ్మన్న కత గాను (52), కుట్ట దేలుఁ కుట్టకున్నఁ గుమ్మరబూచి (62), తిరిపెం బెత్తేవానికిఁ బెరుగుంగూ డేమి బ్రాతి (64). ఎల్లవారికి శకునంబు లెఱుఁగఁ బలికి, బల్లి తాఁ బోయి తొట్టిలోఁ బడినరీతి (72). తగిలెనా తగిలెను, తప్పెనా తప్పెను, నాతి వెఱ్ఱివాని చేతిఱాయి (59). ఇట్టి వింకను గలవు. సాభిప్రాయములైన ప్రయోగములు నొకకొన్ని కలవు.

ఉదా :-
1. శ్రీకృష్ణునిఁ దోడి తెమ్మని రాధ పంపిన చిలుక పుల్లయ వేమవరము చేసికొని వచ్చినది. తదుపమానము: ---

‘హరు నుదుటి కంటి మంటల నంట బెదరి
త్రుళ్లి రౌతును బడవైచి వెళ్లివచ్చు
తీయవిలుకాని సాంబ్రాణి తేజ’ (19).


2. కృష్ణుఁడు రాఁడు; రాధకుఁ గూరిమి పోదు. ‘అత్తకోక తొలఁగినటు’ లున్నదఁట యాసందర్భము. అత్త సరుదుకోదు; సరుదుకొమ్మని యల్లుఁడు చెప్పలేడు (46) (ద్రావిడభాషలో ‘అత్తగారికచ్చ’ యనునర్థముగల లోకోక్తి కలదఁట).

3. రాధాపదాక్రాంతుఁడైన కృష్ణు నామె యదొక గమ్మత్తుగా లేవనెత్తినదట ఆ ‘యెత్తిన పట్టువీడక’ లేచినాఁడఁట యా రసజగత్సమ్రాట్టు (116).

ఇట్టి ప్రయోగవైచిత్రి సముఖమునకే చెల్లినది. ఆస్వారస్యరహస్యాభిజ్ఞత ముద్దుపళనికే చెల్లినది. సముఖము ప్రయోగములలో నింకొక విలక్షణతయుఁ గలదు. గుట్టుబొయ్యీని, చూచేరు, మోవాని (మోవి+అని), నడిచే, నవ్వేటి, చేసుక, వద్ది మొదలగునవి. ఆప్రయోగము లాయుగసహజములు. ‘అచ్చుత’ శబ్ద మొకటి ప్రాసఘటితముగా నిందుఁ గన్ప ట్టుచున్నది. అదియు నాఁటి యపరూపవికృతివిశిష్టతలలో నొకటి (చూ విజయరాఘవుని రఘునాథనాయకాభ్యుదయము). ఆకవులకు వ్యాకరణము రాదనికాదు, వారు మహాకవులని కాదు, కానీ వారి కావ్యములం దప్రయత్నముగనో, యభినివేశపూర్వకముగనో దొరలిన వా ప్రయోగములు. అంతే; అదియొక విలక్షణత! సముఖము ప్రయోగములు రసాపకర్షకములు కాలేదనియే చెప్పవచ్చును.

రసికశేఖరుఁడగు విజయరంగనికొలువు. దక్షిణాంధ్రయుగ శ్రీనాథుఁడగు శేషము వేంకటపతి స్నేహము, తిమ్మన గారి యొరవడి, చేమకూర పలుకుఁబడి సముఖము నొకసరసకవిగాఁ జేసినవి. రాధికాసాంత్వనము, అహల్యాసంక్రందనము మనకు దక్కినవి. ఉభయత్ర భావబాంధవ మున్నను శైలీభేదము గన్పట్టుచున్నది. మొదటిదానిలోఁ దెలుఁగుపొలుపును, రెండవదానిలో సంస్కృతప్రౌఢియు నెక్కువ. అహల్యాసంక్రందనమే యతని కవిప్రథకు మూలకందమైనను దాని కీలక మీ చిన్నికృతి యైన రాధికాసాంత్వనమే.

యస్వీ జోగారావు
బి. యే. (ఆనర్పు)


ఆంధ్ర విశ్వకళాపరిషత్-
పరిశోధనశాఖ, వాల్తేరు.
1-అక్టోబరు, 1958