రాధికాసాంత్వనము (సముఖము)/గ్రంథ ప్రచురణ



గ్రంథ ప్రచురణ.

ఈ ప్రచురణకు మూలము : ఆంధ్రసాహిత్యపరిషత్తులోని సం. 177 రు గల తాళపత్త్రప్రతి. లేఖకుఁడు తంజావూరికవి వేంకటస్వామి నాయకుఁడు. అతఁడు వ్రాసినది కీలక మార్గశీర్షమున. ప్రతిస్థితియు, లేఖనవైఖరియు బాగుగనే యున్నవి. కాని వ్రాఁతతప్పులు లేకపోలేదు. అవి యీ దిగువ నుదాహరింపఁబడిన ముద్దుపళని ముద్రితప్రతులను సంప్రతించి సవరించితిని.
1. తిరుక్కడియూరు కృష్ణారావు గారిచే-
శ్రీధామ ముద్రాక్షరశాల ప్రచురణ- (1887 క్రీ. శ.)
2. ఎద్దనపూడి చెంచురామయ్య గారిచే -
శ్రీ పారిజాత ముద్రాక్షరశాల మదరాసు (1908)
3. కె.జి. మూర్తి, శృంగార గ్రంథమండలి, మచిలీపట్టణము - (1936]
4. శ్రీ సత్యనారాయణ పబ్లిషింగ్ హౌస్, రాజమండ్రి - [?]
5. వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్. మదరాసు - (1950)
పై వానిలో 1,2 ప్రతు లొక్కమాదిరిగను, 3,4 ప్రతు లొక్కమాదిరిగను నున్నవి. ముద్రితప్రతులలో నపపాఠము లున్నచోట్ల మూలప్రతిపాఠములే స్వీకరింపఁబడినవి. ముద్రితప్రతుల కతీతమైన చోట్ల నున్న లేఖకప్రమాదము లర్థానుగుణముగా సరిచేయఁబడినవి. పాఠాంతరములు పుటల కడుగునఁ జుక్కగుర్తులతోడను జూపఁబడినవి, గ్రంధపాతములు ముద్రితపతుల సాహాయ్యమునఁ గుండలీకరణములలోఁ బూరింపఁబడినవి. చెన్నపుర ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమున నం R. 28 రు గల తాళపత్త్రప్రతి యొకటి కలదు. అదియు సముఖము రాధికాసాంత్వనమే. కానీ యందలి వ్రాఁత యొక తీరు, తప్పులున్నవి, శైథిల్యము గలదు, గ్రంథపాతములు నెడ నెడఁ గలవు. అచ్చటనే నం 199 రు కాగితపుఁ బ్రతియు నొక్కటి కలదు; కాని దాని మాతృక పై శిథిలతాళపత్త్రప్రతియే. ఆంధ్రసాహిత్యపరిషత్తు ప్రతియే మేల్తరమైనది.

నా కీ గ్రంథ పరిష్కరణోద్యమమునఁ దోడ్పడిన యాంధ్రసాహిత్యపరిషత్కార్యదర్శి శ్రీ చతుర్వేదుల సత్యనారాయణ శాస్త్రి గారికిని, మేనేజరు శ్రీ వద్దిపర్తి చలపతిరావు గారికిని, దక్కిన పారిషదులకును గృతజ్ఞుడను.

అభినవముగ నాంధ్ర రాష్ట్రప్రభుత్వశుభోదయమైనది. ఇఁక నైన నిట్టి యమూల్యగ్రంథజాలము నాంధ్ర ప్రజ కందిచ్చు పరిషత్తువారి పూనిక నగ్గించి, ధనాభావముచే వెనుకపడియున్న పరిషత్తుసకు శుభాక్షతలుగా విరాళముల నిచ్చి ప్రోత్సహించి, తద్గ్రంథభాండాగారమునఁ దాళపత్త్రతనుకార్శ్యముతో నసూర్యంపశ్యలై పడియున్న కావ్యసుందరులను జూచుట కాంధ్రసాహిత్యసత్యవతులు నోచుకొందురుగాక.