రాధికాసాంత్వనము (ముద్దుపళని)/ద్వితీయాశ్వాసము



(ఇళాదేవీయ మనునామాంతరముగల)

రాధికాసాంత్వనము

ద్వితీయాశ్వాసము

శ్రీ రాధామధురాధర
సారామృతపానచతుర సద్గుణహారా
పారావార విహారా
భారతసఖ చిన్నికృష్ణ పాలితకృష్ణా. 1

తే. అవధరింపుము దేవదివ్యానుభావ
వ్యాసమునిసూతి జనకభూవిభునిఁ జూచి
చొక్కటపుజీనిచక్కెరయుక్కెరలకు
నెక్కుడై మించు నుడిచవులెక్కఁ బలికె. 2

క. అటు లారాధిక గోపీ
విటు నటు రతికేళి నేలి విడువంగ నిలా
కుటిలాలకఁ జేరి తనదు
కుటిలత్వ మెఱుంగనీక కూరిమి చెలఁగన్. 3



తే. నిను మిగుల గాసి యిడె నని నే మురారి
నెనసి పైకొని దండింప నీవు నిదియె
సందు చేసుక యెచటికి జరిగి తనుచు
నిళను జేపట్టుకొని రాధ యింటి కేగె. 4

వ. అప్పుడు. 5

సీ. మహితగండస్థలీమకరికాపత్రికల్
మొసలివాపోగులపసలు దెలుప
మెఱుఁగుచన్మొనఁ గ్రమ్మి మెఱయుతమ్మరసంబు
పటుతర కౌస్తుభప్రభ ఘటిల్ల
దలిరువాతెర నొప్పు బలుకెంపు లలవేణు
వివరంపునొక్కులవిధ మెసంగ
నలిగి వెన్నునఁ గుల్కు తెలిముత్తియపుజడ
పన్నగతల్పంబుచెన్ను దనర
తే. హారగతి మణిశ్రీవత్ససారకాంతి
దశదిశల్ నిండ రాధికాతరుణితోడ
శౌరిసారూప్య మంది యిల్ చేరవచ్చు
నిళను గల్గొని యలివేణు లిట్టు లనిరి. 6

సీ. మనిసి కాటున కెందు మందు లే దందురు
మంచిది ఘనసార ముంచరమ్మ
చిఱుగోటిపోటులు సెలవారు నందురు
పునుగుకుంకుమ గూర్చి పూయరమ్మ
తొడసాముచేఁ గండ లెడ గట్టు నందురు
చలువగోజంగినీట జవరరమ్మ
వలపు చెమ్మట లింకఁ జలి పట్టు నందురు
కలపంబు నెనయించి యలదరమ్మ
తే. కమ్మవిలుకానియేనుఁగుఁగున్న బడలెఁ
దళుకుఁజెక్కుల సాంకవతైల ముంచి



యలరుమందులపొడిఁ బూసి యలుపుదీఱ
మేటి తాంబూలకవళంబు మేపరమ్మ. 7

క. అని మిగులవగలఁ బల్కుచు
ఘనతరసురతాంతతాంతకాంతామణికిన్
మనసిజశాస్త్రక్రమమునఁ
దనువలయిక దీర్చి రంతఁ దద్దయు వేడ్కన్. 8

చ, అలరులమోవికాటు పస పంటినదుప్పటినీటు చెక్కులన్
విలసిలుతమ్మముద్దు జిగివెన్నునఁ గీల్జడదద్దు కన్నులన్
నెలకొనునిద్రసొక్కు మెడ నెక్కొనుగాజులనొక్కు లెంతయున్
వెలయఁగఁ గేళిమందిరము వెల్వడె మన్మథమన్మథుం డొగిన్. 9

తే. ఇటుల వెలువడి మజ్జనగృహముఁ జేరి
చలువగొజ్జంగినీటిచే జలక మాడి
వలువలు ధరించి కలపముల్ గలయఁబూసి
యతివ వడ్డింప దివ్యాన్న మారగించి. 10

చ. పడఁతి యొకర్తు కెంపురవపావలు వెట్ట లతాంగి యోర్తు పా
వడఁ గొని వీవ నొక్క మదవారణగామిని తావికప్రపున్
విడె మొసఁగన్ మఱొక్కనవనీరదవేణి కళాచిఁ బూనఁగా
నడిదము కేడెముం గొనుచు నంగన యొక్కతె వెంటఁ గొల్వఁగన్. 11

సీ. మగరాలకంబాల నొగి యంత్రపాంచాలి
కలు మీటువీణెలగులుకు రాగ
ముల సొక్కి తల లూఁచు జిలుగుబంగరునీటు
వ్రాఁతచిత్తరుబొమ్మలను గురించి
యొరలెడుచిలుకల గొరవంకలను నవ్వు
నిలువిరినగవులో యివి యనఁదగు
ముత్తియంబులతీఁగె ముడికట్టుపనుల హొం
బట్టుమేల్ కట్టుల వఱలు విరుల

సరులమూఁగెడు తేంట్ల గరుల మొయిళ్ళని
యాడునాఁడు నెమళ్ళ యడుగుటందె
తే. లందుఁదగురోదరతినాద మనుచు నెపుడు
నిలువుటద్దాలపడకిళ్ళ నలరుగూండ్ల
రమణఁ బలికెడుపారావతముల నెసఁగు
రాధికామణిమణిసౌధరాజమునను. 12

తే. చేరి [1]యట వింతపనులచేఁ జెలువు గులుకు
చలువచప్పరకోళ్ళమంచంబుమీఁది
యంచరెక్కలసెజ్జపై నలరుముత్తి
యంపులోడునఁ దగఁ జేరి హౌసు మీఱి. 13

తే. అండ నటు నిల్చి యిళ ముత్తియంపుసున్న
మిడినతమలపుటాకులమడుపు లియ్యఁ
గదిసి రాధిక తనచనుఁగవకుఁ బులక
లమరఁ జాచినపాదపద్మముల నొత్త. 14

సీ. తంబుర మీటి గీతంబు పాడుచు నొక్క
మధురోష్ఠి సరిగమపధని యనఁగ
జగ్గుచౌకట్లను నుగ్గడింపుచు నొక్క
చక్కెరబొమ్మ తద్దిక్కు మనఁగ
గుజరాతిజక్కిణీకోపు లాడుచు నొక్క
భామిని జీవుసల్లా మనంగ
బిరుదు కైవారము ల్ఫేర్మి సేయుచు నొక్క
సరసిజానన జయజయ యనంగఁ
తే. జంద్రబింబాస్య యొకతె హెచ్చరిక దెలుపఁ
జెలియ యొక్కతె సందడి దొలఁగఁ జేయ
నందఱకు నన్నివగల నానంద మిడుచు
నిండుకొలు వుండె యదువంశమండనుండు. 16

చ. అప్పుడు పయఃపయోధిమణియల్లునిఁ బిల్వఁగ నెమ్మిఁ గోరి స
ద్విపులకుల ప్రదీపకుఁడు విశ్రుతకీర్తి యశోదతోడఁబు
ట్టపరిమితప్రభావజనకాధిపుమన్ననఁ గొన్నకుంభకుం
డుపగతహర్షుఁ డై వరుస లొప్పఁగ వచ్చెను నందుచెంతకున్. 16

క. వచ్చిన మఱఁదిని గని ముద
మెచ్చఁగ వడి లేచి కౌఁగి లిచ్చి సమానం
బచ్చుపడఁ బసిఁడిగద్దియ
నిచ్చి రహి న్నందుఁ డతని నీక్షించి దయన్. 17

ఉ. వచ్చిన కార్య మే మనుచుఁ • బల్కిన నాతఁడు కూఁతు నల్లునిన్
మచ్చికఁ బంపఁగా వలయు మా సదనంబున కన్న, రాధతో
జెచ్చెర నెచ్చరించి యటు చేయుదు నం చని నందుఁ డాడఁగా,
నచ్చెలియింటికిం జనె నిశాబ్జదళాక్షినిఁ గన్నతండ్రియున్. 18

వ. ఇట్లు చనునెడ నాళీజనంబులవలనఁ దదాగమనం బాలకించి యవ్విరించిగురుం దుదంచితముదం బెదం గదుర నెదుర్కొని ప్రణమిలి యవ్వల్లవతల్లజునిదీవనలం జెందిన వేడుకఁ దోడుకొని తెచ్చి హెచ్చు పచ్చరాగద్దియ నుంచిన నతం డందు వసించి రాధావధూరత్నంబుతోనం గురియించి యిళామాధవులఁదోడ్కొని మానివాసంబుకునకు నీవు రావలయు నన నావనజానన యయ్యా నన్నడుగం బని యేమి యయ్యిళయు నేనును మీ కొక్కరూప కాదె న న్బిలువ వలయునే వలసినప్పుడు వచ్చెద నిప్పు డివ్వధూవరులఁ బిలుచుకొని చనుం డని పనిచిన వారలం దోడ్కొని నిజమనోరధంబీడేర రథం బారోహించి యాభీరవీరు లపారాయుధపాణులై బలసి నలువంకలంగొలువ నమితానందంబును జెంది నందుమఱంది నిజమందిరంబునకుం జని సుఖంబుండె నంత నిచ్చట. 19

సీ. పద్మాక్షుఁడును దాను బవళించుపడకయి
ల్గని కను ల్కటికచీఁకటులు గ్రమ్మ
నెడలేక మురవైరి నెనయుముచ్చట లెంచి
పగిలి గుండియ వకాలవకలు గాఁగ

శ్రీకృష్ణుచేఁ గొను చిలుకపల్కులు విని
గుమ్ముగుమ్మని చెవుల్ దిమ్ముగొనఁగ
హరిభోగ్యవస్తువు లందందసోఁకిన
నెమ్మేను ఝుమ్మని సొమ్మసిల్ల
తే. నిప్పుద్రొక్కినరీతిని నిలువ దెచట
గాము సోఁకినమాదిరిఁ గలువరించు
విరిగి తల మిన్ను పడినట్లు విన్నవోవు
భావజునిధాటి కలికి రాధావధూటి. 20

సీ. వెన్నెలచిచ్చులు వెదఁజల్లు రేరాజు
కిరణంపుగుంపుల సొరిగి సొరిగి
యమధనుష్టంకార మన మీఱుతేఁటిఝుం
కారంబులకుఁ జాలఁ దారి తారి
రాహుఫూత్కారంబులను మించి చనుదెంచు
మలయానిలునిధాటి కళికి యళికి
యురుమనిపిడుగులై యొడలు చిల్లులు వోవఁ
బడుమరుకోలల బడలి బడలి
తే. వదరుచిలుకలకూతకు బెదరి బెదరి
పలుకుబకదారిపిట్టల కులికి యులికి
తల్లడిల్లుచు వడిఁ బడకిల్లు జేరి
మరులుకొని చాన తనదునెమ్మనములోన. 21

వ. ఇట్లని వితర్కించె. 22

సీ. కలుగునా కన్నుల కఱ వెల్లఁ దీఱంగఁ
గమలాక్షునెమ్మోము గనుఁగొనంగ
వేవేగ నబ్బునా వీనులవిందుగా
దనుజారివేణునాదము వినంగ
నలవడునా చేతు లతిపుణ్య మందంగ
వాసుదేవాంఘ్రిసేవలఁ బెనంగ

దొరకునా నెమ్మేను పరవశ మందంగ
వటపత్రశాయికౌఁగిట మెలంగ
తే. నొదవునా గోపగోపికాసదయు నెనసి
యురుతరానందజలరాశి నోలలాడఁ
బ్రబల మగుమద్దశాపరంపర లవెట్లు
గాఁగ నున్నవొ యే నైతె కాన నకట. 23

తే. రాసిఁ జేసినశృంగారరస మనంగఁ
జక్షులకుఁ దోఁచుకరుణాతిశయ మనంగ
నొకటి యైనట్టిమన్మథాయుత మనంగఁ
బొలుచుగోపాలరూపంబుఁ బొగడవశమె. 24

క. తమ్ములు శౌరిశ్రీపా
దమ్ములు మోదమ్ము లొదవుఁ దమ్ముల నెల్లన్
దమ్ము లనం దప మళినా
దమ్ములు వేదమ్ములు నినదమ్ములు సలుపున్. 26

ఆ. పుంగవములమీఁదఁ బులులును బులులపైఁ
గరులుఁ గరులపైని హరులు గవియు
నందగోపసుతుని నడ కొకించుక సాటి '
తాము తాము తాము తా మటంచు. 26

తే. దానవారాతినఖధాళధళ్యములును
బ్రపదరోచులు పదరుచుల్ పరిఢవిల్లె
నతనియడుగుల నొకటిగా నతిశయిల్లు
జాహ్నవీయమునాసరస్వతు లనంగ. 27

తే. తీర్థపాదుని శ్రీపాదతీర్థమందుఁ
గలకమఠనక్రములు దేలి వెలికి వచ్చె
జోడుజోడుగ నన నీడు జోడు లేక
యతనిమీఁగాళ్లుఁ జిఱుదొడ లనువుమీఱు. 28

చ. సిరియును భూమినీళలును జెల్వగువల్లవపల్లవాధరల్
నిరతము లాలనల్ సలుప నిగ్గులు గుల్కెడుశౌరిజంఘలన్
గరకరిఁ జూచి మారజయకాహళు లూఁదఁబడంగ నే మగున్
మొఱ లిడు టింతె కాని సరిపోలునె పోలిన బోలుఁ జెందవే. 29

క. నాగారిగళముపైఁ దగు
నాగమదధ్వంసితొడలు నాగకరంబుల్
నాఁ గనుకని నగరే యెల
నాగలతో ధీరులైన నాగరజనముల్. 30

ఆ. కౌస్తుభంబుతోడఁ గనుపట్టు ఫణిరాజ
శాయిగళము శంఖ మాయె ననుచుఁ
గనకపటముతోడఁ దనరుగోపాలక
స్వామికటియుగంబు చక్ర మయ్యె. 31

తే. జానులను జేరుబాహుల సరవిఁజూచి
కనులు చెవులకు వివరింపఁ గదియువింత
పొలుపు వినఁగోరి తల లెత్తె భుజము లటులఁ
గాన లే నైతి ననువంతఁ గౌనుచిక్కె. 32

తే. ముజ్జగంబులు వెన్నుని బొజ్జనున్న
తెఱఁగు వివరించుదారి నాఁ ద్రివళు లమరుఁ
గదిసి వళిభంగములఁ దేలు కమల మనఁగ
నలువగుము లీనుకృష్ణుని నాభి దనరు. 33

ఆ. శ్రీయుతంబు గాఁగఁ జిలువరాపడగయు
గందపట్టె లుండుకతనఁ దలుపు
హరియురంబు నెదిరి శిరము వేవ్రక్కలై
మూలయింటిలోన మూఁతఁబడియె. 34

క. కనుపసికాపుపడంతుల
చనుజక్కువ లలరఁ జేయు శౌరినఖంబుల్

చను నే నెలరేఖలు నా
ననుపమములు తత్సమంబు లవియే జగతిన్. 35

చ. ఖరమురకంసహంససరకాదిసురారుల ప్రాణవాయువుల్
పొరిగొని దివ్యరత్నమయముద్రిక లొప్పెడిసోగవ్రేళ్లతో
హరిభుజకాండముల్ చెలువ మందు శిరోమణు లంద మందఁగా
మురు వగుపంచభోగయుతభోగుల నీఁగను శ్రీ లొసంగుచున్. 36

చ. శర ణనువారికి న్మృదువు శత్రులకు న్గఠినత్వ మిచ్చుఁ ద
మ్మెఱుఁగని వీనిపల్లవము లే మెన యంచుఁ దలంచె నంచుఁగా
మురు పగుదేవశాఖిని సమూలముగాఁ బెకలించి తెచ్చి యా
మురరిపు కేలుదోయి యిడె ము న్నొకభామ పెరంటిచెట్టుగన్. 37

ఉ. కోరినఁ గల్పశాఖి యొకకొన్నిఫలంబుల నిచ్చు నల్పముల్
గోరిక పార నిత్యఫలకోటుల నిచ్చు మురారి బాహువుల్
సారెకు వాని వీని కెటు సాటి యనం దగు దీటు లేమిచే
వారక పోల్తు రీకవులు వానికి వీనికిఁ దాఱుమాఱుగన్. 38

చ. అరయఁగ శంఖచక్రముల నంది సుగంధములం భరించి ప
ల్మరు విను చిక్కినట్టిమహిమన్ ఘనసింధురసేవ్యమానమై
ధరణిధరత్వ మంది గిరి తద్బుజయుగ్మముమీఁద నెంతయున్
సరిపడఁ బోరి యెత్తు వడె చాలక యా మురవైరిచేతనే. 39

చ. సరసులు మెచ్చఁగాఁ దనరు శంఖ మనంతము పద్మయుగ్మమున్
నరహరికంఠమధ్యనయనంబులకు న్వెలగా వటన్నచో
నరయఁగఁ బోకలా పిడికిలా యొకచేర లటంచు నెంచఁగన్
హరిహరి వారిమూఢమతి కాదియు నంతము గల్గ నేర్చునే. 40

తే. మారు డధరామృతం బెందు జాఱనీక
కోరి పెట్టిననీలంపుకోర యనఁగ
గొల్లచెలియలసొమ్ముగాఁ గొనుచుఁ దనరు
మదనజనకుని చుబుకంబు మధుర మొదవు. 41



తే. కావి గా దది విడికెంపుదీవి గాని
దీవి గా దది యమృతంపుబావి గాని
బావి గా దది కపురంపుతావి గాని
తావి గా దది శౌరికెమ్మోవి గాని. 42

క. తేటలుగా జిగిముత్యపు
పేటలుగాఁ బంచదారపేటులుగాఁ బూఁ
దోఁటలుగా రాచిలుకల
మాటలుగాఁ గంసవైరిమాటలు దనరున్. 43

తే. శౌరిముఖచంద్రునకు సహజంబులగుచుఁ
దగియే నధరామృతస్పూర్తి మృగమదాంక
మతులితకటాక్షశీతల మైనకళలు
నవ్వువెన్నెల కువలయానందగరిమ. 44

ఉ. మల్లెలు మొల్లమొగ్గలును మంకెనపువ్వు సువర్ణకోశమున్
దెల్లనినవ్వు పల్వరుస తియ్యనివాతెర నిక్కుముక్కునై
యల్లుకొన న్ముఖాబ్జమున నాతఁడు మాధవుఁడౌ టెఱింగి మే
ల్చెల్లవె వీనికి న్బుధులు చెప్పెడియాసుమనోభిధానముల్. 45

చ. మురహరునాస నూఁదఁబడి పోయిననీలపువేణునాదమున్
సరి గన లేక చేఁబడిన చంపకకాండవిలాససంపదన్
నెరి గని కాదె పక్షిపతి నేర్పున ము క్కెడఁ జేసి తగ్గి త
చ్చరణము లంది క్రిందుపడె సమ్మతి నెప్పుడు వీఁపుఁ జూపుచున్. 46

క. సరి లేనిశౌరినాసిక
స్మరవనవంశంబు గాదె మఱి దానితుదన్
వరముక్తాఫల మేటికి
వెర వగుతిలపుష్పతుహినబిందువురీతిన్. 47

క. అద్దిర నిద్దపుటద్ధము
లద్దనుజవిదారిచెక్కు లటు గా కున్నన్



సుద్దపుటద్భుతరసముస
కొద్దిక యై చూచువారి నొగి లోఁ గొనునే. 48

చ. జలజము కల్వ లొక్కదెస శౌరివిశాలవిలోచనంబులం
దుల గనఁ గోరి హంసతతితో జలమందుఁ దపంబు సల్పఁగాఁ
గలిగెను దోసము న్బగలుఁ గ్రమ్మఱ నాకనుదోయి నెంచఁగా
జెలఁగెఁ బికస్వరం బమర శ్రీధరణీకరభూషణంబు లై. 49

క. మురహరుని వంకబొమ్మలు[2]
మరువిండ్లే కాక యున్న మగువలమనముల్
మెఱుఁ గైనచూపుతూపులఁ
గురిసి విభేదించుదారి గొనునే జగతిన్. 50

తే. తనుఁ దలఁచి దీను లిడు మొఱ ల్వినఁగ లేక
యతులనవదివ్యసంపద లలరఁ జెలఁగు
శౌరివీనులు శ్రీలె పో సారె కటులఁ
గాక కనుదమ్ములటు మేలు గనఁగ నేల. 51

తే. శౌరిముఖసామ్యమును గోరి సారసారి
గట్టుపై నెక్కి తలక్రిందు గాఁగ నెంతొ
కాఁకఁబడిపడి తనచేతఁ గాక కాదె
యతనుచిత్తానువర్తి యై యతిశయిల్లె. 52

చ. వల నగునబ్జరూపములఁ బాత్రము జ్యోతియుఁ గాఁగఁ జేసి య
వ్వలపులఱేనితండ్రి మొగవాసికి వాసిగ దృష్టి దీసినం
జెలిమి ఘటిల్ల నప్పు డొకచెల్వము గాంచి ఘసంబు మించి హం
సలకుఁ గలంగ కే యుభయసంపద లందెఁ దమఃప్రసక్తి గాన్. 53

తే. ఇరులు గా వవి నీలంపుసరులు గాని
సరులు గా వవి మగతేఁటిగఱులు గాని

గఱులు గా వవి మరువేటయురులు గాని
యురులు గా వవి శౌరిముంగురులు గాని. 54

సీ. ఈకప్పు పెన్నెరి కెన యౌనె సౌరముల్
నీలాంచలముపైని నెగడినంత
నీయెమ్మెక్రొమ్ముడి కెన యౌనె నునునాచు
యమునాజలంబులో నల్లినంత
నీనిడుకీల్జడ కెన యౌనె రాహువు
గురుతమోవిఖ్యాతిఁ గొన్న యంత
నీగొప్పకొప్పున కెన యౌనె శిఖికోటి
మనులతో బహుమైత్రిఁ గన్న యంత
తే. ననఁగ వలగట్టి మృదులత్వ మంది చిక్కు
గొనక భంగమై కొనసాగి కనుల కెసఁగి
బెండుపడకయె యెపు డొక్క దండి వన్నె
జెందు గోపాలకస్వామి చికురభరము. 55

సీ. శకటారి నెమ్మోము సరి యెందు లేదని
ద్విజరాజుపై నానఁ బెట్టవచ్చు
శౌరికన్నులతోడ సమ మెందు లేదని
తమ్ములఁ బడవైచి దాఁటవచ్చు
మరునికన్నయమోవి సరి యెందు లేదని
యమృతంబుముందర నాడవచ్చుఁ
గ్రీడిబావయురంబు జో డెందు లేదని
యాదిశేషునిఫణ మంటవచ్చు
తే. కంసరిపుమధ్యసామ్యంబు గలుగ దనుచుఁ
జెప్పి హరిముందరనె బాస సేయవచ్చుఁ
గృష్ణదేవునిరూప మిం కెందు దొరకఁ
బో దటంచును నజు నైన ముట్టవచ్చు.

క. ఇల రాయరాయ లగుమా
యలరాయల నెంచి యూచ కాచక మదిలో
నలరాయల నెలరాయల
వలరాయల నెన్న దృష్టిపాత్రలు గారే. 57

ఉ. ఆనడ లామెఱుంగుతొడ లారసికత్వము లావిలాస మా
మేనిమెఱుంగు లామొలకమీసఁపురంగులు నాబెడంగు లా
సూనశరాసతంత్రపరిశోధన లామధురస్మితంబు లా
పూనికచొప్పు లాపలుకుపోడిమి యానెఱజాణకే తగున్. 58

ఉ. మాటలు ముద్దుపద్దులును మక్కువ చెక్కులు మ్రొక్కుసొక్కులున్
గాటఁపుకౌఁగిలింతలు వగల్ గిలిగింతలమీటువింతలున్
మాటికి మాటికి న్గలయుమాలిమి మేలిమిఁ జూచినట్టియే
యాటది వాని వీడు నకటా కడురక్కసి నన్నుఁ దక్కఁగన్. 59

మ. అని చింతించుచు మించుఁబోఁడి తనకున్ బ్రాణావనోదార మై
వనజస్యందమరందబిందువిలసద్వాగ్ధోరణీసార మై
యనవద్యాఖిలలోకవర్ణితమనోజ్ఞాకార మౌకీరముం
గని తా ని ట్లనె [3]సూనసాయకశరాఘాతార్తచిత్తాబ్జ యై. 60

మ. ఇదిగో వచ్చెద నంచుఁ బోయె బహునాళ్లేగెన్ మహాబ్దంబు లై
సదయుం డేటికి రాడు నాయెడఁ గటాక్షం బెల్లఁ బో నా డెనో
మది దా వీడెనొ కూడెనో యిళను రామా జీవ మూటాడెడిన్
మదనక్రూరదవానలం బదన మై మై నంటఁగాఁ గీరమా. 61

ఉ. కంటికి నిద్ర రాదు విను కాంతుని బాసిననాఁటినుండియున్
వంటక మింపు గాదు పెరవార్తలు వీనుల సోఁక లేదు నేఁ
డొంటిగఁ బ్రొద్దు పోదు మరు లూరక యుండఁగ నీదు తొల్లియే
జంటఁ బెనంగువారి గనఁ జాలక చాల కరంగఁ గంటినో. 62

సీ. వానిమోమును జూచి నే నేల మరు లైతి
జిగిగందమామపై వెగటు దోఁప
వానిమైసొగ సెంచి నే నేల వలచితిఁ
గలువలపాన్సుపైఁ గసటు వొడమ
వానినవ్వు దలంచి నే నేల చిక్కితిఁ
జిక్కనిపాలపైఁ జేఁదు గొనఁగ
వానిమా టాలించి నే నేల లో నై తిఁ
జిలుకపల్కులపైని జుల్క నమర
తే. వానివాతెర నే నేల యాసఁ గంటి
జీనిచక్కెరయుక్కెర[4]లేని మాన
[5]నిందు కేమందు నేమందు నందితిందు
[6]నెపుడు హరిపొందు గనుఁగొందు నెట్టులుందు. 63

సీ. కనుఁగవ హరిమోము గనుఁగొననే కోరు
వీనులు హరిమాట వినఁగఁ గోరు
నాసిక హరిమేని వాసన ల్గొనఁ గోరు
నధరంబు హరిమోవి యానఁ గోరుఁ
జెక్కిలి హరిగోటి నొక్కు టెక్కుల కోరు
గుబ్బలు హరిఱొమ్ముఁ గ్రుమ్మఁ గోరుఁ
గరములు హరి నెంతొ కౌఁగిలింపఁగఁ గోరు
మేను శ్రీహరిప్రక్క మెలఁగఁ గోరు
తే. నిన్ని యొక్కొకటే కోరు నిదిగొ నాదు
మనసు గోరెడికోరికెల్ మట్టు లేవు
మర్మమెందుకు మదనసామ్రాజ్య మిచ్చి
నెగడు హరియె యాయుర్దాయ మగుట శుకమ. 64

తే. మనసు కరఁగును హరిముద్దు మాట విన్న
మోహ మెద నిండు హరినగుమోము గన్నఁ

దమి చెలంగును హరిచెంత నిమిష మున్న
మరువవచ్చునె యెవరెంత మరువుమనిన. 65

సీ. హరి పేరురముఁ జూచినంతఁ జన్గుబ్బలు
సిగ్గుమాలుచు రైక చిటుల నుబ్బు
బసిగాపురాయలపల్కు విన్నంతనే
వీనుల కమృతంబువిందు లగును
మీనాంకుతండ్రినెమ్మేను సోఁకినయంతఁ
బులకలు తను వెల్ల మొలకలెత్తుఁ
గమలాయతాక్షుని గదిసి పైకొన్నంతఁ
దమి నిండి తండోపతండ మగును
తే. నందనందనుఁ డబ్బెనా నవనిధాన
ములును దక్కినచందానఁ జెలఁగుఁ జిత్త
మామనోహరుఁ బాసి నేఁ డడల వ్రాసె
నౌర తలవ్రాఁత తలకొట్లమారిధాత. 66

క. చెలువుని గన్గొనుటకు నా
పలుకునఁ జని చిక్కె నేమొ పరిపరిగతులన్
బిలిచిన రా దిచ్చటికిం
జెలిమి గలుగునాదుమనసు చెలి యోచిలుకా. 67

క. వీడుదు బంధుల మగనిన్
వీడుదు ధనధాన్యగేహవిభవము లెల్లన్
వీడుదుఁ బ్రాణము లొడలన్
వీడంగాఁ జాల హరిని వే యన నేలా. 68

ఉ. ఎంతని విన్నవింతు హృదయేశుఁ డొనర్చినవింత లన్నియుం
జింత కెడంబు లాయె మును చేసినబాసలు దప్పు లాయె న
న్నింతులు నవ్వ నాయె వెత లెందు వెలి న్విడఁ గూడ దాయె నే
నెంతయుఁ దార నాయె నిఁక నేటికి మాటలు ముద్దుకీరమా. 69

కం కల గంటి నిన్న రాతిరి
[7]కలకంఠిని గూడి హరికిఁ గరకరినాపైఁ
[8]గల కంటినగతి నిదిగో
కలకంఠధ్వనులు కర్ణ కాండము లయ్యెన్. 70

ఉ. కావునఁ బోయి నీ విపుడు గావుము శౌరిని దెచ్చి కూర్చి వే
గావుగ నన్ను వే గదిసి కాయజుఁ డెంతయుఁ బంతగించె లో
జీవము లావలించెఁ దమి సిగ్గు నడంచె విరాళి మించె మై
దీవె చలించె దాయ యయి దేవుఁడు న న్నిటు ముంచెఁ గీరమా. 71

సీ. నాకృష్ణ దేవుని నాముద్దుసామిని
నాచక్కనయ్యను నాదుహరిని
నానోముపంటను నారాజతిలకుని
నారాముతమ్ముని నాదువిభుని
నామనఃకాంతుని నానందతనయుని
నాప్రాణనాథుని నాదుప్రియుని
నామోహనాంగుని నానీలవర్ణుని
నావిటోత్తంసుని నాదుసఖుని
తే. జేరి కన్నులకఱ వెల్లఁ దీరఁ గాంచి
చాల నడిగితి మ్రొక్కితిఁ గేలు సాచి
కౌఁగిలించితిఁ గరములు కనులఁ జేర్చు
కొంటి రమ్మంటి మది వేడుకొంటి ననుమి. 72

సీ. మోహనాంగునితియ్యమోవి బింబ మటంచు
మదిఁ జొక్కి నామాటమరువ వలదు
నలినలోచనునిలేనగ వానవా లంచు
మరు లెక్కి నామాట మరువ వలదు

కంసారిపలుకులు కండచక్కెర అంచు
మదిఁ దక్కి నామాట మరువ వలదు
రమణుచల్లనిచూపు లమృతపూరమటంచు
నెరిఁ జిక్కి నామాట మరువ వలదు
కమలాక్షుకరములు కల్పశాఖ లటంచు
మది నెంచి నామాట మరువ వలదు
తే. వానిఁ గని రేని ఘనమోహవనధిలోన
మరగి ముగ్గుదు రయ్యాదిమౌను లైన
బలుక నేటికి మనవంటివారిఁ గానఁ
గీరమా తెల్వి గొని తెల్పు శౌరితోడ. 73

క. ఇళచెంత నాధుఁ డుండఁగ
బలుకం బోయెదవు నాదుపలుకులు చిలుకా
వెలి దీసి యొంటికొలువునఁ
జెలువునితో విన్నపంబు సేయుము చిలుకా. 74

క. అనుచిలుకలకొలికిని గని
కనికరమునఁ జిలుక పలికెఁ గలికిరొ వినుమా
వనరుహనయనుఁడు మఱి మది
నిను గడ నిడి భళి మఱొక్కనెలఁతను గొనునా. 75

సీ. కలికి నీకంఠంబుకరణి నున్న దటంచు
నీకటితటిదారి నెగడె నంచుఁ
గాంత నీయూరులగతిఁ జెలంగె నటంచు
నీయారుతీరున నెగడె ననుచుఁ
జాస నీబొమలచందాన మించె నటంచు
నీముక్కుటెక్కున నెగడె ననుచుఁ
బొలతి నీకొప్పుచొప్పున మేలు గనె నంచు
నీ మోముగోమున నెగడె ననుచు

తే. శంఖచక్రగదాఖడ్గశార్ఙ్గములను
వేణుశిఖిపింఛపద్మము ల్విడక పూనె
నట్టిహరి నిన్ను విడుచునా యడల వలదు
నిమిషమునఁ దెత్తు నే వాని నీలవేణి. 76

క. జలజభవాదులచేతం
దెలివిగఁ దే రానివానిఁ దే నోపుదునే
భళిభళి నీ వనఁ దెత్తును
బలుసోదరు నీ కటాక్షబలమునఁ జెలియా. 77

క. అని పలికి కలికిపంపునఁ
జనె ముద్దులు చిలుకుచిలుక జలజదళాక్షుం
గొని వత్తు నంచు నంతట
వనిత సఖు ల్గొలువఁ గేళివనమున కరిగెన్. 78

తే. కొమ్మ యీరీతిఁ జని కొమ్మకొమ్మయందు
నూతనం బగుదళములు నూల్కొనంగ
మరునికో టగుపూఁదోఁటఁ జొర వెఱవఁగఁ
జొరవ నుడివిరి తెఱవలు మఱువువడగ. 79

చ. సకియరొ చూడుమా కనులు చల్లఁగ నల్లదె మాధవుండు వా
రక సుమనోవికాసుఁ డయి ప్రాప్తవనప్రియచిద్విలాసుఁ డై
శుక ముఖసద్విజప్రకరసూనృతవాఙ్మయుఁ డౌచు గోపికల్
కకవికఁ జుట్లఁ బెట్ట వనలక్ష్మిని గూడి చెలంగె వేడుకన్. 80

చ. పొగడలు చెంగలించె సురపొన్నలు క్రొన్నన లుంచె మావులం
జిగురులు మించె సంపెఁగలు చెల్వు వహించె రసాలసాలము
ల్మొగడలు నించె గొజ్జఁగిగము ల్వికసించె నశోకభూజము
ల్తొగరు ఘటించె మించెఁ గదళుల్ కనవే ఘనవేణికామణీ. 81

చ. ఘనకమలాకరాశ్రయతఁ గాంచిన హంసలు మాధవస్తుతిం
జనుపికముల్ హరిం దలఁచు జక్కవపక్షులు కృష్ణవర్ణముల్



గొనునునుదేంట్లు మారగురుఁ గోరి వహించుశుకంబు లొప్ప మే
లని పురుషోత్తమస్ఫురణఁ గైకొనె నీవనిఁ జూడు భామినీ. 82

క. ఇటు లాడుచెలులమాటలు
కుటిలాలక యాలకించి కొంతకుఁ గొంతన్
దిట మూని కేళివనమును
జటులగతిం జొచ్చి మెల్లఁ జని చని యచటన్. 83

సీ. పున్నాగములఁ జూచి పున్నాగము లటంచు
భ్రమ గొని లేమావిగుములఁ జేరు
లేమావిగుములను లేమావిగుము లంచుఁ
దారాడి స్యందనతతికిఁ బాఱు
స్యందనతతులను స్యందనతతు లని
వెత నొంది పరవీరతతులఁ గోరుఁ
బరవీరతతులను బరవీరతతు లంచు
బెదరి కెంజిగురాకుపొదలు దూఱుఁ
తే. బొదలు మదనుని విరియంపపొదు లటంచు
నవలగొజ్జంగినీటికాలువలఁ దారుఁ
జెలులపైఁ జీరు వేమారు కలఁకఁబాఱు
వెతలచే మీఱు వేసారు విధిని దూఱు. 84

క. ఈరీతి నెచట నిలువక
తారాడుచు నొకరసాలతలమూలమున్
జేరి విరిపాన్పుమీఁదను
నారీరత్నములు గొలువ నవలా చెలఁగెన్. 85

తే. కోకకుచ కాఁకఁజడఁ జూడ లేక లోక
బాంధవుం డస్తమించెను బశ్చిమాద్రిఁ
గువలయద్వేషి యయ్యును గొమ్మవంతఁ
గనఁగ లేఁడన నితరుల ననఁగ నేల. 86

సీ. మఱి సంజ గనిపించె విరహులపై వల
రాజు గ్రక్కినకోపరస మనంగఁ
దిమిరంబు [9]తిమిరించెఁ దెగి పాంథులను ముంచ
మరుఁడు నిర్మించినమాయ యనఁగఁ
దారక లరుదెంచె మారుండు పథికులం
గూల్ప నించినచిచ్చుగుం డ్లనంగ
విధుబింబ ముదయించె వెస వియోగులనొంప
స్మరవీరుఁ డెత్తినచక్ర మనఁగ
తే. బొండుమల్లియతండముల్ పూచినటులఁ
బండువెన్నెల బ్రహ్మాండభాండ మెల్ల
మెండుకొనె విప్రయోగులమీఁద శంబ
రారి వైచినవెలిగుడారం బనంగ. 87

చ. కలువలు మీఱె నీరరుహకాండము తారెఁ జకోరపంక్తి వె
న్నెలరుచి గోరె జక్కవలనీటులు దీఱె విటీవిటాళిపే
రలుకలు జాఱె సూనశరుఁ డమ్ములు నూఱె సుధాంశురాలలో
పల జల మూరె దంపతులబంధురతాపము లాఱె నంతటన్. 88

చ. వెడవిలుకాఁడు లోపలను వెల్పల గాలియుఁ బైని జంద్రుఁడున్
జడిగొని చుట్టుఁ గీరములు శారికలు న్బికహంసముల్ నెరా
యిడుములఁ బెట్టఁగాఁ గలికి యిట్టటు బెట్టుగఁ గొట్టుకాడుచున్
బడలి విరాళిచేఁ గుముదబంధుని గన్గొని సైఁచ కిట్లనున్. 89

ఉ. తోయధిరాజుకుం బొడమి తోయజవాసినితోడఁబుట్టి యా
తోయరుహాప్తుజం టగుచు తోయజనేత్రునకు న్మఱంది వై
త్రోయఁగ రానిచీఁకటులఁ ద్రోయుచుఁ జల్లనితెల్వి చెందియున్
నాయమె నీకుఁ జెంగలువ నాయఁడ నాయెడ నింత సేయఁగన్. 90

తే. కాలమహిషాధిరూఢతఁ గదలి వచ్చి
కిరణపాశమ్ములఁ దగిల్చి విరహిజనుల
[10]డాసి తీసెదు ప్రాణముల్ దోసకారి
రాజవా నీవు యమధర్మరాజు గాని. 91

క. తమ్ములకును గొడుకునకును
సమ్మతి గానట్టిరజనిచరుఁడవు గావా
యిమ్మహి రావణదితిజుల
నమ్మక్కరొ మించి తౌర యత్రికుమారా. 92

తే. గురుసతిని బట్టి విప్రయోగులను గొట్టి
తమ్ముల నడంచి పక్షపాతము ఘటించి
కాలగతి నుండి యిదెరాజగట్టునుండి
పడె దధోగతి రౌరవప్రాప్తిఁ జెంది. 93

చ. తనుఁ గొనువారినిం గొనుచు ధర్మము దప్పక కాలకూటమున్
మును గళమం దడంచికొని మూర్ఖత ని న్శిరసావహింపఁగాఁ
బునుకకళాస మెమ్ములను బూదియుఁ బూని తలేఱుఁ బట్టి మే
నును సగ మయ్యు మూలఁ బడె నుగ్రుఁ డుదగ్రనిశాచరాగ్రణీ. 94

వ. అని మదనునిం గూర్చి యి ట్లనియె. 95

తే. విసముతోఁ బుట్టెఁ గావున విధున కకట
పద్మినుల నేచుగతి సరే భళిర నీవు
పద్మినీపద్మనేత్రులవలనఁ బుట్టి
మేనమామను బోలఁగా మేలె మదన. 96

తే. తల్లిపుట్టింటిపగవానిఁ దనరఁ జేసి
తండ్రిపేరును గైకొన్నదంటనంటి
పద్మినీజాతులను జంపఁ బగలు గంటి
వౌర నీ కిది యేమిటి మేర మార. 97

చ. అని యనిలుం గురించి పవనా [11]పవ నాయెడఁ జేయ నాయమా
ఘన మెడలించి మారుగతిఁ గైకొనుచు న్సుమనోహరుండ వై
దినమును లంకనుండి చనుదెంచుచుఁ గొమ్మలఁ బల్మిఁ బట్టఁగా
ననఁ దగు దీవు రావణున కన్నవొ తమ్ముఁడవో యెఱుంగరా. 98

వ. అని శుకపికాదులం గురించి. 99

సీ. [12]కాని మాటనె బందిఖాననే వేయింతు
గడుసుకొక్కెరవేఁటకానిఁ గూడి
[13]పట్టి మీపు ట్టెల్లఁ బలుగాకుల కొసంగి
వే ముంతు గోపికారాముఁ గూడి
పద మెత్తి పెట్టి మీమద మెల్ల వదలింతు
మెదలనీయక నీలమేఘుఁ గూడి
జడకొద్దిఁ గొట్టి మీచెడుగంతుల నడంతు
నిస్తులశరదబ్జనేత్రుఁ గూడి
తే. యలిగి మొగ మేల నెఱఁ జేయ శుకములార
[14]విడువుఁడీ వట్టికూఁతలు పికములార
డించుఁ డటు మందగతుల రాయంచలార
నిలుపుఁ డిఁక వెఱ్ఱికేకలు నెమ్ములార. 100

వ. అని విలపించుచుండునవసరంబున. 101

చ. చిలుక వజీరుఁ డత్తరిని జిందఱవందఱఁ జేతు నంచు నా
చిలుకలకొల్కిపైఁ గదిసి చివ్వలిరవ్వ లడంగ జాతిపెం
జిలుకులకోరికోల లటుచేఁదెను దుమ్మెదనారి మ్రోయఁగాఁ
గలికిమెఱుంగుగుబ్బలను ఖంగు ఖణీలు ఖచిక్కు రింగనన్. 102

క. ఇట్లేసిన మదిఝల్లని
[15]పట్లెల్లను సడలి రాధ భయ మందుచుఁ దా



నిట్లని పలుకఁ దొడంగెను
బొట్లంబుగఁ జుట్టు నున్న పొలఁతులతోడన్. 103

ఉ. శౌరిని బిల్వఁగాఁ జనినచక్కనికీర మదేల రాదొ యే
దారిని జన్నదో నడుమఁ !దారెనొ చేరెనొ లేదొ గోపికా
జారుని గాన్చెనో కనదొ చక్కఁగ నా వెత విన్నవించెనో
సారెకు లేక శౌరినుడిచక్కెగయుక్కెర మెక్కి చిక్కెనో. 104

సీ. పద్మాక్షుఁ డెవ్వతెపైఁ గన్ను వేసెనో
పలుమాఱు వలకన్ను పదరె నిదిగొ
శౌరి యెవ్వతెమోవి చవులకు మరగెనో
వదలక కెమ్మోవి యదరె నిదిగొ
వనజారి యచట నెవ్వతెచెట్టఁ బట్టెనో
విడువక భుజము కంపించె నిదిగొ
ఫణిశాయి యెవతెను బైకొని యేలెనో
మించి పెందొడ చంచలించె నిదిగొ
తే. చిత్తజునితండ్రి యెవతేచేఁ జిక్కుకొనెనొ
మించుసంచున మై తత్తరించె నిదిగొ
చిలుక యీవేళకును రాక నిలిచినపుడె
యేమి హేతువొ తెలియ లేదింతులార. 105

క. చెలువుఁడు వేఱొకచెలియను
దలఁపునఁ దలపోసినపుడె తనకుం దానే
తల నొచ్చుఁ గనక వినకయె
కలికిరొ యే మందు వలపు కానిది సుమ్మీ. 106

చ. కిలకిల నవ్వుచుం దివిరి కిన్నెర మీటుచుఁ బాట పాడుచున్
జిలుగురుమాలచెంగు వెనుజీరఁగ దుప్ప టొకింత జాఱఁగాఁ
గిళుకుహొరంగుపెండియము ఘల్లన నాయొడ లెల్ల ఝ ల్లనన్
దులదుల శౌరి వచ్చుగతి దోఁచియుఁ దోఁచక యున్నదేమొకో.

సీ. మదహస్తిపై నెక్కి మావటీల్ గొలువంగ
విచ్చలవిడిఁ జొచ్చి వచ్చునటుల
సాంబ్రాణితేజపై సాహిణు ల్పొగడంగఁ
బట్టాను జేపట్టి వచ్చునటుల
వెంట దళంబులై విచ్చుకత్తులవారు
మెచ్చఁగా దులదుల వచ్చునటుల
గిలుకుపావలు మెట్టి చెలికాండ్రు వెంట రాఁ
బావురంబును బూని వచ్చునటుల
తే. బడఁతు లిరువంకఁ దెలనాకుమడుపు లొసఁగఁ
గొనుచు జిగిచూపులను నాదుమనసు గొనుచుఁ
బడకయిలు సేరఁగా శౌరి వచ్చునటులం
దోఁచుటే కాని మఱి యేమి దోఁచ లేదు. 108

చ. ఉరమున హారము ల్గదల నొ ట్లసియాడ రుమాల చెంగు వె
న్నొరసి నటింపఁగాఁ జెమట లూరఁగఁ గస్తురిబొట్టు జాఱఁగా
వరుసలు మీటఁగా గళరవం బొఱపారఁగ మందనుండి శ్రీ
హరి నను నేలె నేను నెదురానఁగ మాయగ నున్న దేమొకో. 109

చ. అరయఁగఁ బ్రాణనాయకుల నవ్వల నివ్వలఁ బాయురామ లా
విరిశరునంపతంపరల వ్రేఁగునఁ బొర్లఁగ న్యాయ మక్కటా
హరి యిదొ నాదులోవెలి నహర్నిశముం గనుపట్టుచుండెడిన్
విరహ మి దేలనో మిగులవేదనఁ బెట్టు దురాగతంబుగన్. 110

చ. వలచినవారు లేరొ యెడఁబాసినవారలు లేరొ వార లీ
యలమటఁ జెందిరే మిగుల నందియు నావలె జీవయుక్తలె
నిలిచిరె యేటిమాట లివి నేరక యాడితి భూమి నుండఁగాఁ
గలిగెను శౌరితోఁ జెలిమి గంధగజేంద్రసమానగామినీ. 111

ఉ. ఎంతవిలాస మెంతసొగ సెంతవదాన్యత యెంతరాజసం
బెంతయొయార మెంతకళ యెంతగభీరత [16]యెంతసోయగం

బెంతనిరూఢ మెంతనయ మెంతమనోజ్ఞత యెంతఠీవి నా
యంతటిమందభాగ్య కిక నంతటిచక్కనిదేవుఁ డబ్బునే. 112

సీ. నేను ముద్దులు పెట్టఁ దాను ముద్దులు పెట్టి
తెఱవ నీదుఋణంబు దీరె ననును
నేను గెమ్మో వానఁ దాను గెమ్మో వాని
వెలఁదిరో విందుకు విందె యనును
నేను జెక్కిలి నొక్కఁ దాను జెక్కిలి నొక్కి
విరిబోణి వీడుకు వీడె యనును
నేను గౌఁగిటఁ జేర్పఁ దాను గౌఁగిటఁ జేర్చి
మెలఁతరో మేరకు మేర యనును
తే. [17]రతుల సే నేలఁ దా సమరతుల నేలి
సారసాక్షిరొ యిది మారుబేర మనును
చిన్ని చిన్నారివెన్నుఁడు సేయుచిన్నె
లెన్ని యె న్నని తలపోతు నేమి సేతు. 113

సీ. కెమ్మోవి యానకు గేలి సేయుదు రంటె
గజిబిజి మొనపంట గంటి సేయుఁ
గురులు ప ట్టీడ్వకు గుట్టు దక్క దటంటె
చీకాకుగాఁ దీసి చిక్కు పఱచు
జిగిగుబ్బ లంటకు సిగ్గు పోవు నటంటె
క్రొత్తనెత్తురు గ్రమ్మ గోరు లుంచుఁ
బరులు రాఁ గలరు లే వడిగ నేలు మటంటె
జూముల తరబళ్లఁ బ్రేమ నేలుఁ
తే. బలుక వ ల్దనఁ బావురాపలుకు పలుకుఁ
గిలకిలను నవ్వవ ల్దనఁ గేక వేయు

వానివగ లెంచి మై నీరు గానియపుడె
రాతఁ జేసెనొ చెనటివిధాత నన్ను. 114

సీ. వానికన్నులతేట వానిచల్లనిమాట
వాఁ డాడుసయ్యాట వానిపాట
వానిముద్దుమొగంబు వానికంబుగళంబు
వానిఱొమ్ముదిటంబు వానిడంబు
వానివాతెరకావి వానిపెన్నెరితావి
వానిచక్కనిఠీవి వానియీవి
వానిమూఁపులపొంగు వానిమేనిమెఱుంగు
వానికౌనుబెడంగు వానిరంగు
తే. వానియొరతీరుచూపులు వానిసౌరు
వానివలపులదొరసాము వానిగోము
వానిసేఁతలతగుమేల్మి వానితాల్మి
పరుల కెవ్వరికిని లేదు మరపు రాదు. 115

సీ. తనరఁ జూచిన దృష్టి దాఁకునో యని వాని
నునుమోము కనులారఁ గనఁగ నైతిఁ
గదియ నొక్కిన నేడఁ గందునో యని వాని
యధరంబు తనివార నాన నైతి
బిగిగుబ్బ లెద సోఁక బొగులునో యని వాని
ఱొమ్మున నిండారఁ గ్రుమ్మ నై తిఁ
దడవు చేసిన మేను బడలునో యని వాని
జెలఁగి నామనసారఁ గలియ నైతి
తే. నొచ్చు నంచని చెక్కిలి నొక్కనై తి
నలుగు నని గ్రుచ్చి కౌఁగిట నలమ నైతి
నందసుతు ప్రేమ సతత మని నమ్మియుంటి
నిప్పు డీరీతి నడుచు నంచెఱుఁగ నైతి. 116

సీ. మును చల్వ లొసఁగుచు మోమోటమున నున్న
సోముఁడు సోముఁడై చురుకు చూపె
నపరశరీరుఁ డై యాత్మజుఁ డై యున్న
మారుఁడే మారుఁ డై పోర సాగె
దాక్షిణ్యశాలి యై తగుప్రాణ మై యున్న
గాలియే గాలి యై కలఁప సోఁకె
మధువు గూరుచువేళ మహిమ నపేక్షించు
సురభియే సురభి యై తరుమఁ జూచె
తే. నగ్నిశిఖ లయ్యె వివరింప నగ్ని శిఖలు
భువి శిలీముఖములు శిలీముఖము లయ్యె
నన్ని యట్లయ్యె నిట్లైన యపుడె యిపుడు
కృష్ణ దేవునిదయ దప్పె నేమి సేతు. 117

వ. ఇ ట్లగుటంజేసి. 118

సీ. తగుకుంకుమరసంబు మగనిపేరురమునఁ
బెం పొందుకొమ్మ కర్పించరమ్మ
పద నై నగంబురా సదయువాతెర నాని
యెసఁగురంభోరున కొసఁగరమ్మ
నూఱినకస్తూరి గారాబుపతిప్రక్క
వెలయుమృగాక్షి కిప్పించరమ్మ
చేర్చి కూర్చినవిరుల్ చెలికానిఁ బైకొని
పొసఁగులతాతన్వి కొసఁగరమ్మ
తే. కటకటా నేర కిటు లంటిఁ గాని ద్రోహి
యైన నేఁ గూడఁగాఁ బెట్టినట్టిదీని
నిచ్చినంతనె వారల మచ్చికలకు
హాని పుట్టదె యిప్పుడే చానలార. 119

వ. అని యనేకవిధంబుల విలపించుసమయంబున. 120

తే. హరు నుదిటికంటిమంటల నంటి బెదరి
త్రుళ్ళి రౌతును బడవైచి మళ్ళి వచ్చు
తియ్యవిలుకానిసాంబ్రాణితేజి యనఁగ
గగనమార్గంబునను దోఁచెఁ గలికిచిలుక. 121

క. ఇటు లేతెంచినచిలుకను
గుటిలాలక చూచి లేచి కులుకుచుఁ జిలుకా
యిటు రమ్ము ర మ్మటంచన
దిటమున ముంజేత వ్రాలె దీనత దోఁపన్. 122

తే. అటుల ముంజేతిపై వ్రాలినట్టిముద్దు
చిలుకను గురించి చిలుకలకొలికి పలికె
మోవి కంపింప ముక్కరముత్తె మదరఁ
గప్పురపు తావి గుప్పున నుప్పతిల్ల. 123

సీ. కంటివా నాసామి కళలుగుల్కెడుమోము
కనులకఱవు దీర గరిమ చేర
వింటివా నాసామి వెలలేనిపలుకులు
తమకంబు దైవాఱఁ దాప మాఱ
నుంటివా నాసామి యొఱపైనముంజేతఁ
గాయంబు చెలువాఱ ఘనత మీఱ
మంటివా నాసామి మన్ననల్ గైకొని
బలుసంతసము దేర వలపులూర
తే. నంటివా తుంటవిలుదంటమంటమారి
తనము తొగగంటి వెనువెంటఁ దగిలెనంట
తొంటి నెనరంట నొంటినే నింట నుంట
జంట గూడక తాళ లేనంట చిలుక. 124

ఉ. దేవకిచిన్నికుఱ్ఱ వసుదేవునికూన యశోదపట్టి నా
దేవుని నెందుఁ గందు బలదేవునితమ్ముఁడు గోపగోపికా



జీవసజీవనంబు యదుసింహుఁడు శౌరి కిరీటిబావ శ్రీ
దేవియనుంగు సౌఖ్యనిరతి న్వసియింపఁగఁ గంటె కీరమా. 125

తే. ఎంత వేఁడిన బదు లాడ వేమి చిలుక
కాలగతు లెట్టు లున్నవో గడచినామె
కాఁగలది కాక మానదు గానఁ దెల్పు
చల్లకై వచ్చి ముంత దాచంగ నేల. 126

తే. అనిన విని చిల్క యుల్కి పేరల్క చిల్క
బల్కె ని ట్లని చిల్కలకొల్కితోడ
నన్నుదలమిన్న విను మొన్న నన్ను నీవు
వనజనాభుని దోడి తె మ్మనఁగఁ బోయి. 127

క. తెఱవా యే మని చెప్పుదు
హరి యున్నవనంబు చేరి యటు చూతుఁ గదా
గిరికొని యున్నా రచ్చటఁ
దరుణులు కోటానకోట్లు తన్మధ్యమునన్. 128

సీ. బారను గొల్వగా మీఱువక్షమువాఁడు
తలచుట్టి వచ్చు నేత్రములవాఁడు
చిక్కనిపాల్గారు చెక్కులు గలవాఁడు
మెఱుఁగుచామసచాయమేనివాఁడు
విడికెంపునణగింపు బింబాధరమ్మువాఁ
డున్నతాజానుబాహువులవాఁడు
చిగురాకులను గేరి నగుపాదములవాఁడు
డంబైనకంబుకంఠంబువాఁడు
తే. నెమలిరెక్కతురాఁబూనునెరులవాఁడు
మొలకనవ్వులఁదగుముద్దుమొగమువాఁడు
మదనకోటులఁ గొనగోట నదుమువాఁడు
చారుతరమూర్తి గోపాలచక్రవర్తి. 129

తే. పూలసిగ వీడ బావిలీల్ తూలియాడ
రాజసము గూడ భూషణరాజితోడఁ
బ్రోడలకుఁ బోడ యని కొనియాడిపాడఁ
గనఁదగియెనాడఁ గన్నులకఱువులూడ. 130

తే. మనము మాటాడ వేళ గాదనుచు నేను
దియ్యమామిడికొమ్మపైఁ గుయ్యకణగి
యుంటి దంటలమటుమాయతంట లెఱుఁగ
సరగఁ గులుకుచు వారలు హరినిగూడి. 131

సీ. కొమ్మ యొక్కతె గబ్బిగుబ్బలు గదియించె
సఖియ యొక్కతె మోవి చప్పరించె
వనిత యొక్కతె రాధవలె నేలుమని తక్కె
జెలియ యొక్కతె నిక్కి చెక్కు నొక్కె
రమణి యొక్కతె పావురాపల్కులను బల్కె
గలికి యొక్కతె పొలయలుక చిలికె
నలివేణి యొక్కతె సొలపి ముద్దులు వెట్టె
నువిద యొక్కతె పాదయుగము పట్టె
తే. ముదిత యొక్కతె చుంబనం[18]బునను బొల్చె
బాల యొక్కతె పుంభావకేళి నిలిచెఁ
జాన యొక్కతె సమరతి సలుపఁ బిలిచెఁ
దరుణి యొక్కతె నటనబంధనము వలచె. 132

చ. అపు డొకకుల్కులాడి పొలయల్కలు చిల్కుచుఁ బల్కుపల్కుకున్
గపురపుపల్కు లొల్క వగకాఁడ బలే నిను మెచ్చఁగా వలెన్
గపటము చేసి మాచెలిని గంతునిరంతుల కొప్పగించి నీ
విపు డిటు వచ్చి నెచ్చెలుల వేడుకల న్మరుగంగఁ జెల్లునే. 133

తే. అనుచుఁ జనుదేరఁ గని యిళావనితచెలియ
యంచు మది నెంచి చెలుల కేడించి దాని
గబ్బిచనుదోయి యెద నుంచి కౌఁగిలించి
పడఁతితోఁ దెల్ప వల దని పంజరించి. 134

సీ. తప్పక తనుఁ జూచి ఱెప్పవేయక వచ్చు
జలజాక్షిపై దృష్టిసైత మిడక
మోహాపదేశతమోముఁ జూపుచు వచ్చు
సకియమోమున ముద్దుసైత మిడక
బహుదూరమున నుండి పైఁట విచ్చుచు వచ్చు
చానగుబ్బల గోరుసైత మిడక
భ్రమఁ బోకముడి సగ్గి బారవైచుక వచ్చు
నాతిమేనున మేను సైత మిడక
తే. జారుశిఖ వీడ తెలిముత్తెసరము లాడ
నందియలు పల్కఁ బఱచె ఘర్మాంబు లొలుక
సదరు మదినాటి యిళనెంచి యదుకిరీటి
[19]పదక మెద మీఱ బంగారుపటము జాఱ. 135

మ. ఇటు లేతెంచినశౌరిరాకఁ గని యయ్యేణాక్షి మోహంబుచే
నటు చన్గుబ్బలు లుబ్బం గన్ను బెళుకన్ హారాళు లల్లాడ నా
మటుమాయ ల్గలశౌరిఁ జేరి పులకల్ మైఁ గ్రమ్మఁగాఁ గ్రుచ్చి కౌఁ
గిట శయ్యాగృహమందుఁ జేర్చి మదనక్రీడాభిలాషం దగన్. 136

క. అప్పుడు వారలవెంటనె
చొప్పెఱుఁగఁగనీక నందుఁ జొరఁబడి యొక హో
న్మెప్పులకీల్బొమ్మకడన్
దప్పక కనుచుంటి వారితటమట లెల్లన్. 137

సీ. పన్నీరుమేరువల్ బాగాలతట్టలు
కలపంపుగిన్నెలు గందపొడులు
ముడిపూలపొట్లముల్ పునుఁగుకరాటముల్
జవ్వాదిబరిణె లాక్షారసంబు
సొమ్ముల పెట్టెలు సొరిది యత్తరుబుడ్లు
కుంకుమపింగాండ్లు కుసుమధృతులు
కపురంపుక్రోవులు కస్తూరివీణెలు
కట్టువర్గంబులు చుట్టుఁ దనరు
తే. చలువచప్పరకోళ్లమంచంబులోనఁ
జెంపబిళ్ళలతలగడల్ చిన్నిదిండ్లు
బటువులొఱుగులుఁ గలపూలపాన్సుమీఁదఁ
దమకమున నిళామాధవుల్ తగ వసించి. 138

సీ. కంసారి బిగియారఁ గౌఁగిటఁ జేర్చిన
గుబ్బలకసి దీరఁ గ్రుమ్మెఁ గొమ్మ
కంజాక్షుఁ డాని చిక్కనిముద్దు పెట్టిన
నలరుచక్కనిమోవి యానెఁ జాన
యతనునికన్నయ్య యచ్చోటఁ జెనకినఁ
దేటచెక్కిలి గోట మీటె బోటి
మందరనగధారి మణితముల్ నించినఁ
జిగురుమకారముల్ చిలికెఁ గలికి
తే. కృష్ణదేవుఁడు కరికరక్రీడ సలుప
జేరి తమి రేచి పురికొల్పెఁ గీరవాణి
నీలవర్ణుఁడు పైకొని క్రీడ నేల
బాళి నెదురొత్తు లిచ్చె నిళాలతాంగి. 139

సీ. కిలకిలనవ్వులు గిలిగింతలును బంధ
భేదపురవములు వింతవగలు

పావురాపలుకులు వాతెరనొక్కులు
చిగురుమకారముల్ జిలుగుతిట్లు
దురుసుపైసరములు తొందరముద్దులు
బిగికౌఁగిలింతలు బింకములును
గొనగోటిమీటులు గోరింపు లుబుకులు
కొసరులు బొమముళ్ళు కురుచసన్న
తే. లౌర శాబాసు మేలు బళారె బాగు
హాయి తడబడ కెడ గాకు మాయెనాయె
విడకు విడువకు మనియెడి నుడువు లపుడు
చెల్లవో యేమి చెప్పుదుఁ గొల్లకొల్ల. 140

తే. వెలఁది యీరీతి వేవేలవితము లమరఁ
గలిసి కసివోక నీలమేఘంబుమీఁద
నెరితళుక్కనుక్రొక్కాఱుమెరు పనంగ
సరసిజాక్షునిపై వేగఁ జౌకళించె. 141

సీ. వడిగండ్లగమిగుంపు వర్షించుఘనమనఁ
గుసుమముల్ గురియుకీల్కొప్పు మెరయ
హిమబిందుసిక్తమై యిం పొందుతమ్మినాఁ
జెమట గ్రమ్మినమేను చెలువు మీఱఁ
జిలుక నొక్కినబింబఫలరాజమో యన
మొనపంటిగంటికెమ్మోవి దనర
డాగువేసినబల్కడానికుండలరీతిఁ
గొనగోటిమీటుల గుబ్బ లలర
తే. మారసంగ్రామగంభీరభేరిదారి
రవలబంగారుటందెలరవ మెసంగఁ
దరుణి పొదలుచుఁ బురుషాయితంబు సలిపె
ముద్దులమురారిపై లకుముకి యనంగ. 142

చ. తసుగులు మూల్గు లగ్గలికె తాఁకులు సోఁకులు తోపు లూపులున్
కొసరులు మెప్పులున్ వగలు గుల్కులు బెళ్కులు కూర్మిపల్కులున్
వెసఁ జిఱుసన్నలున్ వలపునిక్కులు తక్కులు సొక్కుమ్రొక్కులున్
గుసగుసమాటలు న్నడిచెఁ గూరిమి నిద్దఱికి న్సమంబుగన్. 149

క. నానావిభవాకర మై
మానససంజాతజాతమహిమార్ణవ మై
కానుకతర మై యాసుఖ
మానందోబ్రహ్మ మైన హరి మైమఱచెన్. 144

గుణితమత్తేభవిక్రీడితవృత్తము.
తరుణీమన్మథ తామసాంతతిమిరోద్యచ్చాయ తీర్థాంఘ్రిపు
ష్కరమా తూర్ణగవైనతేయహయ తేజస్సూర్యతైక్ష్ణ్యోజ్జ్వల
ద్వరచక్రాయుధ తోయజాతనయనా తౌషారశుభ్రప్రభా
కరకీర్తి ప్రద తంద్రికేతరచిరాఖ్యా తస్కరాగ్రేసరా. 145

కవిరాజవిరాజితము.
వృజినవిదారణకారణ దారుణవీర్యగుణాగుణవిత్ ప్రతిభా
విజయవిసృత్వరజిత్వరసత్వరవీర పరాత్పరవిప్రసభా
నిజపదసేవనపావనభావననీలఘనాఘననిర్మలభా
స్వజనకృతాదర మోదరసాదరసర్వధరాధరసారశుభా. 146

క. అంభోధిపటీభారవి
జృంభణసకలాద్రికులవిశృంఖలదళహృ
బ్జంభారితనయసారథి
గాంభీర్యాదార్యవిజితకలశాంబునిధీ. 147

గద్యము
ఇది శ్రీచిన్నికృష్ణకరుణాకటాక్షవీక్షణక్షణప్రవర్ధమానానూనశృంగారరసప్ర
ధానసంగీతసాహిత్యభరతశాస్త్రాదివిద్యాపారంగత శ్రీమత్తిరుమల
తాతయాచార్య పాదారవిందమిళిందాయమానమానసచోళ
సింహాసనాధ్యక్ష ప్రతాపసింహమహారాజ బహూ
కృతానేకచామీకరాంబరాభరణముత్యా
లుగర్భశుక్తిముక్తాయమానముద్దు
పళనిప్రణీతం బైనరాధికా
సాంత్వనం బనుశృంగార
ప్రబంధంబునందు
ద్వితీయా
శ్వాసము.

  1. పనులచేఁ [మూ.]
  2. కన్ను బొమ్మలు [మూ.]
  3. రాధ మన్మథ [మూ.]
  4. లేనిమాలి [మూ.]
  5. తిందు కేమందు మదిని నానంద మొందు [మూ.]
  6. దెపుడు [మూ]
  7. కలకంఠిని గూడి శౌరి కందిన యటు లైఁ [మూ.]
  8. గలఁ గనినగతియు నిదిగో [మూ.]
  9. మించెను దెగిసాధులను [మూ.]
  10. గాసిఁ జేసెదవిప్పుడు దోసకారి [మూ]
  11. పగ [మూ]
  12. కానిమ్ము నే [మూ]
  13. పట్టి మీపుట్టిల్లు [మూ.]
  14. ప్రేలగా నేలనిప్పుడు పికములార [మూ]
  15. పెట్లెన్మదిసడలి రాధ పంబినవెతతో [మూ.]
  16. యెంత యారజం [మూ.]
  17. రతుల నే నేలఁగా నను రతుల నేలి [మూ.]
  18. బోలిజేసె [మూ]
  19. వెడలె నెదయందు మదనుఁడు విరియఁబాఱ