రాధికాసాంత్వనము (ముద్దుపళని)
శృంగారకావ్యగ్రంథమండలి-౧
రాధికాసాంత్వనము
ముద్దుపళని ప్రణీతము
PUBLISHED BY
K.G.MURTHY
FOR SRUNGARA KAVYA GRANDHA MANDALI
1000 COPIES.
సర్వస్వామ్యములును
మచిలీపట్టణము,
శృంగారకావ్యగ్రంథమండలివారివి.
రససమీక్ష
మధురసంగీతగీతికాలాపమోహనపారవశ్యము—సరసత్వము…చెలులకే చెల్లుతుంది. ఈ ఔపచారికదోహదవిధులలో…ననవర్ధితమైన కవితావైభవము—పరిమళ మలవడినమేలిమి.
యౌవనోపభోగముల చవులెరిగిన మిటారపువయసుకత్తె కవితామాధుర్యము భోజదేవునే పరవశుణ్ణి చేసింది. విద్వత్కుటుంబమును సన్మానించి గౌరవించడంలో…కళామోహిని అయినపడుచుకోడలి పద్యరచనకే అగ్రమర్యాద జరిగినది.
భోజునిబామరగ్రాహిణిసీత…ఎన్నికకువచ్చిన కవితావిదుషి.
ఆంధ్రభోజుఁడు—తుళువ కృష్ణరాయని కూతురు…మోహనాంగి!
ఆ వదాన్యరాజసముతో తీరికలు దిద్దుకున్న మహారాష్ట్ర—నాయకుల వినోదసదస్సులలో అపరభారతులై, కనకాభిషేకపరువము దక్కించుకున్న—శృంగారనాయికలు…వలపుల దొరసానులు…ప్రబంధరూపబంధనిర్మాణలు…జాణలు.
ఎటుచూచినా మొదటినుంచీ చక్కనికవిత్వరచనచేయడం—కావ్యరసికులను మెప్పించడం—సీమంతినులసొ మ్మని విశదమౌతూన్నది.
మండలముల బారున ఋక్సాముచేసిన ఋషులతోబాటు…సంహితకు రచనామణీదీధితులు అలవరించిన వైదికయోషలకున్నూ—ఏకప్రధనము ఉన్నది. అంతవరకూ ఎందుకు?—‘యఃకౌమారహరః’ అన్న ఒక్కపద్యమే—శీలభట్టారికకీర్తిని కావ్యఅనుక్రమంలో వర్ధిల్లజేస్తూన్నది.
అలంకారికులు అందరూ మధ్యమరసమని శృంగారమునకు ప్రధానఫాయా కల్పించినారు. రతి…అష్టాదశకావ్యవర్ణనలలో—ఉద్రేకస్థాయిని రెట్టించి మంగళపరమావధిని కలిగించె ఉపకరణము.
సిసలైన శృంగారకావ్యమును…ఆద్యంతరతివిహారప్రధానంగా రచించవలెనంటే…యౌవనవతి సకలకలాప్రౌఢ—సర్వంకషరాసిక్యనిధానము వెలయాలు—ఒక్కతే తగుతుంది.
మగవారికి చేతకాదని…దోషాపాదనము లేశమున్నూ కాదు. కాని ఎంతఊహించి కథాదృశ్యమును చిత్రించినా మగవాడు—దీపము ఉండగా ఇల్లు చక్కబెట్టనీయలేడు—చీకటితప్పు కనుక. పింగళిసూరన్న స్వతంత్రించినా ననుకున్నా సుగాత్రిచేత ఎదురుబ్రతిమాలించడానికి…నాయికానాయకులను—వైదికదంపతులను—ఊరివెలుపలితోటలో చెట్లచాటున దాచివేయక తప్పిందికాదు.
పోనీ కవి అంతకన్న ఇంకా కొంచెంవిజృంభించినా…నాయికాసాలభంజిక ఊహాగానలయను ఊగవలసినదేకాని…అకృత్రిమచైతన్యస్పందితముకాదు. విద్యాదయితుడంతటివాడు…ఆడువారిసుఖానందం అనుగతంగా ప్రత్యక్షీకరించుకునేందుకు…భార్యను బ్రతిమాలి సెక్సు మార్చుకున్నాడని—కళాపూర్ణుడి జననవార్తకు పూర్వరంగం ప్రమాణము.
—కవిసార్వభౌమునితో కన్నెతనపు మురిపెములలో ప్రౌఢరికము చలాయించి దేశములు తిరిగి ‘కన్నడరాజ్యరమారమణు’ని రసికజీవనం ధన్యముచేసిన తెలుగువాణికి…తాళికోటలో నిలువనీడ తరిగిపోయింది. అష్టదిగ్గజాధిరూఢోత్సవవైభవము కలలలో మలగిపోయినా…మధుర తంజాపురసామంతనాయకులు కావ్యకన్యకజీవనసంధ్యకు అరిగాపులై నిలిచినారు. వయసుజిగివి పోయినా ఆమె అలవాటుచొప్పున ఎడనెడ వింతకై సేతలు మానినది కాదు!
ఆ తళుకులే…నవ్యసారస్వతానికి, రచనాలాలిత్యానికి, ఊతలై నిలిచిన…కావ్యచిత్రశోభలు.
—భోసల తుళజేంద్రుని కుమారుడు—ప్రతాపసింహుడు. తుళజరాజు వెనుకవారు కృష్ణరాయలు నమ్మిన మరాటాసామంత వీరులు. ముసల్మాను ఒత్తిడిని లక్ష్యముచేయకుండా వీలుచూసుకుని స్వతంత్ర ఆధిపత్యము సంపాదించుకున్న రాహూతులు. భాషకు…సంప్రదాయములకు కెేవలం పరాయివాళ్ళయినా ఏలిక అభిరుచులను మరగినభాగ్యాన తెలుగుకవిత్వాన్ని—కవులను, ఆదరించి గ్రంథరచన ప్రోత్సహించారు. రఘునాథుడు—విజయరాఘవుడు—అటు, తిరుమలనాయకుడు—చొక్కనాథుడు…వీరందరూ లేకపోతే తెలుగుతల్లిని ప్రేమతో పూజాస్థానంగా చేసుకోకపోతే…రంగాజీలాటి దివ్యతారలు మెరసిపోకపోతే…ఎంత అంధయుగం—వాఙ్మయచరిత్రలో!…వెలుగు యీనాటికైనా కోలుకొనేదా?
ప్రతాపసింహుడు—రసికప్రభువు—1749 మొదలుకొని పదహారు సంవత్సరాలు పరిపాలనచేసినాడు. ఈతని కుమారుడు…పితామహునిపేరిటివాడు…‘భరతశాస్త్రనిధి: సంగీతం అతనిసొమ్ము: రూపమున మన్మథుడు.’
ఇంకొకరసికుడు—ప్రతాపసింహుడే ఉన్నాడు—అమరేంద్రుని కుమారుడు…
ప్రతాపసింహుడు వైష్ణవుడు. తండ్రినాటినుంచి కులగురువు—తిరుమల తాతయాచార్యుడు—బ్రహ్మవిద్యానిధి.
♦ ♦ ♦ ♦
చోళసింహాసనాధ్యక్షుడైన ఆ మహారాజు వలపునేస్తము—ముద్దుపళని…
—పళని…దక్షిణదేశంలో వేలాయుధుని పూజాక్షేత్రము. ముద్దు—ముత్తు…తమ ముద్దుచెల్లించుకునేందుకు ద్రావిడులు—కన్నపాపలకు ఉంచే నామ—పూర్వపదము. ‘చాలచోట్ల బిడ్డలకు దేవస్థలములపేరులే ఉంచుచుండుట వాడుకఉన్నది’—అని…నిత్యసువాసిని బెంగుళూరి నాగ(గాన)రత్నం గ్రంథస్థము చేసినది.
ముద్దుపళని తండ్రి ముత్యాలు. ఈతడు, అనుష్టానికవైష్ణవుడైన నాలవజాతిగృహస్థు.—అసలు అవ్వయ్యకు—ఒక కొడుకు ఒక కూతురూ... ముత్యాలు తంజనాయకి అని, 'వీళ్ల తల్లి—చెంగాతి ...
ఎందుచేతనో చెప్పవీలులేకుండా ఉన్నది: భార్య తనకన్న ముందుగా చనిపోవడంచేత, ఒక్కడూ పిల్లలను సాకలేకపోయినాడో—లేక, చిన్నతనంలో తలిదండ్రులు కరవౌటచేత ఆమె పాలబడ్డారో— కాని ... తంజనాయకి అని ఒక వేశ్య—ముత్యాలునూ ఆతని తోబుట్టువునూ పెంచుకున్నది.
...చిన్న తంజనాయకి—కులవృత్తిలోకి దిగిపోయింది. ఆమె కూతురు—రామామణి ... తన పేర ఒక అగ్రహారం నిర్మించి అనేక సత్కార్యాలు... సప్తసంతానములలో వీలైనన్ని ప్రతిష్ఠించి—సంపాదన సద్వినియోగం చేసింది.
—ముత్యాలు...పోటి ఆనే భార్యతో—నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు.... సంసారవృద్ధి చేసుకున్నాడు.
ముద్దుపళని ... తొలిచూలు. ఇంకో చెల్లెలు ముద్దులక్ష్మి: చివరపిల్ల పేరు—పద్మావతి. వీళ్లు ఇద్దరూ కూడా అక్కతో సమాన లైన జాణలే: కాని, ఏమహారాజులు వారిని ఆదరించారో వివరములు తెలియడములేదు....
‘ముద్దుపళని’__ ఈ నామం మరాటాబాణీలో ఉన్నదని అనుమానించి బ్రౌనుపండితుడు—ముత్యాలువంశం తెలుగునాటది కాదు అని అభిప్రాయపడినాడు. అచ్చ తెలుగు కుటుంబము... దేశము అలజడిలో దక్షిణానికి తరలిపోయి ఉండవచ్చును. వైష్ణవ ఆవేశంవల్ల ద్రావిడనామములు అలువాటు చేసికొని ఉండవచ్చును కొంతవరకూ. ముత్యాలు మరియడ్దరు కుమార్తెలకు—లక్ష్మి, పద్మావతి—అని అరవకల్తీ లేని సంస్కృతనామకరణమే చేశాడు కాదూ?
...కనుక ముత్యాలు.......చిరవాసం చేత సగం ద్రావిడుడైన ఆంధ్రుడే కాని... మహారాష్ట్రుడు ఏలా అవుతాడు?
ముద్దుపళని ... భరతాభినయంలో ప్రావీణ్యం సంపాదించు కుంది... కులమర్యాదక్రమాన. వయసుకాడైన వైష్ణవదేశికుడు . .. ‘తపఃఫలసారుండు’ .... వీరరాఘవుడు - సాహిత్యనేపథ్యము శృంగారించినాడు. ఇక మహారాజు మనసుకు నచ్చడానికి ... ఏమికొదువ?
అయితే: ముద్దుపళని రంగాజీవలె శాస్త్రకాకలదీరిన పాండిత్యధీర కాదు. గొప్పచక్కదనం, అందుకు వన్నె తెచ్చే భరతవిద్య -వీటికి దీటైన సరసత్వం సాహిత్యం అన్నిటినీ మించిన . . మహారాజ భోగానుభవయోగము !....
కృష్ణునికి సాంత్వనోపాయాలు, పదాఘాతబహూకృతులూ - వింతలు కావు. తిమ్మన్న ప్రసిద్ధ -ఉత్పాద్య వస్తువును ...రాయల వారుకూడా, గీర్వాణిలో ముఖరించినారు. ప్రీణనకావ్యములు ముద్దుపళని నాటికి కొత్తలుకావు. కాని, ఆ కధాకలాపమంతా... సత్య మీదుగా నడిచింది.
‘రాధికాసాంత్వనము’ ...ముద్దుపళని రచించే అవసరాన— వీరరాఘవదేశికుడు సలహాయిచ్చి అపుడపుడు సాహాయ్యపడి ఉండ వచ్చును. కాని అతని పాండిత్యానికి ప్రతిభకూ - యీప్రబంధములో విశేషముపని తగులలేదు.
రావిపాటి తిప్పన్న సంస్కృత ‘ప్రేమాభిరామము’ను.... వల్లభరాయడు అనుసరించినట్లు, ముద్దుపళని సాంత్వనకావ్యమునకు ఏవో ఒరవడులు ఉండి ఉండవచ్చును.
...కృష్ణుని, యశోదానందులు. గారాబంగా పెంచుకుంటున్నారు వ్రేపల్లెలో... నందుని చెల్లెలు రాధ. పెంపకములాలనలో మరులు రేకెత్తించి…‘గోపపతుల కెల్ల కుసుమశరు’డైన ‘రాజగోపాలమూర్తి’ని వశము చేసుకుని హరికి ప్రాణపదమై స్వైరవిహారం చేస్తూ ఉన్నది.
యశోద తోడబుట్టినవాడు కుంభకుడు. ఆతనికూతురు… ఇళ్లను, కృష్ణునికి యిచ్చి పెళ్లి చేశారు. పిల్ల మేనత్తవద్ద చనువుచేత వ్రేపల్లెలోనే ఉంటూన్నది. ఆమెపోషణకూడా రాధదే…
—ఈ డేరిన తరువాత …ఇళకు మాధవునకీ…ఔపోసన కార్యం జరిగింది. రాధశుశ్రూషలో గడి రిన ఇళ—పసిబాలఅయినా—ప్రౌఢమర్యాదల చవులెరిగిన నాథుణ్ని అనురక్తునిగా చేసుకున్నది.
కొన్నాళ్లకు, భార్యతో కృష్ణుడు అత్తవారింటికి మిధిలకు వెళ్లాడు. రాధ—మొదలు, కృష్ణుడు ఇళతో దాంపత్యంచేస్తూన్న శృంగార భావనే—సవతిమత్సరంపూని—సహించలేకపోయింది… ఇళమీద ఎంతప్రాణమైనా. ఇక ఆతడు కంటికికూడా దూరమై సప్పుడు ఆమె వేదన… వర్ణించడానికి వీలవుతుందా?—
విప్రలంభము భరించలేక …చిలుకను రాయబారమంపింది. అది మిధిలకు రెక్కలమీద వెళ్లి వచ్చి అక్కడి విలాసాలన్నీ అతిశయంగా వర్ణించేసరికి…రాధ తూలిపోయింది…
ఇంతలో కృష్ణుడికి కూడా…రాధను చూడకుండా ఉండటం దుర్భరమై తోచి తిరిగివచ్చేస్తాడు. రాధ, ఆతన్ని చూడగానే ఉక్రోషంకొద్దీ మండిపడి తాచులాగా లేస్తుంది: ఇష్టం వచ్చిన మాటలంటుంది. క్షమను అర్డిస్తూ ఆతడు పదములు అంటబోతే—తంతుంది: చివరకు వలవల ఏడుస్తుంది—ఈ మాదిరిగా నాటకమంతా జరిపి…నాధుని కౌగిలిలో…ఆకులలో పిందెలాగా…అణగి పరవశిల్లి పోతుంది. అక్కడితో—కధకంచికి,…
ప్రబంధము నాలుగు ఆశ్వాసములుగా పెరగడం కోసం…ముద్దుపళని, రాధ చేత… చంద్రోపాలంభనాదికములు, ఛాందసకార్యములు చేయించింది. అంతమాత్రమే!—ప్రత్యేక కల్పనాలంకృతములు కావు ఆ భాగములు: విశేష చమత్కారములున్నూ లేవు…
—కాని, రాధను చిత్రించడంలో ముద్దుపళని శిల్పసౌభాగ్యమంతా వినియోగపడింది. రాధ…నందునికన్నా చాలా చిన్నది. గేహే గేహే జంగమా హేమవల్లులు మెరసిపోయిన వ్రేపల్లెవాడలోనే…ఆమెను మించిన అందాలరాసులు లేనందువల్ల…గోపకిశోరునికి ఆమె అనంగసర్వస్వరూపమవటంలో విశేషం ఏమిలేదు. వివాహిత; కాని, మోట—గొల్లమగనితో కాపురం చేయకపోవడం—నందాదులు హర్షించి ఊరుకున్నారంటే…సామాన్యకుటుంబధోరణిలో కళంకమైనా…అది వారిరసజ్జతను రెట్టిస్తూ, లోకైకశృంగారవీరశేఖరుడైన కృష్ణునికి పెంపుడుకులముగా ఉండగల తాహతుకు ప్రతిపత్తి కల్పిస్తున్నది.
కృష్ణుడు…రాధకు సర్వమున్నూ, కృష్ణుని చిన్నిభార్య కనుక ఇళను ఎంతో కూరిమితో పెంచి …ఆతనికి తగినయిల్లాలుగా తయారుచేసింది. తన అనుభవమంతా వినియోగించి. —శృంగారించి గదిలోకి పంపింది. ఇక అక్కడనుంచీ …ఆమె ప్రవృత్తి సాఫుగా మారిపోతుంది. అంతకుముందు, ఇళ తన శిష్యురాలు. నవ్వులాటకు సవతి అని పరిహాసం చేసినా…మనసులో బాధపడవలసిన అవసరం లేకపోయింది—వ్యధ ప్రత్యక్షంగా అనుభూతం కాందువల్ల.
—పడకటింటి గదితలుపు గడియ పడగానే…రాధగుండెల్లో రాయిపడ్డది. దంపతులిరువురూ ఏకాంతాన అనుభవించే సుఖమును తలచుకొన్న కొలదీ…మతిపోతూన్నది. తనకు లేదని ఒకమూలచింత: తనవాడు—మరొక్కతెతో—ఇళ అయినప్పటికీ—తనకు ఖాయములైస భోగములు పొందుతున్నాడని…అంతకుమించిన వేదన. తెల్లవార్లూ ఎలావేగించిందో…పొద్దు పొడవకముందే—ఇక నిలువలేక —వెళ్లి తలుపు తట్టి…లోపలికి చొరవ చేసుకుని జొరబడి, కసి—ససిగా—తీర్చుకున్నది…
…కుంభకుడు కూతుర్ని అల్లుడినీ తీసుకపోవడానికి వచ్చినప్పుడు రాధను కూడా సమ్మతి అడిగినాడు. అత్తా—అల్లుడిపరిచయం అందరూ ఎరుగున్నదేకదూ? …కాని ఆమె ఏలా పంపగలదు? —మరి పంపకనూ విధి లేదు. అందుచేత మనోగతభావములను పైకి తొణకనీయకుండా చాలాసరదాగా మాటాడి సంతోషముగా సరేనన్నది. ఇక తరువాత…ఆమె అవస్థ…
—కృష్ణుడు మిథిలనుండి బెదురుతూనేవచ్చాడు…విడిచి వెళ్లినందుకు రాధ ఎంతగా దండిస్తుందో అని.. కాని ఆమె తయారీలో రాటుదేరినవాడే గనుక అనునయించలేకపోతానా అని భరోసా మాత్రం ఉన్నది. అయినా ఏమవుతుందోననే భయం ఆదుర్దా, లేకపోలేదు.
కంటబడగానే…ఎన్ని నిష్ఠురములాడింది!…ఎన్నిరకాల దెప్పిపొడిచింది?…ఎంతకోపము తెప్పించుకుని బుసలుకొట్టింది. అయినప్పటికీ, లయవిడవకుండా—మూర్ఛనలో తొట్రువలు గమకించే మహాగాయకుడి గీతాలాపనలాగు, అంత కసురుతున్నా…వెల్లివిరిసిన అనురాగం, అపేక్ష—అంతర్వాహినిగా ద్యోతకమౌతూనే ఉన్నవి. నాథుని అలయించి—అలరించడం… కులపాలికల సామాన్యశృంగారధర్మమైనా ఇన్ని పోకడలు—ఎత్తులు, వాళ్లకు చేతనవుతవా? తుల్యానుభవయోగ్యత ఉన్న సరసనాయకితప్ప…మరొకరు కథారసపోషణము— ఇంతప్రౌఢిమతో చేయనేర్పరులయేవారా?
ముద్దుపళని వారాంగన అని…సనాతనులు ఆమెను తత్కర్తృకములనూ…అకారణవైరంతో కృత్రిమంగా ఈర్షించవచ్చును. కాని, ముద్దుపళని—మహారాజరసికసమ్మానిత కాకపోయినట్లయితే…తెలుగులో—‘రాధికాసాంత్వనము’ వెలువడేది కాదు ....
శృంగారవర్ణనము గర్హ్యమనే వైదికులకు…జవాబు అనవసరము. అనభిజ్ఞులకు విద్యాదానం చేయడం వ్యర్థము. హేయజుగుప్సాకలుషితముకాని శృంగారస్థాయి లేనిది…ప్రకృతి—స్థితికే—మోసం.
‘రాధికా సాంత్వనము’, నిస్సంశయముగా సత్ప్రబంధము. నాయిక లేని బ్రహ్మచారికూటము గనుక—విశాఖదత్తునికృతి అసత్కావ్యములజాబితాలో చేర్చినారు పూర్వలాక్షణికులు అని…మల్లినాధుని స్వారస్యసిద్ధాంతము…
గొప్పకవిత్వధోరణులు లేవు కాని చదివినకొలదీ చవులూరించి ఆలోచనలలో ముంచి ఆనందపారవశ్యము ఆవహింపజేసే రసవత్ కావ్యచిత్రము…‘రాధికాసాంత్వనము’.
రాధఎవరు? చైతన్యసంప్రదాయవైష్ణవసిద్దాంతముల వివరణానికి, వేదాంతానికి ఏమికాని… సందగోపుడికి రాధ అనే చెల్లెలు ఉన్నదని ఆమెకు మేనల్లునితో తగులాటమైనదనీ మొదట ఎవరు కల్పించారో?—జయదేవుడు…యీకధను నమ్మినాడు. సంసారాన్నీ, చేసుకున్న మొగుణ్నీ త్రోసివేవి…కృష్ణుని పెనవైచుకొనిపోయిన ఈ రాధకు…శృంగారసంచారంలో మన గణనప్రకారం—అది భగవద్విషయమైనా—వ్యభిచారదోషము ఉన్నది. మరి ఆ కందులోనూ ఏదో స్వారస్యం ఉండటముచేతనే కాదు ... ఇంతవరకూ ప్రతిహతం కాకుండా దేశమంతా ప్రాకిపోయింది? తెలుగులో—రాధామాధవుల శృంగారలీలలకు ప్రతిభాసిత ఉపోద్ఘాతము—సరసభావుకులకు ఏకై క అవలంబనము. ‘కరివేల్పుశతకము’—ఎవరి కావ్యాత్మ—ఆరచనలో పునీతమైనదో నిశ్చయించ వీలూ ఆధారములూ లేవుకాని…ఇంతవరకూ రంగాజీ—ముద్దుపళనీ, పృథక్తయా ఆ—ప్రతిష్ఠను—పంచుకుంటున్నారు…
ఇంకొక రాధ ఉన్నది…వృషభాను నందిని. ఆమె కన్య: స్వీయ; కృష్ణుని ధర్మపత్ని. రూపగోస్వామి——‘విదగ్ధమాధవము’లోనూ, మధురాదాసు—‘వృషభానుజ’లోనూ ఈ రాధవివాహగాథను రూపకవస్తువుగా తీసుకున్నారు. పరిణయ పరిణితికి—యోగిని నాయికానాయకులకు రాయభారములు నడిపింది. అంతేకాని, వృషభానుజ—రాధ...పరకీయ్య కాదు…
ఏది ఎలా ఉన్నప్పటికీ మన్మథమన్మథునికి—సరిపోలిన నాయిక రాధ, ఆమె పరకీయ అయినందువల్లనే దాంపత్యశృంగారము అప్రాకృతధోరణిలో పల్లవించి…వివిధ—రత్యాలంబనభావశబలితమైనది.
రాధ ప్రేమవాహినిని…తెలుగు కావ్యకేదారప్రాంతముల పరవళ్లు సోలించిన ముద్దుపళని… ఉత్తమ—ధన్య…
(వెంపటి నాగభూషణము)
ప్రస్తావన
సీ. శ్రీపరిపూర్ణమౌ వ్రేపల్లెవాడలో
నందగోపాలునిమందిరమున
నవతీర్ణుఁడై మేనయత్తయౌ రాధికా
విధుముఖిచేఁ బ్రేమఁ బెంపుఁగనుచుఁ
దనమేనమామకూఁతు నిళాలతాంగిని
బెండ్లాడి యామెతో వేడ్క నుండఁ
దనవియోగముచేతఁ దాళఁజాలక చాలఁ
జింతిల్లుచుండుటఁ జిల్కవలన
తే. విని మిథిలనుండి యింటికి వేగ వచ్చి
చతురగతులను రాధికాసాంత్వనమ్ముఁ
జేసి దక్షిణనేత నా వాసిఁ గన్న
చిన్నికృష్ణుని మనసులో నెన్నుచుందు.
నేను జిన్ననాఁటనుండియు సంగీతవిద్యతోపాటుగా సాహిత్యవిద్యయందుఁగూడఁ గొంచెము గొప్పపరిశ్రమచేయుచు మాదేశభాషయగు కన్నడములోను తెలుఁగులోను బెక్కుగ్రంథములు చదివితిని. తరువాత బెంగుళూరినుండి యీ చెన్నపట్టణమునకు వచ్చినది మొదలుగా నఱవములోఁ గూడ ననేకగ్రంథములఁ జదువుచుంటిని. అయినను నాకాంధ్రభాషాగ్రంథములయందుఁ గలయభిరుచి పైభాషలలో నంతగా లేకపోయినది ఇట్లుండఁగా "వేలాంవెఱ్ఱి” అనుసామెతగాఁ జాలదినములనుండి తెలుఁగుబాసలోఁ గవిత్వము చెప్పవలయు నను కుతూహలము కూడఁ గలిగి పట్టుదలతో మరల భారతాదిగ నాంధ్రగ్రంథములు చదివితిని. పదపడి బ్రహ్మశ్రీ శతావధానులు తిరుపతి వేంకటేశ్వరకవులు విరచించిన శ్రవణానందము మొదలగు గ్రంథములు చదువుచుండఁగ వారి “పాణిగృహీత" యను ప్రబంధములోని
తే. రాధికాసాంత్వనమ్మును రచనఁ జేసి
పేరు గనుముద్దుపళని తెల్వియును విజయ
నగర భూపాలుఁ డుంచిననాతి చాటు
పద్యములు గాంచి యాకీర్తి పడయ నెంచి.
ముద్దుపళని
ఈమెను గూర్చి మ॥రా॥శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులవారు తమయాంధ్రకవులచరిత్రములో వ్రాయించిన పఙ్క్తులు కొన్ని యవసరమునుబట్టి యిం దుదాహరించుచున్నాను. “ముద్దుపళని పద్యకావ్యములు చేసిన స్త్రీలలో నొకతె. ఈముద్దుపళని వేశ్యాంగన. ఇది రాధికాసాంత్వన మను నాలుగాశ్వాసముల శృంగారప్రబంధమును రచించెను. దీనితల్లి పేరు ముత్యాలు. అది తంజాపూరు సంస్థాన ప్రభు వయిన ప్రతాపసింహుని యుంపుడుకత్తె యయినట్లు…గద్యములో వ్రాయఁబడినదానినిబట్టి యూహింపఁ దగియున్నది. దీనికే ఇళాదేవీయ మనునామాంతరము గలదు” అని యున్నది. ఇందు "తల్లి పేరు ముత్యా లనియు, గద్యములో వ్రాయఁబడినదానినిబట్టి యూహింపదగియున్నది" అనియు వ్రాయుటచే శ్రీపంతులవారుకూడఁ బీఠికను జూచినట్టు గన్పట్టదు. పీఠికలోఁ గవయిత్రి వంశవర్ణనము గలదు. ముత్యా లనునతఁడు పళనికిఁ దండ్రి. “ముద్దు” అనునది యుపనామము. పళని యనఁగా దక్షిణదేశములోని సుబహణ్యస్వామి వేంచేసియున్న దివ్యస్థలమునకుఁ బేరు. చాలచోట్ల బిడ్డలకు దేవస్థలముల పేరులే యుంచుచుండుట వాడుక యున్నది. ఈ ప్రబంధములో యశోదకు మేనగోడలును శ్రీకృష్ణునికి భార్యయు నగు నిళాదేవిచరిత్ర ముండుటచే దీని కిళాదేవీయ మను నామాంతరము వచ్చినది.
“ఇది సంగీతసాహిత్యభరతశాస్త్రములలోఁ బ్రవీణురాలైనట్టు తానే చెప్పుకొన్నది. దీని కవిత్వము నాతికఠినమై మృదువుగా నుండినందుకు సందేహము లేదు. దీనికి మంచి సంస్కృతాంధ్ర సాహిత్యమును గలదు. అందందుఁ దప్పు లున్నవి కాని యట్టి తప్పులు పురుషులకవిత్వమునందు సయిత మనేకగ్రంథములలో గానంబడుచున్నవి” అని శ్రీపంతులవారే యొప్పుకొనిరి. బాగుగా నాలోచించినచో శబ్దమునుబట్టియో అర్థమునుబట్టియో భావములనుబట్టియో రసమునుబట్టియో ఔచితినిబట్టియో యెటులయిన నేమి తప్పులేకుండ భారతము మొదలుగా నేగ్రంథమును లేదు. ఇట్లుండఁగా స్త్రీలు వ్రాసిన గ్రంథములలోఁ దప్పు లుండుట యొకతప్పు కాదు. “అయినను గ్రంథములోని భాగము లనేకములు స్త్రీలు వినఁదగినవియు, స్త్రీనోటినుండి రాఁదగినవియుఁ గాక దూష్యములై యున్నవి” అని శ్రీపంతులవారు వ్రాసిరేకాని తారాశశాంకవిజయము, హంసవింశతి, వైజయంతీవిలాసము మొదలగు గ్రంథములలోనివానికన్న నెక్కువగా నిందు దూష్యము లున్నవా! అదిగాక స్త్రీలు పురుషులవలన వినఁగూడక పోవచ్చును గాని తమలోఁ దాము చదువుకొనుటకు బాధక మే మున్నది? ఇంతకును నిది భగవచ్చరిత్రము, తారాశశాంకవిజయాదులవలె స్త్రీలకుఁ జెడుబుద్దులు గఱపువిషయ మేదియును నిందు లేదే. “ఇది
జారత్వమే కులవృత్తిగాఁ గల వేశ్య యగుటచే స్త్రీజనస్వాభావిక మైనసిగ్గును విడిచి శృంగారరస మనుపేర సంభోగాదివర్ణనములను బుస్తకమునిండ మిక్కిలి పచ్చిగాఁ జేసినది” అని వ్రాసిరి. అగ్నిసాక్షికముగా నొకమగనిం గట్టుకొని రెండవమగనితోఁ బోవుట జారత్వ మనిపించుకొనును గాని వేశ్య జారిణి యనిపించుకోదు. బ్రహ్మసృష్టినాఁటినుండియు వచ్చుచున్న మాజాతికిఁ గులవృత్తి యెట్టిదో ఆసంగతియంతయు వాత్స్యాయనకామసూత్రములఁ జూచువారికి యథార్థము గోచరించును.
సిగ్గనునది స్త్రీజనమునకేకాని పురుషులకుమాత్రము స్వాభావికము కాదు కాఁబోలును. ఇక్కవయిత్రి వేశ్యగనుక సిగ్గుమాలి సంభోగాదివర్ణనములు పచ్చిగా వ్రాసిన వ్రాయవచ్చును. కాని శిష్టు లనిపించుకొన్న పురుషు లట్లు వ్రాయఁగూడదుగద? అట్టి మహానుభావులు మాత్రము తమతమగ్రంథములలో నంతకన్న నెక్కువపచ్చిగా వర్ణనలు చేయలేదుకాఁబోలును. వేయేల? శ్రీపంతులువారే తమకవులచరిత్రలో “వేశ్యాసంపర్కమువలన నెట్టిదృఢమనస్కులకును ననర్థములు వచ్చునని చూపుటకయి యింతవఱకుఁ గల్పింపఁబడినకథ నీతిబోధకముగానే యున్నది కాని తరువాతికథమాత్రము నీతిబాహ్యముగా నున్నది” అనియు, “ఇటువంటి సిద్ధాంతములే మన దేశములో నీతికిని మతమునకును గూడ నమితమైన చెఱుపును గలుగఁజేయుచున్నవి. నీతిని విడిచినమత మెప్పుడును దేవునికిఁ బ్రీతికరము కానేరదు” అనియు నిందించి తరువాత దమస్వహస్తముతో సరిచూచి యచ్చొత్తింప నిచ్చిన వైజయంతీవిలాసములోని పచ్చవిల్తుని పచ్చికపట్టుకన్నను, వీరే స్వయముగ రచించిన [1]రసికజనమనోరంజనములోని బూతులకన్నను నిందుఁ బచ్చిబూతులు కన్పట్టుచున్నవా!
ఈ గ్రంథము రస మొల్కుచుండుట చేతను, ఇది రచించినది స్త్రీయేగాక మాజాతిలోఁబుట్టిన దగుటచేతను దీనిని మంచిప్రతిగా ముద్రింపవలయు ననుతలంపుతో వ్రాతప్రతిని ముద్రితపుస్తకమును సరిచూచి నామనసున కింపైనపాఠము నుంచి యొకప్రతి పనిఁ బూని వ్రాసితిని. ఇటీవల బ్రహ్మశ్రీ వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు ప్రాచీనప్రబంధములను మంచిస్థితిలోనికిఁ దెచ్చుచుండుటచే దీనినిగూడ వారే యచ్చొత్తించినచోఁ జాల బాగుగ నుండు నని యెంచి యీప్రతి యనేక వందనములతో వారియొద్దకుఁ బంపించితిని. ఇది వ్రాసినదియు సవరించినదియు స్త్రీయే యగుటచేతను గలిగినతప్పుల నొప్పులుగా గమనింతు రని స్త్రీల యందు గారవము గలవారిని బ్రార్థించుచున్నాను.
సౌమ్యసంవత్సరపు మహాశివరాత్రి. చెన్నపట్టణము 9.3.1910 |
ఇట్లు, సహృదయవిధేయురాలు |
- ↑ వీ రధికారమం దుండుటచే మదరాసు విశ్వవిద్యాలయములో దీనిని వీరు బఠనీయగ్రంథముగా నిర్మించుకొనిరి.
విషయసూచిక
మార్చు1 |
42 |
77 |
118 |