శ్రీరస్తు
రాధామాధవసంవాదము
ద్వితీయాశ్వాసము
క. |
శ్రీమత్సమస్తసద్గుణ, ఛామా! రామాభిరామా! తాండవకృష్ణ
స్వామిపదాంబుజదాసా! శ్రీమగదలరామదాస! చిత్రవిలాసా!
| 1
|
గీ. |
అవధరింపుము జనకధరాధిపతికి, మదిని సంతోష మొదవ సన్మౌనితిలకుఁ
డైనశుకయోగి రోమాంచితాంగుఁ డగుచు, నవలికథయెల్ల నిట్లని యానతిచ్చె.
| 2
|
చ. |
అమరఁగఁ గార్యఖడ్గములయందుఁ బరాకయి రాధికామనో
రమణుఁడు కొన్నినాళ్ళు మధురాపురిలో విహరించి యంత భ
ద్రముగ సముద్రమధ్యమున ద్వారకయన్ పురమున్ ఘటించి రా
జ్యమునకు నాథుఁడై సకలసంపద లందుచు నొప్పె నప్పురిన్.
| 3
|
|
కుల మెల్లను రక్షించెసు, దలిదండ్రుల చెఱలు వాపి తాఁ బోషించెన్
భళి! యిఁకఁ దగదె "సుపుత్రః, కులదీపక" యనెడుమాట గోవిందునకున్.
| 4
|
ఉ. |
ఏవగవారు చేరిన సహించి తనంతటివారి జేయుచున్
దైవము దాత తల్లియును దండ్రియుఁ దానయి ప్రోవఁగా జగ
త్పావనమూర్తి తవకుఁ బావనమాతను గన్నదేవకీ
దేవినిఁ దన్నుఁగన్న వసుదేవుని నాపదఁ బాపి పోచుటల్.
| 5
|
మ. |
పదిరెండేండ్లగు ప్రాయమందు నిటు గోపాలుండు భూపాలురన్
మెదలన్ మీఱఁగనీక లోఁగొనుచు రుక్మిణ్యాదులన్ గన్యలన్
బదియార్వేల వివాహమై సగుణరూపబ్రహ్మమై కన్నవి
న్నదిగా దీమహిమం బటంచు ఘను లెన్నంగాఁ జెలంగెన్ మహిన్.
| 6
|
క. |
ఈవగ సమస్తభాగ్యము, కైవసమై నిండియుండఁగా సైఁపక యా
గోవిందుడుఁ రాధపయిన్, భావంబడి కందుఁ గుందు బరవశ మొందున్.
| 7
|
క. |
డాయఁడు వనితామణులన్, మూయం డొకగడియమాత్రమును గనుఱెప్పల్
చేయడు చక్కఁగ భోజన, మీయఁడు తనమనసుమర్మ మెవ్వారలకున్.
| 8
|
సీ. |
పెనఁగుచో రుక్మిణి మునువలె నీదు మే, నత్త లేదని పల్క వలసినవ్వు
కథ దెల్పుమన సత్య గాథరాదని పల్క, నది గాక విననని యసురుసురను
మరుమాట దెల్పు జాంబవతినా నీవల్ల, వింట లేదని నీరు కంటనించు
రతివేళఁ గాళింది నుతియించుచును నాథ, రాయనఁ గైవ్రాలు హా యటంచు
|
|
గీ. |
బలిమిఁ బడఁతులు పైఁబ్రక్కఁ బడెడువేళ, నొడువుమాటలవ్యంగ్యముల్ దడబడుటలు
చదురులను సంధినేర్పులు వెదకిచూడ, రాధ తలఁ పైన మదిగుందు మాధవుండు.
| 9
|
చ. |
పయికొని పువ్వుఁబోండ్ల బహుభంగులఁ బ్రార్ధన చేసి వేడినం
గయికొనఁడాయె శౌరి తమఁ గానక రాధిక యెంతయుబ్బసం
బయిపొరలాడునో యనుచు నాత్మను జింతలు నెట్టివారికిన్
దయ యొకచోట నుండిన వితావిత యెంతవివేక ముండినన్.
| 10
|
చ. |
ఒకరికిఁ దెల్పరాదనుచు నూరక చింతిలుఁ గొంతసేపు కా
దొకరికిఁ దెల్ప మంచిదని యుద్ధవుతోఁ దెలుపంగఁబోవు నే
నొకరికిఁ దెల్స రాధ యిటు లొక్కరి కేటికిఁ దెల్పెనంచుఁ దాఁ
దకపికలాడునంచు మదిఁ దాలిమి వీడును వేఁడు దైవమున్.
| 11
|
వ. |
ఇవ్విధంబున బహువ్యథలం బొండుచు నెందునుం బ్రొద్దువోక దేవకీనందనుండు తన
ప్రాణసఖుండగు నుద్ధవుని కైదండఁ గొని మందమందచరన్మలయపవమానకంపితాభంగ
భంగనటత్కలక్వణితరణితకలహంసకారండవప్రముఖప్రత్త్రికులగోత్త్రకులపత్ర
వాతోద్ధూతాంబుజాతజాతపరాగరాగకషాయితకషాయకాసారరంగత్తరంగ
కణోద్ధూతజలకణపరంపరాపరితోషితమందారమాకందచందనపిచుమంద
కుందసిందువారతాలహితాలతమాలమాలతీతక్కోలసాలరసాలజంబుజంబీరఖర్జూర
కరవీరసహకారపున్నాగనాగవల్లీమల్లికాపుంజరంజితనికుంజపుంజమంజులవివిధ
కుసుమభాసురవాసనాభిరామం బగు నొక్కకేళికారామంబుఁ జేరి యందు
నింద్రనీలసాంద్రకుట్టిమప్రాంతప్రవాళస్తంభసంభూతకాంతివిభ్రాజితజాతరూప
మయకుడ్యనిబద్ధపద్మరాగచ్ఛవిచ్ఛన్నమరకతలాపయుక్తముక్తావితానవిలాస
వాసచతుష్కిరాంగణకాంతశశికాంతిశిమయవేదికాతలంబునఁ గూర్చుండి
కొండొకవడి యూరకుండి నలుదిక్కులుం గనుంగొని యుద్ధవుం డాయరమ్మని
యీమర్మం బెన్నఁడేనియు నీవు వినియుందువే యని గోవిందుండు మందహాస
భాసురముఖారవిందుండై యిట్లనియె.
| 12
|
ఉ. |
ఇద్ధరకెల్ల రాజనయి యెక్కడలేని ప్రసిద్ధి గాంచి నా
బుద్ధికి నీడు లేదనగఁ బొల్పు వహించి తలంప నేమిటన్
|
|
|
బద్దుఁడఁ గాక యుంటిఁగద ప్రౌఢతకెల్లను వెల్తిగాఁగ నో
యుద్ధవ పిన్ననాటితగు లొక్కటి గల్గె జగద్విరుద్ధమై.
| 13
|
క. |
పడుచుదనంబున గొల్లల, పడుచులతో నాడునాఁడు పైనిన్ బ్రక్కన్
బడుచు న్నందునిచెల్లెలిఁ, బడుచున్ గైకొంటి మోహపడుచున్ వేడ్కన్.
| 14
|
గీ. |
పిన్ననాటనుఁడి ప్రేమ నెందఱతోడ, గూడలేదు? కూడి వీడలేదు?
దాని మఱతుననిన ధైర్యంబు రా దది, రాధ గాను ధృతివిరోధి గాని.
| 15
|
ఉ. |
తల్లికిఁ దండ్రి కన్నలకుఁ దమ్ములకున్ దెలుపంగ రాని నా
యుల్లముగుట్టు గోప్య మిపు డుద్ధవ నీకు వచింతు రాధ కే
నల్లుడ నంచు రాధ మఱి యత్త యటంచుఁ బ్రసిద్ధి యుండగాఁ
జల్లుగ మాకు నిద్దరకుఁ జేరిక యేగతిఁ గల్గుఁ జెప్పుమా.
| 16
|
చ. |
గమకముతోడ నొక్కపని గ్రక్కునఁ జేసినచో రహస్యమై
యమరదు మున్నె కొంత గొఱయైనది శౌరి స్వతంత్రవాది; వే
దమును మతంబు శాస్త్రమును దైవము లేదని లోక మెంచు; లో
కమున వివేకి లేఁడొకడు కాముకధర్మము లూహ సేయఁగన్.
| 17
|
ఉ. |
ఆరును దూఱునుం బడియు నాచెలి యేమిటికంటివేని నే
వీరును వారునుం బలెను వెఱ్ఱిదయన్ వలపింపలేదు శృం
గారరసప్రభావములు కన్నియ నా కుపదేశ మీయఁగా
నేరిచినాఁడ దాని విడనేర్తునె నేర్చిన వైన మోర్చునే.
| 18
|
గీ. |
చక్కదనమెల్ల రాసిగాఁ జక్కఁద్రోసి, కమ్మకస్తూరి మేదించి కరగఁబోసి
చేసినాఁడేమొ పరమేష్ఠి చేతివాసి, డాసి మెచ్చఁడె చెలిన సన్యాసియైన.
| 19
|
గీ. |
భూమి రామలమోములపోల్కి యనుచుఁ, దామరల నెంతు రే నట్టితామరలనె
చెలియపాదంబులకు సాటి సేయఁగూడ, దందు రాజకరస్పర్శ మందలేమి.
| 20
|
గీ. |
కమలగర్భంబులఁ దృణంబు గాఁగఁ జూచి, పొలుచుకాహళ లూదుకపోవు ననినఁ
బొలఁతిజంఘలతో సరిపోల్ప నగునె, జనులమఱుఁగున దాఁగెడిదొవల నెందు.
| 21
|
గీ. |
ఆకృతికి రంభ యనికదా లోకరూఢి, యెట్టిరంభలనైన నయ్యిందువదన
తొడలనగఁజాలు ననినచోఁ గడమ కేమి, యతివ నెంచంగఁ దరమె బ్రహ్మాదులకును.
| 22
|
క. |
ఉన్నవె సాటువ లెన్నఁగఁ, గన్నియపిఱుఁ దంద మింకఁ గౌ నందంబున్
మన్నును మిన్నును గలిగిన, యన్నాళ్లకు మఱవవచ్చునా చెలికాఁడా.
| 23
|
క. |
ధరఁ గవులు పక్షపాతము, గ రచింతు రదేమొ గాని గతులకు సరులా
కరులును; గిరులును సరులా, గురుకుచముల; కెఱుఁగలేరు గుణసామ్యంబుల్.
| 24
|
క. |
వచియించను రచియించను, బవరించ గణించఁ బంచబాణునితరమా
కచమేచకచకచకరుచి, కుచలికుచమరీచిలికుచమకుచకే తగుటన్.
| 25
|
ఆ. |
క్రోల బుద్ధిగొల్పు కొమ్మవాతెరతోడఁ, బండియున్న దొండపండు సరియె?
చేరెఁడేసికన్ను లారసి యిసుమంత, తమ్మిరేకు లనఁగ ధర్మ మగునె.
| 26
|
క. |
కోమలిమోమున కాహిమ, ధాముఁడు సరిగాడటన్నఁ దామర సమమా
తామర సమమొనప్పుడు, తామరసము గాక తనయథాస్థితి నున్నన్.
| 27
|
క. |
ఏయెడ నఖశిఖవర్ణన, సేయంగా నొకరివశమె ; శేషుఁడు రాధన్
బాయక వేణినెపంబై, వేయేటికిఁ దెలియ లేక వ్రేలుచునుండున్.
| 28
|
క. |
ఆనగుమో మాకనుఁగవ, యానడు మామోవితీరు నాచనుఁగవని
క్కానడగు ల్కాతొడత, ళ్కానీటును మఱవవచ్చునా చెలికాఁడా.
| 29
|
సీ. |
అల్లుఁడా రమ్మని యలరించు నొకవేళ, హొయలుగాఁ గైసేయు నొక్కవేళ
దుడుకు చేసినను బుద్ధులు దెల్పు నొకవేళ, మక్కువ ముద్దిచ్చు నొక్కవేళ
కన్నెలతో నాడ గద్దించు నొకవేళ, నొంటిగాఁ జదివించు నొక్కవేళ
తచ్చనమాటలఁ దర్కించు నొకవేళ, నూరక నవ్వించు నొక్కవేళ
|
|
గీ. |
వలచు నొకవేళ నొకవేళ వద్దఁ జేరుఁ, బలుకు నొకవేళ నొకవేళఁ బల్కకుండుఁ
బెనఁగు నొకవేళ నొకవేళఁ బ్రేమఁ గలియు, నలుగు నొకవేళ నొకవేళ నాదరించు.
| 30
|
క. |
ఆనాతిమనసుమర్మము, లే నెఱుఁగుదు నాదుమర్మ మెఱుఁగును రాధా
మానవతి లోకు లెవ్వరుఁ, గానరు మామనసుమర్మకర్మము లరయన్.
| 31
|
చ. |
తననునుగోటితాఁకులకుఁ దాళిన నెవ్వతెపైఁ బరాకు నీ
కని యొకకిన్కఁ దెచ్చుకొని యవ్వలిమోమయి మోడిసేయుఁ గా
దని విదళించినన్ సయిప దాయనె నేఁడని చిన్నవోవు యెం
తని వచియింతుఁ గంచుపద నాచెలినెమ్మన మెంచ నుద్ధవా.
| 32
|
చ. |
సికనునుగోళ్ల దువ్వుచును జెక్కిలి నొక్కుచు నేమియే నొకా
నొకథ బూతుగాఁ దెలుప నూకొన కేను బరాకుగాఁ, బకా
పక నగి యేలరా వినవు పాపఁడ! యింతనె యింతవింతయే
రక మనుముచ్చటల్ మఱపురా విఁక రాధిక నెట్లు వాయుదున్.
| 33
|
శా. |
రారా కృష్ణుఁడ రాఁగదోయి వరదా, రావయ్య గోపాలకా,
యేరా చుంబన మీఁగదోయిఁ యధరం బీవయ్య నీయాగడం
బేరా, కోప మదేలనోయిఁ యలిగే వేమయ్య, మాటాకరా,
"రారా ర" మ్మని పిల్చు, నెట్లు మఱతున్ రాధావధూటీమణిన్.
| 34
|
ఉ. |
చక్కనిరూపుతోఁ గలికి జగ్గున నిల్చినయట్ల నిల్చి తా
నిక్కముగాఁగ నన్నుఁ గరుణించుచుఁ జూచినయట్ల చూచి తాఁ
బక్కున నవ్వినట్ల నగి పైకొనఁగా గమకించినట్ల నల్
దిక్కులఁ గాననయ్యెడి మదిం దిగులయ్యెడిఁ దెల్పబోయినన్.
| 35
|
క. |
ఆకామిని యటు నే నిటు, "కాకః కాకః పికః పికః" యటన్నవిధం
బై కవఁబాయఁగవలసెఁ బ, రాకా నావంకఁ జూడరా చెలికాఁడా.
| 36
|
గీ. |
ఇఁక నశక్తునిరీతిని నేఁ దపింప, నొకఁడు కరుణింపనున్నాఁడె యుర్విలోన
మనము వేకువ వ్రేపల్లెదనుకఁ బోవ, వలయు నీవును బైనమై నిలువు మనిన.
| 37
|
క. |
ఇది మంచి దనుచు నుద్ధవుఁ, డెదఁ బొదలుచు మాట నుబ్బనియ్యక యంతన్
బోవలె నట రుక్మిణీమణి, యుదుటుం బడుచులయెలుంగు లొగి వినఁబడఁగన్.
| 38
|
క. |
మనమాటలు వినరుగదా, యని కొంకుచుఁ గృష్ణుఁ డుద్ధవా చూచితివే
యినుఁ డస్తమించు వైఖగి, మనలం గని డాఁగఁబోవు మహిమ చెలంగన్.
| 39
|
క. |
దిగవిడిచి లోకబాంధవ, తగవే నీవేఁగ మనకుఁ దా నిది మేలా
పగలాయె ననుచుఁ బద్మిని, మొగిచినకే లనఁగఁ బద్మములు ముకుళించెన్.
| 40
|
చ. |
పొడుచుట యాదిగా దనుజపుంజములం దెగటార్చి యార్చి తా
వడిఁ జరమాగ దానవుని పైఁబడి నాతపనుండు గ్రుంక వెం
బడి జగ మెల్లనున్ బొడువఁ బైకొనుచీఁకటి సోఁకుమూఁకచే
నదరుతుపాకిత్రాటి కొడియగ్గి యనం బొడసూపెఁ దారకల్.
| 41
|
క. |
మడిగొన్న కటికచీఁకటి, కెడచూపక దీపకళిక లిండ్లఁ జెలంగెన్
వడిఁ దేంట్ల నంటనీయక, పొడసూపినకనరముకుళము లనగ మిగులన్.
| 42
|
వ. |
అని యివ్విధంబున నవ్వనజనాభుండు గొన్నిప్రొద్దుపోకమాట లాడుచు, బెండ్లి
చవికలోనికిఁ జని యుద్ధవునిం బనిచి రుక్మిణీకేళికాగృహంబునకుం బోయి తదను
గుణప్రియభాషణంబుల సంతోషంబు సేయుచుఁ దనపయినంబునకు నుపాయంబు
గానక నెపంబు వెదకుచు మనంబున ఘనంబగు పరితాపంబునఁ బొరలుచుండె నంత
నక్కడ.
| 43
|
క. |
తను నిదురఁబుచ్చి వేకువ, వనరుహనయనుండు చనినవార్త చిలుకచే
వెనుకన్ విని యారాధిక, ఘనతరశోకాబ్ధి మునిగి కళవళపడుచున్.
| 44
|
సీ. |
ఒకరిఁ బిల్వఁగఁబోయి యొకరిపేరునఁ బిల్చు, నమ్మచెల్ల! యటంచు హరిఁ దలంచు
నొకటిఁ జూడఁగఁబోయి యొకటిఁ దప్పక చూచుఁ, దప్పుగ యిదియంచుఁ దనుగణించు
|
|
|
నొకటి సేయఁగబోయి యొకప్రయత్నము చేయు, మంచిదాన నటంచు మదిఁ దలంచు
నొకటి పల్కఁబోయి యొకటి యేమేఁ బల్కు, మోసమాయె నటంచు మోమువంచు
|
|
గీ. |
మారు నిందించునదె తోఁచె శౌరియంచు, బయలు గబళించుఁ బలవించుఁ బల్కరించు
నిజము గాదంచుఁ గన్నుల నీరు నించుఁ, గలకలనుముందుఁ గలయించుఁ గలువరించు.
| 45
|
గీ. |
బయలు వెడలంగఁజాలదు భయముచేత, నిముడుకొనియుండఁజాలదు భ్రమముచేతఁ
గలికి యపు డోదమున బడ్డకరిణికరిణిఁ, దొట్రుపడి కొట్టుకాడును ద్రొక్కులాడు.
| 46
|
సీ. |
మధుకైటభారాతి మధురవాచారీతి, నొంటిగాఁ జింతించు నొక్కవేళ
హాటకాంబకధారి యదెవచ్చె నని చేరి, యున్నట్ల బయలాను నొక్కవేళ
పాధోధిశాయిపైఁ బదము పాడగబోయి, యూర కేదొ గొణఁగు నొక్కవేళ
మనమునఁ బెనఁగొన్న మర్మకర్మములకు, నుడుకుచు వెతనొందు నొక్కవేళ
|
|
గీ. |
దిక్కులేదని విధి దూఱు నొక్కవేళ, మ్రొక్కి దయఁజూడుమని వేఁడు నొక్కవేళ
నోయదూద్వహ యని చీరు నొక్కవేళఁ, దా మది కలంగి రాధికాకోమలాంగి.
| 47
|
గీ. |
మఱియు నొకయింత శయ్యపై మఱవులేక, బాధ పడి రాధ తడఁబడి బడలి నిల్చి
పిల్చి హాయనతాఁ బ్రలాపింపఁదొడఁగెఁ, గృష్ణు వటు గూర్చి చెక్కునఁ గేలు చేర్చి.
| 48
|
క. |
హా కృష్ణ! హా యదూద్వహ!, హా కేశవ హా ముకుంద! హా గోవిందా!
హా కమలనయన! హా హరి!, హా కమలాహృదయలోల! హా గోపాలా!
| 49
|
మ. |
నిను నాదైవముగా మదిం దలఁతు నీనిద్దంపునెమ్మేను నీ
గొనబుంజెక్కులు నీసుధాధరము నీగోమైన నెమ్మోమునుం
గని యుప్పొంగుచు నాతపఃఫలముగాఁ గైకొందు నేఁ డయ్యయో
నను నేలా గెడఁ బాయఁజాలితివి కృష్ణా ! యెంత నిర్మోహివో.
| 50
|
మ. |
ఒకనాఁ డించుక చూడకున్న నిను నాఁ డూరెల్ల నేమేమొ కం
టికి నిస్సారము గాఁగఁ గానఁబడు; నా డెందంబు నిన్ జూచినం
దుకె ముల్లోకముఁ దానె యేలుగతి నెందున్ సంతసంబందు; నేఁ
డకటా యేమియు లేక నీవు ననుఁ గృష్ణా! యింత గాఁ జేయుదే.
| 51
|
ఉ. |
అక్కట యెన్నిముచ్చటల కాసపడుంటి మనంబులోనఁ దా
నొక్కటి యెంచ దైవ మదియెక్కటి యెంచుట సత్యమాయె; నీ
యక్కునఁ జెక్కుఁ జేర్చుకొననైతిని, నా కిది మోసమాయె న
న్నిక్కము పాయకుందువని ని న్నెద నమ్మితిరా మనోహరా.
| 52
|
చ. |
కదియక సీమవారివలెఁ గన్నులఁ జూచినవేళఁ గొంతసే
పది యిది ప్రొద్దుపోకలవిహారము సల్పిన నింత రాదుగా
మొదలనె దూర మెంచవలె మోసము వచ్చె నిఁ కేమి సేతు హా
మది మదినుండి యేల నిను మాలిమి చేసితి జీవితేశ్వరా.
| 53
|
క. |
ఆసించి నీవు చేసిన, బాసల కే నమ్మియున్న పసిగోల నయో
దోస మన కింతలో మది, రోసితి వింతటిదయాపరుండవొ కృష్ణా.
| 54
|
చ. |
అని విలపించి నీవు విడనాడిన నెవ్వరిదాననంచుఁ గా
మిని మొగమందు చేల యిడి మెల్లనె యేడ్చెను వెక్కి వెక్కి వా
ల్లనుఁగవ వెచ్చనీరు చిఱుకాలువలై ఱయికంటి నిక్కుచ
న్గొనలను జాఱఁగా మెయి గగుర్పొడువన్ మది తాల్మి వీడఁగన్.
| 55
|
గీ. |
అంతఁ బెంపుడుచిల్క యయ్యతివఁ జేరి, యక్క యది యేమి చేసెద వళుకుదీరి
చెలులు వినియెద రెందుకే చింతఁగుంద, వలదు కృష్ణునిపదమాన నిలువు మనిన.
| 56
|
క. |
కనువిచ్చి చూచి రాధిక, తనువేఁడెడుచిలుకతోడఁ దా నిట్లనియెన్
వినవే చిలుకా కృష్ణుఁడు, తనునొల్లని వెనుక నాదుతను వేమిటికే.
| 57
|
క. |
ఇ ల్లేటికి మగఁ డేటికిఁ, ద ల్లేటికిఁ దండ్రి యేల ధన మేటికి నా
యల్లునిరూపము కన్నులు, చల్లనఁగాఁ జూడఁగనినఁ జాలదె చిలుకా.
| 58
|
చ. |
కల్లరి గాఁడు లో నెనరు గల్గినవాఁ డదిగాక వావి మే
నల్లుడు రూపవంతుడు మహాగుణశాలియటంచు నమ్మి నా
తల్లిని దండ్రినిన్ మగని దమ్ముల నన్నల రోసి తన్ను నే
నుల్లములోని దేవు డనియున్నది కీరమ నీ వెఱుంగవే.
| 59
|
ఉ. |
వీథులలోన లేవగవు వెన్నెల చల్లఁగఁ గాయఁ బూర్ణచం
ద్రోదయమైనరీతిఁ గళలూనినవానిమొగం బెగాదిగ
న్నాదిగులెల్లఁ దీఱఁ గని నాదిగదా తగుభాగ్య మౌర నా
మీఁదను స్వామి కెంతదయ మేలుభళా యనుకొందుఁ గీరమా.
| 60
|
గీ. |
చందురుని జూచి సంతోష మందులీల, జూచి పొంగుదు హరి నది చూడలేక
యమ్మలక్కలు మిన్నక యాడుకొందు, రేల కొఱయైతి నిందుల నేమిగంటి.
| 61
|
చ. |
చలమున మచ్చుచల్లిన నిజాలకునున్ దయ వాఁడటంచు నే
వలచితిఁ గేతకీకుసుమవాసనకై భ్రమనొంది తేనె లో
|
|
|
పలఁ గలదంచు నాసఁగొని పైఁబడఁ బుప్పొడి రెండుకన్నులం
దొలసిన లేవలేక పడుతుమ్మెదతో సరియైతిఁ గీరమా.
| 62
|
చ. |
మది మది నుండలేక బతిమాలిన నామది నాడికొందునో,
కొరవలు గాఁగ నాడుకొనుగుంపుల నందునొ, యింత కోర్చు నా
బ్రదుకున కందునో, వెతలఁ బాల్పడజేసిన బ్రహ్మ నందునో,
యది యిది యేల నావలపు లాఱడిఁబెట్టిన శౌరి నందునో.
| 63
|
ఉ. |
ఎన్నిటికంచు నే వగతు నిప్పుడు నాతలవ్రాత యేమి గా
నున్నదొ యింతఱంకుపడ నోర్చినదానికి నెంతచందఁగా
నున్నదొ కానిపోనితగు లూనిన నామది కేమి సేతుఁ గా
నున్నది కాకపోవదని యుందునె యుండదు నెమ్మనం బిఁకన్.
| 64
|
మ. |
అనుకోరాదనికాక యోచిలుక! నా కాశౌరి యూరెల్ల హో
యనుకాలంబున నే ఫలం బొసఁగి యన్యాధీనతం జెంది నేఁ
దనుఁ బ్రార్థించిన కొద్దిఁ దాబిగియ వంతం జింత నంతంత యిం
తనఁగా రానివిరాళిపాలుపడి లోనైయుంటి నన్నింటికిన్.
| 65
|
క. |
నేఁడైన వానియాసల, పోఁడిమి విడనాడి నేను పొలిసెదనన్నన్
వాఁడి చెడినాఁడు మారుం, డాడు నితని కేల పువ్వుటమ్ములు విండ్లున్.
| 66
|
చ. |
అనుచు ననంగునిం గుఱిచి యంగనలన్ మము నొంపఁ గాని పెం
పను గొఱగావు నీయొడలు భస్మముగా మగవారిఁ జేరనుం
జెనకఁగలావె లావుగలచిల్కగుఱాని బిరాను జేరి సి
గ్గున బ్రదుకందలంపు మదిగో యిఁక నెన్నకు బంటుపంతముల్.
| 67
|
క. |
దమయంతి రామునింతిని, బ్రమయించినరీతి వట్టిభ్రాంతిని నన్నుం
దమి ముంచకు మరు లెంచకు, కుమిలించకు పువ్వుటమ్ముఁ గుదిలించ కెదన్.
| 68
|
గీ. |
అని యనంగుఁడ వీవు ని న్ననఁగ నేమి, నేమిరీతిని నెలదోఁచె నింగి నిందు
నిందుఁ బగఁజూడు మని మళ్ళి తీవు గాక, కాఁక నను ముంచలేవని కలికి యనియె.
| 69
|
సీ. |
పశ్చిమాచలము ఫైఁబడి మళ్ళి బ్రతుకుదే, లలిఁ జూపు నింద్రజాలంబు గాక
యిలఁ జకోరములు వెన్నెలఁ గ్రోల నెగడుదే, వగఁజూపు కరలాఘవంబు గాక
దినదిన మొకవింతతీరుగాఁ దోఁచెదే, వెడచూపు బహురూపవిద్య గాక
రాహువు మ్రింగఁ గోఱలు సోకి వెడలుదే, వెడవెడఁజూపు గారడము గాక
|
|
గీ. |
నల్లనైయున్న జగ మెల్లఁ దెల్లఁజేసి, భ్రమల ముంతువె కనుకట్టుబలిమి గాక
కాక యేపాటి నిజరీతి ఘనుడవైతి, నేఁడు గాదోరి నీదారి నీరజారి.
| 70
|
ఉ. |
ఆననవింటివాని మది నల్లునిగా నెఱనమ్మినావు; లో
కానఁ గుమారుఁడు జనకు కైవడి నౌగద; మేనమామగం
డాన జనించినాడని వినంబడెఁ దండ్రిని మించినాడుకు ద్రో
హానకు నింకనైనను మృగాంక మృగాంకునిఁ జేరు మూరకన్.
| 71
|
క. |
కాదేని నీదువెన్నెల, వేదన నామీఁద జూపి విను ప్రాణములన్
లేదనిపించును పంతము, లేదా యల్లునికిఁ దోడు లే లెమ్ము వడిన్.
| 72
|
వ. |
అని యారాధావధూతిలకంబు తలపెంపుడుచిలుకం బేర్కొని.
| 73
|
చ. |
ననవిలుకాఁడు బోయ; నెల నా కలదాయ; యిదేల వీరిబా
ధను బడఁజాల; జాణవుగదా చిలుకా, యొక గాథ లేదుగా
యన "విను సన్నుతాంగి తెలియంగ ననంగ నవంగ నొక్కరా"
జన వాని యంతఁ గేల జెవు లల్లన మూయును నీశ్వరా యనున్.
| 74
|
క. |
ఇవ్వగల రాధికామణి, నెవ్వగలం బొగులఁ జిలుక నేర్పునఁ బలికెన్
జవ్వని మీగోపాలుని, నవ్వుచు నేఁ దోడితెత్తు నన్నంపవుగా.
| 75
|
గీ. |
ఆఱునెల లాయెఁ గృష్ణుఁ డందరిగి యిపుడు, సకియ రాకున్నె పిలిచిన జాలుఁ గాని
బ్రమసి వెదకెదుగాక నీ పతిమనంబు, కదలకున్నది నీచెంతఁ గంటి నేను.
| 76
|
వ. |
అనిన విని నవ్వి యవ్విలాసినీతిలకం బిట్లనియె.
| 77
|
చ. |
వలచినవారు లేరొ, సరివారలలో నగుబాటు గాఁగ నా
వలెఁ జరియించిరే యొకరివంతుల కేటికి బోవ, దాత నా
తల నిటు వ్రాయఁగావలెనె; దైవము దూఱఁగ నాయమౌనె; నే
దొలిమెయి నేమినోము లెటునోచితినో యిది గంటి నిమ్మెయిన్.
| 78
|
ఉ. |
కంటికి నిద్రరాదు చిలుకా! కలకాలము వేగఁజాల నీ
వంటియనుంగుఁ గల్గి తగవా మగవారలఁ బాసియుండ నే
నొంటిగ నుండి ని న్ననుపనోప; నయో యిటు లేల జాగు; నీ
వెంటనె జంట చేసికొనవే; పదవే వనమాలిపాలికిన్.
| 79
|
క. |
నీకుం గలిగినఱెక్కలు, నా కమరకపోయెఁగాక; నా కబ్బినచోఁ
బైకెగసి యిందిరారమ, ణీకాంతునిఱొమ్ముమీఁద నిలువనె చిలుకా!
| 80
|
క. |
పొ మ్మనవలె; న న్నీయెడఁ, బొమ్మనవలె; నీవు పోయి పురుషోత్తముతో
ర మ్మనవలె; దేహము నీ, సొ మ్మనవలె; విడువవలదు సు మ్మనవలయున్.
| 81
|
మ. |
తను భోగింతుఁ, దను న్వరింతు ననుచింతం గాదు పో యింక నా
పని నాకేటికి; సిగ్గులేదె తొలుతన్ బ్రాయిండి యిల్లాలిఁ గా
పునుగాఁ జేసి తుదిన్ ద్యజించి తిరిగే పుణ్యాత్ములం జూచినం
తనె చాలున్ ఫల; మీశ్వరేచ్ఛ యెటులైనం గాని యామీదటన్.
| 82
|
మ. |
తన పేరుం దనపల్కులుం దనవగల్ తా నాయెడం జేయుమ
న్ననయు న్నెమ్మది నాఁటియున్న దిఁక మానంచాలఁ జింతాభరం
బున డెందంబున కొక్కటన్ విరసమున్ బుట్టించి పోఁ గాని ర
మ్మనవే యొల్లనివాని కేల యితనివ్యాపారచాతుర్యముల్.
| 83
|
ఉ. |
ఇంగిత మెల్లనుం దెలియ నెంతయు జాణవు నీవు; నీవచ
స్సంగతి యేరికిం గలదె; సన్నుతి గా దిది శౌరి నేను ను
ప్పొంగుచుఁ గూడినప్పటికి బొల్పుగఁ దోఁచును నిన్ను మెచ్చఁగా
బంగరుచిల్క; నిన్నిపుడు పల్కఁగ నేర్తునె పేదపల్కులన్.
| 84
|
గీ. |
అనుచుఁ దనచేతివ్రాలఁ బద్యములు రెండు, వడిగ లిఖియించి ఱెక్కలనడుమ నునిచి
చిల్క నేనేమి దెల్ప నీచిత్త మిఁకను, దనదుభాగ్యము పోయిరమ్మనుచు ననుప.
| 85
|
క. |
గగనమున కెగసి మథురా, నగరముఁ గని యచటఁ గమలనాభుఁడు లేమిన్
దగఁ దెలిసి ద్వారకాపురి, డిగి యచ్చటినగరు సొచ్చి డెందం బలరన్.
| 86
|
క. |
తమకమున భోజకన్యయుఁ, గమలాక్షుఁడుఁ బడుకటింటఁ గవగొని యుండన్
సమయము గాదని యచ్చట, నమరినచిలుకలను గూడి యాడుచు నుండెన్.
| 87
|
మ. |
తళుకుదంతపుఁజెక్కడంపుఁబనినిద్దాజాళువాకీలుబొ.
మ్మలు నల్వంకల మాడిగంపునడగుమ్మల్ గాఁ 'బనుల్ సేయఁగాఁ
గులుకుంబచ్చలకోళ్లమంచముపయిన్ గోపాలుఁ డారుక్మిణీ
లలనారత్నముతోడిఁ గూడి పొలయల్కన్ మార్మొగం బౌనెడన్.
| 89
|
మ. |
చిలుకం జూచి బిరాన లేచి నగుచున్ జేసాచి రా రమ్ము ము
ద్దులగారాబుమిటారిచిల్క యన నెంతో వేగఁ బాదాంబుజం
బులపై వ్రాలఁగ గేలిపైఁ దిగిచి యింపుల్ గుల్క ముద్దిచ్చి ఱె
క్కలఁ జక్కంబడదువ్వుచు న్నిజదృఢాంకంబందు లాలించుచున్.
| 90
|
క. |
నందయశోదలు పరమానందంబున నున్నవారె?, నన్ దలఁచెదరే
యందలిమనవారందఱు?, గొందఱు నన్నెపుడు దూఱుకొందురె కినుకన్?
| 91
|
ఆ. |
పిన్ననాఁటనుండి నిన్నుఁ బ్రాణంబుగాఁ, బెంచుకొన్నరాధ యించుకంత
తడవు వీడఁజాల దెడఁబాసి వచ్చుటఁ, జింతసేయ నేదొ వింతే కలదు.
| 92
|
క. |
అని వనజాయతలోచనుఁ, డన విని యింతంత గాని యానందముతో
నెన రింత లేకయుండినఁ, జన నగునే యనుచు మదిని సంభ్రమ మొప్పన్.
| 93
|
ఉ. |
ఓసుగుణాభిరామ పురుషోత్తమ దేవరవారు పూర్ణసిం
హాసనపట్టభద్రబిరుదాంకమహోన్నతులై భవత్పద
వ్యాసలసత్కిరీటవసుధాధిపకన్యక లూడిగంబు లా
సాసలఁ జేయనుంటఁ గనినంతకు వింత మ ఱేమీ కల్గెడిన్.
| 94
|
ఉ. |
అన్నియు నుద్ధరించెదనటంచు నటించినదాని కేమిపో
యె న్నెల కొక్కసారి మొగ మించుక చూపినఁ జాలు నేల యీ
యెన్నిక లంచుఁ గొందఱు నిజేచ్ఛల దూఱుటదక్క నెవ్వరున్
ని న్నొకపాటివాఁడని గణించెదరే యదువంశభూషణా.
| 95
|
క. |
ఇమ్మాటలు మఱి మఱి విన, ముమ్మరమై తనదుచెవికి ములుకులు గాగా
ముమ్మడి నలుమడి కోపము నెమ్మదిలో బొడమ రుక్మిణీమణి యంతన్.
| 97
|
ఉ. |
జాఱినకొప్పుతో జెవికి జాఱినపాపటబొట్టుతో దిగం
జాఱినపైటతో నొఱగజాఱిననీవికతో నొకింతగా
జాఱినసొమ్ముతో జెమట జాఱినకస్తురిబొట్టుతో ముడిం
జాఱినపూలతో నొడలు జగ్గుమనన్ వడి లేచి దిగ్గునన్.
| 98
|
గీ. |
లేచి తనబోంట్లమీదను లేనికోప, ముంచి గుప్పించి పిలిచి గద్దించుకొనుచు
సైగగా బోవ దన కది సైగ గాగ, శౌరి ముసిముసినగవుతో నూరకుండె.
| 99
|
గీ. |
చిలుకకడ జూచి నీ కేల చిన్నవోవ?, నెంత లేదిది; నీకు బ నేమి; యొకరి
ప్రకృతి గాదని మాన్పంగ కొకరివశమె?, చెలియ యేమనె నవ్వల దెలుపు మనిన.
| 100
|
చ. |
చెలియ కి కేమియున్నవి విశేషము లయ్యెడ నెన్న మాటికిన్
దెలుపగ వేసటయ్యె జెలిదీనత జూచిన గృష్ణ కృష్ణ; యా
పొలతుక యేమిభాగ్యములు పొందెడినో తెలియంగరాదు; వే
డ్కల గనియైన నీదుసముఖంబున దెల్పగరాదు తద్వ్యథల్.
| 101
|
మ. |
ఘనయోగీంద్రునిరీతి నేమి వినినన్; కందోయిఁ దా నేమిగ
న్నను; నెమ్మేనున నేమి సోఁకినను; గృష్ణా! దేవకీనందనా!
యని పల్కున్; జెలిప్రేమ నేమనుదు నాహా! మోహ మోహోహొ; నె
మ్మన మౌరౌర; వికార మంచినదిరా మందారపుష్పాకృతిన్.
| 102
|
క. |
ఆపడఁతిచేతఁ బెరిఁగిన, పాపంబున నాదుపల్కు ప్రత్యక్షము గా
మోప దయిన నీసేవలు, ప్రాపించుటఁ గొంతకొంత పాటింపఁదగున్.
| 103
|
చ. |
ఘనకుచపాళి హాళి నినుఁ గస్తురిచేఁ గొనగోట వ్రాసి యి
య్యనువున నెన్నఁ డుందు నకటా యనుచున్ దలపోసి పోసి వె
చ్చనికనునీరు పై పయిని జూఱఁ గరంటుల నాని చే చుఱు
క్కున విదళించి యెంత ఘనమాయెను జీవమటంచుఁ జింతిలున్.
| 104
|
క. |
వక్కమ్మలోన నేమో, గ్రక్కునఁ దా వ్రాసి యొసఁగెఁ గైకొను మనుచున్
ఱెక్కల నుంచినపత్త్రిక, ముక్కున నెడలించి శౌరిముంగల నిడియెన్.
| 105
|
క. |
పురుషేత్తముఁ డాపత్త్రిక, నిరుకేల వహించి మొదల నీయ వటంచున్
మురియుచు గన్నుల నొత్తుచుఁ, దఱచుగ దల యూచి చదివె దా నిట్లనుచున్.
| 106
|
చ. |
సకలగుణాభిరాముఁ డగుశౌరికి రాధ నమస్కరించి మి
న్నక యొకవిన్నపంబు; నిను నమ్మినవన్నియునున్ ఫలించె న
త్తకు మగఁ డల్లు డంచును వితావిత తేరకుఁ దేర వట్టియా
డిక లివి యేల నాకు నెగడెన్ వడి మాన్పుము మేలు నీకగున్.
| 107
|
వ. |
అని చదువుకొని తద్భావంబులు పలుదెఱంగులం బరికించి వాత్సల్యంబును ముగ్ధ
తనమును బ్రౌఢతనమును వ్యంగ్యంబుగఁ దోఁప వింతయుఁ జింతయు దొంతరగా
నంతరంగంబునం గదురఁ గొంతవడి యూరకుండి యవ్వలం గనుంగొని యందు.
| 108
|
క. |
... ... నిను మది మఱవను
... ... నను నెనరు మఱచి కినియకు నాపై
... ... కనికర ముంచర
... ... యని తలఁచినపుడె యెనసెద ననరా.
| 109
|
( ఇది గుప్తచతుష్పాదకందము.)
వ. |
అని చదువుకొని యది గణబద్ధం బయ్యును బద్యంబు గానివిధం బేమి యని యూ
హించి యస్మన్నామంబు ముందు వెనుకల రచియించి పరిత్యాగలోభంబున మన్నా
|
|
|
మంబులు వ్రాయక మనంబునఁ దలంచుకొన నుంచుకొనియె నని తానె పొసగించి,
యవియే నాలుగువిధంబుల నిట్లనుచుఁ జదివె.
| 110
|
క. |
కృష్ణా నిను మది మఱవను, కృష్ణా నను నెనరు మఱచి కినియకు నాపైఁ
గృష్ణా కనికర ముంచర, కృష్ణా యని తలఁచినపుడె యెనసెద ననరా.
| 111
|
క. |
కృష్ణా కనికర ముంచర, కృష్ణా యని తలఁచినపుడె యెనసెద ననరా
కృష్ణా నిను మది మఱవను, కృష్ణా నను నెనరు మఱచి కినియకు నాపై.
| 112
|
క. |
నిను మది మఱవను కృష్ణా, నను నెనరు మఱచి కినియకు నాపైఁ గృష్ణా
కనికర ముంచర కృష్ణా, యని తలఁచినపుడె యెనసెద ననరా కృష్ణా.
| 113
|
|
కనికర ముంచర కృష్ణా, యని తలఁచినపుడె యెనసెద ననరా కృష్ణా
నిను మది మఱవను కృష్ణా, నను నెనరు మఱచి కినియకు నాపైఁ గృష్ణా.
| 114
|
క. |
అని రచనఁ బొగడి కృష్ణుఁడు, మనమున సంతోష మంది మక్కువఁ జిలుకన్
గనుఁగొని గ్రక్కునఁ జను మిఁక, ననువుగ నే ఱేపె వత్తు నని తెల్పవలెన్.
| 115
|
గీ. |
మొదలఁ బదివేలనేరముల్ మోచియున్న, నేను నేఁ డింక నేమన్న నిక్కమగునె
రాధతోఁ దెల్పు మొకమాట "రమణి ఱేపె, నీదు పదమాన వచ్చెద నిజ" మటంచు.
| 116
|
క. |
అని మారుకమ్మ యొసఁగిన, వినయంబునఁ గొని శుకంబు వినువీథి వడిన్
జనుదెంచెను వ్రేపల్లెకు, మునుపటి తనపక్షపాతమును గనుపింపన్.
| 117
|
గీ. |
వచ్చుచిలుకఁ జూచి వనిత దిగ్గున లేచి, బార చాచి తిగిచి గారవించి
పోయినట్టిపనులు కాయొ పండో యన్నఁ, బండుపండు ఱేపు పండు గనిన.
| 118
|
క. |
ఇంతమొగ మంత చేసుక, యంతింతనరాని నిస్తులానందముతోఁ
గొంతవడి యూరకుండి త, నంతనె రాచిల్కఁ జూచి యంగన వల్కెన్.
| 119
|
ఉ. |
కంటివె కన్నులార నవకంతుని రూపము; వీనులారఁగా
వింటివె వానిమాట; లొడవెంబడినైనను నన్ దలంచునా;
యంటివె కృష్ణ కృష్ణ యని; హా శుకమా! పొడఁగంటి నీవు మా
వంటియదృష్టహీనులకు వాని గనుంగొనుభాగ్య మబ్బునే?
| 120
|
క. |
ఉన్నాఁడో గోపాలుఁడు?, విన్నాఁడా నీదుమాట? వేడుక వచ్చే
నన్నాఁడా నీతోడను?, మన్నాఁడా యేడనైన మక్కువతోడన్?
| 121
|
ఉ. |
ఏమనె నేమి పల్కె నిను నే మని పంపెను నన్ను దూఱెనో
రామనెనో పరాకిడెనొ రాజులయేలిక కృష్ణమూర్తి నా
|
|
|
స్వామి ముకుందుఁ డచ్యుతుఁడు వారిజనాభుఁడు శేషశాయి న
న్నేమనె; నేమి చెప్పుమనె; నేమని పంపెను ; నిన్ను నేమనెన్.
| 122
|
క. |
అదియుండె నేను వ్రాసిన, పదపద్యములెల్లఁ జదివి భావముఁ గనెనా
బదు లేమి పంపెఁ దెమ్మని, పొదలుచు నాలేఖఁ గొనుచుఁ బొలఁతుక నగుచున్.
| 123
|
క. |
పత్త్రికల వ్రాయుజాణకు, బత్త్రికలను వ్రాయు టేమిప్రౌఢి యటంచున్
బత్త్రికఁ జనుగవపై నిడి, పత్రార్థము సొమ్ముఁ దెమ్ము పత్రిక యనుచున్.
| 124
|
ఆ. |
చిలుకతోడఁ గొంతసేపు మాటాడుచు, మొదలుకొనినచోటె మొదలు గాఁగ
నాల్గుచరణములును నాలుగువిధములై, తనరుపద్య మిట్టులనుచుఁ జదివె.
| 125
|
క. |
తలఁచినఁ గలసెద రాధా, తలపడు మరుశరములకును దలఁకకు రాధా
నెల నిఁకఁ దలఁపకు రాధా, కల చిలుకలపలుకులకును గలఁగకు రాధా.
| 126
|
వ. |
అని చదువుకొని తచ్చాతుర్యంబునకు మెచ్చుచు నీపాటికటాక్షంబున్నదే యశోదా
గర్భరత్నాకరరాకాసుధాకరున కని తన పెంపుడుచిలుకను బ్రియంబు దొలఁక
దువ్వుచు నీవల్ల నుల్లం బీపాటిచల్లదనంబున నుల్లసిల్లె. శుకకులరత్నాకరరాకా
సుధాకరా! ద్వారకాపురం బేకరణి నుండె నందలి వింత లేచందంబున నుండె నందు
గోవిందుం డేయందంబునఁ గొలువై యుండె నంతయుఁ దెలియఁ బలుకవలయు
ననిన రాధికావధూతిలకంబునకు ముద్దుచిలుక యిట్లనియె.
| 127
|
సీ. |
అష్టదిక్పరిచుంచితాభ్రంకషవిచిత్ర, గోపురం బలద్వారకాపురంబు
మహీపదాంభోజాతమణిమయమహనీయ, నూపురం బలద్వారకాపురంబు
సకలవైభవభోగసరణిపరాజిత, గోపురం బలద్వారకాపురంబు
కమలాంబకునిఁ గన్నకమలాలయకు నుండఁ, గాఁపురం బలద్వారకాపురంబు
|
|
గీ. |
నీలపద్మమహాపద్మనిరుపమాన, విజయకరశంఖవరకుందవినుతమకర
కచ్ఛపముకుందశోభితఘనలసదల, కాపురం బగు నలద్వారకాపురంబు.
| 128
|
చ. |
పురవరసౌధవాటముల బోటులపాటలఁ జంద్రకాంతముల్
గరఁగి ప్రవాహముల్ దివిముఖంబున రా వినువాఁక యంచుఁ ద
త్తరమున వేకువన్ సురవితానము, తాపము సేయఁ గ్రుంకుచో
"హరిరొ హరీ" యటంచుఁ బరిహాసము సేయుదు రవ్విలాసినుల్.
| 129
|
చ. |
అలరెడివీటివజ్రమయహర్మ్యరుచు ల్దివిఁ గప్పఁ బల్కుతొ
య్యలిఁ గనుఁగొంటి నంచు నపు డానరవాహనపుత్త్రువేశ్యకున్
|
|
|
జెలఁగఁగ వేలుపుందపసి చేయు నమస్కృతి మాటిమాటి; క
క్కలికియు నేను గా ననును, గాంతుఁడు విన్నను నేగి పొమ్మనున్.
| 130
|
చ. |
పుడమిజనంబు లీయినునిఁ బూర్వగిరిం దిగి పశ్చిమాద్రిపైఁ
బడునని యాడుకొందు రది పట్టరు ద్వారకలోనివార లె
క్కడిమత మంచుఁ; దూరుపుటగడ్తను దోఁచుచుఁ గోట యెక్కి యా
పడమటగడ్త వ్రాలు నొకబాలునిగాఁ గనుఁగొందు రయ్యెడన్.
| 131
|
గీ. |
మేటినాకం బెఱుంగును గోటపొడ వ, గడ్తఁగలలోతు నాగలోకం బెఱుంగు
దీనిలోఁ దారతమ్యంబు దెలియరాదు, దానఁ బ్రథమ తృతీయ భేదములుతక్క.
| 132
|
సీ. |
ఆచారవంతులౌ నచటిభూదేవతల్, వావిదప్పిన బ్రహ్మవార్త నగుదు
రపజయం బెఱుఁగని యచటిరాచకొమాళ్లు, రణమున వెనుకయౌ రాము నగుదు
రందఱఁ బోషించు నచటికోమటు లాది, భిక్షుకు రోయు కుబేరు నగుదు
రధికధాన్యసమృద్ధి నచటిశూద్రులు తన, హలము వ్యర్థమటంచు బలుని నగుదు
రచటితేరులు మేరువునైన నవ్వు, నచదటిగజములు శక్రునిగజము నవ్వు
నచటి హయములు పవమానునైన నవ్వు, నచటిభటకోటి నిప్పులనైన నవ్వు.
| 133
|
చ. |
ఘలుఘలుఘల్లుఘల్లుఘలుఘ ల్లనుఘంటల నొప్పు కాలిపొన్
గొలుసులు మందపున్నడలకుల్కులు హుంకరణంబు లోరచూ
పులవిడఁబాటు లారజపుఁబూనిక లానికలున్ మదోద్ధతుల్
దలఁపఁ గంధసింధురములా యనఁ బొల్తురు వారకామినుల్.
| 134
|
క. |
వడి గలిగి మృదుపదంబుల, నడవడిచే మిగిలి యౌ ననన్ సాదుల కె
క్కు డునగఁ జొప్పడుఁ దగునడ, గడు నలవడఁ దురగవితతి గరిత లనంగన్.
| 135
|
ఉ. |
అంగన నీపు పువ్వులుఁ గలాసెవె; యౌ మగవారు లేరు ; లే
కం గడిదేరినావె వళు లౌ; వెలకుం గొనుమోవితేనె; బం
తిం గనకుండ దాఁచి; తది తెరకుఁ జూపుదురా విటుండ; కొ
న్నంగడి మారుబేరములె; యంచు వచింతురు పుష్పలావికల్.
| 136
|
గీ. |
అట్టిపట్టనమెల్ల నేకాధిపత్య, ముగ భరింపుచున్నాఁడు నీమగఁడు నేఁడు
ఱేపె పట్టపుదేవి గానోపు దీవు, మమ్ము నేరీతిఁ బ్రోతువో మఱపు లేక.
| 137
|
ఉ. |
నీడలువారుమేడల ననేకము చూచితి నాఁడు మేడ లా
మేడలలోన నొక్కమగమేడ భవత్పతికొల్వుమేడ యా
|
|
|
మేడకుఁ దూర్పుప్రక్క నొకమేడ చెలంగఁగ శౌరితోడ నీ
మేడకు నెవ్వ రాఢ్యు లన మీపువుఁబో డని పల్కె నవ్వుచున్.
| 138
|
గీ. |
మగువ మగరాలచవికె నీమగఁడు నేను, నీప్రసంగము లాడ నానీడ పార
నచట నొకచిల్క ననుఁ జూచినట్టులుండె, నవల నెవరన నెవరు లే రనియె శౌరి.
| 139
|
చ. |
ఇటు ననుఁ బంపినన్ మొదట నే నటు వోయిన త్రోవఁ దప్పి చీఁ
కటి నడిమిద్దెయిండఁబడి కాంతమణుల్ బయలంచు భ్రాంతిచే
నట నెగఁబ్రాకి తాకి తడవాడుచు గూడులవెంట దూరి యె
ప్పటిహరిముంగలం బడి కృపన్ గడవెళ్లితి ద్రోవ చూపఁగన్.
| 140
|
మ. |
ఒకకీల్గోపురమందు వింతే గనుఁగో నూహించి యాపైన నిం
చుక కాలూనిన గిఱ్ఱునం దిరుగ నచ్చోఁ బోవరాదంచు బు
ద్ధికిఁ దోఁచెన్ మఱియొక్కవింత విను మాతీరంబునం దొక్కబొ
మ్మ కరం బెత్తనిజాలకున్ బడఁతిగా మల్లాడుచు న్నవ్వితిన్.
| 141
|
ఉ. |
గోలతనంపుజిల్క యని కోమలి నవ్వకు; నీవు ముందుగా
బేలవు గాక తప్ప దొకపెద్దహజారముఁగన్న వీఁడు గో
పాలుఁడు వీఁడు కృష్ణుఁ డనుభ్రాంతిని జిత్తరుబొమ్మలెల్ల నా
పోలిక నున్నఁ బైబడక పోదువె; తాళుము; రేపె చూచెదన్.
| 142
|
క. |
సైచు మని పలుక రాధిక, యోచిలుకా యింత యేల యుడికించెదవే
నీచిత్తము నాభాగ్యం, బాచతురుం డెపుడు వచ్చు నని యడుగునెడన్.
| 143
|
గీ. |
కొంద ఱాభీరపూర్ణరాకేందుముఖులు, నగుచు నేమక్క విన్ననైనావు నీవు
మాట లేమన మఱి యేటిమాట లనుచు, నొకటిపైఁ బెట్టు నిదెమాట కొకటియుండ.
| 144
|
వ. |
అనిన నవ్వలివృత్తాంతంబు చెప్పుమనుటయు.
| 145
|
ఉ. |
సింధుగభీర! శీతకరశేఖరజూటనటద్వియన్నదీ
బంధురశీకరప్రకరపావనసత్కవితాధురంధరా!
సింధురగామినీనఖరచిహ్నవిభూషణభూషితోజ్వల
త్కంధర! నీతినూతనయుగంధర! బర్హిణబంధుకంధరా!
| 146
|
క. |
ఖరనఖరశిఖరముఖరిత, వరరవవీణాప్రవీణ! వాణీరమణీ
శ్వరనారదహరపారద, శరకీర్తివిహార! కృష్ణసచివకుమారా!
| 147
|
మాలిని. |
సులభనవమనోజా! సూర్యసంకాశతేజా!
ఫలితహరిసుపూజా! బంధుమందారభూజా!
కలితసుకవిభోజా! కాంతసత్కాంతిరాజా!
లలితగుణసమాజా! లక్ష్మమాంబాతనూజా!
| 148
|
గద్య. |
ఇది శ్రీ మద్వేణుగోపాలవరప్రసాదలబ్ధ శృంగార కవిత్వవైభవ
వెలిదిండ్ల తిరువేంగళార్యతనూభవ విద్వజ్జనవిధేయ వేంకట
పతినామధేయ ప్రణీతం బైన రాధామాధవ
సంవాదం బను మహాప్రబంధంబునందుఁ
ద్వితీయాశ్వాసము.
|
|