రాధామాధవసంవాదము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

రాధామాధవసంవాదము

తృతీయాశ్వాసము

క.

శ్రీకరవరవైభవని, త్యా! కమలనాథమృదుపదాంబుజభృత్యా!
యాకారవిజితనాస, త్యా! కృష్ణాపత్య! రామదాసామాత్యా!

1


గీ.

అవధరింపుము జనకధరాధిపతికి, మతిని సంతోష మొదవ సన్మౌనితిలకుఁ
డైనశుకయోగి రోమాంచితాంగుఁ డగుచు, నవలికథయెల్ల నిట్లని యానతిచ్చె.

2


ఉ.

అప్పుడు కృష్ణదేవుఁడు దయాంబుధి గావునఁ గావు మన్నచో
గుప్పున నాగజేంద్రుకడకుం జనుదెంచినరీతి వచ్చెఁ దా
నెప్పటిగొల్లపల్లెకుఁ గవీంద్రులు గాయకులున్ సఖుల్ భటుల్
తప్పక వెంట రా రథము దారుకుఁ డింగిత మెంచి తోలఁగన్.

3


గీ.

మునుపు తానున్నరీతులు మొదటికథలు, నక్కడక్కడ సఖులతో నాడుకొనుచుఁ
గనుచు నట గొల్ల లెవ్వరో యనుచు బ్రమయ, నడచి కృష్ణుండు నందునినగరు చేరి.

4


క.

బడలితిరి మీర; లిప్పుడు విడిదిండ్లకుఁ బొండు; మిమ్ము వెనుకఁ బిలిచెదన్;
దడసితిరి భోజనానికిఁ దడయక సేదలను దేరఁదగు మీరు వడిన్.

5


చ.

అని పలుకుల్ వినంబడినయంతఁ బడంతులఁ జేవదల్చుచుం
గనుబొమ నిక్క నంబరముఁ గన్గొనుచుం జెవి వ్రాల్చి కొంతసే
పున కిది శౌరిపల్కుబడి పో వినగల్గెనె యంచుఁ దత్తరం
బును దమకంబుఁ దాల్మి భమము న్ముదము న్మదిలో బెసంగఁగన్.

6


క.

బిరబిరను సెజ్జమీఁదికి, నరిగి గవాక్షములఁ జూచి హరియే యనుచుం
బరికింప రాధికామణి, మఱియేమియుఁ దోప కపుడు మ్రాన్పడియుండెన్.

7


వ.

అంత.

8


సీ.

వచ్చెనా నాతండ్రి వాసుదేవుం డని, నందుండు వచ్చె నానందమునను
నాచిన్నపాపని జూచితినా యని, సొంపున జేరె యశోద ప్రేమ

మననేస్తకాఁడు చేరెనటంచు గోపాలు, గుమిగూడి మూగిరి గొల్లలెల్ల
నేడైన దయకల్గెనే యంచు గోపిక, ల్పొరుగిండ్లనుండి చూచిరి కడంగి


గీ.

చెలగి కృష్ణుండు దుప్పటి మొలబిగించి, తల్లిదండ్రులపాదపద్మముల కెరగె
వారు దీవించి కౌఁగిట గారవించి, రపుడు వారలభాగ్య మేమని నుతింప.

9


ఉ.

నందకుమారు డంత జిఱునవ్వు మొగంబున దేటకన్నులన్
బొందుగ జాఱుపూలసిగ పొంకమునన్ దల పగ్గలించు మై
గందపుబూతచే నలుపు గన్పడ కొక్కవిలాసమూర్తి విం
తందము మించినట్లు కననయ్యె నెగాదిగ జూచువారికిన్.

10


మ.

అచటం జల్లగ దల్లిదండ్రులమనం బానందముం జెంద బ
ల్కుచు గోపాలుర బుజ్జగించి నలుదిక్కుల్ జూచి తన్ జేరగో
రుచునున్నట్టివ్రజాంగనామణులకోర్కుల్ జూపులన్ బ్రీతి జొ
న్పుచు వార్వారల నిండ్ల కంపి చనె గృష్ణుం డానగర్లోనికిన్.

11


గీ.

చని యనుంగులతోడ భోజనము చేసి, తల్లిదండ్రులతో గొంతతడవు దానుఁ
బెండ్లియాడినముచ్చటల్ ప్రేమ నుడివి, వారియనుమతి నిద్రింపవలయు ననుచు.

12


ఉ.

ఇంపు ఘటిల్ల నొక్కపడుకిల్లు గనుంగొని యందు రాధయం
దంపుటెలుంగు వీనుల వినంబడ దా విననట్లు చేరి నున్
గెంపులచెక్కడంపుబని గీల్కొనుబంగరుపావ లెక్కి ని
ద్దంపుమెఱుంగుజాయజముదాళికరంబున దల్పు మీటినన్.

13


గీ.

అమ్మ నేజెల్ల యది యెవ్వ రనగ రాధ, యెటకు బోవడు మిం దెవ్వ డేల వచ్చు
నేను నీయల్లుడనటంచు నెనరుదోప, బాదములమీద వ్రాలె గోపాలమూర్తి.

14


క.

లేవయ్య దొడ్డవాడవు, నీ వని తా నవలి కేగి ని న్నేమనుచుం
దీవింప; నిందు మునుపే, గోవిందుడు నిత్తెపెండ్లికొడు కన విందున్.

15


గీ.

పాన్పుమీదను గూర్చుండి పలుకవయ్య, మీరలును మహారాజు లైనారుగనుక
నే నమస్కృతి సేసెద నిదిగొ యనుచు, మ్రొక్కి తా బాన్పుదిగువ నింపున వసించి.

16


క.

వెఱగుపడి యూరకుండెడు, హరిగూరిచి రాధ పలికె నానాటివలెన్
మురిపము గలదో లేదో, యరయుదమని వచ్చినావె? యరయుము రాధన్.

17


ఉ.

ఊరక యేమియు బలుకకుండెద నంచు దిటాననున్నశృం
గారగుణావతంస! నిను గన్గొని మిన్నక యూరకుండ దీ
నో రొకపెండ్లికైనను ననుం బిలిపించితె? చూడ నెవ్వరున్
లేరని కాదు; నీదయకు నే దగుదానను గాన వేడితిన్.

18

క.

గోపాలక మాటాడక, గోపంబున నుండ నెంచుకొంటిని మొదలన్
నాప్రజ్ఞ నడవబోదని, కోపము నేనే శమించుకొంటిం బిదపన్.

19


ఉ.

వేడుకకత్తెనంచు రతివింతల నిన్ బ్రమియింపజూతునో
మోడి వహింతునో భువనమోహిని నేనని కాక యేల పెం
డ్లాడితి వంచు బాధ్యతను నాడుదునో యిదియేమి యెందునుం
గూడనిదాననై చనవు గోరెద నెవ్వతె నంచు దూఱెదన్.

20


ఉ.

మానుష మెంచియైన నొకమంచితనానకునైన నీవు పు
ణ్యానకు మాటలాడెదవు; నాతరమా నిను బల్మి జేసి నే
సానకుఁ బిల్వ; నీఘనత చాలదె రాధకుఁ; గాక కాఁకచే
నే నొకటాడ నేటి; కది నీకు నసభ్యతఁ దోఁప నేటికిన్.

21


ఉ.

దోసము కృష్ణ కృష్ణ నిను దూఱిన; నానొసలందు ధాత మున్
వ్రాసినవ్రాఁత కాదనుచు వ్రాయఁగ నీవశమౌనె; నీవు నే
వేసట లేక యేరికని వేడుకచేసెదు పైని పైని నా
సాసల మాకు మేమె పయినాడుచు నిన్నన నేర మున్నదే.

22


చ.

ఎడనెడఁ జూడుమంటివొ; పయింబయి నెమ్మది నిల్పుమంటివో;
గడెగడెఁ గోరుమంటివొ, వగంబడుమంటివొ, వేఁగుమంటివో,
బడలుమటంటివో; యరుచి పాల్పడమఁటివొ; సిగ్గు నెగ్గు లే
కడలుమటంటివో, పొరలుమంటివొ; మూర్ఛ మునుంగుమంటివో.

23


ఉ.

ఒక్కతె భ్రాంతిచేఁ బొరల నొక్కఁడు మాన్పగఁ బూఁటకాఁపె? నే
నెక్కడిదాన నీవు మును పెక్కడివాఁడవు నాకు నీకు నే
మక్కరయున్న దైన నొక రాడెడిపల్కులు నేనె బల్కెదన్
గ్రుక్కక; యాయెఁ బోయె నవి కొన్నిదినాల ఋణానుబంధముల్.

24


మ.

మన మానాఁడు మహావినోదములఁ బ్రేమ ల్మీఱ భోగించుట
ల్విను మీనాఁటికి నిద్ద ఱొక్కరొకరిన్ వేసారుటల్ వింతలై
కనుపించన్ రచియింపనేరిచి కవు ల్కల్పింప లోకానకున్
విననౌ; నింతియచాలు; మీఁదికథ లీవీనుల్ వినన్ లే వికన్.

25


ఉ.

అందుకు బైసిమాలి యొకయత్నము చేసుకయుంటినేని నా
యందుఁ బదాఱువేల కొకయంశము రాదు భవత్కటాక్ష; మీ
సందున భోజకన్యకయు సత్యయుఁ దృప్తి వహించినంగదా
యిందఱమీఁద రాధ యిఁక నేటికిఁ జాలదె జీవనానికిన్.

26

మ.

తుది నెట్లయ్యెదనో యిదేటికి విరక్తల్ రేపు నీరుక్మిణీ
సుదతీరత్నము నీవు వాదుఁకొనఁ బొంచుల్ చేరి నే నల్కఁదీ
ర్చెదనో యెవ్వ రెఱుంగువారు మఱి నీచిన్నారిపూఁబోండ్ల నే
ర్పొదవంగా గయిసేసి పెద్దతనమై యుండంగ నేఁ గందునో.

27


మ.

సతమా పొత్తులవన్నెకాఁడని గణించన్ లేక యీగొల్లగు
బ్బెతలన్ బోరితి నేఁటిదాఁక; నది చూపెన్ జూడు చేసేత; నా
గతి నీపట్టపురాండ్ర యొకతె పల్కన్ కారణం బున్నదే?
యతిమాత్రం; బెన రేమి సేయ నిఁక మధ్యస్థుండవై తన్నిటన్.

28


సీ.

పాలువెన్నలకుఁ బైబడెడునాఁటికెకదా, యాదరించు యశోదమీదిప్రేమ
వేడుకతోడ ముద్దాడునాఁటి కెకదా, మిక్కిలి నందునిమీఁదిప్రేమ
వ్రేపల్లె దూడల మేపునాఁటికెకదాఁ, మేలమౌ గొల్లలమీఁదిప్రేమ
అబ్బినయెడల మల్లాడునాఁటికెకదా, మిక్కిలి మాబోంట్లమీఁదిప్రేమ


గీ.

తండ్రి వసుదేవుఁ డయ్యెను దల్లి యిపుడు, దేవకీదేవి యయ్యెను దేవరకును
సఖులు నృపులైరి రాబోంట్లు సకియలైరి, చాలదే నేఁడు కొత్తసంసారమయ్యె.

29


మ.

విమలాత్మా! యొకవిన్నపంబు వినుమా వ్రేపల్లెలో నున్నపా
పమునన్ మానితొ నన్ను; నేను మెలఁగేపాపాన వ్రేపల్లెపై
మమతల్ మానితొ, యింతమాత్రము వచింపన్ లేవె; పుణ్యంబు నీ
కమరున్ గారణకార్యముల్ దెలిసి యోగ్యాయోగ్యము ల్చూచెదన్.

30


ఉ.

యేమిటికంటివేని విను మిక్కడివారలు నాఁటినుండి నీ
వేమొ త్యజించి నాకొఱకె యీడకు రావని యాడుగొందు రా
సామి యెఱుంగు నీమనసు జన్మముదాల్చుటయాదిగాఁగ నా
నాముఖబాధలం బడితి నల్గురికిం బగయైతి నీవగన్.

31


చ.

నిలువనిప్రేమదోసమున నెంజిలి నీకు వచింప; నేరికిన్
దెలుపుదు నిందుకోసమె యతిత్వర రమ్మని కమ్మఁ బంపుటల్
పొలుపుగ నేఁటితో మనసులోఁ గల త్రొక్కుడులెల్లఁ దీఱె ని
ర్మల మిఁకమీఁద నేమయిన మంచిది యం చిది సమ్మతించితిన్.

32


మ.

ఇల నీమోహపుటాండ్రు నీవు పదివేలేండ్లున్ మహారాజులై
కలిమి న్బల్మిని జల్లనై బ్రతుకు డింక న్నన్ను నాపేరునుం
దలంపబోకు; తలంప నేమి పని? యాదైవంబు నీతోడనే
కలసెన్; బాసలు నీకు మేలొసఁగు బో కంజాతపత్రేక్షణా.

33

శా.

దైవం బెంతకు దెచ్చె? నీవలపు లేదా నాఁటికి? న్నేటికిన్
ద్రోవల్ పుట్టెనె? నాఁటి దీగుణమె కాదో; నాఁటి విమ్మేనులే
కావో? లేక యిదేమి; యీ నడత; లీకైలాట; లీమోసముల్;
నీ వాకృష్ణుఁడ వేను రాధనెకదా నీరేజపత్త్రేక్షణా!

34


ఉ.

ఇన్నిదినంబు లే బ్రతుకనెంచుట యేమిటి కంటివేని యీ
కన్ను లదేమొ నిన్నుఁ దమకాంక్షలు దీఱఁగఁ జూడఁగోరె; నే
నున్నది దేవుడుం తెలియకుండునె; దేవుఁడటందు నీకు లే
కున్నను మాఁకు బామరిక మున్నది యున్నదినాలలోపలన్.

35


ఉ.

వంచన మాని గుట్టు మగవానికి నాఁడుది మించి యియ్యరా
దంచు వచింతు; రౌనది యథార్థము; ముంగల నిన్ను నొక్క టా
సించినదానఁ గాన నది చెప్పకతీఱదు; నేను బడ్డపా
ట్లెంచఁగ రాధ దయ్యముసుమీ యిది యేమని చిత్తగించెదో.

36


సీ.

ఒంటిగాఁ బవళింప నూరక నాగుండె, యదరంగ నెగవైచినట్లు తోఁచు
వడి లేచి తెగువతో నడవ నూహించుచో, నదుముచుఁ బైఁబడినట్లు తోఁచు
కాదని యటులేప గమకింప వడఁకుచు, నదియేమొ కుదయించినట్లు తోఁచు
గోరంతయుబుసుగాఁ గూర్చుండఁదలఁచుచో, నట్టె సివంబాడినట్లు తోఁచు


గీ.

వెఱ్ఱి పట్టినఁ గొంతవివేక ముండు, జలధిలోఁ బడ్డ నొకతెప్ప గలిగియుండు
నింతగా దిక్కు దెసలేని యిట్టివెతలు, నాతలనె పెట్టవలెనె యాధాతకైన.

37


మ.

 అడిగేవారొ; మనంబు చల్లఁగను మాటాడేటివారో; ప్రియం
పడ నూరార్చెడివారొ; మిక్కిలిదయన్ భాసించుచున్ బుద్ధిఁ దె
ల్పెడివారో; ధృతిలేక యేడ్చుచు మొఱల్ వెట్టంగఁ గన్నీళ్ళు చేఁ
దుడిచేవారొ; యొకింత రేఁబగలు నాతో వేఁగువారో కడున్.

38


చ.

నలువురు నవ్వఁగా నడవినక్క శివంబయి పొర్లి యంతలో
మెలఁకువ నన్ను నే నుపశమించుక క్రుళ్ళుచు లోన మించినన్
దెలివిని దెచ్చుకొంచు నొకదిట్టతనాన దినాలు త్రోసి యిం
తలరితి నిన్నుఁ జూచితి దురాసలు రోసితి మేలు చేసితిన్.

39


ఉ.

ఓర్పున భాగ్య మిెతేయని యూరక నీపలు కెంతుఁగాక యా
నేర్పు లిఁ కేమి యల్లుడవు నీవని నేనపు డెత్తి పెంచి యీ
డేర్పను, నేఁడు తాము రమియించి మదించను, తమ్ముజూచి ని
ట్టూర్పులతో నిటుల్ కరఁగియుండఁగ నేవది యేల యిం కిటన్.

40

శా.

నామీఁద దయ యుంచుమయ్య యనుచున్ మౌనంబుతో
రాధికా
భామారత్నము చెక్కు కేలనిడి గోపాలుం గనుంగొంచు వీ
ణామాధుర్యకలస్వనంబు దొలుకం దా నేడ్చెఁ గన్నీటనున్
గోముంజన్నులు గొప్పఁదోఁగి కడకన్ లో నెక్కుచున్ స్రుక్కుచున్.

41


క.

కాంతాళంబున రాధా, కాంతామణి రోదనంబు గావింప రమా
కాంతుఁడు గుణవంతుఁడు నర, కాంతకుఁ డపు డలుకఁ దీర్తునని వడి లేవన్.

42


క.

ముకుచెవు లదరఁగ గోపము, ముఖమున కొకవింత దోఁప మ్రొక్కుచు రాధా
ముకురాస్య రాకు రాకని, మకరాంకునితండ్రి కనియె మఱిమఱి కినుకన్.

43


క.

ఎనిమిదిరసములఁ గాంతల, నెనమండ్రను బెండ్లియాడి యిఁక నొకకొదువై
పెనుపొందుహాస్యరసమున, నను మచ్చిక సేయ వచ్చినాఁడవె కృష్ణా.

44


క.

నాతోడిది నీ కేటికి; నాతో డిఁక బలుక రాకు; నాతోడిసఖుల్
నీతికి జాతికి వెలిగా, జూతురు నీతోడి చెలిమిఁ జేసిన నన్నున్.

45


క.

కడనుండి యాడవలసిన, యడియాసలమాటలెల్ల నాడుము నాపై
నిడవలసిన నేరం బిడు, గడిదేరితి నాఁటిరాధ గాదిఁక మెలఁగన్.

46


వ.

అని సవతులపయిం బొడము పెరుసునం బెరుఁగుకినుకచేత నొకటిసేయం జేతఁ
గాని వితంబున లేనికలంకలు మనంబునం దొలఁక తొందరపడి యెందునుం
ద్రోవగానని కొందలపాటున వెనుకముందఱతోఁచక యన్నియుం జేసి తటస్థుని
విధంబున నున్న సన్నిధానప్రియభావి వియోగానలకందర్పహేతిఘాతంబుల
నిలువునం గృశించి కలితకంకణనయన యగుచు నప్పటప్పటికిఁ దలఁ ద్రిప్పుచుఁ
దప్పక తనుఁజూచు నప్పడంతిఁ గటాక్షించి యించుక విచారించి యిది యేమనియుం
వలంపక తెగించియున్నది యెందు నపనమ్మికలం బడువారిమనంబు లొడంబడికలం
గాని తీర వని వినయాదరసంభాషణంబుల షోడశసహస్రరాజకన్యకామనోహరుం
డిట్లనియె.

47


చ.

పడతిరొ చూఁడు నీకుఁ గలపాటివిచారము మాకు లేదె; నీ
యడుగుల వ్రాలి కొంతప్రియమైనఁ దుద న్వివరింతు నన్నచో
దొడిబడ నానఁ బెట్టితివి ద్రోహము చేసినవాఁడ గాను నా
చిడిముడియెల్ల విన్నపము చేసెదఁ దాలిమి నూఁకొనన్వలెన్.

48


మ.

మును బాల్యంబున నీవు ప్రోవనితఱిన్ మోదంబుతో నున్నచో
నను నానావిధగండముల్ బొదువుచున్నన్ నీకటాక్షంబుచే

తనె కాదా కడవెళ్లఁగల్గె నది రాధా నాఁడు బాలెంతయం
చును బండ్లంచును గాలియంచుఁ దరులంచున్ మాయలం చందుమే.

49


క.

వెనుకన్ దెలిసెను కంసుని, పనుపని యది తెలియలేక బలిమిని బిలువన్
జనవలసె మథుర కవ్వల, వినకుందువె మామ యచట విడివడినకథల్.

50


గీ.

తల్లిదండ్రు లయ్యుం దారు గాకుండిరి, చెరలఁ దగిలి వెడలఁ దెరువులేక
ననుఁదలంచు దేవకిని వసుదేవుని, నరయవలదె దోషమా లతాంగి.

51


కట్టిడిసేఁతలు న్వెతలు, గంసునితోడనె దీఱెనంచు నే
గుట్టు వహించి రాజ్యమునకున్ బరు వానక వానితండ్రికిం
బట్టముఁ గట్టి యాకుదురుపాటవునంతకు నిల్చి యంత ను
న్నట్టుల నిన్నుఁ జూడవలెనంచుఁ దలంచుక పైన మౌనెడన్.

52


మ.

సకియా! కంసునిఁ జంపినామని జరాసంధుండు గోపాన నూ
రక మామీదఁ జలంబుతో దిగి యహోరాత్రంబులున్ గోటఁ జు
ట్టుక పోరాడు బలంబుతో మరలి పోటుంబంట్లతో డుల్లు నా
బకశాటావకుఁగాదె యీనడుమ నేఁ బార్వారి డాఁగుండితిన్.

53


క.

ఈడకువచ్చినఁ గాదని, యాడకునుంబోక మనము హాయిగ నెచటన్
కూడానుండుదుమో యని, వేడుకను సముద్రు నడిగి విను నేర్పుమెయిన్.

54


గీ.

వనధినడుమను ద్వారక యనగ నొక్క, పురముఁ గల్పించి యందు గాపురము గాఁగ
నచటివారల రప్పించి యిచటి కేను, బైనమైయుంటి నింతలోపలనె వినుము.

55


శా.

వాండ్లు న్వీండ్లు మమున్ బడంతి యనుచున్ వాక్రువ్వఁగా వించు దా
విండ్లమ్ముల్ శిశుపాలుఁ డందుకొని ఠీవిం బైకొనం దోడ వి
ల్కాండ్ల న్వాని జయించి రుక్మిణి నటుల్ వంశాభిమానంబుకై
పెండ్లాడన్వలసెం బయోజముఖి దప్పేనిన్ శమింపందగున్.

56


చ.

ఇవతల నొక్కరాజు తనయింటను రత్నము పోయెనంచు నా
యవుదల నింద మోపఁ బరిహారముగా నొకజాడవెంబడిన్
దవుల వనాంతరంబునను న న్నని మెచ్చి పురాణఋక్షపుం
గవుఁ డగురామదాసు, తనకన్యను రత్నము నిచ్చె బల్మిచేన్.

57


క.

అపు డారత్నముఁ దొలుతటి, నృపునకు నిచ్చినఁ గుమారి నిచ్చె నతండున్
జపలాక్షి నిందసోకిన, యపకీర్తికి వారిఁ బెండ్లియాడఁగవలసెన్.

58

గీ.

గడమవారల నొక్కొక్కకారణాన, నటు బ్రతిష్టకుఁ గాఁ బెండ్లియాడవలసె
నొకటి సేయంగఁబోయిన నొకటి వచ్చు, నెదుటివారు వివేకులై యెఱుఁగవలయు.

59


మ.

చెరలోనం బడువారు లేరా? దయచేసేవారలు న్లేరో? కా
తరలంచు న్విడిపించఁబోయిన నదే తప్పే? పదార్వేలురా
తెరవవ ల్నామెడఁ జుట్టుకోవలెనె యాదీనత్వముం జూడ కే
మరుమాటాడఁ దెగింతు; రేమని వచింపన్ లేక పెండ్లాడితిన్.

60


క.

ఈలాగు నొక్కొక్కతెఁ, జీలలువలె దగులుకొనఁగఁ జేసెను దైవం
బేలా యొడలెఱుఁగనిశశ, మేలోకమునందుఁ గలదె యిది నిజమౌనే.

61


మ.

ఇదిగో చేసినపాప మీపలుకులం దేమాత్రముం దప్పినం
బదివే లేల భవత్పదంబులు దలంపన్ యోగ్యుఁడం గాను సం
పదతోడన్ బలగంబుతోఁ బ్రతిభతో భాగ్యంబుతో నున్న వీ
మది కింపౌనని నీప్రతిష్ఠయని కొమ్మా నమ్మితి న్నెమ్మదిన్.

62


ఉ.

ఏనటు గాక వారలపయిన్ దయగల్గినవాఁడ నెైన నో
మానిని! నిన్ను నింత బతిమాలుదునే సమయంబుఁ జూచి యే
మేనియుఁ బల్కఁ గాని దయ నింతటిమోహము నీకు గల్గినన్
మానక నాదు వెంబడిని మచ్చిక రమ్మిఁక యుక్తు లేటికిన్.

63


ఉ.

అన్నియు విందు నాకుఁగలయట్ల పదాఱవపాలు మేలు నీ
కున్నదె! నీకుఁదాఁ దెలియదో? యవివేకపుఁజేఁత నోరు లే
కున్నది గాని నిన్బలుక నోడెద? లోకమువా రెఱుంగరే
కన్నుల కల్కి నీవు దయగల్గుట నే దయ గల్గియుండుటల్.

64


క.

అది యేల యాఁడుదానికిఁ, గొదవ లిడన్ రాదు గానఁ గొదువగు నేనే
యుదయుఁడ మహాపరాధిని; మదవతి యిఁకనైన మోడి మానఁగరాదే.

65


మ.

అని పల్క న్వినలేక రాధిక సరోజాక్షు న్నిరీక్షించి క్ర
మ్మిననిట్టూర్పు లడంచి గద్దదిక నేమే నాడఁగాఁబోయి యే
లని తానే తలయూఁచి యోయి, విను కృష్ణా! జాణవం చందు రే
మును గల్పించుచు నేఁ డెఱింగితిమి సొంపుల్ గుల్కు నీపల్కులున్.

66


క.

వేవిధముల నీమోహపు, దేవులకథ కథలు గాఁగఁ దెలిపెద వౌఁగా
నే వినవలె నను ప్రజ్ఞకొ, నీవేడుకొ కాక యేమి నేరుపు చెపుమా.

67

క.

ని న్నెవ్వ రడిగి రీకథ, లిన్నియు; ని న్నెవరు కొదువ లిటు లాడిరి, మా
కున్నవి దయ లని యెవ రను, కున్నా; రీటక్కు లేల; నోయి మహాత్మా!

68


చ.

వెడవిలుకానిచేఁ దనువు వేసరియున్నది; యందుమీఁద నీ
యుడుకులమాట లేమిటికి నూరక యాడెదు నేర్తు నంచు; మున్
బిడుగునఁ బడ్డవారి కొరవిఁగొని చూడుదురే వితావితల్
విడు విడు చాలు నెంతయవివేకము నేఁ డిటులయ్యె వేడుకల్.

69


గీ.

మమ్ము హాస్యంబులాడక మానవేని, నాడవలసినయటులెల్ల యాడు మీవు
నేను విని తాళలేనని మౌనమునను, జెవుల నంగుళులను జొన్పి శిరము వంప.

70


చ.

ఇది కదియంగ వేళ యని కృష్ణుడు పానుపు డిగ్గి రాధికా
మదవతిచెంతఁ జేరి నునుమై పులకించి చెమర్చ నొక్కకే
లుదుటునఁ దీసి కన్నుఁగవ నొత్తుక యోనలి కోమమున్న మం
చిది చల మేల నొక్కచెవిచే విను నా దొకవిన్నపం బనన్.

71


క.

ఒకచెవి మూసుక విన్నప, మొకచెవి విను మనినమాట కుల్లములోనన్
ముకురాస్య వాదులాడక, మొక మోరఁగఁ జేసి కొంత మోడి వహించెన్.

72


ఉ.

ఇప్పటి కింతె చాలునని యేమియునున్ బెనఁగాడఁబోక యా
కప్పురగందితో ననియెఁ గంజదళాక్షుఁడు కోపగించి యో
యొప్పులకుప్ప నీ విటులు నుందువె యుండిన నుండు మోమటుల్
ద్రిప్పఁగ నేమి చేసితిని దిన్నగఁ గన్నులు విచ్చి చూడవే.

73


క.

నీమనసు రాకయుండిన, మో మైనం జూపరాదె మోసంబటవే
మామిళ్ల కాజ్ఞలైతే, కామిని గ్రుక్కిళ్ల కాజ్ఞ గలదే యెందున్.

74


ఉ.

కోమలి లోకమందు నొకకొన్నిదినాలకుఁ గాదె కామినుల్
కాముకులందు నిల్పుదురు కాంక్షలు పిన్నటనాఁటనుండియున్
గోమున నెత్తిపెంచితివి గోరిక లుంచితి నాదరించితే
మేము యెఱుంగఁ జేసి తిపు డెవ్వఁడ నింత నిరాకరింపఁగన్.

75


చ.

ఎఱుఁగనివాని నన్నుఁ జెలి మేటికిఁ జేసితి వాసఁగొల్పి నీ
సరసము నీవిలాసమును చాల మనంబున నాఁటె ని న్నిఁకన్
మఱవఁగజాల నేల బతిమాలఁగఁజేసెద వేమిపోయె ని
న్నరగడెసేపు కూడిన గృతార్థుఁడ నౌదుఁగదే తలోదరీ.

76

మ.

కలలోనైనను నీవే దైవమని నేఁ గన్గొందు నాడెందముం
దెలియన్నేర్తవు దైవయత్నమున నెంతేనేరముల్ చేసినన్
జులుకం జూతురె; బుద్ధిగా నడువుమంచుం దిద్దుకోరాదఁటే;
చెలి! నీచిత్తము నాదుభాగ్య మిఁక నాజీవంబు రక్షింపవే.

77


చ.

కనికర ముంచవో, నెనరుగల్గినదానవు కావొ; భేద మీ
తనువులతోడ రాదనినదానవు గావొ; పడంతి యింతలో
మనలను జూడలేక నడుమంత్రపువారు గుబారు చేసి గొ
బ్బున నినువంటిదాని కెగఁబోసిరి నాతలపొప్పకుండగన్.

78


చ.

చిలుకలకొల్కి నీసొబగుచిన్నెల నీనునుదేటపల్కులన్
వెలసె మనంబు కొంత, రతివేడుకలన్ జవిచూపితేనియున్
బలుకుల కేమి నాతనువు పావనమౌ; నటమీఁదిమాటకున్
ములు చనుగాను నీమనసుముచ్చటఁ దీర్చెద నోతలోదరీ.

79


క.

అహమికను నన్ను దూఱిన, తహతహచే నపుడు నీకు దయ లేదనుచున్
బహువిధముల నెదురాడితి, నహహా నాయంతవెతల నందవె నీవున్.

80


ఉ.

కంతునిగంతు లెంచి కనుగంటికిఁ బుట్టెఁడు నీరునించి యం
తంతకుఁ దల్లడించి ధృతి యల్లలనాడఁగ నిచ్చగించి యా
ద్యంతములున్ దలంచి చెలులాడుకొనన్ దలవాంచి వాంఛచే
నెంతవిరాళిఁ బొందితివొ యెంతకృశించితివో తలోదరీ!

81


చ.

చెలి నినుఁబాసి యే నిదురఁజెందమి ఱెప్ప లెఱుంగుఁ గాఁకచేఁ
దలఁగుట మే నెఱుంగు రుచిదప్పుట జిహ్వ యెఱుంగు నొంటి నే
నిలుచుట నీ వెఱుంగుదువు నిన్నును నీమదిలోనిచింతయున్
దలఁచిన గుండెలో దిగులు దైవ మెఱుంగును బ్రాణనాయికా.

82


చ.

నలువురిమాటలున్ వినక నాతలిదండ్రుల నమ్మఁబోక పె
ద్దలు తెలుపంగ నూఁకొనక దైవమునుం గొలువంగలేక నీ
చెలిమియె భుక్తి ముక్తి యని చేరితి నింతటిదాన వౌట నేఁ
దెలియక మోసపోతిఁ బరదేశిని జేసితి వంగనామణీ.

83


క.

ఈవగను వగకు వగకును, భావనతో నూఱుపద్యములు చెలి నీకై
యీవఱకును రచియించితి; నీవేగతి; లోకమెల్ల నినుఁ గొనియాడున్.

84

ఉ.

జిత్తులకత్తె లిచ్చకముఁ జేయుచుఁ బైపయి నాసఁగొల్ప నే
నత్తఱి నన్నియు న్మఱచి యంతకుఁ జొచ్చితి; బొంక నేర; వా
దత్తిఁక నీవు నేవగను దండనఁ జేసినఁ జేయఁ జెల్లు; నీ
చిత్తము నాదుభాగ్య మిఁకఁ జెప్పెడి దేమి కురంగలోచనా.

85


ఉ.

ద్రోహి నటంచు నేఁడుగద తోఁచెను; ముందటి చిన్ననాఁటి నా
మోహముఁ జూచియైన నను ముందుగఁ గైకొనరాదె కోప మే
కే హరిణాక్షి! నానడత లేగతి నుండిన నుండెఁగాక; యీ
దేహము నీయధీన; మిది యెంచియుఁ గౌఁగిటఁ జేర్పరాదఁటే.

86


సీ.

ననచూపక ఫలించు పనసభూజము భంగి, సుదతీరో! మును మేలు చూపినావు
పూచినంతనె కాచి పొల్చుమామిడిమాడ్కి, నెలత! మది దయ నిలిపినావు
పూచి పిమ్మట రాలిపోవుపాటలిలీలఁ, దరుణిరో! కలప్రేమ దాఁచినావు
పూచి కాచి ఫలించు భూకల్పకమురీతి, మగువరో! యిఁకనైన మనుపఁగలవు


గీ.

నీకు నీయంతఁదోఁపని నెనరు ప్రేమ, బలుకువగలను నడతలఁ దెలుప వశమె
నిన్నువంటిది ననువంటినెవరువానిఁ, జలము సేయుట యిది పూర్వఫలము గాదె.

87


క.

కలికీ! పలుకవె; చిలుకల, కొలికీ! దయఁ జూడరాదె; కోపం బేలే?
యలికీరంబుల కిదిగో, యళికెను నాడెంద మెందు కలయించెదవే.

88


గీ.

ఆన విడు నీదుపదములనైన వ్రాలి, వేడుకొనియెద దయపుట్ట విన్నవించి
పడతి కాదేని హృదయతాపంబు దీఱ, నాన విడువుము నీయధరామృతంబు.

89


గీ.

రమణి దాసరితప్పు దండమునఁ బోవు, నందు రందుకు నోచనై తిందువదన!
యింక దయ నేలుదో భాగ్య మింతొ యనుచుఁ, దొలుతఁ దను దోడితెచ్చినచిలుకఁ జూచి.

90


చ.

కడకడయుండెదేమె చిలుకా! మును నమ్మిక లీ వొసంగఁగాఁ
దొడిఁబడి నమ్మి వచ్చితిని దోచినరీతిని విన్నవించితిన్
గడపట నేమిలేక ననుఁ గంతునిచేతికి నప్పగించె మీ
పడఁతుక, యౌను గా దనుచుఁ బల్కదు; నీవును నూరకుండెదే?

91


క.

చిలుకలకొలికికిఁ గలికికి, నలుకఁట, పలుకదఁట చలములఁట నీ వైన
గులుకువగఁ గులుకుకపురపు, బలుకలొలుక వలపుఁ జిలుకఁ డలుకవె చిలుకా!

92

గీ.

మరుఁడు గుఱి గాఁగ నేనాడుమాట యొకటి, చెవులఁ జొరదాయె చిలుక యీచెలికి నేఁడు
నూఁది త్రిప్పంగ దారంబు నూతపడును, భాము యిటులున్న మగవాఁడిఁ కేమి సేయు.

93


వ.

అనిన రాధికాతిలకంబు తనపెంపుడుచిలుకం బేర్కొని యిట్లనియె.

94


క.

నే నెవ్వతెఁ దను మనుపను, దా నెవ్వఁడు నన్ను వేఁడఁ దనకు న్నాకున్
బూనిక నేసంబంధమొ, వైనము నీ వడుగనేరవా యని గదుమన్.

95


వ.

చిలుక యిట్లనియె.

96


క.

నీ వనఁగా నతఁ డనఁగా, నే వినగా జాల; నెల్ల నీతులు గీతుల్
నీ వెఱుఁగు దాత డెఱుఁగు, బోవే యనఁ గృష్ణు డలుక మొగమునఁ దొలఁకన్.

97


గీ.

ఇంత పనిలేనిపనికి నే నేల పెనగ, ననుచు మెడజాఱుసిగఁ గేల నదుముకొనుచుఁ
దగటుదుప్పటి వలంలెవాటుగ ఘటించి, లేచి తల యూఁచి రాధను జూచి పలికె.

98


ఉ.

 తీరని మోహతాపమున దీనతచే బతిమాలి చూచి వే
సారితి నింక నీచెలిమి చాలును నీవెత నీకు ముద్దె; నే
నూరికిఁ బోయెదం గరుణ యుంచవె యించుక యూఱడింపగా
నేరకపోతి నంచుఁ జెలి నీవెత లెంచెద వింకమీదటన్.

99


చ.

సొలయక యెన్నిదేశములు చూచితి నెందఱతోడ నేస్తముల్
సలిపితి నెంత ముచ్చటకుఁ జాలితి; నెవ్వియు నిల్వవాయె నీ
నిలుకడమాట నీనెనరు నీరసికత్వముఁ జాల నమ్మితిన్
జెలి! కలనైన నన్ను మఱచేవు సుమీ యెవ రెన్ని చెప్పినన్.

100


చ.

కులుకుమిటారి నీవు నెలకొన్నపురంబును నీగృహంబు నీ
చెలులును నీవు నీసొలపుఁజిన్నెలు నీవగలున్ మనంబునన్
నెలకొన గుండె జల్లుమను నేఁటికిఁ దీఱనిపైనమాయె ముం
గల నినుఁ జూడనౌనె! యవుఁగా పరదేసుల కేడ వేడుకల్.

101


ఉ.

ఒక్కొక్కనాఁటి నీనడత లుల్లమునం దలపోసి యే
చిక్కులకైన నోర్చి దరిఁ జేరుదుఁగా యని చాల నమ్మితిన్
మక్కువలేనిచోట బతిమాలిన నామది కందుఁ; గాక యా
తక్కువనేస్తమైన మితిదప్పిన వేసట గాదె యేరికిన్.

102

చ.

పకపక నవ్వుచుం జెలఁగి పైకొనుచున్ రతులం బెనంగి పా
యక మనమున్న చంద మిసుమంతయు నే మఱవంగఁజాల; నెం
దుకుఁ బలుమాట; లీతనువుతో నెఱసమ్మిన నామనంబుతో
నిక నొకకాంతతోఁ జెలిమి యేమన సేయఁగలాఁడ మానినీ!

103


చ.

పలువురు నీకుఁగాఁ బడినపాటులు నీమనసే యెఱుంగు; నీ
చలమును నీతృణీకృతియు జవ్వని నామనసే యెఱుంగు; న
వ్వల ననువంటిమేలుగలవాని గడించుకొనంగలేవు; నా
వలనను దూఱు లేదు; సెలవా యిఁక నీమకు ముద్దుకోమలీ.

104


మ.

పరునై వచ్చితిఁ గాని నేరములు నాపైనుంచి కోపించు టే
నెఱుఁగ న్నామది చల్లఁజేసితివి యీ యిల్లేల? యూ రేల? యె
వ్వరు నాకేల? ఋణానుబంధములు గావా యన్నియు న్నేఁటితో
సరి గాఁబోలుసు బోయివచ్చెదఁ గటాక్షం బుంచుమీ రాధికా.

105


మ.

అని పల్క న్విని కల్కి యెంతపలుకయ్యా యింతగా నేరకుం
డిన లోచేతువె రాజకన్యకల; నెంతే జాలుఁ దెల్పెల్లఁ బా
లనుచు న్నమ్మెడిగొల్లవారికడ; నాహా నేము నీ చేతులన్
గనినా; మన్నియు నీకటాక్షముననే కాదా ప్రవర్తించుటల్.

106


మ.

నను నేఁ డెవ్వతెనంచుఁ జూచెదవు కృష్ణా నిన్నుఁ బోకుండ బ
ల్మిని బ్రార్థించెదనంచు నెంచితివొ యౌలో యంతకుం జాలవే
యనుఁగుంబోటులయిండ్ల కేఁగెదవొ భాగ్యం బాయెఁ బోపొమ్ము ప్రే
మను నేఁ జూచెద నిన్ను నన్నుఁ దెగడే మాయూరిపూఁబోఁడులన్.

107


చ.

తెగువల నమ్మలక్కలు పతివ్రతలై నను దూఱువారు; నే
నొగి వినుదాన; నీవు కడనుండెడివాడవె; నీవు వారునుం
దగవున మెచ్చసేయుదును; దప్పినఁ జూచెద; నింటికెల్లనుం
బొగడికఁ దెత్తుగాదె; యెటు పోయెదు నిన్విడ నెన్నిభంగులన్.

108


చ.

అనుచు బిరాన లేచి వనజాక్షునిదుప్పటికొంగుఁ బట్టి గొ
బ్బున నెటు పారిపోయెదవు పోదువు గా కని శయ్యమీఁదికిన్
బెనగుచుఁ దీయ నొయ్యనఁ దమిన్ బిగికౌఁగిటిలోఁ గదించి రా
ధను గరఁగించె శౌరి తనుతాపము దీఱఁగఁ గోప మాఱగన్.

109


చ.

చలమును గోప మీరసము జవ్వని కేడకు డాఁగిపోయెనో
తెలియదు కొంతసేపు తనదేహము తా నెఱుఁగంగలేక మై

పులకల నప్పటప్పటికిఁ బొంగుచు నిక్కువలంట సోలుచున్
బలుకక యూరకుండె నలమాధవుకౌఁగిట రాధ వేడుకన్.

110


క.

చెలువయఁట రాధ; కృష్ణుఁడు, చెలువుండఁట; చిన్ననాఁటిచెలిమఁట; యెడలై
కలసినవారఁట; వారల, మెలకువలకుఁ దమికి మట్టుమేరలు గలవే.

111


మ.

కొమరుంబ్రాయపుజిన్నిచన్నుఁగవముక్కుల్ నొక్కి కోరాడి కం
ఠమునం గేలు గదించి యిక్కువలు గోటన్ మీటి నెమ్మేన లేఁ
జెమటల్ గ్రాలఁగఁ గౌఁగిలించి బడలించెన్ జొక్కి తా నెంతయున్
దమి రాధామధురాధరాధరసుధాధారల్ చవింగ్రోలుచున్.

112


ఉ.

చిక్కితి వంచు రాధ యొకచే హరికంఠము గౌఁగిలించి తా
నక్కున వ్రాలి చూడకుమటంచును నించుక మోడిసేయుచుం
జక్కెరయోని యాని నిలజాలక కన్నరమోడ్చి సోలుచుం
బుక్కిటివీడె మందుకొని ముద్దుల నొద్దిక మాటలాడుచున్.

113

నిరోష్ఠ్యమత్తేభవృత్తము

గిలిగింత న్నగి కాంత కాంతకృతసంకేతజ్ఞయై యిచ్చఁ జం
చలతాటంకరథాంగగండయుగయై సత్యంక్తచేలాంతయై
చెలరేఁగెన్ గఠినస్తనార్ద్రనఖనిశ్శేషాధరగ్రాహియై
గళనాదాంగదఘంటికాకలకలాక్రాంతాంగణేచ్ఛారతిన్.

114


చ.

గళరవ ముప్పతిల్ల బిగికౌఁగిటఁ జన్నులు పిక్కటిల్ల నం
దెలరవ మావహిల్ల గడిదేరినవార్తలు గ్రక్కతిల్ల మే
ఖలరొద తారసిల్లఁ దెలికన్గొన లించుక సొమ్మసిల్ల నూ
ర్పులు వడిసంఘటిల్లఁ దమిఁ బొంగి లతాంగి చెలంగి పైకొనెన్.

115


ఉ.

అంత రతాంతమందుఁ గమలాక్షుఁడు రాధికమోముఁ జూచి యీ
వింత లిఁకేమి తెల్ప నొకవేడుకలోఁ బదివేలువేడ్క లం
తంత ఘటింపనేర్చితి వహా నెఱయోధవు గావె నీవు నీ
వింతకు సేరకున్న బ్రమియింతువె కృష్ణుని లోకు లెన్నఁగన్.

116


ఉ.

కోమలి యెంత నీవు పయికొన్నను మున్నొక లేనియెమ్మెతో
నామికచేత నే రతులయంద మెఱుంగక యొల్లనంటి నేఁ
డేమని విన్నవింతుఁ దనువెల్లను బావనమాయె నీఋణం
బేమిటఁ దీర్చికొందు సొలయించితి వన్నిట నన్ను వేడుకన్.

117

క.

అన విని రాధిక కృష్ణునిఁ గనుఁగొని యానవ్వుమోము కళగలచెక్కుల్
నునుమోవియుఁ దెలిగన్నులు, గొనబువఁ బలుమారు ముద్దుగొనుచు న్నగుచున్.

118


ఉ.

తేరనినిద్రమంపు దగదీఱనియూర్పులపెంపు పచ్చికా
టాఱనిమోవికెంపు చెమటాఱనిచెక్కులసొంపు జాఱియున్
జాఱనిపైఁటలోనిబిగిచన్నులక్రొన్నెలవంకగుంపు చె
న్నార నొయారముల్ గులుక నచ్చెలి యప్పడకిల్లు వెల్వడెన్.

119


క.

ఆనడత నెఱిఁగి యెఱుఁగని, దానివలెనె యాయశోద తా నుండఁ దనుం
దానయి నందుం డడిగినఁ, బోనీ మనకేమి యనుచుఁ బొలఁతుక నవ్వున్.

120


క.

ఈరీతిఁ గొన్నిదినములు, కూరిమితో రాధ వగలకున్ లోనై యా
శౌరి వసియించి యొకనాఁ, డారమణిన్ సమ్మతిల్ల నాడి సుముఖుఁడై.

121


గీ.

పదిదినములకు మఱలివచ్చెదనటంచుఁ, దల్లిదండ్రులతోఁ దెల్పి యెల్లచెలుల
బూర్వసఖులను బ్రియమున బుజ్జగించి, రాధతోఁగూడ వెడలె నమ్మాధవుండు.

122


చ.

రథముపయి న్వసించి కవిరాజులు రాజులు నేస్తకాండ్రు వే
విధముల వెంటరా నమితవేగముతో నతివైభవంబుతో
నధికముదంబుతోఁ దలఁచినప్పుడె ద్వారిక కేగుదెంచె దన్
రథగజవాజివీరభటనాథు లెదుర్కొనఁగా మహోన్నతిన్.

123


ఉ.

ఇట్లు పురంబుఁ జేరునెడ నేమని తెల్పుదుఁ
దోరణాలమే
ల్కట్లను మంచెలన్ బురుజుల న్విడితేరులఁ జప్పరాలయ
ర్కట్ల జవాదివాసనలు ఘమ్మన బంగరుమేడలన్ జెలుల్
పొట్లముగా సుమంబులను బోయఁగ నబ్బుర మయ్యె రాధకున్.

124


మ.

హరిఁ జూడన్ బుర మెల్ల ఘుల్లుమనె; నాహా రాధ మాకేడ దా
పురమై వచ్చె నటంచు రుక్మిణిమొదల్ పూఁబోఁడు లేమేమొ యెం
చిరి; శ్రీకృష్ణుఁడు పూర్వపక్షములఁ దా సిద్ధాంతముల్ చేయునే
ర్పరిగానన్ సరిమిద్దెలోన నిడెఁ బూర్వస్నేహాయౌరాధికన్.

125


మ.

పయిపై రుక్మిణిసత్యభామల రమింపంగాఁ బదార్వేలుక
న్నియలం గూడఁగ నిర్వివికారుఁ డనిన న్నిర్మోహియౌ నిర్జితేం
ద్రియుఁ డౌనన్నను దాళియిండె వెనుక; న్నిక్కంబుగా రాధపై
దయవాఁడై యపుడున్నచిన్నెలు వృథాతత్త్వంబు లయ్యెం గడున్.

126

ఉ.

చేకొని మంత్రులం దిడియె సీమవిచక్షత; కార్యఖడ్గము
ల్వీకఁ గుమాళ్లయం దిడియె; విద్యల, బెద్దతనంబులన్ గుల
స్త్రీకుళకంబులం దిడియెఁ; జిన్నెలి కేమన రాధతోడిదే
లోకము గాఁగ నుండె నిఁక లోకులు కాముకుఁ డంచు నెంచరే.

127


చ.

కవ విడలేక జక్కవలకైవడి రాధయు మాధవుం డిటుల్
దవులుకయుండఁగాఁ దమరు తాళక రుక్మిణి సత్యభామ జం
బవతియు మిత్రవిందయును భద్ర సుదంత కళిందజాతయున్
రవరవ నాడుకొంచు నొకరాతిరి లక్షణయింటి కేఁగినన్.

128


చ.

పడఁతుక మ్రొక్కి వారికి సపర్యలు సేయుచుఁ దాను వారు నొ
క్కెడ వసియించి నెచ్చెలుల నెవ్వరి నుండఁగనీక యోజనల్
నడుపుచు నీసునం దెగువ నల్వురు నాలుగుమాటలాడఁగా
నుడుకుచు సత్యభామ వినయోక్తుల రుక్మిణితోడ నిట్లనెన్.

129


గీ.

నన్ను గయ్యాళి యందు రీకన్నెలెల్లఁ, దెలియ వినవక్క పట్టపుదేవి వీవు
పేర్మి నీతోడిసాటిగాఁ బెనఁగఁజేసె, దానవారాతి పారిజాతంబుకొఱకు.

130


ఉ.

ఎన్నఁటికైన వాని చను వెవ్వతె నమ్మునె కృష్ణ కృష్ణ యా
యున్నదినాలలోన దయయుంచినవానివితానఁ బెద్దకున్
బిన్నకుఁ గాకయుండ నడపించును; చేసెడిబాసలంటిమా
యెన్న వశంబు గాదు నిజ మించుక లేదు తలంచి చూచినన్.

131


ఉ.

ఇంచుక రాధసుద్ది మునుపే విని వేడితి; వారు వీరుఁ గ
ల్పించిరటంచు నో రదిమి లేదని బొంకిను నాఁడు; నాఁడె యి
ట్లించుకి యొద్దికైన మన మింతకు రా నడపింతుమే యిఁకం
గొంచెములోనె డానిపయిఁ గూరిమి తప్పునె? తప్పె యోజనల్.

132


వ.

అనిన జాంబవతి సత్యభామ కిట్లనియె.

133


ఉ.

ఎందుకుఁ దప్పె యోజనలు కృష్ణునితంట లెఱింగి దానిపై
నిందఘటింప నేమగును నేఁడవుఁ గా దనువారు లేరుగా
కందఱుఁ గారటంచు నిపు డక్కట రాధిక మేలుగల్గెనా
యందె రమింపఁగావలె నహర్నిశముం బనియేమి యేరికిన్.

134


వ.

అనిన మిత్రవింద జాంబవతితో నిట్లనియె.

135

ఉ.

ఎవ్వరికిం బనేమి యని యేటికిఁ బల్కెదు నాఁడు నీవు నే
మెవ్వరమంచు నుల్కితి; మొకించుక నేర్పుల నాటపాటల
న్నవ్వుల లోనుజేయవలె, నాఁటికి నాఁటికి గాక రిచ్చలన్
రవ్వలఁ బెట్టినన్ మససు రంజిలనేర్చునె యెట్టివారికిన్

136


వ.

అనిన భద్ర మిత్రవిందతో నిట్లనియె.

137


ఉ.

రచ్చల రవ్వలన్ మససు రంజిలదంటివి; రాధ కేమిట
వ్వచ్చెఁ బ్రతిష్ఠ నేఁడు; మగువా మనమందఱ మొక్కమాటగాఁ
గచ్చెగ శౌరితోడఁ బలుకన్వలె రాధకు మాకుఁ గూడునే
విచ్చలు మేము గావలెనొ నీ కది కావలెనో యటం చిఁకన్.

138


వ.

అనిన సుదంత భద్రతో నిట్లనియె.

139


చ.

అదివలె మేము గావలెనొ యం చిపు డాడిన దాని మానునే;
యదివలె మీరుఁ గావలె నటం చను; నింకొకనేర్పు దెల్పెదన్;
పదటము లేక నందఱముఁ బద్మదళాక్షునిత్రోవఁ బోక నేఁ
డిదిమొదలున్ దిగించినవహిన్ సమయంబు ఘటింపఁగావలెన్.

140


వ.

అనినఁ గాళింది సుదంతతో నిట్లనియె.

141


చ.

సమయము సేయఁ గృష్ణునకు సాగకపోయిన దేమి; యందుచే
నమరఁగ రాధ కేమి కొదువయ్యెను; బిన్నటనాఁటనుండియున్
దమి తలకెక్కియున్న దయదప్పునె నేర్చితిమేని మందుమం
త్రములను బూని వానికిని దానికి భేదము సేయఁగాఁదగున్.

142


వ.

అనిన లక్షణ కాళిందితో నిట్లనియె.


ఉ.

మందును మంత్రమంచనెదు మంత్రము లిప్పుడు పాటిఁదప్పె; నీ
యందఱు మెచ్చ నే నొకయుపాయముఁ దెల్పెద రాధచెంతకే
పొందుగఁ జెప్పి పంపుదము "బుద్ధిని బెద్దవు నీవు, నీకు మా
కెందుకు నాదు నీవె తగ నెంచుక దిట్టము సేయు" మం చొగిన్.

143


వ.

అనిన రుక్మిణీరమణీశిరోమణి యక్కామినీమణులం గనుంగొని నవ్వుచు నిట్లనియె.

144


ఉ.

నిందలం నేయ నెందుకుఁ దృణీకృతి యెందుకు మించనాడఁగా
నెందుకుఁ గాదు కూడ దననెందుకు మోడి వహించి యుండఁగా
నెందుకు మందు మంత్ర మననెందుకు దైన్యముతోడ వేఁడుకో
నెందుకు నేవచింతు నొకయిక్కువ యించుక విందురేనియున్.

145

మ.

మనోభోగంబుల నేమితక్కువలుగా మన్నించె నేవేళకై
నను మాటాడఁడొ బుజ్జగింపఁడొ రతిన్ మల్లాడుచుం దృప్తిగాఁ
దనువుల్ సౌఖ్యము లొందఁజేయఁడొ మహాతాత్పర్యచిత్తంబునవ్
మనలోనన్ మనవారె యీర్ష్యలు వహింపన్ వారివే నేరముల్.

146


సీ.

ఒకనిసొమ్మేమి వేఱొక్కనిసొమ్మేమి, చక్కెర కమరునే చిక్కఁదనము
లోకులు గననేమి తా కనుంగొననేమి, వెన్నెల పూనునే విన్నఁదనము
అంత గైకొననేమి యింత గైకొననేమి, యమృతాన కబ్బునే యల్పతనము
చెంత నుండిననేమి చేత నుండిననేమి, విరబంతి కబ్బునే వెగటుఁదనము


గీ.

ఒకతె చవిఁగొన్న లేదె మోవికిని దీపి, నలుగురును జూడ లేదె నవ్వులకుఁ దెలివి
మాట యొకమాటు విన్నఁజాల్ మనకు తృప్తి, శౌరికడ నుండినను లేదె సంతసంబు.

147


మ.

వినుఁ డేవేళను గష్టుఁ డేనగరికిన్ వేంచేసెఁ దా నెవ్వతెం
గని మాటాడెను వార లప్పటికి బల్కన్ మేర సర్వజ్ఞుఁడౌ
ఘనుఁ డేలా పొరపొచ్చెముల్ నడపు నింకన్ మానుఁ డీవార్త లొ
య్యన నారాధ యొకింత విన్న మనకే యౌఁ జిన్నపో హీనముల్.

148


చ.

అన నిది యుక్తమంచు నపు డందఱు సమ్మతిఁ జేసికొంచు మె
ల్లనె తమయిండ్ల కేఁగి యొకలాగున నుండిరి వారిమాటలే
యొనరికఁ బొంచులుండి విని యొద్దికఁ బెంపుడుచిల్క గ్రక్కునన్
దనకు వచింప రాధ విని తా నది శౌరికిఁ దెల్పెఁ దెల్పినన్.

149


క.

ఈనుడువు లిపుడు వింటివె, యానడుమను నీవు చిలుక నంపిననాఁడే
నానావిధముల నడిగిరి, మానవతీ! నీదురాక మహి నల్పంబే.

150


వ.

అనిన రాధికావధూతిలకం బతిముదంబునఁ గృష్ణునితో నిట్లనియె.

151


సీ.

పల్లెతావులనున్న గొల్లదానిని దెచ్చి, నిధిరత్నములయందు నిలిపినావు
చెలఁగి రాధామాధవులచెల్మి హా యన, బిరుదైనకీర్తిఁ గల్పించినావు
ప్రౌఢలైన కిరీటపతులకన్యల మాని, ననుఁ బ్రాణపదముగా నడపినావు
సకలవిద్యారహస్యము లెఱుంగఁగఁ జేసి, దేహ మానంద మొందించినావు


గీ.

నేఁడు నాపాలిదైవంబు నీవె యనినఁ, జాల దీమాట నామహోత్సాహమునకు
యెంత సంతోషపడెదనో యెఱుకలేదె, మొదటి కిటు చేయు సర్వజ్ఞమూర్తి వీవు.

152

గీ.

ఒకటఁ గొఱతయు లేక నే నున్నదాన, నైన నావిన్నపం బిపు డాదరింపు
నీదుపట్టపుదేవులు నేను నీవు, బంతిభుజియింపవలె రేపు సంతసమున.

153


చ.

అని మఱునాడు వారికిఁ బ్రియంబుగ సమ్మతి గాఁగ శౌరిచే
తనె పిలిపించి వారలును దానును గృష్ణునిఁగూడి బంతులై
యనువుగఁ బంచభక్ష్యపరమాన్నములన్ జవు లెంచికొంచు భో
జన మొనరించి ధౌతకరసారసలై ముదమంది రందఱున్.

154


మ.

నవరత్నస్థగితంపుసొమ్ములను నానాగంధపుష్పాదుల
న్నవరంగత్కనకాంబరంబులను గాంత ల్వింతలై చేరి చు
ట్ల వసింపం గొలువున్నమాధవునిదండ న్నిల్చి యారాధ మ
క్కువతోఁ బల్కెను గప్పురంపునునుబల్కుల్ దళ్కులం జిల్కఁగన్.

155


మ.

పొలుపౌ రుక్మిణిసత్యభామలకు నీపూఁబోండ్ల కాయున్నక
న్నెలకు న్నేఁ జెలికత్తెనై తెలిపెదన్ వీరల్ భవత్ప్రీతికై
కలహం బందఁగ నేల? పంచి వరుసల్ గల్పించి గోపాల వీ
రలరన్ దిట్టము చేసి చేసెదను మాధ్యస్థంబు నే నియ్యెడన్.

156


చ.

ఒకనెల కొక్కమేర వినుఁ డున్నదినంబులలోఁ బదాఱువే
లకును బదాఱునాళు; లవల న్మఱి యార్గురి కాఱునాళ్ళు నొ
క్కొకటిగ లక్షణాదులకు నొప్పగు; సత్యకు రెండునాళ్లు; నం
దుకు నొక టెచ్చు రుక్మిణికిఁ దోఁచినచో దయ నిల్పు వెల్తికిన్.

157


గీ.

అనుచు నోయక్కలార నే నంటి ననుచుఁ, గోప ముంచకుఁ డీమేర కొదువ గాదు
సమ్మతిలుఁ డంచు సతులమొగమ్ముఁ జూచి, హరికి మొదలుగ రాధ యందరకు మ్రొక్క.

158


క.

కూర్చుండు మనుచు రాధం, గూర్చి పడంతుకలు మెచ్చుకొనుచుం బ్రియముం
గూర్చి పలుకంగఁ గృష్ణుఁడుఁ, గూర్చుండఁగ నిడియె నవ్వుకొనుచుం జెంతన్.

159


ఉ.

అంతట వారి వారిని గృహంబులకున్ సెలవిచ్చి రాధికా
కాంతను గృష్ణదేవుఁడు తగనే గరఁగించి చెలంగి వింతకున్
వింతలుగాఁ దమిన్ వరుసవెంబడి నందఱయిండ్ల కేఁగి య
త్యంతవిలాసమార్గముల దక్షిణనాయకుఁ డయ్యె నున్నతిన్.

160


క.

విను రాధామాధవకృతి, మనమున నిడి వినినఁ జదివి మఱి వ్రాసిన మె
చ్చిన యాధన్యాత్ములకున్, వనజాక్షుఁ డొసంగు సకలవైభవము దయన్.

161

గీ.

అనుచు శుకయోగి తెలుప నజ్జనకవిభుఁడు
కృష్ణుఁడును రాధయును గాక యిఁకను గలరె
దైవము లటంచు వారల భాసమునను
దలఁచి మ్రొక్కుచు శుకయోగిఁ గొలిచియుండె.

162


ఉ.

కృష్ణయమంత్రిపుత్త్ర! సుకవీంద్రముఖాంబుజకంజమిత్ర! శ్రీ
కృష్ణపదాబ్జసంతతవశీకృతచిత్త! నవీనచిత్తజా!
జిష్ణుసమానభోగ! గుణచిత్రవిశేష! గభీరసాగరా!
వైష్ణవసమ్మతప్రకటవస్తువిచారణ! మంత్రివారణా!

163


క.

చతురతరవచనరచనా, చతురానన! కవినిధాన! సంతతదానా!
మితభాషణ! హితపోషణ!, మతితోషణగుణధురీణ! మాన్యవిహరణా!

164


మాలిని.

మగదలకులధీరా! మానినీచిత్తచోరా!
యగణితగుణహారా! యర్థిరాధాకుమారా!
నిగమవిధివిహారా! నిత్యసౌఖ్యానుసారా!
సగరభవగభీరా! చారుశృంగారవీరా!

165


గద్య.

ఇది శ్రీ మద్వేణుగోపాల వరప్రసాదలబ్ధ శృంగార కవిత్వ వైభవ
వెలిదిండ్ల తిరువేంగళార్యతనూభవ విద్వజ్జనవిధేయ వేంకట
పతినామధేయ ప్రణీతం బైన రాధామాధవసంవా
దంబను మహాప్రబంధంబునందుఁ సర్వంబును
తృతీయాశ్వాసము.
సంపూర్ణము.