రాణీ సంయుక్త/ముప్పదియొకటవ ప్రకరణము

ముప్పదియొకటవ ప్రకరణము

ట్లు చక్రవర్తి రణమునకు దిగి రోషభీషణాకారుండై శత్రు సంహారము గావింప మొదలిడ నొకవార మగునప్పటికి జయచంద్రునిసేన పూర్తిగ నాశనమయ్యెను. అనేక వేల మ్లేచ్చులును హతులైరి. అంత నిక నాలస్యమొనరించిన మోసమగునని సుల్తాన్ తన సైన్యమును వెనుకకు మరలించెను. సుల్తాన్ యాజ్ఞప్రకారము సేనలు బరుగెత్తిపోవుచుండ స్వసైన్యములేమి ముందుఁబోయిన యెటువచ్చునో యని జయచంద్రుఁ డొక రాత్రివేళ నెవరికి దెలియకుండ నీశ్వరభట్టును వెంటఁగొని వెండియు యుద్ధమారంభమైనది మొదలు దనకు దార్శ్వవర్తులుగ నుండి మిక్కిలి నమ్మకముతో మెలఁగుచు వచ్చిన జలీమ్‌నేర్, షైదాఖాన్, మిర్జాఖాన్ అను మువ్వురు సేవకులఁ గూడ గైకొని వేరొండు మార్గమున వెడలిపోయెను. చక్రవర్తి పరువెత్తుచున్న వారి నేల చంపవలయునని యూహించి వారి మ్లేచ్ఛదేశము వరకు దఱుమఁ దనవారల కాజ్ఞయిచ్చెను. ఇట్లు మ్లేచ్చులు ముందు నార్యులు వెన్కయై రెండుసేనలు మరల ధానేశ్వరము దగ్గరకుఁ జేరెను. సుల్తాన్ తన కపజయము కలిగినందున ననారతము చక్రవర్తి నెట్లు చంపుదునా యని యుపాయముల వెదకుచున్నవాఁడు గాన దుట్టతుదకు మోసముఁజేసి యార్యుల బరిమార్చఁగోరి ధానేశ్వరము చేరినపిదపఁ దా నార్యావర్తము వదలి మార్గమునం దేవిధమైన యల్లరులు చేయకుండ నాఫ్‌గన్ స్థానమున కేగునట్లును, తనదేశము జేరువరకు గొంత చక్రవర్తి సేనను వెంటనుంచుకొని దానికగు ఖర్చులు తానే భరించునట్లును యిక ముందెన్నటికిఁ జక్రవర్తి యనుమతిలేక యార్యావర్తమునకు రాకుండునట్లును, సార్వభౌమునితో సంధిగావించుకొనెను. అట్లు సంధిజేసుకొనుటవలన జక్రవర్తి హృదయమునగల రోష మంతరింప మరలదుఃఖమంకురింపసాగెను. సంధిగావించుకొన్న పిదప మ్లేచ్ఛు లెట్లుండిరో చూచిరండని చక్రవర్తి మొదలగువారు కొందఱు వేగులవారినంప వారు తిరిగివచ్చి మహమ్మదీయులు శస్త్రాస్త్రముల నుజ్జగించి నెమ్మదిగ నున్నారని వచించిరి. అంత నా దినము ప్రొద్దుగ్రుంకిన వెంటనే హాయిగ భుజించి సార్వభౌమసైనికులెల్లరు సకలలోకానందకరముగఁ గాయుచున్న నిండువెన్నెలలో కొంతసేపటివరకు నిష్టమువచ్చిన ప్రసంగము లాడుకొని తరువాత నెక్కడి వారక్కడ నిదురించిరి, చక్రవర్తియుఁ బ్రత్యేకముగఁ దనకొరకు నిర్మిఁపబడిన శిబిరముఁజేరి మంత్రులు దండనాయకులు మొదలగువారు చుట్టునిదురించియుండ దాసంయుక్తం దలఁచుకొని విలపించుచుఁ గొంతసేపటి కట్లే నిదురగూర్కెను. అటు లార్యసైనికు లెల్లరు మైమఱచి గాఢనిద్రపరవశులై యుండ రాత్రి నొంటి గంటవేళ మ్లేచ్ఛులందఱును సుల్తాన్ యాజ్ఞప్రకారము ఖడ్గపాణులై వారిమధ్యంజొచ్చి యొక్కొక్కని దీర్ఘనిద్రఁ బుచ్చ సాగిరి. సుల్తాన్ బలశాలులగు నిరువదిమంది భటులఁ గూడుకొని చక్రవర్తియున్న శిబిరముఁ బ్రవేశించి నలుప్రక్కలఁ బరుండి యున్నవారల వధించి చక్రవర్తి గొంతుఁగోయఁ బోవుతరుణమున నతఁడుల్కిపడిలేచి మ్లేచ్చులఁగాంచి విభ్రాంతుఁడై తనఖడ్గమును జేఁబూని వారిపైఁ దిరుగఁబడెను. ఈలోపలనే రెండుమూఁడు ఖడ్గప్రహారములు వెన్నున దగిలెఁగాని వానికి వెనుదీయక పోరాడమొదలిడి సుల్తాన్ వెంటవచ్చిన వారిలో నొకని దక్కువగ నందఱఁ గడదేర్చేను. ఆత్తరి సుల్తాన్ చక్రవర్తిమీదికి రా నతని క్రింద పడతన్ని నరుకబోవ మ్లేచ్చభటుఁడు వెనుకనుండి వచ్చి చక్రవర్తి కంఠముపై బలమగు దెబ్బకొట్టెను. ఆ దెబ్బతో నతఁడు నేలగూల సుల్తాన్ పరువెత్తి పోయెను. ఇట్లు తెల్లవారులోపల నార్యులఁజంపి మ్లేచ్ఛులందఱు సుల్తాన్ కావార్త నెఱుగింపఁ గృతకృత్యుఁడై యతఁడు కన్యాకుబ్జము నాక్రమించుకొన కొంతసేనతో గుతుబుద్దీనును బంపి తాను, మిగల సైన్యముం గూడుకొని డిల్లీకేగఁ బయనమై పోయెను. అంత నిక్కడ ప్రబలమగు నార్య సేనయంతయు దుర్దశం బడియుండఁ, దెల్లవారినపిదప శత్రువుల కంటబడక మిగిలిన కొందఱు చిన్నచిన్న కాలువలుగట్టి పారుచున్న రక్తమునందడిసి లేచి సంభ్రాంతమనస్కులై మహమ్మదీయులు గావించిన మోసమని తెలిసికొని యీవార్త నెఱుగింప వారును డిల్లీకేగిరి. సుల్తాన్‌కుగాని మఱి యితరులకుగాని తెలియకుండఁ బారిపోయిన జయచంద్రుఁడు తనరాజధానికేగ బయనమై పోవుచుండెను. మార్గమధ్యమున నీశ్వరభట్టుకుఁ గలిగిన దురూహలకు మితిలేదు. కన్యాకుబ్జముఁ జేరులోపల జయచంద్రుని జంపి తానుపోయి యారాజ్యము నాక్రమించు కొనఁగోరి పార్శ్వ వర్తులు మువ్వు రత్యంత జాగరూకులై యుంటచే యనేక పర్యాయము లతనిజంపఁ గడఁగియు మానుచు నిఁక వారి కెరుక లేకుండ తనకార్యము నెరవేర్చుకొనుట దుర్ఘటమని తలఁచి యొకనాఁడు రాజావలకు జనియుండ వారితో రహస్యముగ "మిత్రులారా ! మీరు నా కత్యంత స్నేహితులగుటచే నిప్పుడు నేనొకరహస్యముఁ జెప్పుచున్నాను. దుర్ఘటమని యెంచకుడు. పాపమని తలపోయకుఁడు. మన మీ రాజుగారి నెన్నిదినముల నుండియా కొలుచుచున్నాముగదా ! మన కేమైన సౌఖ్య మనిపించుచున్నదా ? ఇత్తరి నేనొకయుపాయముఁ జెప్పెదను. నలుగురముచేరి యీరాజుం గడతేర్చితిమా నిక్కముగ మనకుఁ గన్యాకుబ్జరాజ్యము లభించును. పట్టణముఁ జేరినపిదప నక్కడి విషయములు చక్కబఱుచుభారము నాది. ఇట్లుచేయుటవలన మనకీకష్టములన్నియు నడిగి రాజభోగములు ప్రాప్తములు గాఁగలవు. నామాట కాదనక యిందున కొడంబడుఁడు. మీరతనికిఁ దోడ్పడ కుండినఁజాలు. నే స్వయముగా నతని గడముట్టించెద. మీ రిందులకు సమ్మతింపనిచో మనము పడవలసిన బాధలకు మితియుండదు. కాన నాలోచించి కొనుఁ" డన వారుమువ్వురు మొగములు చూచుకొనుచు నౌరా ! వీనిదుశ్చింత యని తల పోయఁగడగిరి. అంత మరల భట్టు " మీ రూరకమొగములు చూచుకొనుటవలన నేమిప్రయోజనము ? మనమిప్పుడు కొంచె మించుమించుగఁ గన్యాకుబ్జముఁ జేరవచ్చినాము. ఆపట్టణ మిచ్చటకు నైదారామడలకంటె యెక్కువలేదు. పురముఁ జేరిన పిదప నతనిజంపుట మన తరముకాదు. ఆ కార్య మిటువంటి స్థలమందే జరిగినయెడఁ బులియెత్తుకొని పోయినదనిగాని రణముననే మృతినొందినాఁడని గాని చెప్పి పౌరుల నెమ్మది పఱచ గలము. కావున నేదోయొకటి నిర్ధారణ సేసుకొని నాతో వచింపు" డన వారుమువ్వురు రేపాలోచించి చెప్పెదమనిరి. తరువాత జయచంద్రుడు వచ్చుటచే నాఁటి కాప్రసంగ మాపివేసిరి. ఆమఱునాఁడు భట్టు స్నానమొనరింప నక్కడికిఁ గొంచెము దూరముననున్న నొకసెలయేటికి బోయి యుండ మ్లేచ్చ సేవకులు రాజుదగ్గర కేతెంచి " రాజేంద్రా ! మీరింతకాల మీ భట్టు నెట్లు నమ్మియుంచుకొంటిరో యూహింపజాల కున్నాము. వీడు మిమ్ము గడతేర్చి కన్యాకుబ్జము నేలదలఁపు గలిగియున్నాడు. నిన్న మీ రావలకేగియున్న సమయమున నతడు మావద్దకు వచ్చి మిమ్ముజంప మమ్ముగూడ సహాయ పడవలసినదని కోరినాడు." అన జయచంద్రుడు వారివాక్యముల విశ్వసింపక “ మీరుచెప్పున దంతయు నాకాశ్చ్యర్యము నున్నది" అనెను. అత్తరి వారు మువ్వురు " రాజా మీ కతనియెడగల చిరపరిచయమున నిట్లనె నెదరుకాని కావలయునన్న నిప్పు డతడువచ్చులోపల నా పొదరింట దాగియుండుడు. మాకందఱకు జరుగుసంభాషణ విందురు గాక" యనిరి. అందుల కతడును సమ్మతించిపోయి పొదరింట దాగియుండెను. అంత గొంతసేపటికి భట్టు చనుదెంచి జయచంద్రుఁ డెక్కడనని యడుగ నవతలకు వెళ్ళిరని వారు చెప్పిరి. అత్తరి మరల " నే నిన్న మీతో ముచ్చటించినదానిఁ గూర్చి యేమీచేసితి ” రన నా మువ్వురు " అయ్యా : రాజ్యము వచ్చునన్న సంతోషము మాకును గలదుకాని మమ్ము బోషించు వారియెడ నట్టిద్రోహంబుఁ గావింప. మా మనంబులు జంకుచున్నవి. మఱియు నా విషయమై తలఁచుకొన్నపుడెల్ల మితిలేని భయము గలుగుచున్న "దని వచించిరి. అందుల కతడు "మీరు వట్టి తెలివితక్కువ వారుగ గన్పించుచున్నారు. మనల బోషించువారని యభిమానము పెట్టుకున్న చో మన మొక్క నాటికి నెగ్గజాలము. అయినంతవరకు మనకు సౌఖ్యము కలుగు మార్గము సూచుకొనవలయుఁగాని రాజని తలచి యూరకున్నచో మన మేనాటికి బాగుపడజాలము. నేను మొదటినుండి యింతవరకు గావించుచున్న వాని విన్నచో మీ రెంతైన నాశ్చర్య పడుదురు. నాకు బుద్దివచ్చినప్పటినుండి రాజ్యము సంపాదింప వలెనన్న కోరికను మనస్సున బెట్టుకొని సాధ్యమైనన్ని కుట్రల బన్నుచున్నాడఁ గాని యింతవర కా కోరిక సఫలముగాలేదు. ఇప్పుడు మంచితరుణము దొరికినది. ఈ సమయమును జెడఁ గొట్టుకొంటిమా యిక మనకు వేరొండు తెరుపులేదు. కావున మీ 'రట్లే" యన్నఁజాలు. ఒక్కక్షణమున నేనతనిఁ గడదేర్చెదను. మనము నల్వురము గలిసినటులైన జయచంద్రు రహస్యముగ జంప నవసరముండదు. బహిరంగముగ నెదిరించి పోరాడి చంపవచ్చును. నేనింతకు మునుపు గోరీ మూలమున నా కార్యము నెరవేర్చుకొనఁ దలచియుంటిగాని యతనికే యపజయము కల్గినది. కాన నిప్పుడింత ప్రయత్నము చేయవలసి వచ్చినది. మీ రేమాత్రము భయమందవలసిన కారణములేదు. నేను చిన్నతనంబు నుండియుఁ జేసినవానిఁ జెప్పఁబూనినచో నొకపెద్ద గ్రంథమగును కాన కొంచెముగఁ దెల్పెదను. ఢిల్లీ యందున్న కాలమున నొక మహ్మదీయునితోఁ గలసి చక్రవర్తిపై ననేకములగు గుట్రలబన్నితి, కన్యాకుబ్జముఁ జేరినదాది నితని భరతముఁ బట్టింపఁ బ్రయత్నములఁ జేయుచున్నాడను" అనుమాటలు భట్టునోటివెంట వెడలుటయే తడవుగ నంతవరకును బెరుగుచున్న కోపము నాపుకొని లోపలనున్న జయచంద్రుఁడిక నాపుకొనఁజాలక యౌరా యనుచుఁ దటాలున బొదవెడలి వచ్చెను. భట్టతని గాంచినవెంటనే నిశ్చేష్టితుఁడై యొక్క క్షణ మాత్రము నిలచి తరువాత చప్పున బారిపోవ దలచి కొన్ని యడుగులువైవ చివాలున షైదాఖాన్ బరువెత్తి తనచేతికత్తితో నతని పాదముల తెగగొట్టెను. భట్టు కెవ్వున గేకవైచి నేల కొరగి ప్రాణముల వదలెను. దూరముననుండి చూచుచున్న జయచంద్రు డా దుర్మార్గునకు దగినశిక్ష యైనదని తలంచుకొనుచు సేవకులఁగూడి మరల బయనమై పోపుచుండెను. నాటినుండియు జయచంద్రుని మనసంతయు మారిపోయెను. అంతవరకు దాను కావించిన యవివేకపు గార్యములకు బశ్చాత్తాపమందజొచ్చెను. అన్యాయముగ నీశ్వరభట్టును నమ్మి మోసపోయితిగదా యని తలంపసాగెను. అట్లు పశ్చాత్తాపతప్తుఁడై తన నగరమున కేగుచు మార్గమధ్యమున నొక వృక్షముక్రింద విడసియుండ రాత్రి రెండు ఝాములవేళ గొందఱు బాటసారు లాచెట్టు క్రిందికే వచ్చి మరియొకవైపున విడిసి నిట్టూర్పులు విడచుచు హా ! జయచంద్రా ! మమ్మందఱ నరణ్యములపాలు కావించి పోయితివిగదా యని తన పేరు నుచ్చరించుచు దుఃఖించుచుండ వారి సమాచార మరయుటకై తన మువ్వురు నేవకులతో నెదుటకేగి నిలువ వారు భీతిల్లి యయ్యో ! మనకిక్కడ గూడ మ్లేచ్ఛుల దర్శనమయ్యెనే యని యఱచుచుఁ బరుగిడజొచ్చిరి. కాని జయచంద్రుఁడు వారలనాపి. "అయ్యో ! మీ రెవరు? ఏటికిట్లు మమ్ముగాంచి భయంపడెదరు ? మేము మీ కేవిధమైన యపకారము చేయుటకు రాలేదు. సావకాశముగ మీవృత్తాంతము దెలియఁజేయుఁ" డన " అయ్యా ! నిన్ను గాంచిన మా కేవిధమైన భయము లేదు కాని యీ మువ్వురఁ జూడ మాగుండెలు కొట్టుకొనుచున్నవి. మేమీ దినము సాయంతనము వరకు నిట్టివేషముల వారిచేతులలో జిక్కుబడి చావుదప్పి కన్నులు లొట్టపోయి తప్పించుకొనివచ్చి యిటఁజేరినాము. ఇక్కడ జేరిన వెంటనే మరల వీరిదర్శన మయ్యెఁగదా యని భయముకలిగినది. ఇత్తరి నీ వభయహస్తము నిచ్చియున్నావుకాన భయమువదలి మావృత్తాంతము జెప్పెదము వినుము. మేమందరము గన్యాకుబ్జనగరవాసులము. మారాజుగు జయచుద్రుడు సద్గుణవంతుడే కాని యీశ్వరభట్టను నొకదుర్మార్గుని జేరదీసి యతనికుట్రపు మాటలువిని మంచి చెడ్డ ఆలోచింపక చక్రవర్తితో వైరము బెట్టుకొని మా కెన్నరానికష్టముల గలిగించినాడు. రాజ్యకార్య ధురంధరులును, సద్గుణశీలురును మంత్రి పురోహితులునగు వినయశీలదేవశర్మ లెంతజెప్పినను వినక వారల వెడలగొట్టి మారాజు వివేకహీనుఁడై భట్టుసలహా ప్రకారము మ్లేచ్ఛులఁ దోడుచేసుకొని చక్రవర్తిమీదికి దండెత్తిపోయినాడు. నేటికి వారమురోజుల క్రిందట జయచంద్రుఁ డెక్కడికో పారిపోయినాడనియు, చక్రవర్తియు సంయుక్తయు మరణంబు నొందిరనియు దెలిసినది. ప్రజలందరియెడ సమానభావము గలిగి సకలసద్గుణ సమన్వితయై బరగిన సంయుక్త మరణమునకును, నతులిత ప్రతాపశాలియగు చక్రవర్తి గతించుటకును జయచంద్రుడే కారణుఁడుగదా యని పౌరులెల్ల రతని ననేకగతుల దూషింపసాగిరి. ఎటులై నను రాజు కావున నతనిపోకకు నొకవైపు జింతింపసాగిరి. ఇటులుండ వురిసినపుండుమీద కారముజల్లి నట్లు కుతుబుద్దీనును మహమ్మదీయు డొకడు సేనాపరీవృతుడై వచ్చి మా నగరదుర్గమును స్వాధీనము జేసుకొని పౌరులెల్ల ననేకగతుల బాధింపమొదలిడ వానికోర్వ జాలక మావలెనే యనేకు లిదివరకే యడవుల పాలైరి. " నగరమందలి గొప్పవారంద ఱొకటియై వానిదగ్గరకేగి " మారాజుగారు లేనితరి మీరిట్లువచ్చి యాక్రమించుకొను టుచితమగునా? కావున న్యాయమాలోచించి మీరువెళ్లు " డన నవ్వుచు నతడు "మీరాజుగారప్పుడే పరలోకగతులైనారు. బ్రతికివచ్చినను నతనికి మేము రాజ్యమియ్యము. చక్రవర్తి నోడినపిదప జయచంద్రుని గూడ జంపి యీరాజ్యము నీశ్వరభట్టున కిచ్చునట్టు అతడు మేము నొప్పందము జేసుకొనుయుంటిమి. కాన మీ దారిని మీరు పొండన వారు మఱలవచ్చిరి. అంత పురవాసు లెల్లరు నెక్కడనైన తలదాచుకొన రాత్రివేళ ననేకమార్గముల బోగడగిరి. మేము నిట్లుచనుదెంచితి" మని వచింప జయచంద్రుడత్యంత లజ్జక్రాంతుడై విచారమున మునిగి " అయ్యా ! మీ కింక నేవిధమైన భయములేదు. మేమును మీవలెనే బాటసారులము, మఱియు మీరునిద్రించుతిరి నే మేల్కొని కావలి యుండెదను. తెల్లవారినపిదప మనమందర మెక్కడికైన బోవుదము, శయనింపు" డన వారు నట్టేపరుండి నిద్దురపోయిరి. జయచంద్రు డారాత్రి నంతయు గావలికాచి ప్రభాతమగు సమయంబున నీవల కేగి కాల్యకరణీయమున దీర్చుకొనివచ్చి కూరుచుండియుండెను. అంత బాగుగ దెల్లవారినపిదప బౌరు లెల్లరు మేల్కొని ఖడ్గపాణియై తమకు గావలిగ గూరుచుండి యున్న రాజుంగాంచి శోకముప్పొంగ హా! జయచంద్రా యని యొక్క పర్యాయముగ నతని పాదములపై వ్రాలిరి. అత్తరి రాజును దుఃఖమున శిరము వంచుకొని " పౌరులారా : లెండు మిమ్మిట్లడవుల పాలుగావించిన క్రూరుడగు నీజయచంద్రుని పదములపై నేలబడెదరు. అయ్యో ! మీకునిలువ నీడయైనను నాపురంబున లేకపోయెగా " యని వారినోదార్ప లేచి వారందఱు ఆహా ! నేడు మేమెంతధన్యులమైతిమి ? ఎన్నాళ్లకు భవదీయ దర్శనం బబ్బెను ! రాజచంద్రా : మీకును గహనవాసమే చేకూరెనా? మాగతి యెటులైన గానిమ్ము. అయ్యో : పుట్టుభోగంబులగాంచిన రాజకుమారుడవే: సామ్రాజ్యపాలకుడవే ! ఎట్లీ యరణ్యంబుల వేగించెదవు? హా: దైవమా ! నీ వెంతనిర్దయుడవు ? మాకును మారాజునకును గాననమే గతిచేసితివా " యని విలపించుచుండ " అయ్యా ! నాకురాజ్యము పోయినదనుచింత యెంతమాత్రములేదు కాని యవినీతుడనై వెడలగొట్టిన నామంత్రి పురోహితు లేమైరో యని దుఃఖము గలుగు చున్నది. కట్టా ! నిష్కారణముగ నిండుసభ వారి నవమానపఱచి వెడలగొట్టితి. నా హితము గోరువారిని తలఁపనైతి. క్రూరుఁడగు భట్టునే నమ్మితి. అయ్యో ! ఆ మహాత్ము లిప్పుడు నా కంటబడిన నే నెంతయైన ధన్యాత్ముడ నగుదు " నని చింతించుచు గూరుచున్న తరుణమున మ్లేచ్చ సేవకులు మువ్వురు ముందర కేతెంచి " రాజేంద్రా ! నీ మంత్రి పురోహితు లింతవరకు సౌఖ్యముగ నున్నారు. నీవు వివేక హీనుడవై పారదోలినను వారు నీ సహజగుణము నెఱిఁగి యున్నారు కాన భట్టు మూలమున నట్లు కావించితి వనుకొనుచు మరల నీవు సన్మార్గమునకు రాఁబర మేశ్వరు బ్రార్ధించుచు నొక వేళ నీ కేమైన నపాయము గలిగిన దోడ్పడ నీ వెనువెంటనే మెలంగుచున్నారు. వారే యీవేషము" లని తమ మ్లేచ్ఛ దుస్తులఁ దీసివైచి వినయశీల దేవశర్మ కంచుకులై యెదుట నిలచిరి. అత్తరి జయచంద్రునకు గల్గిన సంభ్రమము వచింప నలవికాదు. మిక్కుటంబుగ విచారమును సంతోషము నుప్పతిల్ల నోట మాటరాక యొక్కక్షణకాలము వారి వంకనే దృష్టి నిగుడించుచు గూరుచుండియుండ వెంటనే లేచి వారి పదములపై వ్రాలెను. ఆ సమయమున వారనురాగ పూరితులై యతని లేవనెత్తి "రాజా ! ధృత్యుందగు మా పాదములపై బడుట నీ కుచితము కాదు, నీవు మరల సన్మార్గమున బడినందులకు మాకు మితిలేని సంతసము గలుగుచున్నది. గతించిన దానికి వగచిన నేమి ప్రయోజనము, పోయినరాజ్యము మనకు మరల రానేరదు. దుర్మార్గుడగు నీశ్వరభట్టు మనల కిట్టి గతి గలుగ జేసినాడు కాని " మ్మని పౌరులవంకకు దిరిగి " అయ్యా ! మీ రిప్పు డెక్కడికేగ బయనమైతి " రని యడుగ “ ధీమంతులారా ! మే మీ యరణ్యములందే వసింప వచ్చినాము ఏ పురము జేరబోయినను మహమ్మదీయుల పోరేగదా ! అట్లు కాని యెడల మీ రెట్లు చెప్పిన నట్లు నడచుకొసగల వార " మని పౌరులు వచించిరి. అత్తరి వారితో దేవశర్మ " పౌరులారా ! మన మందఱము నడపులయందే వసింప వలసినవార మైనను వేరువేరు కానలందు బ్రత్యేకముగ నుండదగిన వారమే కాని యొకటిగఁ గలసియుండుటకు మాత్రము వలనుపడదు. అనేకు . లొక్కచోటఁ గూడియుండు నప్పుడు వేర్వేరు పనులమీద బలు ప్రదేశములకు బోవలసివచ్చును. మన మెంతరహస్య ప్రదేశమున వాసము చేయుచున్నను గ్రహచారముచాలక మనలో నొక్కడు శాత్రవులకంటబడుట సంభవించెనేని వారెన్నికష్టముల నైనఁబడి గుట్టుకనిపెట్టి మనలనందఱ వధింతురు. కావున మేమునల్వుర మెక్కడికైనబోయెదము. మీరు మఱియొక త్రోవనుబొండన " సమ్మతించి జయచంద్రుడు మొదలగువారలకు నమస్కృతు లొనరించి పౌరులు తమదారింబోయిరి. అనంతరము వారనల్వురక్కడకు గొంత దూరమందున్న నొకకొండదరికేగి యచ్చోట నొకరహస్యమగు ప్రదేశమున బర్ణశాలను నిర్మించుకొని యందు నివాసము సేయదొడఁగిరి. అనుదినమును జయచంద్రుడు పడుపరితాపమువకు బరిమితి లేకుండెను. దేవశర్మాదుల కతని నోదార్చుట దుర్ఘటముగ దోచుచుండెను. ఇటులుండ నొకనాడు మంత్రి పురోహితభృత్యులు మువ్వురు బ్రభాతకాలమున లేచి వాడుకప్రకారము నిత్యకృత్యముల నేరవేర్చుకొనుటకు గొండదిగువనున్న సెలయేటివద్దకు వెళ్లిరి. అంత గొంతసేపునకు జయచంద్రుడు మేల్కాంచి యొంటరిగనున్నందున దలంపులన్నియు మనస్సునకురా ! హా ! నే నెంత క్రూరకర్మఁడను ? నాకా యీశ్వరభట్టెక్కడ దాపరించె ? అయ్యో ! నిక్కమైనమిత్రుడని నమ్మితికాని నా కింతద్రోహము గావించువాడని కలనైనఁ దలచితినా ? సర్పమునకు బాలుపోసిపెంచునట్లు వానిఁబోషించితి. దైవమా ! నా ప్రజలకందఱకు నిలువ నీడలేక చేసి యడవులపాలు కావించితివా? ఇక నేను జీవించి యేమి ప్రయోజనము? రాజ్యమా పోయె. బంధువులా నశించిరి. ప్రియతనూజయా మరణించె. నాకు గష్టములు కల్గిన యెడఁ దోడ్పడి రక్షింపగలవాడని తలఁపక నిష్కారణముగ నతిధీమంతుఁడగు జామాతతో వైరము బెట్టుకొంటి. తుద కతడును నాశనమయ్యె. హా! ప్రియకుమారీ ! సంయుక్తా ! నీ వచనంబు లెంతయాదరణీయములే ! అమ్మా ! తండ్రినని దయదలంపక నన్నప్పుడే చంపియుండిన నింతకానేరదుగదా ! సుగుణగణసమేతవగు నిన్నుఁ దిరస్కారము గావించి యింత దెచ్చుకొంటి. తల్లీ ! అప్పటికి నీ వచనసుధాధారలు విషతుల్యములై యా క్రూరుని విషవాక్యములే యమృతోప మానములయ్యె. అయ్యో ! నీ వెంతపరితపించి యుంటివోగదా? నేను నిన్నంత నీచముగ నొవ్వనాడినను నాపైఁ గిన్కఁబూనక నీ మరణకాలంబున నాతోఁ జెప్పఁబంపిన వాక్యము లెంత శ్లాఘాపాత్రములు! అమ్మా ! నీ వన్నట్లు నాకు గహన సంవాసమే ప్రాప్తమైనది. హా ! జామాతా ! చక్రవర్తీ ! నీవు నన్ను కన్యాకుబ్జనగరపు ముట్టడియప్పుడే యేలజంపవైతివి? అయ్యో : తలచుకొన్న కొలది నా కడుపు తఱుగుకొని పోవుచున్నది. చీ ! జయచంద్రహతకా ! మాతృదేశ ఘాతకుడవగు నీ వింకను బ్రతికి యుండ నెంచెదవా ? పోయి యిప్పుడే యెక్కడనైన మృతినొందరాదా యని తన్నుదాన దూషించుకొనుచు మిక్కుటమైన శోకమునఁ దన ఖడ్గముగైకొని కొండ యావలి ప్రక్కకు దిగెను. అక్కడ గొందఱు పుణ్యాంగనలు "హా ! జయచంద్రా ! మావంటి మానవతులకెల్ల భరింపశక్యముగాని యవాచికములగు నిక్కట్టులఁ గలుగఁజేసి పోయితివిగదా" యని రోదనములు చేయుచుఁ గాష్టముల బేర్చుకొని వానికి నిప్పంటించుకొని పైఁబరుండి చచ్చుచుండిరి. జయచంద్రుఁ డా దారుణకృత్యముల నవలోకించి విభిన్న చేతస్కుఁడై " ఓ సాధ్వీమతల్లులారా ! పూజనీయంబగు పరలోకంబున కేగుచు బాపాత్ముఁడగు జయచంద్రుని పేరేల యుచ్చరించెదరు ? అయ్యయ్యో ! మీకిట్టిపాటు గల్గజేసిన యా దుర్మార్గుడుగూడ జావఁబోవుచున్నాడు. మీ కందఱకు స్వస్థత చేకూరుగాక " యని ఖడ్గముతోఁ బొడుచుకొని తన మిత్రుల దలఁచుకొనుచు బ్రాణములవదలెను. అంత నట స్నానము లొనరింప బోయిన వారు తిరిగివచ్చి పర్ణశాలయందు రాజులేకుండుటచే ననుమాస గ్రస్తులై యతని వెదకుటకు మువ్వురు మూఁడు త్రోవలఁ బోయిరి. అందు దేవశర్మ రాజుపడియున్న వైపునకేగి తగుల బడుచున్న కాష్టముల గాంచి విస్మితుఁడై కొంచె మవతలికి బోయి చేతిఖడ్గము కంఠమున గ్రుచ్చుకొనియుండ విగతజీవుడై పడియున్న యతని గాంచి హా ! యని మతిదప్పిపోయినవాడై కళేబరము మీఁదఁబడి " సౌర్వభౌమా ! హా ! జయచంద్రా ! మమ్మందఱ మోసము గావించి పోయితివా ! ఓ! ఆర్యా వర్తమా ! నీకుఁ బ్రేమాస్పదులగు రాజులెల్లరు నశించిరిగదా ! ఇక నీ గతియేమగు " నని విలపించుచు నా ఖడ్గము లాగుకొని దానితోనే పొడుచుకొని తానును మరణంబు నొందెను. అంత కొంత తడవునకు వినయశీలుఁ డేతెంచి రెండు కళేబరములఁ జూచి శోకమున “హా! ఇదియేమి ! నేను నిక్కముగ నావారి కళేబరములఁ జూచుచున్నానా ? లేక నాకేమైన భ్రమ చేకూరినదా ? హా ! జయచంద్రా ! నీ కీదుర్మరణం బేలకల్గె ! హా! నెచ్చెలీ : దేవశర్మా : ఇప్పుడేకదా మమ్మటుబంపి నీ విటువచ్చితివి? ఇంతలో నింతఘోరమా ! హా ! నీవు యమునంబడిన నాటఁగోలే నేటివరకు గాంచినకృత్యముల దెల్పి యవి మన జయచంద్రునకు దెల్ప నేతెంచితిమిగదా ? కట్టా ! నీ సాహస కృత్యముల బరలోకమందైన నెఱిగించెదగాక" యని పోయితివా? నేనుమాత్ర మేలవినకుండవలయు. ఇదిగో నేనును వచ్చుచున్నాడ నని తనదగ్గరనున్న కత్తితో బొడుచుకొని ప్రాణమువదలెను. కొంతతడవునకు గంచుకి చనుదెంచి మూడు శవములవీక్షించి భయోపేతుడై రోదసము సేయుచు నట మండుచున్న యొకకాష్టముపై కురికి మృతుఁడయ్యెను. అట ఢిల్లీ నగర మందున్న మంజరి జరిగిన వార్తలన్నియు విన్న వెంటనే దుర్గమందున్న నేనను గోరీని నెదురింపబంపి యనంతరము పురమునంగల యంగననెల్ల రావించి వారితో సాధ్వీమతల్లులారా ! కన్న బిడ్డలంబలె మనల బోషించుచువచ్చిన రాజదంపతు లిరువురు మృతినొందినపిదప మనము జీవించియున్న ప్రయోజనం బేమి ? మఱియు గోరీ మనపురంబున కేతెంచుచున్నాడట. మ్లేచ్ఛులచే జిత్రహింసపడుటకన్న వేరుమార్గముల మృతినొం దుటమేలు ? అదియుంగాక నా ప్రియసఖియగు సంయుక్త తాను మరణించినతరుణమున " చెలీ ! మంజరీ ! ఒకవేళ నానాథున కపజయంబైన ఢిల్లీపురకాంతల మానభంగముగాకుండ రక్షించు భారము నీదేసుమా " యని సందేశ మంపియున్నది. ఇత్తరి మిమ్మట్లురక్షింప నాకు వేరొండువెరవు గన్పించుటలేదు. గోరి వచ్చులోపల జితులం బేర్చుకొని యగ్నినిడుకొని వానిపైబడి మృతినొంది మీమర్యాదల గాపాడుకొను " డన నందఱు శోకాక్రాంతలై యాక్రందనముల జేయుచు మంజరి దారిఁజూప దామును బ్రాణములబాసి స్వస్థనొందిరి. సుల్తాన్ మహమ్మద్ గోరీయు దన్నెదురింప వచ్చినసేనల నవలీల నుక్కడిఁచి రాజుధానింజేరి దుర్గపుదలుపులు తెరువబడియుండుటచే నే యాటంకములులేక లోపల బ్రవేశించి పురమున నెక్కడ జూచినను భస్మరాసులుంట కాశ్చర్యకలితుఁడై యార్యకాంతల సొహసమునకు మెచ్చుకొనుచు నన్ని కడల బాగుసేయించి మహమ్మదీయ రాజ్యము స్థాపించెను.


సంపూర్ణ ము.