రాణీ సంయుక్త/ముప్పదియవ ప్రకరణము

ముప్పదియవ ప్రకరణము

ట్లు సంయుక్త తనమనోకాంతుని చరణంబుల స్తరించుకొనుచు సేనల నతి ప్రావీణ్యముతో నడిపించుకొని గైజియాపురమున కఱిగెను. ఆమె యచటి కేగునప్పటికి నచలునిసేన విస్తారము హతమై యుండెను. రాజకులుం డత్యంత పరాక్రమున స్వయముగ యుద్ధమునకు దిగి సైనికులకుఁ బ్రోత్సాహము కలుగఁజేయుచుండెను, సంయుక్త తాను వెంటఁగొనివచ్చినసేనల నచలుని సేనలంగలిపి యతనివార లించుకధైర్యము చెడి యుంటఁగనిపెట్టి "సైనికవర్గములారా! మిమ్ముఁజూడ నిరుత్సాహులై నట్లు గాన్పించుచున్నారు. ఇదివర కెన్నడులేని పిరికితనము నేడేల పూనెదరు? మీమీ శౌర్యముల వెల్లడిపరచుకొనదగు నిట్టి సమయము మఱియొకప్పు డెప్పుడైన దొరకునా? మనమందఱ మేనాటికైన మృతి నొందవలసిన వారమేకదా? ఎక్కడనో నీచమగుచావు చచ్చుటకన్న శత్రువులతో నెదిరించి పోరాడి మరణంబునొందుటయే మేలు. ఈ తుచ్ఛశరీరంబులపై నావంతైన నభిమానము బెట్టుకొనకుడు. ఇంతకాలము మిమ్ము బోషించినవారి యెడలను, మీ మాతృదేశము నెడలను సంపూర్ణాభిమానము గలిగియుండుడు. పొండు. మీకార్యముల నప్రమత్తులరై యొనర్చుకొను " డన నందఱు రోషావేశులై విజృంభించి రణమునకేగి యొక్కుమ్మడి వైరిసంహారము గావింప నారంభించిరి. అట ఫరుక్నగరమున మహాబుద్దీ తనసేనలఁ జక్కదీర్చి యుద్ధము సేయించుచు వంగపతిని భీతిల్లఁ జేయుచుండెను. కోసలపతి నెదురింపఁబోయిన ఘూర్జరనాయకు డవలీల సంపూర్ణము జయముంగొని మరల శత్రుపులెవరైన నే తెంతురేమో యని కొన్ని దినంబులవరకు జోలాపురియందే యుండి వేగులవారివలన జయచంద్రుడు తన్నగరపు ముట్టడిని మానుకున్నాడని విని తనకడనున్న సేనయందు కొంతభాగము నట కావలిగనుంచి మిగతదానిం గూడుకొని మహాబుద్ధికి దోడ్పడ నేతెంచెను. ఇట్లార్యావర్తమునఁ బ్రఖ్యాతి గాంచిన వానిలోనివగు దుర్గములు రణసంకులములై యుండ నాలుగైదు వారములు గడచిపోయేను. అప్పటి కలీఘరు దగ్గరనున్న జయచంద్రువి సేన విస్తారభాగము నాశనమయ్యెను. లక్షలకొలదిగ నున్న తమ సేనయంతయు నష్టమగుచున్నందులకు సుల్తాన్ జయచంద్రు లిరువురు నిరుత్సాహులై విచారపడసాగిరి. అట గైజియా పురమందలి సైనికులు బాహుపరాక్రమము లుల్లసిల్ల ధైర్యసాహసములతో బోరాడుచుండ వారిధాటి కోరువలేక రాజకులుఁ డా నగరమును ముట్టడించుట మానుకొని పరువెత్తి పోయి జయచంద్రుని దగ్గరకేగుట లజ్జాకరమని వంగపతికిఁ దోడ్పడబోయెను. సంయుక్త కావార్త తెలిసిన వెంటనే యచలు నక్కడనే నిలపి తాను మహాబుద్దికి సహాయపడబోయేను. ఫరుక్నగరముననున్న సార్వభౌమ సేనాధిపతులు లీమెంగాంచిన వెంటనే మన్నించి గొంపోయి యామె రణకౌశలము గని విని యున్నందున సర్వ నేనాధిసత్య మామెకే యొసంగి తా ముప నేనాధిపతులై రణము జేయదొడగిరి. సంయుక్త రణరంగమున బ్రవేశించినదాది మందూరు వంగపతు లామె నెటులైన జంప ననేక ప్రయత్నములు చేయుచుండిరి. ఆమె తన యుపసేనాను లిరువురు వేరొండు దిక్కుల రణముఁ జేయుచుండ రెండుచేతుల రెండుకత్తులఁబూని సేనామధ్యమునకుఱికి లేక్కలేని భటులఁ జంపుచు వంగపతిని సమీపించి యతని గడదేర్చెను. వేరొక ప్రక్క యుద్దముజేయుచున్న రాజకులున కీవార్త తెలిసినవెంటనే భయమంది యెదుటఁబడి పోరాడిన శాత్రవులఁ గెల్వఁజాలమని రహస్యమార్గమున నామెంజంప నిశ్చయించుకొని యువసేనాను లున్న స్థలమును వదలకుండునట్లు యుద్ధము చేయుచుండ వలసినదని తన క్రిందవారల కాజ్ఞాపించి యతడు మహాబుద్ది వేషమూని యామెకడ కేతెంచుచుండెను. సంయుక్తయు నాకలి గొన్న యాడుసింగములీల విజృంభించి రణమునేయుచు దూరమున వచ్చుచున్న రాజకులునిగాంచి మహాబుద్ది యను తలంపున దాను గావించు పనియందే మునింగియుండెఁ గాని యతని విషయమై జాగ్రత్త పడదయ్యెను. అట్టి తరుణమున మెల్లన రాజకులుండు వెనుకప్రక్కగ నామెను సమీపించి దీర్ఘ మగు కరవాలముంగొని కంఠమునకు గురిఁజూచి కొట్టెను. వెంటనే యామె భయంకరలీల సింహనాదము జేయుచు దుపాకిదెబ్బ తగుల దెబ్బవెంటనే యెగిరి వేటకానిపైఁబడు సింగములీల రాజకులునిపైబడి నొక్కనిమిషమున నతని పొడిచిచంపెను. కాని వెంటనే యామెయు దన గుఱ్ఱముపై వ్రాలెను. రాజకులుడు విసరిన దెబ్బ కంఠమునకుదప్పి భుజముకడదగిలి మెడవరకును దిగెను. నెత్తురు వెల్లువయై పారుచుండెను. సైనికులెల్లరు తమ రాణికి సంభవించిన పాటునకుఁ దత్తరమందుచు నామెచుట్టుఁ జేరి శత్రువుల దరిఁజేరకుండ దూరము చేయుచుండిరి. ఆవలి వైపున యుద్దముసేయుచున్న యుపసేనాను లిరువు రీవార్త విన్నవెంటనే యొక్కపరుగున సంయుక్త దగ్గర కేతెంచి మాగుబారిన చంద్రునివలె గుఱ్ఱముపై బడియున్న యామెఁగాంచి ప్రబలార్తిమగ్నులై యా క్షణమందే యచటి కొకమైలు దూరముననున్న రాజవైద్యశాల కనిచి మితిమీరిన రోషంబున హతశేషులగు జయచంద్రుని సైనికులనెల్ల దునుమాడి పారఁదోలి సంపూర్ణ జయోపేతులై వారును వైద్యశాలకడ కేగిరి. వీరు వైద్యశాలఁ జేరునప్పటికి సంయుక్త మరణవేదన ననుభవించు చుండెను. లెక్కలేని దాసీలు చుట్టుఁజేరి యనేకగతుల నుపచారముల సలుపుచుండిరి. భుజముపైనుండి మెడవరకు లోపలగల రక్తనాళములన్నియుఁ దెగియుంటచే శరీరమునం గల నెత్తురంతయుఁ బోయి యతిశీతలత్వమంది యుంటచే ధీవిశారదుఁడగు వైద్యుఁ డత్యుష్ణముఁ బుట్టించు నౌషధముల వాడుచు తెగిన నాళముల దగ్గరజేర్చి రక్తము బయటరాకుండ బ్రయత్నములఁ జేయుచుండెఁగాని గాయ మతని కలవిగాకుండెను. సంయుక్త యప్పటి యవస్థంగాంచి సేనాను లిరువురును దైర్య హీనులై దుఃఖింపమొదలిడ నామె కొంచెము స్మృతికల్గి చెంతనున్న వారిగుర్తించి మిక్కుటమగు నాయాసమున హీనస్వరముతో " సేనాపతులారా ! మీ రిట్లువిలపించిన ప్రయోజనంబేమైనఁగలదా? నాకు గాలమాసన్నమైనది గానఁ బోవుచున్నాను. మరణమునొందుట నాకేమియుఁ జింతలేదు కాని కడసారి నా మనోహరు వదనారవిందముగాంచు భాగ్యము లేకపోయెగదా యనువిచారము నన్ను బాధించుచున్నది " అని యొకలేఖవ్రాసి మహాబుద్దిచేతి కొసఁగి " అయ్యా! నా మరణాంతరము దీని నాప్రియున కందఁజేయుము. నేఁడు నా ప్రాణములు నిలుచునట్లు లేదు. అత్యంతమగు నాయాసము పొడుముచున్నది. కన్నులు దృష్టివిహీనము లగుచున్నవి. మీరు వచించువాక్యములును దిన్నగ వినరావు. మీ రందరు నాకొఱకై చింతింపకుఁడు. నే పోయినపిదప నీ లేఖ నా ప్రియునకొసగి యందుల కతడేమైన నకార్యములు గడంగసమకట్టినచో నాటంకపరచి యోర్పుఁడు. అతని చరణారవిందములకు నా లింగన పూర్వకమగు వేనవేలు నమస్కారము లొనర్చితి నని విన్నవింపుడు. వెండియు నే రణమున కేతెంచుచుండ నా మనోహరుడు నన్ను గౌగిలించుకొని 'సతీ! సంగరతలంబున గడు నప్రమత్తురాలనై సంచరింపు' మని వచించెను. నా యజాగ్రత్తచే నిటులయ్యెనని తలఁచునేమో? విధివశంబున నిట్టిపాటుకలిగినదని నుడువుడు. మఱియు నాతోడునీడయగు మంజరికడకేగి నా వచనములుగా నిట్లని తెలియఁజేప్పుడు ' చెలీ ! మంజరీ : చిన్న నాటినుండియు మనమిద్దఱ మొకటిగఁ బెరిగి కలసి యుంటిమి. నేఁడు నీవు నాకుదూరస్థు రాలవై యుంటచే నాకుగల్గినపరితాప మింతింతని వచింప నలవిగాదు. నీవు నా చావునకై బెంగపెట్టుకొనక చక్రవర్తివచ్చు వరకు నగరము నతిజాగరూకత గాపాడి యతని మన్నన లందుము. ఒకవేళ నా నాధునకే యపజయము గలిగినచో మ్లేచ్చుల వాతఁబడకుండ పురకాంతల నందర రక్షించుభారము నీదేసుమా ' అనివెండియు ' సేనాని ! ఇంకొకటిగలదు. ఎవని మూలమున నా యజ్ఞాంధకారము మాసిపోయి జ్ఞానసూర్యుఁడు వెలుఁగఁగల్గెనో - యెవని కారణమున నా మదింగల పిరికితనముపోయి శౌర్య మంకురించెనో యెవవివల్ల నస్త్రశస్త్రాద్య నే కాయుధప్రయోగముల గుర్తెఱిఁగి సంగర రంగమందు సంచరింపదగుదాన నైతినో యెవనిమూలమున నీ మనోరధము లెల్ల నెరవేర్చు కొనుచుందునో ' యెవని యుపాయమున నీశ్వరభట్టు మొదలగువారి మాయా వాగురలఁజిక్కి ప్రాణములఁ గోల్పోవక బ్రతికితినో యట్టి సుగుణగణ సమేతుఁడు, దీనదయాపరుఁడు, పరోపకార పారీణుండగు నా ప్రియోపధ్యాయు దేవశర్మంగాంచఁ గల్గితిరేవి నా సంగతినంతయు విన్నవించి నా నమ్కృతు లందఁజేయుఁడు. " మీ రూరడిల్లి యుండుఁడన" నెల్లరును భరింపనోప కత్యంతముగ విలపింపసాగిరి. ఆత్తరి మరల సంయుక్త " అయ్యా ! ఈప్రాణి కెప్పటికైన నిర్యాణ మున్నదేగదా ? ఇందులకై మీరింతగ వగవనేటికి ? అనవరతంబు సన్మార్గ వర్తనులై, సత్యవంతులై , స్వార్ధపరత్యాగులై మిమ్ముఁ బాలించు వారియెడల భక్తిగలిగి మెలఁగు చుండుఁడు. అందువలన మీ కెనలేనిసౌఖ్యంబులు చేకూరు" నని వెండియు “మీలో నెవరైన నా జనకునిదగ్గరకేగి యిట్లు వచిఁపుఁడు. "తండ్రీ! నీ వింత యవివేకుఁడవై కావింపఁగడగిన యకార్యముల మూలమునఁగదా నా కట్టిదురవస్థ వాటిల్లినది. ఇందులకు నీపై నా కావంతైనఁ గోపములేదు. నేమరణించిన పిమ్మటనైన యించుక మంచిచెడ్డల విచారించుకొని సన్మార్గమున, నడువుము. పరలోకంబున కేగుచు నీ ప్రియతనూజ సంయుక్త సమర్పించు వందనముల, ననుగ్రహింపు" మని పల్కెను. అంత కొంత తడవునకు మఱింత యాయాసము గలుగసాగెను. మాటలాడ దలంపు గలిగియు శక్తిలేమి కనులు మూసుకొని పరుండి యుండెను. దాసీలు మున్నగువారు దగ్గరఁజేరి పిలువఁ గనులు విచ్చి చూడసాగెను. కొంతసేపటి కదియు నడంగిపోయెను. దండనాయకులు, దాసీలు, వైద్యులు మొదలగువారు చుట్టుఁజేరి విలపించుచుండఁ గొంతవడికి నా ధీరసాధ్వి తన ప్రాణముల వదలెను. అతులిత ధైర్యసాహస పరాక్రమవంతురాలై, యొక్క యార్యావర్తము వారిచేఁగాక సకల విదేశీయులచేఁ బొగడ్తలఁ గాంచి, నిజయశోమరీచుల దిక్కుడ్య భాగంబుల వెలుఁగఁజేసిన మహారాణియగు సంయుక్త యట్లు జీవముల వదల నక్కడ నున్న వారందఱు మహా సంక్షోభమున మునిగిపోయిరి. అంద రామెచుట్టుజేరి "హా ! లోకజననీ ! హా ! దివ్యమంగళ విగ్రహా ! హా! మహారాణి ! సంయుక్తాదేవీ ! అనాధలమగు మమ్మందఱ నిట్లు దయమాలి నీ వొంటరిగ నెచ్చటికేగితివి? తల్లీ ! కన్న బిడ్డలకన్న నెక్కుడగు ప్రేమంబున మమ్ముఁ జూచుచుందువే ! ఎవరింక మమ్మాట్లాదరించి కన్గొనువారు? నీ యీ వృత్తాంతము మే మెట్లు నీ నాధునకు దెలియబఱచగలము, అతఁడీ వార్తవిన్న పిదపఁ బ్రాణముల భరించి యుండునని తోచదు. నీవు లేని మా జన్మ మేటికి? హా ! ఢిల్లీ నగర రాజ్యలక్ష్మీ ! పోయితివా” యని యేడ్చుచు చేయునదిలేక రాజోపచారంబుల నామెశరీరము దహనము గావించి మతిపోయినవారలై యందఱు నలీఘరు వద్దకురాఁ బయలుదేరిరి. ఆట నలీఘరుదగ్గర ఘోరమగు రణము జరుగుచుండ జక్రవర్తి శిబిరమున గూరుచుండి తన ప్రాణకాంత కడనుండి రెండుదినములైనను వార్తరానందుల కాలోచించు చుండెను. అత్తరి మహాబుద్ది మొదలగువారు. దీనవదనులై శిబిరము బ్రవేశించి యతనికి నమస్కృతులఁజేసి నిలువ “సంయుక్త యెక్కడ" నని యతఁడడిగెను. అందుల కొక్కరు బ్రత్యుత్తర మీయక తలలు వంచుకొని నిలువఁబడియుండిరి. వీరిస్థితింగాంచి చక్రవర్తి యనుమానో పేతుడై " మీరందఱేల మాటలాడరు ? నిక్కముగ నా ప్రాణకాంత కేమైనదో వచింపుడు. నా మనస్సు నేల విట్లు కలత బెట్టెదరు; వచింపు" డన నొక్కడును మాటలాడక విలపింప సాగిరి. అంత నతడు ధైర్యముచెడి “హా ! ప్రాణనాయకీ " యని మూర్చిల్లెను. వెంటనే దగ్గఱ నున్న వారు సేదదేర్స లేచి దుఃఖపరీత చిత్తుఁడై “హా ! నా మోహంపు మొలక, నా ప్రియభామిని, నాప్రాణము, నాసంయుక్త యెక్కడ నని యడుగ మీ రేల ప్రత్యుత్తర మీయరు? నా హృదయమున నేటికిట్లు వ్యధగలుగ జేసెదరు. చెప్పు" డన మహాబుద్ది ధైర్యము దెచ్చుకొని సంయుక్త వ్రాసియిచ్చిన లేఖ నతనిచేతి కొసఁగెను. చక్రవర్తియు లేఖ నందుకొని చదువుకొన నోపక చెంతనున్న మఱియొకని చేతికియ్య నతడిట్లు చదువ నారంభించెను.

ప్రాణేశ్వరా !

తమచరణదాసినగు నే కాలంబుతీరి పరలోకమున కేగుచు విన్నవించుకొను దీనాలాపంబుల కొంచె మాలింపుడు. మీచే నట్లనుజ్ఞాతనై నైజియాపురము జేరిరాజకులుని నోడించి పారఁదోల నతఁడుపోయి వంగపతితో జేరుకొనెను. వెంటనే నేనును మహాబుద్ధికి దోడ్పడ నేగితి. రణమున బ్రవేశించిన దాది మందూరు వంగపతులు నన్నుజంప నెన్నియుపాయములో సల్పిరి కాని వారికి సాధ్యము కాలేదు. తుదకు నే వంగపతిం జంపి యుద్ధము సేయుచుండ రాజకులుఁడు మహాబుద్ధి వేషమున జనుదెంచి నన్ను బొడిచినాడు. తోడనే వానిజంపితి కాని యతని వ్రేటు గురితప్పి భుజముపైన దగిలి మెడవరకు దిగినది. వెంటనే మహాబుద్ది మొదలగు వార లేతెంచి నన్నీ రాజవైద్యశాల కనువ బాప మీ వైద్యుడును సంపూర్ణాదరమున నాకు దగిన చికిత్సలఁ జేయుచున్నాఁడు గాని నే బ్రతుకుటకుమాత్రము దుర్ఘటము. రక్తనాళములన్నియు భిన్న భిన్నము లైనవి. శరీరమునంగల రక్తమంతయుఁ బోయినది. నాధా ! నిర్భాగ్యురాలనగుట నాకు భవదీయ దర్శనంబు మరల గలుగుభాగ్యము లేకపోయే. నా యనంతరమునకు మీరు బెంగపెట్టుకొనక ధైర్య మూని మీ కార్యముల నప్రమత్తులరై యొనర్చుకొనఁ బ్రార్ధించు చున్న దానను.

ఇట్లు విన్నవించుకొను మీ ప్రియురాలు

"సంయుక్త"

అని చదివినతోడనే కనుల వెంట నొక్కుమ్మడి బాష్పములుఁ బాల్గొన మూర్చిల్లి లేచి "హా పరిహసితపూర్ణిమా శశాంకవదనా? హా ! రణరంగసంచరణకళా విశారదా ! హా! వినీలకుంత లాచ్చాదితార్దేందునిటలా ! హా ! తోరూవంశ కల శార్ణవ లక్ష్మీ : హా ! మదీయ మనోమోదసంధాయినీ! హా ! ప్రియసఖీ ! హా ! సంయుక్తా !" యని విలపించుచు మరల మూర్ఛిల్లెను , దగ్గరనున్న వారు శోకపరీతచిత్తులై యావల నట్లు దారుణమగు రణమగుచుండ నిక్కడ నిట్లగుటకు వెతనందుచు ననేకగతుల నోదార్ప లేచి చక్రవర్తి తన కాంతవ్రాసిన లేఖం గొని కనుల కద్దుకొనుచు. "హా ! మదీయకులకమలినీ రాజ హంసినీ ! నీ కింతటిలోనే నూరేండ్లు నిండెనా? నన్నిట్టి దుఃఖ భాజనుగఁజేసి నీ వెచటికేగితివి? తన్వీ! నీ సుందరవదనార విందము గాంచి సంతసించు భాగ్యము నాకు నేఁటితోఁ దీరి పోయెనా? నీవులేని యీ రాజ్యభోగంబులు నాకేల? కట్టా! నీ వంటి యుత్తమకులాంగనల కెల్ల సంపూర్ణాయువు నొసంగవి యా విధాత నేమననగును. ముద్దులొలుకఁబలుకు నీవచనామృత పూరంబులఁ గ్రోలుభాగ్య మే నిర్భాగ్యుండ నగుట దప్పిపోయె. తరుణీ ! ముందుజన్మింపగల నీ తోడికాంతలకెల్ల గురుభూత వైతివి. పుట్టినింటికి మెట్టినింటికి యశంబు దెచ్చితివి. నీకు మాతృదేశముపై గల యభిమానమును వెల్లడిపఱచుకొంటివి. అయ్యో ! భుజముదగ్గరనుండి మెడవరకు తెగినంత మాత్రముననే ప్రాణంబుల నిలుపుకొనఁజాలక పరలోకమున కేగితివికదా? అర్ధాంగివగు నీవు పోయినపిదప నర్దశరీరుఁడనై నే నెట్లు మని యుండగలను? నేనును నీవెంటనే చనుదెంచెద" నని ఖడ్గమునకై వెతకికొనబోవఁ దటాలున విజ్ఞానశీలుండు లేచి యతని హస్తమును బట్టుగొని " రాజేంద్రా | కాలముతీరుటచే నా సాద్వి పోయినది. ధీవిశారధుఁడవగు నీవే యిట్లు సేయబూనిన నీ రణ సంరంభ మంతయు నేటికి ? నీవిట్లు చేయుచున్నావని తెలిసిన జయచంద్రుఁ డాదిగాఁగలవారల కెంత చుల్కన యగునో తలపోయుము. నీవు పోయినపిదప మేముమాత్ర మెందుకు? మున్ముందు మమ్ముఁగడదేర్చి యావల నీ యిష్టమువచ్చినట్లు గావించుకొను ” మన నతడు మారువల్కనోడి తన ప్రియ కాంతం గడసారి చూచివచ్చెదనని వేడుకొనెను. మహాబుద్ది మొదలగువారు జరిగినసంగతుల సవిస్తరముగ నెఱుగపఱచిరి. అంత చక్రవర్తి మనస్సు రాయిచేసుకొని జయచంద్రుని వలన నింత చేటుగల్గినదిగదా యని త్వరలో నతనిజంప శపథముపట్టి దండనాయకులఁ బురికొల్పి తాను స్వయముగ రణమునకు దిగెను.