రాజశేఖరవిలాసము/ద్వితీయాశ్వాసము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరాజితాఖిలాగమ | పారగ! సురరాజమౌళిభాసురతరకో
టీరా! మణిరుచిరచరణ! | క్రూరాహిత మదవిభంగ! కుక్కుటలింగా!


వ.

అవధరింపుము నైమిశారణ్యమహర్షులకు నిఖిలపురాణవ్యాఖ్యానవిఖ్యాతుండగు
సూతుం డిట్లనియె. అట్లు నిరంతరజంగమారాధనదీక్షితుండై యాక్షమావల్లభుండు
వర్తించుచున్న సమయమున నొక్కనాఁడు.


సీ.

ఘనమైనతనుకాంతిఁ గనుగొన్నచో శరద్ఘనమైనవాక కదలి పాఱ
బొడవైనజడలదీప్తులు సాంద్రతరబాలజలజాప్తరుచులతోఁ జెలిమి సేయ
నిండుచందురుఁబోలు నిటలభాగంబున రమ్యభస్మత్రిపుండ్రంబు మెఱయఁ
బవమానవశమునం బల్కుచేతివిపంచి గళరవంబునకు రాగంబు గూర్ప


గీ.

మండితంబైనదండకమండలువులు | నలరు పటికంపునరులు మృగాజినంబు
గల్గి యరుదెంచె నమ్మహీకాంతుకడకు | భూరిలీలాప్రచారుండు నారదుండు.


ఉ.

వచ్చు టెఱింగి మౌనిజనవర్యు నెదుర్కొననేగి మ్రొక్కి తో
డ్తెచ్చి యనర్ఘ్యరత్నరుచిదీపితపీఠమునందు నుంచి తా
హెచ్చుగ నర్ఘ్యపాద్మవిధు లిచ్చి కడు న్వినుతించి భక్తితో
నచ్చతురాస్యసూతికి ధరాధిపు డిట్లని పల్కె నేర్పునన్.


చ.

మునివర! సర్వలోకముల ముఖ్యుఁడ వీశ్వరభక్తిమార్గసం
జనితయశఃప్రకాశుఁడవు సంతతపుణ్యుఁడ వీవు మద్గృహం
బున కిపు డిట్లు రాఁగనుట భూరిశుభంబుల కెల్లఁ దావకం
బనుదినభోగభాగ్యవిభవాతిశయంబుల కెల్ల మూలమున్.


క.

అనఘ! మిముఁబోటిపుణ్యులఁ | గనుగొనుభాగ్యంబు మాకుఁ గల్గుట యెల్లన్
ఘనమగునిధిఁ గాంచిన పే | దనుఁ బోలుట గాదె తలఁపఁ దావనముఖ్యా.


సీ.

అనవుఁడుఁ గలహభోజునుఁడు సర్వంసహావరుని కిట్లని పల్కె వలను మీఱ
రాజాధిరాజ! యోరమణీరతిరాజ! రాజశేఖరపదాంభోజమధుప!
యాచకాసురభూజ! హరిదశ్వనిభతేజ! కాంచనాచలధైర్యకలితకార్య

పండితజనగేయ భల్లాణరాయ! నీసరివారు లేరు ముజ్జగములందు
నడుగునయ్యల కెల్ల లేదనక యీయఁ | జాలినావెద్దియైన నీచరితమునకు
సంతసంబయ్యె నీపుణ్య మింత యంత | యనుచు వర్ణింపఁదరమె యయ్యజునకైన.


క.

కొట్టితివి రిపులఁ బోరులఁ | బట్టితివి మహేశ్వరాంఘ్రిపంకేరుహముల్
పుట్టితివి వంశమణివై | కట్టితి వర్ధులకు నొసఁగు ఘనమగుబిరుదున్.


క.

వచ్చితి నినుఁ గనుఁగొనుటకు | మెచ్చితి నీసుగుణములకు మేల్భళి! యిటు నీ
విచ్చినయర్చనలకుఁ గడు | హెచ్చుగఁ బరితోషమయ్యె నిచ్చో మదికిన్.


గీ.

పార్థివోత్తమ! నిశ్చలభక్తితోడ | నిందురేఖావతంసు గిరీశు నీశుఁ
గోరి సతతంబుఁ బూజించుధీరమతుల | కనఁగ నిహపరసౌఖ్యంబు లందఁగలుఁగు.


సీ.

ఫణిహారునకుఁ బ్రదక్షిణము గావించుట దేవాదిదేవునిఁ దెలిసికొనుట
చంద్రశేఖరుపదాబ్జంబు లర్చించుట తెవిలి శంభునిచరిత్రములు వినుట
పురదైత్యహరుని నేర్పునఁ బ్రస్తుతించుట భర్గునిదివ్యరూపంబుఁ గనుట
ధరఁ జాగి పార్వతీధవునకు మ్రొక్కుట నెఱి నీశుఁ దనయందు నిల్పికొనుట


గీ.

వలయుఁజువ్వె నృపాల! పావనత మీఱ | నిరవుగా నీశ్వరుని నాశ్రయించువారి
కంఘ్రిధీహస్తకర్ణజిహ్వాగ్రనేత్ర |శీర్షహృదయంబు లలరు విశేషముగను.


సీ.

వినవయ్య! శితికంఠుఁడనెడు నిక్షేపంబు గురుకృపాంజనముచేఁ గోరి కాంచి
హృదయపీఠికయందుఁ బదిలంబుఁ గావించి యదె జగత్కారణం బని తపించి
గరిమ మీఱఁగఁ దదేకధ్యానమున నుండి కడఁగి షడ్వర్ణతస్కరులఁ దరిమి
చారుశంభుకథాసుధారసం బనుచు నవిరళభక్తి వైభవముఁ జెంది


గీ.

వామదేవార్చనంబె జీవనము గాఁగ | నొనరముక్తివధూటికి నుంకు వొసఁగి
యలర నిహపరసౌఖ్యంబు లందవలయు | మహితసుజ్ఞానమతియైనమానవుండు.


మ.

పురవిధ్వంననదారవిందయుగళీపూజావిధానోల్లన
ద్వరమార్తాండమహోగ్రచారుకిరణవ్రాతంబుచేఁ గాక యో
నరనాథోత్తమ! యెంచి చూడ భువి నన్యాయక్రియాయుక్తి దు
స్తరవిస్తారనితాంతఘోరకలుషధ్వాంతౌఘము ల్వాయునే.


గీ.

విను మిలాధీశ! కడునవివేకులయిన | నరు లెఱుంగరుగాక శంకరునివంటి
భక్తలోకాభిరక్షణప్రౌఢి నలరు | దైవ మెందైనఁ గలఁడె చిత్తమున నరయ.


క.

చదువులు పెక్కులు నేర్చియు | మది దుర్జనుఁ డెట్టు లభవుమహిమ యెఱుంగు

న్వదలక విద్యలు నేర్చియుఁ | బదపడీ కానరము ముక్తిపద్ధతిఁ గనునే?


మ.

బలభిన్మౌళిమణిప్రభావిసరశుంభద్దివ్యపాదద్వయు
న్బలవద్వైరినిశాచరాంబుదజగత్ప్రాణుం ఫణీంద్రాంగదు
న్నలినాప్తేందు కృశానులోచను సువర్ణగ్రావకోదండునిం
గలుషారిన్ ఘనునిం గడుం దెలియశక్యంబౌనె యెవ్వారికిన్?


మ.

సురదైతేయులు వారిధిం దఱుచుచోఁ జోద్యంబుగా నయ్యెడం
గరళం బుద్భవమై జగంబుల వడిం గాల్పంగ దా నవ్వి సం
బరయం గుత్తుకయందుఁ బూని దయతో నంతర్బహిర్లోకముల్
పరిరక్షించినయట్టి శంభునిప్రతాపం బెన్న సామాన్యమే?


క.

నెరి ద్వాదశవర్షాయుః | పరిమాణుమృకండుతనయు బ్రతికించి యముం
గరువం బణచిన శంభుని | చరితం బహివరునకైనఁ జనునే పొగడన్?


క.

సర్వేశుఁడు దానని కడు | గర్వంబునఁ బలుకుచున్న కమలజుశిరముం
గీర్వాణు లెన్నఁ ద్రుంచిన | శర్వునివిక్రమ మెఱుంగ శక్యమె చెపుమా?


మ.

హరిజంభారివిరించిముఖ్యులగు దేవానీకముం గూర్చిశం
కరునిం బిల్వక దక్షుఁ డధ్వరముఁ దాఁ గావించుచున్నంత న
గ్గరళగ్రీవుఁడు వానిఁ బట్టి శిరమున్ ఖండించి గీర్వాణులం
దఱినింగొట్టినయట్టితద్విజయ మేతన్మాత్రమే భూవరా!


తరళ.

సురలకేరికిఁ గెల్వరా కతిచోద్యలీల జెలంగు న
ప్పురము లొక్కట శరముఖంబునఁ బూని యేసి జగంబు లా
దరము మీరఁగఁ బ్రోచినట్టి సుధామయూఖకిరీటునిం
దరమె సన్నుతి సేయ నింతయు ధాతకైన నరేశ్వరా?


సీ.

మహిమ మీరఁగ సర్వమంత్రరాట్టనఁ బొల్చు గాయత్రి కెవ్వఁడు నాయకుండు
కనుదమ్మిఁ బూజింపఁ గైటకారాతికిఁ దిరముఁగా జక్ర మేదేవుఁ డిచ్చె
బ్రహ్మాద్యఖిలజంతుపరిపాలుఁ డౌటచేఁ బశుపతినామ మేప్రభున కలరు
శ్రుతి యేక ఏవ రుద్రో న ద్వితీయ యం చనిశంబు నేవాని నభినుతించు
నట్టిగిరిజేశుఁ డఖిలేశుఁ డఘవినాశుఁ | డార్తరక్షాధురీణుఁ డనాథమూర్తి
గరళగళుఁ డొక్కరుఁడె కాక కలఁడె మఱియు | దైవ మెందైనఁ బరికింప ధరణినాథ!


ఉ.

భీమమహీరుహాగ్రములఁ జేరి ఫలంబులసార మెంతయుం

బ్రేమ భుజించురీతిఁ గడుఁబెద్దయొడల్ గల యుష్ట్ర మేక్రియం
దా మెసఁగంగ నేర్చు? విదితంబుగ నిశ్చలుఁడైన భక్తు న
ట్లామినువాఁకఁ దాల్పువిధ మబ్జభవుండు నెఱుంగనేర్చునే?


తొల్లి గుణాఢ్యుఁడైన చిరితొండఁడు వేడ్కను శైలరాట్సుతా
వల్లభుఁ గొల్చియాత్మజునివంచన లేక వధించి భక్తి రం
జిల్లఁగఁ బాక మర్పణము చేసి నిరంతరకీర్తిమంతుఁడై
యెల్లజగజ్జనం బెఱుఁగ నీశ్వరసత్కృపఁ జెందఁడే తగన్?


కావున నీ వత్తెఱఁగున | భావజమదహరునిచరణపద్మంబులు స
ద్భావమునఁ గొల్వు మిఁక నా | దేవుఁడు గరుణించి యొసఁగు దివ్యపదంబున్.


వ.

అనుటయు మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె.


సీ

తాపసోత్తమ! ధరాధరకన్యకాధీశుఁ డనిశంబు చాంచలికునివిధమున
జగదుద్భవస్థితిసంహారకరుఁడును సకలభూతాంతరస్థాయి యగుచుఁ
గర్తయు భోక్తయు గణుతింపఁ దానయై వర్తించుఁగా కెట్లు నేర్తు రొరులు?
కావున నద్దేవుకరుణాకటాక్షవీక్షణముచే వ్రత మెట్లు జరుగఁగలదొ?
కాక మముబోంట్ల కిది పూనఁగాఁ దరంబె? యనుచు వినయంబు మీర మేలైనయట్టి
కట్ణము లొసంగుటయు మౌని కౌతుకంబు |మదిని దైవారవికసితవదనుఁ డగుచు.


క.

వీణియ సుతిఁ గూర్చి జగ | త్ప్రాణాశనధరునిమహిమఁ బాడఁగ విని భ
ల్లాణుఁడు మదిఁ జొక్కుచు గీ | ర్వాణమునీంద్రుని నుతించె రభసముతోడన్.


వ.

ఇవ్విధంబున నారదుం డవ్వసుంధరావల్లభుం డొసంగుపూజలఁ గైకొని యనేకాశీర్వ
చనంబు లొసంగి యతనిచేత నాజ్ఞవడసి తద్వృత్తాంతం బీశ్వరుని కెఱింగించువాఁడై
చనుచుఁ దనమనంబున.


సీ.

చిలువలదొర మంచివిలువమించినసొమ్ము సొగసైనసిగపువ్వు తొగలఱేఁడు
పొలుపుగుల్కినయాలపోతు చొక్కపుజక్కి పరగునేనిగతోలు పట్టుశాలు
తెలిపక్కి బలురౌతు తలపుడ్క పళ్ళెంబు బాగైనయవ్వినం బోగిరంబు
వణకుగుబ్బలిపట్టి వలపులయిల్లాలు మొగములారిటిమేటి ముద్దుకొడుకు
సరవిఁజిక్కులయెకిమీడు సంగడీఁడు | పసిఁడిమల విల్లు వెన్నుండు పొనఁగునమ్ము
కడలిదొనపాము నారియుఁ బుడమి తేరు | గాఁగఁ జెలువొందు ముక్కంటిఁ గొలుతు మదిని.


వ.

అని మహేశ్వరధ్యానంబు సేయుచు.

చ.

చని కనియె న్నిలింపముని సంతతభవ్యయశోవిశాలమున్
సనకసనందనప్రముఖసాధుగణస్తుతిమూలము న్సుపా
వనతరసానుదేశపరివర్తితకిన్నరకంబుకంధరీ
జనమృదుగానమోదితభుజంగమజాలము శ్వేతశైలమున్.


సీ.

ప్రకటితసహకారపల్లవోద్యత్ఖాదనామోదపరభృతోద్దామరవము
ఘననితంబస్థలోద్గాఢలీలాలోలగీర్వాణకామినీగీతరవము
చారుమారుతపూరితోరుతరాశేషకీచకానీకప్రకీర్ణరవము
సదమలవరఝరీసందోహసంరూఢమానితఘూర్నాయమానరవము
సతతగంగాతరంగసంగతబలాక | చక్రసారసహంసాదిశకునిరవము
నొక్కటఁ జెలంగు మిగులఁగర్ణోత్సవముగఁ । సురుచిరంబైన యమ్మహీధరమునందు.


చ.

గుఱుతుగ పద్మరాగమయకూటతటంబులఁ గ్రీడ సేయు స
త్కరినికరంబు లాప్రకటకాంతులఁ జెంది వసింపఁ దుమ్మెద
ల్సరగున వానినూత్నమదసౌరభలీలలఁ జేరి నిర్నయం
బెఱుఁగకయుండుఁ ద్రిమ్మరుచు నెంతయు నబ్బురపాటుతోడుతన్.


ఉ.

చందురుఱాలచప్పరపుఁజాయలఁ గిన్నరదంపతు ల్కడుం
బొందుగ నాశ్రమంబులను బుష్పశిలీముఖకేళిఁ దేలి తా
రుందురు రేలునుం బవలు నుక్షతురంగశిరస్సుధాంశురు
గ్బృందము లన్మణు ల్గఱఁగి పెం పలరం బయిఁజిల్క నగ్గిరిన్.


సీ.

కొదమసింగములతోఁ గదిసి మేలములాడుఁ గేరుచు నున్మత్తవారణములు
వాడిమెకంబులఁ గూడి వేఁడుకతోడఁ గ్రీడించుఁ బ్రోడలై లేడిగములు
పేర్మితో బావురుబిల్లుల మెల్లన సయ్యాటలాడు మూషకచయంబు
గారవం బలరారఁ గాఱెనుబోతులఁ జేరి లీలల నుండు వారువములు
చిలువలును ముంగిసలు చాలఁజెలిమి సేయుఁ | దగరు లెప్పుడు తోడేళ్ళఁ దగిలియుండుఁ
బగ లొకింతయు నెఱుఁగ కప్పర్వతమునఁ | దుహినకరశేఖరుని మహామహిమఁ జేసి.


మ.

కమనీయామలతోయసంయుతములౌ కాసారరాజంబు లం
దము మీఱ న్విలసిల్లుచుండుఁ బొగడొందం దత్ప్రదేశంబులం
గుముదేందీవరపద్మహల్లకలసత్కూర్మాండజగ్రాహన
క్రమహావ్యాళకుళీరహంసబకకోకస్తోమధామంబులై.

చ.

ఘనమగుపోఁకమాఁకులును గాంతినిఁ జెన్నగుపొన్నగున్నలుం
బనసలు నారికేళములుపాటలము ల్వకుళామ్రసాలచం
దనములు పారిజాతములు దాడిమము ల్సురపొన్నలాదిగాఁ
దనరు ననేకభూజములు తచ్ఛిఖరీశసమీపభూములన్.


వ.

మఱియును.


చ.

సకలితపత్రము ల్ప్రకటజాలకచంచువులు న్వసింప నిం
చుకశుకనామ మబ్బుటనె సొంపున మారునమంబె? తాళకిం
శుకములటంచు నెంతయును జూడఁగ నోర్వకతమ్ముఁ బల్మరున్
శుకములు పల్క నం దతులశోభలఁ గేరుపలాశజాలముల్.


చ.

సకలసుమంబులం దురుము శంభున కెగ్గొనరించి వానిపూ
జకు వెలియైన గేదఁగిని సమ్మతినుండునటంచు ఫుల్లచం
పకములు పూన్కితోడ మధుపమ్ములఁ బాఱగఁదోలుఁ జేరనీ
యక యటుగానిచో మధుకరావళి సేసిన దేమి వానికిన్?


గీ.

మెండుకొని గండుతుమ్మెదపిండు నిండి | యుండఁ గన్నులపండువై బొండుమల్లె
పొద లలరు నందు హరిరత్నములు ఘటించి | నెరినిడిన ముత్తిమంపుపందిరు లనంగ.


చ.

సురుచిరపల్లవప్రకటచూతలతాస్థితకోకిలావళు
ల్వరుసఁ జెలంగుమాధవుఁడు వావిరి నవ్వనలక్ష్మి కెంతయున్
గురుతుగఁ బ్రేమతోడుతను గూర్చి యొసంగిన శోణనీరజ
స్ఫురదసితోత్పలౌఘములఁ బొల్పగుమాలికలో యనం గడున్.


రగడ.

మఱియుఁ జివురించు నెలమావులను రావులను | బొరిపొరిని విలసిల్లు పూవులను దావులను
సొలయుచును జారుతరసూనముల లీనములఁ | దలరు నిందిందిరవితానముల గానముల
నారూఢఫలరసాహారముల బీరములఁ | కేరి పొలుపారుమదకీరముల వారములఁ
బగలు రేయి లతాగ్రభాగముల భోగములఁ | బొగరెక్కి కూయుపికపూగముల రాగముల
మాటికిని బొదరిళ్ళమాటులను నీటులను | గూటములఁ బెనగుసురకోటులను బోటులను
దానకములైన మందారముల తీరముల | మావైన పుప్పొడిదుమారముల పూరముల
మరిగి విద్యాధరకుమారికల చేరికల | సరసగతి నలరారుశారికల కోరికల
విరివి మీరఁగ నెపుడు వేదముల నాదముల | మొరయు మునిజనుల సమ్మోదముల వాదముల
నయమొప్ప సంతతానందముల డెందములఁ | బ్రియలీలఁ దగువరూబృందముల చందముల

బలమయినపూఁదేనెవానలను గోనలను | జెలఁగి తడియునిలింపసేనలను జానలను
దరుచైన ఘనసారతరువులను దొరువులను | దిరమైన వలచదురుతెరువులను విరువులను
నెరిఁబూచు సంపెంగనీడలను వాడలను | సరవిఁ దిరిగెడు చెలులజాడలను క్రీడలను
దొలఁగ కతిమందవాతూలముల లోలముల | నలరియాడెడుమహావ్యాళముల జాలములఁ
దొడరి మార్గములెల్లఁ దుండముల కాండములఁ | దడిపి విలసిల్లు వేదండముల తండముల
బరగు గిరిచెంగటను బాత్రమున గోత్రమున | మరలక వసంత మతిమాత్రమున సూత్రమున


క.

వెండియుఁ బ్రచండమండల | మండితమార్తాండకరసమంచితమై యు
ద్దండజగదండభయదా | ఖండగతి న్గ్రీష్మఋతువు కడునొప్పారెన్.


మఱియు మింటనంటిన యమ్మహీధరంబు జంటన శక్రచాపంబులం బన్ని చెన్నుగఁ
గారుగ్రమ్ముచున్న పెనుమబ్బులును, మబ్బుల నిబ్బరంబుగాక యబ్బరంబుగా గొ
బ్బున మెఱసిమఱలి చనుక్రొక్కారుమెఱుంగులును, మెఱుంగులరంగు గుబ్బునం
గనుంగొని యంతరంగంబునఁ బ్రియాంగనల మేనుల మెఱుంగులఁ దలంచి యల్లన
నుల్లంబులు ఝల్లన నొల్లంబోయి మల్లడిగొని తల్లడిల్లెడు పాంథవ్యూహంబుల గే
హినులకు మోహంబలరఁ బ్రియులరాక యెఱింగించుతెఱంగున ఘోషించు ఘన
తరస్తనితంబులును, స్తనితశ్రుతిజనితకుతూహలార్హంబులగు బర్హంబులు వి
ప్పి తప్పక నర్తనంబులు సేయు నీలకంఠంబులును, నీలకంఠధ్వానంబులు హీనం
బులుగాక సోకిన లీనంబులై యుండు భీకరదర్వీకరానీకంబులును, దర్వీకరానీకం
బుల నొక్కొక్కతఱి నాలోకించి మూకలై పారుభేకంబులును, భేకంబుల శోకం
బులఁ బాపి లోకంబు లేకంబు సేయుకరణి నదీహ్రదంబులు నిండి యఖండంబులై పా
రునట్లుగా గురియు నవారితవారిధారాపరంపరలును, వారిధారాపరంపరల వలన
నుండి మెండుగఁ దండంబులై పుడమి ముద్దియకు సమయనాయకుం డొసంగిన నూ
త్నహారరత్నంబులనబడు కరకలును, కరకల సరకుగొనక యిరికి జలబిందువు లం
దంబుగాఁ గ్రోలి సోలిన చాతకవ్రాతంబులును, చాతకవ్రాతంబుల కౌతుకం బలరె
నని దిశల నెఱింగించువిధంబునం బఱచుకేతకీగంధబంధురగంధవాహంబులును,
గంధవాహంబులకుఁ జలింపక పెంపున గుంపులై మృగయావిహారలంపటంబునఁ
గ్రుమ్మరు కిరాతులును, కిరాతయువతీచరణపంకజసంకలితకుంకుమాంకిత
పంకంబులగు తెరువులును, తెరువులం బరువులై విరుపులుగఁ బూసి మురువు లలరు క
దంబతరువులును, తరువుల నిరవులు చేసి మొల్లంబుగఁ బిల్లల నిడి యుల్లసిల్లు ఖగం

బులును, ఖగపోతంబులకు మేతలిడు దాతలనందగి నానాకీటకకోటులం బాటిల్లు
పచ్చికపట్టులును, పచ్చికపట్టుల దట్టంబులై మురకతప్రదేశంబుల భాసిల్లు పద్మ
రాగంబుల చెలువున నలరు నింద్రగోపంబులును, గలిగి వితరణహస్తంబునుంబో
లె నిరంతరవారిధారాకరంబై, మహాశైలగేహంబునుంబోలె సమంచితనీలకంఠశ
బ్దంబై, దివ్యజ్ఞానమూర్తియుంబోలె వికసితసుమనోక్తంబై, యుత్కర్షంబునఁ
గర్షకహర్షదంబగు వర్షాగమంబు నొప్పునొక్కభాగంబున.


చ.

కొలకులఁ బద్మముల్ తొనలుకోమలకాంతిఁ జెలంగ సస్యము
ల్ఫలపతితంబులై పొదల భవ్యవిపాండురలీల మీరు చు
క్కలదొరఱేలు వెన్నెలలు గాయఁగ వేల్పులత్రోవ చాల ని
ర్మలత వహింప నందుల శరత్సమయం బలరారు నొక్కెడన్.


సీ.

ఉత్తరానిలముల మొత్తంబు లలరారె సాంద్రతుషారవర్షంబు గురియ
లీల మీర రసాలసాలము ల్ననలెత్తె నదు లెల్ల నింకి కాల్నడలు గాఁగఁ
జలికి నోడిన భంగి శాంతరూపము దాల్చె చండభానుఁడు వేగ జరుగుచుండఁ
గొమ్మలగుబ్బచన్గొండలదండల నెల్లవారును మని రుల్లపిల్ల
దెఱవలకు నంగజునికేళిఁ దృప్తి యలరఁ | జేయవలెనని తలఁచి నిల్చెడువిధమున
యామినులు దీర్ఘముల మీర నన్నగమున | నలరు హేమంతఋతు వొక్కతలమునందు.


వ.

మఱియు నమందసుందర కుందబృందనిష్యందన్మరందపానానందితహృదర
విందేందిందిరసందోహంబగు శిశిరసమయంబున నొక్కభాగంబునఁ గలిగి, యి
ట్లు షడృతువులుం దప్పక యెప్పుడును వర్తింపనలవిగాక మనోహరంబై చెలంగు న
మ్మహీధరాగ్రభాగంబున.


సీ.

మరకతహరినీలమౌక్తికాంబుజరాగ వజ్రవైడూర్యప్రకాశపుష్య
రాగగోమేధికరత్నసంస్థాపిత మహితకాంచనదివ్యమందిరముల
శక్రాదిదిక్పతు ల్సరనితో సేవింప ప్రమథగణంబులు బలిసి కొలువ
వీరభద్రకుమారవిఘ్నరాజవిరించిజలజనేత్రాదులు చనువు నెఱపఁ
గశ్యపాగస్త్యమాండవ్యగౌతమాత్రి | వాలఖిల్యభరద్వాజవామదేవ
గాలవవశిష్ఠమైత్రేయకణ్వముఖ్యు | లైనమునిసంఘములు భక్తి నభినుతింప


వ.

మఱియును.


సీ.

గొనకొని స శివ ఏకో దేవ యంచును సరవితోఁ బల్కెడుశారికలును

దత్వరీతిని శివా త్పరతరం నాస్తి యం చాడెఁడుమదమదాళావళియును
హర వామదేవ మహాదేవ యని భక్తిఁ గీర్తించుఘనరాజకీరములును
భర్గ శంకర పరబ్రహ్మ త్రినేత్ర యం చారయఁ గేరుమయూరతతులు
నభవ భూతేశ హరివిరించ్యర్చితాంఘ్రి | పంకరుహయుగ్మయని కేరుపరభృతములు
గలిగి యభినవశృంగారగరిమఁ దనరి | మహితగతి నొప్పు శశిమౌళిమందిరంబు.


క.

అద్దివ్యధామమెంతయు | నుద్దామతఁ జొచ్చి యందు నొకచెంగటఁ దా
నుద్దీపితమణిమయమగు | గద్దియపై సౌఖ్యలీలఁ గదిసినవానిన్.


సీ.

ఘనరత్నరజితకాంచనభూషణవ్రాత సతతవిశాలయశస్సమేత
నిజభక్తలోకమానితకల్పభూజాత భూరికారుణ్యవిస్ఫురితచరిత
మహిషదానవగర్వమర్దనవిఖ్యాత ముదితాప్సరీజనముదితగీత
కమనీయతరదివ్యకరధృతశుకపోత వితతకటాక్షపోషితవిధాత
బుధజనవ్రాత కేవలభువనభూత | యగుమహాసితనగజాతనమితపూత
నభినవానందబంధురస్వాంతుఁ డగుచుఁ | గనియె సురమౌని కన్నులకరువు దీర.


సీ.

సర్వగీర్వాణప్రచయన మర్చితదివ్యచరణారవింద యేహరిణనేత్ర
హారహీరపటీరతారకాహిమచారుకీర్తివిస్తార యేకీరవాణి
నతతమానితదానజనగృహాంగణనవ్యకల్పభూజాత యేకంబుకంఠి
నమరారిసందోహసంహారకరలనద్విక్రమోల్లాస యేవిధునిభాస్య
చిరతరైశ్వర్యయుక్తయే చిగురుబోణి | విమలసౌందర్యమూర్తి యేద్విరదయాన
భూరికారుణ్యచిత్త యేపుష్పగంధి | యట్టిశర్వాణి నతిభక్తి నభినుతింతు.


మ.

సురరాజార్చితపాదపద్మయుగళీ! సూరిస్తవానందినీ!
శరదిందుప్రతిమానసుందరముఖీ! చంచత్కురంగేక్షణీ!
పరదైతేయభయంకరీ! శివకరీ! బ్రహ్మాండభాండోదరీ!
దురితవ్రాతలసన్మతంగజహరీ! దుర్గా! జగత్పావనీ!


తోటకవృత్తం.

జయ శాంకరి భూరియశస్స్ఫురితా | జయ సర్వవరప్రదసాధుమతా
జయ సంతతపావనిశర్వరతా | జయ చంద్రధరప్రియశైలసుతా.


చ.

అని వినుతించుచున్నఁ గని యంబిక యిట్లను నోమునీంద్ర! నీ
వెనయగ నెందునుండి యిట కిప్పుడు రాక జగంబులందు స
జ్జనులగువారివార్తలు నిజంబుగ వేగ నెఱుంగఁ బల్కవే

యనవుఁడు నారదుండు వినయంబునఁ జెప్పఁదొణంగెఁ బొంగుచున్.


మ.

విను శర్వాణీ! యశేషలోకములు నే వీక్షించితిం గాని ధా
త్రిని మర్త్యు ల్కడుశంభుభక్తినియతిం దీపించుచు న్నిత్యసం
జనితానందము నొంది రందు నొళయాశ్చర్యంబుఁ గన్గొంటినో
జననీ! సత్కృపఁ జిత్తగింపు మది విస్పష్టంబుఁగాఁ దెల్పెదన్.


సీ.

ఘనత మీరఁగ సింధుకటకం బనఁగ నొప్పు పురవర మొక్కటి ధరణియందు
నప్పట్టణం బేలు నమితకృపాస్వాంతుఁ డర్కవంశజుండు భర్మాద్రిధీరుఁ
డనుదినశైవవ్రతాధారశీలుండు భల్లాణుఁడను రాజు భక్తి మిగుల
నడుగనిజంగానకలరగా నొట్టగు నడిగిన లేదన్న నదియె తనకు
నని దిశలనెల్లఁ జాటించి యద్భుతముగఁ | దనదు మొగసాల నందంబుఁ దనర గంట
వ్రేలఁగట్టించె నంతయు వేడ్కతోడ | నెద్ది వేడిన నరుల కిచ్చుచుండు.


గీ

మఱువఁ డెపుడైన శివనామమంత్రజపము | వెఱవఁ డెందైన నర్థులు వేడుటకును
బఱవఁ డరిసంఘములకు సంగరమునందు | గిరిశపదభక్తినిరతుండు నరవరుండు.


క.

కోప మనికైన లే ద | ర్కోప మనిరతప్రతాపుఁ డొగి నీతనికిం
గోపమని తలఁచి శాత్రవ | భూపతు లరుగుదురు తమదుపురవరములకున్.


గీ.

అద్ధరాధీశునగరిసమృద్ధి యతని | భక్తిమార్గంబు భాసురయుక్తిఁ దెలిసి
మీకు నెఱిఁగింపవచ్చితిఁ బ్రాకటముగ | సమదపికవాణి! శర్వాణి! జలజపాణి!


ఉ.

నావుఁడు శైలపుత్రి మునినాథునిపల్కుల కాత్మలోన నెం
తో వెఱగంది సంతసముతో నపు డాతని వీడుకొల్పి భ
క్తావళిఁ బ్రోచుతత్పరత నందము మీరఁ బయోరుహాక్షి యా
భావజగర్వభంజనునిపాలికి శీఘ్రమ యేగి యిట్లనున్.


సీ.

జయ జయ ఫణిహార! సర్వలోకాధార| జయ జయ నగచాప! శశిశలాప!
జయ భ క్తసురభూజ! సంతతోజ్జ్వలతేజ! జయ మహోన్నతవేష! సాధుపోష!
జయ మౌనిజనపాల! సామగానవిలోల! జయ చక్రధరబాణ! శరధితూణ!
జయ చారుదరహాస! సామజాజిశవాస! జయ విధుస్తుతిపాత్ర! సత్వవిత్ర!
జియజయ సురవముఖ్యనిర్జరకదంబ | భర్మమకుటాగ్రసుఘటితప్రకటరత్న
చిత్రరత్నపభావిభాసితసుదివ్య | చరణపద్మద్వయోల్లాస! జయ మహేశ!


వనమయూరవృత్తం.

సామజహరా హరతుషారకరభూషా

కామితఫలప్రదజగద్విదితవేషా
తామరససంభవనుతా గగనకేశా
నీ మహిమలేఁ బొగడ నేర్తునె గిరీశా.


క.

జగములు వడిఁ బుట్టింపను | దగ నంరక్షింప నణఁప దైవ మవని ని
న్బొగడునుగాదె ముదంబున | నిగమంబులు దేవదేవ! నీలగ్రీవా!


క.

అరయ నొకవార్త విని మీ | కెఱిఁగింపఁగ వచ్చితి నిపు డెంతయు వేడ్కం
బరిపాటిఁ జిత్తగింపుము | పరమేశా! నగనివేశ! భవ్యవిలాసా!


క.

హెచ్చుగఁ గొల్చినవారికి మెచ్చుగ నర్ధాంగమయిన మిగులంగృపతో
నిచ్చుఘనమైనదేవుఁడ | వచ్చుగ నినుఁ బొగడఁ దరమె యవ్విధికైనన్.


సీ

దంటయై యొకఁడు నేత్రమున ని న్బూజించె వింట నొక్కఁడు గొట్టె వెఱపులేక
యింట గావలినుంచె నిరవుగా ని న్నొక్కఁ డొంటిగా దండెత్తె నొకఁడు గినిసి
కంటకం బలర ఱోకట గుమ్మె నొక్కఁడు కుంటెన ని న్నంపెఁ గోర్కి నొకఁడు
గొంటితనమున ఱాల్గొని ఱొప్పె నొకఁడు ని న్నొంటిగ వెలిఁజేసె నొకఁడు పూని
మఱియు నిటమీద నద్భుతకరము గాఁగ | నొక్కభక్తుండు ధాత్రిపై నిక్కముగను
నిన్నుఁ గొల్చుచునున్నాఁడు చెన్నమీర | నతనిమహిమము నెఱిఁగింతు నభవ! వినుము.


క.

నెరి సింధుకటక మనియెడు | పురియేలునృపాలుఁ డమితపుణ్యుఁడు తగ నీ
శ్వరభక్తుఁడు భల్లాణుం | డరయగ సతతంబు జంగమార్చనపరుఁడై.


అడుగకయున్నజంగమున కారయ నొట్టగుఁగోర్కె మీరఁగా
నడిగిన నియ్యకున్నయెడ నట్లె యగుం దన కంచుఁ బల్కి తా
నెడతెగ కెద్దియైన వడి నిచ్చుచు గర్వముతోడ నున్నవాఁ
డుడుపతిసత్కిరీట! కమలోదరపూజిత! భక్తవత్సలా!


గీ.

అతనిపట్టణమునకు నీ వరుగుదెంచి | సరవిఁ దద్భక్తిమార్గంబు లరసిచూచి
రమ్ము వేవేగ నని గిరిరాజుపుత్రి | పల్కు టయు మోదమున నుండె భర్గుఁ డపుడు.


క.

అద్భుతము నొంద నేటికి | మద్భక్తులజాడ లెఱుఁగ మదవతి! సరసీజోద్భవహరిజంభాసుర | జిద్భోగీంద్రులకుఁ దరమె? చిరతరయుక్తిన్


క.

నాకన్న నధికు లెన్నఁగ | లోకానీకంబులెల్ల లోఁగొనఁగలరో
కోకస్తని! మద్దాసులు | చేకొని యెటు లాడుచున్నఁ జెల్లుంజుమ్మీ!


ఉ.

నిక్కముఁ దెల్సెద న్వినుము నీరజనేత్ర! విధాతకేనియుం

జిక్క నొకింతభక్తునికిఁ జిక్కినపద్ధతి నట్టు లౌటచే
మిక్కిలిభక్తి న న్గొలిచి మీరి నరుండు విధూతపాపుఁడై
పెక్కువిధంబుల న్మహినిఁ బేర్మి వహించు నుదగ్రలీలలన్.


గీ.

అశ్వమేధాదియాగంబులైన ధేను | భూహిరణ్యేభహయతులాపురుషశకట
ముఖ్యదానంబులైన నో మోహనాంగి | సరవి మద్భక్తి కింతైన సరియె చెపుమ!


క.

అలిగినచో విధినైనం | దలఁద్రుంతు నిజంబుమీర దయ చేసినచోఁ
దలఁదాల్తు నెపుడు వేడుక | లలర గురుద్రోహినైన నంబుజనేత్రా!


క.

కంటికి రెప్పవలె న్వా | ల్గంటిరొ! మద్భక్తవరునిఁ గాఁచుకొఱకు వె
న్వెంటం దిరుగుదు నెప్పుడు వింటే | చర్చింప నిఁకను వే యేమిటికిన్.


ఉ.

కావున నీదువాక్యమును గాదన కిప్పుడ యేగుదెంచి త
ద్భూవరుభక్తి చూచుటకుఁ దోడ్కొని శీఘ్రము గాఁగ వత్తు ని
చ్చో వరవర్ణిను ల్గొలువ శోభనలీల వసింపు మింపుతో
నీ వని పల్కి యద్రిసుత నెమ్మది నమ్మతి చేసి యంతటన్.


గీ.

హరిసురేశాబ్జసంభవా ద్యమరవరుల | వేడ్కమీఱఁగ నప్పుడే వీడుకొలిపి
కొలువు చాలించి వేవేగ నిలకు డిగ్గి | తనర భల్లాణువీటికిఁ జనుచునుండె.


క.

చనిచని కనె శివుఁ డొకచో | ఘనతరకల్లోలమాలికాపరిభాసి
న్వినుతయశోరాశిం ద్రిభు | వనదురితవినాశిఁ బృథులవణవారాశిన్.


సీ

వేలాతలోదంచదేలాలతాగ్రాతి హేలావిలోలాళిజాలకంబు
శుంభత్క్రియారంభకుంభీవనగ్రాహ కుంభీరసంరంభజృంభితంబు
రంగన్మహోత్తుంగభంగావళితట శృంగారితాంభోమతంగకులము
భూరిప్రకారసంచారఛారాధర వారచారుతరప్రతీరభూమి
కలితబలయుతఘనతిమింగిలవిలాస | చలనసతతస్ఫుటీకృతఝషజలూక
భేకకర్కటకమఠనీహాకశుక్తి | శంఖవరరత్నసంఘ మాసాగరంబు.


చ.

సకలజగంబుల న్మనుచుసామికి నీకు నినం బొసంగె నే
ప్రకటితలీల నంచు నల పాల్కడలి న్నిరసించి తాఁబురాం
తకునకుఁ గాన్క లియ్యగ ముదంబునఁ బట్టు సుధాసముత్కరం
బకొ యన నొప్పు ఫేనతతి బాగుగ నజ్జలరాశి నెంతయున్.


లయగ్రాహి.

ఇమ్ములగు ఘూర్నితరవమ్ములు మృదంగనినదమ్ములుగ నండజచయమ్ము లరుతమ్ము

ల్క్రమ్ముకొని గీతపురవ మ్మరుగ సారెకుఁ బ్లవమ్ములధ్వనుల్ ఘనరవమ్ములుగ మ్రోయ
న్నెమ్మి యలరార నటనమ్ము లొనరించు నలకొమ్మలో యనంగఁ జెలువమ్ము గన కూపా
రమ్మునఁ జెలంగు నిరతమ్మును విలాసగతిఁ ద్రిమ్మరుచు వీచిక లొకుమ్మడినిఁ జూడన్.


చ.

సలలితనూత్నరత్నమయసైకతము ల్విలసిల్లు నచ్చటం
గలితబలాకజాలములఖండగతి న్వసియింపఁజాల ని
మ్ముల మణిమేఖలాఘటితముం బరిశుద్ధనవీనచేలముం
గలజలజాక్షి చొక్కపునిగారపుగొప్పపిఱు౦దులో యనన్.


జాలరు పువ్వుబోణులు వెసం దమబిత్తరివాలుగన్నులం
బోలిక చేసియో యనఁగఁ బూనికె వాలికె గండుమీల బ
ల్గాలమునందుఁ గ్రుత్తు రధికంబగు కోరిక మీరఁబట్టి దా
రేలలు వాడుకొంచు మది కింపుగ నవ్వనరాశిచెంతలన్.


శా.

ఆరత్నాకరతీరభూములు సముద్యల్లాంగలీతాళజం
బీరామ్రక్రముకప్రవాళకదళీబిల్వామ్లకాకేతకీ
సారంగప్రముఖాఖిలాగమవితానచ్ఛాయలం దెల్లఁ బ
ల్మారుం గోర్కెల విశ్రమింపుచును లీలన్ శూలి దా నంతటన్.


సీ

రమణీయమౌక్తికరచితసౌధంబులు మేలైనహరినీలజాలకములు
విమలచంద్రోపలవేదికాస్థలములు గురుతరాంబుజరాగకుడ్యములును
సురుచిరవైడూర్యసోపానవితతులు పాటింప వజ్రకవాటములును
బటుపుష్యరాగసంఘటితార్గళంబులు భూరిగారుత్మతద్వారములును
శుంభదున్నతవిద్రుమస్తంభములును | గలితసంతతశృంగారగరిమతోడఁ
బొలుపు మీరెడుభల్లాణపురవరంబుఁ | దగఁ బ్రవేశించె నగ్గజదైత్యహరుఁడు.


అప్పురవీథిం జనుచోఁ | గప్పురము జవాది యగరు కస్తురియును
గుప్పలుగ నుంచి యమ్మెడు గొప్పవసారములు గాంచె గురుఁ డొకచోటన్.


చ.

నిరుపమరత్నపుంజరమణీయతలేందుశిలావితర్ది పై
నరయ సమస్తవస్తువులు నమ్మెడు వైశ్యునిఁ జూచి శూలి తా
నురుమణిశృంగసంగరజితోర్విధరాంచితమధ్యసీమయం
దిరువుగ నుండునట్టి యలకేశ్వరుఁ బోలినవాని నొక్కెడన్.


క.

హాటకమయచిత్రాంబర | కోటులు మేటులుగ నుంచి గుఱుతుగ నెపుడు

న్బాటించి యమ్ముచుండెడు | చోటులు గనె నొకట నందు జూటుఁడు వీటన్.


క.

పొంగారువేడ్కతోడన్ | జంగమరాజాంగదుండు వెసఁ గనుఁగొనియెన్
రంగత్తురంగఘనమా | తంగశతాంగముల గములఁ దగ నొకచోటన్.


చ.

కనుఁగొనె నొక్కచోట నవకాంచనరత్నసమందదూర్మికా
ఘనతరమేఘలాకటకకంకణకంఠవిభూషణాది మం
డననిచయంబు నెంతయు దృఢంబుగ నిల్పి క్రయించుచోటులం
దునఁ దుదిలేనివేడుకలతో నలరారి పురారి సారెకున్.


చ.

ఒనరఁగ విప్రకాంతల సమున్నతదేహరుచుల్ తటిద్రుచుల్
ఘనతరవేదనాదములు గర్జితము ల్పటుహెూమధూమముల్
తనరఁగ నీలనీరదకదంబము లంచు గృహాహిభుక్తతు
ల్పనివడి వే నటింపఁగనె బ్రాహ్మణవీథిఁ గపర్ది యొక్కెడన్.


వ.

మఱియును గరితురగరథారోహణాస్త్రశస్త్రవిద్యాభ్యాసపరాయణజనభాసురంబుల
గు క్షత్రియనివాసంబులును, ధనకనకాంబరప్రముఖసమస్తవస్తుసుందరంబుల
గు వైశ్యమందిరంబులును, గోమహిషోష్ట్రఛాగాద్యఖిలపశుసమూహంబులగు
శూద్రగేహంబులును, గంధపుష్పాక్షతధూపదీపఫలరసాపూపోపహారసమేతంబుల
గు దేవతానికేతనంబులును, కలితమణిగణకిరణవిస్ఫారంబులగు కాంచనప్రా
కారంబులును, ఝషకమఠకర్కటగ్రాహమహోరగభీకరభేకానీకకుముద
కల్హారసారసప్రచయవిశాలంబులగు పరిఘాజాలంబులును, సమంచితనూత్ననవర
త్నమాలికలగు కపోతపాలికలుచు, ముక్తాఫలచూర్ణరంగద్రంగవల్లికాసంగతంబు
లగు వితర్దికాప్రాంగణంబులును, లీలావిలాససంచారసుందరీసందోహసౌధశిఖ
రంబులుమ, నిరంతరపల్లవితకోరకితపుష్పితఫలితలలితక్రియాప్రమోదితశుక
పికమధుకరనికరప్రకటారవభావమానంబులగు నుద్యానవనంబులును, గ్రమక్ర
ముంబునఁ జూచుచుఁ బ్రచ్ఛన్నవేషంబునం జని మరియు.


చ.

రతిపతిపువ్వుదోట యొనరంగ భుజంగుల కొడ్డుమీట సం
తరమదనజ్వరంబునకు దట్టపుమందులమూట సౌఖ్యసం
హతులకు బల్కరాట మిరవై తగునప్పురి నొక్కచోట శో
భితగతిఁ జెంది వేశ్యతతి పేటబుధు ల్నుతిసేయ నేటగున్.


సీ.

చిత్తజాతుఁడు విటశ్రేణి కాసలు గొల్పఁ బూని నిల్పిన పైడిబొమ్మ లనఁగఁ

జెలువొప్ప రతికాంతచే విలాసప్రౌఢిఁ బరగుచేమంతిపూబంతు లనఁగఁ
బొలుపుఁగాఁ బరిపూర్ణపూర్ణిమారాత్రుల నలరారుశీతాంశుకళ లనంగ
జగము లామోదింపఁ జతురాస్యుఁ డొనరింపఁ దనరారుమించుటద్దము లనంగ
బాగుమీరినపగడంపుఁదీఁగె లనఁగ | నొఱపు గలిగినతొలుకరిమెఱుపు లనఁగ
రూపలావణ్యయావనరూఢి నలరి | యందముగ వారభామిను లుందు రందు.


సీ.

అళులు తామరలు చెల్వారుమారునివిండ్లు కలువరేకులు మంచిగంధఫలులు
కుందము ల్కెంపునిం పొందునద్దంబులు శ్రీలుశిరీషము ల్చిగురుటాకు
లలశంఖములు జక్కవలు నీలసర్పము ల్వీచులు సింగము ల్వెలయుగొలఁకు
లిసుకదిన్నియలు బా గెసఁగు దింటెనవిరు ల్కరికరాలుకలమగర్భములును
గచ్ఛపంబులు నొనఁగూర్చి కమలభవుఁడు | మిగుల నేరుపు దనర నిర్మింపఁబోలు
భూరిశృంగారగరిమచేఁ బేరు గలిగి | యలరు నమ్మించుబోణులయవయవములు.


గీ.

అతులగతులఁ బతుల నత్యుపరతులసం | గతులచేఁ బ్రమోదయుతులఁ జేసి
నుతులఁ దనరు రూపవతులగు నవ్వార | సతులప్రతులు గలరె క్షితులయందు?


ఉ.

ఆనవపానయోషిదధరామృతపాననవోపగూహనో
ల్లానముల న్పమంచితవిలాసముల న్మృదుగంధసారపు
న్వాసనల న్బ్రహాసముల వావిరి నగ్గజరాజయానల
న్భాసురలీలఁ గూడుకొని పల్లవసంఘము లుందు రందఱున్.


క.

ద్యూతంబుల మృదుతరసం | గీతంబులచేత మఱియుఁ గేరుచు విటసం
ఘాతంబులు వసియింతురు | జీతంబులు లేక కొల్చుచెల్వున నెపుడున్.


చ.

మదనకిరాతతీవ్రతరమార్గణపంక్తుల కాత్మ నెంతయుం
గదిసినభీతిఁ బల్లవమృగంబులు వారవరూప్రదేశము
ల్కుదురుఁగఁ జేరి గుబ్బచనుఁగొండలచాటున దాఁగరాఁగఁ ద
త్సదనములందు బెబ్బులులచాడ్పున వేశ్యలతల్లు లుం డ్రొగిన్.


వ.

అని వేశ్యవాటంబు వాటంబుగాఁ బ్రవేశించి శశిజూటుం డందుల బోటులనెల్ల నొ
క్కచోటికి రావించి.


సీ.

బన్నవరంబులు పచ్చలకడియంబు లాణిముత్తెపుఁబేరు లందియలును
గమ్మలు బలిరెలు గంటలమొలనూళ్ళు రంగైనభుజకీర్తు లుంగరములు
మొగపులతీగెలు పొగడలు బావిలీ ల్నీలంపుముంగర ల్నేవళములు

చెవులపువ్వులు మంచిచేర్చుక్కబొట్టులు సాగపొప్పుబంగారుమొగలిరేకు
లాదిగాఁగల్గుదివ్యభూషావళియును | వన్నెచీరెలు ఱవికెలు వలసినంత
విత్తమును వేగ నొసఁగె నవ్వెలఁదులకును | గట్టుగమిఱేనిగారాపుపట్టిమగఁడు.


చ.

అటుల నొసంగి యొక్కకనకాంబుజపత్రవిశాలనేత్రకుం
బటుతరకామశాస్త్రచయపారగుఁ డై విలసిలునట్టి స
ద్విటు నొకనొక్కని న్మిగులవేడుకతో నొనఁగూర్చి వారిఁ బ్ర
స్ఫుటరతికేళిసౌఖ్యములఁ బూని వసింపఁగఁజేసె వాసిగన్.


గీ.

కూర్మిఁ బల్లవకోటి నక్కొమ్మలకునుఁ | దనర నొనఁగూర్చినట్టిమాధవునిలీలఁ
గూర్మిఁ బల్లవకోటి నక్కొమ్మలకును | దనరనౌ నఁ గూర్చేనయ్యుమాధవుఁడువేనను.


మత్తకోకిల.

మానితంబుగ లోకము ల్నిజమాయచేఁ బలుమారును
న్బూని మోహము నొందఁజేసి వినోదదైఖరిఁ గేరు త
ద్భానుకోటిసమానతేజుఁడు బాగుమీరఁగ నయ్యెడం
దానును న్విటజంగమాకృతిఁ దాల్చె నెంతయు వేడుకన్.


చ.

నెఱవుల తేటిగుంపుల గణింపఁగజా ల్నునుసోగవెండ్రుక
ల్నెఱిఁ గొనగోళ్ళ దువ్వికొని నేర్పలర న్సిగవైచి యాపయిం
దఱుచుగ మేలిబంగరపుతాయెతులు న్విరిదండ లుంగరం
బఱుదుగఁ జుట్టి పూనెఁ జెలువార శిరోంశుక మింపుమీరఁగన్.


చ.

మనుపగునిల్వుటద్దముఁ గనుంగొని సన్నపుభూతిరేఖ యొ
య్యన సొగసొప్ప నెన్నుదుటియందునఁ దీరిచి చూచునప్పురీ
జనులకు సొంపుగా బొమలసందున జంత్రపుచుక్కబొట్టు నే
ర్పున నిడె నమ్మహేశ్వరుఁడు పొల్పగుమిక్కిలికంటి వైఖరిన్.


క.

గండస్థలదీధితులకు | పండుగవిం దొసఁగుగతి నమితతరశోభా
తుండితవరకాంచనమణి | కుండలయుగళంబుఁ దాల్చెఁ గొమరు దలిర్పన్.


గీ.

కనకభూషణహరినీలకాంతితతుల | తోడ జోడుగఁ గూడుకొ క్రీడ సేయు
కరణిఁ దనరెడురుచులఁ జొక్కముగ మెఱయు | బవిరిగడ్డంబు సొగసు లేర్పడఁగ దువ్వె.


వ.

మఱియును.


సీ.

మణిమయోజ్వలవిభూషణము లొప్పుగఁ దాల్చి గట్టిగాఁ గటి బట్ట దట్టిఁ జట్టి,
జిలుగుబంగరుశాలు వలెవాటుఁ గావించి మేదురంబుగ భూతి మేన నలఁది

సజ్జిలింగము సూత్రజన్నిదంబులు బూని రుద్రాక్షమాలిక ల్రూఢి నించి
గండపెండెరమును గంటలు జంగులు గిలుకుపావలును జెల్వడరఁ దొడిగి
చెలఁగి నెలవంకకత్తియుఁ జేకటారి | గుఱుతుఁగ నఱుతఁ గడుమొల్లవిరిసరులును
వెలయఁ గెంజేత శూలంబుఁ గల్గి | గరళకంఠుఁ డలరొందె మోహనాకారలీల.


గీ.

మొదల పారద మొనరించి పిదపఁ దన్నుఁ | దవిలి సాధింప నయ్యవతారమునను
దాల్చు నల కేతకీగర్భదళము లనఁగ | మారవైరికి వాలారుగోరు లలరె.


ఉ.

చెక్కులదక్కులం మిగులఁ జెల్వగుమోవినిఁ బంటినొక్కులం
జొక్కులటెక్కులం బెళుకుచూపులఁ జెన్నగుచిన్నినవ్వులం
జక్కగ నిక్కుమక్కువలఁజక్కెర లొక్కటఁ జిల్కుపల్కులం
గ్రక్కున నెల్లవారలకుఁ గామవికారవిహార మేర్పడెన్.


సీ.

ఒకభృత్యుఁ డురుయుక్తి జికిలినిద్దపుటద్ద మొగిఁబూని నీడబా గొనరఁ జూప
నొకసేవకుఁడు క్రేవ నకలంకమతిఁ జెల్వు మెఱయ నేరుపునఁ జామరము వీవ
నొకదాసుఁ డభిలాష మొదవంగఁ గపురంపుతమలంబు వేమారు తవిలి యొసఁగ
నొకకింకరుఁడు పొంక మొప్పఁ జెంతల నుండి భూషణానీకము ల్పొందుపఱుప
మఱియు నొకభక్తుఁ డత్యంతమధురగీత | రవముఁ గావింప నెంతయురభసమునను
జారుసౌందర్యరేఖాప్రశస్తుఁ డగుచుఁ | దనరి జంగంబు బురవీథిఁ జనుచునుండె.


వ.

అట్టియెడ.


ఉ.

నీరజగంధు లిందుమణినిర్మితనిర్మలభర్మహర్మ్యవి
స్తారతరాగ్రభాగములఁ దా రలరం జరియింపుచుండి సిం
కారము మీఱు నవ్విటశిఖామణిచెల్వముఁ గాంచి యెంతయు
న్మారవికారసంచలితమానసలై తమకించి రందఱున్.


క.

మఱియును బౌరవధూమణు | లఱుదుగ నమ్మిండజంగమయ్య యొయారం
బిఱుపుఁగ గనుఁగొనుటకుఁ ద | త్తరమునఁ బఱతెంచి రధికతత్పరమతులై.


ఉ.

ప్రేమఁబడంతియోర్తు మకరీమయపత్రము నంద మొప్ప ను
ద్దామగతిం గుచాగ్రములఁ దా నిడికొంచు వసించి యవ్విట
గ్రామణిఁ జూడఁ బయ్యెదఁ దిరంబుగఁ జేర్పక వచ్చెఁ గాన్క లా
స్వామికి రత్నకీలితసువర్ణపుబంతులు దెచ్చెనో యనన్.


ఉ.

ఒల్లె చెఱుంగుపై నడలి యుర్విపయి న్నటియింప లీల ధ

మ్మిల్లము జారి మల్లికలు మెల్లన నెల్లెడలందు డుల్లఁగాఁ
బల్లవపాణియోర్తు కచభారఛలల్లలితావలగ్నయై
యల్లన నేరుదెంచెఁ గుసుమాయుధసన్నిభుఁ జూఁడ వేడుకన్.


క.

నెరి నొడ్డాణము గళమునఁ | దిరముగ ధరియించి మెఱుఁగుఁదీఁగెఁ గడుం భా
సురగతి నడుమున నిడి యొక | హరిమధ్య మహేశుఁ జూడ నరుతెంచె వడిన్.


క.

బాలునిఁ బాలకుఁ బిలుచుచు | లీలం గరయుగము సాచి లేమయొకతె య
ట్లాలింగనఁ గన వేగం | బాలింగన మొనఁగవచ్చునటు లరుదెంచెన్.


సీ.

కమనీయసౌవర్ణకర్ణకాపత్రద్యుతు ల్తళుకులేఁజెక్కుటద్దములమీదఁ
జోరుముక్తాహారభూరిశోభావళు ల్ప్రకటవక్షోజకుంభములమీదఁ
బటువైన మేఖలాఘటితరత్నప్రభల్ ఘనతరజఘనభాగంబుమీద
సురసనీలాభవిస్ఫురితవేణీరుచు ల్సలలితపృథుకటిస్ధలముమీద
జిలుగుచెంగావిపావడసిరులు మిగుల | చెల్వుగలచల్వవలువపైఁ బలువిధములఁ
గలిసి వర్తింప నొకశీతకరనిభాస్య | సరవి నరుదెంచె నమ్మహేశ్వరునిఁ జూడ.


మ.

ప్రమథాధీశునిఁ జూడ నొక్కచెలి శుంభత్ప్రరియ న్వచ్చుచో
నమర న్నవ్వుమొగంబుపైఁ గురులు చెల్వారెం గడు న్వీడి స
త్కమలేందీవరవజ్రపుష్పనవమాఖ్యప్రోల్లసద్రూపికా
సుమమధ్యంబుల సంచరించు మధుపస్తోమంబులో యన్గతిన్.


ఉ.

గొబ్బున గిబ్బ గబ్బిచనుగుబ్బలు జొబ్బిల నబ్బురంబుగా
నిబ్బర మొప్ప చందనము నేర్పునఁ బూసి వెలందియోర్తు చే
నుబ్బగ దివ్యసౌరభము లొక్కట దిక్కులఁ జిక్కి యెల్లెడం
బ్రబ్బ బొజుంగుజంగముఁ దిరంబుగఁ గన్గొనఁ జేరెఁ గేరుచున్.


సీ.

ఘనలీలం దనరారు నునుసోఁగవెండ్రుక ల్మేలైనసురరాజనీలములుగ
సదమలతరవిరాజి న్నఖాంకురములు ప్రకటితమౌక్తికప్రకరములుగ
సతతశోభాసమంచితదంతపంక్తులు వన్నె కెక్కిన మంచివజ్రములుగ
భూరిప్రభాపరిస్ఫురదధరోష్ఠంబు రమణీయతరపద్మరాగముగను
రతివధూమణీచే నూత్నరత్నఖచిత | మగుచుఁ జెలువొందు చొక్కఁపుజిగిపసిండి
బొమ్మ యన నొక్కముద్దులగుమ్మ వేడ్క | నవ్విరూపాక్షుఁ గన్గొన నరుగుదెంచె.


శా.

చంచల్లీల నొకర్తు నీలజలదచ్చన్నోడురాడ్బింబమో

యెంచ న్మించిన చంచరీకతతిచే నింపొందు రాజీవమో
యంచు న్బోల్పఁగఁజాలి మోముపయిఁ జెల్వౌకుంతలశ్రేణి న
ర్తించ న్నీలగళుం గనుంగొనుట కేతెంచె న్సిరు ల్మించఁగన్.


చ.

సకియ యొకర్తు నూపురలసన్మణికంకణకింకిణీధ్వను
ల్ప్రకటగతిం జెలంగఁ బరిభాసితనవ్యసువర్ణభూషణ
ప్రకరము లుల్లసిల్ల నల వల్లవశేఖరుఁ జూడవచ్చె ద
ర్పకకరముక్తమైనరవిఁ బర్వెడు చొక్కపుడేగయో యనన్.


సుగంధి.

ఈగతి న్ద్విరేఫవేణులెల్ల సంతసంబుతో
వేగ నేగుదెంచి యంతవింతకాంతి నెంతయు
న్బాగుమీరినట్టి మేటిపైఁడిగట్టువిల్తునిన్
యోగినాథుఁ జూచి రాగయోగ మొప్ప నొక్కటన్.


ఉ.

అంగనలెల్ల వేడుక ననంగశతప్రతిమానభంగది
వ్యాంగుని నబ్భుజంగునిఁ బ్రియంబున నీక్రియఁ జూచి జాళువా
బంగరుపళ్ళెరంబులను బాగుగ రత్నము లుంచి హారతు
ల్పంగతితో నొసంగీ సరసంబుగ సేసలు చల్లి రంతటన్.


ఉ.

అద్దిర వీని చెల్వము! జయంతధనేశకుమారమారుల
న్బెద్దయుఁ గెల్వఁజాలు ధరణి న్విలసిల్లెడు మేనితేజ మా
ప్రొద్దునకుం సమం బెసఁగఁబోలు నయారె విలాసలీల నో
ముద్దియలార రండు కడుముద్దులు గుల్కెడు నమ్మసారెకున్.


సీ.

పొదలెడుకొదమతుమ్మెదగుంపు నదలించుఁ బరికింప వీనిపెన్నెరులకాంతి
తొగలరాయనితోడఁ దులయౌ ననఁగ వచ్చు మొనసి వేడ్కను వీనిముద్దుమోము
వెలిదమ్మిరేకులఁ బలుమారు నిరసించు రమణిరో! వీనినేత్రములచెల్వు
తళతళ మెఱయునిద్దపుటద్దముల నేలు లీలతో వీనికపోలయుగము
వెలయు తిలపుష్పమును గేరు వీనినాస | వింతయగుసింగిణీవిండ్లు వీనిబొమలు
కొల్లలుగ మొల్లమొగ్గలఁ గోడగించు | నెంతయును బంతమున వీనిదంతపంక్తి.


క.

నెలఁతా! పున్నమఱేవె | న్నెల తా సరి యగునె పోల్ప నెఱి నీతనిచె
ల్వలరెడునగవునకు న్నును | బలుకులకు న్సరియె చిలుకపలుకులు ధాత్రిన్.


గీ.

కంబుసన్నిభమైనగళంబువాఁడు | ఇమ్ము మీరు విశాలవక్షమ్మువాఁడు

రమణఁ బొడవగుబాహుదండములవాఁడు | తొడరి సింగంబుఁ గెల్చు నెన్నడుమువాఁడు.


ఉ.

తమ్ములఁ గేరుపాదలసితమ్ములవాఁడు నవీనబంధుజీ
వమ్మున దల్చు మోవి చెలువమ్మునుగల్గినవాఁడు పేర్మిఁ జొ
క్కమ్మునఁ గమ్మవిల్తుతమకమ్ము నణంచెడువాఁడు లీలతో
నమ్మకచెల్ల! వీఁడుమది నమ్మకపోవఁడి దేమి చోద్యమో?


సీ.

ఎమ్మె మీఱఁగ వీనికెమ్మోవి యానుట భావింప నమృతంబుసేవ గాదె?
పొలుపొంద వీనితోఁ బొందొనర్చుట వేడ్క నలకల్పభూజాశ్రయంబు గాదె?
లీల వీనిని గౌగిలించుట నిర్జరగవి యిచ్చు నిష్టానుభవము గాదె?
వలనైన చెల్వముఁ బనిపూని కంటఁ దలఁపఁగ ననిమిషత్వంబు గాదె?
కుసుమశరకేళి వీనితోఁ గూడియుంటఁ | బ్రకటితంబగు సాంమ్రాజ్యపదవి గాదె?
యిమ్ముగా స్వర్గలోకసౌఖ్యమ్ము వేరె | కోరవలయునె వీఁడు చేకొనియెనేని?


ఉ.

కొమ్మరో! మోము ముద్దు గొని కోరికఁ జెక్కులు గోట మీటి చె
ల్వమ్ముగ నెంతయు గళరవమ్ములు మీఱఁగఁ బూని తేనియల్
గ్రమ్మెడుమోవి యాని యధికంబుగ వీనియురమ్ము సారెకుం
గ్రుమ్మఁగరాదె గబ్బిచనుగుబ్బల నుబ్బుచు గొబ్బుగొబ్బునన్.


క.

కుతుకమునఁ బ్రతిదినము నీ | చతురుని మెయి జంట నుండు నతిభాగ్యము సం
స్తుతి సేయఁ దరమ తిరముగఁ | జతురాస్యునకైన వానిచానకునైనన్?


ఉ.

ఈనెఱజాణఁ డీచెలువుఁ డీదరహాసవిభాసితాననుం
డీనళినీకళత్రనిభుఁ డీప్రభుఁ డీనవయౌవనాంగుఁ డే
మానినినైన నెంతయును మన్మథబాణవికంపితాత్మఁగాఁ
దా నొనరింపకున్నె? వనితామణులార విలాససంపదన్!


శా

వీనిం జూచినపూవుఁబోఁడి మదనావిర్భావలోలాత్యయై
మేనం బుల్కలు గ్రమ్మ మేటిజిగిచన్మెట్టల్ గగుర్పుట్టఁగా
సూనాస్త్రాలయమెల్లఁ జెమ్మ?లఁ దాఁ జొక్కుంగదే కొమ్మ! యిం
పూనం జంద్రునిఁ గన్నచంద్రశిలయుంబోలెం బ్రమోదంబునన్.


ఉ.

కంజదళాక్షి! యీననువుకానిఁ గనుంగొనినంతనుండియుం
రంజిలి మాననంబు పరిరంభణలాలస మయ్యెఁ జయ్యనన్
మంజులవుష్పబాణములు మన్మథుఁ డేయఁదొణంగెఁ బైపయిం

బింజయుఁ బింజయుం దవులఁ చేర్చి కడుందృఢలీల నొక్కటన్.


క.

అతివా! శతధృతి యీతనిఁ | బతిగా నూహింపకున్న పాపముననె కా
మతిఁ దలకోఁతలఁ బడియెన్ | సతతము భువనంబులెల్లఁ జర్చింపంగన్.


వ.

అని మఱియు నిట్లనివితర్కించిరి.


సీ.

పణఁతి యీతండు వాక్పతియొ! ! యిట్లనఁగ నల్మొగములుఁ బుక్కిట ముగ్ధ యేది ?
తరుణి యితండు మాధవుఁడో ! యిట్లన శంఖచక్రముల్ ఱొమ్మునఁ జాన యేది?
ధవళాక్షి యితఁడు వాసవుఁడో! యిట్లన వేయుగన్నులుఁ గులిశెంబుఁ గలుగు టేది?
శుకవాణి యితఁడు దర్పకుఁడో! యిట్లనఁగఁ గ్రొవ్విరితూపులును దియ్యవిల్లు నేది?
యితఁడు భల్లాణు నిజభక్తి మతినిఁ దెలియఁ | జల్లమాంబ నిజంబెల్ల సరవి నరయఁ
బూని చనుచున్న శివుఁడు గాఁబోలు నిదియె | తధ్యమగు నిందుముఖులార తలఁచి చూడ!


క.

తొలినోములఫల మిపు డీ | చెలువునిఁ గనుగొంట యిందుచే భాగ్యంబో
చెలువారఁ గల్గె నిట్టులఁ | దలఁపఁగ నద్భుతము గాదె ధారుణియందున్?


క.

అని యివ్విధమునఁ బురసతు | లెనలేని ముదంబుతోడ నీక్షించుచుఁ దన్
గొనియాడ నంత శివుఁడా | జనపతి మొగసాలదరికిఁ జనియెన్ లీలన్.


వ.

అని సూతుం డెఱింగించిన విని నైమిశారణ్యమహామును లటమీఁది వృత్తాంతం బె
ట్లని యడుగుటయు.


శా.

గౌరీచారుపయోధరద్వయమిళత్కస్తూరికాకర్దమ
స్ఫారోదగ్రభుజాంతరాళవిధిజంభద్విణ్ముఖామర్త్య కో
టీరస్థాపితనూత్నరత్నరుచిధాటీప్రోల్లసత్పాద మం
చారక్షీరపటీరహారహిమరుక్తారాభమందస్మితా.


క.

తరుణారుణాబ్జసుందర | చరణా దురితాబ్దితరణ సంతతకరుణా
ధరణీధరశరణా శశి | భరణా కరిహరణ నిఖిలభయసంహరణా.


తరల.

భువనపోషణ సత్యభాషణ భోగిరాజవిభూషణా
దివిజపాలన ద్విడ్విభాలన దివ్యతాండవఖేలనా
పవిధరార్చిత మానిపూజిత భానుకోటివిరాజితా
శివగిరీశ్వరభూతిదాయక సింధుజాధిపసాయకా.


మాలిని.

మనసిజశతరూపా మర్దితాశేషపాపా
దనుజరిపుకలాపా దర్పితోద్యత్ప్రతాపా

ధనపతివరమిత్రా దానసంస్తోత్రపాత్రా
ఘనతరనిజశౌర్యా కాంచనాహార్యధైర్యా.

గద్య. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురం
ధర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధ
జనవిధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన రాజశేఖర
విలాసంబను కావ్యంబునందు ద్వితీయాశ్వాసము.

రాజశేఖరవిలాసము

తృతీయాశ్వాసము

శ్రీమత్కామితజన సుర | భూమీరుహభుజగవరవిభూషణ సుగుణ
స్తోమహిమాచలకన్యా | కోమలముఖపద్మభృంగ కుక్కుటలింగా.


వ.

అవధరింపుము నైమిశారణ్యమహర్షులకు నిఖిలపురాణవ్యాఖ్యానవిఖ్యాతుండ
గు సూతుం డిట్లనియె నట్లు జగన్మోహనాకారుండగు నవ్విటజంగమేశ్వరుండు
తనమందిరద్వారంబునకు వచ్చు టెఱింగి భల్లాణుండు.


చ.

ఎదురుగ నేగి యాగురుజనేశ్వరుఁ గాంచి నమస్కరించి స
మ్మదమునఁ దోడి తెచ్చి సుషమంబగుపీఠిక నుంచి శోభన
ప్రదముగ నర్ఘ్యపాద్యములు భాసురలీల నొసంగి వేగఁ ద
త్పదసలిలంబు మూర్ధ్నమున భక్తినిఁ జల్లుక నిల్చియుండినన్.


క.

నెఱిఁగక్షపాలయంద | త్యురుగాంతులఁ దనరుభూతి యొక్కింత కరాం
బురుహమునఁ బట్టి యోగీ | శ్వరుఁ డానృపునుదుట నిడిన సరవి నతండున్.