రాజవాహనవిజయము/తృతీయాశ్వాసము

శ్రీ

రాజవాహన విజయము

(తృతీయాశ్వాసము)

శ్రీలక్ష్మీ కమలాక్షీ
శ్రీలక్ష్మీకృతకటీరశింజితకాంచీ
లోలచ్చిత్తమరాళక
రా లఘువిక్రమణ వేంకటాచలరమణా!

1


వ.

అవధరింపుము.

2


శా.

వేలాదంతి పెకల్చివైవ నపరోర్వీభృచ్ఛిరోగంబు పై
వ్రాలంజాలిన పూర్వసింధుసరసీరక్తాబ్జ మట్లొప్పె దా
నాళీకాప్తుఁడు చిందు తద్రజ మన న్సంధ్యాతపం బొప్పెఁ ద
న్నాళోత్థాంబుకణాళి పంకములనందారా తపంబు ల్దగెన్.

3

సీ.

దినతమీమధ్యస్థతను ఫలించిన మేటి
                 కడుఁ బ్రతీచికి రాగ మిడిన జాణ
శంభునాట్యమునకు సమయ మిచ్చిన ప్రోడ
                 శశికి సద్ద్యుతిపాళిఁ జేర్చు దంట
జగములఁ గల యనుష్ఠాతల తనుకాఁడు
                 పితృకోటిఁ గాంచి పెంపిన యొయారి
ద్విజరాజులఁ గులాయవితతిఁ గూర్చు మిటారి
                 దితికి రతిప్రేమఁ దెచ్చు రవ్వ


గీ.

కువలయమునకు నిద్ర మేల్కొలుపు గబ్బి
యంగభస్రం బయనంబు గమ్మనిన జోదు
కనక కశిపుని జుముప్రోలి కనుపు గొంటు
చాలితానేక ఘూకాంధ్యసంధ్య దొలఁగె.

4

4. శశి....దంట = (సూర్యకిరణములు రాత్రియం దగ్నిం బ్రవేశించుట.) తనుకాఁడు = తృప్తిఁజేయువాఁడు. గొంటు = కఠినుఁడు.

మ.

కమలామిత్ర కరత్రమంధపటలీగంధేభధామంబు జా
రమయూరాబ్దము మారమల్లఖురళీరంగం బితోష్ణాంగగం
ధము జోరోద్ధవభూమి యామికజనాదాయంబు దావాకుల
స్రమదాపూరుషభర్మటంకణము చేరన్ వచ్చె రే యయ్యెడన్.

5

5. ఉద్ధవభూమి = ఉత్సవభూమి.

ఉ.

జారసమస్తచోరతతి జాతర ఘూకదృగంజనంబు తా
రారమణీయహీరమణిరాజితశాణము దీధికాచర
ద్వారజరావతీతరుణతాప్రదమూలిక లోకదృష్టి కా
సారసకందమంధతమసం బెసఁగెం దశదిక్తటంబులన్.

5

5. కందము = మేఘము.

సీ.

ధరభేది సంకెలల్ దప్పించుకొని వచ్చి
                 కానకుండఁ జరించు ఘన మనంగఁ
గడతత్త్వ మిటమోవఁ గడమయే యేనని
                 మొదటితత్త్వము మిన్ను ముట్టె ననఁగ
తముఁ గనకుండ బంధకులు చల్లు కనీని
                 కానికాయవిభావికాస మనఁగ
నెలతగు ల్గోరి రే నెలత మజ్జనమాడి
                 యార విప్పిన కుంతలాళి యనఁగ


గీ.

జలధిలో మిత్రుఁ బడఁ ద్రోచు కలుష కలన
నంటు కాలంబు మొగము నల్పనఁగ దండ్రి
సూడుఁ ద్రిప్పఁగ సమయంబుఁ జుట్టికొన్న
యమున యనఁ జీకువాల్ జగం బాక్రమించె.

6

6. కడతత్త్వము = భూమి (ఈలాగునంతయు మోయుచుండ నేను చివరదాననై యుండనా యని మొదటిదైన యాకాశమును గలసిన దన్నట్లు) చీకువాలు = చీకటి.

సీ.

ప్రసవకోదండుండు పాశంబు దగిలింప
                 నెగయు మిణుంగురుతెగ లనంగ
జైత్రయాత్రోన్ముఖస్మరునిపై సౌధాశ
                 రా'జముఖు ల్చల్లులాజ లనఁగ
శంబరారికి వినోదంబుఁ జూపఁగ నంబ
                 రంబాను పువ్వుబాణంబు లనఁగఁ
దెంపుమై మరుఁడు నిలింపాంగనల నొంప
                 నంపిన వెలిదమ్మియమ్ము లనఁగ


గీ.

సుమశరునితూఁపు లమరీకుచములఁ దాఁక
దివికిఁ దెగి వ్రాలు హారమౌక్తికము లనఁగఁ
బాంథజయలబ్ధదర్పకప్రబలకీర్తి
హీరము లను జుక్కి లెల్లెడల నిక్కె.

7

7. సౌధాశరాజముఖులు = దేవతాస్త్రీలు

చ.

చలువలరచ్చపట్టు జలజంబులతుట్టు విరాలికల్కి ప్రో
గులకనుకుట్టు జక్కవలగొట్టు చకోరులమేలియట్టు రే
పొలఁతుక తాళిబొట్టు తమపుందడకట్టు సరోజసౌధముల్
గల చెలితోడఁబుట్టు తొలుగట్టుపయిం గనుపట్టు నంతటన్.

8

8. తుట్టు = వినాశకుఁడు. కనుకట్టు = నేత్రబాధకుఁడు. గొట్టు = విరోధి. తాళిబొట్టు = మంగళసూత్రములోని సువర్ణాలంకారము. తడకట్టు = అడ్డగింపు.

సీ.

ఎఱమన్ను గోరాడి యెర మఱ్ఱి కరిగొమ్మ
                 గఱచి నిల్చిన మరుత్కరి యనంగఁ
గనుదోయి నిప్పుకల్ గ్రక్కు రక్కసుఁ జెక్కి
                 ధరఁ గౌగలించు నాద్యకిటి యనఁగ
సామజభేదియై క్షతజంబు మైఁ జెందఁ
                 దో లొల్చి కటి గట్టు శూలి యనఁగః
గెంజడల్ పైవ్రాలి కెంపులీన విపంచి
                 మొఱయించు నారదముని యనంగ


గీ.

నొనరు ధవళాయకంబులో నుదయరాగ
మెనయఁ దనచిహ్నము సెలంగఁ దనప్రతాప
కలనఁ బరచక్రముఁ గలంగ నలరె నతఁడు
కువలయం బేలురాజు ప్రాక్కుధరవీథి.

9

9. ఎర = ఆహారమైన, కఱికొమ్మ = నల్లనికొమ్మ.

గీ.

మిక్కుటపురిక్కచాల్ పంట మిన్ను తోఁటఁ
జక్రదృష్టి హరింప నిర్వక్రఘృష్టి
యష్టి హత్తించి యెత్తిన యట్టి మెరుఁగు
సున్నపుంగుండయన నిక్కెఁ జుక్కఱేఁడు.

10

10. ఘృష్టియష్టి = కిరణ మను కఱ్ఱ.

సీ.

పతిఁ గూడ యామినీసతి మజ్జనంబాడు
                 నికరంపుపన్నీరు నెఱసె ననఁగ
శశి మౌళి తరుపుచే జడఁజుట్టు నిరుపడు
                 ద్రావిన పాలెర గ్రాచె ననఁగ
నల్లుఁడు చిల్కకి డ్డటు లిందుఁడు చకోరు
                 లకు జీని చక్కెర ల్దార్చె ననఁగ

సిరుల దొంగిలఁగ రాజీవాళిపై భూతి
                 శశి జొక్కుమందుగాఁ జల్లె ననఁగ


గీ.

ఖలనదియై గట్టు పక్కఁ జిక్కిన కొఱంత
పుడమిమీఁదికి డిగి కౌశి నడఁగు కొదువ
మాన్పుకొన గంగ దివి భువిం బ్రబలవృత్తి
నిండెనో నాఁగ బండువెన్నెల సెలంగె.

11

11. తరుపు =మణివిశేషము, నిడుపడు =పాము, పాలెర = క్షీరాహారమును, క్రాచెను = గ్రక్కెను. జీని = నాణెమైన. జొక్కుమందు = మోహనౌషధము.

గీ.

విరహి తనుతాపశిఖ సోఁక వెచ్చనైన
యైందవాతపసుధను పెల్లార్చివైచి
యల్ల మలినాంబరం బెల్లఁ దెల్లఁజేసి
యామినీభామినికి సమయం బొసంగె.

12

12. సుధ = సున్నము. అంబరము = ఆకాశమను బట్ట. (సమయ మనుచో కాలమను చాకలివాడని గమ్యము.)

సీ.

పందిఁటిపరపుచాపలపొడల్ విగళిత
                 హారముక్తాశంక నంటి యంటి
వదలు సోరనగండ్ల వచ్చిన జిగివెండి
                 హరివాణమని చేఁత నరసి యరసి
తలుపు పారం జెందు బలుచాలుజడ జారి
               పడు పువ్వుదండని పట్టి పట్టి
చాటుచే నింటిపంచఁ జెలంగు వెలుఁగారఁ
                 గట్టిన చీరని ముట్టి ముట్టి

గీ.

క్రాఁగు పైమ్రొగ్గు తెలినిగ్గుఁ గ్రాఁగి పొంగ
సాఁగు పాలని పైనీరుఁ జల్లి చల్లి
యల్లుకొనునట్టి వెన్నెల నల్లుకొన్న
యన్నుమిన్నలు విహరించి రన్ని వగల.

13

13. చాలు = వెన్నెలపఙ్క్తి. క్రాఁగు = పాలకుండ.

శా.

చెల్లెం గంతునిపంత మబ్ధిపొగ రెచ్చెం గల్వ రాఱాలు రం
జిల్లె న్మంచుల పుంజతోఁడ వినుమించెన్ భోగినీరాజి రా
జిల్లెన్ హల్లకముల్ చకోరములు ద్రేఁచెం బిల్లలుం బిల్లగో
ర్పెల్లోయంచు బయల్లనుం జిడుగుడుల్ ప్రేరేఁచి రవ్వేళలన్.

14

14. పొగరు = గర్వము. పుంజి = సమృద్ధి. త్రేఁచెన్ = త్రేణుపు బొందెను. పిల్లగోరు, చిడిగుడులు = బాలురయాటలలో భేదములు. పెల్లో = ఆడునప్పుడు వేయు కేక.

సీ.

కొలఁదిగాఁ జరిపించు కొనిరమ్ము కడియ మం
                 చొకపెర పతిచేతి కొసంగె నొకతె
వడి మిద్దె విరిగి పైఁ బడ వచ్చెనని బైటి
                 కరిగి మిన్నని యట్ల యలికె నొక తె
మగఁ డటుండగ వేరెమగని నాలుగఁ జీరి
                 గడుసుచేఁ జెంపపె ట్టొడసె నొకతె
కాపురం బెఱుఁగ వెక్కడి కేగితని యన్య
                 తన భర్తయని యన్యుఁ బెనఁగె నొకతె

గీ.

వాఁడఁ జను చాకికి ధరించు వలువ వైచి
తెట్టు తాఁగట్టు పుట్టంబుఁ గట్టి తనుచుఁ
బొరుగుసతి దాల్చు చీరపై బోరె నొకతె
యధికమధుమత్తతావృత్తి నట్టి రాత్రి.

15

15. చరిపించుకొని = సాగఁగొట్టించుకొని, గడుసుచేన్ = కఠినహస్తముచేత. అన్య (ఇది ఒకతె యను దానికి విశేషణము.)

క.

కట్టిన దట్టి కటీతటిఁ
బెట్టిన విరిపిడియ మెక్కువెట్టిన విల్లున్
మెట్టిన యెగనాళ్ళుం గను
పట్టిన పస మారుఁ డపుడు పాంథుల వెదకెన్.

16

16. విరిపిడియము = పెద్దబాకు. ఎగనాళ్ళు = దూరదేశములు.

సీ.

అన్యదారీకారితాప్తచేటీగతి
                 వ్యాజస్వవిమతసర్వస్వహరులు
గుహరీలోహముద్గరఘట్టనాభీత
                 మానవస్తేనతామార్గకరులు
పర్యటజ్జనబాహుబంధనదాయకా
                 త్మకనామతమ్మటధ్వానభరులు
ప్రతివాసరస్వయంకృతచౌర్యబలవదం
                 ఘ్రినతార్థవిత్తదాతృత్వపరులు


గీ.

పరనగరికార్పితాత్మరాట్పల్లికార్థ
తస్కరపదాంకపద్ధవస్థానజనిజ
ఘోషపదజనితాజ్యాధికుతలవరులు
తలవరులు సంచరించి రాతమిని దమిని.

17

గీ.

బిట్టు కసరెత్తి మున్నీటినట్టనడిమి
కరుగఁగా జీను వైచిన తరణి యనఁగఁ
జక్కసాఁగిన రశ్మిచేఁ జుక్కఱేఁడు
సమయవశమున గగనమధ్యమున నిలచె.

19

19. కసరు = గాలివాన, జీను = లంగరు.

సీ.

విరహిణీజయరమాపరిణేత్రు మదనప్ర
                 సవదామయుతసితచ్ఛత్ర మనఁగ
మదచకోరవివాహమహితకు వెలిని నూ
                 ల్వెలయు జాజాలపాలిక యనంగ
వేళావణిఙ్మణి వెన్నెల జీని చ
                 క్కెర దూఁచ వచ్చు తక్కెడ యనంగ
నభము రేయెండ సున్నముఁ జేయ నింగి ని
                 ల్పిన వెండిమొక్కలిపీట యనఁగ.


గీ.

సారనీహార మణపువిశాఖజొన్న
విత్తు ధాత్రీతలంబున వెదలుజల్లఁ
దగులు ప్రగ్గంపుపూన్కి జడ్డిగ మనంగఁ
గిరణబాహుళ్యమున సుధాకరుఁడు పొదలె.

20

20. అణపువిశాఖజొన్న = విత్తనము లోపలి కణిగిపోవునట్లుగా వేయు విశాఖకార్తిలోని జొన్నచేను.

గీ.

బాంధకీబాష్పవర్షసంబంధమునకు
గర్భగృహ ముబ్బి పార గంగాధునీస
లిలము లెత్తిన పటికంపులింగ మనఁగఁ
జంద్రికాపూరితాజాండచంద్రుఁ డలరె.

21

క.

ఉడుపతి దరమిన వడిచెడి
గుడిగుండంబుల మరుంగుఁ గొని యల శశియుం
బడమటి కరిగిన వెనుకను
బడి చను తమమనఁగ నీడ ప్రాగ్దిశఁ దిరిగెన్.

22

22. బంధకీ = విటకత్తెలు.

క.

నైలింపాయనజలధిం
దేలెడు ధవళాంశు దరము నిబిడత నక్ష
త్రాళీశుక్తిచ్ఛటతోఁ
గాలపుదెర బిట్టు వడిని గట్టునఁ బెట్టెన్.

23

23. దరము = శంకము. తెర = తరంగము.

గీ.

తనపగతుఁ డెంతదూరంబు జనియెనొక్కొ
యనుచు నిక్కుచుఁ గను ధవళారవింద
మనఁగ మినువాఁక నంత రత్యంతతాంత
విటులు నిద్రాపటిమఁ జొక్క వేఁగుచుక్క.

24

24. ఈ పద్యమందు "పొడమె"నని క్రియ అధ్యాహారము.

క.

ఇందుముఖుల్ సరసాంజన
సందోహంబులకు నిడ్డ సత్పాత్రాళీ
చందనలేపముఁ ద్రావిన
చందంబున దీపతతి పొసఁగె ధవళంబై.

25

25. కాటుక వేయు పళ్ళెముమీద చలవకొరకు గంధము వేతురు.

క.

ఇనురాక కుదయరాగము
గనఁ బూనం బొరుగుచెలిమిఁ గైకొని ప్రాక్కా
మిని తనధవళాంబర మిడఁ
గనుపట్టెను దీపరేఖ ఘనగౌరవమై.

26

శా.

అధ్వన్యక్షణదాప్రయాణసమయోక్ సంభృతజ్యౌతిషుల్
విధ్వీశద్రుహిణాదృతత్రిమునిధీవేదాంగకృద్దేశికుల్
విధ్వస్తేతరపార్శ్వతాడనగఠుద్వృత్తిక్రియం గొక్కరే
కోధ్వానంబులు నిక్కఁ గుక్కుటము లెక్కుం దిక్కుటీ రాగ్రముల్ .

27

27. అధ్వన్య = మార్గస్థులయొక్కయు. క్షణదా = రాత్రియొక్కయు. ఉక్త = చెప్పుటకు. (మార్గస్థులు బయలుదేరుటకును, రాత్రి వెళ్ళిపోవుటకును వేళఁ జెప్పు జ్యౌతిషికు లైనవి. త్రిముని = పాణిని, కాత్యాయన, పతంజలులయొక్క, (కోడికూతను బట్టి హ్రస్వదీర్ఘప్లుతకాలములు వ్యాకరణకర్త లేర్పరచిరని ప్రసిద్ధి) గరుత్ = ఱెక్కలు.

ఉ.

కల్లరి మావు మావి కడఁ గట్టి శరంబులు మూలవైచి చే
విల్లొక వంకఁబెట్టి కరవీరపుజాయల దట్టిఁ జుట్టి వే
తల్లెపుదిక్కునందు నిడితావుల చల్లడ మొప్ప రాజుమే
నల్లుఁడు నిద్రఁ జెందెఁ బథికాహవభోగకషాయనేత్రుఁడై .

28

28. రాజుమేనల్లుఁడు = మన్మథుఁడు.

వ.

ఆసమయంబున.

29

సీ.

హరిగూరుచుండు పాదానంతసంపఁద
                 బెంపైన మొక్కలిపీట యనఁగ
వృత్రభేదికి వీవ నెత్తిన సూర్యపు
                 టంపుటిం పాలవట్టం బనంగ
కాలంబు పేరి సుంకరి యంబరంబునఁ
                 బొడిచినట్టి యరుణముద్ర యనఁగ
గురుకుచాకుచపాతకుంఠాంగజాంబుజా
                 స్త్రముల మొక్కలు దిద్దు సాన యనఁగ


గీ.

నుదయగిరి దుర్గమునఁ దమోభ్యుదయబలము
గూల్పఁగా నొడ్డిన ఫిరంగిగుం డనంగ
గుండుబుల్గుల మదిఁగుందు చెండు మందు
దోఁచె నెత్తమ్మివిరివిందు తూర్పునందు.

30

30. గుండుబులుగులు = చక్రవాకములు.

క.

వికసించు తమ్మి నుండు మ
ధుకరావళి వెడలె వెలుఁగుదొర గనఁ గాసా
రకలావమతుఁడు మును గొం
చక మ్రింగ వెడల్చు నినుపసరిపెణ మనఁగన్.

31

31. కళావంతుఁడు = గారడీఁడు. సరిపెణము = గొలుసు.

క.

జలజాతము నగుమొగమునఁ
జెలరేగినఁ గలువ ముణిఁగె సిరిగల వాడల్
విలసిల్లిన దినగండం
బులఁ బొరలెడువారు మొగము ముడుచుట యరుదే.

32

32. వాడల్ = తనయింటికి దగ్గరయిండ్లు.

క.

ఆ తరువాతఁ బ్రభాతా
యాతామితవాతపోతహతజలజాతా
న్వీతామృతధౌతాస్యతఁ
బ్రాతారమణీయకర్మపరతంత్రుండై.

33


మ.

ఒకచెంతం గకుబంతకావ్యకవితాసూక్తిప్రసంగోత్సవం
బొకచాయన్ వికచాయగాయనవితానోజాతగీతామృతం
బొకచోటన్ శకఘోటయౌవతభుజాయుక్చామరోచ్చాలనం
బొకసొంపుం బ్రకటింప మాగధవిభుం డొడ్డోలగం బుండఁగన్.

34

34. వికచ= వికసించిన, అయ = శుభావహదైవముగల.

సీ.

కఱకుజుంజురువెండ్రుకలు గూడఁగట్టిన
                 నికరంపుటగరువల్లిక చెలంగ
నిభకుంభమణు లెడనెడఁ గూర్చు కురువింద
                 జమలి యుత్తరజన్నిదములు దనర
మృగనాభి మృగనాభి లగన క్షతజసిక్త
                 పాణియుక్చాపంబు పాణి నిక్క
నొక్కచేజల్లులు చుక్కళించి బిగించు
                 వెదురుబియ్యపుపాత్ర యెదను సూప


గీ.

నించుమొలత్రాటియుదులచా లిరుకుగ్రుడ్లు
గబ్బి వగఁజూపు పెల్లుబ్బుగబ్బుసల్లు

నల్లచాయల మేను శోభిల్ల భిల్ల
వల్లభుఁడు రాజుచెంతకు వచ్చి యంత.

35

35. లగన = తగులుకొనుటగల, పాణియున్ = చేతఁబట్టుకొను చోటితోఁగూడిన. జల్లు = వింజామర.

క.

జల్లులు జవాది పునుఁగుల
పిల్లలు పెరతేనె వెదురుబియ్యము క్రీడా
భల్లుకకురంగములు సెల
విల్లుం గైకాన్క భిల్లవిభు డిడి మ్రొక్కెన్.

36

36. క్రీడాభల్లుకకురంగములు= పెంపుకు ఎలుగగొడ్లు, లేళ్ళు. విభుడు = చెంచునాయకుఁడు.

గీ.

ఇట్టులను మ్రొక్కి మీరాక కెదురుచూచు
చుంటి నానేర్చు విలువిద్యయును ఫలించె
గబ్బి మెకములు దిక్కామొగంబు లయ్యె
నేఁడుగా చెంచుకులములో నీటుగనుట.

37

37. దిక్కామొగంబులు = దిక్కులకుఁ బారిపోయినవి.

క.

నీ పాదముఁ దల మోచిన
నాపే రిలనుంచు చెంచునాయఁ డటంచున్
నాపల్లె మృగనిదానం
బాపక్కణ మలరుకొండ యడవుల కొండన్.

38

38. పక్కణము = బోయపల్లె.

క.

మంచులఁ బెంచిన మలనూ
ఱంచుల మించిన కటారి యాతనిచుట్టుం
జెంచుల యోబన గుట్టం
జెంచుల దొర మొలవఁబెట్టు జెట్టుల నృపతీ.

39

39. ఓబన = చెంచువాళ్ళ దేవత, నూఱంచు . . . యాతని = దేవేంద్రునియొక్క, చెంచులయోబన (అనఁగా శివుఁడని చెప్పవలెను.) (చెంచులదొర యనఁగా నేననియర్ధము) హిమవన్మేరుకైలాసములయందు జెట్లు మొలవేసినాను (అనఁగా నా పర్వతములయంచు దిరుగుచుందునని తాత్పర్యము.)

గీ.

చట్టపలుచట్టుపలు గొట్టునట్టి గట్టి
గట్టు రాగట్టు బిటుపేరు పట్టుపట్టు
డట్టి జగజెట్టి గొట్టంప కట్టవిట్ట
మెట్టుమెట్టది మాట పట్టుగట్ట.

40

40. చట్టు = పర్వతములయొక్క, పలు = విస్తారమైన, చట్టుపలు = ఱెక్కలు.

సీ.

కీటు దిద్దెడుచోటఁ గేవల మృగనాభి
                 మను ముద్ద సరిసుమ్ము మనుజనాథ
వాస పోసెడుచోట వాసనగల వాస
                 మేపె వాసము నొకడింతె మహిప
పెండె గట్టెడుచోటఁ బెనుపగడపుతీగ
                 లీతమెల్లెలు దుల్య మెపుడు నృపతి
యిల్లు గట్టెడుచోట జల్లులు గసవు పం
                 జులు సమానంబులు క్షోణిరమణ


గీ.

గీమలుకుచోట జవ్వాది గోమయంబు
సమము మ్రుగ్గిడుచోట వంశకరి దంత
కోలదంష్ట్రల ముత్తెముల్ రాలు పిండి
రెండు నొండయ్యె మాకొండ మండలేశ.

40

41. మెల్లెలు = సన్నపుపొడవైన కొమ్మలు. కసవుపంజులు = గడ్డికట్టలు, గీము = ఇల్లు, కోల = అడవిపంది, కీటు = మట్టిగోడభాగము.

గీ.

సామి యేమేమి లేదు మాభూమియందు
తల్లిదండ్రుల మీవంటి దాత దైవ
ములనె తీరాదు పులిజున్ను మున్నెకలదు
కడమ యొక్కటి గాన నీయడుగులాన.

42

42. కడము = లోపము.

గీ.

రెండుగడియలపైన మాకొండ కొండ్ర
యెండు చెట్టున కొకటియు రెండు మూఁడు
నుండు గండకముల జంతుకాండకములఁ
జెండ వచ్చుఁ గటారి విల్లుండ నిమ్ము.

43

43. కొండ్ర = దున్నుచున్న నేల. (లక్షణచే తెరపినేల యనుట.)

క.

మానిసి యలుకుడు విన్నం
గానంబడి యందుఁ గదలు గద కైదువచేఁ
బూని యదలించునాడె కు
లీనా! యయ్యడవిలోపలి మెకంపు గముల్.

44

44. అదలించునాడె = బెదరించునప్పుడే. కులీనా = సద్వంశమునందు బుట్టిన రాజా.

క.

నానాటఁ గూరనారకు
నోనాటఁగ నేసి యింట నుండగ చానల్
గోనల్ దిరిగి మెకంబుల
సేనల్ గాఁదెత్తు రింతసేఫున నృపతీ.

45


సీ.

ఒకయీత గవిమావి యూడ్చు బెబ్బులి నూర
                 బిల్లి యుంచునె పట్టి పెనచికట్టు

నెదురు మారిన పందిఁ గదిసి గాదియక్రింది
                 పందికొక్కని మోరఁ బట్టి కెడపు
కర్జూరమును గండఖర్జూహృతికి రాయు
                 కరి దుంతయని యీడ్చుఁ గర్ణమంటి
కుంజరేంద్రంబుపైఁ గుప్పించు సింగంబుఁ
                 జెల్లరేచని పండ్లు డుల్లఁ దన్ను


గీ.

నధిప! దేవరబంటు గన్నట్టిపట్టి
నిన్న పున్నమ కైదేండ్లనిసువు సామి
వాని కల్లరితనము లీశ్వరుఁ డెఱుంగు
నీరు తటకాపడుదు రొక్కయింత గనిన.

46

46. గవి = గుహ. దుంత = దున్నపోతు. కల్లరితనము = మోసము. తటకాపడుదురు = నిశ్చేష్టులౌదురు.

సీ.

పనుల నోదాలఁ ద్రోవక దేవ కరిఁబట్టి
                 యొరిజు వైవక యెక్కు నుదుటుదనము
తడవింట నేయక తరమి గాలిమెకంబు
                 నుసురుతోఁ గొనివచ్చు నసమజవము
వలలొడ్డ కాయుధంబులు లేక మొదటి
                 దిం బట్టి లతఁగట్టి తెచ్చు బలిమి
యురిలేక జిగురులే కొగి బుల్గురాయని
                 లావులతోఁ దెచ్చు లావు కొలఁది


గీ.

మాకు మే మాడుకొనరాదు గాక జోక
వేఁటలాడించి నారెందు వేఁటలాడి
నారు మునువింటి కనుఁగొంటి నన్నువంటి
యెరుకు దొరకుని నినువంటి యెఱుక దొరకు.

47

47. ఓదాలు = ఏనుఁగులఁ బట్టు గోతులు. ఒరిజ = మెడగొలుసు. లావులు = ఱెక్కయీకలు. ఎఱుకదొర = తెలివిగలరాజు.

క.

మాయలమెకంబు నేసిన
యాయన నన్నెఱుఁగవలయు నటకాదె నరుం
డేయక మును గిటిఁ బొరిగొను
నాయకుఁ డావెన్క మీరె నన్నెఱుఁగుటకున్.

48


క.

ఇవి పందికొమ్ము గాయము
లివి సింగపుకోరజీర లివి యేనుఁగుపో
ట్లివి పులిగోరులచెనకులు
నువుగింజకుఁ జోటిడదు తనువు గనుము నృపా.

49

49. చెనకులు = ఆక్రమణములు. (అనఁగా చీరెకలు.)

సీ.

తనగాలి యింత సోకిన జారు దిగ్గజం
                 బులమోపుఁ గని శేషభోగి ములుగఁ
దనకాలిమట్లచే జనులకుఁ జొరరాని
                 కాంతారములు చాపకట్టు వడఁగఁ
దనప్రక్క యెరసినఁ గనకాద్రి మొదలగు
                 నుర్వీధరంబు లుఱ్ఱూతలూగఁ
దనదానఝరులచే వనధి బాడబహుత
                 భుజులకు డాకాలబొమ్మఁ గట్ట


గీ.

గొమ్ముతాకుల కుసులకుఁ గూలమబ్బు
లదరి ఫూత్కృతి రవిమధ్య మంకె గొనఁగఁ
జిక్కుపడక చరించు నం దొక్కకరటి
చందువంగడపుందమ్మిచదలు కెడప.

50

50. మోపు = బరువు. అంకె గొనఁగన్ = కప్పుకోఁగా. కరటి = ఏనుఁగు.

తే.

చూడము దేవర వనవే
దండముపై వైరిబాహుదండములకు గో
దండముఁ బోలెడు నీకో
దండము పసఁ జూపుటకును దగు నివ్వేళన్.

51

51. కోదండము బోలెడు = వజ్రాయుధమువలె నున్న.

తే.

దేవర యరుదెంచిన మే
లేవెరవున నైనఁ బట్టి యిత్తున్ హత్తిన్
నావంటి బంటె నాపిన
బావగజాఖేటకప్రపంచంబునకున్.

52

52. హత్తిన్ = ఏనుఁగును.

క.

వేటాడ దొరలసన్నిధి
మాటాడ మదించు చెంచుమన్నీలఁ గరం
బూటాడఁజేయు నన్నిఁట
జూటాడనెయుండు నతఁడు చూచెదరె కదా.

53

53. జూటు = మోసము.

క.

అనిన మృగయావినోదము
మనమునఁ బెనగొన సృపాలమణి యాప్తజనం
బులు వాగురికు ల్వెంటం
జనుదేర నరణ్యమునకుఁ జనియెడు నెడలన్.

54


ఉ.

బెబ్బులికూన దానవుఁడు భీముడు గామిడిగట్టు గట్టి వా
గబ్బి కరాళి కాళి సురగాలి గయాళి వయాళిపుట్ట చెం

డుబ్బరి సింగిణీమిసికి యెంటరి గొంటరిపందిచుక్కవా
ల్మబ్బుమొగాలమిత్తియన మత్తిలి రాగిలు జాగిలంబులన్.

55


క.

నిగ నిగని పైఁడిగొలుసులు
నిగుడింపుచుఁ బట్టినట్టి నిద్దఁపుచిటికాం
డ్రగణంబు వెంటరా విభు
శ్వగణికుఁ డీక్షించి మ్రొక్కి చక్కిం జనియెన్.

56

56. చిటికాండ్రు = కుక్కలు, శ్వగణికుఁడు = కుక్కలమూహముగలవాడు.

క.

తేటకరు ల్గల యల వన
వాటగిరు ల్సూటి భిల్లవరులేనాదు
ల్లేటసిరు ల్తీటకరు
ల్వేటమరు ల్దొరకుఁ గొలుప విడివడి యంతన్.

57

57. లేటసిరుల్ = కొమ్మలశోభలు. తీట = దురద (అనగా మదకండూతి).

సీ.

ఇవి పుట్టఁ గోరాడి చవిఁజూచి మధుకోశ
                 ములు భల్లకము సల్లు పొలము లయ్య
యివి చెట్టువెండ్రుక ల్దరవుల నూడక నిల్చు
                 చమకులఁ బులులీడ్చు జాడ లయ్య
యివి పొత్తి సొలసిన మృగనాభి మృగి నెత్తు
                 రులు గప్పళించిన నెలవు లయ్య
యివి పిల్లలకు మేత లిడి పిల్లులెల్ల సాం
                 కవ మొంద నెరసిన కఱ్ఱ లయ్య

గీ.

యివి కరటికుంభదళనవిజృంభమాణ
శబరిసంహారి సింహరోషచలిత దను
జాత భిల్ల పరాభూత ధూత గహన
సంచరణ పంచముఖనివాసంబు లయ్య.

58

58. భల్లకము = ఎలుఁగుబంటి, పొత్తి = పొత్తికడుపు, సొలసిన = వ్యాపించిన: పిల్లులు = సంకుమృగములు.

గీ.

అనుచు బలుకుచు నటవీరు లటవి కిటుల
వలలు ఘటియించి సగర నోవములు ద్రవ్వి
బోను లమరించి తెరలెత్తి ప్రోగువారి
చుట్టియును కుల మెకముల జోపువెట్ట.

59

59. జోపువెట్టన్ = బెదరఁగొట్టఁగా.

క.

మార్గములఁ బన్నువగలకు
మార్గంబులు చిక్కుపడక మరలిన నెలవు
ల్మార్గికులు గాచి నిష్ఠుర
మార్గణముల గెడపి రంత మహిపతిచెంతన్.

60

60. వగలు = ఉపాయములు. మార్గంబులు = మృగ సమూహములు. మార్గికులు = మృగముల వేటవాండ్రు.

క.

ఎలుగుల మలుగుల నలుగుల
గులగులలుగఁ జేసి పట్టుకొని బిట్టలుకం
బలుగుల సలుగుల ములుగులఁ
గలగంగా కొట్టి రట్టి గట్టికిరాతుల్.

61

61. మలుగులు = తుంట్లు. గులగుల = చూర్ణము, పలుగులు = కాడికిఁ గట్టు త్రాళ్ళు, నలుగులు = పందులు, ములుగులు = మూల్గుటలు

క.

కరవాలమ్ముల మదకరి
కరవాలమ్ములను జించి క్రమ్మరి వని ద్రి

మ్మర వాలమ్ములఁ గల చా
మరవాలమ్ముల నొగిల్చె మఱియొకఁ డలుకన్.

62

62. మద... వాలమ్ములను = మదకరి = మదపుటేనుఁగులయొక్క, కర = తుండములను, వాలమ్ములను = తోఁకలను, చామరవాలమ్ములన్ = బాలచమరమృగములను.

క.

పులిచెలికెలోని రేగుం
బులికాయల కరిగి యొక్కపులి చింతపొదం
బులియుండ జాగిలముచేఁ
బులిపులి గావించె నొకఁడు పులిమేనెల్లన్.

63

63. పులిచెలికె = గడ్డివీడు. పులిపులి గావించెన్ = మర్దించెను.

క.

చెమరుం గాకిం గనివై
చె మరుద్వేగంబు డేగఁ జేఁగొని నెంటం
జెమరు బలిమి గల యొక్కఁడు
చమరులపై దృష్టిఁ ద్రిప్పె జనపతి గనఁగన్.

64

64. చెమరుఁ గాకి, చెమరు = చెమర్చు.

సీ.

మద మబ్బు బలుగబ్బుమయి బెబ్బులిని నుబ్బు
                 వడిగొబ్బు నను మబ్బు వొడిచె నొకఁడు
వలఁ దట్టి చనుగట్టి వగచుట్ట నరిగట్టి
                 జగజెట్టిఁ బడఁగొట్టి చనియె నొకఁడు
నెర బింకము దొలంక నిలుమింక నని కొంక
                 కకలంకగతి జింక నంటె నొకఁడు
నడిగొండ చరిదండ నడ దండమున మెండ
                 డరుగండకము గండడంచె నొకఁడు

గీ.

చండకోదండకాండప్రకాండముల న
ఖండవేదండకరగండమండలముల
గండభేరుండమును గండతుండెములుగ
నండఁ జనుచుండఁ జెండు చెండాడె నొకఁడు.

65

65. గబ్బు = దుర్వాసన, మబ్బువొడిచెన్ = చీఁకటి పడునట్లుగాఁ జేసెను.

వ.

అని వనిం జుట్టుకొని తెట్టతెరవు మెకంబులఁ గొట్టి
తుట్టలుగాఁ బెట్టి గట్టి చెట్టులకుం బిట్టురికిన ఖడ్గమ్ముల
ఖడ్గమ్ముల భల్లమ్ముల భల్లమ్ములఁ జిల్లరమ్ముల జుల్ల
రమ్ములఁ జామరమ్ములఁ దోమరమ్ములఁ వేదండం
బులఁ గోదండంబులఁ గొండగొరియల నుండసురియలఁ
గొండచరియల తుడ ముద్దండతం బెండుపడం జెండా
డుచుండఁ జండకిటి యొకటి చిక్కువడక యొక్కనడ
కతో వెలుపడి వడిగల గడలబంట్ల మొత్తమ్ముల
కుంతమ్ముల దంతమ్ములం దుత్తుముఱుగా నప్పళించి
యప్పౌఁజుల మెప్పించి యప్పటప్పటికిం గనుజిప్పలఁ
దెప్పలుగా గుప్పళించు విప్పుగల నిప్పుకల కుప్పలకుం
దోడు నప్పళించినం జిప్పిలు దంష్ట్రాలగ దనర్గళ లాలా
జాలంబు రాహువు ముక్కలు గ్రాసంబుగా మెక్కి
నం జిక్కిన రిక్కదొర ప్రక్కం దొరఁగు సుధా
ధారలం గేరడంబాడ నసదృశనిస్వనదశనిపాత
విశకలితతరనిస్తులస్థూలప్రస్తరద్వయాతరదుస్తర
సంకుచితమార్గనిర్గమక్రమణోభయపక్షసంఘటన
పార్శ్వవనీపనీపతత్తదుపలయుగళతటతమాల

సాలనిద్రితభద్రదంతావళాభ్రంకషఘీంకారం
బెచ్చఁ బెచ్చవుం గడలం గడలుకొన్నకరులు
చెవుడుపడ ననిశనిశాతవిలోలతావిశృంఖలరింఖా
టంకసముట్టంకితగ్రావగ్రామజాగ్రదుగ్రావణ
సద్యస్సముద్యదుద్దామదావపావకావసరధావన
బహుధాననాధ్వావరోధకుటిలవిటపివాటికా
ఫాటనపాటవంబునకు వేసటలు లేక బాసట కాస
టలు సముత్కటనిటలతటంబుల నిటక్క నిలచి
యంపకట్టెల నటన ఘటియింప దివసగ్రాసఘటనా
ఫలితకీచకకోటికోటిత్రుటనపటిష్ఠనిష్ఠురతోరిటీ
పుటీచటులగుటగుటార్భటుల భటులం గలగుండు
పరచి యల దండు తలఁగుండు గుండు గండంబై గండు
మెరసినం గని దుర్ఘటఘర్ఘరఘుర్ఘురధ్వనులం గదా
ళించి గహ్వరిం గాలుద్రవ్వుచు లాంగూలచలనంబు
తోఁ జెవులు నిక్కించి మోరయెత్తి యావులించి వెడ
లు విడుద నాలుకలు నకనకలు బడఁ బురోభాగంబు
దన్ని చక్కసాగి లాగిన వాగురికసంఘంబు సరిపనులు
సడల్పకునికి సవ్యాప్తసవ్యంబులుగాఁ బెనంగి చుట్టునుం
దిరిగి తచ్చరణంబులు మూర్కొని వాపోవుచు మా
తంగసంఘంబులం గను సింగంపుకొదమల తెరంగున
మహెూక్షంబుల వీక్షించు తరక్షుశాబకంబులదక్ష
తం ద్రుళ్ళుమీఱ వీడిసాఁగిన జాగిలంబులపద నెఱిగా
వేటకాండ్రు మెడపట్టె లూడ్చి క్రోడంబుపై విడిచిన.

66

66. చెండాడుచుండ (ఇంతవఱకు వేటకాండ్రు కర్తలు.) గండు మెఱసినన్ (ఇంతవఱకుఁ బంది కర్త.) వీడి సాగిన (ఇంతవఱకు జాగిలములు కర్తలు.) చండకిటి = కోపముగల పంది. గెలువడివడి = గెలుపుగల వేగము. గడలబంట్లు = ఈటెబంట్లు. దంష్ట్రాలగత్ = కోరయందుఁ దగులుకొన్న. లాలా = చొంగ. ముక్కాలుగ్రాసంబుగా = ముప్పాతికమట్టు లోపటకి బోవునట్టుగా. చిక్కిన = మిగిలిన. పనీపతత్ = మిక్కిలి పడుచున్న, పెచ్చవు = అతిశయించిన. రింఖా = నడకయనెడు. టంక = ఉలిచేత. సముట్టంకిత = కొట్టఁబడిన. గ్రావగ్రామ = ఊళ్ళసమూహమందు, కీచకకోటి = అనేకములైన వెదుళ్ళయొక్క , కోటి = అంచులయొక్క, త్రోటి = ముట్టె, తలఁగుండున్ = ఒత్తిగిలఁగా. గహ్వరిన్ = భూమియందు. నకనకలుజబడన్ = జవజవలాడఁగా. సరిపనులు = గొలుసులు. తరక్షుశాకంబులు = సివంగిపిల్లలు, పదను = అనుకూలసమయము. (అసదృశ ... ఘీంకారం బెచ్చ, పెద్దచప్పుడు గల పిడుగులు బడి ఱాళ్ళు బ్రద్దలు కాగా ఆసందులమార్గమం దిరుకుగా వచ్చుచు బ్రక్కలు దగిలి యాఱాళ్ళు పడిపోయి యక్కడి తాపింఛవృక్షములక్రింద నిద్రించుచున్న యేనుగులు గీపెట్టుచున్నవని తాత్పర్యము.) (అనిశ...ఘటియింప = ఱాళ్ళపై బరుగుబెట్టుచుండగా డెక్కలదెబ్బలచేత అగ్గి బుట్టి యడవి కాలుచుండఁగాఁ బారిపోవుత్రోవ కడ్డయిన చెట్లు పడఁగొట్టునప్పు డొడలొత్తకుండఁ చేయు వెండ్రుకలు నిక్కి బాణములవలెనున్నవని తాత్పర్యము.)

సీ.

కొన్నిజాగిలములు కోలాగ్రమున నిల్వ
                 నొకకొన్ని వెనుకకాలికిని నొడియు
నొడియుచోఁ గ్రోడంబు పెడమరఁ దిరిగిన
                 నవిజారి యెదిరికి నట్ల కదియు
గవియుచో మరలి యేకలమంది సెలసిన
                 పెట్టుచే నవి కిటి వెంటఁబెట్టు
బెట్టుచోఁ బిరిదిని బెడతలఁగొని లాఁగి

                 గెడపినఁ గడమవి కడల గదియుఁ


గీ.

గదిసి కురువీరు లభిమన్యుఁ గక్కసింప
నిక్కు జిగినొక్క మొగిపెక్కు కుక్కలెక్కి
పిక్క ప్రక్కయు డొక్కపే రుక్కుచెక్కు
మక్కుచిక్కించుకొన స్రుక్కె నక్కిటియును.

67

67. కోలాగ్రమునన్ = పందియెదుట. యేకలము == పంది. సెలసినన్ = విజృంభింపఁగా. గెడపినన్ = బాధింపఁగా, మక్కుచిక్కించుకొనన్ = అనిసిపోవునట్లు చేయఁగా.

సీ.

గుహఁ జొచ్చి నిదురించు కోల్పులి మేల్కొల్పి
                 బడిఁబిల్చుఁ దిట్టుఁ బైఁబడక యున్నఁ
దగ వేఁచి వేఁచి చన్ ద్రావు కూనం గొని
                 వాఁడు రాగవిడించి వచ్చి కాంచి
శిరమెత్తి వెనుక వంచిన మేనితోఁ దోఁక
                 చరచి చంగున మీఁది కురక దానిఁ
దల గుడ్డ నొడు పింత దప్పించి చేయిచ్చి
                 కుడికేల జముదాళి కొలఁదిఁ బొడిచి


గీ.

చించి తిత్తొల్చి కటిఁదాల్చి చిక్కు జింక
కొదమఁ జేఁబట్టి బెబ్బులి కోర మనును
గొడ్డలి ధరించి పులిపిల్ల నిడ్డవాని
కీశ్వరుఁడు వేఁటకని భూతి యిచ్చె నృపతి.

68

68. వేఁచి వేఁచి = కనిపెట్టి కనిపెట్టి. వాఁడు = ఆవేఁటకాఁడు. జముదాళి = ఆయుధవిశేషము. భూతి యిచ్చెన్ = బహుమతిఁ జేసెను.

సీ.

అలజగత్ప్రాణసారంగభంగప్రౌఢి
                 పావనమూర్తికి బలుచ ననుచుఁ

బశుపతి హస్తైణశిశుకప్రమథనంబు
                 సర్వజ్ఞునకుఁ గాని చంద మనుచు
ద్విజరాజశంబరవిదళనోల్లాసంబు
                 రాజచిహ్నమున కక్రమ మటంచు
నట యజ్ఞమృగశీర్షహరణవిహరణంబు
                 ఘనమార్గమునకు లాఘవ మటంచు


గీ.

దయ దలఁచెఁగాక కాకున్నఁ దరుల దరులఁ
గరుల వ్యాఘ్రాదుల వధించు ఘనున కెంత
యని వనీభూమి భూభుజు లభినుతింప
నఖిలమృగములఁ జెండాడె నధిపమౌళి.

69

69. పావనమూర్తికిన్ = వాయువుకనియు, పనిత్రునకనియు నర్థము. ఏణశుకంబు = లేడిపిల్ల. సర్వజ్ఞునకున్ = శివునికనియు, సమస్త మెఱిఁగినవానికనియు నర్ధము. రాజచిహ్నమునకున్ = చంద్రకళంకమునకనియు, రాజలక్షణమునకనియు నర్థము. ఘనమార్గమునకున్ = ఆకాశమునకనియు, గొప్పరీతికనియు నర్ధము. తరులదరులన్ = చెట్ల సమీపములయందు.

గీ.

వేఁటఁ జాలించి లాలించి యాటవికుల
నాగధాటీసమాటీకనాగధన్వి
మాగధాధీశుఁ డపు డేగె మాళవేంద్ర
మానసారమహెూద్యమోద్యానమునకు.

70

70. నాగధాటీ = ఏనుఁగులమీది దాడియొక్క, సమాటీకన = వెడలుటకు. అగధన్వి = రుద్రుడైన.

ఉ.

జాతికిఁ జుక్కవాల్ పిదపజాతికిఁ బువ్వులవాఁడు శంబరా

రాతికి నేస్తకాఁ డివమురాతికిఁ డంకముఖంబు యామినీ
భూతికి సాంధ్యనిద్ర నలభూతికిఁ బంచమశుద్ధి తుమ్మెదల్
వాతికి మేత గోరు తరువాతికిఁ వచ్చె వసంతుఁ డంతటన్.

71

71. జాతికిన్ = యోగ్యవంశమునకు. చుక్కవాలు = ఎదురుచుక్క అయినది. జాతికిన్ = జాజితీగకు. పువ్వులవాడు = పుష్పముల వాడిపోవునట్లు చేయునది. ఇవమురాతికిన్ = మంచనెడు శిలకు. టంకముఖము = ఉలిచివర. సాంధ్యనిద్ర (సంధ్యాకాలనిద్రవల్ల ఐశ్వర్యహాని) నల = పద్మములయొక్క.

క.

కాంత లతాంతామోదా
క్రాంతానంతంబు పాంథకాంతాస్వాంతా
త్యంతాగ్ని తాళవృంతము
శాంత హిమాశాంత మవ్వసంతం బలరున్.

72

72. అనంతంబు = ఆకాశము గలది.

మ.

అధిగౌరంబును బల్లవాళి కిడి బాణాదిక్షమాజోద్ధతిన్
మధురత్వంబు ఘటించి గోపికల సమ్మానంబు నిండించి తా
మధువు న్నవ్యమనోనివాసమునకు న్మన్నించి శైలీముఖా
స్యధృతోద్ధీపికఁ జొక్కు మాధవుఁడు రాధాఖ్యాబలాసక్తుఁడై.

73

73. ఈ పద్యమందు వసంతర్తుపరముగాను కృష్ణపరముగాను రెండర్ధములు. పల్లవాళికిన్ = చిగుళ్ళపఙ్క్తికి; పల్లవ = పాదలేశము, అళికిన్ = స్నేహితుఁడుగలవానికిఁ (అనగా పాదభక్తునికి.) అధిగౌరంబు = అధికమగు నెఱుపును, అధికమను నైర్మల్యమును, బాణా. . .ద్ధతిన్ = (బాణాది = నీలిగోరంటచెట్లు మొదలగు, క్షమాజ = చెట్లయొక్క, ఉద్ధతిన్ = అతీశయమును. బాణాది = బాణాసురుఁడు మొదలగువారియొక్కయు, నరకాసురునియొక్కయు, ఉత్ = గొప్పదియగు, హతన్ = కొట్టుటచేత) గో = భూమియందైన. పిక = కోవెలలయొక్క. గోపికల = గోపికాస్త్రీలయొక్క, మధువున్ = మకరందమును, పాలను, నవ్యమనోనివాసమునకున్= (అనగా మనసున కింపగుటకు) శైలీముఖ = తుమ్మెదలసంబంధమైన, బాణముల సంబంధమైన, ఉద్దీపిక = ప్రకాశము. మాధవుఁడు = వసంతుఁడు, కృష్ణుడు, రాధా = వైశాఖపూర్ణిమ, రాధాదేవి.

క.

మగధపతిఁ గాంచి వెలిమరుఁ
డగుదెంచె నటంచుఁ జైత్రుఁ డలరుల మేల్క
ట్లిగురుల తోరణములుఁ దగ
నగనగర మలంకరించె నా వన మొనరెన్.

74


శా.

పూచెం బొన్నలు, గ్రొన్ననల్ మొనసె, సొంపు ల్మీఱ సంపంగి పె
ల్లేచెం, బుష్పసమృద్ధి మల్లియలిచా లిందిందిరీబృందముల్
బ్రోచెం, గందము లందుగుల్ చిగురు గుంపు ల్నింపె, నింపారఁగాఁ
గాచెం బాలరసాలసాలములు సింగారంబుగా నామనిన్.

75

సీ.

అంగనాగాత్రాదిసంగోపమానంబు
                 ననవిల్తు సాన దీరిన లకోరి
స్తుతసంకుమదగంధచూర్ణసౌరభదాత
                 రాచిల్కదొర యెల్లి ప్రాపు దెలియ
ఆధ్వన్యచేతోహుతాశనవ్యజనంబు
                 బుడుత తెమ్మెరకును విడిన దంట
రత్యంతతాంతహృద్రసపునస్థితికర్త
                 చిదుమంగఁ దలకెక్కఁ జేయు దంట


గీ.

గర్వితారామభూమ్యలంకారకారి
చూడఁగలవాని చెలికాని జోడుకోడె
శోభనస్వాంతనామధేయాభినవము
క్రొవ్వి యయ్యెడఁ గ్రొవ్విరి నివ్వటిల్లె.

76

76. ఎల్లి = గొడుగు, చూడ...కోడె = మన్మథునికి మిత్రుడైన వసంతునికి సహాయుడైనది. శోభ...నవము = సుమనారి అను పేరుచేత నొప్పునది.

క.

అంతట నుపవనకేళీ
సాంతత్యంబునకు మానసారధరిత్రీ
కాంతకుమారి యవంతియ
వంతియపురి నుండి యమితవనితావృతయై.

77


సీ.

కర్ణాటి యొకతె చెంగావిపావడ వేయఁ
                 గరహాటి యొకతె బాగా లొసంగ
గాంధారి యొక్కతె కాళంజిచే నంద
                 ద్రమిడి యొక్కతె వీజనము వహింప
సౌరాష్ట్ర యొక్కతె చమరవాలముఁ బూన

                 బాహ్లికి యొకతె దర్పణము జూప
పాంచాలి యొక్కతె పాదుకల్ ధరియింప
                 నాతి యెక్కతె గిండి చేతఁబట్ట


గీ.

బర్బరీఘూర్జరులు బరాబరులు సేయఁ
బల్లకీ యెక్కి సల్లకీపల్లవోష్ఠి
వల్లకీవాణి వాణీప్రఫుల్లకీర్తి
గారవమ్మునఁ జేరె శృంగారవనము.

78

78. సల్లకీ పల్లవ = అందుగుచిగురువంటి.

శా.

పూవుందోఁట యొయారి జేరి బలితంపుంజందు రాతిన్నెలం
బూవుందేనియ సోనవాన చొతుకుల్ పోవైచు గొజ్జింగిపూ
పైవాటు ల్గలదాసనంబు గరిమం బన్నీటి మున్నీటి బల్
త్రోవం గట్టిన పచ్చమెట్టికలపైఁ దోడ్తోడ గ్రీడింపగాన్.

79

79. చొతుకల్ = చెమ్మలు. మెట్టికలు = మెట్లు.

క.

గళితమకరందలహరీ
కులకుహరీలహరి మహిజకుసుమసుగంధా
కులగమమహిమ హిమంబులు
మలయఁ దొడఁగెఁ గొమల యఱుత మలయానిలముల్.

80

80. లహ...రీలన్ = (లహరీ = తరంగములయొక్క. కుల = సమూహము గల. కుహరీ = గుహలయొక్క. ఇలన్ = భూమియందు.) హరి = పచ్చనైన.

చ.

కలువలతావిఁ ద్రావి బలుకప్రవనంబుల వంటి జుంటితే
నెల జడి దోఁగి గొజ్జఁగుల నీటికొలంకుల నీఁది పోకమ్రా
కుల విరిగుత్తు లత్తి చలి గుప్పిడి పుప్పొడి నప్పళించి య
య్యళి కచ సేదఁ దేర్చె నపు డందఁపు దందఁపుఁ గొండ పయ్యెరల్.

81


సీ.

శిరము కప్రఁపుదుమ్ము మరువంపుపాదుల
                 కెరువాటు వైచిన యింపు సొంపు
గమ్మతేనియనీళ్ళు గట్టి పుప్పొడి మట్టి
                 గోడకా ల్దీర్చిన ప్రోడతనము
గందంపుగూచముల్ పొందించి కురువేళ్ళ
                 నలవగాఁ గట్టిన యట్టి మహిమ
పన్నిచెట్టులచుట్టు బలువట్టివేళ్ళచే
                 గంచెఁ గావించిన గారవంబు


గీ.

తావి తమ్మి కెళాకూళి దండ నొప్పు
గొప్పపన్నీటికాల్వకు నుప్పరిగకు
సతుల జలసూత్ర మిడినట్టి యద్భుతంబుఁ
గాంచి రాజన్య మూర్ధన్యకన్యఁ బొగడె.

82

82. ఎరువాటు = చెట్లకుఁ జేయు దోహదము. గోడకాల్ = అడ్డుకట్టు. కూచముల్ = స్తంభములు, అలవ = దడి. కంచె = కంపనోట.

సీ.

తాల్చునా మఱ్ఱి మాధవుని ముద్దుమఱంది
                 యీపొన్నమీఁదఁ గ న్నిడియె నేని

శయనించునా సుధాజలధిఁ బన్నగశాయి
                 యీమంచుదొనఁ గటాక్షించెనేని
ముడుచునా లేరాచమొలక మిక్కిలికంటి
                 యీచల్లవిరజాజిఁ జూచెనేని
గొనిపోవునా వేల్పుకూఁటికుండ సుపర్ణుఁ
                 డీతేనెమావి యొ టెఱిఁగెనేని


గీ.

నుండుదురె చైత్రరథనందనోపవనుల
బాహుళరంభాశ్రయం బీయు పవన మింత
యింద్రనలకూబరులుఁ గాంచిరేని యంచు
నచ్చకోరాక్షి నెచ్చలుల్ మెచ్చి రపుడు.

83

83. చంద్రునియందు మఱ్ఱి యున్నదని ప్రసిద్ధి. లేరాచమొలక = బాలచంద్రఖండము. వేల్పుకూఁటికుండ = అమృతకలశము. ఒంటె = సులువు, రంభా = రంభయను నప్సరస యనియు, అరఁటిచెట్టు అనియును.

ఉ.

 అమ్మ పరాకు పోక వన మల్లదె చల్లనిమల్లికాగ్రకుం
జమ్మిదె కప్పురంపనఁటిసారువ లివ్వి రసాలసాలపుం
గమ్మనిపువ్వుఁదేనియలు కాలువ పొన్నదె యద్దె కంటివే
నిమ్మల చాయ గొజ్జఁకులనీటఁ దొలంగు దొనం దలోదరీ.

84

84. పొన్నదె = తిన్నఁగా గాన్నించుచున్నది యదిగో. దొన = చిన్నకాలువ.

సీ.

ఈ పారిజాతంబు లేపారినవి కొంత
                 యీపారి చూతమే యిందువదన
యా మల్లియల దాటి శ్రీమల్లి కుచవాటి
                 యామల్లుకొనియుండు నరుఁగదగదె
యా నిమ్మచాల్ త్రోవఁ బోనిమ్మవలవందు
                 నానిమ్మగువ వెట్టు టదియు వినవె
యీ నీరు చన నీదు రానీరు బడలిగా
                 రీనీరు కైదండ యింతగలదె.


గీ.

యమ్మ యిది కమ్మవిరితేనె యసలు సుమ్ము
కొమ్మ యిది ముమ్మరంబైన కుసుమరజము
ఠావులని దెల్పెఁ దేటమాటల వయాళి
నంగజహయాళి గయ్యాళి యగు ప్రియాళి.

85

85. ఈపారి = ఈపర్యాయము, ఆమల్లుకొని = ఆవరించి. వలదంచు = అడ్డుకోవద్దని. ఆన = ఒట్టు. ఈరు బడలినారు = మీ రాయాసపడినారు. కైదండ యీనీరు = హస్తావలంబ మియ్యనీయరు. అసలు = బురద. వయాళిన్ = వనవిహారమందు. అంగజహయాళి = చిలుకలపఙ్క్తికి. గయ్యాళి = ధిక్కరించి పలికేది. ప్రియాళి = ఇష్టసఖి.

ఉ.

మిన్నరచేఁత బట్టు కడిమిం జెలి యొక్కతె కొప్పు చక్కఁజె
క్క న్నటియించు కైతవము గైకొని వేనలి మోపు జేకొనం
గన్నియ యోర్తు కై యొసఁగు కైపునఁ జన్గవ మోవ నొక్క క్రీ
డ న్నలినాక్షియుం బిడికిట న్నిలువన్ రహిమధ్య మానఁగన్.

86

86. కైపునన్ = శోభచేత, (అనగా మిషచేతనని తాత్పర్యము.) ఇం దాచిన్నదాని యవయవములను చెలికత్తె లవలంభించిరని తాత్పర్యము.

సీ.

చిఱునవ్వు చిలుకుచోఁ జెలియోర్తు లేఁగొమ్మ
                 రాలు క్రొవ్విరులంచుఁ గేలుసాచుఁ
గొసరు పల్కించుచో బినరుహాక్షి యొకర్తు
                 వనకీరమంచు నల్వంక వెదకఁ
గీల్గంటు వీడుచోఁ గిసలయోష్ఠి యొకర్తు
                 తనుగంధగమ్యాళు లనుచు జోపఁ
బయ్యెద యొక్కంత బైలైనచో నింతి
                 యెకతె దాడిమ శంక నొడియఁజూడ


గీ.

నొకతె బాగా లొసంగ వేఱొకతె సురటి
వీవ మఱియోర్తు సమభూమిఁ బావ లిడఁగ
నెండపొడలకు వ్యజనంబు నెత్త నొకతె
తేలె నారామ యారామకేళిపాళి.

87

87. కొసరు = కోరిక. బాగాలు = పోకచెక్కగుండ మొదలగునది యుంచి చుట్టిన తమలపాకులు. (బిడాలు.) పావలు = పాదుకలు, ఆరామకేళిపాళిన్ = వనవిహారపఙ్క్తిని (బహువిహారము లనుట.)

సీ.

చెంగావిపావడచేత నితంబాంబ
                 రం బెల్ల సుమధావనంబు గాఁగఁ
గులుకు గుబ్బల నంటికొన్న రవికె పచ్చి
                 గంధంపునెఱిపూత యంద మొంద
సీమంతసిందూరసిక్తవజ్రలలంతి
                 చొక్కంపుఁగెంపు చేర్చుక్క గాఁగఁ

గరఁగి చెక్కుల పట్టు గనుపట్టు కస్తూరి
                 నింతి కంతుని మదదంతిఁ జెనక


గీ.

గమ్మనీరుదకంబు మైగంద వొడియుఁ
దరులవీరులకు నొకవింతతావిఁ గట్ట
దొట్టుకొన్నట్టి చెమటలు దుడిచె నొకతె
చికిలికాటుక నునురేక చెదరకుండ.

88

88. పావడ =- గాగరా, సుమధామము - కుసుంబారంగు, సీమంత = పాపిడియందైన. లలంతి = పాపిడిచేరు, చెక్కులపట్టు = గండప్రదేశము. కమ్మనీరు = పన్నీరనెడి, ఉదకము =జలకము. గంధవొడి = బుక్కా, దొట్టుకొన్నట్టి = క్రమ్మిన. చికిలి = నున్నని.

చ.

చెమటలు దొప్పఁదోఁగు జిగిచెక్కులు పువ్వులు రాల మూపులం
దుమికెడి కొప్పులు న్నొసఁటఁ దుంపెసలారెడు చేరుచుక్కలుం
గమికెడు గుబ్బచన్నుగవ గాసికిఁ బాసిన జారు పయ్యెదల్
గమకపు వాలుగన్ను లెసఁగం బొసఁగించిరి కేళి బాలికల్.

89

89. దొప్పదోగు = నిండుగా గ్రమ్మిన, మూపులన్ = బుజములపైని, దమికెడు = నటించునట్టి, తుంపెసలారెడు = ఊగుచున్న, కమికెడు = కందునట్టి, గమకపు = సొగసైన.

చ.

చనుఁగవమొగ్గ లన్నిజభుజాకుజశాఖల నవ్వుఁబువ్వులం
దనులతలం గచభ్రమరదంపతులం బదపల్లవంబులం

గన నధరోష్ఠబింబములఁ గమ్రవచోమధుపాళిఁ బొల్చి ర
వ్వనమున దాము కాము వనవాటికలో టన నవ్వధూటికల్.

90

90. కుజ = చెట్లయొక్క. కచ = కేశములనెడి. కనత్ =ప్రకాశించుచున్న, కమ్ర = మనోహరములైన, మధుపాళి = మధు = మకరందముయొక్క, పాళి = ప్రవాహము.

శా.

పువ్వుందీవెల తూఁగుటుయ్యెలల సొంపుల్ నింపఁగాఁ దూగు న
ప్పువ్వుంబోఁడుల గబ్బిగుబ్బవలిపెంబుల్ జారి వర్తింపఁగా
నవ్వేళన్ సరిదూఁగ రమ్మనుచు భూషారావభాషార్భటిం
గ్రొవ్వుల్ మీఱఁగ వేల్పు జవ్వనులకుం గొంగిచ్చి నట్లొప్పెడిన్.

91

91. వలిపెంబుల్ = సన్నబట్టలు, భూషా.. ర్భటిన్ = (భూషా = అలంకారములయొక్క, ఆరావ = = ధ్వనులనెడి, భాషా = వాక్యములయొక్క, ఆర్భటిన్ = ఆటోపముచేత.) కొంగిచ్చినట్లు (శౌర్యముగలవారు శత్రువుపై యుద్ధమునకు రమ్మని కొంగువిసరుట ప్రసిద్ధి.)

ఉ.

వాలిక చూపు మించుగమి మచి ముఖేందుపరిద్యుదారహా
రాళికయై విహారలసితాలసతాగసితాగ్రఘర్మవా
శ్శాలి కపోలపాలికపసం బొసఁగించె లతాంతడోలికా

కేళిక రాజు బాలికవి
కీర్ణకచం బొకచేతఁ జెక్కుచున్.

92

92. ముఖేందు. . .ళికయై = ముఖేందు = ముఖచంద్రునికి. పరిది = పరివేష మై. ఉదార = అతిశయమైన. హారాళిక = హారపఙ్క్తి గలది. (అనఁగా ఊగునప్పు డెగిరిన హారములమధ్యమున ముఖము పరివేషమధ్యచంద్రునివలెఁ గాన్నించెనని.) విహార...పాళిక = విహారలసిత = వనవిహారమువల్లఁ బ్రకాశించుచున్న. అలసతా = మాంద్యముచేతఁ. గ్రసిత = మ్రింగబడిన. అగ్ర = శ్రేష్ఠమైన. ఘర్మవాః = చెమటనీటిచేత, శాలి = ఉప్పుచున్న.కపోలపాళిక = గండస్థలముగలది, వనవిహారమువల్ల చురుకు తగ్గి అందువలన చెమటార్చుకొనిపోవుచున్నదని.

క.

హేలాగతి లీలావతు
లీలాగునఁ జాలలోలదేలా లతికా
డోలా ఖేలావేలా
ధీ లాలిత లగుచుఁ గేలిఁ దేలెడు నెడలన్.

93

93. చాలన్ = విస్తారముగాను. లోలత్ = ఆస్తకములగుచున్న, (ధీశబ్దమునకు విశేషణము.) ఏలాలతికా = ఏలకితీఁగె లనెడు. డోలా = ఉయ్యెలలయొక్క. ఖేలావేలా = క్రీడాసమయమందైన.

క.

వేటాడినపిమ్మటఁ బూ
దోఁటకు నిజమంత్రిసఖులతోఁ జను నృపుఁ డా
పాటలవాటుల నుయ్యా
లాటలఁ బాటిల్లు తటిదపాంగం జూచెన్.

94

94. పాటలవాటులన్ = పాదిరిచెట్ల వరుసలయందు, దపాంగన్ = మెఱుపువలెఁ జలించు క్రీగంటిచూపు గల చిన్నదానిని.

ఉ.

చూచి మరీచి వీచి పదచుంబితబింబవిడంబితాధరం
బీ చనుగబ్బిగుబ్బ వగ లిట్టి విలోచన రోచి యింత చె

ల్వేచెలి యందుఁ జూడమని యిక్షుశరాసనవాసనాగ్రనా
రాదపరంపరాభవనిరంతరజర్ఝరితాంతరంగుఁడై.

95


చ.

అనధరపానసౌఖ్యదశనాగ్రవినిర్దళితోష్ణకంబచుం
బనయుతలోచనం బనఖమద్గీతగండతలం బపాణిఘ
ట్టనమిళితాచలత్కుచతటం బదృభవదంకపాళిభే
లనపరితాంతగాత్ర మబలామణి దీని గణింప శక్యమే.

96

96. ఆచలత్ = పర్వతములై యాచరించుచున్న. అంకపౌళి = ఆలింగనము. ఈ విషణములవల్ల ఆచిన్నది పురుషసంయోగము లేని కన్యకయని తోఁచుచున్నది.

చ.

అలరుల తీవ యుయ్యెల యొయారపుటాటల గన్న యిన్నెలం
తల తలమిన్నహారగతనాయకరత్నము శక్రకార్ముకాం
చలచలచంచలాలతికస్మారకరాహృతచాపమౌర్వికా
మిళితశరం బిట న్నికటమిశ్రవిధానము గాక కొంచెమే.

97. శక్రకార్ముక = ఇంద్రధనుస్సుయొక్క. చంచలాంతిక = మెరుపుదీగ. స్మార = మన్మథసంబంధమైన. ఉయ్యలలోనున్నచిన్నది హారములోని నాయకమణివలెను, ఇంద్రధనుస్సులోని మెఱుపువలెను, మన్మథధనుస్సులోని బాణమువలె నున్నదనియు, దగ్గరనున్న నిధితో సమానముగా నుండెనని తాత్పర్యము.

క.

నెలచుట్టు నెమ్మొగము వె
న్నెలముట్టు సడల్చు నగవు నెత్తమ్ములకుం
దలకట్టులైన యడుగులు
దలచుట్టుఁ గనుంగవయు నితంబిని కొప్పున్.

98


క.

కనుముక్కుతీరు కులుకుం
జనుముక్కులసౌరు కొఱఁతఁ జనుచెక్కులు గో
త్రను దొక్కు పిఱుఁదు వరుదౌ
విన మెక్కుడు బిరుదు చెల్లు వెలఁదికి నీడున్.

99

99. చనుముక్కులు = చూచుకములు. కొఱఁతఁజను = లోటులేని. గోత్రను = భూమిని. (వెలఁదికి) ఈడున్ = సమానముగ నుండుదానిని. వినము.

క.

మొన్నం దలోదరులచే
విన్నందుల కిందుఁ జూడ్కి విందుగఁ దీనిం
గన్నందులకున్ డెందము
విన్నందన ముడిపెఁ గౌను విన్నందంబై.

100


క.

శృంగారసరసి నీలభు
జంగఁపుటూర్పున జనించు శైవలమధ్యా
భృంగసృతిరీతి జడతో
నం గన సీమంతవీథి యలరె నయారే.

101

101. సృతి = ప్రవాహము. సీమంతవీథి = పాపిడి. (శృంగారరసస్సులో జడయను పాము బుసకొట్టఁగా నాచు తోసుకొనిపోయి త్రోవ యేర్పడినట్టు పాపిడి ప్రకాశించెనని.

క.

తానెంత యెగసిపడినం
గానీ దీని కుచములకుఁ గందుక మెనయే
నానాటఁ జక్రములెగ
ట్లైన న్మఱి వన్నెవాసి యగు జోడునకున్.

102

102. చక్రవాకములే పర్వతము లైనట్లయితే చక్రధర్మమున్ను,పర్వతధర్మమునుగూడ కలిగియుండుటచేత సమానములగునని.

క.

దీని చను గబ్బిగుబ్బలు
లే నఖ వజ్రముల నప్పళింపుచు నధరా
నూనసుధారసధారలెె
యానిన దేవేంద్రపదవి యది యెంతంచున్.

103


క.

ఆకాంతారములో నపు
డాకాంతారత్న మోహనాకారకళల్
భూకాంత మౌళిఁ గనుటకు
నేకాంతలతావితానగృహమున నిలచెన్.

104


క.

విరితీవల యుయ్యాలల
హరువు విడిచి సుమచయాపహరణవిహరణా
దరణచణప్రచరణలై
యరుణాంబుజచరణ లప్పు డలరుం బొదలన్.

105

105. హరువు = విలాసము. అపహరణ = కోయుటయనెడి. ఆదరణచణ = ఆదరముతోఁ గూడిన.

శా.

ఈవే మంజరి మంజరిం జిదుమవే లేమల్లికల్ మల్లికా

కోవే మాధవి మాధవిం గదియఁబోకో పాటలిం బాటలీ
తేవే మాలిక మాలికా నుసలకేతే కేతకుల్ కేతకీ
రావే వల్లిక వల్లికా యచట నీరల్దూరగా నేటికిన్.

106

106. కోవే = పుచ్చుకోవే. నుసలక = ఆలస్యము చేయక, ఈరల్ = పొదలు. (ఇందు మంజరి మంజరి ఇత్యాది రెండు శబ్దములలో నొకటి చెలికత్తెల పేరు.)

సీ.

పాటలీతరులకై పాట లీనఁగ నేల
                 పాటలీకము సుమ్ము పంకజాక్షి
వట్టి వేరున కీవు వట్టివేరులు చేయ
                 వట్టివేరుటము లింపైనచెలికి
లే మావి తేనియ లే మావి యనిచాట
                 లేమా విచారంబు లేదె లేమ
పొన్నమా నిపు డింత పొన్నమానిని కిమ్ము
                 పొన్నమా నినుబోటి కన్నెలంత


గీ.

పొగడ కై లాఁతిఁ దగునటే పొగడ మగుడ
ననటి మాత్రంబునకు నట ననటి యనకు
దాడిమల కేల బాలపై దాడి మగువ
దిరిసెనము కంటె యిది విరుల్ విరిసెననుచు.

107

107. పాట లీనఁగ నేల = పాటల బాడ నెందుకు, పాటు = ఆయాసము. అలీకము = ఇష్టము కానిది, (ఇంపైన చెలికి, రుటములు = రూఢములు. అట్టివే.) ( తేనియలే, మావి, అనిచాటలేదా) పొన్నమానినికిన్ = ఆకనఁబడు స్త్రీకి, అమా = తల్లీ, అన్నెలంత = నినుబోఁటికీ. పొన్ను = బంగారము. (అనఁగా బంగారమువలె గౌరవించదగినది.) లాతిన్ = అన్యుని. పొగడఁదగునటే. నటన నటి నటన = నాట్యముఁ జేయునట్టి. నటి = ఆటకత్తె. దాడిమలకు = దానిమ్మలకు, దాడీ = జగడమునకుఁబోవుట.

లయవిభాతి.

మిసమిసని చన్నుగవశిపసకు వెస మార్మసలు
                 నసమకళిక ల్చిదుమ నెసఁగు తరిశాఖా
విసరములు గమ్మఁగర బిస నటనఁద్రోఁచి దర
                 హసనములతో మలయజసలహరికాస
త్కుసుమసమితి న్ముసరుభసలములసోఁగ జెడ
                 విసరి పొసఁగించి రోగిఁ బ్రసవహరణంబుల్
గిసలయనిభాతి పదలసనముల శోణరద
                 వసనముల నింపెసఁగు నసదృశకృణాంగుల్.

108


మ.

జలజాక్షీ, సురపొన్నయు న్వకుళము న్సంపంగియుం గ్రోవివా
విలి గోఁగుం దిలకంబుఁ జంపకము మావిం బ్రేంకణంబుం న్విరుల్
దలచూపెన్ హసియింపఁ దన్న మొగమెత్తం గౌఁగిటం జేర్చ నూ
ర్పులిడం బల్కు నదల్పఁ గల్లుమియఁ గేల్బొందిచినం బాడినన్.

109

109. సురపొన్న, వకుళ, సంపఁగి మొదలగునవి, హసియించుట, తన్నుట మొదలగు దోహదవిశేషము లిందు వర్ణితములు.

సీ.

వచనోన్నతికిఁ బ్రసనము గోఁగు గనిపించె
                 గంకేళి వనపదగతి కొసంగె

శ్రీమదిరం జొక్కి చిల్కెఁ బొగడపువ్వు
                 కమ్మపూల్ వాడఁ బ్రేంకణము సల్లె
వాదనస్ఫూర్తిని వచ్చె సంపఁగి విరుల్
                 హస్త మానఁగ నిచ్చె నలరు మావి
పుష్పము ల్దర్శనంబున కీనెఁ దిలకంబు
                 నవ్వించఁ జూపె సూనములఁ బొన్న


గీ.

కొఱవి కుసుమంబు లాశ్లేష గరిమ కిడియె
వావిలి సుమంబు లిడియె నాశ్వాసమునకు
నల వసంతంబు మించిన ఫలము లిడఁగ
గడఁగు టబ్రంబె వితరణఘనతరులకు.

110

110. అల వసంతంబు మించినన్ = వసంతరుతువు అతిశయించఁగా. వచన ...గనిపించె. మాటాడుటచేత గోగుచెట్టు పూసెను. ఇది గోగునకు దోహదము. ఈప్రకార మంతట నూహించవలెను, కంకేళి = అశోకము. రదగతికిన్ = పాదపుతాకునకు. శ్రీమదిరన్ = శోభగల మద్యముచేత. పాడన్ = గానము చేయఁగా, వాదన = హస్తవాద్యముయొక్క. దర్శనంబునన్ = చూపుచేత. కొరవి = గోరంటచెట్టు, ఆశ్లేష = ఆలింగనముయొక్క. ఆశ్వాసము = నిట్టూర్పు, వితరణఘనతరులన్ = (వితరణఘన = దాతృత్వముచేత గొప్పవియగు. తరులకున్ = చెట్లకు.) ఈపద్యమందు విద్యావంతుల విద్యలవల్లఁ బ్రభువులు బహుమతు లిచ్చిరని యర్ధాంతరము. ఎట్లనిన, వచన్నోతికిన్ = వాక్యగౌరవమునకు, పదగతికిన్ = శబ్దరీతికి. శ్రీమదిరన్ = శ్రీమత్ = శోభగల. ఇరన్ = వాక్యముచేత, పాడన్ = గానము చేయఁగా, వాదన = మృదంగాదివాద్యములయొక్క, హస్తమానఁగన్ = తాళము వేయఁగా, దర్శనంబు = శాస్త్రము. నవ్వించన్ = విద్యచే నానందింపఁజేయఁగా. అశ్లేష = అట్టి శ్లేషయొక్క. ఆశ్వాసము = గ్రంధముయొక్క అంశము. వితరణఘనతరులకున్ = దాతృత్వముచేత మిక్కిలిగొప్పవారైన వారికి, ఫలములిడఁగఁ గడఁగుట - కోర్కె లియ్య నుద్యోగించుట.

ఉ.

కేవల పుష్పభారమునకే తలవంచుట తత్ఫలాశి సం
సేవకు దూరమైతి నను చింతలనో యిఁక నీళ్ళువోసెదం
దావక పల్లవాప్తి రతి నాలుగు కాయలు గాచినన్ రస
జ్ఞావలి మెచ్చు నూరువగ లంది చలించుట రంభ మానవే.

111

111. రంభ = ఓఅరటిచెట్టా, పుష్పభారమునకే = పువ్వు బరువునకే. తత్ఫ... సేవకు = దానిపండ్లు దినువారిని బొందుటకు. తావక....రతిన్ = (తావక = నీసంబంధమైన. పల్లవ = చిగురుయొక్క, ఆప్తి = పొందుటయందు. రతిన్ = ఆసక్తిచేత, రసజ్ఞావళి = నాలుకలగుంపు. ఊరువగలు = తొడలయొక్క విలాసములు. ఈ పద్యమందు మఱియొక యర్థము దోచుచున్నది. రంభయనుపేరుగల యోచిన్నదానా, కేవలపుష్పభారమునకే = రజస్వలయైనందుకే. తత్ఫలసేవకున్ = రజస్వలయైనందుకు ఫల మనుభవించువారిని బొందుటకు, దూరమైతినను చింతలనో = లేనిదాన నైతినను విచారముచేతఁ గాఁబోలు, నీళ్ళువోసెదన్ = స్నానము జేయించెదను, తావక ...రతిన్ = (తావక పల్లవ = నీ విటకానియొక్క. ఆప్తి = కలుసుకొనుటచేతనైన. రతిన్ = సంభోగముచేత.) నాలుగుకాయలు గాచినన్ = నలుగురు బిడ్డలు గల్గినయెడల, రసజ్ఞావళి = రసికులపఙ్క్తి. నూరువగలు = వందవిచారములు, చలించుట = వణఁకుట.

క.

కొరవులె కొరవులు కేసర
తరువులె తరువులు సమీరతరుణాదరముల్
దరముల్ కల జాగరములు
గరములు మనవంటి విరహకాంతల కబలా.

112

112. కొరవులె = గోరంటచెట్లే కొరవులు = కొరకంచులు, తరువులు = మావద్దబదులు తీసిన సొమ్ము తెమ్మని నిర్బంధించువారు. సమీర తరుణ = చిన్నగాలియందు, ఆదరములు = ఆసక్తులు. దరములు = భయములు (అనఁగా భయంకరములు.) గరములు = విషములు.

చ.

ఇగురుల జొంపముల్ కొరవు లెచ్చిన క్రొంబొగ తండము ల్పయి
న్నెగయు మిళిందబృందములు నిండిన పుప్పొడితేనెజల్లు దు
మ్ముగమియుఁ బోతనీరుఁ బికము ల్దెగబిట్టుగఁ ద్రోచువారుగా
జిగిఁ దళుకొత్తెఁ జైత్రుఁ డిడు చిచ్చుసుమీ యలమావి నెచ్చెలీ.

113

113. తెగ బిట్టుగన్ = కష్ట మతిశయించునట్లుగా, త్రోచువారుగాన్ = అగ్ని నెగఁద్రోయువారు అగునట్లుగా.

క.

కదలి కనుగొంటివా యీ
కదలిమరందంబు ముదిత కదలి నయోరజో
క దలిర్పఁ దేఁటి పాటల
కదలిక యిఁకఁ జేరి వినవె కద లికుచ కుచా.

114

114. కదలి = వెల్లి. ఈ కదలి = ఈ అరటియొక్క, ముదిత = సంతోషింపఁజేయఁబడిన. కత్, నింద్యములైన, అలిన్ = తుమ్మెదలు గల. అయో = అక్కటా, జోకదలిర్పన్ = సొగసొప్పునట్లుగా. కదలిక = చురుకుదనము, వినవె కద = వినకున్నావుకదా, లికుచకుచా = నిమ్మపండ్లవంటి స్తనములుగల చిన్నదానా.

వ.

అని మఱియు గట్టువాకట్టు చనుకట్టు గట్టివా
‘మిటారులు కలిగొట్టు చెబ్బు చుట్టు బిట్టురువడిం దిరుగు
రోలంబ కుటుంబ పాళి వనీవనిత తిరుపుగట్టం గనుపట్టు

కానెనీలిమ యంచు నెంచుచు, మాటిమాటికిఁ గొరవి విరి
గుత్తిపై వ్రాలి యెగయు భసల పఙ్క్తిఁ గొమ్మ పుష్ప
మంజరులు గ్రాయు ముసలంబని గుసగుసలాడుచుఁ దపసి
చిగురాకునకుం బ్రదక్షిణంబులు సేయు భ్రమరాళికఁ
దత్పయోజబీజాక్షమాలికయని పోలికల సందుకొనుచు,
నందంద లతాకుందబృందంబులకు దూరంబారు నిందింది
రావళి యిందిరానందనుం డిందీవరగంధులపై వైచు
వాటుబల్లెంబని చాటుచు, సకలవకులముకులంబు
లపై వ్రాలు బంభరడింభకవీథి యంభోజబాణుండు
వియోగినీ కుచకుంభంబులు దాకనేయ సాయకంబులం
దగిలిన యందలి కస్తూరిబొట్టులని ప్రస్తుతింపుచుఁ, బొదలు
గడలి యెగసి నడుము నెడతెగని బారుదీరిన మగతేఁటి
దాటు నామనిదొర చెలికాని రాకకుఁ గట్టిన కలువతో
రణంబని పేరుకొనుచుఁ, దదీయదళంబున వ్రాలు షట్చ
రణరాజి రంభ వెన్నంటి రాజిలు కీలుజడయంచు నొడంబ
డచు, జుమ్ముజుమ్మున నేరేడుతండమ్ములఁగ్రమ్ము తుమ్మె
దచాలు కాలజాంబవనికాయంబులని కోయని డాయుచు,
నరవిరి బాగునం గనుపట్టు మెట్టతమ్మిరేకు తుదలం
దట్టమ్ముగా జుట్టుకొన్న పుష్పంధయశ్రేణి యారామ
రమాకరంబునకుఁ దోడుగ బల్మినిం బట్టిన నీలంపుగా జ
నుచు, గజిబిజింపుచు, నమితకుసుమితలతావితానకుంజ
పుంజోపరితిర్యక్పరీతచంచరీకరేఖ యనేకపంబునకు
వెలిపట్టుజూలు బిగియించిన వెండ్రుకత్రాఁడని కొనియా
డుచు, మరుం బాడుచు, గురువిందమ్ముల యందములను

మోదించుచు, నరవిందబృందంబులను సోలించుచు, మొల్ల
లకు నరుగుచు, మల్లెలకుం దిరుగుచు, విరవాదులం జిదు
ముచు, గన్నెఱ్ఱఁజేయుచు, గన్నేరులుగోయుచుఁ, గురు
వకంబుల డాయుచు, మరువకంబుల మాయుచు, సన్నజా
జులం దేరుచుఁ, గన్నెమావుల నిలుచుచు, దిన్నెరావులం
గొలుచుచు, మదనుమావులం బట్టుచు, నదనుతావు
ల మెట్టుచుఁ, బరువులు వెట్టుచుఁ, దరువులు సుట్టుచు, మధు
పతతిం దెచ్చుచు, మథుగతి న్మెచ్చుచుఁ, జిగురులు ద్రుం
పుచుఁ, బొగరులు దెంపుచుఁ, బువ్వుల రువ్వుచు, గ్రొవు
ల నవ్వుచు, వికవిక నగుచు, నకనక నగుచుఁ, దలతల
మనుచుఁ, గొలకొల మనుచు, మరుల జరింపుచు, విరుల
హరింపుచు, విహరించిరి ముకానవసరంబులు గునియ
నయ్యవసరంబున.

115

115. గట్టువాకట్టు = పర్వతముల నోరుగట్టునట్టి, చనుకట్టు = స్తనములుగల, గట్టివామిటారులు = రాగలైన స్త్రీలు, ఇది మొదలుగా కొనియాడుచు అను పర్యంతమును తుమ్మెదలయొక్క వర్ణనము. రోలంబ = తుమ్మెదలయొక్క, కుటుంబ = జాతులయొక్క, పాళి = పఙ్క్తి. తిరుపుగట్లన్ = తిరుగగా, కాసెనీలిమ = కాసెవోకయొక్క నలుపు, భసలపఙ్క్తిన్ = తుమ్మెదల బారును. పుష్పమంజరులు = ఈ పేరుగల ధాన్యమును, పువ్వులగుత్తుల ననియును. క్రాయుముసలంబు = దంపునట్టి రోకలి, తపసి = అవిసెచెట్టు, తపశ్శాలియనియును. సందుకొనుచున్ = గ్రహించుచు. ఇందిందిరావళి = తుమ్మెదలపఙ్క్తి. ఇందిరానందనుండు = మన్మథుఁడు. వాటుబల్లెంబు = దెబ్బదగులుబల్లెము. బంభరడింభక = తుమ్మెదపిల్లలయొక్క. దాటు =సమూహము. ఆమనిదొర = వసంతుఁడు. చెలికానిరాకకున్ = మన్నథుని రావడమునకు. తదీయ = ఆ యరటిచెట్టు సంబంధమైన, షట్చ రణరాజి = తుమ్మెదలపఙ్క్తి, రంభ = అనటిచెట్టు, ఆ పేరుగల స్త్రీయనియును, కాల = నల్లనయిన. జాంబవ = నేరేడుపళ్ళయొక్క. అరవిరి = సగమువికాసముయొక్క, పుష్పంధయ = తుమ్మెదలయొక్క. గజిబిజింపుచున్ = కలతపడుచు, తిర్యక్పరీత = అడ్డముగా వ్యాపించిన, చంచరీక = తుమ్మరలయొక్క, రేఖ = వరుస. అనేకపంబునకున్ = ఏనుఁగునకు, సోలించుచు = మూర్ఛనొందం జేయుచు (అమగా కోయుచు) మరువకంబులన్ = మరువములచేత, మాయుచున్ = ధూసరవర్ణము గలవారౌచు, తిన్నెరావులన్ = అరుగులు వేసిన రావిచెట్లను, మదనుమావులన్ = చిలుకలను, అదనుతావులు = సమయానుకూలస్థలములు, పొగరులు దెంపుచు = ఒకరిగర్వ మొకరు అణచుచు. నకనక నవ్వుచు = అలసినవారౌచు, మనుచున్ = వృద్ధి యగుచు, మరులన్ = కామముచేత, ముక్తా = ముత్తెముల యొక్క, నవ = నూతనములగు, సరంబులు = హారములు, గునియన్ = కదలుచుండగా.

సీ.

పూవుఁగొమ్మలు వంప బోనేటి కే యన్నఁ
                 జేమించెదే యభిరామబాహ
చిగురుటా కేటికే చిదిమెదన్నను గయ్య
                 మునకుఁ గాల్దువ్వెదే మోహనాంగి
పసరుమొగ్గలు గోయఁ బాడియే యనఁ బంటఁ
                 బగఁ బూన నేటికే భవ్యరదన
మల్లికావల్లికల్ గిల్లఁ జెల్లదటన్న
                 నొళ్ళేల విరిచెదే యుజ్వలాంగి


గీ.

సంపెఁగలు ద్రుంపఁ జనరాదు చాలింపు మనినఁ
బదరి ముక్కునఁ గోపముంచెదు సునాస
యనుచు నొండొరు నర్మోక్తు లాడుకొనుచుఁ
బ్రసవహరణంబు మాని సంభ్రమముఁ బూని.

116

116. ఈ పద్యమందు ఆరుచరణముల పర్యంతము నర్మోక్తులు ఎట్లంటే = పూవుగొమ్మ నేల వంచినావని యొకచెలికత్తె అడుగగా అభిరామబాహ అని సంబోధనచేత మనోహరములు చేతులుకలదానవు గనుక. (చేమించెదే = దెబ్బలాటకు వచ్చెదవా అనియును,నేను వంచునట్టి పూవుగొమ్మను హస్తసౌందర్యముచే నతిక్రమించెదననియును తాత్పర్యము. కడవఱకు నీరీతినే సంబోధనలకును, జవాబులకును సార్థక్యము నూహించవలెను. చిగురుటాకుకును కాలికిని సామ్యము. అది మోహనాంగి పసరుమొగ్గలకును, దంతములకును సామ్యము. అది భవ్యరదన = మంచిదంతములు గలది, మల్లికలకును, ఒళ్ళు = దేహమునకును సామ్యము, ఉజ్వలాంగి = ప్రకాశంచుచున్నదేహముగలది. సంపెంగలకును ముక్కుకు సామ్యము. అది సునాస = మంచి ముక్కు గలది.

క.

నాళీక మధూళీ సుమ
పాళీ కమనీయ కిసల ఫల పటల నట
న్నాళీక మరాళీ భ్రమ
రాళీక మహా సరోవిహారాదరలై.

117

117. భ్రమర = తుమ్మెదలయొక్క, అళీక = పఙ్క్తిగల.

సీ.

ఆ సారసేక్షణల్ కాసారతటిఁ జేరి
                 మై సారమణు లంత మరక తిగిచి
సవరగా సవరించు సవరముల్ వదలించి
                 కలికి బాగొలయఁ గీల్గంట్లు వైచి
తల తల తలమంచు దల మించు వలి మంచు
                 వాలించు వలిప పావడలు గట్టి
యలగుండు బులుగుండు బలుపాండురాబ్జంబు
                 పజ్జ వ్రాల్ సతి మేలుబంతి యనుచుఁ


గీ.

గొలను నడుచక్కి కొప్పుల కుప్పలుప్ప
రముగఁ గుప్పించి రుడువీథి రాయ గుభగు

భధ్వనుల లేచు సరసి కాంభఃకణములు
స్వకచ వికచప్రసవ శంక సంఘటింప.

118

118. కాసారతటిన్ = సరస్తీరమును. మై = శరీరమందలి, సారమణులు = మంచిరత్నములను, వాలించు = అతిక్రమించునట్టి, గుండుబులుఁగు= జక్రవాకము, ఒప్పులకుప్పలు = సౌందర్యవతులనుట. ఉరుకుటచేత చెదరిననీకు వీరికొప్పులలోనిపువ్వులు తూలుచున్నట్లున్నవి.

స్రగ్ధర.

అంతం గాంతల్ లతాంతాహరణవిహరణాన్యోన్యసంచారజాత
శ్రాంతుల్ జారంగఁ దన్నీరజరజములపై వ్రాలుచుం దేలుచుం జ
న్బంతుల్ కాంతుల్ రథాంగీపటలి కెరవిడం బండువై యీదులాడన్
స్వాతానంతానురక్తిన్ సలిపిరి సరవిన్ సారకాసారసీమన్.

119

119. లతాంత = పుష్పములయొక్క, రథాంగీపటలికిన్ = స్త్రీచక్రవాకసమూహమునకు, ఎరవిడన్ = ఎరువుగా నియ్యగా.

ఉ.

గట్టుల గట్టు గట్టి చనుకట్టు జిగిం గనుపట్టు గట్టివా
గట్టున కేగి యోర్తు తలఁగట్టుక రింగున వాలి లోతు గ
న్పట్ట మునింగి తేలి తనపాణి నస ల్గొని చూపె దీనిలోఁ

బుట్టిన తమ్మి యింటికయి పోలు నటే యని చూపు కైవడిన్.

120

120. ఈపద్యము ప్రథమచరణమునకు అర్థము 116లోౌ మొదటియర్ధమువల్లఁ దెలియును. అసల్ = బురదను. దీనిలోన్ = ఈబురదలో. ఇంటికయిపోలునటే = నాకిల్లు గావడమున కనుకూలించునా. (అనఁగా నేను పద్మగృహముగల లక్ష్మివలె నుంటినా అని తాత్సర్యము)

క.

జగరాఁగ యొకతె దిట్టుచు
మగువా! నాసరికి నీదుమా, యన నదియున్
మొగ మెగఁ జేయుట కెలయుట
తగినదిగద యీత నీళ్ళఁ దగు సతి కనియెన్.

121

121. జగరాఁగ = ప్రసిద్ధమైన గడుసుతనము కలది. కెలయుట = విజృంభించుట, ఈతనీళ్లని = ఈదునట్టిజలములయం దనియు, ఈతచెట్లయొక్క నీళ్ళచేత (అనఁగా మద్యముచేత) ననియు, మొగ మెత్తుటయు, విజృంభించుటయు రెండిఁటియందును గలవనుట.

రగడ.

అప్పుడు కొంద ఱరుణ నంద
                 నాబ్జబ్బందములను ద్రుంచి
నిపుణ చాటు ఫణితి నీటు
                 నిగుడ వ్రేఁటు లాడ నెంచి
జలజ నాళముల విశాల
                 సరస లీలఁ గొట్టులాడి
కలువ దుమ్ము తరుచు గమ్ము
                 గమ్ము చిమ్ములాటఁ గూడి

యొడలు సన్నజాజి పొన్న
                 యొరపుఁ గన్న సరసి నించి
యడరుచుండు బిసముఁ జెండు
                 సంచ పిండు నెడచి పొంచి
యెడలఁ బ్రాచి యెడలఁ ద్రోచి
                 యెగయు వీచికలను దేలి
కడ తరంగములఁ బొసంగఁ
                 గదలు చెంగలువల వ్రాలి
చలువ బావి తొనల తావి
                 జంటయీవి కాత్మఁ జెలఁగి
కులుకు గుండుఁ బులుఁగు దండు
                 గుబ్బు నిండుటలకుఁ గలఁగి
తేట మీటు గన్న జూటు
                 తేఁటి దాటు పాట మెచ్చి
గాటమైన హంసయాన
                 కలన పూన డెంద మిచ్చి
గాలి గొట్టి పొరలి నట్టి
                 కరడుఁ దట్టి యిట్టిలీల
నాలి పాలి హాలిఁ దేలి
                 యంబు కేళి సల్పువేళ
గుబ్బ బంటి నీట నొంటి
                 కూలమంటి దుమికె నొకతె
దబ్బరాడి జనములోడి

                 తరుణిగూడి గదిమె నొకతె
తగిలి పట్టు మనుచుఁ దిట్టు
                 తన్విఁ చుట్టు పెట్టె నొకతె
మగుడి పెట్టు కాని యొట్టు
                 మాన్పనట్టు గొట్టె నొకతె
యీత నీటిలోనఁజాటి
                 యిసుము పాటి కెత్తె నొకతె
లోతు గానఁబోయి సేన
                 లోగి నాన యెత్తె నొకతె
యోల యెన్ను కన్న యన్ను
                 నొరసి వెన్నుఁ దన్నె నొకతె
సోలి చిక్కువడక నిక్కు
                 చుట్లఁ జిక్కు వన్నె నొకతె
వెలఁదు లెల్ల నీదు లెల్ల
                 వెడల నొల్ల దాయె నొకతె
పొలది ప్రల్లదములఁ జల్ల
                 బోరగిల్ల మోదె నొకతె
జాతిఁ బెట్టి యీదు నట్టి
                 సకియఁగొట్టి డాగె నొకతె
నాతి దెంచు నెరుల మించు
                 నాచటంచు లాగె నొకతె
కలిగెఁ దామర యని రామ
                 కరము ప్రేమ గిల్లె నొకతె

కలికి బేడస యని ప్రోడ
                 కన్ను జూడ మళ్లె నొకతె
గురు రథాంగ మని లతాంగ
                 కుచము జంగ చరచె నొకతె
తరుణిఁ బొంచి శిరమువంచి
                 దరిని ముంచి పరచె నొకతె
కనలి కొమ్ముఁ గొని కరమ్ము
                 కలికిరొమ్ము దాచె నొకతె
మొనసి గాత్రమైన నేత్ర
                 మున సునేత్ర వైచె నొకతె
కొదమ తమ్మకంటిఁ గమ్మి
                 క్రోవెఁ జిమ్మి నవ్వె నొకతె
ముదిత హత్తి కడకునెత్తి
                 మొల్లగుత్తి రువ్వె నొకతె.

122

122. గమ్ముచిమ్ములాట = గమ్ముమనునట్టుగా నీళ్ళుఁ జల్లుకొనుట. బిసముఁ జెండు = తూఁడుఁ గొఱుకుచున్న. ఎడలన్ = ఆయాస్థలములయందు. ప్రాచి = నాచు. కడ =దగ్గిర. జంట = సమీపము. గుబ్బు = గుండెలు కొట్టుకొనుట. మీటు = పెంపు, జూటు = మోసముగల, గాటమైన = అతిశయించిన, కరడున్ = తరంగమును, తట్టి = తాకి, ఆలిపాలి = చెలికత్తెలపఙ్క్తి, హాళిన్ = విహారమును, గదిమెన్ = బూకరించెను, తిట్టు = ఒట్టుఁ బెట్టునట్టి. తుట్టు బెట్టెన్ = నష్టము కలుగఁజేసెను. కాని యొట్టు = అయోగ్యమైన యొట్టు, నట్టు గొట్టెన్ =అడ్డుకొనెను, సాటికిన్ = దృష్టాంతమునకు, సేన = విస్తారముగా, లోగి = అలసి, ఓలయెన్ను = ఓలయని పలుకుచున్న, కన్నయన్నున్ = చూచిన స్త్రీని. ఒరసి = దగ్గరయై, చుట్లన్ = తిరగడములచేత, ఎల్ల = హద్దు, వెడలనొల్లదాయెన్ = దాటలేకపోయెను పొలది = అల్లది, ప్రల్లదములఁజల్లన్ = కారుమాటలాడఁగా, జాతి = ప్రతిజ్ఞ (అని తోచుచున్నది.) (లేక ఒట్టు అని.) తెంచు = కొప్పు విడినట్టి, నెరులన్ = వెండ్రుకలను, తామరగలిగెన్ = పద్మము దొరకెను. బేడస = మత్స్యవిశేషము. రథాంగమని = చక్రవాకమని, లతాంగ =స్త్రీయొక్క, జంగచరచెన్ = దాటిపట్టుకొనెను. నాతిదెంచు అను చరణము మొదలు గురురథాంగ అను చరణమువఱకు భ్రాంతులు. కొమ్ము = చిమ్మనగొట్టము. తాచెన్ = కొట్టెను. గాత్రమైన = శరీరమందైన. నేత్రమునన్ = వస్త్రముచేత, వైచెన్ = కొట్టెను. క్రోవిఁ జిమ్మి = చిమ్మనగ్రోవి విసరి, (అనఁగా నీరు చిమ్మనగ్రోవితోఁ జల్లి.) హత్తి = పట్టుకొని.

క.

ఈలీలఁ దేలి విహృతులు
సాలించి నృసాలతనయ సహయౌవతయై
కేలీసరస్తటమునకు
వ్రాలి లతాతన్వి యొకతె వడిఁ దడియొత్తన్.

123

123. సహయౌవతయై = స్త్రీసమూహముతోఁ గూడినదై.

చ.

పనుపడిఁ బూను సారె తెలిపావడపై నెరిపట్టుకుంచెఁ గ
ట్టిన యపరంజిపువ్వులు ఘటించెడు చందురుకావిఁ గట్టి పే
ర్చిన యరజారుకొప్పున ధరించి విరుల్ మృగనాభినాభియై
తనరఁగఁ దీర్చి కుంకుమ కదంబము పూసె విలాసరాశియై.

124

124. పనుపడన్ = అనుకూలముగా. పావడ = గాగరా. కుంచె = కుచ్చెళ్ళు. మృగనాభి = కస్తూరిచేత. నాభి = బొడ్డుగలది. కదంబము = పరిమళవస్తువులన్నియు గలిపిన ముద్ద.

సీ.

పరువంపువిరవాది విరులరంగాన రాఁ
                 దురిమిన నెరజారుతురుము దనర
గ్రొమ్మించు నిర్మించు కమ్మపంజులతళ్కు
                 లుదిరి చెక్కులతోడఁ జదురు లాడ
నిగరంపుఁజనుకట్టు నగరంపురవికెమేల్
                 సరిగకుట్టులమెట్టు సడల నిక్క
బిళ్ళల మొలనూలు బిగిడాలు పైపెడల్
                 తొడలనిగ్గు నొకింత తోడుఁ బిలువ


గీ.

విలువ యిడరాని చెంగావి చెలువు నెఱిక
నాభి విభవంబు పొన్నక్రొన్ననలు నించఁ
జంచలాపాంగ చెంగట నుంచు మించు
టద్ద మించుక వీక్షించు నవసరమున.

125

125. తురిమిన = ముడిచిన, తురుము = కొప్పు, ఉదిరిచెక్కులు. చదురులు = విలాసములు. (అనగా పరిహాసములు) నిగరంపు = మెరుగైన. నగరంపు రవికె = నాగరికత గల రవిక, సరిగ = జలతారుయొక్క. కుట్టులమెట్టు = కుట్టులమడతలు. సడలన్ = విడిపోవునట్లుగా. డాలు = కాంతియొక్క. పైపెడల్ = పైపార్శ్వములు. నెఱికన్ = కుచ్చళ్ళ యందు

సీ.

బవిరి సొంపుల చెంపపని కప్పునిడి యొంట్ల
                 కడినీలములకప్పు గప్పుగుప్ప
నొరయు కుళ్ళాయి పొన్ విరుల చెక్కుల చక
                 చ్చకలతో వన్నెవాసికిఁ బెనంగ
వరచట్టమయి కుంకుమాంబువు నడికట్టు
                 చెంగావిమై జిగి జికిలిచేయ

నడుగు కెంజిగురు సోయగ మింద్రగోపంబు
                 పాపోసులకుఁ జాయ పసలు జూపఁ


గీ.

జంద్రికాహాస లఖిలపుష్పములుఁ జిదుమ
విన్న నైయున్న తోఁటకు వింత సన లొ
సంగ సాక్షాత్కరించు వసంతుఁడనఁగ
ధరణికాంతుఁడు పొడచూపెఁ దరుణి యెదుట.

126

126. బవిరసొంపుల = గుండ్రనిసొగసుగల, చెంపపనికిన్ = గండస్థలముల దిద్దుటకు, అప్పున్ = బదులును. ఒంట్ల = పోగులయొక్క. కప్పు = నలుపు, కప్పుగుప్ప = కప్పున వ్యాపించగా, పొన్ విరులు = బంగారుపువ్వులు, అరచట్టమై = వస్త్రవిశేషమై. కుంకు...గావి = కుంకుమ నీ రానిన నడుము కట్టుబట్టమొక్క యెఱుపు, మైజిగిన్ = శరీరచ్ఛాయను. ఇంద్రగోపంబు. పాపోసులకున్ = ఆర్ద్రపురుగు రంగుగల పైజార్లకు, చంద్రికాహాసలు = స్త్రీలు.

గీ.

అప్పుడా రాజవాహన క్ష్మాధిపునిఁ బ్ర
పంచనాళీకగుణగణైకాంచనాఢ్యుఁ
గాంచ నాళీకతనుమనోవంచనార్ధ
పంచనాళీకుఁ గాంచె నా కాంచనాంగి.

127

127. ప్రపంచము - జగత్తునందలి. (అళీక = అప్రియము.) నాళీక = ఇష్టములైన, గుణగణ = గుణసమూహములచేత. ఏకాంచన = ముఖ్యమైన పూజతోడ. అఢ్యున్ = కూడుకొనిన కాంచనా...నాళీకున్) = కాంచన = బంగారము. ఆళీక = స్నేహితురాలుగాగల. తను= శరీరముగల స్త్రీలయొక్క, మనోవంచనార్థ = మనస్సుయొక్క మోసము చేయుటకొఱకైన. పంచనాళీక = మన్మథుడైన. రాజవాహనునికి విశేషణములు.

క.

చూచినఁ జెలి లికుచత్కుచ
చూచుకముల్ మేర మీఱఁ లో జూచెం గన్నుల్

ద్రోచి ముఖమాక్షమించఁగఁ
జూచె దనయంప దొనలఁ జూచె మరుండున్.

128

128. లికుచత్ = గజనిమ్మపండ్లయి అచరించుచున్న. మేరమీర జూచెన్ = హద్దుదాట నారంభించినవి. (స్తవము లుబ్బినవి. నేత్రములు వికసించినవి. మన్మథుఁడు కొట్టనారంభిచెనని తాత్సర్యము.

చ.

చెలి యటఁ జూచి లేచి తనచేడియపై నొరఁగెం జలద్దృగం
చలములు గ్రమ్మ పంజు నునుసానలఁ దీరఁ బదాఱువన్నె గం
టల మొలిచూలు జారఁ జరణమ్ముల ఱంపున గిల్కుమట్టియల్
ఘళు ఘళు ఘళ్ళనన్ నృపశిఖామణి యుల్లము ఝల్లు ఝల్లనన్.

129

129. పంజునునుసానలన్ = పంజుకమ్మలనెడు నున్ననిసానలయందు, చరణమ్ముల ఱంపునన్ = పాదముల కలకలముచేత.

సీ.

కలికిచెక్కుల డాలు కమ్మపంజుల మేలు
                 తళుకుల కసరంజి బెళుకు గులుక
ముదురువెన్నెల క్రొవ్వు జిదుము క్రొంజిగినవ్వు
                 దంతకాంతికి మొల్ల తావి గట్టఁ
పసిఁడిపంటల కెగ్గుఁ బరపు చన్గవ నిగ్గు
                 పటు కక్షరుచితోడ బంతులాడ
నందంపు మైచాయ సందిదండల చాయ
                 నుడికి సంపఁగిమొగ్గ యొప్పుగుప్పఁ

గీ.

 గప్పు నెరివిప్పు కొప్పు నగ్గలఁపు సొలపు
నిలుపు చూపును వలపుల పొలపుఁ దెలుప
నృపు తలఁపు రేపె నపుడు మాధుపదాపాంగ
సాన మొనదేరిన యనంగశర మనంగ.

130

130. పంటెలు = కుండలు. కక్ష= చంకయొక్క, రుచితోడన్ = కాంతితోడ, సందిదండలు = బాజుబందులు. మాధుపత్ = తుమ్మెదసమూహమై యాచరించుచున్న. అపాంగ = క్రేగంటిచూపుగల యాచిన్నది.

క.

అబ్బిత్తఱికిం గన్నుల
పబ్బమ్ముగఁ జూచు నపుడు ప్రమదంబునఁ బె
ల్లుబ్బెడు గబ్బి మెఱుఁగు చన్
గుబ్బలచే రవికె నుగ్గునూచములయ్యెన్.

131

131. కన్నుల పబ్బమ్ముగన్ = కనుపండువగా, నుగ్గునూచములు = ముక్కముక్కలు.

వ.

ఈ వైఖరి నారాజశేఖరు నఖిలలేఖాలభ్యరేఖావిలాస
రేఖాచుయూఖావళికిం జొక్కి యక్కంజముఖీశిఖా
మణి సఖీగ్రామణితో నిట్లనియె.

132

132. అఖిలలేఖ = సమస్తదేవతలకు, అలభ్య = పొందశక్యము గాని, లేఖా = సౌందర్యముయొక్కయు, విలాస = విలాసముయొక్కయు, రేఖా = పఙ్క్తితోఁ గూడిన, మయూఖ = కిరణములయొక్క (అనఁగాఁ గాంతియొక్క) సఖీగ్రమణి = చెలికత్తెలలో శ్రేష్ఠురాలు.

ఉ.

కంటినే కల్వకంటి మనకంటికి వేలుపుగట్టుచంటిపా
లింటికిఁ దుంట వింటిదొరలీలల మీఱినమేటిబోఁటి యీ

పంటవలంతి ఱేఁడు మణివంటి చొకారపు వీని మోవి పై
గంటి యొకింతసేయు కలకంఠి యకుంఠితభాగ్య మెట్టిదో.

133

133. వేలుపుగట్టుచంటిపాలింటికిన్ = మేరువువంటి కుచములుగల స్త్రీలపాలిఁటికి. ఈ రాజు మనకంటికిని స్త్రీలపాలిటికిని మన్మథునివిలాసములను మించియున్నవాఁడనుట.

క.

చక్కని రాకొమరులలోఁ
జక్కనివాఁ డజర జగపుజగజోటులకుం
దక్కని దొర ధర సతులకుఁ
జిక్కని రాజన్యపాలశేఖరుఁడు చెలీ.

134

134. అజర జగపి= స్వర్గసంబంధమైన. జగజోటులకున్ = జగత్ప్రసిద్ధులైన స్త్రీలకు.

క.

నరులను గనమో సురకి
న్నరులన్ వినమో ముకుందనందన పౌరం
దరులంగనుఁగొనమో యీ
ధరణీధరతరణిఁ బొగడఁ దరమే తరుణీ.

135

135. ముకుం...దరులన్ = మన్మథజయంతులను . ధరణీధరతరణి = రాజసూర్యుఁడు.

సీ.

శ్రీకారములు తావకాకారములఁ జెందె
                 నని వీనులకుఁ దెల్ప నరిగె ననఁగ
ఫాలంబుఁగని చిక్కె బాలేందుఁడని తమః
                 కమలంబు లిరువంక గదిమె ననఁగఁ
బలుకుఁదేనియఁ గూర్చు పలుమొగ్గతావికై
                 బరతెంచు లేఁదేటిబా రనంగఁ

గాండ యుక్తాబ్జప్రకాండదళచ్యుతా
                 గ్రస్థితస్ఫుటమౌక్తికం బనంగ


గీ.

నాయతవిలోచనంబులు నత్యుదంచ
దలక వదనము మీనపు మొలకచాలు
ఖరయుగళపాణి శాఖానఖంబు లడర
నీతనికి నొప్పుఁ గదె యఖండేందువదన.

136

136. ఈ పద్యముందు సీసచరణములలోని యుపమేయవస్తువులకుఁ గ్రమముగా నన్వయము.

వ.

మఱియును.

137


క.

తరుణి దొరఁ జూచె దొరయుం
తరుణీమణిఁ జూచె మధురధర్మధరుండున్
ధరణిపురందరు నురమున్
గురు కుచ కుచభరము శరము గురిగాఁ జూచెన్.

138

138. మధురధర్మధరుఁడు = తీయనినింటిని దాల్చిన మన్మథుడు.

సీ.

రాజుపైఁ గొఱగాని రహిఁజూచి తనవాలు
                 మొక్కపరచు నగుమోముఁ దలఁచి
శూరుఁడన్నఁ జలించు తీరెంచి తనతూపు
                 జులకఁజేసిన వాడిచూపుఁ దలఁచి
కాంచనాహృతి పాతకంబెన్ని తన యల్లిఁ
                 జెఱకుఁ గూర్చిన సోగ నెఱులు దలఁచి
పలు మొనఁబేటెత్తు పసఁగాంచి తన విల్లు
                 దునియ నాడిన బొమదోయిఁ దలఁచి


గీ.

వలచినట్టి యొయారి జవ్వనిని గలఁచి
యలఁచి యల చిత్తసంభవుఁ డనెడు బోయ

సూన నారాచములఁదొంటి సూడుఁ ద్రిప్పెఁ
బగ మరల్పని వాఁడొక బంటె జగతి.

139. ఇక్కడ రాజు యొక్క అవయవములు మ్మథుని యాయుధములందు దోషము లెన్నినట్లు చెప్పినాఁడు. తనవాలున్ = పద్మము. రాజుపైన్ = చంద్రునిపైనియనియు; అధికారిపైవనియును. తూఁపు = కలువ. శూరుఁడు = శౌర్యముగలవాడనియు, సూర్యుఁ డనియును. తనయల్లి = నారియైన తుమ్మెద. కాంచనాహృతి = బంగారయు దొంగిలించుటయనియును, సంపెంగవచేతనైన హరించుట యనియును. చెఱకుఁగూర్చిన = ఖైదు చేసినయనియు, నిక్షువు సంధానముఁ జేసిననియును, తనవిల్లు = చెఱకు. పలుమొనఁ జేటె = అనేకముఖములుగా బారిపోవు అనియు, చాలామొలకలెత్తు అనియు. అలచి = ఆయాసపెట్టి, సూడున్ = విరోధమును.

క.

ఆలోపలనె యవంతి మ
హేళా జనయిత్తి దర్శయిత్రీకృత పు
త్రీలాలిత ధాత్రీ నే
త్రాలోకన విఘ్నధాత్రి యై యచ్చటికిన్.

140

140. అవంతియొక్క. మహత్ = పూజ్యుయగు. ఇలాజనయిత్రి = ఇలయను పేరుగలతల్లి. దర్శయిత్రీకృత = త్రోవఁజూపునదిగాఁ జేయఁబడిన. పుత్రీలాలిత = కొమార్తెచే గారవించఁబడు చెలికత్తెగలది. (అనఁగా కొమార్తెయొక్క చెలికత్తె యిలాదేవికి నుద్యానవనపుత్రోవఁ జూపుచున్నదనుట.) ధాత్రీనేతృ = రాజుయొక్క.

ఉ.

వే యరుదెంచి కాంచి తగవే తగవేగన వచ్చి యెంతసే
పాయె నపాయమే యిది కృపాయతలోచన రాచపట్టి కీ

పాయపుటింతి కింపగు నుపాయము లేయవి యో సువర్ణపు
త్త్రీ యని తోడుకొంచుఁ జనియెన్ సనయం దనయిష్టపుత్త్రికన్.

141


గీ.

పుట్టినిలు డించి యత్తయి ల్మెట్టినట్టి
కోడలి తెఱంగు చెఱకుచే న్వీడనాడి
బందెదొడ్డికిఁ జనుకోడె చంద మొంద
నుపవనముఁ బాసి తనయింటి కువిద జనియె.

142


శా.

రాఢామాహురమఖ్కికా కటకధా రాకొండవీడ్కొండప
ల్లీఢిల్లీనగరాముదానగరఘూళీమండువాపండువా
ప్రౌఢాంభోరుహలోచనా కుచతటీపాటీర పత్రక్రియా
గాఢారూఢ కరాంబుజీ. కృత నతక్ష్మాదేవ కంఠీరవా.

143

143. పండువా అను పర్యంతము పట్టణముల పేర్లు, క్ష్మాదేవ = రాజులు, శ్రీరామమూర్తికి లొంగినరాజు లందరును స్త్రీలయొక్క గండస్థలములయందు మకరికాపత్రములు వ్రాయుచు స్వేచ్ఛావిహారులైయున్నా రనుట.

క.

పుష్కరబాంధవసంభవ
కిష్కిందారాజ్యపూజ్య కృద్భుజశరదా
నుష్కాగ్రణి సేనానీ
పుష్కరిణీతీరభవన పోషితభువనా.

144

144 పుష్కరబాంధవసంభవ = సూర్యపుత్రుఁడగుసుగ్రీవునికి. సేనానీపుష్కరిణీ = స్వామిపుష్కరిణి యనుసరస్సు.

పంచచామరము.

కృపా ప్రపా విపాటితార్తి ఖిన్నకిన్నరవ్యధా
తపా ద్విపాద్ద్విపాయితస్వ ధన్యమాన్యపాదలో
లుపాధిపా జపాధిపా కలుబ్ధబుద్ధిమ త్పత
ద్విప ద్ద్రుషచ్ఛిదా విధాపనీ భవచ్చవిచ్ఛటా.

145

145. కృపా...తపా = దయయనెడు. ప్రపా = చలిపందిరివల్ల, విపాటిత = పోఁగొట్టఁబడిన (ఆతపమునకు విశేషణము.) ఆర్తిఖిన్న = పీడచే దుఃఖించుచున్న. కిన్నరవ్యధా = కిన్నరులబాధ యనెడు, ఆతపా = యెండగలవాఁడా, ద్విపాత్ = మనుష్యులకు. ద్విపాయిత = ఎనుఁగై యాచరించుచున్న. స్వ = తనయొక్క. ధన్యమాన్య = యోగ్యులకు బూజింపఁదగిన, పాద = పాదములయందు. లోలుపాధిపా = ఆసక్తిగలవారికి నధిపతియగువాఁడా, జప = ధ్యానముయొక్క, అధిపాక = పరిపాకమందు. లుబ్ధ = ఆసక్తిగల, బుద్ధిమత్ = బుద్ధిగలవారియొక్క. పతత్ - ఆక్రమించుచున్న, విపత్ = ఆపదలనెడు. ద్రుషత్ = ఊళ్ళయొక్క, చిదావిధా = బ్రద్దలు చేయుటయందు. పవీభవత్ =వజ్రాయుధమౌచున్న. ఛవిచ్చటా = కాంతి సమూహముగలవాఁడా.

గద్య
ఇది శ్రీమద్రా మభద్ర భజనముద్ర కవిపట్టభద్ర కాద్రవే
యాధిప వరసమాగత సరససారస్వత లహరీపరిపాక
కాకమానిమూర్తిప్రబోధ బుధకవిసార్వభౌమ
పౌత్ర రామలింగభట్టపుత్ర కౌండిన్యగోత్ర
భాగధేయ మూర్తినామధేయ ప్రణీ
తంబైన రాజువాహనవిజయం
బను మహాప్రబంధంబునందుఁ
తృతీయాశ్వాసము