రాజయోగసారము/ప్రథమ ప్రకరణము

శ్రీ ర స్తు

రా జ యో గ సా ర ము

———*****———

ప్రథమ ప్రకరణము

శ్రీగణనాథు నాశ్రితపరిపాలు
నాగమసంవేద్యు నాధారసదను
ననిశంబుఁ గీర్తించి యతిభక్తి మెఱయ
ననువుగఁ దఱికుండహరిని మహాను
భావుని భవ్యరూపాంచితు నెంచి
పావనమూర్తిని బరమపావనుని
వేదాంతవేద్యుని విశ్వతోముఖుని
నాదవినోదిని నలినలోచనుని
నాదినారాయణు ననిశంబు మదిని
మోదంబుతో మర్మమును దగుత్రోవ
యందుంచి యచలతత్వార్థంబుసరణిఁ
బొందించి భావించి పుణ్యప్రయుక్త
ఘనత యెసంగు గంగాయమునలకు
ననుపొందుమధ్యయౌ నాడికాగ్రమునఁ

జెలువారు ఘనమేరుశిఖరంబునందు
లలిని విజ్ఞప్తికళామాత్రుఁ డగుచుఁ
బరుఁ డౌచు వెల్గు సుబ్రహ్మణ్యగురుని
చరణరేణుచయంబు సారెసారెకును
శిరమున ధరియించి చిరభక్తిఁ బెంచి
పరమరహస్యంబు భావమం దుంచి 10
రహి మీర సోమేశ్వరస్వామిఁ దలఁచి
మహితముక్తిప్రదమార్గమునొందు
కొఱకు విద్యారణ్యగురుని భజించి
వఱల బ్రహ్మేంద్రులఁ బ్రస్తుతి చేసి
ఘనత మీర స్వయంప్రకాశులఁ దలఁచి
యనఘాత్ముఁ డగుసచ్చిదానందగురుని
కారణుం డగుమల్లికార్జునగురుని
ధీరుఁడౌ నవధూతదేశికోత్తముని
నచలితపరమహంసాఖ్యసద్గురుని
నచలభక్తుని బడబానలగురుని
నలరు సుజ్ఞానయోగానందగురుని
నిల ధన్యులై నజితేంద్రియగురునిఁ
గరమర్థియై పరకాయప్రవేశ
గురుని నిత్యానందగురురాజచంద్రుఁ
డరయ నిరంజనుఁ డనుగురు మదిని
నిరతంబు వేఁడుచు నెమ్మిమై మిగులఁ

గాంచు బోధానందఘనుపదాబ్జంబు
లంచితభక్తిమై నాత్మయందుంచి
కుదురుగ మది నిట్టిగురుపరంపరను
సదమలహృదయనై సన్నుతిచేసి 20
సర్వయోగీంద్రులు సంతసింపంగ
నుర్వియం దీరాజయోగసారంబు
వఱల నే ద్విపదకావ్యముగ రచించి
యెఱుకయౌ హరి కియ్య నెడఁదఁ దలంచి
మున్నుగ నాచందములు తేటగాఁగ
విన్నవించెద మీకు విశదంబుగాను
వినరయ్య కవులార విద్వాంసులార
వినరయ్య మీరెల్ల విమలాత్ములార
ఘనయతిప్రాససంగతుల నేనెఱుఁగఁ
దనర నాక్షేపింపఁ దల్పకుఁ డెలమి
శ్రీకరుం డగునారసింహునికరుణ
నీకథాప్రారంభ మెసఁ జేసి తలర
మహితాత్ములార ధర్మాసక్తులార
మహిమాఢ్యుఁ డగుకర్దమప్రజాపతికి
ననుకూలవతి యగు నాదేవహూతి.
యనుసత్పతివ్రత కవనీతలాన
ననురాగయుక్తుఁడౌ నమ్మహాపుర్షుఁ
డెనసి పుత్త్రికల తా నింపుగఁ గాంచి

తనయులు లేక డెందమునఁ జింతించి
యనుపమంబైనఘోరాటవి కరిగి 30
పరమాత్ముఁ గూర్చి తపం బాచరించె
నరుదుగఁ బరమాత్ముఁ డమ్మహాత్మునకుఁ
బరఁగఁ బ్రత్యక్షమై పల్కె నిమ్మాడ్కి
వరమేమి నీకుఁ గావలె నని యడుగ
విని కర్దముఁడు చాల వేడ్కఁ బ్రార్థించి
యనియెఁ గృపాంబుధి యంబుజనయన
పరమాత్మ నీవు నాపట్టి గావలయు
వరమిదె చాలు నేవర మొల్ల నింక
ననవుఁడు పరమాత్ముఁ డావరమిచ్చి
తనరార నంత నంతర్ధానుఁ డయ్యె
నావేళ కర్దముఁ డరిగి మోదముగ
దేవహూతిం గూడెఁ దిరముగ నంత
వెన్నుండు పరికించి వేడ్కతో వచ్చి
యున్నతుఁడై దేవహూతిగర్భమున
గరిమమై జనియించెఁ గపిలుఁ డనంగఁ
గరమర్థిఁ బెంపొంది ఘనుఁ డయ్యె నంతఁ
బూని కొన్నాళ్లకు బుణ్యచారిత్రుఁ
డైనకర్దముఁడు నిజాత్మజుం జూచి
నావరపుత్త్రక నావంశతిలక
నీవు నాసుతుఁడవై నిజముగ నన్నుఁ 40

జెన్నలరంగఁ బ్రసిద్ధిచేసితివి
అన్న నాకోరిక లన్ని ఫలించె
న్యాయంబుఁ దప్పక యానందముగను
బోయెద నింకఁ దపోవనంబునకు
ననుచు సమ్మతిఁ జేసి యాక్షణంబునన
తనవధూమణికిఁ దాఁ దద్వివరంబు
నలరారఁ దెల్పిన నాదేవహూతి
పొలుపొందఁ బతిపదంబులయందు వ్రాలి
పూని యిట్లనియెఁ దాఁ బుణ్యాత్మ యేను
మానసంబునుబట్టి మఱియొంటి నుండఁ
జాల నే నీవెంటఁ జనుదెంతు ననిన
నాలలితాంగికి నతఁ డిట్టులనియె
భామ నీ వీరీతిఁ బలుక నేమిటికిఁ
బ్రేమ నాయందున్నఁ బెక్కుధనంబు
నీకుమారుడు ధర్మనిపుణుండు గాన
నీకు జీవన్ముక్తి నిజముగ నొసఁగు
వనమున కీవు రావలసిన దేల
వనిత యిచ్చటన నీవ్రతము ఫలించు
నని యొప్పఁజెప్పి యాయతివను సుతుని
నొనరంగ వీడ్కొల్పి యుచితమార్గమున50
వరతపోధనదసద్వనమందుఁ జేరి
పరమేశు నెద నుంచి ప్రార్థించుచుండె

నెమ్మి నాకపిలుఁడ నేకవత్సరము
లిమ్ముగ జనకుని యెస నాజ్ఞనుండి
పాయనిసంసారపథ మాత్మఁదలఁగ
మాయావిరహితుఁడై మౌనియై యంతఁ
గాననంబున కేఁగఁ గా దేవహూతి
యానందనుంజూచి యనియె నిమ్మాడ్కి
వరపుత్త్ర నీతండ్రివాక్యంబు నేఁడు
సరవి మఱచితె నీస్వాంతమునందు
నానాఁడు నీతండ్రి యరిగెడువేళ
నేను శోకింపఁగ నినుజూపి వగపు
నణఁచి కానకు నేఁగె నమ్మహామహుడు
గుణరత్న నిన్నుఁ గన్గొనుచు నేచింత
నెఱుఁగక యుండితి నిన్నాళ్లుదనుక
మఱి నీ వదియు నొగి మది నెంచకుండ
జనకాజ్ఞ వదలి విచ్చలవిడిగాను
నను విడనాడి కానకు నేఁగఁ దగునె
తల్లితండ్రులు పరదైవంబు లంచు
నెల్లవా రనుచుండ నెఱుఁగవే నీవు60
నీమదిలో నుండునీతి భావించి
యేమున్నమాటాడుమెల్ల నిల్కడగ
అన విని కపిలాఖ్యుఁ డల్లన నవ్వి
తనతల్లి నీక్షించి తా నిట్టు లనియె

§§§తల్లికిఁ గపిలుఁడు విరక్తిమార్గము బోధించుట§§§

ఏలకో జనని నీ కీపామరంబు
చాలించు నిది వట్టిజాలి జగాన
తలిదండ్రు లెవ్వారు తనయు లెవ్వారు
దెలియ బుద్భుదము లీదేహంబు లెపుడు
కాయ మస్థిర మని కడఁ గాన లేక
పాయక సంసారబద్ధులైమమత
వదలక కామ్యార్థవాంఛితు లగుచు
మదమత్తు లగుచు దుర్మార్గంబునొంది
మదిలోన నుబ్బి కామక్రోధలోభ
మదమోహమచ్చరా ల్మాటికిఁ బెంచి
సంపద గల్గితే సామర్థ్య మంచు
సొంపగు తుచ్ఛమౌ సుఖమును గోరి
కామాంధు లై తమగతి గానలేక
భామలవలలోనఁ బడి లేవలేక
తఱగనియీషణత్రయవార్ధిలోన
మఱిమఱి మునుఁగుచు మమత రెట్టింప70
నాలుబిడ్డల కనియర్థంబు గూర్చి
కాలంబు నూరక గడుపుచు నుండి
యంతకాలము వచ్చినప్పుడు యముని
చింతఁ జేయుచు హింసచేఁ గంది గుంది
కూపంబు లోఁబడి కొన్నాళ్లు కఠిన

పాపాత్ము లగుచుం బ్రపంచంబునందుఁ
బుట్టుచు గిట్టుచుఁ బొరలుచుండెదరు
ఇట్టిపుట్టులు చావు లెన్నంగ వశమ
యన దేవహూతి నిజాత్మజుంజూచి
యనియెఁ గుమార! యీయవనీతలానఁ
బట్టుగ నిరతంబు బహురూపపటిమె
నిట్టిపిండోత్పత్తి యెట్లగు ననిన
విని కపిలుండు సద్వినయంబు మెఱయ
జననితో నిట్లనె సంతసంపడఁగ.

§§§పిండోత్పత్తిలక్షణము§§§

 
విను మింక దల్లి తద్వృత్తాంత మీవు
తనరంగ నన్నమదంబును మించి
సతిపతు లిద్దఱు సంతసం బలర
రతి సల్పఁగా ననురాగంబు మించి
నెలవుగ శుక్ల శోణితములు రెండు
కలసి యేకంబుగ గర్భమందుండి 80
నెఱి నది యైదింట నీటిబుగ్గౌను
పఱిదగ గట్టియౌఁ బదిదినంబులకు
నమరి పదేనింట నండమైయుండు
స్థిమితమై నెలనింట శిరమేరుపడును
బరగ నేలల్ రెంటఁ బదకరంబులును
సరవిగ నేర్పడు చందము దెలియ

నొనర నెలల్ మూఁట కుదరంబు గల్గు
ననబోడి నాల్గింట నడుము పార్శ్వంబు
లొందును బాదంబు లొందు నాపైని
బొందుగ నాఱింటఁ బుట్టు నేత్రములు
సరవి నేడవనెల సరగ జీవుండు
పరఁగఁ బ్రవేశించుఁ బాయక యంద
మఱియు నష్టమమాస మహితతేజమును
బఱిదగ విజ్ఞానపరధనం బలరి
లలి ధాత్రిఁ బ్రసవకాలంబునువఱకు
మలమూత్రములఁ జిక్కి మఱి యాత్మఁ గుంది
కటకటా! నాపూర్వకర్మంబువలనఁ
బటుతరపాపకూపంబునం బడితి
పూర్వజన్మంబున బుద్ధిలేకుండ
గర్వించి సత్క్రియల్ గాంచకపోతి 90
సద్గురు నాశ్రయించంగఁ బోనైతి
సద్గతి నేను విచారింపనైతిఁ
బామరంబునఁ బడి పరభామినులను
గామించి యవివేకకలితుఁడనైతి
బాలబుద్ధులు చేతఁ బాతకం బనక
చాలఁ బెద్దలను దూషణము చేసితిని
తనువు లస్థిరములు ద్రవ్య మస్థిరము
లని యించుకేనియు నారయనైతిఁ

బెనుప్రేమ పెండ్లము బిడ్డలఁజూచి
మనమున హర్షించి మత్తుఁడనైతి
గాన నీవిధ మగుకష్టకూపాన
నేను జిక్కితి నింక నెవ్వరు దిక్కు
ఈమూత్రమలకూప మే నింకఁ గడచి
భూమిపై వ్రాలిన బుద్ధి తెచ్చుకుని
పరమదేశికపదాబ్జంబుల వేఁడి
పరమైన నిర్వాణపదము నొందెదను
మఱచియుండను దొంటి మాయలోఁ బడను
మఱి యిప్పు డీమూత్రమలకూప మేను
ఎప్పుడు దాఁటెద నని యెంచుచుండ
నప్పుడు తొమ్మిది యగునెలల్ మించ100
ధరణిపైఁ బడఁగ నంతట విష్ణుమాయ
తఱచుగఁ గప్పినఁ దల్లడిల్లుచును
ఆవేళ శిశువయి యన్నియు మఱచి
కావున యేడ్చి యక్కడకుఁ దన్ మఱచి
మునుపటిజ్ఞానంబు మోసయై మంచ
మునఁ బడి తనమలమూత్రాదులందుఁ
బొరలుచు దుర్బలంబున నుండఁగాను
గురుతుగ నట గాలి గుంతయుఁ ద్రవ్వి
కిసరులు కూనలు కిన్కసందులను
ముసరులు దగ్గులు ముట్టుదోషములు

ననుభవించుచు వృద్ధి యై వయోధర్మ
మును మించి వచ్చినప్పుడు మత్తుఁ డగుచు
వసుధఁ బెండిలియాడి వరసుతసుతుల
నెసఁ గాంచి వారల నెలమిఁ బోషింప
భూవరులను వేఁడి పొల్పుగ ధనము
నేవగనైనఁ దా నెసఁ గూర్చి మించి
భూరిలోభము దారపుత్త్రాదుల నొగి
వారక గాచుచు వసుధఁ గట్టకడ
కడు వృద్ధదశ రాగఁ గాయంబువడఁక
దడవుచు మంచాన దగఁ జేరి యుండి110
చెవుడు వట్టి మఱేమి చేయుటలేక
యెవరు వచ్చినఁగాని యెఱుఁగకయుండి
ఆలుబిడ్డలఁ జూచి యకట నే వీండ్రఁ
బాలించువిధమును బరికింపనైతి
నని ప్రలాపించుచు నంతకాలమున
మొనసి వచ్చినయమముఖ్యసేవకులఁ
గనుఁగొని యఱచుచుఁ గనుల మూయంగ
వెనువెంట గొంపోయి విభునిడగ్గఱగ
నిలువఁజేయఁగఁ జూచి నెఱిఁ బాపములను
దెలియంగ నాశ్రాద్ధదేవుండు వడిగ
నడుగ లెక్కలు చూచి యాచిత్రగుప్తుఁ
డెలమిఁ జెప్పఁగ వెంట హింసచేయుఁ డన

భటు లట్లసేతు రెప్పటివలెఁ బుడమి
నటఁ బుట్టవలయుఁ బాయక బంధుమిత్రు
లంతకాలంబున నయ్యయో యంచుఁ
జింతించుచుందురు చేరి డగ్గఱగఁ
గావున జీవుని కఠినమార్గంబు
కానంగలేరు టక్కరిమాయవలన
తనువులఁ దామని దలఁచుచుండుదురు
తనువులోపల కర్మతతి విచారింప 120
నెత్తురుప్రేవులు నిండుమాంసంబు
హత్తినయెముకలు నధికమౌ చీము
మొనసినచర్మంబు మూత్రంబు మలము
నెనసి దేహములోన నెసఁగుచు నుండు
నటువంటిఘటములం దాకాంక్షఁ జేసి
కుటిలులై తమలోన గుఱిఁ గానలేరు
అన విని యాయింతి యాత్మజుం జూచి
యనియె నోతనయ మాయాప్రపంచంబు
నెవ్వరు గల్పించి రెఱిఁగింపు మనిన
నవ్వారిజాక్షికి నతఁ డిట్టులనియె.

§§§ విశ్వోత్పత్తిఘట్టము §§§

విలసితమైన యీవిశ్వమంతయును
గలిగినచందము గ్రమముగ వినుము
నిత్యుండు నచలుండు నిర్వికారుండు

సత్యుండు సగుణుండు సర్వాత్మకుండు
ననెడుపరబ్రహ్మ యాదికాలమున
ఘనతరమై నిరాకారమై యుండె
నతనియందు ననాది యైనట్టిమాయ
యతఁడు గూడి వహించె నయ్యీశుసంజ్ఞ
నెలమి నచ్చటఁ గల్గె హేమగర్భుండు
కలకంఠి యాహేమగర్భునియందుఁ 130
దలఁగక యట మహాతత్వంబు పుట్టె
నలరంగఁ గలిగె నహంకారమందు
నది మూఁడుభాగంబు లై వృద్ధిఁ బొందె
ముదిత సత్వరజస్తమోభేదములను
బొందె సత్వమున నింపుగ జ్ఞాన మరయఁ
బొందుగ రాజసంబున నుద్భవించె
నలరార కర్మేంద్రియములు తామసము
వలనఁ దన్మాత్రంబు వరుసగఁ గల్గె
నందు శబ్దంబున నభ్రంబు వొడమె
నందు సదాశివుఁ డధినాథుఁ డయ్యె
మఱియును స్పర్శతన్మాత్రంబువలనఁ
గఱువలి గలిగె నక్కడ నీశ్వరుండు
నలరార నచ్చటి కధికారి యయ్యెఁ
దలకొని యట రూపతన్మాత్రవలన
నొనర హుతాశనుఁ డుద్భవుం డయ్యె

ననిశంబు నిట్టిహుతాశనాకృతికిఁ
బరగ రుద్రుం డధిపతి యయ్యె నవల
సరవిని రసమున జల ముద్భవించె
హరి నాయకుం డయ్యె నమ్మరో వినుము
మఱియును గంధతన్మాత్రంబువలన140
సముదయం బయ్యె విశ్వంభరయందుఁ
గమలసంభవుఁ డధికర్తయై నిల్చెఁ
బ్రకటితమైన యీపంచభూతముల
నొకటొక్కటిని రెండు నొనర భాగించి
యందందు నొక్కనిజాంశంబు నుంచి
యందందుఁ దక్కినయట్టియం దొకటి
కలకంఠి నాల్గేసిగా విభాగించి
కలయఁ బంచిననవి క్రమముగఁ బుడమిఁ
బంచీకృతం బయ్యెఁ బరికింపఁ దల్లి
యంచితంబుగ విను మది యెట్టులనినఁ
బొందుగ నాకాశమున నర్ధమయ్యె
నందు జ్ఞాతృత్వము నం దొగి నాల్గు
నగుభాగములఁ బవనాగ్నిజలముల
నొగిఁ గూడి మానసం బొగి బుద్ధి చిత్త
మును నహంకారంబు మొనసి వాతూల
మున నర్ధభాగంబు పుణ్యచరిత్ర
అరయ వ్యానం బయ్యె నటు నిల్చెనాల్గు

నిరవుగ భూమి వహ్ని జలంబు గగన
ములఁ గూడి యింతకు మూలంబు నగుచు
నల పంచభూతంబు లయ్యె నెంచఁగను 150
తల్లి హుతాశనార్థము చక్షువయ్యె
నెల్లఁ దక్కిననాలు గెంచ భూనీర
మరుదంబరముల మర్మంబుగఁ గూడి
యరయఁ ద్వక్ఛ్రోత్రజిహ్వాఘ్రాణములను
గలిగె నీ రర్ధభాగము రసంబయ్యె
నలినాక్షి తక్కిననాల్గు భూవహ్ని
మారుతాంబరముల మఱి గూడి వరుస
నారూప మాశబ్ద మాస్పరిశంబు
తనరార నోజ గంధంబయ్యె నట్ల
మొనసి యాభూమ్యార్థమున పాయువయ్యెఁ
తల్లిరో విను మొగిఁ దక్కిననాల్గు
నల్ల ధనంజయ యనిలాంబరముల
సారంబులై కూడి సల్పుక్రియలకు
నారూఢిహేతువు లైనట్టిగుహ్య
హస్తవాక్బాదంబు లనువుగఁ గల్గి
విస్తరిల్లెను బంచవింశతిక్రమము

§§§ పంచవింశతితత్వప్రకరణము §§§

వీనుల కింపుగ విను మొకపథము
పూని జెప్పెదఁ బంచభూతంబులకును
బలము సద్యోజాత వామదేవులును
బొలఁతి యఘోరతత్పుర్షు లీశానుఁ
డనెడు పంచబ్రహ్మ లా బ్రహ్మ విష్ణుఁ
డును రుద్రుఁ డీశ్వరుఁ డొగి సదాశివుఁడు
పంచకర్త లనంగఁ బ్రఖ్యాతులైరి
యంచితమౌ మానసాదులు నైదు
రాణింపఁగాను బరాశక్తి యయ్యెఁ
బ్రాణాదివాయువు ల్పట్టుగఁ జూడ
నాదిశక్తి యనంగ నమరె శ్రోత్రేంద్రి
యాదులు నైదయ్యె నలర విజ్ఞాన
మరయ నీభూమ్యాదు లైదుతత్త్వములు
సరవిగ నెంచ నిచ్ఛాశక్తి యయ్యెఁ
గ్రమముగ వాగాదికర్మేంద్రియములు
నమరఁ క్రియాశక్తి యయ్యె నోతల్లి
అన్నియుఁ గూడి బ్రహ్మాండమై నిలిచె
నెన్నఁగ శ్రీజగదీశుఁడౌ శ్రీవి
రాజితుండును శ్రీవిరాట్పుర్షరూప
మాజగదాకృతి కరయఁ బెంపారె

పాతాళలోకంబు పదమయ్యె నట్లు
ఖ్యాతిగ సత్యలోకంబు శీర్షంబు
లోకము లెల్ల నాలోకింప నాదు
శ్రీకరతన్వు లై చెలఁగునోతల్లి 170
అనువొంద నిట్టిమహావిగ్రహునకుఁ
గొనకొని యన్నిదిక్కులు శ్రోత్ర మరయ
నొనరంగ వినుము వాయువు త్వగింద్రియము
మొనయునేత్రేంద్రియ మొప్ప భానుండు
పరగ భ్రూయుగ్మంబు బ్రహ్మపదంబు
చిరతరవరుణుండు జిహ్వేంద్రియంబు
వెలియ నాశికము నశ్విని దేవతలును
వలనొప్ప వహ్నిగ వాగింద్రియంబు.
తెలియ బాహువు లెల్ల దేవతాధిపుడు
తలఁగకుండును భాగతత్వంబు లరయఁ
బరగ నుపేంద్రుండు పాదేంద్రియంబు
పరికింపఁగాఁ బ్రజాపతియు గుహ్యంబు
వలనొప్ప మృత్యుదేవత యగునంబు
కలువపువ్వుల చెలికాఁడు మనంబు
మతి బ్రహ్మదేండు మహనీయచిత్త
మతులితక్షేత్రజ్ఞుఁ డనఁబడుచుండు
ననుపమాహంకారుఁ డగురుద్రమూర్తి

తనర జ్ఞాతృత్వ మంతఃకరణంబు
సరవిగ జీవునిచంద మీమీఁదఁ
బరగ జెప్పెద విను బ్రాకటంబుగను 180
అలరు ఘటాకాశ మం దొప్పుగాను
గలిగినజలములోఁ గన్పట్టు నభము
గతి సాక్షియం దున్న గ్రాలెడుబుద్ధి
ప్రతిబింబితం బైనబ్రహ్మ మీరీతి
జీవుఁడ ననుభ్రాంతి చేఁ జిక్కి మించి
సావధానక్రియాశక్తినిఁ గూడి
రూఢియై తనస్వస్వరూపంబు మఱచి
మూఢుఁడై షడ్వర్గములకు లోబడుచుఁ
దులువయై మానసాదులచేతఁ జిక్కి,
కలుషాత్ముఁ డై తన్ను గానక భ్రమసి
భిన్నభావములచేఁ బెక్కుదేహములు
పన్నుగ ధరియించి పరవశత్వమున
స్త్రీలు పుర్షు లటంచుఁ జెడుగుభేదముల
వాలాయముగఁ జిక్కి వాంఛతోఁ దగిలి
వారును వీరును వారు మే మనుచు
భారంబుగను నహంభావ మూహించి
జీవభ్రమములచేఁ జెడి పలుమాఱు
చావు పుట్టువు గల్గి జడుఁ డాయె నిప్పు

డెప్పు డైనను జీవుఁ డిదియెల్ల విడచి
యొప్పుగ విజ్ఞానయుక్తినిఁ గూడి 190
తన్ను దాఁ దెలిసిన ధన్యునిఁ జేరి
పన్నుగ నతనిచే బ్రహ్మంబు దెలిసి
కామాదిశత్రుల ఖండించివైచి
యామూక సకలేంద్రియాల జయించి
నిటలభాగంబున నిలిచి శోధించి
ఘటము బయల్జేసి కడఁగాంచె నేని
యతఁడ పరబ్రహ్మ మతఁడ స్వయంభు
వతఁడ మహావిష్ణు వతఁడ శివుండు
అతనికి వేఱలే దనుచు బోధింప
నతని కి ట్లనివల్కె నా దేవహూతి
మలమూత్రరక్త దుర్మాంసంబు చీము
గలిగిన దుర్గంధకాయంబులందు
నిరవుగ నాబ్రహ్మ మేరీతి నుండు
పరవి నా కెఱిఁగింపు సదయాత్మ యనఁగఁ
గపిలుఁ డాతల్లిని గరిమనుఁ జూచి
యపు డిట్లు వచియించె నమ్మరో వినుము
ఇది సోమనాథ విశ్వేశుని పేర
పదవాక్య భవ్యసుబ్రహణ్యయోగి
చరణాంబుజాతషట్చరణాయమాన
పరిపూర్ణ నిత్యసద్భావనిమగ్న

మానస యగువేంకమాంబికారచిత
మైనట్టి రాజయోగామృతసార
మం దెన్నఁగాఁ బ్రథమాఖ్యప్రకరణ
మొందు శ్రీ తఱికుండ పురిథాముఁ డైన
వీరనృసింహుడు వెలయఁ గైకొనియె
ధారుణి నాచంద్రతారార్కముగను.

ప్రథమ ప్రకరణము సంపూర్ణము.