రాజయోగసారము/ద్వితీయ ప్రకరణము
శ్రీ ర స్తు
రా జ యో గ సా ర ము
————*****————
ద్వితీయ ప్రకరణము
శ్రీకరానందవశీకరం బైన
ప్రాకటభక్తిమై భావ మంతయును
వినుము నీ వత్యంతవేడ్క నోతల్లి
కనఁగ సుగంధదుర్గంధముల్ రెండు
ననుపమపరమాత్ముఁ డంటి రెంటికిని
దనరారఁగాను మేధ్యామేధ్యములను
బ్రతిఫలింపదె భాను భాసురకిరణ
గతిగ సంవ్యాప్తంబుగాఁ దనరార
నతనికి నేమంటె నర్కునిభాతి
అతులితంబుగ నాత్మ కంట దేమియును
మతిమంతులకు నట్లు మలినంబు లేదు
క్షితి నీవిధంబును జెలఁగి చూడంగఁ
గుటిలత్వరహిత మెక్కువగాఁగ నిట్టి
ఘటములోనివిధంబు గ్రమముగ వినుము
సలలితపంచవింశతితత్వములను
బొలుపొందు స్థూలాఖ్య పుణ్యచరిత్ర
కాయంబులో సప్తకమలంబు లుండుఁ
బాయక వానిని బరఁగఁ జెప్పెదను
దొలుత నాధారమ న్దోయజాతంబు
సలలితమౌ రహస్యస్థానమందు
గొనకొని నాల్గురేకులపీతవర్ణ
మును వశషసలను ముఖ్యాక్షరములు
ననువుగ భూముద్ర నమరుచు నుండు
నెనసి యచ్చటను గంగేశ్వరుఁ డుండు
నలరఁగ విను దాని కావలివిధము
దలకొని యంగుళద్వయముమీఁదటను
ధీరత మీర స్వాధిస్ఠానజలజ
నూఱురేకులతోడ నమరు శ్వేతముగ
నది బభమయరలా యనువర్ణములను
అది పక్షిముద్రయం చనఁ దగి మఱియు
జలజాతభవుఁడు నిశ్చలత నుండు నొగి
నలఘుప్రకాశుఁ డై యమ్మరో వినుము
మొనసి యష్టాంగుళములమీఁదఁ దనరి
యనువుగ మణిపూరకాఖ్యంబు వెలుగు
నెఱి ఱేకులును బది నీలవర్ణంబు
వఱల డాదిఫకారవర్ణము ల్గల్గి
యనువర్ణము ల్గల్గి యాపీఠముద్ర
యొనరంగ వెన్నుఁ డం దొప్పుచు నుండు
పదియంగుళములకుఁ బైన నాహతము
హృదయప్రదేశమందిరముగ నుండు 20
భామవి న్ద్వాదశపత్రము ల్గలిగి
హేమవర్ణంబున నింపొందు నందు
నఖిలవాక్యావళి కాస్పదం బగుచు
కఖగఘఙలు చఛాఖ్యలు జఝఞణలును
ననువొందఁగా టఠా యనులింగముద్ర
దనరారు రుద్రుఁ డాస్థానాధిపతియు
నావల మఱి ద్వాదశాంగుళములను
ధావళ్యరుచి విశుద్ధంబు పదాఱు
దళములై, అఆలు దానికి వర్ణ
ములు నగునది మత్స్యముద్ర జీవుండు
అందుండు మఱి ద్వాదశాంగుళములను
బొందుగ భ్రూమధ్యమున దళద్వయము
అందుఁ బావకదీప్తి యలరుచు నుండు
నందు హంసలు రెండు నమరుచు నుండు
ధరణిఁ బ్రకాశముద్ర యనంగ నదియ
పరమాత్ముఁ డచ్చట ప్రభువై వెలుంగు
నందుకు నవల సహస్రారమందుఁ
గ్రందుగ నుండు హకారసకార
బీజద్వయం బాత్మబిందువుఁ గూడి
తేజరిల్లుచు నుండు దేదీప్యముగను 30
గగనముద్రయు నదె గన్గొనఁ దల్లి
సగుణనిర్గుణరూప సచ్చిదానంద
గురురాజచంద్రుఁడు కొల్వారుచుండు
సరవి నన్నిటికిఁ దా సాక్షియై యుండు
పనివడి విను మంబ ప్రాణానిలంబు
మొనసి యాహృత్పద్మమున నిల్చియుండు
తఱుచైనపవనుఁ డాధారచక్రమున
విరివిగ నేవేళ విహరింపుచుండు
అలసమానుఁడు నాభియందు నవ్యానుఁ
డలరి సర్వాంగంబులందుఁ దానుండు
గళమున రోమసంఘంబులయందుఁ
దొలఁగక నాగ వాతూలంబు మఱియు
ననఘ లలాటమం దాకూర్మపవనుఁ
డనువొంద ఘ్రాణమం దాకుకురుండు
కంటిపై నుండును ఘనదేవదత్తు
డంట నారంధ్రమం దాధనంజయుడు
అనుదశవాయువు లంగములందు
మొనసి తత్తత్కార్యములు సల్పుచుండు
లలిని యిళాపింగళలు సుషున్నుయును
నలరార నాధారమందుండి వచ్చి
మొనసి యాజ్ఞాచక్రమున మూఁడుఁ గూడి
యనువొందఁగా మఱి యంతట నిలుచుఁ
దనర సుషుమ్న మంతట నిల్వ కరిగిఁ
ఘనతగఁ గ్రమముగఁ గ్రాలుచు నుండి
సరవిగ ఘనసహస్రారంబు సేరి
గురుతరంబుగ నందు గోప్యమై యుండు
దేహమధ్యంబునఁ దిరుగు జీవుండు
సోహం బటంచు సంశోభితంబుగను
మొనసి యహోరాత్రములను జపంబు
నొనరంగ నిరువదియొక్కవెయ్యారు
నూఱును జేసి యనూనంబు గాఁగ
నాఱు నూ ఱాదిగణాధీశునకును
ఆఱువే లాబ్రహ్మ కాఱ్వేలు హరికి
నాఱువే లారుద్రుఁ డనుదైవమునకు
వేయి సదాశివ విభవమూర్తికిని
వేయి యయ్యాత్మకు వేయి గుర్వుకును
వాసిగ దినమును వరుస నర్పణము
చేసినఁగాని యాజీవుండు మగుడి
భాసురమతి నిట్టిభావంబుగాను
శ్రీసద్గురునిమేటిరీతి నీలాగు50
కాశిగయాప్రయాగలు నంద యుండు
దేశికుఁ డటుమహాదేవుఁ డై యుండు
పోఁడిమి మీరఁ బెంపొందుచు మధ్య
నాడి సహస్రారనాళమై యుండు
నదియ సరస్వతి యదె పరంజ్యోతి
యదా యూర్ధ్వకుండలి యదె సుధాధార
యదె భూతతతిహేతు వదె తటిద్వల్లి
యదె చిద్విలాసంబు నదె పరమంబు
ఇటువంటిసుధ దేహి కెస నంటనీక
కుటిలమార్గత నధఃకుండలి పొంచి
పటుశక్తి నమృతంబు పానంబు చేయ
నిటువంటికీలకం బెఱుఁగక దేహి
కాయమే నని యహంకారి యై యాత్మ
నాయకుఁ గనలేక నానావిధాల
ముక్తినొందెద నని ముందు గానకయ
శక్తిచేఁ గర్మముల్ సల్పుచు నెపుడు
కాశికిఁ బోయి చక్కగ గంగలోన
నాశగ మునిఁగినయప్పుడ తనకు
నంటువోవునె మోహ మబ్బునె తల్లి
తొంటిపాపము వోయి దొరకునె సుఖము.
§§§ జీవన్ముక్తివిచారఘట్టము §§§
అని యిటువల్కిన నాదేవహూతి
తనసుతు నీక్షించి తగ నిట్టు లనియె
పావనచరిత జీవన్ముక్తి నరుని
కేవిధంబునఁ గల్గు నెఱిఁగింపు మనిన
జనయిత్రిఁ జూచి యాసత్కుమారుండు
మనమున హర్షించి మాత కిట్లనియె
వినవమ్మ జనని యీవిశ్వంబునందు
మనుజులు వేఱ కర్మంబులు విడచి
తను దాను దెలిసినధన్యునిఁ జేరి
పనివడి ద్వాదశాబ్దములు శుశ్రూషఁ
జేసి మెప్పింపఁగ శ్రీగురుమూర్తి
భాసురంబుగ వారిభక్తికి మెచ్చి
యసదృశసిద్ధాసనాసీనుఁ జేసి
భసితంబు తమఫాలభాగాల నుంచి
వారితత్పూర్వపువ్రాలెల్లఁ దీసి
భూరికృపవ్రాలు పొందుగ వ్రాసి
జడియకుఁ డని వారిజడుపెల్లఁ దీర్చి
కడువేడ్క రాజయోగప్రకారంబు
సాంగముగను జెప్పి సాధుపథంబు
శృంగాటకంబునఁ జేరి చూడుఁడని70
గురుమూర్తి యపుడు మక్కువ మీఱ శిష్యుఁ
డరుదుగఁ దసమానసాబ్జమం దుంచి
పరమార్థసరణి సద్భావంబు మీరఁ
బరమాద్భుతధ్యానపరవశత్వమున
మనసు సహస్రారమధ్యమం దుంచి
మొనసి తా నపుడు షణ్ముఖి యనుముద్ర
వితరణంబుల లేదు విద్యల లేదు
వ్రతములలో లేదు క్రతువుల లేదు
మతములలో లేదు మహిమలో లేదు
సతతంబు నన్నియు సల్పువారలకు
నలరంగ దివ్యస్వర్గాదిభోగములు
గలిగి యాపుణ్యముల్ కడ ముట్టఁగాను
సమసినప్పుడ చాల జన్మంబు లెత్తి
శ్రమములు వడుచుండు సరవిగ నెపుడు
గనుక స్వర్గాదిభోగము లిచ్ఛయింప
కను మనశ్శుద్ధి చక్కఁగఁ జేసి పరము
సద్గతిగాను విచారించి యపుడు
సద్గురుచే వేదసారంబు దెలిసి
మమతను విడి కూటమార్గంబు చేరి
అమలసాంఖ్యము తారకామనస్కములఁ
గలిగిన యనుభవక్రమములం దెలిసి
సలలిత శివయోగసచ్చిదానంద
వైరాగ్యసుఖకేళివార్ధిలో మునిఁగి
వైరాగ్యసంపద వఱలుచుండంగ
నవధూతభావుఁడై యాత్మను జెంది
ప్రవిమలజ్ఞానంబు ప్రబలుచుండంగఁ
దానను నహమును దగ్ధంబు చేసి
తానను దానై యుండు తత్త్వంబు దెలిసి
నిగమాంతవేత్తయై నిలిచినవాఁడు
మగు డిందురాఁడు జన్మము నెత్తఁబోఁడు
మఱికొంద ఱీమహామహిమఁ గానకయ
గురు నెఱుంగక కర్మగురుచెంతఁ జేరి
గాథకుఁ జిక్కి దుష్కర్మమార్గమున
సాధనంబుగ యోగసరణులఁ దెలిసి
యలమట నాసనాభ్యాసము ల్చేసి
చలమున బాహ్యలక్ష్యములు చూపుచును110
కూలంకషములోనిగుఱిఁ గానలేక
లాలితంబుగ మంత్రలయహఠయోగ
ఫలములం గోరుచుం బామరు లగుచు
జలబుద్బుదమువంటి జన్మంబులకును
సిద్ధులం గోరి ప్రసిద్ధమై యోగ
సిద్ధాంతమందు సుస్థిరమతి లేక
అగణితవిషయసుఖాసక్తిమీరఁ
దగ మణిమంత్రసిద్ధక్రియల్ నేర్చి
మఱి పామరులకెల్ల మహిమలం జూపి
తిరిగెడువార లీ దేహవాసనలు
వీడఁగ నేరరు వేదాంతమందుఁ
గూడ నేరరు వట్టికుంభనగాని
వరముక్తిఁ బొందెడువాఁడు త్రికూట
మరయఁగ నిష్ఠమైనందునఁ జెంది
నెలవుగ నౌ త్రివేణీసంగమమున
జలకంబు లాడి విశ్రాంతివహించి
వెలిప్రపంచంబును విడిచి యాలోన
నిలిచి చూచెడితెల్వి నే నని నిజము
నరసిన బ్రహ్మవిద్యాధురంధరులు
దొరఁకొని కాయసిద్ధులు గోరఁబోరు
నూరక సంసారయుక్తులై యుండి
ధారాళముగఁ దమ్ముఁ దాము చూచుకొని
జలజపత్రంబులో జలముచందాన
నలరి సంసారమునం దంట కెప్పు
డుండుధన్యులు సిద్ధయోగులు గాక
ఖండవిద్యలు నేర్చి గర్వంబు మించి
స్తంభనమోహనోచ్చాటనమంత్ర
జృంభణంబులు సూపి చెలఁగెడువారు
పవనయోగము నేర్చి పటుయుక్తిఁ బెంచి
యవిరళంబుగఁ దటాకాంతరమందు
మహిమఁ జూపుటకుఁ బద్మాసనంబునను
సహజంబుగా నుండి జనుల మెప్పించి
బద్ధులై యంతకుఁ బరమైన యోగ
సిద్దాంత మెఱుఁగక చెడిపోవువారు
కడుపునిండఁగ నుదకంబును బీల్చి
కడుపున మలమెల్లఁ గడగి శోధించి
యిది యాత్మసిద్ధి యౌనని నిశ్చయించి
ముదమంది తమలోన ముఱిసెడువారు
వాయుధారణసేసి వసుధఁ గొన్నాళ్లు
కాయంబు వేయేండ్లు కాపాడువారు130
ఆత్మానుభవులుగ నరసి వీక్షించి
యాత్మను గాంచిన యవధూతమూర్తి
అల నభోమధ్య కుంభాకృతిగాను
వెలిలోను వెల్గుచు విషయశూన్యముగ
జలరాశిగతకలశంబుచందానఁ
బొలుపొంద వెలిలోను పూర్ణమై యుండి
అంతముఁ దాఁ గాక యంతఁ దానగుచు
సంతతానందాబ్దిచంద్రుఁ డై యున్న
యతఁడె యోగీశ్వరుఁ డతఁడె ధర్మాత్ముఁ
డతఁడె పరాత్పరుం డతఁడె సద్గురుఁడు
ఇటువంటి గురుతత్త్వ మెఱుఁగక నీవు
మటుమాయగాఁ జిక్కి మై నీడవలెను
తనవారు పెఱవారు తగుపాటిబంధు
లనియెడుభ్రమలు సత్యంబుగ నమ్మి
ననుఁజూచి నీవు కానకు నేఁగఁదగునె?
యని పల్కితివి మాయ ననుసరణగను,
భాసురమతి నిట్టి భావంబు విడచు
నీసుతుఁడనుగాను నెఱివినుతల్లి
నానాఁడు కర్దముం డత్యుగ్రతపము
పూనిచేయుటఁజేసి పుత్రుఁడ నైతిఁ
గాన నే నీసొమ్ము గాను నిక్కముగ
మానసంబును నిది మఱచిపో తల్లి
సుతుఁ డని నన్నికఁ జూడకు మమ్మ
అతలాదిలోకంబు లన్నియు నేను
పంచభూతము లేను బ్రణవంబు నేను
బంచకోశం బేను బరతత్వ మేను
గణుతింప సోమ భాస్కర వహ్ను లేను
అణువు మహత్తు లే నఖిలంబు లేను
సగుణభావంబున సర్వమందుండి
యగణితవిభవంబు లనుభవించుచును
పరమైన నిర్గుణభావంబు నొంది
సరవి నంతటికిని సాక్షి నై యుందు
జనయిత్రి నాయంద జగములు నుండు
మొనసి నానాలోకముల నుందు నేను
అలదర్పణంబులో నాననాబ్జంబు
చెలువొందఁ బ్రతిఫలించినచందమునేను
నాయందు జగములు నానావిధముల
మాయగ నీరీతి మలయుచు నుండు
నటుగాన ముకురమందా ప్రతిబింబ
మెటువలె దబ్బరో యెఱిఁగి చూచినను
నటువలె నాయందు నఖిలలోకములు
మటుమాయగా నుండు మైనీడవోలె
నగణితమైన విశ్వాకృతి యగుచుఁ
దగిలియుం దగలక తనరెడువాఁడఁ
గాని నిక్కంబు చక్కఁగ విచారింప
నేన కర్తయు భోక్త నేన బ్రహ్మంబు
అని స్వస్వరూపంబు నప్పుడు చూపఁ
దనయుఁడు గాఁడని తద్దయు నెంచి
కడుదురాశలు మాని కడుభక్తిఁ బూని
కొడుకు నావేళ సద్గురునిగ నెంచి
పావనచారిత్ర పరమపవిత్ర
నీవంటి ధన్యుండు నీవంటి సుకృతుఁ
డేవిధమున నాకు నెస సుతుఁ డైతి?
దేవ జీవన్ముక్తి దిరముగ నీయు
మింతియ చాలు మఱేమియు నొల్ల
నంతయు విడచితి నయ్య నీ దయను
ఏ నొల్ల భాగ్యంబు నే నొల్ల పదవి
నే నొల్ల సంసార మే నొల్ల నెల్ల
నీలీలఁ దెలియక నే యిన్ని నాళ్లు
కాలంబు నూరక గడపుచు నుంటి160
సకలలోకాతీతసత్యమౌ తత్వ
మిఁకనైన నుపదేశ మీవయ్య దేవ
అన విని కపిలుఁ డయ్యంబ కిట్లనియె
జననీ నీ వత్యంతసద్గుణవతివి
కావున నీరీతిగా బ్రహ్మవిద్య
కావలె నంటివి గలుగదా నీకు
నని యిట్లు పల్కి సిద్ధాసనమందు
దనతల్లి సునిచి యత్తఱి లలాటమునఁ
జెలువుగ వీభూతిచేఁ జుక్క పెట్టి
మలినంబుఁ బోఁ ద్రోసి మస్తక మంటి
బోధింపఁ దొడఁగె నాపుణ్యసాధ్వి కొగి
సాధురక్షకుఁడు నిశ్చలత నిట్లనియె
నోయమ్మ నీవింక నొగి నిశ్చలముగ
మాయాప్రపంచంబు మానసమందు
మఱచి నిర్మాయవై మామాట నుండు
మిరవుగఁ బరమార్థ మేర్పఱించెదను
దేవ నీ విప్పుడు దేహంబు గావు
నీ వింద్రియంబులు నిజముగఁ గావు
నీవు స్త్రీయును గావు నీవు నపుంస
భావంబు గావు గొప్పగఁ బుర్షరూప
ధారిణి గావు నిం దలఁప వృక్ష పశు
ధారిణి గావు సత్యంబును వఱల
భావనాతీత సద్బ్రహ్మంబు నీవు
నీవ యఖండంబు నీ వవ్యయంబు
నీవ ప్రకాశము నీవ బ్రహ్మంబు
భావింప నిను నీవు పరగ నెఱుంగు
కనిపించువస్తు వెక్కడనైన లేదు
అని యిట్లు పల్కిన నాయింతి సుతుని
గనుఁగొని పల్కెఁ జక్కనియుక్తి మెఱయ
విను మని యాతఱి వెన్నుని కెలమి
నేను బ్రహ్మంబు నై నిర్వికల్పంబు
గా నుండఁగానె యాకరణి నిద్రయును
ఆహారమును గల్గు నట్లుండు టేమి
యోహో విచిత్రమై యున్నది దీని
భావంబు దెల్పు తప్పకు మన్న నతఁడు
దేవహూతికి నిట్లు దెలుపఁగఁ దొడఁగె
ఇది సోమనాథవిశ్వేశుని పేర
పదవాక్యభవ్యసుబ్రహణ్యయోగి
చరణాంబుజాత షట్చరణాయమాన
పరిపూర్ణ నిత్యసద్భావనిమగ్న 180
మానసయగు వేంకమాంబికారచిత
మైనట్టి రాజయోగామృతసార
మం దెన్నఁగా ద్వితీయప్రకరణము
పొందుగఁ దఱికుండపురిధాముఁ డైన
వీరనృసింహుండు వేడ్క గైకొనియె
ధారణి నాచంద్రతారార్కముగను.
ద్వితీయప్రకరణము సంపూర్ణము.