రాజగోపాలవిలాసము/పంచమాశ్వాసము

శ్రీరస్తు

శ్రీరాజగోపాలవిలాసము

పంచమాశ్వాసము

శ్రీలక్షితపదలక్షణ
చోళగజలదుర్గసింధుశోషకఘోటీ
వేలాతిగఖురధూళి
దురాలాలితతేజ! విజయరాఘవభోజా!

1


గీ.

అవధరింపుము సూతసంయమివరుండు
శౌనకునితోడ నిట్లను శౌరి మున్ను
చంపకారణ్యమునకును సంఘటించె
దక్షిణద్వారకాసంజ్ఞ ధన్యమతిని.

2


క.

విను మందుకు నితిహాసము
వినుతంబై సకలవేదవేద్యం బగుచున్
తనరారునట్టికథ యే
వినుపించెద నిపుడు మిగులవేడుకతోడన్.

3


క.

అష్టోత్తరశతనిలయము
లిష్టమ్ములు హరికి నందు నెనిమిదియే యు
త్కృష్టములు వాటియందు వి
శిష్టము చంపకవనంబె శిష్టాచారా!

4


సీ.

సౌరభ్యపరిభూతషట్పదపంక్తినా
                 హోమధూమము మిన్ను లొరయుచుండ
కాషాయశాటికాఖండమండలమునా
                 వికచకోరకవిభావిభవ మమర

ఘనతపోమహిమనిర్గతరజోగరిమనా
                 రాజుత్తరపరాగరాజ మలర
శ్రుతిపాఠసంతతోత్సుకశుకశ్రేణినా
                 సనవకోరకపత్రసమితి దనర


గీ.

మదనమార్గణగణనయమహిమ మయ్యు
మదనమార్గణవిరహితమహిమఁ జెలఁగు
రాజగోపపదధ్యానరాజమాన
భక్తలోకావనంబు చంపకవనంబు.

5


గీ.

అట్టి చంపకవనమున నఖిలమునులు
తపముఁ గావింప వారిలో ధన్యతముఁడు
వహ్నిముఖుఁడను సంయమివరుఁడు చెలఁగు
సతతగార్హస్థ్యసన్నుతాచారుఁ డగుచు.

6


చ.

అలమునిలోకచంద్రునకు నాత్మజులై జనియించి రెంచ గో
ప్రళయుఁడు గోభిలుండు నను భవ్యచరిత్రులు వారిలోన గో
ప్రళయుఁడు పూర్వపుణ్యపరిపాకఫలంబున మించె నెంతయున్
జలరుహనాభపాదజలజాతవినిశ్చలభక్తియుక్తుఁడై.

7


సీ.

కల్యసాకల్యసంకల్పితస్నానంబు
                 సాంధ్యకృత్యంబును జపసమాధి
యగ్నిహోత్రము దేవతార్చనావిధియును
                 వేదపాఠంబును వినయగరిమ
మాధ్యందినాదిసన్మానితాచారంబు
                 నభ్యాగతులకు మృష్టాన్నదాన
మర్హపురాణసమాకర్ణనంబును
                 తద్గతబహువిధధర్మచింత

గీ.

యనుదినంబును సహజకృత్యంబు గాఁగ
మేలుమేలని జగమెల్ల మెచ్చిపొగడ
బ్రహ్మవిద్యావిదుండు గోప్రళయమౌని
తపము గావించె శ్రీహరిఁ దలఁచి భక్తి.

8


మ.

బలునిష్ఠన్ మధువాసరాత్యయములన్ పంచాగ్నిమధ్యంబునన్
వలిగాడ్పుల్ నిగుడంగ బట్టబయిటన్ వర్ష ప్రకర్షంబునన్
పులకల్ జాదుకొనంగ శీతువున సంపూర్ణోదవాసంబునన్
చలనం బందక సల్పె నుగ్రతప ముత్సాహంబు సంధిల్లగన్.

9


క.

నిరుపమనిష్ఠానిధి యగు
పరముమునీంద్రుని తపఃప్రభావము మదిలోఁ
బరికించి పంకజాక్షుఁడు
కరుణకు పాత్రంబు సేయఁ గౌతూహలియై.

10


సీ.

గరుడిఱెక్కలగముల్ గగనసౌధమునకు
                 కనకంబు వ్రాయువాఁగరులు గాఁగ
పసిఁడిచేలచెఱంగు బర్హిబర్హంబను
                 మేఘంబునకుఁ గారుమెఱుఁగుఁ గాఁగ
కరుణాప్రవాహంబు కన్నుదమ్ములకును
                 పసిమించు మకరందరసము గాఁగ
మొలకనవ్వులు లచ్చిమోము జూబిల్లిపై
                 నెలకొన్న చిన్నివెన్నెలలు గాగ


గీ.

గరుడగంధర్వగాయనీగాన మమర
నమరనాయకు లిరువంకలందుఁ గొలువ
విలువలేనట్టి శృంగారవిభవ మెసఁగ
నంబుజాక్షుండు మునికిఁ బ్రత్యక్షమయ్యె.

11

మ.

ఘననిష్ఠం దపమాచరించు మునిలోకశ్రేష్ఠుఁ డవ్వేళఁ దా
కనుదమ్ముల్ వికసిల్లు చెంగటను సాక్షాత్కారముం జెందు న
వ్వనజాక్షున్ భువనైకరక్షకుని దుర్వారప్రభావోన్నతుం
గనియెన్ పెన్నిధిఁగన్నపేదగతి నుత్కంఠాతిరేకంబునన్.

12


సీ.

బ్రహ్మాండభాండముల్ బంతులుగామాటి
                 కలదు లే దనునట్టి ఘనుఁడ వీవ
పదునాల్గుజగములు భరియించి జలధుల
                 విహృతి సల్పిన మహామహుఁడ వీవ
పొక్కిలి విరిదమ్మి భువనముల్ నిర్మించు
                 బుడుతని గన్నట్టి ప్రోఢ వీవ
పదిరూపములు పూని పదిలంబుగా భూమి
                 కరుణఁ గాచిన జగత్కర్త వీవ


గీ.

మూఁడుమూర్తులు మెలఁగెడు మూర్తి వీవ
వేదవేదాంతముల నిన్ను వెదకి వెదకి
కానకున్నట్టిపట్ల నీఘనత లెల్ల
వల్లవీజార! కొనియాడవశమె మాకు?

13


గీ.

వినతి గావించి యీరీతి వినుతి సేయు
మౌనిచంద్రునిఁ గనుగొని మాధవుండు
మించు నీ నిష్ఠకునుఁ జాల మెచ్చినాఁడ
నడుగు మాశాస్యమయ్యది యనిన నతఁడు.

14


ఉ.

వారిజనాభ! నీవు మును ద్వారకలోపల గోపగోపికా
వారము రుక్మిణీప్రముఖవారిజనేత్రలు సేవ సేయఁగా
వారిధితీరశైలవనవాటికలన్ విహరించునట్టి యా
మేరలు చంపకాటవిసమీపమునన్ మెఱయింపు మింపుగన్.

15

గీ.

అనుచు నమ్మౌని కోరినయట్లు సల్పి
వనజనాభుండు చంపకవనమునకును
దక్షిణద్వారకాభిఖ్యదయ నొసంగి
యతనిప్రార్థన నచ్చట నధివసించె.

16


క.

ఆరీతి నధివసించిన
నారాయణదేవుచరణనళినమ్ములకున్
సారెకు నతు లొనరింపుచు
ధీరవిచారుండు మౌనితిలకుఁడు పలికెన్.

17


వ.

దేవా! దేవరవారు నిచ్చలు నిచ్చట నధివసించుటవల్ల
నుల్లంబు పల్లవితంబయ్యె నయ్యడ నేగావించు తీర్థంబునకు
వాయవ్యంబున బాణపాతపరిమితప్రదేశంబున నవిరళపరిమిళిత
ప్రసవవిసరపరాగాభోగవిభావిభావనీయసాంధ్యవేళాతివేలా
తిలంబిదీపశిఖారేఖామోహావహాపాదలంబిశిఖాముఖా
లక్ష్యసౌవర్ణవర్ణజాలజాలకంబును నినంపాంససారలోభలో
లుపస్వాంతభూనభోంతరనిరతయాతాయతపరిశ్రాంతశశి
కాంతప్రముఖామరవ్రాతసంజాతతాపత్రయనిదాఘతాప
గర్వసర్వస్వహరణచణవర్ణావర్షమధురమధురసధారాదుర్దిన
దినారంభంబును నగు చంపకంబు సదేశంబున నిదేశకారులై
మార్కండేయమాండవ్యమౌద్గల్యసనకసనందనసనత్కుమా
రసనత్సుజాతాదిమౌనిసంఘంబు లసంఖ్యంబులుగా సవనం
సవనంబులు సల్ప విమానీకృతదివ్యవిమానంబులగు విమానం
బున నీవేశించి విశ్వరక్షణవ్యిక్షణంబును విశ్వ
కర్మనిర్మితంబును నగు త్రిణతంబు ధరించి భవత్కటాక్షవీక్ష
ణానుగణకృతార్థంబుగ కృష్ణతీర్థంబు గావించి ఆభీరభీరుకుచ

శాతకుంభాకుంభగుంభితకుంకుమపంకహరిద్రాముద్రా
ముద్రితవీచికాసారంబగు కాసారంబు గావించిన నది హరిద్రా
నది యనంబరగు. భవదీయదివ్యవిమానంబునకు బాణ
పాతప్రమాణంబున, పశ్చిమంబున గోభిలప్రకల్పితం బైన
భవ్యజ్ఞాప్రదం బగుచు విష్ణుపుష్కరణియనంబరగ వరం బొసంగి
బహుమునిప్రణీతంబులైన బహువిధతీర్థంబులకు పావనత్వంబు
గల్పించి ద్వారకంగోరక పెన్నిధిరీతిసన్నిధానంబు సేయవలయు
ననవుఁడు శ్రీవత్సలాంఛనుండు భక్తవాత్సల్యంబున నచ్చట
నిచ్చ వసియించి బృందావనతరుబృందంబుల యమునాతీర
కుంజపుంజంబుల గోపగోపికాగోకులంబును క్రీడాశైలతటాగా
తటాగమ్ముల మరియు నచ్చటి మహీతలమహితవిహరణవిహి
తోపకరణమ్ముల దక్షిణద్వారకానగరయోజనాంతంబున నిరం
తరంబుగ నుండ నేమించి మించి మించినకరుణాకుహనాగోపా
లుండు గోప్రళయగోభిలులకు మంత్రోపదేశంబు గావించి
వారలయందు దయయుంచి యచ్చట వసియించె అందుగోప్రళ
యుండు నందకధరపాదభజనానందధరుండై సాంగక్రతువిధాన
సంశోధితకల్మషుండై దక్షిణద్వారకావాసవాసవాసనావాసి
తుం డగుచు చక్రధరసాయుజ్యసామ్రాజ్యంబు నొందె. అందలి
గుణగణంబులు గణనాతిలంఘ్యంబు లని మఱియు నిట్లనియె.

18


గీ.

దక్షిణద్వారకాపురస్థలమహాత్వ
మగ్నికల్పంబునను జెప్పె నందు బ్రహ్మ
తపముఁ జేసెను నిష్ట పద్మయును హరిని
తలపునను గోరి ఘననిష్టతపము జేసె.

19

క.

వారిద్దఱి తపములకును
వారిజనాభుండు మెచ్చె వరమును దయచే
కోరఁగ నొసంగి మగుడన్
జేరెను వైకుంఠపురము చిత్త మెలర్పన్.

20


గీ.

దక్షిణద్వారకాపురస్థలము మహిమ
శౌనకమహర్షికిని సూతసంయమీంద్రుఁ
డంతయునుఁ దెల్పియచ్చట నతిశయిల్లు
నలహరిద్రానదినిఁ జాల యభినుతించి.

21


చ.

ఇలఁగల పాపసంఘముల కెందును నిష్కృతిఁ గల్గుగాని మేల్
దలఁపని పాపకర్ముని కృతఘ్నతకున్ మఱిలేవు నిష్కృతుల్
తొలుతఁ దొలంగినట్టి ఘనదోషము నొక్కదరాధినేతకున్
కల దితిహాస మొక్కటి ప్రకాశము సేసెద మీకు నెంతయున్.

22


గీ.

ఒనరు గోదావరీనది యుత్తరమున
సింధుసౌవ్వీరమధ్య ప్రసిద్ధ మగుచు
తేజమున మించి సౌరాష్ట్రదేశమందు
పుణ్యవర్తనుఁ డొకమహీభుజుఁడు గలఁడు.

23


సీ.

తనదు దుర్గాధిపత్యము లోకముననున్న
                 జననాథుల కలంఘ్యశక్తిఁ దెలుప
తనదు సర్వజ్ఞత్వ మనిశంబు జనముల
                 మనములలోనున్న మర్మ మరయ
తనయుగ్రభావంబు దర్పితాహితవాస
                 పురముల నొక్కట పొడవడంప
తనమహైశ్వర్యంబు తప్పకఁ గొల్చిన
                 ధన్యులకును ధనదత్వ మెసఁగ

గీ.

తనరు తనలోకపాలకత్వప్రసిద్ధి
పరిజనులనెల్ల లోకపాలురుగఁ జేయ
రాజశేఖరుఁ డనఁగ సౌరాష్ట్రదేశ
రాజశేఖరుఁ డెంతయు రహి వహించు.

24


క.

ఆరాజశేఖరుండును
భూరమణుఁడు వేఁడలాడఁ బోవఁదలంపన్
సూరెలనున్న జనంబులు
సారెకు మృగయావిహారసన్నాహామునన్.

25


సీ.

సివ్వంగిబండ్లును చిఱుతబలంబులు
                 మోటకత్తులు తెరల్ మోకురురులు
పారెపాతెమ్ములు బదనికల్ తడకలు
                 చిలుకుటమ్ములు చల్టిచిక్కములును
వలలును బోనులు వల్లిత్రా ళ్లొడిసెళ్లు
                 సెలవిండ్లు దీనుముల్ జిగురుగడలు
వెటులు గ్రోవులు మనుల్ బిసలును డేగలు,
                 వేపులునాదిగా వెలయునట్టి


గీ.

వివిధసాధనముల వేఱువేఱఁ బూని
యాగ్రహవ్యగ్రులై మృగయానుషక్తి
వెల్లివిరిసినసంద్రంబువిధము మీఱ
నాటవికులెల్ల తనవెంట నంటికొలువ.

26


శా.

వాహారోహ మొనర్చి పార్శ్వయుగళిన్ వల్లత్కృపాణంబులన్
బాహాదండము లొప్ప వీరరసతద్భావానుభావంబునన్
సాహాయ్యంబొనరించు రాచకొమరుల్ సన్నద్ధులై వెంటరా
సాహో యంచును హెచ్చరించ విభుఁ డుత్సాహంబు సంధిల్లగన్.

27

గీ.

వేయువిధముల వనములో వేఁటలాడి
యెపుడు మెప్పింతు మిక నిప్పుడెప్పు డనెడు
చెంచుదొరలునుఁ దానును చేరి యచట
వేటలాడంగదొడఁగె నుర్వీవిభుండు.

28


క.

దండం బిడి చెంచొక వే
దండము తొండంబువట్టి తా లాగింపన్
కొండవలెఁ బడియె దానము
మెండుగ సెలయేర్లరీతి మేదిని నిండన్.

29


గీ.

లేటికెదురుగ రాఁబులి వేటసేయు
భూభుజా! యమ్ము రెంటిని బొలియఁజేయ
పులియు లేడియు సరిపడఁబోరిపడియె
ననరి శరవేగ మెఱుఁగక యాటవికులు.

30


ఉ.

దండితనంబుమీఱ భుజదండమునం దగు నేజఁబూని వే
దండముఁ జేరఁబోయి వసుధాపతి దాని మరల్ప దాని యా
దండ నయుండు కొండవడి దాఁకినచప్పుడు విన్నయప్పుడే
కొండను కొండ దాఁకె కనుగొండని చూతురు భిల్లవల్లభుల్.

31


క.

పులుగులుఁ జొరపిడి యొకరుఁడు
వలకేలను డేగబూని వైవగ నాసన్
వలగొన నదియును నవియునుఁ
దొలఁగెను బహ్వాశవలన దొరకునె ఫలముల్.

32

గీ.

జగతి గెలుపులచే కొనుచామరమ్ము
లధికసత్వంబులుండ నియ్యడవి వింటి
కేటికని చామరమ్ముల నెల్లగొనిరి
చమరులనుఁ జేరి శూరులు చెమరుబలిమి.

33


శా.

దానప్రౌఢిమ నెంచి చూచినను భూదారత్వసంరూఢిచే
యేనాటం దమి నేమిటం గొదవయే మీయమ్ము లాయమ్ములన్
క్ష్మానాథుం డిటు లేయనేటి కనుగిన్కం గోలె కోలంబు లౌ
రానించెన్ ప్రతిగాగ రక్తశరధారాసారముల్ మీఱఁగన్.

34


మ.

వడిగా వెన్నున నిల్వనేసిన శరవ్రాతంబు నిండార నల్
గడలన్ మిన్నులురాయు కీచకశిఖాకాండప్రకాండంబుగా
పుడమిం జాఱెడు క్రొత్తనెత్తురులరొంపుల్ ధాతుపూరంబుగా
నడగొండల్ వలె నుండె వన్యగజసంతానంబు లంతంతటన్.

35


సీ.

ముంచి యెత్తిన రొంపి ముకుగోళ్లఁ జిందెనా
                 గగనగంగకుఁ బంకగరిమఁ జూప
చింతనిప్పులు రాలు చిఱుతకన్నులడాలు
                 దావకీలలకునుఁ గైదండ లొసఁగ
ఝాడించి నిలిచిన స్తబ్ధరోమములచే
                 బ్రహ్మాండములు తూంట్లబావలుగను
ఘుర్ఘురస్వనముల గుంభినీధరముల
                 గుహలసింగంబుల గుండె లవియ


గీ.

వలల చించుక చెంచులవశముగాక
యేకలం బొక్కఁ డుర్వీశు నెదుట నపుడు
ప్రళయకాలవరాహంబు పగిది హెచ్చ
వచ్చినిలిచెను ప్రజలెల్ల విచ్చిపాఱ.

36

గీ.

కుండలితచాపుఁడై నృపకుంజరుండు
నిశితశరములు నొండొండ నిగుడఁజేసి
ఘోణిఘ్రాణపుటంబున గుదులు గ్రుచ్చె
పొదలచున్నట్టి వాలంపుపొదు లనంగ.

37


వ.

మరియు నమ్మహీమండలాఖండలుండు మండలీకృత చండ
కోదండుండై యొండొండ నిశతకాండంబుల నించి చించి
చెండాడు చండగవిసిన చందంబునం దమకంబు వీడ క్రోడంబు
తత్తరంబునం బరువెత్తిన హత్తికత్తళాధాటింపుచు, వెంబడిం
బడి మిట్టాడు మానిసి లేనినట్టడవి మలపం యెదదప్పిచే నలపం
.................బ్రాణత్రాణపరాయణుండగును నాచక్కినొక్క
యాశ్రమంబు శ్రమంబు దీరునను తలంపునందుఁ బ్రవేశించి
యందునయజ్ఞయజ్ఞశీలుం గనుంగొని నమస్కరించి "అయ్యా
యియ్యడవి నెయ్యడలం దేరుగడలు దీపించె నన్ను నన్నంబు
వెట్టి రక్షింపుమ న్నతం డన్నపానాదుల నన్నరవరుం బరితృ
ప్తుం జేసి యనిచిన ననిచినముదంబున నమ్మహీకాంతుండు
నిజపురంబు ప్రవేశించె నంత నొక్కనాడు.

38


క.

మునినాథుఁడు డెందంబున
జననాధుకృతజ్ఞభావసంగతిఁ దెలియన్
జనుదెంచెను శౌర్యంబున
మునిముచ్చనుమాట లోకమునఁ దనరారన్.

39


ఉ.

వచ్చి మహీమహేంద్రు తలవాఁకిటి మోసలనుండి చీకటుల్
హెచ్చినవేళ నందునను నెవ్వరు గానకయుండ నేర్పుగా

సొచ్చి యొకండ మేలుకలసొమ్ములనెల్ల గ్రహించి క్రమ్మరన్
వచ్చినఁ జూచి వీథితలవ ర్లతనిం గని కట్టి గట్టిగన్.

40


గీ.

వేగ గొలువున్నయమ్మహీవిభుని సభకు
పాశబద్ధునిఁ జేసిన బ్రహ్మకులుని
తెచ్చినిలుప మహీపతి తెలియఁజూచి
యెఱిఁగియుండియు నతనితో నిట్టులనియె.

41


శా.

ఓరీ! బ్రహ్మకులాధమా! నగరిలో నొంటిం బ్రవేశించి నీ
వేరీతిన్ హరియించి తింతధన మిం దెవ్వారలున్ లేరె? యీ
చోరత్వంబున నెట్టు లొగ్గె మన సెచ్చోటన్ మునిశ్రేణికిన్
మేరల్ చెల్లునె చెల్లఁబో యనుచు భూమీభర్త రోషంబునన్.

42


గీ.

తొలుతఁ జేసిన మేలెల్లఁ దొలఁగఁ ద్రోచి
పెట్టె పెట్టుడు సొమ్ములు పట్టి తీర్చి
యాజ్ఞ కర్హుండుగాఁడు బ్రాహ్మణుఁడటంచు
వెడలిపొమ్మని త్రోయించె వీడు వెడల.

43


క.

యతియును నవ్వుచు నూరక
నతివేగముతోడ నరిగె నాశ్రమమునకున్
కృతమెఱుఁగని పాతకమున
క్షితిపతియును పుణ్యకర్మశీలత తొరఁగన్.

44


సీ.

మ్రొక్కి ముందట నిల్చి మోడ్పుచేతులచేత
                 వేఁడుకోవచ్చిన వెక్కిరించు
నాడినమాటలే యాడుచు దనమాట
                 లాదరింపనివారి నదరవైచు

నటులు చూపినవిద్య నటులఁగా దంచు దా
                 నడ్డమై రోణంగి యాటలాడు
వలెవాటువైచిన వలిపెసాలువ చించి
                 పెనచి పగ్గాలుగాఁ బేనుచుండు


గీ.

మేర మీరిన మన్మథభార మొంది
యలఁత యాఁకలి దప్పియు ననక వెనుక
వచ్చువారలఁగ నక భూవల్లభుండు
ఘోరకాంతారవీథులఁ గ్రుమ్మరిలుచు.

45


గీ.

చేరువనెయున్న యాయజ్ఞశీలువనము
చేరి యాసంయమీంద్రుని చెంతనిలుప
నకట! యీతని కిటులయ్యెనా యటంచు
నార్ద్రచేతస్కుఁడై యిట్టు లనియె మౌని.

46


క.

శాపము జెందఁగ మావిభుః
డేపాపము సేయఁగానొ యిటులయ్యెగటా!
రూపింపగా కృతఘ్నత
ప్రాపించెను కాక యింతభంగము గలదే?

47


గీ.

అనుచు మౌనీంద్రుఁ డప్పుడు ననుచు దయను
రాజ్యగర్వంబుచే నపరాధ మితఁడు
సేయు టెంచి యుపేక్ష ముంజేయఁదగదు
పరిహరించెద నీతనిపాతకంబు.

48


మ.

అని యామౌని నృపాలుఁ జూచి హృదయాహ్లాదంబు సంధిల్ల నో
ఘనశౌర్యోదయ! నీకు నిప్పుడు కృతఘ్నత్వంబు పాటిల్లఁగా
వినుమా పాపము సంభవించె ధన ముర్విన్ సంయమిగ్రామణుల్
గొని యేకార్యము సేయువారు తగునీకున్ దెల్పెదన్ మత్కథన్.

49

క.

మును మాయాశ్రమమునకును
జననాయక నీవు వచ్చి సంతుష్టుఁడవై
చను మే లెఱుఁగుదువో యని
మన మరయ దలంచి యొక్కమార్గముచేతన్.

50


చ.

ధనములు చోరవృత్తిఁ గొన దగ్గరకిం దలవర్లు దెచ్చినన్
ననుఁ గని నీవు చాలకఠినంబులు పల్కితి మున్నెఱింగియున్
మనుజవరేణ్య! యట్టియవమానమువల్ల కృతఘ్నదోషముల్
పెనఁగొని వెఱ్ఱిజేసె నిక భీతిల కేగతి యొండు దెల్పెదన్.

51


గీ.

అకటబ్రాహ్మణఁ డుపకర్త యనఁగవలదు
భూసురుండైనవాఁ డెల్ల పూజ్యు డరయ
నవనినాయక! యుపకర్తయైనయట్టి
విప్రు నవమతి సేసిన వేఱెకాదె.

52


సీ.

చతురంగబలములై సంరక్షణము సేయు
                 బ్రాహ్మణాశీర్వాదపాటవంబు
ధనధాన్యరాసులై తనుపు సంతతమును
                 బ్రాహ్మణాశీర్వాదపాటవంబు
ప్రాకారము లగాధపరిఘులునై కాచు
                 బ్రాహ్మణాశీర్వాదపాటవంబు
ప్రాసాదములు రత్నభవనంబులై యుండు
                 బ్రాహ్మణాశీర్వాదపాటవంబు


గీ.

బ్రాహ్మణులఁ బూజసేసి సద్భక్తితోడ
నన్నపానాదు లొనగూర్చు నవనినేత
యాయురారోగ్యభాగ్యంబు లనుభవించు
సత్య మిదె సుమ్ము నమ్ము నాసత్యరూప.

గీ.

ఘనత మించిన యాకృతఘ్నత్వమునకు
నూహ సేయంగ నిష్కృతి యొండుగలదు
దక్షిణద్వారకాపురోత్తమమునందుఁ
తీర్థ మొనరు హరిద్రానదీసమాఖ్య.

55


సీ.

ఆభీరభీరూకుచాద్రులతో నేఁడు
                 వియ్యమందెడునట్టి వేడ్కఁ గలిగె
గోపరూపవతీసురూపేక్షణములతో
                 సయ్యంబుఁ గావించు సౌఖ్య మబ్బె
వల్లవపల్లవీవదనపద్మములతో
                 నెయ్యంబు సవరించు నెనరుఁ గలిగె
ఘోషయోషామణీకుంతలంబులతోడి
                 గలసి మెలంగు విఖ్యాతి యొదవె


గీ.

ననుచు రంగంత్తరంగరథాంగమీన
కమలశైవాలకల్హారగరిమ మెఱయఁ
దనరుచులు నెల్లదిక్కులఁ దనర నలరు
ధర్మములదొంతి యలహరిద్రాస్రవంతి.

56


గీ.

అందుఁ గ్రుంకినవారల కవనినాథ!
యఖిలపాపంబు లడఁగుట యబ్బురంబె?
కఠినతరమైన నీకృతఘ్నత్వ మడఁగు
స్నానదానంబు లచ్చట సవదరింపు.

57


క.

అని యనిచిన సమ్మదమున
జననాయకుఁ డరిగె వేగ చంపకవనిలో
ననఘ హరిద్రానదిఁ దాఁ
గనుఁగొని నతి సేసి భక్తిగౌరవ మెసఁగన్.

58

గీ.

వినుతి గావించి శాస్త్రోక్తవిధిని యందు
మజ్జనం బాడి యాస్నానమహిమవలన
వీతకల్మషుఁడై భక్తి వెలయ నాత్మ
నాత్మముఖల నెల్ల దా నధికనిష్ఠ.

59


క.

మనుజేంద్రుఁడు పదియాఱగు
ఘనదానము లొసఁగి విష్ణుకైంకర్యము దా
నొనరించు మిగులధనముల
వినతులు గావించి భక్తివినుతులు సేసెన్.

60


గీ.

కోటిమణు లిచ్చి యారాజగోపమణికి
పంచపాత్రము లర్పించి భక్తి మించి
భక్తిశేఖరుఁడైన యాపార్థివుండు
తదనుమతి నేఁగె నిజరాజధాని కపుడు.

61


క.

ఈకథ వినినం జదివిన
లోకోత్తరమహిమ భక్తలోకము కెల్లన్
శ్రీకాంతునికృపవల్లను
చేకురు నారోగ్యభాగ్యచిరతరసుఖముల్.

62


క.

అష్టాక్షరీజపం బురు
శిష్టతఁ గావించు పుణ్యశీలురకు మనో
భీష్టార్థఫలము లన్నియు
ముష్టిగ్రాహ్యంబు లగుచు ముందటనిల్చున్.

63


గీ.

ద్వాదశాక్షరియనెడు మంత్రంబు భక్తి
జపముఁ గావించునట్టి సజ్జనుల కెల్ల
రాజగోపాలుఁ డురుదయ రాజిలంగఁ
గొంగుబంగార మగుచుఁ జేకూర్చు శుభము.

64

.

శా.

పక్షాంతేందుముఖీవిలాస సుమనోబాణాస బాణసఖీ
దక్షప్రాభవదేవలబ్ధకవితాదాక్షిణ్య దాక్షిణ్య భూ
శిక్షానీక్షితనైకనైగమమహాసిద్ధాంత సిద్ధాంతరు
ద్వేక్షారాధిత రాధికాప్రియమహావిద్యోత విద్యోతనా.

65


క.

హారాయిత గుణగణప్రతి
హారాంకనభూపరూప హార్యనుహారా
....................................
హారాంచితకీర్తిపూర హారివిహారా.

66


ఘనతరాజివినత........విరాజివైభవా
వినుతశాలిదశదిశాలి వివిధశాలి భూధవా
జననురాగ జలజరాగసదనురాగ గౌరవా
పనితదామ యువతిథామ బహువిధా మనోభవా.

67


సీ.

వారాశివలయిత భూరక్షణ.......


గద్య.

ఇతి శ్రీమత్కాళహస్తీశ్వరకరుణాకటాక్షలబ్ధసిద్ధసార
స్వతనయ చెంగల్వ వెంకటార్యతనయ విజయరాఘవభూప
ప్రసాదాసాదితవివిధరాజచిహ్నచిహ్నితభాగధేయ కాళయ
నామధేయ ప్రణీతంబైన రాజగోపాలవిలాసంబను మహాప్ర
బంధంబునందు సర్వంబును పంచమాశ్వాసము.

శ్రీరాజగోపాలాయనమః