రాఘవపాండవీయము/ప్రథమాశ్వాసము

శ్రీరస్తు

శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః

రాఘవపాండవీయము

సవ్యాఖ్యానము

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

ఆ.

వెలయు నఖిలభువనములలో నవారణ
నగరిపురమతల్లి నాఁ దనర్చి
రాజ్యలక్ష్మి మిగులఁ బ్రబల నయోధ్య నాఁ
రాజవినుతి గనిన రాజధాని.

1

రామాయణార్థము. అఖిలభువనములలోన్ = సకలజగత్తులలోపల, 'విష్టపం భువనం జగత్', అని యమరము. అవారణ = అనర్గళమైన, నగరిపు = ఇంద్రునియొక్క, రమ = సంపదకు - అవారణపదము రమకు విశేషణము. తల్లి = పోషించునది, నాన్ = అనఁగా - ఉ. 'శ్రీ యన గౌరి నాఁబరఁగు చెల్వ' యని సోమయాజి ప్రయోగము. తనర్చి = ప్రకాశించినదై - రాజ్యలక్ష్మి మిగులఁ బ్రబలఁగా, ఇది యత్యుక్తి. ఇందుకు లక్షణము చంద్రాలోకమందు, "అత్యుక్తిరద్భుతాతథ్యశౌర్యాచార్యాదివర్ణనమ్, త్వయి దాతరి రాజేంద్ర యాచకాః కల్పశాఖినః" అని. 'భువనములలో నవారణ' అనుదిక్కున సంధికి ఆంధ్రభాషాభూషణమందు, క. 'మానుగ విభక్తులందుం, బూనిన నురులులకు నచ్చు వోయినఁబోవు' నను లక్షణమువలన నుకారము లోపము. రమ తల్లి యనుదిక్కున, గీ. 'క్షమ నకారాంతరూపప్రకాశికంబు, లైన పుంలింగములు దక్క నన్నిటికిని, బరఁగ సంబంధషష్ఠిపైఁ బ్రథమ యగును, దంతికన్నులు రమపల్కు తరువుకొమ్మ.' అను లక్షణమువలన షష్ఠ్యర్థమందుఁ బ్రథమాంతరూపము. అయోధ్య నాన్ = అయోధ్య యనెడిపేరు గలదై, రాజవినుతి గనిన రాజధాని, వెలయున్ = సర్వోత్కృష్టమై వర్తించును. క. 'కృతిముఖమున దైవనమ, స్కృతి యొండె నభీష్టవస్తుకీర్తన మొండెన్, వితతాశీఃపద మొండెను, బ్రతిపాదింపంగ వలయు భద్రాపేక్షన్.' అను న్యాయమున వస్తునిర్దేశరూపమంగళము. క. 'శుభసుఖరుక్క్షయధనకన, కభయైశ్వర్యములఁ జేయుఁ గవులకుఁ గావ్య, ప్రభులకుఁ గృతులకు మొదల, న్మభజసనయరతగణాళి మల్లియరేచా.’ అని భీమునిఛందమందుఁ జెప్పి యున్నది గనుక నాదియందు నగణప్రయోగము వెలయు ననునది శుభపదము నకార మమృతబీజమును.

భారతార్థము. అఖిలభువనములోనన్, వారణనగరి = హస్తిపురము, పురమతల్లి = పురశ్రేష్ఠమైనది, నాన్ = అనఁగా. ని. “మతల్లికామచర్చికాప్రకాండముద్ఘతల్లజౌ ప్రశస్తవాచకాన్యమూని” అని అ. అవారణనగరిపురమతల్లి యనుదిక్కున, క. 'పొసఁగం బల్కెడునెడఁ బొ, ల్పెసఁగిన ప్రథమాంతములపయిం గదిసి కడుం, బసనారు కచటతపలను, గసడదవల్ ద్రోచివచ్చుఁ గవిజనమిశ్రా.' అని యాంధ్రభాషాభూషణమందును, క. 'ప్రథమాంతవిభక్తులపైఁ, గథితము లగుకచటతపలు గసడదవ లగుం, బృథివి నవి గజడదబ లగుఁ, బ్రథమపుసున్నలు గణాంతపదమున మీఁద' నని యనంతునిఛందమందును జెప్పినలక్షణమువలన, పకారమునకు వకారము రావలసినందుకుఁ దాతంభట్టుగారు కవిలోకచింతామణియందు. క. 'భిన్నపదప్రథమలపై, నున్న పకారంబు నత్వ మెందును వళులన్, ము న్నిజరూపము ప్రాసము, నన్నవరూపంబు దాల్చు నాళీకాక్షా.' అని విశేషవిధులుగాఁ జెప్పిరి. శా. 'ఆవాలుంగనుదోయి యా నగుమొగం బాగుబ్బపాలిండ్లపెం, పావేణీరుచి నూతనూవిలసనం బాయొప్పులేఁ జెప్పినన్, గైవారం బగుఁగాని యయ్యెడ శిరఃకంపంబుతోఁ గూడ నా, హా పుట్టింపదె పుష్పధన్వునకు నయ్యబ్జాక్షి నీక్షించినన్.' అని పిల్లలమఱ్ఱి వీరన్నగారిప్రయోగమును. ఉ. 'భూనుతకీర్తిబ్రాహ్మణుఁడు పుట్టఁగఁ దోడనె పుట్టు నుత్తమ, జ్ఞాన' మని యివి మొదలయిన కవిత్రయమువారి ప్రయోగములును వ్రాసినందువలనఁ బ్రథమాంతముమీఁది పకారమునకు వకారాదేశము ప్రాసస్థానమందు నిత్యముగా వచ్చును. యతిస్థానమం దుండరాదు. ఇతరత్ర యేదైనఁ జెప్పవచ్చునన్నట్టాయెను గనుక, వారణనగరిపురమతల్లి యని చెప్పవచ్చును, కాఁగానే, సూరపరాజుగా రీమీఁదటిపద్యమందును విముఖతసమదాటోపారిపంక్తిరథుఁ డని, రామాయణార్థమందుఁ జెప్పినారు. ప్రకృతము, తనర్చి = ప్రకాశించినదై, అయోధ్య = యుద్ధము చేయ శక్యము గానిది, యోద్ధు మశక్యా = అయోధ్యా యనునర్థమందు, “ఋహలోర్ణ్యత్ " అని సూత్రమున ణ్యత్ప్రత్యయాంతము. నిడుపులుడుపఁ దెనుఁ గగును. నాన్ = అనంగా, రాజ = దిగ్దేశరాజులచేతనైన, వినుతి గనిన, రాజధాని = సింహాసనస్థలమైనది, వెలయును, క్రియ.

క.

ఆపట్టణ మేలెడిపృథి, వీపాలుఁడు భ్రుకుటిమాత్రవిముఖితసమదా
టోపారిపంక్తిరథుఁ డు, ద్దీపించు నుదారనీతి ధృతరాష్ట్రుఁ డనన్.

2

భారత. భ్రుకుటిమాత్ర = బొమముడిచేతనే, “మాత్రం కార్త్స్న్యేవధారణే" అని అ. విముఖత = పరాఙ్ముఖములుగాఁ జేయఁబడిన, సూ. తత్కరోతీతిణ్యం తాత్కర్మణిక్త అనిక్తప్రత్యయాంతము, “సువర్ణదండైకసితాతపత్రిత జ్వలత్ప్రతాపావళి కీర్తిమండలః" అని నైషధము. సమదాటోప = గర్వాతిశయముతోఁ గూడిన, అరి = శత్రువులయొక్క, పంక్తి = శ్రేణులయొక్క, రథుఁడు = రథములుగలవాఁడు, విముఖితపదము రథవిశేషణము, ఉదారనీతి = ఘనమైన నీతి గలవాఁడు, "ఉదారో దాతృమహతోః” అని అ. ధృతరాష్ట్రుఁ డుద్దీపించును.

రామ. భ్రుకుటిమాత్రవిముఖితులయిన సమదాటోపారులుగలవాఁడు, పంక్తిరథుఁడు = దశరథుఁడు, “పంక్తిస్స్యాద్దేశమచ్ఛందోదశసంఖ్యావళీషుచ " అని విశ్వనిఘంటు. ఉదారనీతిచేత, ధృత = ధరింపఁబడిన, రాష్ట్రుఁడు = దేశము గలవాఁడు, అనన్= అనఁగా, ఉద్దీపించును, క్రియ.

చ.

తెలివి నతిప్రగల్భుఁ డసదృగ్బలుఁ డాతఁడు భీష్మచాపకౌ
శలమె సహాయమై యమరశత్రుల నేపడఁపన్ వలంతి యై
నిలుకడ నేలె విశ్వధరణిం దనమిత్త్రకులంబు వైభవో
జ్జ్వలతఁ దలిర్పఁ బౌరవసుసంతతి రాజుల కెల్ల హెచ్చుగన్.

3

రామ. అసదృగ్బలుఁడు = సరి లేనిబలము గలవాఁడు, “సదృక్షస్సదృశస్సదృ” క్కని అ. అతఁడు = దశరథుఁడు, భీష్మ = భయంకరమైన, చాపకౌశలమె = వింటియందలి నేర్పే - ధనుర్విద్య యనుట, సహాయమై, ఆమరశత్రులన్ = అసురులను, ఏపడఁపన్ = కొంచము పఱుచుటకయి, వలంతియై = సమర్థుఁడై, తనయొక్క, మిత్త్రకులంబు = సూర్యకులము, “ద్యుమణిస్తరణిర్మిత్ర" అని అ. వైభవములయొక్క, ఉజ్జ్వలతన్ = ఆధిక్యముచేత, తల్ప్రత్యయాంతము, తలిర్పన్ = ప్రకాశించునట్టుగా, పౌర=పట్టణమువారియొక్క, వసు = ధనములయొక్క, “వసురత్నే ధ౽నేపిచ” అని అ. సంతతి = సమూహము, రాజుల కెల్ల, హెచ్చుగ = అరుదగునట్లుగా, విశ్వధరణిన్ = సమస్తభూమిని, "విశ్వం కృత్స్నమశేష” మని అ. నిలుకడన్, వంశపారంపర్యముగా, ఏలెను, రాజులయొక్క సంపద యనుక్తసిద్ధము. ఇది కావ్యార్థాపత్త్యలంకారము, “ కైముత్యేనార్థసంసిద్ధిః కావ్యార్థాపత్తిరిష్యతే” అని.

భారత. తెలివిన్ = బుద్ధిచేత, అతిప్రగల్బుఁడు, అసదృగ్బలుఁడు, దృష్టిబలసహితుఁడు కానివాఁడు, ధృతరాష్ట్రుఁడు, భీష్మునియొక్క చాపకౌశలమే సహాయమై యమ రఁగా శత్రులను, ఏపడఁపన్ = మట్టు పెట్టుటకు, వలంతియై, మిత్రకులంబు = బంధువులయొక్క కులము, తలిర్ప, పౌరవ = పూరునిసంబంధమైన, సుసంతతి = సత్కులమందుఁ గల - "సంతతిర్గోత్రజననకులాని” అని అ. రాజుల కెల్లన్ = యయాతి భరతుఁడు మొదలయిన రాజులకందరికిని, హెచ్చుగ, ఏలెను, క్రియ.

క.

సుబలతనయగుణమహిమన్, బ్రబలి తన కుదారధర్మపాలనలీలన్
సొబ గొంది వన్నె దేఁగా, విబుధస్తుతుఁ డవ్విభుండు వెలసెన్ ధరణిన్.

4

భారత. సుబలతనయ = గాంధారి, గుణ = సౌశీల్యాదిగుణములయొక్క, మహిమన్ = మహిమచేత, క. 'వినుతద్ద్వితీయసప్తమి, కిని మఱిమూఁడవవిభక్తికిని నిడఁగానౌ, విన నింపుపుట్టుపట్టున, నను వెఱిఁగి ప్రబంధములఁ బయోంబుధిశయనా.' అని కవిలోకచింతామణియందు, ప్రబలి తనకు, దారధర్మ = స్మృత్యుక్తమైన భార్యాధర్మముయొక్క, పతివ్రతాచారముయొక్క యనుట, “ఆర్తార్తే ముదితే హృష్టా ప్రోషితేమలినాకృశా, మృతేమ్రియేత యా నారీ సాస్త్రీజ్జేయా పతివ్రతా” అని స్మృతి. "ధర్మఃపుణ్యేయమే న్యాయే స్వభావాచారయోః క్రతౌ" అని అ. పాలనలీలచేత, "ప్రదిత్సతస్స్వం పితురం ధమాత్మనో నిశమ్య భర్తారమగూఢసమ్మదా, అరుంధతీకీర్తిమసౌ నిరుంధతీ బబంధ పట్టేన దృశౌ ప్రతివ్రతా” అని బాలభారతమందును జెప్పియున్నది గనుక, సొబగొంది = ఒప్పినదై, వన్నె దేఁగా “అనుకూలాం విమలాంగీం కుశలాం కులజాం సుశీలసంపన్నామ్, పఞ్చలకారాంభార్యాం పురుషః పుణ్యాధికో లభతే" అని చెప్పుదురు. విబుధస్తుతుఁడు = పెద్దలచేత స్తోత్రము చేయఁబడినవాఁడు, “విబుధః పండితే దేవే” అని వి. అవ్విభుండు = ఆధృతరాష్ట్రుఁడు, వెలసెను.

రామ. సుబలత = బలిమి, బహువ్రీహిమీఁది తల్ప్రత్యయాంతము, నయగుణమహిమచేతఁ బ్రబలి యుదారధర్మపాలనలీలచేత, సొబగొంది తనకు వన్నె దేఁగా, ఈయర్థమున సుబలత యనునది కర్తృపదము. విబుధ = దేవతలచేత, స్తుతుఁడు, అవ్విభుండు = దశరథుండు, వెలసెను, అర్థాంతరము. సుబలతన్ = బలిమిచేతను, అయగుణ = భాగ్యలక్షణములయొక్క, “అయశ్శుభావహోవిధిః" అని అ. "గుణః ప్రధానేశబ్దాద్ మౌర్య్వాం సూదే వృకోదరే” అని వి. మహిమచేతఁ బ్రబలి, ఉదారధర్మపాలన = దుష్టనిగ్రహశిష్టానుగ్రహాదిధర్మములయొక్క సంరక్షణము, ణ్యాసశ్రంభోయుచ్చని యు చ్ప్రత్యయాంతము గనుకఁ బాలనాశబ్దము స్త్రీలింగము. ఉ. 'పాండవసైన్యసంఘపరిపాలన సేయు, నితండయంచుఁ గృష్ణుం డభిషేకసంపదుపశోభితుఁ జేయఁగ' నని సోమయాజియు స్త్రీలింగముగాఁ బ్రయోగించినాఁడు. ఇటువంటి శబ్దములు ల్యుట్ప్రత్యయాంతము లైనపుడు నపుంసకలింగములు నవును గనుక రెండులింగములును గలవని ముందును దెలిసికొనునది, వన్నె దేఁగా, ఈయర్థమున ధర్మపాలన యనునది కర్తృపదము, వెలసెను

క.

అని నీడు లేనికడిమిం, దనరారు నతిప్రతాపితదనుజుఁ డతఁ డు
ర్విని గలనృపతుల నందఱఁ, దన కరిగాఁపులుగఁ జేసె దర్పస్ఫురణన్.

5

రామ. అనిన్ = యుద్ధమందు, కడిమిన్ = శౌర్యముచేత, తనరునట్టి, అతిప్రతాపితదనుఁజుఁడు = మిక్కిలి తపింపఁజేయఁబడినదనుజులు గలవాఁడు “సకిలసంయుగమూర్ధ్నిసహాయతాం మఘవతః ప్రతిపద్య మహారథః, స్వభుజవీర్యమవాప యదుచ్ఛ్రితం సురవధూరవధూతభయాశరైః" అని కాళిదాసు చెప్పినాఁడు గనుక, ఆతఁడు = దశరథుఁడు, నృపతులనందఱ నరిగాఁపులుగఁ జేసెను.

భారత. అతిప్రతాపి = అధికప్రతాపముగల, తదనుజుఁడు =ఆధృతరాష్ట్రునితమ్ముఁడైన పాండురాజు, కర్మధారయము, తనరారును, అతఁడు = ఆపాండురాజు, నృపతుల నరిగాఁపులుగఁ జేసె నని యన్వయము.

క.

తా నన్నమాట యింద్రున, కైన నలంఘ్యమయి పేర్చు నట్లుగ నెంతేఁ
బూనిక చెల్లింపుచు జగ, తీనుతవిక్రముఁ డొనర్చె దిగ్విజయంబున్.

6

భారత. తాను, అన్నమాట = జ్యేష్ఠుఁడైన ధృతరాష్ట్రునివాక్యము, కడమయేకార్థము సులభము.

రామ. తా నన్నమాట= తా నాడినమాట.

సీ.

ధృతిఁ గుంతిమద్రభూపతులనెయ్యపుఁగన్య
            కలనన వాలుఁదూపుల జయించె
యలరారునతనుజయశ్రీల వరియించి
            యవనసౌరాష్ట్రభూధవుల గెలిచె
ద్రవిడకళింగసాల్వవిదర్భవసుధాధి
            పతుల నోడించి కప్పములు గొనియెఁ
జోళనేపాళపాంచాలకేరళమత్స్య
            వత్సభూపతులగర్వం బడంచె


తే.

శకయుగంధరఘూర్జరాశ్మంతసింధు
లాటభూపాలముఖ్యుల నోటుపఱిచె
జగతిఁ గోసలకేకయమగధుల తన
యలవరించినయాజ్ఞలో మెలఁగఁజేసె.

7

రామ. ధృతి = ధైర్యముచేత, కుంతిమద్రదేశాధీశ్వరులను, నెయ్యపుఁగన్యకల నన = ఇంపైన క్రొత్తజగడముననే యనుట, ఈదిక్కునఁ గొందఱు కావ్యాలంకారచూడామణియందు, గీ. "విశ్రుతులు హేమచంద్రత్రివిక్రమాదు, లొనరఁ జూపిరి ప్రాకృ తంబునకుఁ ద్రోవ, నంధ్రభాషయుఁ బ్రాకృతాహ్వయమె కాన, వలయుఁ దల్లక్షణంబులు వరుసఁ దెలియ. క. వదలక సిద్ధాక్షరములు, పొదివిన వర్ణములు దూలిపోఁబలుకఁగ న, ర్థదమై ప్రాకృతనిభమగు, నదిక తద్భవపదమునాఁగ నభిమత మయ్యె' నని చెప్పినలక్షణమువలన, కన్యకాశబ్దము ప్రాకృతమున, 'మనయామ్ = అధోవర్తమానానాం మకారనకారయకారాణాం లోపస్స్యా' త్తని కియ్యవడికి లోపము వచ్చి, 'శేషాదేశస్యార్హో చోఘోః=అవశిష్టస్యాచః పరస్యసంయుక్తాదేశస్యాహరస్యహలోద్విత్వం భవతి' అని నకారద్విత్వమును వచ్చి యంత్యకకారము లుప్తమై యుపర్యకారమునకు యకారశ్రవణము రాఁగా, కన్నయా అని యుండును. ప్రాకృతాపభ్రంశరూపమై తద్భవ మయ్యెనేనిఁ, దెనుఁగునఁ గన్నియ యనవలెను. కన్యాశబ్దమే తద్భవ మయ్యెనేనిఁ గన్నె యని యుండును గనుక బహువచనమందుఁ గన్నియలు కన్నె లనవలెఁ గాక భారతార్థమందుఁ గన్నెకల నని కన్యకాశబ్దముమీఁద నంత్యకకారము యకారము గాకయే మధ్యైత్వము వచ్చి తెనుఁగై యుండదు. ఎట్లు విచారించినను, రెండర్థములకు సరిపోదని సందేహింతురు, గ్రంథకర్త కన్నెలకలననయని యేత్వము నిలువఁజెప్పలేదు. అది లేఖకదోషము. తే. 'పుడమి స్త్రీలింగశబ్దంబు కడకకార, మునకు వచ్చుయకారంబు గనఁగఁ గొన్ని, యెడల నెత్వంబు నగుఁ గియ్యవడియు నగును, జడ్డ యగుచోట నైశాటచక్రశమన. తే. 'వధునికకుఁ జెల్లు వదినియ వదినె యనఁగ, వర్ణికకుఁ జెల్లు వన్నియ వన్నె వన్య, యనఁగ నీరీతి మౌక్తికంబునకుఁ జెల్లు, ముత్తియము దొడ్డముత్తెము ముత్య మనఁగ.' ముక్తయే మౌక్తికము. అని. కవిలోకచింతామణియందుఁ జెప్పినలక్షణమువలనఁ గన్యకాశబ్దముమీఁద దెనుఁగునఁ గన్యయనికియ్యవడియుండనేచెప్పినారు కాఁగా భారతార్థమందు గన్యకలనని చెప్పవచ్చును. తత్సమపదము, ప్రకృతము, వాలుఁదూపులన్ = తీక్ష్ణబాణములచేత, జయించి, అతను = విస్తారములయిన, జయశ్రీలను వరియించెను. కోసలకేకయమగధులయొక్క, తనయలన్ = కౌసల్యాకైకేయీసుమిత్రలను, వరించి నయాజ్ఞలో మెలఁగఁజేసెను. తనయల వరించి, కోసలకేకయమగధులను నయాజ్ఞలో మెలఁగఁజేసెననియుఁ జెప్పవచ్చును.

భారత. ధృతిన్ = సంతోషముచేత, “ధృతిర్యోగాంతరే ధైర్యే ధారణాధ్వర తుష్టిషు” అని వి. కుంతిమద్రభూపతులయొక్క, నెయ్యఁపుఁగన్యకలన్ = కుంతీమాద్రులను, ననవాలుదూపులన్ = పుష్పబాణములచేత, జయించి, అలరారు = ఒప్పుచున్న, అతను = మన్మథునికి, జయశ్రీలన్ = జయశ్రీలైనవారిని - కన్యకలకు విశేషణము. వరియించెన్ = వివాహమాయెను - కడమసమానార్థము. కోసలకేకయమగధులన్ = ఈదేశములరాజులను, 'తద్రాజస్యబహుషుతేనైవాస్త్రియా' మని అఙ్ప్రత్యయలోపము. తనయొక్క, అలవరించిన = నియమించిన, క. 'అచ్చుగఁ బెరయచ్చులపై, యచ్చు యకారంబు దాల్చు నబలా యీవే, యిచ్చయపూర్వమునావిని, యచ్చెరువై యుండెనా నుదాహరణంబు' లని యాంధ్రభాషాభూషణము. ఆజ్ఞలో మెలఁగఁజేసెను.

సీ.

కొందఱు తనవార్త కొనసోఁకినంతన
            కొందఱు వృత్తాంతగురుతకతనఁ
గొందఱు భేరినిర్ఘోషంబు లాలించి
            కొందఱు బలరజోబృంద మరసి
కొందఱు నాసీరకోలాహలంబునఁ
            గొందఱు మణికేతుకోటివీక్షఁ
గొందఱు కోదండగుణటంకృతులు విని
            కొందఱు హుంక్రియాకులతఁ జెంది


తే.

కొంద ఱొకటిరెండేటులకొలఁది గలిగి
వివిధదిగ్దేశనృపతులు విరిగి పాఱ
నవనియందును యుద్ధవిహారమునకు
మాఱులేకయ విహరించె మనుజవిభుఁడు.

8

భారత. రామ. రెంటికిని సమానము, భేరినిర్ఘోష మనెడుదిక్కునఁ దెనుఁగుషష్ఠి.

మ.

తలఁపం జొప్పడి యొప్పె నప్పుడు తదుద్యజ్జెత్రయాత్రాసము
త్కలికారింఖదసంఖ్యసంఖ్యజయవత్కంఖాణరింఖావిశృం
ఖలసంఘాతధరాపరాగపటలాక్రాంతంబు మిన్నే ఱన
ర్గళభేరీరవనిర్దళద్గగనరేఖాలేపపంకాకృతిన్.

9

రామ. భారత. రెండర్థములకు సమానము. తత్ = ఆరాజుయొక్క, ఉద్యత్ = ప్రకాశించుచున్న- జైత్రయాత్ర యందు, సముత్కలికా = అధికోత్కంఠచేత, "ఉత్కంఠో త్కలికే సమే” అని అ. రింఖత్ = సంచరించుచున్నవై - అసంఖ్యములైన, సంఖ్య = యుద్ధములయందు, “మృధమాస్కందనం సంఖ్య” మని అ. జయవత్ = జయములు గలవియునైన, కంఖాణ = అశ్వవిశేషములయొక్క, రింఖా = గోరిసెలచేత - విశృంఖల మౌనట్టుగా, సంఘాత = త్రొక్కఁబడిన, ధరా = భూమియందుఁగల, పరాగ = ధూళియొక్క - పటలముచేత, ఆక్రాంతంబు = ఆక్రమింపఁబడినదైన, మిన్నేఱు = ఆకాశగంగ-కర్తృపదము. అనర్గళములైన భేరీరవములచేత, నిర్దళత్ = పగులుచున్న, గగన = ఆకాశముయొక్క, రేఖా = బీఁటికలకు - ఆలేపార్థమైన, పంక = బురదయొక్క, ఆకృతిన్ =సామ్యముచేత, తలఁపన్ = ఊహించుటకు, చొప్పడి = యుక్తమై – ఒప్పెను. “సంబంధాతిశ యోక్తిస్స్యా దయోగే యోగకల్పనమ్, సౌధాగ్రాణి పురస్యాస్య స్పృశంతి విధుమండల”మని సంబంధాతిశయోక్త్యలంకారము.

చ.

తురగఖురాహతిక్షితిజధూళిచయస్థగితాంబరంబుతో
నొరయుచుఁ దచ్చమూగజసముత్కర మప్పుడు చూడ నొప్పె ది
క్కరివరయూథమత్సరవిగాఢతఁ జేసి సమస్తమైనయి
ద్ధర దనపైకి నెత్తుకొని తాల్చెడినో యనుచుండఁ జూపఱుల్.

10

భారత. రామ. రెంటికి సమము. సులభము.

మ.

జవవద్ఘోటకపాటితక్షితిరజస్సంక్రాంతిచే నింకుసిం
ధువులం గ్రమ్మఱ నుర్వికిన్ దివికిఁ దోడ్తో నించెఁ దన్నాగముల్
నవనిర్యన్మదనిర్ఝురౌఘమున శుండాశీకరోర్ధ్వప్రవ
ర్షవిధిం దానను జేసి సింధురములన్ ప్రఖ్యాతి గాంచెం గరుల్.

11

రామ. భారత. రెంటికి సమము. ఇంకు = ఇంకెడు, సింధువుల = సముద్రములను - ఆకాశగంగను, “దేశే నదవిశేషేబ్ధౌ సింధుర్నాసరితి స్త్రియామ్” అని అ. సేనాధూళి సర్వత్ర వ్యాపించి యాకాశగంగను సముద్రములను నింకించె నని యతిశయోక్తి. తన్నాగముల్ = ఆసేనాగజములు, నవనిర్యన్మదనిర్ఝరౌఘములచేతను, "ప్రవాహోనిర్ఝరోఝురః" అని అ. “ఓఘో బృందేంభసాం రయే" అని అ. శుండా = తొండములయొక్క, "శుండాతుబలహస్తిన్యాం మదిరాకరిహస్తయోః” అని వి. శీకర = జలకణములయొక్క, ఊర్ధ్వప్రవర్షవిధిన్ = పొడవుగాఁ జల్లుటచేతను, ఉర్వికిన్ = భూమికిని, దివికిన్ = ఆకాశమునకును - క్రమాలంకారము. క. 'ద్యోశబ్దమునకు దివియును, భూశబ్దంబునకు భువియుఁ బూనఁగవలయున్, నౌశబ్దము నావయురో, రైశబ్దము రాజపదము రాజనఁ జెల్లు' నని తాతంభట్టు. క్రమ్మఱన్ = తిరుగ-నించెను. క. 'స్థావరతిర్యక్ప్రభృతుల, కేవెరవునఁ గ్రియలు దలఁప నేకవచనముల్, దేవమనుష్యాదిక్రియ, భావింపఁగ నేకవచన బహువచనంబౌ' నని కేతన. దానను జేసి = అటు కనుకనే, సింధురములు. 'సింధూన్ రాంతి దదతీతి సింధురాః' రాదానే యను ధాతువు. ఈయర్థము గల సింధురము లనెడిప్రఖ్యాతిని గరులు గాంచెను - నిరుక్త్యలంకారము. "నిరుక్తి ర్యోగతో నామ్నా మన్యార్థత్వ ప్రకల్పనమ్, ఈదృశైశ్చరితైర్జానే సత్యం దోషాకరో భవాన్" అని చ.

సీ.

గంభీరవేదిలక్షణలక్షితంబు లై
            తనరారుభద్రదంతావళములు
నారట్టసింధుగాంధారాదిభవము లై
            కొఱలు శ్రీవృక్షకీఘోటకములు

పదునాల్గుజాతులం ద్రిదశకాంతల మీఱు
            పద్మినీజాతిసౌభాగ్యవతులు
కడు నద్భుతములైన కనకరతాంశుక
            చందనాదిసువస్తుసంపదలును


తే.

నఖిలదిగ్దేశభూపసమర్చితంబు
లగుచు నరణంబుగతిఁ దోన యరుగుదేఱఁ
దనువరించు జయశ్రీలఁ గొనుచు నతఁడు
పురికిఁ జనుసొంపువాగగోచరతఁ బరఁగె.

12

భారత. రామ. రెండర్థములకు సమము. గంభీరవేదు లనెడుగజవిశేషములయొక్క లక్షణములచేత, లక్షితంబులై, కనుపట్టినవై. “త్వగ్భేదాచ్ఛోణితస్రావాన్మాంసస్య దళనా దపి, ఆత్మానం యోపజానాతి తస్యగంభీరవేదితా" యను మృగచర్మీయమందును, "చిరకాలేన యోవేత్తి శిక్షాం పరిచితామపి, గంభీరవేదిర్విజ్ఞేయస్సగజో గజవేదిభిః” అని రాజపుత్త్రీయమునందునుఁ జెప్పఁబడి యున్నది. తనరారు = ఒప్పుచున్న, భద్రదంతావళములు = పట్టపుటేనుఁగులును, ఆరట్టసింధుగాంధారాదిభవములై కొఱలు = చెలఁగుచున్న, ఈ దేశములయశ్వము లుత్తమములు గనుక, శ్రీవృక్షకీఘోటకములు, “వక్షోభవావర్తచతుష్టయంచ కంఠేభవేద్యస్య చరోచమానః, శ్రీవృక్షకీనామహయస్స భర్తుః పుత్త్రపౌత్త్రాభి వృద్ధయే స్యా" త్తని హయలీలావతి. "శ్రీవృక్షకీ వక్షసి చేద్రోమావర్తో ముఖేసి చ” అని వైజయంతీనిఘంటువు. పదునాల్గుజాతులన్ = బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వ్యావహారిక, గోరక్షక, శిల్పక, పంచాహణ, కుంభకార, తంతువాయ, క్షౌరక, రజక, వస్త్రచ్ఛేదక, చర్మకర, తిలఘాత, లుబ్ధక, చండాల, మాతంగు లనెడు పదునెనిమిదిజాతులందు, బ్రాహ్మణజాతియు నరబాహ్యులయిన లుబ్ధకచండాలమాతంగజాతులును వినా కడమ పదునాలుగుజాతులయందును, త్రిదివకాంతల మీఱుచున్న పద్మినీజాతి సౌభాగ్యవతులును, పద్మినీజాతిలక్షణము రతిరహస్యమందు, "కమలముకుళమృద్వీ ఫుల్లరాజీవగంధీ సురతపయపి యస్యాస్సౌరభం దివ్యమంగే, చకితమృగదృగాభే ప్రాంతరక్తేచ నేత్రే స్తనయుగళమనర్ఘశ్రీఫలశ్రీవిడంబి, తిలకుసుమసమానాం బిభ్రతీ నాసికాం చ ద్విజగురుసురపూజాశ్రద్ధధానా సదైవ, కువలయదళకాంతిః కాపి చాంపేయకాంతిర్వికచకమలకోశాకారకామాతపత్రా, వ్రజతి మృదుసలీలం రాజహంసీవ తన్వీ త్రివళిలలితమధ్యా హంసవాణీ సువేషా, మృదుశుచిలఘు భుఙ్క్తే మానినీ గాఢలజ్జా ధవళకుసుమవాసో వల్లభా పద్మినీస్స్యా" త్తని చెప్పి యున్నది. చందనాదిసువస్తుసంపదలును, అరణంబుగతిన్ = హరణము నిచ్చినట్లు, తోన = వెంటనే - కడమ సులభము.

క.

తనపాండుసమాఖ్య జగం
బున వెలయఁగ నిట్లు సకలభూనాథుల నా
త్మనిదేశవర్తనులుగా
నొనరించె నితాంతవైభవోజ్జ్వలుఁ డగుచున్.

13

రామ. ఈ పద్యమునకుఁ గర్తృపదము నరనాథుఁడని ముందరిపద్యములో నున్నది, పాండు = శుభ్రమైన, "హరిణః పాండురః పాండుః” అని అ. సమాఖ్య = కీర్తి “యశఃకీర్తిస్సమాఖ్యాచ” అని అ. కడమ సులభము.

భారత. తనయొక్క పాండుసమాఖ్య = పాండురాజనుపేరు, "ఆఖ్యాహ్వే అభిధానంచ” అని అ. కడమ సులభము. సం. ఉపసర్గము.

వ.

ఇట్లు యథేష్టభోగంబులఁ బ్రవర్తిల్లుచు నొకనాఁడు తనమనంబున.

14


చ.

శ్రమ ముడుగుం దనూజడిమ జాఱుఁ జలాచలలక్ష్యభేదన
క్రమము లెఱుంగవచ్చు మదిఁ గానఁబడుం బరజాతిభీతికో
పము లవి చేష్టితంబు లివి భావమునం దలపోయ నన్నిచం
దములఁ బ్రియంబె యంచు నరనాథుఁడు వేఁటకు నుద్యతాత్ముఁ డై.

15

రెంటికి నేకార్థము – వేఁట ప్రశస్తమని, “పరిచయం చలలక్ష్యని పాతనే భయరుషోశ్చ తదింగితబోధనం, శ్రమజయాత్ప్రగుణాంచకరోత్యసౌ తనుమతోనుమతస్సచివైర్యయా” అని కాళిదాసువలెనే చెప్పినాఁడు. నైషధమందును - "మృగయాఘాయన భూభృతాం ఘ్నతామ్" అని చెప్పియున్నది గనుక అన్నిచందములఁ బ్రియంబె యంచు చెప్పెను. నరనాథుఁ డనెడి దిక్కున డాపలిసున్నకు నకారము యతిగాఁ జెల్లినందుకు లక్షణము కవిలోకచింతామణియందు, తే. 'టపతవర్గాక్షరములకు డాపలించి, యొనర నూఁదిన బిందువు లుండెనేని, వరుస ణనమలు వళు లగు వానికెల్ల, నవని గొందఱు సుకవులయనుమతమున. చ. కినుకఁ జళుక్యవంశనృపకేసరి వేసినచోఁ గృపాణఖం, డనమునఁ గల్గుఁబో సురగణత్వము తత్పదపారిజాతవం, దనమునఁ గల్గుఁబో మనుజనాథ తతద్భటదర్శనావలం, బనమునఁ గల్గుఁబో గహనమధ్యనివాసము శత్రుకోటికిన్.' అని కావ్యాలంకారచూడామణి.

క.

అతివినయాన్వితకుంతియు
ధృతిమహిమాద్రియును నగుచు నతిప్రీతితరం
గితమతు లై తనుఁ గొలువఁగఁ
జతురమృగయు లేగుదేరఁ జనియెన్ వనికిన్.

16

భారత. అతివినయాన్విత = అత్యంతవినయముతోఁ గూడిన, కుంతియు, ధృతి = ధైర్యమునకు, మహి = స్థానమైన - మాద్రియును, క. 'వనితా యనుచో వనితయు, జననీ యని పలుకుచోట జననియును వధూ, యనుచో వధువును దెనుఁగునఁ, జనునాయీయూలు దుదలఁ జను పలుకులకు' నని కుంతియు మాద్రియు నన్నందుకుఁ గావ్యాలంకారచూడామణియందు లక్షణము. నగుచు = నవ్వుచును, అతిప్రీతి = అత్యంతసంతోషరసముచేత, తరంగిత = పరంపరలు గలదైన, తదస్య సంజాతం తారకాదిభ్య ఇతచ్చని యితత్ప్రత్యయాంతము. మతులై = బుద్ధిగలవారై, తనుఁ గొలువఁగ, చతుర = సమర్థులైన, మృగయులు = వేఁటకాండ్రును, “మృగయుర్లుబ్ధ కశ్చ స” అని అ. ఏగుదేరఁగా, వనికిన్ = వనమునకు, చనియెను.

రామ. అతివినయాన్వితులైన, కుంతియు = ఈటెలు గలవారు గలవాఁడు “ప్రాసస్తు కుంత” అని అ. "కుంతా ఏషాంసంతీతి కుంతినః" అనెడు మతుబంతశబ్దముమీఁద బహువ్రీహి. ఈదిక్కునఁ గప్రత్యయరహితముగాఁ జెప్పినందుకు భారవి ప్రయోగము. “పృథుకదంబకదంబకరాజితం ప్రథితమాలతమాలవనాకులం, లఘుతుషారతుషారజలచ్యుతం ధృతిసదానసదాననదంతినమ్” అని ధృతిమహిమకు. అద్రియున్ = పర్వతమైనవాఁడు. అర్థాంతరము. ధృతిమన్ = ధైర్యలక్ష్మిచేత, హిమాద్రియున్ = హిమవత్పర్వతమువంటివాఁడును అగుచు, కొలువఁగ = కొలిచెడునిమిత్తమై, మృగయులు, ఏగుదేరన్ = రాఁగా, చనియెను.

వ.

ఇట్లు సని చని వివిధమృగంబుల వేఁటాడుచుం దిరిగితిరిగి.

17

భారత. రామ. రెంటికి సరి సులభము.

క.

నెలకొనియె వేఁటతమి న, బ్బలియుఁడు శిశిరనగరుచిరపరిసరమహిమన్
గల తమసతీరసికతా, విలసనములు డెందమునకు విం దొనరింపన్.

18

రామ. అబ్బలియుఁడు = దశరథుఁడు, శిశిరనగ = శీతలవృక్షములచేత, “శైలవృక్షౌ నగావ గౌ" అని అ. రుచిర = మనోహరములయిన, పరిసర = ప్రాంతభూములయొక్క, "పర్యంతభూః పరిసరః” అని అ. మహిమం గల = మహిమను గలిగినట్టి, అరసున్న యున్నచో నెఱసున్న వచ్చినందుకు లక్షణము. క. 'కుఱుచలతుదహల్లులకుం, బిరుద న్నెలకొన్న యట్టిబిందువు లెల్లన్, నెఱయఁగ నూదుచుఁ దేలుచు, నొఱపై యిరుఁదెఱఁగు సెల్లుచుండుం గృతులన్.' అని యాంధ్రభాషాభూషణము. తమస = తమసానదియొక్క, తెనుఁగుషష్ఠి, తీర = గట్టులయందుఁ గల, సికతా = ఇసుకదిబ్బలయొక్క, "సికతావాలు కాయాం చ సైకతేష్వామయాంతరే” అని వి. విలసనములు = ఒప్పిదములు, ల్యుదంతము, డెందమునకున్ = మనస్సునకు - దేశీయపదము, విం దొనరింపన్ = వేఁటతమియందు, నెలకొనియెన్ = స్థిరుఁ డయ్యెను.

భారత. అబ్బలియుఁడు = పాండురాజు, శిశిరనగ = హిమవత్పర్వతముయొక్క - రుచిర మైనపరిసరమహియందు, మంగలతమ = అత్యంతశుభము లయిన, సతీ = కుంతీమాద్రులయొక్క, రసికతావిలసనములు = రసికత్వవిలాసములు - మంగళతమశబ్దము రసికశబ్దమునకు విశేషణము. డెందమునకు విం దొనరింపంగా = వేఁటతమిచేత మహియందు నెలకొనియె నని యన్వయము.

ఉ.

హారిమృగవ్యనవ్యవిహితాదరుఁ డాధరణీతలేశుఁ డ
ధ్వారచితశ్రమాకలితుఁ డై కడు మెచ్చె సురాపగాజలా
సారసమాగమార్హతమసారససారససారసౌరభో
దీరణకారణంబు నతిధీరసమీరకిశోరవారమున్.

19

భారత. హారి = ఒప్పుచున్న, మృగవ్య = వేఁటయందు, "ఆచ్ఛోదనం మృగవ్యం స్యాదాఖేటో దృగయాస్త్రియా” మ్మని అ. నవ్య = నూతనముగా, విహిత = చేయఁబడిన - ఆదరముగలవాఁడు, ఆధరణీతలేశుఁడు = పాండురాజు, అధ్వ = మార్గమందు, అరచిత = చేయఁబడిన -వేఁటచేతఁ జేయఁబడినదనుట. శ్రమ = బడలికచేత, ఆకలితుఁడై = అలసినవాఁడై, సురాపగాజలాసార = గంగాజలప్రవాహములయందు, “ధారాసంపాత ఆసారః" అని అ. సమాగమ = పరస్పరసాంగత్యమునకు, అర్హతమ = మిక్కిలిఁదగిన, సారస = బెగ్గురులుగల, సారస = తామరలయొక్క - సమాగమార్హతమసారసపదము పద్మములకు విశేషణము. సార = ఉత్కృష్టములయిన, సౌరభ = వాసనలయొక్క, ఊదీరణ = విస్తరించుటకు, కారణంబు = హేతువైన - అతిధీరములయిన, సమీరకిశోర = మందమారుతముల యొక్క, వారమున్ = సమూహమును, కడున్, మెచ్చెను. క్రియ.

రామ. హారి = హారములు గలవాఁడు, మృగవ్యనవ్యవిహితాదరుఁడు, ఆధరణీతలేశుఁడు = దశరథుఁడు, సురాపగాజలాసార = గంగాప్రవాహమునకు, సమ = సమమును, ఆగమ = శ్రుతిస్మృతులవల్ల, అర్హ = శ్రేష్ఠమయినది, ఆగమార్హ = యాత్రాయోగ్యమయినది యనియుఁ జెప్పవచ్చును. తమసారస = తమసానదీజలమందుఁ గల, కడమ సమము. ఉదకమువల్ల శైత్యము పద్మములవల్ల సౌరభము కిశోరపదమువల్ల మాంద్యమును జెప్పుట.

సీ.

పుడమిఱేఁ డీరీతిఁ గడఁగి డెందము మృగ
            వ్యాపారఖేలన మభిలషింపఁ
గానలోఁ దారుమృగంబులకైవడిఁ
            గైకొని యసమాస్త్రకర్మవలనఁ
దనరు చొక్కపురాణమునిదంపతులు దమ
            కంబులు దేర నెయ్యంబు మీఱ

ననిచిన తత్ప్రియతనయుం డవారిత
            కారుణ్యుఁ డై పూని కలశమంబు


తే.

మగ్నముగఁ జేయుచప్పుడు భుగ్నహృదయుఁ
డగుచు వినిశితశరవిశేషాభిహతిని
ద్రెళ్లనేసె నాఘనులసద్దృష్టినియతి
బ్రుంగఁ గేవలసారంగబుద్ధిఁ జేసి.

20

రామ. పుడమి = భూమికి, ఱేఁడు = రాజైనదశరథుఁడు, ఇటువంటివి తద్భవపదములు, సీ. 'యోధులు జోదులు యోగంబు జోగంబు భేదంబు బిందంబు పృథివి పుడమి' యని కావ్యాలంకారచూడామణియం దుదహరించినవి గనుక ముందరను దెలిసికొనునది. ఈరీతిన్ = ఈపూర్వోక్తప్రకారముగ, కడఁగి = ఉద్యోగించి, డెందము = మనస్సు, సీ. 'వెన్నన్ను విన్నవావిరివంతవాగంబు డెందంబు దెప్పాడి దెల్లపాటు' ఇటువంటివెల్లను దేశ్యపదములని యాగ్రంథమందె చెప్పినాఁడు. మృగవ్య = వేఁటయందుఁగల, అపారఖేలనము = అధికవిహారమును, క. 'జంగమపదములు దక్క ధ, రం గలపదముల ద్వితీయప్రథమయు నగురా, జంగదము లూడ్చె సతి నూ, త్నాంగదములు దాల్చె నా నుదాహరణంబు' లను నాంధ్రభాషాభూషణమందలిలక్షణమువల్లఁ బ్రథమకు ద్వితీయార్థము. కానలోన్ = అడవియందు, తారు = సంచరించెడి, మృగంబులకై = మృగములకొఱకు, వడిఁ గైకొని, అసమ = సరిలేని, ఆస్త్రకర్మకలనన్ = బాణప్రయోగగతిచేత, తనరుచున్ = ఒప్పుచున్నవాఁడై, చప్పుడు విని యని ముందరి కన్వయము. ఒక్కపురాణమునిదంపతులు = ఒక్కవృద్ధమునిస్త్రీపురుషులు. "పురాణప్రతసప్రత్నపురాతనచిరంతనాః" అని అ. “జాయాయాదం భావజం భావౌ వా నిపాత్యే తేప త్యౌ” అనువార్తికమువల్ల జాయాశబ్దమునకు దం జం అనునాదేశము, “దంపతి జంపతీ జాయాపతీ" యని అ. అంబులు దేరన్ = నీళ్ళు దెచ్చెడునిమిత్తమై, క. 'గురువులు గురులనఁ గొల్తురు, గురువులచే గురులకొఱకు గురువులవలనన్, గురులకు భక్తి దనర్చును, గురువులయం దుండు సకలగుణములు నెపుడున్.' అని కావ్యాలంకారచూడామణియం దుదహరించినవి గనుక, అంబువులు + అంబు లని రెండువిధములఁ జెప్పవచ్చును. నెయ్యంబు మీఱ, అనిచిన = అంపిన, తత్ప్రియతనయుండు = ఆమునిపుత్త్రుఁడు, అవారితకారుణ్యుఁడై పూని కలశము, అంబుమగ్నముగఁ జేయుచప్పుడు = నీళ్లు ముంచెడుధ్వనిని, భుగ్నహృదయుఁ డగుచున్ = సరళము గాని మనస్సు గలవాఁడై, "ఆవిద్ధం కుటిలం భుగ్నం వేల్లితం వక్ర మిత్యపి" అని అ. విని, శిత = వాఁడియైన, శరవిశేష = శబ్దఘాతి యనెడు బాణవిశేషముయొక్క, అభిహతిన్ = వ్రేటుచేత, లసద్దృష్టి = మంచివివేకము. దృష్టిర్జ్ఞానేక్ష్ణి దర్శనే” అని అ. నియతిన్ = విధిచేత, "భాగ్యం స్త్రీనియతిర్విధిః" అని అ. బ్రుంగన్ = కొంచెపడఁగా, సారంగబుద్ధిఁ జేసి = ఏనుఁ గనెడిబుద్ధిచేత, “సారంగ శ్చాతకే భృంగే కురంగేచ మతంగజే” అని అ. ఆఘనున్ = ఆమునిపుత్రుని, త్రెళ్లనేసెను.

భారత. పుడమిఱేఁడు = పాండురాజు, ఈరీతిఁ గడఁగి, ఇంక భిన్నాన్వయము, డెందము, మృగ = మృగ దంపతులయొక్క, వ్యాపార = రతివ్యాపారమువంటి, ఖేలనము = క్రీడను, “మృగీచ మృగశ్చ మృగౌ పుమాన్ స్త్రియా” మ్మను సూత్రమున నేకశేషము "మృగయోర్వ్యాపారః మృగవ్యాపారః" అని. సమాసము, అభిలషింపఁగా, తారు = తాము, అ. 'ఒత్తు నక్షరములు నొనరంగ ఙఞలుర్క్ష, శషసహలు నిరూఢి జడ్డ గాని, ళాను నచ్చతెనుఁగులను దీర్ఘములమీఁద, బండిరాను లేదు పద్మనాభ' యని వెల్లంకికులశ్రేష్ఠుఁ డైనతాతంభట్టుగారు కవిలోకచింతామణియందుఁ జెప్పినారు గనుక తారు సంచరించెడుననుదిక్కునను రేఫమే. మృగంబుల = మృగములయొక్క, కైవడి = రీతిచే, అసమాస్త్రకర్మకలనన్ = మన్మథవ్యాపారాసక్తిచేత, కలిః కామధేను వన్నారు గనుక, తనరు = ఒప్పునట్టి, చొక్కపురాణన్ = మంచియనురాగముచేత, రాగశబ్దమునకు రాణ యనునది మాగధిరూపము, మునిదంపతులు, తమకంబులు దేరన్ = తమి పుట్టఁగా, నెయ్యంబు నెనరు, మీఱ ననిచిన, తత్త్రియతన = ఆవిహారమందలి తాత్పర్యముచేతనే, ఉండఁగా, పుడమిఱేఁడు వారితకారుణ్యుఁడై యని యన్వయము. పూని = లక్ష్యము చేసికొని యనుట, కలశమంబు = కలిగినశాంతి నంతటిని, మగ్నముగఁ జేయుచున్ = అడఁచుచును, అపుడు, వినిశిత = మిక్కిలిఁ దీర్ఘమైన, శరవిశేషముయొక్క యభిహతిచేత, సద్దృష్టి = వివేకులయొక్క, నియతి = నియమము, వృద్ధాచార మనుట, బ్రుంగన్ = తప్పఁగా, సారంగబుద్ధిఁ జేసి = లే ళ్లనెడిబుద్దిచేత, ఆఘనులఁ ద్రెళ్లనేసెనని యన్వయము.

వ.

ఇ ట్లేసిన.

21


క.

వాలంపతాకునకు ధృతి, వ్రీలఁగ హా తాత యనుచు వెలువడుతన్మ
ర్త్యాలాపమునకు నాజన, పాలకులోత్తంసుగుండె భగ్గునఁ గలఁగెన్.

22

రెంటికి సమము సులభము.

క.

ఆధరణీపాలుఁడు తమ, సాధునియతికొమరునేఁడు సమసెనె యిట్లా
హా ధాతవ్రాఁత యని శర, బాధం గలఁగఁగను వారిపజ్జకుఁ జనియెన్.

23

భారత. ఆధరణీపాలుఁడు = పాండురాజు, తమయొక్క, సాధు = లెస్సైన, నియతి = భాగ్యముయొక్క, కొమరునేఁడు, సమసెనె = సమసెఁ గదా యని ఖేదవాక్యము, అని శరబాధచేత, కలఁగఁగన్ = మునిదంపతులు తొట్రుపడఁగా, వారియొక్క, పజ్జకున్ = సమీపమునకు, చనియెను.

రామ. ఆధరణీపాలుఁడు = దశరథుఁడు, తమసాధునిన్ = తమసానదియందు, "తటినిహ్రాదినీ ధునీ” అని అ. యతికొమరు = మునిపుత్త్రునియొక్క, ఏఁడు = ఏండ్లు, ఆయు వనుట, జాత్యేకవచనము. క. 'రూకకు వేపోఁ కనఁగా, బ్రాకటముగ వృష్టి ప్రాణి భాగ్యం బనఁగా, లోకమున నాఁడు దానికి, శ్రీకర మగు సొమ్ము సువ్వె సిగ్గె యనంగ' నని కవిలోకచింతామణియందు, నేఁడు + అనుచోటను నర్ధబిందు వున్నందుకు, ఉ. 'వాఁడిమయూఖముల్ గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్, నేఁ డిట వచ్చె నేకతమనిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్, పోఁడిగ వేల్వఁగాఁ బడియెఁ బ్రొద్దును బోయెఁ గచుండు నింటికిన్, రాఁడు వనంబులోన మృగరాక్షసపన్నగబాధ నొందెనో' యని నన్నయభట్టప్రయోగము, సమసెనే యని, వారిపజ్జకున్ = ఉదకసమీపమునకు, చనియెను.
క.

చని తన్ముఖమునఁ దద్వ
ర్తనవిధ మంతయును విని ధరారమణుఁడు ద
త్తనుశరవేదనఁ గ్రమ్మఱి
తనుఁ బొదవినయ ట్లతివ్యధావిహ్వలుఁ డై.

24

రెంటికి సమము సులభము.

క.

ఏనుం గనికర మరయక
పూనితిఁ గా కిట్టియెడలఁ బొసఁగునె యేయం
గానమెకాలని యమగతి
తో నావేఁట మునియుగము ద్రుంగించెఁ దుదన్.

25

రామ. ఏనుంగని = గజమని, సీ. 'ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రాఁ బురవీథులఁ గ్రాలఁ గలదె' అని సోమయాజి. కరము = మిక్కిలి, అరయక = విచారింపక, పూనితిఁగాక, ఇట్టియెడలన్ = ఈయాశ్రమభూములయందు, ఏయను, పొసఁగునె = యుక్తమౌనా, అని కాకుస్వరము. కానమే = ఎఱుంగమా - "నృపతే రవధ్యో నన్యః కరీ” అనునర్థము ననుట. కాలనియమగతితోన్ = కాలప్రేరణతోఁ గూడి, “లలాటలిఖితా రేఖా పరిమార్ష్టుం న శక్యతే” అని న్యాయము. మునియుగము = మునికుమారుని యాయుస్సును, నానుడువార్త, తుదన్ = వేఁట యగుసమయమున, త్రుంగించెను = క్రియ.

భారత. ఏనున్ = నావంటివాఁడును, కని = ప్రత్యక్షముఁగ జూచి, కరమరయక = చెయి గొంచింపక, ఇట్టియెడలన్ = ఈక్రీడాసమయములయందు, కనికర మరయక = దయ లేక యనియుఁ జెప్పవచ్చును. ఏనును + కనికరమను దిక్కున సంధికి, క. 'వాంతములైన పదంబుల, పొంతం బై నున్న శబ్దముల కచటతపల్, దొంతిగజడదబ లగున, య్యంత నకారంబు సున్న యభినవదండీ' అనెడులక్షణములవల్ల నకారపుఁబొల్లు బిందువై కకారము గకారమైనతర్వాత, క. 'కుఱుచలతుది హల్లులకును, బిఱుద న్నెలకొన్నయట్టిబిందువు లెల్ల, న్నెరయఁగ నూఁదుచుఁ దేలుచు, నొఱపై యిరుదెఱఁగు సెల్లుచుండుం గృతుల' నని యాంధ్రభాషాభూషణమువలన నేనుఁ గనికరమనియు నేనుం గనికరమనియుఁ జెప్పవచ్చును. కానమెకాలని = అడవిమృగములని, యమగతితోన్ = యమప్రేరణతోఁ గూడిన, నావేఁట, ముని = మునులయొక్క, యుగము = ద్వయమును, అనఁగా మునిదంపతులను, "యుగం యుగ్మేకృతాదిషు” అని అ. త్రుంగించెను.

వ.

అని చింతించుచుండ.

26


చ.

ఘనశరవేదనల్ బలియఁగా వనకుంభిని వ్రాలియున్న య
మ్మునియుగళంబు దొట్రుపడ ముంచితి నాతలిదండ్రులన్ మహా
ఘనదినిఁ కేమన న్నెఱయఁ గాననికన్నులవారి వృద్ధులం
దనరఁ దదంఘ్రిచేర్పునను ధార్మికుఁ డాయన నమ్రవక్త్రుఁ డై.

27

భారత. ఘనశరములవలన నైనవేదనలు బలియఁగా, వనకుంభినిన్ = వనభూమియందు, “గౌరిలాకుంభినీక్షమా” అని అ. మునియుగళంబు తొట్రుపడఁగా, పాండురా జనుకొనుమాట, ఆతలిదండ్రులను, మహాఘ = అధికదుఃఖ మనెడి, నదిన్ = వైతరణియందు, “అంహోదుఃఖవ్యసనేష్వఘమ్” అని అ. ముంచితిని, ఇం కేమనన్ = ఇంక ననఁబోవునది యెద్ది గనుక, అని, కన్నులవారి = కన్నీరు, వృద్ధులం దనరన్ = పరంపరలౌచు నుండఁగా, తదంఘ్రిచేర్పునన్ = వారిపాదములయొద్ధ, ధార్మికుఁడు = ధర్మాత్ముఁడైన “ధర్మేణ జయతీతి ధార్మిక” అని “తేనదీవ్యతి జయతి జితమ్" అనుసూత్రమున ఠక్ప్రత్యయాంతము. ఆయన = పాండురాజు, అప్పన సేసెనని ముందరిపద్యమునఁ క్రియ.

రామ. వనకుంభిని = జలకలశియందు, కుంభిశబ్దమునకు "ఉదస్య కుంభీరథశాతకుంభజాః" అని నైషధము పదునాలుగవసర్గలో బ్రయోగ మున్నది గనుక, వ్రాలియున్న యమ్మునియు, గళంబు = కంఠము, తొట్రుపడ, దశరథునితో ననుమాట, నాతలిదండ్రులను, మహాఘ = అధికదుఃఖ మనెడు, నదియందు, ముంచితి = ముంచితివి తెనుఁగునఁ బ్రథమమధ్యమోత్తమపురుషములకు నాంధ్రభాషాభూషణమందు, క. 'ఒరులకు నెనయునై నిరియునె, దిరికిఁ దికారంబు తిరియుఁ దెల్లముదనకుం, బరువడిఁ దినియును దిమియును, బొరయు నుభయవచనములకు భూతక్రియలన్.' లక్ష్యము. క. పలికెను బలికి రనంగాఁ, బలికితి పలికితి రనంగఁ బలికితి నర్థిం, బలికితి మనఁగా నన్నియు, నలవడఁగా వరుసతో నుదాహరణంబు' లని యేకవచనబహువచనములు చెప్పఁబడినవి. ఇఁకను, ఏను = నేను, మనసు = నిర్వహింపను, అని శోకవాక్యము. నెఱయన్ = మిక్కిలి, కాననికన్నులవారిని = అంధులను, వృద్ధులను, తలిదండ్రులకు విశేషణములు, ననున్ = నన్ను, తదంఘ్రి చేర్పు = వారిపాదములయొద్దఁ జేర్పుము, ధార్మికుఁడా = ఓయివిలుకాఁడా, ఇది వ్యంగ్యోక్తిచేత సంబోధనము. అనన్ = ఇటనఁగా, నమ్రవక్త్రుఁడై, విని యని ముందరి కన్వయము, ధర్మశబ్దము ధనుర్వాచక మైనందుకు “ధర్మః పుణ్యే యమే న్యాయే స్వభావాచారయోః క్రతౌ, ఉపమాయామహింసాయాం చాపే చోపనిషద్యపి" అని వి.

క.

వినియతనిందన పై నిడు
కొని యేఁగి నియమికిఁ దగని ఘోరార్తి యొన
ర్చినవాఁడ మీకు దండ్యుఁడ
నని తనుఁ దెలుపుచును వారి కప్పన నేసెన్.

28

రామ. విని, అతనిన్ = మునిపుత్త్రుని, తనపై నిడుకొని, ఏఁగి = వృద్ధులయొద్దకుఁ బోయి, వారితోడ దశరథుఁ డనెడుమాట, నియమికిన్ = మునీశ్వరునికి, తగని, ఆర్తి = పీడను, ఒనర్చినవాఁడను మీకు దండ్యుఁడ నని తెలుపుచును, వారికిన్ = మునిదంపతులకు అతని నప్పన చేసెనని యన్వయము.

భారత. వినియతనిందన = మిక్కిలి నియతమైన యవకీర్తినే, పై నిడుకొని, పాండురాజు మునితో ననుమాట, ఏన్ =నేను, కినియమికిన్ = కోపింపమికి, మీరు క్షమించుట కనుట, తగని, కడమ సమము. తన్నున్ = తన్ను, అప్పన సేసెను.

తే.

చేసి మనుజేశ్వరుండు తచ్ఛాసనమున
నాత్మశరసముత్పాటన మాచరించె
దానఁబట్టి ప్రాణంబు లెంతయుఁ జలింప
నసుతతోగ్రార్తి కోర్వక యతివరుండు.

29

భారత. దానఁబట్టి = పాండురాజు తాను బాణముఁ దీయఁటఁబట్టి, ప్రాణంబులు, చలింపన్ = తొట్రుపడఁగా, అసు = ప్రాణములయొక్క, తత = విస్తృతమైన, ఉగ్రార్తికి నోర్వక యతివరుండు, ముందర ననెడుమాట.

రామ. దానన్ = దశరథుఁడు బాణముఁ దీయుటవల్ల, పట్టి = కుమారునియొక్క, ప్రాణంబులు, చలింపన్ = పోఁగా, అసుతతా = అపుత్త్రకత్వముచేత నైన, కడమ సమానార్థము.

ఆ.

కాంతతోడఁ గూడఁ గాన ని ట్టటు చన
లేనియీయవస్థ పూనియున్న
మాకుమారుప్రాపు వోకార్చె నేఁడు నీ
దైనప్రౌఢిమహిమ భానుకులుఁడ.

30

రామ. కాంతతోడఁగూడఁగానను, ఋషిదంపతు లంధులు గనుక, ఇట్టటుచన, లేనియీయవస్థన్ = వార్ధకమును, పూనియున్న, మాజ = మాయొక్క, కుమారుప్రాపును, నీ దైన ప్రౌఢిమహిమ పోకార్చెను, భానుకులుఁడ, సంబుద్ధి.

భారత. కానన్ = అడవియందు, కాంతతోడఁగూడ, ఈయవస్థ = రతిని, పూనియున్నమాకు, మారుప్రాపు = మన్మథానందమును, నీదైన ప్రౌఢిమ పోకార్చెను, హిమభానుకులుఁడ = చంద్రవంశపురాజా! "భానూ రశ్మిదివాకరౌ” అని ఆ. ఇది వ్యాజనిందాలంకారము.

ఆ.

ఎందు వేఁట రారె యితరు లేమనసుతో
దారసంగసుఖముఁ దప్పఁ ద్రోచి
తకట పాండురాజ యశ మెన్నవైతతి
క్రూరదశరథేశ కులము రోయ.

31

భారత. ఏమనసుతో, దార = భార్యయొక్క, సంగసుఖముఁ దప్పఁద్రోచితివి, క్రూరదశన్ = క్రౌర్యముచేత, రథేశ = అతిరథులైన రాజులయొక్క, కులము, రోయన్ = రోయునట్టుగా, యశమును, ఓరాజా! ఎన్నవైతివి.

రామ. ఏమనన్ = అన నేమున్నది, సుత = కుమారునివల్లనైన, ఉదారమైన సంగసుఖమును దప్పఁద్రోచితివి, పాండుర = శుభ్రమైన, అజునియొక్క యశమును, అతిక్రూర, దశరథేశ, సంబుద్ధులు, ఎన్నవైతివి, అజునికీర్తికిఁ గొదవ తెచ్చితి వనుట.

వ.

అని యమ్మునీశ్వరుండు.

32


తే.

నిజశరీర మె ట్లట్ల యానృపునిమేను
నాత్మజాయాసమాగతం బైనయపుడ
ప్రాణములు వాయునట్లుగాఁ బరమశోక
వశత శపియించి మృతి నొందె వనితతోడ.

33

రామ. ఆత్మజ = కుమారునియొక్క, ఆయాసము = సంకటము, ఆగతంబైన.

భారత. ఆత్మజాయా = నిజభార్యలతోఁగూడ, సమాగతం బైనయపుడ = సంయోగమైన యపుడే, సమాగతశబ్దము భావార్థమందుఁ గ్తప్రత్యయాంతము. కడమ యేకార్థము.

మ.

యతి యెంతేఁ దనయార్తిఁ జేడ్వడినవాఁ డై యాత్మజాయాసమా
గత మైనప్పుడు మేనుఁ బాయు మని యల్క న్నన్ను శాపించె సం
తతి లేకుండెడిచోఁ దదాశ మిగులం దాఁ బోవు టెట్లేనియున్
ధృతిమై నోర్వఁగ వచ్చు నామదికిఁ జింతింపంగ నం చెన్నుచున్.

34

భారత. యతి = ముని, ఎంతేన్ = అధికమైన, తనయార్తిన్ = తనదెసకు, చేడ్వడినవాఁ డై = లోనై, ఆత్మజాయాసమాగత మైనప్పుడు = ఆత్మభార్యాసంయోగ మైనయపుడే - అని పూర్వోక్తానువాదము. మేనుఁ బాయుమని, శాపించెన్ = శపించెను. సంతతి లేకుండెడిచో, తదాశన్ = ఆసంయోగాపేక్షవల్లనే, తాఁ బోవుట, మిగులన్ = మిక్కిలియు, మదికిన్ = మనస్సునకు, ధృతిమైన్ = ఎంతధైర్యము గలిగిన ననుట. ఓర్వఁగ వచ్చునా? తాళరాదని కాకుధ్వని. అంచున్, జనపతి యని మీఁదటిపద్యములోఁ గర్త. ఎన్నుచును.

రామ. తనయునియొక్క, ఆర్తి, ఆత్మజ = పుత్త్రునియొక్క, ఆయాసము = శోకము, దదాశ = సంతానాపేక్ష, మిగులన్ = పూర్ణ మైనను, తాఁ బోవుట, ఎట్లేనియున్ = ఎట్లైనను, నామదికిఁ జింతింప నోర్వవచ్చును. కడమ సులభము.

క.

జనపతి దాన నతివ్యధ, మనస్కుఁ డై యిట్టి దయ్యె మత్సుచరితవా
సన యిఁక నేమని నిజపురి, కిని జనియెద ననుచు నాత్మకిల్బిషశంకన్.

35

రామ. జనపతి = దశరథుఁడు, తాను, అనతివ్యధమనస్కుఁడై = అధికవ్యధ లేని మనస్సు గలవాఁడై, శాపము పుత్రహేతు వాయెఁగనుక, మత్ = నాయొక్క, సుచరితవాసన = జన్మాంతరసుకృతసంస్కారము. “వాసనాభావనా సంస్కారోనుభూతాద్యనుస్మృతిః" అని అ. ఇట్టిదయ్యెన్, శాపమై ఫలించెననుట. ఇంక నేమి = ఇంక విచారమునకు నిమిత్త మేమి, అని = ఈలాగున నెంచుకొని, నిజపురికి = అయోధ్యకు, చని = పోయినవాఁడై, ఎదన్ = మనస్సునందు, ననుచు = చిగుర్చునట్టి, అభివృద్ధియగునది యనుట. అర్థాంతరము. ఇంక నేను, మని = కృతార్థుఁడనై, నిజపురికి = ఆయోధ్యకు, చనియెద ననుచు, ఆత్మ = తనయొక్క, కిల్బిషశంకన్ = పాపభీతిచేత, దానంబు చేసె నని ముందరిపద్యమున కన్వయము.

భారత. జనపతి = పాండురాజు, దానన్ = ఆయెన్నికచేత, అతివ్యధమనస్కుఁడై = ఆధికవ్యధ గలమనస్సు గలవాఁడై, ఇఁక నేమని, నిజపురికి = హస్తినగరమునకు, చనియెద ననుచున్. కడమ సమము.

క.

గణనాతీతము లగుగో
గణములు వేదండఘోటకస్తోమములున్
మణులు ధనధాన్యములు బ్రా
హ్మణులకు దానంబు సేసె నాతడు మఱియున్.

36

రెంటికి సమము సులభము. ఇఁక నాల్గుపద్యములకుఁ గుళకము.

తే.

తనకుఁ గలభూషణాదిసద్వస్తుజాల
మగ్రజాయత్తముగఁ జేసి యంచితనయ
బలలసద్వర్తనలవనీస్థలిని జూడఁ
జాల నని వారితో దయాశ్రయత మెఱయ.

37


తే.

మనవియుక్తితెఱంగు మీకనిన దడవి
నవయ నేటికి మనకరినగరమునకు
నరుగుఁ డని పెదముదుసళ్లు ననుఁగులాడ
వెరవరులు గనికరముతోఁ బెరసి కొలువ.

38


క.

మానవతులారహితస, త్త్వానుగతిన్ శాంతిఁ దనరి యతినైపుణ్య
శ్రీ నెరయ నాత్మసామ్రా, జ్యానుభవము పూనెదయ జనావళి మెచ్చన్.

39


క.

అనిభృతదాక్షిణ్యుం డై
తనయాలోకనవిదూరతకుఁ గుందునిజాం
గనలం గూడి యవని నా
ఘనుఁడు నడపెఁ బెంపు మీఱఁగా మునిచర్యల్.

40

ఆనాల్గుపద్యములకు భారతార్థము. భూషణాదిసద్వస్తుజాలమును, అగ్రజ = జ్యేష్ఠుఁడైన ధృతరాష్ట్రునకు, ఆయత్తముగ = అధీనమగునట్లుగా, "అధీనో నిఘ్న ఆయత్తః” అని అ. చేసి, అంచి = అంపి, సద్వర్తనలన్ = మంచినడకలు గలవారైన, తనయబలలన్ = కుంతీమాద్రులను, వనీస్థలియందుఁ జూడఁ జాలనని, వారితో, దయాశ్రయత = కృపాస్పదత్వము, మెఱయఁగా, అనుమాట. 1. మనవియుక్తి తెఱంగు, మీకనినది = మీరెఱింగినది, అడవినవయ నేటికి మన, కరినగరమునకున్ = హస్తినగరమునకు, అరుగుఁడు, ముదుసళ్లును = పెద్దలును, అనుఁగులు = ఆప్తులును, ఆడన్ = ఆపట్టణమందు, వెరవరులును గనికరముతో, కొలువన్ = కొలుచునట్టుగా, అనిపెదన్ = అంపెదను. అరుగుఁడని క్రిందటి కన్వయము. 2. మానవతులార = సంబోధనము. హితవైనసత్త్వగుణముయొక్క, అనుగతిన్ = ఆవృత్తిచేత, యతినై = తపస్వినై, పుణ్యములయొక్క, శ్రీ = సమృద్ధి, నెరయన్ = ప్రకాశించునట్టుగా - శ్రీశబ్దముమీఁద దెనుఁగునఁగూడ దీర్ఘ మున్నందుకు, క. 'స్త్రీలింగశబ్దవితతికి, నోలిం దుదిదీర్ఘ ముడుప నుండును దెనుఁగై, కోలదియేకాక్షరశ, బ్దాలి విసర్జించి నిర్జితాసురకృష్ణా' యని కవిలోకచింతామణి. ఆత్మబ్రహ్మమనెడి, సామ్రాజ్యముయొక్క, అనుభవమును బూనెదను, యజన = యజ్ఞములయొక్క, ఆవళిన్ = పఙ్క్తిని, మెచ్చను. 3. అని ఇట, భృతదాక్షిణ్యుండై, తనయొక్క, ఆలోకనవిదూరతకున్ = చూడకుండుటకు, కుందుచున్న నిజాంగనలను, కూడియ = కూడుకొనియె, వనిని, ఆఘనుఁడు = పాండురాజు, మునిచర్యలను బెంపు మీఱఁగా నడపెను. 4.

ఆనాల్గుపద్యములకు రాఘవార్థము. తనకుఁ గల, అగ్రజాయత్తముగన్ = బ్రాహ్మణాధీనముగా 'ద్విజాత్యగ్ర జన్మ భూదేవ బాడబాః' అని అ. అంచిత = అర్హములైన, నయబలముల చేత, లసత్ = ఒప్పుచున్న, వర్తనలు, అనివారితమైన, ఉదయ = అభ్యుదయముయొక్క, ఆశ్రయతన్ = ఆశ్రయత్వముచేత, అవనీస్థలిని మెఱయఁగానును. 1. మంత్రులవాక్యము. మనవి = విన్నపము, యుక్తితెఱంగు = యుక్తిమార్గము, మనవి చెప్పికొనునే ర్పనియుఁ జెప్పవచ్చును. మీకనినది, అరి = శత్రుఁడైన దశరథునియొక్క, నగరమునకున్ = పట్టణమునకు, అరుగుఁడని, పెదముదుసళ్ళును ననుఁగులును, ఆడన్ = చెప్పఁగా, వెరవు = వారు చెప్పినబుద్ధిని, కని, అరులు = శత్రువులు, కరముతోన్ = కప్పముతోఁ గూడ, 'భాగధేయః కరోబలిః' అని అ. కొలువఁగానును. 2. మానవతులా = ఇతరపురుషసామ్యముతోడ, రహితమైన, సత్త్వ = బలముయొక్క, అనుగతిన్ = యోగముచేత, అతినైపుణ్య = అధికనిపుణత్వముయొక్క, శ్రీ = సమృద్ధి, నెరయదయను జనావళి మెచ్చఁగా, ఆత్మ = తనయొక్క సామ్రాజ్యానుభవమును, పూనెన్ = వహించెను. 3. అనిభృత = గూఢముగాని, దాక్షిణ్యుండై = దక్షిణనాయకత్వము గలవాఁడై, క. 'పెక్కండ్రసతులయందును, జక్కనిమొగమోట మొక్కచందముగాఁ బెం, పెక్కిన దక్షిణనాయకుఁ, డక్కజముగఁ దెలియవలయు నార్యులు ప్రీతిన్' అని కావ్యాలంకారచూడామణి. తనయ = కుమారులయొక్క, ఆలోకనవిదూరతకుఁ గుందు, నిజాంగనలన్ = కౌసల్యాకైకేయీసుమిత్రలను, కూడి, అవనిన్ = భూమియందు, ఆఘనుఁడు = ఆలాగునఁ బ్రసిద్ధుఁడైన దశరథుఁడు, కామునిచర్యల్ = మన్మథక్రీడలను, పెంపు మీఱ నడపెను. 4.

చ.

అకలుషయౌవనస్థదశయంతయుఁ దా నడపెన్ నృలోకపా
లకుఁడు శఠాంతరంగరిపులన్ నెఱయం బొలియింపుచున్ సమా
ధికరహితాత్మవర్తన నతిస్థిరుఁ డై ప్రణిధిప్రయుక్తిఁ బా
యక యెపుడుం బ్రధానపురుషాంతరవర్తన నాకలింపుచున్.

41

రామ. నృలోకపాలకుఁడు = దశరథుఁడు, శఠ = కఠోరములైన, 'నికృతస్త్వనృజుశ్శఠః' అని అ, క్రోధగుణగ్రస్తములైనవి యనుట. అంతరంగములఁ గలశత్రువులను, క్రోధగుణములకు మనుస్మృతియందు, 'పైశున్యం సాహసం దోహ మీర్ష్యాసూయార్థదూషణం, వాగ్దండనంచ పారువ్యం క్రోధజోపి గుణోష్టధా' అని అ. నెఱయం బొలియింపుచున్ = లెస్సగా నిగ్రహించుచు, 'అగ్నేశ్శేషం ఋణాచ్ఛేషం శత్రోశ్శేషం నశేషయే' త్తను నియతివలన, అర్థాంతరము. శత = నిగ్రహమునకు రాని, అంతరంగ = హృదయమువల్ల నైన, రిపులను = వ్యసనరూపములయిన శత్రువుల ననుట. 'స్త్రీద్యూతమృగయాపానవాక్పారుష్యార్థదూషణం, వాగ్దండనం చ సప్తైతే వ్యసనాని విదుర్బుధాః' అని గ్రంథాంతరము. 'మృగయాక్షౌదివాస్వాపః పరీవాదః స్త్రియానుగః, తౌర్యత్రికం వృథాట్యాచ కామజా దశధాగుణాః' అని కామందకము. నెఱయం బొలియింపుచున్ = పెంచకుండఁ జెఱుచుచును, 'ఆత్మానమేవ ప్రథమం వినయేనోపపాదయేత్, తతోమాత్యాం స్తతోభృత్యాం స్తతఃపుత్రాం స్తతఃప్రజాః' అని నీతిసారము, ‘వినేయోహీంద్రియజయస్తద్యుక్తశ్శాస్తు మర్హతి' అని రామాయణము. సమాధిక = సములతోడను నధికులతోడను రహితుఁడైన, ప్రభుమంత్రోత్సాహశక్తులచేత నందఱినీ లోఁబడనడఁచి సర్వాధికుఁడైన యనుట. ఆత్మ = తనయొక్క, వర్తనన్ = రాజధర్మముచేత, 'న్యాయేనార్జనమర్థస్య రక్షాసంవర్ధనం తథా, సత్పాత్రప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధ' మ్మని కామందకము. అతిస్థిరుఁడై = ఊర్జితుఁడై, అర్థాంతరము. సమాధికరహిత = సాధారణమైన, ఆత్మ = శరీరముయొక్క, వర్తనన్ = స్థితిచేత, అతిస్థిరుఁడై = స్థైర్యగుణముగలవాఁడై, 'షణ్ణవక్యంగుళోత్సేధో యః పుమాన్ స దివౌక సః, ఉరశ్చ మణిబంధశ్చ ముష్టిశ్చ నృపతేః స్థిరః' అనియు లక్షణశాస్త్రము. ప్రణిధి = గూఢచారులయొక్క, 'ప్రణిధిః ప్రార్థనే చారే' అని అ. యుక్తిన్ = అంపుటచేత, ప్రధానపురుష = పురోహితమంత్రిపుత్రజ్ఞాతిదండనాయకులయొక్క, 'పురోహితామాత్యకుమారకుల్యసేనాప్రణేతారఇతి ప్రధానాః' అని కామందకము. అంతరవర్తనన్ = అంతరంగవృత్తాంతమును, ఆకలింపుచున్ = తెలిసికొంచును, 'చరాన్ ప్రచారయే దర్థేష్వాత్మనశ్చ పరస్య చ, పాషండాదీనవిజ్ఞాతా నన్యోన్య మితరై రపి' అని నీతిసారము. అర్థాంతరము. ప్రణిధి = గూఢచారులయొక్క, ప్రయుక్తిన్ = వాక్యమును, పాయక = అతిక్రమింపక, ఎపుడును, ప్రధానపురుష = పెద్దమంత్రితోడ నగు. 'ప్రధానం స్యా న్మహామాత్యే ప్రకృతౌ పరమాత్మని' అని వి. అంతరవర్తనన్ = ఆప్తాలోచనను, ఆకలించుచున్ = చేయుచును. 'సదానుకూలేషు హి కుర్వతే రతిం నృషేష్వమాత్యేషు చ సర్వసంపదః' అని భారవి. అకలుష = దోషము లేని, యౌవనస్థ = ప్రాయపువానియొక్క, దశ = అవస్థను, విహారముల ననుట. ధర్మార్థకామములను బ్రాతర్మధ్యాహ్నసాయంకాలములయందు నాచరించుట ధర్మమే కనుక నకలుషపదము ప్రయోగించినాఁడు. 'ధర్మార్థకామాః కాలేషు త్రిషు యేన స్వనుష్ఠితాః' అని బ్రహ్మాండపురాణము. అర్థాంతరము. యౌవనస్థ = జవ్వనమందుఁ గలిగియున్న, దశ = అవస్థను, బహువిధరతిప్రసంగము ననుట. 'దశావస్థాననేకథా' అని అ. అంతయున్ = లెస్సగా, నడపెను. 'జాతిస్వభావగుణదేశజధర్మచేష్టాభావేంగితేషు వికలో రతితంత్ర పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/67 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/68 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/69 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/70 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/71 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/72 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/73 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/74 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/75 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/76 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/77 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/78 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/79 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/80 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/81 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/82 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/83 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/84