శ్రీరస్తు

శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః

రాఘవపాండవీయము

సవ్యాఖ్యానము

పీఠిక



తోఁ బుట్టి సుధామధుద్రవముతోఁ జెన్నొందుపుష్పంబు శో
భాతారుణ్య మెలర్పఁగా ముడుచుపంపాహేమకూటాశ్రయ
ఖ్యాత బ్రహ్మము ప్రోచుఁ గావుత విరూపాక్షాహ్వయం బాకువీ
టీతిమ్మప్రభు వేంకటాద్రి హృదయాటీకంబు లోకంబులన్.

1

వ్యాఖ్యానకర్తృకృతమంగళాచరణము

శా.

శ్రీలీలాజలజంబుఁ జేకొని దరస్మేరాస్యుఁ డై గోపికా
జాలం బద్భుతవార్ధిఁ దేలఁగ నిజేచ్ఛన్ నైజసౌందర్యధు
ర్యాలోకద్యుతిధారతన్ ముకుళనవ్యాకోచముల్ సేయుగో
పాలస్వామి మనోహరాకృతి మదిన్ భావించి సేవించెదన్.


చ.

అమరయసూరయార్యరచితాంచితరాఘవపాండవీయకా
వ్యమహితమాధురీమదుభయార్ణవిబోధిక టీకఁ జేసెదన్
గమలనివాసినీచరణకాంచననూపురశింజితార్భటిన్
సమమతి సంస్కృతాంధ్రకృతిసాధనలక్షణలక్షితంబుగన్.

టీక. శ్రీతోన్ = లక్ష్మితోడ, పుట్టి = జనించి, సుధామధుద్రవముతోన్ - సుధా = అమృత మనెడి, మధు = పూఁదేనెయొక్క, ద్రవముతో = తడితోడ, చెన్నొందుపుష్పంబు - చెన్నొందు = ప్రకాశించునట్టి, పుష్పంబు = పువ్వును, శోభాతారుణ్యము = తరుణకాంతి, ఎలర్పఁగాన్ = ఒప్పఁగా, ముడుచు పంపాహేమకూటాశ్రయఖ్యాతబ్రహ్మము - ముడుచు = జడలయందుఁ దాల్చుకొన్నట్టి, పంపా = పంపాసరస్తీరమం దున్న, హేమకూట = హేమకూటపర్వత మనెడు, ఆశ్రయ = ఉనికియందు, ఖ్యాత = పేర్కొనిన, బ్రహ్మము = కర్త - అనఁగా బాలచంద్రుని శిరమునందుఁ దాల్చినదని భావము. విరూపాక్షాహ్వయంబు = విరూపాక్షనామము గలది, ఆకువీటీతిమ్మప్రభు వేంకటాద్రిహృదయాటీకంబు - ఆకువీటీ = ఆకువీడను పత్తనమునకు ఱేఁడైన, తిమ్మప్రభు = తిమ్మరాజుకొమరుఁడయిన, వేంకటాద్రి = పెదవేంకటాద్రిప్రభువుయొక్క, హృదయ = ఉల్లమునందు, ఆటీకంబు = వర్తించునది - బ్రహ్మశబ్దమునకు విశేషణములు, లోకంబులన్ = జనకోటులను, ప్రోచుఁగావుతన్ = రక్షించుఁగాత.

శా.

శ్రీచన్గొండలు రెండు నండ గొని వాసిం బేర్చుచున్ భక్తిసా
మీచీన్యామల పెద్దవేంకటనృపోన్మీలన్మనశ్చాతక
వ్యాచిక్రింసకుఁ గైవసం బయి సదోదంచత్కృపావృష్టిస
ధ్రీచీనం బగుకృష్ణమేఘము జగత్ప్రీతిం గడుం జేయుతన్.

2

టీక. శ్రీ = లక్ష్మీదేవియొక్క, చన్గొండలు = స్తనములనెడు పర్వతములను, రెండున్ = రెంటిని, అండగొని = ఆశ్రయించి, వాసిన్ = ఆధిక్యముచేత, పేర్చుచున్ = ప్రసిద్ధి కెక్కుచును, భక్తి = భక్తియొక్క, సామీచీన్య = కొమరుచేత - అనఁగా నిష్కలంకభక్తిచే ననుట. అమల = పవిత్రుఁ డయిన, పెద్దవేంకటనృప = పెదవేంకటాద్రిప్రభువుయొక్క, ఉన్మీలత్ = వికాసము పొందుచున్న, మనః = డెంద మనెడి, చాతక = వానకోయిలయొక్క, వ్యాచిక్రింసకున్ = గమనేచ్ఛకు - అనఁగా నుదకమును గోరి సంచరించుట, కైవసం బయి = అధీనమై, సదా = ఎల్లప్పుడు, ఉదంచత్ = అడరుచున్న, కృపా = దయారస మనెడి, వృష్టి = వర్షముతోడ, సధ్రీచీనం బగు = కూడి వర్తించునట్టి, కృష్ణమేఘము = కృష్ణుఁడను కార్మెఱుంగు - శ్లిష్టరూపకము. జగత్ = లోకముయొక్క, ప్రీతిన్ = ఇష్టమును, కడున్ = మిక్కిలి, చేయుతన్ = ఒనర్చుఁగాక.

శా.

లోకత్రాణరతిం దదాదిమమహీలోకప్రవేశోత్కభా
షాకౢప్తప్రథమద్వితీయపదగుంజన్మంజుమంజీరగ
ర్జాకల్పామలరామభారతకథాసర్గంబులన్ మించువా
ల్మీకివ్యాసులఁ గొల్చెదం దదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

3

టీక. లోకత్రాణరతిన్ - లోక = జనులయొక్క, త్రాణ = ప్రోపునందుఁ గల, రతిన్ = ఆశచేత - ఇది వాల్మీకివ్యాసులయం దన్వయము, తత్ = అట్టి, ఆదిమ = తొలుతటి దైన - ఇది ప్రవేశమునకు విశేషణము, మహీలోక = భూలోకముఁ గూర్చి, ప్రవేశ = చొచ్చుటయందు, ఉత్క = ఉత్సాహము గల, భాషా = సరస్వతీదేవిచేత, కౢప్త = తొడుగఁబడినవియై, ప్రథమద్వితీయ = కుడియెడమ లయిన, పద = పాదములయందు, గుంజత్ = అవ్యక్తముగ మ్రోయుచున్న, మంజు = విన నింపైన, మంజీర = అందెలయొక్క, గర్జాకల్ప = రొదతో సమానము లయిన, అమల = స్వచ్ఛము లయిన, రామ = రామునియొక్క, భారత = భరతవంశపురాజులయొక్కయు, కథా = చరిత్రములయొక్క - అనఁగా రామాయణభారతము లనుట, సర్గంబులన్ = నిర్మాణములచేత, మించు = పేర్చునట్టి, వాల్మీకివ్యాసులన్ = వాల్మీకిముని వ్యాసమునులను, తదుభయ = ఆరామాయణభారతముల రెంటియొక్క, శ్లేషార్థ = కూడిక యగునర్థముయొక్క, సంసిద్ధికిన్ = నెరవేరుటకొఱకు, కొలిచెదన్ = సేవించెదను.

ఉ.

ఏయెడ నర్థగౌరవసమృద్ధియు శబ్దవిశుద్ధియుం దిరం
బై యనవద్యతం బరఁగ నంధ్రవచస్స్థితి భారతంబు రా
మాయణము రచించిన మహాతుల నాత్మ్యఁ దలంచెదన్ జగ
ద్గేయుల నన్నపార్యునినిఁ దిక్కసుధీమణి నెఱ్ఱసత్కవిన్.

4

టీక. ఏయెడ = ఎల్లెడలను, అర్థ = వాచ్యాద్యర్థములయొక్క, గౌరవసమృద్ధియున్ = గురుత్వాతిశయమును, శబ్ద = పదములయొక్క, విశుద్దియున్ = సౌష్ఠవమును, తిరంబై = స్థిరమై, అనవద్యతన్ = నిర్దుష్ట మగుటచేత, పరఁగన్ = ఒప్పునట్లుగా, ఆంధ్రవచః = తెనుఁగుపదములయొక్క, స్థితిన్ = ఉనికిచేత - అనఁగాఁ దెనుఁగు ననుట, భారతంబు = భారతంబును, రామాయణమున్ = రామాయణమును, రచించిన = ఒనర్చిన, మహాత్ములన్ = పూజ్యులయిన, జగద్గేయులన్ = లోకస్తుత్యు లయిన, నన్నపార్యునిన్ = నన్నయభట్టారకుని, తిక్కసుధీమణిన్ = తిక్కనకవిని, ఎఱ్ఱసత్కవిన్ = ఎఱ్ఱాప్రెగ్గడను (ఈ మువ్వురిని), ఆత్మన్ = హృదయమునందు, తలంచెదన్ = భావించెదను.

క.

ఈవిధి నభీష్టసిద్ధికి, దైవతకవి నుతి యొనర్చి తప్పొప్పు మదిన్
భావించి దిద్దకుండను, దేవానాంప్రియుల మ్రొక్కి తెలతుఁ గుకవులన్.

5

టీక. ఈవిధిన్ = ఈ క్రమమున, అభీష్టసిద్ధికిన్ = కోర్కి నెఱవేఱుటకు, దైవత = దేవకలయొక్కయు, కవి = కవీశ్వరులయొక్కయు, నుతి = స్తోత్రమును, ఒనర్చి = కావించి, తప్పు = దోషమును, ఒప్పు = గుణమును, మదిన్ = తమహృదయములందు, భావించి = ఎంచి, దిద్దకుండ = సరిపఱుపకుండునట్లు, దేవానాంప్రియులన్ = మూర్ఖులకు, మ్రొక్కి = నమస్కరించి, కుకవులన్ = దుష్కవులకు, తెలతున్ = నమస్కారము చేయుదును. “దేవానాం ప్రియ ఇతి చ మూర్ఖ” అని వ్యాకరణము.

వ.

అని కుకవు లొకనిమిత్తంబునం బ్రార్థనీయు లగుటం జేసి తత్ప్రార్థనం
బునుం గొంత నడపినవాఁడనై యెద్దియేనియు నొక్కభవ్యకావ్యంబు
నవ్యప్రకారంబున రచియించుటకు నుదంచితకుతూహలుండ నై
యుండు సమయంబున.

6

టీక. అని = ఇట్లని, కుకవులు = కుత్సితకవులు, ఒకనిమిత్తంబునన్ = ఒకకారణముచేత, ప్రార్థనీయు లగుటం జేసి = కొనియాడఁదగినవా రగుటచేత, తత్ = ఆకుకవులయొక్క, ప్రార్థనంబును = వేఁడికోలును, కొంత = కొంచెము, నడపినవాఁడ నై = ప్రవర్తినఁజేసినవాఁడ నై, ఎద్దియేనియున్ = దేని నైన, ఒకభవ్యకావ్యంబు = ఒకమనోజ్ఞ మైనప్రబంధమును, నవ్యప్రకారంబునన్ = వింతతెఱంగున, రచియించుటకు = ఒనర్చుటకు, ఉదంచితకుతూహలుండ నై = సోత్సుకుండ నై, ఉండుసమయంబునన్ = ఉన్నవేళ.

ఈమీఁద నొకటిరెండు పద్యములు విడఁబడి యవి ప్రత్యంతరములయందుఁ గానఁబడమిచే నిటఁ జేర్పఁబడిన వయ్యెఁ గాని దానఁ గథాసందర్భము తప్పినది కాదు.

సీ.

ఏమహీవరుతాత యిమ్మభూవరుఁడు స
             త్కీర్తిగంగాజన్మకృతిమహాద్రి
యేవిభుతండ్రి నానావిధపౌరుష
             స్థిరవృత్తి మీసాలతిమ్మశౌరి
యేనృపోత్తముతల్లి మానితపరమసా
             ధ్వీగుణంబులప్రోక తిమ్మమాంబ
యేధీరుననుజన్ము లిద్ధదానక్షాత్ర
             భద్రుండు చినవేంకటాద్రినృపుఁడు


తే.

ఘనులు వేంకటరాయవేంకటవరదులు
ననఁ బ్రసిద్ధులు ముగు రట్టియాకువీటి
పురవరాంకుండు త్రిభువనపూర్ణకీర్తి
యతులతేజుండు పెదవేంకటాద్రివిభుఁడు.

7

టీక. ఏమహీవరు = ఏభూపతియొక్క, తాత = పితామహుఁడు, సత్కీర్తి = మంచియశ మనెడు, గంగా = ప్రాయేటియొక్క, జన్మ = పుట్టుకయొక్క, కృతి = ఒనర్పునకు, మహాద్రి = గట్టులఱేఁ డయిన, ఇమ్మభూవరుఁడు = ఇమ్మరాజో, ఏవిభు = ఏప్రభువుయొక్క, తండ్రి = జనకుఁడు, నానావిధ = పెక్కుభంగులయిన, పౌరుష = మగఁటుముల చేత, స్థిర = తిర మైన, వృత్తి = వ్యాపారము గల, మీసాలతిమ్మశౌరి = మీసాలతిమ్మరాజో, ఏనృపోత్తము = ఏరాజశ్రేష్ఠునియొక్క, తల్లి = జనని, మానిత = మన్నింపఁబడిన, పరమ = శ్రేష్ఠము లయిన, సాధ్వీగుణంబుల = పాతివ్రత్యగుణములకు, ప్రోక = రాసియైన, తిమ్మమాంబ = తిమ్మాంబయో! ఏధీరు = ఏధృతిమంతునియొక్క, అనుజన్ములు = తమ్ములు, ఇద్ధ = ప్రకాశింపఁజేయఁబడిన, దాన = త్యాగముచేతను, క్షాత్ర = క్షత్రభావముచేతను – అనఁగాఁ బరిపాలనాదు లనుట, భద్రుండు = మంగళకరుఁ డయిన, చినవేంకటాద్రినృపుఁడు = చిన్నవేంకటాద్రిరాజును, ఘనులు = అధికులయిన, వేంకటరాయ = వేంకట్రాయనృపుఁడును, వేంకటవరద = వేంకటవరదప్రభువును, అనన్ = అనఁగా, ప్రసిద్ధులు = ఖ్యాతి కెక్కినవారు, ముగురు = ఈమువ్వురో, అట్టి = అటువంటి, ఆకువీటి = ఆకువీడను, పుర = పట్టణమునకు, వర = ఱేఁ డనెడు, అంకుండు = చిహ్నము గలవాఁడు, త్రిభువన = ముల్లోకములయందు, పూర్ణ = నిండిన, కీర్తి = యశము గలవాఁడు, అతుల = ఈడు లేని, తేజుండు = పరాక్రమము గలవాఁడు, పెదవేంకటాద్రివిభుఁడు = పెదవేంకటాద్రిరాజు.

వ.

నిజాస్థానంబున సంగీతసాహిత్యాదివివిధవిద్యాప్రసంగంబులం బ్రవ
ర్తిల్లుచు.

8

టీక. నిజ = తనయొక్క, ఆస్థానంబునన్ = కొలువుకూటమునందు, సంగీత = గానము, సాహితీ = సాహిత్యము, ఆది = మొదలుగాఁగల, వివిధ = అనేకములయిన, విద్యా = విద్యలయొక్క, ప్రసంగంబుల = ప్రసక్తులచేత, ప్రవర్తిల్లుచున్ = ఉన్నవాఁ డగుచు.

సీ.

శోభితాపస్తంబసూత్రు గౌతమగోత్రు
             సుచరిత్రుఁ బింగళసూరసుకవి
పౌత్త్రు నన్నపరతిభావనదౌహిత్రు
             నమరధీమణికి నబ్బమకుఁ బుత్త్రు
ననుజన్ము లై నట్టియమలనయెఱ్ఱనా
             ర్యులు భక్తి సేవింప నలరువాని
సత్కావ్యరచనావిశారదుఁ డగువాని
             సూరననామ విశ్రుతుని నన్నుఁ


ఆ.

బ్రియము సంధిలంగఁ బిలిపించి బహువస్త్ర
భూషణాదిదానములఁ గరంబు
సంతసం బొనర్చి యెంతయు గారవ
మెసఁగ మధురఫణితి నిట్టు లనియె.

9

టీక. శోభిత = ప్రకాశింపఁజేయంబడిన - ప్రసిద్ధినొందినదనుట, ఆపస్తంబసూత్రున్ = ఆపస్తంబ మనుసూత్రము గలవాని, గౌతమగోత్రున్ = గౌతములగోత్రము గలవాని, సుచరిత్రున్ = మంచినడత గలవాని, పింగళసూరసుకవిపౌత్త్రున్ = పింగళసూరన్నకవియొక్క మనమఁడైనవాని, నన్నపరతిభావన = నన్నపరతిభావనలకు, దౌహిత్రున్ = కూఁతురుకొడు కైనవాని, అమరధీమణికిన్ = అమరయకవికిని, అబ్బమకున్ = అబ్బమ్మకును, పుత్త్రున్ = తనయుఁ డయినవాని, అనుజన్ము లైనట్టి = తమ్ము లైన, అమలనయెఱ్ఱనార్యులు = అమలనయెఱ్ఱనకవులు, భక్తిన్ = భక్తిచేత, సేవింపన్ = సేవచేయుచుండఁగా, అలరువానిన్ = ఒప్పెడువాని - మహిమఁ జెందువాని ననుట, సత్కావ్య = మంచికావ్యములయొక్క - అనఁగా దోషరహితములై రసాద ప్రయుక్తము లయినవి యనుట, రచనా = కూర్పునందు, విశారదుం డగువానిన్ = నేర్పరియైనవాని, సూరననామ = సూరన యనుపేర, విశ్రుతునిన్ = ప్రసిద్ధి కెక్కినవాని, నన్నున్ = నను - క్రిందటి వెల్ల దీనికి విశేషణములు, ప్రియము = ప్రీతి, సంధిలంగన్ = తనరఁగా, పిలిపించి = పిలువ నంపి, బహు = అధికము లయిన, వస్త్ర = చేలములు, భూషణ = సొమ్ములు, ఆది = మొదలుగాఁగలవానియొక్క, దానములను = ఈవులచేత, కరంబున్ = మిక్కిలి, సంతసం బొనర్చి = సంతోషపెట్టి, ఎంతయున్ = చాల, గారవ మెసఁగన్ = ఘనత మీఱఁగా, మధురఫణితిన్ = ఇంపగుతెఱఁగున, ఇట్టులు = ఈమీఁదఁ జెప్పఁబోయెడిప్రకారమున, అనియెన్ = పల్కెను.

శా.

రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
కుండుం దద్గతిఁ గావ్య మెల్ల నగునే నోహో! యనం జేయదే
పాండిత్యంబున నందునుం దెనుఁగుకబ్బం బద్భుతం బండ్రు ద
క్షుం డెవ్వాఁ డిల రామభారతకథల్ జోడింప భాషాకృతిన్.

10

టీక. రెండర్థంబులపద్యము = ద్వ్యర్థి యగుపద్యమును, ఒక్కటియున్ = ఒండేనియు, నిర్మింపంగన్ = కూర్చుటకు, శక్యంబు గాకుండున్ = తరము గాకుండును, అట్లుండఁగా, తద్గతిన్ = ఆరెండర్థములు గలపద్యము చొప్పున, కావ్య మెల్ల నగునేని = ఒకప్రబంధము కడముట్ట నిర్మిత మాయెనేని - ఆకావ్య మనుట సిద్ధార్థము. అదియ కర్త, ఓహో యనం జేయదే = ఆశ్చర్యపడి మెచ్చుకొనునట్లు చేయఁజాలదా, పాండిత్యంబున నందునున్ = రెండర్థముల కావ్యమును జేయునట్టియానేర్పునందును, తెనుఁగుకబ్బంబు = ఆంధ్రకావ్యము - అనఁగా నాంధ్రకావ్యముచేత యనుట, అద్భుతం బండ్రు = అరు దందురు - పెద్ద లని కర్త, భాషాకృతి = వాగ్రూపమునఁ - గావ్యస్వరూపముగ ననుట, రామభారతకథల్ = రామాయణ భారతములను, జోడింపన్ = జంటగాఁ జేయుటకు - అనఁగా నారెండర్థములను నొకటిగాఁ జెప్పుటకు, ఇలన్ = భూమియందు, దక్షుండు = సమర్థుఁడు, ఎవ్వాఁడు = ఏకవి, కలఁ డని శేషము. కావున నీకంటె నెవఁడును లేఁడని భావము.

ఉ.

భీమన తొల్లి చెప్పె నను పెద్దలమాటయె కాని యందు నొం
డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరుఁ గాన ర టుండనిము నా
నామహితప్రబంధరచనాఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్
నామదిఁ దద్ద్వయార్థకృతినైపుణియుం గల దంచు నెంచెదన్!

11

టీక. తొల్లి = మునుపు, భీమన = భీమన యనుకవి - రెండర్థముల కావ్యము నని తెచ్చుకొనునది, చెప్పెను = వచించె ననుట, అను = అనునట్టి, పెద్దలమాటయె కాని = వృద్ధులవాక్యమే కాని - రెండర్థముల కావ్యము నొకదాని భీమన చేసినట్టు పెద్దలు వాడుకొనుచున్నారని భావము, అందున్ = ఆకావ్యమునందు, ఒండు = ఒకటి, ఏమియున్ = ఏదియు - ఒకపద్యము నైన ననుట, ఏయెడ = ఎచ్చోటను, నిలుచుట = వర్తించుటను, ఎవ్వరును = ఏవారును, కానరు = ఎఱుఁగరు, అటుండనిమ్ము = ఆవార్త యట్లుండనీ - ఇట నిది యనాదరోక్తి, ఇఁక నేమనఁగా, నానా = పెక్కులయిన, మహిత = పూజ్యము లయిన, ప్రబంధ = కావ్యములయొక్క, రచనా = ఒనర్పుచేత, ఘన = అధిక మయిన, విశ్రుతి = ఖ్యాతి, నీకు, కల్గుట = లభించుటచేత (ఇది హేతువు), తత్ = క్రిందటఁ జెప్పిన, ద్వయార్థ = రెండర్థములప్రబంధముయొక్క, కృతి = కూర్పునందుఁగల, నైపుణియున్ = నేర్పును, కల దంచు = నీకుఁ గలదని, నామదిన్ = నాహృదయమునందు, ఎంచెదన్ = తలఁచెదను.

క.

చాటుప్రబంధరచనా, పాటవకలితుఁడవు శబ్దపరిచితియందున్
మేటివి దీనిం దెనుఁగునఁ, బాటించి రచింప నీవ ప్రౌఢుఁడ వరయన్.

12

టీక. చాటుప్రబంధ = సంఖ్యాకాసంఖ్యాకాదిభేదప్రశస్తకృతులయొక్క, రచనా = ఒనర్సునందుఁ గల, పాటవ = నైపుణ్యముతోడ, కలితుఁడవు = కూడుకొన్నవాఁడవు, శబ్దపరిచితియందున్ = శబ్దపరిజ్ఞానమునందును - సాహితియం దనుట, మేటివి = సమర్థుఁడవు, కావున, అరయన్ = విచారించి చూడఁగా, దీని = ఈరెండర్థములకావ్యమును, తెనుఁగున = ఆంధ్రమునందు, పాటించి = కైకొని, రచింపన్ = ఒనర్చుటకు, నీవ = నీవే, ప్రౌఢుఁడవు= జాణవు.

ఉ.

దక్షత యింత గల్మి విశదంబుగఁ గాంచియు నీమదిన్ ఫలా
పేక్ష ఘనంబు కామి నిది యి ట్టనఁ గొంకెద నీకు నోలలా
టేక్షణభక్తిశీల రచియించుట యిష్టము కాదె శ్రీవిరూ
పాక్షున కంకితంబుగ శుభార్థము రాఘవపాండవీయమున్.

13

దక్షత = కౌశలము, ఇంత గల్మిన్ = ఇంతమాత్రము కలిగి యుండుటను, విశదంబుగన్ = తెల్లముగ, కాంచియు = తెలిసియు, నీమదిన్ = నీయుల్లమందు, ఫలాపేక్ష = ప్రయోజనాసక్తి, ఘనంబు గామిన్ = గొప్ప కాకపోవుటచేత - నీకుఁ గృతి చెప్పి దానఫలమును బొందుట గొప్ప యనుబుద్ధి లేమి హేతువుచేత నని భావము, ఇది యిట్టనన్ = ఈకృతి చేయుమనుటకు, కొంకెదన్ = జంకెదను - అట్లు వలదు గాని, ఓలలాటేక్షణభక్తిశీల = ఈశ్వరభక్తినిరతుఁ డయినవాఁడా - ఇది హేతుగర్భవిశేషణము, శ్రీవిరూపాక్షునకున్ = విరూపాక్షస్వామికి, అంకితంబుగన్ = పేర్కొనంబడినదిగా - శ్రీవిరూపాక్షునిపేర ననుట, శుభార్థము = మేలు గలుగుటకొఱకు, రాఘవపాండవీయమున్ = రాఘవపాండవీయ మనుగ్రంథమును, రచియించుట = ఒనర్చుట, నీకున్ = నీకును, ఇష్టము కాదె = అభీష్టమే కదా. ఫలాపేక్షచే నొనర్ప నిష్టము లేనివాఁడవైనను భగవదంకితముగఁ జేయ నిచ్ఛ గలవాఁడవు కావున శ్రీవిరూపాక్షునిపేర నీద్వయార్థకృతి నొనర్పు మని తాత్పర్యము.

వ.

అని సవినయభక్తికంబు లగుమధురభాషణంబుల నిజాభిలాషంబు
తెఱం గెఱింగించిన నేనునుం దదీయంబు లగునతిమాత్రగౌరవ
సంభావనాదివిశేషంబులచేతం బ్రీతచేతస్కుండ నై యునికిం జేసి
శక్యాశక్యవిచారంబు లేక యంగీకారభంగీతరంగితం బగునంత
రంగంబుతో నతని నభివీక్షించి.

14

టీక. అని = ఇట్లని, సవినయభక్తికంబులు = వినయభక్తిసహితములు, అగు = అగునట్టి, మధురభాషణంబులన్ = తియ్యనిమాటలచే, నిజాభిలాషంబు తెఱంగు = తనకోర్కిరీతిని, ఎఱింగించినన్ = తెలిపించినను, తదీయంబులు = అతనివి అగునట్టి, అతిమాత్రగౌరవ = ఎంతయు గారవముతోఁ గూడిన, సంభావనాదివిశేషంబులచేత = వింత లగుమన్ననలచే, ప్రీతచేతస్కుండ నై = సంతసించినహృదయము గలవాఁడ నై, ఉనికిం జేసి = ఉండుటచేత, శక్యాశక్యవిచారంబు = కాఁదగుఁ గాఁదగ దనుచింత, లేక, అంగీకారభంగీ = ఒప్పికోలువిధముచే, తరంగితం బగు= పెనుపఁబడినట్టి, అంతరంగంబుతోన్ = చిత్తముతోను, ఇ ట్లంటిని = ఈలాగునఁ బల్కితిని.

ఉ.

రాఘవపాండవీయకథ రమ్యముగా నొకకావ్యసృష్టి నా
హా ఘటియింపఁగా వశమె యాంధ్రకవీంద్రుల కైనఁ దావక
శ్లాఘనపూర్వకోక్తి యవిలంఘ్యము గావునఁ గోవిదానుకం
పాఘనబుద్ధిఁ జూపెదఁ జమత్కృతిమత్కృతి మత్కృతిత్వమున్.

15

టిక. ఆంధ్రకవీంద్రుల కయినన్ = ఆంధ్రకవిశ్రేష్ఠుల కేనియు, రాఘవపాండవీయకథ = రామాయణభారతములను, రమ్యముగాన్ = ఒప్పిదముగా, ఒకకావ్యసృష్టిన్ = ఒకప్రబంధనిర్మాణముచేత, ఆహా = ఔరా - ఆశ్చర్యవాచకము, ఘటియింపఁగాన్ = కూర్చుటకు, వశమె = శక్యమా - రాఘవభారతార్థములు రెండు కలిగి యుండునట్లుగా నొకకావ్యము నిర్మింపఁ గూడునా యనుట, అట్లైనను, తావక = నీదగు, శ్లాఘనపూర్వక = పొగడుకోలు మున్నుగాఁ గల, ఉక్తి = మాట, అవిలంఘ్యము = దాఁటఁ దగనిది, కావునన్ = ఆకారణముచేత, కోవిద = విద్వాంసులయొక్క, అనుకంపా = కరుణచేత, ఘన = అతిశయముం బొందిన, బుద్ధిన్ = మతిచేత - పండితోత్తముల కృపాతిశయమువలన నాబుద్ధికి నిట్టిమహాకావ్యనిర్మాణమునందుఁ జూడ్కి కలిగెంగాని మఱియొకటిఁ గాదనుట, చమత్కృతిమత్ = చమత్కారము గల, కృతిన్ = ప్రబంధరచనయందు, మత్కృతిత్వమున్ = నాకౌశలమును, చూపెదన్ = కనుపఱిచెదను.

వ.

అని మఱియు నతనిచేత ననేకవిధసత్కారసంభావనాసంభృతసమ్మదుండ నై.

16

అని = ఇట్లని, మఱియును, అతనిచేతన్ = ఆ పెదవేంకటాద్రిప్రభువుచేత, అనేకవిధ = నానాప్రకారములయిన, సత్కారసంభావనా = దానసమ్మానములచేత, సంభృత = వహింపఁబడిన, సమ్మదుండనై = సంతోషము గలవాఁడనై.

సీ.

ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష
             యొక్కొకచోట నొక్కొక్కచోట
నుచితశబ్దశ్లేష యొక్కొక్కచోట న
             ర్థశ్లేష యొక్కొక్కతఱిని ముఖ్య
గౌణవృత్తిశ్లేషఘటన యొక్కొకతఱి
             నర్థాన్వయము వేఱెయగుచు నునికి
శబ్దాన్వయనిభేదసంగతి యొక్కొక్క
             తఱి నివి యొక్కొక్కతఱిని రెండు


తే.

మూఁడు గూడుట యన సముజ్జ్వలము గాఁగ
నాకుఁ దోచినగతిఁ బెక్కుఁబోక లమర
రామభారతకథలు పర్యాయదృష్టి
జూచుసుమతుల కేర్పడ నాచరింతు.

17

టీక. ఒక్కొకచోటన్ = ఒక్కొకయెడ, ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష = ఆంధ్రగీర్వాణములయొక్కకూడికలు, ఒక్కొక్కచోట, ఉచిత = తగిన, శబ్దశ్లేషణ = శబ్దములకూడికయు, ఒక్కొక్కచోటన్, అర్థశ్లేష = అర్థములకూడికయు, ఒక్కొకతఱిన్ = ఒక్కొకవేళ, ముఖ్యగౌణ = ప్రధానాప్రధానములయిన, వృత్తి = ప్రవృత్తులు గల, శ్లేష = కూడికయొక్క, ఘటన = కూర్పును, ఒక్కొకతఱిని, అర్థాన్వయము = అర్థముల చేరిక, వేఱె యగుచు = భిన్న మగుచును, ఉనికి = ఉండుటయు, ఒక్కొకతఱిని, శబ్దాన్వయ = శబ్దముల చేర్చుటయొక్క, విభేదసంగతి = వేఱుపాటును, ఒక్కొకతఱిని, ఇవి = ఈక్రిందటఁ జెప్పిన శ్లేషాదులు, రెండుమూఁడు = రెండు గాని మూఁడు గాని, కూడుట = చేరుటయు, మఱియు, సముజ్జ్వలముగన్ = ఒప్పునట్లుగా ననుట, నాకు, తోఁచినగతిన్ = స్ఫురించునట్టివిధమున, పెక్కుపోకలు = పలుమార్గములు, అమరన్ = ఏర్పడునట్లుగా, రామభారతకథలు = భారతరామాయణములను, పర్యాయదృష్టిన్ = పర్యాయక్రమమున, చూచుసుమతులకున్ = పరికించునట్టిధీమంతులకు, ఏర్పడన్ = రామభారతకథలు వేఱువేఱ నేర్పడునట్లు, ఆచరింతున్ = రచియింతును, కృతి నని సంబంధము.

క.

ఒకకథ వినియెడితరి వే
ఱొకకథపై దృష్టి యిడిన నొకయర్థముఁ దోఁ
పక పోవుఁ గాన నేకా
ర్థకావ్య మెట్లట్ల వినగఁ దగు నొకటొకటిన్.

18

టిక. ఒకకథ = ఒక్కకథను, వినియెడితఱిన్ = ఆకర్ణించునట్టివేళ, వేఱొకకథపై = మఱియొకకథమీఁద, దృష్టి యిడినన్ = చూడ్కి యుంచినయెడల - తల పుంచిన ననుట, ఒకయర్థము = ఒకయర్థమేనియు, తోఁపకపోవుఁ గానన్ = స్ఫురింపకపోవును గనుక, ఏకార్థకావ్యము = ఒకయర్థముగల గ్రంథము, ఎట్లు = ఏప్రకారమో, అట్ల = ఆప్రకారమే, ఒకటొకటిన్ = ఒక్కొక్కయర్థమునుగా, వినఁగఁ దగున్ = ఆకర్ణింపవలయును.

తే.

ప్రభువుసత్కారఋణ మిందుఁ బాయు ననియు
శ్రీవిరూపాక్షసేవావిశేష మనియు
సుజను లిందు గుణాంశంబ చూతు రనియుఁ
జలిపితి నసాధ్యకృతి కిట్లు సాహసంబు.

19

టీక. ప్రభువు = పెదవేంకటాద్రిప్రభువుయొక్క, సత్కార = సమ్మాన మనెడు, ఋణము = అప్పు, ఇందున్ = ఈకావ్యనిర్మాణమునందు, పాయు ననియున్ = తీరు ననుచును, శ్రీవిరూపాక్ష = విరూపాక్షదేవునియొక్క, సేవా = భజనవలన నైన, విశేషము = శ్రైష్ఠ్యమును కలుగు నని శేషము, అనియు, సుజనులు = పెద్దలు, ఇందున్ = ఈ కావ్యమునందు, గుణాంశంబ = మే లగుపట్టునే, చూతురనియున్ = కాంతురనియు, అసాధ్య = నెఱవేర్పఁదగని, కృతికి = ప్రబంధనిర్మాణమునకు, ఇట్లు = ఈలాగున, సాహసంబు = తెగువను, చలిపితిన్ = చేసితిని, “సలుపు” అనునీక్రియాపద మీరాఘవపాండవీయ ప్రాచీనలిఖితప్రతులయం దంతటఁ జాదిగా వ్రాయఁబడి యున్నది గాని తదాది యని నిర్ధారణ చేయుట కాకరము లేదు. ఇప్పటివాడుక సాదిగాఁ గనుపడుచున్నయది.

వ.

అని యిట్లు కృతోత్సాహుండ నగుచు నేతత్ప్రబంధనిబంధనారంభం
బునకుఁ బ్రేరకుం డైనసకలాంతర్యామి హేమకూటాధ్యక్షుండు శ్రీ
విరూపాక్షుండే నిర్విఘ్నపరిసమాప్తిప్రచయగమనంబులకుం దాన కలం
డతనిసంకల్పానుసారంబున నెట్లు గావలయు నట్లగుం గాక నాకు
భారం బేమి యనుతలంపున నిశ్చింతుండ నై కడంగి దీనికిఁ బ్రత్యక్ష
నియామకుం డైన పెదవేంకటాద్రిమహీవల్లభువంశక్రమం బభి
వర్ణించెద.

20

టీక. అని యిట్లు, కృత = చేయఁబడిన, ఉత్సాహుండ నగుచున్ = పూనిక గలవాఁడనై, ఏతత్ప్రబంధ = ఈకావ్యముయొక్క, నిబంధనారంభంబునకున్ = నిర్మాణప్రారంభమునకు, ప్రేరకుం డైన = పురికొల్పువాఁ డగునట్టి, సకలాంతర్యామి = సర్వజనహృదయాంతర్వర్తియైన, హేమకూటాధ్యక్షుండు = హేమకూటాచలేంద్రుఁడగు, శ్రీవిరూపాక్షస్వామియే, నిర్విఘ్న = చెఱుపు లే కుండునట్లు, పరిసమాప్తి = ముగియుటకును, ప్రచయగమనంబులకున్ = వ్యాప్తి నొందుటకును, తాన = తానే - శ్రీవిరూపాక్షుఁడే యనుట, కలండు = ఉన్నాఁడు. అతని = ఆవిరూపాక్షస్వామియొక్క, సంకల్పానుసారంబున = ఇచ్ఛవెంబడిని, ఎట్లు = ఏరీతి, కావలయున్ = కావలయునో, అట్లు = ఆరీతి, అగుంగాక = ఔఁ గాత, నాకు, భారంబు = బరువు, ఏమి యనుతలంపునన్ = ఏమి యున్న దనుభావముచే, నిశ్చింతుండ నై = వగపు లేనివాఁడ నై, కడంగి = యత్నపడి, దీనికిన్ = ఈప్రబంధనిర్మాణమునకు, ప్రత్యక్ష = ఎదుట నుండునట్టి, నియామకుండు = ప్రోత్సాహకుఁడు, ఆయిన, పెదవేంకటాద్రిమహీవల్లభు = పెదవేంకటాద్రిప్రభువుయొక్క, వంశ =కులముయొక్క, క్రమంబు = వరుసను, అభివర్ణించెద = ఉగ్గడించెదను.

శా.

శ్రీశోభాఘనుఁ డిమ్మభూవరుఁడు లక్ష్మీనాథకల్పద్రుబా
హాశాఖాఫల మైనవంశమున మూర్తామోదమున్ బోలె స
ర్వాశాపూరితకీర్తివాసనలతో నావిర్భవించెన్ ధరి
త్రీశోత్తంసితభవ్యశాసనకళాహేతుప్రతాపాఢ్యుఁ డై.

21

టీక. శ్రీశోభా = సంపద్విలాసముచేత, ఘనుఁడు = అధికుఁ డయిన, ఇమ్మభూవరుఁడు = ఇమ్మరాజు, లక్ష్మీనాథ = శ్రీమన్నారాయణుఁ డనెడు, కల్పద్రు = కల్పవృక్షముయొక్క, బాహా = భుజ మనెడు, శాఖా = కొమ్మయందుఁ గల, ఫలమయిన వంశమునన్ = పండైన కులమునందు - అనఁగా క్షత్రియకులమునం దనుట, ధరిత్రీశ = రాజులచేతఁ , ఉత్తంసిత = శిరోభూషణముగాఁ జేయఁబడిన దై, భవ్య = ఒప్పిదము నైన - యుక్తమైన దనుట, శాసనకళా = శిక్షావిధికి, హేతు = కారణమైన, ప్రతాప = పరాక్రమముచేత, ఆఢ్యుఁడై = సంపన్నుఁడయి - అతని పరాక్రమమునకు వెఱచి రాజులందఱు నతనియాజ్ఞ శిరముచే వహించుచుండిరి (అనఁగా రాజులంద అతనికి లోఁబడిరని భావము.), మూర్తామోదమున్ బోలెన్ = మూర్తివంతమైన వాసనావిశేషమువలె, సర్వాశా = ఎల్లదిక్కులయందు, పూరిత = నిండింపఁబడిన, కీర్తి = యశ మనెడు, వాసనలతోన్ = గంధములతోడ, ఆవిర్భవించెన్ = జనించెను.

తే.

ఆకువీటిపురీశాసనాంకుఁ డగుచు
సకలసంగ్రామకేళినిశ్శంకుఁ డగుచు
ననిశపూజితశేషపర్యంకుఁ డగుచు
నతఁడు సొంపొందు యువతిమీనాంకుఁ డగుచు.

22

టీక. ఆకువీటిపురీశాసన = ఆకువీటిపురప్రభు వనెడు, అంకుఁ డగుచున్= పేరుగలవాఁ డగుచు, సకలసంగ్రామకేళి = సమస్తయుద్ధక్రీడలయందు, నిశ్శంకుఁ డగుచున్ = జంకు లేనివాఁ డగుచు, అనిశ = నిరంతరము, పూజిత = అర్చింపఁబడిన, శేషపర్యంకుఁ డగుచున్ = అనంతుఁడు శయ్యగాఁ గలవిష్ణుమూర్తి గలవాఁ డగుచు, యువతిమీనాంకుఁ డగుచున్ = మానినీమన్మథుఁ డగుచును, అతఁడు = ఆయిమ్మభూపతి, సొంపొందున్ = యింపొందెను.

క.

కౌండిన్యగోత్రజలధివి, ధుం డాతఁడు గాంచె వరసుతున్ భావమహీ
మండలపతిఁ గదనబలో, ద్దండుని లక్ష్మాంబ యనెడు తనసతియందున్.

23

టీక. కౌండిన్యగోత్ర మనెడు, జలధి = సముద్రమునకు, విధుండు = చంద్రుఁ డయిన, ఆతఁడు = ఆయిమ్మభూపతి, లక్ష్మాంబ యనెడు, తనసతియందు = తనభార్యయందు, కదనబలోద్దండునిన్ = యుద్దమునందలి బలిమిచేత భయంకరుఁడైనవాని, భావమహీమండలపతిన్ = భావరాజును, వరసుతున్ = శ్రేష్ఠుఁడైనపుత్త్రునిగా, కాంచెన్ = కనెను.

స్రగ్ధర.

ఆలక్ష్యాంబాకుమారుం డమలయశుఁడు భావావనీశుండు సాధ్విం
బోలాంబన్ బెండ్లి యై యొప్పుగఁ గనియెన్ సుతు భూపరిరంభలీలా
శీలస్థూలంభవిష్ణుస్థిరభుజబలలక్ష్మీవిశేషప్రయుక్తో
ద్వేలాశాదంతిశుండావిలసనలఘిమావేశు నిమ్మక్షితీశున్.

24

టీక. ఆలక్ష్మాంబాకుమారుండు = ఆలక్ష్మమ్మపుత్త్రుఁ డయిన, అమలయశుఁడు = నిర్మలకీర్తి గలవాఁ డైన, భావావనీశుండు = భావరాజు, సాధ్విన్ = పతివ్రతయైన, పోలాంబన్ = పోలమను, పెండ్లియై = వివాహమయి, ఒప్పుగన్ = తగునట్లుగా, భూ = భూదేవియొక్క, పరీరంభ = కౌఁగిలింతయందుఁ గల - భూమివహన మనుట, లీలా = వేడుకయే, శీల = స్వభావముగాఁగల, స్థూలంభవిష్ణు = తోరముగాఁ గల - వృద్ధిఁబొందుచున్న దనుట, స్థిర = నిల్కడ యైన, భుజబల = బాహుబలముయొక్క, లక్ష్మీవిశేష = సమృద్ధ్యతిశయముచేత, ప్రయుక్త = ప్రయోగింపఁబడిన - కలుగఁజేయఁబడిన దనుట, ఉద్వేలాశా = దిగంతములయందున్న, దంతి = దంతావలములయొక్క, శుండా = తుండములయొక్క, విలసన = విజృంభణముకొఱ కైన, లఘిమావేశున్ = లఘుత్వప్రవేశము గలవాని, ఇమ్మక్షితీశున్ = ఇమ్మభూపతిని, సుతున్ = పుత్త్రునిగా, కనియెన్ = కాంచెను.

క.

రాజమహేంద్రవరాధిపు, రీజైత్రవిచిత్రములఁ బరిభ్రాజితుఁ డై
యాజిఘనుం డాయిమ్మమ, హీజాని ప్రసిద్ధి గాంచె నెంతయుమహిమన్.

25

టీక. రాజమహేంద్రవర మనెడు, అధిపురీ = పట్టణశ్రేష్ఠముయొక్క, జైత్ర = జయశీలమైన, విచిత్రముల = వింతపనులచేత, పరిభాజితుఁడై = ప్రకాశింపఁబడినవాఁడై, ఆజిఘనుండు = రణశూరుఁ డయిన, ఆయిమ్మమహీజాని = ఆయిమ్మరాజు, ఎంతయుమహిమన్ = మిక్కిలి ప్రభావముచేత, ప్రసిద్ధి గాంచె = ప్రఖ్యాతిఁ జెందెను.

తే.

ఆమహీలోకవిభుని యర్ధాంగలక్ష్మి
యయినకసవమ్మ యనసూయ యగుట నార్య
యగుట సుప్రసిద్ధమ వేఱె యడుగ నేల
వినుతి కెక్కు పాతివ్రత్యవిలసనంబు.

26

టీక. ఆమహీలోకవిభుని = ఆయిమ్మభూవరునియొక్క, అర్ధాంగలక్ష్మి = అర్ధశరీరలక్ష్మి, ఐన = అయినట్టి - అనఁగా భార్య యయిన, కసవమ్మ = కసవాంబ, అనసూయ = అనసూయాదేవియు - అసూయ లేనిదియు, అగుటన్ = అవుటచేతను, ఆర్య = పార్వతీదేవియు - కులీనయు, అగుటన్ = అవుటచేతను, సుప్రసిద్ధమ = తేటతెల్లమె, వినుతికెక్కు = ప్రఖ్యాతి నొందిన, పాతివ్రత్యవిలసనంబు = పతివ్రతామహిమను, వేఱె = ప్రత్యేకముగా, అడుగ నేల = విచారింప నేమిటికి.

క.

ఆయిమ్మడిధాత్రీతల, నాయకునకుఁ గసవమకును నందను లధిక
శ్రీయుతు లిద్దరు సుజనవి, ధేయులు బొమ్మప్రభుండు తిమ్మవిభుండున్.

27

టీక. ఆయిమ్మడిధాత్రీతలనాయకునకున్ = ఆయిమ్మభూపతికిని, కసపమకును = కసవాంబకును, అధికశ్రీయుతులు = ఘనలక్ష్మీసమన్వితులు, సుజనవిధేయులు = సజ్జనుల కడఁగినవారు, బొమ్మప్రభుండు = బొమ్మరాజును, తిమ్మవిభుండు = తిమ్మరాజు ననఁగా, ఇద్దరు = ఇరువురైన, నందనులు = సుతులు - కల రని శేషము.

వ.

వారిలోన.

28

టీక. వారిలోనన్ = ఆయిరువురిలోపల.

ఉ.

పావనమూర్తియై విజయభైరవసద్బిరుదాంకుఁ డై దశా
శావనితాలలాటతటచందనచిత్రకభావభాగ్యశ
శ్శ్రీవిభవాభిరాముఁ డయి జృంభితదానవిహారుఁ డై ధరి
త్రీవలయంబునన్ వెలసెఁ దిమ్మనృపాలుఁడు ధర్మశీలుఁ డై.

29

టీక. పావనమూర్తియై = నిర్మలదేహుఁడై - సౌందర్యవంతుండై యనుట, విజయభైరవసద్బిరుదాంకుఁడై = విజయభైరవుఁ డను మేటిబిరుదు గలవాఁడై, దశ = పదియైన, ఆశా = దిక్కు లనెడు, వనితా = కాంతలయొక్క, లలాటతట = అలికప్రదేశములయందుఁ గల, చందనచిత్రకభావ = గంధపుబొ ట్టగుటను, భాక్ = పొందిన, యశశ్శ్రీవిభవ = కీర్తివైభవముచేత, అభిరాముఁడయి = ఒప్పినవాఁడై - అనఁగా శుభ్రకీర్తి యెల్లదిశల వ్యాపించిన దని భావము, జృంభితదానవిహారుఁడై = ప్రశస్తత్యాగపరుఁడయి, ధర్మశీలుఁడై = పుణ్యస్వభావుఁడయి, తిమనృపాలుఁడు = తిమ్మరాజు, ధరిత్రీవలయంబునన్ = భూతలమునందు, వెలసెన్ = ప్రకాశించెను.

క.

ఉభయకులసిద్ధిఁ దనరెడు, నభినవగుణములఁ బ్రసిద్ధ యగుతిమ్మాంబన్
విభవమునఁ బెండ్లి యాడెను, ద్రిభువనవిభుఁ డాకువీటితిమ్మవిభుఁ డొగిన్.

30

టీక. త్రిభువన = ముల్లోకములయందు వ్యాపించిన, విభుఁడు = ప్రతాపము గల, ఆకువీటి = ఆకువీడను పట్టణమునకు రాజైన, తిమ్మవిభుఁడు = తిమ్మరాజు, ఒగిన్ = క్రమమున - వయఃప్రాప్తియం దనుట, ఉభయకుల = పుట్టినమెట్టినయింటివారి వంగడములయొక్క, సిద్ధిన్ = నిల్కడచేత, తనరెడు = ఒప్పునట్టి, అభినవగుణములన్ = క్రొత్తలైన సద్గుణములచేతను, ప్రసిద్ధ యగు= ప్రసిద్ధురా లైన - పాతివ్రత్యాదిసద్గుణమహిమచే నుభయకులోద్ధారకురా లయిన దనుట. తిమ్మాంబన్ = తిమ్మమ్మను, విభవమునన్ = వైభవమున, పెండ్లి యాడెను = వివాహ మయ్యెను.

చ.

పటుబలశాలి తిమ్మనరపాలుఁడు పుత్త్రులఁ గాంచె విక్రమో
ద్భటుఁ బెదవేంకటాద్రిఁ బ్రతిపక్షహరుం బినవేంకటున్ మరు
ద్విటపిసమానదానఘను వేంకటరాయని భవ్యతేజు వెం
కటవరదున్ బుధప్రణుతి గాంచినతిమ్మమయందుఁ బెంపుగన్.

31

టీక. పటుబలశాలి = గట్టిబల్మిగల, తిమ్మనరపాలుఁడు = తిమ్మభూపతి, బుధప్రణుతి గాంచిన = పెద్దలస్తోత్రమును బొందిన, తిమ్మమయందు = తిమ్మాంబయందు, పెంపుగన్ = వృద్ధిగా, విక్రమోద్బటున్ = పరాక్రమోద్దండుఁ డైన, పెదవేంకటాద్రి = పెద్దవేంకటాద్రి యనునాతని, ప్రతిపక్షహరున్ = శత్రుసంహారకుఁ డయిన, పినవేంకటు = చిన్నవేంకటాద్రి యనునాతని, మరుద్విటపిసమాన = కల్పవృక్షముతో నీ డయిన, దాన = ఈవిచేత, ఘనున్ = గొప్పవాఁడైన - అనఁగాఁ బ్రసిద్ధినొందిన, వేంకటరాయనిన్ = వేంకట్రాయఁడను నాతని, భవ్యతేజున్ = ప్రతాపశాలియైన, వేంకటవరదున్ = వేంకటవరదుఁ డను నాతనిని, ఈనలువురిని, పుత్త్రులన్ సుతులను, కాంచెన్ = కనెను.

వ.

అందు.

32

టీక. అందు = ఆనలువురియందు.

తే.

అమరవరభూమిభృన్మస్తకములఁ గ్రిందు
పఱచునిజపాదకటకసత్ప్రౌఢిచేత
విమలధృతిఁ గేశవప్రాయణమున వెలయు
వేంకటాద్రియ యనఁ బినవేంకటాద్రి.

33

టీక. అమరవరభూమిభృత్ = దేవనగరమైన మేరుపర్వతముయొక్క, మస్తకములన్ = శిఖరములను, క్రిందుపఱచు = తగ్గుఁ జేయుచున్న, నిజ = తనయొక్క, పాదకటక = నితంబప్రదేశముయొక్క, సత్ప్రౌఢిచేత = ఔన్నత్యముచేత ననుట - మేరుపర్వతమునకంటె మించినదని తాత్పర్యము. అర్థాంతరము — అమరన్ = ఒప్పఁగా, వరభూమిభృత్ = రాజశ్రేష్ఠులయొక్క, మస్తకములన్ = తలలను, క్రిందుపఱచు = క్రిందుగాఁ జేయుచున్న - వంచికొనఁజేయుచున్న వనుట. నిజ = తనయొక్క, పాద = చరణములయం దున్న, కటక = నూపురములచేత నైన, సత్ప్రౌఢిచేతన్ = మ్రోఁతచేత ననుట - చినవేంకటాద్రి యెక్కుడుకడిమిచే బిరుదుగాఁ బాదములఁ దాల్చినయందియలఁ జూచి శత్రురాజులు మాఱాడక తలలు వంచుకొందురని తాత్పర్యము, విమల = నిర్మలమైన, ధృతి = ధైర్యముచేతను, కేశవ = వేంకటేశ్వరునికి, ప్రాయణమునన్ = ఉనికి యగుటచేతను - చినవేంకటాద్రి వేంకటేశ్వరుని నిరంతరభక్తిచే ధ్యానించుచుండుటవలన వేంకటేశ్వరస్వామియుఁ జినవేంకటాద్రి హృదయమందే వాసము చేయుచుండె నని తాత్పర్యము. అర్థాంతరము — వేంకటాద్రియ యనన్ = వేంకటాచలమే యనునట్టుగా, పినవేంకటాద్రి = చినవేంకటాద్రిరాజు, వెలయున్ = ఒప్పును.

చ.

క్షమయు నమోఘవిక్రమము సద్వినయంబు ప్రతాపమున్ సురూ
పము నవికారభావమును బ్రాభవశక్తియు నిత్యదానశీ
లముఁ దగ నొక్కటొక్కటి కలంకృతిఁ జేయఁగఁ దాల్చి శోభిలున్
విమలత నాకువీటిపురవేంకటరాయఁ డతిప్రసిద్ధుఁ డై.

34

టీక. ఆకువీటిపుర = ఆకువీటిపట్టణమున కధిపతి యయిన, వేంకటరాయఁడు = వేంకటరాయఁ డనురాజు, క్షమయున్ = సయిరణను, అమోఘ = మొక్కవోని, విక్రమము = బీరమును, సద్వినయంబు = మంచినమ్రతను, ప్రతాపమును = వేఁడిమిని, సురూపమును = చక్కఁదనమును, అవికారభావమును = వెక్కురుఁదనము లేమిని, ప్రాభవశక్తియున్ = దొరతనపుఠీవిని, నిత్య = ఎడతెగని, దానశీలము = ఈగినడకను, తగన్ = తగునట్లు, ఒక్కటి = ఒకగుణము, ఒక్కటికిన్ = మఱియొకగుణమునకు, అలంకృతి = సింగారమును, చేయఁగన్ = ఒనర్చునట్లుగా - ఒకటిచే నొకటి ప్రకాశింపఁగా ననుట, తాల్చి = ధరించి - అనఁగా నీగుణములు కలవాఁడై, అతిప్రసిద్ధుఁడై = ఇట్టిసద్గుణములు కలవాఁడు కనుకనే మిక్కిలి ఖ్యాతి జెందినాఁడని సంబంధము, విమలతన్ = నిష్కల్మషత్వముచేత - పాపకృత్యములు చేయనివాఁ డనుట, శోభిలున్ = ప్రకాశించును.

క.

వేంకటవరదుఁడు వెలయు ని, రంకుశవితరణనిరూఢప్రజ్ఞను రణని
శ్శంకితప్రాభవమున నక, లంకితకీర్తిప్రతాపలక్ష్ములమహిమన్.

35

టీక. వేంకటవరదుఁడు = వేంకటవరదరాజు, నిరంకుశ = అడ్డపాటులేని, వితరణత్యాగములందు, నిరూఢ = తీర్పు గల, ప్రజ్ఞను = బుద్ధిచేతను, రణ = కయ్యముచేత, నిశ్శంకిత = జంకు లేనిదిగాఁ జేయఁబడిన, ప్రాభవమునన్ = ఏలుబడిచేతను - అనఁగాఁ జక్కఁగా యుద్ధము చేయువాఁ డనుట, ఆకలంకిత = కలక లేనిదిగాఁ జేయఁబడిన, కీర్తిప్రతాపలక్ష్ముల = పొగడువేడుములసిరులయొక్క, మహిమన్ = ఎక్కువచేతను, వెలయున్ = ప్రకాశించును.

తే.

ఇట్టి యన్వయపరిశుద్ధి యింపుమీఱ
శ్రీవిరూపాక్షభక్తివిశేషవిమల
హృదయుఁ డగుచు సంగీతసాహిత్యనిత్య
సరసగోష్ఠీవినోదైకనిరతుఁ డగుచు.

36

టీక. ఇట్టి = ఈపూర్వోక్తమయినట్టి, అన్వయ = వంశముయొక్క, పరిశుద్ధి = గరగరిక, ఇంపు మీఱన్ = ముద్దు చెలఁగఁగా, ఇది (సతిసప్తమి) శ్రీవిరూపాక్షస్వామియందుఁగల, భక్తివిశేష = భక్త్యతిశయముచేత, విమల = కసటువాసిన, హృదయుఁ డగుచున్ = ఉల్లము గలవాఁ డగుచును, సంగీత = పాటచేతను, సాహిత్య = చదువుచేతను, నిత్య = నిశ్చల మగు, సరస = తెలివరులతోడనగు, గోష్ఠీ = కూటువయందైన, వినోదైక = వేడుకయొకటనే, నిరతుఁ డగుచున్ = ఇచ్ఛ కలవాఁ డగుచును. కర్తృక్రియలు పైపద్యమున.

క.

వడిగలతనాన నీవిని
విడిముడిపసఁ బ్రాభవమున విజయనగరిలోఁ
గడు నెన్న నేర్చఁ గలమే
ల్నడకలఁ బెదవేంకటాద్రినరవరుఁ డొప్పున్.

37

టీక. వడిగలతనానన్ = శౌర్యముచేతను, ఈవిని = త్యాగముచేతను, విడిముడిపసన్ = ధనసంపత్తిచేతను, ప్రాభవమున = ప్రభుత్వముచేతను, విజయనగరిలోన్ = విజయనగరములో, కడు = మిక్కిలి, ఎన్నన్ = గణించుటకును, ఏర్చన్ = ఇవి యని యేర్ప రించుటకును, కల = కలిగినట్టి - తగిన వనుట, మేల్నడకలన్ = మేటివర్తనలచేత, పెదవేంకటాద్రిరాజు, ఒప్పున్ = ప్రకాశించును.

చ.

విడువక యాకువీటిపెదవేంకటభూపతిసత్ప్రతాపముం
గడుఁ దెలుపైనకీర్తియు జగంబుల నన్నిఁటి మించి ముంచినన్
జడధిశయుండు సంతసిలు నాదువిరాణ్మయమూర్తి కబ్బె ని
ప్పుడు నవకుంకుమంబు తెలిపూవులపూజయు నంచు నాత్మలోన్.

38

టీక. ఆకువీటి = ఆకువీటిపట్టణప్రభువైన, పెదవేంకటభూపతి = పెద్దవేంకటాద్రిరాజుయొక్క, సత్ప్రతాపము = ఉజ్జ్వలమైన పరాక్రమమును, కడు = మిక్కిలి, తెలుపైన = తెల్లనైనట్టి, కీర్తియున్ = యశమును - ఈరెండు కర్తలు, జగంబుల నన్నిఁటిన్ = లోకముల నెల్లను, మించి = అతిక్రమించి, ముంచినన్ =మునుఁగఁజేసినను - కీర్తిప్రతాపప్రవాహము జలప్రళయమువలె లోకముల నెల్ల ముంచె ననుట, జడధిశయుండు = సముద్రశాయి యయిన నారాయణుఁడు, ఇప్పుడు = ఈవేళ, నాదు = నాయొక్క, విరాణ్మయ = విరాడ్రూపమైన, మూర్తికిన్ = దేహమునకు - ప్రళయమున హరి విరాణ్మూర్తి యయి సముద్రములోఁ బవళించుట శాస్త్రసిద్ధము, నవ = క్రొత్తయయిన, కుంకుమంబు = కుంకుమపుఁబూఁతయు, తెలి = తెల్లనైన, పూవులు = పుష్పములచే నయిన, పూజయున్ = అర్చనయు, అబ్బె నంచున్ = కలిగె ననుచు, ఆత్మలోన్ = హృదయమున, సంతసిల్లున్ = ఆనందించును.

ఉ.

చేకొని యాకువీటివిభు శ్రీపెదవేంకటుఁ జెంది యాత్మలో
నేకలసద్గుణంబు మహి యెన్న దనేకలసద్గుణాప్తిచేఁ
గైకొని శేషభోగములకల్మి దలంప దశేషభోగలీ
లాకలనంబుచేతఁ గరులన్ గిరులన్ మఱి చెప్ప నేటికిన్.

39

టీక. మహి = భూమిదేవి, ఆకువీటివిభు= ఆకువీటిపురాధీశ్వరుఁడైన, శ్రీపెదవేంకటున్ = పెదవేంకటాద్రిరాజును, చేకొని = వరియించి, చెంది = కూడి - పాలింపఁబడినదై యనుట, ఆత్మలో = హృదయమునందు, అనేకల = ఏకలము గానివానియొక్క, సద్గుణాప్తిచేన్ = సుగుణ ప్రాప్తిచేత - హేతువు, ఏకల = వరాహముయొక్క, సద్గుణంబు = సుగుణము, ఎన్నదు = గణింపదు -రసికశిఖామణి యయిన పెదవేంకటాద్రిని గూడి యాతనిగుణముల మరిగినది గనుక మృగముయొక్క గుణములను మెచ్చనిదాయె ననుట, అనేక = పెక్కులయిన, లసత్ = ప్రకాశింపుచున్న, గుణ = గుణములు గలవస్తువుయొక్క, ఆప్తిచేన్ = ప్రాప్తిచేత, ఏక = ఒకటైన - లసద్గుణంబును ఎన్నదని యర్థాంతరము, అశేషభోగ = శేషభోగములు కానివానియొక్క, లీలాకలనంబుచేతన్ = విలాసానుభవముచే - ఇదియు హేతువు, శేష = ఆదిశేషునియొక్క, భోగముల = పడగలయొక్క, కల్మి = విలాససంపదను, తలంపదు = ఎన్నదు - పెదవేంకటాద్రిలీలలను గన్నది కాన సర్పక్రీడను మెచ్చనిదయ్యె ననుట, ఆశేష = సమస్తములైన, భోగ = సుఖానుభవములయొక్క, లీలాకలనంబుచేతన్ = విలాసక్రియచేత, శేష = కొద్దియయిన - భోగములకల్మిని తలంపదని యర్థాంతరము, మఱి = ఇంక, కరులన్ = అష్టదిగ్గజములను, గిరులన్ = సప్తకులపర్వతములను, చెప్ప నేటికిన్ = వాకొన నేల. కేవలభగవదంశసంభూతము లైనవరాహాదిశేషులే యిటు లైనచో నితరములఁ జెప్ప నేల యని తాత్పర్యము.

తే.

ఈకరణి ధాత్రి వెలసినయాకువీటి
తిమ్మరాహుత్తతనయుఁ డుత్తీర్ణకీర్తి
పరుఁడు పెదవేంకటాద్రిభూవరుఁడు సేయు
సేవ లింపుగఁ గైకొని దైవమునకు.

40

టీక. ఈకరణిన్ = ఈవిధమున, ధాత్రిన్ = భూమియందు, వెలసిన = ఒప్పిన, ఆకువీటి = ఆకువీటిపురాధ్యక్షుఁడైన, తిమ్మరాహుత = తిమ్మరాజాగ్రణియొక్క, తనయుఁడు = కొమరుఁడైన, ఉత్తీర్ణ = లోకము నతిక్రమించిన, కీర్తి = యశమునందు, పరుఁడు = సక్తుఁ డైన, పెదవేంకటాద్రిభూవరుఁడు = పెదవేంకటాద్రిరాజు, చేయు = ఒనర్చునట్టి, సేవలు = వందనములు, ఇంపుగన్ = ఇష్టముగ, కైకొని= గ్రహించి, దైవమునకు = నాయిష్టదేవతకు.

క.

లోకైకస్తుత్యునకు ని
రాకృతనతజనజనుర్జరామృత్యునకున్
ద్రైకాల్యసత్యునకుఁ బా
ణౌకృతగిరిరాడపత్యునకు నిత్యునకున్.

41

టీక. లోక = జనులచేత, ఏక = ముఖ్యముగ, స్తుత్యునకు = స్తోత్రము చేయఁదగినవానికి, నిరాకృత = పోఁగొట్టఁబడిన - ఇది జనురాదిశబ్దమునకు విశేషణము, నతజన = అభివాదకులయొక్క, జనుర్జరామృత్యునకు = పుట్టువుముదిమిచావులు గలవానికి, త్రైకాల్య = భూతభవిష్యద్వర్తమానకాలముల మూఁటను, సత్యునకున్ = నిత్యుఁ డయినవానికి, పాణౌకృత = పెండ్లాడఁబడిన, గిరిరాడపత్యునకున్ = పార్వతి గలవానికి.

క.

అధ్యాత్మతత్త్వవిద్యా
సాధ్యునకు సమస్తయోగిజనహృత్కమలా
రాధ్యునకుఁ గాలదిగనవ
రోధ్యున కధ్యుషితతిగ్మరుచిమధ్యునకున్.

42

టీక. ఆధ్యాత్మతత్త్వవిద్యా= బ్రహ్మవిద్యచేత, సాధ్యునకు = సాధింపఁదగినవానికి - తెలియఁదగినవాని కనుట ఇతరవిద్యలచే నెట్టివారిచేతను సాధింపఁదగిన వాఁడు గాఁడని భావము, సమస్త = ఎల్లరగు, యోగిజన = తపోవంతులయొక్క, హృత్కమల = మానసాబ్జములచేత, ఆరాధ్యునకు = పూజింపఁదగినవానికి, కాల = కాలముచేతను, దిక్ = దిక్కులచేతను, అనవరోధ్యునకున్ = అడ్డగింపఁబడఁదగనివానికి, అధ్యుషిత = ఉనికి చేయఁబడిన, తిగ్మరుచి = వేఁడివెలుంగుయొక్క, మధ్యునకున్ = నడుముగలవానికి - త్రిమూర్తులును మార్తండమండలమధ్యవర్తు లగుట వేదనిష్ఠము.

క.

శంకారుజాపహృత్యగ, దంకారున కచలితామృతప్రియముఖస
త్యంకారభక్తియుక్త్య క, లంకారచితార్యనుత్యలంకారునకున్.

43


టీక. శంకా = భయ మనెడు, రుజా = నొప్పియొక్క, అపహృతి= పోఁగొట్టుటయందు, అగదంకారునకున్ = వెజ్జగువానికి - ఆశ్రితులకు జననాదులవలనఁ గలుగుభయమును బాపువాఁ డని భావము, అచలిత = చలింపఁబడని - అనఁగా నెడవాయనిముఖశబ్దమునకు విశేషణము, ఆమృత = సుధవలె, ప్రియ = ఇంపయిన, ముఖవాక్కులయొక్క, (ఇట లక్షణ), సత్యంకార = నిజమైన - అనఁగా నిశ్చలమైన, భక్తి = భక్తియొక్కయు, యుక్తి = కూడికచే, అకలంక = కాలుష్యము లేకుండునట్లుగా, ఆరచిత = మించఁజేయఁబడిన, ఆర్య= పెద్దలయొక్క, నుతి = స్తోత్రములే, అలంకారునకున్ = తొడవుగాఁ గలవానికి - కేవలభక్తితోడ సుజనులు చేయు స్తోత్రమునకు సంతసించువాఁ డని భావము.

క.

ప్రార్థనపరసురసార్థహి, తార్ధకృతత్రిపురదైత్యహతికిన్ వేదాం
తార్థావనలీలాచరి, తార్థీకృతబహుమహర్షిహర్షితమతికిన్.

44

టీక. ప్రార్థన = వేఁడుకోలునందు, వర = సక్తులైన - అనఁగాఁ బ్రార్థించుచున్న, సురసార్థ = వేల్పుగుమికి, హిత = మేలైన, అర్థ = ప్రయోజనముకొఱకు, కృత = చేయఁబడిన, త్రిపురదైత్య = త్రిపురాసురులయొక్క, హతికి = చావు గలవానికి - అనఁగా దేవతలెల్లఁ బ్రార్థింపఁగా వారికొఱకుఁ ద్రిపురాసురులఁ జంపెనని భావము, వేదాంత = ఉపనిషత్తులయొక్క, అర్థ = ఆర్థముయొక్క, ఆవన = పాలనమునందుఁగల, లీలా = విలాసముచేత, చరితార్థీకృత = సార్థకములుగా నొనర్పఁబడిన, బహు = అనేకులైన, మహర్షి = గొప్పఋషులయొక్క, హర్షిత = సంతసమందిన, మతికిన్ = మనస్సు గలవానికి - అనఁగా వేదాంతార్థానుసరణంబుగఁ దా నటించి మహర్షులయెన్నికలను సఫల మొందించెనని భావము.

క.

దక్షమఖధ్వంసునకుం, జక్షూభవదనలకుముదసఖహంసునకున్
భిక్షాసరిరంసునకున్, వీక్షాసఫలితమనోజవిజిఘాంసునకున్.

45

టీక. దక్ష = దక్షప్రజాపతియొక్క, మఖ = జన్నమును, ధ్వంసునకు = చెఱిపినవానికి, చక్షూభవత్ = నేత్రము లగుచున్న, అనల = అగ్నిదేవుఁడును, కుముదసఖ = కలువఱేఁడును, హంసునకున్ = సూర్యుఁడు గలవానికి, భిక్షా = బిచ్చమందు, సరిరంసునకున్ = క్రీడించునిచ్ఛతోఁ గూడుకొన్నవానికి - భిక్షాటనమూర్తి కనుట, వీక్షా = చూపుచేత, సఫలిత = నెఱవేర్పఁబడిన, మనోజ = మన్మథునియొక్క, విజిఘాంసునకున్ = చంప నిచ్ఛ గలవానికి - మూఁడవకంట మన్మథు నేర్చినవాని కనుట.

క.

పశ్యత్ఫాలున కతిదృ, గ్దృశ్యద్రష్టాదిభేదధీజాలునకున్
వశ్యావిద్యునకు శమా, వశ్యాసాద్యునకు నిత్యవైశద్యునకున్.

46

టీక. పశ్యత్ = జూచుచున్న, ఫాలునకు = నుదురు కలవాని కనుట - నుదుటఁ గన్ను గలవాని కనుట, అతిదృక్ = చూడనతిక్రమించినవాఁడు, దృశ్య = చూడఁదగినవాఁడు, ద్రష్ట = చూచువాఁడును, ఆది = ఇవి మొదలుగాఁ గల, భేద = భిన్న మొందిన, బుద్ధి = బుద్ధులయొక్క, జాలునకున్ = సమూహము గలవానికి, ధీమంతులును దమతమబుద్ధిబలంబునఁ దన్నుఁ జూడరానివాఁ డనియుఁ జూడఁదగినవాఁ డనియుఁ దా నొరులఁ జూచువాఁ డనియు నిట్లు భిన్నభావంబులు నిరూపణము చేయుదురని భావము, వశ్య = లోకువ చేసికొనఁదగిన, అవిద్యునకున్ = మాయ గలవానికి - మాయ దా నందఱ మోహింపఁజేసినను నీశ్వరుఁ డట్టిమాయకుఁ దా మోహ మడరించునని భావము, శమ = ఓర్పుచేత - ఇది దమాదుల కుపలక్షణము, అవశ్య = ముఖ్యముగ, ఆసాద్యునకున్ = పొందఁదగినవానికి - శమదమాదిగుణములు గలవారికే లభ్యుండని భావము, నిత్య = నిత్యమైన, వైశద్యునకున్ = నిర్మలత్వము గలవానికి - నిష్కళంకుఁ డనుట.

క.

దేవాసురనరతిర్యక్, స్థావరబహుజంతుపూర్ణసంఖ్యాతిగరా
జీవభవాండఫలావి, ర్భావాకరవపురుదుంబరక్ష్మాజునకున్.

47

టిక. దేవ = వేలుపులు, అసుర = రక్కసులు, నర = మానుసులు, తిర్యక్ = పసిపులుంగులు లోనగునవి, స్థావర = నిలువరములు ననెడు, బహు = పెక్కులైన, జంతు = మేతాల్పులచేత, పూర్ణ = నిండిన, సంఖ్యాతిగ = ఎన్నికకు మీఱిన, రాజీవభవాండ = తమ్మిచూలిగ్రుడ్డు లనెడి, ఫల = మఱ ఱిపండ్లయొక్క, ఆవిర్భావ = పుట్టుకకు, ఆకర = ఇరవయిన, వపుః = మే ననెడి, ఉదుంబరక్ష్మాజునకున్ = మఱ్ఱిమ్రాను గలవానికి - అనఁగా నసంఖ్యాతచరాచరజంతుసంఘాతసంయుతబ్రహ్మాండభాండసహస్రంబులు వటఫలంబులు వటకుటంబునం బోలెఁ దనగాత్రంబున నతిమాత్రంబుగ నుప్పతిల నొప్పువాఁడని భావము.

క.

దీపితరాగశివాత, న్వీపుండ్రేక్షునకు నాకువీటిపురాంక
శ్రీపెదవేంకటనృపధీ, రూపాంబకలక్షునకు విరూపాక్షునకున్.

48

టీక. దీపిత = ప్రజ్వలితమైన, రాగ = అనురాగముగల - అనఁగాఁ గామోద్రిక్తురాలైన దనుట, శివా = పార్వతీదేవి యనెడు, తన్వీ = కాంతకు, పుండ్రేక్షునకున్ = మన్మథుఁ డైనవానికి, (ఆకువీటిపురము), అంక = చిహ్నముగాఁ గల, శ్రీ = సంపద్విశిష్టుఁడగు, పెదవేంకటనృప = పెదవేంకటాద్రిరాజుయొక్క, ధీరూప = బుద్ధిస్వరూపమయిన, అంబక = నేత్రములకు, లక్షునకున్ = విషయమైనవానికి - అనఁగాఁ బెదవేంకటాద్రి వాలాయము నీశ్వరుని దనహృదయమున ధ్యానించుచుండునని భావము, విరూపాక్షునకున్ = ఇట్టివిరూపాక్షస్వామికి - మీఁదటి కన్వయము.

వ.

సభక్తికసమర్పితంబుగా నాయొనర్పంబూనిన రాఘవపాండవీయంబు
నకుఁ గథాప్రారంభం బెట్టి దనిన.

టీక. సభక్తిక = భక్తితోఁ గూడుకొన్నట్టు, సమర్పితంబుగాన్ = ఒసఁగఁబడ్డదిగా, నా = నాయొక్క, ఒనర్ఫన్ = రచియించుటకు, పూనిన = కడంగిన, రాఘవపాండవీయంబునకున్ = రాఘవపాండవీయమను గ్రంథమునకు, కథాప్రారంభము = కథారంభము, ఎట్టిదనినన్ = ఎటువంటిదనఁగా.