రంగారాయచరిత్రము/ప్రథమాశ్వాసము

రంగారాయచరిత్రము

పీఠిక

శా.

శ్రీమద్భూమిభవన్నవాంగరుచిరశ్రీనాత్మవామాంకసీ
మామధ్యంబునఁ జేర్చి లోకవితతి న్మన్నించు ధన్యుండు లీ
లామర్త్యాకృతిరాఘవుండు సుగుణాలంకారు మల్రాజు శ్రీ
రామారాయవసుంధరాధిపుఁగృపన్ రక్షించు నశ్రాంతమున్.

1


మ.

విమాలాంభోజసువర్ణకర్ణికపయిన్ వెల్గొందు పూఁబోఁడిచం
ద్రము సైదో డగు ముద్దరాలు మురజిద్వక్షస్స్థలిం బొల్చుశీ
తమయూఖాననపాలవెల్లి నిసువౌఁ దామ్రాధరోష్ఠీవతం
సము మల్రాజుకులాబ్ధిచంద్రుని మహైశ్వర్యాన్వితుం జేయుతన్.

2


చ.

తొలుబలుకుల్ నిజాననచతుష్టయమార్గవినిర్గతంబులై
నెలకొని వర్ణధర్మముల నిర్ణయముల్ పరికింపుచున్ జగం
బుల వెలయింపఁగాఁజెలఁగు ప్రోడ విరించి చిరాయురున్నతుల్
పొలుపు దలిర్ప రామనృపపుంగవమౌళి కొసంగుఁ గావుతన్.

3

ఉ.

ఆయతమౌక్తికగ్రథితహారమునం జెలువొప్పు విస్ఫుర
న్నాయకరత్న మట్లు సుమనస్తతి కెంతయు నగ్రగణ్యుఁడై
పాయక యంతరాయములఁ బాపు గజాస్యుఁడు రామమేదినీ
నాయకమౌళికిం గృప ననారతమున్ సమకూర్చు నిష్టముల్.

4


శా.

చాపంబున్ డమరు త్రిశూల శరముల్ శాతాసి ముఖ్యాయుధ
వ్యాపారంబునుఁ బాణిపంక్తులఁ దలిర్పన్ శాబరోద్వేలహే
లాపుంభావమునం జెలంగి విజయోల్లాసంబునం బొంగున
య్యీపూరీపురవీరభద్రుఁడు జయం బిచ్చుం గృతిస్వామికిన్.

5


శా.

వీణాపుస్తకముల్ కరాబ్జయుగళిన్ వెల్గొంద విద్వత్కవి
శ్రేణీజిహ్వలపై నటింపుచు రమాసీమంతినీరత్నశ
ర్వాణీముఖ్యసతీవతంసములకు న్వైదగ్ధ్యముల్ నేర్పున
వ్వాణీదేవి యొసంగు మత్కృతికి వాగ్వైచిత్ర్యమాధుర్యముల్.

6


తే.

కాళిదాసమయూరమాఘప్రభృతుల
నుతులఁ దేలించి యాంధ్రసత్కృతు లొనర్చు
నన్నపార్యుండు తిక్కన నాఁ దనర్చు
ప్రాక్తనకవీంద్రచంద్రులఁ బ్రస్తుతింతు.

7


ఉ.

నిబ్బరమైన యక్కరము నేర్చినవారలపోల్కె వట్టి త
బ్బిబ్బులు నాలుగల్లి తమభీకరవేషవిశేషపుష్టికై
యుబ్బి భ్రమల్గొనం గదిసి యొంటరిపాటున మూఢసన్నిధిం
డబ్బులుగొట్టు దుష్కవులు డాయఁగ నోపుదురే రసజ్ఞులన్.

8

వ.

అని యిష్టదేవతావందనంబును సుకవికవితాభినందనంబును
గుకవినిందనంబునుం గావింపుచు నిదానీంతనమహా
వీరపురుషపౌరుషరసానుబంధబంధురం బగునొక్కప్రబం
ధంబు రచియింపం గోరి యున్నసమయంబున.

9


సీ.

శ్రుతగుడక్షోణభృత్క్షితిమండలోచిత
        ప్రాజ్యరాజ్యరమాధురంధరుండు
దానధారాధౌతధరణీసుపర్వాను
        సారిదారిద్య్రరజస్తముండు
సంగీతసాహిత్యసరసవిద్యారస
        రసికతామహితసారస్వతుండు
సామంతభూపాల సంశ్రేషితద్విప
        దానకర్దమితసద్మాంగణుండు


తే.

పద్మనాయకకుముదినీబాంధవుండు
దర్పితారాతిరాజన్యదర్పమధన
రాజితాటోపకేళి మల్రాజవంశ
పద్మవనహేళి రామనృపాలమౌళి.

10


ఉ.

డెబ్బదియేడుగోత్రముల ఠీవి వహించిన యాత్మవర్ణపు
న్నిబ్బర మైనపౌరుషము నేర్పుమెయి న్వెలమ ల్వచింపుచో
బొబ్బిలిరావు వారల యపూర్వపరాక్రమ మబ్బురంబుగాఁ
బ్రబ్బినతచ్చరిత్రము ప్రబంధముఖంబున నాలకింపఁగన్.

11


వ.

మహోత్సాహం బుదయించి యుదంచితశాస్త్రప్రపంచ
సరస్సంచరస్మనోహంసు లగువిద్వాంసులును కవిత్వరచనా
చమత్క్రియాచరితోత్సవు లగుకవులును రాజకార్యస్వతం

త్రులగుమంత్రులును నాయకులును గాయకులును దక్కుఁ
గలపరివారంబు గొలువఁ గొలువుండి గోష్ఠీవినోదంబున.

12


మ.

ననునానాపృథివీంద్రచంద్రకృతసన్మానున్ రఘూత్తంస పా
వనపాదాంబుజసేవనానిరతు సత్ప్రాచీనవిద్వత్కవీ
శనికాయాదరణీయదిట్టకవివంశప్రోద్భవున్ ధీరసా
యను నారాయణుఁ జూచి యిట్లు పలికెన్ హర్షాంబుధిం దేల్చుచున్.

13


తే.

హైమభూషావిశేషవర్షాశనాగ్ర
హారముఖ్యబహూకృతుల్ గారవమున
నందుకొంటివి మాచేత నస్మదాశ్రి
తాగ్రణివి దిట్టకవిరాజ యరుణతేజ.

14


ఉ.

భారతయుద్ధమట్టు లతిభాసురతం గనుపట్టుచు న్మహా
వీరరసప్రధాన మయి వేడుక నింపెడు రావువారిదు
ర్వారరణప్రసంగ మతిరమ్యతరం బది గద్యపద్యసం
భారయుతంబుగా నొకప్రబంధ మొనర్పు మదంకితంబుగన్.

15


వ.

అని యనూనయింపుచుం బరిమళపరిమిళిత కర్పూరవీటీ
కనకశాటీనిరాఘాటధాటీజనవఘోటీపరంపరాది సత్కా
రంబులఁ బ్రియంబుఁగొలుపుటయుం గౌతూహలంబు వొ
డమి తత్ప్రారంభంబునకు మంగళోజ్జృంభణంబుగాఁ గృతి
పతివంశావతారం బభివర్ణించెద.

16


మ.

సనకాదు ల్భజియింతు రెవ్వనిపదాబ్జాతంబు నేపుణ్యశీ
లుని యంఘ్రిన్ జనియించి జాహ్నవి కడున్ లోకత్రయీలోకపా
వని యౌనట్టి రమామనోహరుని దివ్యశ్రీపదాంభోరుహం

బున జన్మించిరి పద్మనాయకులు విస్ఫూర్తిం బ్రవర్తిల్లుచున్.

17


క.

ఆపద్మనాయకాగ్రణు
లేపలరెడువేడ్క డెబ్బదే డగుగోత్ర
వ్యాపాదితనియమస్థితి
దీపించిరి వెలమసంజ్ఞ తేజరిలంగన్.

18


క.

ఆసప్తోత్తరసప్తతి
భాసురగోత్రములయందుఁ బ్రతిభాకరమై
భాసిలె విరియాలాఖ్యన్
వాసిం గలగోత్ర మెన్న వన్నె దలిర్పన్.

19


శా.

కల్లోలి న్యధినాథతుల్యవిలసద్గాంభీర్యుఁడై శారదో
తుల్లాంభోరుహవల్లరీ హిమఝరీ భూతేశవాక్సుందరీ
మల్లీ స్వర్లహరీ కరీంద్రయశుఁడై మల్రాజువంశంబునన్
వల్లారాయనృపాలమౌళి వొడమెన్ వార్ధిన్ మృగాంకాకృతిన్.

20


సీ.

తన చేతినిశితాసిధారావిధుంతుదుం
        డహితాననేందుల నాక్రమింపఁ
దనరణభేరికాధ్వనిగర్జితంబులు
        విమతహంసములకు వెఱపుఁ జూప
దనవాహఖురపుటీజనితధాత్రీధూళి
        పరిపంథికంధుల మురువు దింపఁ
దనజయధ్వజవీరహనుమంతుఁ డభియాతి
        యాదోనిధానంబు లవఘళింప

తే.

నలరు నమితవిరోధి ధరాధినాథ
రత్నమకుటాంశురాజినీరాజితాంఘ్రి
నఖరశిఖరసుధాంశుండు నయవచోభి
రామగీష్పతి వల్లభరాయనృపతి.

21


సీ.

ఆవల్లభనృపాలదేవవల్లభునకుఁ
        దనయులు జనియించి రనఘమూర్తు
లసమానలసమానహారీవాక్చాతురీ
        పన్నగపతి పెదచ్చన్న గారు
శతమన్యుసన్నిభాద్భుతజగన్నుతసంప
        దౌన్నత్యనిధి చినచ్చన్నగారు
వితరణశ్లాఘానవీనకర్ణఖ్యాత
        ఘనకీర్తిశాలి జగ్గన్నగారు


తే.

కొండమక్ష్మాతలాధిపాఖండలుండు
నాఁగ నలువురు దశరథనందనప్ర
తీతసౌభ్రాత్రకలితప్రదీప్తు లగుచుఁ
ద్రిజగదభినంద్యవైభవశ్రీలఁ దనర.

22


క.

ఆనలుగురిలోఁ గొండ
క్ష్మానాయకుఁ డలరె దశదిశామానవతీ
మానిత నాసాభూషా
నానట దురుమౌక్తికాభనవ్యయశుండై.

23


సీ.

ఆశ్రితప్రకరవన్యాదైన్యనిరసన
        సంభ్రమాశ్రాంతవసంతఋతువు
విద్వద్గృహాంగణావిర్భూతనిజరూప
        సంరంభయుతసౌరసౌరభేయి

కవిజనానీకలోకక్రమోదాపాది
        విస్రంభశుంభత్సహస్రరశ్మి
సకలబాంధవచకోరకనికాయతపఃఫ
        లాయితరాకాసుధాంశుబింబ


తే.

మతఁడు నృపమాత్రుఁడే చతురంబురాశి
వలయితక్ష్మాసుపర్వానువర్ణ్యమాన
భూరివితరణవిజితమందారశాఖి
రాజితాకృతి కొండలరాయనృపతి.

24


మ.

జలజాతాత్మభవప్రగల్భవచనశ్లాఘానిరాఘాటమం
జులతాలంఘనజాంఘికంబుల హిరాట్సువ్యక్తవక్త్రావళి
స్ఖలితాలాపకలాకలాపములు నై కన్పట్టు మల్రాజుకొం
డలరాయప్రభుసార్వభౌముని ప్రచండప్రౌఢవాగ్ఝల్లరుల్.

25


క.

ఆకొండలరాయధరి
త్రీకాంతవతంసమునకు దివిషత్తటినీ
వ్యాకోచపుండరీకర
మాకల్పయశు ల్కుమారు లాఱ్వురు వరుసన్.

26


శా.

లీలాసూనశరాసనుల్ వొడమి రా లింగన్న జగ్గక్షమా
పాలగ్రామణి రామభూమిపతియుం బార్థోపమాటోపదో
శ్శీలుండై తగు రామచంద్రనృపుఁడున్ శ్రీరంగపక్ష్మావరుం
డోలిన్ మల్లనృపాలమౌళియు ననా నుర్వీశచూడామణుల్.

27


క.

వారలలోపలఁ గులవి
స్తారకుఁడై సుకవివిద్వదాధారుండై
ధీరోదాత్తుఁడు రామ
క్ష్మారామారమణుఁ డలరె సరసులు వొగడన్.

28

సీ.

అతనిచేతికటారి కభియాతినృపశరీ
        రములు సజీవకోశములు గావె
యతనిశౌర్యాగ్నికి నభియాతినృపదుర్గ
        తండముల్ హోమకుండములు గావె
యతనియాగ్రహశక్తి కహితభూభృచ్ఛిరః
        కమలముల్ కబళకోశములు గావె
యతనిజయేందిరకరిరాజకరికుంభ
        నికరముల్ హారపేటికలు గావె


తే.

భళిభళీ యని తనప్రతాపంబుఁ గాంచి
సకలదిగ్దేశనృపతులు సన్నుతింప
నలరు బెల్లపుకొండ ధరాధిరాజ
రాజమార్తాండమూర్తి యారామనృపతి.

29


మ.

అలఘుశ్రీనిధియట్టిరామవసుధాధ్యక్షుండు గాంచెన్ గుమా
రుల మాద్రేయులఁ బాండురాజుకరణిన్ రుద్రప్రతాపుండు కొం
డలరాయప్రభుసార్వభౌముఁడు ప్రచండాటోపియౌ వేంకటా
చలధాత్రీపతి నాఁగ నిర్వురమహాసామ్రాజ్యధౌరేయులన్.

30


సీ.

అర్థిదారిద్య్రముద్రాంధకార మడంపఁ
        జంద్రార్కులతెఱంగు సంగ్రహించి
దుష్టనిగ్రహకళాదోహలస్ఫురణచే
        రామలక్ష్మణుల బీరంబు నెరపి
శాత్రవోత్కరజయోత్సాహసాహసమున
        భీమార్జునులపోల్కె దీముకొల్పి

లలితవిలాసలీలాచారుచర్యల
     బలరామకృష్ణుల పటిమగల్గి


తే.

 వార లిరువురు సౌహార్దవైభవముల
నంచితస్ఫూర్తి మిగుల దీపించి రెలమి
రహి వహింపుచుఁ గొండలరాయనృపతి
వేంకటాచలమహిభృన్మృగాంకమూర్తి.

31


క.

అం దగ్రజుండు శశభృ
చ్చందనకుందారవిందసాంద్రయశశ్రీ
లందెను కొండలరాయపు
రందరుఁడు నిజాన్వయానురంజనకరుఁడై.

32


ఉ.

 కొండలరాయనిం గెలువఁ గోరు సమున్నతధైర్యసంపదన్
గొండలరాయనిం జెనకఁ గోరు నఖండతరాతిభూతిచేఁ
గొండలరాయనిన్ సమతఁ గోరు నతప్రకరావనిక్రియన్
గొండలరాయభూరమణకుంజరుఁ డెన్న నృపైకమాత్రుఁడే.


సీ.

 దశరథసూతి యీధన్యుండు గాకున్న
     నరిపంక్తికంఠసంహర్త యెట్లు
బలరాముతమ్ముఁ డీప్రభుమౌళి గాకున్న
     సత్యాభిరామప్రచారుఁ డెట్లు
రాకామృగాంకుఁ డీరమణుండు గాకున్నఁ
     గువలయానందన ప్రవణుఁ డెట్లు
జంభవిద్వేషి యీజనపతి గాకున్న
     నహితబలచ్ఛేది యగుట యెట్టు


తే.

 లని జనంబులు వెయినోళ్లఁ దను భజింప
నప్రతీపప్రతాపమహాప్రదీప

శమితరిపువర్గదోర్గర్వతిమిరుఁ డలరు
రమ్యగుణహారి కొండలరాయశౌరి.

34


శా.

ఆసౌభాగ్యబలారి గైకొనియె భార్యాయుగ్మముం గొండమాం
బాసాధ్వీమణిఁ జిన్నపాపమసతిం బద్మామనోభర్తల
క్ష్మీసర్వంసహల న్వరించుపగిదిన్ శ్రీరుక్మిణీసత్యభా
మాసీమంతవతీవతంసములఁ బ్రేమం గృష్ణుచందంబునన్.

35


మ.

 అనసూయాసతి నన్నపూర్ణను బులో మాత్మోద్భవారుంధతీ
వనితారత్నములం బయోధితనయన్ వైదేహి నశ్రాంతముం
దనసౌశీల్యపతివ్రతాత్వవినయౌదార్యాదుల న్మించి పే
ర్కొను కొండమ్మకు నింకఁ గాంత లెనయే కొండొక్క రిమ్మేదినిన్.

36


సీ.

 తనదయాలీలాంచితనయవిశేషముల్
       సకలార్థిజనములు సంస్తుతింపఁ
దనసాధువినయవర్తనసొంపు సేవించి
       యుభయవంశంబులు నుత్సహింపఁ
దనగుణపారిజాతనవీనవాసనల్
       నిఖిలకకుప్పాళి నిండికొనఁగఁ
దనతాల్మికల్మి యింతనరాక వెగ డొంది
       తోడిచేడియల కుత్సుకత నెరప


తే.

 దనరు నాత్మీయసౌశీల్యదానధర్మ
విభవసౌభాగ్యకారుణ్యవిశదకీర్తి
సాధుమాధుర్యనయగుణసారముదిత
బంధునికురంబ శ్రీచినపాపమాంబ.

37

సీ.

అం దగ్రమహిషియం దలఘుప్రతాపుని
       వేంకటరామపృథ్వీపతిలకు
సన్నుతౌదార్యు సూరన్నప్రభూత్తంసు
       రామభూమీమండలామరేంద్రుఁ
గొండొకసతియందు గురుశౌర్యు వేంకట
       నరసింహరాయభూవరవతంసు
ఘనునివల్లారాయ జననాయకవరేణ్యు
       రామచంద్రక్షమారమణచంద్రుఁ


తే.

గ్రమము దీపింపఁ బుత్రషట్కంబు గాంచె
మువుర మువ్వుర సమతానుమోదలీల
నమ్మహాసాధుసాధ్వీయుగ మ్మెలర్పఁ
బ్రబలరుచిహేళి కొండలరాయమౌళి.

38


తే.

 తత్తనూభవషట్కసౌందర్యధైర్య
శౌర్యచాతుర్యధుర్యతాసరణిఁ దెలియ
విన్నవించెద మిగుల వేర్వేర నెన్ని
సకలజనమానసానురంజకము గాఁగ.

39


సీ.

 ఏధన్యుసత్కీర్తి యిందుకుందమరాళ
       ధారాళరుచులతోఁ దారసించు
నేధీరువితరణం బినతనూసంభవు
       విశ్రాణనప్రౌఢి వీటబుచ్చు
నేవీరుదోశ్శౌర్య మింద్రనందనుభుజా
       పాండిత్యమునకు విశ్రాంతి యొసఁగు
నేభవ్యుసౌందర్య మిక్షుచాపసురూప
       నైపుణ్యగుణముల నేఁపు గాంచు

తే.

 నతఁడు చెల్వొందుఁ బ్రణమితాహితశిరస్స్థ
రత్నమకుటమరీచిపూరప్రరోహ
రాజనీరాజితాంఘ్రినీరేజయుగళి
రాజపవిధారి వేంకటరాయశౌరి.

40


సీ.

 తనరాజసంబు మాంధాతృభగీరథ
       దశరథసగరులదశ వహింపఁ
దనచక్కఁదనము కందర్పనైషధరాజ
       రాజతనూజుల నోజఁ దెగడఁ
దనదానపటిమ రాధాసుతజీమూత
       జీమూతవాహుల చెలువుఁ జూపఁ
దనపరాక్రమము మందాకినీనందన
       శరవణోద్భవుల కచ్చెరువు నింప


తే.

 నిం పలరుఁ దారకాశరదిందుకుంద
శారదాశారదాభ్రమందారచంద్ర
దరహరవియన్మతంగజధవళయశుఁడు
రాజదివిషద్విభుండు సూరప్రభుండు.

41


ఉ.

 క్రొన్ననవింటివాని యనుగుంజెలిచక్కఁదనంబునందు వే
గన్నులవానిపట్టి కధికం బగు జోదుపరాక్రమంబునన్
మిన్నులమానికం బపరిమేయరుచిస్ఫురణన్ మహాత్మురా
మన్నను బ్రస్తుతింపఁ దరమా ధరమానవకోటిలోపలన్.

42


సీ.

 అర్థార్థిజనకామితావాప్తి యొనరింప
           నవనికి డిగ్గిన యమరతరువొ
కనకధారాసారగౌరవస్ఫురణంబు
          నెరవ వచ్చినయట్టి నీరదంబొ

భూలోకసంచారఖేలనానిరతిమైఁ
       గనుపట్టుచుండెడి కామగవియొ
పద్మనాయకమణిభావంబు గైకొని
      మహిఁ జెలంగెడువేల్పు మానికంబొ


తే.

 భళిర యితఁ డని తనుజను ల్ప్రస్తుతింప
వెలయు విరియాలగోత్రపవిత్రమూర్తి
చారుతరకీర్తి నరదేవచక్రవర్తి
భవ్యరుచిహేళి రామభూపాలమౌళి.

43


సీ.

 తనరూపు మీనకేతనవసంతజయంత
       సౌందర్యధిక్క్రియాసరణిఁ బొదల
దనవదాన్యత వికర్తనతనూజదధీచి
       శిబికుబేరాదుల సిగ్గుఁబరచఁ
దననీతిపటిమ శాంతనవకామందక
       చాణక్యమనువుల జాడఁ దెగడఁ
దనరాజసము పురాతనరాజలోకైక
       చూడావతంసకస్ఫురణఁ దెలుప


తే.

శ్రుతగు డక్ష్మాభృదధిపుఁడై సొంపుఁ గాంచె
సైపుఖానవజీరభుజావలేప
లోపకృద్వీరవిజయప్రతాపశాలి
వేంకటనృసింహరాయ పృథ్వీపమౌళి.

44


శా.

మల్లీవల్లరులన్ హసించు విలసన్మందారకుందారవిం
దొల్లోలన్నవమంజరీరుచులపై హుంకించు నబ్రాపగా
కల్లోలాంబుశుభప్రభానిభములై కన్పట్టు మల్రాజు శ్రీ
వల్లారాయనృపాలచంద్రునియశోవల్లీసముల్లాసముల్.

45

క.

 ఆధన్యుని పినతండ్రి సు
ధాధారారుచిరరుచివిధాయకవాచా
మాధుర్యైకనిధానగు
ణాధారుఁడు వేంకటాచలాధిపుఁ డలరెన్.

46


సీ.

 అశ్రాంతవిశ్రాణనాభినంద్యప్రౌఢి
       యినతనూభవునందు నితనియందు
నంగనాజనమనోహరరూపసౌష్ఠవం
       బిందిరాసుతునందు నితనియందు
క్ష్మాభారభరణరక్షాదక్షదోశ్శక్తి
       ధృతరాష్ట్రతనయునం దితనియందు
రణరంగవిజయశౌర్యప్రసంగనిరూఢి
       యింద్రనందనునందు నితనియందుఁ


తే.

 గాని కాన మటంచు లోకము నుతింప
స్ఫుటతరౌదార్యరూపప్రభుత్వశౌర్య
ధర్మములయందు మా రెందు దనకు లేక
నలరు మల్రాజవేంకటాచలవిభుండు.

47


తే.

అమ్మహాబాహుగేహిని యతిశయిల్లు
నాస్యలక్ష్మీనిరస్తసుధాంశుబింబ
యాశ్రితజనావనాంచద్దయావలంబ
యన్నపూర్ణాకృతివిడంబ యన్నమాంబ.

48

షష్ఠ్యంతములు

క.

 ఈదృగ్విధాన్వవాయసు
ధోదన్వచ్చంద్రమునకు నుర్వీజనసం

మోదకరదానదాక్షి
ణ్యాదిగుణనీకనిధికి నప్రతినిధికిన్.

49


క.

లాటయుగంధరకురుక
ర్ణాటద్రవిళాంగవంగనానావనిభృ
త్కొటీరఘటితమణిఘృణి
పేటీభవదంఘ్రినఖరబిరుదాంకునకున్.

50


క.

 శ్రీమంతున కతివినమిత
సామంతునకున్ లసద్యశశ్చుతికితది
క్సీమంతున కరిసరసిజ
హేమంతున కలఘుధైర్యహిమవంతునకున్.

51


క.

కరుణారసార్ద్రమతికిన్
జరణానతవిమతతతికి శౌర్యోన్నతికిం
దరుణార్కసమద్యుతికిని
ధరణీభృద్ధృతికి పుష్పధన్వాకృతికిన్.

52


క.

కనదురుదరస్మితయుతా
ననసరసీజునకు భూజనస్తుతలీలా
ఘనభాగ్యబిడౌజునకున్
దినకరతేజునకు సాహితీభోజునకున్.

53


క.

 రాజదిలీపునకున్ మ
ల్రాజాన్వయకలశసాగరకలాపునకున్
రాజత్కలాపునకు న
వ్యాజసుధామధురపేశలాలాపునకున్.

54


క,

శాంతరసపాండవాగ్రణి
కంతర్వాణిప్రతానహర్షప్రదనై

రంతరవితరణసరణికిఁ
గాంతాంబాతనయమణికి ఖలగజసృణికిన్.

55


క.

 శరనిధిగాంభీర్యునకున్
సరసౌదార్యునకు మేరుసమధైర్యునకున్
స్మరనిభసౌందర్యునకున్
నిరుపమశౌర్యునకు రామనృపవర్యునకున్.

56


వ.

 అభ్యుదయపరంపరాభివృద్ధిగా నఖిలకకుబంతవిశ్రాంతప్రసి
ద్దిగా నంకితం బొనర్పం బూనిన యిమ్మహాప్రబంధంబునకుఁ
గథాక్రమం బెట్టిదనిన.

57

కథాప్రారంభము

మ.

 అమరేంద్రుం డొకనాఁడు కాల్యకరణీయంబుల్ నివర్తించి రు
క్ష్మమణీకీలితమండనప్రకరముల్ గైచేసి యాంగీరస
ప్రముఖోదీరితపూర్వపుణ్యపురుషప్రఖ్యాతచర్యాసుధా
ప్తిమహాహర్ష మిడన్ సుధర్మనొఱపై పేరోలగం బున్నెడన్.

58


సీ,

 అమరావతీనగర్యంతరాంతరవినో
       దావలోకనజాతహర్ష ముననొ
రంభాప్రభృత్యప్సరఃకామినీపయో
       ధరధరారోహణోత్సాహముననొ
మాహేంద్రలోకసామ్రాజ్యేందిరాసమా
       క్రమణసంసక్తదీక్షాభిరతినొ
యైరావణభుజాబలాత్మీయదోస్సార
       తారతమ్యజ్ఞానతత్పరతనొ

తే.

ప్రమద మెసగంగ మర్త్యలోకమున నుండి
నిండి రెల్లెడ తండోపతండములుగ
నింద్రపురియందు నిజభుజాహీనచలిత
కలితకరవాలవీరు లాకస్మికముగ.

59


తే.

అట్లు చనుదెంచుచున్న శూరాగ్రయాయి
జననికాయంబుఁ గాంచి యాశ్చర్య మొంది
తత్పురీగూఢచరు లతిత్వరత నేగి
మరుదధీశ్వరుఁ గాంచి నమస్కరించి.

60


శా.

దేవా దేవర వీటి కెవ్వరొ ధరిత్రీభాగమందుండి తే
జోవైశ్వానరులాజిరంగనరులక్షుద్రప్రభాభీక్ష్ణబా
హావిక్షేపితశాతహేతిరుచిధారాకృష్టదుష్టాహిత
క్ష్మావర్యేందిరు లేగుదెంచి కనదాశ్చర్యం బవార్యంబుగన్.

61


సీ.

ఉచ్చైశ్రవంబు చుం చొడసిపట్టి చరాల్న
       నెగిరి యొక్కుమ్మడి నెక్కువారు
నందనోద్యానమన్దారశాఖలు వంచి
       యొఱపుగా నుయ్యెల లూగువారు
కామధేనువ నడ్డఁ గట్టి గుమ్మలు గ్రోలి
       యాబెయ్య యిది మంచి దనెడివారు
సురసరిత్కనకతామరసమ్ము లుడివోక
       తెమలించి బారుగాఁ ద్రెంచువారు


తే.

జలవిహారావసరసాహచర్య మమర
నమరకన్యాకపోలస్తనాతిచిత్ర
మకరికాపత్రములరూపు మాపువారు
నగుచు నెల్లెడఁ దారె యై రగవిరోధి.

62

చ.

 తొడఁబడ వచ్చి హెచ్చరికతో మును జన్నము లెన్నియేని యే
ర్పడ నొనరించు పుణ్యమున బాంధవ మొందిన పారుటయ్యలన్
వెడల నదల్చి యచ్చరల వెన్వెనుక న్వగగాఁ జరించుచోఁ
బడచుతనంపుటాటలనెపంబున వారల కయ్యె కయ్యముల్.

63


వ.

అని మఱియునుం బ్రళయసమయసముచితరుచిపిచండిలప్ర
చండచండకిరణమండలమండలాయితమాననీయప్రతాప
కలాపధురీణులును నభినందితసౌందర్యరేఖామోఘీకృత
ప్రసవబాణులును నతినిశితకులిశధారానిరాకరణకారణప్ర
భావిభాసమానబాణబాణాసనకృపాణపరశుపట్టినప్రాసము
సలముద్గరప్రముఖనిఖిలసాధనప్రసాధితపాణులును ననర్ఘ్య
తరచిరంతనోదారహీరమణితనుత్రాణులును నమందానంద
కందళితసుధాబిందుసందోహప్రస్యందిమధురవాణులును
మానత్రాణులును నగు వీరపుంగవశ్రేణు లిరుగెలంకులందు
నేతేర రేఁచినతీరునం బరవకట్టి రాసమయంబున.

64


సీ.

మగమానికపుతురాసొగసురాఁ జెక్కిన
       కలువరావన్నెపాగా ధరించి
గంబురామెయిపూఁతడంబురాజరబాబు
       ఖండువా వలెవాటుగా ధరించి
చలువరాచెలువురాచవులనిద్దాతరా
       కట్టాణి గొప్పచౌకట్లు దాల్చి
జాళువా మొసలివాజము దాడుశత్రుల
       గెలువ నోపెడుదానిఁ గేలఁ బూని

తే.

పెలుచ నీరేడుజగములు గలయఁ దిరుగ
నరుగుదెంచిన గరుడవాహనునికరణి
నరుణిమలఁ జొక్కు హైమపల్యంకికంబు
నెక్కి యొకదొడ్డదొరబిడ్డ యుక్కు మెఱసె

65


క.

 ము న్నెన్నఁడు మాదృశు లిట
విన్నది గన్నయది గానివిస్మయ మిది య
న్నన్నా కన్నారం గనుఁ
గొన్నారము తమకుఁ దెలుపు కూరిమికతనన్.

66


చ.

 అనవుఁడు విస్మయంబును భయంబును సంభ్రమ మొక్కవ్రేల్మిడిం
బెనఁగఁగ నెమ్మనంబునను బేర్కొను చింతల నెంతయుం బురా
తననహుషాదికృత్యములు తద్దఁ దలంపుచు ఖిన్నచిత్తుఁడై
వెనుకయు ముందుఁ దోచమిని వృత్రవిరోధిదురాధిమగ్నుఁడై .

67


ఉ.

 పెచ్చు పెరుంగు నక్కజపుఁ బెంపునఁ గూరు నిలింపభర్త క
భ్యుచ్ఛయహేతువై తనదుపూర్వతపఃఫల మిట్లుఁ దోచె నా
నెచ్చటనుండి యెచ్చటికి నేగుచునోఁ జనుదెంచెఁ బుణ్యసం
పచ్చరితుండు చుక్క దెగిపడ్డగతిం గలహాశనుం డొగిన్.

68


సీ.

 కొమరుగాఁ జుట్టిన కుఱుఁగెంపుజడగుంపు
       బాలార్కబింబసంభ్రమము నీన
నిగురుపూఁతమిటారి జిగిఁ బూను తెలి మేను
       శరదభ్రవిభ్రమస్ఫురణఁ జూపఁ
జక్కనిపటికంపుజపసరంపుటొయార
       మతితపఃఫలసంఖ్య నభినయింప
మువ్వన్నెమెకముతో ల్మవ్వపునడికట్టు

సౌరు శక్రాయుధచ్ఛవినిఁ దెగడ


తే.

 మహతి నారాయణాత్మకమహితమంత్ర
వర్ణములు సారెఁ బల్కించువన్నెకాఁడు
దురముటోరెంపుదాసరి సరసగతుల
సతులవైఖరి మెఱయ ని ట్లరుగుటయును.

69


ఉ.

కప్పరపాటుతో నతనిఁ గన్గొని కన్గొనలందుఁ జాలుగాఁ
జిప్పిలు హర్షబాష్పములచేఁ బద మార్జన మాచరింపుచున్
ముప్పిరిఁగొన్న సంభ్రమసముద్రమముద్రతఁ దాల్చి పొంగిరా
నప్పరమోపకారనిధి యంఘ్రులకుం బ్రణమిల్లి యల్లనన్.

70


వ.

అమ్మహామహుం దోడ్కొనివచ్చి నిజాసనార్ధభాగంబున నుని
చి సముచిదమనుండు సముచితప్రకారంబుగా ననిచినకుతూ
హలంబునఁ బునఃపునరభివందనంబుల నతనిడెందంబు
నానందింప జేసి యప్పు రాతన తపస్వియాననారవిందం
బవలోకించి కించిదభ్యంచితపంచమస్వరప్రపంచితవిపంచి
కారవానుకారిభూరిమాధురీధురీణవచనరచనాచమత్కా
రంబు మెఱయ నిట్లనియె.

71


క.

నారదమౌనీశ్వర ని
ష్కారణ మరుదెంచినట్టి కారుణ్యసుధా
ధారానీరాకరమౌ
నీరాక రమాకరంబు నిక్కము మాకున్.

72


తే.

దేవమునివర్య తావకపావనాంఘ్రి
జలజసందర్శనానూనసంభ్రమమున
నభిమతార్థంబు లొడఁగూడె నంతెకాదు
జన్మసాఫల్య మొదవె మజ్జాతికెల్ల.

73

తే.

 ఆజవంజవమాలిన్య మపనయించు
దురితముల నొంచు నుత్తరోత్తరశుభాభ
వృద్ధి సమకూర్చు మీరాక వినుతి సేయ
నింక వేయేల పలుక మునీంద్రతిలక.

74


చ.

అని వినయంబు దోఁపఁగ మహర్షి సమాగమనంబు మెచ్చి హె
చ్చినకుతుకంబుచే నతనిచిత్తము రా మధురోపహారముల్
మునుపుగ భక్ష్యభోజ్యముఖముఖ్యపదార్థసమాదరార్హభో
జనమున గంధిలార్ద్రహరిచందనచర్చలఁ దృప్తిఁ జేయుచున్.

75


మ.

కలకాలంబు నహర్నిశంబును భవత్కారుణ్యసంపత్తిచేఁ
గలిగెన్ స్వస్థత మాకు సార్ధకముగాఁ గళ్యాణసంధాయకో
జ్వలలీలావిభవంబు లెన్నియొకొ తత్సర్వంబు సంపూర్ణతా
కలనం జెందెనొ కంటనుం గుఱు తెఱుంగన్ రాని భాగ్యోన్నతిన్.

76


చ.

వశిజనవర్య మీ కెఱుఁగవచ్చు సమస్తమునైన యీచతు
ర్దశభువనంబులం గల యుదంతము మీరు త్రిలోకవేదు లీ
దృశమహిమంబు మీకె తగు దేవరవారి కవేద్య మెద్ది యీ
దిశలఁ జరించుపేరు గల దేవఋషుల్ మిముఁ బోల రెవ్వరున్.

77


చ.

 అని కొనియాడి యాతపసియాత్మకు నెయ్యము దోఁపఁగా మహా
వినయముతోడ నిట్టులను విన్నప మొక్క టి యున్న దిఫ్డు మా
మనమునఁ గల్గుసందియము మానుప మీరు సమర్థులౌట నొ
య్యన వినుపింతు మీకు నిదె యంజలి నెంజలి వాపు నంయమీ.

78


వ.

అది యెయ్యది యంటేని.

79

చ.

ఇపుఁ డొకయక్కజంబు జనియించిన దిప్పుడు దెప్పరంపుఁగా
ర్యపుఁ బని ము న్నెఱుంగనితెఱం గగు నిట్టిమహాద్భుతంబు మీ
నిపుణత దక్కఁగాఁ దెలియనేరము నేరము సైఁపు మెవ్వరో
విపులపరాక్రమక్రమనవీనధనంజయు లిందుఁ గ్రందుగన్.

80


క.

చనుదెంచి వీటి నెల్లెడ
ఘనతరదర్పం బఖర్వకలన వహింపం
జనవరు లట్లన విడిసిరి
జనవరు లగువారితెఱఁగు సాకల్యముగన్.

81


క.

వినుపింపు మనుడు నారద
మునిచంద్రుఁడు లేతనగవు మొగమునఁ జిలుకం
దనవాక్సుధారసాప్లుతి
ననిమిషపతి డెంద మలర నల్లన ననియెన్.

82


మ.

ధరణీభాగమునం దపూర్వ మగు యుద్ధం బయ్యె భీభత్సరౌ
ద్రరసాలంబనమై మహాద్భుతతమద్రాఘిష్ఠదోశ్శౌర్యభీ
కరమై పర్వుచుఁ బద్మనాయకులకున్ క్షత్రాళికిం దద్రణో
ర్వరమేను ల్విడనాడి శూరులు మహేంద్రా వచ్చి రివ్వీటికిన్.

83


స్రగ్ధర.

ఘోరాటోపంబు మీఱన్ గురుతరసమరక్షోణి నన్యోన్యవైర
ప్రారంభోత్పాతజాతప్రబలజయరుషాపాటవం బేపు మీఱన్
బీరంబుల్ చూపికొంచున్ బిరుసనక ధరం బెల్లుగా వ్రాలు శూరుల్
వీరస్వర్గానుభూతిన్ వెలయుదు రనఁగా వీట నిక్కంబు దోపన్.

84


వ.

ఇత్తెఱంగున ననన్యసామాన్యదౌర్జన్యజన్యం బగు నొక్క
జన్యంబు విస్మయప్రాధాన్యంబై పరంగిన కారణంబున నిత రే

తరనిశితకరవాలధారానిపాతనంబుల నెదురుగాయంబులం
గాయంబులు పదులు జోదులు ధర్మాధర్మప్రకారంబుల
ననుకరించి కొంద ఱీయమరావతిని గూర్చియుఁ బరేతపతి
నికేతనంబు ననుసరించి కొందఱు ప్రవర్తించి రనవుడు, నౌడు
కఱచి శచీజాని యాసంయమిపుంగవుం గనుంగొని యి
ట్లనియె.

85


శా.

భూలోకంబున నెవ్వ రెవ్వరికి నాపోరాట వాటిల్లె త
చ్ఛీలంబుల్ కులముల్ బలాబలములున్ సేనాసముజ్జృంభితా
భీలాటోపవిడంబనంబులు జయాపేక్ష ప్రచారంబు ల
య్యాలంపున్ బరుషత్వముల్ వినుట కయ్యా వేడ్క యౌ నిత్తఱిన్.

86


క.

యీకథ సాకల్యంబుగ
మా కెఱుఁగింపుము కృపాసమగ్రకటాక్ష
ప్రాకటవచోవినోదో
త్సేకము దీపింప మౌనిశేఖర యనుడున్.

87


చ.

చిఱునగ వాననాబ్జమునఁ జె న్నలరన్ మునిచంద్రుఁ డప్పురం
దరునిమనంబు రంజిల సుధామధురద్రవముద్రితంబులన్
నిరుపమగోస్తనీస్తబకనిస్సృతచారుమరందపూరభా
స్వరములు నైన పల్కు లతిసమ్మదలీలఁ దలిర్ప నిట్లనున్.

88


చ.

 కలవు ధరిత్రియందు సరకారు లనేకము లందులో శ్రికా
కుళము కళింగసంజ్ఞత మకుంఠతఁ .........బొ
బ్బిలి యను నొక్కపట్టణ మభీష్టత .......మం

జుల మగుచున్ ధరారమణిసొమ్ములపెట్టెయ నా మహోన్నతిన్.

89


ఉ.

నీలమణిప్రరోహరమణీయశిఖాపరిచుంబితాంబరో
త్తాలవిశాలసాలకలితద్యుతిరూషితదిక్తటంబు కే
ళీలసదౌపవన్యలవలీసుమనిర్గళదానవాంబుధా
రాలలితంబు బొబ్బిలిపురం బెసఁగున్ సుజనాభినంద్యమై.

90


ఉ.

ఆపురిసాల మాకసము నాఁగ నభోగతి తా గమింపఁగా
నోపకఁ గాదె యవ్వలికి నూకువతోడుతఁ జౌకళింపఁ గా
నోపు నటంచు నెంచి జనితోత్సుకుఁడై తురగంబుగాఁ గొనెన్
జాపలయుక్తమౌ హరిణశాబకమున్ హరి యాత్మ మెచ్చుచున్.

91


మ.

జితవారాన్నిధి యైన వీటిపరిఘం జెన్నొందు వాఃపూర మ
ద్భుతలీలన్ భుజగాధినాయకపురంబుల్ జొచ్చె నందున్ జల
ప్లుతిబాతాళతలం బొకింతయును నంభోవ్యాప్తి గాకుంట జు
మ్మతలంబున్ వితలంబు నన్నయభిధల్ ప్రాపించుటల్ వానికిన్.

92


ఉ.

వ్రాలిన యాఖనీలిమకరంబు నజాండముఁ బ్రాకి యొప్పు న
ప్ప్రోలి యనూనమానములఁ బొల్పగు మేడలఁ బెట్టినట్టి యా
నీలపుటోడుబిళ్లల జనించిన నైల్యము జుమ్ము గానిచో
మే లగునే యరూప మగు మిన్నునకున్ గుణయుక్తి జెప్పుటల్.

93


మ.

విలసద్వాతవిధూతకేతనసముద్విగ్నస్ఫురద్ఘంటికాం
'చలరావంబులు రేయునుం బగలు హెచ్చై దాపునన్ మ్రోయఁగా
నలరూదన్ గను మూయలేమిని గదా యస్వప్ననామంబు వే

ల్పులకున్ గల్గుట వీటిసౌధములపెంపుల్ జెప్పఁగా నేటికిన్.

94


క.

అన్నగరి నున్న సంపఁగి
క్రొన్ననల నమర్త్యనీలకుంతల లుత్సా
హోన్నతిఁ దాల్తురు తురుముల
నెన్నంగను బైడిఱేకు లివియో యనఁగన్.

95


ఉ.

ఱెక్కలు లేని యండజవరేణ్యము లుజ్జ్వలరూపసంపదన్
మిక్కిలి విఱ్ఱవీఁగెడు సమీరణముల్ జనలోచనోత్సవం
బెక్కఁగఁ జేయు చిత్తము లమేయసుధానిధి యైన చంద్రుపే
రక్కునఁ జొక్కుచుండెడి కురంగము లప్పురిలో తురంగముల్.

96


క.

వేదండము లప్పురి శుం
డాదండము లెత్తి వంచుటలు దిగిభములన్
వాదునకే పిలుపుగదా
కాదే నినవెత్తి వంపఁగా నేమిటికిన్.

97


ఉ.

కంటికి గూర్కు గాన రొకకాలమునందును గూటి యాస నిం
టింటికి సత్రముల్ వెదకు హీనత కోడరు పాకవైరితో
జంట దొరంగ రద్దివిజసంతతు లెంతటివార లంచు న
న్నింటను సౌఖ్యము ల్గను మహీసురు లొప్పరు వేల్పులం బురిన్.

98


మ.

అరివర్గంబుల నొంచుపట్టు నరణాహంకారదోశ్శౌర్యబం
ధురులై ధర్మసహాయవర్తనల నెందున్ దక్కు రాకుండఁ గ్రు
మ్మరుచున్ రాజకుమారసంజ్ఞితము సన్మానింపఁగా నుందు ర

ప్పురిలో రాజకుమారు లాహవజయస్ఫూర్జత్ప్రతాపోన్నతిన్.

99


మ.

నవతం బూను నిధానముల్ గలుగు నంతర్గర్వ సంపత్తివై
భవ మందెన్ దనగుహ్యకేశవిదితప్రఖ్యాతిఁ గానండు వై
శ్రవణుం డంచుఁ గుబేరు నెంచరు మహాసంపూర్ణసంపత్కళా
వివిధైశ్వర్యనిధుల్ కిరాటు లెలమిన్ వీటన్ నిరాఘాటతన్.

100


సీ.

ఒకక్రౌంచమును గెల్చి యుబ్బి తబ్బిబ్బైన
             షాణ్మాతురుని పౌరుషంబు ఘనమె
ఒకయంధకుని ద్రుంచి యుగ్రతఁ గైకొన్న
             పశుపతివిక్రమప్రౌఢి యరుదె
ఒకవీరుఁ గెల్వ నోపక వీఁగిపాఱిన
             హరిదశ్వుమగటిమి యబ్బురంబె
ఒకసైంధవోద్రేక ముడిపి పెల్లు నటించు
             పార్థుని యాటోపపటిమ యరుదె


తే.

యనుచు నభినవవిక్రమార్కావతార
సారదోస్సారనిస్సారితారివీర
వారదుర్వారగర్వాంధకారగిరులు
వెలమదొర లొప్పుచుందు రవ్వీటియందు.

101


ఆ.

 అంటి పొడిచి పోటుగంటు వెంబడి దూరు
వీరవరులు పురుషకారపరులు
మేరమీఱు సంఖ్య మెఱయుదు రవ్వీట
నదురుగుండె పిక్క చెదురులేక.

102

మ.

ఒకయె ద్దేఱుగలంతనే వృషలుఁడై యుద్యద్విభూతిన్ మహా
ధికుఁడై భిక్షుఁడు రాజశేఖరుఁ డనాఁ దీండ్రించు సంపత్తి మా
మకనామాంకము లూఁది కాంచె నిల నస్మద్వృత్తు లెవ్వారి ను
త్సుకతన్ రాజులఁ జేయ వంచుఁ బురిలో సొంపొందుచుం డ్రంఘ్రిజుల్.

103


మ.

హరిణీరమ్యతఁ జూడ్కిచేత శశిరేఖాహ్లాదమాస్యంబునన్
మఱి రంభాతిశయంబు పెందొడల హేమాభ్యంచితస్ఫూర్తి భా
స్వరమౌ మేనఁ దిలోత్తమాధికత నాసాపుష్టిచే గెల్వ న
చ్చరలం గెల్చుట కెంతవింత పురివేశ్యాకామినీజాతికిన్.

104


చ.

ఉపవనమండలంబుల మహోన్నతులున్ సరసీవ్రజంబు తో
రపుసొబగున్ బురీనికటరాజితశాలివనీసమగ్రతల్
విపులత రావణప్రకరవిస్తృతనిస్తులవస్తుజాలముల్
నిపుణతఁ గాంచు సత్కవుల నేర్పునఁగాని నుతింపఁ బోలునే.


వ.

మఱియు నతివిమలనీరంధ్రప్రఫుల్లహల్లకకల్హారపరిమళమిళి
తమధురమధురసాసారంబు లగు కాసారంబులవలనను
గుసుమితలతాప్రతానవేల్లితనానానోకహవితానబంధుర
గంధప్రలుబ్ధవిభ్రమద్భ్రమరసంతానంబు లగు నుద్యానం
బులవలనను హరిహయాయుధప్రస్థరస్థగితహర్మ్యనిర్మలప్ర
భాపటలప్రణుతరాకానిశాకరకళంకంబు లగువిటంకంబుల
వలనను నభ్రంలిహాదభ్రసౌధాగ్రతలపరిభ్రమత్పురపు
రంధ్రీకచప్రచయపయోధరావలోకనప్రభూతకుతూ
హలచటులనయనాపరాయణపోషితమయూరవర్ణంబు
లగు రాజమార్గంబులవలనను ననర్ఘ్యతరచిరంతనరత్నఘం
టికాఘణఘణత్కారఘీంకారసంకులారవనిరంకుశాకుంచన

ప్రసారణోద్దండశుండాదండంబు లగు వేదండంబులవల
నను దుములతమలడమామికాతమ్మటపటహఢక్కాహు
డుక్కాప్రముఖభేరికానినాదమేదురదురాసదప్రాంగణసుం
దరంబు లగు తత్తత్ప్రభుమందిరంబులవలనను నిజభుజాగ్ర
జాగ్రన్మండలాగ్రధారానిరాఘాట వజయధాటీసముద్భటు
లగు వీరభటులవలనను నమూల్యకల్యాణపల్యాణకలితవిల
యపవమానజవమానబాంహ్లీకపారసీకారట్టఘోట్టాణస
మారోహణోద్వృత్తు లగు రాహుత్తులవలనను వప్రస్థలస్థా
పితాపరిమితశతఘ్నికానికాయంబుసొంపునం బొంపిరివోని
పెంపుమిగిలి సుధర్మాభిరామంబై యమరావతి ననుకరింపు
చుఁ బుణ్యజనేశ్వరవిరాజితంబై యలకాపురంబుతెఱంగున
గరంబు రంజిల్లు నప్పురంబున కధీశ్వరుండు.

106


ఉ.

రావుకులాభిమాని బుధరంజనధర్మగుణప్రధాని నా
నావసుధాధినాయకగణస్తవనీయయశోనిధాని శౌ
ర్యావసధాయమానవివిధార్భటిమద్వరసేని రంగరా
యావనిజాని పొల్పెసగు నాహవరంగజితారిమాని యై.

107


వ.

ఏతదీయవంశానుక్రమం బభివర్ణించెద.

108


చ.

పరమపవిత్రయౌ భువనపావని జాహ్నవి గల్గె నేమహా
పురుషుని పాదపద్మమునఁ బుణ్యతమం బగుతన్మురద్విష
చ్చరణసరోరుహంబుననె సంభవ మందినకారణంబుచే
నరయఁగఁ బద్మనాయకులు నా వెలమ ల్నుతిఁ గాంచి రిమ్మహిన్.

109


క.

ఆవెలమవంశములలో
రావుకులీనులు ప్రసిద్ధరమ్యయశశ్శ్రీ

లావణ్యమూర్తు లగుచు ధ
రావలయం బేలుచుండ్రు రాజన్నీతిన్.

110


శా.

శ్రీనాథాంఘ్రిసరోరుహోదయముచేఁ జెన్నొందుచుం బౌరుషా
ధీనస్వచ్ఛతరస్వజీవనకులై దీపింపుచున్నట్టి య
మ్మానైకాలయపద్మనాయకులకున్ మాన్యాదిపీఠస్థులై
శ్రీనిర్వాహకులైరి వేంకటగిరిశ్రీరావురాజాగ్రణుల్.

111


సీ.

అనపోతవిభుఁడు మహాపరాక్రమశాలి
       గావునఁ దనశౌర్యకలనఁ జేసి
యాజిరంగమునను రాజుల నోడించి
       కృష్ణానదివఱకు గెలిచి దేశ
మును దనకు నధీనముగఁ జేసికొనియె నిం
       కొకపరిఁ బొసఁగిన యుద్ధమునను
దనమీఁద వచ్చిన ఘను లగుదొరలను
       నూటిపై నొక్కని గీటడంచి


తే.

యేకవీరుం డటంచును నెన్నికఁ గనె
వేంకటగిరికుటుంబపుఁ బృథివిపతుల
లోన నారవపురుషుఁ డామానఘనుఁడు
వెలమలకు నెల్లఁ గలిగించె విమలకీర్తి.

112


సీ.

సర్వజ్ఞసింగయ జనపతి యెల్ల వి
       ద్యల నేర్చి తనపేరు సార్థకముగఁ
బండితకోటిచేఁ బలుకవీంద్రులచేతఁ
       బరివేష్టితుండయి ప్రౌఢి మెఱయ
విద్యావినోదియై హృద్య మైనరసార్ణ
       వసుధాకరం బనఁబరగు గ్రంథ

ము రచించె సంస్కృతమునఁ బండితుం డసి
             కవివరుం డనియును గాంచెఁ గీర్తి


తే.

నతఁడు వేంకటగిరివంశమందు నుదయ
మందిన వసుంధరావరులందు దశమ
పూరుషుం డయి జను లెన్నఁ బేరు వడసె
దగదె యాతనివర్ణింప జగతియందు.

113


క.

 అల వేంకటగిరిపురరా
జులలోఁ బదునేనవపురుషుం డగుచు మహిన్
బొలిచెఁ బెదరాయఁ డాతఁడె
వెలసెను నిర్వాణరాయవిభుఁ డనుబేరన్.

114


సీ.

మొగలాయిప్రభులకై పూని షేర్మహమదు
       ఖానుఁ డనెడు పేరు గల్గినట్టి
సరదారుడు మనదేశమును జయింపఁగ
       వచ్చె నాతనితోడ వచ్చినట్టి
యిరువురుప్రభులలో నీతఁ డొక్కరుఁ డయి
       యుండెఁ దత్కాలపుయుద్ధములను
బలుసాయ మొనరించి పాదుషావలన రా
       జామనునట్టి సంస్థానము బ్రతి


తే.

ఫలముగను నొందె రెండవప్రభువు విజయ
నగరరాజ్యము మొదటివాఁడుగ గణింపఁ
బడిన మాధవవర్మ యన్ బుడమిరేఁడు
వీరిలో బెద్దరాయపృథ్వీవరునకు.

115


సీ.

సంస్థానము నొసంగు సమయంబునందె వం
       శక్రమంబుగను రాజాబహదరు

మొదలైన బిరుదులు ముఖ్యమౌ తెల్లజెం
       డా నవుబత్తును ఢక్క యాది
గలిగిన రాజచిహ్న లొసంగఁబడె నుత్త
       రపుసరకారులం దపుడు పోరి
సందడి యడగ దాజనపతి కూడవ
       చ్చినయట్టి లింగప్ప యనుసుతునకుఁ


తే.

దనకు సమకొన్న యారాజ్యమును నొసంగి
తండ్రితాతలనాటిదై తనకు వేంక
టగిరి రాజ్యమ్మునకును దిరుగ జనియెను
బెద్దరాయ వసుంధరావిభువరుండు.

116


శా.

శ్రీమల్లింగపరాయమానవపతిశ్రేష్ఠుండుసర్వప్రజా
క్షేమాపాదకరాజ్యరక్షణపరస్వీయాంతరంగాడ్యుఁ డై
రాముం బోలుచుఁ దండ్రిగారివెనుకన్ రాజ్యంబు పాలించె ది
గ్భామాకాయదుకూలతావిభవశుంభత్కీర్తిసంపన్నుఁ డై.

117


చ.

అపుడు శ్రిగాకుళాఖ్యపురమందు వసించు నబాబు గారు త
ద్విపులపరాక్రమాతిశయవిశ్రుతలింగపరాయనాముఁడౌ
నృపమణిరంగవా కను వనీస్థలికి న్మృగయార్ధ మేగి శ
త్రుపటలబద్ధు నాత్మసుతు దోర్విభవంబున వారిఁ గొట్టితే
నపరిమితప్రమోదభరితాంతరుఁడై కడుసన్నుతింపుచున్.

118


శా.

గారా మొప్పఁగ నప్పు డీతనినిరాఘాటప్రతాపాఢ్యతా
ధీరత్వాదిగుణప్రపంచము నిజాంధీగోచరం బౌనటుల్
దా రాగంబున వ్రాయఁ జూచి యతఁ డుత్సాహంబుచే నిచ్చెరం
గారావన్ ఘనపౌరుషాఖ్యఁగులజక్ష్మాపాలచిహ్నంబుగన్.

119


ఉ.

అంతియెకాక యొక్కనిశనాయనగ్రామము లెన్నితోరణా

క్రాంతి వహింపఁజేయునవి గౌరవ మొప్పఁగ శాశ్వతంబుగా
సంతస మొప్ప నాతనికిఁ జయ్యన నిచ్చెఁ దదీయపౌరుషం
బంతయు నిత్యమై జగములందు వెలుంగఁగఁ జేయు నూహచేన్.

120


శా.

ఆరాజన్యుఁ డపుత్రకుం డగుటచే నాత్మీయవంశోదయున్
ధీరున్ వెంగళరంగరాయనృపతిన్ దీనావనోదారునిన్
గారా మొప్పఁగ దత్తపుత్రకునిగాఁ గైకొంట నాధీరుఁడే
యారాజాగ్రణివెన్కఁ బూజ్యగతి రాజ్యం బేలె నత్యున్నతిన్.

121


శా.

శ్రీమద్వెంగళరంగరాయవసుధాసీమంతినీశుండు సు
త్రామప్రోజ్వలభూరిభోగవిభవభ్రాజిష్ణుఁ డౌచుం గృపా
భూమాన్వీతమనోంబుజాతుఁ డయి సద్భూమిసురవ్రాతమున్
గ్రామాదిప్రదుఁ డౌచు మోదయుతమున్ గాఁ జేసె సంప్రీతిచేన్.

122


క.

రంగపతి రంగరాయనృ
పుంగవుఁ డొకఁ డతనిసుతుఁడు భూరితరశ్రీ
రంగపతి భక్తిపరుఁ డై
మంగళగతిఁ దండ్రికరణి మహిఁ బాలించెన్.

123


క.

కాయజతులితాకృతియున్
ధీయుక్తివిశేషవిజితధిషణోన్నతియున్
రాయఁ డపరంగరాయా
ఖ్యాయుతు నొకసుతు నతండు గనె సుకృతమునన్.

124


క.

ఆఘనుఁడు విష్ణుపదకల
నాఘటితనిజాత్ముఁ డగుచు నైజవసుశ్రీ
మోఘితకవిదారిద్రని
దాఘోన్నతి యగుచుఁ జిరము ధరఁ బాలించెన్.

125


క.

ఆపార్థివుఁ డసుతుం డై

భూపాలననిపుణుఁ డైన పూర్వోక్త శ్రీ
గోపాలకృష్ణరంగ
క్ష్మాపాలకు దత్తపుత్రుఁ గా జేసికొనెన్.

126


తే.

క్షితితలంబున గోపాలకృష్ణరంగ
రా వటంచును మఱి రంగరా వటంచు
నామముల రెంటిచేత నా భూమినాయ
కాగ్రగణ్యుండు మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె.

127


క.

అతఁ డినుఁ డయ్యును గువలయ
హితుఁ డగుచున్ రాజనామ మెసఁగియుఁ బద్మా
దృతి యగుచుఁ దాను ఘనుఁడై
క్షితి మెలఁగుచుఁ జిత్రరీతిఁ జెలఁగుచు మఱియున్.

128


సీ.

తనభుజాదండాసి ధారామహారాహు
       వరిరాజతతుల వెన్నంటి మ్రింగఁ
దనసముద్దీప్తప్రతాపసహస్రాంశుఁ
       డహితాంధతమసమున్ గుహలఁ జొనుపఁ
దనకీర్తి కుముదబాంధవుఁడు శాత్రవలోక
       ముఖపంకజముల సొంపులు హరింపఁ
దనదృఢాజ్ఞావేల మొనసి ప్రత్యర్థిభూ
       పతిసముద్రంబులఁ బట్టువఱప


తే.

నహుష నల రంతి సగర మాంధాతృ పూరు
పృథు భగీరథ శశిబిందు విక్రమార్క
ధర్మతనయుల మఱపించి ధరణి నేలె
రమ్యగుణజాలముల ప్రోవు రంగరావు.

129


తే.

 మన్నెహంవీరపెరమన్నె మద విభాళ

గాయగోవాళబిరుదవిఖ్యాతిధనున
కమ్మహీజాని కనుజన్ముఁ డై తనర్చె
రావుకులహేళి వెంగలరాయమౌళి.

130


క.

ఇంద్రోపేంద్రులకైవడిఁ
జంద్రార్కులపగిది రామచంద్ర సుమిత్రా
చంద్ర ముఖీజులక్రియ ని
స్తంద్రత వెలయంగ నం దుదారక్రీడన్.

131


తే.

 అగ్రజుం డైనరంగరాయావనీంద్ర
చంద్రమునిసాహసౌదార్యసద్గుణములు
వినయధర్మప్రజానుపాలనవిధములు
పెద్ద లగువారి దెలుప నప్రియముదొట్టి.

132


సీ.

ఆమన్నెకొమరుని యభినవసౌందర్య
       వీరప్రతాపసద్వృత్తి యరసి
యాపద్మనాయక క్ష్మాపాలతిలకుని
       ప్రకటితసప్తాంగపటిమ నరసి
యావెల్మదొరబిడ్డ యప్రతీపవిచార
       పంచాంగనిర్ణయప్రౌఢి యరసి
యారావువంశపయఃపయోధిసుధాంశు
       చతురుపాయజ్ఞానసరణి నరసి


తే.

చాల దనలోనఁ జూపోపఁజాల కునికి
నిర్నిమిత్తవిరోధంబు నెఱయ మెఱయ
రయసముద్విగ్నరోషాగ్ని రవులుకొనుచు
డెంద మగలింపదుర్వ్యథామందుఁ డగుచు.

133


తే.

రావుకులజన్ముఁ డగురంగరావుపేరి

గొప్పమగమానికపుఁబూస యొప్పిదమున
కాత్మసామ్రాజ్యవైభవం బక్కటకట
వెదకికొన గాజుపూసపాటిది యటంచు.

134


తే.

భాగ్యసంపన్నుఁ డగు పూసపాటివిజయ
రామరా జను నొకదొడ్డరాచబిడ్డ
యనుదినంబును రంగరాయక్షితీంద్రు
పెంపు మది నించుకేని సైరింపలేక.

135


వ.

ఇట్లున్నంత.

136


సీ.

గుఱిదప్ప కొకట నేగుర నార్గురను నొంపఁ
       గలయలగో ల్తుపాకులబలంబు
కో ల్తల నడఁచి గగ్గోలుగాఁ బడఁ గ్రుమ్ము
       వేబారుటీటెల వెలమగుంపు
ఱెక్కమొనల్ గాచి ఱిక్క వైచిన డాగి
       తేఱపులు వఱపెడు తేజిపౌఁజు
నూటి కొక్కఁడె చాలి మేటిమగంటమిఁ
       గాలు ద్రవ్వుచు నుండు కాలిమూఁక


తే.

యద్దిఱా వీని కెద్దిరా నుద్దియైన
జోదువివ్వత్సుఁ డొకఁడేమొ చూడ ననుచు
నివ్వెరఁగుఁ గాంచి పై నెత్తి చివ్వకెదుర
నోప నేరని కడిమిమై యుండునంత.

137


శా.

డిల్లీపాదుషహానియోగమున రూఢిన్ రాజరాజౌ నిజా
మల్లీపేరటి మేటిసాహెబు సుబాయాత్మం గళింగంబు రా
జల్లీలన్ ఘనుఁ డాఫరాసునకు మూసాబూసి యన్వాని క

త్యుల్లాసంబున నాధిపత్య మొసఁగన్ యోజించి రావింపుచున్.

138


ఉ.

భాస్కరసన్నిభం బయిన భవ్యతరస్ఫురణాభినంద్యవ
ర్చస్కత గల్గు నీకు నతిసాహసశీలునకుం గళింగస
ర్లస్కరు భార మిచ్చి శుభలక్షణలక్షితుఁ జేసిపుత్తు శ్రే
యస్కర మిట్టికార్య మని యాదరపూర్వముగా వచింపుచున్.

139


వ.

అప్పు డప్ప రాసులఱేనికి నుత్తుంగతురంగమాతంగంబులు
మొదలుగాఁ గొన్నియుపాయనంబులు నుద్ధతులముల్కుగ
జఫరజంగుసిఫహాసరదారుగా రనియెడి దొడ్డకితాబులు నొ
సంగి యతనికిం దగిన సంగడిగా హైదరుజం గనియెడు
యవనపుంగవుం బ్రధానత్వంబునకుం గుదురుకొల్పి మఱి
యును.

14


మ.

తరవుల్ పాలన సేయుచుండునెడలం ధర్మప్రకారంబు సుం
దరమై పర్వఁగ నచ్చటచ్చటిజమీదారుల్ దివాణాన కొ
ప్పరులై గ్రుమ్మర సీమలెల్ల ఖిరదాబాదాను గావింపుచున్
సరకారర్థము దస్తు సేయుఁడు ఖజానా నింపుఁ డింపొందగన్.

141


మ.

అని రాజ్య ప్రతిపాలనానుగుణవాక్యంబుల్ నిజామల్లినాఁ
జను సర్వాధిపుఁ డానతిచ్చుటయు మూసాబూడి వల్లేయటం
చును దా హైదరజంగుతోఁ జనఁ జమూస్తోమంబుతోఁ బైన మ
య్యెను లెక్కింపఁగ రాని రాజసము పెంపెక్కం గళింగానకున్.

142


వ.

తత్కాలంబున.

143

సీ.

దిగ్గజంబులనైన దివులు కొల్పెడు బృంహీ
       తధ్వనుల్ నెఱపు దంతావళములు
వాసవాశ్వమునైన వడిఁ జూపి లంఘించి
       తోఁకఁ ద్రొక్కఁగ జాలు తురగతతులు
మంథానగిరినైన మాయున్నతముతీరు
       గలదె నీ కను శతాంగములగములు
సేనానినైన నాసీరమ్మున నెదిర్చి
       తప్పులు వెదకు పదాతిచయము


తే.

ఘనతరోల్కానికాయముల్ గ్రక్కఁ దివురుఁ
బారు దీర్పఁగ నగునరాబాతెఱంగు
మందుశకడాలు గుంటిసామానుబండ్లు
చెకుముకితుపాకిసొబగు కౌతుకము నెఱప.

144


సీ.

సాహసోద్ధతమూర్తి జండ్రాల్మహమ్మదు
       హుస్సేన్మయూరనా నొప్పు నతఁడు
మోఖీకృతారిలాడూఖాన్కుమందమన్
       పటుతరాభిఖ్యఁ గన్పట్టు నతఁడు
బహుయుద్ధములఁ బేరు పడ్డ విక్రమశాలి
       సిద్దీబిలాలునాఁ జెలఁగు నతఁడు
శూరాగ్రయాయియౌ జోదుజానూఖాను
       మీర్జా యనెడిపేర మెలఁగు నతఁడు


తే.

మఱియు హసనల్లిఖానుఁ డన్మానధనుఁడు
మొదలుగాఁ గల్గుసరదారు లెదుట నిల్చి
వేలకొలఁదుల జీరాగుఱాలతోడ
నిరుగెలంకులఁ దనుఁ గొల్వ నేపు మిగిలి.

145

శా.

మూపాశబ్దము పూర్వమందు మెలఁగన్ ముఖ్యుల్ సజాతీయులౌ
లాసూమర్తెనుదొమ్మితీరువిపులాంలస్సేనుకుప్లాంకువే
మాసూనాములు వానిఁ జేరి రతిదుర్మానుల్ జిరాకూర్పు మి
న్నాసన్నంపు బనాతుపింజరుల సొన్నాపాలకీ లెక్కుచున్.

146


మ.

సమరోజ్జృంభితశౌర్యధుర్యు లగు సార్జ౦తుల్ మయూరుల్ కుమం
దములన్ వీరులు సోలుదారులు సుబేదారుల్ మొద ల్గల్లు సై
న్యము లాత్మీయులు గొల్వ నుద్ధతుల ముల్కాఖ్యామహాఖ్యాతిమ
త్సముదగ్రప్రతిభావిభాసి యగు మూసాబూసి యుల్లాసియై.

147


వ.

వెండియుం బ్రచండదోఃపాండిత్యంబునం జుఱుకుగల షుకు
రుల్లాప్రభృతిఖానువర్గంబులును ఛత్రపతిరామచందురుప్ర
ముఖు లగు రజపుత్రులును నాగోజీరాయపురోగము లగు
పండితప్రకరంబులును సమరసన్నాహదోహళంబు లగు
కాహళంబులును గర్జాసమూర్జితవిరావంబునకుం దానకం
బు లగునానకంబులును దూరీకృతశీతవాతోష్ణవృష్టిప్రచా
రంబు లగుపటకుటీరంబులును భారవహనక్రమవిక్రమంబు
లగు క్రమేళకంబులును నీలపీతారుణవిభావడంబరాంబరతల
చుంబితపటపటత్కృతిచంచలనిజాంచలప్రభూతనూతన
వాతనిర్ధూతజలభృజ్జడంబు లగుసిడంబులును సమస్తవస్తుసం
భారభరణధురీణంబు లగు నాపణంబులును దక్కుoగల
సామగ్రియుం దనడెందంబున కమందానందంబు సంధింప
గందళితహృదయారవిందుండై ఫరంగులదొర కళింగస

స్కరుభరంబుఁ బూని షహరు వెడలి కతిపయప్రయాణం
బులం జనిచని.

148


ఉ.

రాజమహేంద్రపట్టణ విరాజదదూరతలంబునన్ సము
త్తేజిత మైన గౌతమనదీతటసీమను గోటిలింగవి
భ్రాజిత మైన యొక్కనవపాదపమంజులనిష్కుటస్థలిన్
రాజితలీలఁ జేరి శిబిరంబు వడిన్ విడియించె వేడుకన్.

149


సీ.

అచటిలేమావిమోకాకుఖాణాదిను
       పులుగులరొదలు విందులు ఘటింప
నచటిపుప్పొడితిన్నె యలరారు క్రొవ్విరి
       తేనెవాకలరాక దేఁటలీన
నచటియేడాకులనంటిచెట్టులఁ బుట్టు
       కపురంపుఁజిదురుపల్ గన్నుఁ దనుప
నచటియేటికరళ్ల నలరు దమ్ములమీఱి
      కమ్మతెమ్మెరతావి ఘమ్ము రనఁగ


తే.

మంచిచెంగావిమే ల్మొకమాల్కనాతు
కుట్టుసొగ నుట్టివడఁ దీర్చి కట్టినట్టి
రాంకవ మ్మైనయొకగుడారంబులోన
సిఫహసరదారుగారు వసించి యుండి.

150


ఉ.

కారుణికత్వ మేర్పడ శ్రికాకుళపుంసరకారులో జమీ
దారుల రామరాజవసుధావలయేశ్వరముఖ్యుల న్ముదం
బారఁగఁ బిల్వఁ బంపు మని హైదరజంగున కానతీయఁ ద
చ్చారవచఃక్రమంబునకు సత్వరుఁడై పిలిపించి వారలన్.

151


ఉ.

పాయనివేడ్క విద్విషదపాయకరాయతబాహుశౌర్యులౌ
పాయకరాయఁడున్ గిమిడిపట్టణపుం బృథివీశ్వరుండు నా

రాయణదేవుఁడున్ నరసరాజు మఱిం గొలుగొండమన్నెపుం
రాయఁడు నాదిగాఁ గలధరావరు లందఱు వచ్చి రత్తఱిన్.

152


తే.

ఉద్ధతులముల్కు సందర్శనోత్సుకత్వ
మాత్మఁ జిట్టాడ నాడాడ నలరు మన్నె
దొరలు వచ్చి రమానుషదోఃప్రసంగ
కలితుఁ డగురంగరాయఁ డొక్కరుఁడె దక్క.

153


సీ.

నిజభుజాదండనిర్ణిద్రకోదండంబు
       గాండీవిగార్ముకక్రమముఁ జూపఁ
జరమభాగస్ఫురచ్చటులతూణీరముల్
       గవదొనసొంపు సంఘటిలఁజేయ
నాసీరముఖరనానాశాంఖకధ్వనుల్
       దేవదత్తారవోద్వృత్తిఁ దెలుప
సూరెలఁ బఱతెంచు జులమతీతేజీలు
       ధవళాశ్వములమస్తు ద్రస్తరింపఁ


తే.

గలియుగార్జునుఁ డౌర యీఘనుఁ డటంచుఁ
దనుజగజ్జన మెన్న నుద్దతులముల్కు
వీక్షణాపేక్ష నేతెంచె విజయరామ
రాజరాజన్యలోకమార్తాండమూర్తి.

154


వ.

 ఇ ట్లరుగుదెంచు నవసరంబున.

155


సీ.

సౌవర్ణకలశముల్ సవరించినవిలాతి
       సకలాతిహౌదాలసామజములు
జిలుగుచీనాపట్టుచెంగావిచెఱఁగుల
       నిద్దాజరీనిశానీలకరులు

గడలికరక్లచప్పుడుల నారడిసేయు
             గొప్పునగారాల కుంజరములు
నజగరప్రతిమంబు లగు కంచుషుతురునా
             ళములు బన్నిన జిరాసమదగజము


తే.

లన్ని యిన్నియు ననరాక చెన్ను మిగిలి
తెగలుగా గొల్వవచ్చి యెం తేని వేడ్క
మానితము లయ్యె నారాచఱేని కెదుట
నంతకంతకుఁ గనుదోయి కబ్బురముగ.

156


తే.

అర్జునఖ్యాతి రాముశౌర్యాతిశయము
రాజభోగంబు మెఱయ నారాజమౌళి
విశ్వవిఖ్యాతిఁ గాంచెను విజయరామ
రాజనామంబు తనకు సార్థత వహింప.

157


సీ.

చక్కనిసన్నంపుజరబాబుగవిసెనల్
       జాలఁ జొప్పడు జెజాయీలబారు
మందుఘట్టనలవలందు బాజునయించి
       చాలు దీర్చిన ఫిరంగీలబారు
ధన్నాసరీవజాతాప్తామునుంగుల
       నోలి గన్పడు రేకలాలబారు
జానకిత్రాళ్ల కృశానుకీలలఁ జేర్చి
       కేల నూఁదిన తుపాకీలబారు


తే.

మేర మీఱినకొలఁది సమిధ్ధలీలఁ
బూసపాట్యన్వయాబ్ధిరాకాసుధాంశు
మ్రోలఁ జూపట్టెఁ జూడ్కి కమూల్యమైన
నిబిడతరనిర్భరానందనియతిఁ దెలిపి.

158

శా.

కాజాలూడ్చి ఖలీనవల్గనకశాఘాతోరుసంజ్ఞాదులం
దేజీలన్ దుమికింపుచున్ గరములన్ ధీరుల్ గమాను ల్వగం
బౌఁజుల్ గట్టి సహస్రసంఖ్యలు శిలేబక్తర్లతో వచ్చి రా
రాజన్యోత్తముచిత్త మొప్ప మిగులన్ రాహుత్తు లత్యున్నతిన్.

159


సీ.

 పొలుపొందఁ గాకర్లపూడి జగన్నాథ
       రాజుగా రొకకొంతపౌఁజుతోడ
సత్యవరపుపురస్వామియౌ నలరామ
       భద్రరా జొకకొంతబలముతోడ
ఘనయశోనిధి ముఖీకాశీపతిక్షమా
       ధవమౌళి యొకకొంతదళముతోడ
నలఘువిక్రముఁడు జింతలపాటినీలాద్రి
       రాజుగా రొకకొంతపౌఁజుతోడ


తే.

విజయరామరాజక్షమావిభునిమ్రోల
నేత్రపర్వం బొనర్చిరి నిజభుజాభు
జంగరసనాయమానప్రచండనిశిత
మండలాగ్రప్రభావళుల్ మెండుకొనఁగ.

160


శా.

శ్రీరంజిల్లు కడానిపైడిజలతారీమాహురీకెంపుటం
బారీయేనుఁగు నెక్కి పెక్కులు మదేభంబుల్ దనున్ గొల్చి రాఁ
గా రూఢిన్ జతురంగసైన్యములతో గర్జిల్లుచున్ వత్సవా
యీరాయప్రభుమౌళి వచ్చెఁ గడు రా జీక్షించి హర్షింపఁగన్.

161


మ.

 జగ మొక్కుమ్మడిఁ గ్రమ్మఁ జాలెడు మహాసత్వంబుచే నొప్పుగొ
ప్పగు ఱాల్రౌతులు గైత లొట్టియలు శోభాస్ఫూర్తిఁ ద న్గొల్వ మా

దుగులింగావనిభర్త రాజమణి సంతోషిల్లఁగా వచ్చె నొ
క్కగజోత్తంసము నెక్కు చొక్క మగు నుత్కంఠాతిరేకమ్మునన్.

162


శా.

ధన్యాటోపులు మందపాటికులరత్నంబుల్ మహారాజమూ
ర్ధన్యుల్ శ్రీ రఘునాధ రాజబలభద్రక్ష్మావరుల్ మున్ను సౌ
జన్యక్రీడలఁ బాఱుదెంచి శిబికాచంచద్గతు ల్మీఱ రా
జన్యగ్రామణి కిచ్చి రుత్సవముఁ దత్స్వాంతంబు కాంతంబుగన్.

163


చ.

 నలువది వేల కాల్బలము నాలుగువేలతురంగమంబులున్
నలువదియేఁబదేనుఁగు లనంతములైన శతఘ్నికాచయం
బులు నొకవేయులొట్టియ లపూర్వవిభావిభవంబుఁ దెల్పుచుం
గొలువ ఫరాసుఱేనిఁ గనుగోఁ జనుదెంచెను రా జతిత్వరన్.

164


వ.

 ఇట్లు మిన్ను మెఱసి యనన్యసామాన్యసామ్రాజ్యదురంధ
రుం డగు నారాజపురందరుండు గంధబంధురసింధురస్కం
ధం బధివసించి విచిత్రముక్తాతపత్రప్రముఖరాజలక్షణలక్షి
తుండై సపరివారంబుగా నరుగుదెంచునప్పుడు.

165


తే.

 దుర్నిమిత్తంబు లొకకొన్నిఁ దోచె నెదుట
దాన భావ్యర్థసూచకం బౌ నటంచు
నెఱిఁగి యెఱుఁగక వర్తించి రెందఱేని
కారణము దీర్పఁబోల దెవ్వారికైన.

166


శా.

ఆసన్నాహవిజృంభితస్ఫురణచే నారాజచంద్రుండు కై
లాసక్ష్మాధరతుంగశృంగగతలీలాకందరం బంచితో
ల్లాసప్రౌఢిమ డిగ్గు సింగముక్రియన్ లావణ్య మింపొదఁ గ్రీ
డాసన్నాహసముజ్వలద్గజమువేడ్కం డిగ్గి యల్లల్లనన్.

167

సీ.

నిశితాసిపాణులై నిలిచి శిఫాయీలు
       ప్రేమ ఱొ మ్మాని సలాము సేయ
నానమ్రమణిమకుటాంశుమాలికలతో
       సామంతనృపులు సాష్టాంగ మెరఁగఁ
గలధౌతమయకనద్ఘనవేత్రములవారు
       బలసి ముంగల బరాబరులు సేయ
వందిమాగధులు కైవారముల్ ప్రకటించి
       కొమరైన బిరుదుపద్యములు చదువ


తే.

మదవదైరావతముమాడ్కి మందమంద
గతుల నడతెంచి వచ్చి యుధ్ధతుల ముల్కు
గారి సందర్శన మొనర్చె గారవమున
కోచ యొక్కింత లేక యారాచపట్టి.

168


తే.

దర్శనానంతరంబునఁ దత్తదుచిత
బహుబహూకృతు లొదవె శుంభన్మదేభ
శోభమానాంశుకాదికలోభనీయ
రాజితోపాయనములు బరస్పరంబు.

169


ఉ.

అంత వసంతసంభ్రమసమంచితమైన మనంబుతో ధరా
కాంతుఁడు దంతపుంబని చొకాటపు నీటిమెఱుంగు గెంపురా
దొంతరవింతనంతనలతోఁ దగు పాలకి నెక్కి వచ్చి ని
శ్చింతమెయిన్ నివేశనము జేరె వడిన్ దివిటీల వెల్గునన్.

170


సీ.

గుబ్బెత లందిచ్చు గోదావరీనదీ
       స్వాదూదకంబుల జలక మాడి
శారదచంద్రచాంద్రీరోచిరుద్వాహ
       దములైన ధౌతవస్త్రములు గట్టి

యభిమతభక్ష్యభోజ్యాదికాహారమ్ము
       లాప్తవర్గములతో నారగించి
నటనటీగాయకనానావినోదప్ర
       సిద్దప్రసంగముల్ జిత్తగించి


తే.

రాయభారులు దెలుపువార్తలు గ్రహించి
యొక్కచొక్కంపురాకుటి నుక్కు మిగిలి
నిదుర పాటించి మరునాఁటియుదయకాల
కృత్యములు దీర్చి కొలువు సాగించి యుండె.

171


చ.

సరసగుణాభిరామ మురశాసనభక్తివిశేషధామ సా
గరతనయాకటాక్షపరికల్పితవైభవగేహసీమ ని
ర్భరరుచితీవ్రధామ పటుపౌరుషభార్గవరామ పార్థివో
త్కరనవసోమ పండితవితానగృహాంగణకల్పకద్రుమా.

172


క.

 ఆచక్రవాళశైల, క్ష్మాచక్రనృపాలజాలసమ్మదకరలీ
లాచతురకీర్తిపూరా, యాచకమందారమన్నెహంవీరవరా.

173


ఉత్సాహవృత్తము.

 అనతవైరి లోకదర్పహారిభూరివిగ్రహా
ధనదనందనానురూపతరుణరూపవిగ్రహా
ఘనదయారసానురాగకలితవాగనుగ్రహా
మనుపమాననయభృతక్షమావధూపరిగ్రహా.

174


గద్యము.

 ఇది శ్రీమత్కాశ్యపగోత్ర దిట్టకవివంశపవి త్రాచ్చ
నామాత్యపౌత్ర పాపరాజకవిపుత్ర శ్రీరామచంద్రచర
ణారవిందధ్యానపరాయణ నారాయణాభిధానప్రధాన
మణిప్రణీతం బైన రంగారాయకదనరంగచరిత్రం బను
మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము.

————